కాంగ్రెస్‌ వైఫల్యాలపై రేపు బీజేపీ చార్జిషీట్‌ | BJPs chargesheet on Congress failures tomorrow | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైఫల్యాలపై రేపు బీజేపీ చార్జిషీట్‌

Feb 1 2026 4:13 AM | Updated on Feb 1 2026 4:13 AM

BJPs chargesheet on Congress failures tomorrow

ఒకట్రెండు రోజుల్లో ఎక్కడికక్కడ మున్సిపల్‌ మేనిఫెస్టోలు

రోడ్డు షోలు, బహిరంగ సభలకు తరలిరానున్న అగ్రనేతలు 

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాల అమలుకు నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రెండేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ సోమవారం చార్జిషీట్‌ విడుదల చేయనుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, విద్య, వైద్య వ్యవస్థల్లో వైఫల్యాలు, నిరుద్యోగ భృతి హామీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటివి అమలు చేయకపోవడం తదితర అంశాలను అభియోగపత్రంలో ప్రముఖంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం 30 శాతం కమీషన్‌ సర్కార్‌గా మారిందని.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తూ ఆర్థిక అరాచకానికి పాల్పడుతోందని.. ఒక వర్గం వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ హిందూ వ్యతిరేకిగా మారిందని ఆరోపిస్తూ ఆయా అంశాలను పొందుపరచనున్నట్లు తెలిసింది.  

సేవ్‌ తెలంగాణ, ఓట్‌ ఫర్‌ బీజేపీ నినాదంతో... 
మున్సిపల్‌ ఎన్నికలకు సేవ్‌ తెలంగాణ–ఓట్‌ ఫర్‌ బీజేపీ అనే ప్రధాన నినాదంతోపాటు కాంగ్రెస్‌ పాలనలో మార్పు రాలే... తెలంగాణ బతుకులు మారలే, పట్టణ ప్రగతి బీజేపీతోనే పురోగతి అనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 48 డివిజన్లలో గెలిచేందుకు అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అమలు చేయనుంది.

జాతీయ నేతలు, కేంద్ర మంత్రుల సుడి గాలి పర్యటనలు, ముఖ్యనేతల రోడ్‌ షోలు, చార్జిషీట్ల విడుదలతో ప్రచారాన్ని హోరెత్తించనుంది. ఒక్కోరోజు ఒక్కో మున్సిపాలిటీలోని అన్ని స్థానాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయి ప్రచారం (కార్పెట్‌ బాంబింగ్‌ తరహాలో)నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. 

ప్రజలకిచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వైఫల్యాలతోపాటు ఆయా పార్టీలపై వచ్చిన అవినీతి ఆరోపణలే ప్రచారాస్త్రంగా మొత్తంగా పురపాలిక ఎన్నికల కోసం ఒక మేనిఫెస్టోను.. ఒక్కో కార్పొరేషన్, ఒక్కో మున్సిపాలిటీకి వేర్వేరుగా మేనిఫెస్టోలను ప్రకటించనుంది. స్థానికంగా ఎక్కడికక్కడ చార్జిషీట్లను విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. శనివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జీలకు బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, ఎన్నికల ఇన్‌చార్జీలు బీఫారాలు అందించారు. 

4న పాలమూరుకు నితిన్‌ నబీన్‌... 
ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం నాలుగు పెద్ద బహిరంగ సభలు, ఎక్కడికక్కడ రోడ్డు షోలను బీజేపీ నిర్వహించనుంది. ఈ నెల 4న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న ఆయన.. అక్కడి మున్సిపల్‌ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు తెలిసింది. 

ఈ నెల 8న నిర్మల్‌లో నిర్వహించే మరో బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొననున్నట్లు సమాచారం. మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తంగా 3, 4 కార్పొరేషన్లు, సగానికిపైగా మున్సిపాలిటీల్లో గెలిచి సత్తా చాటాలని కమలనాథులు ఉవి్వళ్లూరుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement