Jammu: కూలిన వంతెన.. ముగ్గురు దుర్మరణం! | 3 Workers Crushed as Old Bridge Collapses | Sakshi
Sakshi News home page

Jammu: కూలిన వంతెన.. ముగ్గురు దుర్మరణం!

May 2 2026 11:26 AM | Updated on May 2 2026 11:38 AM

3 Workers Crushed as Old Bridge Collapses

బంటలాబ్: జమ్ము శివార్లలోని బంటలాబ్ ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరమ్మతులు చేస్తున్న సమయంలో పాత వంతెన అకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. గత ఏడాది వరదలకు దెబ్బతిన్న వంతెన రక్షణ గోడ మరమ్మతులను కార్మికులు చేపడుతున్నారు. ఇంతలో ఈ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో ఒక కార్మికుడిని ప్రాణాలతో కాపాడారు.  ముగ్గురి మృతదేహాలు శనివారం ఉదయానికి లభ్యమయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొన్న డివిజనల్ ఫైర్ ఆఫీసర్ మహ్మద్ జాఫర్‌పై బండరాయి పడటంతో ఆయన  గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం  స్పందించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి సురేందర్ కుమార్ చౌదరి, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాహిల్ వర్మ, జూనియర్ ఇంజనీర్ సజాద్ మీర్‌లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను అటాచ్ చేయాలని ఆదేశిస్తూ, ఈ ఘటనపై అధికారిక విచారణకు ఆదేశించారు.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల్లో జరిగిన లోపాలపై లోతైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పబ్లిక్ వర్క్స్ (ఆర్ అండ్ బి) శాఖ కార్యదర్శి (టెక్నికల్) పురుషోత్తం కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. మరమ్మతు పనుల సమయంలో పర్యవేక్షణ ఎంతవరకు ఉందనే కోణంలో దర్యాప్తు చేసి, ఐదు రోజుల్లోగా పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఈ ప్యానెల్‌ను ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement