పుట్టినరోజు నాడైనా ఎవరికీ అపకారం చేయకూడదన్నది చాలామంది సెంటిమెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టిన రోజునే సచివాలయ ఉద్యోగ సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఆ రోజున చేశారో తెలియదు కానీ.. ఈ చర్య వల్ల ఉద్యోగ వర్గాల్లో చంద్రబాబు పరపతి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగులను పలు రకాలుగా వేధిస్తోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నా ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తున్న ఉద్యోగ నేతను డిస్మిస్ చేయడం ఏమిటని చాలా మంది మదనపడుతున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 200 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. సీనియర్ అధికారులను ఏదో నెపంతో జైళ్లకు పంపించారు. ఇదంతా కక్ష సాధింపు, రెడ్ బుక్ అరాచకాలలో భాగంగానే సాగుతుందన్న విమర్శలున్నాయి. కొంతకాలం క్రితం తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ చంద్రబాబుకు పరువు నష్టం నోటీసు పంపిన పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్యను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉండి, అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొంత విశాల దృక్పథంతో పనిచేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేయాలి. చంద్రబాబు గతంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదని చాలామంది అంటుంటారు. ఇంతకీ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చేస్తున్న అభియోగం ఏమిటి? గత ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఏవో కొన్ని బస్ డిపోలలో ప్రచారం చేశారట. ఇది అవాస్తవమని, ఆధారాలు చూపాలని ఆయన కోరుతున్నారు.
బస్‌డిపో మేనేజర్లు కూడా ఈ మేరకు నివేదికలు ఇచ్చారని ఆయన అంటున్నారు. అయినా ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. దానికి కారణం ఆయన టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పదే, పదే ప్రశ్నించడమే కారణం. పోనీ తన హయాంలో ఉద్యోగ సంఘ నేతలను టీడీపీకి అనుకూలంగా వాడుకోలేదా అంటే శుభ్రంగా ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఉద్యోగ సంఘ అధ్యక్షుడుగా ఉన్న అశోక్ బాబు, తదితర ఎన్జీవో నేతలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన రాజకీయ విన్యాసాలు అన్నిటిలో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన సమక్షంలోనే ప్రధాని మోడీని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయినా వారు తప్పు చేయనట్లు లెక్క. ఆ తర్వాత కాలంలో అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన టీడీపీలో కీలకమైన ఒక నేతగా ఉన్నారు. అంటే చంద్రబాబుకు, ఆయనకు మద్య క్విడ్ ప్రోకో జరిగినట్లు కాదా? ఉద్యోగులను ఎన్నికల సమయంలో ప్రభావితం చేయడానికి కొందరు నేతలు ఆ రోజులలో ప్రయత్నించారా? లేదా? అన్నది అందరికి తెలుసు.
అయినా 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ వీరెవ్వరిపైన కక్ష సాధింపులకు దిగలేదు. అంతేకాదు.. జగన్ ఐదేళ్ల పాలనలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడానికి గట్టిగానే కృషి చేసినా సంఘాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కృషి చేసింది తెలియదా? టీఏ, డీఏ లేటు అవుతోందని ఆరోపిస్తూ ఒక కానిస్టేబుల్ ముఖ్యమంత్రి జగన్‌ను దూషించిన ఘటనలో సస్పెండ్ అయ్యారు. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఇదే చంద్రబాబు ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరొకటి ఉంది. నర్సీపట్నంలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ అనే ఆయన టీడీపీ నేత ప్రోద్బలంతో ఆనాటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపై విచారణ చేసి, కావాలని సుధాకర్ అలా దుష్ప్రచారం చేశారని నిర్ణయానికి వచ్చాక సస్పెండ్ చేసింది. దానిని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు.. సుధాకర్ మద్యం సేవించి విశాఖలో రోడ్డుపైన రచ్చ చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ కానిస్టేబుల్ చర్యను కూడా ముఖ్యమంత్రికే ఆపాదించి, చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఆ తర్వాత కాలంలో సుధాకర్ అనారోగ్యానికి గురై మరణించారు. అందుకు కూడా జగనే కారణం అంటూ అబద్దపు ప్రచారం చేశారు.
అప్పుడేమో ఉద్యోగుల పట్ల ఎంతో సానుభూతి ఉన్నట్లు, వారికి మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడేవారు. అధికారంలోకి రాగానే తనకు గిట్టని, తనను ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నేతను ఏకంగా ఉద్యోగాల నుంచే డిస్మిస్ చేశారు. వెంకట్రామి రెడ్డిని కంట్రోల్ చేస్తే ఇంకెవరూ మాట్లాడరన్నది ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు. కాని దీనివల్ల చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా అప్రతిష్ట అయితే తప్పకుండా వస్తుంది. ఉద్యోగులకు కూటమి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నది వెంకట్రామిరెడ్డి వాదన. గతంలో ఎప్పుడూ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగులో లేవని ఆయన చెబుతున్నారు. జగన్ టైమ్‌లో వచ్చిన సచివాలయాలను ప్రస్తుతం స్వర్ణ గ్రామాల ఆఫీసులు అని పిలుస్తున్నారు. ఆ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను వేధిస్తున్నారని, వలంటీర్లు చేసే బాధ్యతలను ఈ ఉద్యోగులకు అప్పగిస్తున్నారని, చివరికి పార్కింగ్ ప్రదేశాల వద్ద కాపలా పెడుతున్నారని, వీధి కుక్కలను లెక్కించే పని వీరికి అప్పగిస్తున్నారని వెంకట్రామి రెడ్డి అన్నారు.
ఈ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడితో గుండెపోటుకు గురైకాని, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కాని దాదాపు వంద మంది మరణించారని ఆయన చెప్పారు. వీటన్నిటిని ప్రస్తావిస్తున్ననందుకే ఆయనపై కక్ష కట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారన్నమాట. నిజానికి సరైన ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఆధారాలు చూపకుండా ఉద్యోగం నుంచి తీయరాదు. దీనిపై న్యాయ పోరాటానికి ఆయన సిద్దం అవుతున్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి. గతంలో చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో సోదాలు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రాన్ని మేనేజ్ చేసుకుని ఆ కేసు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు చేసుకోగలిగారని చెబుతారు. స్కిల్ స్కామ్ కేసులో విచారించడానికి సీఐడీ శ్రీనివాస్‌ను పిలిస్తే ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు వెళ్లిపోయారు. దాంతో గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ అభియోగాలన్నిటిని ఎత్తివేసి జీతం బకాయిలతో సహా చెల్లించి ఉద్యోగం ఇచ్చింది. ఇలా చేయడం చట్టబద్దమేనా?. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక పోలీసు ఉన్నతాధికారి అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్ళారు. అయితే ఆయన ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చేయలేదని ఏకంగా పోలీసునే కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. కాని తన మాజీ పీఎస్ విషయంలో ఎందుకు అంత ఉదారంగా ఉన్నారో ప్రజలకు తెలియదా?.
అలాగే మరో పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హోదాలో ఉండి టీడీపీ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించే వారు. ఈ సంగతి ఒక టీడీపీ ఎమ్మెల్యేనే పార్టీ సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు అప్పట్లో వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెబుతారు. అది తప్పు కాదా? అవన్ని ఎందుకు! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, ప్రజలందరిని సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేశారు కదా! కాని ఆయనే స్వయంగా వైఎస్సార్‌సీపీ వారికి ఏ పనులు చేయవద్దని ఎలా అధికారులకు బహిరంగంగా ఆదేశాలు ఇచ్చారు?. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెప్పడం ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది. దేశ రాజ్యాంగం పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆయన కుమారుడు లోకేశ్ ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు. వెంకట్రామిరెడ్డి నిజంగానే వైఎస్సార్‌సీపీకి ప్రచారం చేసి ఉంటే తప్పే అయితే, అంతకు మించి వీరంతా తప్పు చేసినట్లు కాదా? ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ పేరుతో టీడీపీ అరాచకాలు చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది.
టీడీపీ వారు ఏ ఫిర్యాదు చేసినా ఆగమేఘాల మీద కేసు బుక్ చేసి వైఎస్సార్‌సీపీ వారిని, చివరికి జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల కార్యకర్తలను కూడా అరెస్టులు చేస్తున్నారే. అదే టైమ్ లో వైఎస్సార్‌సీపీ వారు తమపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదే! మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరబడి టీడీపీ రౌడీలు, గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు. వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ఆరోపణ చేసి ఉద్యోగం నుంచి తీసివేసిన ప్రభుత్వం ఈ అకృత్యాలకు బాధ్యత వహించదా!. వీటన్నిటిని ప్రశ్నిస్తూ చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు అంటూ మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పటికైనా వీటన్నిటికి నైతికంగా, చట్టపరంగా జవాబివ్వక తప్పని రోజు ఒకటంటూ రాకుండా ఉంటుందా?.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


