న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని భారీ దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఏడుగురు కీలక ఎంపీలు అనూహ్యంగా కమలం గూటికి చేరారు. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామంతో ఎగువ సభలో అధికార బీజేపీ బలం అమాంతం పెరిగిపోగా, జాతీయ రాజకీయాల్లో కలకలం మొదలయ్యింది. రాజ్యసభ సచివాలయం అధికారిక లెక్కల ప్రకారం, ఏడుగురు ఆప్ సభ్యుల రాకతో సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 113కు చేరింది. ఐదుగురు నామినేటెడ్ సభ్యులతో కలుపుకుంటే ఎన్‌డీఏ కూటమి బలం 148కి పెరిగి, 245 స్థానాలున్న సభలో మూడింట రెండొంతుల మెజారిటీకి అత్యంత చేరువయింది.
‘ఆమ్ ఆద్మీ’కి చెందిన రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలీవాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ తదితరులు అధికారికంగా బీజేపీలో చేరికకు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, వారిని ఎన్‌డీఏలోకి ఆహ్వానించారు.
‘ఆప్’ ఉనికి ప్రశ్నార్థకం
ఈ ఆకస్మిక పరిణామంతో రాజ్యసభలో ఆప్ బలం కేవలం మూడు స్థానాలకు పడిపోయింది. ప్రస్తుతం సంజయ్ సింగ్, బల్బీర్ సింగ్ సీచేవాల్, ఎన్డీ గుప్తా మాత్రమే ఆ పార్టీ తరపున మిగిలారు. పార్టీ మారిన ఏడుగురు సభ్యులలో ఆరుగురు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారే. వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ పరిణామం ఆప్ భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆప్ పార్టీలోని మూడింట రెండొంతుల రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవుతున్నట్లు స్వయంగా రాఘవ్ చద్దా ప్రకటించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
చట్టపరమైన చిక్కులు
ఈ ఫిరాయింపుల పర్వంపై ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా చట్టవ్యతిరేకమని, ఫిరాయింపుల నిరోధక చట్టం (రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్) ప్రకారం వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఆయన రాజ్యసభ ఛైర్మన్‌కు పిటిషన్ సమర్పించారు. రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సలహా మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ‘ఒరిజినల్’ పార్టీలోని మూడింట రెండొంతుల మంది విలీనం కావాలన్న నిబంధనను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. అయితే ఛైర్మన్ కార్యాలయం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ రాజకీయ క్రీడ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


