రేపే కేరళ తీర్పు.. మధ్యాహ్నానికి స్పష్టత? | Kerala Election 2026 Showdown, High-Stakes Counting Begins Tomorrow, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

రేపే కేరళ తీర్పు.. మధ్యాహ్నానికి స్పష్టత?

May 3 2026 1:14 PM | Updated on May 3 2026 2:59 PM

Kerala Election Showdown: High-Stakes Counting Tomorrow

తిరువనంతపురం: కేరళ రాజకీయ ముఖచిత్రం రేపు తేలిపోనుంది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య జరిగిన ఉత్కంఠభరిత అసెంబ్లీ ఎన్నికల సమరానికి మే 4న తెరపడనుంది. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో కేరళ ప్రజలతో పాటు యావత్ దేశం ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు
సోమవారం ఉదయం 8 గంటలకు 43 ప్రాంతాల్లోని 140 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు సహా సుమారు 15 వేల మంది సిబ్బందిని ఈ విధుల్లో నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నానికల్లా విజేత ఎవరనే దానిపై స్పష్టమైన ట్రెండ్ వెలువడే అవకాశం ఉంది.

భారీ పోలింగ్.. బరిలో 883 మంది
ఈ దఫా కేరళ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో 79.63 శాతం భారీ పోలింగ్ నమోదైంది. సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 883 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రాష్ట్ర చరిత్రలోనే ఇదొక హోరాహోరీ పోరుగా మారింది. పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదు కావడంతో ఓటర్ల నాడిని పసిగట్టడం రాజకీయ విశ్లేషకులకు సైతం సవాలుగా మారింది.

అగ్నిపరీక్షలో పార్టీలు.. 
ఈ ఫలితాలు మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం. 2016 నుంచి ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని అధికార ఎల్‌డీఎఫ్ భావిస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అత్యంత హోరాహోరీ పోరు తప్పదని, యూడీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యం రావచ్చని అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కాసేపట్లో నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Advertisement
 
Advertisement
Advertisement