సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోదాల సందర్భంగా భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల మేరకు జగిత్యాల ధరూర్ క్యాంపులోని ఎక్సైజ్ సీఐ రాము నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ రామును అరెస్ట్ చేశారు. అయితే, గతంలో ఆయన సిరిసిల్ల ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఏసీబీకి ఆధారాలు లభించాయి. మరోవైపు.. సీఐకి మీడియేటర్‌గా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐ రాము ఫోన్ కాల్ డేటా, మెసేజ్‌లపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం.


