తెలుగులోనే తొలి ఛార్జి‘షీ’ట్‌ | Dundigal Police Station woman head constable Swaroopa filing charge sheets entirely in Telugu | Sakshi
Sakshi News home page

తెలుగులోనే తొలి ఛార్జి‘షీ’ట్‌

Jan 9 2026 12:47 AM | Updated on Jan 9 2026 1:12 AM

Dundigal Police Station woman head constable Swaroopa filing charge sheets entirely in Telugu

తెలుగులో అభియోగపత్రం దాఖలుచేసిన తొలి మహిళా పోలీస్‌ సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లోని దుండిగల్‌ పోలీసుస్టేషన్‌లో హెడ్‌–కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మాలోత్‌ స్వరూప తెలుగులో అభియోగపత్రం దాఖలు చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 

దీంతోపాటు పోలీసు పరిభాషలో ఫైనల్‌ రిపోర్టుగా పిలిచే నివేదికనూ తెలుగులో రూపొందించి, ఉన్నతాధికారికి సమర్పించిన తొలి అధికారిణిగా రికార్డుకెక్కారు. తాను పనిచేస్తున్న పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పోలిశెట్టి సతీష్‌తోపాటు  కమిషనర్‌ మస్తీపురం రమేష్‌లు దీనికి స్ఫూర్తి అని స్వరూప చెప్తున్నారు. ఆ ‘తొలి తెలుగు మహిళ’ దీని పూర్వాపరాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆంగ్లంలోనే ఉండటం పరిపాటి. ‘జెన్‌–జెడ్‌’ను మినహాయిస్తే... గ్రామాల్లోనే కాదు,  పట్టణాలు, నగరాల్లోనూ ఆ భాషపై పట్టు ఉన్న వారు చాలా తక్కువ. దీంతో అనేకమంది ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి బాగా చదువుకున్న వారిమీద ఆధారపడాల్సిందే. ఇక పోలీసు విభాగం విషయానికి వస్తే తమ వద్దకు వచ్చే ఫిర్యాదు తెలుగు భాషలో ఉన్నా... అధికారులు దాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసి మరీ కేసు నమోదు చేస్తారు. దర్యాప్తు, కేసు డైరీలతో పాటు ఛార్జిషీట్‌ అనే అభియోగపత్రం కూడా ఇంగ్లీషులోనే రూపొందించి న్యాయస్థానానికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలూ తమ మాతృభాషలోనే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అనివార్య కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది అమలు కావట్లేదు. ప్రస్తుతం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా ఉన్న మస్తీపురం రమేష్‌ గతంలో హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌కు డీసీపీగా పనిచేశారు. అప్పట్లో తెలుగును పోలీసు విభాగంలో అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆయన స్ఫూర్తితోనే అప్పట్లో చాదర్‌ఘాట్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన పోలిశెట్టి సతీష్‌ 2021లో రెండు కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను తెలుగులో రూపొందించి కోర్టుకు సమర్పించారు. 

గతంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన అవినాష్‌ మహంతి హెడ్‌–కానిస్టేబుల్‌ స్థాయి అధికారులను దర్యాప్తు అధికారులుగా మార్చారు. కొన్ని కేసుల్ని వీళ్లే దర్యాప్తు చేసి, అభియోగపత్రాలు దాఖలు చేసేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసు విభాగంలోకి విద్యాధికులే వచ్చి చేరుతున్నారు. అయితే వారికి ఆంగ్లంపై పట్టు తక్కువ కావడం వల్ల ఆసక్తి ఉన్నప్పటికీ అభియోగపత్రాల దాఖలులో ఉన్న ఇబ్బంది మూలాన దర్యాప్తు అధికారులుగా మారట్లేదు. ఈ విషయం గమనించిన ఇన్‌స్పెక్టర్‌ పోలిశెట్టి సతీష్‌ తెలుగులోనే రూపొందించి, దాఖలు చేయడానికి ప్రయత్నించమని ప్రోత్సహించారు. 

ఆ స్ఫూర్తితో తెలుగులో చార్జ్‌షీట్స్‌ వేయాలని నిర్ణయించుకున్నా. బౌరంపేటకు చెందిన వెంకటేష్‌ తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న దానిపై ఎక్సైజ్‌ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి తెలుగులో రూపొందించిన అభియోగపత్రాన్ని మేడ్చల్‌లోని మొదటి తరగతి మేజిస్ట్రేట్‌కు సమర్పించా. 

అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ఓ మహిళ వలస కూలీ, ఆమె కుమార్తె తప్పిపోయిన కేసు దర్యాప్తును పూర్తిచేశాను. వారి ఆచూకీ కనిపెట్టి, కుటుంబీకులకు అప్పగించిన తర్వాత కేసు మూసివేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన తుది నివేదికను తెలుగులో రూపొందించి మేడ్చల్‌ ఏసీపీ శంకర్‌ రెడ్డికి సమర్పించా. సాధారణంగా ఇలాంటి కేసులకు సంబంధించిన చార్జ్‌షీట్, ఫైనల్‌ రిపోర్టులను గరిష్టంగా రెండు గంటల్లో తయారు చేయవచ్చు. అయితే తెలుగులో పదాలు వెతుక్కోవాల్సి రావడంతో మూడేసి రోజులు పట్టింది. భవిష్యత్తులోనూ ఈ విధానాలను కొనసాగిస్తా!

మాది మెదక్‌ జిల్లా. నేను దుండిగల్‌లోనే పుట్టిపెరిగాను. అక్కడి జిల్లా పరిషత్‌ స్కూల్‌ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తెలుగు మీడియంలో చదివాను. గ్రాడ్యుయేషన్‌ మాత్రం ఇంగ్లీషు మీడియంలో పూర్తి చేయాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి రిక్రూట్‌మెంట్‌లోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ప్రస్తుతం హెడ్‌–కానిస్టేబుల్‌ హోదాలో పని చేస్తున్నాను. ఇటీవల డీజీపీ బి. శివధర్‌ రెడ్డి చేతుల మీదుగా ‘సైబర్‌ యోధ’ అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో పెండెన్సీ లేకుండా చూసినందుకు నాకీ అవార్డు లభించడం చాలా సంతోషం. 
– స్వరూప, హెడ్‌–కానిస్టేబుల్‌, దుండిగల్‌ పోలీసుస్టేషన్‌

తెలుగులోనే ఉంటే న్యాయం జరుగుతుందని...
ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్స్‌ ఇంగ్లీషులో ఉంటున్నాయి. దీనివల్ల తన ఫిర్యాదులోని అంశాలను ఎలా దర్యాప్తు చేశారో, అభియోగపత్రాల్లో ఏం ΄÷ందుపరిచారో బాధితులకు తెలియట్లేదు. తాను చేసింది ఏ చట్ట ప్రకారం నేరమనేది నిందితుడికీ అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ కోర్టు పత్రాలనూ చదవలేరు. ఇవన్నీ తెలుగులో ఉంటే దర్యాప్తులోని లోపాలను బాధితులు కూడా కనిపెట్టి నిర్లక్ష్యం చేసిన అధికారుల్నీ నిలదీస్తారు. అలా సరైన న్యాయంపొందగలుగుతారు. బీఎన్‌ఎస్‌ ప్రకారం మాతృభాషలోనూ అభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. 
– పోలిశెట్టి సతీష్, ఇన్‌స్పెక్టర్, దుండిగల్‌ పోలీసుస్టేషన్‌

వీలున్నంత వరకు తెలుగులోనే అందిస్తాం
దుండిగల్‌ హెడ్‌–కానిస్టేబుల్‌ స్వరూపను ఆదర్శంగా తీసుకుని, ఎందరో స్ఫూర్తి ΄÷ందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య భాష ఓ అగాథంలా మారిపోయింది. సామాన్యుల కోసం పని చేసే ప్రభుత్వాలు, యంత్రాంగాలు వారికి అర్థమయ్యేలా సాధారణ వాడుక భాషలోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలి. పరిపాలనపరమైన అనేక అంశాలపై వివిధ సర్క్యులర్లు నిత్యం పంపిస్తూ ఉంటాం. వీటితో పాటు వీలున్నంత వరకు మెమోలను కూడా తెలుగులోనే జారీ చేయాలని నిర్ణయించాం. ఓ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ వ్యవహారానికి సంబంధించిన తొలి సర్క్యులర్‌ను ఇప్పటికే తెలుగులో ఇచ్చాం. 
– మస్తీపురం రమేష్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ 

– శ్రీరంగం కామేష్, క్రైమ్‌ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement