Sakshi Special
-
జనాభా తగ్గుతోంది... వృద్ధులు పెరుగుతున్నారు
ఇటు జనాభా క్షీణిస్తోంది. అటు వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనా సహా అనేక దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లివి. పెళ్లికి, పిల్లలను కనేందుకు యువతరం పెద్దగా ఇష్టపడటం లేదు. కాస్త అటూ ఇటుగా ప్రపంచమంతటా ఇదే ధోరణి పెరుగుతోంది. దాంతో ఏ దేశంలో చూసి నా జనాభా క్రమంగా తగ్గుతోంది. 2024లో చైనా జనాభా 10.4 లక్షలు తగ్గింది. అక్కడ జనాభా తగ్గడం వరుసగా ఇది మూడో ఏడాది. జపాన్లోనైతే 15 ఏళ్లుగా జనాభా వరుసగా తగ్గుము ఖం పడుతోంది. దక్షిణ కొరియాలో 2023లో కాస్త పుంజుకున్న జనాభా ఈ ఏడాది మళ్లీ తగ్గింది. ఇటలీలో జననాల సంఖ్య 19వ శతాబ్దం తరవాత తొలిసారి 4 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. 63 దేశాలు, భూభాగాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరిందని ఐరాస అంచనా. వచ్చే 30 ఏళ్లలో మరో 48 దేశాలు ఆ స్థాయికి చేరతాయని సంస్థ పేర్కొంది. 60 ఏళ్లలో ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని, అక్కడినుంచి క్షీణించడం మొదలవుతుందని అభిప్రాయపడింది. చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు మరోవైపు ఆరోగ్య సంరక్షణ, మెరుగైన జీవనశైలి, ఆయుర్దాయం పెరుగుదల తదితరాలతో చాలా దేశాల్లో వృద్ధుల జనాభా నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దాంతో ఆర్థిక వృద్ధి దెబ్బ తింటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. పురుషుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 63 ఏళ్లకు పెంచింది. ఫ్యాక్టరీ, బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు 50 నుంచి 55కు, వైట్–కాలర్ ఉద్యోగాల్లో 55 నుంచి 58కు పెంచింది. 2022 నుంచి చైనాలో జనాభా తగ్గుముఖం పట్టడం మొదలైంది. దాంతో అత్యధిక జనాభా రికార్డును 2023లోనే భారత్‌కు కోల్పోయింది. ఒకే సంతానం నిబంధనను సడలించి ముగ్గురిని కనేందుకు అనుమతించినా లాభం లేకపోయింది. 140 కోట్లున్న చైనా జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఇటలీదీ అదే వ్యథ... ఇటలీలో కూడా జనాభా నానాటికీ తగ్గిపోతోంది. 2023లో 5.94 కోట్లుండగా 2024 చివరికి 5.93 లక్షలకు తగ్గింది. 2008లో 5.77 లక్షలున్న వార్షిక జననాల సంఖ్య 2023 నాటికి ఏకంగా 3.8 లక్షలకు పడిపోయింది! ఇటలీ ఏకీకరణ తరువాత జననాల సంఖ్య క్షీణించడం అదే తొలిసారి! పిల్లల సంరక్షణ ఖరీదైన వ్యవహారంగా మారడం, తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకునే సంప్రదాయం వంటివి ఇటాలియన్లకు భారంగా మారుతు న్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా పోప్ కూడా ఇటీవలే ఇటాలియన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా 2033 కల్లా ఏటా కనీసం 5 లక్షల జననాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించడానికి జనాభా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దక్షిణ కొరియాలో విదేశీయుల రాక పుణ్యమా అని 2023లో జనాభా పుంజుకుంది. నిజానికి అధిక పోటీ విద్యా విధానంలో పిల్లలను పెంచడానికి అధిక ఖర్చు, మహిళలే శిశు సంరక్షణ చేపట్టా లనే ధోరణి వల్ల అక్కడ కొన్నేళ్లుగా జనాభా తగ్గుతోంది. వర్కింగ్ వీసా ప్రోగ్రాం పొడిగింపు వల్ల విదేశీ నివాసి తుల సంఖ్య 10% పెరిగి 10.9 లక్షలకు చేరింది. ఫలితంగా జనాభాలో కాస్త పెరుగుదల నమోదై 5.18 కోట్లకు చేరింది. కానీ వీరిలో ఏకంగా 90.5 లక్షల మంది 65, అంతకు మించిన వయసువారే! వృద్ధుల జనాభా పెరగడం కార్మికుల కొరతకు దారి తీస్తోంది.జపాన్‌లో అలా.. జపాన్ అయితే జనాభా సంక్షోభమే ఎదుర్కొంటోంది! 2008లో 12.8 కోట్లుండగా ప్రస్తుతం 12.5 కోట్లకు పడిపోయింది. జననాల సంఖ్య కూడా బాగా తగ్గుతోంది. యువత పెళ్లి, పిల్లలను కనడంపై తీవ్ర విముఖత చూపుతుండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ఉద్యోగావకాశాల లేమి, జీవన వ్యయానికి తగ్గ వేతనాలు లేకపోవడం, కార్పొరేట్ సంస్కృతి పనిచేసే మహిళలు పని చేసేందుకు అనుకూలంగా లేకపోవడం వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయి. 2070 నాటికి జపాన్ జనాభా 8.7 కోట్లకు పడిపోతుందని అంచనా. జనాభా సమస్యకు తోడు వృద్ధుల సంఖ్య కూడా జపాన్ను కలవరపరుస్తోంది. అక్కడ ప్రతి 10 మందిలో నలుగురు వృద్ధులే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనక్కి పంపేస్తున్నాం.. మాకు వద్దే వద్దు
మెక్సికో గుండా శరణార్థులుగా చొరబడిన వారందరినీ వెనక్కి పంపేస్తామంటూ అమెరికన్లకు ఇచ్చిన వాగ్దానాన్ని డొనాల్డ్ ట్రంప్ నెరవేర్చాలని చూస్తుంటే అందుకు మెక్సికో ససేమిరా అంటోంది. మా గడ్డ మీదుగా వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లుకాబోరని తెగేసి చెబుతోంది. అయినాసరే విమానాల్లో తరలిస్తామంటే ఆ విమానాలను ల్యాండింగ్ కానివ్వబోమని స్పష్టంచేసింది. దీంతో ఈ శరణార్థులను ఎక్కడి పంపాలో, వీళ్లని ఏం చేయాలా అని అమెరికా తల పట్టుకుంది. అసలేం జరిగింది? చాన్నాళ్లుగా శరణార్థులుగా అమెరికాలోకి అక్రమంగా వలసవస్తున్న వారిని గత అమెరికా ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డాక్యుమెంట్లు లేకుండా శరణు కోరుతూ అక్రమంగా వస్తే ఎవ్వరినీ అనుమతించబోమని ట్రంప్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇప్పటికే వచ్చిన వారినీ పంపేస్తామని ప్రకటించింది. గ్వాటెమాల నుంచి వచ్చిన వాళ్లను ఇటీవలే వెనక్కి పంపింది. ఒక్కోదాంట్లో 80 మంది శరణార్థులున్న రెండు సైనిక విమానాలు శుక్రవారమే గ్వాటెమాలకు వెళ్లి అక్కడ వదిలేసి వచ్చాయి. ఇదే తరహాలో ‘‘మెక్సికో వాళ్లు మెక్సికోలోనే ఉండాలి. అమెరికాలో కాదు’’అనే అర్థంలో గతంలో అమలుచేసిన ‘రిమేన్ ఇన్ మెక్సికో’విధానాన్ని ట్రంప్ యంత్రాంగం తెరమీదకు తెచ్చింది. మెక్సికో వెళ్లి శరణార్థులను వదిలేసి రావాలని ట్రంప్ ప్రభుత్వం గత వారం నిర్ణయించింది. సీ–17 భారీ సైనిక సంబంధ సరకు రవాణా విమానంలో వారిని మీ దేశానికి తీసుకొస్తున్నట్లు మెక్సికోకు అమెరికా సమాచారమిచ్చింది. ఇది తెల్సిన వెంటనే మెక్సికో ఘాటుగా స్పందించింది. ‘‘మా దేశం గుండా మీ దేశంలోకి వచ్చినంత మాత్రాన వాళ్లంతా మెక్సికన్లు అయిపోరు. వాళ్లలో అక్రమంగా మెక్సికోకు వచ్చి చివరకు అమెరికా సరిహద్దుదాకా వచ్చి శరణు కోరిన వారు ఉన్నారు. ఒకవేళ వాళ్లందరినీ విమానంలో మా దేశానికి పంపిస్తే ఆ విమానాన్ని ల్యాండ్ కానివ్వం. అమెరికాతో మాకు సత్సంబంధాలున్నాయి. వలస విషయంలోనూ అంతే. అయినా తప్పదనుకుంటే ఆ శరణార్థుల్లో మెక్సికో జాతీయులను మాత్రం తిరిగి పంపడానికి అనుమతిస్తాం’’అని మెక్సికో విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. క్షీణించిన సత్సంబంధాలు మెక్సికో సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టంచేస్తానని, ఓ యాప్ ద్వారా స్లాట్ బుక్‌చేసుకుని ఇంటర్వ్యూ తర్వాత శరణార్థి హోదాలో అమెరికాలోకి వచ్చే విధానానికి చరమగీతం పాడుతున్నట్లు ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లే సరిహద్దు వద్ద వేలాది మందిగా అదనపు బలగాలను మొహరించారు. మెక్సికో గుండా అత్యంత ప్రమాదకర కొత్తరకం మాదకద్రవ్యాలు అమెరికాలోకి స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అక్కడి డ్రగ్ ముఠాలను ఉగ్రసంస్థలుగా ప్రకటించారు. మెక్సికో వస్తూత్పత్తులపై ఫిబ్రవరి నుంచి అదనంగా 25 శాతం పన్నులు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. వెనక్కి పంపిస్తామన్న ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తిరస్కరించారు. మూకుమ్మడి తిరుగుటపాలు ఒప్పకోబోమని, అయినా ప్రతిభ గల మెక్సికన్ శరణార్థులు అమెరికా ఆర్థికాభివృద్ధికి దోహదపడతారని ఆమె హితవు పలికారు. దీంతో అమెరికా, మెక్సికో సత్సంబంధాలు క్షీణించాయి. 2021లోనూ అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించినప్పుడు అక్కడి వేర్వేరు దేశస్తులను తమ తమ దేశాలకు అమెరికా తమ సైనిక విమానాల్లో తరలించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అద్దెదార్ల ఓట్లపై పార్టీల వల
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం అద్దె ఇంట్లోనే నివసిస్తోంది. మొత్తం ఓటర్లలో అద్దెదార్ల వాటా తక్కువేమీ కాదు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించిగల స్థాయిలో ఉన్న ఈ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు వల విసురుతున్నాయి. వారి ఓట్లపై గురిపెడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. అద్దెదార్ల ఓట్లు గంపగుత్తగా పడితే ఎన్నికల్లో గెలుపునకు ఢోకా ఉండదని భావిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు హామీలు ఇచ్చారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఉచితంగా నీరు, విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. → ఢిల్లీ నివాసితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నగరంలో 66.6 శాతం మంది సొంత ఇళ్లల్లో నివసిస్తుండగా, 32.4 శాతం మంది కిరాయి ఇళ్లల్లోనే బతుకులీడుస్తున్నారు. → అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారిలో 51.9 శాతం మంది న్యూఢిల్లీ జిల్లాలోనే ఉండగా, 41.9 శాతం మంది సౌత్ఈస్ట్ జిల్లాలో ఉన్నారు. → న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో 62.7 శాతం మంది, ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో 46.9 శాతం మంది అద్దెదార్లు ఉన్నారు. → ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ప్రజలు వలస వస్తున్నారు. ప్రధానంగా పూర్వాంచల్‌గా పిలిచే ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ వాసులు దేశ రాజధాని గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకొనే పూర్వాంచల్ ప్రజల్లో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. → ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ సైతం అద్దెదార్ల ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. → తాము అధికారంలోకి వస్తే పూర్వాంచల్ ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. → ఆమ్ ఆద్మీ సర్కారు పాలనలో అద్దెదార్లు నిర్లక్ష్యానికి గురయ్యారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ వారం కథ.. వైతరిణికి ఈవల
నేను చనిపోయాను రాత్రి రెండుగంటలప్పుడు నీళ్లు తాగటానికని లేచి, తాగి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత నేను చనిపోయాను. నేనేమీ ముసలోణ్ణి కాదు ఆయుష్షు తీరిపోవటానికి. యాభై ఐదు మొన్ననే దాటింది. అయినా అదికాదు నేనాలోచించేది. నేను మందు ముట్టను. సిగరెట్టు తాగను. మాంసం పెద్దగా తినను. పేకాట ఆడను. ప్రతిరోజు వాకింగ్, యోగా చేస్తాను. సంవత్సరంలో దాదాపు మూడొందల రోజులు ఆరోగ్యం కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఎందుకిలా జరిగింది? ఏమో తెలీదు. ప్రస్తుతానికి నన్నెవరూ చూడలేదు కాబట్టి కారణం తెలీదు. శరీరం మాత్రం ఇంకా మంచం మీదే వుంది నా భార్య ఉదయం కాస్త లేటుగా నిద్ర లేస్తుంది. అప్పటివరకూ నేను చనిపోయానన్న విషయం ఎవరికీ తెలీకపోవచ్చు. ఒక మనిషి పుట్టుక అతడి తలరాతని బట్టి వుంటుందట. మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా? ఒకవేళ చేసినా అవన్నీ చిన్నవా? లేక అనుభవించాల్సింది ఇంకా ముందు ముందు మిగులుందా?మందు, విందు లాంటి బయటికి కనపడేవే చెడ్డ అలవాట్లు, పాపాలుగా పరిగణిస్తే .. నేను అవి చేసి వుండకపోవచ్చు. మరి అవతలి వాళ్ళను పరోక్షంగా బాధపెట్టటం, అసూయగా ఆలోచించటం, ఒంటరిగా వున్నప్పుడు మనసులో కలిగే చీకటి ఆలోచనలు/ అలవాట్లు పాపాలు కాదా? తెలిసో తెలియకో నేను ఎగ్గొట్టిన డబ్బులు, నా వల్ల బాధపడిన మనుషులు, నేను ఈర్ష్యపడేట్టు చేసిన నా స్నేహితులు (పదప్రయోగానికి క్షమించాలి.. బంధువుల, స్నేహితుల ఉన్నతికి నేను పడిన ఈర్ష్య అసూయలు) మరి ఇవన్నీ తప్పులు కావా? అసలు తప్పులకి, పాపాలకి సంబంధం ఉందా? ఉదాహరణకి నేనో పామునో, కప్పనో చంపితే అది చెడ్డ పనా? తప్పు పనా? దాన్ని తప్పుగా భావించి దేవుడు నాకు శిక్ష వేస్తాడా? లేక, పోయిన జన్మలోనో, వచ్చే జన్మలోనో.. దానికీ నాకూ ఉన్న సంబంధాన్ని బట్టి అది అలా జరగాలని రాసి వుంటుందా? మరైతే ఒకపని చేసేటప్పుడు అది ఇప్పటిదా లేక పోయిన జన్మలో చేసిన దాని పర్యవసానమా అనేది ఎలా తెలుస్తుంది?అన్నట్టు పాపం అంటే గుర్తొచ్చింది. నా కొడుకు విడాకులనాడు మా వియ్యంకురాలు నన్ను తిట్టిన తిట్లమాటేమిటి? తన కూతురికి అన్యాయం చేసినందుకు ఆ పాపం ఊరికే పోదనీ, నాకు నా కుటుంబానికి ఆ పాపం తగులుతుందని, దాని వల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని శాపం కూడా పెట్టింది. మరి నా కొడుకు చేసిన పనిలో/ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుందా? ఒకరి పాపపుణ్యాల్లో మరొకరికి వాటా ఉంటుందా? అసలలా జరిగే వీలుంటుందా? ఏమో.. ఈసారి స్వర్గంలోనో, నరకంలోనో.. ఎవరైనా ప్రవచనకర్త కనిపిస్తే అడగాలి.సమయం కొంత గడిచి, ఉదయం ఐదున్నర అయింది. నా భార్య నిద్రలేచింది. కళ్ళు మూసుకునే దేవుడికి దణ్ణం పెట్టి తర్వాత తాళి కళ్ళకద్దుకుంది. మా పెళ్ళైనప్పటినించీ నిద్ర లేచాక ఆమె చేసే మొదటి పని అదే. పక్కనే ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. రోజూ ఐదింటికల్లా వాకింగ్‌కి వెళ్లే నేను ఈ రోజు ఇంకా నిద్ర కూడా లేవకపోవటం చూసి పడిన ఆశ్చర్యం అది. చిన్నగా తట్టి ‘ఏమండీ..’ అంది. శరీరం అటు ఇటు కాస్త కదిలిందే తప్ప చలనం లేదు. దగ్గరకొచ్చి ‘ఏమండీ..’ అని తోసినట్టు గట్టిగా కుదిపింది. ఉలుకు లేదు పలుకు లేదు. మొదటిసారి ఆమెకు అనుమానం వచ్చింది. రెండో నిమిషంలో అది రూఢి అయింది. ఇంకో గంటకి.. అక్కడ వందమంది దాక గుమికూడారు. వాళ్ళందరూ నేనెంత మంచివాణ్ణో(?) మాట్లాడుకుంటున్నారు. చిత్రమేమిటంటే.. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది వాళ్లెవరో కూడా నాకు తెలీదు.ఒక మహానుభావుడు చెప్పినట్టు ‘నువ్వు హాస్పిటల్లో వున్నప్పుడు, కనీసం వందమంది నిన్ను పరామర్శించాలని నువ్వు భావిస్తే, ఆ వందమందికి బాలేనప్పుడు నువ్వెళ్ళి పరామర్శించి ఉండాలి’. కానీ, నేనా బాపతు కాదు. ఎవరినైనా పరామర్శించాల్సి వస్తే నేను వెళతాను కానీ, వాళ్లొచ్చి మళ్ళీ నా దగ్గిర అటెండె¯Œ ్స వేయించుకోవాలి అని నేనెప్పుడూ ఎదురుచూడను. చూడలేదు. అసలలాంటి ఆలోచన నేనెప్పుడూ చెయ్యను కూడా. అంతదాకా వస్తే నేనెప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడింది లేదు. అవతలి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగింది లేదు. తిరగాలన్న కోరిక కూడా నాకెప్పుడూ ఉండేది కాదు. అలా తిరగటం తప్పని నా ఉద్దేశం కాదు. ఎవరి జీవన విధానం వాళ్ళది. ఎవరి ఆలోచనలు, పద్ధతులు వాళ్ళవి. నా ఆలోచనలన్నీ నా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేవే తప్ప.. ఇతరులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాకెప్పుడూ లేదు. జీవితం పట్ల నా దృక్పథం వేరు. నా ఆలోచన, జీవన విధానమే వేరు. ఇలా ప్రతి ఒక్కరూ నేను వేరు అనుకుంటారేమో.. నాకు తెలీదు.ఇంకో అరగంటకి.. పూలమాలలు తెచ్చారు. బాడీని మంచం మీద నించి ఒక చిన్న బల్ల మీదకు మార్చారు. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యలో దాని కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లిస్తున్నారు. ‘పిల్లలకి ఫోన్ చేశారా?’ అని ఎవరో అడుగుతుంటే, ‘చేశాం. రాత్రికల్లా వస్తాం అన్నారు’ అంటున్నారు మరెవరో.అన్నట్టు చెప్పటం మరిచా. నాకు ఒక కొడుకు, కూతురు. కొడుకు బెంగళూరులో, కూతురు పుణెలో వుంటారు. నా పిల్లల్ని నేను కాలు కదపనీయకుండా.. అడుగు కింద పెట్టనీయకుండా.. లాంటివి కాదు కానీ ఉన్నంతలో బాగానే పెంచాను. వాళ్ళు అడిగినవి, అవసరమైనవి కొనివ్వగలిగాను. ఒక తండ్రిగా ఎంత చెయ్యాలో అంతా చేశాను. అలాని వాళ్ళకెప్పుడూ నేను ఆదర్శాలు వల్లించలేదు. నీతి సూక్తులు చెప్పలేదు. ధర్మం తప్పకుండా జీవించమని ఉద్బోధించనూ లేదు. పిల్లలు మనం చెప్పేదానికంటే, చేసేది చూసి నేర్చుకుంటారని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, కౌన్సెలర్లు చెప్పగా విని, పాటించాను. ఒక అనుభవం.. అది మంచైనా, చెడైనా వాళ్ళు దాన్నించి నేర్చుకోవాలనేది నా సంకల్పం. ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు.నిజం చెప్పొద్దూ ఆమెను చూస్తే నాకు జాలేసింది. ఏమీ చెప్పకుండా సడన్‌గా నేనిలా వచ్చేస్తే.. తను ఎలా బతుకుద్ది? ఆ భారం తను మోయగలదా? ఆస్తులంటే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ, ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది, ఎవరికి ఎంత అప్పుంది.. లాంటి డబ్బు సంబంధమైన విషయాలు నేనెప్పుడూ తనతో కనీసం చర్చించింది కూడా లేదే. మరిప్పుడెలా?పెళ్ళైనప్పటినించీ నేనే లోకంగా బతికింది. తను నన్ను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్క మా అబ్బాయి పెళ్లి మాత్రం తనిష్టప్రకారం తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో జరిపించాలంది. తెలిసిన వాళ్ళైతే సర్దుకుపోతారనేది తన ఆలోచన. ఆ ప్రకారమే తనూ మావాడూ ఇద్దరూ ఇష్టపడ్డ అమ్మాయితోనే మావాడి పెళ్ళిచేసింది. ఆ సంసారం నాలుగైదేళ్లు సజావుగా సాగింది. ఏమైందో ఏమో గాని మనస్పర్థలు మొదలయ్యాయి. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో కేవలం భగవంతుడికే తెలుసు. అటువైపు నించీ, మా వైపు నించీ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి అది విడాకుల దాకా వెళ్ళింది. విడాకులు మంజూరైన రోజు.. మా వియ్యపురాలు నన్నూ, నా కుటుంబాన్నీ తిట్టని తిట్టులేదు. తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంది. నడిరోడ్డు మధ్యలో అలా వదిలేసి వెళితే తమ పరిస్థితేంటని నిలదీసింది. అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా అర్ధాంతరంగా బయటికి గెంటేస్తే .. ఆ పాపం ఊరికే పోదనీ, దాని ఉసురు కచ్చితంగా తగులుతుందని శపించింది. చివరగా.. నీక్కూడా ఒక కూతురుందనీ దానికి కూడా ఇలాంటిది జరిగితే అప్పుడు తండ్రిగా ఆ బాధేమిటో తెలుస్తుందని దుమ్మెత్తి పోసింది. ఐతే అదృష్టవశాత్తూ అలాంటివేం జరగలేదు. కానీ, ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో అంత వేదన అనుభవించటం అది రెండోసారి (మొదటిసారి.. శ్రుతిలయతో నేను విడిపోయినప్పుడు జరిగింది). చేయని తప్పుకి శిక్ష అనుభవించాలా? అయినా తప్పెవరిదో కూడా నిర్ణయించే పరిస్థితి లేనప్పుడు కేవలం నా కుటుంబాన్ని ఆడిపోసుకోవడం న్యాయమా? ఏదైతేనేం.. జరగకూడనిది జరిగిపోయింది. పచ్చని సంసారం పెటాకులైపోయింది. ఎదో దిగులు. మానసిక వ్యథ. కాస్తో కూస్తో పరువుగా బతుకుతున్న వాళ్ళం. ఎందుకిలా జరిగింది? సమాజం మారిందనటానికి ఇవన్నీ రుజువులేమో. కావొచ్చు కానీ ఎక్కడో జరిగితే మనం దానిమీద చర్చించొచ్చు, సులభంగా తీర్మానం చెయ్యొచ్చు. కానీ అది మనింట్లోనే జరిగితే..? మనసు ఏ పని మీదా లగ్నం కావటం లేదు. నిద్ర రాదు. ఆకలి వేయదు. ఒకటే అంతర్మథనం. దాదాపు మూడు నెలలు. మానసికంగా కుంగిపోయాను. ఆలోచించే కొద్దీ ఎవరో రెండు అరచేతుల మధ్యకి నా గుండెని తీసుకుని ఒత్తిన ఫీలింగ్. కాలమే అన్ని గాయాల్ని మాన్పుతుందన్నట్టు కొన్నాళ్ళకు నేను తేరుకున్నాను.. తేరుకుని చూస్తే.. మా ఆవిడ తమ్ముడు ఫ్రీజర్ బాక్స్ తెచ్చి సర్దుతున్నాడు. నా మనసెందుకో కీడు శంకించింది. ఇప్పటివరకూ లేని ఒక చిన్న జలదరింపు. నేనూహించినట్టుగానే నలుగురైదుగురు కలిసి ఆ బాడీని ఎత్తి ఫ్రీజర్‌లో పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. శరీరం ఆ చల్లటి వాతావరణానికి అలవాటు పడుతుంది. కానీ నేనే బయట ఉండలేకపోతున్నా. అప్పటివరకూ అది నేనే, ఆ శరీరం నాదే అన్న ఆలోచన నన్ను ఏమీ ఆలోచించనీయలేదు కానీ ఇప్పుడు తొలిసారిగా నన్నూ, నా శరీరాన్నీ విడదీస్తున్నారన్న భావన. పావుగంటలో ఆ బాడీని లోపల సర్దేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నేను బయట బిక్కుబిక్కుమంటూ బిగుసుకుపోయాను. ‘మనిషి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ అక్కడక్కడే తచ్చట్లాడుతుంటుంది. తిరిగి తన శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఒకసారి శరీరాన్ని వీడాక మళ్ళీ అందులోకి వెళ్ళటం అన్నది సృష్టి విరుద్ధం కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ కర్మలన్నీ ముగిశాక ఇక ఏ దారీ లేక అక్కణ్ణించి నిష్క్రమిస్తుంది’ నా స్నేహితుడు రవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి.. ఇప్పుడు నా పరిస్థితేంటి? మొదటిసారిగా నాకు భయం వేసింది. ఫ్రీజర్ బాక్స్ చుట్టూ చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాతో వాళ్లకున్న జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అవన్నీ నా చెవికెక్కడం లేదు. నాకు తిరిగి ఆ బాడీలోకే వెళ్లాలని వుంది. కానీ దాన్ని ఫ్రీజర్‌లో పెట్టి ఆ చల్లదనం బయటికి పోకుండా చుట్టూ గ్లాసులతో బిగించేశారు. లోపలికి వెళ్లే మార్గమే కనపడటం లేదు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేక పోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా?ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు. అప్పడు.. మొదటిసారిగా నాకు అనుమానం కలిగింది. ఇకమీదట నేను తిరిగి ఆ శరీరంలోకి చేరలేనేమో! తిరిగి నేను మనిషిని కాలేనేమో! ఒక్కసారిగా భయం వేసింది. ఏదైనా ప్రయత్నం చెయ్యాలని వుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. ‘ఆ శరీరం నాది. నన్ను అందులోకి వెళ్లనివ్వండి’ అని గొంతెత్తి అరవాలనుంది. కానీ మాట పెగలటం లేదు. శబ్దం బయటికి రావటం లేదు. నాకేమీ పాలుపోవటం లేదు. ఇక ఇంతేనా? నేను నా శరీరంతో వేరైపోయానా? ఇక మీదట నాకు ఆ శరీరంతో ఏ సంబంధమూ లేదా? ఇలా నాకొక్కడికేనా? సృష్టిలో ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుందా? మరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు.. వీళ్లందరినీ ప్రజల సందర్శనార్థం కోసం అలానే గంటల తరబడి ఉంచుతారే? వీలయితే రోజుల తరబడి కూడా ఉంచుతారే మరి వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఎంతగా క్షోభించి ఉంటుంది? నా ఈ మానసిక క్షోభకి కారణం నేను చేసిన పాపాలేనా? మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా?పాపం అనగానే నాకు శ్రుతిలయ గుర్తొచ్చింది.శ్రుతిలయ నా కాలేజ్‌మేట్. మనిషి అందంగా ఉండేది. ఇష్టానికి, ప్రేమకు అందమే తొలిమెట్టు ఐతే.. నేనామెను ఇష్టపడ్డా. విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్టు ఆమె కూడా నన్నిష్టపడింది. ఎన్నో ఉత్తరాలు.. ఎన్నెన్నో కబుర్లు.. సమయం తెలిసేది కాదు. మొదటి సంవత్సరంలో మొదలైన మా పరిచయం చివరి సంవత్సరానికొచ్చింది. పెళ్లి ప్రాతిపదికగా మేమెప్పుడూ ఒకరొకర్ని ఇష్టపడలేదు. అందువల్ల ఆ టాపిక్ ఎప్పుడూ మా మధ్య రాలేదు. కేవలం అభిప్రాయాలు, ఆలోచనలు కలవటం వల్లనే మా మధ్య బంధం మొదలైంది. ఆ బంధాన్ని ఒక అనుభూతిగా, తీయని జ్ఞాపకంగా, మధురస్మృతిగా వుంచుకోవాలనుకున్నామే తప్ప కలిసి జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఇష్టంలో, బంధంలో, ప్రేమలో ఉన్న అందం పెళ్ళిలో రాదేమో! అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. చివరిరోజు ఇద్దరం కాలేజీ గ్రౌండ్లో.. ఒకరికొకరం రాసుకున్న ఉత్తరాలను వెనక్కి ఇచ్చేసుకున్నాం. డైరీలు చింపేసుకున్నాం. అనుభూతులు, అనుభవాలు చెరిపేసుకున్నాం. చెరిపేసుకోవడానికి ఇక ఏమీ మిగిలి లేవనుకున్నాం. కాని, జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గాయమైనట్టు ఒకటే బాధ. ఎర్రగా కాల్చిన కర్రుతో గుండెల్లో ఎవరో కెలుకుతున్న భావన. చెరుకు మిషన్‌లో గుండెను పెట్టి తిప్పినంత నొప్పి. అంత మానసిక క్షోభ అనుభవించటం అదే మొట్టమొదటిసారి నాకు ( రెండోసారి మా వాడి విడాకులప్పుడు). కొన్నాళ్ళు అలా గడిచాయి. ఆ తర్వాత తను ఏమైందో, ఎక్కడుందో కూడా ఆచూకీ లేదు. ఆ విధంగా ఆ ప్రేమకథ ముగిసింది. కాని, అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వచ్చే జ్ఞాపకాలు నన్ను నిలువెల్లా దహించి వేస్తుంటాయి సరిగ్గా ఇప్పుడీ బాధలాగానే. ఇంత బాధలోనూ నాకు శ్రుతిలయ గుర్తొచ్చిందంటే మా బంధం ఏపాటిదో మీకు అర్థమయ్యేవుంటుంది. జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి చూస్తే చీకటిపడి ఎంతసేపయ్యిందో. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. కాసేపటికి మా పిల్లలు వచ్చారు. మా మనవళ్లు, మనవరాళ్లు వాళ్లతో వున్నారు. నా భార్య వాళ్ళని దగ్గరకు తీసుకుంది. నా కూతురి కళ్ళు ఉబ్బి వున్నాయి. ఎంతగా ఏడ్చివుంటుందో. రాగానే నా శరీరం మీదపడి వెక్కివెక్కి ఏడుస్తున్నారు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా? నేనేమంత గొప్ప పని చేశానని.. నా కోసం ఈ ఏడుపులు? చరిత్ర గతిని మార్చిన గొప్పగొప్ప వాళ్ళు తమ ఆనవాలు వదిలివెళతారు. వాళ్ళకోసం వుంచుకోమ్మా నీ కన్నీళ్లు. అల్పుడినైన నా కోసం ఎందుకు వృథా చేసుకుంటావు? అని నా కూతుర్ని, కొడుకుని బుజ్జగించాలని వుంది. కానీ, వీలవడం లేదు.దేవుడా! ఎందుకయ్యా నాకీ కష్టాలు? ఓ దేవా.. మనుషుల మధ్య ఈ బంధాలు, పాశాలను ఎందుకు సృష్టించావు? ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయం అన్నట్టు.. మనుషుల మధ్య ఈ బంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వల్ల ఏర్పడేట్లు చేస్తావు. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగిపోయినట్లు ఈ అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మనిషికి మోక్షం రాదు. తన తర్వాత తన పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన మనిషిని నిలవనీయదు. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం, జారిపడే జాబిల్లి, ఆశల హారతి, కరిగే మబ్బు.. వీటన్నిటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది చివరికి తెగిన వీణలా బంధాలన్నిటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది. ఓ ఈశ్వరా! నీ సృష్టి ఎంత విచిత్రం? నువ్వే సృష్టిస్తావు. జ్ఞానమో, అజ్ఞానమో అన్నీ నువ్వే పంచుతావు. చివరికి ఏదీ శాశ్వతం కానట్టు, నువ్వే తీసుకెళతావు. ఓ ప్రభూ .. మనుషులుగా జన్మించినందుకు మాకిది తప్పదా? ప్రతి మనిషీ ఈ చట్రంలో బిగుసుకోవాల్సిందేనా? ఈ బంధాలనించీ, పునరావృతమయ్యే నీ లీలలనించీ ఎప్పుడయ్యా మాకు విముక్తి?మనసు ధారాపాతంగా రోదిస్తూనే వుంది. తర్వాతరోజు ఉదయం పది గంటల వేళ.. శరీరం అగ్నిలో దహనమయ్యింది. బంధాల్ని తెంచుకుని ఆత్మ ఊర్ధ్వముఖంగా శూన్యంలోకి పయనమయ్యింది. నడ్డా సుబ్బారెడ్డి(మిత్రుడు వైవీకే రవి చెప్పిన మాటల సౌజన్యంతో ) -
National Voters Day: ‘ఓటు’.. ఎందుకీ తడబాటు?
ప్రతీ పౌరుడు ఓటు హక్కును ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి. మొత్తం ఓటర్లలో కనీసం 90 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకోవాలి. 90 శాతం ఓటింగ్ జరిగితే దేశం ఎప్పుడూ అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. – అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి సాక్షి ప్రతినిధి, వరంగల్: భారత రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 ఏళ్లు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటుహక్కు(National Voters Day) కల్పించారు. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద, వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించి.. ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మనదేశంలో వయోజన ఓటింగ్ హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. అయితే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ.. అవినీతిని పారదోలే వజ్రాయుధం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.. ఇలా ఎన్ని విశ్లేషణలు జోడించినా.. ఓటు వేస్తున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు వీలుగా.. వరసలో నిలబడి ఓటు వేయడానికి ఇంకా చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఓటు వేసే విషయంలో గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపుతున్నా.. పట్టణ, నగర ఓటర్లే తడబడుతున్నారు. ఓటర్ల నమోదు పెరుగుతున్నా.. ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. తెలంగాణలో మూడు ఎన్నికలు.. 80 శాతం చేరని వైనం..1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు(Vote) హక్కును వినియోగించారు. 2019 నాటికి 17వ లోకసభ ఎన్నికల్లో 66.4 శాతం మంది ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు పర్యాయాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఏటా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటు నమోదు కోసం జిల్లాల అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపడుతోంది. కానీ.. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు.. పోలైన ఓట్లు.. ఓటింగ్ శాతాలు పరిశీలిస్తే 80 శాతం చేరుకున్న దాఖలాలు లేవు. కేంద్ర ఎన్నికల సంఘం నివేదికల ప్రకారం.. తెలంగాణ ఏర్పడిన తొలి శాసనసభ (2014) ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0 శాతం) ఓటు వేశారు. 2018లో 79.67 శాతం ఓట్లు పోల్ కాగా, 2023లో 71.37 శాతంగా నమోదైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భారీ వ్యత్యాసం..తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌లో భారీ వ్యత్యాసం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినంతమంది కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు రాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,81,65,885 మంది ఓటర్లకు 1,94,43,411 మంది (69.0శాతం) ఓటు వేయగా.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,81,75,651 ఓట్లకు 1,94,31,99 (68.97 శాతం) ఓట్లు పోలయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,56,94,443 ఓట్లకు, 2,04,70,749 (79.67 శాతం) ఓట్లు పోలవగా, ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2,80,65,876 ఓట్లకు 1,86,42,895 (66.4 శాతం) ఓట్లు పోలయ్యాయి. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3,26,02,799 ఓటర్లకు 2,32,67,914 మంది ఓటర్లు (71.37 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటు న మోదు పెరిగినా 5.11 శాతం తగ్గింది. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,08,373 మంది (66.26 శాతం) ఓట్లేశారు.ఓటు హక్కుపై అవగాహన ఓటు హక్కు వినియోగంపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు తోడు పౌరసమాజం, యువత మహిళా సంఘాలు, స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థలు చైతన్యం కలిగించాలి. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఓటుహక్కు చాలా కీలకం. ఓటు హక్కు వినియోగం మీద అందరినీ మరింత చైతన్య పరచాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉంది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సమర్ధులైన అభ్యర్థులకు ఓటువేసేలా చూడాలి. – డాక్టర్ కేశవులు, చైర్మన్, తెలంగాణ యాంటీ కరప్షన్ ఫోరం -
యుద్ధ గాయాలకు ఉపశమనం
2023 అక్టోబరు 14. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక రాజప్రాసాదం ఓ అసాధారణ షోకు వేదికైంది. అది స్టాండప్ కామెడీ. ప్రఖ్యాత కమేడియన్ ఆంటోన్ టైమోషేంకో సోలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఘనత సాధించిన తొలి ఉక్రేనియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్లుగా యుద్ధ విషాదంలో మునిగి తేలుతున్న ఉక్రెయిన్‌కు స్టాండప్ కామెడీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మారింది. ఒకప్పుడు విలాసవంతమైనవిగా గుర్తింపు పొందిన షోలు ఇప్పుడు ఉక్రెయిన్ సంస్కృతిలో భాగమయ్యాయి. స్టాండప్ కామెడీని సైకోథెరపీ బడ్జెట్ వర్షన్‌గా అభివర్ణిస్తున్నారు టైమోషేంకో . యుద్ధ సమయంలో కామెడీ చేయడం నిజానికి అంత్యక్రియల్లో జోక్ వేయడం వంటిదే. అయినా దేశ ప్రజల ముఖాల్లో మాయమైన నవ్వును తిరిగి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు స్టాండప్ కమెడియన్లు. షెల్టర్ హోమ్స్‌లో, సాయుధ దళాల కోసం, ఔట్‌డోర్ స్టేజీలపై... ఇలా వీలైన చోటల్లా ప్రదర్శనలు ఇస్తున్నారు. రష్యా క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నా ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న స్టాండప్ కామిక్స్‌లో 30 ఏళ్ల టైమోషెంకో ఒకరు. క్లిష్ట సమయాలను అధిగమించడానికి, సమాజ భావనను నిర్మించడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ హాస్యం ఉత్తమమైన మార్గం అంటున్నారాయన. గాయాలను గుర్తు చేయకుండా భయంకర ఘర్షణ వాతావరణంలో హాస్యం నవ్వించగలుగుతుందా? అంటే అవునంటున్నారు కమెడియన్లు. ప్రమాదాన్ని ఎగతాళి చేయడం వల్ల దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుందంటారు కమెడియన్ హన్నా కొచెహురా. యుద్ధ సమయంలో వేసే జోక్స్ సహజంగానే యుద్ధానికి సంబంధించినవే ఉంటాయి. ఫ్రాంక్ జానర్లాగా ఉండే స్టాండప్ కామెడీలో కమెడియన్లు తమ సొంత అనుభవాలు, ఆలోచనల్లోంచే మాట్లాడతారు. యుద్ధ సమయంలో జోక్స్ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే, ఆకాశంలో రష్యా క్షిపణులను చూడగానే వాటంతటవే పుట్టకొస్తాయంటూ వ్యంగంగా బదులిస్తారు ఆంటోన్. పట్నంలో ఉన్న కొడుకుతో గ్రామంలో ఉంటున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ, ‘బాబూ! ఈ రోజు మన ఇంటిపై నుంచి ఎన్ని రాకెట్లు వెళ్లాయో తెలుసా?’అంటూ బెదిరిపోతుంటుంది. ‘‘భయపడకులేమ్మా! అవన్నీ పట్నంలో ఉన్న నా వైపుకే వచ్చాయి’’అంటూ భయాన్ని పోగొడుతుంటాడు కొడుకు. ఇలా ఉంటుంది వారి కామెడీ. అయితే యుద్ధంపై జోక్ చేయడం కత్తిమీద సాము. ఆ క్రమంలో గాయాలను మళ్లీ రేపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు వీళ్లు. విచారంగా, విషాదంగా అనిపించే విషయాలను కామెడీ చేయరు. సైన్యానికి సాయంగా.. ఉక్రెయిన్‌లో స్టాండప్ కామెడీకి మరో కోణమూ ఉంది. అది సైన్యానికి సాయం. యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియాల్లోనూ వీళ్లు ప్రదర్శనలిస్తున్నారు. వచ్చిన డబ్బును సాయుధ దళాలకు సాయంగా ఇస్తున్నారు. ‘‘యుద్ధ సమయంలో ప్రతిదీ సైన్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. దూసుకొస్తున్న క్షిపణుల మధ్య కళ గురించి మాత్రమే మాట్లాడటం మతిలేనితనం. కానీ నాకు తెలిసిన ఏకైక మార్గం కామెడీ. ఆ షోల ద్వారా నిధులు సేకరిస్తున్నా. ఇప్పటిదాకా రకూ రూ.6 కోట్లకు పైగా విరాళాలిచ్చా’’అని టైమోషేంకో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ దూకుడు.. మన విద్యార్థుల్లో ఆందోళన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి వారిలో చాలామంది పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్‌టైమ్‌గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎఫ్–1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. కానీ చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్‌టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు. ధీమా పోయింది.. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని మన విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు. ‘‘రూ.42 లక్షలు అప్పు చేసి మరీ వచ్చా. కాలేజీ కాగానే చిన్న కఫేలో రోజుకు ఆరు గంటలు పని చేసేవాన్ని. గంటకు ఏడు డాలర్ల చొప్పున ఇచ్చేవారు. నెలవారీ ఖర్చులు హాయిగా వెళ్లిపోయేవి. కానీ ఇలా అనధికారికంగా పని చేస్తున్న వారిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియడంతో గత వారం రాజీనామా చేశా’’ఇల్లినాయీ వర్సిటీకి చెందిన ఓ భారతీయ విద్యార్థి చెప్పారు. ‘‘ఇప్పటికే నా పొదుపులో చాలావరకు వాడేశా. రూమ్మేట్స్ నుంచి అప్పు తీసుకుంటున్నా. ఇంకెంతకాలం నెట్టుకురాగలనో తెలియడం లేదు’’అని టెక్సాస్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మరో విద్యార్థి వాపోయాడు. ఈ అనిశ్చితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతోంది. అతి పెద్ద విద్యార్థి సమూహం... అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మనవాళ్లు అతి పెద్ద సమూహం. ఈ విషయంలో చైనాను కూడా దాటేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నివేదిక ప్రకారం 2022–23లో 2.69 లక్షల భారత విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే అది ఏకంగా 35% అధికం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తారలు అక్షరాలు తళుక్కుమన్నాయి
సాహిత్యాభిమానులు క్యూ కట్టారు. వేదికల మీద రచయితలు, రచయిత్రులు, నటీనటులు తమ మాటల మూటలు విప్పారు. పుస్తకాలు మేమున్నామంటూ ఆకర్షణీయమైన అట్టలతో పాఠకుల్ని కేకేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ నగరానికి కొత్త శోభను తెచ్చింది. ఈ సందర్భంగా తారలేమన్నారో అక్షరాలు ఎలా మెరిశాయో ఇక్కడ చదవండి.ప్రపంచమే ఒక రంగస్థలంభారతదేశం గొప్ప లౌకికదేశమని కొనియాడారు అమల్ అల్లానా. దేశవిభజన సమయంలో అమల్ తల్లి రోషన్ నిండు గర్భిణి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నెల రోజులకు పుట్టింది అమల్. ఆమె తండ్రి ఇబ్రహీమ్ అల్కాజీ గుర్తింపు పొందిన డైరెక్టర్. సౌదీ అరేబియా, కువైట్ మూలాలున్న కుటుంబం ఆయనది. విభజన సమయంలో ఇబ్రహీం సోదరులంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఇబ్రహీమ్ మాత్రం ఇండియాలో కొనసాగారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అమల్. తల్లి కుటుంబం గుజరాత్‌కు చెందినది కావడం కూడా తాము ఇండియాలో ఉండిపోవడానికి అదో కారణమంటూ తాను చూసిన ఇండియా గమనాన్ని విశ్లేషించారు. ‘అరవైల నాటి ఇండియాని చూశాను, 90ల నాటికి వచ్చిన మార్పులకు ప్రత్యక్ష సాక్షిని. అలాగే 2025కి సాధించిన పురోగతిని ఆస్వాదిస్తున్నాను. కొత్త బాధ్యతలను భుజానికెత్తుకుంటూ పాత బ్యాగేజ్‌ని తగ్గించుకుంటూ ముందుకుపోవడమే అభివృద్ధి’ అన్నారు అమల్. అవి గోల్డెన్ డేస్! రంగస్థల దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్, సీన్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన అమల్ అల్లానా ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె తల్లి రోషన్ అల్కాజీ రచనలు ‘ఏన్షియెంట్ ఇండియన్ కాస్ట్యూమ్, మిడివల్ ఇండియన్ కాస్ట్యూమ్’ లను పరిష్కరించారు. ఇటీవల తండ్రి జీవితాన్ని ‘ఇబ్రహీం అల్కాజీ: హోల్డింగ్ టైమ్ క్యాప్టివ్’ పేరుతో అక్షరబద్ధం చేశారు. ఈ రచనలోని విషయాలను ప్రస్తావించడం అంటే నా తండ్రిని గుర్తు చేసుకోవడమే అంటూ ‘మేము ముంబయిలోని ఒక ఆరు అంతస్థుల భవనంలో నివసించేవాళ్లం. ఆ టెర్రస్‌ని చూసిన మా తండ్రి అక్కడ 80 మంది వీక్షించే రంగస్థల వేదికను ఏర్పాటు చేశారు. అప్పుడు నాటకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఐదంతస్థులు మెట్లెక్కి వచ్చేవారు. అవి రంగస్థలానికి గోల్డెన్ డేస్. ఇప్పుడు రంగస్థలానికి వన్నె తగ్గిన మాట నిజమే కానీ, రంగస్థలం అంతరించిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ప్రపంచ దేశాల సంస్కృతి అంతా రంగస్థలం చుట్టూనే పరిభ్రమించింది’ అన్నారు అమల్ అల్లానా.భాగమతి ప్రేమకథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందిబెంగాల్కు చెందిన మౌపియా బసు జర్నలిస్టు, రచయిత. చారిత్రక పరిశోధనల ఆధారంగా కథనాలను వెలువరించే మౌపియా నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు.‘అనార్కలి అండ్ సలీం: ఏ రీటెల్లింగ్ ఆఫ్ ముఘల్ ఈ ఆజమ్, ‘ద క్వీన్స్ లాస్ట్ సెల్యూట్: ద స్టోరీ ఆఫ్ ద రాణీ ఆఫ్ ఝాన్సీ అండ్ ద 1857 మ్యూటినీ, ఖోక, కమల్సుందరి’ రచనలు చేసిన మౌపియాకు హైదరాబాద్ నగరం కొత్త సందేహాలను రేకెత్తించింది. నగరంలో ఎక్కడికెళ్లినా ఆమెకు వినిపించిన భాగ్యనగర్ అనే పేరు మీద పరిశోధన మొదలుపెట్టారు. తాను తెలుసుకున్న విషయాలను ‘భాగమతి : వై హైదరాబాదీస్ లాస్ట్ క్వీన్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద సిటీ’ పేరుతో ప్రచురించారు. హైదరాబాద్వాసుల్లో పరిపూర్ణమైన మతసామరస్యాన్ని, బ్రదర్‌హుడ్‌ను చూశానన్నారు మౌపియ. ‘ఈ నగరంలో నివసించే వాళ్లు తమను తాము మతం, కులం,ప్రాంతం, భాషల ఆధారంగా పరిచయం చేసుకోరు. ‘హైదరాబాదీని’ అని గర్వంగా చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే వినిపించే డయలక్ట్ కూడా వీనులవిందుగా ఉంటుంది. హైదరాబాద్ మీద సామాన్యుల్లో ఉన్న అనేక అపోహలను నా పర్యటన తుడిచేసింది. ఓల్డ్‌సిటీకి వెళ్లవద్దనే హెచ్చరికలను పట్టించుకోకుండా రంజాన్ మాసంలో వెళ్లాను. ఆత్మీయతకు అర్థాన్ని తెలుసుకున్నాను. అక్కడి వాళ్లను పలకరించినప్పుడు వారి నోటివెంట కూడా భాగమతి మాట వినిపించింది. ఒక ప్రేమ కథ రెండు మతాలను కలిపి ఉంచుతోంది. ఆ ప్రేమకథ నాలుగు వందల ఏళ్లుగా జనం నాలుకల మీద సజీవంగా ఉంది. అయితే నాకు సమాధానం దొరకని ప్రశ్న ఏమిటంటే... గోల్కొండను పాలించిన కుటుంబాల సమాధులున్నాయి, మహళ్లు, ప్యాలెస్‌లున్నాయి. కానీ భాగమతి ఊహాచిత్రం తప్ప అధికారిక డాక్యుమెంట్ కానీ, శిల్పం వంటి ఆధారం కానీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్ అధికారిక రికార్డుల్లో ఎక్కడా ఆమె పేరు కనిపించదు. కానీ ఇక్కడ పర్యటించిన యాత్రికుల రచనల్లో ఉంది. డచ్, బ్రిటిష్ వ్యాపారుల రికార్డుల్లో భాగ్నగర్ పేరు ఉంది. సినిమా, రంగస్థలం, కవిత్వం, పెయింటింగ్లుల్లో భాగమతి కనిపిస్తోంది. ఆమెకు సంబంధించిన భౌతిక ఆధారం ఒక్కటీ లభించకపోవడానికి కారణం ఉద్దేశపూర్వకంగా తుడిచేయడం జరిగిందా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది’ ఈ చారిత్రకాంశం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి మౌఖికంగా కొనసాగుతోంది’ అని వివరించారు మౌపియా బసు. ఆమె శిల్పం లేదు. ఆమె రూపాన్ని చిత్రపటంగా అయినా ఎవరూ చూడలేదు. ఆమె సమాధి ఎక్కడో తెలీదు. కానీ ఇన్ని వందల ఏళ్లుగా ఆమె పేరును తలవడం మానలేదు హైదరాబాదీలు.ఫెమినిస్ట్ అయితే తప్పేంటి?షబానా ఆజ్మీ తెలుగింటి ఆడపడచు. ఆమె పుట్టిల్లు హైదరాబాద్. తొలిసారి కెమెరా ముందుకు వచ్చిందీ ఇక్కడే! ఆ జ్ఞాపకాలతోపాటు నేటి సినిమా.. ఆ రంగంలో పెరుగుతున్న అమ్మాయిల పాత్ర గురించీ ముచ్చటించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టినా ఇక్కడ గడిపింది తక్కువే! నాన్న (కైఫీ ఆజ్మీ)పోయెట్ మాత్రమే కాదు కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ కూడా. ఆయన అండర్ గ్రౌండ్ జీవితం వల్లే నా తొమ్మిదో ఏట అమ్మ నన్ను తీసుకుని ముంబైకి వెళ్లింది. సమ్మర్‌కి మాత్రం వచ్చేవాళ్లం. అమ్మ (షౌకత్ ఆజ్మీ) రంగస్థల నటి. దాంతో హైదరాబాద్‌లోని మా ఇంట్లో సాహిత్యం, నాటకం, సామాజిక స్పృహ కలగలసిన ఒక ప్రోగ్రెసివ్ వాతావరణం ఉండేది. ఆ నేపథ్యంలో పెరిగాన్నేను. దాంతో యాక్టివిజం కూడా నాకు వారసత్వంగా అబ్బింది. ఆ గుణం వల్లే ముంబైలోని మురికివాడల నిర్వాసితుల కోసంపోరాడాను. పొట్ట చేతపట్టుకుని సిటీకి వచ్చేవాళ్లకు పని దొరుకుతుందేమో కానీ సొంత జాగా దొరకదు. దానికోసం వాళ్ల తరఫున నిలబడ్డాను. మహిళల హక్కుల కోసమూ ముందుంటాను. కొంతమంది ఫెమినిస్ట్ అని చెప్పుకోవడం పట్ల నామోషీ ఫీలవుతున్నట్లనిపిస్తోంది ‘నేనేం ఫెమినిస్ట్‌ను కాను’ అని చెప్పుకుంటున్న వాళ్ల తీరును చూస్తే! ‘అంకురం’తో సొంతూరు పర్యటననా మొదటి సినిమా శ్యామ్ బెనెగల్ తీసిన ‘అంకురం’ షూటింగ్ హైదరాబాద్ (ఎల్లారెడ్డి గూడ) లోనే జరిగింది. బాల్యం తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం అప్పుడే! అంతా కొత్తగా అనిపించింది. అంకురంలో నాది పనమ్మాయి పాత్ర. దానికి తగ్గట్టు నన్ను మలచడానికి శ్యామ్ బెనెగల్ నన్ను.. చీర కట్టుకుని మేమున్న ఇంటి పరిసరాల చుట్టూ తిరిగి రమ్మన్నాడు. మనుషులను, కల్చర్‌ను అబ్జర్వ్ చేయడానికి. ఓ మూడు రోజులు అదేప్రాక్టీస్! మాకు భోజనాలు ఏర్పాటు చేసిన చోట కూడా వాళ్లంతా టేబుల్ మీద తింటుంటే.. నన్నో మూలన, కింద కూర్చొని తినమనేవాడు. ఒకరోజు నేనలా తింటుంటే.. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి ‘ఇక్కడేదో సినిమా షూటింగ్ అవుతోందట కదా! హీరోయిన్ ఏది’ అనడిగారు. ‘బయటకు వెళ్లింద’ని చెప్పాను. ‘నువ్వెవరు?’ అనడిగారు. ‘ఆయాను’ అన్నాను. దీన్నంతా దూరం నుంచి గమనించిన శ్యామ్ బెనెగల్.. ఆ స్టూడెంట్స్ వెళ్లిపోగానే నన్ను పిలిచి, ‘నువ్విక ఈప్రాక్టీస్ ఆపేయొచ్చ’ని చెప్పారు. అలా ఉండేది ప్యార్లల్ మూవీస్‌లో పాత్రల ప్రిపరేషన్! హాలీవుడ్లో కూడా నటించాను (Madame Sousatzka, City of joy) కదా! వాళ్ల తీరు వేరు. పేపర్ మీద రాసుకున్నది రాసుకున్నట్టుగా జరగాలి. అది ఏ కాస్త కింద మీదైనా కంగారుపడిపోతారు. మళ్లీ అంకుర్ జ్ఞాపకాలకొస్తే.. నాకు కాస్ట్యూమ్స్‌ను కుట్టించడానికి ఓ దర్జీని పిలిపించారు. అతను టేప్ లేకుండా జస్ట్ అలా వచ్చి నన్నోసారి పై నుంచి కిందకు.. కింద నుంచి పైకి చూసి వెళ్లిపోయాడంతే! తర్వాత రెండు రోజులకు పర్ఫెక్ట్ సైజ్‌తో కాస్ట్యూమ్స్‌ను రెడీ చేసిచ్చాడు.పారలల్ మూవీస్‌కి... ఫార్ములా మూవీస్‌కి మధ్య వ్యత్యాసంపారలల్ మూవీస్‌లో స్త్రీ పాత్రలకు ఔచిత్యం, వ్యక్తిత్వం ఉండేవి. అదంతా సీరియస్ వ్యవహారం. ఫార్ములా మూవీస్‌కి వినోదమే ప్రధానం. ఆర్ట్ మూవీస్ నుంచి కమర్షియల్ మూవీస్‌కి వెళ్తున్న కొత్తలో భలే ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా డాన్స్ విషయంలో! ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌ను ఇప్పుడు ఓటీటీ రీప్లేస్ చేస్తోంది. అన్నిరకాల సినిమాలతో ప్రేక్షకులకు చాయిస్ ఉండాలి. ఈ మధ్య కొన్నివర్గాల వాళ్లు తమ ఐడియాలజీస్ను ప్రమోట్ చేసుకోవడానికి సినిమాను ఉపయోగించుకుంటున్నారనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల విచక్షణ చాలా గొప్పది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పురుషులను ఎడ్యుకేట్ చేయాలిఅన్ని రంగాల్లో అమ్మాయిలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివక్ష వీడట్లేదు. దానికి సినిమా రంగమూ అతీతం కాదు. ప్రతిచోట స్త్రీలకు భద్రత ఉండాలి! వివక్షను రూపుమాపడానికి పురుషులను ఎడ్యుకేట్ చేయాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లిదండ్రులే ఆ ప్రయత్నానికి నాంది పలకాలి. ఈ విషయం మీద మా అబ్బాయి (యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్) ‘మర్ద్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మగ పిల్లల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాడు!’ అంటూ చెప్పుకొచ్చింది నటి షబానా ఆజ్మీ. సినిమా ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్స్ పెరిగారు. వాళ్లలో స్క్రిప్ట్ రచయితలు, దర్శకులు కూడా ఉండటంతో సున్నితమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి. నటనలో కూడా నేటి అమ్మాయిలు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఐటమ్ సాంగ్స్‌తోనే పేచీ. అవి పెట్టినా కాస్త అర్థవంతంగా ప్రెజెంట్ చేయొచ్చు కదా!గర్ల్‌ఫ్రెండ్సే కారణం.. ‘స్త్రీకి స్త్రీ శత్రువు కాదు. ఇలాంటి తప్పుడు భావజాలాన్ని ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటోంది పురుషాధిపత్య సమాజం. దాని మాయలో పడకూడదు. స్త్రీకి స్త్రీయే నేస్తం. నేనీ రోజు ఈ స్థాయికి చేరానంటే కారణం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులు.. గర్ల్‌ఫ్రెండ్సే! అందుకే సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. అలాగే తిండి, కట్టు, బొట్టు లాంటివన్నీ వ్యక్తిగత విషయాలు. మన సౌకర్యం, అభిరుచిని బట్టి నిర్ణయించుకునేవి తప్ప సమాజమో, ప్రభుత్వాలో నిర్ణయించేవి కావు!’– హుమా ఖురేషీచిత్చోర్ ఏమన్నాడు‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ అంటూ అమోల్ పాలేకర్ హైదరాబాద్ వచ్చేశాడు మరాఠీ న్యూవేవ్ సినిమా పయనీర్, నటుడు, దర్శకుడు, థియేటర్ పర్సనాలిటీ, చిత్రకారుడు అమోల్ పాలేకర్... మారిన సినిమా తీరు, మరాఠీ రంగస్థలం గురించి మాట్లాడుతూ.. ‘సినిమా థియేటర్ ఉనికి కోల్పోయింది. ఓటీటీ వచ్చింది. సెల్ఫోన్లో ప్రపంచం కనబడుతోంది. ఈ మార్పంతా ఓ పద్ధతి ప్రకారం జరిగింది. అది ప్యార్లల్ మూవీ మూవ్‌మెంట్‌నూ కంట్రోల్ చేసింది. సొంత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు కొమ్ముకాసే వాళ్లు సినిమా రంగంలోనూ ఉంటారు. ఏటికి ఎదురీదే వాళ్లు కొద్దిమందే! వాళ్లు మైనారిటీ వర్గంగా మిగిలిపోయి ప్రభావం చూపించలేకపోతారు. వీటన్నిటి క్రమంలో ఊరటను.. సంతోషాన్నిస్తున్నది రంగస్థలమే! అది తన శోభను కోల్పోలేదు. ముఖ్యంగా మరాఠీ రంగస్థలం. యంగ్ జనరేషన్‌తో కళకళలాడుతోంది. అది ఒక్క ముంబై, పుణెలోనే కాదు మహారాష్ట్ర అంతటా ఎక్స్‌పెరిమెంట్స్‌తో వైబ్రెంట్‌గా ఉంది’ అని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
హస్తినలో ఆప్, బీజేపీ హోరాహోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈసారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆప్ అంటే ఆపద అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అధికార పార్టీపై ఇప్పటికే యుద్ధ భేరీ మోగించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 53.6 శాతం ఓట్లతో 62 సీట్లు కొల్లగొట్టగా బీజేపీ 39 శాతం ఓట్లతో 8 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండాపోయింది. కేవలం 4.3 శాతం ఓట్లకు పరిమితమైంది. సీట్ల ఖాతాయే తెరవలేక కుదేలైంది.ద్విముఖమే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ద్విముఖ పోరు సాగుతోంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్ కూడా మొత్తం 70 సీట్లలోనూ బరిలో ఉన్నా దాని పోటీ నామమాత్రమే. ఆ పార్టీ 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది. ఈసారి బీజేపీ, ఆప్‌లతోపాటు పోటీపడి మరీ హామీలిచ్చినా కాంగ్రెస్‌కు అవి కలిసొచ్చేది అనుమానమే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఇద్దరు మాజీ సీఎంల కుమారులు బరిలో ఉండటం విశేషం. బీజేపీ నుంచి మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. ఈసారి తమకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని బీజేపీ నేతలంటున్నారు. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు, జనం సొమ్ముతో అద్దాల మేడ కట్టుకోవడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఆప్ నేతల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు లాభిస్తాయని అంటున్నారు. ఆప్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో తమకు విజయం సులభం కాదని అంగీకరిస్తున్నారు. అయితే కేజ్రీవా ల్కు జనాదరణ, విశ్వసనీ యత, సంక్షేమ పథకాల సక్రమ అమలు, కొత్త హామీలు గట్టెక్కిస్తాయని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.– సాక్షి నేషనల్ డెస్క్ -
రూపాయికి ఆర్బీఐ టానిక్
అంతర్జాతీయంగా రూపాయి వాడకాన్ని ప్రాచుర్యంలోకి తేవడంపై రిజర్వ్ బ్యాంక్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సీమాంతర లావాదేవీలను రూపాయి మారకంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. భారతీయ అదీకృత డీలర్ (ఏడీ) బ్యాంకుల విదేశీ శాఖల్లో, ప్రవాస భారతీయులు (ఎన్నారై) రూపీ అకౌంట్లను తెరిచేందుకు అవకాశం కల్పించింది. ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు సీమాంతర లావాదేవీలను సులభతరం చేయడానికి తాజా నిబంధనలు ఉపయోగపడగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా దీని వెనుక గణనీయంగానే కసరత్తు జరుగుతోంది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా సహా ఇతర దేశాలతో వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునేందుకు వీలుగా, భారతీయ ఏడీ బ్యాంకుల్లో, ప్రత్యేక రూపీ అకౌంట్లను తెరిచేందుకు విదేశీ బ్యాంకులకు 2022లో ఆర్బీఐ అనుమతినిచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ బాస్కెట్లో చేర్చడం సహా రూపాయిని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అనుసరించతగిన మార్గదర్శ ప్రణాళికను సూచిస్తూ 2023లో ఆర్బీఐ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలోనూ, స్థానిక కరెన్సీల్లోనూ సెటిల్ చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. అలాగే, ఎన్నారైలకి రూపాయి మారకం ఖాతాలను తెరిచేందుకు వీలు కల్పించాలని సూచించింది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ వీటన్నింటికి కొనసాగింపుగానే భావించవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకర్లు ఏమంటారంటే.. ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం.. అంతర్జాతీయంగా వాణిజ్యంలో రూపాయి వాడకాన్ని ప్రోత్సహించడమే అయినప్పటికీ, రూపాయి నాన్–కన్వర్టబుల్ కరెన్సీ కావడం వల్ల ఎక్కువగా లావాదేవీలు జరగకపోవచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తు తానికి వాణిజ్య లావాదేవీల కోసం.. అది కూడా యూఏఈ, తదితర దేశాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రూపాయి మారకంలో సీమాంతర చెల్లింపులు.. ఉదాహరణకు అమెరికాలో ఉంటున్న ఎన్నారై న్యూయార్క్‌లోని ఏడీ బ్యాంకు శాఖలో రూపీ ఖాతా తెరవొచ్చు. ఎగుమతులకి సంబంధించి వచి్చన ఆదాయాలను జమ చేసుకునేందుకు, దిగుమతి చేసుకున్న వాటికి చెల్లింపులు జరిపేందుకు ఈ ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. అంటే.. భారత్‌కి చేసిన ఎగుమతులకు సంబంధించి వచ్చిన నిధులను ఆ అకౌంట్లో రూపాయి మారకంలో ఉంచుకోవచ్చు. భారత్‌లో ఉన్న వ్యక్తికి రూపాయి మారకంలో వ్యాపారపరమైన చెల్లింపులను జరిపేందుకు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఉపాధికి చేయూత కావాలి
బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్‌లు, ఎడ్టెక్, ఎంఎస్ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి. పర్యాటకం–ఆతిథ్యం ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ఎడ్టెక్ డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్‌లైన్ ప్రెస్టీజ్ స్కూల్ వైస్ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్ జైన్ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో గగన్ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్టార్టప్‌లు స్టార్టప్‌లు, వెంచర్ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ వ్యవస్థాపకుడు గౌరవ్ గగ్గర్ కోరారు. స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ (వ్యవస్థ)కు వెంచర్ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్ గగ్గర్ డిమాండ్ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ముంచుకొస్తున్న మెగాబర్గ్ ముప్పు?!
అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకం. ఎంతలా అంటే.. ముంబైలాంటి మహానగరాలు ఆరు కలిస్తే ఇది ఏర్పడిందట. అంతటి ఐస్‌బర్గ్ ఓ ద్వీపం వైపుగా దూసుకొస్తోంది. అలాంటప్పుడు ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. అది ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు చర్చిద్దాం. A23a.. అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది. బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యే యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్బర్గ్గా ప్రకటించింది కూడా.ఇక.. సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్‌బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణిస్తోంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దీవికి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మంచు ఫలకం. ఈ ఐస్‌బర్గ్ పైభాగానికి పదిరెట్లు సముద్రంలో ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే.. ట్రిలియన్ టన్నుల బరువుండొచ్చనేది ఒక అంచనా. ప్రపంచంలోనే భారీ మంచు ఫలకం కావడంతో.. అందరి కళ్లు దీని మీదే ఉన్నాయి. అందుకే దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే గంటకు ఒక మైలు వేగంతో పయనిస్తోందట!.ఢీ కొడితే ఏమౌతుందంటే..సౌత్ జార్జియా పెద్దగా జనావాసం లేని ద్వీపం. కానీ, వైవిధ్యమైన జంతుజాలం అక్కడ ఉంది. కింగ్ పెంగ్విన్స్, సాధారణ సీల్స్‌తో పాటు ఎలిఫెంట్ సీల్స్ ఈ దీవి ఆవాసం. అయితే గతంలో ఈ దీవిని ఈ తరహాలోనే ఐస్‌బర్గ్‌లు ఢీ కొట్టాయి. ఆ టైంలో పక్షులు, సీల్ చేపలు లాంటివి లెక్కలేనన్ని మరణించాయి. అలాగే ఇప్పుడు ఈ భారీ ఐస్‌బర్గ్ ఢీ కొడితే.. ఆ నష్టం ఊహించని స్థాయిలో ఉండొచ్చనే ఆందోళన నెలకొంది. అంతేకాదు.. అది అక్కడి నౌకాయాన రంగంపైనా తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిశ మార్చుకుంటుందా?అయితే సౌత్ జార్జియాకు చేరుకునేలోపే మెగాబర్గ్.. ముక్కలయ్యే అవకాశం ఉందని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే అంచనా వేస్తోంది. అలాగే.. దీవి వైపు కాకుండా దిశ మార్చుకుని పయనించే అవకాశమూ లేకపోలేదని చెబుతోంది. ఇందుకు గతంలో జరిగిన పరిణామాలనే ఉదాహరణలుగా చెబుతోంది. అయితే.. ఢీ కొట్టనూ వచ్చు!మరోవైపు.. శాటిలైట్ వ్యవస్థ ద్వారా దీని కదలికలను పరిశీలించిన బ్రిటిష్ అంటార్కిటికా సర్వే ప్రతినిధి ఆండ్రూ మెయిజెర్స్ మాత్రం పై వాదనలతో ఏకీభవించడం లేదు. ఇది మిగతా ఐస్బర్గ్లాగా ముక్కలు కాకపోవచ్చనే ఆయన అంటున్నారు. పైగా అది దిశ మార్చుకునే అవకాశాలను ఆయన కొట్టిపారేశారు. ఇది గతంలోని ఐస్‌బర్గ్‌ల మాదిరి కనిపించడం లేదని అంచనా వేస్తున్నారాయన. ద్వీపాన్ని ఢీ కొట్టిన తర్వాత అది దక్షిణాఫ్రికా వైపు దారి మళ్లొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.ఏ23ఏ ఏర్పాటునకు క్లైమేట్ ఛేంజ్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ.. భవిష్యత్తులో ఈ తరహా భారీ మంచు ఫలకలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అంటార్కిటికాలో సముద్ర మట్టం పెరగడం, ఉష్ణోగ్రతల పెరుగుదల.. భవిష్యత్తులో ఈ తరహా భారీ ఐస్‌బర్గ్‌లను మన ముందు ఉంచే అవకాశాలే ఎక్కువ. A68aకి ఏమైందంటే.. ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో అతిపెద్ద ఐస్బర్గ్గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్‌కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పుట్టుకతో వచ్చే పౌరసత్వం: భారత్ సహా ఏ దేశాల్లో ఎలా ఉందంటే..
విదేశీయులకు పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికాలో సహజంగా దక్కుతున్న పౌరసత్వ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. కానీ, న్యాయస్థానం తాజాగా ఆ ఆదేశాలకు మోకాలడ్డేసింది. దీంతో అప్పీల్‌కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే.. జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో మిగతా దేశాలు ఏం విధానాలు పాటిస్తున్నాయో తెలుసా?.అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అక్కడి రాజ్యాంగం హక్కు కల్పించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ హక్కు దక్కాలి కూడా. అయితే ఆ హక్కును తనకున్న విశిష్ట అధికారంతో మార్చేయాలని ట్రంప్ భావించారు.ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికా నేలపై విదేశీయులకు పుట్టే పిల్లలను అమెరికా పౌరులుగా పరిగణించకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం.👉పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్. తల్లిదండ్రుల జాతీయత.. అంటే వాళ్లది ఏ దేశం, ఇమ్మిగ్రేషన్ స్టేటస్.. అంటే ఏ రకంగా వలసలు వచ్చారు ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వ గుర్తింపు ఇస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తంగా ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్‌షిప్‌ను వర్తింపజేస్తున్నారు. అయితే.. ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్’’ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి . జస్ సాన్‌గ్యుఇనిస్ అంటే.. వారసత్వంగా(రక్తసంబంధంతో) పౌరసత్వ హక్కు పొందడం. జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కు లభించడం. 👉ఇప్పటిదాకా అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగుదేశాలైన కెనడా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా తరహాలోనే ఈ దేశం కూడా తమ గడ్డపై పుట్టే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తింపజేస్తోంది. అయితే అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.👉అమెరికా రెండు ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలాదేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. 👉యూరప్, ఆసియా, ఆఫ్రికా.. చాలా దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి ఉదాహరణకు.. జర్మనీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లపాటు(ప్రస్తుతం 8 సంవత్సరాలుగా ఉంది) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.👉భారత్‌లో జన్మతఃపౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జస్ సాన్గ్యుఇని అనుసరిస్తోంది మన దేశం. అంటే.. వారసత్వంగా రక్తసంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుందన్నమాట. అయితే.. 1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్ సోలిని భారత్‌లోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. అంటే.. భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపజేయాడన్నమాట. జస్ సాన్గ్యుఇని ‘జాతి భావన’ మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ ఉన్నారు.1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, కాలక్రమేణా భారత్‌లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది.👉జపాన్‌లోనూ కఠిన నిబంధనలే అమలు అన్నాయి. అయితే ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.👉ఇటలీలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పరిమితులున్నాయి. పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు.👉యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది. 👉జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ఉంటాయి. అయితే.. అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమ వలసదారుల్నిప్రొత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత-వలసవిధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది ‘‘బర్త్ టూరిజం’’గా మారే ప్రమాదం లేకపోలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. దాదాపు 6,20,000 మంది ఈ యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. ఈ 157 ఏళ్ల చరిత్రను రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా.. తన సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావించడం విశేషం. -
బాలికలకు ఏదీ భరోసా!?
‘నవరత్నాల’తోపాటు అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాలికలకు ఎంతో భరోసా కల్పించింది. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలతోపాటు అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలుచేసి తద్వారా బాలికా వికాసానికి వైఎస్ జగన్ సర్కారు ఎంతో తోడ్పాటునందించింది. విద్య, వైద్యం, రక్షణ, సంక్షేమం తదితర విషయాల్లో వారి కోసం ఆయన అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కనీసం ఎన్నికల్లో హామీ ఇచి్చన తల్లికి వందనం పథకాన్ని సైతం అమలుచేయకపోగా ఉన్న పథకాలను కూడా నీరుగారుస్తోంది. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బాలికలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామగా కొండంత అండగా నిలిచారు. తన హయాంలో వారికి అనేక పథకాలను అందించి పెద్ద మనస్సు చాటుకునే వారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్), సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఐసీపీఎస్)ను సమర్థవంతంగా అమలుచేశారు. మైదాన ప్రాంతంలో 47,287 అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, గిరిజన ప్రాంతంలోని 8,320 అంగన్వాడీల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్‌ను పటిష్టంగా అమలుచేశారు. రాష్ట్రంలో మొత్తం 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని, వైద్య సేవలను, నర్సరీ విద్యను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక్క బాలికలకే కాకుండా బాలురు, గర్భిణులు, బాలింతలు కలిపి 35 లక్షల మందికి క్రమం తప్పకుండా పౌష్టికాహార కిట్లను అందించి వారిలో రక్తహీనత లేకుండా చర్యలు చేపట్టారు. ‘దిశ’తో ఆడబిడ్డలకు రక్షణ.. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో దిశ బిల్లును తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంతోపాటు దోషులకు త్వరితగతిన శిక్షపడేలా చేసింది. ఈ యాప్ ద్వారా ఆపదలో ఉన్న ఆడపిల్లలు సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి ఆదుకున్న ఘటనలు కోకొల్లలు. దిశ పోలీస్స్టేషన్లు, ప్రత్యేక న్యాయస్థానాలు, వన్‌స్టాప్ కేంద్రాలు సైతం ఏర్పాటుచేసింది. సైబర్ నేరాల కట్టడికి 9121211100 వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో 9071666667 వాట్సాప్ నెంబర్‌నూ ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 5,651 మంది బాలికలను రక్షించారు. బాల్య వివాహాలకు చెక్.. పేద తల్లిదండ్రులకు తమ బిడ్డ పెళ్లి భారం కాకూడదనే పెద్ద మనçస్సుతో అందించిన వైఎస్సార్ కళ్యాణమస్తు పథకంలో ఆడపిల్లకు కనీసం 18 ఏళ్లు, ఉండాలనే నిబంధన పెట్టింది బాల్య వివాహాలను నిరోధించేందుకే. దీంతోపాటు.. కనీసం పదవ తరగతి చదివి ఉండాలనే నిబంధనవల్ల బాలికలను ఉన్నత విద్య చదువుకునేందుకు ప్రోత్సహించినట్లైంది. దీంతోపాటు బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ కూడా అమలుచేశారు. సమర్థంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ అమలు.. కేంద్ర ప్రభుత్వం అందించిన మిషన్ వాత్సల్య పథకంలో పిల్లల సమగ్రాభివృద్ధికి, వారి రక్షణ, మౌలిక సదుపాయాల కోసం జువెనైల్జస్టిస్ (కేర్–ప్రొటెక్షన్) యాక్ట్‌ను సమర్థవంతంగా అమలుచేసింది. వారి సహాయానికి 1981, 1098 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ సెంటర్లు సేవలు అందించాయి. భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడ శిశువుల హత్యలను నివారించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఆడపిల్లల పట్ల కూటమి నిర్లక్ష్యం.. రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, గత ప్రభుత్వం అమలుచేసిన కొన్ని పథకాలు అమలుచేయడం మినహా కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకం కూడా అమలుచేయలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి రూ.15వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. నాప్కిన్స్ పంపిణీని అటకెక్కించింది. ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో గత ప్రభుత్వం అందించిన పథకాలను అరకొరగానే కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బాలికా విద్యను, ఆరోగ్యాన్ని, రక్షణను గాలికొదిలేసింది.విద్యలో బాలికలకు ప్రాధాన్యం..రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల విద్యను ప్రోత్సహించి వారి డ్రాపౌట్స్‌ను నిరోధించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. » అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థలోనే నూతనోధ్యయాన్ని సృష్టించింది. పేద పిల్లల చదువు కోసం ఏటా రూ.15 వేలు అందించి బాలికల విద్యను ప్రోత్సహించింది. » నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి వారి ఇబ్బందులను తొలగించింది. » ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే 7వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) చదివే యుక్తవయస్సు బాలికలు దాదాపు 10 లక్షల మందికి ‘స్వేచ్చ’ పథకంలో ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్స్ను ఉచితంగా అందించింది. -
ఆల్చిప్పలే దివ్యౌషధాలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ అనారోగ్యాలను తగ్గించడంలో యాంటీబయోటిక్ మందులు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే యాంటీబయోటిక్‌లకు సైతం చావని కొన్ని సూక్ష్మక్రిములను అంతం చేయగల శక్తి ఓ సముద్రజీవికి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఆల్చిప్పల (oyster) రక్తంలోని యాంటీమైక్రోబియల్ ప్రొటీన్లు, పెప్టిన్లు సూపర్ బగ్స్‌ను (Super Bugs) సమర్థంగా చంపగలవని తేల్చారు. ‘ప్లోస్ వన్’లో ప్రచురితమైన తాజా పరిశోధనల ప్రకారం ఆల్చిప్పల్లోని హీమోలింఫ్ (ఆల్చిప్పల రక్తంగా దీన్ని చెప్పొచ్చు)లో సూక్ష్మక్రిములను చంపే మాంసకృత్తులు ఉన్నాయి. అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న సూక్ష్మక్రిములను సమర్థంగా అరికట్టే శక్తి హీమోలింఫ్ ప్రొటీన్లకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొండి బ్యాక్టీరియా జాతుల (సూపర్ బగ్స్) పీచమణిచేలా యాంటీబయాటిక్స్ ఔషధాలను శక్తివంతం చేయడంలో ఆల్చిప్పల ప్రొటీన్లు ఉపయోగపడతాయని అంటున్నారు.ఏమిటీ సూపర్ బగ్స్?స్ట్రెప్టోకాక్కస్ న్యూమోనియే అనే సూక్ష్మక్రిమి వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు ఇదే ముఖ్యకారణం. వృద్ధులు తరచూ ఆసుపత్రులపాలవ్వడానికి కారణం కూడా ఇదే. టాన్సిలైటిస్ లాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ సాధారణంగా చాలా మంది చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. స్ట్రెప్టోకాక్కస్ ప్యోజెనెస్ సూక్ష్మక్రిమి చర్మంపై, గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇది నొప్పులతో రుమాటిక్ జ్వరం, రుమాటిక్ గుండె జబ్బుకు కూడా దారితీయొచ్చు. ఇటువంటి ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ మందులు తరచూ వాడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సూక్ష్మక్రిములు ఈ మందులకు నిరోధకత పెంచుకొని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాగా మారుతాయి. ఈ సూపర్ బగ్స్ కారణంగా వ్యాధులకు చికిత్స చేయడం కష్టతరంగా మారుతోంది.బయోఫిల్మ్‌ల రక్షణ వలయంలో..సూపర్ బగ్స్ తమ చుట్టూతా బయోఫిల్మ్‌లు (Bio Film) అనే రక్షణ కవచాలను రూపొందించుకొని యాంటీబయాటిక్ ఔషధాల నుంచి రక్షించుకుంటూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే అన్ని రకాల బ్యాక్టీరియాలు బయోఫిల్మ్‌ల రక్షణలోనే ఉంటాయి. ఈ రక్షణ వలయాన్ని ఛేదించగలగటంపైనే యాంటీబయోటిక్‌ల విజయం ఆధారపడి ఉంటుంది. 32 రెట్లు మెరుగుపడ్డ ఫలితాలు ఇప్పటికే వాడుకలో ఉన్న యాంటీబయోటిక్స్‌కు ఆస్ట్రేలియా రాతి ఆల్చిప్పల ప్రొటీన్లను జోడించగా వాటి ప్రభావశీలత 3 నుంచి 32 రెట్లు మెరుగైనట్లు ప్రయోగాల్లో తేలిందని పరిశోధకులు ప్రకటించారు. చర్మవ్యాధులు, రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు కలిగించే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను ఆల్చిప్పల రక్తంలోని ప్రొటీన్లు సమర్థంగా అరికట్టాయని పరిశోధకులు వివరించారు. మనుషుల కణాలపై ఎటువంటి విషపూరిత ప్రభావం లేదని స్పష్టం చేశారు. అయితే సూపర్ బగ్స్‌ను అరికట్టే ఆల్చిప్పల ప్రొటీన్లపై జంతువులు, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగాల్సి ఉంది. సిడ్నీ రాతి ఆల్చిప్పల్లో ఔషధ గుణాలు.. సముద్ర జలాల వల్ల కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటీన్లు, పెప్టయిడ్లను ఆల్చిప్పలు తమ రక్తంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాసకోశ, ఇన్ఫ్లమేషన్ సమస్యలకు చైనా, ఆస్ట్రేలియా సంప్రదాయ వైద్యులు ఆల్చిప్పల ఔషధాలను అనాదిగా వాడుతున్నారు. చదవండి: నెలలో 1,000 విస్ఫోటాలుఈ దిశగా పరిశోధించిన శాస్త్రవేత్తలు.. సిడ్నీ రాక్ ఆయిస్టర్ల రక్తంలోని ప్రొటీన్లు, పెప్టయిడ్లలో స్ట్రెప్టోకాకస్ ఎస్పీపీ జాతి బ్యాక్టీరియాను చంపే ఔషధగుణాలు ఉన్నట్లు గుర్తించారు. సూక్ష్మక్రిముల చుట్టూ ఉండే రక్షణ కవచాన్ని ఛేదించటమే కాకుండా అది ఏర్పడకుండా చూసే శక్తి కూడా ఈ ప్రొటీన్లు, పెప్టయిడ్లకు ఉందని తేల్చారు. -
కంటిపాపలకు కనురెప్పలా...
‘స్వావలంబన దిశగా భవిష్యత్’ అనే థీమ్‌ను నిర్ణయించారు. నేటి బాలికలు భద్రంగా ఉంటేనే భవిష్యత్ సాధికారత సాధ్యమవుతుంది! ఆ భద్రతే నేడు అతి పెద్ద సమస్య! సమస్య ఆలోచనలను రేకెత్తిస్తుంది.. వినూత్న ఆవిష్కరణలు ఆకారం దాల్చేలా చేస్తుంది!అలాంటి యువ ఆవిష్కర్తలనే ఇక్కడ పరిచయం చేయబోతున్నాం.. ఆడపిల్లల భద్రత కోసం వారు రూ΄పొందించిన డివైజెస్‌తో!గణేశ్ రూరల్ ఇన్నోవేటర్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అయిదు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌ను సాధించాడు. గణేశ్ ఘనత గురించి తన ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. కట్టెల΄పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు ఆ ΄పొగను తట్టుకోలేకపోతున్న అమ్మ అవస్థను చూసి ఆమె కోసం తన పదకొండేళ్ల వయసులోనే హ్యాండ్ ఫ్యాన్ తయారు చేసి ఇచ్చాడు. ఆనాడు మొదలైన ఆ ప్రస్థానం నేడు 30కి పైగా ఆవిష్కరణలకు చేరుకుంది. అందులోదే బాలికల భద్రత కోసం రూ΄పొందించిన సంస్కార్ టాయ్. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలంటే వారిని ముట్టుకునే చెప్పాల్సి వస్తోంది. వారిని తాకకుండా.. దూరంగానే ఉంటూ చెప్పడమెలా అన్న అతని ఆలోచనకు పరిష్కారమే ‘సంస్కార్ టాయ్’. దీనిపేరు ఆద్య. ఇది మాట్లాడే బొమ్మ. ఆద్యను ఛాతీ ప్రాంతంలో తాకామనుకో.. ‘అక్కడ తాకకూడదు’ అంటూ హెచ్చరిస్తుంది. ఇలా శరీరంలో ఏ స్పర్శ తప్పో.. ఏ స్పర్శ భద్రమో.. ఆద్యను టచ్ చేస్తూ తెలుసుకోవచ్చన్నమాట. భద్రమైన చోట కూడా తాకడం నచ్చకపోతే ఐ మే నాట్ లైక్ అని చెప్పచ్చని చెబుతుంది. అంతేకాదు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా చెబుతుంది.హెల్ప్‌లైన్ నంబర్లను వల్లె వేస్తుంది. సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ హాని గురించీ హెచ్చరిస్తుంది.‘సంస్కార్ టాయ్’ లో బాయ్ వర్షన్ కూడా ఉంది. పేరు ఆదిత్య. అబ్బాయిలకూ అవన్నీ చెబుతుంది. అదనంగా ఆడపిల్లలతో ఎలా మెసలుకోవాలో కూడా చెబుతుంది. అంతేకాదు చూపు, వినికిడి లోపాలున్న పిల్లలకూ సంస్కార్ టాయ్ ఉంది. చూపు లోపం ఉన్నవారికి వైబ్రేట్ అవుతూ టీచ్ చేస్తే, వినికిడి లోపం ఉన్న వాళ్లకు రెడ్, గ్రీన్, ఆరెంజ్ లైట్స్‌తో బోధిస్తుంది. గణేశ్ ఈ బొమ్మను రూపొందించిన (2021) నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది, ఉత్తరాది కలుపుకుని మొత్తం అయిదు రాష్ట్రాల్లో, 65 వేల మంది విద్యార్థులకు భద్రత మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని స్కూల్స్‌కి ఉచితం గానే సేవలందించాడు. త్వరలోనే ఎల్ఎల్ఎమ్ మాడ్యూల్స్‌తో అప్డేట్ అవుతూ ‘సంస్కార్ 2.0’పేరుతో హ్యుమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నాడు. ఇది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంది. ‘చిన్నప్పటి నుంచీ నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెన్షన్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించి నాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. ఇన్నోవేటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లకు ఓ ΄్లాట్‌ఫామ్ తయారు చేయాలన్నదే నా లక్ష్యం. అందుకే ‘సంస్కార్ ఎలక్ట్రానిక్స్’ అనే స్టార్టప్ పెట్టాను. సామాజిక బాధ్యతే నా ప్రధాన ఆశయం! ఆసక్తి ఉన్న విద్యార్థులకి ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తున్నాం. సంస్కార్ టాయ్ తయారు చేయడానికి సైకాలజిస్ట్స్, సైకియాట్రిస్ట్స్, పిల్లల హక్కులు – భద్రత కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు వంటి వాళ్లందరినీ కలిసి, రీసెర్చ్ చేసి ఒక కాన్సెప్ట్‌ను తయారు చేసుకున్నాం. మళ్లీ దాన్ని వాళ్లందరికీ చూపించి.. ఓకే అనుకున్నాకే టాయ్‌ని డెవలప్ చేశాం’ అని సంస్కార్ టాయ్ వెనకున్న తన శ్రమను వివరించాడు గణేశ్.సంస్కార్ టాయ్ఆవిష్కర్త: యాకర గణేశ్, వయసు: 25 ఏళ్లు, ఊరు: వరంగల్ జిల్లా, నందనం గ్రామం, తెలంగాణ!తల్లిదండ్రులు: స్వరూప, చంద్రయ్య. వ్యవసాయ కూలీలు. ఇంకా.. తెలంగాణ, వికారాబాద్‌కు చెందిన సానియా అంజుమ్.. ఆడపిల్లల భద్రతకు ‘షీ (ఫర్ అజ్)’ అనే వినూత్న ఆలోచన చేసింది. పీరియడ్స్ టైమ్‌లో ఆడపిల్లల అవసరాలను తీర్చే అన్ని ఎక్విప్మెంట్స్తో ప్రతి స్కూల్లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయాలనేదే‘ షీ’ కాన్సెప్ట్. మంచిచెడులను గైడ్ చేయడానికి, ధైర్యం కోల్పోకుండా అమ్మాయిలను మోటివేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్, టీచర్స్‌తో కలిపిన ఒక బృందం, అలాగే క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్ విజిట్స్‌ను ఏర్పాటుచేయాలనేది ‘షీ’ ఉద్దేశం! హైదరాబాద్‌కు చెందిన హరీష్ గాడీ అనే అబ్బాయి.. ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ బ్యాంగిల్‌ని తయారుచేశాడు. ఇది మామూలు గాజునే పోలి ఉంటుంది. దీన్ని వేసుకుంటే.. దాడి చేసిన వాళ్లకు ఆ గాజు తగిలి షాక్‌నిస్తుంది. అంతేకాదు అందులో ఫీడ్ అయి ఉన్న నంబర్లకు మీరున్న లొకేషన్ కూడా వెళ్తుంది. దీన్ని కనిపెట్టినందుకు హరీష్‌కి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ (2019) లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆదిలాబాద్‌కు చెందిన ఎ. సాయి తేజస్వి ‘గర్ల్ సేఫ్టీ డివైస్’ను కనిపెట్టింది. చాలా తేలికగా ఉండే ఈ పరికరాన్ని కాలికి కట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కేయాలి. ఎమర్జెన్సీ టైమ్‌లో యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని టచ్ చేసిన వాళ్లకు షాక్‌నిస్తుంది. దాంతో దుండగులు మిమ్మల్ని ముట్టుకునే సాహసం చేయరు. సికింద్రాబాద్‌కు చెందిన వైష్ణవి చౌధరీ, మనోజ్ఞ సిద్ధాంతపు, నక్షత్ర పసుమర్తి.. ఈ ముగ్గురూ కలిసి ‘మహిళా సురక్షా బ్యాండ్’ను తయారుచేశారు. ఇది కూడా ఎవరైనా మీ మీద దాడికి పాల్పడితే వాళ్లకు షాక్‌నిస్తుంది. పెద్దగా డేంజర్ అలారమ్‌ని మోగిస్తుంది. మీరు ఆపదలో ఉన్న సందేశంతోపాటు మీ లొకేషన్‌నీ అందులో ఫీడైన నంబర్లకు షేర్ చేస్తుంది. ఈ డివైస్ చూడ్డానికి స్టయిలిష్‌గానూ ఉంటుంది. ఇలా అమ్మాయిల భద్రత కోసం యువత తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. మహిళల సాధికారతకు మద్దతునిస్తోంది. బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు→ గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. → అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూ ప్రోత్సహిస్తోంది. → ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. → గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! → ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. → బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ఆవిష్కర్త: ఎస్. పూజ, చదువు: బీటెక్ సెకండియర్, ఊరు: కరీంనగర్ జిల్లా, మానకొండూరు, తెలంగాణ. తల్లిదండ్రులు: సుమిత్ర (గృహిణి), రమేశ్ (బైక్ మెకానిక్). వయసుతో సంబంధం లేకుండా స్త్రీల మీద జరుగుతున్న దాడులు, వాళ్లకు భద్రత, రక్షణ లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చదువుకు దూరమవడం వంటివన్నీ వినీ, చూíసీ చలించిపోయింది పూజ. తనకు చేతనైనంతలో ఆ సమస్యకో పరిష్కారం కనిపెట్టాలనుకుంది. అదే ‘విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్!’ ఇదెలా పనిచేస్తుందంటే.. జడకు మామూలు రబ్బర్ బ్యాండ్‌ని ఎలా పెట్టుకుంటారో దీన్నీ అలాగే పెట్టుకోవాలి. ఆపద ఎదురైనప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్‌ను నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఆ శబ్దానికి భయపడి ఈవ్‌టీజర్స్, దుండగులు పారిపోతారు. ఒకవేళ వాళ్లు వెళ్లకుండా ఇంకా ఇబ్బంది పెడుతుంటే.. ఆ బ్యాండ్ ను మరొకసారి నొక్కాలి. అప్పుడు ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న షీ టీమ్ ఆఫీస్‌కి ‘ఆపదలో ఉన్నాను.. రక్షించండి..’అన్న వాయిస్ మెసేజ్ వెళ్తుంది. అంతేకాదు, మీరున్న లైవ్ లొకేషన్‌నూ చూపిస్తుంది. వాటి ఆధారంగా షీ టీమ్ అలర్ట్ అయ్యి రక్షిస్తారు. ‘సమాజంలో అమ్మాయిలకు భద్రత, రక్షణ లేక వాళ్లు చాలా రంగాల్లోకి అడుగుపెట్టలేక పోతున్నారు. శక్తిసామర్థ్యాలున్నా రాణించలేకపోతున్నారు. ఆమె లక్ష్యానికి భద్రత, రక్షణలేములు ఆటంకాలు కాకూడదు అనిపించి ఈ హెయిర్ రబ్బర్ బ్యాండ్‌ను తయారు చేశాను’ అని చెబుతుంది పూజ.బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు∙గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. ∙అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూప్రోత్సహిస్తోంది. ∙ ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. ∙ గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! ∙ ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. ∙ బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.– సరస్వతి రమ -
నెలలో 1,000 విస్ఫోటాలు
తూర్పు ఇండోనేషియాలో ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని మారుమూల ద్వీపం హల్మహెరాలోని ఇబూ అగ్నిపర్వతం ఈ జనవరి నెలలో కనీసం 1,000 సార్లు బద్దలైంది. గత ఆదివారం ఒక్కరోజే ఈ అగ్నిపర్వతం 17 సార్లు విస్ఫోటం చెందిందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధికారులు సోమవారం ప్రకటించారు. విస్ఫోటం దాటికి అగ్నిపర్వతం సమీపంలో నివసిస్తున్న ఆరు గ్రామాల్లో మూడు వేల మంది గ్రామస్తులను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. పండించిన పంట చేతికొచ్చే సమయం కావడంతో చాలా మంది నివాసితులు ఖాళీ చేయడానికి విముఖత చూపుతున్నారు. అలాంటివారు సురక్షిత షెల్టర్లలో ఉండాలని అధికారులు సూచించారు. గత బుధవారం విస్ఫోటనంతో నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడింది. పర్వతంలో జనవరి 1 నుంచి ఇప్పటివరకూ 1,079 విస్పోటాలు నమోదయ్యాయి. ఆదివారం జరిగిన విస్ఫోటకం తీవ్రంగా ఉందని ఏజెన్సీ తెలిపింది. ‘స్థానిక కాలమానం ప్రకారం గత ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు 1.5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద మేఘం గాల్లోకి ఎగిసింది. ఈ ధూళి మేఘం నైరుతి దిశగా విస్తరిస్తోంది. మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు పెద్ద శబ్దం వినిపించింది’’అని ఒక ప్రకటనలో వెల్లడించింది.ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో మౌంట్ ఇబూ ఒకటి. గత జూన్ నుంచి విస్ఫోటాలు గణనీయంగా పెరిగాయి. దీంతో అగ్ని పర్వతం శిఖరం చుట్టూ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. మౌంట్ ఇబు సమీపంలో నివసిస్తున్నవారు, పర్యాటకులు మాస్క్ ధరించాలని సూచించారు. అధికారిక గణాంకాల ప్రకారం 2022 నాటికి హల్మహెరా ద్వీపంలో సుమారు 7,00,000 మంది నివసిస్తున్నారు. విస్తారమైన ద్వీపసమూహమైన ఇండోనేషియా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లకు చిరునామాగా మారింది. గత నవంబర్‌లో పర్యాటక ద్వీపం ఫ్లోర్స్‌లోని 1,703 మీటర్ల ఎత్తయిన జంట శిఖరాల అగ్నిపర్వతం మౌంట్ లెవోటోబి లాకి–లాకీ ఒక వారంలో అనేక మార్లు విస్ఫోటనం చెందింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రువాంగ్ పర్వతం గతేడాది ఆరుసార్లు విస్ఫోటనం చెందడంతో సమీప ద్వీపాల నుంచి వేలాది మందిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా విస్తరణ కాంక్షకు ‘పనామా’తో ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు. రష్యా, చైనాల సరసన అమెరికా? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్‌ల్యాండ్‌లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్‌కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు. చైనాకు ఓ అవకాశం కానుందా? పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమిస్తే చైనా తైవాన్ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్‌తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్హావో అంటున్నారు. కాలువపై చైనా పెత్తనం నిజమేనా? పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మేఘాలే తాకింది ఆ ‘మోనాలిసా’..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న మహా కుంభమేళాలో ఇప్పుడో అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. రోజూ కనీసం కోటి మంది సందర్శకులు వచ్చే ఈ మహా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రయాగరాజ్‌కు (Prayagraj) వచ్చిన 16 ఏళ్ల యువతి ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తన అందంతో కేక పుట్టిస్తోంది. కుంభమేళాకు వస్తున్న పర్యాటకులు, భక్తులు, యాత్రికులు.. చూడగానే ఎవరినైనా ఇట్టే అకర్షించేలా ఉన్న ఈ తేనెకళ్ల సుందరి నుంచి రుద్రాక్షలు, పూసలు కొనుగోలు చేయడానికి కంటే ఆమెతో ఓ సెల్ఫీ తీసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎగబడుతున్నారు. ఆ ఇంటర్వ్యూతో యమా క్రేజ్.. ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే ఆ యువతిని, మహా కుంభమేళా న్యూస్‌ను కవర్ చేసే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. ఆమె ఫొటో పెడితే చాలు, లక్షల్లోనే ఫాలోవర్స్.. వాస్తవానికి.. ఇండోర్ నుంచి రుద్రాక్ష మాలలు అమ్మకునేందుకు వచ్చిన ఆ యువతి పేరు మోనాలిసా భోంస్లే. చూసీచూడగానే ఎవరినైనా కట్టిపడేసేలా మనోహరంగా ఉన్న మోనాలిసా (Monalisa) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా (Social Media) కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసే వారి సంఖ్య వేల సంఖ్యలోనే ఉండడం, వాటిని చూసి లైక్‌లు కొట్టేవారు లక్షల్లో ఉండడంతో సోషల్‌మీడియా వేదికగా ఆమె కీర్తి ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ యువతి మీడియా ప్రతినిధులతో తానేమి చదువుకోలేదని చెప్పినప్పటికీ.. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆమె పేరుతో ఏర్పాటైన పేజీలతో పాటు ఆమె ఫొటోలు పోస్టుచేసిన దాదాపు అందరికీ కొత్త ఫాలోవర్స్ వరదలా పెరుగుతున్నారు. చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..అప్పటివరకు వందల్లో కూడా ఫాలోవర్స్ లేనివారికి మోనాలిసా కవరేజీతో వేల, లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మను లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ ‘మోనాలిసా’తో పోలుస్తున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారల కన్నా ఆమె అందం పదుల రెట్లు ఎక్కువంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉపాధికి గండికొట్టిన పాపులారిటీ.. ఇదిలా ఉంటే.. అందం, కళ్లు ఆమెకు ఓ వైపు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టగా.. మరోవైపు అదే క్రేజ్ ఆమె ఉపాధికి గండికొడుతోంది. ఆమె అమ్ముతున్న రుద్రాక్షలు, పూసల దండలు కొనడంకంటే ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అమ్మకాల్లేక, ఆదాయం రాక ఆందోళన చెందుతున్నారు. ఈ హడావుడితో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మోనాలిసాను ఇండోర్‌కు తిరిగి పంపాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. (ప్రయాగరాజ్ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి) -
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్‌కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేతన జీవులను కనికరించేనా?
న్యూఢిల్లీ: బడ్జెట్ 2025పై మధ్య తరగతి, వేతన వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను ఉపశమనం లభిస్తుందన్న అంచనాలతో ఉన్నాయి. పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలు సైతం పన్ను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఆదాయం మిగిలించొచ్చని, ఇది మందగించిన వినియోగానికి ప్రేరణనిస్తుందని ఆర్థిక మంత్రికి సూచించడం గమనార్హం. దీంతో వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా కొంత ఉపశమనం కల్పించొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇదే కనుక నిజమైతే అది వినియోగానికి ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచొచ్చని, పన్ను శ్లాబుల్లో సర్దుబాట్లు చేయొచ్చని, స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వీటికితోడు పన్ను నిబంధనల్లో మార్పుల ద్వారా పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించొచ్చని భావిస్తున్నారు. అంచనాలు ఇలా..→ నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు ఆదాయ పరిమితి రూ.3లక్షలు. రూ.3–7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. రానున్న బడ్జెట్లో ఈ బేసిక్ మినహాయింపును రూ.5లక్షలకు పెంచొచ్చని తెలుస్తోంది. అప్పుడు రూ.3–7 లక్షల శ్లాబు కాస్తా రూ.5–7 లక్షలుగా మారుతుంది. దీంతో మొత్తం మీద రూ.10,000 మేర పన్ను ఆదా అవుతుంది. → 7–10 లక్షల ఆదాయంపై 10% పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. అలాగే, రూ.10–12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను అమలవుతోంది. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. → రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను ప్రస్తుతం అమలవుతోంది. బడ్జెట్లో దీన్ని రూ.12–18 లక్షలకు సవరించొచ్చని భావిస్తున్నారు. 30 శాతం పన్నును రూ.18లక్షలకుపైన ఆదాయం ఉన్న వారికి వర్తింపచేసే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే రూ. 18లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రూ.3లక్షల ఆదాయంపై 30 శాతం రూపంలో సుమారు రూ.90వేల వరకు ఆదా అవుతుంది. రూ.18 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఊరట ఉండకపోవచ్చు. → నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా ఉంది. దీన్ని రూ.1,00,000కు పెంచొచ్చని తెలుస్తోంది. నిజానికి రూ.50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను గత బడ్జెట్లో రూ.75,000కు పెంచారు. మొత్తం ఆదాయంలో దీన్ని నేరుగా మినహాయించుకోవచ్చు. పాత విధానంలో ఇది కేవలం రూ.50,000గానే కొనసాగుతోంది. 72 శాతం మంది కొత్త విధానంలోనే పన్ను రిటర్నులు సమర్పించారు. పెద్దగా పన్ను మినహాయింపుల్లేని, సరళతర నూతన పన్ను విధానంలోకి క్రమేణా అందరినీ తీసుకురావడం కేంద్రం లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కనుక మరిన్ని పన్ను ప్రయోజనాలు కొత్త విధానంలో కల్పించడానికే ఆర్థిక మంత్రి పరిమితం కావచ్చు. → రూ.2.5 లక్షలు మించిన పీఎఫ్ వడ్డీపై టీడీఎస్‌ను, ఉపసంహరణ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ–సాప్లను విక్రయించినప్పుడే పన్ను చెల్లించేలా అనుమతించాలని, ఎన్ఆర్ఐల ఇల్లు విక్రయంపై టీడీఎస్ నుంచి మినహాయింపులు కల్పించాలన్న డిమాండ్లు సైతం ఉన్నాయి. ఆకర్షణీయంగా కొత్త పన్ను విధానం! మరింత మందిని ఇందులోకి తీసుకురావడంపై దృష్టి 5 % పన్ను శ్లాబులో మార్పు: రూ.10,000 వరకు ఆదా 30 శాతం పన్ను శ్లాబులోనూ మార్పు: రూ.90,000 వరకు ఆదా – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పక్షులకూ ఓ మ్యూజియం
టెక్కలి: ఏటా శీతాకాలం ఆరంభంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా ప్రాంతం నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ వలస పక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుంటాయి. తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రంలో గల చింత, రావి, తుమ్మ, గండ్ర, జూము, వెదురు తదితర చెట్లపై ఆవాసాలు చేసుకుని సమీపంలో చిత్తడి నేలల్లో వేట కొనసాగిస్తాయి. సమీపంలో గల చిత్తడి నేలలో 120 రకాల పక్షులు ఉన్నట్లు అంచనా. దూరం నుంచి పక్షులు చూడడం ఆనందించడం సహజం. పక్షులను దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఇక్కడ పక్షుల మ్యూజియం ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ పక్షుల విన్యాసాలను తిలకించడానికి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. విదేశీ పక్షులైన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల విన్యాసాలతో పాటు ఈ పక్షుల మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తోంది.మ్యూజియంలో నమూనాలు..విదేశీ పక్షుల ప్రత్యేకతలు ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆయా ప్రత్యేకతలు మ్యూజియంలో నమూనాలు పరిశీలిస్తే.. పెలికాన్: పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు 14 సెంటీమీటీర్లు. దీని రెక్కల పొడవు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకేసారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాసంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతి సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. రోజుకు 2 సార్లు ఆహారం కోసం బయటకు వెళ్తుంటాయి. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 ఏళ్లు.పెయింటెడ్ స్టార్క్: పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 ఏళ్ల కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 ఏళ్లు.120 రకాల పక్షుల్లో కొన్ని పక్షుల ప్రత్యేకతలు..పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాసంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. -
స్వచ్ఛ కుంభమేళా
(మహా కుంభమేళా ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ప్రాంతాన్ని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు మాత్రమే సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న మహా కుంభమేళాకు రోజూ కోటి, రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చి వెళుతున్నా ఆ పరిసరాలు వీలైనంత మేర పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ నెల 13న మొదలై 45 రోజులు నిరంతరం కొనసాగే.. భూమిపై జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా కార్యక్రమాన్ని పూర్తి పరిశుభ్రత, పర్యావరణ జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం ముందస్తుగా అనేక చర్యలు చేపట్టినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.సాధారణంగా ఎక్కడైనా ఒక లక్ష మంది ప్రజలతో ఒక సభ జరిగితే అది ముగిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇప్పటికే ఎనిమిది రోజులపాటు రోజూ సరాసరి కోటి మందికి పైగా యాత్రికులు మహా కుంభమేళా త్రివేణి సంగమం ప్రాంతాన్ని సందర్శిస్తున్నా.. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల పూర్తి నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. పరిశుభ్రత కోసం 20,000 మంది సఫాయి సిబ్బంది ఆ ప్రాంతంలో షిఫ్టుల వారీగా నిరంతరం పనిచేస్తున్నారు. 10 వేల ఎకరాల విస్తీర్ణంలో లక్షన్నర మరుగుదొడ్లు..ప్రయాగరాజ్ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం చుట్టుపక్కల మొత్తం పది వేల ఎకరాల విస్తీర్ణంలో మహా కుంభమేళా ఉత్సవాలు కొనసాగుతుండగా, యూపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో లక్షన్నర మరుగుదొడ్లు, 5,000 యూరినల్స్ కేంద్రాలు, 350 కమ్యూనిటీ టాయిలెట్లు, 10 టాయిలెట్ కాంపె్లక్స్లు ఏర్పాటుచేసింది. మరుగుదొడ్ల శుభ్రతను పర్యవేక్షించడానికి 2,500 మంది సిబ్బందితో పాటు 12 కిలోమీటర్ల పొడవున్న 44 పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మరో 5,000 మంది పనిచేస్తున్నారు. త్రివేణి సంగమం నదీ గర్భంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిచేసేందుకు 40 కాంపాక్టరు మోటార్లు వినియోగిస్తుండగా, ఆ ప్రాంతంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తరలించేందుకు 120 టిప్పర్లను వినియోగిస్తున్నారు.పారిశుధ్య కార్మికులకు బీమాఇక మహాకుంభమేళా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్మికులతో పాటు బోట్మెన్లకు స్వచ్ఛ కుంభ్ ఫండ్ నిధుల ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా పాలసీలు అందజేశారు. అలాగే, ప్లాస్టిక్ వస్తువు వినియోగంపై ముందే శిక్షణ పొందిన దాదాపు 1,500 మంది సిబ్బంది కుంభమేళాకు వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతంలో చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్న యజమానులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. మహా కుంభమేళా ప్రారంభానికి నెలల ముందే ప్రయాగరాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే 400 పాఠశాలల్లో ఉపాధ్యాయులు, 4 లక్షల మంది విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం 1,249 కి.మీ. పైపులైన్లు.. ఇక మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు చేసేందుకు రోజూ భారీగా తరలివచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం ఆ పదివేల ఎకరాల విస్తీర్ణ ప్రాంతంలోనే 1,249 కిలోమీటర్ల పొడవునా మంచినీటి పైపులైన్లును ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శుద్ధిచేసిన తాగునీటిని ఆ పైపులైన్ ద్వారా యాత్రికులు వినియోగించుకునేలా 56,000 చోట్ల కుళాయిలు ఏర్పాటుచేశారు. 85 గొట్టపు బావులు, 30 జనరేటర్లతో నడిచే పంపింగ్ స్టేషన్‌తో కుంభమేళా ప్రాంతమంతా నిరంతరం నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా ఇంజనీర్లు, సిబ్బందిని నియమించారు. ఆకుపచ్చ మహాకుంభ్.. మహా కుంభమేళాలో భాగస్వాములయ్యేందుకు జాతీయ, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం రెండేళ్లుగా భారీస్థాయిలో మొక్కల పెంపకం చేపట్టింది. పది ప్రాంతాల్లో చిన్నచిన్న వనాలను రూపొందించింది. మహా కుంభమేళా ప్రారంభానికి ఏడాది ముందు నుంచే ప్రయాగరాజ్ అంతటా సుమారు మూడు లక్షల మొక్కలను పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మేళా ముగిసిన తర్వాత కూడా వాటి సంరక్షణ, నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. నగరానికి దారితీసే 18 ప్రధాన రహదారుల వెంట ఈ మొక్కల పెంపకం డ్రైవ్‌లు కొనసాగాయి. కదంబ, వేప, అమల్టాస్ వంటి స్థానిక జాతులకు చెందిన 50,000 మొక్కలు రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా నాటారు. -
గాజా.. చెదిరిన స్వప్నం!
పదిహేను నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైన గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతిరేఖలు ప్రసరించినా యుద్ధంలో జరిగిన విధ్వంసఛాయలు తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. అయినాసరే అశాంతి నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా మృతదేహాలే స్వాగతం పలుకుతూ నాటి మారణహోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. గాజా స్ట్రిప్‌పై వేల టన్నుల పేలుడుపదార్ధాలను కుమ్మరించిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల జనవాసాలను దాదాపు శ్మశానాలుగా మార్చేసింది. స్వస్థలాలకు కాలినడకన, గుర్రపు బళ్లలో చేరుకుంటున్న స్థానికులకు ఎటుచూసినా వర్ణణాతీత వేదనా దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటికింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలు కూలిపోయాయి. కొందరు ఆత్మియులను పోగొట్టుకుంటే.. మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీదా విషాద చారికలే. కుప్పకూలిన వ్యవస్థలు గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సగం ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షింకంగానే పని చేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూదిమందు, బ్యాండేజీ, కాటన్ వంటి వాటినీ అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య సంస్థలను మళ్లీ పునర్నిర్మించాల్సి ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరీ అధ్వాన్నం. శిథిలాల తొలగించాక ఏర్పడిన కాలిబాటే ఇప్పడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబుదాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాసరే పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్లముందే కుటుంబసభ్యులను కోల్పోయిన వారు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు.యుద్ధభయం వారిని ఇంకా వెన్నాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. యుద్ధం ఆగాక సహాయక, అన్వేషణా బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామికయుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్లు శిథిలా తొలగింపు పనులు చేస్తున్నారు. ‘‘వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్లినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చు’’అని గాజా సిటీలోని 24 ఏళ్ల సివిల్ డిఫెన్స్ కార్మికుడు అబ్దుల్లా అల్ మజ్దలావి చెప్పారు. ‘నా కుటుంబం శిథిలాల కింద కూరుకుపోయింది, దయచేసి త్వరగా రండి’’అంటూ కాల్పుల విరమణ తర్వాత కూడా స్థానికుల నుంచి తమకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయ ని సహాయక ఏజెన్సీ తెలిపింది. పునర్నిర్మాణానికి చాలా సమయం ధ్వంసమైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ ఉన్వ్రా తాత్కాలిక డైరెక్టర్ సామ్ రోజ్ తెలిపారు. ‘‘గాజాలో ఆవాస వ్యవస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.ప్రజల అత్యవసర అవసరాలను తీర్చడానికి, గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు తొలి 60 రోజుల ప్రణాళిక ఉందని, వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బాల్కీ ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ప్రిప్లో ఆస్పత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని బాల్కీ వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్అణువణువునా విధ్వంసంయుద్ధం దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 46,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,10,700 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48 శాతం మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85 శాతం వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది.ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చిచేరినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఉన్న ఆ కాస్త ఆనందం కూరా ఆవిరయ్యే దుస్థితి దాపురించింది. గాజా అంతటా 60శాతం నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. కూలిన ఇళ్ల కింద 10,000కు పైగా మృతదేహాలు ఉండొచ్చని ఏజెన్సీ అంచనావేస్తోంది.నెమ్మదిగా మొదలైన సాయం కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకుని, గాయాలపాలుకాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం వంద రోజులు సమయం పడుతుందని అన్వేషణా బృందాలు అంచనావేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది.స్థానికులకు ఆదాయం కాదు కదా ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా తయారైంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను మానవతా సంఘాలు అందించడం మొదలెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా సరకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.