breaking news
kommineni Srinivasa Rao
-
దేశ వ్యాప్తంగా పెను సంచలనం!
తీగ లాగితే డొంక కదిలిందన్నది సామెత. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకం అలాగే ఉంది. ఇంతకాలం ఏ రాష్ట్రం నుంచి ఎన్నికలలో అవకతవకాలు జరిగాయని , ఓటర్ల నమోదు, తొలగింపు తదితర అంశాలలో అక్రమాలు జరిగాయని ఎవరు ఆరోపణలు చేసినా, ఎన్నికల సంఘం ఏమీ జరగలేదన్నట్లు ఎన్నికల సంఘం నటించిందనిపిస్తుంది. అయితే ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ఎన్నికల సంఘం ప్రత్యేకించి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మూలాలను కదిలించిందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఇది పెను సంచలనం అయింది. దేశంలో ఈవీఎంల పైనే అనేక అనుమానాలు వస్తుంటే, ఇప్పుడు ఏకంగా ఓట్ల నమోదు, తొలగింపులలో వచ్చిన ఆరోపణలు దేశ ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు కలిగిస్తున్నాయి.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, సమాజవాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరుల నేతృత్వంలో వివక్ష ఎంపీలు ఎన్నికల సంఘం వద్ద చేసిన ధర్నా ఒకరకంగా చారిత్రాత్మకమైనదని చెప్పాలి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా ఆందోళన చేసిన సందర్భం ఇదేనేమో! అలాగే బీజేపీ ఈ స్థాయిలో ఆత్మరక్షణలో పడడం కూడా ఇదే మొదటిసారి కావచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అయితే 2024 లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సాధారణ ఎన్నికలతో పాటు జరిగి ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిని విస్తుపరిచాయి. ఏదో మోసం జరిగిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అప్పుడే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మోసం ఏమిటో బహిర్గతం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా మోసాలు జరిగాయంటూ విపక్షం ఆరోపణలు చేస్తోంది. రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ఆధారాలతో ఆరోపణలు చేశారు. అయినా ఈసీ, బీజేపీ కొట్టిపారేస్తూ వచ్చాయి.సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేపట్టిన వైనం, కోట్ల మంది ఓట్లను తొలగిస్తున్న పద్దతి తీవ్ర అలజడి రేపింది. మహారాష్ట్రలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు లక్షల ఓట్లు కొత్తగా చేరడం ఏమిటి? పశ్చిమబెంగాల్లో లక్షల ఓట్లు పోవడం ఏమిటి? వాటిలో 27 లక్షల ఓట్లు నిజమైనవా, కాదా? అన్నది నిర్దారించకుండా ఎన్నికలు జరిపేయడం ఏమిటి? దీనిపై సుప్రీంకోర్టు కూడా తగు రీతిలో స్పందించలేదన్న భావన న్యాయవాద వర్గాలలో ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జి ఉజ్వల్ బుయాన్ ఓట్ల గల్లంతు అంశంపై మాట్లాడుతూ దేశంలో ఓట్లు కలిగినవారు. ఓట్లు లేనివారు అని రెండు రకాల పౌరులు ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు.సుప్రీంకోర్టులో కేసు ఉండగా బుయాన్ ఇలా మాట్లాడడంపై మరో మాజీ చీఫ్ జస్టిస్ గవాయ్ అభ్యంతరం తెలిపారు. చిత్రమేమంటే హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలంలో చెట్లు కొడుతుంటే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన గవాయ్ ఇన్ని కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన అంశంలో మాత్రం విభిన్నంగా మాట్లాడడం చిత్రం అనిపిస్తుంది. ఓటర్ల జాబితా రివిజన్ అధికారం ఢిల్లీలోని కార్యాలయంలో పెట్టుకోవడం ఏమిటి? ఫారం 6లో మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని ఈసీ తెలిపితే, తమ అంగీకారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసలు ఈ మార్పులు పార్లమెంటు చట్టం ప్రకారం జరగవలసి ఉండడగా, జ్ఞానేష్ కుమార్ తనే ఎందుకు స్వతంత్రంగా నిర్ణయం చేశారు. సీఈసీ ఎంపికలో సీజేఐని తప్పించి, కేంద్ర మంత్రిని పెట్టడం.. ఆయనకు జీవితాంతం కేసులు రాకుండా రక్షణ కల్పించడం వంటివి అనేక సందేహాలకు తావిచ్చాయి.ఓటు హక్కును రక్షించాల్సిందేస్థూలంగా చెప్పాలంటే రెండు అంశాలను గమనించాలి. కొన్ని రాష్ట్రాలలో బోగస్ ఓట్లు, మరికొన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఒరిజినల్ ఓట్ల తొలగింపు వంటి ప్రక్రియ జరిగినట్లు ఆరోపణలన్నమాట. దేశంలో దొంగ ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నమాట నిజమే. వాటిని నిరోధించవలసిందే. అదే టైంలో పౌరుల ఓటు హక్కును పరిరక్షించవలసిన బాధ్యత ఈసీపై ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో కుప్పం వంటి కొన్ని సరిహద్దు నియోజకవర్గాలలో పొరుగు రాష్ట్రాలకు చెందినవారిని వేలమందిని ఓటర్లుగా చేర్పిస్తుంటారట. అలాగే హైదరాబాద్‌లో నివసించే లక్షల మందికి ఏపీలోను, తెలంగాణ జిల్లాలలోను ఓట్లు ఉన్నాయి. రాజకీయ పార్టీలు తద్వారా దొంగ ఓట్లు వేయించుకుంటుంటాయన్నమాట. వాటిని ఈసీ ఎంతవరకు నియంత్రించిందన్నది చర్చనీయాంశం.అసలు సర్ ప్రక్రియకుగాను ఈసీ తయారు చేసిన దరఖాస్తులో ఎప్పుడో 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు ఉండాలని చెప్పడం, తండ్రి, తాత వంటివారి ఆరాలు తీయడం తదితర అంశాలన్ని ప్రజలకు విసుగు తెప్పించాయి. అయినా ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టు రితిక చోప్రా ఈసీలో దీనిపై వ్యక్తం అయిన బేదాభిప్రాయాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆమె లాగిన తీగతో డొంక కదిలినట్లయింది. దీంతోనే వివిధ అంశాలతో పాటు జ్ఞానేష్ కుమార్ కెరీర్ లో పలు వివాదాస్పద ఘట్టాలు, ఆరోపణలు అన్ని బయటపడుతున్నాయి. కేరళం రాష్ట్రం అయితే ఈయనకు సంబంధించిన 2006 కేసును విజిలెన్స్ విచారణకు అప్పగించింది.జవాబు లేని ప్రశ్నలు!ఏపీలో 2024లో జరిగిన లోక్ సభ, శాసనసభ ఎన్నికల తీరు కూడా ఒక కేస్ స్డడీ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రముఖ మేధావులు పరకాల ప్రభాకర్, ఉండవల్లి అరుణకుమార్ తదితరులు ఏపీ ఎన్నికలలో ఏభై లక్షల ఓట్లు అదనంగా ఎక్కడ నుంచి లెక్కించారని వేస్తున్న ప్రశ్నకు ఎన్నికల సంఘం జవాబు ఇవ్వలేకపోయింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏభై లక్షల మంది సుమారు 3500 పోలింగ్ బూత్‌లలో తెల్లవారుజాము రెండు గంటలవరకు నిలబడి ఓట్లు వేసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అందుకు సాక్షాధారాలు చూపడంలో విఫలం అయిందన్న అభిప్రాయం కలిగింది. ఎందుకంటే అదేదో బ్రహ్మరహస్యం అన్నటు సీసీ టీవీ ఫుటేజీని ఈసీ దాచేసుకోవడమే సంశయాత్మకంగా ఉంది. అంటే ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ప్రజలకు ఈసీ చెప్పలేకపోయిందన్నమాట.ఇదీ చదవండి: కలరింగ్ ఇస్తే సరిపోతుందా?ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన వివిపాట్ స్లిప్ లను ఈవీఎంలతో పోల్చి లెక్కవేయాలని కొందరు అభ్యర్దులు కోరినా, తమకు కొన్ని బూత్‌లలో వచ్చిన ఓట్లను ఈవిఎంను ఓపెన్ చేసి చూపాలని అడిగినా, అందుకు అవసరమైన ఫీజ్ కట్టినా ఎన్నికల అధికారులు ఎందుకు తోసిపుచ్చారు? అంతకాడికి వివి పాట్ స్లిప్‌ల మిషన్ల కోసం కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? నలభై ఐదు రోజులపాటు జాగ్రత్తపరచవలసిన ఈ స్లిప్‌లను పది రోజులలోనే దగ్దం చేయాలని ఆనాటి ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఎందుకు ఉత్తర్వులు ఇచ్చి హడావుడిగా తగులపెట్టించారన్న ప్రశ్నకు ఇప్పటికీ, ఆయన నోరు తెరిచిన దాఖలా కనిపించలేదు. పైగా ఆయనకు 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం మంచి పోస్టింగ్ ఇచ్చి కీలకమైన స్థానంలో పెట్టి, వైఎస్సార్సీపీపై కల్పిత స్కామ్‌లను సృష్టించుకోవడానికి వాడుకుంటున్నదన్న అభియోగాలను వైఎస్సార్సీపీ నేతలు చేస్తుంటారు? మరో సంగతి ఏమిటంటే ఈవిఎంలలో నమోదైనా ఓట్లను చూపించం లేదని హైకోర్టుకు వెళితే, అంత సింపుల్ కేసులో తీర్పు ఇవ్వడానికి అక్కడ మూడు నెలలు తీసుకున్నారు. ఈ లోగా సంబంధిత పిటిషనర్ వైఎస్సార్సీపీ నుంచి జనసేనకు వెళ్లారు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?ఏపీలో పారం 20 ని పూర్తి చేసి అప్లోడ్ చేయవలసిన ఈసీ నెలల తరబడి ఎందుకు జాప్యం చేసిందని, సర్వే నిపుణులు మస్తాన్ వంటివారు ప్రశ్నిస్తున్నారు. అన్నిటిని మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఈ ఎన్నికల అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణల జోలికి వెళ్లకుండా ఉండడం కూడా ఆసక్తికరమైనదే. టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై అంతెత్తున ఎగిరిపడిన చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. ఏపీలో గెలిచింది జగనే తాజాగా తెలంగాణ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఏపీలో గెలిచింది జగనే అని, చంద్రబాబు గెలవలేదని, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని సంచలన వ్యాఖ్య చేశారు. అలాగే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఏపీకి సంబంధించి ఎన్నికల అక్రమాలపై స్టడీ చేస్తున్నానని, త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడ్డాక కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన అధికారులను బదిలీ చేయడం నుంచి కూటమి నేతలు ఏది కోరితే అది చేశారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇంత తీవ్రమైన అభియోగాలకు గతంలో ఎన్నడూ గురి కాలేదు. ఆయా వ్యవస్థలు సజావుగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి!
ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా ప్రచారం చేస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. వైఎస్సార్సీపీ ప్రభుత్వ టైమ్‌లో విశాఖ రిషికొండపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి గుదిబండగా ఉన్నాయని ఎల్లో మీడియా ఒక కధనాన్ని ఇచ్చింది. దానిని చదివితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంత అసమర్ధంగా ఉందా అన్న అభిప్రాయం కూడా వస్తుందని ఆ మీడియా ఊహించి ఉండకపోవచ్చు. అదే టైమ్‌లో విశాఖపై ఎల్లో మీడియాకు ఇంత ద్వేషం ఉందా అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో సర్కార్‌కు అర్ధం కావడం లేదట.రిషికొండ భవనాలే గుదిబండ అయితే మరి రాజధాని అమరావతి పేరుతో అప్పులు తెచ్చి మరీ వేల కోట్ల వ్యయంతో చేస్తున్న నిర్మాణాలను దేనితో పోల్చాలి! రిషికొండలో మహా అయితే 400 కోట్లు ఖర్చు పెట్టి ఉండవచ్చు. ఆ భవనాలు సముద్ర తీరాన ఠీవిగా కనిపిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ నేతలు ఎవరైనా విశాఖకు వస్తే అక్కడ వారికి విడిది వసతి పెట్టడం గొప్పగా ఉంటుందని అప్పట్లో ఆ ప్రభుత్వం తలచింది. కాని తదుపరి అనూహ్యంగా కూటమి అదికారంలోకి వచ్చింది. దాంతో రిషికొండకు గ్రహణం పట్టించారు. ఇప్పటికి దాదాపు రెండున్నరేళ్లకాలం పూర్తి అవుతున్నా, ఆ భవనాలను ఎలా వినియోగించాలన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారంటే ఏమనుకోవాలి! ఎంతసేపు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ అవసరాల కోసం నిర్మించారని దుష్ప్రచారం చేయడం తప్ప మరేమీ చేయలేకపోతోంది. ప్రభుత్వ గెస్ట్ హౌస్‌గా వాడుకోవచ్చు , లేదా మరేదైనా ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు. కాని ఆ భవనాలను ఏమి చేయాలో తెలియడం లేదని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంటున్నారంటే ఆయన సీనియారిటీ అంతా ఏమైనట్లు అనుకోవాలి! రుషులు బస చేసిన కొండ అంటూ చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు చెబుతారు. ఆ భవనాలను ప్రైవేటు హోటళ్లకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పుడు ఈ సెంటిమెంట్ ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి అందలం వేస్తారన్న అభిప్రాయానికి తగ్గట్లుగానే ఆలోచన చేశారన్నమాట. అది కూడా ఒక కొలిక్కి రాలేదు. వారు ఇంకా అదనంగా భూమి కోరారట. ఇప్పుడు దానిని సమకూర్చడం కోసం ప్లాన్ చేస్తోంది.నేరుగా ఆ భూమి కూడా కేటాయిస్తే విమర్శలు వస్తాయి కనుక, ముందుగా జగన్ పై వీలైనంత బురదచల్లి, ఆ తర్వాత కామ్ గా తన పని కానివ్వాలని భావిస్తున్నట్లు ఉన్నారు. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆ భవనాల నిర్మాణం క్రిమినల్ వేస్టు అని అన్నారట. నిజానికి భవనాలు సిద్దంగా ఉన్నప్పటికీ, చేతకానితనంతో వాడుకోలేకుండా వృధాగా పెట్టడం క్రిమినల్ వేస్టే అన్నది అనుభవజ్ఞలు వ్యాఖ్యగా ఉంది. వైసిపి ప్రభుత్వంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఒక అసత్యాన్ని ఎల్లో మీడియా ప్రచారంలోకి తెస్తోంది. అదే నిజమైతే డేటాసెంటర్ల పేరుతో పది కొండలను గుండు కొట్టినట్లే కాదు.. సింహాచలం కొండతో సహా మొత్తం కొండలే కనిపించకుండా అన్నట్లు తవ్వేస్తున్నారు కదా!దానికి ఏ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది?విశాఖకు అన్ని డేటా సెంటర్లతో, నీరు, విద్యుత్ ,కాలుష్యం తదితర సమస్యలు వస్తాయని మేధావులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం వినడం లేదే! ఎల్లో మీడియా శరభ, శరభ అంటూ కూటమి ప్రభుత్వానికి భజన చేస్తోందే!పర్యావరణ నిబంధనలకు పూర్తి విరుద్దంగా కృష్ణా నది గర్భంలో నిర్మించిన ప్రజావేదిక తాత్కాలిక కట్టడాన్ని గత ప్రభుత్వం కూల్చితే దానిని విధ్వంసం అని విష ప్రచారం చేశారే. అంటే ఎల్లో మీడియాకు ఇష్టమైతే పర్యావరణంతో సంబంధం లేకుండా ఏమైనా చేయవచ్చు. లేకపోతే టీడీపీ కోసం పచ్చి అబద్దాలతో బురద చల్లుతుందన్నమాట. అంతేకాదు. మూడు పంటలు పండే వేలాది ఎకరాల భూమిని రాజధాని నిమిత్తం తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికార కమిటీ సూచిస్తే, ఆ కమిటీనే దూషించారే. ఆ నివేదికనే పక్కనబెట్టారే! ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పవచ్చు. రిషికొండ భవనాలకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేసిన పిటిషన్లను హైకోర్టు అప్పుడే కొట్టేసింది. ఆనాటి మంత్రి రోజా ఆ భవనాలను ప్రారంభించారు కూడా. అయినా ఆ భవనాలను లీజుకు ఇవ్వరాదంటూ మళ్లీ పిటిషన్ లు వేశారట. అది వేసింది టీడీపీ నేతలేకదా! వారితో వాటిని ఉపసంహరింప చేయడం కూడా టీడీపీ నాయకత్వానికి కుదరదా!అంటే ఏదో వంకతో భవనాలు వేస్ట్ గా ఉంచి, జగన్ పై తప్పుడు ప్రచారం చేయడమే వీరి లక్ష్యం అన్న భావన కలగదా! అదే టైమ్ లో తమకు కావల్సినవారికి ఆ భవనాలను, అక్కడే ఉన్న మరో తొమ్మిది ఎకరాలను కట్టబెట్టడానికి ప్లాన్ చేశారట. అప్పుడు రుషులు తపస్సు చేసుకోకుండా వెళ్లిపోయానా ఫర్వాలేదా! నిజానికి ఎప్పటినుంచో రిషికొండపై టూరిజం భవనాలు ఉన్నాయి. వాటి స్థానంలో అదునాతన భవనాలను జగన్ ప్రభుత్వం నిర్మించింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేసి , దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడంలో భాగంగా భవనాలు నిర్మించడానికి జగన్ చేసిన కృషిని నిర్వీర్యం చేసే పనిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నమాట. ఒక ఐటి కంపెనీ కూడా ఈ భవనాలు తీసుకోవడానికి ముందుకు వచ్చిందని, కాని హైకోర్టులో కేసుల వల్ల లీజుకు ఇవ్వలేకపోతున్నామని లోక్ సభ సభ్యుడు భరత్ అన్నారు. మరో వైపు మంత్రి దుర్గేష్ మాత్రం త్వరలోనే ఈ భవనాలను వినియోగంలోకి తెస్తామని అన్నారు. ఇన్ని కబుర్లు చెప్పే కూటమి పెద్దలు, ఎల్లో మీడియా అమరావతిలో జరిగే పర్యావరణ విధ్వంసం గురించి మాత్రం మాట్లాడరు. పైగా అదో అధ్బుతమని ప్రచారం చేస్తారు.కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల భూమి వరద నీటితో మునిగిపోయింది.వరద కారణంగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని మీడియాలో కధనాలు వచ్చాయి. కేవలం వరద నియంత్రణ ప్రాజెక్టులకోసమే వందల కోట్లు వెచ్చిస్తున్నారు. సచివాలయ టవర్ల భవనాల అద్దాలకు 2500 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని అమరావతి జేఏసీ రైతులు కోరారంటేనే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. గ్రామకంఠాల విషయంలో వారు అధికారుల తీరుతెన్నులను ఎంతగా తప్పుపట్టారో అందరికి తెలిసిందే. అమరావతిలో డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, లేనివారికి మరో న్యాయం జరుగుతోందని కూడా వారు ధ్వజమెత్తారు. వీటిపై మాత్రం వార్తలు ఇవ్వని ఎల్లో మీడియా రోజుకో కధ అల్లి, అమరావతిలో ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పించడానికి నానా పాట్లు పడుతుంటుంది. అందులో భాగంగా ఏ చిన్న డెవలప్మెంట్ ఉన్నా ఆహో, ఓహో అంటూ ఊదరగొడుతుంటుంది. ఐదెకరాలలో అమెజాన్ అడవిని సృష్టించబోతున్నట్లు రాసిన ఘనత కూడా ఎల్లోమీడియాదే. విజయవాడకు అమరావతిని అనుసంధానం చేస్తూ జల ప్రాజెక్టును చేపడతారట. వీటిలో ఎన్ని కార్యరూపం దాల్చుతాయో, ఎన్ని దాల్చవో తెలియదు కాని, ఎల్లో మీడియాలో వచ్చే కధనాలు చూస్తే ఇప్పటికే అమరావతి ప్రపంచస్థాయి నగరం అయిపోయిందేమో అని జనం భ్రమపడవలసిందే. జగన్ ప్రభుత్వ టైమ్ లో విశాఖపై ఎంత విద్వేష పూరిత స్టోరీలను ఎల్లో మీడియా ప్రచారం చేసిందో గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అమరావతి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల ముందు , విశాఖ నగర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఎల్లో మీడియాకు పట్టవన్న సంగతి తెలుస్తూనే ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లక్ష కోట్ల ఉద్యాన హబ్.. రైతుల కడుపు నిండుతుందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు, కథలు చెప్పడంలో మహా నేర్పరితనం ప్రదర్శిస్తున్నట్లు అనిపిస్తుంది. రాయలసీమలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పనిలో పనిగా తనకు తానే తగిలించుకున్న వాటర్ మాన్ బిరుదును కూడా గుర్తు చేసుకుని రాయలసీమలో ప్రాజెక్టుల ఘనత తనదేనని కూడా తెలిపారు. మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో హబ్‌కు శ్రీకారం చుట్టారు. అక్కడే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాపనకు నాంది పలికారు. ఈ స్కూల్ ఏర్పాటు చేయడం వరకు ఓకే. దానివల్ల రైతులకు ఉపయోగం జరిగితే మంచిదే. కాకపోతే దీనిపై సందేహాలు రావచ్చు. రిలయన్స్ కంపెనీ నెలకొల్పితే,సామాన్యులకు అందుబాటులో ఎంతవరకు ఉంటుందన్నది చెప్పలేం.ఉదాహరణకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదవాలంటే సుమారు ఏభై లక్షల వరకు ఫీజలు ఉంటాయట. గత రెండు దశాబ్దాలలో ఈ స్కూల్ వల్ల తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం ఏమిటో తెలియదు. అయినా ఒక సంస్థ ఏర్పడితే దానిని ఆక్షేపించనవసరం లేదు. ఇక రాయలసీమ హబ్ గురించి విశ్లేషించుకుందాం. ఎల్లో మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ప్రస్తుతం 20.77 లక్షల ఎకరాలలో రాయలసీమలో పండ్ల తోటలు ఉన్నాయి. కొత్తగా ఈ హబ్ ద్వారా మరో తొమ్మిది లక్షల ఎకరాలకు విస్తరిస్తారట. అంటే ఏమిటి దీని అర్దం ఇప్పటికే 21 లక్షల ఎకరాలలో తోటలు ఉంటే హబ్‌గా అభివృద్ది చెందినట్లే కదా! 9 లక్షల ఎకరాలలో విస్తరిస్తే కొత్తగా హబ్ అవడం ఏమిటి? దీనితో రాయలసీమ భవిష్యత్తు మారిపోవడం ఏమిటి? దీనిపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత రెడ్డి ఒక వ్యాఖ్య చేస్తూ లక్ష కోట్ల హబ్ కాదు.. లక్ష అబద్దాలతో పాలని అని ఎద్దేవా చేశారు.వ్యవసాయాన్ని గబ్బు పట్టించి హబ్బులంటూ ప్రచారమా అని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించి వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా రాయలసీమ అంటూ ఆకర్షణీయమైన డైలాగులతో అబద్దాల హబ్‌గా మార్చారా అన్న అభిప్రాయం కలగవచ్చు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపిలో ఉద్యానవన రైతులతో సహా వివిధ ఇతర పంటలు వేసే కర్షకులంతా నానా పాట్లు పడుతున్నారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలోనే మామిడి రైతులు పడ్డ పాట్లు ఇన్నీ అన్నీ కావు. పండించిన మామిడికి గిట్టుబాటు ధర రాకపోవడంతో రోడ్డు మీద కాయలను పారేసిన ఘట్టాలు కనిపించాయి.మరోవైపు ఈ ఏడాది వర్షాలు లేక తోటలు ఎండిపోతున్నాయి. వాటిని రక్షించుకోవడం కోసం టాంకర్ల ద్వారా నీటిని తోలుకోవడానికి రైతులు అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఎల్లో మీడియా వీటన్నిటిని కప్పిపుచ్చుతూ రాయలసీమకు శుభకరం, ఫలప్రదం అంటూ శీర్షికలు పెట్టి హబ్ అంటూ పాఠకులను మాయ చేయడానికి తంటాలు పడుతోంది. తన ప్రార్ధనవల్లే విశాఖలో వర్షాలు పడ్డాయని చిత్రమైన వాదన ప్రచారం చేసుకున్న చంద్రబాబు రాయలసీమలో వానల కోసం ఎందుకు ప్రార్ధనలు చేయలేదో తెలియదు. ఒకవేళ చేసినా అది ఫలించలేదా అన్నది సామాన్య రైతుల ప్రశ్నగా ఉంది. చిత్రమేమిటంటే తాను వాటర్ మాన్ అనిపించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు చెప్పుకున్నారు. కాని ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సైతం తీవ్రమైన కరువు ఉందని ప్రభుత్వం అధికారిక జాబితాలో వెల్లడించింది. 1989 నుంచి ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు అక్కడ కరువు జాడలు లేకుండా చేసి వాటర్ మాన్ అయ్యానని చెప్పుకుంటే ఒప్పుకోవచ్చు.ప్రాజెక్టుల నిర్మాణంపై ఆయన చేసిన కృషి అంతంతమాత్రమే అయినా, మొత్తం క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు వాటర్ మాన్ అని చెప్పుకుంటే జనం నమ్ముతారా! నిజంగానే ఈయనే వాటర్ మాన్ అయితే రాయలసీమలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఉద్యానవనాలతో పాటు, వివిధ పంటలకు నీళ్లందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావు, నీలంసంజీవరెడ్డి వంటివారిని ఇంకెంత గొప్పగా పిలవాలి? జగన్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ తీసుకు వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కోరిక మేరకు దానిని నిలిపివేసిన చంద్రబాబు వాటర్ మాన్ ఎలా అవుతారో అర్ధం కాదు. ఒకపక్క సీమలో కుప్పంతో సహా అత్యధిక మండలాలు కరువుతో అల్లాడుతుంటే ఇలాంటి డైలాగుల వల్ల ప్రజలలో అపహాస్యం పాలవ్వరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.లక్ష కోట్ల రూపాయల హబ్‌లో కేంద్రం నలభై వేల కోట్లు ఇస్తుందట. ఆ మాట కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట మాత్రంగా కూడా ఎందుకు చెప్పలేదో అన్న మీమాంస ప్రజలలో ఏర్పడింది. అంటే ఇది ప్రచారం కోసమేనా అన్న సందేహం వస్తోందన్నమాట. మిగిలిన అరవైవేల కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడతాయట. ఇది నమ్మశక్యంగా ఉందా? అందుకే కల్లబొల్లి కబుర్లు, కాకమ్మ కథలుగా పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం వెల్లడించినదాని ప్రకారం తొలి దశలో 2026-27 లో 12 వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తారట. ఈ ఆర్ధిక సంవత్సరం ఆరు నెలులు గడిచిపోయింది. మిగిలిన 6 నెలల్లో ఇంత భారీ మొత్తం వ్యయం చేస్తారంటే విశ్వసిస్తారా? 2029 నాటికి మూడో దశ పూర్తి అవుతుందట. ఎల్లో మీడియాలో వచ్చిన వివరాలను చూస్తే ఈ మూడేళ్లలో నలభై వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది.ఇదీ చదవండి: నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!అది కేంద్రం ఇస్తుందా? లేక రాష్ట్రం ఖర్చు చేస్తుందా? ప్రైవేటు సంస్థలు వ్యయం చేస్తాయా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.ప్రైవేటు సంస్థలైతే ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. రైతులకు ఎలా ఉపయోగం కలుగుతుంది?అన్నదానిపై క్లారిటీ లేదు. రైతుల పొలాలను లీజుల పేరుతో తీసుకోవడానికి ఇందులో ఏమైనా ప్లాన్ ఉందేమో తెలియదు. రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్, నాణ్యత పెంపు, విస్తరణ తదితర కార్యక్రమాలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ప్రపంచ ఉద్యాన కేంద్రం అని, రాయలసీమ రైజింగ్ అంటూ ప్రచార ప్రకటనలు గుప్పించి ఈ సభ జరిపారు. రైతులకు జరిగే మేలు ఏమో కాని అడ్వర్టైజ్ మెంట్లకు భారీగానే ఖర్చు చేశారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎల్లో మీడియాలో అదరగొట్టే హెడింగ్‌లు వచ్చాయి.ఇదీ చదవండి: చంద్రబాబు ఒక్క విశాఖ గురించే ప్రార్దన చేశారా? అద్భుత ప్రస్తానానికి నాంది అని, రాయలసీమ తలరాత మార్చే ఉద్యాన హబ్ అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే ప్రపంచంలో ప్రతి మూలకు మన ఉద్యాన ఉత్పత్తులు అని ఆయన అంటున్నారు. నిజానికి ఇప్పటికే ఆయా ఉద్యాన ఉత్పత్తులు దేశ వ్యాప్తంగాను, ఇతర దేశాలకు రాయలసీమ నుంచి ఎగుమతి అవుతుంటాయి. ఇకపై కూడా ఎగుమతి అవుతాయి. ఆ క్రెడిట్ అంతా తమదేనని కూటమి పెద్దలు ప్రచారం చేసుకోవచ్చన్నమాట. ఇదంతా డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని, అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాలలో వ్యక్తం అవుతున్న అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఆడే గేమ్ ఇదన్నది రాయలసీమ ప్రాంతంలో బలపడుతున్న అభిప్రాయంగా కనిపిస్తుంది. లక్ష కోట్ల హబ్ కాదు.. లక్ష మోసాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా ప్రకటనలు చేస్తే రైతుల కడుపు నిండుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియవనుకున్నారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజంగానే అధికంగా అసత్యాలు చెబుతారన్న నానుడి ఉంది. వాటితో పాటు కొన్ని చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో పలచన అవుతున్నారన్న భావనకు అవకాశం ఇస్తున్నారు. పల్లె పండగ పేరుతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఒక సభ జరిగింది. అది నిజంగా పల్లె పండగ అవుతుందా, లేదా? అన్నది పక్కనబెడితే ఎవరు ఏ కాస్త అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినా మంచిదే. కాకపోతే గతంలో ఏమీ జరగనట్లు, ఇప్పుడే అన్ని జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తే సరిపోతుందా? మొత్తం వాగ్దానాలన్నీ నెరవేర్చేసినట్లు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేసినట్లు స్పీచ్‌లు ఇస్తే వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియకుండా పోతుందా? ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉపాధి అంతంత మాత్రంగానే ఉండడం తదితర అనేక సమస్యలతో గ్రామీణాంధ్ర కొట్టుమిట్టాడుతోంది.ముందుగా ఆయన చేసిన చిత్రమైన వ్యాఖ్యలు చూద్దాం. ఏపిలో ఎల్‌నినో ప్రభావం ఉందని చెబుతూనే తాము ప్రార్దన చేయడం వల్లే వరుణ దేవుడు కరుణించి విశాఖలో 27 సెంటిమీటర్ల వర్షం కురిపించాడట. వర్షాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటే వచ్చే చిక్కేమిటన్నది ఆయనకు అవసరం లేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అది మాట్లాడేసి జనాన్ని నమ్మించే యత్నం చేయడం ఆయనకు అలవాటే. బంగళాఖాతంలో వాయుగుండం వల్ల ఇటీవల ఉత్తరాంధ్రలో వర్షాలు పడ్డాయి. దానివల్ల రైతులకు కొంత మేలు, మరికొంత నష్టం జరిగింది. దానిని పక్కనబెడితే కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు విశాఖలో తాగు నీటి సమస్య ఉందని, ఈ ఏడాది తాము ఏమీ చేయలేమని, వచ్చే ఏడాదికి తీర్చుతామని చెప్పారు. దాంతో విశాఖ ప్రజలు తమ ఖర్మ ఇంతేనా అని సరిపెట్టుకున్నారు. అప్పుడే ఆ మాట చెప్పకుండా తాను ప్రార్దన చేయబోతున్నానని, వర్షాలు పడబోతున్నాయని చెప్పి ఉంటే.. వర్షాలు పడిన వెంటనే టీడీపీ మీడియా ఇక చంద్రబాబుకు దైవశక్తులు ఉన్నాయని ఊదరగొట్టేసి ఉండేదేమో! కాని అప్పటికి కరువు గురించే మాట్లాడారు.కరువుకు క్రెడిట్ తీసుకోరా?చంద్రబాబు ఒక్క విశాఖ గురించే ప్రార్దన చేశారా? లేక రాష్ట్రం అంతటా వర్షాలు పడాలని ప్రార్దించారా అన్నది పలువురి ప్రశ్న. చంద్రబాబు చెప్పేది నిజమే అయితే రాయలసీమలో వర్షాలు పడాలని ఎందుకు ప్రార్దనలు చేయలేదని వారు అడుగుతున్నారు. పలు చోట్ల చీని తోటలు ఎండిపోయాయి. వర్షాలు లేక పంటలే వేయలేకపోయారు. నెలల తరబడి కృష్ణా డెల్టాలో సరిపడా వర్షాలు లేక శివారు భూములకు నీరు సరిగా అందలేదు. ఆ సమయంలో చంద్రబాబు ఈ ప్రార్ధనలేవో చేసి వర్షాలు తెప్పించి ఉండాలి కదా! అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలా వర్షాలకు క్రెడిట్ తీసుకుంటే కరువుకు కూడా బాధ్యత వహించాలి అన్న సంగతి తెలియదా! ఈ నేపధ్యంలోనే చంద్రబాబు పాలనలో ఆయా సంవత్సరాలలో వచ్చిన కరువులను ప్రస్తావించి ఆ సమస్యను ప్రత్యర్దులు ఆయన ఖాతాలో వేస్తుంటారు.చంద్రబాబు ఈ స్పీచ్ ఇచ్చిన రోజే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపి, తెలంగాణలలోని కొన్ని ప్రాంతాలు కరువు పీడితంగా ఉన్నాయని ఢిల్లీలో తెలిపారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఏదో తాత్కాలిక రాజకీయం కోసం జనాన్ని సెంటిమెంట్ రాజకీయాలతో మభ్య పెట్టే బదులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడితే బాగుంటుంది. అందులోను ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యలతో ప్రజలలో పలచన అవవడం మంచిదా! ఎల్లో మీడియా కూడా ఈ వ్యాఖ్యలను ప్రచురిస్తే చంద్రబాబుకు నష్టం వస్తుందని అనుకున్నదేమో కాని, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది.ఇలాంటి మాటలు చెబితే ఎలా! ఇక 22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. గతంలో డావోస్ వెళ్లిన సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడితే అది జాతీయ మీడియాలో సైతం వైరల్ అయింది. ప్రసంగంలో పొరపాటు దొర్లితే సరిచేసుకోవచ్చు. కాని ఒకటికి రెండుసార్లు అవే తప్పులు చెబితే ప్రజలకు భిన్నమైన సంకేతం వెళుతుంది. పైగా 22 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ పచ్చి అబద్దాలను చెబితే జనం చెవిలో పూలు పెట్టడం కాదా! నిరుద్యోగ భృతి ఎగవేయడం కోసం ఇలాంటి మాటలు చెబితే ఎలా! పది లక్షల కోట్ల అప్పు తాము అధికారంలోకి వచ్చేనాటికి ఉందని మరో అబద్దం చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకున్నా, అందులో ఆయన ఏడేళ్ల పాలనలో ఎంత అప్పు చేసింది, జగన్ ఐదేళ్లలో ఎంత అప్పు అయింది వివరించకుండా, మొత్తం జగన్ ఖాతాలో వేయడంలోని దురుద్దేశాన్ని సామాన్యులు పసికట్టకపోవచ్చేమో కాని, బుద్ది జీవులు కనిపెట్టలేరా!ఆ పని ఎప్పటికి చేయలేరుకూటమి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిందట. టీడీపీ, జనసేన ఉమ్మడి మానిఫెస్టో కాపీని దగ్గరపెట్టుకుని వరసగా ఇచ్చిన హామీలు చదువుతూ ఈ మాట చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఉంటే ఒప్పుకోవచ్చు. కాని ఆ పని ఎప్పటికి వారు చేయలేరు. ఎందుకంటే ప్రజలను తాము మోసం చేస్తున్నామని వారికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా తన వంతు అసత్యాలు చెప్పారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో 880 కి.మీ.రోడ్లే వేశారని ఆయన అంటున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వం 7600 కిలోమీటర్ల రోడ్డు వేసిందని వైఎస్సార్సీపీ నేతలు జవాబు ఇస్తున్నారు.పవన్ ముద్ర కనబడుతోందట!అలాగే గ్రామాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి సంస్కరణలు తెచ్చి గ్రామాలకు అభివృద్ది రూపం ఇచ్చిన ఘనత జగన్ ది కాదనగలరా? బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తన ఉపన్యాసంలో గ్రామ సచివాలయాల ప్రస్తావన తెచ్చారు. అవి ఎవరి టైమ్‌లో వచ్చింది తెలియదా!. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు భలే పొగుడుకున్నారు. చంద్రబాబు తన స్పీచ్‌లో పల్లె వికాసంలో పవన్ కళ్యాణ్ ముద్ర కనబడుతోందని చెబుతున్నారు. పవన్ ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ది చేస్తున్నారట. లక్షకు పైగా పంట కుంటలు, పశువుల షెడ్లు, నీటి తొట్టెలు నిర్మించారట. పల్లెకు ఆయన హుషారుతో పట్టాభిషేకం చేస్తున్నారట.ఇదీ చదవండి: బాబు 'బీసీ' బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్‌ఫ్లాప్! ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబులో అద్బుతమైన ఆర్ధిక ప్రణాళిక ఉందని అంటున్నారు. సీఎంతో సహకారం అందిస్తున్నారని ఆయన అన్నారు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం అని చెప్పాలి. బాగా పనిచేస్తే దండ వేస్తామని, లేకుంటే దండిస్తామని చెప్పడం ద్వారా వారికి వార్నింగ్ ఇచ్చారన్నమాట. మరి కూటమి ఎన్నికల హామీల మాటేమిటని మాత్రం ఎవరూ అడగకూడదన్నమాట. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండగను కాంట్రాక్టర్ల పండుగగా అభివర్ణించారు. పాలకుల విధానాలే పల్లెలకు శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా పట్టాభిషేకం వంటి సినిమా డైలాగులు కాకుండా నిజంగా గ్రామాలకు మేలు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు.- కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నాటి చంద్రబాబు పాత్రలో నేడు లోకేష్.. పీఆర్ పీక్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు తన ప్రాధాన్యం కాదని ఆయన చెప్పారు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే పని చేస్తున్నానని ఆయన అన్నారని ఎల్లో మీడియా అత్యంత ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. ఇండియా టుడే మీడియా కేరళంలో నిర్వహించిన ఒక సదస్సులో సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.నిజంగా ఆయన అదే ప్రకారం పనిచేస్తే మంచిదే. కాని ప్రస్తుతం షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న భావన రాజకీయ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రజలలో కూడా ఏర్పడింది. ముఖ్యమంత్రి పదవిలో లేరన్న మాట మినహాయించి, ప్రభుత్వంలో లోకేష్‌కు తెలియకుండా ఏమి జరగవన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఇది ఏమైనా మంచి పనుల కోసం అయితే ఫర్వాలేదు. పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని రెడ్‌బుక్ పేరుతో ఏపీలో సాగుతున్న అరాచకాలన్నిటికి ఆయనే బాధ్యుడున్న విమర్శ వైఎస్సార్సీపీతో సహా వివిధ సంఘాలు చేస్తుంటాయి. ఇందులో చాలావరకు నిజం ఉందనిపించేలా ఆయన పార్టీ సమావేశాలలో వైఎస్సార్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టించడం గురించి రెడ్‌బుక్ పేజీలు అంటూ ప్రసంగిస్తుంటారు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని రెచ్చగొట్టేవారు. అధికారంలోకి వచ్చాక టీడీపీవారిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయించే పనిలో ఉన్నారు. ఎక్కడైనా అలా ఎత్తివేయకపోతే డీజీపీని పంపిస్తానని ముఖ్యమంత్రి మాదిరే ప్రకటనలు చేశారు. నిజానికి ఇదంతా సీఎం లేదా, హోం మంత్రి పరిధిలో ఉండే విషయం. అయినా పెత్తనం అంతా లోకేష్‌దే అన్నమాట.ఇక పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఎక్కడ ఉంటారో తెలియదు. కాని మొత్తం ఆ పరిశ్రమకు సంబంధించిన అంశాలన్నిటిపైన నిర్ణయాలు ఈయనే ప్రకటిస్తుంటారు. విదేశాలకు టూర్లు వెళుతుంటారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లినా పారిశ్రామికవేత్తలతో తాను చర్చలు జరుపుతానని ఆయనే ఈ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. 99 పైసలకే పరిశ్రమలకు భూములు ఇస్తా.. తన ఇష్టం అన్నట్లుగా కొంతకాలం క్రితం ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా అదే పరిస్థితి. లోకేష్ పేషీకి తెలియకుండా బిల్లులు పాస్ అవడం అరుదని చెబుతున్నారు.గత టరమ్‌లో టీడీపీ ప్రభుత్వంలో చెట్టు-నీరు స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేల కోట్ల అవినీతి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసింది. దాని ప్రకారం కొందరి బిల్లులు నిలిచిపోయాయి. ఈసారి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లులన్నీ క్లియర్ చేసుకుంటున్నారట. లోకేష్ ఏ బిల్లుల గురించి చెప్పారో కాని, ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. తాము ఇప్పటికే చాలావరకు బిల్లులు క్లియర్ చేశామని, మరో 200 కోట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో ఆర్దిక మంత్రి ప్రస్తావనను తెచ్చినప్పటికి అది నామమాత్రమే అన్నది తెలుస్తూనే ఉంది.ప్రభుత్వ విషయాలలోనే కాదు.. పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి హోదాలో కూడా ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు 15 శాతం సీట్లే ఇస్తామని స్పష్టం చేసింది కూడా ఆయనే. ఒకవైపు పార్టీపరంగా సమావేశాలు నిర్వహిస్తూ, మరో వైపు ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ, ఇంకో వైపు తన ఇమేజీని పెంచుకోవడం కోసం ఎల్లో మీడియాను, ఐటీడీపీ తదితర సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు.సాధారణంగా దేశస్థాయిలో జరిగే సదస్సులకు చంద్రబాబే వెళుతుండేవారు. కాని ఈ మధ్యకాలంలో ఢిల్లీ, లేదా ముంబై తదితర నగరాలలో జాతీయ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు లోకేషే హాజరవుతున్నారు. ఆయా సభలలో లోకేష్, చంద్రబాబులు పరస్పరం పొగుడుకోవడం, తండ్రికి బహిరంగ కార్యక్రమాలలో పాదాభివందనం చేస్తున్న ఘట్టాలు అందరు గమనిస్తున్నవే. ఇదంతా పీఆర్లో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు.ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?కాగా, డీఎస్సీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు యధా ప్రకారం తండ్రి మాదిరి అసత్యాలు చెప్పడానికి ఆయన పెద్దగా ఫీల్ అవలేదు. ఎన్నికల కమిషన్‌పై వచ్చిన విమర్శలకు కూడా ఆయన ఇచ్చిన జవాబు తన తండ్రికే వర్తిస్తుందన్న సంగతి ఆయన గమనించనట్లే వ్యవహరించారు. గతంలో ఓటమి ఎదురైనప్పుడు ఈసీపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేసింది తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే తనకు సీఎం పదవి ఇప్పుడు ప్రాధాన్యం కాదని ఆయన చెప్పడాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే సీఎం పదవిలో లేరన్నమాటే కాని, మొత్తం అధికారం అంతా ఆయన చేతిలోనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఆయన ఆఫీస్ వద్దే జనం ఎక్కువగా కనిపిస్తారట.2014 టరమ్‌లో లోకేష్ ఎన్నికలలో పోటీచేయలేదు. కాని పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలానికి చంద్రబాబుపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చి లోకేష్‌ను ఎమ్మెల్సీ చేసి, ఆ తర్వాత మంత్రిగా చేయించారని అంటారు. అప్పట్లో షాడో ముఖ్యమంత్రి అన్న విమర్శ రాలేదు. ఆ తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టి జనంలో తిరగడానికి కృషి చేశారు. వాటిలో యువగళం ఒకటి.2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం చంద్రబాబు ప్రధానంగా పర్యటనలు, ఉపన్యాసాలకే పరిమితం అవుతుంటే, లోకేష్ కథ నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా చంద్రబాబుతో దాదాపు సమానంగా సానుకూల కథనాలు అనండి.. భజన స్టోరీలు అనండి.. నిత్యం ఇస్తుంటాయి. లోకేష్‌ను సీఎం చేయాలన్న వాదన కుటుంబంలోను, ఆయన మద్దతుదారులలో బలంగా ఉన్నప్పటికి, వివిధ కారణాల రీత్యా అది జరగడం లేదన్న అభిప్రాయం ఉంది.ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సానుకూలత వ్యక్తం చేయవలసి ఉందని అంటారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను అన్న అని లోకేష్ సంభోధించడమే కాక, సభలలో వారిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నిస్తున్నారు. పవన్ ఈయనను ఓరే అన్నంత చనువు ఉన్నంతగా ఆ మధ్య చెప్పారు. కాని పవన్ అసలు ఎవరిని ఓరేయ్, అరేయ్ అనరని ఆయన మద్దతుదారులు చెబుతూ లోకేష్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది వేరే కథ. బహుశా తను సీఎం పదవి తీసుకున్నా పవన్ సహకారం అవసరమన్న భావనతో ఆయనతో సలహా, సంప్రదింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయం కల్పించడం లోకేష్ లక్ష్యం కావచ్చు. కాని, పవన్‌కు తెలియకుండానే ప్రభుత్వంలోని అనేక విషయాలు జరుగుతుంటాయి. డీఎస్సీకి అక్రమాల ఆరోపణలపై పవన్ ఇంతవరకు ప్రత్యక్షంగా లోకేష్‌కు మద్దతుగా ఖండన ఇవ్వకపోవడం కూడా గమనించదగిందే.ఇక్కడ మరో విషయం గుర్తు చేయాలి. 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిని రెండేళ్లపాటు పవన్ కళ్యాణ్‌కు కూడా ఇవ్వాలని జనసేనలో కొందరు ప్రచారం చేశారు. కాని మొహమాటం లేకుండా అది కుదిరే పని కాదని లోకేష్ మీడియా ముందు ఆ రోజుల్లోనే కుండబద్దలు కొట్టారు. బహుశా ఆ అవకాశం పవన్‌కు వస్తే తన భవిష్యత్తుకు అడ్డంకి అవుతుందని అనుకొని ఉండవచ్చు. అంతేకాక పవన్‌కు డిప్యూటి సీఎం పదవిపై కూడా టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. అయినా పవన్ దానిపై పెద్దగా ఫీల్ కాకుండా సర్దుకుపోయారు. ఇప్పుడు పవన్ ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో బయటపడడం లేదు. లోకేష్ తనకు సీఎం పదవి ప్రాధాన్యం కాదని అన్నారే తప్ప, ఈ టరమ్ అంతా చంద్రబాబే సీఎంగా ఉంటారని, వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్ధి కూడా ఆయనే అని లోకేష్ స్పష్టంగా చెప్పకపోవడం గమనించదగ్గ అంశమే.2029 ఎన్నికలలో లోకేష్‌నే సీఎం అభ్యర్ధిగా ఫోకస్ చేస్తారా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతకాలం క్రితం లోకేష్ సీఎం కాబోతున్నారంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. కాని అది జరగలేదు. ఉమ్మడి ఏపీ, విభజిత ఏపీలలో ఒక వైఎస్ జగన్ తప్ప మరే సీఎం కుమారుడు, లేదా కుమార్తె ముఖ్యమంత్రులు కాలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం కోసం లోకేష్ ఎదురుచూస్తుండవచ్చు.1986 ప్రాంతంలో ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణను వారసుడుగా ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కాని ఆ తర్వాత అతనిలో ఉన్న పొటెన్షియాల్టిని గమనించి, లోకేష్ భవిష్యత్తుకు ఆటంకం అవుతాడని సందేహించి ఆయనను పక్కన పెట్టేశారని చెబుతారు. ఒకప్పుడు ఎన్టీఆర్ వద్ద కర్షక పరిషత్ చైర్మన్‌గా ఉంటూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు లోకేష్ ఆ పాత్ర పోషిస్తున్నారు.లోకేష్ తన కుమారుడు కనుక వారసత్వ, కుటుంబ రాజకీయాల సమస్య, విమర్శలు రావని చంద్రబాబు భావిస్తుండవచ్చు. అందుకే పార్టీలోను, ప్రజలలోను లోకేష్ పట్ల సానుకూలత పెంచేందుకు వివిధ ప్లాన్లు అమలు చేసున్నారనుకోవచ్చు. కాలచక్రం అలా ఉంటుందన్నమాట. కాకపోతే లోకేష్ పాజిటివ్ కోణం కన్నా, నెగిటివ్ ధోరణిలోనే ఎక్కువగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. లోకేష్ కోరిక ఈ టరమ్‌లో తీరుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే. మనసులో ఎంత బలమైన కోర్కె ఉన్నా కొంత కాలం అణచుకోక తప్పదు కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?
దేశంలోని ఎన్డీఏ రాష్ట్రాలలో ఉమ్మడి పౌర స్మృతి(యూనిఫాం సివిల్ కోడ్)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం కొత్త వివాదం అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీ(యు) ఈ ప్రతిపాదనకు ఓకే చేస్తున్నా, బిహారులో మాత్రం అమలు చేయరాదని డిమాండ్ చేస్తోంది. అలాగే మరికొన్ని ఎన్డీఏ పక్షాలు కూడా ఈ ప్రతిపాదనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అమిత్ షా ప్రకటనతో ఇబ్బందిలో పడిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడానికే సిద్దపడుతున్నట్లు కనబడుతోంది.ఒకప్పుడు తలాఖ్ చట్టాన్నే వ్యతిరేకించిన టీడీపీ, ఇప్పుడు యూసీసీకి మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు దీనిపై నేరుగా వ్యాఖ్య చేయనప్పటికీ , ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చాలా స్పష్టంగా అమిత్ షా ప్రకటన మేరకు నడుచుకుంటామని తెలిపారు. నిజానికి దేశం అంతటికి కలిపి పార్లమెంటులో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) బిల్లు పెట్టవలసి ఉంటుంది. కాని బీజేపీ అందుకు సిద్దపడడం లేదు. రాష్ట్రాలవారీగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ఉంది.ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడంలో తప్పేముంది? దేశంలో ఉన్న పౌరులందరికి సమానమైన నియమ, నిబంధనలు పెట్టడం మంచిదే కదా అన్న అభిప్రాయం కలగడం సహజమే. ప్రత్యేకించి వ్యక్తిగత విషయాలైన పెళ్లి, విడాకులు, ఆస్తుల వారసత్వం తదితర అంశాలలో యూసీసీ తీసుకువస్తామని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెబుతోంది. 2014 నుంచి బీజేపీ పూర్తి మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కూడా వివిధ కారణాలతో ఈ ప్రతిపాదనను అమలు చేయలేకపోయింది. అయితే గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ యూసీసీని అమలు చేయడం ఆరంభించింది. ఇందులో ఉన్న అంశాలలో ప్రజలకు మేలు చేసేవి అయితే స్వాగతించవలసిందే. ఉదాహరణకు ఆయా విషయాలలో అన్ని మతాలలోని మహిళలకు సమానత్వం కల్పించడం మంచిదే. కాని ఇది అన్ని మతాలలో ఒకే విధంగా ఉండాలి. కేవలం ఒక మతాన్ని ఉద్దేశించి ఈ చట్టం తెస్తున్నారన్న భావన కలగనివ్వరాదు.బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సీఎఎ, త్రిబుల్ తలాఖ్ తదితర చట్టాలను తెచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది రాలేదు. ప్రత్యేకించి త్రిబుల్ తలాఖ్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని చాలామంది భావించారు. కాని ముస్లిం సమాజంలో కొంతమంది వ్యతిరేకించారు. బీజేపీ హిందూ మతాన్ని ఏకీకృతం చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నిస్తోందన్నది కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాల విమర్శ. అయినప్పటికీ, బీజేపీ చిత్తశుద్దితో అందరిని సమానంగా చూసే చట్టాలు తెస్తే తప్పు లేదు. కాని అనేక మతపరమైన విషయాలలో బీజేపీ అనుసరిస్తున్న విధానం అంత సమర్ధనీయంగా లేదన్నది బుద్దిజీవుల భావన.గోవాలో అమలు చేస్తున్న యూసీసీపై పలువురు తమ అసమ్మతి తెలియచేస్తున్నారు. అందులో పురుషాధిక్యతను చాటే విధంగా నిబంధనలు రూపొందించారన్నది ఆరోపణ. అలాగే వివిధ మతాలలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాటిని గౌరవించకపోతే సమాజంలో అశాంతి ప్రబలే ప్రమాదం ఉంటుంది. అన్ని మతాలవారిని ఒప్పించి ఇలాంటివాటిని తేగలిగితే బాగుంటుంది. కాని అది అంత తేలిక కాదు. ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ చేసిన యూసీసీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఈ యూసీసీని అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక దానిని అమలు చేయరు.పైగా మైనార్టీలు అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో వారి మనోభావాలు దెబ్బతింటాయని కాంగ్రెస్ భావిస్తుంది. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితి కొనసాగవచ్చు. బీజేపీ కనుక పవర్లోకి వస్తే అప్పుడు యూసీసీ అమలు ప్రతిపాదన ముందుకు రావచ్చు. అయితే అంతకుముందు ఎన్నికల మానిఫెస్టోలో ఈ అంశం చేర్చుతారా? లేదా? అన్నది చెప్పలేం.ఇక ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వానికి ఈ అంశం ఇబ్బంది కలిగించేదే. బీజేపీతో స్నేహం తప్పనిసరి కనుక కేంద్రంలోని ఆ పార్టీ నాయకత్వం చెప్పినట్లు తెలుగుదేశం, జనసేన కూడా వినకతప్పదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన గత ఐదేళ్లుగా బీజేపీ విధానాలకు వంతపాడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎటువచ్చి తెలుగుదేశం పార్టీకే కొంత సమస్య అవుతుంది. ఒకప్పుడు ఈ విషయంలో బీజేపీపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ తెచ్చిన త్రిబుల్ తలాఖ్ చట్టాన్నే ఈయన వ్యతిరేకించారు. 2019లో బీజేపీ మళ్లీ గెలిస్తే ముస్లింలకు రక్షణ ఉండదని విమర్శించేవారు. కాని ఆ తర్వాత పరిణామాలలో 2024లో అధికారంలోకి రావడానికి బిజెపి అవసరం తప్పనిసరి అని గుర్తించి మెల్లగా ప్లాన్ మార్చేసుకున్నారు. ఎలాగైతేనేం మళ్లీ అధికారంలోకి రాగలిగారు. తదుపరి ప్రధాని మోదీని విపరీతంగా పొగడడం ఆరంభించారు. బీజేపీకన్నా తాము మతవాదంలో తక్కువేం కాదన్న చందంగా వ్యవహరించడం ఆరంభించారు.ఇదీ చదవండి: బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, ముస్లింల హక్కులకు భంగం కలిగితే ఒప్పుకోబోమని అనేవారు. కాని ఇప్పుడు ఆ మాట కూడా అనలేని పరిస్థితి ఏర్పడినట్లు ఉంది. యూసీసీని అంగీకరించబోమని గతంలో చంద్రబాబు అన్నారు. కాని పల్లా శ్రీనివాసరావు ప్రస్తుతం అమిత్ షా ప్రకటనను సమర్ధించడంతో టీడీపీ యూటర్న్ తీసుకున్నట్లయింది. దేశ సమైక్యతకోసం యూసీసీని బలపరుస్తామని ఆయన అన్నారు. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించారో చెప్పలేదు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో ఎంత బలహీనంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. బిహార్ వంటి రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయు, లోక్ జనశక్తి పార్టీలోని రెండు వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. కాని టీడీపీ ఏపీ అధ్యక్షుడు మాత్రం పూర్తిగా సరెండర్ అయిపోయిన విధంగా మద్దతు ప్రకటించారు. టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతానికి దీనిపై చర్చ జరగలేదని అన్నారు.వివిధ రాష్ట్రాలలో పలు రకాలు సంస్కృతులు ఉంటాయి. అలాగే ఆచారాలు ఉంటాయి. మతాలలోని అనాచారాలను సంస్కరించడం, మహిళలకు సమాన గౌరవం ఇవ్వడం వంటివి చేయడం స్వాగతించదగినవే. కాని బీజేపీ అధినేతలు ఆయా సందర్భాలలో మతాన్ని తమ రాజకీయం కోసం వాడుకుంటున్నారన్న విమర్శ ఎక్కువగా ఉంది. చివరికి ప్రధాని సైతం మత ఆధారిత ప్రసంగాలు చేస్తుంటారు. అందువల్లే వారి చిత్తశుద్దిపై సందేహాలు వస్తున్నాయి. కాకపోతే టీడీపీ వంటి పార్టీలు యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏపీలో ఈ ప్రతిపాదన అమలు చేస్తారో చెప్పలేం కాని, అదే జరిగితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటారు. ఏపీలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరిగి, తెలంగాణలో అమలు కాకపోతే ఒక విభిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు ‘బీసీ’ బిల్డప్.. కోర్టు తీర్పుతో అట్టర్ ఫ్లాప్!
అది మోసమని తెలుసు.. ప్రజలను మభ్య పెట్టడమని తెలుసు.. అయినా ఎందుకు కావాలని ప్రభుత్వంలోని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటారు? అదే రాజకీయం అన్నమాట. ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం డాక్టరేట్ సాధించిందని ఒప్పుకోవచ్చు.దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. దాని ప్రకారం ఏభై శాతం మించితే అవి చెల్లవు. అయినా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చెల్లని జీఓ ఒకటి ఇచ్చేసింది. ఆ తర్వాత టీడీపీ క్యాడర్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం వంటివి చేసేశారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని గొప్పలు పోయారు. జయహో బీసీ అంటూ ఊదరగొట్టారు. కాస్త బుద్ది జీవులు కాని, బీసీ సంఘాలవారు కాని ఇదేమి మోసం అని విస్తుపోయారు.ఏభై ఏళ్ల రాజకీయ సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు మరీ ఇంత ఓపెన్‌గా ప్రజలను తప్పుదారి పట్టించవచ్చా అని వారు బాధపడ్డారు. కాని చంద్రబాబు స్టైలే అది కదా అని అనుకున్నారు. ఈ జీఓలపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ రిజర్వేషన్ల జీఓలు చెల్లవని హైకోర్టు కొట్టివేసింది. ఏభై శాతం మించిన రిజర్వేషన్లను ఎలా సమర్ధించుకుంటారని హైకోర్టు ప్రశ్నిస్తే సరైన సమాధానం ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. రాజివ్ రంజన్ కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆ నివేదిక ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేష్లు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. పంచాయతీరాజ్ చట్టంలోనే వెసులుబాటు ఉందంటూ కొత్త వాదన తెచ్చి బీసీ వర్గాలను మాయచేయాలని కూడా అనుకున్నారు. ఎల్లో మీడియాలో బీసీలకు రిజర్వేషన్లు పెంచేసినట్లుగా హోరెత్తించారు. ఇవన్ని ఉట్టిదేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మాయ చేయడానికి డ్రామా ఆడిందన్న విషయం బట్టబయలైంది.నిజానికి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిజాయితీ ఉంటే, పార్లమెంటులో సంబంధిత చట్టం తీసుకురావడానికి కృషి చేసి ఉండాల్సింది. కేంద్రంలో టీడీపీ ఎంపీల బలంతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. ఇది బీసీలను వంచించడం కాదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గత జగన్ ప్రభుత్వం కూడా జీఓ ద్వారా యత్నించింది. దానిపై బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడు హైకోర్టుకు వెళ్లారు. దాంతో జీఓలను అప్పట్లో న్యాయ స్థానం కొట్టేసింది. ఆ మీదట ఏభై శాతం మించకుండా చట్టప్రకారం సుమారు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, పార్టీ పరంగా సుమారు ఏభై శాతం వరకు బీసీలకు టిక్కెట్లు ఇచ్చి జగన్ న్యాయం చేశారు.ఉదాహరణకు 69 శాతం మేయర్ పదవులను బీసీలకు ఇచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ రకంగా కొన్ని జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లకు గాను ఆరింటిని బీసీలకు వచ్చేలా చేశారు. 46 శాతం పదవులను బీసీవర్గాలకు కట్టబెట్టారన్నమాట. మండల పరిషత్, మున్సిపల్ చైర్ పర్సన్ల పదవులకు కూడా ఇలాగే ఏభై శాతం పైగా జగన్ బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు ఆ ప్రకారం ఇస్తామని చెప్పలేకపోతున్నారు.ఇదీ చదవండి: రేవంత్ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి గెలుపుకోసం ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రచారం ఆరంభించారు. మున్సిపాల్టీలలో 11 వేల కోట్ల రూపాయల పనులు, పల్లెలలో 11 వేల కోట్ల రూపాయల పనులు చేపడుతున్నట్లు హంగామా చేసి సభలు పెట్టారు. పల్లెకు పట్టాభషేకం, పేదలకు పట్టాభిషేకం అంటూ డైలాగులు చెబుతూ హోరెత్తించారు. స్థానిక ఎన్నికలలో కూటమికి తిరుగులేదని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు. బీసీలకు తాము న్యాయం చేయబోయామని కాని వైఎస్సార్సీపీ అడ్డుకుందని కూడా టీడీపీ ప్రచార వ్యూహం అమలు చేయవచ్చు. ఎందుకంటే అలవోకగా అబద్దాలు ఆడడంలో ఈ పార్టీ మంచి నైపుణ్యం సాధించిందన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు అసలు సమస్య కూటమికి ఎదురు అవుతుంది. ఆరు వారాలలో ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. అది సాధ్యం కాదని చెప్పి వాయిదా కోరితే తప్ప ఎన్నికలు ఆగకపోవచ్చు. అయితే టీడీపీ, జనసేనల మధ్య పోటీచేసే స్థానాలపై పంచాయతీ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని నాదెండ్ల మనోహర్ కాని ఒకసారి ఆత్మాభిమానం అంటూ, మరోసారి గెలుపు ప్రాతిపదిక అంటూ టీడీపీ లైన్లో మాట్లాడారు. తద్వారా కార్యకర్తలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కనీసం 30 శాతం సీట్లు అయినా జనసేనకు ఆయా పదవులకు పోటీచేసే అవకాశం కల్పించాలన్నది క్యాడర్ డిమాండ్. కాని పవన్ కళ్యాణ్ ఎంతవరకు న్యాయం చేస్తారో అన్న సంశయం వారికి లేకపోలేదు. అయినా ఏదో ఆశ వారిలో ఉంది.టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు నారా లోకేష్ ఇప్పటికే 15 శాతం సీట్లు జనసేనకు ఇస్తామని ప్రకటించారు. దానిని నేరుగా ఖండించే ధైర్యం జనసేనకు లేకపోయింది. కాకపోతే కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో వారి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసి సరిపెట్టుకున్నారు. 30 శాతం సీట్లు సాధించగలిగితే పవన్ కళ్యాణ్‌పై పార్టీలో నమ్మకం పెరుగుతుంది. లేదంటే పార్టీలో నిరాశ అలముకుంటుంది. అది వేరే సంగతి. ఒకవేళ 30 శాతం సీట్లు జనసేనకు, మరో ఐదు శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే టీడీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. బలం లేని జనసేన, బీజేపీలకు అన్ని సీట్లు ఇవ్వడం ఏమిటని టీడీపీ స్థానిక నేతలు తిరుగబడే అవకాశం ఉంటుంది. 30 శాతం కాకపోయినా, 15 శాతంతోనే జనసేనకు సరిపెట్టినా, సీట్ల కేటాయింపులో గడబిడలు కొంతమేర జరగవచ్చు.ఉదాహరణకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల మేయర్ పదవులను జనసేన కోరుతోందట. కాని వాటిని టీడీపీ తమకు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ పరిస్థితిలో సామాజికవర్గాల సమస్య కూడా టీడీపీ ఎదుర్కోవలసి ఉంటుంది. జగన్ మాదిరి బీసీ వర్గాలకు పార్టీపరంగా ఏభై శాతం సీట్లు ధైర్యంగా ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. ఈ సమస్యతో పాటు బీసీలకు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానం కూడా కూటమికి తలనొప్పిగా మారుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపైన, యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలు, సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ వారిని భయపెట్టి పోటీలో లేకుండా చేయడానికి కూడా యత్నించవచ్చు.అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ క్యాడర్‌కు, నేతలకు ధైర్యాన్ని ఇస్తూ అన్ని చోట్ల పోటీచేయాల్సిందేనని చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వపరంగా జనాన్ని పోగుచేస్తే తప్ప చంద్రబాబు మీటింగ్‌లు జరగడం కష్టంగా ఉంటే, జగన్ ఎక్కడకు వెళ్లినా వస్తున్న జన తరంగాలు కూటమిని కలవరపెడుతున్నాయి. వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే శాసనసభ ఎన్నికలలో మాదిరి ఏదైనా మాయ జరిగితే తప్ప స్థానిక ఎన్నికలు కూటమికి ఒక అగ్ని పరీక్షవంటివే అని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనంతట తాను కొన్ని అనవసర అంశాలను ప్రస్తావిస్తున్నారా? లేక సలహాదారులు , పీఆర్ టీమ్ రాసి ఇస్తున్న వాటిని పాలో అవుతున్నారో తెలియదు. కాని ఆయన చేస్తున్న ప్రసంగాలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని వ్యాఖ్యలు హేతుబద్దంగా కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో అస్సాం చెందిన ఒక మీడియా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒటర్ల జాబితా ప్రత్యేక సవరణను బ్రిటిష్ హయాం నాటి సైమన్ కమిషన్‌తో పోల్చారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ శ్రీరాముడు ఉత్తరాది దేవుడు, ఉన్నవారి దేవుడు, శివుడు దక్షిణాది దేవుడు అంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ముందు ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే బాగుంటుంది. అలాకాకపోతే ఆయన విమర్శలకు గురి అవుతారు. ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై , ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ అంశంలో అనుసరిస్తున్న విధానాలపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈసీలో జరిగిన పరిణామాలపై ఇచ్చిన సంచలన కధనంతో ఆ సంస్థ ఆత్మరక్షణలో పడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఆందోళనలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనలలో పాల్టొంటోంది. హైదరాబాద్ లో పీసీసీ అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు నిరసనలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణపై గత కొన్ని నెలలుగా రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో దీని పరిస్థితిపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈసీ పనితీరును ఉతికి ఆరేస్తున్నారు. దానికి ప్రతిగా బీజేపీ జవాబు ఇస్తోంది. ఇదంతా వేరే కధ. తాజాగా ఢిల్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు బహుశా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి చేశారా అన్న సందేహం కలుగుతుంది.ఆనాటి భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడానికి, రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడానికి సైమన్ కమిషన్ ఏర్పడింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ పై ఆందోళనకు పిలుపు ఇచ్చింది. సైమన్ కమిషన్ లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నది ఈ నిరసనకు ప్రధాన కారణం. దీనిని ప్రస్తుత భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్కు పోలిక ఏమిటో తెలియదు. ఓటర్ల జాబితా సవరణ లో వివక్ష జరుగుతోందని, విపక్షం అదికారంలో ఉన్న రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అవుతున్న వైనంపై పలు అభియోగాలు వచ్చాయి.అసలు చట్టం లేకుండానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం, ఓటర్ నమోదుకు అవసరమయ్యే ఫామ్ 6 లో పలు మార్పులు పార్లమెంటుతో సంబంధం లేకుండా చేయడం, ఓట్ల తొలగింపు ప్రక్రియను డిల్లీ లో కేంద్రీకృత విధానంలో చేయడం వంటివాటిపై అనుమానాలు వచ్చాయి. ఈ విషయాలను వివరించడం తప్పు కాదు.కాని తెలిసి,తెలియని రీతిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రసంగం చేస్తే అది ఆయనకు అంత ప్రతిష్టనివ్వదు. 13 కోట్ల ఓట్లను తొలగించిన వైనం, జనాభా పెరుగుతుంటే, ఓట్లు ఎలా తగ్గుతున్నాయని ప్రశ్నించడం వంటివి సమంజసమే. తమాషా అంశం ఏమిటంటే దేవుళ్లకు కూడా ఉత్తరాది, దక్షిణాది అని పేర్లు పెట్టడం. బహుశా దేశంలో ఏ రాజకీయ నేత ఇలాంటి విశ్లేషణ గతంలో చేసి ఉండరు.పైగా శివుడు పేదల దేవుడని, రాముడు సంపన్నుల దేవుడని ఆయన వర్గీకరించారు. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్,బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు తదితరులు దేవుళ్లను కూడా చీల్చుతారా? అని విమర్శిస్తూ కాంగ్రెస్ ది ఎప్పుడూ విభజించే విధానమే అని ధ్వజమెత్తారు.ఆ రకంగా బీజేపీకి ఈయన అవకాశం ఇచ్చినట్లయింది కదా! రేవంత్ చేసిన ఈ వాదనలో హేతుబద్దత కూడా కనిపించదు. నిజానికి ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా భక్తులు శ్రీరాముడు, శివుడులను కొలుస్తారు. శ్రీరామ నవమి వస్తే శ్రీరాముడిని, శివరాత్రి వస్తే శివుడికి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో రాముడి గుడి లేని గ్రామం ఉండదంటే ఆశ్యర్యం కాదు. అదే విధంగా శ్రీశైలంతో సహా పలు చోట్ల శివాలయాలు ఉంటాయి. భద్రాద్రిలో అదికారికంగా శ్రీరామనవమి చేస్తారు. ఎపీలో ఒంటిమింట, రామతీర్ధంలలో ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. ఉత్తరాదిలో శివాలయాలు పెద్ద ఎత్తునే కనిపిస్తాయి. ఉదాహరణకు వారణాసిలో ఉన్నది శివలింగమే కదా! కేదార్ నాద్, బదరీనాద్, అమరనాద్ వంటి ప్రముఖ క్షేత్రాలలో శివార్చనలు జరుగుతుంటాయి. అంతేకాదు.. లక్షల సంఖ్యలో ఉండే దేవుళ్లను ఆయా ప్రాంతాలలో ఆచారాలను బట్టి పూజిస్తారు. దీనికి ప్రాంతీయత ఆపాదించడం ఏమిటో! అయోధ్యలో రాముడికి బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్రహ్మండమైన రీతిలో గుడి కట్టించిన నేపధ్యంలో ఆయన సంపన్నుల దేవుడని అన్నారో, లేక బీజేపీ సంపన్నుల పార్టీ అని చెప్పడానికి ఈ ఉపమానం వాడారో తెలియదు కాని అంత అర్దవంతంగా కనిపించదు.ఇదీ చదవండి: గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?సాధారణంగా ఒక మాట చెబుతారు. విష్ణువు ధనికుడుగాను, శివుడు తిరిపమెత్తే దేవుడుగాను ప్రాచుర్యంలో ఉంటారు. బహుశా దానిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ అన్నారేమో కాని, దానిని సరిగా చెప్పలేకపోయారనిపిస్తుంది. ధనిక, పేద తేడా లేకుండా హిందూ భక్తులు అంతా ఈ దేవుళ్లను పూజిస్తుంటారు. బీజేపీ వారు హరహర మహాదేవ అనరని రేవంత్ వ్యాఖ్యానించగానే, ప్రధాని మోడీ శివరాత్రినాడు అవే పదాలు వాడుతూ ప్రార్దనలుచేసిన వీడియోలు వచ్చేశాయి. అంటే సి.ఎమ్. స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేస్తుంది. తన గురువు చంద్రబాబు మాదిరే ఏది పడితే అది మాట్లాడితే రేవంత్ కే నష్టం అని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయి. ప్రధాని మోడీ తెలంగాణతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా అన్యాయం చేస్తున్నారని, అంతా గుజరాత్ కే చేసుకుంటున్నారని రేవంత్ ఆరోపించడం విచిత్రమే. బీజేపీ పాలిత రాష్ట్రాల తరపున ఈయన వకల్తా తీసుకోవడం ఏమిటో తెలియదు. అందుకు ఏమైనా ఉదహరణలు ఇచ్చారా అంటే అదీ కనబడదు. తాను కాంగ్రెస్ లోకి ఎందుకు రావల్సి వచ్చింది తదితర విశేషాలు చెప్పారు. వాటిలో అభ్యంతరాలు ఏమి లేవు. సహజంగానే బీఆర్ఎస్ పైన, కేసీఆర్‌పైన విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఆంధ్రవాళ్ల పెత్తనంపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని రేవంత్ చెబుతున్నారు. మరి ఇప్పటికీ ఆయన ఆంధ్రా నాయకుడైన చంద్రబాబు నాయుడుకే శిష్యుడుగా ఉంటున్నారన్న విమర్శ ఎందుకు వస్తోంది? టీడీపీ ఎంపీ ఒకరు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డా, అలాగే మరో ఎంపీ కుమారుడు చేసిన కారు ప్రమాదంలో ఒక మహిళ మరణించినా అరెస్టు చేయకపోవడం, ఏపీకి చెందిన కొందరు నేతలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా చట్టాన్ని అమలు చేయకుండా, చూసిచూడనట్లు పోవడం వంటివాటిని గమనిస్తే ఇంకా వారి పెత్తనానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గి పనిచేస్తున్నదన్న భావన కలగదా! ఏది ఏమైనా రేవంత్ జాతీయ స్థాయిలో ప్రొజెక్టు కావాలన్న ఆలోచనలో తప్పు లేదు. కాని ఆ క్రమంలో చేసే ప్రసంగాలు, వ్యాఖ్యల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గతాన్ని మరిచిన బాబు.. ఈసీపై డబుల్ టాక్!?
రాజకీయ ప్రయోజనాలకోసం ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయడం విచారకరం.. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్య.2019లో చంద్రబాబే చేసిన ఇంకో వ్యాఖ్యను గమనించండి. మోదీ దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలను ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో వ్యవస్థల స్వతంత్రత, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయి. సీబీఐ మొదలు ఆర్బీఐ వరకు... ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను కూడా వదలిపెట్టడం లేదు.ఈ రెండు వ్యాఖ్యలను చదివితే ఏమనిపిస్తుంది? చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నేతల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటోందా? లేక బలపడుతోందా? అన్న భావన కలగదా! తాను అధికారంలో ఉంటే అంతా సజావుగా ఉన్నట్లు, అధికారంలో లేకపోతే వ్యవస్థలన్నీ పాడైనట్లు జనం అనుకోవాలన్నమాట. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్ నియమితులైనప్పటి నుంచి వివాదాలు మరీ తీవ్రమైనట్లు అనిపిస్తుంది. గతంలో కూడా కొందరు సీఈసీలపై విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి వచ్చినవి తీవ్రమైన అభియోగాలు.గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడించారంటే అతిశయోక్తి కాదు. కాస్త దుందుడుకు అన్న విమర్శ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలు ఎన్నికల అక్రమాలకు పాల్పడాలంటే, అదికారులు రాజకీయ నేతలకు సహకరించాలంటే భయపడే పరిస్థితిని తెచ్చారు. చివరికి గోడలపై ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకునేవారు. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విబేధాలు రావడంతో, ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా మార్చారు. ఆయన తనకు సన్నిహితుడైన జీవీజీ కృష్ణమూర్తిని నియమించారని అంటారు. శేషన్‌కు చెక్ పెట్టడానికి ఈ ఏర్పాటు జరిగిందన్న భావన అప్పట్లో ఉండేది. ఆనాటి నుంచి త్రిసభ్య కమిషనే కొనసాగుతోంది. కొన్నిసార్లు విమర్శలు వచ్చేవి.కేంద్రంలో శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కొందరు ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఘట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధానిగా, బీజేపీ అదికారంలోకి వచ్చాక కొన్ని ఇలాంటివి జరిగాయి. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఒకరి కుటుంబ సభ్యులపై ఈడీని ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎంపిక కమిటీలో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బదులుగా కేంద్ర మంత్రిని ఒకరిని నామినేట్ చేసే పద్దతిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. లోక్‌సభలో విపక్ష నేతకు ఇందులో స్థానం ఉన్నా ఆ పాత్రను నామమాత్రం చేశారన్నమాట.గత 2024 ఎన్నికలకు ముందు జ్ఞానేశ్‌కుమార్‌ను ఎంపిక చేసుకున్న వైనం, అంతకుముందు కేంద్రంలో ఈయన కీలక పాత్ర పోషించిన తీరు, గతంలో కేరళలో పనిచేసినప్పుడు వచ్చిన విమర్శలు, ప్రధాని, హోం మంత్రులకు ఈయన సన్నిహితుడన్న ప్రచార నేపథ్యం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే ఆయా వర్గాలకు అనుమానాలు కలుగుతాయి. దానికి తోడు పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో 2024 ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై ఎన్నో సంశయాలు వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షల ఓట్ల తొలగింపు, లేదా పెండింగులో పెట్టడం, పోలింగ్ జరిగేనాటికి కూడా ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిష్కరించకపోవడం, ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు, అర్ధరాత్రి దాటిన తర్వాత లక్షల ఓట్లు పోలైనట్లు చూపించడం, వీటిపై ఆధార సహితంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వంటివి ఎన్నికల సంఘంలో పారదర్శత లేదన్న అభిప్రాయం కలిగించింది.కొన్ని ఉదాహరణలు చూడండి.. పశ్చిమబెంగాల్లో 27 లక్షల ఓట్లను పెండింగ్‌లో ఉంచారట. వాటి సంగతి తేల్చకుండా ఎన్నికలు పూర్తి చేయడంలో ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వాటిని పరిశీలిస్తుంటే 97 శాతం ఓట్లు నిజమైనవేనని తేలుతోందట. ఏపిలో సాయంత్రం ఆరు తర్వాత ఏభై లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? అందులోను అర్దరాత్రి 12 గంటల నుంచి రెండుగంటల వరకు 17 లక్షల ఓట్లు ఎలా పోల్ అయ్యాయన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎన్నికల సంఘం మౌనముద్ర దాల్చింది. వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసినా కిమ్మనలేదు. పరకాల ప్రభాకర్ వంటి వారు పరిశోధన చేసి సదస్సులు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నా, జవాబు ఇవ్వడం లేదు. ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేస్తారా అని కూడా అడగలేకపోయింది.ఇదీ చదవండి: బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?విశేషం ఏమిటంటే 2009లో కాని, 2019లో కాని ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ పైన, ఈవీఎంల పైన తీవ్ర విమర్శలు చేసి, అవి మానిప్యులేషన్‌కు గురి అవుతున్నాయని ఆరోపించారు. నిజానికి అప్పట్లో ఈవీఎంలపై ఈ స్థాయిలో సందేహాలు రాలేదు. అయినా వాటి ద్వారా అక్రమాలు చేయవచ్చని ఆయన అనేవారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా విమర్శలు చేయరాదని సుద్దులు చెబుతున్నారు. 2019లో ఆనాటి ప్రధాని మోదీపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది ఆయన ట్వీట్లే తెలియచేస్తాయి. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేశారని కూడా ఆనాడు ఆరోపించారు. ఇప్పుడేమో ఇలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అవే ఆయన తెలివితేటలు.చంద్రబాబు వ్యూహాత్మకంగా, ఎలాగొలా బతిమలాడి 2024 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల కమిషన్ పూర్తిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆనాటి బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమకు ఏ ఏ అధికారి కావాలో చెబుతూ జాబితాను సమర్పిస్తే, చాలావరకు ఎన్నికల సంఘం అమలు చేసిందని చెబుతారు. సీసీ టీవీ ఫుటేజీ ఒకసారి లీక్ అయింది. దానిని టీడీపీ ప్రచారం చేసింది. అయినా అదెలా జరిగిందని ఈసీ అడగలేదు. ఎన్నికలయ్యాక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్దిష్ట గడువుతో సంబందం లేకుండా వివిపాట్ స్లిప్‌లను దగ్దం చేసేయడం పలు సందేహాలకు అవకాశం ఇచ్చింది.కొందరు వైఎస్సార్సీపీ నేతలు కొన్ని బూత్‌లలో ఓట్లను తిరిగి లెక్క వేయాలని కోరుతూ దరఖాస్తు చేసినా అందుకు ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దపడలేదు. దీనిపై న్యాయవ్యవస్థ వద్దకు వెళ్లినా ప్రయోజనం కలగకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వ్యవస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయేమిటా అని చాలామంది బాధపడ్డారు. కాని జరగవలసిన డామేజీ జరిగిపోయింది.ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎన్నికల కమిషన్‌లో జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం చెప్పిన విధానం.. అన్నిటిని జర్నలిస్టు రితిక చోప్రా వెలుగులోకి తీసుకువచ్చిన కథనం సంచలనం అయింది. ఇందుకు ఆమె చేసిన కృషిని అంతా అభినందించాలి. ఎన్నికల కమిషన్‌లోని డొల్లతనం అంతా వెలుగులోకి వచ్చింది. అసలు ఇలా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు చట్టంలో ఎక్కడా అవకాశం లేదని, మాజీ ఎన్నికల ముఖ్య కమిషన్ ఖురేషి వెల్లడించారు. అయినా జ్ఞానేశ్‌కుమార్ ఎలా చేశారంటే ఏమి చెబుతాం. కేవలం బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల కోసమే పనిచేస్తున్నారని, విపక్ష పార్టీల వాదనలను పెడచెవిన పెడుతున్నారన్న భావన కలిగితే వ్యవస్థకు ఎంత నష్టం. ఎవరు ఫిర్యాదు చేసినా అందులోని వాస్తవాలను విచారించి న్యాయం ఏమిటో తేల్చవలసిన ఎన్నికల వ్యవస్థే ఏకపక్షంగా మారితే ఎన్నికలు జరిగి ఏమి ఉపయోగం? ఇదంతా నియంతృత్వానికి దారితీయదా? అందువల్లే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది.జ్ఞానేశ్ రాజీనామాకు విపక్షంలోని కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, సమాజవాది, తదితర పార్టీలతో పాటు యువతకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంపై పునఃసమీక్ష జరగాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. గతంలో తాము మద్దతు ఇచ్చినప్పటికీ, జరిగిన పరిణామాల రీత్యా దీనిలో మార్పు రావాలని ఆయన కోరారు. ఈ అంశంపై కొన్ని బీజేపీ మిత్రపక్షాలు కూడా జాగ్రత్తగా స్పందించాయి. వాటిలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈసీ వివరణ ఇవ్వాలని తొలుత సూచించారు. దానికి టీడీపీ అధినాయకత్వం కంగారుపడినట్లు ఉంది. తదుపరి ఈసి ఇచ్చిన వివరణ అంత సంతృప్లిగా లేనప్పటికీ, చంద్రబాబు నాయుడు బీజేపీకి కోపం రాకుండా వెంటనే స్పందించారు.ఇంతకాలం ఏపిలో జరిగిన ఎన్నికల ప్రహసనంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడని చంద్రబాబు దీనిపై మాట్లాడుతూ వ్యవస్థల విశ్వసనీయత గురించి ధర్మోపదేశం చేశారు. ఏపిలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అవకతవకలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం జరగలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివి లేకుండా ఓటర్ల జాబితాలను తయారు చేయాలన్న చిత్తశుద్ది ఉంటే, ఆధార్ కార్డుకు లింక్ పెట్టి ఓట్లను ఖరారు చేస్తే సరిపోతుందని ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. అది చేయకుండా ఎన్నో విన్యాసాలను ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ చేస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా కుదురుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబుకు సోషల్ మీడియా భయం.. కరపత్రాల ప్రచారం తగ్గిందా?
ఏపీ ప్రభుత్వం ప్రచారం విషయంలో వెనుకడుగు వేయడం లేదు. కొత్తగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారికి ప్రభుత్వం పరోక్ష వేతనం చెల్లించడానికి రెడీ అయింది. ఇది ఒకరకంగా పరీక్ష లేకుండానే క్రీడా కోటాలో కొందరికి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన చందంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, ఇప్పటికే తనకు అనుకూలంగా పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం ప్రధాన మీడియాకాని, వందల సంఖ్యలో ఉన్న యూట్యూబ్ చానళ్లు తమ ప్రచారానికి సరిపోవడం లేదని అనుకుంటోందా? లేక వాటిని జనం నమ్మడం లేదన్న అభిప్రాయానికి వచ్చిందా అన్నది తెలియదు కాని, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో అంటే ప్రభావశీలురతో కంటెంటె పెట్టిస్తారట. దానికి భారీగా చెల్లింపులు చేస్తారట.కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికి నాలుగువేల రూపాయల చొప్పున మంజూరు చేయడానికి డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉద్యోగుల జీతాలకే ప్రభుత్వ ఆదాయంలో 94-98 శాతం ఖర్చు అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు. సంపద సృష్టించే మార్గాలు కనబడడం లేదని, ఐడియాలు ఉంటే ఇవ్వండని ప్రజలనే ఆయన సలహా కోరారు. అవన్ని వాస్తవమా? కాదా? అన్నది మనం చెప్పలేం.కాని, చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సోషల్ మీడియాలో కూటమి సర్కార్ పక్షాన, చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ల పక్షాన ప్రచారం చేయడానికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు ఇస్తారట. ప్రభుత్వం ఇచ్చే కంటెంట్ పోస్టు చేస్తే ఒక రేటు, స్వయంగా తయారు చేసే కంటెంట్‌కు మరో రేటు ఉంటుందట. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్ పోస్టింగ్‌లకు కేటగిరిని బట్టి 500 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇస్తారట. ఆడియో, వీడియో పోస్టింగ్లకైతే 750 నుంచి రెండువేల రూపాయల వరకు ఇస్తారట. సొంతంగా తయారు చేసే వీడియోలకు గాను క్రియేటర్స్‌కు 2500 నుంచి ఇరవైవేల వరకు చెల్లిస్తారట. దీనికి ఏవో కండిషన్లు అని చెప్పినా, చివరికి ఏమి జరుగుతుందో ఊహించుకోవచ్చు.ఎన్నివేల మందిని ఇందుకోసం వినియోగించుకుంటారో, ఎంత బడ్జెట్ కేటాయిస్తారో వెల్లడించలేదు. హిమచల్ ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లలో వివిధ పద్దతులలో ఇలాంటి స్కీములను అమలు చేస్తున్నారట. యూపీలో ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ పారంలకు నేరుగా డబ్బులు ఇస్తారట. వీటిని కాపీ చేసి ఏపీ ప్రభుత్వం వీటిని అమలు చేస్తోందన్నమాట. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్‌తో ప్రభుత్వ ప్రచారం చేస్తుంటుంది. అందులో కూడా కంటెంట్ తయారు చేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదతర మీడియా సంస్థలకు ప్రచార ప్రకటన రూపంలో, ఇతరత్రా భారీగానే లబ్ది చేకూర్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారు మరీ ఏకపక్షంగా టీడీపీ కరపత్రాలుగా ప్రచారం చేస్తుండడంతో ప్రజలలో విశ్వసనీయత తగ్గిపోతోంది.ఈ నేపథ్యంలో ఈ కొత్త ఐడియాను తీసుకువచ్చి ప్రజాధనాన్ని వెచ్చించబోతున్నారన్నమాట. నిజంగానే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైనా పోస్టు చేస్తే ఫర్వాలేదు. ప్రభుత్వం ఇచ్చే గ్రాఫిక్స్, వీడియోలు అంటే కేవలం ప్రభుత్వ నేతల ప్రచారమే అత్యధికశాతం ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. దానికి తోడు ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లూయేన్సర్లు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో వచ్చే విషయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నమాట. అలాగే ఇండిపెండెంట్‌గా పనిచేసే యూట్యూబర్లు వెలికితీసే వాస్తవాలను ఖండించాలన్నమాట. వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లే పనిలో నేర్పరితనం ప్రదర్శించాలన్నమాట. డైవర్షన్ రాజకీయాలలో భాగస్వాములవ్వాలన్నమాట.ఇదీ చదవండి: దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్? ఉదాహరణకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధారాలు చూపుతున్నప్పుడు అవేవి సరికావన్నట్లుగా ప్రచారం చేయాలి. ఇలాంటి డైవర్షన్ విషయాలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు ఉండకపోవచ్చు. డీఎస్సీ స్కామ్‌పై నిరసన చెప్పడానికి వెళ్లిన వైఎస్సార్సీపీవారిపై దాడి చేసింది టీడీపీవారు లేదా టీడీపీ యువగళం టీమ్ అన్నది బహిరంగ రహస్యమే. వారే ఈ విషయం చెప్పుకున్నారు. కాని వ్యూహాత్మకంగా గురువులపై వైఎస్సార్సీపీ దాడి అని చంద్రబాబే ప్రచారం ఆరంభించారు. అది నిజం కాదని ఆయనకు తెలుసు. పోలీసులకు తెలుసు. లేదా రెండు వైపులా ఏమైనా గొడవ జరిగితే ఇరుపక్షాలకు చెందినవారిమీద కేసులు పెట్టవచ్చు.అదేమి కాకుండా వైఎస్సార్సీపీపైన ఎంత వీలైతే అంత బురద చల్లడం, జగన్‌పై పిచ్చి, పిచ్చి ఆరోపణలు చేయడంతో అసలు స్కామ్‌ను దారి మళ్లించాలన్నది వారి వ్యూహమన్నమాట. దీనికోసం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఎంత బాగా పనిచేసి అంతగా వ్యూస్ సంపాదిస్తే వారికి అంతగా డబ్బు వస్తుందన్నమాట. ఇదంతా టీడీపీ తరపున ఇప్పటికే పనిచేస్తున్నవారికి డబ్బులు ఇవ్వడానికే ఈ స్కీమ్ తెచ్చారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. డీఎస్సీలో పరీక్షలు లేకుండా టీచర్ ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చి అప్రతిష్ట తెచ్చుకున్న నేపథ్యంలో ఈ స్కీమ్ ప్రకారం తమకు కావల్సిన వారికి ప్రభుత్వం డబ్బు ఇష్టారీతిన వెచ్చించే అవకాశం ఉండవచ్చన్నది కొందరి అనుమానం.ఒకవైపు ఇలా జనం డబ్బుతో వారినే మభ్య పెట్టడానికో, నమ్మించడానికో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, మరో వైపు పోలీసుల ద్వారా తమకు వ్యతిరేకంగా స్కామ్‌లను బయటపెడుతున్న సోషల్ మీడయాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో చివరికి అమెరికాకు చెందిన పోలీస్ వ్యవస్థ ఎఫ్‌బీఐ పేరుతో కూడా నకిలీ ఫిర్యాదులు చేయడానికి ఏపీ పోలీసు వ్యవస్థ సిగ్గుపడకపోవడం దారుణంగా ఉంటుంది.ఎవరైనా వేరే సంస్థ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టే పోలీసులే స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు నకిలీ ఫిర్యాదులు చేయడం ఏమిటి? తద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వాస్తవ పోస్టులను తొలగించేలా చూడడం ఏమిటి? ఏపీలో పోలీసు వ్యవస్థ ఎంతసేపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడం, వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం, వారి అక్కౌంట్లను మూసివేయించడం పనిలోనే బిజీగా ఉంటున్నట్లు కనిపిస్తుంది.ఎక్స్‌లో 150 ఖాతాలు తొలగింపచేశారట. సుమారు 800 పోస్టులు తొలగించారట. చివరికి జడ శ్రవణ్ వంటివారు మీడియా సమావేశాలలో చేసే విమర్శల వీడియోలు కొన్నిటిని సైతం ఇండియాలో కనబడకుండా చేస్తున్నారంటే ప్రభుత్వం సోషల్ మీడియాకు ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కొత్త ఐడియాను ప్రవేశపెట్టి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఉపాధి స్కీము కింద ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారన్నమాట. అంత మాత్రాన ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత తగ్గుతుందా? అన్నది సందేహమే!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దానం ఎపిసోడ్.. డిఫెన్స్‌లో కాంగ్రెస్, రేవంత్?
సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పు చేశారా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? దానం నాగేందర్ పార్టీ మారి ఉండవచ్చు. కాని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో ఫిరాయింపులపై స్పష్టమైన హామీని ఇచ్చింది. ఎవరైనా పార్టీ ఫిరాయించితే రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా చేయాలన్నదే తమ అభిమతమని అందులో తెలిపింది. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉంటే కాంగ్రెస్‌కు ప్రతిష్ట అయ్యేది. అలా చేయలేదు. పైగా ఆయనను సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ పక్షాన పోటీచేయించింది. కనీసం అప్పుడైనా రాజీనామా చేయించాల్సింది. ఆయన గెలిచి ఉంటే ఎలాగూ రాజీనామా చేస్తారని అనుకుని ఉండవచ్చు. కాని ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డిలు స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్‌కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన విచారణ పేరుతో కొంత కాలయాపన చేశారన్న భావన ఉంది.నిజానికి మొత్తం తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసి ఉంటే గౌరవంగా ఉండేది. ఏదో కారణంతో వారిపై అనర్హత వేటు వేయకుండా వారిని రక్షించారన్న విమర్శకు స్పీకర్ గురయ్యారు. మిగిలిన ఎనిమిది మంది కన్నా, దానం నాగేందర్ ఫిరాయింపు మరీ ఓపెన్ అయిపోయినట్లు లెక్క.స్పష్టమైన ఆధారాలు ఎదురుగా కనబడుతుంటే, అసెంబ్లీ వెలుపుల జరిగే పరిణామాలతో సంబంధం లేదని స్పీకర్ అభిప్రాయపడడం ఎంతవరకు హేతుబద్దమో తెలియదు.తదుపరి బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ వాదోపవాదాల తదుపరి నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆ వెంటనే నాగేందర్ దానిని స్వాగతిస్తూ తాను మళ్లీ పోటీకి సిద్దమని అన్నారు. కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమో, లేక అదిష్టానం అభిప్రాయమో తెలియదు కాని, హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. హైకోర్టులో తీర్పు రాగానే రాజీనామా చేసి ఉన్నా బాగుండేది. కాని స్పీకర్ తీర్పులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చా అన్న మీమాంసలో కాంగ్రెస్ పడింది తప్ప, నైతికంగా తప్పు చేస్తున్న సంగతిని విస్మరించింది. చివరికి సుప్రింకోర్టు తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి పరువు పోయినట్లయింది.నాగేందర్ మాత్రం తీర్పును వ్యతిరేకించకుండా పోటీకి రెడీ అని మాట్లాడడం కరెక్టుగా ఉందని చెప్పాలి. అంటే మొత్తం విశ్లేషిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి ఇష్టపడడం లేదన్న సంగతి అర్థం అవుతుంది. లేదా ఆయనకు న్యాయ సలహా ఇచ్చినవారు తప్పు దోవ పట్టించి ఉండాలి. దేశంలో ఇదొక రిఫరల్ జడ్జిమెంట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీజేపీ చేయిస్తున్న ఫిరాయింపులపై విమర్శ చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వ్యవహరించి నైతికంగా నష్టపోయినట్లయింది.లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పట్టుకు తిరుగుతూ ప్రధానిని విమర్శిస్తున్నారని, అలాంటి వ్యక్తికి ఫిరాయింపుల చట్టం ఏమి చెబుతోందో తెలియదా అని బీఆర్ఎస్, బీజేపీలు ప్రశ్నించడం సహేతుకమే అని చెప్పాలి. ఓవరాల్‌గా చూసినప్పుడు ఈ మొత్తం ప్రక్రియలో నాగేందర్ చేసిన తప్పుకన్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమే ఎక్కువగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?ఇంకో సంగతి గుర్తు చేయాలి. 2004లో నాగేందర్‌కు అసిఫ్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కాకుండా సికింద్రాబాద్ లోక్‌సభ టిక్కెట్‌ను ఇచ్చారు. దానిపై ఆయన అసంతృప్తి చెందారు. రాత్రికి రాత్రే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి ఆ పార్టీ టిక్కెట్ తీసుకుని పోటీచేసి అసెంబ్లీకి గెలిచారు. కాని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం, కాంగ్రెస్ పవర్లోకి రావడంతో దానం టీడీపీకి దూరం అవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానికి అంగీకరించిన వైఎస్ ఈయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. నాగేందర్ కూడా అందుకు భయపడలేదు. కాకపోతే ఉప ఎన్నికలో ఓడి పోయి ఉండవచ్చు. కాని ఆయన చట్టం ప్రకారం తప్పు చేయలేదు. అప్పటి మాదిరే దానం రాజీనామాకు సిద్దపడినా కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదా అన్న సంశయం కలుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని ఆ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బహిరంగంగా ఎన్నికలలో పోటీచేశారని, అందువల్ల అనర్హత వేటు పడిందని, మిగిలినవారు కాంగ్రెస్‌తో ఉంటున్నా, తాము పార్టీ మారలేదని వాదిస్తున్నారని, దాంతో వారిపై చర్య అంత తేలికగా అవుతుందా అన్న చర్చ ఉంది.సుప్రింకోర్టు తీర్పు తర్వాత సత్యమేవ జయతే అని కేటీఆర్ అనడం బాగానే ఉన్నా, గతంలో బీఆర్ఎస్ వివిధ కారణాలతో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ మొదలైన పక్షాల నుంచి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఏకంగా మంత్రి పదవిని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. అవి కూడా తప్పులే అవుతాయి. ఏపీలో అయితే మరీ ఘోరంగా ఫిరాయింపులు జరిగాయి. 2014 టరమ్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని అప్పుడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. అయినా వారు మాట మాత్రంగా కూడా అభ్యంతరం చెప్పలేదు.కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ తదితర పార్టీలు ఫిరాయింపుల విషయంలో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయన్నది వాస్తవం. చట్టాలు చేసేది ఈ పార్టీలే, వాటిని ఉల్లంఘించి, సాకులు వెదికేది ఈ పార్టీలే. దాంతో దేశంలో రాజకీయ పార్టీల పట్ల ప్రజలలో గౌరవం సన్నగిల్తుతోంది. ఇప్పుడు దానం అనర్హత వేటు వ్యవహారం స్పీకర్ పరిధి దాటి వెళ్లిపోయినట్లే అన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. అలాకాకుండా ఇంకా దీనిని సాగదీయడానికి స్పీకర్‌తో కాంగ్రెస్ ప్రయత్నిస్తే అది ఆ పార్టీకి మరింత చేటు తెస్తుంది.ఆయా రామ్, గయారామ్లపై న్యాయ వ్యవస్థ కూడా స్థిరమైన తీర్పులు ఇవ్వడం లేదన్న భావన కూడా లేకపోలేదు. ఫిరాయింపులకు ఆస్కారం లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది. కాని దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఏది ఏమైనా నాగేందర్ అనర్హతపై సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగింది. కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు దీనిని గుణపాఠంగా తీసుకుంటాయా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?
ఎవరైనా వెయ్యి రూపాయలతో అయ్యే పనికి ఐదువేలో, పది వేలో ఖర్చు చేస్తారా? అలా చేస్తామని అంటే జనం ఏమని అనుకుంటారు? అయితే చేతకాని తనమన్నా కావాలి. లేదా ఏదైనా స్వార్ధ ప్రయోజనం ఉండి ఉంటుందని అనుకోరా? సరిగ్గా ఇదే రీతిలో ఏపీ రాజధాని అమరావతి గ్రామాలలో జరుగుతోందనిపిస్తోంది.కొత్త ఎయిర్ పోర్టు కోసం ఇరవై వేల ఎకరాలు, రైల్వే లైన్, గ్రిడ్ రోడ్డు విస్తరణ వంటి కోసం 6212 ఎకరాలు తీసుకుంటారట. ఎయిర్ పోర్టుకు ఐదువేల ఎకరాలు సరిపోతుంది. కాని నాలుగురెట్లు ఎక్కువగాను, రైల్వేలైన్, తదితర అవసరాలకు 1581 ఎకరాలు చాలు. కాని నాలుగు రెట్లు అదనంగా పూలింగ్ చేస్తారట. ఇప్పటికే విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. గతంలో దాని విస్తరణకు రైతులనుంచి భూములు తీసుకున్నారు. ఆ రైతులందరికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని ఈ మధ్యనే ఎయిర్ పోర్టు వద్ద ధర్నా కూడా జరిగింది.అయితే కొంతమంది పలుకుబడి కలిగినవారు ఈ భూములకు బదులు అమరావతి ప్రాంతంలో విలువైన ప్లాట్లు పొందారని కూడా చెబుతారు. దీనిని పక్కనబెడితే కూటమి ప్రభుత్వానికి లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా, కొత్తగా మరో విమానాశ్రయం కట్టాలన్న ఆలోచన వచ్చింది. అది కూడా విజయవాడ, గుంటూరులకు సుదూరంగా ఉండే మారుమూల గ్రామాలలో కావడం విశేషం. ఇందుకోసం ఐదువేల ఎకరాలు అవసరమట. కాని 20వేల ఎకరాలు సేకరించవలసి ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పీ.నారాయణ ప్రకటించారు. అదేమిటి? నాలుగు రెట్లు అధికంగా భూములు తీసుకోవడం ఏమిటన్న సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే 20వేల ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఐదువేల ఎకరాలే మిగులుతుందట. మిగిలిన భూమిలో ప్లాట్లు అభివృద్ది చేసి రైతులకు ఇవ్వవలసి ఉంటుందట. అలాగే విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇతర అవసరాలకు కేటాయించాలట. ఇదే ప్రకారం రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, గ్రిడ్ రోడ్లకు కూడా తీసుకుంటారట.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రానికి రాసిన ఒక లేఖ ప్రకారం ప్లాట్ల అభివృద్దికి ఎకరాకు రెండు కోట్లు వ్యయం అవుతుంది. అది ఇప్పుడు మరికొంత పెరిగిందేమో తెలియదు. ఈ రకంగా చూస్తే ఎయిర్ పోర్టు భూమి పోను మిగిలిన 15వేల ఎకరాలనే పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు మినిమమ్ రెండు కోట్ల చొప్పున ముప్పైవేల కోట్ల వ్యయం అవుతుందన్నమాట. ఇంత భారీ వ్యయం చేసే బదులు అవసరమైన ఐదువేల ఎకరాలకు రెండు కోట్ల చొప్పున లెక్కగట్టి ఇస్తే పదివేల కోట్లు సరిపోతుంది కదా!లేదా మూడు కోట్లు ఇచ్చినా 15వేల కోట్లు అవుతుంది.రైల్వే లైన్ తదితర అవసరాలకోసం ఈ ప్రకారం లెక్కవేస్తే ప్లాట్ల అభివృద్దికే 18వేల కోట్లు అవుతుంది. కాని కొనుగోలు చేస్తే పది, పన్నెండువేల కోట్లు మించి కాకపోవచ్చు. దీనిని వదలి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి ఎందుకు భూములు సేకరిస్తున్నట్లు? రైతులకు ప్లాట్ల అభివృద్ది జరిగే వరకు కౌలు రూపేణా, రుణాల మాఫి రూపేణా, ఇతరత్రా కోట్ల రూపాయల మెత్తాలను వెచ్చించవలసి ఉంటుంది. దీనిని బట్టి ఏం అర్దం అవుతుంది. వెయ్యి రూపాయల ఖర్చు అయ్యేదానిని మూడు, నాలుగు రెట్లకు పెంచుతున్నారనిపించదా? ప్రభుత్వం ఏదో రకంగా దీనిని సమర్ధించుకోవచ్చు. కానీ అందులో హేతుబద్దత ఎంత అన్నదే చర్చ.ఇదీ చదవండి: నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!హైదరాబాద్ శంషాబాద్ వద్ద రైతుల నుంచి భూములను ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించిన అనుభవం ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పూలింగ్ వైపే వెళుతోంది. రైతుల నుంచి భూములు తీసుకోవడంతో పచ్చని పంట పొలాలను నాశనం చేయడం ఒక ఎత్తు అయితే, వారి వద్దే భూములు ఉంటే ఎప్పుడైనా తమకు నచ్చిన రేటుకు అమ్ముకునే అవకాశం ఉండడం మరో ఎత్తుగా ఉంటుంది. వీటన్నిటిని కాదని ప్రభుత్వం భూములు తీసుకోవడం, నిర్మాణాల పేరిట వేల కోట్ల రూపాయలను అప్పు తెచ్చి మరీ వ్యయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఐఎఎస్, లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్ తదితరులు ముందుగా ఇప్పటికే తీసుకున్న భూమిని అభివృద్ది చేయకుండా కొత్తగా భూములు తీసుకోవడం ఏమిటని, పలు అనుభవాల రీత్యా చంద్రబాబునునమ్మడం ఎలా అని ప్రశ్నించారు. రెండో దశ భూ సేకరణ అంటే అవినీతికోసమేనని మరో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం ఆరోపించారు. ఎవరు ఎన్ని హితోక్తులు చెప్పినా, విమర్శలు చేసినా.. ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఆయా భవనాల నిర్మాణానికి పెడుతున్న వ్యయం చూస్తే ఎవరికైనా దిమ్మదిరగాల్సిందే.శాశ్వత సచివాలయ టవర్ల అద్దాలకు 2455 కోట్లు వ్యయం చేయబోతున్నారు. ఇందులో తొలుత ఉన్న అంచనా వ్యయం కన్నా 500 కోట్లు అధికంగా ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. అమరావతిలో విద్యుత్ సరఫరాను ప్రైవేటుకు అప్పగించాలన్నది మరో ఆలోచనట. దీనిపై నివేదికలు తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. ఇప్పటికే వేల కోట్ల వ్యయం చేసి అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్డిఏ తయారు చేస్తోంది. అంతా సిద్దం అయ్యాక ప్రైవేటువారికి దీనిని అప్పగిస్తారా? లేక ముందే ప్రైవేటుకు అప్పగిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇదంతా వినియోగదారులపై భారం కాదా అన్నది కొందరి సందేహం.అమరావతి చుట్టూరా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలన్నది మరో ప్రతిపాదన. కేంద్రం దీనిపై కొన్ని అభ్యంతరాలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. సుమారు 30వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా అయితే ఇందులో రాష్ట్రం కూడా నాలుగువేల కోట్లకు పైగా భరించాల్సి ఉంటుందట. అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించడంలో భాగంగా కేవలం భవన శిఖరం(డూమ్) నిర్మాణానికి 660 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారట. పార్లమెంటు కొత్త భవనం, తెలంగాణ సచివాలయంలకు పెట్టిన ఖర్చుతో పోల్చితే ఏపీ ఖర్చు గుండె బేజారెత్తిస్తుందని చెప్పాలి.కొండవీటి వాగు వరదనుంచి రక్షణ పొందడానికి కొన్నివందల కోట్లు వ్యయం చేస్తున్నారు. కృష్ణానది కుడి కరకట్ట విస్తరణకు 443 కోట్లు వెచ్చించబోతున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థ కోసం 415 కోట్లు పెట్టబోతున్నారు. గవర్నర్ నివాస భవన సముదాయానికే 200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా అట. అమరావతిలో పెడుతున్న ఖర్చులో ఇవి కొన్నే. ఇందులో దుబారా, అవినీతిపై ఎవరైనా ప్రశ్నించినా పట్టించుకునే దశలో చంద్రబాబు సర్కార్ లేదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరినుంచి వసూలు చేసే పన్నులలో నుంచే అమరావతి అప్పులను తీర్చవలసి ఉంటుంది. ఒకపక్క ఎల్ నినో కారణంగా కరువు తాండవిస్తుంటే, మరో పక్క అమరావతిలో వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా వెచ్చించడం న్యాయమా అని సామాన్యుడు ప్రశ్నించినా వినే నాధుడు లేడు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నాడు ప్రశంసలు.. నేడు విమర్శలు.. బాబుకు కొత్త ఆందోళన!
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీ పాలనను వ్యతిరేకించే విధంగా వ్యవహరించిన కొందరు మేధావులు, మాజీ అధికారులలో మార్పు కనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న మరికొంతమంది సైతం ప్రభుత్వంపై స్పందిస్తున్న తీరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.గతంలో న్యాయాధికారిగా పనిచేసి జడ శ్రవణ్‌కుమార్ ఇటీవలికాలంలో కూటమి ప్రభుత్వ వైఖరిని తూర్పారాపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన గత ప్రభుత్వ టైమ్‌లో అమరావతి తదితర అంశాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశారు. వివిధ ఆందోళనలలో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఆయన విసిగిపోయారు. సొంత రాజకీయ పార్టీని స్థాపించుకుని పనిచేస్తున్న శ్రవణ్ ప్రజా సమస్యలపై గళం విప్పారు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను కూడా వెలుగులోకి తెస్తున్నారు.చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తికి, ఆయన రిటైర్ అయ్యాక లోకాయుక్త పదవిని ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించి శ్రవణ్ న్యాయపోరాటానికి సిద్దం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని విధానంపై విరుచుకుపడుతున్నారు. మంత్రి నారా లోకేష్‌పై అవినీతి అభియోగాలు మోపుతూ మీడియా సమావేశాలు పెడుతున్నారు. డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో శ్రవణ్ అంతగా స్పందించలేదు. అందులో అక్రమాలు ఉన్నాయా? లేదా? అన్న సందేహం ఆయనకు వచ్చినట్లు ఉంది.కాని గత కొద్ది రోజులుగా ఆయనకు వచ్చిన ఆధారాల మేరకు డీఎస్సీపై అవకతవకలపై విరుచుకుపడుతున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినవారికి సంబంధించి అక్రమాలు జరిగాయని ఆయన చెబుతున్నారు. క్రీడా కోటాలో అనర్హులకు టీచర్ ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్సీపీ గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. జై భీమ్ పార్టీని స్థాపించిన జడ శ్రవణ్ కూటమికి అధినేతలకు దూరం అవడమే కాకుండా, స్వతంత్రంగా ఆ ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు.మరో రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై ఈ స్థాయిలో విమర్శలు చేస్తారని రెండేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. కూటమి అధికారంలోకి రాగానే ఈయనకు కీలకమైన పదవి వస్తుందని చాలామంది అనుకున్నారు. కాని అనూహ్యంగా ప్రాధాన్యత లేని పోలీస్ హౌసింగ్ సంస్థ చైర్మన్ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఇది ఒక రకంగా అవమానించడమేనని ఆయన సన్నిహితులు చాలామంది బాధపడ్డారు. అయినా చంద్రబాబు కాని, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి లోకేష్ గాని పట్టించుకున్నట్లు లేదు. ఆ తర్వాత క్రమేపి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఏబీవి కూడా ధ్వజమెత్తడం ఆరంభించారు. ముఖ్యంగా 22-ఎ నిషేధిత భూముల జాబితా విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుపోయినట్లు భూములను ప్రభుత్వంలోని వారు ఎత్తుకపోయారని గళమెత్తారు. అమరావతి రెండో దశ భూ సమీకరణ అంతా అవినీతే అని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య కూడా గమనించదగిందే. రాష్ట్రంలో సహకార డెయిరీ రంగం మూల పడుతోందని ఆయన అన్నారు. సహకార డెయిరీ రంగం 'మూడు " పువ్వులు, అనేకానేక కాయలు అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు.ఇదీ చదవండి: బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?అలాగే ఒక ప్రముఖ టీవీ యాజమాన్యంలో మార్పుల గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. అది అసలు వార్తే కాదట.. కొనుక్కుని చదివే పాఠకులు వర్సెస్ ప్రకటనలు విసిరే పాలకులు.. ఎవరి ప్రయోజనాలు ముఖ్యం అని ఆయన ప్రశ్నించారు. ఏవి తల్లి నాడు విరిసిన విలువలు, అభ్యుదయాలు? అని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఈటీవిని టీడీపీకి చెందిన ముఖ్యనేతలలో ఒకరు తన అధీనంలోకి తీసుకున్నారని ప్రచారం అవుతున్న పరిస్థితిలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.మరో సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి అయిన నారా బ్రాహ్మణి ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుపై ఆయన ఘాటుగా స్పందించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండి విడుదలై మూడేళ్లు అవుతున్న సందర్భంగా నిజం గెలిచింది అంటూ, 53 కొవ్వొత్తులు వెలిగించిన వీడియోని ఆమె పోస్టు చేశారు.ఈ పోస్టుపై నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండొ, ఇరవైరెండెకరాలతోనో 1970వ దశకంలో రాజకీయ జీవితం ఆరంభించి, ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకువచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును నిస్వార్థ అవినీతిపరుడు అని కూడా ఎద్దేవ చేశారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ.రామారావుకు వెన్నుపోటు పొడిచారని కూడా ఆయన విమర్శించారు. ఏపీ విభజనకు లేఖ ఇవ్వడంతో తెలుగుజాతికి తీరని ద్రోహం చేశారని చంద్రబాబుపై నాగేశ్వరరావు మండిపడ్డారు.మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విశాఖపట్నం ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా డేటా సెంటర్లు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా వంటి దేశాలు డేటా సెంటర్లను వదలించుకుంటుంటే, ఇండియా వంటి దేశాలు ఎదురు రాయితీలు ఇచ్చి తెచ్చుకోవడం ఏమిటని అన్నారు. అందులో విశాఖలో వీటిని అధికంగా ఏర్పాటు చేయడం వల్ల వచ్చే నీరు, విద్యుత్ సమస్యలను ఆయన ప్రస్తావించారు.ఇంకో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో మెటాకు ఫిర్యాదు చేసి సోషల్ మీడియా పోస్టులను తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిని నేరపూరిత దుష్ప్రవర్తనగా ఆయన అభివర్ణించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వీరే కాదు. మరికొందరు మేధావులు కూడా ప్రభుత్వంలో జరుగుతున్న వివిధ అక్రమాలు, వివాదాస్పద అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తున్న తీరు స్వాగతించదగిందే!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబూ.. ఏపీలో కొత్త సంస్కృతికి తెర లేపారా?
ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆవేదన కలిగిస్తాయి. ఈవీఎంలు మాయ కాకుండా నిజంగానే ప్రజల ఓట్లతోనే బీజేపీ, టీడీపీ,జనసేన కూటమి గెలిచి ఉంటే ఇంత అరాచకంగా, అధ్వాన్నంగా పాలన సాగిస్తుందా?అన్న సందేహం రోజురోజుకు బలపడుతోంది. విజయవాడలో స్పోర్ట్స్ అధారిటీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా చేయడానికి వెళ్లినప్పుడు వారిపై దాడి జరిగిన తీరు, తదుపరి అరెస్టులు, కేసులు వారిపైనే పెట్టిన వైనం గమనిస్తే , ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు నిజాలు మాట్లాడుతూ ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలి. కాని దురదృష్టవశాత్తు చంద్రబాబు అందుకు విరుద్దంగా నిత్యం అబద్దాలు చెబుతూ, ఏపీని అబద్దాల సమాజంగా మార్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విషయం చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒక అసత్యం చెబితే సరిపోతుందన్న ధోరణితో ఆయన సాగుతున్నారన్న భావన ఏర్పడుతోంది. విజయవాడలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి జరిగితే ఆయన గురువులపై వైఎస్సార్సీపీ గూండాలు దాడి చేశారని కుప్పంలో స్పీచ్ ఇచ్చారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి అసలు టీడీపీ వారు కాని, టీచర్ల పేరుతో వచ్చిన గూండాలు కాని, లోకేష్ యువగళానికి చెందినవారుకాని చేసిన దుశ్చర్యల గురించి మాట మాత్రం రాయకుండా వైఎస్సార్సీపీ వారే దాడులు చేశారన్నట్లుగా తెగబడి రాశాయంటే ఏమిటి అర్దం?. డీఎస్సీ అక్రమాల కేసు ఆధారాలతో సహా బయటపడటంతో ఏం చేయాలో దిక్కుతోచక ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న భావన కలగదా!. ఒక వేళ ఈ ఘటనలో వైఎస్సార్సీపీ వారి వైపు నుంచి కూడా ఏదైనా తప్పు ఉంటే అది రాయవచ్చు. అలాగే టీడీపీ వారు ఎందుకు అలా అరాచకంగా ప్రవర్తించారో తెలియచేయాలి. అదేమీ లేకుండా పూర్తి ఏకపక్షంగా కదనాలు ప్రచారంలోకి తెచ్చారంటే విద్యా శాఖ మంత్రి లోకేష్ ను ఈ స్కామ్ నుంచి బయట వేయడానికి ఎదురుదాడి ఒకటే మార్గమని ఎంచుకున్నట్లు అనిపించదా!అధికారం ఉంది కనుక ,పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారి నిష్పక్షపాతంగా పనిచేయడం మానివేసింది కనుక దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టవచ్చు. వారిని అరెస్టు చేయవచ్చు. అంతమాత్రాన ప్రభుత్వం ఎస్కేప్ అయిపోతుందని అనుకుంటే పొరపాటు.ఎందుకంటే సోమవారం నాటి ఈ ఏపీసోడ్ మొత్తం ప్రభుత్వ బలహీనతను బయటపెట్టింది. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని అనుమానాలు పెంచింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ దర్నాకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించడమే ఆశ్చర్యం. అంత ప్రమాదం ఏమి వచ్చిందని వారి నిరసనకు అనుమతి ఇవ్వలేదు? అయినావైఎస్సార్సీపీ నిరసనపై ముందుకు వెళ్లింది. అలా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు పోలీసులను తోసుకుంటూ ముందుకువెళ్లలేదా? అనివైఎస్సార్‌సీపీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తే తప్పేమిటన్నది వారి వాదన. డీఎస్సీ అభ్యర్దుల పేరుతో ప్రభుత్వం చేయించిన ర్యాలీలకు ఎలా పర్మిషన్ లభించింది?అంటే చట్టం అన్ని పక్షాలకు ఒకరకంగా ఉండడం లేదన్న విషయం అర్ధం అవుతూనే ఉంది కదా? టీడీపీ కార్యకర్తలు,గూండాలు, టీచర్ల ముసుగులో వచ్చిన రౌడీలు శాప్ కార్యాలయ ఆవరణలోకి ఎలా వెళ్లారు? అక్కడ వారికి షామియానాలు, కుర్చీలు వేసి ఎలా సదుపాయాలు కల్పించారు. వైఎస్సార్సీపీ నేతలు నిరసన నిమిత్తం అక్కడకు వెళితే వారు ఎలా ఎగబడ్డారు? కొందరైతే పోలీసుల నుంచి లాఠీలు లాక్కుని మరీ దాడి చేశారట. నోటికొచ్చిన బూతులతోవైఎస్సార్సీపీ నేతలను తిట్టారట. ఎంత వీలైతే అంత వైఎస్సార్సీపీ వారిని రెచ్చగొట్టారన్నమాట. అలా చేసినప్పుడు ఎవరైనా కొంతమంది ఆవేశపడుతుంటారు. అప్పుడు వారికి రౌడీ ముద్ర వేసి ప్రచారం చేస్తారన్నమాట. దాడులలో గాయపడ్డది వైఎస్సార్సీపీ నేతలు కదా!అయినా వారిపైనే కేసులు పెట్టారు. పైగా కొందరిపై హత్యాయత్నం కేసు వరకు పెడుతున్నారట. పోనీ దాడులు చేసిన టీడీపీవారిపై కూడా కేసు పెట్టారా అంటే అలాంటిదేమీ లేదట. టీడీపీ పక్షాన గూండాయిజం చేసిన కొందరు తాము యువగళం టీమ్ అని ఓపెన్ గానే చెప్పుకున్నారే. ఎల్లో మీడియా ఈ ఉదంతం మొత్తాన్ని వక్రీకరించి ప్రచారం చేసే క్రమంలో తొలుతటీడీపీవారిపైనే వైఎస్సార్సీపీ దాడి అని స్టోరీలు ప్రచారం చేసింది.కాని అంతలో వారికి కొత్త ఐడియా వచ్చినట్లు ఉంది. టీడీపీ వారిపైన దాడి అంటే,వైఎస్సార్సీపీ నిరసన సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారని జనం అనుకుంటారని భావించి మొత్తం కధను మార్చి గురువులపై దాడి అని కొత్త స్టోరీ అల్లారట. ముఖ్యమంత్రి సైతం ఇదే ప్రకారం ఉపన్యాసం ఇచ్చారు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారని అర్ధం అవుతోంది కదా! గొడ్డలి పార్టీ అని చంద్రబాబువైఎస్సార్సీపీని ఉద్దేశించి అంటే, వెన్నుపోటు పార్టీ టీడీపీ అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. ఇదంతా చంద్రబాబుకు గౌరవం అయిన సంగతేనా? అర్హులైన టీచర్ అభ్యర్ధులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రసంగంలోని కొన్ని అంశాలు చూడండి.క్రీడా కోటాలో తప్పులు జరిగాయని, ఆ ఉపాధ్యాయులంతా బోగస్ అని అంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.ఇదీ చదవండి: అందుకే ఈ అరాచకాలా..?వైఎస్సార్సీపీ ఎన్నడూ అందరూ బోగస్ అని అనలేదు. తప్పుడు క్రీడా సర్టిఫికెట్లు తెచ్చి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు పొందిన పలువురి వివరాలు వెల్లడించి విమర్శలు చేస్తోంది. ఆ నిర్దిష్టమైన కేసులలో ఇంతవరకు చంద్రబాబు,లేదా మంత్రి లోకేష్ వివరణ ఇవ్వలేకపోయారు. వైఎస్సార్సీపీ హయాంలో పోటీలలో పాల్గొని వారి చేతుల మీదుగానే ధృవపత్రాలు పొందినవారిని ఫేక్ అంటున్నారని ఆయన చెప్పారు. ఇందులోను నిజం లేదు. ఫేక్ పత్రాలతో కొంతమంది పోస్టులు సాధించారా? లేదా? అన్నదాని పై ఆయన మాట్లాడడం లేదు. విజయవాడలో గురువులపై రౌడీలు దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది కూడా నిజం కాదు. వైఎస్సార్సీపీ ధర్నా చేయాలని తలపెడితే అక్కడ టీడీపీ గూండాలు, టీచర్ల ముసుగులో రౌడీలు ఎందుకు ఉన్నారని ఎవరికైనా సందేహం వస్తుంది కదా! అసెంబ్లీకి వచ్చే ధైర్యంవైఎస్సార్సీపీకి లేదని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. కాని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు హాజరవుతున్నారు కదా!అక్కడ ఎందుకు చర్చకు టీడీపీ వెనుకాడింది అంటే జవాబు ఇవ్వరు. లోకేష్ మండలికి హాజరైనా దాని గురించి ఎందుకు వాదన వినిపించలేకపోయారు.వైఎస్సార్సీపీ సహభ్యుల ప్రశ్నలకు బదులు ఇవ్వలేదంటే సమాధానం ఇవ్వరు. కొందరు టీచర్లను తీసుకువచ్చి ర్యాలీలు చేయించి ఒక రాజకీయ పార్టీని ఇష్టం వచ్చినట్లు దూషింపచేస్తారా?మాజీ ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది. చంద్రబాబు రాష్ట్రంలో ఒక విష సంస్కృతిని తీసుకువస్తున్నట్లు అనిపించదా!ఇవన్ని ఎందుకు! అసలు డీఎస్సీలో అక్రమాలు జరగలేదన్న నమ్మకం ఉంటే వైఎస్సార్సీపీ అదినేత జగన్ సవాల్ చేసినట్లు సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా! పైగా తన టైమ్ లో జరిగిన ఏపీపిఎస్సిపై కూడా సిబిఐ విచారణ వేసుకోండని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కదా!దాని గురించి ప్రస్తావించకుండా ఏపీపిఎస్సిపై వైఎస్సార్సీపీ మాట్లాడడం లేదని చంద్రబాబు అనడం ఏమిటో అర్దం కాదు..టీచర్ల నియామకాలపై అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చని,కోర్టు ఆదేశిస్తే చర్య తీసుకుంటామని అన్నారు. ఉద్యోగాలు రాని అనేక మంది కోర్టుకు వెళితే అసలు కేసే విచారణకు రాకుండా చేస్తున్నారని వారు బహిరంగంగానే చెబుతున్నారే? కోర్టులో విచారణకు రెడీ అయిన ప్రభుత్వం వారు సిబిఐ దర్యాప్తునకు ఎందుకు వెనుకాడుతున్నారు?జగన్ మళ్లీ సోమవారం నాడు కూడా డీఎస్సీ స్కామ్ పై 14 ప్రశ్నలు వేశారు. చంద్రబాబు, లోకేష్ లు తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. జగన్ ప్రశ్నలపై చంద్రబాబు ఎప్పటికైనా స్పందిస్తారా?అన్నది అనుమానమే. ఒక్క మాట చెప్పాలి. డెబ్బైఆరేళ్ల వయసులో ఎంతో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హోదాకు తగ్గట్లు వ్యవహరించలేకపోతున్నారనిపిస్తుంది. ఇదంతా పుత్ర ప్రేమా?లేక సహజంగా వచ్చిన అలవాటా?అంటే ఏమి చెబుతాం!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అందుకే ఈ అరాచకాలా..?
అధికారం ఉంటే ఎలాగైనా చేయవచ్చని ఏపీలో కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నట్లుగా ఉంది. తమ హయాంలో జరిగిన స్కామ్‌ల కేసులను పోలీసు వ్యవస్థ ద్వారానే ఎత్తివేయించుకోవడం, అదే పోలీసులను ప్రయోగించి విపక్ష వైఎస్సార్సీపీ నేతలపై కల్పిత కేసులు పెట్టడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. బహుశా గతంలో ఏ ప్రభుత్వం ఇంత అరాచకంగా వ్యవహరించి ఉండకపోవచ్చన్నది ఎక్కువ మంది భావన.2014-19 టరమ్‌లో జరిగిన స్కిల్ స్కామ్‌తో సహా ఆయా కేసులను ఎత్తివేసేలా పావులు కదపడం, అదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ ఒక కల్పిత మద్యం కేసును సృష్టించి, అవసరమైనప్పుడల్లా దానిని ప్రచారానికి వాడుకోవడం ఈ ప్రభుత్వం అలవాటుగా మార్చుకున్నట్లుంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని విద్యాశాఖలో జరిగిన టీచర్ల నియామక స్కామ్‌ను కప్పిపుచ్చడానికి ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఇదే కాదు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసిన కేసు మూలలోకి వెళ్లకుండా కథ నడిపిస్తున్న తీరు కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక జనాన్ని ఏమార్చే పనిలో ఉంటోంది. మరో వైపు ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్‌లు, పోలీసు శాఖ ద్వారా జరుగుతున్న అరాచకాలు కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. వీటికి తోడు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని ఈడి కూడా తేల్చడంతో ప్రభుత్వ పెద్దలు అపచారం చేసినట్లయిందని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని వెరసి ప్రభుత్వం ప్రజలలో పరపతి బాగా కోల్పోతోందన్న భావన వచ్చినప్పుడల్లా దానిని డైవర్ట్ చేయడానికి వైఎస్సార్సీపీపై ఏవేవో పిచ్చి ఆరోపణలు చేయడం, ఆ పార్టీ నేతలపై పిచ్చి కేసులు పెట్టడం చేస్తున్నారు.డీఎస్సీ అక్రమాలపై ఆధార సహితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ ఇతర నేతలు ఆరోపణలు చేస్తుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. ఎంత బుకాయించాలని చూస్తున్నా, స్కామ్ వివరాలు, కొత్త సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. హర్యానాలో జరిగిన టీచర్ల ఎంపిక స్కామ్‌తో పోల్చుతూ కొందరు మేధావులు విశ్లేషణలు ఇస్తున్నారు. గతంలో హర్యానా ముఖ్యమంత్రి చౌతాలా, ఆయన కుమారుడు, కొందరు అధికారులు జైలుకు వెళ్లిన ఘటన తీరుతెన్నులను పోల్చుతూ ప్రముఖ మేధావి, ఫ్రొఫెసర్ రామచంద్రయ్య ఒక వీడియో చేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో, కేసు విచారణ దశకు వెళ్లకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని వేధిస్తూ కాలం గడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలు డీఎస్సీ స్కామ్ గురించి మరీ ఎక్కువగా చర్చించుకోకుండా ఉండాలన్న లక్ష్యంతో అవసరమైనప్పుడల్లా మద్యం స్కామ్ అంటూ తెరపైకి తీసుకువచ్చి ఎల్లో మీడియాతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా బెవరేజ్ కార్పొరేషన్లో ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్ అనే ఉద్యోగి వాంగ్మూలం పేరుతో ఒక కథను సృష్టించారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. సత్యప్రసాద్ కూడా ఈ కేసులో ఒక నిందితుడే. కాని ఆయన అరెస్టు కాకుండా చూసి, అతనిని నయానో, భయానో అప్రూవర్‌గా మార్చుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఈ రెండేళ్లలో రకరకాల విన్యాసాలు చేసిందన్న అభిప్రాయం కలుగుతోంది. అనేక మందిని ఈ కేసులోకి తీసుకురావడం, అరెస్టులు చేయడం, ఎప్పటికప్పుడు ఒక కొత్త స్టోరీని అల్లడం చేస్తోందన్న భావన ఉంది. మద్యం తయారీదార్ల నుంచి లంచాలు తీసుకున్నారన్నది సిట్ అబియోగం. ఇందుకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా అంటే అదేమి లేదు. ఎవరో రహస్య లేఖ రాస్తే వెంటనే పోలీసులను రంగంలోకి దించి విచారణ ఆరంభించారు. ఈ లంచం డబ్బును ఒకసారి రియల్ ఎస్టేట్‌లో పెట్టారని, మరోసారి సినిమాలు తీశారని, ఇంకోసారి విదేశాలకు తరలించారని, వేరొక సారి ఆ డబ్బును గత ఎన్నికలలో ఓటర్లకు పంచడానికి వెచ్చించారని ఆరోపణలు చేశారు. సత్య ప్రసాద్‌తో కోర్టులో కూటమి పెద్దలు కోరుకున్న విధంగా వాంగ్మూలం ఇప్పించారన్నది వైఎస్సార్సీపీ అభియోగం.ఇదీ చదవండి: ‘హూ ఈజ్ మోదీ’ నుంచి గ్రేట్ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?మాజీ మంత్రి పేర్ని నాని ఈ కేసుపై పార్టీ వాదనను సమర్ధంగా వినిపించారు. సత్యప్రసాద్ వాంగ్మూలంలో చెప్పిన అంశాలలోని వైరుధ్యాలపై పలు ప్రశ్నలు సంధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి వద్ద మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు సమావేశం జరిగిందని సత్యప్రసాద్ చెప్పారట. ఆయన వద్ద దీనికి ఆధారం ఏమైనా ఉందా అంటే అదేమీ కనిపించదు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో ఒక కాలేజీలో 11 కోట్ల డబ్బు దొరికిందని పోలీసులు హడావుడి చేశారు. అది ఈ కేసులో ఒక నిందితుడైన రాజ్ కసిరెడ్డిదని ఆరోపించారు. దానిని ఆయన తోసిపుచ్చి ఆ డబ్బును కోర్టులో పెట్టాలని, నెంబర్లు నోట్ చేయాలని కోరగా, కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసు అధికారులు ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేశామని చెప్పడంతోనే ఈ కేసులో డొల్లతనం బహిర్గతం అయింది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన ఒక కానిస్టేబుల్‌కు ప్రమోషన్ ఇవ్వడం, అందుకు ఇష్టపడని మరో కానిస్టేబుల్‌ను తీవ్రంగా వేధించడం చేశారట. నెలకు ఏభై, అరవై కోట్లు వసూలు చేసేలా నిర్ణయించుకున్నారని, దానిని జగన్‌కు చేర్చేవారని లాజిక్ లేకుండా సత్యప్రసాద్ కోర్టుకు తెలిపారట. అది నిజమే అయితే అది ఎలా జరిగింది. సిసిటీవీ ఫుటేజ్ ఉందా? అంటే అదేమీ కనిపించదు.నిజంగానే మూడువేల కోట్ల డబ్బు ఎన్నికలలో పంచిఉంటే ఏ ఒక్క ఎన్నికల పర్యవేక్షణ అధికారి అయినా తన రిపోర్టులో తెలిపారా అని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి కేసులు పెట్టి ఏమి సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏ కేసు అయినా కేవలం అప్రూవర్ ఇచ్చే వాంగ్మూలం తోనే బలంగా ఉంటుందనుకుంటే పొరపాటని శ్రవణ్ అన్నారు. డబ్బు ఎక్కడనుంచి ఎక్కడకు వెళ్లింది? డబ్బును సీజ్ చేశారా? నిజంగానే మద్యం డిస్టిలరీల వారు లంచాలు ఇచ్చి ఉంటే వారందరిపైన కూడా కేసులు పెట్టాలి కదా అని ఆయన అడిగారు.ఇక సత్యప్రసాద్ ఇంతకుముందు రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జగన్ పేరే ఎందుకు ప్రస్తావించలేదు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని కూడా వేదించి అప్రూవర్‌గా మార్చుకునే యత్నం చేశారు. తొలుత అంగీకరించినా, ఆ తర్వాత ఆయన ఒప్పుకోకపోవడంతో కొత్త కేసులు పెట్టి వేదిస్తున్నారట. స్కిల్ స్కామ్‌లో డబ్బు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లింది? చివరికి టీడీపీ ఆఫీస్‌కు ఎలా చేరింది? బ్యాంకు స్టేట్ మెంట్లతో సహా సీఐడీ అప్పట్లో అభియోగాలు మోపింది. అంతేకాక సంబంధిత ఫైళ్లలో చంద్రబాబు సంతకాలు కూడా ఉన్నాయి. అలాంటి కేసులో ఏమీ జరగలేదని సీఐడీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎలా నివేదిక ఇచ్చిందో తెలియదు. పైగా ఈ కేసు మూలం ఈడి దర్యాప్తుతో మొదలైంది. అయినా ఇప్పుడు ఈడి ఎక్కడా సీన్లో కనిపించదు.మాజీ మంత్రి అంబటి రాంబాబు డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆయనకు మద్యం కేసులో నోటీసులు రావడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అమరావతికి సంబంధించిన స్కామ్‌లు కొన్నిటిలో కొందరు ఐఏఎస్ అధికారులు వాంగ్మూలాలు ఇచ్చినా, అవన్ని ఇప్పుడు ఎలా పూర్వపక్షం అవుతున్నాయో అర్థం కావడం లేదని ఈ కేసులను గమనిస్తున్న ఒక ప్రముఖుడు అన్నారు. న్యాయ వ్యవస్థ వీటిని ఎలా అనుమతిస్తుందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును వీలైనంతమేర సాగదీస్తున్న సిట్ అధికారులు ఇంతవరకు ఎందుకు అతనిని హింసించారు అన్న మూలాలలోకి వెళ్ళినట్లు సమాచారం లేదు. ఏ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు అతనిని మార్కాపురం నుంచి పట్టుకువచ్చారు? పై అధికారులను విచారించే పరిస్థితి ఉందా? లేదా? ఇలాంటి సందేహాలు ఎన్నో వస్తున్నాయి ఏ కేసునైనా నిష్పక్షపాతంగా చేస్తే అభ్యంతరం ఉండదు. అధికారంలో ఉన్నవారిపట్ల ఒకరకంగా, విపక్షంవారిపై మరో రకంగా వ్యవహరిస్తేనే సమస్య. ఇది వ్యవస్థలకు కూడా మంచిది కాదు. అన్నిటికి మించి సత్యప్రసాద్ మానసిక పరిస్థితిపై ఒక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఆసక్తికరంగా ఉంది. అప్పుడు ఆయన వాంగ్మూలం చెల్లుతుందా? లేదా? అన్నది చూడాలి.మరో విషయం ఏమిటంటే మద్యం కేసులో ప్రభుత్వం తరపున వాదించే ఒక లాయర్ ఏకంగా జడ్జినే బెదిరించిన ఘటన గతంలో జరిగింది. అయినా ఆయనకు ఏమీ కాలేదు. ఇలా రకరకాల సందేహాలతో, సంశయాలతో కొనసాగుతున్న కల్పిత మద్యం కేసు ద్వారా వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టి తమపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవచ్చని పాలకులు భావిస్తున్నారేమో తెలియదు. కాని అది అన్నివేళలా సాధ్యపడకపోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘హూ ఈజ్ మోదీ’ నుంచి గ్రేట్ అని భజన దాకా.. బాబు వ్యూహం అదేనా?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటి? ఆయన ఏ లక్ష్యంతో బీజేపీ పట్ల, ప్రధాని మోదీ పట్ల అంత విధేయత చూపుతున్నారు? ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందింది. అదంతా ఏమైందో కాని, ప్రస్తుతం ఆత్మాభిమానంతో సంబంధం లేకుండా టీడీపీ ముఖ్యనేతలు ప్రవర్తిస్తున్నారేమిటా అని పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా వారణాసికి వెళ్లి ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎవరూ కాదనరు. కాని వారణాసి వెళ్లి బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి పూజలు చేసి హారతి ఇచ్చిన వైనంపైనే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పనే వైఎస్ జగన్ వంటి నేతలు ఎవరైనా చేసి ఉంటే, చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి ఉంటే, ఇక ఇల్లెక్కి గోలచేసినంత పని చేసేవారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిందని ఎల్లో మీడియాలో హోరెత్తించేవారు. కేసుల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించేవారు.రాజకీయాలలో ప్రధాని మోదీ కన్నా చంద్రబాబు నాయుడు చాలా సీనియర్. ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పుకునేవారు. ఆ సీనియారిటీని పక్కనబెట్టి మోదీ కోసం చంద్రబాబు పూజలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ అవసరాలా? లేక తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయడానికి తగు సహకారం పొందడానికా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది చర్చగా ఉంది.చంద్రబాబు 1978లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టరమ్‌లో మంత్రి అయ్యారు. ఆయన మామ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ నుంచి జంప్ చేసి పెత్తనం సాగించారు. కర్షకపరిషత్ ఛైర్మన్‌గా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మెడలు వంచి అధికారం సాధించామని ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. అలాంటి నేత బీజేపీ విషయంలో పలుమార్లు పిల్లిమొగ్గలు వేశారు.1996లో వామపక్షాలతో కలిసి పోటీచేసి బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు. 1998 నాటికి ఎన్డీఏలోకి వచ్చి, 1999 ఎన్నికలలో కలిసి పోటీచేశారు. 2001 ప్రాంతంలో గుజరాత్ మత కలహాల నేపథ్యంలో మోదీని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 2004 ఎన్నికలలో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోబోనని ప్రతిజ్ఞ చేశారు. కాని 2014 నాటికి ప్రధాని అభ్యర్ది అయిన మోదీని కలవడానికి లాబీయింగ్ చేసుకుని సఫలం అయ్యారు. ఆ తర్వాత 2018లో మళ్లీ బీజేపీకి దూరం అయి కాంగ్రెస్‌తో కలిశారు. 2019లో ఓటమి తర్వాత మళ్లీ బీజేపీవైపు వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసి 2024లో పొత్తు పెట్టుకోగలిగారు. రాజకీయాలలో పొత్తులు మార్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాని విమర్శలు, ఆరోపణల విషయంలో పెద్ద నేతలు సంయమనంగా ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం ఆ విషయంలో హద్దులు పాటించలేదు. ప్రధానిని ఏవైతే అనగూడదో ఆ మాటలన్నీ అన్నారు. దేశానికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా, ముస్లింలను బతకనివ్వని మనిషిగా, భార్యను ఏలుకోవడం లేదని అంటూ హూ ఈజ్ మోదీ అనేంతవరకు వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో మోదీ కూడా చంద్రబాబును అవినీతిపరుడని ధ్వజమెత్తారు. అయినా ఇరు పార్టీలు, ఇద్దరు నేతలు మళ్లీ కలవడం ద్వారా ఇవా రాజకీయాలు.. ఔరా అనిపించారు.తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తుకోసం డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాచారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఇష్టపడలేదని, తాను ఈ విషయంలో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్‌లో వెల్లడించారు. కూటమి ఎన్నికల ప్రచారానికి మోదీ వచ్చినా చంద్రబాబుతో అంతంతమాత్రంగానే మాట్లాడారని అంటారు. ఆయా సందర్భాలలో మొక్కుబడిగానే వీరిమధ్య సంబంధాలు సాగాయి. ఈ లోక్ సభ ఎన్నికలలో 16 సీట్లు రావడం టీడీపీకి కలిసి వచ్చింది. బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ సీట్లు కీలకం అయ్యాయి. ఆ తర్వాత మోదీ, చంద్రబాబుల మధ్య సంబంధాలు మెరుగుపడడం ఆరంభం అయిందని చెప్పాలి.ఇదీ చదవండి: రేవంత్ వర్సెస్ కేసీఆర్.. భూముల లెక్కల్లో అసలు ట్విస్ట్ ఇదేనా?అయినా చంద్రబాబును బీజేపీ పెద్దలు నమ్మడం అంతంత మాత్రమేనని చెబుతారు. చంద్రబాబు పలుమార్లు డోకా చేశారని, కాంగ్రెస్‌తో కూడా కలిసి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో వ్యతిరేక ప్రచారం చేశారన్న అసంతృప్తి బీజేపీలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనపై బీజేపీలో నమ్మకం పెరగడానికి గాను 2024 నుంచి తెగ పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. మోదీని అవసరం ఉన్నా, లేకపోయినా పొగడడం, అది కూడా బీజేపీవారికే ఎబ్బెట్టుగా ఉండేంతగా చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఉదాహరణకు ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మోదీని ఆకాశానికి ఎత్తేశారు. మోదీ, మోదీ అంటూ సభికులతో నినాదాలు ఇప్పించారు. మోదీ ప్రపంచానికే నాయకుడని మెచ్చుకుంటున్నారు. మోదీ కోసం ప్రత్యేకంగా యోగా దినోత్సవం నాడు కోట్లు వెచ్చించి ఒక రోజు కార్యక్రమం నిర్వహించారన్న విమర్శలు కూడా వైఎస్సార్సీపీ, మరికొన్ని పక్షాలు చేశాయి. కేంద్రం బాగా సహకరిస్తోందని ఒకటికి రెండుసార్లు ప్రకటనలు చేస్తున్నారు.జగన్ టైమ్‌లో రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టు తదితర స్కీములకు భారీగానే నిధులు వచ్చాయి. ఆనాటితో పోల్చితే ఈ రెండేళ్లో అమరావతి అప్పు మినహా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి సాధించింది అంతంత మాత్రమే. అయినా ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. వారణాసిలో సైతం మోదీని కొనియాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడు అని అభివర్ణించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చారని చెప్పారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు కూడా మోదీని పొగిడే పనిలో ఉంటున్నారు.గతంలో గుజరాత్‌కే అన్ని చేస్తున్నారని, ఏపీ అంటే మోదీకి అసూయ అని, అమరావతికి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించేవారు. కాని జత కలిసిన తర్వాత మాట మార్చారు. అది వేరే సంగతి. ఇటీవలికాలంలో ఎందుకు ఇంతగా తగ్గి వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఒత్తిడి ఆయనపై అధికంగా ఉందని అంటారు. జనసేన, బీజేపీల నుంచి దానిపై ఒక క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు తన అభిప్రాయం వెల్లడించలేదు. మోదీ ఒప్పుకుంటే ఆ విషయం ఒక కొలిక్కి రావచ్చు.అంతేకాదు... అది జరిగితే తను జాతీయ స్థాయిలో ఏదైనా పదవికి వెళ్లడానికి చంద్రబాబు టార్గెట్ పెట్టుకుని ఉండవచ్చు. అది సాధించాలంటే బీజేపీ ఓకే చేయవలసి ఉంటుంది. కేంద్ర స్థాయిలోకాని, ఇతరత్రా ఏమైనా కేసులు ఉంటే వాటిని పరిష్కరించుకునే పనిలో కూడా ఉండి ఉండవచ్చన్నది కొంతమంది అభిప్రాయం. ఏది ఏమైనా మోదీ జన్మదినోత్సవ పూజలకు వెళ్లడం ద్వారా చంద్రబాబు తన సీనియారిటీని తానే తగ్గించుకున్నట్లు అయిందా అన్న భావన టీడీపీతో సహా ఆయా వర్గాలలో ఏర్పడింది. ఆత్మగౌరవం వంటివాటితో సంబంధం లేకుండా, ఇలాంటి రాజకీయ వ్యూహాలలో ఆయన దిట్టే అన్న అభిప్రాయం కూడా ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేవంత్ వర్సెస్ కేసీఆర్.. భూముల లెక్కల్లో అసలు ట్విస్ట్ ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగం ప్రధానంగా విపక్ష నేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అందులో తప్పులేదు. ఆయనకు ఆ హక్కు ఉంటుంది. కేసీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితులు, కొందరు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూములపై రేవంత్ ఆరోపణలు గుప్పించారు. వీటిపై విచారణ చేసుకోవచ్చని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్ రెడ్డి తదితరులు సవాల్ చేశారు.ఇదే టైమ్‌లో బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఉన్న వాస్తవాలపై కూడా రేవంత్ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ రెండు పార్టీల వాదనలు, పరస్పర ఆరోపణలు విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? రాజకీయ నేతలు తెలంగాణలో భూమిని ఒక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న అనుమానం కలగదా?. రేవంత్ చేసిన ఆరోపణలలో కొన్ని నిజాలు ఉండవచ్చు. కొన్ని నిజం కాకపోవచ్చు. అయినా ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన వివరాలకు ప్రాముఖ్యత ఉంటుంది. కాకపోతే కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల భూములు దోపిడీ చేసిందని ఏదో ఒక ఆరోపణ చేయడం బట్టకాల్చి మీద వేసినట్లుగా ఉంది.రేవంత్ చెప్పిన వివరాల ప్రకారం చూసినా ఆ భూములు విలువ అంత ఉండదని అర్థం అవుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దానిపై మంత్రులు పొంగులేటి, వివేక్, దామోదరలను కమిటీగా వేయడం ఏమిటో అర్థం కాదు. అంటే మొత్తం ప్రక్రియ రాజకీయం అయిపోదా అన్న చర్చ వస్తుంది. కేసీఆర్‌కు ఫామ్ హౌస్‌లో ఎంత భూమి ఉందన్నదానిపై రేవంత్ రెడ్డి గందరగోళంగా చెప్పినట్లు అనిపిస్తుంది.కొంతకాలం క్రితం అక్కడ వెయ్యి ఎకరాలు ఉందని ఆయనే అన్నారు. అసెంబ్లీలో 67 ఎకరాలని ప్రకటించారు. 700 ఎకరాల ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి 388 ఎకరాలు ఉందని రేవంత్ అన్నారు. ఈ భూమిని దళితులకు పంచుతానని అన్నారు. బాగానే ఉంది. కాని నిజంగా ఆ స్థాయిలో ప్రభుత్వ భూమి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉంటే ఈ మూడేళ్ల కాలంలో ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులు పసికట్టలేకపోయారా? కేటీఆర్‌తో పాటు ఆయన సతీమణి, కుమారుడుల పేర ఉన్న భూముల వివరాలు కూడా ఆయన చెప్పారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత పేరిట ఉన్న భూముల గురించి కూడా చెప్పారు. మొత్తం మీద కేసీఆర్ కుటుంబం పరిధిలో 439 ఎకరాలు ఉందని అన్నారు. కేసీఆర్‌కు బంధువులు అయ్యేవారి కుటుంబాలకు ఉన్న భూములన్నీ కేసీఆర్ ఖాతాలో ఎలా వేస్తారో అర్థం కాదు. ఈ లెక్కలన్ని కాస్త గజిబిజిగా ఉన్నాయనిపిస్తుంది. సర్వే బృందాలను హడావుడిగా పంపించినా అందులో ఏమీ తేలలేదన్నది ఇప్పటికి వస్తున్న సమాచారం. ప్రభుత్వం చెబుతున్న భూమిలో దళితులే వ్యవసాయం చేసుకుంటున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. ఆ ధైర్యంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే మొత్తం ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని హరీష్‌రావు సవాల్ విసిరారనుకోవాలి. సిద్దిపేట వద్ద హరీష్ రావుకు చెందిన భూములను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి పరిశీలించారు. తొలుత అక్రమ భూములు అని అన్నారు. ఇప్పుడేమో తక్కువ ధరకు కొన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై క్లారిటీతో ఉంటే మంచిది. గత డెబ్బై ఐదేళ్లుగా వచ్చిన పలు భూ సంబధిత చట్టాలు ఎంతవరకు అమలు అవుతున్నాయో ఈ ఆరోపణల పర్వం తెలియచేస్తుంది.ఇదీ చదవండి: బాబూ.. వాటర్‌మ్యాన్ బిరుదుకు ఇంతే క్వాలిఫికేషనా?!అస్సైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లాండ్ సీలింగ్ భూములు ఇలా అనేక రకాల భూములు కాలక్రమంలో చట్టాలతో నిమిత్తం లేకుండా అన్యాక్రాంతం అవుతున్నమాట నిజమే. కాకపోతే దీనికి ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. భూ సంస్కరణల చట్టం వచ్చిన రోజుల్లో నిర్దిష్ట పరిమితికి మించి ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ లెక్కలు తీసే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదని చెప్పాలి. రేవంత్ రెడ్డి 22 ఎ సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితాలో చేరిన లక్షల ఎకరాల భూమిపై బాధితులకు ఊరట కలిగిస్తారని అంతా అనుకున్నారు. కాని ఆయన చెప్పిన 12 విధానాల వల్ల ఎంతవరకు ఆ సమస్య పరిష్కారం అవుతుందో అప్పుడే తెలియదు.రేవంత్ సీఎం కనుక జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసాన్ని 22 ఎ నుంచి చకచకా తొలగించి ఉండవచ్చు. కాని సామాన్యుడికి ఆ పరిస్థితి ఉండదన్నది నిజం. వారు అధికారుల చుట్టూ తిరగక తప్పదు. ఈ రాజకీయ వేడితో అధికారులు తగు నిర్ణయాలు చేయడానికి వెనుకాడతారు. విశేషం ఏమిటంటే రేవంత్ కేవలం రాజకీయపరంగా మాత్రమే ఆరోపోణలు చేశారు. రాజకీయ నేతలు మాత్రమే భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారా? లేక ఇతర వర్గాలవారు కూడా అలాగే చేశారా? అంతెందుకు! రేవంత్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఒక మీడియా సంస్థ కొనుగోలు చేసిన వేల ఎకరాల భూములలో పెద్ద ఎత్తున అస్సైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దానిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు పోరాటం కూడా చేశారు. ఆ సంస్థ తప్పు చేసిందా? లేక కరెక్టుగా చేసిందా అన్నదానిపై గత కేసీఆర్ ప్రభుత్వం చెప్పలేదు. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కూడా తేల్చదు. దానికి కారణం అందరికి తెలుసు కదా!ఇదొక్కటే కాదు. అనేక మంది బడాబాబులు చట్టాలను ఉల్లంఘించి భూములను కొనుగోలు చేశారనో, అక్రమించారనో తరచు వార్తలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎంత శాతం మందిపై చర్య తీసుకుంటున్నారంటే సమాధానం దొరకదు. కేసీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణల మీద కేటీఆర్ గట్టిగానే స్పందించారు. ఈ క్రమంలో రేవంత్ కుటుంబంపైన ఆయన ఆరోపణలు చేశారు. రేవంత్ జీవితం ఎలా ఆరంభం అయింది? ఆయన ఆర్ధిక స్తితిగతులు ఏమిటి? జూబ్లిహిల్స్‌లో ఎలా ఇంటిని నిర్మించారు? ఆయన సొంత ప్రాంతంలో భూమి ఎలా కొనుగోలు చేశారు అన్నదానిపై విమర్శలు చేశారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ సోదరులకు చెందిన సంస్థకు అతి తక్కువ ధరకు రెండు ఎకరాలు ఎలా ఇచ్చారని కూడా ప్రశ్నించారు.హరీష్ రావు నిర్దిష్టంగా రేవంత్ కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. వీరిద్దరు చేసిన అభియోగాలలో ఎన్నిటికి ఆధారాలు ఉన్నాయో తెలియదు. కాని పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న నేపథ్యంలో ప్రజలలో ఇదొక చర్చగా ఉంటుంది. రేవంత్ వ్యూహాత్మకంగానే 22ఏ అంశాన్ని రాజకీయంగా మార్చారని అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, హామీలు అన్నీ నెరవేర్చడం కష్టమైన పరిస్థితి మొదలైన అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని తెలివిగా కేసీఆర్ కుటుంబంపై భూముల ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మరలించడానికి యత్నించినట్లు అనిపిస్తుంది. 22 ఎ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చినప్పటికీ, రేవంత్ స్వయంగా ఆ విషయంపై మళ్లీ మూడు గంటలు ప్రసంగించడం, బీఆర్ఎస్ పైన, కేసీఆర్ కుటుంబంపైన దాడి చేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.అయితే ఈ క్రమంలో కేసీఆర్ కుటుంబంతో పాటు తన కుటుంబంపై కూడా వచ్చిన ఆరోపణలకు రేవంత్ జవాబు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. హైకోర్టు లేదా సుప్రింకోర్టు సిటింగ్ జడ్జితో ఈ ఆరోపణలన్నిటిపైన విచారణకు సిద్దమని కేటీఆర్, హరీష్‌లు సవాల్ విసిరారు. దీనిపై రేవంత్ లేదా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఈలోగా మంత్రుల కమిటీ వేయడంతో ఈ కధ ఎన్ని మలుపులు తిరుగుతుందో అప్పుడే చెప్పలేం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబూ.. వాటర్‌మ్యాన్ బిరుదుకు ఇంతే క్వాలిఫికేషనా?!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటర్ మాన్ ఎప్పుడు అయ్యారు? వాటర్ మాన్ అంటే రాష్ట్రానికి పుష్కలంగా నీటిని అందించిన వ్యక్తి అన్నమాట. నిజంగా ప్రాజెక్టులు నిర్మించి, ఏపీలో కరువు పరిస్థితిని పారదోలి ఉంటే ఆయన అందుకు అర్హుడు అయి ఉండేవారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయం ఉంది.అయినా ప్రాజెక్టులు ఎవరు నిర్మించినా, నీటిని కొంతమేర విడుదల చేసే అవకాశం వచ్చినంతవరకు క్రెడిట్ తీసుకుంటే ఆక్షేపణ లేదు. కాని మొత్తం ప్రాజెక్టులన్నీ ఆయనే పూర్తి చేశారేమో అన్న విధంగా ప్రచారం చేసుకోండం, దానికి తోడు వాటర్ మాన్ పదాన్ని ఎకనమిక్ టైమ్స్ పత్రిక వాడింది కనుక ఆయనకు సన్మానాలు, అభినందనలు, స్టాండింగ్ ఒవేషన్లు ఇప్పించడం మరీ కృతకంగా ఉన్నట్లు అనిపిస్తుది. పార్టీపరంగా ఏదో చేసుకుంటే చేసుకున్నారులే అనుకోవచ్చు. కాని ఏకంగా అధికారిక సమావేశంలో ఐఏఎస్ అధికారులంతా పాల్గొన్న కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వాటర్ మాన్ అంశాన్ని ప్రస్తావించి చప్పట్లు కొట్టించారు. దానికి చంద్రబాబు మురిసిపోయారు.ఇది ఒక రకంగా అతి ప్రచారంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఐఏఎస్‌లలో చాలామంది సీనియర్లు గత పాతికేళ్లుగా ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని పనిచేసి ఉంటారు. వారందరికి వాస్తవ పరిస్థితి తెలియకుండా ఉండదు కదా! వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన విషయం, ఆ సమయంలో చంద్రబాబు వాటిపై విమర్శలు చేయడం, పోలవరం ప్రాజెక్టుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, అంతేకాక పోలవరం కాల్వలను వైఎస్ తవ్విస్తుంటే తీవ్రంగా అభ్యంతరం తెలిపి, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోల రూపంలో నిక్షిప్తం అయి ఉన్నాయి.అలాగే వెలిగొండ ప్రాజెక్టు టెక్నికల్‌గా సాధ్యం కాదని కొంతకాలం, నిధులు లేవని మరికొంతకాలం చంద్రబాబు కాలయాపన చేసిన అంశంపై వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. అయినా అదృష్టం కొద్ది నీటిని విడుదల చేసే అవకాశం పొందారు. కాని వెలిగొండ ప్రాజెక్టు నీరు నల్లమలసాగర్‌లోకి రావడానికి అవసరమైన టన్నెల్స్ తవ్వకం, ఫీడర్ కాల్వ ఏర్పాటు, డామ్ నిర్మాణం మొదలైనవన్నిటిని చేపట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా!ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నెల్స్‌ను పూర్తి చేసి ఆరంభించిన సంగతి తెలియదా! నిర్వాసితులకు పెండింగులో ఉన్న పునారావాస చర్యలను అరకొరగా చేపట్టి, హడావుడిగా నీళ్లను వదలితే వాటర్ మాన్ అయిపోతారా? అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా, గ్రావిటీ ద్వారా కాకుండా లిప్ట్ ద్వారా నీటిని కాల్వలోకకి తోడితే వాటర్ మాన్ అయిపోయినట్లేనా? ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక కథనాన్ని ఇస్తూ అందులో వాటర్ మాన్‌గా పేర్కొంది.సాధారణంగా వార్త ఇవ్వడం తప్పుకాదు. కాని అతిశయోక్తులతో, లేని బిరుదులు ఆపాదించి స్టోరీలు ఇస్తే ఆ పత్రిక విమర్శలకు గురి అవుతుంది. చంద్రబాబుకు ఎంతవరకు క్రెడిట్ ఇవ్వాలో అంతవరకు కాకుండా, మొత్తం ఏపీకి ఈయనే వాటర్ మాన్ అన్నచందంగా వార్త ఇస్తే జనం నమ్ముతారా? కాకపోతే టీడీపీ ప్రచారానికి వాడుకోవచ్చు. ఒకపక్క ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ నగరంలో సైతం తాగు నీటి కష్టాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఏభై శాతం పైగా వర్షపాతం లోటు ఉందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. వరి వేసుకోవద్దని సలహాలు ఇచ్చారు. రైతులు నానా అవస్థలు పడుతున్న టైమ్ లో చంద్రబాబును వాటర్ మాన్ అని పొగిడితే కాస్త ఎబ్బెట్లు అనిపించదా!ఇదీ చదవండి: కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు నిజానికి భారీ ప్రాజెక్టులపైనే నమ్మకం లేదు. ఆ మాట ఆయన దాచుకోకుండానే గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు వడ్డీ వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు పోలవరం ప్రాజెక్టుపై ఉద్యమం చేస్తుంటే వారిని చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. ఆయన చెరువుల పూడిక తీయడం, పట్టణాలలో ఇంకుడు గుంతలు వంటివాటిపైనే ఎక్కువగా కేంద్రీకరించేవారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఈ భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఫలకాలు వేసి వదలివేసేవారు.నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి తదితరుల సమయంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పోచంపాడు వంటి ప్రాజెక్టులు రాకపోతే ఉమ్మడి ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అంతకు ముందు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండి విజయవాడవద్ద బారేజీ నిర్మించారు. ఆంగ్లేయుడైన కాటన్ దొర తొలుత కృష్ణా, గోదావరి నదులపై డామ్లు నిర్మించారు.ఆ తర్వాత కాలంలో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. అలాగే హంద్రీ-నీవా, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి 48 ప్రాజెక్టులకు జీవం పోశారు. ఆయన చొరవ లేకపోతే పోలవరం, పులిచింతల, వెలిగొండ, పోతిరెడ్డిపాడు విస్తరణ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి కావేమో! వైఎస్ ఆర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను విస్తరిస్తున్నప్పుడు కృష్ణా డెల్టాకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు విజయవాడలో ధర్నా చేయడానికి చంద్రబాబు అంగీకారం ఉందా? లేదా? అలాగే జగన్ పాలనలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌ను చేపడితే, దానిని వ్యతిరేకించడమే కాకుండా, తెలంగాణ సీఎం కోరారని దానిని నిలుపుదల చేయించింది ఈయన కాదా! అయినా వాటర్ మాన్ అని పిలిపించుకుంటే ఏమి చెబుదాం.అవన్ని ఎందుకు! చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంకు జగన్ టైమ్‌లో కదా నీరు వచ్చింది. అప్పటికే సుమారు 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోలేదు? కేవలం నీటిని విడుదల చేస్తేనే వాటర్ మాన్ అయిపోతే ప్రాజెక్టులు ఒక రూపానికి తీసుకువచ్చిన ఇతర ముఖ్యమంత్రులు ఏమి అవుతారు? అసలు వాటర్ మాన్‌గా ప్రసిద్ది చెందిన రాజేంద్రసింగ్ గురించి ఏమి చెప్పుకోవాలి. ఏడారిలో పచ్చదనం సృష్టించిన ఆయన ఘనత తెలియదా! మంత్రి కేశవ్‌కు ఈ విషయాలేవి తెలియక కాదు. కాని చంద్రబాబు మెప్పు పొందడానికి, టీడీపీ ప్రచారానికి ఇది ఉపయోగపడవచ్చు. అంతే తప్ప ఆయన చెప్పింది పూర్తి వాస్తవం కాదు.ఈ పాతికేళ్లలో ఏడెనిమిది సార్లు కరువు పరిస్థితులు ఏర్పడితే అందులో ఐదారుసార్లు చంద్రబాబు పాలనలోనే అని గణాంకాలు ఇస్తూ ఎల్లో మీడియాలోనే ఒక కథనం వచ్చింది. 2014 టరమ్‌లో రెయిన్ గన్స్ ద్వారా కరువు నివారిస్తామంటూ సుమారు 400 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత ఆ రెయిన్ గన్స్ ఏమయ్యాయో తెలియదు. ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ 2004 కి ముందు చంద్రబాబు కొంత హడావుడి చేసి చాలా ఖర్చు చేశారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా పెట్టారు. కాని అది సఫలం అయి ఉంటే దానిని ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించడం లేదు? పోలవరం ప్రాజెక్టును జాప్యం చేసి, పట్టిసీమ వద్ద లిఫ్ట్ పెట్టామని చెబితే సరిపోతుందా? ఆ లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్లు వైఎస్ నిర్మించిన కాల్వలలోనే ప్రవహిస్తున్నది.ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రతినిధికి అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఆ పత్రికలో వాటర్ మాన్ అని రాసేస్తే అయిపోతుందా!అన్ని విషయాలు విశ్లేషించాలి కదా! ఈ మధ్య అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ కథనం అంటూ ఒక దానిని ప్రచారం చేశారు. అందులో వాస్తవాలకన్నా అతిశయోక్తులే ఎక్కువగా కనిపించాయి. దాంతో అంతర్జాతీయ పత్రికలైనా, జాతీయ పత్రికలైనా మేనేజ్ మెంట్‌కు అతీతం కావు అన్న భావన ఏర్పడింది.తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ఆయా యూనివర్శిటీలు ఆసక్తి చూపినా తాను ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారట. గతంలో ఒకసారి చికాగోకు చెందిన ఒక యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని ఆ తర్వాత ఆ యూనివర్శీటీ స్థితిగతులపై అనేక విమర్శలు వచ్చాయి. వీటిని పక్కనబెడితే ఏపీలో కరువును శాశ్వతంగా నివారించే దిశగా ఇప్పటికైనా చంద్రబాబు చిత్తశుద్దితో చర్యలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు ఎవరూ అడగకుండానే ఐఏఎస్ లైనా, మరెవరైనా చప్పట్లు కొడతారన్న సంగతి గ్రహించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!
ఏపీలో మూడు నెలలకో, నాలుగు నెలలకో ఒకసారి జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశాలు పెట్టి ఏం సాధిస్తున్నట్లు?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటల తరబడి ఇచ్చే స్పీచ్‌లను గమనిస్తే, ఒకసారి అంతా బాగుందని చెబుతారు. మరో సారి కలెక్టర్లు, ఐఏఎస్‌లు సరిగా పనిచేయడం లేదని అంటారు. ఈ చెవితో విని ఆ చెవితో వదలివేస్తుంటారని కూడా ఆయనే చెబుతారు. 12 గంటలపాటు కూర్చోలేరా? అని ప్రశ్నించి అధికారులందరిని ఆశ్చర్యపరుస్తారు. ఏవేవో ర్యాంకులు అంటారు. ఫైళ్ల క్లియరెన్స్ అంటారు. ఒక మంత్రి మొదటి స్థానంలో ఉన్నారంటారు. తదుపరి ఆ మంత్రి ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రే మందలిస్తారు. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నామని, లక్షన్నర కోట్లు వ్యయం చేశామని చెబుతారు. అదెలాగో స్కీములవారీగా వివరణ ఇవ్వరు. అందులో నిజం అంత ఎన్నది ప్రజలు లెక్కవేసుకోవాల్సిందే. గత ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి చర్చించరు!అప్పట్లో చంద్రబాబు ప్రకటించిన వివిధ స్కీములకు ఏడాదికి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని ఆనాటి సీఎం జగన్ చెబితే, తమకు సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. ఈ రెండేళ్లలో ఇన్నిసార్లు కలెక్టర్ల సదస్సులు జరిగాయి కదా! ఎంత మేర సంపాదన సృష్టించింది లెక్కలు చెప్పి ఉండవచ్చు కదా! లేదా తాను చేసిన 3.90 లక్షల కోట్ల అప్పే సంపద అని అనుకోమంటారా!. మరోవైపు పెన్షన్దారులలో అనర్హుల పేరుతో ఏరివేయాలని అంటారు. చివరికి పెన్షన్ దారులను తాగుబోతులుగా అభివర్ణిస్తారు. మద్యం షాపులను ఇష్టారాజ్యంగా సిండికేట్లకు ఇచ్చి బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెడతారు. ఎంఆర్పీ మించి ధరకు అన్ని చోట్ల అమ్ముతున్నా,చర్యలు ఉండవుకాని, కలెక్టర్ల సదస్సులో మాత్రం హుంకరిస్తుంటారు.ఎన్నికలకు ముందు సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకుంటే తప్పేముందని,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఆయనే హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయి ఉండవచ్చు. డిఎస్సిని బాగా చేశామని అంటారు. అక్రమాలు బయటపడడంతో డిఎస్సి నిర్వహణ అంతా అధికారులే చూసుకున్నారని చెప్పేస్తారు.చంద్రబాబు చెప్పే అనేక అంశాలలో ఒకదానితో మరొకటి పొంతన ఉండదన్న భావన ఉంది.గత కలెక్టర్ల సమావేశాలలో వచ్చిన సమస్యలే మళ్లీ,మళ్లీ వస్తుంటాయి. అంతా ఏకపాత్రాభినయంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుందని కొందరు అదికారులు వ్యాఖ్యానిస్తుంటారు. కొందరు అధికారులను ఆయన కావాలని అవమానించేలా మాట్లాడారన్న అభిప్రాయం కలుగుతోందన్న ప్రచారం ఐఏఎస్ వర్గాలలో జరుగుతోంది.వీరిని స్కూల్ పిల్లల మాదిరిగా ట్రీట్ చేయడం, తమాషాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది.ఎవరి పని తీరైనా నచ్చకపోతే వారిపై చర్య తీసుకోవచ్చు.లైవ్ లో టీవీ ప్రసారాలు జరుగుతున్నప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఇలా బహిరంగంగా మాట్లాడితే అదికారులలో నైతిక స్థైర్యం దెబ్బతినదా అన్నది ప్రశ్న. అధికారులు కొందరు సమావేశాలకు రాకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి కదా! మంత్రులు, ఐఏఎస్ లు అంతా రావల్సిందేనట.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు రాకపోయినా, ఈ సదస్సులకు హాజరుకాకపోయినా ఇలాగే ప్రశ్నిస్తున్నారా అని ఐఏఎస్ లు గుసగుసలాడుకున్నారట. ఐఏఎస్ లు ఈ చెవితో విని ,ఆ చెవితో వదలివేస్తున్నారని చంద్రబాబే చెప్పిన తర్వాత ఈ సదస్సులకు ఉన్న విలువ ఏమిటో అర్ధం అవుతూనే ఉంది.12 గంటలు కూర్చోవాల్సిందేనని సీఎం ఆదేశిస్తే, బయటకు వెళ్లిన తర్వాత అదికారులు ఏలా ఫీల్ అవుతారో ఊహించుకోపోవచ్చు. ఇదంతా లాఫింగ్ స్టాక్ అవుతుందని గమనించాలి.సుదీర్ఘంగా మాట్లాడడం అలవాటు చేసుకుని గంటల తరబడి ప్రసంగాలు చేస్తే ఎంత ఐఏఎస్ లైనా ఎలా భరించగలుగుతారు? నిజానికి సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంపొందిన ఈ రోజుల్లో రెండు రోజుల పాటు ఇలా కలెక్టర్ల సదస్సులు పెట్టడం అవసరమా?కాదా?అన్న చర్చ ఉంది.అసలు సమావేశాలు వద్దని ఎవరూ అనరు.కాని అవి అర్ధవంతంగా లేకపోతే రెండు రోజుల ఖర్చు వృధా అవడం తప్ప ఏమీ ఉండదు కదా అన్నది కొందరి అభిప్రాయం. రాజకీయ పాలన చేయాలని ఐఏఎస్ లకు,ఐపిఎస్ లకు చెప్పిన తర్వాత ఇంక వారు చేసే సాధారణ పాలన ఏమి ఉంటుంది?తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పిన పనులు చేయడమే కదా రాజకీయ పాలన అంటే!ప్రత్యర్ధి రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఎలాంటి పనులు జరగకూడదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తర్వాత కలెక్టర్లు నెత్తి,నోరు కొట్టుకోవడం తప్ప ఏమి ఉంటుంది?గంటల తరబడి ఉప్యాసాలు ఇచ్చేసి ,ఎవరైనా అధికారులు సమస్యలు చెప్పబోతే వారిని డబాయిస్తే అవి ఎలా పరిష్కారం అవుతాయి.గత సమావేశంలో కూడా అటవీ శాఖ,పర్యావరణ సమస్యలు వచ్చాయి. దానికి చంద్రబాబు ఇచ్చిన చిట్కా ఏమిటో తెలుసా!కాసేపు అటవీ,పర్యావరణ అధికారులు కళ్లు మూసుకోవాలట.అప్పుడు పనులు చేసుకోవాలట. సంబంధిత చట్టాలు చేసింది ఎవరు?వాటిని అమలు చేయవద్దని చెబుతున్నదెవరు? పెన్షన్ల ను,ఇళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇచ్చేసిందట.సాచ్యురేషన్ మోడ్ లో గత ప్రభుత్వం వివిధ స్కీములను అమలు చేసింది. అంతకంటే ఎక్కువ ఇస్తామని హామీలు గుప్పించి,కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత దానిని చంద్రబాబు తప్పుపడుతున్నారు.అది సరికాదని అనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసివేసి ఉండాలి కదా!రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపి స్థానిక ఎన్నికలకు ముందు పెన్షన్లు ఇవ్వడంలోకాని, అనర్హతతో రద్దు చేసే ఆలోచనకాని ఎందుకు చేస్తున్నట్లు?ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తమకు కావల్సినవారికే పెన్షన్ దరఖాస్తులు అప్ లోడ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే వైఎస్సార్సీపీ మద్దతుదారుల పెన్షన్లు రద్దు చేయడానికి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలట. అదేమిటో అర్ధం కాదు.ఒక వయసు వచ్చాక ఎవరి బతుకు వారు బతుకుతారు. వారిలో అర్హులైనవారికి పెన్షన్లు,ఇళ్లు వంటివాటిని ప్రభుత్వాలు మంజూరు చేస్తాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల పేరుతో వీటిని తగ్గించాలని చూస్తున్నారా అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.దీనికి ఎల్లో మీడియా పెట్టిన హెడింగ్ ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు చీలిపోవాలా?దీనిని చంద్రబాబు ఆచరించి చూపారా అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.కుటుంబం ఒక యూనిట్ అయితే పెన్షన్లు, ఇళ్లు తదితర అన్నీ స్కీములలో లబ్దిదారులు బాగా తగ్గిపోతారన్నమాట.ప్రస్తుతానికి లబ్దిదారులను యధాతధంగా కొనసాగిస్తామని అంటున్నా,దానికి గ్యారంటీ ఏమి ఉంటుంది. కొంతమందికి ఒక విధానం, మరికొందరికి ఇంకో విధానం ఉంటుందా? ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ఎలా చెప్పారు?అప్పుడు ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించలేదా?యధా ప్రకారం వైఎస్సార్సీపీపైన పరోక్ష విమర్శలు చేయడం, ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్ లను వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ,లేదా మరికొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా అధికారులను పురికొల్పడం కోసం కలెక్టర్ల సమావేశాలు పెట్టాలా? ఇప్పటికే పోలీసు, అధికార యంత్రాంగం ద్వారా అన్ని కుట్రలు చేస్తున్నారు కదా! పైళ్ల క్లియరెన్స్ అంటూ లెక్కలు చెప్పడం ఆయనకు ఎప్పటి నుంచో అలవాటే. దాదాపు ప్రతి రోజు ఆయా జిల్లాలకు వెళ్లి సభలు పెట్టి అధికారులకు ర్యాంకులు ఇస్తున్న చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ర్యాంకులు అంటూ కధ నడపడం దేనికి?. విశేషం ఏమిటంటే చంద్రబాబేమో అన్ని పనులు చేసేయాలని హుకుం జారీ చేస్తుంటారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?ఆర్ధిక మంత్రి కేశవ్ ఏమో బడ్జెట్ తో సంబంధం లేకుండా మితిమీరి ప్రతిపాదనలు వస్తుంటే ఒత్తిడి అవుతోందని అంటున్నారు.నిధులు ఇచ్చినా,ఇవ్వకపోయినా పనులు జరగాలంటే అది ఎలా అవుతుంది. చివరికి అసలు విషయం ఏమిటంటే తమది రాజకీయ పాలన కనుక కూటమి నేతలకు అధికారుల వద్దకు వస్తే గౌరవించాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రజలు ఎవరు వచ్చినా, ఏ రాజకీయ పార్టీవారు వచ్చినా మర్యాద ఇవ్వండి అని చెప్పవలసిన చంద్రబాబు ఇలాంటి ప్రసంగాలు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం అనిపించదా!అయినా ఆయన తప్పులేదనుకోవాలి.రాజకీయ పాలన చేస్తామని ఆయన చెబుతుంటే జనం నిలదీయనంతకాలం ఇలాంటి నేతలు ఇలాగే పాలన చేస్తారు.-కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మౌనమే కేసీఆర్ అస్త్రం.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్‌కు గులాబీ బాస్ చెక్
తెలంగాణ అసెంబ్లీ బయట,లోపల జరిగిన కొన్ని పరిణామాలు ఏ మాత్రం ఆహ్వానించదగినవి కావు.ఈ సందర్భంగా కాంగ్రెస్,బిఆర్‌ఎస్‌లు పరస్పరం చేసుకున్న ఆరోపణలు కూడా వినడానికి బాలేదు.శాసనసభ వద్ద జరిగిన ఘటనల ఆధారంగా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఈ రెండు పార్టీలు యత్నించాయి. మరో రెండు ఏళ్లలో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ఇప్పటి నుంచే ఈ పార్టీలు వ్యూహ రచనలో తీవ్రంగా పోటీ పడుతున్న సంగతి కనిపిస్తున్నదే.బీఆర్ఎస్ అసెంబ్లీలో అనుసరించబోయే వ్యూహాన్ని ముందుగానే రేవంత్ పసికట్టినట్లున్నారు. నల్ల షర్టులతో శాసనసభలోకి అడుగుపెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన తెలుపుదామని భావించిన బీఆర్ఎస్కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. నల్ల షర్టులపై ఏవో నినాదాలు ఉన్నాయన్న సాకుతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను గేటు బయటే అడ్డుకున్నారు. బహుశా ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ ఊహించి ఉండకపోవచ్చు.నిజానికి బీఆర్ఎస్ నేతలు నినాదాలతో ఉన్న షర్టులతో రావడం ;పెద్ద తప్పేమీ కాదు.అయినా రాజకీయంగా మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ ప్లాన్ వేశారని అనుకోవాలి. ఆ క్రమంలో పోలీసులతో బీఆర్ఎస్ నేతలకు జరిగిన గొడవలు,వారిపై ఎదురు కేసులు పెట్టే పరిస్థితి రావడం వంటివి జరిగాయి. అంతేకాక తాతా మధు అనే ఎమ్మెల్సీ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య బీఆర్ఎస్ను డిఫెన్స్‌లో పడేసింది. దానికి ప్రతిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులపై పోలీసులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం అంటూ పార్టీ నేతలు విమర్శలు చేసినా,ఆశించిన రీతిలో ఆ ఇష్యూ పెరగలేదు.అదే టైమ్‌లో అసెంబ్లీలో స్పీకర్ కంటతడి పెట్టుకోవడంతో బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందిగా మారంది.దానిపై మాజీ మంత్రి హరీష్ రావు తమ వాదన వినిపించినప్పటికీ పెద్దగా ప్రయోజనం జరగలేదు.పైగా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సభ నుంచి సస్పెన్షన్‌కు గురి కావల్సి వచ్చింది.దాంతో బీఆర్ఎఎస్ లేవనెత్తాలని అనుకున్న ప్రజా సమస్యలు వెనక్కి పోయినట్లయింది. అందువల్లే 22ఎ నిషేధిత భూముల వివాదంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అనుకున్నా బీఆర్ఎస్కు అది కుదరలేదు.అలాగే మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా ఉదంతం గురించి ప్రస్తావించే అవకాశం వీరికి రాలేదు. ముఖ్యమంత్రి సోదరులపై కేటిఆర్ తదితరులు చేస్తున్న ఆరోపణలను శాసనసభలో ప్రస్తావించలేపోయారు.అందువల్లే కేటిఆర్,హరీష్ రావులు ప్రత్యేకించి ఫ్యూచర్ సిటీలో రేవంత్ సోదరుడు తక్కువ ధరకు భూమి పొందారంటూ అక్కడకు వెళ్లి నిరసన తెలిపారు.అయినా ఇలాంటి విషయాలు సభలో చర్చించితే వచ్చే ప్రాధాన్యత వేరే ఉంటుంది. అలాగే రికార్డులలో ఎప్పటికి ఉండిపోతుంది.22 ఎ భూముల అంశంపై కూడా పార్టీ ఆఫీస్‌లో బాదితులతో ఒక కార్యక్రమం పెట్టడం ద్వారా కొంత కవర్ చేసుకునే యత్నం చేశారు. ప్రతిపక్ష నేత కేసిఆర్ ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సమావేశమై వ్యూహ రచన చేసుకున్నా పెద్దగా ఫలించినట్లు అనిపించదు. రేవంత్ ఇంతవరకు బీఆర్ఎస్ను అసెంబ్లీలో నిలువరించినప్పటికీ,కొన్ని చర్యల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదన్న విమర్శ జనంలోకి వెళ్లవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటువద్దే అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారన్న విమర్శకు గురి అయ్యారు.పార్లమెంటులో రాహుల్ గాంధీ నల్ల షర్టుతో వెళ్లినప్పుడు ,తాము వెళితే తప్పేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ తరహా నిరసనలు ఆయా రాష్ట్రాలలో జరుగుతూనే ఉంటాయి. ఏపీలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి వేరు పడిన తర్వాత నల్ల షర్టు వేసుకుని అసెంబ్లీలో ప్రధాని మోడీపై తీవ్రమై విమర్శలు చేశారు.గతంలో ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి నిరసనలు జరిగేవి.సభ గేటు వద్ద జరిగిన ఘటనలను, స్పీకర్ పై ఓ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను కెసిఆర్ కు ముడిపెట్టి ఇదంతా ఫామ్ హౌస్ కుట్ర అని ప్రచారం చేయాలని రేవంత్ భావించారు.కాని అది కూడా అంతగా సఫలం అయినట్లు అనిపించదు.రేవంత్ ఎలాగొలా కేసీఆర్‌ను రెచ్చగొట్టి కేసీఆర్‌ను ముగ్గులోకి లాగాలనే తాపత్రయపడుతున్నారు. కేసీఆర్,తను ఒకటే స్థాయి అని,ఆ మాటకొస్తే కేసీఆర్ కన్నా తానే పవర్ ఫుల్ అని నిరూపించుకోవడానికి ఆయన యత్నిస్తుంటారు. కాని కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండడం ద్వారానే సమానం చెబుతున్నారు.స్పీకర్ దళిత వర్గానికి చెందినవారు కనుక ఆ కోణం తీసుకుని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద కొందరు నేతలను , దళిత సంఘాలను పంపి నిరసన చెప్పే ప్రయత్నం చేయడం అంత పద్దతిగా లేదు.దీనివల్ల కాంగ్రెస్ కు ఎంత లాభం వచ్చిందో చెప్పలేం.పైగా ప్రభుత్వంలో ఉండి ఘర్షణ వాతావరణం సృష్టించారన్న విమర్శ వచ్చింది.ఈ సందర్భంలో గతంలో బీఆర్ఎస్లో ఉన్న దళిత ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి ,కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఎంత తీవ్రమైన విమర్శలు చేశారో తెలిపే వీడియోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రవెల్లి వద్ద శుద్ది కార్యక్రమం నిర్వహించారు.అది కూడా సరైనదేనా అన్నది ఆలోచించుకోవాలి.కాకపోతే రేవంత్ ఈ క్షుద్రపూజలు,చేతబడులువంటివాటిని నమ్ముతారు కనుక ఆయనను భయపెట్టడానికి ఏమైనా చేశారేమో తెలియదు.పసుపు నీళ్లు చల్లినవారిని అరెస్టు చేసిన పోలీసులు ,ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన కాంగ్రెస్ వారిపై కూడా చర్య తీసకోవాలి కదా!తెలంగాణ పోలీసులు ఎపిలో కన్నా బెటర్ అనుకుంటున్న తరుణంలో ఇలాంటివి జరగడం సరికాదు. డీజీపీ సీవీ ఆనంద్‌కు గతంలో మంచిపేరే ఉంది.కాని ఇప్పుడు ఆయన చేతిలో ఏమి లేదని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే కేటిఆర్,హరీష్ తదితరులపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం మరీ దారుణంగా ఉంది. ఒక లేడీ కానిస్టేబుల్ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణతో ఈ కేసు పెట్టడం వల్ల ప్రభుత్వానికి,రేవంత్‌కు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. పైగా ఇలాంటివి బూమ్ రాంగ్ అవుతాయని కాంగ్రెస్ గమనించాలి.ఎపిలో కూడా ఇలాంటి దిక్కుమాలిన కేసులను రేవంత్ గురువైన చంద్రబాబు ప్రభుత్వం తీరు విమర్శలకు గురి అవుతోంది. మరో సంగతి ఏమిటంటే అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలపై రేవంత్ ఫ్లాష్ సర్వే చేసుకుంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితం వచ్చిందట. అలాగే బీఆర్ఎస్ కూడా ఒక సర్వేని ప్రచారంలోకి తెచ్చి తాము అదికారంలోకి రాబోతున్నామని దీమాను వ్యక్తం చేసింది.రెండేళ్ల తర్వాత ఈ సర్వేల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేం.కాకపోతే ఓవరాల్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నెగిటివ్ వాతావరణాన్ని ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండవచ్చు.మరో వైపు బీజేపీ కూడా తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయత్నాలు చేస్తోంది. కాని పరిస్థితి లోక్ సభ ఎన్నికలలో మాదిరి అనుకూలంగా ఉంటుందా?అన్నది చర్చనీయాంశంగా ఉంది.అసెంబ్లీలో బిజెపి సభ్యులు 22 ఎ తదితర అంశాలపై మాట్లాడారు.వారు బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌లు రెండిటిని విమర్శించారు.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22 ఎ పై జవాబు ఇచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించినా ప్రజలలో మాత్రం దీని అలజడి తగ్గలేదు. అసెంబ్లీ వరకు రేవంత్ వ్యూహం కొంత ఫలించినా, అసెంబ్లీ వెలుపల కేటిఆర్,హరీష్ లు నిర్వహించిన కార్యక్రమాలతో ప్రజలను కొంతమేర ఆకర్షించగలిగారు. కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్‌ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్‌ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్‌ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్‌ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్‌పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తన అనుభవ రాహిత్యం ఏమిటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి. గాజు ఇంటిలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు వేస్తే ఏమవుతుందో అర్దం అయి ఉండాలి. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బుకాయింపులు, అసత్యాలు వల్లె వేయడం వంటివి నేర్చుకున్నారు కాని, ఆయన మాదిరి ఎదుటివారిపై నెట్టివేయడం అలవాటైనట్లు లేదు. అందువల్లే ఇప్పుడు లోకేష్ సవాళ్ల పర్వం నుంచి పనిచేసేవారికే రాళ్ల దెబ్బలు అంటూ సెంటిమెంట్ ప్రయోగించే యత్నం చేశారు. లేదంటే కోర్టుకు వెళ్లండని అంటున్నారు. కొందరు అభ్యర్దులు కోర్టులకు కూడా వెళ్లారు. కానీ అవి ఎప్పటికి విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.ఏపీలో టీచర్ల ఎంపికలో ఎన్ని గందరగోళాలు జరిగాయో రోజురోజుకు తేటతెల్లమవుతున్నప్పటికీ, చర్చకు సవాల్ అంటూ లోకేష్ డాంబికంగా మాట్లాడి దెబ్బతిన్నారు. పదిసార్లు తాను చర్చకు సవాల్ విసిరినా మాజీ సీఎం జగన్ సిద్దం కాలేదని ఒక అసత్యపు ప్రచారం చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి బయటపడవచ్చని తొలుత అనుకున్నట్లున్నారు. కానీ నిజం నిప్పులాంటిది అంటారు. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే క్రీడల కోటాలో నకిలీ సర్టిఫికెట్తో, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందినవారి బాగోతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఇతర కేటగిరీలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. తొలుత ఎస్ఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ మొదటి ర్యాంకు సాధించడం, ఆ తర్వాత అతనిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అక్కడ పరీక్ష పత్రం లీక్ అయిందన్న అనుమానంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, తిరుగు లేని ఆధారాలతో స్కామ్ బయటపడిందన్న విషయం బోదపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన పార్టీ నేతలు వీటికి సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తున్నా వాటికి జవాబు ఇవ్వడంలో మంత్రి లోకేష్, టీడీపీ నేతలు విఫలం అయ్యారు. సవాళ్లు చేస్తూ టీడీపీ కేడర్‌లో ఒక నమ్మకం కలిగించడానికి లోకేష్ ప్రయత్నించారు. ఆయనను రక్షించడానికి చంద్రబాబు కృషి చేశారు. అందులో భాగంగానే లోకేష్ గురుపూజోత్యవం నాడు మాట్లాడుతూ పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటి?.డీఎస్సీ పెట్టింనందుకు కాదు.. అక్రమాలు జరిగినందుకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే ఎలా కుదురుతుంది?. సమాజంలో గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది తన తండ్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా, యువకుడిగా ఉన్న లోకేష్ అసత్యాలు చెప్పడం మాని, అహంకారంతో ప్రవర్తించడం మాని, హుందాగా రాజకీయాలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నిత్యం అంతా మాట్లాడుకునేదే. జగన్‌కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని అనడం ద్వారా ఏదో ఆత్మ సంతృప్తి చెంది ఉండవచ్చు కానీ, ఆయన విసిరిన సవాల్ గురించి లోకేష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?. డీఎస్సీ అన్న పదం రెండుసార్లు వాడినందుకే తప్పుపడుతున్న లోకేష్ తెలుగులో ఎన్ని తప్పులు మాట్లాడతారో మర్చిపోతే ఎలా?. అదే జగన్ తన టైమ్ లో జరిగిన ఏపీపీఎస్సీపై చేస్తున్న అభియోగాలు, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరారే!. తాను పదిసార్లు సవాల్ చేసినా చర్చకు రాలేదని, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం?. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వపరంగా ఏ తప్పు చేసినా, తెలివిగా అధికారుల మీద తోసేసి తప్పించుకుంటారు. ఉదాహరణకు ఈ మధ్య ఆయా సభలలో అధికారులను నిలబెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగోలేదు కదా అని ప్రజలను ప్రశ్నించి అధికారులను నిందిస్తే ఏం లాభం. నిధులు ఇవ్వకుండా తమపై రుద్దడం ఏమిటా అని అధికారులు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏదైనా స్కామ్ జరిగితే, అందులో తనకు ఇబ్బంది వస్తుందనుకుంటే వ్యూహాత్మకంగా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని డ్రామా నడిపిస్తారు. ఎవరో కొందరిని ఆ సమయానికి బలి చేసి కథ ముగిస్తారు. ఉదాహరణకు గాదె సాయికృష్ణ అనే నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించిన ఘటనను కేవలం అక్కడి సీఐ, ఆ దిగువ ఉండే కానిస్టేబుళ్ల వద్దే ఆపేశారు తప్ప, పై అధికారుల దాకా వెళ్లకుండా సిట్ పేరుతో కధ నడిపించేశారు. ఎందుకంటే అది పై దాక వెళితే తనకు కూడా తలనొప్పి అవుతుందని తెలుసు కాబట్టి అన్నమాట.రాజమండ్రి పుష్కరాలలో పబ్లిసిటీ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారన్న అభియోగాలు వచ్చాయి. ఆ ఘటనలో తను చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? అని ఎదురుదాడి చేశారు. తిరుమలలో 20 మంది ఎన్కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా అది సంచలన ఘటన. దానిని కూడా ఎలా ముగించారో చూశాం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చంపడం తప్పుకాదన్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. చంద్రబాబు ధోరణి అలా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, వాటిని తుస్సు మనిపించడం, తాను అబద్దం ఆడుతున్నానని తెలిసినా, ప్రజలను నమ్మించడానికి వాటినే వల్లించడం వంటివి చంద్రబాబు చేయగలరన్న అభిప్రాయం వివిధ పక్షాల నేతలలో ఉంది. ఈ విషయం వరకు బాగానే నేర్చుకున్నట్లు కనిపించిన లోకేష్, తన అనుభవ రాహిత్యంతో డీఎస్సీ అక్రమాల కేసులో ఇరుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది.వైఎస్ జగన్ ఈ అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించిన వెంటనే, ఆధారాలు ఉన్నట్లయితే తప్పక చర్చ తీసుకుంటామని, ఇందులో తనకు పాత్ర లేదని, అధికారులదే తప్పేమైనా ఉందేమోనని అని ఉంటే కొంతైనా తప్పించుకోగలిగేవారేమో. కానీ లోకేష్ మొత్తం వ్యవహారాన్ని తన భుజాన వేసుకుని డీఎస్సీ క్రెడిట్ అంతా తనదేనని ప్రొజెక్టు చేసుకునే క్రమంలో అందులోని డెబిట్ మొత్తం తన ఖతాలో వేసుకోవలసి వచ్చింది. ఇదే సమయంలో యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు ఉన్నవారికి క్రీడా కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణను వైఎస్సార్సీపీ చేస్తోంది. అది నిజమైతే వారికి టీచర్ల ఉద్యోగాలు ఇప్పించానన్న సంతోషం కన్నా, అది స్కాంగా మారి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న టెన్షన్ లోకేష్‌కు ఏర్పడుతుంది. జగన్ వీటన్నిటిపైన ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తూ మరిన్ని అనుమానాలను చంద్రబాబు, లోకేష్ కలిగించారు.చిత్రంగా ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మరిన్ని డౌట్లు క్రియేట్ చేసుకున్నారు. టీచర్ పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నేరుగా ఆరోపిస్తున్న అభ్యర్దుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఆధారాలు తీసుకుని చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కదా!. ఎంపికైన టీచర్లందరిని వైఎస్సార్సీపీ తప్పుపట్టకపోయినా వాళ్లతో కర్నూలు, విశాఖపట్నం తదితర చోట్ల ర్యాలీలు తీయిస్తే ఏం ప్రయోజనం?. చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో కాని, ఇతరత్రా కాని కొందరు అభ్యర్దులు చెబుతున్న వాటిలో నిజానిజాలు ఏమిటో తేల్చడానికి ఎందుకు లోకేష్ సిద్దపడలేకపోయారు. తాము జవాబు ఇవ్వలేకపోతుండటం, సంబంధిత అధికారులతో మీడియా సమావేశాలు పెట్టించారు. వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతమయ్యారు. కొన్ని అంశాలలో విచారణ జరుగుతోందని, పరిశీలిస్తున్నామని తప్పించుకునే ధోరణిలో అధికారులు చెప్పవలసి వచ్చింది.జగన్ టైమ్‌లో సుమారు లక్షన్నర మంది సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఒక్క అక్రమం జరిగినట్లు కూడా ఆరోపణలు రాలేదు. గతంలో ఏ అంశంపైన అయినా, ఏ ఆరోపణ వచ్చినా, ఎలాంటి విచారణకైనా జగన్ ఆదేశించేవారు కదా!. ఆ ధైర్యం చంద్రబాబు, లోకేష్లలో ఎందుకు కొరవడుతోంది?. దీనికి తోడు సుప్రీంకోర్టు తాజాగా వేరే రాష్ట్రంలో టీచర్ల ఎంపిక కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా వీరికి మరింత ఆందోళన కలిగిస్తుండవచ్చు. కాగా, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరమే. చిత్రంగా పవన్‌తో కలిసి టీచర్ నియామక పత్రాలు అందించామని చంద్రబాబు ఒక స్పీచ్‌లో చెప్పారు. కానీ అసలు ఆ ప్రోగ్రాంలో తండ్రి, కొడుకులు తప్ప పవన్ లేరు కదా అని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే పవన్‌కు కూడా ఈ బురద అంటిస్తే బెటర్ అనుకున్నారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్కామ్ నేపథ్యంలో పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులు తొలగించడం వంటి చర్యలు చేస్తున్న కొద్దీ స్కామ్‌పై జనంలో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్’ రాజకీయం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా సెంటిమెంట్ రాజకీయాలను పండించడానికి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల కార్యక్రమాలను అమలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తొలుత వెలుగొండ ప్రాజెక్టు నుంచి , ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాని ఆ సందర్భంగా ఆయన అనుసరించిన పద్దతులు, చేసిన ప్రసంగాలు చూస్తే , డైవర్షన్ రాజకీయాలలో భాగమేనా అన్న సందేహం కలుగుతుంది. స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో ఉండవచ్చు. కాగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ ఎలా చేశారో అంకెలతో సహా జగన్ వివరించారు. ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వకు గ్రావిటీ ద్వారా కాకుండా, అప్పటికే అమలులో ఉన్న పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తోడి ఈ కాల్వలో పోసి అదేదో ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని జగన్ విమర్శించారు. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి తంటాలు పడుతున్నట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చి ,సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిని ప్రజలు విశ్వసించడం లేదు. అంతా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చెబుతున్నారేమిటా అని చర్చించుకుంటున్నారు. మరో వైపు రెడ్ బుక్ పేరుతో పోలీసుల ద్వారా అరాచకాలు సాగుతున్న వైనం ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తోంది. ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహంతో ఉన్నారు.విశాఖలో డేటా సెంటర్ల పేరుతో జరిగే కాలుష్య విధ్వంసంపై మేదావులు గళమెత్తుతున్నారు. అమరావతిలో మాత్రం వేల కోట్ల అప్పులు తెచ్చి అదిక అంచనాలతో నిర్మాణాలు జరుగుతున్న తీరుపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. జగన్ మావిగన్ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కారిడార్ అభివృద్దిని ప్రతిపాదించడంతో ఇరుకున పడ్డ చంద్రబాబు దానిని ఆవిగన్గా (అమరావతి, విజయవాడ, గుంటూరు) మార్చుకున్నారు. అయినా ఖర్చు మాత్రం కేవలం 29 గ్రామాల పరిదిలోనే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. డిఎస్సి అక్రమాలతో సహా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు చికాకుగా మారాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందన్న భావన ఏర్పడింది. ఈ నేపధ్యంలో వాటిని కొంతమేర పక్కదారి పట్టించి ప్రజలలో ప్రాజెక్టులకు సంబందించి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల కార్యక్రమాలు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే వెలిగొండలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం చేయకుండా, హడావుడిగా నీటిని విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం తన ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. దానిపై జగన్ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.ఇక ఆ వెంటనే పోలవరం ఎడమ కాల్వకు నీరు అంటూ మరో ప్రోగ్రాం నిర్వహించారు. నిజంగానే పోలవరం ప్రాజెక్టు అందరూ ఆశించినట్లు పూర్తి చేసి,నీటి విడుదల జరిగి ఉంటే అంతా సంతోషిస్తారు. కాని గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన పుష్కర స్కీమ్ మోటార్లను వాడి కాల్వలో నీటిని పారించారట. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుకార్చినట్లు అవుతుందన్న భయం ప్రజలలో ఏర్పడుతోంది. మార్కాపురం వద్దకాని, అనకాపల్లి జిల్లా పాయకరావు పేట వద్ద కాని, ఆయన పంచెకట్టుతో రావడం, సాశ్టాంగ నమస్కారం చేయడం, సభికులతో గోదావరి నీళ్లు వచ్చాయి అంటూ గట్టిగా చెప్పించడం, రకరకాల సెంటిమెంట్లను చొప్పించడం వంటివి చేశారు. నిజంగా ఎడమ కాల్వను ఆయనే నిర్మాణం చేపట్టి ఉంటే చెప్పుకోవచ్చు. కాని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్వలు తవ్వించడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరిందన్నది వాస్తవం. కాకపోతే చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం ఇష్టం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఎడమ కాల్వకు మోటార్ల ద్వారా నీరుఎత్తిపోయవలసిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు, గత టరమ్ లో పట్టిసీమ లిఫ్ట్ ను పెట్టి హడావుడి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కుడి కాల్వ ద్వారా నీటిని విజయవాడ వద్ద కృష్ణానదికి తీసుకువెళ్లారు. అప్పట్లోనే పట్టిసీమ కాకుండా పోలవరానికి ఆ డబ్బు ఖర్చు చేసి సత్వరమే ప్రాజెక్టును సిద్దం చేయాలని అనేక మంది సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు.ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల ద్వారానే నీటిని తరలిస్తున్నానని చెప్పుకోవచ్చేమో కాని, దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో పట్టిసీమ ద్వారా నీటిని తరలించి కృష్ణా డెల్టాకు సాగుకు అందిస్తున్నామని గొప్పగా ప్రకటించారు. పూజలు కూడా చేశారు.కాని ఆ తర్వాత గోదావరిలో నీరు తగ్గడంతో పట్టిసీమ నుంచి నీరు రావడం తగ్గిపోయింది. దాంతో కృష్ణా డెల్టాలో సైతం పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రస్తుతం పుష్కర మోటార్లను వాడి నీటిని విడుదల చేశారు. కాని ఈ నీరు పూర్తిగా రైతులకు అందడానికి ఇంకా సమయం పడుతుంది. మోటార్లపైనే ఎప్పటికీ ఆధారపడడం అంత మంచిది కాదని అనుభవం చెబుతోంది. అలాగే ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. కాకపోతే జనాన్ని ప్రస్తుతానికి మభ్య పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ పోలవరంపై డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు నుంచి ఇచ్చినట్లు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవే కదా అని అంటూ, అయినా ఈ డ్రామా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తమపట్నానివి అయితే, కాల్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చేసిందేమిటని అన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లా? లేక 41.15 మీటర్లకే పరిమితమా? అని జగన్ సూఠిగా అడిగారు.ఈ అంశంపై చంద్రబాబు స్పందించగలిగితే బాగుంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై ప్రేమ అంతా ప్రసంగాలకే పరిమితమా అని జగన్ ఎద్దేవ చేశారు. ఒక వేళ 41.15 మీటర్ల వద్దే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతే ఈ కాల్వల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.మరో వైపు పోలవరం నిర్వాసితుల కాలనీలలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎడమ కాల్వ నీటి విడుదలపై కామెంట్ చేస్తూ 26 నెలల్లో ఎడమ కాల్వ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన ఉంటే ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో టైమ్ లో భూ సేకరణ, ఆ తర్వాత కాల్వ తవ్వకం, తదితర నిర్మాణాలు సాద్యమవుతాయా అని వారు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి వ్యయం జనానికి కన్పించకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేయడం లేదని ప్రచారం చేసుకోవడానికి ఈ నీటి విడుదల కార్యక్రమాలు నిర్వహించారా అన్నది చర్చగా ఉంది. అదే లక్ష్యం అయితే ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా? -
సురేఖ ఎపిసోడ్.. కాంగ్రెస్‌లో రేవంత్ బలపరీక్ష నెగ్గినట్టేనా?
రాజకీయాలలో సరైన వ్యూహం లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆమె రాజకీయంగా నష్టపోయారు. అదే టైమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను కొంతవరకు దెబ్బతీశారు. విపక్షాలకు ఆమె కొన్ని ఆయుధాలు అందించారు. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు పార్టీలో పట్టు ఉందని నిరూపించడానికి శ్రమించాల్సి వచ్చింది.కొండా సురేఖతో గత కొన్ని నెలలుగా రేవంత్‌కు కారణం ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయి. అయినా ఆమెను మంత్రిగా కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను పదవి నుంచి తప్పించారని సురేఖ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అన్నది పక్కనబెడితే దాదాపు రెండువారాల పాటు సాగిన ఈ డ్రామా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పరపతి కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే డైలాగులకు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ టీడీపీ వాసన వదలుకోలేకపోతున్నారన్న భావన పలువురిలో ఉంది. కాకపోతే పైకి అనడం లేదు.సురేఖ, ఆమె భర్త మురళీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్లే ఆయా పార్టీలు వారిని ఆదరించక తప్పలేదు. అంతవరకు ఓకే కాని కొండా దంపతులు దానిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు వారిది ఘర్షణాత్మక రాజకీయమే. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డితో తప్ప, ఆయా పార్టీల నేతలు పలువురితో గొడవలు ఉండేవి. రెండున్నర దశాబ్దాల తర్వాత, లక్కీగా మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సఖ్యత లేకపోవడం పెద్ద మైనస్‌గా కనిపిస్తుంది. పోనీ రాష్ట్ర స్థాయిలో ఎవరితోనైనా అవగాహనతో ఉన్నారా అంటే అదీ కనిపించదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేడా వచ్చాక, తెలివిగా వేరే ముఖ్యమైన నేతలు, మంత్రుల మద్దతు పొందే యత్నం చేయాలి. కాని వీరు రేవంత్ సోదరులపైన, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నేతలు పలువురిపైన ఆరోపణలు గుప్పించారు. దాంతో ఈమెకు అండగా నిలవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌లో ఏర్పడిన పరిణామాలలో తొలుత వైఎస్సార్ కుమారుడు జగన్‌కు మద్దతుగా ఉన్నా, తదుపరి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో అనవసర విమర్శలు చేశారు. రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయనను వ్యతిరేకించారు. నిజానికి అప్పట్లో రఘువీరారెడ్డి వంటి వారు కూడా రోశయ్య క్యాబినెట్ లో చేరడానికే ఇష్టపడలేదు. కాని తదుపరి సర్దుకుపోయారు. కొండా సురేఖ మాత్రం అలా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా, మళ్లీ అక్కడే గొడవే అయింది. కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం విశేషమే. రేవంత్‌తో మొదట సత్సంబంధాలు ఉన్నా, కారణం ఏమిటో కాని తేడా వచ్చింది. ఈమె భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉండవచ్చు. ఇంకేదైనా కావచ్చు. పరకాలలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం వీరికి ఆగ్రహం తెప్పించింది. కొండా కుమార్తె సుస్మిత దానిపై ఒక సభలో తీవ్రమైన భాషలో ప్రసంగం చేయడం, రేవంత్‌పై ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. దానికి ముందు ఒఎస్‌డి కేసులో మంత్రి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈమె పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎలాగో రాజీ చేశారు. కాని ఈసారి రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారు.నిజానికి తన కుమార్తె సీఎంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వెంటనే సురేఖ నిలువరించి ఉండాల్సింది. లేదా ఆ వెంటనే ఖండించి ఉండాల్సింది. ఎందువల్లో సురేఖ ఆ పని చేయలేదు. దాంతో వివాదం ముదిరింది. ఎంత కాదన్నా ముఖ్యమంత్రికి ఉండే పవర్ వేరు. ఆమె తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, ఇతరత్రా విమర్శలు చేసినా, ప్రయోజనం ఉండదు. క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చినప్పుడు సారీ చెబితే అయిపోయేదానికి మంత్రి పదవి పోయేవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏఐసీసీకి ఇచ్చిన లేఖ బయటపెట్టినా పెద్దగా ప్రకంపన ఏమీ రాలేదు.బహుశా ఆమె భర్త మురళీ ఆమె రాజకీయ ఎదుగలకు, అలాగే పతనానికి కూడా కారణమా అన్న విశ్లేషణ వస్తుంది. దానికి తగినట్లే మురళీ ఇంత జరిగిన తర్వాత మీడియాకు కనిపించేలా మీసం మెలి తిప్పుతూ కన్పించారు. అంటే జనంలో తనకు అంత పట్టు ఉందని చెప్పదలిచి ఉండవచ్చు. కాని వర్తమాన రాజకీయాలలో ఎన్నికలు వచ్చేవరకు అధికారంలో ఉన్నవారిదే పెత్తనం అవుతుంది. ఇవన్ని వారికి అనుభవమే అయినా, ఏ ధైర్యంతో ఇలా చేశారో తెలియదు. వారి ప్లాన్ బి ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతామని సురేఖ ప్రకటించడం కాస్త తెలివైన చర్యగానే కనిపిస్తుంది. సమయం మించిపోయాక రక్షాబంధన్ రాఖీని రేవంత్‌కు కట్టినా ప్రయోజనం కలగలేదనుకోవాలి.ఇక రేవంత్ వైపు చూస్తే సురేఖ ఇష్యూ మొదలు కాగానే పదవి నుంచి తప్పించి ఉంటే ఆయన పవర్ పుల్ గా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. సురేఖపై కొంతమంది ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడంతో పార్టీలో వివాదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం వద్దే పంచాయతీ జరగడం, ఆ పైన మరికొన్ని రోజులు జాప్యం జరగడంతో రేవంత్ కూడా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. అందువల్లే రేవంత్ హైకమాండ్‌ను బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించగలిగారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సురేఖ రాఖీ కట్టిన తర్వాత రాజీ కుదిరిందేమోనని అనుకున్నారు. కాని రేవంత్ అందుకు సిద్దపడలేదన్నమాట.బీసీ వర్గానికి చెందిన మహిళ సురేఖను పదవినుంచి తప్పించడంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం జరిగి ఉంటుంది. ఈ వివాదం తొలుత రేవంత్ వ్యాఖ్యలతోనే ఆరంభమైన సంగతిని కూడా కాంగ్రెస్ క్యాడర్ గుర్తించి ఉంటారు. గతంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రులన్న పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు సైతం బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేసేవారుకాదు. మరో బలమైన నేత చెన్నారెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి పదవి కోల్పోయారు. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ఒక మంత్రి విమర్శలు చేసిన వెంటనే పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ లను బర్తరఫ్ చేశారు.కాగా తాను ఎవరికి భయపడనని, స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెడతానని రేవంత్ అంటున్నారు. ఇది అచ్చంగా గతంలో కొన్నిసార్లు ఆయన గురువు చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం మాదిరే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ అధినేత కాబట్టి కొంతవరకు చెల్లవచ్చు. అయినా ఆయన అన్నీ అంచనా వేసుకున్నాకే ధైర్యం చేసేవారు. కొన్నిసార్లు ఏమి జరగనట్లు రాజకీయం సాగించేవారు. కాంగ్రెస్‌లో అది అంత తేలికకాదు. ఎవరికి ఉండే బలం వారికి ఉంటుంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాదిరి ఒక నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే దశ తెలంగాణలో రాలేదు. అది ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే తన కుటుంబ సభ్యులపైన, సన్నిహితులు కొందరిపైన సురేఖ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్‌కు కొంత నష్టం జరుగుతుంది. వాటిపై అసెంబ్లీలో చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టవచ్చు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అదొక సమస్య అయ్యే అవకాశం ఉంది. కాగా సౌమ్యుడుగా పేరొందిన చిన్నారెడ్డి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. బీసీ నేత పదవినే తీసేశారన్న విమర్శ రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఓవరాల్‌గా ఈ పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలలో పలచన కావచ్చు. సురేఖ రాజకీయం ముళ్లబాటగా మారే అవకాశం ఉంటుంది. కాగా, రేవంత్ తన పరపతి నిలబెట్టుకున్నప్పటికీ, కొంత డామేజీని భరించక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: విజయసాయి మాట ఎందుకు మార్చారు? -
విజయసాయి మాట ఎందుకు మార్చారు?
మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఏదో తెలియని ఆందోళనతో, ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమి చెప్పాలో అర్థంకాకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్సీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విజయసాయి సడన్‌గా ఎంపీ పదవి వదలుకోవడం, పార్టీని సైతం వీడడం సంచలనం అయింది. ఇందులో ఏమి మతలబు ఉందా అన్న చర్చ జరిగింది. కాని ఆయన మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. చాలామంది ఆయన మాటకు కట్టుబడి ఉంటారేమోలే అని సరిపెట్టుకున్నారు.కాని కొంతకాలం గడిచే కొద్ది ఆయనలో మార్పు రావడం ఆరంభం అయింది. తొలుత అక్కడక్కడ కామెంట్లు చేయడం, తదుపరి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, ప్రత్యేకించి వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించడం అందరిని విస్మయపరిచింది. రాజకీయ పార్టీలలో నేతల మధ్య తెలియని స్పర్ధ ఉంటుంది. అయినా పార్టీలో ప్రధాన నాయకుడిని చూసి సర్దుకుపోతుంటారు. పైగా విజయసాయికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్ద లభించిన ప్రాధాన్యత చాలా ఎక్కువే. పార్టీలో పలువురికి దీనిపై కాస్త అసంతృప్తి ఉన్నా ఎవరూ పైకి మాట్లాడలేదు.ప్రత్యేకించి విశాఖపట్నం ఇన్‌చార్జీగా ఉన్న సమయంలో ఈయనపై ఎల్లోమీడియా విపరీతమైన వ్యతిరేక వార్తలు ఇచ్చేది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఈయన టార్గెట్‌గానే ఉండేవారు. ఈయన బందువులు విశాఖలో స్థలం కొనుగోలు చేసినా ఎల్లోమీడియాలో ఆరోపణలు వచ్చేవి. చివరికి ఆయనపై ఎంత నీచమైన అభియోగాలు మోపింది అందరికి తెలుసు. టీడీపీ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి మీడియా సమావేశాలు పెట్టేవారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా మొదటి పేజీతో పాటు, లోపలి పేజీలో పెద్ద ఎత్తున పరచిందంటే అందులో ఉన్న మతలబు అర్థం చేసుకోవచ్చు.ఆ రకంగా చూస్తే విజయసాయి తనకు ఇంత ప్రచారం ఆ మీడియాలో వస్తోందని సంతోషిస్తున్నారేమో తెలియదు కాని, అది పులిమీద స్వారీలాంటిదే అని తెలుసుకోగలగాలి. నిజంగానే ఆయన చెబుతున్నట్లు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కూడా తన విధానాలపై ప్రచారం చేసుకుంటే ఫర్వాలేదు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసన, బీజేపీ కూటమి విధానాలను వ్యతిరేకిస్తారో, మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఆయన అసలు లక్షణం బయటపడుతుంది.ప్రభుత్వ విధానాలలోని మంచి, చెడులపై వ్యాఖ్యానిస్తే తప్పు కాదు. కూటమి ప్రభుత్వంపై కాకుండా వైఎస్సార్‌సీపీపైనే దృష్టి కేంద్రీకరిస్తే, టీడీపీకి పరోక్ష మద్దతు ఇవ్వడానికే ఈ రెండేళ్లుగా రాజకీయం నడిపారని జనం అనుకుంటారు. అంటే టీడీపీ ట్రాప్‌లో విజయసాయి పూర్తిగా చిక్కుకున్నట్లు అవుతుంది. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిపైన కాని, ఆయన సమీప బంధువులపై కాని కూటమి ప్రభుత్వం పలు కేసు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి యత్నించింది. దానికి తోడు విశాఖలో ఈయన అనుచరులు భూ దందాలకు పాల్పడ్డారని పదే, పదే ప్రచారం చేశారు. అప్పటికే మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో పలువురిని అరెస్టు చేశారు. విజయసాయి పేరు కూడా కేసులో చేర్చారు.ఈ కేసుల బెడద, ఎల్లోమీడియా దాడి భరించలేకే ఈయనలో బాగా మార్పు వచ్చిందా అన్నది కొందరి అనుమానం. ఆ కేసులో ఉన్న ఇతర నిందితులు కొందరితో ఆయన వివాదపడుతున్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తం మీద ఏ రకంగా మేనేజ్ చేసుకున్నారో కాని చంద్రబాబు ప్రభుత్వం ఐదో నిందితుడుగా ఉన్న ఆయన జోలికి వెళ్లలేదు. ఆ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దానిని టీడీపీ చేజిక్కించుకోవడం వంటివి జరిగాయి.ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?ఈ నేపథ్యంలో విజయసాయి తాజాగా చేసిన ప్రకటనలు సహజంగానే అందరికి సందేహాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారంటూ దారుణమైన ఆరోపణ చేయడం ఆయనకే చెల్లింది. అదే నిజమైతే ఈయననే మార్చి ఉండాలి కదా అన్న విమర్శకు బదులు లేదు. జగన్ అధికారంలో ఉండగా, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఈపాటికి కూటమి ప్రభుత్వం ఎంత యాగీ చేసేదో కదా! పైగా హిందూ ధర్మపరిరక్షణకు అవసరమైన అనేక చర్యలు జగన్ తీసుకున్నారు. విజయసాయి చేసిన ఈ విమర్శపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసారి బహరంగ లేఖ పేరుతో సజ్జలపై విరుచుకుపడే యత్నం చేశారు. ఆయన పార్టీలో నెంబర్ వన్‌గా ఉన్నారంటూ జగన్‌ను తగ్గించే యత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందో లేదో ఆయనకు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆ ఫీలింగ్ ఉంటే అప్పుడే బయటకు వచ్చి ఉండవచ్చు లేదా ఓపెన్ అయి ఉండవచ్చు. అలాకాకుండా ఎన్నికలలో ఓటమి ఎదురయ్యాక మాట్లాడడమే అభ్యంతరం అనిపిస్తుంది. సజ్జలపై కేసులు రాలేదని ఆయన చెబుతున్నారంటే దాని అర్థం టీడీపీతో కుమ్మక్కైనట్లు కాదు.నిజానికి సజ్జలపైన, ఆయన కుమారుడు భార్గవపైన పలు కేసులను ప్రభుత్వం పెట్టింది. వాటిలో పలు పిచ్చి కేసులు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసుల వరకు వెళ్లింది. అయితే వాటన్నిటిపైన న్యాయపోరాటం చేసి స్టేలు తెచ్చుకున్నారు. అంతే తప్ప విజయసాయి మాదిరి భయపడి పోలేదని అనుకోవాలి. ఒకప్పుడు విజయసాయికి ఉన్న ధైర్యం ప్రస్తుతం లేకుండా పోయిందని అనుకోవాలి. వైఎస్సార్సీపీ కార్యకర్తల మాదిరి పోరాడే శక్తిని ఆయన కోల్పోయారని భావించాలి. సజ్జల వల్ల తాను పార్టీని వీడడం లేదని గతంలో చెప్పిన విజయసాయి మాట మార్చి, ఏకంగా తనపై భౌతిక దాడి జరిగిందని, 74 సార్లు అవమానాలు జరిగాయని ఆరోపించేవరకు వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.అది నిజమే అయితే, ఆనాడే ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఉండాల్సింది కదా! అప్పుడే పదవులను వదలుకుని ఉండాలి కదా!అధికారం కోల్పోయాక చేసే ఆరోపణలకు విలువ ఏమి ఉంటుంది. ఆయన ప్రతిష్ట దెబ్బతినడం తప్ప. తనను ఎన్నో విధాలుగా వేధించిన ఎల్లో మీడియాకు అస్త్రంగా మిగలడం తప్ప. ఆయన వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా కనిపిస్తున్నాయి.గతంలో చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయి కొన్ని అభ్యంతర పోస్టులు పెట్టడం ద్వారా పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా సీనియర్ నేత కనుక ఎవరూ మాట్లాడలేదు. తనతో పాటు విజయసాయిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్న సానుభూతి ఉండబట్టే కదా జగన్ ఈయనను రెండుసార్లు ఎంపీని చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిని చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాని వివిధ పరిణామాల నేపథ్యంలో పార్టీలో మార్పులు జరుగుతుంటాయి. ఆ సంగతి ఆయనకు తెలియదా! అయితే ఇప్పటికీ జగన్‌కు నమ్మక ద్రోహం చేయనని అనడం మంచిమాటే. కాకపోతే టీడీపీ ట్రాప్‌లో పడి, వారు రాసిచ్చే స్క్రిప్టు చదివే దశకు విజయసాయి వెళితే అది మరింత బురద ఊబిలో కూరుకుపోతున్నట్లే అవుతుందేమో! ఆ సంగతి ఆయన గ్రహిస్తే మంచిదే!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?
పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగానే సిద్దం అవుతోందా?వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కాని ఆ ప్రాజెక్టును తొలుత ప్రతిపాదించిన విధంగా కాకుండా నిర్ధిష్ట లక్ష్యంలో నాలుగో వంతుకే పరిమితం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటా అన్నది పెద్ద చర్చగా ఉంది. 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి గాను రూపొందించిన ఈ ప్రాజెక్టు తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రకారం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీరు అందించగలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దీనికి ఎవరు బాద్యత వహించాలి?. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున నిర్మించాలని తొలుత భావించగా, ఇప్పుడు దానిని 41.15 మీటర్లకే పరిమితం చేయబోతున్నారన్నది వస్తున్న సమాచారం. దీనికి తొలిదశ అని పేరు పెట్టి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా అన్న సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పార్లమెంటుకు ఇస్తున్న సమాచారం పరిశీలిస్తే,ఈ ఎత్తు వరకే కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎల్లో మీడియా మాత్రం దీనిని కవరప్ చేస్తూ ఇది తొలిదశ అయినా, తర్వాత కూడా పనులు సాగించుకోవచ్చని చెబుతోంది. కాని అందుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి? ఈ మొత్తం ఎపిసోడ్‌ను పరిశీలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-2019 టర్మ్‌లో తీసుకున్న ఒక నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అందించాలి. కాని చంద్రబాబు అప్పట్లో కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి, ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రమే నిర్మిస్తుందని చెప్పి కేంద్రాన్ని ఒప్పించారు.ప్రత్యేక హోదా డిమాండ్‌ను చంద్రబాబు వదలుకుని పోలవరం కాంట్రాక్టును తీసుకున్నట్లయిందని అప్పట్లో ప్రతిపక్షం విమర్శించేది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టైమ్‌లో ఈ ప్రాజెక్టుకు 45.72 మీటర్ల ఎత్తును కేంద్రంతో ఖరారు చేయించి, తదనుగుణంగా నిధులు మంజూరుకు ఒప్పించారని చెబుతారు. ఇందుకు తగినట్లుగా స్పిల్వేని ఆ స్థాయిలో నిర్మాణం చేయించారు. జగన్ ప్రభుత్వం రెండు దశలలో నిర్మాణం జరుగుతుందని చెబితే విపక్షంగా ఉన్న తెలుగుదేశం తీవ్ర విమర్శలు గుప్పించింది. రెండేళ్ల క్రితం కూటమి అదికారంలోకి వచ్చాక తొలిదశతోనే ప్రాజెక్టును ముగించే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగించే అంశమే. 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు పూర్తి అయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల స్థాయిలో అయితే 119 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతారు. ఇదే జరిగితే తొలుత అంచనా వేసినట్లు ఏడు లక్షల ఎకరాలకు పైగా నీటిని అందించడం సాధ్యం కాదు. అలాగే కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంద్ర సుజల స్రవంతి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడం సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అలాగే విద్యుత్ ప్రాజెక్టును కూడా వరద వచ్చినప్పుడే నడపగలుగుతారు. ఒరిజినల్‌గా పోలవరం నిర్మాణానికి సుమారు 55 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. కాని ఇప్పుడు దానిని సుమారు 30వేల కోట్లకే పరిమితం చేస్తున్నారట. ఆ లెక్కన మరో 12 వేల కోట్లు ఇస్తే సరిపోతుందన్నది కేంద్రం అభిప్రాయంగా ఉంది. దీనివల్ల ఏపీకి బాగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తుది దశ నిర్మాణాన్ని రాష్ట్రం నిజంగా కొనసాగిస్తే అదనంగా అయ్యే వ్యయం సుమారు 25 వేల కోట్లు ఉంటుంది. కేంద్రం దీనిని ఇస్తామంటే మంచిదే. కాని రాష్ట్రమే భరించవలసిరావచ్చన్న సందేహాలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని నిర్వాసితుల కోసం ఖర్చు చేయవలసి ఉంది. రెండో దశలో మునిగిపోయే ప్రాంతాన్ని తగ్గించడంవల్ల ఈ వ్యయం తగ్గించుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది.అదే జరిగితే ప్రాజెక్టు పర్పస్ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన ఉంది. కేంద్రం రెండో దశకు కూడా నిధులు ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా అధికారికంగా చెబుతున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. దీనివల్ల తమ భూభాగం మునుగుతుందన్నది ఆ రాష్ట్ర వాదన. నిజానికి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రతిపాదించి, వివిధ అనుమతులు సాదించినప్పుడే వాటన్నిటిని లెక్కించి చాలావరకు పరిహారం ఇప్పించారు. తదుపరి ఆయన అనూహ్య మరణంతో మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. ఈ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని తెలిపినా, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో కేంద్రం నుంచి తీసుకోవడం ఒక చారిత్రక తప్పిదంగా చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ విమర్శలు చేస్తూ పోలవరాన్ని చంద్రబాబు అవినీతి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. అంతేకాక కాఫర్ డామ్ పూర్తిగా నిర్మించకుండా రెండు గాఫ్ల్ పెట్టి డయాఫ్రం వాల్ నిర్మాణానికి పూనుకోవడం, భారీ వరదల కారణంగా ఆ వాల్ దెబ్బతినడం వంటి ఘటనలు జరిగాయి. చంద్రబాబు తాను చేసిన తప్పులను జగన్ ప్రభుత్వంపై నెట్టివేయడం చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాఫర్ డామ్ ఎడమవైపు పది అడుగుల వెడల్పు, ఏడు నుంచి ఎనిమిది అడుగుల లోతున జారిందని ఎల్లో మీడియానే రిపోర్టు చేసింది. దీనిని కొంత కవర్ అప్ చేసే యత్నం చేస్తూ కధనాన్ని ఇచ్చింది. అదే జగన్ టైమ్ లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే, టీడీపీ, ఎల్లో మీడియా రచ్చ రచ్చగా ప్రచారం చేసేవి. కాగా డయాఫ్రం వాల్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని సెంటర్ ఫర్ లిబర్టి ప్రతినిధులు ఎబి వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తి చేసి మమ అనిపించుకుంటారా? లేక పోలవరం ప్రాజెక్టు రెండో దశ కొనసాగించగలుగుతారా అన్న సందేహాన్ని నివృత్తి చేయవలసి ఉంది. చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై అంత నమ్మకం లేదు. ఇదే విషయాన్ని గతంలో ఆయన చెబుతుండేవారు. టీడీపీ నేతలుగా ఉన్న వడ్డి వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు ఈ ప్రాజెక్టు కోసం నిత్యం పోరాడేవారు. అయినా వారిని చంద్రబాబు పట్టించుకునేవారు కాదు. భారీ ప్రాజెక్టుల వల్ల రాజకీయ లబ్ది వెంటనే ఉండదన్నది ఆయన భావనగా ఉండేది. కాని వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం మాత్రమే కాకుండా సుమారు 48 ప్రాజెక్టులను ఆ రోజుల్లో జలయజ్ఞం పేరుతో సంకల్పించారు. దానిపై టీడీపీ విమర్శలు చేస్తుండేది. విభజన తర్వాత మాత్రం అప్పటికే నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు తన కల అని చంద్రబాబు చెప్పడం ఆరంభించారు.నిజంగా ఆయన కలే అయితే చిత్తశుద్దితో 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయగలగాలి. చంద్రబాబు ఆ పని చేసి చూపిస్తారా!. లేక దీనితోనే మాయ చేస్తారా? అన్నది చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేష్ వ్యాఖ్యలు.. జనసేన ఆత్మగౌరవానికే పరీక్ష?
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు చికాకుగా మారేలా ఉంది. జనసేన క్యాడర్ లో చాలామంది ఈ స్థానిక పదవులపై ఆశలుపెంచుకోవడమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎం పదవిలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ సంగతి ఎలా ఉన్నా,తన వరకు పవర్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారన్నది పలువురి భావనగా ఉంది. ఆయన తరచుగా మంత్రివర్గ సమావేశాలకు వెళ్లకపోయినా అడిగేవారు లేరు. కీలకమైన అంశాలలో పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించకపోయినా లోలోపల మదనపడేవారే తప్ప ఆయనను అడిగే ధైర్యం చేసేవారు లేరు. పవన్ కు భుజం శస్త్ర చికిత్స ,అనారోగ్య సమస్య కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినా కొన్ని కార్యక్రమాలకు వెళ్లడం, మరికొన్నిటికి వెళ్లకపోవడం జరుగుతోంది.ఇటీవల కేరళకు వెళ్లారు. దీనిపై అంతా సానుభూతితోనే ఉన్నారు. కాని రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు పార్టీలో అంత సంతృప్తికరంగా లేవన్నది నిష్టుర సత్యంగా కొందరి వ్యాఖ్యల బట్టి అర్దం అవుతుంది. ఇవన్ని ఎలా ఉన్నా కూటమి ప్రభుత్వం ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం 15 ఏళ్లు ఉండాలని స్వయంగా పవన్ కళ్యాణే పలుమార్లు ప్రకటించడంతో జనసేన క్యాడర్ లో నిస్తేజం ఏర్పడింది. తాము పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని అనుకుంటే, ఆయనేమో దాని గురించి ఆలోచించడం మానేశారన్నది వారి బాధ. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా అది దక్కలేదు. కాని చివరికి అటవీశాఖలో గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంతవరకైనా అన్నదమ్ములకు న్యాయం జరిగినట్లయిందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించిన సంగతి వేరే కోణం. పార్టీలో ఆయా ముఖ్యమైన పదవులలో సామాజిక న్యాయం జరగడం లేదన్న విమర్శ ఉంది. పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు కారు రాష్ డ్రైవింగ్ కారణంగా ఒక యువతి మరణిస్తే తగురీతిలో పార్టీ స్పందించి ఉండాల్సిందని,అలా చేయకపోవడం వల్ల జాతీయ మీడియాలో కూడా విమర్శలకు గురి కావల్సి వచ్చిందన్న భావన ఉంది. చంద్రబాబు, మంత్రి లోకేష్ లు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ను పొగడడం మినహా జనసేన పార్టీవారికి పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదన్నది కొంతమంది జనసేన నేతల అభిప్రాయం. ఈ పరిణామాలను అంతా గమనిస్తున్నారు. కాకపోతే అధికారంలో ఉన్న నేపద్యంలో ఎవరికివారు పైకి మాట్లాడడానికి కాస్త వెనుకాడుతుంటారు. ఈ పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తమకు ఏ మేరకు అవకాశాలు వస్తాయన్నది జనసేన కార్యకర్తలలో ఉన్న ప్రశ్న. లోకేష్ ఎప్పుడైతే జనసేనకు 15 శాతం సీట్లే కేటాయిస్తామని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. లోపల ఉడుకుతున్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శాసనసభ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరని, అందువల్ల 15 శాతం కేటాయింపు సమ్మతం కాదన్నట్లు మాట్లాడారు.కాని ఆ తర్వాత కాస్త తగ్గారేమో అన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడక తప్పలేదు. నిజానికి ఆయనకు ఈ అంశంపై ఎంత శ్రద్ద ఉందో పార్టీ క్యాడర్ కు తెలియడం లేదు. నిర్దిష్టంగా స్థానిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు,లోకల్ నేతలకు మంచి ప్రాధాన్యం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వలేదు. ఒక కమిటీని నియమించారు. వారేమి చేస్తారో తెలియదు. లోకేష్ ప్రకటనకు పవన్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారన్నది జనసేనలో ఉన్న ఒక అభిప్రాయంగా భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలు,సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు కోరాలన్న ఆలోచనను ఆయన చేస్తున్నారట. ఈ ఎన్నికలలో జనసేన ప్రభావశీలంగా ,మెరుగైన స్థాయిలో నిలబడుతుందని ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంత శాతం సీట్లు దక్కుతాయన్నది తేల్చలేదు. లోకేష్ అంత స్పష్టంగా ఒక లెక్క చెప్పినప్పుడు అది కుదరదని చెప్పకపోతే పార్టీవారికి అది లోకువ కాదా అన్నది కొందరు నేతల భావన. కాగా పార్టీ బాధ్యత అంతా నాదెండ్ల మనోహర్ కే అప్పగించినట్లుగా కనిపిస్తుందని, ఆయనే ఆయా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల కోసం 30 రోజుల ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించేది చెప్పకుండా ,మూడుపార్టీలు కలిసి పనిచేయాలని ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ ఏ మేరకు సీట్లు ఇస్తుందో తెలియక,ఆయా చోట్ల జనసేన ఆశలు పెంచుకుంటోంది. మచిలీపట్నంలో ఇంతవరకు టీడీపీతో ఒక అవగాహన రానప్పటికీ జనసేనలోని రెండువర్గాలు దీనిపై ఘర్షణ పడ్డాయి.మరోవైపు గుంటూరు మేయర్ సీటును జనసేనకే కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.గుంటూరులో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పదవులన్నీ టీడీపీవారికే వచ్చాయని, అందువల్ల మేయర్ పదవికి పోటీచేసే అవకాశాన్ని జనసేనకు ఇవ్వాలని ఆయన కోరారు. పలు ఇతర జిల్లాలలో కూడా జనసేన నేతలు ఇలాంటి డిమాండ్లే పెడుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది నేతలు ఏ ఏ జిల్లాలలో ఎంత శాతం సీట్ల కేటాయింపు కోరాలో పార్టీకి సూచిస్తున్నారు.దాని ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీతో సమానంగాను, ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లావరకు 40 శాతం సీట్లు,తొమ్మిది జడ్పి చైర్ పర్సన్, ఐదు మేయర్ పదవులకు పోటీ చేయాలని వీరు కోరుతున్నారు. ఒవరాల్ గా చూసినప్పడు సగటున మూడో వంతు సీట్లకు పట్టుబట్టాలన్నది జనసేన నేతల డిమాండ్ గా ఉందని అంటున్నారు. తాను నియమించిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తాము కోరదగిన సీట్ల వివరాలను టీడీపీ నాయకత్వానికి అందచేయవచ్చని భావిస్తున్నారు.ఆ తర్వాత సంప్రదింపులలో ఎన్నిటికి ఒప్పందం కుదురుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికలలో కనీసం 50 సీట్లకుపట్టుబట్టి ఉంటే,ఈ రోజు జనసేనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుకుంటున్నారు. అయినా ఆనాడు పవన్ మాటను కాదనలేక సర్దుకుపోయామని కొందరి వ్యాఖ్యగా ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో లోకేష్ మాటే చెల్లితే జనసేన పరిస్థితి మరింత దిగజారుతుందన్న భయం పార్టీవర్గాలలో ఉంది.ఇప్పటికే అనేక చోట్ల టీడీపీ నేతల నుంచి అవమానాలను భరించవలసి వస్తోందన్నది పలువురు నేతల బాధగా ఉంది.ఈ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారని వార్తలు వచ్చాయి. దీనిపై పార్టీ కార్యకర్తలలో ఉన్న అసహనాన్ని కూడా తెలియచేశారు. పవన్ ఈ విషయాలు తెలుసునని అన్నారట. అయినా ఆయన నుంచి వారికి కచ్చితమైన హామీ లభించినట్లు చెప్పలేకపోతున్నారు. ఒకరకంగా ఈ స్థానిక ఎన్నికలు జనసేన ఆత్మగౌరవానికి ఒక పరీక్ష అని ఆ పార్టీవారే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రాజకీయపార్టీగా జనసేన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకుంటుందా? లేక టీడీపీ వెనుక నిలబడే పార్టీగానే మిగిలిపోతుందా అన్నది స్థానిక ఎన్నికలలో కొంతవరకు తేలవచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..! -
బాబూ... చెత్త ఎవరిది? సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్‌లు ఇస్తుండడం విశేషం.మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా?ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం.ఇవి కూడా చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలదట. అది జరిగితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందట. అంటే ఇప్పట్లో రాష్ట్రం స్వర్ణాంధ్ర కాదని పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా? ఎంతసేపు ప్రజలను నిందిస్తున్నారే తప్ప, తాము డబ్బు పంచకుండా ఎన్నికలలో పోటీచేస్తామని మాటవరసకు చెప్పలేకపోతున్నారన్న విమర్శ వస్తోంది.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే నేరుగా రాజకీయాలలో డబ్బు ప్రభావం తెచ్చిందే చంద్రబాబు అని స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారని ఆయన ఏ ఆధారంతో చెప్పారో తెలియదు. కాని చిత్రం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీటీడీనే రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. దాని గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా? స్కిల్ స్కామ్‌లో ఆయన పీఏ అరెస్టు కాకుండా అమెరికాకు పంపించిందెవ్వరో తెలియదా! స్కిల్ స్కామ్‌లో అప్పటి సీఐడీ చేసిన అభియోగాలపై ఎన్నడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాయింట్ వైజ్ వివరణ ఇచ్చి, తానేమి తప్పు చేయలేదని చెప్పి ఉండాలి కదా!ఈ స్కామ్‌లో ఏ అధికారులు అరెస్టు అయింది అందరికి తెలుసే. డీఎస్సీ, ఏపీపీఏస్సీ అంశాలను చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు ప్రస్తావిస్తూ తమ వాదన సమర్థించుకునే యత్నం చేస్తున్నా, జగన్ విసిరిన సవాల్, అంటే సీబీఐ విచారణకు సిద్దపడకపోవడం వారి బలహీనతగా కనిపించదా! నకిలీ మద్యంతో గత ప్రభుత్వంలో 30వేల మంది చనిపోయారని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.విశేషం ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు గ్రామం వద్ద టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్నే పెట్టిన విషయం బహిర్గతం అయింది. అలాంటివి ఏవైనా జగన్ టైమ్‌లో కనిపించాయా? అయినా ఈ ఆరోపణలు ఏమిటో! చంద్రబాబు స్పీచ్ ఇస్తున్న టైమ్‌లోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తీవ్ర ఆరోపణ చేశారే. ఈ రెండేళ్లలో 200 కోట్లు భూ దోపిడీ, ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరి వాటిపై విచారిస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.అంతేకాదు. అదే ఎమ్మెల్యే తనకు ప్రతినెల మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయే!విజయవాడ టీడీపీ ఎంపీ వర్గంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మాటేమిటి? గంజాయి, మట్టి, ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా అక్రమాలు చేస్తున్నదానిపై ఎన్ని ఆరోపణలు చేసింది ఆయనకు తెలియదా? వాటిపై చర్య తీసుకోకపోగా పార్టీ కమిటీ కొలికపూడిని పిలిచి మందలించిందని వార్తలు వచ్చాయే. ఇటీవలే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోలీస్ స్టేషన్ అడ్డగానే దందాలు చేస్తున్నట్లు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారే. వారిద్దరు బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇస్తే సరిపోతుందా!ఇక మహిళలను వేదించిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను కనీసం పిలిచి కోప్పడ్డారా? ఒక మంత్రే తనను వేధించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేస్తే ఏమి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియచేసి ఉండాల్సింది కదా! ఇలా చెప్పుకుంటూ పోతే భారతం అంత అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ అద్వాన్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.ఇక మంత్రి లోకేష్ డీఎస్సీపై ఐదో సారి చర్చకు రమ్మన్నా రావడం లేదని సభలలో ఉపన్యాసాలు ఇచ్చి, జనం వాటినే నమ్మాలని తండ్రి మాదిరే అనుకుంటే ఎలా? జగన్ విసిరిన సీబీఐ సవాల్‌ను దమ్ముగా ఎదుర్కుని స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదని రుజువు చేసుకోవచ్చు కదా! చంద్రబాబు, లోకేష్‌లు తమను తాము పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ఎదుటివారిపై నిందలు మోపే ముందు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అవి తమకు కూడా తగులుతాయేమో చూసుకుని మాట్లాడితే వారికే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న బాటింగ్‌ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న దిగులు ఎల్లో మీడియాకు బాగానే పట్టుకున్నట్లు ఉంది. అందుకే జగన్ మీడియా సమావేశంపై నేరుగా దాడి చేయడానికి ఈ తెలుగుదేశం మీడియా పడరాని అగచాట్లు పడుతోంది.జగన్ బుధవారం నాడు కరువు సమస్య, బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వ డ్రామా, గంజాయి ప్రదేశ్‌గా మారిన ఏపీ, వెలిగొండ క్రెడిట్ చోరీ మొదలైన అంశాలపై డిటైల్డ్‌గా తన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటికి ఆయన ఆధారాలు, సాక్ష్యాలు చూపుతూ తన వాదన వినిపించారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వలేక, టీడీపీ నేతలు, మంత్రులు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. కాని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి మాత్రం రాజును మించిన రాజభక్తితో, టీడీపీని కాపు కాసే బాధ్యత తమదే అన్నట్లుగా జగన్‌పై నేరుగా దాడి చేసింది. జగన్ చెప్పినవి అబద్దాలని రాసేసుకుంది. ఆ రకంగా జగన్‌పై బురద వేసి ఆ మీడియా సంతృప్తి చెందింది.జగన్ చెప్పిన విషయాలను పరిశీలిద్దాం.. ముందుగా కరువు ప్రస్తావనను జగన్ చేశారు. రాష్ట్రంలో కరువు ఉందన్నది వాస్తవమే కదా!స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆ విషయాన్ని చెబుతున్నారు కదా! అయినా పట్టిసీమ నుంచి నీరు వచ్చేసిందని చెప్పి ప్రకాశం బారేజీ వద్ద పూజలు చేసి నీళ్లు వదలి కృష్ణా డెల్టా కింద మంత్రులు నీరు ఇస్తున్నట్లు చెప్పింది అవాస్తవమా? ఆ సందర్భంలో వీరంతా ఏ రకంగా గప్పాలు పోయారో తెలియదా! ఆ విషయాలనే కదా జగన్ గుర్తు చేసింది.వాటికి ఆధారంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను కూడా చూపించారు కదా! కాకపోతే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు కరువు అన్న పదాన్ని వాడకుండా ఎల్‌నినో అని చెప్పుకుని జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మంత్రుల మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు. ఇందులో తప్పేముంది? అబద్దం ఏమి ఉంది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మొదలైన ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఎల్లో మీడియాలో కూడా వచ్చాయి కదా!రైతులను, కరువు బారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలేమిటి? ఇంకా ప్లానింగ్‌లోనే ఉన్నామని కదా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది. పలు చోట్ల ముఖ్యంగా రాయలసీమ నుంచి వలసలు ఎలా సాగుతున్నాయో పత్రికలలో వార్తలు వచ్చాయి కదా!ఆగస్టు 11నాటికి శైశైలంలో 879 అడుగుల నీటి మట్టం వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు ఇవ్వలేదన్నది జగన్ ప్రశ్న. రైతులకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి పాలకులు ఉంటారనే, తాము రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌ను ఆరంభించామని జగన్ తెలిపారు. ఇది వాస్తవమే కదా! ఈ స్కీమ్‌ను జగన్ వేగంగా ముందుకు తీసుకువెళుతున్న సమయంలో ప్రభుత్వం మారడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారని చంద్రబాబు ఈ స్కీమ్‌ను నిలిపివేయడం కరెక్టే కదా! రేవంత్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినా చంద్రబాబు ఖండించలేకపోయారే. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు జగన్ చేసిన విమర్శలకు జవాబు ఇస్తూ ప్రతి విమర్శలు చేశారే కాని, ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నది వివరించినట్లు కనిపించలేదు.జగన్ టైమ్‌లో రైతులకు ఉచిత భీమా అమలు చేస్తే ఈ ప్రభుత్వం దానిని ఎందుకు కొనసాగించలేకపోయింది? రామానాయుడు మాత్రం కరువు నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ తర్వాత ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరువు సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా మారాయి. వాటిని ఎలా నివారిస్తారన్న జగన్ ప్రశ్నకు బదులు ఇచ్చినట్లు లేదు.జగన్ టైమ్‌లో వివిధ స్కీమ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాలవారికి ఆర్థిక సాయం అందించడంతో చేతిలో డబ్బులు ఆడాయి. వ్యాపారాలు కూడా సాగాయని ఆర్థిక నిపుణులు కూడా అంగీకరించారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వస్తే ఈ ఎల్లో మీడియా ఎంత నీచమైన రాతలు రాసిందో మర్చిపోయి ఉండవచ్చు. ప్రపంచం అంతటా ఏర్పడినట్లే ఏపీలో కూడా అప్పట్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం సూచనల ప్రకారం రుణం తీసుకోవలసి వచ్చింది. మిగిలిన రాష్ట్రాలకన్నా మెరుగ్గా కరోనాను జగన్ ప్రభుత్వం ఎదుర్కుంది. అయినా జగన్ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందా? లేదా? ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయితే కోర్టులలో కేసులు వేయించి వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశాలు తెచ్చింది ఎవరో తెలియదా!తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అని చంద్రబాబు అంటే అదేమిటని ప్రశ్నించకపోగా, ఎల్లో మీడియా ఔను, ఔను అని భజంత్రి వాయించాయే. ఇప్పుడు కరువు సమస్య వల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంటే వారిని మభ్య పెట్టడానికి ఎల్లో మీడియా ఎల్‌నినో, యుద్దం అంటూ సాకులు ప్రచారం చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ గురించి కూడా ఎల్లో మీడియా తనదైన శైలిలో టీడీపీ ఖాతాలో వేయడానికి తహతహలాడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ లేకపోతే ఈనాటికి కూడా ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చేది కాదన్నది పచ్చి నిజం.చదవండి: బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?జగన్ రెండేళ్ల క్రితం సొరంగాలకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ,నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయిర్‌లోకి నీరు తరలిస్తామని ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. రెండేళ్ల క్రితం ఈ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం కాదా! వైఎస్సార్సీపీ, జగన్ కలిసి సుమారు 31 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తే, చంద్రబాబు హయాంలో 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారన్నది నిజమా? కాదా? ఈ క్రెడిట్లో ఎవరి వాటా ఎంతో చెబితే తప్పుకాదు. మొత్తం క్రెడిట్‌ను చోరీ చేయాలని చూస్తేనే ఇబ్బంది. ఇక ఏపీ గంజాయి ప్రదేశ్‌గా మారిందని జగన్ ఆరోపణ.ఈ మధ్యనే ఏకంగా పోలీసుల వాహనంలోనే గంజాయి తరలించిన వార్తను ఎల్లో మీడియా మర్చిపోయిందా? నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. వంద రోజుల్లో గంజాయి నిరోదించి చూపుతామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల ముందు చేసిన ప్రగల్బాలను జగన్ ప్రస్తావించారు. ఆ ప్రకారం వారు చేయలేకపోయిన విషయాన్ని జగన్ ఎండగట్టారు. ఇక బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఎల్లో మీడియా నిస్సిగ్గుగా భుజాన వేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: బాబూ.. డీస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?గతంలో జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జీఓ ఇస్తే తప్పుపట్టారా?లేదా?దానిపై టీడీపీ నేతే కోర్టుకు వెళ్లారా?లేదా?ఆ తర్వాత అది ఆగిపోతే జగన్ పార్టీపరంగా ఆయా పదవులను ఏభై శాతం పైగా బీసీలకు ఇచ్చారే! ఆ విషయాన్ని ఆయన లెక్కలతో సహా చూపించారు. మరి చంద్రబాబు మళ్లీ ఇప్పుడు జీఓ ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే దానికి కోర్టు ఆమోదం తెలుపుతుందా?పార్లమెంటులో సంబంధిత చట్ట సవరణ చేయిస్తామని ఎందుకు టీడీపీ ప్రకటించలేదు?ఇక వైఎస్సార్సీపీ బీసీ నేతలపై కేసులు అక్రమమా? కాదా? అన్నది అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలపై అప్పట్లో అవినీతి కేసులు వస్తే ఇదే ఎల్లో మీడియా గుండెలు బాదుకుని గోల, గోల చేసిందే. టీడీపీ ముఖ్యనేత పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలను కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే కదా! ఆ కేసు ఏమైందో చెప్పి, ఆ తర్వాత వైఎస్సార్సీపీపై ఎన్ని ఆరోపణలు చేసినా ఆలోచించవచ్చు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లు టీడీపీతో పాటు ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న విషయాన్ని జనం గమనించరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి?
ఏపీలో ప్రస్తుత సచివాలయంలో సుమారు మూడువేల మంది పనిచేస్తుంటారు. పోనీ ఏ రకంగా చూసినా ఐదువేల మంది మించి ఉండరు. కాని అమరావతి రాజధానిలో సచివాలయం కోసం చేపట్టిన భారీ టవర్లలో 16వేలమంది పని చేయవచ్చట. అంత పెద్ద టవర్లు ఏం చేస్తారు? ఈ సందేహం ఏ సామాన్యుడికైనా వస్తుంది? కాని అంతర్జాతీయ మీడియాగా పేరొందిన న్యూయార్క్ టైమ్స్‌కు రాకపోవడమే విచిత్రం అనిపిస్తుంది.ఈ మీడియా అమరావతిపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. దానిని తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి.. అనితర సాధ్యం అన్న శీర్షికన ఈ వ్యాస కథనాన్ని అందించింది. ఒక అంతర్జాతీయ మీడియా అమరావతికి సంబంధించి మంచి, చెడు లేదా లాభ, నష్టాలు రెండూ ఇస్తే ఎవరూ తప్పు పట్టనక్కర్లేదు. కానీ, ఆ వ్యాసం చదివితే ఇంత పెద్ద మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కథనాలు ఇస్తాయా? అమెరికాలో కూడా పత్రికా ప్రమాణాలు దిగజారి ఉంటాయా అన్న సందేహం కలుగుతుంది.మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి అని ఈ వ్యాసానికి శీర్షిక పెట్టారు. వినడానికి ఎంత బాగుంది. అమరావతిలో నివసిస్తే ఓ పాతికేళ్లు అధికంగా బతకవచ్చని చంద్రబాబు తన ఉపన్యాసాలలో చెబుతున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషిస్తారు. కానీ, ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే, చంద్రబాబు స్పీచ్ ఇచ్చిన కొన్నాళ్లకే జరిగిన శాసనసభ సమావేశాలలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎమ్మెల్యే శ్రావణకుమార్ ఏమి చెప్పారో తెలుసా! అమరావతిలో గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారని, సరైన రోడ్లు లేవని, ఇతర వసతులు లేవని, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. మంత్రులు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదని ఆయన వాపోయారు.న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రతినిధులు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే రాశారా? లేక ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రాసిచ్చిన దానిని ముద్రించారా అన్నదానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఏ వ్యాసం రాసినా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ, ఇందులో పూర్తిగా ఏకపక్షంగా పాజిటివ్ వ్యాఖ్యలే కనిపిస్తాయి. ఇది పెయిడ్ ఆర్టికిల్ వంటిదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దానిని కూడా పట్టించుకోనవసరం లేదు. అయితే ఈ వ్యాసకర్తలు అనుసరించాల్సిన ప్రమాణిక సూత్రాలు పాటించినట్లు కనిపించకపోవడమే అసలు సమస్య.న్యూయార్క్ టైమ్స్ విలేకరులు అమరావతి సందర్శించడం చంద్రబాబుకు లేదా మంత్రి నారాయణకు తెలియకుండా జరుగుతుందా? పైగా అంతర్జాతీయ మీడియా వారు వస్తుంటే చంద్రబాబు కలవకపోవడమన్నది నిజంగా జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే మామూలు స్థానిక మీడియాకే విశేష ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి అంతర్జాతీయ మీడియా వస్తుంటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారా! అమరావతిని ఫలానా పెద్ద మీడియా వారు చూసి వెళ్లారన్న వార్తనే హడావుడి చేసి ఉండేవారు కదా! వారు మంత్రి లోకేష్‌తో మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియదు. సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సంప్రదించలేదా? నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నంత వరకు ఆక్షేపణ లేదు. కానీ, వారు అమరావతి గురించి మరీ అతిగా పొగిడారా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.ఏపీకి రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనడం లేదు. అవసరమైన భవనాలు కట్టుకోవచ్చు. కాని ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?వారికి ఎంత విస్తీర్ణంలో భవనాలు కావాలి? ఎంత నిర్మిస్తున్నారు? అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది కదా! అలా కాకుండా అవసరాన్ని మించి నాలుగైదు రెట్ల అదనంగా నిర్మాణం చేపట్టిన తీరును ప్రశ్నించాలి కదా! అమెరికాలోని కాపిటల్ హిల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్న విస్తీర్ణం గురించి గూగుల్‌లో అడిగితే వచ్చిన సమాధానం ఇది.. Capitol Hill is a historic residential neighborhood and the legislative center of the United States government in Washington, D.C., covering just under 2 square miles (5 square kilometers).ఇవి కూడా చదవండి: రేవంత్ టూర్‌కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?కాపిటల్ హిల్ అనేది వాషింగ్టన్, డీ.సీ.లోని ఒక ప్రాంతం, ఇది ఈశాన్య మరియు ఆగ్నేయ చతుర్భుజాలలో విస్తరించి ఉంది. బహుశా అన్ని ప్రభుత్వ ఆఫీస్‌లు ఇందులో ఉన్నాయో లేదో తెలియదు. కాని అంత పెద్ద రాజధానిలో కేవలం 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఈ భవనాలు ఉంటే, భారత్‌లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది.మరో ఉదాహరణ చూద్దాం. అమెరికాలో అతి పెద్దదైన రాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో అనే చోట ఉంది. అక్కడ కేవలం 39 ఎకరాలలో పది బ్లాక్‌లలో ఆఫీస్‌లు ఉన్నాయట. అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ ఆఫీస్‌లు అన్నీ కలిపి 4,72,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని గూగుల్ చెబుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అన్ని ఆఫీస్‌లు కలిపి 300 ఎకరాలలోనే ఉన్నాయన్నది ఒక అంచనా. అమరావతిలో ఏభై లక్షలు, అరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఈ విషయాలేవీ న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులకు తెలియవా? అంటే ఏమి చెబుతాం. అమరావతిలో కేవలం సచివాలయానికే, పరిపాలన కార్యాలయాలకు ఐదు టవర్లు, అతి పెద్ద టవర్‌పై అంతస్తులో సీఎం ఆఫీస్, ఆ పైన హెలిపాడ్ ఉంటాయట.అప్పుల కుప్పగా ఉన్న ఏపీకి ఇంత ఆర్భాటం, అట్టహాసం అవసరమా? దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వేశారో, లేదో తెలియదు. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇతరత్రా చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. యధా ప్రకారం లోకేష్ విభజన సమయంలో కట్టుబట్టలతో ఏపీకి తరలివచ్చేశామని కూడా వారికి చెప్పేశారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదలి ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్న ప్రశ్న సహజంగా జర్నలిస్టులకు వస్తుంది. మరి వీరికి ఎందుకు రాలేదో అర్థం కాదు.ఈ అమరావతి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏభై వేల కోట్ల అప్పు ఎందుకు సమీకరించారు. ఇంకా మరో 1.75 లక్షల ఎకరాల భూమి సేకరణ అవసరం ఏమిటి? ఆ భూములలో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి? ఈ అప్పులు ప్రజలపై భారం కాదా? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు? వారికి అవసరమైన మౌలిక వసతులకు అయ్యే వ్యయం ఎంత? పూలింగ్‌కు భూములు ఇవ్వని రైతులను వేధించారన్నది నిజమా? కాదా? రైతుల గోడును విన్నారా? లేదా? మూడు పంటలు పండే భూములను ఇలా చేయడం పర్యావరణ విధ్వంసం అవుతుందా? కాదా? వరదపీడిత ప్రాంతంలో రాజధాని ఎలా కడుతున్నారు? ఆ వరదను ఎత్తిపోయడానికి లిఫ్ట్‌లు కట్టడమేమిటి? ఇలాంటి అనేక సందేహాలను వారు ముఖ్యమంత్రి లేదా కీలక మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకుని అన్ని విశేషాలతో వ్యాసం రాసి ఉంటే దానికి విలువ వచ్చేది కదా!అలాకాకపోతే తెలుగుదేశం మీడియాకు, ఈ అంతర్జాతీయ మీడియాకు తేడా ఏముంటుందని కొందరు ఢిల్లీ జర్నలిస్టులు తమ కామెంట్లలో ప్రశ్నించారట. అది న్యాయార్క్ టైమ్స్ మీడియాకు శోభనిస్తుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇవి కూడా చదవండి: మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా? -
రేవంత్ టూర్‌కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమేపీ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారనిపిస్తుంది. వీటిలో అత్యధికం ఆయన స్వయంగా సృష్టించుకున్నవేనేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పడం, మద్యలోనే యూకే నుంచే వెనక్కి రావల్సిన పరిస్థితి ఏర్పడడం,కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు పెరగడం,మంత్రి కొండా సురేఖ కుమార్తె ఏకంగా ఆయనపైనే తీవ్ర ఆరోపణలు సంధించడం, తదితర అంశాలు చికాకుగా తయారయ్యాయి. రేవంత్ యూకే, అమెరికాలోని ప్రఖ్యాత విద్యా సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటిని తెలంగాణకు తీసుకురావలన్న ఉద్దేశంతో ఈ యాత్ర పెట్టుకున్నారు. అంతవరకు సంకల్పం మంచిదే. కాని ఈ టూర్ లో ఆయన పెట్టుకున్న మరి కొన్ని ప్రోగ్రాంలు ఇబ్బందిలో పడేశాయి.భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకంగా రేవంత్ టూర్ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయంటూ ఆరోపణ చేశారు. ఆ మరుసటి రోజే కేంద్రం రేవంత్ టూర్‌ను అడ్డుకుంది. సీఎం టూర్ షెడ్యూల్ లో స్పష్టత లేదన్నది ఒక వివరణ అయితే, ముఖ్యమంత్రి హోదా తో సంబందం లేకుండా,రెండు దేశాల సంబందాలపై ప్రభావం పడే అవకాశం ఉండే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించారన్నది కేంద్రం వాదనగా ఉంది. అందుకే రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీనికి ముందు రేవంత్ వివరణ తీసుకుని అనుమతికి నో చెప్పి ఉంటే ఎలా ఉండేదో. కేంద్రం ఏకపక్షంగా అనుమతి నిరాకరించడంతో ఇది బీజేపీ, కాంగ్రెస్ ల మద్య వివాదంగా మారింది. కావాలని రేవంత్ టూర్‌ను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించి ఆక్షేపణ తెలిపారు. రేవంత్ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు విమర్శించారు. తనకు అనుమతి నిరాకరించడం తెలంగాణను అవమానించడమేనని రేవంత్ ఆరోపించారు. కాని బీజేపీ తెలంగాణ అద్యక్షుడు ఎన్.రమాచంద్రరావు మాత్రం ఆ ఆరోపణలను ఖండించి, ఇందులో రాజకీయం ఏమీ లేదని పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు ముఖ్యమంత్రులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనాలని రేవంత్ భావించారన్నది ఒక కారణంగా అనుమతి రాలేదని కొందరు చెబుతున్నారు.కాని దీనికన్నా రేవంత్ అమెరికాలో అత్యున్నత పదవులలో ఉన్నవారిని కలసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా కారణమని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారులను కాంటాక్ట్ చేయడానికి రేవంత్ తరపున ప్రయత్నాలు జరిగినట్లు అనిపిస్తుంది. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అమెరికా కాన్సలేట్ ఉన్న హైదరాబాద్ నానక్ రామ్ గూడకు ట్రంప్ అవెన్యూ అని రేవంత్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఆ విషయం ట్రంప్ దృష్టికి వెళ్లింది. దానికి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పందించారు. అదే టైమ్ లో ట్రంప్ కంపెనీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ టవర్స్ నిర్మాణం చేయడానికి సన్నద్దం అయింది. దాంతో రేవంత్ ప్రభుత్వానికి ఉత్సాహం వచ్చింది. వీలైతే ట్రంప్ ను కలవాలని ఆలోచించింది. లేదా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ను అయినా కలిసే అవకాశాలపై ట్రై చేశారట.ఈ విషయాలన్ని కేంద్రానికి కూడా తెలిశాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేశ అధ్యక్షుడిని అధికారికంగా కలవడం సాధారణంగా జరగదు. ఈ నేపధ్యంలోనే కేంద్రం అనుమతి తిరస్కరించిందన్నది బీజేపీ వర్గాల కధనం.ఫలితంగా రేవంత్ వెనక్కి తిరిగి రాక తప్పలేదు.కాకపోతే యు.కె.లో కొన్ని యూనివర్శిటీలతో సమావేశం అయి సంప్రదింపులు చేశారు. అమెరికాకు తన అదికారులను మాత్రం పంపించారు. లండన్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యారట.ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.అయితే అమెరికా టూర్ కు సంబందించి రేవంత్ బృందం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లడం కూడా సరైనది కాకపోవచ్చు.ఇక కాంగ్రెస్ లో కీచులాటలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ పైన,ఆయన సోదరుడిపైన తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. దానిపై కాంగ్రెస్ కూడా సీరియస్ గా స్పందించింది.కుమార్తె వ్యాఖ్యలకుగాను సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తనకు ఆ వ్యాఖ్యలతో సంబందం లేదని ఆమె వివరణ ఇచ్చినా కమిటీ సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసు ఇవ్వగా, సురేఖ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించారు. తనకు వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇదంతా ఎవరో వెనుక ఉన్న అదృశ్యశక్తులు చేయిస్తున్న పని ఆమె ఆరోపించారు. పైగా కొన్ని బీసీ సంఘాలు సురేఖకు బాసటగా నిలవడానికి సిద్దం అయ్యాయి. పరకాల నియోజకవర్గంలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తారని రేవంత్ ప్రకటన చేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. సాదారణంగా అభ్యర్దుల ఎంపిక అన్నది హైకమాండ్ అంశంగా చెప్పుకుంటారు. రేవంత్ అనవసర ప్రస్తావన చేయడం ద్వారా ఈ వివాదాన్ని కొనితెచ్చుకున్నట్లయింది. 1989-94 మధ్య కూడా మూడు గ్రూపులు కాంగ్రెస్ లో ఉండేవి. అప్పటి ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి మాట్లాడేవారు. వాటిపై ప్రజలలో అసహనం కలిగేది. ఇప్పుడు దాదాపు అదే రీతిలో సురేఖకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మ్యేలు రేవంత్ వైపు మొహరించడం విశేషం. అయితే, 40 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారనుకుటే 17 మందే వచ్చారని బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. కారణం ఏమైనా రేవంత్ కూడా ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సలహా ఇచ్చారు. కానీ, అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిందని చెప్పాలి. నిర్ణయం హై కమాండ్‌కు వదలివేయడంతో సురేఖ ఇష్యూ పెండింగులో పడినట్లయింది.ఇది కూడా రేవంత్ కు కాస్త అసహనం మిగిల్చేదే. మరో వైపు సీనియర్ నేత చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేయడం, చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్ లో ధర్నా చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక మరో సీనియర్ నేత ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏకంగా అసలు కాంగ్రెస్ వారికి నష్టం జరుగుతోందన్నట్లుగా మాట్లాడడం సంచలనం రేకెత్తించింది. అయితే ఆయన కూడా మద్యలో కొంతకాలం బీజేపీలోకి వెళ్లివచ్చారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి పొందడాన్ని ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తగినట్లే రేవంత్ కూడా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారినే ఎక్కువగా నమ్ముతున్నారన్నది వీరి భావన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటనను కొందరు ఉదహరిస్తున్నారు. ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనని రమేష్ కుమారుడు సంజోష్ కారు రాష్ డ్రైవ్ వల్ల ఒక యువతి మరణించింది. ఆ కేసులో సంజోష్‌ని రక్షించడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారన్న ఆరోపణ గుప్పుమంది. జాతీయ మీడియాలో సైతం రేవంత్‌కు ,చంద్రబాబుకు మద్య హాట్ లైన్ నడుస్తుంటుందని, అందువల్లే ఎంపీ కుమారుడిని అరెస్టు చేయలేదని కధనాలు,వ్యాఖ్యలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం బలహీనంగా ఉన్న నేపధ్యంలో రేవంత్ కు ఈ పరిణామాలేవీ ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాని 2028 ఎన్నికల నాటికి రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వపరంగా 22 ఎ, తదితర సమస్యలు ఏ రూపు దాల్చుతాయో అన్న ఆందోళన పార్టీలో ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా?
భారతదేశంలో రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయగల అత్యంత శక్తిమంతులలో ఒకరిగా పేరొందిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ డిపాజిట్ల సేకరణ కేసులో, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం ఫలించినట్లా? కాదా? ఈ కేసును సుప్రింకోర్టు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచారం చేసుకుంది. తప్పులేదు. ఎందుకంటే వారి గ్రూప్ సంస్థ కనుక తమకు అనుకూలంగా ఎట్టకేలకు తీర్పు వచ్చిందన్న భావనతో ప్రజలలో దీనిపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని తొలగించేందుకు ఆ మీడియా యత్నించింది. కాని అంత మాత్రాన చేసిన తప్పు, తప్పు కాకుండా పోతుందా? అన్నది చర్చనీయాంశం.ఈ తీర్పుపై ఉండవల్లి ఇచ్చిన విశ్లేషణ, ఆయన వేసిన ప్రశ్నలకు మార్గదర్శి సంస్థ తరపున ఈనాడు మీడియా సమాధానం ఇస్తే అప్పుడు ప్రజలు ఇందులో రామోజీరావు తప్పు చేశారా? లేదా? అన్నది ఆలోచించుకుంటారు. కాని అటువైపు నుంచి స్పందన కనిపించలేదు. మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఈ కేసు తీర్పు, ఉండవల్లి పోరాటంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన అలుపెరగని పోరాటానికి చివరకు తెరపడిందని, ఈ కేసును ఇంత దూరం తీసుకురాగలుగుతారని తాను అసలు అనుకోలేదని, కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి పడిన శ్రమ మాత్రమే దీన్ని ఇన్నాళ్లు నడిపించాయని ఆయన కొనియాడారు.మంది మార్బలం, అపారమైన శక్తి ఉన్న రామోజీరావు ఎక్కడ? ఒంటరిగా పోరాడిన ఉండవల్లి ఎక్కడ? అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఈ పోరాటాన్ని బైబిల్లోని 'గోలియత్-డేవిడ్' యుద్ధంతో పోల్చారు. బైబిల్లో డేవిడ్ గెలిచి ఉండవచ్చు కానీ, నిజజీవితంలో ఎప్పుడూ గోలియత్లదే (బలవంతులదే) విజయం అవుతుందని న్యాయపరమైన ముగింపును ఉద్దేశించి ఐవైఆర్ కృష్ణారావు నిగూఢ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా ఈ కేసు వీగిపోవడానికి లేదా ముగియడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలోనే మొత్తం సూక్ష్మం అంతా కనిపిస్తుంది కదా! రామోజీరావు తప్పు చేయలేదన్నట్లుగా ఈనాడు ప్రొజెక్టు చేసుకోవడాన్ని ఉండవల్లి ప్రస్తావించి, తప్పు చేయకపోతే ఈటీవీ షేర్లను విక్రయించి డిపాజిట్ దారులకు డబ్బు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించివేస్తామని సుప్రింకోర్టును ఎందుకు వేడుకున్నారన్నది ఆయన ప్రశ్న?అంతేకాక ఫైనాన్స్ సంస్థను ఎందుకు మూసివేశారని ఆయన అడుగుతున్నారు. డిపాజిట్ల సేకరణ చేయవచ్చని ఏ కోర్టు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి నిజమా? కాదా? ఉండవల్లి అడిగిన ప్రశ్నలన్నీ హేతుబద్దంగా ఉన్నాయి కదా! వీటికి రామోజీరావు కుమారుడు కిరణ్ తన మీడియాలో జవాబు ఇస్తే బాగుంటుంది కదా! ఇక్కడ అసలు సమస్య 2600 కోట్ల డిపాజిట్లు తిరిగి చెల్లించారా?లేదా? అన్నది కాదు. చట్టం ప్రకారం డిపాజిట్ల సేకరణ తప్పా? కాదా? అన్నదే. మామూలుగా అయితే రామోజీ ఎంతమాత్రం ఎవరికి లొంగకూడదని అనుకుంటారు. బ్రేక్ ద లా లాఫుల్లీ అన్నది తన విధానం అని ఆయా సందర్భాలలో సన్నిహితులతో రామోజీ అనేవారని చెబుతారు. అంటే ఎక్కడా దొరకకుండా, చట్టంలోని లొసుగులను వాడుకోవాలన్నది ఆయన ధీరీ అన్నమాట.ఆయనకు రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉందన్నది ఎనలేని సత్యం. ఆయన చేసింది సక్రమమా? అక్రమమా? అన్నదానితో నిమిత్తం లేకుండా తెలుగుదేశం మద్దతు ఇస్తుంటుందన్నది చాలామంది భావన. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకినని రామోజీ ప్రకటించుకున్నా, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి చెందినవారు కొందరితో కూడా సత్సంబంధాలు నెరపి, తన వ్యాపార అవసరాలకు వాడుకునేవారని అంటారు. తెలంగాణలో టీఆర్ఎస్తో కూడా చాలావరకు మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ గ్రూప్‌కు పూర్తి సహకారం లభించసాగింది. అందువల్లే రామోజీ మరణించిన తర్వాత ఆ సంస్థకు అనుకూలంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానంలో అఫిడవిట్లు వేశాయన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది.ఇక కేంద్రంలోని బీజేపీతో కూడా ఈ గ్రూపు సఖ్యతతో ఉంటుంది. ఇదంతా తనకు ఉన్న మీడియా బలంతోనే అన్నది బహిరంగ రహస్యమే. బహుశా అందువల్లేనేమో కొంతకాలం క్రితం వరకు డిపాజిట్ల సేకరణ కేసులో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించి సెక్షన్ 45 ఎస్ కింద హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయడం చెల్లదని స్పష్టం చేసేది. కాని అదే రిజర్వుబ్యాంకు ఈ కేసును ఇకపై తాము పట్టించుకోబోమని ఉండవల్లి రాసిన ఒక లేఖకు బదులుగా చెప్పిందంటే ఏమిటి అర్దం?రామోజీ గ్రూప్‌నకు ఉన్న పరపతి, రాజకీయ పలుకుబడి ముందు తాము నిలబడ లేకపోతున్నామని ఆర్బీఐ అంగీకరించడమే కదా!రామోజీ మరణించినందున ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదన్నది తెలిసిన విషయమే. కాని ఆయన సంస్థ చేసిన తప్పులపై కేసు కొనసాగుతుందని గతంలో కోర్టువారు ఇచ్చిన ఒక తీర్పును ఉండవల్లి ఉదహరించారు. నిజానికి ఉండవల్లి చేస్తున్న పోరాటం ఏమిటి?మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు వసూలు చేయడం సక్రమమా? అక్రమమా? కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని రామోజీ అతిక్రమించారా? లేదా? అన్నది తేల్చాలనే! రామోజీ జీవించి ఉన్నప్పుడు కూడా ఉండవల్లి ఒక మాట చెప్పేవారు. రామోజీని జైలులో పెట్టాలని తాను కోరుకోవడం లేదని, కాని ఈ డిపాజిట్ల కేసును నిగ్గు తేల్చడం ద్వారా ఇకపై అలా ఎవరూ డిపాజిట్లు వసూలు చేయకుండా చూడాలన్నదే తన ఉద్దేశం అని ఆయన అనేవారు. ఎందుకంటే అక్రమ డిపాజిట్లు వసూలు చేసినవారికి రెట్టింపు జరిమానా వేయాలని రిజర్వుబ్యాంక్ చట్టం సెక్షన్ 45 ఎస్ చెబుతోంది. దీనిని ఎవరికైనా ఒకేరకంగా వర్తింప చేయాలన్నది ఉండవల్లి డిమాండ్.సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సెక్షన్ 45 ఎస్ గురించి కాకుండా, ఉండవల్లికి ఈ కేసుతో ఏమి సంబంధం అన్నదానిపైనే ఇచ్చినట్లుగా ఉంది. తాను కేసు ఫిర్యాదుదారుడినని గతంలోనే కోర్టుకు తెలిపానని, దానిని పరిగణనలోకి తీసుకున్నందునే ఇంతకాలం కేసు సాగిందని ఆయన అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన ఒక ప్రశ్నకు రిజర్వుబ్యాంక్ సమాధానం ఇస్తూ హెచ్‌యూఎఫ్‌లు, అనధికార సంస్థలు డిపాజిట్లు వసూలు చేయరాదని, అది చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసిందని ఆయన వివరించారు. దీని ఆధారంగా తాను పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ సభ్యులను అప్రోచ్ అయి, ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలుసుకోవాలని కోరతానని ఉండవల్లి తెలిపారు.రామోజీరావు మరణించేవరకు సెక్షన్ 45 ఎస్ తమకు వర్తించదని వాదించేవారని, తర్వాత వారసులు కొత్త వాదన తీసుకువచ్చి ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం ఏమిటని అన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తప్పు చేసినా జరిమానా కట్టకుండా రామోజీ సంస్థ తప్పించుకుందన్నది విశ్లేషణగా ఉంటుంది. అన్నిటిని పరిశీలిస్తే ఉండవల్లి ఇంతవరకు చేసిన పోరాటానికి.. పూర్తి స్థాయిలో అర్ధవంతమైన ముగింపు వచ్చి ఉండకపోవచ్చు కాని, ఆయన చేసిన పోరాట స్పూర్తి మాత్రం ఎప్పటికి కొనసాగుతుంది. రామోజీ వంటి బలాఢ్యులు సైతం తప్పు చేస్తే, దానిని ఒప్పుకోకతప్పదని కూడా ఈ కేసు సారాంశంగా తీసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?
ఆంధ్రప్రదేశ్‌లో విశ్వసనీయతతో కూడిన రాజకీయానికి, బుకాయింపు రాజకీయానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. డీఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలు చూపుతూ మీడియా సమావేశంలో వివరించడమే కాకుండా, వైఎస్సార్సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేసిన ఆరోపణలు అన్నింటికి జవాబు ఇచ్చిన తీరు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచిందని చెప్పాలి.ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు డీఎస్సీపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి, విపక్షం ఉన్న శాసనమండలిలో అసలు చర్చకే వెనుకాడడం, దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఏపీపీఎస్సీపై ఆరోపణలు చేసిన వైనంతో వారు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో లోకేష్ పరిణితితో వ్యవహరించలేకపోతే, చంద్రబాబు మాత్రం డబాయింపు విధానాన్ని అనుసరించారన్న అభిప్రాయం కలుగుతుంది. అన్నింటికి మించి డీఎస్సీ, ఏపీపీఎస్సీలు రెండిటి పైన సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ సవాల్ విసరడంతో చంద్రబాబు, లోకేష్‌లకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.మామూలుగా అయితే జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే టీడీపీ అధినేతలు దానికి కౌంటర్‌గా వారే మాట్లాడడం కాని, లేదా పార్టీ ఇతర నేతలతో కాని జవాబు ఇప్పించేవారు. కాని అలా చేసినట్లు కనిపించలేదు. అసెంబ్లీలో వీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూటమి ఎమ్మెల్యేలు దాదాపు మౌన ప్రేక్షకుల మాదిరిగానే ఉన్నారనిపించింది. దాదాపుగా ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న దానిలో హేతుబద్దత లేదన్న భావన కలుగుతున్నా వాటిని ఎత్తిచూపలేకపోవడం వారి బలహీనతగా తీసుకోవాలి. టీచర్ల నియమాకాలకు సంబంధించి జరిగే డీఎస్సీ ప్రక్రియలో, ప్రత్యేకించి క్రీడా రిజర్వేషన్ విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ నిర్దిష్ట ఆధారాలతో ఆరోపిస్తోంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోరాటం చేశారు. వెంటనే ఆ అక్రమాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాని అధికార టీడీపీ చర్చకు ముందుకు రాలేదు. పోనీ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు పెట్టకుండా ఉంటే అదో పద్దతి అనిపించేది. చంద్రబాబు, లోకేష్‌లు డీఎస్సీ అక్రమాలు జరగలేదని చెప్పడానికి చేసిన వాదనలో చాలా లోపాలు కనిపించాయి. జగన్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయారు. వాటిలో కొన్నిటిని పరిశీలించండి.జగన్ తన వాదనలో ప్రధానంగా క్రీడా కోటాలో 372 పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చిన విదానాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం రెండు జీఓలు ఇచ్చి, వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ ఆ జీఓలను రద్దు చేస్తూ వేరొక జీఓ ఇవ్వడం గురించి జగన్ ప్రస్తావించారు. తమకు కావల్సినవారికి ఉద్యోగాలు ఇచ్చి, తదుపరి గేట్లు మూసివేశారా అన్నది ఆయన వేసిన ప్రశ్న. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా జవాబు ఇచ్చినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధూతో ఈ టీచర్లను లోకేష్ పోల్చడాన్ని యావన్మంది తప్పుపట్టారు. ఈ విషయం కూటమి ఎమ్మెల్యేలకు కూడా అర్థం అయి ఉండాలి. కాని అధికార పక్షంలో ఉన్నందున వారు అడగలేకపోయి ఉంటారు. లోకేష్ తీరు ఇమ్మెచ్యూర్గా ఉందని పలువురు విశ్లేషకులు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేధావులు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖల ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో అర్థం కాదు. కేవలం స్థానికంగా ఆటలలో పాల్గొంటే చాలన్న పద్దతి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండి ఉండదు. చిత్రంగా జాతీయస్థాయి క్రీడలలో మెడల్స్ సంపాదించిన కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించడం, ఆ తర్వాత అతనిని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, పరీక్ష పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఒకరికే అప్పగించడం వంటివాటిని లోకేష్ సమర్ధించుకున్న తీరు కూడా అంత బాగోలేదు.టీచర్ల పోస్టులకు బేరాసారాలు సాగిన ఆడియో తదితర విషయాలను కూడా జగన్ ఆధారసహితంగా చూపించారు. చంద్రబాబు, లోకేష్‌లు ఇచ్చిన సమాధానాలలో పరస్పర విరుద్దంగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించారు. జగన్ లేదా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసినంతనే లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కాని తన వైపు తప్పులేదని చెప్పుకోవడానికి ఆయన పడిన పాట్లు, ఆయనను రక్షించడానికి తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యత్నాలు అందరికి అర్థం అయిపోయాయన్నది పలువురి భావన.చంద్రబాబు తనదైన శైలిలో ఎదురుదాడి చేయడానికి యత్నించారు. పనికట్టుకుని ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, తన జీవితంలోనే ఎన్నడూ ఇలాంటి కుంభకోణం చూడలేదంటూ పెద్ద హడావుడి చేయాలని ఆయన తలపెట్టారు. కాని అది పండలేదు. అసెంబ్లీలో అయినా, బయట అయినా ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే, అంత అసత్యం అయి ఉంటుందని, గతంలో వైఎస్సార్సీపీలో ఉండి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటుండేవారు. పనికట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అధికారి గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై రకరకాల చర్చలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుపైన పలు కీలకమైన కేసులు రావడానికి ఆ అధికారి కారణమన్న కోపం ఉండి ఉండవచ్చని, దానిని ఈ సందర్భంగా బయటపెట్టారని కొందరు అంటున్నారు.అయితే జగన్ తన వివరణలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నిటిని పటాపంచలు చేసే విధంగా మాట్లాడారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు తమ ప్రభుత్వంలో జరిగాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అసలు సంబంధం లేని డిజిటల్ వాల్యుయేషన్, హాయ్ లాండ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి, వాస్తవాలు మరుగున పరచడానికి ముఖ్యమంత్రి యత్నించారని ఆయన ఆరోపించారు. వాటిని కూడా ప్రస్తావించి జగన్ హైకోర్టు తప్పుపట్టలేదన్న సంగతిని గుర్తు చేశారు.గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, పేపర్ టాంపర్ కాలేదని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక పేర్కొందని జగన్ వెల్లడించడంతో కూటమి ప్రభుత్వ వాదనంతా వీగిపోయినట్లయింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, వాల్యుయేషన్ మూడు ప్రదేశాలలో జరపడం, అన్నిచోట్ల సిసిటీవీ కెమెరాల అమరిక జంబ్లింగ్ మొదలైన పద్దతులను కట్టుదిట్టంగా అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌లు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారిలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్న కాన్పిడెన్స్‌ను చూపించలేకపోయారన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది.అదే టైమ్‌లో జగన్ తన ప్రజెంటేషన్‌లో ఒక స్పష్టత, వీడియో, ఆడియో ఆధారాలు, ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులలోని వివిధ భాగాలు మొదలైనవాటిని చూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఈ వివాదాల నుంచి బయటపడాలంటే, అవినీతి జరగలేదని, తాము అసత్యాలు చెప్పడం లేదని ప్రజలను నమ్మించాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జగన్ విసిరిన సవాల్‌కు ధైర్యంగా స్పందించి డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండిటిపైన సీబీఐ విచారణకు ఆదేశించడమే. మరి వారు అలా చేయగలుగుతారా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పీపీపీ ముసుగులో ఏపీ ఫర్ సేల్..!?
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన సందర్భంలో చెప్పిన విషయాలు రానున్న ప్రమాదానికి సంకేతమా అన్న అభిప్రాయం అప్పుడే కలిగింది. సరిగ్గా వారం తిరగకముందే అసలు విషయం బయటకు వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం 16 శాఖలకు సంబందించి వివిధ కార్యక్రమాలను పీపీపీ పద్దతిలో ప్రైవేటువారికి అప్పగించబోతున్నట్లు మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.టీడీపీ, జనసేనలు కలిసి మానిఫెస్టో విడుదల చేసినప్పుడు కాని, ఆ తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచారాలు నిర్వహించినప్పుడు కాని తాము పీపీపీ విధానంలో వివిధ రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తామని, యూజర్ చార్జీలు వసూలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వం పట్టణాలలో పారిశుధ్ద్యం నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఏభై నుంచి వంద రూపాయల చార్జీలు వసూలు చేస్తే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు నానా యాగీ చేశారు. చెత్తపన్నువేసే చెత్త ప్రభుత్వం అని ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే చెత్తపన్ను తొలగించామని అన్నారు. అయినా పిఠాపురం తదితర చోట్ల యధాప్రకారం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.నిజానికి దీనివల్ల ప్రజలపై పెద్దగా భారం పడింది లేదు. అయినా అంత రచ్చ చేసిన చంద్రబాబు ఇప్పుడేమో విద్య, వైద్యం, రవాణా మొదలైన 16రంగాలలో యూజర్ చార్జీలు వసూలుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీనిని ఏ తరహా ప్రభుత్వం అని జనం అనుకోవాలి?ప్రజలకు సంపద సమకూర్చి పెడతానని పదే, పదే ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టేమో కాని, ఉన్న ప్రజల సంపదను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి తయారవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.విపక్షంలో ఉన్నప్పుడు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్‌లు అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తివేస్తామని చెప్పారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి మీటర్లను పగలకొట్టండని పిలుపు ఇచ్చారు. పవర్లోకి వచ్చాక వాటిని తొలగించలేదు సరికదా.. ఇళ్లకు కూడా కొత్త మీటర్లు పెడుతూ జనానికి చిర్రెత్తిస్తున్నారు. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన రోజున ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన 23 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలలో 11.37 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు ఆరంభం అయ్యాయని, వీటిలో అధిక భాగం పీపీపీ మోడల్ అని అన్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలలో 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు పీపీపీ విధానంలో ఉన్నాయని తెలపడం విశేషం. దేనిని నమ్మాలో తెలియదు.అదలా ఉంచితే పీపీపీ వ్యవస్థలో భవిష్యత్తులో యూజర్ చార్జీల రూపేణా లక్షల కోట్ల మేర ప్రజలపై భారం వేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారనుకోవాలా! ఈ ప్రైవేటు కంపెనీలకు వయబిలీటి గ్యాప్ ఫండ్ ఇస్తారట. వడ్డీ లేని రుణం ఇస్తారట. వయబిలిటి ఫండ్ కోసం ప్రభుత్వం 1500 కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీల మూలధనంలో ప్రభుత్వం 20 నుంచి నలభై శాతం గ్రాంట్‌గా కూడా ఇస్తుందట. జగన్ ప్రభుత్వం పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వపరంగా నిర్మిస్తే, వాటిని ప్రైవేటువారికి అణాకు, బేడాకు ఆ సంపదను అప్పగించే కుట్ర జరుగుతోందన్నది వైఎస్సార్సీపీ నేతల విమర్శగా ఉంది.వేల కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత, దానిపై ఏ ప్రభుత్వమైనా ఆదాయం పొందాలని చూస్తుంది. కాని చిత్రంగా కూటమి ప్రభుత్వం దానిని వదలుకుని, ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల రూపేణా ప్రజలపై అదనపు భారం వేయడానికి రెడీ అయిందన్నమాట.భోగాపురం విమానాశ్రయం ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్మించడాన్ని, మెడికల్ కాలేజీలు ప్రైవేటువారికి అప్పగించడాన్ని ఒక రీతిలో చంద్రబాబు చూడడాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపట్టారు. విమానాలు ఎక్కేవారు, ఆరోగ్యం కోసం వచ్చే పేదవారు ఒకటేనా అని ఆయన ప్రశ్నించి, చంద్రబాబు ఆలోచన ధోరణి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని అన్నారు. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరగబోతోందని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పీపీపీ కాదు.. ఏపీ ఫర్ సేల్, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్న కొత్త విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇదంతా పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు.కాగా ఈనాడు మీడియా మాత్రం ప్రైవేటుకు ప్రోత్సాహం ప్రజలకు ప్రయోజనం అన్న శీర్షిక పెట్టి తెలుగుదేశంపై తన భక్తిని ప్రదర్శించింది. అంతే తప్ప విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సేవలకు యూజర్ చార్జీలేమిటి అని ప్రశ్నించలేదు.2004 కి ముందు కూడా చంద్రబాబు ఇదే విధానం అమలు చేయాలనుకునేవారు. ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ చార్జీలను కూడా కొన్నిచోట్ల పెట్టారు. నష్టాలలో ఉన్నాయని పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటువారికి కారుచౌకగా కట్టబెట్టారు. వాటిలో పెక్కు సంస్థలు అక్కడ పరిశ్రమలు నడపడం లేదు. ఆ పరిశ్రమల భూమిని ప్రైవేటు యాజమాన్యాలు రియల్ ఎస్టేట్‌కు వాడుకుని భారీగా లబ్ది పొందాయని అంటారు. చంద్రబాబు అప్పట్లో ఏది ఉచితం కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని అనేవారు. ఆ రోజుల్లో జన్మభూమి పేరుతో ఏభైశాతం ఖర్చు పెట్టే వారి ప్రాంతంలోనే రోడ్లను వేసేవారు.2004లో ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ పద్దతులకు గుడ్ బై చెప్పి, ప్రజల సాధారణ అవసరాలకు ప్రభుత్వమే పూర్తి వ్యయం భరించే విధానం అమలు చేశారు. చంద్రబాబు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన మైండ్ సెట్ ఎప్పుడూ ఆ రకంగానే ఉంటుందని వైఎస్సార్సీపీ వారు వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం తీసుకువచ్చిన పీపీపీ విధానం కూటమి ప్రభుత్వానికి మరణశాసనం అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు ప్రజలకు ఆందోళన కలిగించేదిగా ఉందన్నది వాస్తవం.ప్రైవేటువారు అభివృద్ది చేసుకునే రాజధాని అమరావతిలో ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్దం అవుతూ, ప్రభుత్వపరంగా పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల భారం మోపడానికి తయారవుతున్న వైనం చూస్తే ఇదంతా రివర్స్ ప్రభుత్వం అన్న భావన కలగదా! సామాజిక రంగాలలో సేవలన్నిటిని ప్రైవేటుకు అప్పగించాక ప్రభుత్వ బాధ్యత ఏమి ఉంటుంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప అని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అది నిజమేకదా అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ...! 'ఓటుకు నోటు' కేసు మరిచిపోయావా?
ఎన్నికలలో డబ్బులు తీసుకోవడం మానేయలేమా? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చిన ఒక పెద్ద సందేహం!కొందరు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం అయిన సందర్భంలో ఆయన ఈ ప్రశ్న వేశారు. నిజానికి చంద్రబాబు ప్రశ్న వేసుకోవలసింది తనకే కదా అని ఎవరికైనా డౌటు రావచ్చు. అసలు చంద్రబాబు చెప్పవలసిన మాటేమిటి? ఇకపై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఏ ఎన్నికలోను తాము పార్టీపరంగా ఓటర్లకు డబ్బు పంచబోమని, అలాగే ఏ పార్టీని పంచబోనివ్వబోమని కదా! నిజంగా ఈ మాట అని ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది.ఇంతకాలం జరిగిన విషయాల సంగతెలా ఉన్నా ఇకపై ఎన్నికలలో డబ్బు ప్రభావం తగ్గించడానికి చంద్రబాబు ఇప్పటికైనా పూనుకోవడం మంచి పరిణామం కదా అని అంతా అనుకునేవారు. వాస్తవంగా అలా జరుగుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే, కనీసం మాటవరసకైనా అన్నారులే అని భావించవచ్చు. ఇప్పుడు ఆ మాట చెప్పకపోవడంతో ఆయన చిత్తశుద్దిని శంకించే పరిస్థితి ఏర్పడుతుంది కదా! పైగా మహిళలే డబ్బు తీసుకుంటున్నట్లు మాట్లాడడంపై మాజీ మంత్రి రోజా వంటి వారు అభ్యంతరం చెప్పారు. ఇది మహిళలను అవమానించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే ఘాటు వ్యాఖ్య చేస్తూ రాజకీయాన్ని వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఈసీకి లేఖ కూడా రాశారు. నాయకులు రెండువేలు ఇస్తే, రెండు లక్షలు సంపాదించుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు లక్షలేమి ఖర్మ.. రెండు కోట్లు అయినా కావచ్చు. అదేమి రహస్యం కాదు. మాకు నీతి ఉంది.. డబ్బులు తీసుకోబోమని చెప్పండి అని ఆయన అన్నారు. నేతలు డబ్బు ఇస్తుంటే తమకు నీతి ఉందని చెప్పండని, డబ్బు తీసుకోకుండా ఓటేయండి అని ఆయన అన్నారు. ఇది మంచిమాటే.ఎన్నికలలో డబ్బు ఇచ్చేవారిది తప్పుకాదా! తీసుకునేవారిదే అవుతుందా? ఒకప్పుడు ఈ డబ్బు ప్రభావం పెద్దగా ఉండేది కాదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత, అది చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాకే ఇది బాగా అధికం అయిందని వివిధ రాజకీయ పక్షాల నేతలు విమర్శిస్తుంటారు. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ డబ్బు ఖర్చు పెడుతోందా? లేదా? ఓట్ల కొనుగోలుకు డబ్బు వ్యయం చేయడం లేదని చంద్రబాబు గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చేముందు ఆయా అభ్యర్దులను వారి పరిస్థితిని బట్టి 25 కోట్ల నుంచి ఏభై కోట్ల వరకు ఖర్చు చేయగలరా? లేదా? అని అడుగుతున్నారా? లేదా? కొందరి నుంచి కోట్ల రూపాయలు టిక్కెట్ కోసం వసూలు చేస్తున్నారా? లేదా? ఇతర పార్టీలు చేయడం లేదా?అని అడగవచ్చు.ఒకరిని బట్టి మరొకరు చేసే పరిస్థితి ఎలా వచ్చింది? చంద్రబాబు ఈ సుభాషితాలు చెప్పగానే అనేక పాత విషయాలు గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో సహిత వ్యాఖ్యలు వచ్చాయి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసును పలువురు ప్రస్తావించారు. 2015లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికిగాను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్న ఆరోపణ వచ్చింది. ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏభై లక్షల రూపాయలు తీసుకువెళ్లి ఏసీబీకి పట్టుబడిన వైనం, ఆ తర్వాత ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి భరోసా ఇవ్వడం వంటి సన్నివేశాలు మరోసారి తెరపైకి వచ్చాయి.ఆ క్రమంలో అప్పటి సీఎం అయిన కేసీఆర్‌తో రాజీలో భాగంగానే అప్పటికప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదలుకుని చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు. 1995లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి కోట్లు వెచ్చించారని చంద్రబాబుపై స్వయంగా ఆయన మామ ఎన్టీ.రామారావు ఆరోపించారు. ఆ రోజుల్లో అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటుకు 500 రూపాయలు చొప్పున టీడీపీ పక్షాన పంచామని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఒక టీవీ షోలో ఓపెన్‌గానే కొన్నేళ్ల క్రితం చెప్పారు. అప్పటి నుంచి ఓటు రేటు పెరుగుతూ రెండువేలకు చేరుకుందని అంటారు.ఇక 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేసింది అందరికి తెలుసు. ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తనకు ఏడు కోట్లు టీడీపీ నాయకత్వం ఇచ్చిందని ఆ రోజుల్లో బహిరంగంగానే వెల్లడించారు. మరో ఎమ్మెల్యే తనకు బెంగుళూరులో డబ్బు అందచేశారని అంటే, ఇంకొకరు తన అప్పు మొత్తం తీరిపోయిందని, అందుకే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించానని ఆంతరంగికంగా చెప్పేవారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది చంద్రబాబు అభిప్రాయం.కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఒక ఉపన్యాసంలో ఈ ప్రస్తావన చేశారు. ఇతర విషయాల సంగతేమో కాని, ఎన్నికల విషయంలో ఆయన డబ్బు వ్యయంలో రాజీపడరని కొందరు సీనియర్ టీడీపీ నేతలు చెబుతుంటారు. అవసరమైతే అప్పు చేయడానికి వెనుకాడరు. అలా అప్పులు ఇచ్చినవారిలో కొందరు ఎన్ఆర్ఐలు ఉన్నారని ప్రచారం జరిగేది.తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఓటర్లకు డబ్బు ఇవ్వకుండా విజయం సాధించారని చెబుతారు. ఆయన మాదిరి ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు అదేబాటలో నడుస్తానని చెప్పి ఉండాల్సింది కదా! ఉచిత బస్ స్కీమ్ వల్ల మహిళల ఆత్మగౌరవం పెరిగిందట. అది ఎలా ఉందో కాని, బస్‌లలో జరుగుతున్న గొడవలపై పలుచోట్ల ప్రజలు చికాకు పడుతున్నారు. ఒకప్పుడు ఏదీ ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు తాను ఉచిత బస్ వంటి స్కీమ్ అమలు చేస్తే మాత్రం గొప్ప సంగతి అని చెప్పుకుంటారు. అది ఆయన ప్రత్యేకత.ఈ సందర్భంలో ఒక మహిళ తాను ఫ్రీబస్ ఉందని హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని, విజయనగరం నుంచి రోజూ ఉచిత ప్రయాణం వల్ల 3500 రూపాయలు సేవ్ అవుతున్నాయని అన్నారు. తీరా చూస్తే ఆమె ఏదో చీరల వ్యాపారం చేస్తున్నారని, రీల్స్ చేస్తుంటారని సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఈ ఉదంతం నవ్వులపాలైనట్లయింది. పైగా హైదరాబాద్‌లో కూడా ఫ్రీబస్ స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది కదా అని కొందరు పేర్కొంటున్నారు.మహిళలకు ఇచ్చిన ఇతర హామీల గురించి ప్రస్తావించకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతుంటారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఇస్తానన్న ఆడబిడ్డ నిధి గురించి మాత్రం మాట్లాడలేదు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ డబ్బు ఇస్తామని, వేలంపాట మాదిరి ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. దాని గురించి ఏమనుకుంటున్నారని చంద్రబాబు మహిళలను అడగలేదు. ఒక్కో కుటుంబానికి నాలుగు పథకాలు వస్తున్నాయని ఆయనే అంటారు. చేపలు ఇవ్వడం కాదు. చేపలు పట్టడం నేర్పాలి.. అని ఆయనే చెబుతారు. దేనిని నమ్మాలి!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జీతాలకే 98 శాతమా? చంద్రబాబు లెక్కలపై ఉద్యోగుల ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత వ్యయం అవుతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 94 నుంచి 98 శాతం వ్యయం అవుతోందని, సంక్షేమ స్కీములకు అప్పులు తెస్తున్నామని ఆర్ధిక పరిస్థితి శ్వేతపత్రం విడుదల సందర్భంగా చెప్పారు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన పడుతున్నారు. వారి సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వీరిలో కొందరు టీడీపీ అనుకూల నేతలు కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ ఎన్జీవోల గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడుగా ఉన్న అలపర్తి విద్యాసాగర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కాదని అంటారు. కాని ఆయన సైతం చంద్రబాబు అసత్యపు లెక్కలు చెప్పారని అంటున్నారు.చంద్రబాబు చెప్పేదానిలో నిజం ఉంటే, ఈ నేతలు ఇంత ధైర్యంగా ఖండించగలుగుతారా అన్నది చర్చ. చంద్రబాబు లెక్కల్లో ఎక్కువ సందర్భాలలో నిర్దిష్టత అన్నది ఉండదు. అందువల్ల ఆయన చెప్పేదానిలో సత్యం ఎంత ఉంది? అసత్యం ఎంత ఉంది అన్నది తేల్చడం అంత తేలికకాదు. మొత్తం ప్రభుత్వ లెక్కలన్నీ పరిశీలించి ఒక అవగాహనకు రావల్సి ఉంటుంది. అందువల్లే ఉద్యోగ సంఘాల నేతలు అన్నిటిని సరిపోల్చుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంంది. విద్యాసాగర్ చెబుతున్నదాని ప్రకారం 30 నుంచి 35 శాతమే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ఉ ద్యోగుల పెన్షన్లకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో వంచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరింత వివరంగా ఈ అంశంపై మాట్లాడారు. 2025లో ప్రభుత్వం వ్యయం చేసిన 2.26 లక్షల కోట్లలో 37.4 శాతం మాత్రమే ఉద్యోగులకు అయిన ఖర్చు అని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే పన్నుల రాబడిలో 59 శాతం, ఇతర రాబడి కూడా కలిపితే 49 శాతం మాత్రమే ఉద్యోగులకు పెడుతన్న ఖర్చు అని ఆయన వివరించారు. ఈ రెండేళ్లలో 41 వేల మంది రిటైరైతే, వచ్చే ఐదేళ్లలో లక్షన్నర మందికి పైగా రిటైర్ కాబోతున్నారని, అదే సమయంలో కొత్త రిక్రూట్ మెంట్ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సంపద సృష్టించి హామీలు నెరవేర్చుతామని చంద్రబాబు అన్నారని, ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించారని, జాబ్ కాలెండర్ ఇస్తామన్నారని, కాని ఇప్పుడేమో డబ్బంతా ఉద్యోగులకే అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని వలిశెట్టి దామోదర్ అనే మరో ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు.గతంలో ఉద్యోగుల నేతగా ఉండి, ప్రభుత్వ ఆగ్రహానికి గురైన మరో ప్రముఖుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ఉద్యోగులకు 30 వేల కోట్ల బకాయిలు చెల్లించామని ఆయన అనడం అసత్యమని అన్నారు. ఉద్యోగుల జీతాల ఖర్చు 35 నుంచి నలభై శాతమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికి 50 వేల కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పినా, ఆచరణలో జరగడం లేదని ఈ నేతలంతా అంటున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు ఇంకో విధంగా ఉన్నాయి. వారు సభలు పెట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.తమపై పనిభారం పెంచడమేకాకుండా,తమ 22 డిమాండ్లను పక్కనబెట్టిందని వారు ధర్నా చేశారు. కరపత్రాలు పంచడానికి తమను ఇంటింటికి వెళ్లమంటున్నారని,సర్వేల పేరుతో విసిగిస్తున్నారని, ఆ క్రమంలోతాము ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కుంటున్నామని చెబుతున్నారు. ఇవన్ని చూస్తుంటే ప్రభుత్వంలో ఉద్యోగులలో దాదాపు ఎవరూ సంతోషంగా లేరనిపిస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,కీలక మంత్రి ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతూ కోట్లు వ్యయం చేస్తున్నారని,మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రం ప్రజలలో చెడు అభిప్రాయం కలిగించడానికి యత్నిస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు.వీరు చెప్పే విషయాలలో చాలావరకు వాస్తవాలు ఉండవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని చెప్పడం ద్వారా కొత్తగా పిఆర్సి వేయలేమని, ఇంటెరిమ్ రిలీఫ్ ఇవ్వలేమని చంద్రబాబు సంకేతం పంపినట్లయిందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తున్న వైనాన్ని ఉద్యోగులు కూడా గమనిస్తున్నారు. ఏకంగా నాలుగు భవనాల అద్దాలకు 2500 కోట్లు, రీడిజైనింగ్ కన్సల్టెన్సీకి అదనంగా 206 కోట్లు, హైకోర్టు వెలుపల సుందరీకరణకు 540 కోట్లు.. ఇలా మితిమీరి ఖర్చు చేసే ప్రభుత్వం ఉద్యోగుల వద్దకు వచ్చేసరికి ఆదాయం అంతా జీతాలకే సరిపోతోందని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడానికేనన్నది వారి భావన. ఉద్యోగ సంఘాల నేతలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం చేయకపోలేదు. అయినా వెంకట్రామిరెడ్డి వంటివారు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యోగులకు ఏమి హామీలు ఇచ్చారో గమనించండి. ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్టిస్తామని ఒక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే యత్నం చేశారు. కాని ఇప్పుడేమో అవమానించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న భావన ఉద్యోగులలో కలుగుతోంది. జగన్ ప్రభుత్వం జిపిఎస్ తీసుకువచ్చి ఒక పరిష్కారాన్ని కనుగొనే యత్నం చేస్తే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దానిపై దుష్ప్రచారం చేశారు.తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్, జిపిఎస్ విధానాలను పునఃసమీక్షించి పరిష్కారం చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆ ఊసే తేవడం లేదు. మెరుగైన పీఆర్సీ,ఐఆర్. వెంటనే ప్రకటిస్తామని మానిఫెస్టోలో చెప్పినా అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరైనవారికి మొదటి తేదీనే జీతాలు పెన్షన్ ఇస్తామని,వారికి రావల్సిన బకాయిలు చెల్లిస్తామని వాగ్దానం చేశారు. కాని చంద్రబాబు ఈ విషయంలో చెబుతున్న లెక్కలు తప్పని ఉద్యోగ నేతలు విమర్శిస్తున్నారు. వలంటీర్ల గౌరవ వేతనాన్ని ఐదువేల నుంచి పదివేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దేవుళ్ల సాక్షిగా ప్రకటించారు కాని, అసలు మొత్తం వ్యవస్థనే లేకుండా చేయడం మోసం కాదా అన్నది వారి ప్రశ్నగా ఉంది. ఈ నేపధ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సన్నద్దమవుతున్నాయి.అయితే ఏదో రకంగా వారిని భయపెట్టో, మభ్యపెట్టో వారి ఉద్యమానికి ప్రభుత్వపరంగా అడ్డుకట్ట వేసే యత్నం జరుగుతుంది. విశేషం ఏమిటంటే ఎల్లో మీడియా ద్వారా మాత్రం ఉద్యోగులకు ఏదో చాలా జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. గత జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఉద్యోగులను ఎన్నిరకాలుగా రెచ్చగొట్టాలో అన్ని విదాలుగా టీడీపీ,జనసేనలతో పాటు ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదేమీడియా ఉద్యోగులను మభ్యపెట్టే పనిలో పడింది. ప్రభుత్వ ఉద్యోగులు గత జగన్ టైమ్ లో తమ టైమ్ ప్రకారం డ్యూటీ చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకు జనాన్ని పోగు చేసే పనే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలేవో,నీళ్లేవో ఉద్యోగులు గమనించారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అడ్డంకులు.. ఆంక్షలు.. అయినా జగన్ వెంట జనం!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన ఏపీ ప్రజలకు మరింత స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో జగన్ కృతకృత్యమయ్యారు. అంతేకాదు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని నిర్భంధాలు పెట్టినా జగన్ పట్ల తమ అభిమానం చెక్కు చెదరదని వైఎస్సార్సీపీ క్యాడర్‌తో పాటు సామాన్య జనసందోహం కూడా తేల్చి చెబుతోంది.ఏపీ కూటమి ప్రభుత్వం పోలీసులనే నమ్ముకుని వందల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతున్నా వారు పట్టించుకోవడం మానేశారన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్‌ను కర్నూలు జైలులో అవమానించిన తీరు కూడా ఆయన అభిమానులలో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జైలులో ఉంచారు. అది ఎలా అక్రమ కేసు అన్నది సాక్ష్యాధారాలతో సహా జగన్ చెప్పగలిగారు.వైఎస్సార్సీపీ కార్యకర్తపై కొందరు టీడీపీ వారు దాడి చేసిన సందర్భంలో అతనిని రక్షించడానికి విరూపాక్షి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్త ఒకరు తన భార్య నైటీని తానే చించడమే కాకుండా, ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణ చేసి కేసు పెట్టారు. ఆ తర్వాత కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ వివాదంలో పోలీసులు విరూపాక్షి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి తలుపులు పగలకొట్టి లోపలకు వెళ్లడమే కాకుండా, ఆ సన్నివేశాలు తెలియకుండా ఉండడానికి సిసిటీవీ ఫుటేజ్‌ని, డిస్క్ లను అపహరించుకుని పోయారట. ఈ వివరాలన్నిటిని జగన్ తన టాబ్ ద్వారా మీడియాకు వివరించారు.జగన్ ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతారని ప్రజలు భావిస్తారు. దానికి తగినట్లుగానే తను చెప్పిన విషయాలకు ఆధారంగా సంబంధిత వీడియోలను ప్రదర్శించారు. పోలీసు అధికారులు కాని, ప్రభుత్వంలో ఉన్నవారు కాని వాటిపై ఇంతవరకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. బాధితులు వైఎస్సార్సీపీ అనుకూలురు అన్న భావన కలిగితే చాలు.. పోలీసులు వారిపైనే ఏదో రకంగా కేసు పెడుతున్నారనడానికి విరూపాక్షి అక్రమ అరెస్టు ఉదాహరణ అవుతుంది. పోలీసులు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ భార్య నైటి చించుతున్న వ్యక్తిని అడ్డుకోకపోవడం, వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసినవారిమీద కేసు పెట్టకపోవడం వంటివి ఏపీ పోలీసు వ్యవస్థకు మచ్చగానే మిగులుతుంది.కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ద్వారా జగన్‌కు జనంలో విస్తారంగా పర్యటించే అవకాశాన్ని కూటమి నేతలే ఇస్తున్నారు. తద్వారా ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తున్నారు. జగన్ శ్రీకాకుళం వెళ్లినా, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వెళ్లినా, ఇప్పుడు కర్నూలు వెళ్లినా ఒకే రకమైన స్పందన కనిపిస్తుండడం విశేషం. అంతకుముందు గుంటూరు, కృష్ణా, నెల్లూరులలో పర్యటించినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో హెలికాఫ్టర్ దిగినప్పటినుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లేవరకు 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్‌కు ఐదుగంటలకు పైగా పట్టింది. ఈ పరిస్థితి టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు కూడా కడుపుమంటగా మారుతోంది. వారికి కంటగింపు అవుతోంది. ఇది పరామర్శయాత్రనా? లేక విజయ యాత్రనా అని ఎల్లో మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఆ రకంగా జగన్‌కు జనంలో ఉన్న పట్టును టీడీపీ మీడియానే తెలియచేసినట్లవుతోంది.జగన్‌కు జనం రాలేదని రాయాలన్నది వారి కోరిక కావచ్చు. కాని పరిస్థితి అలా ఉండడం లేదు. కర్నూలుకు జనం రాకుండా పోలీసులు ఎక్కడకక్కడ చెక్ పోస్టులు పెట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆ దశలో వైఎస్సార్సీపీ అభిమానులు పోలీసు చెక్ పోస్టులను తోసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం కనిపించింది. తమపై పోలీసులు కేసులు పెడతారని తెలిసినా వారు అంత ధైర్యంగా ముందుకు కదులుతున్నారంటే జగన్ పై వారికి ఏర్పడిన అభిమానం అటువంటిదన్నమాట.అసలు ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని కలుసుకోవడానికి వెళుతున్న కార్యకర్తలను నిలువరించే పని పోలీసులు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనుకుంటే కట్టడి చేయవచ్చు. లేదా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంటే, దానికి తగ్గట్లు ఏర్పాటు చేయవచ్చు. అలాకాకుండా పాలక పార్టీల నేతల మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా జైలులో ఉన్న తన ఎమ్మెల్యేని కలవడానికి వెళితే పోలీసులు అవమానించిన తీరు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉందని చెప్పాలి. సాదారణంగా రూల్ ప్రకారం ఎవరినైనా కూర్చోబెట్టి ఫోటో తీసిన తర్వాత ఖైదులో ఉన్న వ్యక్తిని కలవడానికి అనుమతిస్తారు. కాని జగన్‌ను మాత్రం నిలబెట్టి ఒక గేటు వద్ద ఫోటో తీయడం ద్వారా ఆయనే ఏదో కటకటాల వెనుక ఉన్నట్లు చూపించాలన్నది అధికారుల తాపత్రయం కావచ్చు. కాని ఈ విషయాన్ని జగన్ బయట చెప్పేయడంతో పోలీసు శాఖ ప్రతిష్ట మరింత దిగజారినట్లయింది.వైఎస్సార్‌సీపీవారితో పాటు సామాన్య ప్రజలలో కూడా ఇదేమిటి ప్రభుత్వం ఇంత సంకుచితంగా మారింది అన్న అభిప్రాయం ఏర్పడింది. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును కుప్పం, అనపర్తిలలో శాంతిభద్రతల సమస్య ఉందని నిలువరించే యత్నం చేశారు. దానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి వారి మాట కాదని టూర్ చేశారు. అనపర్తి వద్ద అయితే ఏకంగా నడుచుకుంటూ వెళతానని తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఆయన చేస్తే అదంతా చట్టబద్దం, వ్యతిరేక పార్టీవారు చేస్తే మాత్రం తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుంటారు.కర్నూలు టూర్లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ. అలాగే డీఎస్సీ అక్రమాల బాధితులు కూడా జగన్‌ను కలిశారు. ఇలా వివిధ వర్గాలవారిని కలుసుకుంటూ, రోడ్లపై ఉన్నవారికి అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్లారు. జగన్‌కు ఇంత ఆదరణ ఎందుకు వస్తున్నదన్నదానిపై ఆత్మవిమర్శ చేసుకోవల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా జగన్‌ను, వైఎస్సార్సీపీని తీవ్రస్థాయిలో విమర్శించడానికి, కొన్నిసార్లు దూషించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయనలోని అసహనాన్ని తెలియచేస్తుంది.ప్రభుత్వం ఇకనైనా తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. వైఎస్సార్సీపీని అణచివేయాలని చూస్తే, అది మరింత ప్రభావం చూపుతుందని, జగన్‌ను కలవకుండా ప్రజలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, అది తమకే నష్టమని చంద్రబాబు, లోకేష్‌లు తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమిలో కుంపటి.. మరో కొత్త తలనొప్పి!
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అద్వాన్నంగా పనిచేస్తున్నది ఆ పార్టీల నేతలే బహిర్గతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం సాగుతున్నది కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. టీడీపీకి ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్న కొంతమంది మేధావులు ప్రభుత్వ తీరుపై పెదవి విరవడమే కాకుండా, ప్రభుత్వం ఐసీయులో ఉందని కామెంట్ చేస్తున్నారు.ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆరోపణల పర్వం, విజయవాడలో టీడీపీకే చెందిన డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులుతో బలవంతపు రాజీనామా చేయించడం తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా సహాకార పాల ఉత్పత్తుల సంఘం విజయ డెయిరీ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లకు నచ్చలేదేమో తెలియదు. క్యాబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇద్దరు మంత్రులు హుటాహుటీన డెయిరీ ఆఫీస్‌కు వెళ్లి ఆంజనేయులు రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు పంపకపోతే వారు ఎందుకు వస్తారన్నది టీడీపీ వర్గాలలో ఉన్న టాక్.ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారధి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రంగంలో దిగి డెయిరీ కార్యాలయానికి వెళ్లి ఆంజనేయులును బెదిరించారట. రాజీనామాకు ఆయన సుముఖంగా లేరు. అయినా మంత్రుల హూంకరింపులతో ఆంజనేయులు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆంజనేయులు కూడా టీడీపీకి చెందినవారే అయినా ఎందుకు ఇంతగా కక్ష కట్టారన్న చర్చ జరుగుతోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈయనపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన అలిగారట. దాంతో ఆయనను బుజ్జగించడానికి గాను ఆంజనేయులుతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావించిందట.అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల కంపెనీకి లాభం చేకూర్చడానికే చలసానితో రాజీనామా చేయించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. అది వేరే విషయం. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యానికి మంత్రులు చెప్పారట. అంతేకాక ఈ క్రమంలో ఆంజనేయులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులుగా పేరొందిన కొందరు యూట్యూబ్ చానళ్లలో ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన పార్ధసారధి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బెడ్‌పై ఉన్న ఆంజనేయులుతో రాజీనామా పత్రాన్ని తీసుకుని ఫోటో దిగడంపై వారు మండిపడ్డారు. పార్ధసారధి తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి ఇంతగా తాపత్రయ పడ్డారని వీరు అంటున్నారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీకి వ్యతిరేకంగా అన్ని ఆరోపణలు చేసినా, మరికొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా, వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని టీడీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఘట్టం గుర్తుకు వస్తుంది. 1995లో పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి ఎన్టీఆర్ నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారని చెబుతారు. సరిగ్గా అదే రీతిలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యవహరించిందన్నమాట. కాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ప్రభుత్వంలో సాగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటికి పలుమార్లు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన కొందరు సాగిస్తున్న గంజాయి, ఇసుక మాఫియాలపై ఓపెన్‌గానే మాట్లాడారు.తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాలలో దామచర్లకు వాటాలు ఉన్నాయని, రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షలు వసూలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ అడ్డాగానే దందాలు సాగిస్తున్నారని కూడా బాలినేని అన్నారు. దీనికి ప్రతిగా దామచర్ల కూడా బాలినేనిపై పలు ఆరోపణలు చేశారు. బాలినేని పార్టీ మారకపోతే, బాలినేని ఆయన కుమారుడు ఈపాటికి జైలులో ఉండేవారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలు చూస్తే ఏమి అర్దం అవుతుంది. ప్రభుత్వంలోను, అలాగే అధికార కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అడ్డూ, ఆపు లేకుండా పోయిందనే కదా! కాని వీరిద్దరు సమన్వయం పాటించాలని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఒంగోలులోని తమ పార్టీ నేతలకు సందేశం పంపించారట. అంతే తప్ప ఇరువురు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా లేదన్నమాట.అవినీతిని కాపాడటమంటే ఇది కదా అన్నది ప్రజల భావన. దీనిని కప్పిపుచ్చుకోవడానికి మూడు పార్టీల సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారు. మనలో మనం విమర్శలు చేసుకోవదని సలహా ఇచ్చాయి. అంతే తప్ప అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించలేదు. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూటమి మిత్రపక్షాలలో విభేదాలు సృష్టించడానికి వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని పిచ్చి ఆరోపణ చేశారు.ఈ మధ్య ఒక సినిమాకు సంబంధించి టీడీపీ, జనసేనల అభిమానులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారట. కొందరైతే దూషణలకు దిగారట. వాటిని వైఎస్సార్సీపీ అంటకట్టి తప్పించుకోవాలని చూస్తే ఎవరు నమ్ముతారు! కాగా రాష్ట్రంలో జరుగుతున్న అద్వాన్న పాలనను, అవినీతిని ప్రశ్నించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీపై కొత్త ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గోవింద నామాన్ని పేరడిగా వాడుతున్నారన్నది ఆయన అభ్యంతరమట. నిజంగానే ఆయన చిత్తశుద్దితో అభిప్రాయపడితే తగు సూచన చేయడం తప్పుకాదు. కాని సినిమాలలో ఎన్ని రకాల పేరడిలు హిందూ మత విశ్వాసాలపై జరిగాయో ఆయనకు తెలియదా! గోవిందా పేరుతో సినిమానే వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో గోవింద అంటూ ఒక బాబాపై పాటకట్టారే. ఇలా ఎన్నో సన్నివేశాలు సినిమాలలో ఉన్నాయి. వాటి గురించి ఏమంటారో తెలియదు.మంత్రి లోకేష్ కూడా గతంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా గోవిందా.. అంటూ నినాదాలు చేసిన వీడియోలు కూడా చక్కర్లు తిరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాటను కూడా చూపుతున్నారు. అందుకే ఏదైనా విమర్శ చేయాలనుకుంటే ముందూ, వెనక ఆలోచించాలని అంటారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. వైఎస్సార్సీపీపై బురద వేసే క్రమంలో ఈ ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న విమర్శలు వచ్చాయి. తదుపరి సీబీఐ దర్యాప్తులో అలాంటి జంతు కొవ్వు కల్తీ ఏది జరగలేదని తేలింది. మరి దానిపై వీరు స్పందించలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ సనాతన ధర్మం పేరుతో ప్రజలను ఏమార్చడానికి వచ్చినట్లుగా ఉంది.ఒంగోలులో తన పార్టీ నేత చేసిన ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. పైగా రెండు పార్టీలు కాంప్రమైజ్ ఫార్ములా వర్కవుట్ చేయడం ఏమిటి? ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది. చలసాని ఆంజనేయులు నుంచి ఆస్పత్రిలోనే రాజీనామా పత్రాన్ని మంత్రి పార్ధసారధి తీసుకుంటున్న పోటో టాగ్ చేస్తూ ఐసీయూలో పార్టీ, ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ వారిని నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు.. ఏబీతో పాటు మరికొందరు టీడీపీ వీర మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు జవాబు ఇచ్చే ధైర్యం చేయగలరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మహేంద్ర దేవ్.. బాబు రాగానే మాట మారిందా?
దేశానికి మేధావులు ఎంతో కీలకం. వారు దేశాన్ని నడిపే రాజకీయ నేతలకు సరైన మార్గ నిర్దేశనం చేస్తే సమాజానికి మేలు చేసినవారు అవుతారు. కాని అదే మేధావులు కూడా, తమ స్వార్థ ప్రయోజనాలకోసమో, లేక ఏదో పార్టీకి మేలు చేయడం కోసమో రాజకీయ కోణంలో మాట్లాడితే అది దేశానికి తీరని నష్టం చేసినవారు అవుతారు. దురదృష్టవశాత్తు కొందరు మేధావుల ముసుగులో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగాను, మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆ జాబితాలో ఆర్థికవేత్తగా ఉన్న సూర్యదేవర మహేంద్రదేవ్ కూడా చేరడం బాధాకరంగా ఉంది.ప్రముఖ చిత్రకారుడు సూర్యదేవర సంజీవదేవ్ అంటే తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం. అలాంటి గొప్పవ్యక్తి కుమారుడు అయిన మహేంద్రదేవ్ గతంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నదానిని పక్కనబెడితే, ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్పే విషయాలను కూడా నమ్మకూడదన్న అభిప్రాయం ప్రజలలో కలగదా? అది మేధావి వర్గానికి సిగ్గు చేటు అవుతుందా? కాదా?మహేంద్రదేవ్ 2024 ఎన్నికలముందు ఏప్రిల్ నెలలో ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆంధ్రాకు అప్పులే శాపం అని వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఆధారంతో అన్నారో తెలియదు కాని ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు దాటిపోయాయని విమర్శించారు. అందులో ఏ ప్రభుత్వ వాటా ఎంత అన్నది చెప్పినట్లు లేరనుకోండి. ఇది సరిగ్గా ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలిగా ఆ రోజుల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు చెప్పిన అసత్య మాటల మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది గదా!నిరుద్యోగం తాండవిస్తోందని, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ ప్రశ్నించారు. ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుందని, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. అప్పటి జగన్ ప్రభుత్వం చేపట్టిన స్కూళ్లు, ఆస్పత్రులను నాడు-నేడు స్కీమ్ కింద బాగు చేయడం పట్ల కూడా అంత సంతృప్తి చెందలేదు. జీడీపీలో అది ఐదు శాతంకన్నా తక్కువేనని ఆయన ఆనాడు వ్యాఖ్యానించారు. కారణం ఏదైతేనేం.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ కీలక మంత్రిగా మారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారితో పాటు మహేంద్రదేవ్‌కు కూడా ప్రధాని కార్యాలయంలో ఆర్థిక సలహామండలి చైర్మన్ పదవి వచ్చింది. ఇక అంతా ఆల్ హాపీస్ అన్నమాట.తాజాగా ఆయన ఎల్లో మీడియాలోని మరో పత్రిక ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎమన్నారో తెలుసా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదట. అప్పులను కేవలం సంఖ్య రూపంలో కాకుండా జీడీపీతో పోల్చి చూడాలట. అంతేకాదు.. చంద్రబాబుకు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను విస్మరించడం లేదని తెలిపారు. ఇవన్ని చదివితే ఏమి అర్థం అవుతుంది. బహుశా చంద్రబాబు సిఫారస్తోనే కేంద్రంలో ఈయనకు పదవి వచ్చిందేమో అన్న అనుమానం జనానికి కలగదా!ఆయన నిజాయితీగా చెప్పదలిస్తే ఏమి వివరించాలి.. గత ఎన్నికలకు ముందు ఏపీ అప్పు 14 లక్షలు ఉందని ఎందుకు చెప్పవలసివచ్చిందో వివరించాలి కదా! ఆ పని చేయలేదు. ప్రస్తుతం లోక్ సభ ఇచ్చిన వివరాల ప్రకారం ఏపీ అప్పు 6.45 లక్షలే అని ఎందుకు ఉంది? అంటే మహేంద్రదేవ్ కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద వేసినట్లు అవ్వలేదా? జగన్ తన టరమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభాన్ని ఎదుర్కున్నా ఐదేళ్ల పీరియడ్‌లో వైఎస్సార్సీపీ టైమ్‌లో జరిగిన అప్పు 3.63 లక్షల కోట్లేనని వెల్లడవుతోంది కదా! కాని కూటమి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ 3.60 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిందో ప్రభుత్వంలోని వారు చెప్పలేకపోతున్నారు. కనీసం మహేంద్రదేవ్ అయినా చెప్పి ఉంటే బాగుండేది కదా!అమరావతి నిర్మాణంతో ప్రయోజనాలు ఉన్నాయట. ఎవరూ రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేయవద్దని చెప్పడం లేదు. అభివృద్ది అన్నది సహజ సిద్దంగా ఉండాలి కాని, లక్షల కోట్ల వ్యయం చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి చేయవద్దని కదా చాలామంది సలహా ఇస్తున్నది! ఒకే ప్రాంతంలో ఇప్పటికే 50 వేల కోట్లను, అది కూడా అప్పు చేసి ఖర్చు చేస్తుంటే మిగిలిన ప్రాంతాలవారికి అది అసంతృప్తి కలిగించదా? జగన్ మావిగన్ ప్రతిపాదన చేస్తే దాని గురించి మాట్లాడకుండా మూడు రాజధానులు అంటూ ఇప్పుడు అవసరం లేని ప్రస్తావన మహేంద్రదేవ్ తేవడం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది.జగన్ సంక్షేమ స్కీముల వల్ల ఉపయోగం లేదని అప్పట్లో చెప్పారు. మరి అంతకన్నా ఎక్కువ అమలు చేస్తామని, సంపద సృష్టిస్తామని చంద్రబాబు టీమ్ ప్రచారం చేసిందే! ఈ రెండేళ్లలో సంపద సృష్టించలేదే. ఖజానా ఖాళీ అయిందని, సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని చంద్రబాబు అడిగారే! కనీసం మహేంద్రదేవ్ అయినా ఆయన చెవిలో సలహా ఇచ్చి ఉండాల్సింది కదా! ఇక ఈనాడు మీడియా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసిన కొన్ని అబద్దపు కథనాలు, పెట్టిన హెండింగ్లు చూస్తే జర్నలిజాన్ని ఇంత నీచంగా మార్చారా అన్న బాధ కలుగుతుంది. కొన్ని ఉదాహరణలు చూడండి..జగన్ బొమ్మవేసి రుణ కంఠుడు అంటూ హెడింగ్ పెట్టి, పది లక్షల కోట్ల అప్పు దాటించిన ఘనుడు అని రాసింది. పురందేశ్వరి రాష్ట్ర అప్పులు 12.50 లక్షల కోట్లు అని ఆరోపించారు. మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు 11 లక్షల కోట్లు అప్పు అంటూ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేస్తూ అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు. శ్రీలంక కంటే నాలుగు రెట్ల అప్పుల ఏపీ అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయనే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ శ్రీలంక ఏమైందో, ఇప్పుడు తామెందుకు భారీ అప్పులు చేస్తున్నారో కేశవ్ చెప్పడం లేదు.శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం అని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతే అని ఈనాడు గుండెలు బాదుకున్నారు. శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అని చంద్రబాబు విమర్శించారు. ఇవన్ని జగన్ ప్రభుత్వంపై ప్రచారం చేసిన అబద్దాలు. వారు అప్పట్లో చేసిన ఆరోపణలన్నిటిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నిజం చేస్తోందేమో అని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని బుద్దిజీవులు వ్యాఖ్యానిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ప్రశ్నించండి’ అంటున్న మోదీ.. ఏపీలో ప్రశ్నిస్తే కేసులా?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఉపన్యాసం చేస్తూ ప్రతి అంశంపైన ప్రశ్నించాలని యువతకు పిలుపు ఇచ్చారు. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. కొద్దికాలం క్రితం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పత్రాల లీక్‌కు సంబంధించి యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేపథ్యంలో జరిగిన పరిణామాలకు, ఆ తర్వాత మోదీలో వచ్చిన మార్పునకు ఇది దర్పణం పడుతుంది. ప్రధాని వ్యూహాత్మకంగా తన వైఖరి మార్చుకున్నారా? లేక దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించేతత్వాన్ని బలపరచడానికి చేశారా? అన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కాని మోదీ ప్రసంగాలలో ఇది కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.కానీ, దీనికి ఆయన కట్టుబడి ఉండడమే కాదు. తన మిత్రపక్షాలు ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రాలలో కూడా అలాగే వాతావరణం ఏర్పడేలా ఆయన చర్య తీసుకుంటేనే యువతలో విశ్వాసం ఏర్పడుతుంది. ఏపీలో ప్రశ్నించే యువతను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పెద్దలు గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బాచ్ అంటూ అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్ది పార్టీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత భాష వాడుతున్నారు. దేశంలో ఇలాంటి పెడ పోకడలను నియంత్రించాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తించాలి. అయితే కాక్రోచ్ ఆందోళన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఎంపీలు పార్లమెంటులో పూలదండలతో స్వాగతం చెప్పిన తీరు కూడా అంత శోభ నివ్వదు. దీనిని మోదీ ఎందుకు అనుమతించారో తెలియదు.మరోవైపు ఏపీలో డీఎస్సీ అక్రమాలపై విపక్ష వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ అక్రమాల వల్ల నష్టపోయిన యువత బహిరంగంగా అవి ఎలా సాగాయో వెల్లడిస్తున్నారు. దీనిపై సీఐఐ దర్యాప్తును, మంత్రి లోకేష్ రాజీనామాను వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. నిజంగా ఇందులో ఏ అవకతవక జరగకపోతే నీట్ పరీక్షల గొడవపై సీబీఐ దర్యాప్తు వేసినట్లు ఏపీలో కూడా చేసి ఉండవచ్చు. అలా చేయకపోగా ప్రశ్నించేవారి గొంతు నులమడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్సీపీ దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు దాడులు చేయడం వంటివి చేస్తున్నారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. ఇంత చేస్తున్నా ఆందోళనలు ఆగడం లేదన్న అసహనంతో పోటీ ర్యాలీలు చేయించడం ఆరంభించారు.ఢిల్లీలో యువత ఆందోళన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యూహాలను కొన్నిటిని అమలు చేయకపోలేదు. పోలీసులు పెల్లెట్ గన్లను ప్రయోగించడం, లాఠీలను ఝళిపించడం వంటివి చేశారు. దీనివల్ల బీజేపీకి బాగా నష్టం జరిగింది. ఆ డ్యామేజీని గుర్తించిన ప్రధాని ఆందోళనకారులను ఫ్రెండ్స్ అంటూ అడ్రస్ చేశారు. కానీ ఏపీలో మాత్రం గంజాయి బ్యాచ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ, ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. పైగా ప్రభుత్వం తలచుకుంటే రెండు నిమిషాలలో అణచివేస్తుందని కూడా బెదిరిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సంబంధించి వచ్చిన ఆరోపణల మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్దపడింది. ఏపీలో మాత్రం అలా చేయడం లేదు.ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలను ప్రభుత్వం సాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. పంజాబ్‌లో ఇలాంటి ఆరోపణలు వస్తే అక్కడ బీజేపీకి చెందినవారు కూడా ఆందోళనలు చేస్తున్నారు. జార్ఖండ్‌లో ఉద్యమానికి అక్కడ అధికారంలో ఉన్న భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ ఏపీలో విచిత్రంగా కాంగ్రెస్, బీజేపీలు నోరు విప్పడం లేదు. జనసేన ఎటూ 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఓపెన్ గానే చెబుతోంది. అంటే అంతకాలం చంద్రబాబు సర్కార్ ఏం చేసినా నోరు విప్పదనుకోవాలి. ఆ రకంగా ఈ పార్టీలన్నిటిని చంద్రబాబు తన కంట్రోల్లో పెట్టుకున్నారన్న భావన ఉంది. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో యువత ప్రశ్నించడాన్ని స్వాగతిస్తున్నామని అంటున్నారు. ప్రతి అంశంపైనా ప్రశ్నించాలని, అందరూ ఆమోదించారని అక్కడితో ఆగిపోవద్దు అని ఆయన చెబుతున్నారు. ఇందులో ఎంత చిత్తశుద్ది ఉందన్నది భవిష్యత్ పరిణామాలను బట్టి ఆధారపడి ఉంటుంది.ఇదే సందర్భంలో అమెరికాలో ప్రజాస్వామ్యం బలోపేతం అయిన తీరుపై ప్రముఖ చరిత్రకారుడు మైకేల్ బిష్లోన్ చేసిన ఒక ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించింది. సాక్షి దినపత్రిక ఈ వ్యాసంలోని ముఖ్యాంశాలను ప్రచురించింది. ఆ ఉపన్యాసంలో ఆయా పూర్వ అధ్యక్షులు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేసిన కృషిని, వారి ఉత్తేజపూరిత వ్యాఖ్యలను కూడా ఆయన ఉదహరించారు. ఇది భారత ప్రజాస్వామ్యం బలపడటానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికాలో గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందిన బెంజిమిన్ ఫ్రాంక్లిన్ ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే అని వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ చెప్పిన మాట ఏమిటంటే, అమెరికాలో గొప్పహోదా మిస్టర్ ప్రెసిడెంట్ కాదు.. మిస్టర్ సిటిజన్.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.దేశాన్ని పొగిడేవారికే కాదు.. దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా సమర్ధించేవారికి సమాన గౌరవం ఉండాలని కూడా అమెరికా గొప్ప నేతలు నమ్మారని మైఖేల్ వివరించారు. ఇంకో ప్రముఖుడు ధామస్ జపర్సన్ మరో మాట చెప్పారు. మిత వ్యయంతో, సమర్ధవంతంగా పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ఆ ప్రజాస్వామ్య స్పూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుందని అన్నారు. ఇదే వ్యాసంలో మైఖేల్ ఒక విషయం చెప్పారు. చరిత్రకారులు తమకు అనుకూలంగానే మాట్లాడాలని 2026లో వాషింగ్టన్ డీసీలోని కొందరు రాజకీయ నేతలు ఆశిస్తున్నారని, సర్కస్ లోని విదూషకుల మాదిరి ప్రవర్తించాలని కోరుకుంటున్నారని, అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారిని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అమెరికాలో కూడా గత విలువలు కొరవడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారన్న మాట.మైఖేల్ చెప్పిన మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? అమెరికా కన్నా పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న విపరిణామాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నాయనే అనిపిస్తుంది కదా! దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి ఏపీ వంటి రాష్ట్రాలలో రెడ్ బుక్ అంటూ అరాచకపు వ్యవస్థను సృష్టించడం ప్రజలను కలవరపరుస్తుంది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి రాజ్యాంగ రూపకర్తలు, దేశ నిర్మాతలు భారత్ లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించి ఉండరు. ప్రజాస్వామ్యంతో నిమిత్తం లేకుండా నియంతృత్వంగా అల్ప బుద్దితో వ్యవహరిస్తున్న నేతల తీరును గమనిస్తే వారి ఆత్మలు క్షోభిస్తాయి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
డీఎస్సీపై ప్రశ్నిస్తే దాడులా?.. ‘క్రిమినల్స్ అడ్డా’ ఎవరిది బాబు?
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తన అనుచరులతో కలిసి గత గురువారం నాడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష శిబిరంపై దాడి చేశారు. టెంట్ పీకేశారు. అక్కడ కొందరు టీడీపీ గూండాలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సరిగ్గా అదే టైమ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. బోండా ఉమ అరాచక ప్రవర్తనపై ఆయనకు సమాచారం అందే ఉండాలి. అయినా అలాంటివి చేయవద్దని చెప్పకపోగా, వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, క్రిమినల్స్ తయారీ అడ్డా అంటూ చంద్రబాబు విమర్శించారట.కొన్నాళ్ల క్రితం బోండా ఉమ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పక్కన కూర్చుంటే చంద్రబాబుకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కమిటీ వేసి మందలించే ఏర్పాటు చేశారు. తదుపరి తన కుమారులతో కలిసి బోండా ఉమ చంద్రబాబును కలిశారు. అక్కడ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కాని, మరుసటి రోజే ఉమా విజయవాడలో గూండాయిజానికి బరి తెగించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఆయన అనుచరులు దాడి చేశారు. విజిటేరియన్ అయిన విష్ణుపై కోడిగుడ్లు విసిరారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, మంత్రి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. వారు తమ డిమాండ్‌తో ప్రశాంతంగా దీక్షలు చేస్తున్నారు. దీనిని భరించడం టీడీపీ నాయకత్వానికి కష్టంగా మారింది.నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. జార్ఖండ్‌లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాటికి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఏపీలో కూడా డీఎస్సీ టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆధార సహితంగా ఆరోపణలు చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పక్షాన సరైన జవాబు ఇవ్వలేకపోతున్నారు. పలువురు డీఎస్సీ అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని సాక్ష్యాలు చూపుతున్నారు. అయినా ప్రభుత్వం డబాయించి తప్పించుకోవాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ వివిధ రూపాలలో ఆందోళనలు సాగిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై జరుగుతున్న ప్రచారం ప్రజలలోకి వెళుతుండడంతో చంద్రబాబు, లోకేష్‌లు అసహనానికి గురవుతున్నారు. అందువల్లే ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలలో అణచివేయగలదని బెదిరించడం, ఆందోళన చేస్తున్న రైతులను, నిరుద్యోగ యువతను గంజాయి బాచ్ అని అనడం వంటివి చేశారనిపిస్తుంది. ఇవన్ని ముఖ్యమంత్రి స్థాయికి తగనివని ఆయనకు తెలిసినా ఏదో నిస్సహాయ స్థితిలో పడ్డారనిపిస్తుంది. ఎదురుదాడిలో భాగంగా కర్నూలులో కొందరితో ప్రదర్శన చేయించారు. వారు ఏ తరహా వారో తెలియదు. ఎల్లో మీడియా ప్రముఖంగా ఆ కథనాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ర్యాలీ చేస్తే వారు పవిత్రులు, వ్యతిరేకంగా చేస్తే గంజాయి బాచ్లని ప్రచారం చేస్తారన్నమాట. తనవైపు వాదన సరిగా లేనప్పుడే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడతాయన్న అబిప్రాయం ఉంది. దేవరపల్లిలో జగన్ టూర్లో ఒక చిన్న హోటల్లో జరిగిన ఉదంతాన్ని కూడా పెద్దదిగా ఫోకస్ చేయాలని యత్నించి చంద్రబాబు అండ్ కో భంగపడ్డారు. ఆ హోటల్ యజమానురాలు లక్ష్మి వచ్చి జగన్‌ను కలిశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోకపోవడం గొప్ప విషయమే. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు, లోకేష్‌లను సంతృప్తిపరచడానికి బోండా ఉమా కాని, మరికొన్ని చోట్ల ఇతర టీడీపీ నేతలు కాని దాడులు చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. దానికి తగినట్లే ఉమా మాట్లాడుతూ లోకేష్‌ను విమర్శిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా దీక్ష శిబిరాలు నిర్వహిస్తారా అని అంటున్నారు.నిజానికి విష్ణు పోలీసులకు చెప్పే దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. చిత్రంగా శిబిరానికి రక్షణ కల్పించవలసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ఉమాను కాకుండా, శాంతియుతంగా కూర్చుని ఉన్న విష్ణును వాహనం ఎక్కించి తరలించారు. అదే టీడీపీ ఎక్కడైనా సభ పెడితే ఆ సమీపంలోకి అయినా విపక్షాలను రానిస్తారా? ఇప్పుడు చెప్పండి.. క్రిమినల్స్ తయారీ అడ్డాగా టీడీపీ ఉందా? వైఎస్సార్సీపీ ఉందా? ఈ దాడుల ద్వారా డీఎస్సీ అక్రమాల వ్యవహరం మరింతగా ప్రజలలోకి వెళుతుంది. ప్రభుత్వ తీరుపై మరిన్ని అనుమానాలు బలపడతాయి. మరికొన్ని ఉదాహరణలు గమనించండి.ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ స్వయంగా లోకేష్‌కు ఫిర్యాదు చేశారట. అయినా ఆ మంత్రిపై చర్య తీసుకోలేదే? అంటే ఎవరు క్రిమినల్స్ అడ్డాలో ఉన్నట్లు అవుతుంది! ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారే. ఒక టీడీపీ నేత తన భార్య నైటీని తానే చించి ఎమ్మెల్యేపై ఆరోపించిన విషయం వీడియో సహితంగా బయటపడి ఉండకపోతే, ఎమ్మెల్యేపై ఆరోపణలను నమ్మే పరిస్థితి వచ్చేది కదా? ఇలాంటివాటిని చేసేవారిని కదా క్రిమినల్స్ అనాల్సింది. అలాంటివారిని ఎంకరేజ్ చేసే పార్టీని కదా క్రిమినల్స్ తయారు చేసే అడ్డా అనాల్సింది అని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. దానిని కాదనగలరా?ఈ మధ్యనే గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసింది కూడా టీడీపీ నేతే కదా! అంతేకాదు. కొందరు కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది ఫిర్యాదులు వచ్చాయే. ఏకంగా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన ఘట్టం మరిచిపోయారా? ఆ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన యువతిని నడిరోడ్డులో పోలీసు లాఠీతో కొట్టింది జనసేన నేత కదా! ఆ ఎమ్మెల్యేపై కాని, దౌర్జన్యం చేసిన జనసేన నేతపై కాని ఏమైనా చర్య తీసుకున్నారా? పలు చోట్ల బాధితులపైనే కేసులు పెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేష్‌లు ఇలాగే క్రిమినల్స్ అంటూ ఆరోపణలు చేసేవారు. ఎన్నికల సమయానికి వారిలో పలువురిని టీడీపీలో చేర్చుకున్నారు. అంటే టీడీపీ క్రిమినల్స్ అడ్డాగా మారిందని ఒప్పుకుంటున్నటా?కాదా? డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దానికి సమాధానం ఉంటే చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవచ్చు.గతంలో చంద్రబాబు డిమాండ్ చేసిన వెంటనే తన కుమారుడు జగన్‌పై సీబీఐ విచారణకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒప్పుకున్న ఘటనను పలువురు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడిపై డీఎస్సీ ఆరోపణలు వస్తే ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన జరిగిన హత్యలు, హత్యాయత్నం ఘటనలు, టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇవన్ని చూస్తుంటే 1983లో తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీ రామారావు చెప్పిన ఆదర్శాలు ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి?ఒక వైపు క్రిమినల్స్‌ను ప్రోత్సహిస్తూ మరో వైపు వైఎస్సార్సీపీపై అదే విమర్శ చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే అని, నిష్ఫక్షపాతంగా పనిచేయండని పోలీసులకు చెప్పవలసిన సీనియర్ నేత చంద్రబాబు ఈ వయసులో కూడా ఇలాంటి ప్రమాణరహిత రాజకీయాలు చేయడం వల్ల ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెడ్‌బుక్ అరాచకాలకు స్వస్థి పలికి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే నష్టం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్ మాటలే బీఆర్ఎస్కు ఆయుధాలు!
తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పెనుగులాట ఆసక్తికరంగా ఉంది. మూడో పక్షం బీజేపీ అధికార సాధన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకైతే ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు,ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో హైడ్రా ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల అమ్మకం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించినా అందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తుంది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందన్నది చర్చగా ఉంది. ప్రభుత్వంపై కాని, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాని ఆరోపణలు వస్తున్న తీరు రేవంత్ కు చికాకు కలుగుతుండవచ్చు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆధారపడి రాజకీయాలను నడుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జనంలో తిరగకుండా, వెనుక ఉండి పార్టీని నడుపుతున్నారు. ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా కేటీఆర్, హరీష్ రావులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ఆందోళనలకు సన్నద్దమవుతున్నారు. రేవంత్ ప్రసంగాలలో ఏ మాత్రం తప్పులు దొర్లినా వెంటనే అందుకుని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్, హరీష్ రావు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రభుత్వపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్నిసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం ఇంజనీర్లందరిని కించపరచడం కాకపోవచ్చు. ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కోల్పోతోందని చెప్పాలన్నది ఆయన భావన. అందులో కొంత నిజం ఉంది. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల సుమారు 60 కాలేజీలు మూతపడ్డాయట. లెక్చరర్లు మంచి విద్య అందించాలని చెప్పడం తప్పు కాదు. కాని అసలు ఆ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని అనడం విమర్శలకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బందులలో పడుతున్నారు. హైడ్రాను సమర్ధించడానికి హిట్లర్‌తో పోల్చుకోవడం, ఇరాన్ యుద్ద విధ్వంసాన్ని ప్రస్తావించడం వంటివి చేశారు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో అయినా కొన్ని ప్రమాణ లోపాలు ఉండవచ్చు. కాని అంతమాత్రాన దానిని క్రిమినల్ వేస్ట్ అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. అలాగైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా! ఇంజనీరింగ్ విద్యను లక్షలాది మంది చదువుకున్నారు కాబట్టే దేశంలోకాని, ఇతర దేశాలలో కాని మనవాళ్లు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారన్న సంగతిని గ్రహించాలి. రేవంత్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవడానికిబీఆర్ఎస్ నేతలు అన్ని వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణలోని యువతను అవమానించే రీతిలో రేవంత్ మాట్లాడారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్లికేషన్ రాయలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారంటున్న రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్ ను పూర్తి చయగలరా అని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు . ఆ తర్వాత రేవంత్ పై కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు.రేవంత్ ఇంజీనిరింగ్ విద్యను వేస్ట్ అనడాన్ని ఎవరూ సమర్దించరు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ ను అదే మాట అనడం కరెక్టు కాదని చెప్పాలి. తమను వ్యక్తిగతంగా అటాక్ చేస్తే తామూ అదే చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కొంత హద్దులు మీరి ఇరువైపులా విమర్శలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంజీనర్లకు మద్దతు ఇస్తూ రాకెట్ పంపుతున్నవారిని అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జెన్ జి, కాక్రోచ్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నా, తెలంగాణకు వచ్చేసరికి అదికారంలో అదే పార్టీ ఉండడంతోబీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వాడుకుంది. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులతో సంగ్రామ్ పేరుతో ఒక భారీ సభను నిర్వహించారు. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడాన్ని తన నోట్ లో తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జీషీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం యువతను ఆకర్షిస్తే తమకు అధికారం రావడం ఖాయమనిబీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రేవంత్ వ్యాఖ్య వారికి అందివచ్చినట్లయిందనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో రేవంత్ కోర్టు ఆదేశాలను పాటించడానికి ఇష్టపడడం లేదని అర్దం అవుతుంది. రంగనాధ్ ను బదిలీ చేయాలని హైకోర్టు సూచించినా ,అది ప్రభుత్వ విచక్షణాధికారమన్న భావనలో రేవంత్ ఉన్నారనుకోవాలి. అదే టైమ్ లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల అమ్మకం ద్వారా అరవైవేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు దీనిని వాడవచ్చన్నది ప్రభుత్వ వర్గాల భావన. అయితే ఈ భూములను అమ్మడానికి అవకాశం లేదన్నది విపక్షం వాదనగా ఉంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉండడం, ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేకపోవడం, మెట్రో రైలు రుణం వ్యవహారం మొదటికి రావడం ఇలా అనేక సమస్యలు ఉన్న తరుణంలో నిజంగానే ఈ భూములను అమ్మే అవకాశం వస్తే అది ప్రభుత్వానికి జాక్ పాట్ అవుతుంది.కాని మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి.ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను చెల్లించవలసిన సుమారు 400 కోట్లకు పైగా రుణాన్ని తీర్చివేశారట.ఇది ఎలా సాధ్యమైందని,దానిపై విచారణ చేయించగలరా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటింగ్ ఏజెంట్లుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఆయా శాఖలలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఇవన్ని ఒక చక్రబంధం వంటివి. వీటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోవాలని అదికార కాంగ్రెస్ యత్నిస్తుంది. కాని ఆ చక్రబంధంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికిబీఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే తేల్చుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు.. అసహనమా? భయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాలలో ఏమని చెబుతుంటారో కాని, ఎల్లో మీడియాలో మాత్రం వచ్చే కధనాలు చూస్తే మాత్రం ఆయన ఇలా మాట్లాడడమేమిటా అనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా , ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని ఇంతలా కించపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారంటే అది ఆయనలోని భయం తెలియచేస్తుంది తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ యూనిట్ ఇన్జార్జీల శిక్షణ తరగతులలో ఆయన స్పీచ్ ఇచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు కూడా తగులుతాయన్న సంగతి మర్చిపోతున్నట్లుగా ఉంది. జనం ఛీకొట్టినా జగన్ ఇంతే అంటూ చంద్రబాబు మాట్లాడారని ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్రజల మనోభావాలు గొడ్డలి పార్టీకి పట్టవు అని చంద్రబాబు అన్నట్లు మరో ఎల్లో మీడియా రాసింది. రాజకీయాలలో జనం ఛీకొట్టడం ఏమిటి? గెలుపుఓటములు అన్నవి సహజంగానే ఉంటాయి కదా!అంత మాత్రాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను మానివేస్తాయా?ప్రజలలోకి వెళ్లకుండా ఉంటాయా?జగన్ శ్రీకాకుళం టూర్‌పై ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని వస్తుంటే, జగన్ రెండు రోజుల ముందు ఈ టూర్ పెట్టుకోవడమని ఆయన ప్రశ్నించారట. అదేమిటి? ఈ కార్యక్రమానికి, జగన్ యాత్రకు సంబంధం ఏమిటి?అసలు సమస్య జగన్ కు జనం విపరీతంగా రావడం అన్నమాట. తమ సభలకు జనాన్ని బస్ లలో తరలించాల్సి వస్తుంటే జగన్ కు స్వచ్చందంగా ప్రజలు వస్తుండడం ఏమిటని ఆయనకు అనిపించవచ్చు. భోగాపురం సభకు జనాన్ని తీసుకురావడానికి వందల బస్సులు పెట్టడాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. జగన్‌కు జనంలో అంత విలువ,ఆదరణ ఉందేమిటన్నదే ఆయన కంగారుగా ఉంది. అది ఆయన బాధ. జగన్ యాత్రకు జనం రాకపోయి ఉంటే, ఇదే చంద్రబాబు ఏమనేవారు!ప్రజలు ఎవరూపట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించేవారా?కాదా? 2024లో ఎన్నికలలో ఏ కారణంతో అయితేనేమి.. వైఎస్సార్సీపీ ఓడిపోయిన మాట నిజమే కావచ్చు. కాని కూటమి అదికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఎందుకు వ్యతిరేకత తెచ్చుకుంది. ఈ రెండేళ్లకాలంలో జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు పోటెత్తుతున్నారే?దీనిపై ఆలోచించకుండా జగన్ ను తిడితే ఏమి ప్రయోజనం వస్తుంది. చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం ఏదైనా పార్టీ ఓడిపోతే జనంలోకి వెళ్లకూడదా!మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది కదా! అయినా అవకాశం ఉన్నా,లేకపోయినా, కావాలని కల్పించుకుని టూర్లు పెట్టుకుని ఎన్నిచోట్ల చంద్రబాబు అలజడులు సృష్టించారో తెలియదా!ఆయన చేస్తే అది ప్రజాస్వామ్యం.. ఎదుటివారు వెళితే అది ఇంకొకటి అవుతుందా!తెలుగుదేశం పార్టీ1983లో ఆవిర్భావం తర్వాత ఎన్నిసార్లు ఓటమికి గురైందో గుర్తు లేదా! ఉమ్మడి ఏపీలో 1989లో టీడీపీ అదికారం కోల్పోయింది. స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తిలో పరాజయం చెందారు. ఆయన నుంచి పార్టీని గుంజుకున్న తర్వాత 2004లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఓడిపోయిందే!2009లో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మళ్లీ ఎందుకు ఓడిపోయింది? రాష్ట్ర విభజన తర్వాత 2019లో ఓడిపోయింది కనుక చంద్రబాబు ప్రజలలోకి వెళ్లకుండా లేరే! పార్టీ క్యాడర్‌ను ఆయా సందర్భాలలో ఎలా రెచ్చగొట్టారో తెలియదా!మరో మాట చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పులివెందుల నుంచి 1978 నుంచి గెలుస్తూనే వస్తోంది. జగన్ ఒకసారి ఎంపీగా రాజీనామా చేసి తరిగి పోటీచేస్తే 5.45 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి గెలిచినా, 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి కుప్పం ను తన స్థావరంగా మార్చుకున్నారు. ఎందుకు సొంత నియోజకవర్గం వదలిపెట్టారో ఎప్పుడైనా చెప్పారా!అందువల్ల చంద్రబాబు తను చేసే విమర్శలు తనకే తగులుతాయన్న సంగతి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా! ఇక ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు సంచనలంగా ఉన్నాయి. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ఆయన ఎండగట్టారు.బహుశా ఆయనను దృష్టిలో ఉంచుకునేనేమో , పార్టీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టే హీరోలు, లేకుంటే జీరోలే అని హెచ్చరించినట్లు అనిపించింది. పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వరదరాజులరెడ్డి సీనియర్ నేత. ప్రొద్దుటూరు నుంచి పలుమార్లు గెలిచారు. ఆయన పార్టీకి నష్టం చేసేలా మాట్లాడారా? లేక ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తి చూపారా?ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు వెళ్లడంపై కూడా ఆయన అసహనంగా ఉన్నారన్నది తెలిసందే. వారందరి గురించి పరోక్షంగా ఆయన మాట్లాడినట్లు ఉంది. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఆ ఎమ్మెల్యేలు కూడా అంత సీరియస్ గా తీసుకుంటారా?లేదా?అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో వారికి కూడా బాగానే తెలుస్తుంది కదా!నిత్యం వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని సంభోధించి ఆత్మానందం చెందుతున్నారేమో తెలియదు. దానికి ప్రతిగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీని బూడిద పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని అడ్రస్ చేస్తున్నారు జగన్ పైన, వైఎస్సార్సీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు అలవాటుగా మార్చుకు్న్నారు. అయినా జగన్ పర్యటనలకు . జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారంటే తన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అర్ధం చేసుకుంటే మంచిది కదా.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతి కాదు.. 'మావిగన్' వైపే అడుగులా?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓటు వేయక తప్పలేదు. నిజమే!మీరు చదువుతున్నది కరెక్టే!. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. జగన్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారు?. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు(మావిగన్) లను కలిపి రాజధాని కారిడార్‌గా అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించవలసిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మావిగన్ కు ఆమోదం తెలిపేవారు వైఎస్సార్సీపీకి, అమరావతికి అంగీకారం తెలియచేసేవారు కూటమికి ఓటు వేయవచ్చని, ఇది ఎన్నికల అంశంగా తీసుకుంటామని ఆయన సవాల్ చేశారు. జగన్ ఈ ప్రతిపాదన చేసినప్పుడు చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవహేళన చేశారు. మతిస్థిమితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సి వస్తోందని చంద్రబాబు విమర్శించారు. కానీ, ప్రజలు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారన్న సంగతి గ్రహించారేమో తెలియదు కాని, చంద్రబాబు కూడా యూటర్న్ తీసుకుని అమరావతి అంటే 29 గ్రామాలే కాదని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి కూడా కలుపుకుని మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారట. ఆయన చెప్పినవాటిలో ఒక్క మచిలీపట్నం మాత్రం లేదు. బహుశా తర్వాత రోజుల్లో మచిలీపట్నాన్ని కూడా కలపవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.దీనిని బట్టి అర్ధం అయిందేమిటంటే వచ్చే ఎన్నికలలో జరిగే రిఫరెండమ్ వరకు ఆగకుండా చంద్రబాబే స్వయంగా జగన్ చేసిన మావిగన్ ను దాదాపు ఆమోదించినట్లే అవుతుంది. జగన్ ది మతిలేని ప్రతిపాదన అయితే ఇప్పుడు చంద్రబాబే ఎందుకు జై కొడుతున్నారో వివరణ ఇవ్వాలి కదా! ఈ రకంగా జగన్ కు చంద్రబాబే ఓటు వేసినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిస్తున్నాయని చెబుతున్నప్పుడు ఇంకా లక్షన్నర ఎకరాల భూమిని ఎందుకు సమీకరించాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. భూ సేకరణపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ వంటివారు ఆ ప్రాంతాన్ని సందర్శించి బలవంతపు భూ సేకరణ పద్దతి కాదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. అయినా వినే పరిస్థితి లేదు. ప్రభుత్వం రెండో దశ పూలింగ్ అనగానే అమరావతిలో భూముల ధరలు సగానికి సగం పడిపోయాయని, అయినా కొనేవారు రావడం లేదని, అంతా అయోమయంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారు ఈ విషయాలను సోషల్ మీడియాలో కూడా చెబుతున్నారు. విజయవాడ,గుంటూరు ప్రాంత ప్రజలలో వస్తున్న అసంతృప్తిని గమనించి బహుశా తన వైఖరి మార్చుకుని ఉండవచ్చు. ఆయన చెబుతున్నట్లు అధికారులు ఆ ప్రాంతంలో పనులు చేపట్టదలిస్తే అందుకు నిధులు కేటాయించాలి కదా!అవేమీ లేకుండా మీడియాలో ప్రచారానికి మాత్రమే చెబితే ఏమి ఉపయోగం అన్న భావన వ్యక్తం అవుతోంది. గత ఏడాది డిసెంబర్ లో పార్లమెంటులో అమరావతికి చట్టబద్దత తీసుకువచ్చిన సందర్భంలో కూడా అమరావతి అంటే 29 గ్రామాల పరిధినే ఎందుకు పెట్టారు? విజయవాడ, గుంటూరు కూడా ఇందులో ఉంటాయని ఎందుకు ప్రకటించలేదు?కొద్ది రోజుల క్రితం సిఆర్డిఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో 29 గ్రామాలలోనే రాజధాని నిర్మాణం నిమిత్తం భూములు సమీకరించినట్లు తెలిపింది.ప్రస్తుతం ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 50వేల కోట్ల వ్యయం అయ్యే పనులు చేపట్టారు. రోడ్లు నిర్మాణం, తదితర సదుపాయాలు కల్పించడానికి ,భవనాల నిర్మాణానికి వ్యయం చేస్తున్నారు. వీటిలో అత్యధిక భాగం డూప్లికసీ తప్ప మరొకటి కాదనిపిస్తుంది.ఇప్పటికే ఒక అసెంబ్లీ భవనం ఉంది అయినా మరొకటి నిర్మిస్తున్నారు. సచివాలయ భవనాలు ఉన్నాయి. అయినా మళ్లీ కడుతున్నారు. పైగా ఏభై అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారట. ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ఎంత స్పేస్ అవసరం అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ భవనాలు చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఒక భవనంలో హైకోర్టు ఉంది. మళ్లీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.ఇవేకాదు. విజయవాడలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. జాతీయ రహదారిని ఆనుకుని విమానాశ్రయం ఉంది. గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. అయినా ఇవన్ని మళ్లీ కడతారట. అది కూడా అమరావతిలో మారుమూల ప్రాంతాలలో అట. ఇందుకోసం రైతులను పీడించి మరీ భూములు తీసుకోవడానికి యత్నిస్తున్నారు. ఇవికాక రైతుల నుంచి తీసుకునే పొలాలకు బదులు వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అవి ఇప్పటికీ గ్రాఫిక్స్ లోనే ఉన్నాయి. ఈ ప్లాట్ల అభివృద్దికి ఎన్నివేల కోట్లు అవుతాయో తెలియదు. వరద సంగతి సరేసరి. వేల కోట్ల వ్యయం చేసి రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేయవలసి ఉంది. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఐదెకరాల స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఐదారువేల రూపాయల వ్యయం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా 15వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేయడం అందరిని నివ్వెరపరుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా అమరావతి స్వయం సమృద్ది(సెల్ఫ్ ఫైనాన్స్ ) నగరం అని ప్రచారం చేస్తూ వచ్చారు. అమరావతికి ప్రజల సొమ్ము రూపాయి అవసరం లేదని, అమరావతి భూముల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వాదించేవారు. తీరా చూస్తే ఇప్పుడు అప్పులే,అప్పులు. అంతేకాక బడ్జెట్ లో కూడా సుమారు ఆరువేల కోట్లు కేటాయించారు. అంటే ఇదంతా రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినదే. తాజాగా అప్పులు ఇచ్చిన సంస్థలకు రుణ చెల్లింపులకు ప్రభుత్వం 231 కోట్లు విడుదల చేసింది. అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం కాదని, ప్రజలపై భారం వేసే సిటీ అని ఒప్పుకున్నట్లయింది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాత్రం అమరావతి పూర్తి అయితే ఏటా 12వేల కోట్ల ఆదాయం వస్తుందని కొత్త ప్రచారం ఆరంభించారు. అది ఎలా సాధ్యమో తెలియదు. గతంలో అయితే ప్రభుత్వం ఇక్కడ తనకు వచ్చే వాటా భూములను అమ్ముతుందని , తద్వారా నిర్మాణాలు చేస్తుందని అనేవారు.కాని ఆ తర్వాత కాలంలో మాట మార్చి, 33వేల ఎకరాలు చాలదని, మరో ఏభైవేల ఎకరాలు తీసుకుంటామంటూ గాత్రం అందుకున్నారు. అక్కడితో ఆగడం లేదు. ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పూలింగ్ విస్తరించనున్నారు. అంటే ఈ రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో,ఎప్పటి నుంచి ఆదాయం వస్తుందో ఎవరూ చెప్పలేరన్నమాట. మరోవైపు పూలింగ్ కు ఇవ్వని రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారు. పోనీ వారికి మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నారా అంటేఅదేమీ లేదు.ఉండవల్లి ప్రాంతంలో ఎకరా ధర ఎప్పటి నుంచో ఐదు కోట్ల నుంచి పదికోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 73 లక్షలు చొప్పునే లెక్క కడుతోందట. రాష్ట్రం అంతటా భూముల విలువలను ప్రభుత్వం పెంచినా అమరావతి ప్రాంతంలో పెంచకపోవడానికి కారణమిదేనట. వరల్డ్ బ్యాంక్ వంటి వాటికి గజం నలభై ఐదువేల రూపాయల వరకు ఉందని చెబుతున్న ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చేసరికి ధరను తగ్గించి వేసిందని అంటున్నారు. అమరావతిలో అభివృద్ది మాటేమోకాని, ఎల్లో మీడియాలో మాత్రం ఏదేదో జరిగిపోతున్నట్లుగా ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు ఈనాడులో ఈ మధ్య వచ్చిన వార్తలు చూడండి. అమరావతిలో మినీ అమెజాన్ అట. ఐదెకరాలలో అమెజాన్ వచ్చేస్తుందట. అతిశయోక్తులతో స్టోరీ వండి వార్చారు. ఎమ్యూజ్ మెంట్ పార్కు, ఎకో టూరిజం రిసార్ట్, స్నో వరల్డ్, లండన్ ఐ మాదిరి అమరావతి ..ఇలా ఒకటేమిటి? వాటిలో కొన్ని వస్తే రావచ్చు.లేకపోతే లేదు.కాని ఎల్లో మీడియా పత్రికలలో చూస్తే మాత్రం అంతా జరిగిపోయినట్లే ఉంటుంది. ప్రజలను మభ్యపెట్టడంలో ఎల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. అమరావతికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 500 మీటర్ల రింగ్ రోడ్డు వేస్తారట. డల్లాస్ వంటి నగరానికే 250 మీటర్ల రోడ్డు ఉంది.హైదరాబాద్ లో 150 మీటర్లే ఉంది.ఇంకా అభివృద్ది మొదలుకాని అమరావతికి మాత్రం అరకిలోమీటర్ రింగ్ర్ రోడ్డేమిటని అంతా బిత్తరపోతున్నారు.ఇప్పటికే ఉన్న వెస్ట్ బైపాస్ రోడ్డు జగన్ టైమ్ లోనే దాదాపు పూర్తి అయింది.అది చాలదట. చివరిగా ఒక మాట. మావిగన్ అంటూ జగన్ ప్రస్తావించగానే, ఎల్లో మీడియాగా పేరొందిన ఆంద్రజ్యోతి వైసిపి నేతలను అసభ్య పదాలతో దూషిస్తూ ఒక వ్యాఖ్య చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా మావిగన్ లో మూడువంతుల భాగానికి ఓటు వేశారు.అంటే ఎల్లో మీడియా ఇంతకు ముందు తప్పుడు కూతలు కూశానని ఒప్పుకుంటుందా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు, పవన్, లోకేష్.. మరీ ఇంతలా?
ఏమైంది.. అలనాటి తెలుగు ఆత్మగౌరవం.. ఏమైంది.. తెలుగు పౌరుషం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్ లు వీటిని పక్కనబెట్టరా అన్న సందేహం ప్రజలలో ఎందుకు వస్తోంది?ఒకప్పుడు మోడీ దేశానికే పనికిరారని తీవ్రంగా పరుష వ్యాఖ్యలు చేశారే.. పర్వతం ఎవరికి తలవంచదన్నారే.. మేం భయపడతామా అని హూంకరించారే.. మరి ఇప్పుడు ఏమైంది. మరీ ఇంతగా లొంగిపోయినట్లు వీరు మాట్లాడడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎందుకు ఎదుర్కోవలసి వస్తోంది?మోడీ కన్నా తానే సీనియర్ని అని, ఆయనకన్నా టీడీపీ కార్యకర్త కూడా బెటరే అని అప్పట్లో ఘాటుగా మాట్లాడిన చంద్రబాబే ఇప్పుడు మోడీకి తాను జై కొట్టడమే కాకుండా, సభికులతో కూడా జేజేలు కొట్టించడమేమిటి అని అంతా విస్తుపోతున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఇలాంటి సన్నివేశాలు రాష్ట్ర ప్రజలందరికి కనిపించాయి. మోడీని ప్రశంసించడం తప్పుకాదు. కాని మరీ అతిగా భజన చేసిన తీరులో మోడీని ఈ ముగ్గురు నేతలు తమను తాము తగ్గించుకోవడమే కాకుండా తెలుగువారి ప్రతిష్టను కూడా తగ్గించారే అన్నదే చర్చగా ఉంది. దీనికి తోడు మా జీసీఎం జగన్ పై అసత్యాలు యధాప్రకారం వీరు సాగించారు. కొబ్బరికాయ మేమే కొట్టాం, గుమ్మడి కాయ మేమే కొట్టాం అని చంద్రబాబు అంటుంటే..అవును.. అది నిజమే.. మధ్యలో పనులన్నీ జగన్ నేతృత్వంలోనే జరిగాయని వైఎస్సార్సీపీ నేతలు బదులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదలివేస్తే, జగన్ ప్రభుత్వం కదా మొత్తం అనుమతులు తెచ్చి,భూ సేకరణ పూర్తి చేసి, శంకుస్థాపన చేసి దానిని ముందుకు తీసుకువెళ్లింది! ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు నిర్మాణం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జున రావు 2023లో జరిగిన సభలో బహిరంగంగానే చెప్పారు కదా! అందువల్లే ఈ ప్రారంభోత్సవ సభలో జీఎంఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశారా అని మాజీ మంత్రి అమరనాధ్ ప్రశ్నించారు. అది ఉత్తరాంధ్రకు అవమానం కాదా అని అంటున్నారు. జగన్ హయాంలో 80 శాతం నిర్మాణం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు తన ఘనత అని చెప్పుకుంటున్న చంద్రబాబు, కుప్పం లో విమానాశ్రయం కట్టి అంతర్జాతీయ నగరాలకు అనుసంధానం చేస్తానన్నారుగా..అది ఎక్కడదాకా వచ్చిందని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. భోగాపురం ఎయిర్ పోర్టుతోనే ఉత్తరాంధ్ర పరిస్తితి మారిపోతుందని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ప్రస్తుతం నగరంలో ఉన్న ఎయిర్ పోర్టు బదులు కొత్తది నిర్మించారు.అంతవరకు ఓకె. కాని దానితోనే అంతా అయిపోతుందా?ప్రస్తుతం విశాఖ నగరం నుంచి సాగుతున్న విమానయానం ఇకపై భోగాపురం నుంచి జరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే మరికొన్ని విమానాలు రావచ్చు. కాని ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తదితర పెద్ద నగరాలతో పోల్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోవడమే కాదు..రివర్స్ వలసలు జరుగుతాయని చంద్రబాబు వంటి సీనియర్ నేత చెబుతుంటే వినేవారి చెవిలో పూలు పెడుతున్నారన్న భావన కలగదా?అదే నిజమైతే ఆయనే కదా సుదీర్ఘకాలం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నది. మరి ఇంతకాలం వలసలు జరుగుతున్నా ఆయన పట్టించుకోలేకపోయారా అని ఎవరైనా అడిగితే జవాబు దొరకదు.ప్రధాని మోడీని ప్రశంసించడాన్ని ఎవరూ ఆక్షేపించరు.కాని అది మరీ అతిగా ఉందని టీడీపీ మద్దతుదారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు మోడీని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు ఎందుకు ఇంతలా మారిపోయారు?మోడీకంటే తానే సీనియర్ ని అని ఒకప్పుడు చంద్రబాబు ధైర్యంగా చెప్పుకున్నారు.అంతేకాదు..మోడీ పాలన ఘోరంగా సాగుతోందని అంటూ ఏడేళ్ల క్రితం చీల్చి చెండాడినట్లు ప్రసంగాలు చేసేవారు.అప్పుడేమో ఏపీకి ఏమీ చేయడం లేదన్నారు. అసలు దేశానికే నష్టం జరుగుతోంందని ..ఇంకా చాలాచాలా ఆరోపించారు. అదే చంద్రబాబు ప్రస్తుతం మోడీని అధ్బుతం, అమోఘం, అన్న చందంగా స్పీచ్ ఇవ్వడం విన్నవారంతా మరీ అతిగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా మాట్లాడడంలో ఆయన ఆంతర్యం ఏమిటి? గత అనుభవాల రీత్యా తన విధేయతను కనబరుచుకోవడానికి మాట్లాడారా? లేక ఇంకేదైనా ఇబ్బంది ఉందా అన్నది తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి మోడీని ఎవరో దూషించారట. దానికి ఆయన గుండె కదలిపోయిందట.కన్నీళ్లు వచ్చాయట. ఇదంతా సినిమాటిక్ అనిపించడం లేదూ!మోడీపై అంత ప్రేమ ,విశ్వాసం ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఎందుకు మోడీని వదలి కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశారు. మోడీ కన్నా బిఎస్పి అధినేత్రి మాయావతి గొప్పవారన్నట్లుగా వ్యవహరించారే! అవన్ని ఎందుకు చంద్రబాబు అప్పట్లో మోడీని అనరాని మాటలు అంటున్నప్పుడు ఒక్కసారైనా అది తప్పు అని చెప్పలేదే!కొందరు మరో సంగతిని ప్రస్తావిస్తున్నారు. తన తల్లిని దూషించారు అంటూ ఎవరిపై పవన్ ఆరోపించారో, క్షమించబోనని హెచ్చరించారో, వారితోనే చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే ..మోడీకి మద్దతు ఇవ్వవచ్చు.కాని కన్నీళ్లు పెట్టుకున్నానంతగా చెబితే వినే జనానికి ఎబ్బెట్టు అనిపించింది. ఇక లోకేష్ ఒక వ్యాఖ్య చేశారు. గుజరాత్ లో బిజెపినే గత పాతికేళ్లుగా అధికారంలో ఉంది కనుక అభివృద్ది జరుగుతోందట. అందువల్ల ఏపీలో కూడా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అంటున్నారు.ఇదే సూత్రం ఏ పార్టీకైనా వర్తిస్తుంది కదా!గత టరమ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ మళ్లీ అదికారంలోకి వచ్చి ఉంటే జగన్ ప్రారంభించిన ఓడరేవుల నిర్మాణం పూర్తి అయ్యేది కదా! పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలోనే ఉండేవి కదా!పరిశ్రమల పేరుతో రూపాయికే ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు ,తమ అనుంగులకు టీడీపీ పెద్దలు ఇచ్చే పరిస్థితి ఉండేదికాదు కదా!అన్నిటికి మించి రెడ్ బుక్ పేరుతో అరాచాకాలకు అవకాశం ఉండేది కాదు కదా! మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు జరిగేవి కాదు కదా!మహిళను వివస్త్రను చేసిన ఘటనకు అవకాశం ఉండేది కాదు కదా!ఇలా అనుకోవచ్చు కదా అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇది ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు గుజరాత్ కు అన్నీ తీసుకువెళతారా అని ప్రశ్నించారు .ఆంధ్ర అభివృద్ది చెందుంటే మోడీ అసూయ పడుతున్నారని ధ్వజమెత్తేవారు. ఇప్పుడేమో మోడీనే ఏపీకి అంతా చేస్తున్నారని అంటున్నారు.దేనిని నమ్మాలి. ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. ఈ నేపధ్యంలోనే సిబిఐ మాజీ డైరెక్టర్ ఎమ్. నాగేశ్వరరావు ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని మోడీని పొగుడుతున్నారని,ఈ రకంగా పతనం మంచిది కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దిగజార్చుతారా అని కామెంట్ చేశారు.సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూటిగానే చంద్రబాబు ప్రభృతులు మోడీని పొగిడిన తీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు ఉందని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు మంచిదే.ఎయిర్ బస్సు బాగానే ఉంటుంది.కాని ఎర్రబస్సు ఎక్కేవారు కూడా ఎయిర్ బస్ ఎక్కేలా చేయగలిగితే అభివృద్ది అవుతుంది తప్ప,కేవలం బడాబాబుల కోసమే ఎయిర్ పోర్టు కాకూడదన్నది నిష్టుర సత్యం. -
ఉత్తరాంధ్రలో జగన్ వెంటే జనం.. కూటమిలో కలవరం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అశేష జనం తరలివచ్చి ఆయనకు స్వాగతం చెబుతున్న తీరు సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం వద్ద అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లారు. ఈ టూర్‌ను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఉత్తరాంధ్రలో ప్రజల అభిమానం చూరగొనడం ఒక ఎత్తు అయితే, అప్పలరాజు కుటుంబాన్ని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ వివరించిన వైనం మరో ఎత్తుగా ఉంది. విశాఖ వరకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గాన వాహనంలో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలలో ,రోడ్డు పక్కన జనం తండోపతండాలుగా గుమికూడడం, ఆయనతో కరచాలనం చేయాలని తహతహడలాడడం, పోలీసులు అడ్డుకుంటున్నా,పొలాలనుంచి వాగులు,వంకలు దాటుకుంటూ జగన్ కలుసుకోవడం గమనించిన వారెవరికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయిందంటే నమ్మబుద్ది కాదు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల గోల్ మాల్ తతంగం ఏదో జరిగి ఉండాలని చాలామంది విశ్వసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనానికి మేలు చేయకపోతే, ఈ స్థాయిలో వివిధ వర్గాలవారు ముఖ్యంగా,పేద,మద్య తరగతి ప్రజలు తరలిరారు. అంతేకాక కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలను అరకొరగా మాత్రమే అమలు చేసి, అనేక హామీలను ఎగవేసిన వైనం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా క్షీణించడం, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తుండడం వంటివి బాగా ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే జగన్ కోసం జనం అంత పెద్ద ఎత్తున వచ్చారనుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టు మొదలు ఆయా చోట్ల ఆయనను నిలిపి తమ సమస్యలను విన్నవించారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయన వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ధాంక్యూ జగన్ సర్ అంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు.భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జగన్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల దివ్యాంగులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ టూర్లో జనం లేకుండా చేయాలని పోలీసులు విశ్వయత్నం చేయకపోలేదు.అనేక చోట్ల రోడ్లపైకి రానివ్వకుండా, ఆయనను కలుసుకునే అవకాశం ఇవ్వకుండా తాడుతో వెనక్కి నెట్టేయడం వంటివి చేశారు. అయినా అభిమానులు వాటన్నిటిని తోసుకుంటూ జగన్ వెంట పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలలో కలిగిన విరక్తికి ఇది దర్పణం పడుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.జనం ఒత్తిడితో నిర్ణీత టైమ్ కన్నా జగన్ ఆలస్యంగా జైలు వద్దకు చేరుకోవడంతో అప్పలరాజును కలుసుకోలేకపోయారు. కాని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ ధైర్యం చెప్పి వచ్చారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.మరో కోణం చూస్తే అప్పలరాజు మాజీ మంత్రి. ఆయన మత్సకార వర్గానికి చెందినవారు. ఆయా అంశాలపై చక్కని క్లారిటీతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఎవరైతే సమర్దంగా వైఎస్సార్సీపీ పక్షాన పనిచేస్తుంటారో వారి గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా రకరకాల కుట్రలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వైఎస్సార్సీపీ మద్దతుదారులను జైళ్లలోకి పంపిస్తున్నారు.అయినా వారు వెనక్కి తగ్గకపోవడం కూటమి ప్రభుత్వానికి ఆందోళనగా మారింది. అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ నడుపుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దాని కారణంగా గొర్రెల కాపరి ఒకరు మరణించారు. అది దురదృష్టకర ఘటన. ఇంతవరకు కేసు పెట్టడాన్ని జగన్ తప్పుపట్టలేదు. కాని ఆ ఆరవ్ పై హత్యకేసు బనాయించడంపై జగన్ బాధపడ్డారు. ఆయన కొద్ది రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు కూడా తప్పుపట్టారు.ఇక అప్పలరాజుపై సాక్ష్యాలు తారుమారు యత్నం చేశారంటూ కేసు పెట్టి జైలులో నిర్భంధించారు. ఆరవ్ కు బెయిల్ వచ్చింది కాని, అప్పలరాజు ఇంకా జైలులోనే ఉన్నారు.ఈ సందర్భంగా బాదిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను కూడా జగన్ వివరించారు.ఈ కేసును కుల వివాదంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనకు ప్రతిబింబమని ఆయన మండిపడ్డారు. మరణించిన వ్యక్తి యాదవ వర్గానికి చెందినవారు కనుక, మంత్రి పార్ధసారధిని పలాస పంపించిన వైనాన్ని, ఆ సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీలు చేయించడాన్ని జగన్ ఆక్షేపించారు.పోనీ యాదవుల పట్ల ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా అంటే ప్రకాశం జిల్లాలో ఒక ఘటనలో ఫిర్యాదు చేసిన యాదవులపైనే కూటమి ప్రభుత్వం ఎదురు కేసు పెట్టిన వైనాన్ని ఉదహరించారు.అంతేకాక విశాఖలో వైఎస్సార్సీపీ యాదవ మహిళకు మేయర్ పదవి ఇస్తే ,ఆమెను పదవినుంచి దించేశారని జగన్ విమర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనలన్నిటిలోను ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా?అని జగన్ వేసినప్రశ్న సమంజసంగానే ఉంది. చాలా కేసులు అసలు పోలీస్ స్టేషన్ వరకు రావు. కొన్ని కేసులలో అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారెవరైనా ఇలాంటి ప్రమాద ఘటనలలో ఉన్నా,వారిపై కేసులే పెట్టరు.అందుకు కొన్ని ఉదాహరణలను కూడా జగన్ పేర్కొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉండగానే ప్రమాదం జరిగిందని, అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు నడుతుండగా యాక్సిడెంట్ అయిందని, ఆ ఘటనలలో ఎవరిపైన కేసులు పెట్టారని జగన్ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం అమలు చేయడం అంటే విషపు విత్తనాలు నాటడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు జరిగినా, వాటిలో టీడీపీవారు నిందితులుగా ఉంటే తూతూ మంత్రంగా కేసులు పెట్టడం చేస్తున్నారు.లేదా అసలు కేసులే పెట్టడం లేదు. జనసేనకు చెందినవారు పోలీస్ స్టేషన్ లపై వరసగా నాలుగురోజుల పాటు దాడులు చేసినా కేసులు లేకపోవడాన్ని ప్రజలంతా గమనించారు. అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చిత్రమేమిటంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా కేసులలో నిందితులను పరామర్శించడానికి వెళ్లారు.ఆయనే కాదు.ఇతర టీడీపీ నేతలు కూడా అలా చేసిన ఉదాహరణలు ఉన్నాయి.అదేమీ తప్పుకాదు.కాని వైఎస్సార్‌సీపీవారు చేస్తే మాత్రం టీడీపీ విమర్శలు చేస్తుంటుంది. ఇక తనపై ఉన్న కేసుల్లో సాక్ష్యులను మేనేజ్ చేసి వారితోనే కేసులను ఉపసంహరించేలా చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఆయా కేసులను చంద్రబాబు ఎత్తివేయించుకుంటున్న తీరును వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే,దానికి రాజకీయ రంగు పులిమి స్వయంగా చంద్రబాబే వెళ్లి ఆ హతుడి పాడె మోశారు.పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఆ సందర్భంలో పోలీస్ వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. రాళ్లదాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ కేసు నిందితులను చంద్రబాబు పరామర్శించారా? లేదా? అవన్ని ఎందుకు చంద్రబాబుపైనే రెండు హత్యాయత్నం కేసులు నమోదు అయి ఉన్నాయే!అవి కాకుండా మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంతసేపు ఎదుటివారిపై ఆరోపణలు చేసి చంద్రబాబు వాటి గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో గౌరు వెంకటరెడ్డి అనే నేత కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయనకు ఒక కేసులో శిక్షపడి జైలులో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శకు వెళితే, అప్పుడు కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.ఆ తర్వాత కాలంలో గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులను టీడీపీలో చేర్చుకుని చరితకు టీడీపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అలా ఉటుంది ఆయన రాజకీయం. చంద్రబాబు ఏమి చేసినా రైటు, ప్రత్యర్ధులు ఏమి చేసినా తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదంతా ఏమిటంటే మీడియా మేనేజ్ మెంట్ తనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్నదే ఆయన నమ్మకం కాబట్టి అనుకోవాలి. సమయం అయిపోయిందని జైలులో ఉన్న అప్పలరాజును కలుసుకునే అవకాశం అధికారులు జగన్‌కు ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళితే, ప్రభుత్వం కొంత బ్రాడ్ మైండ్‌తో అప్పలరాజుతో ములాఖత్‌కు అవకాశం ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం నుంచి అలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సంతాప సభలకూ రాజకీయ రంగు.. చంద్రబాబు వైఖరిపై ప్రశ్నలు!
రాష్ట్ర రాజకీయాలలోనే కాదు.. దేశ రాజకీయాలలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్‌గా ఉన్నారు. ఆ విషయం ఆయన కూడా పలుమార్లు చెప్పుకుంటారు. ఆ సీనియారిటీని ఆయన సమాజ హితవు కోసం, వివిధ వర్గాల ఐక్యత కోసం ఉపయోగించాలని ఎవరైనా కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఈ వయసులో కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, కాపు వర్గ నేత బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాని, వైఎస్సార్సీపీని పదేపదే అనుచిత భాషతో ప్రస్తావించడం కాని, సామాజిక కార్యక్రమాలలో సైతం ఆయా పార్టీలవారు శత్రువుల మాదిరిగా చూసుకోవాలన్నట్లుగా చేస్తున్న సూచనలు కాని ఏ మాత్రం సమంజసమైనవని అనిపించవు. బోండా ఉమా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తుంటే పిలిచి మాట్లాడవచ్చు. అలాకాకుండా పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సంకేతం వెళ్లేలా చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ టీడీపీలోనే చర్చనీయాంశం అయింది.మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత వివిధ పార్టీలకు చెందినవారు ఆయన స్వస్థలం కిర్లంపూడి వెళ్లి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడకు కాపు సామాజికవర్గంలో ఉన్న గుర్తింపు రీత్యా వివిధ ప్రాంతాలలో సంతాప సభలు జరిగాయి. ఇవి పార్టీలకు అతీతంగా జరగడం గమనించదగ్గ అంశం. ఆ సభలు పెద్దగా రాజకీయ ప్రస్తావన లేకుండానే సాగాయి. ఒక సంతాప సభలో బోండా ఉమా, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఘట్టాన్ని వైఎస్సార్సీపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకోలేదు. అంబటిని కాని మరెవ్వరిని కాని తప్పు పట్టలేదు. కాని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమాపై సీరియస్ అయినట్లు తెలుగుదేశం పత్రికలలో ప్రముఖంగా వార్తా కథనాలు వచ్చాయి.ఈ సందర్భంగా గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు చెప్పారని ఎల్లో మీడియాలో ఒకటైన ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించింది. చంద్రబాబు ఎప్పుడైనా విమర్శల కోసం ఒకసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే అదో తరహా. కాని నిత్యం గొడ్డలి అని అభ్యంతరకర పదం వాడుతున్నారంటే ఏమని అనుకోవాలి? గొడ్డలితో హత్య చేసింది ఎవరు? అతను ఎల్లో మీడియాలో కూర్చుని డిబేట్లలో ఎలా పాల్గొన్నారు. ఆయనకు లాయర్‌ను పెట్టిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, చంద్రబాబు మాత్రం గొడ్డలి పదాన్ని వాడడం మానడం లేదు. ఆ కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ చెప్పినా అదే దుష్ప్రచారం చేయడం కూడా సీనియర్ రాజకీయ నేతకు తగిన విషయమేనా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చెప్పడం అంటే మరీ అతిగా లేదా?పెళ్ళిళ్లు, పబ్బాలు, చావులు, సంతాప సభలలో వివిధ రాజకీయ పక్షాలవారు కలవకుండా ఉంటారా? వారు మాట్లాడుకోకుండా ఉంటారా? అది కూడా తప్పే అవుతుందా? ముద్రగడ చనిపోయే సమయానికి వైఎస్సార్సీపీలో ఉన్నా, ఆయన కాపు ఉద్యమ నేతగానే జనంలో నిలిచారు. ఆయన ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దని అంతిమ లేఖలో చెప్పి ఉండవచ్చు. అందువల్లే ఆయన సంతాప సభలలో పాల్గొన్న టీడీపీ నేతలను తప్పుపట్టవచ్చా? కాపులంతా ఒక చోట సమావేశం అవుతుంటే, అలాంటి వేదికలను ఆ వర్గానికి చెందిన ఆయా పార్టీ నేతలు ఎలా పంచుకోకుండా ఉంటారు. అలా చేస్తే కులానికి దూరం అవుతామోమో అన్న భయం వారిలో ఉండవచ్చు.ఇంకో విషయం చెపాలి. ఈ మధ్య ఒక సదస్సులో అంబటి రాంబాబు, టీడీపీకి గతంలో పెద్ద మద్దతుదారు అన్న పేరున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అంత మాత్రాన వారిద్దరూ ఒకటైపోయినట్లవుతుందా? కొద్ది సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అప్పటి వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నారే! ఒకప్పుడు చంద్రబాబు ఏమని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగిలిన సమయం అంతా అభివృద్ది, పాలనపైనే దృష్టి పెట్టాలని అనేవారు. అలా చేసినా, చేయకపోయినా కనీసం మాటవరసకైనా ప్రసంగించేవారు. కాని ఇప్పుడేమో వైఎస్సార్సీపీవారికి ఏమి చేయవద్దు.. వైఎస్సార్‌సీపీవారితో కలవవద్దు, వేదికలు పంచుకోవద్దని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సీనియారిటీకే అప్రతిష్ట అవుతుంది తప్ప మరొకటి కాదు.రాజకీయాల కోసం బంధుత్వాలు, స్పేహాలు కూడా వదలుకోవాలా! అన్నప్రశ్న రాదా? సంతాప సభలో ఉమా ప్రసంగిస్తూ కాపులలో అలజడి ఆరంభమైందని వ్యాఖ్యానించారు. కాపులను పట్టించుకోవాలని, వారి డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని ఆయన పేర్కొన్నారు. కాపు ఉద్యమం చేస్తున్న తరుణంలో ముద్రగడను నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న సందేహం చంద్రబాబుకు కలిగి ఉండవచ్చు. అయినా ఇంత ఓపెన్‌గా టెలికాన్ఫరెన్స్‌లో వైఎస్సార్సీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని అనడం ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వానికే నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఏర్పడింది. దీనికి ప్రతిగా బోండా ఉమా మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన సంతాప సభకు టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వంటివారు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం తను వెళితేనే వచ్చిందా అన్నది ఆయన ప్రశ్నగా ఉంది. బొత్స, తోట త్రిమూర్తులు వంటి వైఎస్సార్సీపీ నేతలతో కూడా టీడీపీ నేతలు ఆ కార్యక్రమాలలో సన్నిహితంగా మెలిగారు కదా అని ఉమా ఎత్తిచూపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, బీజేపీ నేత సోము వీర్రాజు వంటివారు కూడా ఆ సభలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారట. తాను వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లలేదని, కాపు నేత దాసరి రాము నిర్వహించిన సభకు వెళ్లానని, అక్కడ అంబటి రాంబాబు కలిసి పలకరిస్తే, సంస్కారంగా తాను కూడా మాట్లాడానని, తానేమీ పార్టీని ఇబ్బంది పెట్టలేదన్నది ఆయన అభిప్రాయంగా ఉంది.ఈ నేపథ్యంలో బోండా ఉమాను పిలవడానికి ఒక కమిటీనే చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వద్దకు వెళ్లిన బోండా ఆ తర్వాత కాస్త తగ్గి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇకపై వైఎస్సార్‌సీపీవారితో వేదిక పంచుకోనని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. అంటే ఇది ఉమా తన వ్యక్తిత్వాన్ని తానే కించపరచుకోవడమే అవ్వదా! మొత్తం మీద ఏదో రకంగా ఉమాను భయపెట్టి ఉండాలి. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాల జోలికి పార్టీ అధిష్టానం ఎందుకు వెళ్లలేదో తెలియదు.ఈ మధ్యకాలంలో కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విశ్వాసం సడలుతోంది. ఆ వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడుతోందన్న ప్రచారం జరుగుతుండడానికి తోడు ఇలాంటి వివాదాల వల్ల తెలుగుదేశం పార్టీ మరింత ఇరుకున పడే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉన్నా సామాజిక కార్యక్రమాలలో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కలిసినంతమాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడి వాటిపై ఆంక్షలు పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరీ సంకుచిత స్థాయికి చంద్రబాబు తీసుకువెళ్లినట్లు అవుతుందని చెప్పాలి. గతంలో ఇలాంటి వాతావరణం ఎన్నడూ లేదు. ఇది అత్యంత దురదృష్టకరం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇదేం విచిత్రమో.. ఆ లాజిక్కు మిస్సయ్యిందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోర్టులో ఇకనైనా వేగంగా సాగుతుందా? ఈ కేసు ఈ ఏడేళ్లలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులుగా ఉన్న వివేకా రక్త సంబంధికులు ఈ కేసు సత్వరమే విచారణకు రావాలని కోరుతుంటే, స్వయంగా వివేకా కుమార్తె సునీత ఈ విచారణ జాప్యం అవడానికి కారణం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సీబీఐ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆమె తరచు వేస్తున్న పిటిషన్లు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆమె ఏకంగా కొత్తగా ప్రైవేట్ కేసును సీబీఐ కోర్ట్‌లో వేసి మళ్లీ మొదటినుండి సీబీఐ విచారణ కోరడం చూసి కోర్ట్ వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ చట్టపరంగా మెయిన్టెయినబుల్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె లేవనెత్తిన అంశాలకు కోర్టువారు 70 పేజీలలో ఉత్తర్వులు ఇచ్చారు.. ఆమెకు ఎవరిమీద కోపం ఉంటే వారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న విమర్శ వచ్చింది.సీబీఐ తమను అక్రమంగా కేసులో చేర్చిందని కొంతమంది నిందితులు వాపోతుంటే, తానే వివేకాను చంపాను అన్న నిందితుడు ఆప్రోవర్గా మారడం విశేషంగా కనిపిస్తుంది. సునీత ఏ లాయర్నైతే నియమించుకున్నారో, ఆయనే ఇతనికి లాయర్‌గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వివేకా హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఆమె చేసిన ఆరోపణలకు, ఆ తర్వాత కాలంలో చేసిన అభియోగాలకు ఎందుకు తేడా వస్తోందంటే ఏమి చెబుదాం. వర్తమాన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇందులో బంధాలు, అనుబందాల కన్నా, ఇతరత్రా లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. తన తండ్రిని హత్య చేశానని బహిరంగంగా ప్రకటించిన దస్తగిరి అనే నిందితుడికి బెయిల్ రావడానికి సునీత సహకరించారన్న ప్రచారం ఆమె ప్రతిష్ట మసకబారేలా చేసిందనిపిస్తుంది. అలాగే అన్నిటిని మించి వరుసకు తన సోదరుడయ్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తగాదాపడి, తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న చదరంగంలో ఆమె ఒక పావుగా మారిందన్న ఆరోపణను వైఎస్సార్సీపీ నేతలు చేస్తుంటారు.ఈ కేసులో టీడీపీ చేసే విమర్శలు, ఈమె చేసే ఆరోపణలు గమనిస్తే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్‌ను, ఆయన సతీమణిని ఎలాగైనా ఈ కేసులోకి తీసుకురావాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా కోర్టు సూచన మేరకు సీబీఐ మళ్లీ, మళ్లీ విచారణ చేసినా, ఎక్కడా ఎలాంటి కొత్త ఆధారాలు కనిపించలేదు. దాంతో ఎవరెవరిమీదో తోచిన ఆరోపణల్లా చేయడం, ఆ కోణంలో సీబీఐ విచారణ జరపడం నిత్యకృత్యంగా మారింది.ఈ కేసులో సీబీఐ కూడా ఒక కీలకమైన కోణాన్ని వదలిపెట్టిందన్నది నిందితుల తరపు న్యాయవాదుల వాదన. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారా? లేదా? ఆమెకు ఈయన ద్వారా సంతానం కలిగిందా? లేదా? ఆమె వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారా?లేదా? దస్తగిరి తరపున వాదించిన లాయర్ కాని, సునీత పక్షాన వాదన చేసిన లాయర్ కాని టీడీపీ తరపున పనిచేసేవారే కావడంలోని ఆంతర్యం ఏమిటి? వారికి ఢిల్లీలో లక్షల రూపాయల చొప్పున ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. అవన్ని ఎవరు సమకూర్చారు?వివేకా హత్య కేసులో ఆయన సమీప బంధువుల ప్రమేయం ఉందా? లేక వ్యక్తిగత స్నేహితుల హస్తం ఉందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు, సంబంధిత డబ్బు కారణంగా ఈ హత్య జరిగిందా? లేక ఎంపీ సీటుకు పోటీ వస్తాడన్న కారణంగా హత్య జరిగిందా?ఇక్కడ ఒక లాజిక్ సీబీఐ కూడా మిస్ అవుతోందన్న అభిప్రాయం ఉంది. అవినాశ్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో 2019 ఎన్నికలలో కూడా ఆయనే అభ్యర్ధి అని అందరికి తెలుసు. నిజంగా వివేకా ఎంపీ సీటు ఆశించి ఉంటే, అవినాశ్ తరపున ప్రచారానికి ఎందుకు వెళతారు? ఇలాంటి మిస్సింగ్ లింకులన్నీ విచారణ సందర్భంగా ఒక కొలిక్కి వస్తాయోమో తెలియదు. హత్య జరిగిన రోజు వివేకా రాసిన లేఖ, ఆయన పీఏ. కృష్ణారెడ్డి వాదన, సీబీఐ అధికారులను మార్చిన వైనం మొదలైనవి ఎన్నో శేషప్రశ్నలుగా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుతెన్నులపై పరిశోధన జరిగితే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయేమో చెప్పలేం.అంతేకాదు... వివేకా హత్య కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు స్పష్టమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు పదేపదే ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పటికీ ఎందుకు చేస్తూనే ఉన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీగా ముద్రవేసి లబ్ది పొందాలని ఎందుకు యత్నిస్తున్నారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద కూడా మాయం చేసిన నేపథ్యంలో టీడీపీకి బూడిద పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టి కౌంటర్ ఇచ్చి ఉండవచ్చు. అది వేరే విషయం.ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు సునీతకు, బహుశా టీడీపీకి, ఎల్లో మీడియాకు ఆశాభంగం కలిగించి ఉండాలి. మరోసారి విచారణ చేయండని సీబీఐ కోర్టు ఆదేశించి ఉంటే ఆ పేరుతో మరికొంతకాలం గడిచేదేమో! కాని చట్టం ప్రకారం అది కరెక్టు కాదని గౌరవ న్యాయస్థానం అభిప్రాయపడి సునీత పిటిషన్‌ను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ సరిపోలేదని సునీత అంటున్నా, కొత్త ఆధారాలు ఏమీ వెలుగులోకి రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎలా చేయాలో తాము నిర్దేశించజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది.రోజువారీ విచారణ జరగాలని ఒకవైపు కోర్టును కోరుతూ, సీబీఐ దర్యాప్తు మరింత లోతుగా జరపాలని మరో వైపు కోర్టులలో ఆమె పిటిషన్లు వేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు పేర్కొంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిరంతర దర్యాప్తు జరగదని, సుప్రీంకోర్టు కూడా వేగవంతంగా ఈ కేసును విచారించాలని ఆదేశించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కుమార్తె అన్న సానుభూతి పొందడానికి ఆమె ప్రయత్నిస్తున్నారా? లేక చిత్తశుద్దితో తన తండ్రి హత్య కేసు విచారణ సత్వరమే జరగాలని కోరుకుటున్నారా? అన్న ప్రశ్నలను ప్రతివాదులు వేస్తున్నారు.విశేషం ఏమిటంటే ఏ కేసులో అయినా నిందితులు విచారణ జాప్యం కావాలని ప్రయత్నిస్తుంటారు. కాని ఈ కేసులో మాత్రం స్వయంగా వివేకా కుమార్తె పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణం అవుతున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఆ విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా దురుద్దేశాలతోనో, కక్ష కట్టి ఎవరిపైనో కేసును బనాయించాలని ప్రయత్నించడం సమంజసం కాదని పలువురి వ్యాఖ్యగా ఉంది. పైగా ఇందులో రాజకీయంగా తన తండ్రి ప్రత్యర్థుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారన్న విమర్శలు రావడం కూడా ఆమెకు మంచిది కాదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్.. రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పరిధి వారికి ఉంటుంది. సర్వాధికారాలు ఒకే వ్యవస్థకు ఉండవు. చెక్స్ అండ్ బేలెన్సెస్తో నడిచేదే ప్రజాస్వామ్యం. కాని దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంటారు. కార్యనిర్వహణాధికారిగా ఉండవలసిన అధికారిక వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి, హైదరాబాద్ లోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తాయి. రంగనాథ్‌కు సమర్దుడైన అధికారిగా పేరు ఉండవచ్చు. కాని తనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారన్న విమర్శ కొంతకాలంగా వినిపిస్తున్నదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధ, బాంధవ్యం ఉండడం కావచ్చు.. లేదా తన సహజ ప్రవృత్తి కావచ్చు.. ఏదైనా కానీ.. న్యాయ వ్యవస్థను సైతం పదే,పదే దిక్కరిస్తున్నారన్న అభిప్రాయం వల్ల ఆయనకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించడం తీవ్ర సంచలనం అయింది. రేవంత్ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బే అన్నది అందరి అభిప్రాయం. రంగనాథ్‌ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి,తన పరువు కాపాడుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందన్నది ఆసక్తికర అంశంగా ఉంది. రంగనాథ్‌ను బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశం, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదే,పదే కోర్టుధిక్కరణ కు పాల్పడుతున్నందున, ఇలాంటి అరుదైన ఆదేశం ఇవ్వవలసి వచ్చిందని కోర్టు తీర్పును సమర్ధించేవారు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఇది ఘర్షణకు దారి తీస్తుందా?లేక మద్యే మార్గంగా రాజీ కుదురుతుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లినప్పుడు ఎలాంటి వాదన చేస్తుందన్నదానిపై ఈ వ్యవహారం ఆధారపడి ఉండవచ్చు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిని ,ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్దరించడానికి ఈ హైడ్రా ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో కమిషనర్ గా నియమితులైన రంగనాథ్ కొన్ని చెరువులను పరిరక్షించారన్న పేరు తెచ్చుకున్నారు. అంతవరకు మంచిదే. కాని ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తుల, నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన తీరు వివాదాస్పదం అయింది. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఇంటిని కూల్చిన సన్నివేశంలో ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా అధికారులు తీసుకోనివ్వలేదని మీడియా ముందు చెప్పిన వీడియో వైరల్ అయింది. అది రేవంత్ సర్కార్ కు తీరని చేటు చేసింది. అలాగే కొన్నిచోట్ల అపార్టుమెంట్లు, విల్లాలను తొలగించిన వైనం మధ్య తరగతి వారిలో తీరని ఆక్రోశం మిగిల్చింది.రూపాయి,రూపాయి కూడగట్టుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని తాము ఇంటిని కొనుగోలు చేస్తే, సడన్ గా హైడ్రా వచ్చి వాటిని కూల్చితే తమ పరిస్థితి ఏమిటని అనేక మంది వాపోయారు.లే అవుట్ లకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ,విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నివారించలేదన్న ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వమే ఒకవైపు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తుంటుంది.మరో వైపు అక్రమ నిర్మాణాలు అంటూ అదే ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతుంది. చెరువుల గర్భంలో ఆక్రమణలకు పాల్పడి ,అనధికారికంగా నిర్మాణాలు చేస్తే చర్య తీసుకోవడం తప్పుకాదు.కొన్ని చోట్ల ఆయా కాలనీలవారు స్వయంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో కూడా చర్యలు చేపట్టారు. పార్కులను పరిరక్షించారు. మొత్తం మీద లక్షన్నర కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. అది నిజమే కావచ్చు. అయినా ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ లో పడ్డారు?కొన్ని ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించి చర్య తీసుకున్నారన్నది ఆరోపణ. ఆ సంస్థలు ,వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రక్షణ పొందినా,వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ వ్యవహరించారన్నది విమర్శ. లోతుకుంట భూ వివాదం కూడా అలాంటిదే. 65 కోర్టు ధిక్కరణ పిటిషన్ లు ఆయనపై పడ్డాయంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పిటిషన్ లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహించింది. ఏకంగా హైడ్రాను గ్రీకు పురాణాలలోని పలు తలల రాక్షసుడిగా అభివర్ణించింది.కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేస్తూ తాము సంయమనం పాటిస్తున్నామని, రంగనాధ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే అని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో రంగనాధ్ క్షమాపణ కోరిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. తాను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదని,పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, కోర్టు మరోలా అనుకుంటే క్షమించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో నిజాయితీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత రంగనాద్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. నిజానికి ఒక అదికారిగా అంత సీరియస్ గా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!భూకబ్జాదారులు ,లాండ్ మాఫియా వ్యక్తులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇది ఒకరకంగా కోర్టులతో మళ్లీ తగాదా పడినట్లే అవుతుందేమో తెలియదు. రాజకీయ వ్యవస్థలోని వారు ,రేవంత్ ప్రభుత్వంలోని బాధ్యులు ఆయన తరపున మాట్లాడి ఉంటే సమంజసంగా ఉండేదేమో!ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ముందుకు వచ్చినట్లు కనిపించదు. అదేదో రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉన్నారేమో అనిపిస్తుంది.ఊహించినట్లే రేవంత్ సమర్ధించుకోవల్సి వచ్చింది. భూకబ్జాదారులే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆయన అన్నారు.అంతేకాక గతంలో బిఆర్ఎస్ హయాంలో సి.ఎస్.గా పనిచేసిన సోమేష్ కుమార్ పై400 కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. హైడ్రా ను కొనసాగించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రంగనాద్ బదిలీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.కోర్టు తీర్పు ప్రతి చూశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంటే అప్పీల్ కు వెళ్లడానికే రంగం సిద్దం అవుతున్నదని అనుకోవచ్చు.న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందన్నది ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తుంది. అధికారి బదిలీ అన్నది ప్రభుత్వ అభీష్టం మేరకు జరుగుతుందన్నది ఆయన చెప్పకనే చెప్పారు.ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అప్పుడే చెప్పలేం. లోతుకుంటలోని 10వేల కోట్ల రూపాయల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాద్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను న్యాయవ్యవస్థకు మరింత గట్టిగా వివరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఆక్రమణలలో ఉన్నవాటిని కూల్చడంలో హైడ్రా వివక్ష చూపుతోందన్న విమర్శ కూడా వచ్చింది. ఉదాహరణకు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ లో ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి,వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకు ఎందుకు ఆగారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమీప బంధువుల ఇళ్లు ఇందులో ఉండడమే కారణమని వారు ఆరోపిస్తుంటారు. దీనిపై హైడ్రా లేదా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు కనిపించదు.రంగనాధ్ వ్యవహార శైలి చూస్తే తానేదో సర్వస్వతంత్రుడన్నట్లుగా అనిపిస్తుంటుందన్నది ఒక ఆరోపణ.ఆయన చిత్తశుద్దిని ఆక్షేపించడం లేదు కానీ.. దూకుడుగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. కాగా రేవంత్ ఒక సందర్భంలో తాను హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తానని, ఇరాన్ యుద్దంతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం వివాదాస్పదం అయింది. హైదరాబాద్ లో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నది నిజం. కాని ఆ నెపంతో పేద,మధ్య తరగతివారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు సమర్ధనీయం అన్నది ఆలోచించుకోవాలి. ఇందులో హ్యూమన్ ఫేస్ ను కూడా జోడించి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. యుపిలో బుల్ డోజర్ రాజ్ నడుస్తోందని కాంగ్రెస్ పదే,పదే ఆరోపిస్తుంటుంది. అదే బుల్ డోజర్ రాజ్ ను తెలంగాణకు తెచ్చారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాదంబరీ జత్వానీ కేసు.. కూటమి ప్రభుత్వానికి బూమరాంగ్ అయిందా?
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు ఎవరికైనా ఆందోళన కలిగిస్తాయి. శాంతిభద్రతల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష, కక్షపూరిత వైఖరివల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతున్నట్లు కనబడుతుంది. అందువల్లే కేంద్ర హోం శాఖ ఇచ్చిన నివేదికలో ఏపీకి 26వ ర్యాంకు వచ్చింది. ఒకప్పుడు ఏపీ పోలీసు శాఖకు మంచి పేరు ఉండేది. మొదటి ఐదు ర్యాంకులు సాధించిన రాష్ట్రాలలో ఏపీకి స్థానం లభించేది. అలాంటిది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన మొదలయ్యాక, రెడ్‌బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తున్నట్లుగా ఈ నివేదిక వల్ల అర్థం అవుతుంది.తాజా ఉదాహరణ మోసకారి నటిగా పేరొందిన కాదంబరి జత్వాని కేసును ప్రభుత్వం డీల్ చేసిన పద్దతిని తీసుకువచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఎలాగైనా గత జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న లక్ష్యంతో కూటమి పెద్దలు రకరకాల ప్లాన్లు వేశారు. అందులో పోలీసు శాఖను అడ్డు పెట్టుకుని పలు తప్పుడు కేసులు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తూ చట్టాన్ని తుంగలో తొక్కిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అదే ధోరణిని ప్రభుత్వం కొనసాగిస్తోంది.జత్వాని కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అనే డీజీపీ స్థాయి అధికారిని జైలులో పెట్టారు. కొద్దికాలం వైఎస్సార్సీపీలో పనిచేసి, తదుపరి రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యాపార వేత్త అయిన కుక్కల విద్యాసాగరరావు ఎక్కడో డెహ్రాడూన్‌లో ఉంటే అరెస్టు చేసి తీసుకువచ్చారు. జత్వానికి కూటమి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. స్వయంగా హోం మంత్రి అనిత సంఘీబావం తెలిపారు. ఎల్లో మీడియా అయితే రెచ్చిపోయి, తామే శోధించామని చెబుతూ శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు గంతులేశాయి.జగన్ ప్రభుత్వంలో ఒక నటీని అక్రమంగా అరెస్టు చేశారని అభియోగం మోపుతూ, ఆమెను ముంబై నుంచి రప్పించి కేసు నమోదు చేసి ఐపీఎస్‌లను సస్సెండ్ చేసేవరకు వెళ్లారు. అసలు కేసేమిటి? ఈమె తనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతున్నదని, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరిస్తున్నదని విద్యాసాగరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం కదా. ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ వంటివారిని ముంబై, ఢిల్లీ వంటి నగరాలలో ఆ నటి బ్లాక్ మెయిల్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం తొలుత జిందాల్‌ను కూడా కేసులో ఇరికించాలని యత్నించింది. కారణం తెలియదు కాని, ఆ తర్వాత రోజుల్లో ఆయన జోలికి వెళ్లలేదు. బహుశా ఆయనతో రాజీ కుదుర్చుకుని ఉండవచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. స్వయంగా ఎల్లో మీడియానే ఈ తరహా వ్యాఖ్య చేయడం గమనార్హం.విద్యాసాగరరావు పెట్టిన కేసును పక్కనబెట్టి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు జత్వాని పక్షాన కొత్త కేసు పెట్టి కథ నడిపించారు. అన్యాయంగా జత్వానిని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జైలులో పెట్టారని, ఆమె తల్లిదండ్రులను కూడా వేధించారని ఎదురు కేసు పెట్టారు. దీనిని రాష్ట్ర సమస్యగా మార్చి జత్వానికి అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన ప్రసంగాలలో పలుమార్లు అప్పట్లో ప్రస్తావించి వైఎస్సార్సీపీపై బురద చల్లేవారు. విద్యాసాగరరావు కొన్నాళ్లు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా అలాగే బెయిల్ పొందారు. విశాల్ గున్నీ, కాంతీలాల్ రాణ అనే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్‌పై రక్షణ పొందారు. రెడ్‌బుక్ అరాచకాలలో భాగంగానే ఇలా తప్పుడు కేసు పెట్టారన్న ప్రచారం అప్పట్లో జరిగింది.ఈ తరుణంలో సడన్‌గా కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. జత్వానికి వ్యతిరేకంగా సీఐడీ కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించింది. ఇది సంచనలంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం విద్యాసాగరరావుపైన, ముగ్గురు ఐపీఎస్‌లపైన తప్పుడు కేసు పెట్టినట్లు ఒప్పుకున్నట్లయిందన్న విశ్లేషణ వచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం పరువు పోయినట్లయింది. ఈ కేసులో జిందాల్ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తపై కూడా తప్పుడు అభియోగాలు మోపే యత్నం జరగడంతో దేశం అంతటా పారిశ్రామికరంగంలో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చినట్లయింది.జగన్ ప్రభుత్వం మోసకారి నటి జత్వానిపై చర్య తీసుకుని ఆమె బ్లాక్ మెయిల్‌కు అడ్డుకట్ట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం జత్వానిని అడ్డుపెట్టుకుని, వైఎస్సార్సీపీనో, ఎవరినో సాధిద్దామనుకుని సెల్ఫ్ గోల్ వేసుకుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ నష్టాన్ని గమనించిన ఎల్లో మీడియా వెంటనే మళ్లీ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి డామేజి కంట్రోల్‌కు ప్రయత్నించింది. విద్యాసాగరరావు పెట్టిన కేసులో జత్వాని చేసింది తప్పని తేలిందని, కాని ఆమెపై కేసు పెట్టిన తీరు, హాండిల్ చేసిన విధానాల్లో లోపాలు ఉన్నాయని, అది వేరే కేసు అని, ఆ కేసులో ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం జరిగిందని ఎల్లో మీడియా కవరప్ యత్నం చేసింది. పోనీ ఆ అధికారులు చేసిన అక్రమం ఏమిటో అందులో వివరించినట్లు కనబడలేదు.ఒక మోసకారి నటి ఆట కట్టించడం ఆ ఐపీఎస్‌లు చేసిన తప్పన్నమాట. జత్వానిపై అన్యాయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని కదా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణ! ఇప్పుడు జత్వానీనే బ్లాక్ మెయిలర్ అని, కోటి ముప్పై లక్షల రూపాయలకు పైగా విద్యాసాగర్ నుంచి అక్రమంగా పొందిందని, ఆధార సహితంగా రుజువు అయింది కదా! ఇందులో పోలీసు అధికారుల తప్పు ఏమి ఉంటుంది? చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును కవర్ చేసేందుకు ఈ కేసు వేరు, ఆ కేసు వేరు అంటూ కొత్త కథను ఆరంభించారన్నమాట.ఏది ఏమైనా వైఎస్సార్సీపీ నేతలపైన, అప్పట్లో యాక్టివ్‌గా పనిచేసిన అధికారులపైన, సోషల్ మీడియావారిపైన, జర్నలిస్టులపైనా కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతోందనడానికి ఇది పెద్ద ఉదాహరణ అవుతుంది కదా! దీనివల్ల కూటమి సర్కార్ అప్రతిష్ట పాలవుతున్నా ప్రభుత్వ ధోరణిలో పెద్దగా మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇలాంటి తప్పుడు కేసులతోనే ఏపీ పోలీసు వ్యవస్థ ర్యాంకు ఇతర రాష్ట్రాలతో పోల్చితే అంత ఘోరంగా 26 వ ర్యాంకుకు పడిపోయిందని అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్‌లు జరిగినా, లేదా స్కామ్‌ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్‌లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్‌లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్‌ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్‌పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్‌కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్‌గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్‌పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్‌లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మరోసారి పరువు పోయిందిగా..!
నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8.. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో ఉంటే, ప్రస్తుతం కూటమి పాలనలో అది ఎనిమిదో ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్‌లు పదేపదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేశాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏడెనిమిది శాతం అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనెవ్వరికి కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? పరిశ్రమలు వచ్చేశాయా?ఉద్యోగాలు వచ్చేశాయా? వస్తున్నాయా? అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరి ఆడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి.నిజంగా ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కాని అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంటులో కూడ వెల్లడైపోయింది. లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఏడువేల కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కార్ పరువు మరింత దిగజారినట్లయింది.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమలవారితో మాట్లాడినప్పుడుకాని, సదస్సులలోకాని ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కాని పారిశ్రిమికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్‌బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ ఉంది.మోసకారి నటి జత్వాని కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్‌ను కూడా ఇరికించి ముగ్గురు ఐపీఎస్‌లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్‌కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నానా రభస చేసింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా, తాము మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్‌లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డామేజీ జరిగి ఉంటుంది.అంతేకాదు.. విశాఖ వంటి కీలక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరువు తీసి ఉండాలి. ఏపీకి పరిశ్రమలు రావడానికి వెనుకాడుతున్నందున వీరు ఈ భూమిని ఇంత కారుచౌకగా, వేల కోట్ల లాభాలు వచ్చే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న సంకేతం కూడా నష్టం చేసిందేమో తెలియదు. పైగా కొన్ని సంస్థలకే ఇలా ఇవ్వడం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. కార్పొరేట్ సంస్థల మాటున తమకు కావల్సినవారికి కూడా కారుచౌకగా ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రభుత్వపరంగా పాలనకన్నా, ప్రతీకార రాజకీయాలకు, రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికలలో ఏపీ ర్యాంకింగ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో నీతి అయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఒకటి నుంచి ఎనిమిదికి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, వచ్చినా నీతి అయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికి తెలిసిపోతుంటాయి. మరో వైపు జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే, వాటిని ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.రామాయంపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్‌కు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో రెండేళ్ల కరోనా ఉన్నా, అన్ని వాగ్దానాలు అమలు చేసినా, ఆ ప్రభుత్వ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఎంతో సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ప్రభుత్వం రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఇక పరిశ్రమలవారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది.కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత మధ్య జరిగిన రగడ ఇంత, అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వబోమని బెదిరించారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరేసరి. పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది.జగన్ టైమ్‌లో పలు పరిశ్రమలు వచ్చినా, రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికీ ఆపడం లేదు. తాజాగా అమరరాజా ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమ పెట్టుకుంది. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమివేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్ల చేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమరరాజా సంగతి సరే! జగన్ టైమ్‌లో అది ఎక్కడకు వెళ్లలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్‌ల నుంచి సమాధానం లేదు.రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సుగ్గుగా చెబుతోంది. ఇది చిత్రంగా అనిపించదూ! నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే అప్పుడు నెంబర్ ఒన్ ర్యాంక్ ఎలా వస్తుంది? ప్రస్తుతం అంతా సజావుగా ఉంటే ర్యాంకు ఎందుకు పతనం అవుతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ.. లక్ష్మీ కటాక్షమా.. ఓట్ల రాజకీయమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి సంబంధించి చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేవిగా ఉంటున్నాయా? లేక అంతా ఆమోదించేవిగా ఉంటున్నాయా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు చేసిన కొన్ని ప్రకటనలను గమనించండి. అమరావతికి లక్ష్మీ కటాక్షం-హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం.. అమరావతి అంటే విజయవాడ గుంటూరు, మంగళగిరి కలిసి ఉండేదే.. ఈ వ్యాఖ్యలను విశ్లేషించుకుంటే ఏమి అర్దం అవుతుంది?ఇంతకాలం అమరావతిని దేవతల రాజధాని అని ఆయన ప్రచారం చేశారు. దీనిపై వస్తున్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకున్నారేమో తెలియదు కాని ప్రజల రాజధాని అని కూడా అంటున్నారు. అంతవరకు సంతోషమే.దేశంలో మరే రాష్ట్రంలో తమది దేవతల రాజధాని అని ఏ ముఖ్యమంత్రి చెప్పి ఉండరు. ప్రజలను సెంటిమెంట్‌తో ఆకట్టుకోవడం కోసం ఆయన ఇలా చేస్తున్నారన్నది తెలుస్తూనే ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు అన్నారట. ఇలా అనడంలోని ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు. భారత్.. రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ దేశంగా ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాలి. చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా వ్యవహరిస్తుంటారన్న భావన రాజకీయ వర్గాలలో ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మతపరమైన రాజకీయాలు చేయడానికి రకరకాల యత్నాలు చేశారు. చంద్రబాబు 2024లో మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే ప్రయత్నం సాగిస్తున్నారు.తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపించి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టేందుకు కృషి చేశారు. తీరా అలాంటిదేమీ జరగలేదని తేలడంతో ఆయన సెల్ఫ్‌గోల్ వేసుకున్నట్లయింది. అయినప్పటికీ ఈ మధ్య మీమతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ స్పీచ్‌లు ఇస్తూ ప్రజలను అటువైపు మళ్లించడానికి తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా మతపర వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రబలుతోంది.ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత డెబ్బై ఐదేళ్లలో ఎన్నడూ మతాల ఆధారంగా కాకుండా ప్రభుత్వాల పనితీరు, విధానాల ఆధారంగానే ఓట్లు వేస్తూ వచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన అంశాలకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవమే. అందులోనూ మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ధోరణి మరింత హెచ్చింది. బీజేపీ మెప్పు కోసం చంద్రబాబు కూడా హిందూయిజాన్ని ప్రధాన అంశంగా మలచుకుని ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అమరావతి రాజధానిలో జగన్నాధ రధయాత్రలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా స్వామివారి ఆశిస్సులను కోరుకోవడం, ప్రజలకు మేలు కలగాలని ప్రార్ధించడం సహజంగానే జరుగుతుంది. కాని హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మించడం ఏమిటో తెలియదు. ఈ మాటలు విన్న ఇతర మతాలవారికి అది ఎలాంటి భావన కల్గిస్తుందన్నది ఆయన ఆలోచించుకోవాలి!గతంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని పిలవరా అని అన్నప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీకి దూరంగా ఉన్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అన్ని కులాలను, మతాలను తన వెంట తీసుకువెళ్లేలా వ్యవహరించాలి. దేశం కాని, రాష్ట్రం కాని మతపరమైనవిగా లేవన్న సంగతి గుర్తించాలి. స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదలించలేరని అంటూ రాజకీయ లక్ష్యంగా ప్రసంగం చేసినట్లు అనిపిస్తుంది. ఆధ్యాత్మికత తోడుంటేనే ప్రశాంతత వస్తుందని ఆయనే చెబుతారు. కాని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయనే రాజకీయ ప్రసంగాలు చేస్తుంటారు.అమరావతికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషపడతారు. లక్ష్మీ కటాక్షం రాష్ట్రం అంతటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు కాని, అమరావతికే కోరడం ఏమిటో తెలియదు. ఇప్పటికైతే అమరావతి ద్వారా ప్రభుత్వానికి లక్ష్మీ కటాక్షం ఎంత జరిగిందో అంటే.. ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కాని, అప్పు మాత్రం 47వేల కోట్లకు చేరింది. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి లక్షకోట్లు ప్రస్తుతం ఖర్చు చేయవలసి ఉందని అంటారు. నిజంగానే లక్ష్మీకటాక్షం జరిగి, ప్రజల మీద భారం లేకుండా అమరావతి సొంతంగా సంపాదించుకుంటే చంద్రబాబు చెప్పింది నిజమేనని నమ్ముతారు. అలాకాకుండా వేల కోట్ల అప్పులు తెస్తూ దానినే లక్ష్మీ కటాక్షం అని అనుకోవాలంటే కష్టం అవుతుంది.అంతేకాదు... అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ రెండేళ్లలో కలిగిన లక్ష్మీ కటాక్షం పెద్దగా ఏమి లేదని బాధపడుతుంటారు. వారికి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చి ఉంటే కొంత కటాక్షం కలిగేదేమో. పైగా బలవంతపు భూ సేకరణ ద్వారా రైతుల వద్ద ఉన్న లక్ష్మీని కూడా ప్రభుత్వం లాక్కుంటోందన్న బాధ పలువురిలో ఉంది. కొందరు మహిళలను సైతం ప్రభుత్వం ఈ విషయంలో వేధించిన తీరు చూసి లక్ష్మీదేవి కూడా బాధపడి ఉండాలి. ప్రభుత్వం స్టార్ హోటళ్లకు ఎకరా ఎనిమిది కోట్లకు భూమి ఇస్తామని ప్రతిపాదించిందట. అదే టైమ్ లో భూముల సొంతదారులైన రైతులకు మాత్రం కోటి, రెండు కోట్లు కూడా ఇవ్వడం లేదని ఉండవల్లి రైతులు వాపోతున్నారు.చివరిగా మరో మాట.. మాజీ సీఎం జగన్ మావిగన్ అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను ఒక కారిడార్‌గా తీసుకుని రాజధాని అభివృద్ది చేయాలని సలహా ఇస్తే దానిని చంద్రబాబు ఎద్దేవ చేశారు. కాని తాజాగా చేసిన ఒక ప్రసంగంలో అమరావతి అంటే విజయవాడ, మంగళగిరి, గుంటూరు కలిసి ఉన్నాయని అంటున్నారు. అవి ఇందులో భాగం అయితే రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టు వంటివి మళ్లీ ఎందుకు నిర్మించాలి? వాటికోసం వేల ఎకరాల భూములు తీసుకుని రైతులను ఎందుకు బాధించాలి అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. మొత్తం తెచ్చిన అప్పు అంతా అమరావతి 29 గ్రామాలలోనే ఎందుకు వ్యయం చేస్తున్నారన్నదానికి సమాధానం చెప్పరు. అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనను కాదనలేని స్థితికి చంద్రబాబు చేరుకున్నారని అనుకోవాలి. మతం మత్తు మందు వంటిదని కారల్ మార్క్స్ అంటారు. దానిని ఎంతవరకు అంగీకరిస్తారో తెలియదు కాని, మతం పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి మాత్రం చంద్రబాబు వేస్తున్న వ్యూహాలు ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జనసేనకు మళ్లీ భంగపాటు.. టీడీపీ నిర్ణయమే ఫైనలా?
ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ పరిస్తితి ఏ విధంగా ఉండబోతోంది? గౌరవమైన స్థాయిలో పోటీ చేసే అవకాశాన్ని జనసేనకు టీడీపీ ఇస్తుందా?లేదా?అన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. అసలు జనసేన బలం ఎంత అన్నదానిపై కూడా రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. టీడీపీ వర్కింగ్ అద్యక్షుడు, కీలక మంత్రి నారా లోకేష్ వెల్లడించినట్లు వచ్చిన ఒక సమాచారం ప్రకారం 80:15:5 నిష్పత్తులతో శాతాల ప్రకారం ఆయా స్థానిక సంస్థలలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతుంది. ఈ విషయాన్ని ఆయనే పార్టీ జోనల్ కోఆర్డినేటర్లకు స్పష్టం చేశారు. అంతకు కొద్ది రోజుల ముందు ఈ మూడు పార్టీల సమన్వయ సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరి ఉండాలి. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదించి ఉండాలి. లేకుంటే లోకేష్ ఈ విషయాన్ని బహిర్గతం చేసేవారా అన్న సందేహం వస్తుంది. ఈ వార్త మీడియాలో రాగానే జనసేన క్యాడర్ ఒక్కసారిగా నీరుకారిపోయిందని చెబుతున్నారు. పార్టీలో ఉన్న పలువురు స్థానిక నేతలు మంత్రి,పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కు ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దాంతో పార్టీ వైఖరిపై మనోహర్ కొంత వివరణ ఇచ్చారు. నిజానికి నాదెండ్ల మనోహర్ కూడా తమబలాన్ని బట్టే సీట్ల పంపిణీ ఉంటుందని ఎప్పుడో చెప్పారు. కాని పార్టీలో ఏర్పడిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ఆయన తన స్వరం మార్చి అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించిన ఫార్ములా ఇప్పుడు వర్తించదని పేర్కొన్నారు. జనసేన బలంగా ఉన్నచోట తమ పోటీ తప్పనిసరిగా ఉంటుందని అన్నారు.అంటే లోకేష్ చెప్పిన ఈ నిష్పత్తి ప్రకారం 15 శాతం సీట్ల ఫార్ములాను ఒప్పుకోవడం లేదని చెప్పినట్లయింది. సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని,ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఇది నిజమే అయితే లోకేష్ ఆప్రకటన ఎలా చేశారు అన్నది తెలియాల్సి ఉంది. కూటమి భాగస్వామ్య పార్టీలు ఏకపక్షంగా వ్యవహరించడం కుదరదని, అంతా సమన్వయంతోనే నిర్ణయం తీసుకుంటటామని మనోహర్ అన్నారు. జనసేనకు ఎంత బలం ఉందన్నదానిపై ఎవరు అంచనావేస్తారు? 2019,2024 ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు,సీట్ల ఆధారంగా చూస్తే వారికి ఉన్న బలం కన్నా లోకేష్ ఎక్కువ శాతం సీట్లనే కేటాయిస్తున్నట్లు అనిపిస్తుంది. కాని జనసేన క్యాడర్ అంతా దీనిని అవమానంగా భావిస్తున్నది. జనసేనకు ఆరేడుశాతం ఓట్లు మించి ఉండవన్నది ఒక అంచనా. గత ఎన్నికలలో జనసేన 21 సీట్లు గెలుచుకుంది. అంటే ఆ రకంగా చూసినా వారికి లభించిన ఎమ్మెల్యే సీట్లు 12 శాతంగా ఉన్నాయి.అందులో కూడా టీడీపీకి చెందినవారికే దాదాపు పదిమందికి అవకాశం ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి.ఉదాహరణకు అవనిగడ్డ,భీమవరం తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు బలం ఎక్కడిది అని ప్రశ్నించారు. జనసేనకు యంత్రాంగం ఉందా?వనరులు ఉన్నాయా?అంటూ రకరకాల సందేహాలను లేవనెత్తి ఆయనే జనసేన బలహీనతలను బయటపెట్టారు. అది పార్టీకి పరువు తక్కువ అని పార్టీ నేతలు భావించినా, ఆనాడు ఉన్న పరిస్థితిలో ఎవరూ మాట్లాడలేకపోయారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు 50 సీట్లు, బీజేపీకి 25 సీట్లు కోరాలన్న ఒక ప్రతిపాదన నడిచింది. ప్రత్యేకించి బీజేపీ నాయకత్వం ఈ సలహా ఇచ్చిందని చెబుతారు. కాని పవన్ కళ్యాణ్ తనపై తనకే నమ్మకం లేకపోవడంతో ,ఎలాగైనా తాను ఎమ్మెల్యేగా గెలవాలన్న కోరికతో పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిన్నా పర్వాలేదన్నట్లుగా వ్యవహరించారు. అప్పుడే కనుక ఏ నలభై,ఏభై సీట్లను డిమాండ్ చేసి ఉంటే,ఆనాడు ఉన్న వాతావరణంలో టీడీపీ అంగీకరించి ఉండేదని కొందరి అభిప్రాయం. అలాగే ముఖ్యమంత్రి పదవిని షేరింగ్ అడగాలని చాలామంది జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సూచించారు. తద్వారా కాపులలో కూడా ఒకరికి సీఎం. అవకాశం వస్తుందని వారంతా ఆశించారు. ఇదే ప్రశ్నను అప్పట్లో లోకేష్ వద్ద మీడియా ప్రస్తావించగా, ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకోవడానికి టీడీపీ సిద్దంగా లేదని స్పష్టం చేసినట్లు కధనాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని టీడీపీ పాలిట్ బ్యూరో లో చర్చించి నిర్ణయిస్తామని అన్నట్లుగా ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ టీడీపీ నాయకత్వాన్ని నిలదీయలేకపోయారు. ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్లుగానే సర్దుకుపోయినట్లు కనబడుతుంది. జనసేన క్యాడర్ కూడా పెద్దగా గొడవ చేయలేదు.ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కేవలం 15 శాతం సీట్లే కేటాయిస్తే ,చాలామంది ఆశావహులు నష్టపోయే అవకాశం ఉంటుందని వారు బాధపడుతున్నారు. ముందుగా కౌన్సిలర్, జడ్పీటిసి,ఎంపిటిసి స్తానాలలో 15 శాతం చొప్పున కేటాయిస్తే జనసేన ఎన్నిటిలో గెలుస్తుంది?మున్సిపల్ చైర్మన్ ,జడ్పి చైర్మన్,మండల అధ్యక్ష పదవులు ఎన్ని పొందగలుగుతుందన్నది చర్చనీయాంశం అవుతుంది. కనీసం 30 శాతం సీట్లు అయినా డిమాండ్ చేయాలని కొందరు జనసేన అబిమానులు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో టీడీపీతో పాటు జనసేనకు చెందినవారు కూడా పోటీ పడి తమ సత్తా చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఉంది.సెప్టెంబర్ నుంచి స్థానిక ఎన్నికల హడావుడి మొదలవుతుందని చెబుతున్నారు. ఈలోగానే ఆయా మున్సిపాల్టీలు, మండలాలు,జడ్‌పిల విషయంలో జనసేన క్లారిటీ తెచ్చుకోలేకపోతే ఆ పార్టీ కేవలం టీడీపీకి మద్దతు ఇచ్చే పార్టీగానే మిగిలిపోతుందన్న అనుమానం జనసేనకు చెందిన పలువురిలో ఉంది. ఏది ఏమైనా రాజకీయాలలో ముందుచూపు ఉండాలి. తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటే అవి ఆ తర్వాత నష్టం చేసే అవకాశం ఉంటుందని జనసేన నాయకత్వానికి తెలిసి ఉండాలి. ఒకవేళ జనసేన కేవలం 15 శాతం స్థానాలకే పరిమితం కావల్సి వస్తే అది జనసేన స్వయంకృతాపరాధం అవుతుంది తప్ప మరొకటి కాదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రశ్నిస్తే జైలు.. పొగిడితే జేజేలా?
సోషల్ మీడియాలో పెడధోరణులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేస్తుందట. ప్రభుత్వం మీద వచ్చే నెగిటివ్ వార్తలపై నిఘా పెడతారట. అసభ్య పోస్గింగులను అరికట్టే నెపంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా అడుగులు వేస్తోందా అన్న సందేహాన్ని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.అసభ్య పోస్టులు ఎవరు పెట్టినా తప్పే. వాటిని కచ్చితంగా కంట్రోల్ చేయవలసిందే. కాని ఇప్పటికే అందుకు తగిన వ్యవస్థ ఏపీలో ఉంది. అయినా అది సరిపోవడం లేదని ప్రభుత్వం ఎందుకు అంటోంది? పోలీసు వ్యవస్థ సమర్థంగా ఆ దిశలో పనిచేయడం లేదని భావిస్తున్నారా? అసభ్య పోస్టింగ్‌లను ఎలాగైనా ఆపవచ్చు. అసలు సమస్య ఏమిటంటే కూటమి సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రతిబింబిస్తుండడం కావచ్చు. దానిని కంట్రోల్ చేస్తే వచ్చే ఎన్నికలలో నెగ్గగలమన్న ఆశ ఉండవచ్చు. నిజానికి సోషల్ మీడియాతోనే గెలుపు ఓటములు నిర్ణయం కావు. ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఇచ్చిన హామీలు అమలు చేసే తీరు మొదలైనవి ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే అసత్య ప్రచారాల వల్ల నష్టం జరగదా అంటే కాదని అనలేం. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వైఎస్సార్సీపీకు చెందినవారు కాని, వారి సోషల్ మీడియా కాని అబద్దాలు చెప్పే అవకాశం తక్కువ. నిజాలు చెబుతుంటేనే పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్సార్సీపీవారిపై ఎన్ని కేసులు పెడుతున్నది కనబడుతున్న తరుణంలో కోరికోరి ఎవరు సమస్య తెచ్చుకుంటారు? సోషల్ మీడియా పోస్టులలో పచ్చి బూతులు పెట్టిన కొందరిని టీడీపీ ఎంకరేజ్ చేస్తున్నదన్న ఆరోపణ ఉంది.జగన్ ప్రభుత్వ సమయంలో అలాంటివారిపై ఏవైనా చర్య తీసుకోబోతే ఇంకేముంది ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారు, వాక్ స్వాతంత్రం, మీడియా స్వాతంత్రం పూర్తిగా పోయాయి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారితో పాటు ఎల్లో మీడియా వారు ఎన్ని ఆరోపణలు చేసేవారు? బహుశా వారు ఆ సంగతులు మర్చిపోయి ఉండవచ్చు. అరాచక పోస్టులు పెట్టిన ఒక వ్యక్తితో మహానాడులో ప్రసంగమే ఇప్పించారే! అది ఏపాటి మర్యాద అవుతుంది? వైఎస్ జగన్ కుటుంబంపైన, వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలపైన, ఆ పార్టీ మహిళా నాయకులపై ఎంత దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ మద్దతుదారులు కొందరు ఎలా చేశారో అందరికి తెలుసు. వారిలో కొందరికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. మరికొందరు అంతకన్నా పెద్ద పదవులలోనే ఉన్నారు కదా! బహుశా తమ అనుభవం రీత్యా, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను అణచివేయడమే మార్గంగా భావించినట్లు ఉన్నారు.మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియాపైనే ఎక్కువగా చర్చ జరిపే పరిస్థితి వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు సాధారణంగానే అభ్యంతరకరంగా ఉండే సోషల్ మీడియాపై కేసులు పెడుతుంటారు. కాని వారి బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చాక మారిపోయింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ లోటుపాట్లపైన, వైఫల్యాపైన ప్రశ్నిస్తారో వారందరిపై ఏదో రూపేణా కేసులు పెట్టడమే పోలీసుల విధిగా మారిపోయినట్లుంది. అందుకే ఏకంగా సుమారు 1500 కేసులు సోషల్ మీడియాపై పెట్టారు. ఆ కేసులో 1300 మందిని అరెస్టు చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని సీపీఎం కార్యదర్శి వి. శ్రీనివాసరావు వంటివారు గొంతెత్తి చెబుతున్నారు.రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహ కేసు పెట్టి కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. టీడీపీ మద్దతుదారుగా భావించే మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా రావణ్‌పై ఆ చట్టాన్ని ప్రయోగించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. వీరెవ్వరిని తప్పుపట్టని చంద్రబాబు ఈ కేసును వైఎస్సార్సీపీకి రుద్దాలని ప్రయత్నించడమే ప్రభుత్వ బలహీనతగా తీసుకోవాలి.ఒకప్పుడు కులమతాలను రెచ్చగొడుతూ టివీలో నిత్యం మాట్లాడే ఒక నాయకుడిమీద ఆనాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెడితే దానిపై ఆ రోజుల్లో తెలుగుదేశం ఇంతెత్తున ఎగిరిపడింది. ఈ రోజుల్లో కూడా రాజద్రోహం ఏమిటి అని ప్రశ్నించింది. కాని తాను అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై దాడి చేయడమే కాదు.. ఒక చిన్న యూట్యూబర్‌పై రాజద్రోహం కేసు పెట్టి కూటమి సర్కార్ తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సంతృప్తిపరచడానికా? లేక సోషల్ మీడియాను భయపెట్టడానికా అన్నది వేరే సంగతి.నిజానికి చంద్రబాబు ప్రభుత్వం దేనిమీద టాస్క్ ఫోర్స్‌లు వేయాలి? టీడీపీ, జనసేనలు కలిసి ఇచ్చిన ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశాం. ఇంకెన్ని చేయాలి? వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎలాంటి పద్దతి అనుసరించాలి? అన్నవాటి మీద కదా! పెన్షన్ నాలుగువేలు చేయడం, మరికొన్నిటిని అరకొరగా అమలు చేయడం మినహా ఎన్నికల మానిఫెస్టోని తుంగలో తొక్కినట్లుగా వ్యవహరిస్తూ, సోషల్ మీడియాతో ఏదో ప్రమాదం ముంచుకువస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలట. ఇది తప్పు కాదు. కాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎన్ని అబద్దాలు ప్రచారం చేశారో జనానికి తెలియదా?కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూముల రీసర్వే చేస్తుంటే, జగన్ ప్రజల భూములు కాజేస్తున్నారని చేసిన ప్రచారాన్ని ఏమంటారు?ఇప్పుడు అదే రీసర్వే తమ ఘనత అని ఎలా చెప్పుకుంటున్నారు? 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని, అందుకు వలంటీర్లు బాద్యులని చెప్పిన సంగతి నిజమా? అబద్దమా? కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటూ చంద్రబాబు అచ్చంగా వాటి గురించి పలుమార్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే సీనియర్ నేతలలో ఒకరైన చంద్రబాబు వీటిగురించి పదే, పదే మాట్లాడడం సరైనదేనా. తనకు ఫలానా కులం వారైనా ఓట్లు వేయరా అని అడిగిన వ్యక్తిని పక్కనబెట్టుకున్నదెవరు?ఒక సభలో మాట్లాడుతూ గతంలో శ్రీరాముడి తల తొలగించారని ఆరోపించడం సరైనదేనా? ఆ కేసులో పట్టుబడిన వ్యక్తి టీడీపీ మద్దతుదారు అని అప్పట్లో పోలీసులు వెల్లడించారే. ఆ వ్యక్తికి కూటమి అధికారంలోకి వచ్చాక ఐదు లక్షలు ఇచ్చారని వార్తలు వచ్చాయే! ఆదోనిలో శివాలయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించుకున్నాడని చంద్రబాబు చెప్పారు. దీనిపై చర్య తీసుకోవలసింది ఎవరు? పైగా అతను జనసేనకు చెందినవాడని వెల్లడైంది కదా! పదే, పదే ఇలాంటి విషయాలను ప్రస్తావించడం సమాజానికి మంచిదా? ఇవన్ని ఎందుకు! ఇతర మతాలను దూషిస్తున్న ఒక వ్యక్తి జోలికి ఎందుకు ప్రభుత్వం వెళ్లడం లేదు? ముఖ్యమంత్రి, లేదా కీలకమైన పదవులలో ఉండి మీ మతం, మా మతం, మీ దేవుడు, మా దేవుడు అంటూ మాట్లాడడం ద్వారా టీడీపీ నేతలు సమాజానికి ఏమి సందేశం ఇవ్వదలిచారు?తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి మతానికి అపచారం చేశారా? మంచి చేశారా? మతం గురించి ఇంతగా బాధపడుతున్నవారు అయోధ్య రామాలయంలో డోనేషన్ల స్కామ్ గురించి ఎందుకు పెదవి విప్పలేకపోతున్నారు. అది మతానికి జరిగిన నష్టం కాదా? కొద్ది రోజుల క్రితం ఒక సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను చెప్పిన విషయంపై సభలో ఉన్న మహిళలు చప్పట్లు కొట్టరా అని బాధపడ్డారు.. ఉచిత బస్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించామని ఆయన తన ప్రసంగంలో చెబుతుంటే ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో ఆయన అసంతృప్తి చెంది తాను మంచి పనిచేస్తే చప్పట్లు కొట్టరా అని అడిగారు. నిజంగా ఫ్రీబస్ స్కీమ్‌పై ఇచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు అమలు చేస్తున్నదేమిటి?తిరుపతి, అన్నవరం ఏ క్షేత్రానికి అయినా, రాష్ట్రంలో ఏమూల నుంచి ఏ మూలకైనా ఏ బస్ అయినా ఎక్కి వెళ్లవచ్చని కూటమి పార్టీలు ప్రచారం చేశాయా? లేదా? ఇప్పుడు అదేమాదిరి అమలు చేస్తున్నారా? లేక పలు షరతులు పెట్టారా? ఆడబిడ్డ నిధి, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీల మాటేమిటి? వలంటీర్లకు ఏమి చెప్పారు. ఆ తర్వాత ఎలా ఎగవేశారు? ఇలాంటివన్ని ప్రజలకు గుర్తున్నాయి కనుకే సభకు వచ్చినవారు చప్పట్లు కొట్టడం లేదేమో అన్న సంగతి చంద్రబాబు, ఇతర కూటమి నేతలు గుర్తిస్తే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాళేశ్వరం రాజకీయ యుద్ధంగా మారిందా?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిత్యం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. అది క్రమేపి రాజకీయ రూపు దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. ఒక వైపు వానలు అంతంత మాత్రంగా ఉండడం, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వస్తాయో, రావో అన్న సందిగ్దత గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినప్పటికీ మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు కుంగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా డామేజి జరిగింది.2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిలో ఆ సమస్య కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిమీద సరైన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నదన్న విమర్శ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన పగుళ్లనండి. లేదా పిల్లర్లు కుంగడం అనండి.. ఏదైనా కానివ్వండి.. గ్రౌండ్ సిచ్చుయేషన్కు అనుగుణంగా నిర్ణయాలు చేసి రేవంత్ తనకు అడ్వాంటేజ్ తెచ్చుకునే అవకాశం ఒక దశలో ఉంది.ఆ ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నేషనల్ డామ్ సేఫ్టి అథారిటి చెబుతోందన్నది ఆయన వాదనగా ఉంది. ఇందులో స్కామ్ అని, మరొకటి అని చెప్పి గత రెండేళ్లుగా అలాగే ఉంచేశారు. ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. కాని వారు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందగలిగారు. కమిషన్ రిపోర్టుకు కూడా పెద్ద విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు నిల్వచేసి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి ఆయా ప్రాంతాలలో ఉన్న రిజర్వాయిర్లను నింపాలా? వద్దా? అన్న చర్చకు పరిస్థితి చేరింది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడ నీటిని తోడకపోతే తామే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. తనకు ఇరిగేషన్ మంత్రి పదవి అప్పగిస్తే, మూడునెలల్లో బారేజీలను బాగు చేయించి చూపుతానని హరీష్‌రావు సవాల్ చేశారు. వీటికి ప్రతిగా రేవంత్ కూడా ధీటుగానే బదులు ఇచ్చారు. అది వేరే విషయం.నిజానికి ఇంతదాకా రేవంత్ ప్రభుత్వం వెళ్లనిచ్చి ఉండాల్సింది కాదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు ఆయా జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎలా ఇవ్వవచ్చా అన్నదానిపై ఆలోచన చేసి ఉండాల్సింది. కేసీఆర్ కట్టించినంత మాత్రాన ఆ ప్రాజెక్టు ఆయనది అయిపోదు. అలాగే ఆరోపణలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టుతో రేవంత్‌కు సంబంధం ఉండకపోదు. అది ప్రజల ఆస్తి.ఈ క్రమంలోనే వాదోపవాదాలు, విమర్శ, ప్రతి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి బదులుగా నీళ్లు ఉన్నంత మాత్రాన ఎత్తిపోయలేం అని, నీటి నిల్వకు ఆ బారేజీలు అనువుగాదని జాతీయ డామ్ భద్రత అథారిటీ చెబుతోందని, బరాజ్‌లు సురక్షితం కాదని కూడా ఆ సంస్థ చెప్పిందని రేవంత్ అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అందుకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే, రైతుల పొలాలకు నీరందించలేకపోతే, వర్షాలు సరిగా కురవకపోతే ఆ ప్రభావం అంతా తన ప్రభుత్వంపైనే పడుతుందన్న సంగతి ఆయన గుర్తించాలి.అంతేకాక విపక్షాన్ని ఉద్దేశించి పొలాలలో రక్తం చల్లితే పంటలు పండుతాయని అనడం సరికాదు. ఎదుటి పక్షం వారు ఎదైనా చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కాస్త బెటర్ అయినా, ఈ మధ్య జరిగిన కొన్ని అరెస్టులు చూస్తే, ఇక్కడ కూడా టీడీపీ పెత్తనం సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఆయనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరొందిన రేవంత్ కూడా అదే బాటలో వెళ్లకుండా ఉంటే మంచిది.రేవంత్ వ్యాఖ్యను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలచుకుని, గోదావరి నీళ్లు రైతులకు అందిస్తామంటే తమ రక్తం ఇస్తామంటూ పెద్ద హడావుడినే సృష్టించింది. తెలంగాణ భవన్లో భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరిటేట్ చేసి ముగ్గులోకి దించాలని రేవంత్ చూస్తున్నప్పటికి, ఆయన తొణకడం లేదు. కేటీఆర్, హరీష్‌రావులే గట్టిగా బదులు ఇస్తున్నారు. దీనివల్ల కూడా రేవంత్ అసహనానికి గురి అవుతున్నారేమో తెలియదు. రేవంత్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే దాని పునరుద్దరణపై పూర్తి శ్రద్ద పెట్టి ఉంటే ఆయనకు పేరు వచ్చేది.కేసీఆర్‌ను విమర్శించవచ్చు. అందులో అవినీతి ఉంటే దానిపై దర్యాప్తు చేయించవచ్చు. కాని అల్టిమేట్‌గా ప్రజలకు కావల్సింది నీరు. అందులోను వర్షాభావ స్థితిలో తమ పొలాలకు నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ కోరడానికి ముందే, గోదావరిలోకి వచ్చిన వరద నీటిని అంచనా వేసుకుని, పంప్ హౌస్‌ల ద్వారా నీరు లిఫ్ట్ చేయించడం మొదలు పెడితే బాగుండేదేమో! కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా దానినే సూచిస్తున్నారట. ఒక వేళ నిజంగానే గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటే, విపక్షాన్ని కూడా ఆహ్వానించి, వారిని కూడా ఆయా బారేజీల వద్దకు, పంప్ హౌస్‌ల వద్దకు తీసుకువెళ్లి ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిస్థితిని వివరించి ఉండవచ్చు. అలాగే మేధావులైన ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం ఒక సమావేశం పెట్టి ఉండవచ్చు. ఇవేవి చేసినట్లు లేరు. పైగా అనుచిత వ్యాఖ్య చేసి తనకు రావల్సిన మైలేజీని రేవంత్ వదులుకున్నారేమో అనిపిస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఆత్మరక్షణలో ఉన్న బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఊపిరి పోస్తుందనిపిస్తుంది. కారణం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం కూడా మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పునరుద్దరణకు వేగంగా చర్యలు చేపట్టలేదన్న భావన ఉంది. ఒకప్పుడు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఉన్న బారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర సంక్షోభం వచ్చే స్థితి ఏర్పడింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్వయంగా ధవళేశ్వరం వెళ్లి, అక్కడే మకాం చేసి ఆ గేట్లను బాగుచేయడమో. కొత్త గేట్లను బిగించడమో చేశారట. దానివల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది.1986లో వచ్చిన భారీ వరదలకు గోదావరి రెండువైపులా గట్లు పలుచోట్ల తెగిపోయాయి. ఆ నది వెంబడి ఉన్న జిల్లాలన్నీ మునిగిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వెంటనే గోదావరి గట్లను పటిష్టపరిచే పని చేపట్టింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని చెబుతూ కాలం గడపలేదు. ఇలాంటి అనుభవాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కుని ముందుకు పోవడంలోనే ప్రభుత్వ విజన్ కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దానిని వినియోగించుకుంటే మంచిది. పాజిటివ్ దృక్పథంతోనే రేవంత్ ముందుకు వెళితే ఆయనకు మైలేజీ రావచ్చేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉద్యమ కెరటం అస్తమించింది.. ముద్రగడకు వీడ్కోలు
ఒక ఉద్యమ కెరటం ఆగిపోయింది.. ఒక ఆత్మీయ అనుబంధం తెగిపోయింది. మాటకు, పట్టుదలకు మారుపేరు అయిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురై మరణించడం అందరిని కలచివేస్తుంది. ముద్రగడ కాపు ప్రజల కోసం ఎంతో కృషి చేసి ఆ వర్గానికి చాలా మేలు చేశారు కాని, తాను మాత్రం రాజకీయంగా నష్టపోయారని చెప్పాలి. ఎవరు కాపుల ప్రయోజనాలకోసం కృషి చేశారో, చేస్తారో తెలుసుకునే టైమ్‌కి ముద్రగడ కన్ను మూయడం దురదృష్టకరం.ఆయన కాపు సామాజికవర్గ డిమాండ్లపై ఉద్యమాలు చేసినా, ఇతర సామాజికవర్గాలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. అదే ఆయన ప్రత్యేకత. ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని సామాజికవర్గ నేతలు అతి తక్కుమంది ప్రభావం చూపించారు. వారిలో ముద్రగడ అగ్రగణ్యుడుగా ఉన్నారు. కాపులు పేరుకు అగ్రవర్ణం అయినా, పేదల శాతం ఎక్కువగా ఉంది. వారిని ఆకర్షించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పలు హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలు అయింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని కోరుతూ 2014-19 టరమ్‌లో ముద్రగడ నడిపిన ఉద్యమం ఏపీని కుదిపివేసింది. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, ఉద్యమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా, రకరకాల నిరసన పద్దతులను అవలంబించి ముద్రగడ చరిత్ర సృష్టించారు. మహిళలతో సహా కాపువర్గం వారంతా పళ్లాలతో నిరసన తెలుపుతూ చేపట్టిన ఆందోళన ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. తుని వద్ద ఆయన జరిపిన సభకు వేలాదిగా ఆ సామాజికవర్గ ప్రజలు స్వచ్చందంగా తరలివెళ్లడం ఒక చరిత్ర. అనూహ్యంగా తుని వద్ద రైలు దగ్దం ఘటనతో ఆయనతో సహా అనేక మంది ఉద్యమకారులపై కేసులు వచ్చినా చలించలేదు.టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. తన కుటుంబ సభ్యులపై పోలీసులతో బూతులు తిట్టించారని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పలుమార్లు బాధపడ్డారు. ఆయనను రాజమండ్రి ఆస్పత్రిలో నిర్బంధించి ఎవరిని కలుసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదని ఆయన చెబుతుండేవారు. రైతులకు సమస్య వచ్చినా, తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టినా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఆందోళనలకు దిగేవారు. ఉత్తరకంచి గ్రామంలో జరిగిన ఒక ఘటనపై ఆయన దీక్ష చేయడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కొన్నిసార్లు తన ఇంటిలోనే తలుపులు వేసుకుని దీక్ష చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్‌లో కూడా ఆయన కాపుల డిమాండ్లపై దీక్ష చేపట్టారు. అప్పట్లో ఆయన ఆ పార్టీలోనే ఉన్నా ప్రజల కోసం ఉద్యమించడానికి ముందుండేవారు.కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి రోశయ్యను హెలికాఫ్టర్‌లో పంపించి ముద్రగడతో రాయబారం చేసి కాపులకు పలు వరాలను ఇవ్వడానికి అంగీకరించింది. ఆ తర్వాత లక్షల మందితో ఒక సభను పెడితే కోట్ల స్వయంగా హాజరయ్యారు. కొన్నిసార్లు అవసరమైతే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని వదలుకోవడానికి కూడా ఆయన వెనుకాడేవారు కారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు రెండుసార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చిన పద్మనాభం 1978 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎంపీ అయ్యారు. గతంలో జనతా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారు.ముద్రగడను హైదరాబాద్ పంపి, ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించి, కోలుకోవడం కోసం జగన్ ఎంతో కృషి చేసినా అది ఫలించలేదు. ముద్రగడ ఆత్మీయత అనేది ఒక అరుదైన అనుభవం. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్లడానికి ఒప్పుకునేవారు కారు. నిత్య సంతర్పణ మాదిరిగా ఇంటి వద్ద కోలాహలం ఉంటుందంటే ఆశ్చర్యం కాదు. రాజకీయాలలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, తన వ్యక్తిత్వాన్ని ఎన్నడూ వదలుకోలేదు. తనను నమ్ముకున్నవారిని వదలిపెట్టలేదు. ఆయా సందర్భాలలో ప్రభుత్వ నేతలకు లేఖలు రాసి తన అభిప్రాయాలను చెబుతుండేవారు.చంద్రబాబుకు ఆ లేఖలు బాగా చికాకు పెట్టించేవి. ముద్రగడ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయేవారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే, జగన్ ప్రభుత్వం కాపు నేస్తంతో సహా పలు పథకాలను వారి సంక్షేమం కోసం అమలు చేసింది. తద్వారా కాపులకు కూడా ఇతరవర్గాలతో పాటు మేలు చేసిన వ్యక్తిగా జగన్‌ను ఆయన గుర్తించారు. జగన్ కూడా ఆయనను పితృ సమానుడుగా చూశారు. తన సంతాప సందేశంలో అదే విషయం పేర్కొన్నారు. జనసేనకు చెందిన ఒక ప్రముఖ నేత గత ఎన్నికల ముందు ఆయన ఇంటికి వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు. దాంతో ఆయన తగు ఏర్పాట్లు చేసుకున్నారు. కాని ఆయన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ చాలా బాధపడ్డారు. మాటపై నిలబడడం కాని, పట్టుదలకు కాని ముద్రగడ పెట్టింది పేరు.గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురుకాదని ఆయన విశ్వసించారు. అలా జరిగితే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. సాధారణంగా రాజకీయాలలో ఇలాంటి సవాళ్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత వాటిని విస్మరిస్తుంటారు. కాని ముద్రగడ మాత్రం అందుకు భిన్నంగా తన పేరును పద్మనాభరెడ్డి అని గెజిట్‌లో నమోదు చేయించుకోవడం విశేషం. తన కుమార్తె జనసేనలో చేరి తనపైనే విమర్శలు చేసిన తీరు ఆయనకు తీరని ఆవేదన మిగిల్చింది. తాను మరణిస్తే ఆమెను రానివ్వద్దని అన్నారంటే ఎంత బాధపడ్డారో అర్ధం చేసుకోవచ్చు.ముద్రగడ పార్ధీవదేహం చూడడానికి వచ్చిన ఆమెను కుటుంబ సభ్యులు అనుమతించలేదు. కూటమి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికార లాంచనాలతో చేయడానికి ముందుకు వచ్చినా వారు అంగీకరించలేదు. జీవించి ఉన్నప్పుడు ముద్రగడను ఎన్నో బాధలుపెట్టిన కూటమి నేతలు ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ముద్రగడ ఏపీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్నారు. గత ఏభై ఏళ్లలో కాపు సామాజికవర్గానికి ఇంతగా గుర్తింపు తెచ్చిన నేత ముద్రగడ తప్ప మరోకరు కాదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జగన్ అస్త్రాల పదును.. కూటమి సమాధానం సున్నా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు, ప్రకటనలకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఎంత తేడా ఉంటుందో గమనించండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు జగన్‌ను ఎలా దూషించాలా, వైఎస్సార్సీపీపై ఎలా ఆరోపణలు చేయాలా అన్నదానిపైనే కేంద్రీకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాక ఆయా టూర్ లలో ప్రజలను , అధికారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన తొట్రుపడుతున్న తీరును కూడా అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎక్కడా ఆధారాలు ఉండవు. అదే జగన్ చాలా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడతారు. ఈ మధ్య ఏపీలో జరిగిన లాకప్ డెత్ కేసులు, పోలీసుల వేధింపులు తాళలేక జరుగుతున్న ఆత్మహత్యల కేసులు చంద్రబాబు ప్రభుత్వ పరువును బాగా దిగజార్చుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది సర్వసాధారణం అయిపోతోంది.ఈ విషయాలను జగన్ ప్రస్తావిస్తూ ఎక్కడా కులాలు,మతాల గురించి మాట్లాడకుండా స్పెసిఫిక్‌గా ఆయా ఘటనలను వివరించారు. అదే చంద్రబాబు మాత్రం కులాలు,మతాలు గురించి మాట్లాడుతుండడం, రౌడీయిజం అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తుండడం కనిపిస్తుంది. చంద్రబాబు అంత సీనియర్ అయినప్పటికీ ఎందుకో బాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారా అన్న భావన కలుగుతుంది. అది వయసు ప్రభావం కావచ్చని కొన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతుంటే, అదేమీ కాదని, కావాలనే ఆయన డైవర్షన్ రాజకీయాలలో భాగంగా అలా మాట్లాడుతుంటారని మరికొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుప్పం టూర్ లో ఒక అధికారిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును ఉదహరిస్తున్నారు. ఏదో పని గురించి ఆయన అడగగా, ఆ అధికారి నిధుల ప్రస్తావన తేగానే ,వెంటనే ఆ మాటను తప్పించారు.మీకు అవకాశం ఇచ్చానని, ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని అంటూ ఏదో మాట్లాడారు. మరో సందర్భంలో ఒక పౌరుడి ఇంటి వంటగదిలో ఆంగ్లంలో మాట్లాడిన వైనం కూడా ఎవరికి అర్దం కాలేదు. ఇలాంటి ప్రయోగాలను చంద్రబాబు చేయకుండా ఉంటే బెటరేమో అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ హే రామ్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేస్తూ,ఆయా ఘటనలను ప్రస్తావించారు. పోలీసుల పక్షపాత ధోరణి, రాష్ట్రంలో శాంతి భద్రతల లేమి ,సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణమైన కేసులు పెట్టడం వంటి వాటిని ఆయన వివరిస్తూ ఏపీకి కావాల్సింది రౌడీ రాజ్యం కాదని, జింగిల్ రాజ్ కాదని అన్నారు. ప్రజలకు భద్రత,బాదితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ లేవనెత్తిన అంశాలపై ఒక్కదానికి కూడా చంద్రబాబు బదులు ఇచ్చినట్లు అనిపించదు.పైగా తాను రౌడీలు, మాఫియాతో రాజకీయాలు చేయవలసి వస్తోందని అనడంలో అర్ధం ఉన్నట్లు కనిపించదు. ఆయన ఉద్దేశం వైసిపిని ప్రజలలో పలచన చేయడం కావచ్చు. కాని ఆయన ఆ మాట అనగానే జనానికి ఈ రెండేళ్లలో టీడీపీ,జనసేన నేతలు, కార్యకర్తలు పలువురు చేస్తున్న రౌడీయిజం,అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి.గతంలో టీడీపీకి చెందిన కొందరు చేసిన హత్యలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోందన్న వ్యాఖ్యలు కూడా ఆయా వర్గాలు చేస్తున్నాయి. యూట్యూబర్ రావణ అరెస్టు జరిగిన తీరు, ఆ క్రమంలో జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రౌడీయిజం చేసిన తీరేమిటి?పోలీస్ స్టేషన్ ల పైనే దాడులు చేయడం ఎప్పుడైనా గతంలో జరిగిందా?అది ప్రభుత్వ అసమర్ధత కాదా! దీని గురించి జవాబు చెప్పకుండా రౌడీ రాజకీయం అంటూ ఎవరిమీదో నెట్టాలని ఎందుకు చూస్తున్నారు?గాదె సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలలో జగన్ స్వయంగా రంగంలో దిగేవరకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది. అది కూడా అరకొరగా చేస్తూ పోలీసుల తప్పులను కప్పిపుచ్చే రీతిలో వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా?పైగా సాయికృష్ణ కాపు కులమేనని,సిఐ నాగరాజు అదే కులమని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏమి చెప్పదలిచారు?దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులతో టీడీపీకే చెందిన మరో నాయకుడి ఇంటిపైకి వెళ్లి కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం చంద్రబాబు దృష్టిలో రౌడీయిజం అవుతుందా?కాదా?రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై చేసిన దారుణాల గురించి ఎందుకు చర్య తీసుకోలేకపోయారు. రౌడీలు రాజకీయం చేయడం వల్లే వివేక హత్య జరిగిందట.ఆ కేసులో దస్తగిరి అనే నిందితుడికి ఎందుకు టీడీపీ మద్దతు ఇస్తోందన్నదానికి జవాబు దొరకదు. మరి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఏ రౌడీలు హత్య చేశారు? టీడీపీ వారినే కదా ఆ రోజుల్లో అరెస్టు చేసింది?ఆనాడు జరిగిన ఘటనలపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఏమి రాశారు?నేరస్తులతో సమాజానికి నష్టం అని అంటున్నారు.నిజమే!కాని 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా!అందులో 80 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని వచ్చిన లెక్కలపై ఎప్పుడైనా స్పందించారా?ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఏదైనా ప్రచారం చేయవచ్చనుకుంటే రోజులు మారాయి. సోషల్ మీడియా విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. అందులో వాస్తవాలు చెప్పి ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు అంతగా తాపత్రయపడుతుంది అర్ధం కావడం లేదా?ఒకవైపు వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నీచాతీనీచంగా మాట్లాడిన టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యేలుగా చేసేది ఆయనే. జగన్ కుటుంబ సభ్యులను దారుణంగా బూతులు తిట్టిన వారితో టీడీపీ మహానాడులో ఉపన్యాసాలు ఇప్పించేది ఆయనే ! మళ్లీ బహిరంగ సభలలో అదేదో వైఎస్సార్సీపీఇలాంటివి చేస్తున్నట్లు ప్రచారం చేసేది ఆయనే!ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైఎస్సార్సీపీ ఫండింగ్ ఇస్తోందట. దానికి ఆధారం ఉంటే చూపించాలి కదా!అనేక యూట్యూబ్ చానళ్లను టీడీపీ పోషిస్తున్నదన్న అరోపణలు ఉన్నాయి కదా! ఈ చానళ్ళు ఎంత అసభ్యంగా ప్రచారం చేసిన చర్యలు ఉండవు.కాని అదే వైఎస్సార్సీపీపై మాత్రం విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరంగా ప్రచారం చేస్తే చర్య తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారు వేసే ప్రశ్నలకు జవాబు లేక ఏదో రకంగా కేసులు పెడుతున్న వైనాన్ని సమర్దించుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయమే కలుగుతుంది.ఐ టీడీపీ పేరుతో ఏమి చేసింది ఎవరికి తెలియదనుకుంటే ఎలా ? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనకు రౌడీయిజం తెలియదని,తానెప్పుడు హత్యలు చేయలేదని అనవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఇలాంటి మాటలు అన్నప్పుడే సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుందని ఆయన అర్దం చేసుకోవాలి. మావిగన్ అని జగన్అంటే దానిని వాటికన్ తో పోల్చడం ఏమిటి?యధా ప్రకారం లడ్డూ కల్తీ అని స్పీచ్ ఇస్తున్నారు. ఆ కల్తీ ఫిర్యాదు తన హయాంలో వచ్చినా దానిని ఎదుటివారిపై రుద్దుతారు. అసలు ఆయన చేసిన జంతు కొవ్వు ఆరోపణ ఏమిటి?అలా మాట్లాడడం పాపం కాదా?ఇప్పటికీ భక్తుల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఎందుకు మాటలు కొనసాగిస్తున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారన్న భావన జనంలో ఏర్పడుతోంది.జగన్ మాత్రం స్పష్టమైన ఆధారాలతో తన అభిప్రాయయాలు చెప్పడం ద్వారా తన విశ్వసనీయతను పెంచుకుంటున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రావణ్ ఎపిసోడ్.. పరువు పోగొట్టుకున్న బాబు, పవన్!
రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సామర్థ్యం దేశంలో మరే పార్టీకి ఉండకవచ్చు. రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహం కేసు పెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయింది. అంతా ఇదేమి పద్దతి అని నొచ్చుకున్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీరని అప్రతిష్ట వస్తే,ఎపి పోలీసు వ్యవస్థకు కళంకం ఏర్పడిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ వెంటనే వ్యూహం మార్చి వైఎస్సార్సీపీపై బురద చల్లడం ఆరంభించింది. ఎల్లో మీడియాతో పాటు, సోషల్ మీడియాలో తనకు ఉన్న పట్టు మేరకు విపరీతమైన వ్యతిరేక ప్రచారం సాగించింది.అదే టైమ్‌లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో వైఎస్ జగన్‌పైన, వైఎస్సార్సీపీపైన నిందలు వేయడం ఆరంభించారు. రావణ్ అరెస్టు చేశాక జరిగిన పరిణామాలలో జనసేన పరువు పోగొట్టుకుంటే, తీవ్రవాద నిరోధచట్టం కింద కేసులు, దేశద్రోహం కేసులు వంటివి పెట్టి తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. జనసేన క్యాడర్ కొంతమంది అరాచకంగా పోలీస్ స్టేషన్లపై దాడులు చేసినా వారిని అరికట్టలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసులు పెట్టలేదు. జనసేన వారిపై కేసులు పెడితే ఎక్కడ పవన్ కళ్యాణ్‌కు, ఆ పార్టీ వారికి కోపం వస్తుందన్న భయం కావచ్చు.జనసేన జనంలో పలచన అయినా ఫర్వాలేదులే అన్న వ్యూహం కావచ్చు. కాని న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించి రావణ్ కు బెయిల్ ఇచ్చేస్తుండడంతో పవన్‌ను సంతృప్తి పరచడానికిగాను అన్నట్లు తీవ్రమైన నేరారోపణ చేస్తూ రావణ్‌పై కేసులు పెట్టింది. ఈ ఫిర్యాదు చేసింది జనసేనకు చెందిన ఒక స్థానిక నేత అయినా, దానిని ఆమోదించడం ద్వారా టీడీపీ కూడా భాగస్వామి అయినట్లయింది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీతో పాటు, వామపక్షాలు, ఆలోచనాపరులు, విజ్ఞులైనవారంతా స్పందించారు. న్యాయవాది జడ శ్రావణ్ ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని విమర్శించారు.సామాజిక అంశాలపై కూడా స్పందించే నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు రావణ్ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పలువురు సీనియర్ పాత్రికేయులు, యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కొంతమంది ప్రభావశీలురు కూడా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వీడియోలు చేశారు. రావణ్ చేసిన విషయాలలో తప్పు ఉంటే చర్య తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు.కాని తప్పుడు కేసులు పెట్టడం, అది కూడా ఏకపక్షంగా చేయడంపైనే అంతా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో నక్సల్సిజంకు సంబంధించి చేసిన అనుకూల ప్రకటనల వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.దీంతో రావణ్ విషయంలో తప్పుడు కేసు పెట్టిన విషయం జనం అందరికి తెలిసిపోయిందన్న ఆందోళనతో చంద్రబాబు సర్కార్ వ్యూహాత్మక ఎదురుదాడి చేయడం ఆరంభించింది. రావణ్ దేశద్రోహి అని, సమాజ విధ్వంసకుడు అని, హిందూ మత వ్యతిరేకి అని ఇలా పలు ఆరోపణలు సంధిస్తూ ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేనలు యత్నించాయి. వారికి బీజేపీ కూడా జత కలిసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ పైన, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైన పలు విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టారు. చివరకు చంద్రబాబు కూడా ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. రావణ్‌కు జగన్ మద్దతు ఇస్తారా అంటూ టీడీపీ గంభీరంగా మాట్లాడే యత్నం చేసి దొరికిపోయిందని చెప్పాలి. నిజానికి రావణ్ ఎప్పుడూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒకప్పుడు వపన్ కళ్యాణ్ అభిమాని.ఆ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై వ్యతిరేక వీడియోలు చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలు విమర్శలతో వీడియోలు చేసిన వ్యక్తి రావణ్. అయినా రావణ్‌పై కూటమి సర్కార్ తీవ్రమైన కేసులు పెట్టడం మీద జగన్ మానవత్వంతో స్పందించారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కులాలు, మతాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తే సమాజ విధ్వంసకుడు రావణ్‌ను సమర్థిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.అయితే అదే టైమ్‌లో వామ పక్షాలు కూడా రావణ్‌పై ఉపా కేసులు పెట్టడంపై మండిపడ్డాయి. వారి జోలికి మాత్రం టీడీపీ, జనసేనలు వెళ్లలేదు. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ చాలా ఘాటుగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది తప్పుడు కేసు అని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్‌పై కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెట్టిందని ఆయన తెలిపారు. రావణ్‌పై పెట్టిన కేసులకు ఆధారంగా అక్కడక్కడ, ఆయా సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ చేసి, ముక్కలు, ముక్కలు అతికించి వీడియోల రూపంలో పోలీసులు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇతర మతాలను దారుణంగా అవమానించే రీతిలో మాట్లాడితే దానికి జవాబు ఇచ్చారే కాని రావణ్ స్వయంగా మతాలను దూషించలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఏపీ పోలీసుల దుశ్చర్య ప్రజలకు మరింత స్పష్టంగా తెలిసింది. మరి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎందుకు టీడీపీ విమర్శలు చేయలేకపోయింది. ఆయన అడిగినవాటికి ఎందుకు జవాబులు ఇవ్వడం లేదు. ఇప్పటికే సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగవ్వ, తదితర కేసులలో పోలీసులపై మచ్చపడింది. దానికితోడు రావణ్ పై తప్పుడు కేసు పెట్టారని ఒక రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించడంతో అటు చంద్రబాబు, పవన్‌లకు, ఇటు పోలీసు అధికారులకు బాగా డామేజీ అయిందని చెప్పాలి.చిత్రమేమిటంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్సార్సీపీకి చెందిన ఒక నేత పార్టీపై అసమ్మతితో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా రోజూ మాట్లాడుతుంటే వైఎస్ జగన్ ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణలు చేస్తుండేవారు. దానిని ఎల్లో మీడియా లైవ్ కవరేజీ ఇచ్చి అదేదో పండగ మాదిరి సంబర పడేది. అంతే తప్ప ఆయన సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారని ఎక్కడా రాయలేదు.రాజద్రోహం కేసు పెట్టి ఆయనను అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ నానా రచ్చ చేసింది. ఇప్పుడేమో అదే రాజద్రోహం కేసును రావణ్‌పై బనాయిస్తోంది. దాస్ అనే వ్యక్తి చేస్తున్న దారుణ ప్రసంగాలపై చర్య తీసుకుని ఉంటే కూటమి ఇప్పుడేమి చెప్పినా అర్థం ఉండేది. పవన్ కళ్యాణ్ తాను గతంలో నక్సలిజానికి, చెగువేరాకు ఎందుకు మద్దతు ఇచ్చింది చెప్పి తప్పు చేశానని ప్రకటించి ఉంటే ఆయనలో నైతికత ఉందన్న అభిప్రాయం కలిగేదన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన అంశాలకు ఏపీ పోలీసులు సమాధానం ఇస్తారా? ఆయనపై కూడా టీడీపీ దాడి చేస్తుందా? టీడీపీ, జనసేనలు ఈ అంశంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే వారే సెల్ప్ గోల్ వేసుకున్నట్లవుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతిలో దోమలు ఉండవట..! మరి వేల కోట్ల ఖర్చు ఎందుకు?
ఏపీ రాజధాని అమరావతిలో దోమలు ఉండవట.. ఇదినిజంగా మంత్రి నారాయణ చెప్పిన మాట. తెలుగుదేశం పత్రిక ఈనాడులో రాసిన వార్తే. అందువల్ల ఇక్కడ భవనాల నిర్మాణానికి అయ్యే వ్యయంతో ఇతర చోట్ల నిర్మాణాలతో పోల్చరాదట. వినేవ్యక్తి వెర్రివాడు అయితే చెప్పేవ్యక్తి ఏపీ మంత్రి నారాయణ అనుకోవాలి. విద్యా సంస్థలను పెద్ద ఎత్తున నిర్వహించే నారాయణ ఇలాంటి మాటలు చెబుతుంటే కనీసం ఆయన విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్ధులైనా నమ్ముతారా? ఇంతకీ విషయం ఏమిటి?ఇంతకాలం అమరావతిలో జరిగే నిర్మాణాల వ్యయంపై తీవ్ర విమర్శలు వస్తున్నా, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగింది. కాని కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో నిర్మించదలచిన భవనాల సముదాయం నిమిత్తం చదరపు అడుగుకు సుమారు ఐదువేల రూపాయల నుంచి ఆరువేల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అంచనా వేసింది. ఇదే చంద్రబాబు సర్కార్ గొంతులో వెలక్కాయిపడినట్లు చేసింది. కేంద్రంతో పోల్చితే నాలుగురెట్లు అధికంగా వ్యయం చేస్తుండడంపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. చదరపు అడుగుకు రాష్ట్రం సుమారు చదరపు అడుగుకు 17వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు వెచ్చిస్తుండడంలో అవినీతి భారీగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి ప్రభుత్వం బదులు ఇవ్వలేకపోయింది.ఈ నేపథ్యంలో ఎలాగోలా తాము చేస్తున్న అధిక వ్యయాన్ని సమర్థించుకోవడానికి నారాయణ గత కొన్నాళ్లుగా రకరకాలుగా తంటాలు పడుతున్నారు. అమరావతిలో ఇలా వేల కోట్ల వ్యయం చేయడంపై ప్రజలలో కూడా అసహనం పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా జగన్ మావిగన్ అనే ప్రతిపాదనను తీసుకురావడం మరింత సమస్య అయింది. దాంతో జగన్ పైన, వైఎస్సార్సీపీపైన ఏవేవో ఆరోపణలు చేయడం, అమరావతి ఖర్చును సమర్ధించుకోవడానికి నానా పాట్లు పడడం టీడీపీ వంతు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మావిగన్ అన్న పదంతో తొట్రుపాటుకు గురవుతున్నట్లు కనిపిస్తుంది.అమరావతిని ఎవరూ ఆపలేరని, మావిగన్ అని, విజయవాడ అని ఇలా రోజుకొకటి మాట్లాడుతున్నారని, మావిగన్ అంటే వాటికన్ కావాలంటారని అంటూ దీనిని ఒక మతపరమైన వివాదంగా మార్చడానికి చంద్రబాబు యత్నించిన తీరే ఇందుకు ఉదాహరణ అవుతుంది. ఎక్కడైనా రాజధానిలో ప్రజలు ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం దేవతల రాజధాని సెంటిమెంట్ డైలాగు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంటారు. అమరావతి దేవతల రాజధాని అయితే మిగిలిన రాష్ట్రం అంతా ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా వాటికన్ ప్రస్తావన తెచ్చి తన అసహనాన్ని బయటపెట్టుకున్నారు.చంద్రబాబుకు నిజంగానే మావిగన్ అంటే భయం ఏర్పడకపోతే, జగన్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియా ప్లాట్ ఫారంలపై లేకుండా పోలీసుల ద్వారా ఎందుకు చేశారో చెప్పాలి. వచ్చే ఎన్నికలలో మావిగన్ VS అమరావతి ఒక అంశం అవుతుందని, మావిగన్ కావాలి అనేవారు వైఎస్సార్సీపీకి, అమరావతి కావాలనేవారు టీడీపీకి ఓటేస్తారు అన్న జగన్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని చంద్రబాబు లేదా టీడీపీ నేతలు ఎందుకు అనలేకపోతున్నారు? మావిగన్ అంటూ ఏదో ఎద్దేవ చేసేలా మాట్లాడుతున్న కూటమి నేతలు అమరావతిలో అయ్యే వ్యయంపై, వేల కోట్ల అప్పులపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఒకప్పుడు ప్రభుత్వ ధనం రూపాయి అవసరం లేదని అదే సొంతంగా సంపాదించుకుని నిర్మాణాలు చేసుకుంటుందని చంద్రబాబు చెప్పేవారు కదా! మరి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి వేల కోట్ల నిధులే కాకుండా నలభైఏడువేల కోట్లను ఎందుకు అప్పు చేశారంటే జవాబు ఇవ్వలేకపోతున్నారు. ప్రజలలో కూడా రాజధాని పేరుతో లక్షల కోట్ల వ్యయం ఏమిటన్న చర్చ జరుగుతోంది. పైగా నిర్మాణ వ్యయంపై కేంద్ర ప్రకటన ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం బాగా ఎక్స్ పోజ్ అయిపోయింది. రాష్ట్రం నాలుగు భవనాల అద్దాలకు చేసే ఖర్చు 2500 కోట్లుగా ఉంది. అంతే మొత్తంతో కేంద్రం తన భవనాలన్నిటిని నిర్మించుకుంటోంది. అది కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జరుగుతుందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు ఇంతకన్నా స్టాండర్డ్ ఏమి ఉంటుందన్న ప్రశ్న వచ్చింది. దీంతో నారాయణ సాధారణ నిర్మాణాలకు ఐకానిక్ భవనాలతో పోలికా అంటూ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చే యత్నం చేశారు. ఈ వ్యాఖ్య అర్ధరహితంగా కనిపిస్తుంది.డిల్లీలో పార్లమెంటు భవనానికి 16,910 రూపాయలు చదరపు అడుగుకు ఖర్చు అయిందని, తెలంగాణ సచివాలయానికి అడుగుకు 13,762 రూపాయలు అయిందంటూ ఏవో కాకి లెక్కలు చెప్పడం ఆరంభించారు. అది నిజమే అయితే అంతా కలిపి పార్లమెంటు భవనానికి సుమారు 1100 కోట్లు, తెలంగాణ సచివాలయానికి వెయ్యి కోట్ల లోపు మాత్రమే ఎందుకు ఖర్చు అయింది? ఏపీలో మాత్రం సచివాలయ భవనాలకు వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారన్నదానికి సమాధానం దొరకదు. దీనిపై ఎందుకు శ్వేతపత్రం ఇవ్వలేకపోతున్నారు.ఇక రాజధాని రహదారుల నిర్మాణం అంటే కేవలం రోడ్లు వేయడం కాదట. తాగునీరు, మురుగునీరు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, గ్యాస్, టెలికమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలను రోడ్ల వెంటే ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. అంటే ఇవేవి తెలంగాణలో, ఢిల్లీలో ఏర్పాటు చేయకుండానే నిర్మాణాలు చేశారా? ఎన్ని చెప్పినా జాతీయ రహదారులకు కిలోమీటర్‌కు 23 కోట్లు ఎందుకు అవుతుంది? ఏపీలో రాజధాని రహదారికి సుమారు ఏభై కోట్లు ఎందుకు అవుతోందో అర్ధం కాదు.అంతేకాక అమరావతి రాజధానిని దోమల్లేని నగరంగా చేస్తున్నారట. దీనిని ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికే అమరావతికి సంబంధించి చంద్రబాబు చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేశారు. ఉదాహరణకు అమరావతిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అదికారులను చంద్రబాబు కిందటి టరమ్‌లోనే ఆదేశించారు. గతంలో నవ నగరాలు, అంతర్జాతీయ నగరం అన్నారు. ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని మాదిరి అమరావతి అవుతుందంటూ కథలు చెబుతూ వచ్చారు. సింగపూర్ కబుర్లు సరేసరి. మొదట సేకరించిన ఏభైవేల ఎకరాలు ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ నగరం ఎలా అయింది? రెండేళ్ల నుంచి అదే ప్రాంతం మున్సిపాల్టీగా ఎలా మారిపోయింది? అందుకే మళ్లీ లక్షన్నర ఎకరాలను సేకరిస్తాం అంటూ ఎందుకు బయల్దేరారు? కొండవీటి వాగు, పాలవాగులపై 69 వంతెనలు నిర్మాణం చేస్తామని నారాయణ ఎందుకు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఏ దేశంలో అయినా ఉంటుందా?పైగా ఎప్పటికప్పుడు వర్షం నీరు ఎత్తిపోసుకునే నగరం ఇంకేదైనా ఉందా? ఇలా పర్యావరణానికి విరుద్దంగా నగర నిర్మాణం చేయడం సరైనదేనా? దోమల సంగతి దేవుడెరుగు. రక్తాన్ని పీల్చే దోమల మాదిరి, అమరావతి అప్పుల పేరుతో ప్రజలపై భారం వేయకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చట్టాల పేరుతో కొత్త సవాళ్లు.. ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న ప్రశ్నలు!
భారతదేశం ఎటు వైపు పయనిస్తోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించి పౌర హక్కులను కాలరాశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కాకపోయినా, దాదాపు అదే రీతిలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయా అన్న భావనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 25న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్‌ను ఎండగట్టే బీజేపీ పెద్దలు, తాము ఏమి చేస్తున్నామో కూడా ఆత్మపరీశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తుంది.పశ్చిమబెంగాల్లో తీసుకువచ్చిన ఒక చట్టం అందరిని భయపెట్టేలా ఉంది. పేరుకు సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు వస్తున్నామని, దీనిని దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినా, ఆచరణలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్న ఆందోళనను వివిధ రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో అతి ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే ఎవరైనా ఈ చట్టం కింద అరెస్టు అయితే ఏడాదిపాటు జైలులోనే ఉంచుతారట. లాయర్ కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదట. దీనిని రాజకీయంగా వాడుకోబోమని చెబుతున్నా గ్యారంటీ ఏమి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది.ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో హాఫ్ ఎన్కౌంటర్ల పేరిట పోలీసులు సాగిస్తున్న ఘాతుకాలపై ఆయా జాతీయ ఆంగ్ల పత్రికలలో వస్తున్న వ్యాసాలు చదువుతుంటే భయం వేస్తుంది. యూపీలో మరీ ఇంత ఘోరంగా పరిస్థితి ఉందా అన్న భావన కలుగుతుంది. ఇక పశ్చిమబెంగాల్ వంతు వచ్చిందేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టి అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటి సోషల్ యాక్టివిటీస్ బిల్లును ఆమోదించారు. ఇది కేవలం జైళ్లకు పంపడం కాదు.. సమాజాన్ని రక్షించడం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాని ఒక ఏడాది వరకు ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు. ఈ బిల్లు దెబ్బకి, ఆ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. తద్వారా కేసుల బారీ నుంచి తప్పించుకోవచ్చు.గతంలో టీఎంసీలో మంత్రిగా ఉన్న సువేందు అధికారిపై స్వయంగా ప్రధాని మోదీ పలు అవినీతి ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అదే సువేందు బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అవడం కూడా జరిగిపోయింది. అలాగే ఆయా పార్టీల ఎంపీలు తమపై ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా బీజేపీ లేదా దాని మిత్రపక్షాలలో చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రజాస్వామ్యానికి మరింత చేటు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం న్యాయ సమీక్షలో నిలబడదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ చట్టం యూపీ మోడల్లో వచ్చిన బిల్లు అని కొందరు అభివర్ణిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రౌడీ శక్తులను అణచివేయడానికి ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్ల పద్దతిని అనధికారికంగా ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 30 నాటి సంచికలో సందీప్ రాయి, కృష్ణ చౌదరి అనే ఇద్దరు వ్యాసకర్తలు రాసిన ఆర్టికిల్ చదివితే యూపీలో భయానక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.2017లో యోగి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఈ ఎన్కౌంటర్లను కొన్ని సందర్భాలలో ప్రజలు కూడా స్వాగతించి ఉండవచ్చు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ఆయా కేసులలో నిందితుల ఇళ్లను కూల్చివేసేవారు. అలాంటి వాటిని సుప్రింకోర్టు కూడా తప్పు పట్టింది. ఇటీవలికాలంలో నిందితులుగా భావించేవారి ప్రాణం పోకుండా కాళ్లపైనో, ఇతర శరీర భాగాలపైన పోలీసులు తుపాకితో కాల్చుతున్నారట. దాంతో వారు ఏళ్ల తరబడి కదలలేని స్థితిలో పడిపోతున్నారు. వీటిని హాఫ్ ఎన్‌కౌంటర్లని పిలుస్తున్నారు. ఇలా గాయపడ్డవారిలో ఎందరు నిజంగా నేరం చేశారో, ఎందరు అమాయకులో ఎవరికి తెలియదు. ఈ వ్యాసంలో పలు ఉదాహరణలను కూడా వారు వివరించారు.యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత 289 మందిని ఎన్కౌంటర్లలో మరణించారట. క్రిమినల్స్‌గా పరిగణించిన 34వేలమందిలో సుమారు మూడోవంతు 11834 మంది హాఫ్ ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారట. వీరిలో పలువురు కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి జీవనోపాధి కూడా లేకుండా పోయిందట. నిజంగానే ఈ ఎన్కౌంటర్లు ఫలితాన్ని ఇస్తున్నాయా అంటే అదీ గ్యారంటీ లేదు. 2024లో 2823 మంది తీవ్రంగా గాయపడితే, 2025లో హాఫ్ ఎన్కౌంటర్లలో గాయపడ్డవారి సంఖ్య 3153 గా ఉందట. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఫలిస్తే ఇలాంటివి తగ్గాలి కాని, ఎలా పెరుగుతాయన్న ప్రశ్నకు బదులు దొరకదు. రాజకీయ వైరాలకు కూడా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో పోలీసులలో విచ్చలవిడితనం పెరిగి, వారి ఇష్టారాజ్యంగా ఎవరిపైన అయినా ఇలా దారుణంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పలేం.బీహారులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగంగా కాల్చి చంపడం పెద్ద వివాదం అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక బీజేపీ మిత్ర పక్షమైన తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన సంగతే. తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాన్ని అణచివేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసులను వాడుకోవడం సర్వసాధారణం అయిపోయిందన్న విమర్శ ఉంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సీఐ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీవారు దాడులు చేసినా, అరాచకాలు చేసినా వారిపై తూతూమంత్రంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై గంటల తరబడి పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసినా వారిపై సరైన కేసులే పెట్టలేదు. పైగా బాధితులపైనే కేసులు పెట్టడం ట్రెండ్‌గా చేసుకున్నారు.తాజాగా అమరావతి గ్రామాలలో కొందరు రైతుల కోరిక మేరకు వారి సమస్యలను చూడడానికి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అయినా పోలీసులు వైఎస్సార్సీపీవారిపై కేసులు పెట్టారు. ఇలా బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అధికార దుర్వినియోగం, ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్లు, లాకప్ డెత్‌లు సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లో ఏడాదిపాటు నిర్భందించే చట్టం వస్తే ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను కాపాడేదెవరు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్ 20 ఏళ్ల రాజకీయం.. సీఎం కుర్చీపై కొత్త సమరం!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్లు పూర్తి కావడం ఒక మైలురాయే. ఇందుకు ఆయనను అభినందించాలి. రాజకీయంగా జడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంత తేలిక కాదు. దానికి ఎంతో కష్టపడాలి. వ్యూహాత్మకంగా సాగాలి. ఆ విషయంలో రేవంత్‌ను మెచ్చుకోవచ్చు. అంతవరకు అభినందనలు.ఈ సందర్భంగా మిడ్జిల్ వద్ద జరిగిన సభలో రేవంత్ చేసిన ప్రసంగం గమనిస్తే ఏదో భయం ఆయనను వెన్నాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎంత పదవి వచ్చినా, దానిని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలా అన్నదానిపై కాస్త గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి వంటిదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రావణుడి వంటిదని ఆయన అనడంలోనే ఆ డౌటు వస్తుంది. ఆయన ఉద్దేశం తాను రాముడినని, విపక్ష నేత, మాజీ సీఎం చంద్రశేఖరరావును రావణుడని చెప్పడమే కదా!తాను ప్రభుత్వపరంగా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఘనంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలు ఏమిటో, వాటిని ఏ విధంగా నెరవేర్చుతున్నట్లో వివరించగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉండేది. రాష్ట్ర అప్పుల గురించి రెండున్నర ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎంతవరకు ప్రయోజనం? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సహా కొందరు మంత్రులు అప్పులపై బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరడం, చర్చలంటూ హడావుడి చేయడం, దానికి ప్రతిగా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే.తారక రామారావు, మాజీ మంత్రి హరీష్‌లు చర్చకు సిద్దం అంటూ ప్రతి సవాల్ చేయడం తదితర ఘట్టాలు చూస్తే ప్రభుత్వం ఏదో రకంగా అప్పుల పేరుతో ఇతర అంశాలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.మిడ్జిల్‌లో రేవంత్ కూడా అప్పుల ప్రస్తావన తెచ్చి కేటీఆర్, హరీష్‌రావులను పిల్ల రాక్షసులుగా అభివర్ణించారు. వారిని మీరు అన్నా, వారు మిమ్మల్ని అన్నా ఇదేదో మీ రెండు పార్టీలకే సంబందించిన అంశం కాదు. ఎన్నికలకు ముందు కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులపై తీవ్ర విమర్శలు చేశారు కదా! అయినా ఆచరణ సాధ్యం కాని అనేక వాగ్దానాలను పీసీపీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ప్రచారం చేశారు కదా! కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు కదా! పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారో గుర్తు చేసుకోండి.కేసీఆర్ గెలిస్తే పదివేలే రైతుకు వస్తుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే 15వేలు రూపాయలు వస్తాయని అన్నారా? లేదా? అప్పుడు అది సాధ్యమా? కాదా? అన్నది ఆలోచించలేదా? గతంలో అమెరికా టూర్లో రేవంత్ ఒక మాట అన్నారు. మోసపోయే ప్రజలు ఉన్నంతకాలం రాజకీయ నేతలుగా మోసం చేస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. ఆ మానిఫెస్టో చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది కదా! ఉదాహరణకు మహిళలకు ఒక్కొక్కరికి 2500రూపాయలు చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం గురించి ఇంతవరకు వివరణ ఇచ్చారా? లేదే! అలా అని అసలు ఏ హామీ అమలు కాలేదని చెప్పజాలం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూళ్లను కొన్నిచోట్ల ఏర్పాటు చేయడం వరకు బాగుంది. దానిని మెచ్చుకోవచ్చు. రైతులకు రుణమాఫీని కొంతమేర అమలుచేశారు. ఇటీవలి కాలంలో హామీల గురించి మాట్లాడడం కన్నా, బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుంది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అటువైపు మళ్లించాలన్న ఉద్దేశం కావచ్చు. కేటీఆర్, హరీష్‌రావులకు, అదే టైమ్‌లో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా కూడా కావచ్చు. అయితే విపక్షాలకన్నా ప్రభుత్వంలో ఉన్నవారికి అధిక బాధ్యత ఉంటుంది. వాగ్దానాల సంగతి ఎలా ఉన్నా, కొత్తగా మూసి పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ప్రజల మద్దతు పొందాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది కూడా తప్పు కాదు. కాకపోతే మూసికి సంబంధించి రెండున్నర టీఎంసీల మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. అలాగని కాలుష్య కాసారంగా ఉన్న మూసిని బాగు చేయవద్దని ఎవరూ చెప్పరు.అలాగే ఫ్యూచర్ సిటీ పేరుతో వేల కోట్లు వ్యయం చేయాలన్న ఆలోచనను కూడా ఒకటికి రెండుసార్లు సమీక్షించుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. మెట్రో రైలుకు సంబంధించిన రుణ భారాన్ని నెత్తిన వేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందా? లేదా? అన్నదానిపై చర్చ జరగాలి. రైతు భరోసా కింద రైతులకు డబ్బు వేసిన మాట నిజమే. కాని మానిఫెస్టోలో చెప్పినట్లు చేస్తున్నారా? లేదా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. విపక్షంగా బీఆర్ఎస్ ఆ ప్రశ్నను లేవనెత్తి రైతులకు రేవంత్ 28720 కోట్ల బకాయిపడ్డారని విమర్శిస్తున్నారు. వీటిపై తగురీతిలో జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. అయితే ఇలా ఇవ్వకపోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ పాలనవల్ల కలిగిన నష్టం, అప్పటి అప్పులే కారణమని చెప్పి తప్పించుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు.కేసీఆర్ పాలన, తన పాలనపై చర్చకు సిద్దమని రేవంత్ అంటున్నారు. అదేదో అసెంబ్లీ సమావేశాలలో పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఇక ఆయా సభలలో రేవంత్ చేస్తున్న ప్రకటనలు కొన్ని ఆశ్చర్యకరంగాను, ఆసక్తికరంగాను ఉంటున్నాయి. తాను గుంపుమేస్త్రీనని ఆయన ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తన గుంపేనని, ఈ గుంపే తన బలమని, ధైర్యమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారధి అన్నంతవరకు బాగానే ఉంటుంది కాని, గుంపు అనడమే అంత బాగున్నట్లు లేదు. గుంపు అంటే ఏదో మేకలు, గొర్రెల గుంపేమో అన్న భావన కలిగే అవకాశం ఉంది. దీనికి హరీష్ రావు జవాబిస్తూ ముంపు మేస్ల్రీ అని ఎద్దేవ చేశారు. రేవంత్ మంచి ఉద్దేశంతోనే గుంపు మేస్త్రీ అని చెప్పుకున్నా, ఆ పదం అంత బాగున్నట్లు అనిపించదు.మరో సభలో రేవంత్ మాట్లాడుతూ అధికారం కోసం అబద్దాలు చెప్పనని, ఏమి ఉంటే అదే చెబుతానని, చెప్పిందే చేస్తానని, ఇచ్చిన మాట నిలబట్టుకోవడమే తన రాజకీయ జీవితం అని రేవంత్ ప్రకటించారు. నిజంగా అలా చేయగలిగితే ఆయనను అభినందించవచ్చు. రేవంత్‌తో సహ రాజకీయ నేతలు అబద్దాలు ఆడుతున్నారా? లేదా? అన్నది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎన్నికల ముందు ఏమేమి చెప్పింది. వాటిని ఎలా ఆచరించి చూపింది, తద్వారా తాను సత్య సంధుడనని రుజువు చేసుకోగలిగితే ఆయనకు గొప్ప పేరు వస్తుంది. కాని తన రాజకీయ గురువు, ఏపీ ముఖ్యమంత్రి తరహాలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా? అన్నది చర్చనీయాంశం.ఏపీలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరు. తెలంగాణలో పరిస్థితులు వేరు. తెలంగాణలో దైర్యంగా ప్రశ్నించగలిగ ప్రజలు ఎక్కువ. ఏపీలో ప్రజలు ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడేలా రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏపీతో పోల్చితే రేవంత్ సర్కార్ మరీ ఘోరంగా పోలీసులను ప్రజలపై, ప్రశ్నంచేవారిపై ప్రయోగించడం లేదు. అంతవరకు ఓకే. కాని అబద్దాలు చెప్పను అన్న స్టేట్ మెంట్ మాత్రం కాస్త అతిగానే ఉందనిపిస్తుంది. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. సాద్యమైనంతవరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడుపతూ ప్రజలకు నిజాలు చెప్పడం వల్లే ఆయనకు మంచి పేరు వస్తుందని అనాల్సి ఉంటుంది. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్నందుకు రేవంత్‌కు మరోసారి అభినందనలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ప్రశ్న’కు పవన్ భయపడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది? సోషల్ మీడియాను అణచివేయాలన్న ఆలోచనతో టీడీపీ, జనసేన కూటమి నేతలు అనుసరిస్తున్న పద్దతులు ప్రమాదకరంగా మారుతున్నాయి. యూ ట్యూబర్ రావణ్ అనే ఆయనపై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టిన తీరు సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. నిజంగా ఆయన అలాంటి తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు.కాని ఒక ప్రసంగంలో ఏదో మాట్లాడాడని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన పదే, పదే నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఉద్దేశంతో కేసు పెట్టడం, ఆ వెంటనే అరెస్టు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, అవి అంతగా ఫలించకపోవడంతో ఏకంగా దేశద్రోహం కేసులో జైలుకు పంపించడం అంత సమంజసం అనిపించదు.రావణ్ చేసే వ్యాఖ్యలలో అభ్యంతరకర విషయాలు ఉంటే ఎవరూ సమర్ధించరు. కాని అదే టైమ్‌లో ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరించడం శోచనీయం. దళిత క్రైస్తవుల డిమాండ్లకు సంబంధించి ఏలూరులో జరిగిన సభలో ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆయా సందర్భాలలో చేసిన ఆవేశపూరిత ప్రకటనలను ఉటంకిస్తూ అదే తరహాలో మాట్లాడారు. పిఠాపురంలో జరిగిన ఒక కుల వివాదాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. అది పవన్‌కు కోపం తెప్పించి ఉండవచ్చు. ఆ వెంటనే జనసేన కార్యకర్తలను పురమాయించి కేసులు పెట్టించారు.రావణ్‌ను ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ కోర్టువారు బెయిల్ ఇవ్వగానే సర్పవరం, మచిలీపట్నం, నక్కపల్లి పోలీసులు అరెస్టు చేయడం సంబంధిత కోర్టులు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగాయి. పాయకరావు పేట నుంచి ఆయన బయల్దేరి వస్తుండగా, మళ్లీ పోలీసులు అరెస్టు చేసి ఈసారి కృష్ణా జిల్లా గన్నవరం తీసుకువచ్చారు. ఏకంగా దేశద్రోహం కేసుపెట్టారు. ఉగ్రవాదులపై పెట్టే సెక్షన్లు పెట్టారు. తద్వారా కోర్టు రిమాండ్ అంటే జైలుకు పంపించేలా చేశారు. ఈ ఘటనలన్నిటిని చూసినవారికి ఏమనిపిస్తుంది.రావణ్‌ను జైలులో ఎలాగైనా పెట్టాల్సిందేనని, పవన్ కళ్యాణ్, ఆయన పార్టీవారు కోరుకున్నారని, ఆ కక్ష తీర్చుకోవడానికి, అహం చల్లబరచుకోవడానికి ఇలా చేశారని అనిపించదా? మొదటే దేశద్రోహం కేసు పెట్ట లేదు. ఐదు రోజుల పాటు నిద్రహారాలు సరిగా లేకుండా అతనిని తిప్పిన తీరు కూడా దారుణంగా ఉంది. ఇక్కడ చిత్రమేమిటంటే శాంతిభద్రతల గురించి, దాడుల గురించి పదే పదే సుద్దులు చెప్పి ప్రభుత్వ పెద్దలు ఈ పోలీస్ స్టేషన్ల వద్ద జరిగిన గొడవను మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. జనసేన కార్యకర్తలు ఆయా స్టేషన్ల వద్ద నానా రచ్చ చేశారు.కొన్నిచోట్ల పోలీసులను కింద పడేశారు. గోడలు దూకి స్టేషన్లోకి వెళ్లి రావణ్‌ను కొట్టడానికి యత్నించారు. మరి ఇవేవి తప్పు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? వారిపై ఏమైనా కేసులు పెట్టారా? పెట్టి ఉంటే అవి ఏ తరహావో చెప్పాలి కదా!ఒక్కరినైనా ఎందుకు అరెస్టు చేయలేదు? అంటే టీడీపీ, జనసేనలకు చెందినవారు ఎలాంటి రౌడీయిజం చేసినా, అరాచకాలకు పాల్పడినా పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి లేదని చెప్పదలిచారా? గత కొన్నాళ్లుగా దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ సహనం, సంయమనం లేకుండా కక్ష కట్టి ఒక యూట్యూబర్ పై ఈ రకమైన కేసులు పెట్టించడం పిచుకపై బ్రహ్మాస్త్రం వేసినట్లు అనిపించదా?ఈయన చేసిన విధంగా గతంలో పవన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదా అంటే పలుమార్లు ఆ తరహాలో మాట్లాడిన వీడియోలు అనేకం కనిపిస్తాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన తాను నక్సలైట్ అవ్వాలనుకున్నానని, తుపాకి పట్టుకోవడం గురంచి మాట్లాడారు. బీజేపీతో కలిసి లేనప్పుడు యుద్ధాల గురించి ఆయన ఏమి మాట్లాడారో కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. రావణ్ ఒక స్పీచ్‌లో ఏదేదో మాట్లాడారని, దానితో దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు చేసినట్లు, వివిధ వర్గాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు.నిజానికి మతపరమైన, కులపరమైన విద్వేష వ్యాఖ్యలు చేసిన కొందరు నేతలు ప్రస్తుతం కూటమిలో ప్రముఖులుగా ఉన్నారు. అవన్ని ఎందుకు!ఒకప్పుడు టీడీపీ వారు దేశ ప్రధానిని ఎంతలేసి మాటలు అన్నారో అందరికి తెలుసు కదా! అవేవి తప్పుకాదా?వారికి ఏమీ కాలేదే! వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రావణ్ అప్పటి ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగానే విమర్శించేవారు. అయినా అప్పుడు కేసులు రాలేదు. రావణ్‌పై ఇంత తీవ్రమైన కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని వైఎస్ జగన్ ఖండించారు.రావణ్‌కు మద్దతుగా జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ఆయా కోర్టులలో వాదనలు చేశారు. దేశ ద్రోహం కేసు పెట్టడానికిగాను వీడియోలను మార్ఫింగ్ చేశారని రావణ్ భార్య అనూష ఆరోపించారు. ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే తమ కుటుంబాన్ని చంపేయండని ఆమె ఆవేదనతో వ్యాఖ్యానించారు. రావణ్ నిజంగా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? లేదా? అన్నది పోలీసులు ఎలా నిర్థారించుకున్నారో తెలియదు. జనసేన స్థానిక నాయకుడు ఒకరు కేసుపెట్టడం, వెంటనే పోలీసులు రంగంలో దిగిపోవడం జరిగింది.పోలీసులు అనుసరిస్తున్న తీరు మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట తెస్తుంది. అధికారంలో ఉన్నవారు చెప్పినా అది నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా? అన్నది తేల్చుకుని ఆ తర్వాత కేసు పెడితే బాగుంటుంది. రావణ్ అరెస్టు వల్ల ఆయనకు జరిగిన నష్టం ఎంతో చెప్పలేం కాని, పవన్ కళ్యాణ్ కైతే నైతికంగా చాలా అప్రతిష్ట వచ్చే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం ఉంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా పన్నిన ట్రాప్ లో పవన్ పడి, ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన ఆయన, తన ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరో ఘటనలో కూడా పవన్‌కు నష్టమే జరిగింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆయన తప్పు చేసిన పోలీసు అధికారికి మద్దతు ఇచ్చిన తీరు తీవ్ర విమర్శలకు గురైది. సాయికృష్ణను రౌడీషీటర్ అని, పోక్సో కేసులో నిందితుడని, క్రిమినల్ అని పవన్ చెప్పడాన్ని ప్రజాస్వామికవాదులు ఆక్షేపిస్తున్నారు. ఎవరినైనా చంపే హక్కు పోలీసులకు ఉందని పవన్ భావిస్తున్నారా? అది ఏ రకంగా చట్ట సమ్మతం అని ప్రశ్నిస్తున్నారు.పవన్ వ్యాఖ్యలను సాయికృష్ణ తల్లి తీవ్రంగా ఖండించారు. తన కుమారుడిపై ఫోక్సో కేసును కోర్టు కొట్టివేసిందని, ఆ యువతి కూడా అలాంటిది జరగలేదని చెప్పినా ఇలా మాట్లాడడం న్యాయమా అని ఆమె అడిగింది. సాయికృష్ణ కూడా పవన్ అభమాని అని, తామంతా ఆయనకే ఓట్లు వేశామని, కాపులు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు ఇలా అంటున్నారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కాని, జనసేన పార్టీ కాని జవాబు ఇవ్వలేకపోయారు.ఈ రెండు ఘటనలలో టీడీపీ వ్యూహాత్మకంగా చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తూ పవన్‌ను వివాదంలో దించిందా అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. క్రాంతికుమార్ అనే యువకుడు కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకోలేదు. క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ వెళ్లాకే కదలిక వచ్చింది. విశేషం ఏమిటంటే క్రాంతి తండ్రి టీడీపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి. అయినా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.తెలంగాణకు చెందిన జర్నలిస్టు కేవీఆర్‌ను కూడా కక్ష పూరితంగా అరెస్టు చేసి, ఎక్కడో మారుమూల ఉన్న బొబ్బిలి జైలులో పెట్టారు. అది చాలదన్నట్లుగా తమకు విధులకు అడ్డుపడ్డారని చెప్పిన ఆయన భార్యపై కూడా కేసు పెట్టారు. తన పట్ల ఏపీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆమె కేసు పెట్టడంతో పోటీగా ఈ కేసు పెట్టారనుకోవాలి. జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లపై దాడి చేసినా కేసులు లేవు. ఇవన్ని చూస్తుంటే ఏపీలో సోషల్ మీడియాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాపై సుమారు 1400 కేసులు పెట్టి దేశంలోనే ఒక రికార్డు సృష్టించుకుంది. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు దిగితే చంద్రబాబు ప్రభుత్వం మరింత అప్రతిష్టపాలవుతుందని చెప్పక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్‌గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు, రేవంత్‌లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్‌ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్‌ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్‌ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్‌కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్‌కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ కళ్యాణ్‌కు ఆ రూల్ వర్తించదా?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వాక్ స్వాతంత్రం గురించి, పరిమితుల గురించి మంచి ప్రసంగమే చేశారు. అది ఆహ్వానించదగిందే. కాకపోతే అదే సమయంలో పవర్లో ఉన్నవారికి కూడా అపరిమితమైన అధికారాలు ఏమీ ఉండవు అన్న సంగతి కూడా చెప్పి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఒక అర్థం, పరమార్థం కలిగేది. సోషల్ మీడియాలోనే కాదు.. ఏ మీడియాలో అయినా అసభ్యతకు తావు లేదు. అలాగే రాజకీయ నేతల ప్రకటనలలో కూడా అసత్యాలు, అభ్యంతరకర పదజాలం ఉండకూడదు. ఎవరైనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఇది ఏపీ ప్రజలను, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని బెదిరించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. చెప్పేటందుకే నీతులు అన్నట్లు నేతలు వ్యవహరించరాదు. పవన్ కళ్యాణ్ తనకు లేని అధికారాలను తీసుకుని సోషల్ మీడియాపై దాడి చేయబోతున్న సంకేతాలు ఇవ్వడం కూడా ప్రజాస్వామ్యబద్దం కాదు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ఒక ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆయన అంటున్నారు. ఆధారసహితంగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. ఇది ప్రభుత్వపరంగా చేస్తున్నారా? లేక పార్టీపరంగా చేస్తున్నారా? ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఈ పవర్ ఉంటుందా.మిగిలిన మంత్రులకు కూడా ఉంటుందా? మరి హోం మంత్రి బాధ్యత ఏమిటి? ముఖ్యమంత్రి ఏమి చేస్తారు? ఇలాంటివి ఏ మంత్రి అయినా ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఒక జీఓ ఇవ్వవలసిన అవసరం లేదా! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు అనుమతించారా? ఇప్పటికే ఇలాంటి విభాగాలు పోలీసు శాఖలో ఉన్నాయి. సైబర్ క్రైమ్‌కు ప్రత్యేక శాఖ ఉంది. అయినా ఫర్వాలేదు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్దితో ఈ ప్రయత్నం చేస్తే స్వాగతించవచ్చు. కాని ఆయన చెబుతున్నదానికి, ఆచరిస్తున్నదానికి చాలా తేడా ఉంటున్నది. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలనో, సోషల్ మీడియావారినో భయపెట్టే యత్నంగా కాకుండా, జనసేన, టీడీపీలతో సహా ఏ పార్టీవారు, లేదా ఏ యూట్యూబర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పగలిగి ఉంటే దానికి ఒక విశ్వసనీయత వచ్చేది.పవన్ కళ్యాణ్ ఇచ్చిన వీడియో ప్రసంగం చూశాక ఒక మాట అనిపిపిస్తుంది. నిజంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనుభవించినంత స్వేచ్ఛ మరెవరికి దక్కలేదేమో అన్న భావన ఎవరికైనా కలగవచ్చు. పవన్ ఇప్పుడు చెబుతున్న సూక్తి ముక్కావళిని పరిగణనలోకి తీసుకుంటే, ఆ రోజుల్లో ఆయన చేసిన విన్యాసాలన్నిటిని ప్రజలు గుర్తు చేసుకుని, అధికారంలోకి వస్తే మాత్రం ఇలా ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూస్తారా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ప్రస్తావించి ప్రశ్నించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేయడం మంచిదే. తమ నిర్ణయాలతో విబేదించే హక్కు కూడా ఉందని ఆయన గుర్తించడం బాగానే ఉంది. కాని ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను అవమానించడం, హింసను ప్రేరేపించడం స్వేచ్ఛ కిందకు రావని ఆయన అన్నారు. దీనిని ఎవరైనా అంగీకరిస్తారు. ఇదే సందర్భంలో పవన్‌కు పౌరులు పలు ప్రశ్నలు సందిస్తున్నారు. ఓ వారం, పది రోజుల క్రితమే కదా! వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ, తొక్కి నార తీస్తా అని పవన్ అన్నారు! మరి అవి వాక్ స్వాతంత్రం పరిధిలోకి వస్తాయా? రావా? అన్నదానిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా అని అడుగుతున్నారు.తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు చంద్రబాబుకాని, పవన్ కాని ఎన్నడైనా చింతిస్తున్నట్లు ప్రకటన చేశారా? మరి అది వాక్ స్వాతంత్రం కిందే వస్తుందా? అధికారంలో ఉంటే ఏమి మాట్లాడినా, ఏమి చేసినా చెల్లుతుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజి ఒక ఫ్రొఫెసర్‌ను ఉద్దేశించి ఎంత నీచమైన భాషను వాడినప్పుడు పవన్ కళ్యాణ్ మందలించి ఉండాల్సిందే. ఈ మద్యనే జగన్‌ను కూడా దూషించితే, పవన్ పరోక్షంగా సమర్థించినట్లు మాట్లాడారే. మహిళలను ఎవరైనా గౌరవించవలసిందే. అందులో రాజీ లేదు. కాని అదేదో ఒక పార్టీకి సంబంధించినంతవరకే కాదు కదా! మాజీ సీఎం జగన్ కుటుంబాన్ని, అలాగే వైఎస్సార్సీపీ మహిళా నేతలు పలువురిని దూషిస్తూ టీడీపీ, జనసేనలకు చెందిన వారు పోస్టులు పెడుతుంటే పవన్ వారించి ఉంటే, ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా ఆయనకు నైతికంగా మద్దతు వచ్చేది.ఫ్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి అభ్యంతరకర భాషణ చేయకపోయినా ఆయనపైన, మరికొందరిపైన కేసు పెట్టిన జనసేన కార్యకర్తలను మందలించి ఉంటే పవన్ చెప్పే మాటలకు విలువ ఉండేది. విపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎన్నిరకాల దూషణలు చేసింది సోషల్ మీడియాలో వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి కదా! వాటిని గుర్తు చేస్తున్న యూట్యూబర్లను అరెస్టు చేస్తున్నారే. వారిపై జనసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారే! కక్ష కట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ రోజుల తరబడి తిప్పుతున్నారే! చంద్రబాబు పదే, పదే వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని ప్రచారం చేయడాన్ని పవన్ సమర్థిస్తారా?హింసకు తావు లేదని అన్నారు. అది నిజమే. కాని వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు, అమరావతికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లరాదని చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు అంటున్నప్పుడు, టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడినప్పుడు అది రాజ్యాంగ విరుద్దం అని పవన్ కళ్యాణ్ మాట మాత్రం అనలేకపోయారే! విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జనసేనకు చెందిన కొందరు అప్పటి మంత్రి రోజాపై పూలకుండీలతో దాడులు చేశారు. అప్పుడు ఎవరి పక్షాన పవన్ నిలబడింది అందరికి తెలిసిందే కదా! రోజాపై తీవ్రమైన అసభ్య భాష వాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని అభినందించకుండా, మందలించి ఉంటే పవన్ నిబద్దతగా ఉన్నారని అంతా ఒప్పుకునే వారు కదా! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాదితురాలికి కనీస సానుభూతి తెలిపి ఉంటే మహిళలకు పవన్‌పై ఒక నమ్మకం ఏర్పడేది కదా! జనసేన నేత ఒకరు నడిరోడ్డుపై పోలీసుల లాఠీ తీసుకుని ఆ మహిళను కొట్టినప్పుడు అది అరాచకం అని ఖండించి, చర్య తీసుకుని ఉంటే పవన్ ఇప్పుడు ఏమి చెప్పినా జనం అంతా అర్థం చేసుకునేవారు కదా! సుగాలి ప్రీతి తల్లిని జనసేన కార్యకర్తలు దూషిస్తున్న తీరుపై చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంపై పవన్ స్పందించాలి కదా.30వేల మంది మహిళలు మిస్ అయ్యారని అంటూ వలంటీర్లపై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు చూపి ఉండాల్సిందే! రాష్ట్ర అప్పులపై పది నుంచి 14 లక్షల కోట్ల అప్పు అంటూ చేసిన అసత్య ప్రచారం గురించి ఏమంటారు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయే! అయినా అప్పట్లో ఆయనపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టలేదు. ఆ రకంగా స్వేచ్ఛగా ఏది పడితే అది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడేవారు.నేరాలకు కులం లేదని చెబుతున్నప్పుడు అదే సూత్రం పోలీసు అధికారులు చేసే నేరాలకు కూడా వర్తిస్తుందన్న సంగతి మర్చిపోకూడదు. వారు చేసే అకృత్యాలకు మద్దతు ఇచ్చేలా అధికారంలో ఉన్నవారు మాట్లాడడం ఏ రకంగా రాజ్యాంగబద్దమో తెలియదు. రాజ్యాంగంలోని అధికరణాలతో పాటు తాను గత పదేళ్లుగా ఎలా పాటిస్తున్నది, ఇకపై ఎలా ఉండబోతున్నది చెప్పి ఉంటే సరైన పద్దతి అనిపించేదేమో! పోనీ ఇంతవరకు జరిగిన వాటిలో పొరపాట్లు ఉంటే చింతిస్తున్నానని చెబుతూ, ఇకపై తన వైపు నుంచి ఎలాంటి తప్పులు జరగవని, అధికారాన్ని దుర్వినియోగం చేయనని, తప్పుడు కేసులు ప్రభుత్వం పెట్టినా ఒప్పుకోనని చెప్పి ఉంటే పవన్‌ను గ్రేట్ అని అంతా అని ఉండేవారు కదా!ఒక వైపు కీలక మంత్రి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అరాచాకాలు సాగుతుంటే, వాటి గురించి ఒక్క మాట చెప్పడం లేదు. మరోవైపు ఆయనకు పోటీగా సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతానని పవన్ బెదిరిస్తున్నారు. స్థూలంగా చూస్తే పవన్ కళ్యాణ్ పౌరుల హక్కులను రక్షిస్తానని చెబుతున్నారా? లేక ఏదో సాకుతో వారిని భయపెడుతున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతికి అసలు ఎవరు రమ్మన్నారు?
అమరావతికి వాళ్లను ఎవరు వెళ్లమన్నారు? వారు కుట్రలు చేస్తున్నారు.. అందుకే రైతులు తిరగబడ్డారు.. ఇది వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. అంటే దీని అర్థం రైతుల ముసుగులో టీడీపీ వారు దాడి చేసినట్లు అంగీకరించినట్లే అవుతుందా? లేదా?..'మేమే రమ్మన్నాం.. ప్రభుత్వం తమను వేధిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు తెలియచేస్తే ఆయన ఒక కమిటీని వేశారు. వాస్తవ పరిస్థితులను గమనించడానికి తమ కోరిక మేరకు ఆ వైఎస్సార్సీపీ కమిటీ నేతలు వస్తుంటే టీడీపీ వారు అడ్డుకుని రభస సృష్టించారు. ఇది దారుణంగా ఉంది..' అని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు కొందరు ఇచ్చిన జవాబు.'అమరావతి ఏమైనా పాకిస్తానా? తాము ఎందుకు వెళ్లకూడదు..' అని మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, ఇతరత్రా ఆలోచనపరుల ప్రశ్న.'వైఎస్సార్సీపీ నేతలను తరిమిన రాజధాని రైతులు.. ఇది ఎల్లో మీడియాగా పేరొందిన తెలుగుదేశం పత్రిక ఈనాడు' పేపర్లో పెట్టిన హెడ్డింగ్.. ఇది మెయిన్ పేజీలో వచ్చిన శీర్షిక అయితే జిల్లా పత్రికలో మరో కథనం ఇచ్చారు. దానికి 'ఈసడించినోళ్లను ఈడ్చి కొట్టారు' అన్న శీర్షికను పెట్టి మరో స్టోరీ రాశారు. అందులో ఏమి రాశారో తెలుసా!.. శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ, కోడిగుడ్లు విసురుతూ తీవ్ర పరాభవం చేశారు అని ఈనాడులో పేర్కొన్నారు. అదే టైమ్‌లో 'రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి' అని ఈనాడు మొదటి పేజీలో అందుకు విరుద్ధంగా తెలిపారు.'వైఎస్సార్‌సీపీవారిని గంట సేపు అడ్డగించారని, రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ చేష్టలు' అని కూడా రాశారు. అంటే దీని అర్దం ఎక్కడా వైఎస్సార్‌సీపీవారు దాడులు చేయలేదని పరోక్షంగా తెలియచేసినట్లే కదా! అక్కడ అరాచకం చేసింది టీడీపీ గూండాలని తెలుసు.. ప్రశాంతంగా తమ దారిన తాము వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నది వారేనని తెలుసు. అయినా తెలుగుదేశంపై విధేయతతో అడ్డగోలు కథనాలు రాశారు. మరో టీడీపీ మీడియా అయితే 'మళ్లీ అమరావతి వైపు వైఎస్సార్సీపీ వాళ్లు కన్నెత్తి చూడకుండా చేయాలని' వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ప్లేట్ మార్చి 'వైఎస్సార్సీపీ నేతలే అమరావతిపై దండయాత్ర చేశారని' పచ్చి అబద్దాన్ని ప్రచారం చేసిది. దీనిని బట్టి ఎంత నిస్సిగ్గుగా ఈ ఎల్లో మీడియా పనిచేస్తున్నది అర్థం చేసుకోవచ్చు.ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిపై రాయి విసిరిన వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా పోలీసులు మాత్రం అతని పేరు కేసులో చేర్చలేదట. కొద్ది రోజుల క్రితం కీలక మంత్రి లోకేష్ ప్రకటించినట్లు టీడీపీ కార్యకర్తలు తప్పులు చేసినా కేసులు పెడితే ఊరుకోనని, అవసరమైతే డీజీపీని పంపిస్తానని బెదిరించిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతుంది.అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విపక్షానికి చెందిన రాజకీయ పార్టీని అమరావతి ప్రాంతానికి వెళ్లరాదని అనడం సరైనదేనా? అంటే అమరావతిలో జరగకూడనివి జరుగుతున్నాయని అంగీకరించినట్లే కదా అని పెనుమాక రైతు ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా ఈ నాలుగైదు గ్రామాల రైతుల పట్ల ప్రభుత్వం ఇంత క్రూరంగా ప్రవర్తించడం దారుణంగా ఉంది. వారు రాజధానిలో రోడ్డుకు అవసరమైన భూమి ఇచ్చినా, వారికి ఉన్న భూములు మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టి భయపెడుతోంది. వారు తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. సమస్యలను తెలుసుకోవలసిన ప్రభుత్వ పెద్దలే తమ పొలాలలో తాము పనిచేసుకోనివ్వకుండా రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని రైతులు వాపోతున్నారు.వీరి పొలాల్లో మట్టి తవ్వుకుని టీడీపీ మాఫియా గాంగ్ అమ్ముకుందట. ఆ పొలాలను చెరువుల మాదిరి కొందరు అధికారులు పాడు చేశారు. ఆరుగాలం కష్టపడే రైతులను రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారు. వేధిస్తున్నారు. అయినా రైతులు తమ పోరాటం కొనసాగించడం టీడీపీ ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.కొద్ది రోజుల క్రితం జగన్‌ను కలిసిన రైతులు ఆయన సామాజికవర్గానికి చెందినవారని ఒక ఎల్లో మీడియా పత్రిక రాసింది. ఇప్పుడు ఆ కారణంతోనే రైతులను ఇలా హింసిస్తున్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. నిజానికి ఆ గ్రామాలలో అన్ని సామాజికవర్గాల రైతులు ఈ భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైన భూమి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఒక ఎత్తు అయితే, వైఎస్సార్సీపీ నేతలు వారితో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు ఉండవల్లి వద్ద ప్లాన్ ప్రకారం అడ్డుకుని టీడీపీ గూండాలు నానా గందరగోళం సృష్టించడం మరో ఎత్తుగా ఉంది. పైగా దాడులు చేసినవారిపై కాకుండా, బాధితులపైన కేసులు పెట్టడం ఈ ప్రభుత్వం ఒక ట్రెండ్ గా మార్చింది.చంద్రబాబు సర్కార్ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు తెరదీయడం అత్యంత శోచనీయం. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా పాటించే ప్రమాదం ఉంటుందన్న సంగతిని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ విస్మరిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణలో ఒక సభ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అనుమతి కోరితే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాకుండా, మరో రోజు పెట్టుకోవచ్చని ఆ ప్రభుత్వం చెబితే ఇదేమైనా మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబు సైతం మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రశ్నను వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమరావతి రాజధాని గ్రామాలకు ఎందుకు వెళ్లకూడదని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లి, ఎవరిని రెచ్చగొట్టినా అప్పటి ప్రభుత్వం ఏమీ మాట్లాడకూడదనేవారు. అనపర్తికి ఆయన ఒకసారి వెళ్లినప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తోందని, టూర్ వద్దని పోలీసులు చెబితే ఆయన ఒప్పుకోకుండా కాలి నడకన వెళతానని అంటూ పట్టుబట్టి వెళ్లారు. అయినా పోలీసులు ఆయనపై కేసు పెట్టకుండా రక్షణ కల్పించారు. పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్న పరిస్థితిలో పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఆయన టూర్ చేశారు.గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కొందరు తెలంగాణవాదులు అడ్డుకోవడానికి యత్నించేవారు. అప్పట్లో మంద కృష్ణ మాదిగ తన అనుచరులతో యాత్రకు సహకరించారు. అయినా కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వరంగల్ జిల్లాలో ఒకసారి తెలంగాణవాదులు గట్టిగా అడ్డుపడితే అప్పట్లో పవర్‌ఫుల్‌గా ఉన్న ఒక టీడీపీ నేత తన మనుషులతో వారిపై దాడి చేయించారు. వారిని ఉరికించి కొట్టామని ఆయనే స్వయంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లవచ్చు కాని, తను అధికారంలో ఉంటే మాత్రం విపక్షం ఎక్కడకు కదలకూడదా అన్న ప్రశ్న వస్తుంది.గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిని గేటెడ్ కమ్యూనిటిగా మార్చుతున్నారని విమర్శించేవారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు సరసన చేరి మద్దతు ఇస్తుండవచ్చు. కాని ఆయన చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ మాట ప్రస్తుతం నిజం అవుతుందేమో అన్న సందేహం వస్తోంది. అమరావతిలో ఎలాంటి తప్పులు జరగకపోతే, వేల కోట్ల అప్పులు తెచ్చి జరుపుతున్న నిర్మాణాలలో అవినీతి లేకపోతే, రైతులంతా స్వచ్చందంగా భూములు ఇస్తున్నట్లయితే వైఎస్సార్సీపీ నేతల పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమి ఉంటుంది.అమరావతిలో ఒక భయానక వాతావరణం సృష్టించి ఎవరూ అందులోని లోటుపాట్లను ఎత్తి చూపరాదన్న లక్ష్యమా? లేక సాయికృష్ణ లాకప్ డెత్ కేసును డైవర్ట్ చేయడానికి దీనిని వాడుకున్నారా అన్నది తెలియదు. చిత్రం ఏమిటంటే దాడులకు గురైన వైఎస్సార్సీపీ నేతలపై ఎస్సీ.ఎస్టీ చట్టం కింద కూడా ఒక మహిళతో ఫిర్యాదు చేయించడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయాయట. దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీవారిపై మాత్రం నామమాత్రపు కేసులు పెట్టారట. దీనిని బట్టి ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అరాచకంగా మారింది అర్థం అవుతోంది కదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెర వెనుక అసలు కథ ఇదన్నమాట!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసే వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిపై ఎవరైనా పీహెచ్డీ చేస్తే కచ్చితంగా డాక్టరేట్ వస్తుందేమో! కొందరు విశ్లేషకులు చంద్రబాబువి వ్యూహాలు అంటారు.. మరికొందరు కుట్రలు అంటారు. ఆ వ్యూహాలలో ఎటు తిరిగి తనకే రాజకీయ ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతుంటారు. ఆయనకు బాండ్ బాజా వాయించే ఎల్లో మీడియా ఎటూ ఉంటుంది. సాయికృష్ణ కుటుంబాన్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఆడిన గేమ్ కాని, తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు కాని గమనిస్తే ఈ విషయం అర్దం అవుతుంది.అలాగే ఈ ఉదంతంలో చర్చ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నడిచేలా కథ ఎలా సాగించారో విశ్లేషించడం కూడా ఆసక్తికరమే. సాయికృష్ణ కేసులో సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టును కొన్ని రోజుల పాటు జాప్యం చేయడం, దర్యాప్తులో కీలకమైన అంశాలు రాకుండా జాగ్రత్తపడడం కనిపిస్తుంది. అన్నిటిని మించి నాగరాజుతో ప్రభుత్వ పెద్దలు ఒక డీల్ కుదుర్చుకుని కూటమి పెద్దల పేర్లు, పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు బయటకు రాకుండా చూడడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరిగాయని వైఎస్సార్సీపీ ఆరోపించింది. న్యాయం అన్నది అధికారం, పలుకుబడిని పట్టి ఉంటుందని కూటమి ప్రభుత్వం పలుమార్లు రుజువు చేస్తున్నట్లు అనిపిస్తుంది.కాపు యువకుడు సాయికృష్ణ పోలీసుల హింస కారణంగా మరణించిన ఘటనలో చంద్రబాబు తెలివిగా చర్చను ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు తిప్పారనిపిస్తుంది. అదేదో జనసేనకు, వైఎస్సార్సీపీకి మధ్య వివాదం అన్నట్లుగా ప్రచారం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది. ఆ సంగతి అర్థం అవుతున్నా, పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా ఆ ట్రాప్‌లో నుంచి బయటపడలేకపోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసు అన్నది నిజానికి కులానికి సంబంధించిన సమస్య కాదు. ఏపీలో జరుగుతున్న పోలీసుల రాక్షస కృత్యాలకు, చట్టాలు, రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా సాగుతున్న రెడ్‌బుక్ అరాచకాలకు సంబంధించిన అంశం. మానవహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ప్రజలలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత. వీటన్నిటిని కప్పిపుచ్చి రాజకీయ కోణంలో కేసును మలుపు తిప్పి పవన్ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కథ నడపాలని చంద్రబాబు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఈ ప్రక్రియలో రాజకీయ లబ్ది జరిగితే తనకు, అప్రతిష్ట వస్తే అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లేలా వ్యూహాం పన్నారా అన్న అభిప్రాయాన్ని కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగితే పవన్ కళ్యాణ్ ఒక బకరా అయ్యే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, వారు కొందరు కాపు నేతలను ఆశ్రయించడం తదితర అంశాల వల్ల, కులం కోణం కూడా సహజంగానే వస్తుంది. అది ఎవరూ కాదనలేని సత్యం.విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కుల రాజకీయాలే కాదు.. మత రాజకీయాలు కూడా చేసి ప్రజలను ఎంత రెచ్చగొట్టాలో అంతా చేశారన్నది నిర్వివాదాంశం. సాయికృష్ణ కేసులో తప్పని స్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేయవలసివచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ కేసులో సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని వచ్చి హింసకు శ్రీకారం చుట్టారు. దానిని నాగరాజు కొనసాగించారన్నది అభియోగం.ఆ టాస్క్ ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధీనంలో ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర పెద్దలకు సన్నిహితుడన్న పేరు ఉంది. ఆయనను కాపాడుకోకపోతే, ఆ కేసు ఆ పై అధికారులు, తదుపరి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. దాంతో సీఐ నాగరాజును పూర్తిగా మేనేజ్ చేసిన తర్వాతే, సిసిటీవీ ఫుటేజి మాయం అయ్యాకే కేసును ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసి ఉంటారన్నది జై భీమ్ అధ్యక్షులు జడ శ్రవణ్ తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల అభిప్రాయంగా ఉంది. అందులో వాస్తవం ఉండే అవకాశం కనిపిస్తుంది.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ప్రస్తావన లేకుండా, మానవ హక్కుల కోణంలో సాయి కుటుంబాన్ని పరామర్శించినా తొలుత విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేయించారు. అయినా పరిస్థితి చేయి జారిపోతోందని భయపడి స్వయంగా చంద్రబాబే కుటుంబాన్ని తనవద్దకు పిలిపించుకుని రాయబారం చేశారు. అక్కడ ఏమి జరిగిందో కాని ఆ కుటుంబం స్వరం మార్చేసింది. ఇది ఒక కోణం అయితే క్యాబినెట్ సమావేశంలో యధాప్రకారం క్రిమినల్స్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా రాసింది. అది నిజమే అయితే, ఆ క్రిమినల్ కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించారు? విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆ కుటుంబంతో ఎందుకు మాట్లాడి ఓదార్పు మాటలు చెప్పారు. జనసేన నేత ఒకరు డబ్బు ఆఫర్ ఎందుకు ఇచ్చారు? ఇవేవి ప్రస్తావనకు రాకుండా చంద్రబాబు మాట్లాడతారు. ఇది ఇలా ఉంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ తలాతోక లేకుండా వైఎస్సార్‌సీపీవారిని దూషించి రెచ్చగొట్టడం చంద్రబాబు ప్లాన్‌లో భాగమేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం.రౌడీ షీటర్ చనిపోతే ఏమిటన్నట్లు పవన్ మాట్లాడడం ఎంత దారుణంగా ఉంది. అతను కాపు కులం వాడైతే మాత్రం అని ఆయన భావిస్తున్న తీరు పద్ధతిగా ఉందా? సీఐ నాగరాజు లేదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక వ్యక్తి చచ్చేలా హింసించడం నేరం కాదని చట్టబద్దమైన పదవులలో ఉన్న చంద్రబాబు, పవన్‌లు చెప్పదలిచారా? లేక సాయికృష్ణ పేదవాడు కనుక, అతనికి అండ లేదు కనుక, కేవలం జనసేనలో ఒక సామాన్య కార్యకర్త కనుక పట్టించుకోనవసరం లేదనుకున్నారా! అదే సీఐ కూడా కాపు వ్యక్తి అయినా, బాగా డబ్బు ఉన్న వ్యక్తి అవడం, అతని మేనమామ ఒక మాజీ డీజీపీ కావడం వల్ల అతనికి పవన్ అండగా నిలబడుతున్నారా అన్న విమర్శ రాదా? సాయిపై కేసులు ఉంటే, మరి పోలీసులకు హత్యలు చేసే అధికారం ఉండదు కదా! అంటే వారు కూడా నేరం చేసినట్లే అవుతుంది కదా! ఆ ప్రస్తావన ఎందుకు క్యాబినెట్లో రాలేదు. తాను ఎందుకు సాయి కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడింది చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?బాధిత సాయి కుటుంబంతో రాజీచేసుకుని, కేసులో నిందితుడుగా ఉన్న నాగరాజుతో కూడా డీల్ కుదుర్చుకోవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందేమో! పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే స్పందించరేమిటని, కుల రాజకీయాలను తిప్పి కొట్టాలి కదా అని ఆయన అన్నారట. వైఎస్సార్సీపీ పవన్ కళ్యాణ్‌పై తొలుత ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు పైన, పోలీసు అధికారులపైన ఆరోపణలు చేసింది. దానికి జవాబుగా రౌడీలకు మద్దతు ఇస్తారా అని ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా రౌడీ కుటుంబంతో భేటీ అయ్యారు. దానిని ప్రస్తావంచకుండా పవన్ కళ్యాణ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.కాకినాడలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్‌సీపీవారిని ఉద్దేశించి గూండాలు, రౌడీలు అంటూ అనుచితంగా మాట్లాడారు. దానికి జవాబుగా టీడీపీ, జనసేనలలో ఉన్న రౌడీలు, గూండాల గురించి వివరాలను వైఎస్సార్సీపీ బయటపెట్టింది. టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 115 మంది అట. అందులో తీవ్రమైన అభియోగాలు ఉన్నవారి సంఖ్య 82. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే పది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఏడుగురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను దాచేసి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలన్నది చంద్రబాబు లక్ష్యం. కాని సోషల్ మీడియాలో అన్ని వివరాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాలపై మాత్రం టీడీపీ, జనసేనలు నోరు పెగల్చవు.ఈ కేసులో పవన్‌ను ఇరికించాలని జగన్ తన పార్టీ నేతలతో అన్నారని ఒక ఊహాగానాన్ని సృష్టించి దుష్ప్రచారం చేసిది. నిజానికి పవన్ పద్దతిగా వ్యవహరించకుండా చేసింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఒకప్పుడు పోలీసులు ఎలా నిందితులను కొడతారంటూ ప్రశ్నలు వేసిన పవన్‌తోనే, లాకప్ డెత్‌లకు బాధ్యులైన పోలీసులకు మద్దతుగా మాట్లాడించి ఆయన పరువు తీశారు. ఇక నాగరాజుపై అన్ని ఆరోపణలు వస్తే కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారంటూ 'నాగరాజుకు జేజేలు' అన్న హెడింగ్ పెట్టి ఇలాంటి హత్యలను కూడా సమర్థించే దుస్థితిలోకి ఎల్లో మీడియా వెళ్లిందంటే వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో జనం ఊహించుకోలేరా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమికి మరో కొత్త చిక్కు.. ఎల్లో మీడియా బొక్కబోర్లా!
రాజకీయాలలో కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్ అనుకుంటామో, అదే నెగిటివ్ అవుతుండవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ఒక చిక్కునే ఇప్పుడు ఎదుర్కుంటున్నది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల కాంప్లెక్స్‌లు నిర్మించడానికిగాను 2534 కోట్లు మంజూరు చేసింది. ఇది మంచిదే. దీనిని వరంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది.అమరావతిలోనే కేంద్రం ఈ భవనాలు నిర్మించబోతోందని, దానికి గాను డబ్బు కూడా వస్తుందని ఆ మీడియా ఎగిరి గంతేసింది. దానికి అభ్యంతరం లేదు. అయితే కేంద్రం నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న ఖర్చుకు మధ్య హస్తిమశకం అంత అంటే దాదాపు నాలుగురెట్ల తేడా ఉండడంతో కూటమి పెద్దలకు తల బొప్పి కట్టినంత పని అవుతోంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిగా మారింది. దీనిపై వివరణ ఇవ్వలేక ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది.నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో తన కార్యాలయాలకోసం భవనాలు నిర్మించుకుంటుంది. ఉమ్మడి ఏపీలో రాజధాని హైదరాబాద్‌లో కేంద్రం ఎప్పుడో సెంట్రల్ కాంప్లెక్స్‌లు నిర్మాణం చేసుకుంది. అలాగే ఆర్బీఐ శాఖను, ఇతర ముఖ్యమైన ఆఫీస్‌లను ఏర్పాటు చేసుకుంది. అదేమీ కొత్త విషయం కాదు. అమరావతిలో సైతం ఇలాగే బిల్డింగ్‌ల నిర్మాణానికి 2018లోనే సుమారు 25 ఎకరాల భూమిని కేంద్రం తీసుకుంది. దానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కేవలం పాతిక ఎకరాల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను కేంద్రం చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టింది.కేంద్ర ప్రభుత్వం తన ఆఫీస్‌లను ఐదున్నర ఎకరాలలో నిర్మిస్తోంది. ఇందుకోసం 1299 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అంటే చదరపు అడుగుకు 5567 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. అలాగే సిబ్బంది నివాసాలకుగాను 17 ఎకరాలలో 1234 కోట్లే వెచ్చించబోతున్నారట. చదరపు అడుగుకు 3945 రూపాయలు అవుతుందన్నమాట. కేవలం పాతిక ఎకరాలలోనే కేంద్రం ఇంత భారీ భవంతులు నిర్మిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం వేల ఎకరాలలో నిర్మాణాలు అంటూ హడావుడి ఎందుకు చేస్తోంది? రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాల భూములు సేకరించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అన్నది ఒక పాయింట్ అయితే చదరపు అడుగుకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇరవైవేల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని అంగీకరించారు. తమవి ఐకాన్ భవనాలు కనుక అంత వ్యయం అని ఆయన సమర్థించుకునే యత్నం చేశారు. హాపీ నెస్ట్, గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగువేల రూపాయల లోపే ఖర్చు అవుతోంందని అంటున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నందున వ్యయం ఎక్కువగా కనిపిస్తోందని, నాణ్యత, ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఇతర భవనాలు అంత నాణ్యత ఉండవని ఆయన అంటున్నారా? ఎంత ఐకానిక్ భవనాలు అయినా చదరపు అడుగుకు 20వేల రూపాయల స్థాయిలో ఖర్చు అవసరమా? అంటే ఎవరు జవాబు ఇవ్వాలి.ఏపీ ప్రభుత్వం సచివాలయ భవనాల అద్దాలకు పెట్టే 2500 కోట్లతో కేంద్రం మొత్తం బిల్డింగ్ లనే పూర్తి చేస్తుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తోందన్న విషయం అందరికి తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్లు కట్టడం తమకు పాజిటివ్ అవుతుందని, గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటే, అది కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి నెగిటివ్‌గా, తమ గుట్టు మొత్తం బయటపెట్టేదిగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖర్చు తేడాపై ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు.ఎనిమిదివేల మంది ఉద్యోగులకుగాను కేవలం రెండు టవర్లు కేంద్రం నిర్మించాలని తలపెట్టింది. ఏపీ సచివాలయానికి సంబంధించి మూడువేల మంది సిబ్బంది ఉంటారేమో! ఇతరత్రా శాఖల హెడ్ ఆఫ్స్ డిపార్ట్మెంట్ల సిబ్బంది సంఖ్యను తీసకున్నా మరో నాలుగైదువేల మంది ఉంటారేమో తెలియదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సిబ్బంది అంతా ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు. పైగా వర్క్ ఫ్రం హోమ్ వంటివాటిని ప్రవేశపెట్టాలని కూడా గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ పరిస్థితిలో 39 అంతస్తుల టవర్లను నాలుగింటిని, 49 అంతస్తుల టవర్ ఒకదానిని 1500 ఎకరాలలో అమరావతిలో ఎందుకు నిర్మిస్తున్నట్లో ఎవరికి అంతుపట్టదు.అలాగే అసెంబ్లీ భవనం కూడా పార్లమెంటు కన్నా పెద్దదిగా ఉంటుందేమో తెలియదు కాని, ఖర్చు మాత్రం పార్లమెంటు భవన వ్యయాన్ని మించి పోతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే రాష్ట్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని కేంద్రమే పరోక్షంగా చెప్పినట్లు అనిపించడం లేదా! అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే స్థితిలో ఉన్న రాష్ట్రం ఈ రకంగా భారీగా ధన దుర్వినియోగం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది. ఒక్క సచివాలయ భవనాలకే కాదు.. అసెంబ్లీ, హైకోర్టు, ఉన్నతాధికారుల నివాసాలు ఇలా ఏవి చూసుకున్నా ఖర్చు తడిసి మోపెడు అవుతోందన్నమాట.హైకోర్టు ప్రాంగణంలో సదుపాయలకోసం 500 కోట్లు, సచివాలయాల మౌలిక సదుపాయాలకు 2900 కోట్లు.. ఇలా రకరకాల రూపాలలో ఖర్చు చేయడం అవసరమా? విశేషం ఏమిటంటే కేంద్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో తన భవన నిర్మాణాలు చేపడుతోందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు రాష్ట్రం నిర్మించే భవనాల ప్రత్యేకత ఏమి ఉంటుంది? మరో సంగతి చెప్పాలి. తెలిసి, తెలిసి ఎవరైనా వరదలు వచ్చే ప్రదేశాలలో నిర్మాణాలు చేపడతారా? భూమి స్వభావం భారీ భవంతులకు అంత అనువు కాదని నిపుణులు చెబుతున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.అంతా కలిపి ఏభై కిలోమీటర్ల దూరం ఉంటుందో, ఉండదో కాని, ఇక్కడ వాగులపై 69 వంతెనలు నిర్మిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ఇది వరద ప్రాంతం అని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు వద్దని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిందని గతంలో ఒకసారి ఈయనే వెల్లడించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ పలు సందేహాలు వ్యక్తం చేసినా, ఈ టరమ్‌లో మాత్రం కేంద్రంలోని ప్రభుత్వ ప్రభావంతో అదే బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ కలిపి ఇప్పటికే 47వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణం అంతా రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే. ఈ వ్యయ ప్రయోజనం మాత్రం 30 గ్రామలవారికే అధికంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రజలలో నెలకొంది.ఇది ఇలా ఉండగా, ఏపీ కూటమి సర్కార్ కనీస నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తాము అడిగినట్లు భూములు ఇవ్వాల్సిందేనంటూ ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులను ప్రభుత్వం వేదిస్తోంది. ఉండవల్లి ప్రాంత రైతులు సభలు పెట్టుకుని ఈ అంశంపై పోరాడుతున్నారు. వారు ప్రపంచ బ్యాంకుకు ఒక ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందడానికి మాత్రం పలు రెట్ల మేర అధికంగా చూపిస్తున్నారని వారు వివరించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధికారులు సీ.ఆర్.డీ.ఏ ని కోరుతూ లేఖ రాశారట.ప్రపంచ బ్యాంక్‌కు ఇచ్చిన నివేదికలో గజం నలభైవేల నుంచి ఏభైవేల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎకరం ఏకంగా 25 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని, కాని తమకు భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ఎకరా విలువ 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారని ఆ రైతులు ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. నిజానికి 2014 టైమ్ నాటికే ఉండవల్లిలో భూముల విలువ రెండున్నర కోట్లు ఉండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పది కోట్ల నుంచి 30 కోట్లు ధర పలుకుతోందని రైతులు తెలిపారు.దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. అప్పులు తీసుకోవడానికి అధిక విలువ చూపించే ప్రభుత్వం రైతులకు పరిహారం విషయంలో మాత్రం అతి తక్కువ రేటు చూపుతోందనే కదా! ప్రభుత్వం కనీస నిజాయితీగా లేదనే కదా రైతుల ఆరోపణ. తమ పంతం నెరవేర్చుకునేందుకు రైతులను ఇలా నష్టపరుస్తారా? ఒకవైపు కేంద్రం నిర్మాణ ధరలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ వ్యయం చేయడం, మరో వైపు దారుణమైన రీతిలో తక్కువ ధరకు రైతుల భూములు కొట్టేయాలని చూడడం ఏ పాటి ధర్మం అవుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు మార్క్ కుట్ర సిద్ధాంతాలు.. ఎల్లో మీడియా వాయింపు!
అధికారంలో ఉన్నవారికి తమ తప్పులను ఎత్తి చూపితే అవి కుట్రల్లా కనిపిస్తాయి. అంతే తప్ప తాము చేస్తున్న పనులలో తప్పులు జరుగుతున్నాయని అంగీకరించలేరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అధికారులను హెచ్చరించారట. ఇంతకీ ఆయన దృష్టిలో ఏది కుట్ర? ఏది కాదు? తాను విపక్షంలో ఉంటే ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. అదే అధికారంలో ఉన్నప్పుడు విపక్షం సాక్ష్యాధారాలు చూపిస్తూ విమర్శలు చేసినా, ఆయా వివాదాలలో తన ప్రభుత్వం దొరికిపోయినా అదంతా కుట్ర అని చెబుతూ జనం నమ్మాలని కోరుకుంటారు. ఆయనకు ఎల్లో మీడియా తబలా వాయిస్తుంటాయి కనుక అలా సాగిపోతుంటుంది. తమ వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం ఆయన లక్ష్యంగా ఉంటుంది.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో విపక్షంపై ఇదే ఆరోపణ చేసేది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆమె ఇది కుట్ర అని ఆరోపించి ఏకంగా ఎమర్జెన్సీని విధించి, అనేక మంది ప్రతిపక్ష పార్టీల నేతలను జైళ్లలో పెట్టించారు. ఎమర్జెన్సీని ఎత్తివేశాక కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైంది. అది వేరే విషయం.కాంగ్రెస్ ఐ నుంచి రాజకీయ ఆరంగ్రేట్రం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని, తన మామ ఎన్టీఆర్‌ను పడదోసి అధికారంలోకి వచ్చారు. ఇదే పని 1984లో నాదెండ్ల భాస్కరరావు చేస్తే కుట్ర అని, ప్రజాస్వామ్య హననం అని అంటారు. సొంత మామ ఎన్టీఆర్‌ను కూలదోస్తే మాత్రం అది కుట్ర కాదని ప్రచారం చేసుకోగలిగారు. ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబును తీవ్రమైన భాషలో నిందించారు. ఆర్టీజీఎస్ అధికారుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కుట్రలు పన్నే పార్టీలతో జాగ్రత్త అని అన్నారట. ఎల్లో మీడియా చాలా ప్రముఖంగా ప్రచారం చేసింది. ఇంతకీ ఏది కుట్ర అవుతుంది? పోలీస్ స్టేషన్లలో నిందితులను హింసించి చంపిన ఘటనలను ఎవరికి తెలియకుండా చేయాలని అనుకోవడం కుట్ర అవుతుందా? ఆ విషయాన్ని బహిర్గతం చేసిన వైఎస్సార్సీపీ ది కుట్ర అవుతుందా?విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడు మిస్సింగ్ అవడం, ఆ తర్వాత అతనిని దహనం చేసి బూడిద కూడా కనిపించకుండా చేశారన్న ఆరోపణ రావడం ఏమిటి? దాని గురించి నిష్పక్షపాతంగా విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవన్ని కుట్రలు అన్నట్లుగా మాట్లాడడం ఏమిటి. సాయికృష్ణ కేసులో ఇంతవరకు ఒక్క సీఐని మాత్రం అరెస్టు చేసి, మిగిలినవారి జోలికి వెళ్లకపోవడం కుట్ర అవుతుందా? కాదా? చివరికి సిసిటీవీ ఫుటేజీ మిస్ అవ్వడం అంటే కూటమిప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతుందా? లేదా? ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబును రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాల పన్నాగాలను పన్నుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.మాజీ మంత్రి అంబటి రాంబాబు, జైభీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ వంటివారు అనేక ఆధారాలతో సహా ఆరోపణలు చేశారే. వాటికి జవాబు ఇవ్వకుండా కుట్రలు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా అధికారులకు ఎలాంటి సంకేతం పంపుతున్నారు? అంటే తప్పు చేసినా దొరకవద్దని పరోక్షంగా చెబుతున్నారా? లీగల్‌గా, టెక్నికల్‌గా దొరకరాదని చెబుతున్నట్లు అనిపించదా! సాయికృష్ణ రౌడీషీటర్ అని ప్రచారం చేసి, అతని కుటుంబాన్ని జగన్ పరామర్శించడాన్ని టీడీపీ ఎందుకు తప్పు పట్టింది? ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా రౌడీషీటర్ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడడాన్ని ఏమని అంటారు? ఏమి న్యాయం చేశారో బయటపెట్టకుండా బాధిత కుటుంబ నోరు కట్టేయడాన్ని కుట్ర అంటారా? లేక ఓపెన్‌గా ప్రజాస్వామ్య హక్కుల కోసం వైఎస్సార్సీపీ, మరి కొన్ని ఇతర ప్రతిపక్షాలు పోరాడడం కుట్ర అవుతుందా?వివిధ ఘటనలకు కులం, మతం రంగు పులుముతున్నారని కూడా ఆయన అన్నారట. ఇలాంటి వ్యవహారాలలో చంద్రబాబుకు ఉన్న అనుభవం మరెవరికైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. కందుకూరులో జనసేనకు చెందిన ఒక కాపు వ్యక్తి టీడీపీ నేత చేతిలో హత్యకు గురైతే ఏ ప్రాతిపదికన ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వద్ద చంద్రయ్య అనే స్థానిక టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలలో హత్యకు గురైతే బీసీ నేతను వైఎస్సార్సీపీ వారు చంపారంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన మాట నిజమా? కాదా?ఆ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న అతని కుమారుడికి ఏ ప్రమాణం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు? అందులో కుల రాజకీయం లేదా? వైఎస్సార్సీపీ హయాంలో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన సుధాకర్ అనే డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాతకాలంలో ఆయన మద్యం మత్తులో విశాఖ నడిరోడ్డుపై నానా రచ్చ చేస్తుంటే పోలీస్ కానిస్టేబుల్ ఆయన చేతులు కట్టి స్టేషన్‌కు తీసుకువెళితే దళిత డాక్టర్‌ను అలా చేస్తారా అంటూ విమర్శలు చేయడాన్ని ఏమని అంటారు? అది కుట్ర కాదా? అతను అనారోగ్యానికి గురై మరణిస్తే, దానిని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించడం ఏ రాజకీయం అవుతుంది? అవినీతి కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు అయినా, మరో కేసులో ఇంకో నేత కొల్లురవీంద్ర అరెస్టు అయినా బీసీలను అరెస్టు చేస్తారా అంటూ ఎల్లో మీడియా ద్వారా విరుచుకుపడింది ఎవరు? దానిని కుల రాజకీయం అంటారా? ఇంకేమైనా అంటారా?అసలు విషయంలోకి వెళ్లకుండా ప్రత్యర్ధులపై తట్టెడు బురద వేయడంలో చంద్రబాబు ఘనాపాటి అని ఆయన విమర్శకులు చెబుతుంటారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న, చితక కేసులు పెట్టించి, ఆయనపై దుష్ప్రచారం చేసింది ఎవరు? ఆయన కుమారుడు జగన్‌పై ఈ పదేళ్లలో ఎన్ని కుట్రలు చేశారు. ఎంత అబద్దపు ప్రచారం చేశారు? ఇక మత రాజకీయం గురించి చెప్పవలసి వస్తే చాంతాడంత అవుతుంది.కొన్నిచోట్ల టీడీపీకి చెందిన వారు విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటివారిలో ఒకరికి ఐదు లక్షల పరిహారాన్ని ఎలా ఇచ్చారు? తిరుమల లడ్డూపై లేని వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై అభాండాలు వేయడం కుట్ర అవుతుందా? కాదా? పోనీ జగన్ ఏ కుట్ర పన్నారో ఒక్కటైనా ఉదాహరణ ఇవ్వాలి కదా! అలాకాకుండా బట్టకాల్చి మీద వేయడం ఏమిటి? దానిని కదా కుట్ర అనాల్సింది. మొత్తం మీద ఇటీవలికాలంలో ప్రభుత్వపరంగా జరగుతున్న అనేక ఘటనలలో అటు పాలకులు, ఇటు అధికారులపై ఆరోపణలు వస్తుండడంతో చంద్రబాబు కుట్ర ధీరిని ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
టీడీపీ గేమ్‌లో పవన్ ‘ఫ్రంట్ ఫుట్’ బ్యాట్స్‌మెనా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరకంగా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఆయన ఏమి మాట్లాడినా దానిని సినిమా డైలాగు అనుకుని చప్పట్లు కొట్టే అమాయక అభిమానులు ఉండడం ఆయన అదృష్టం అవుతుందేమో!. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పరస్పర విరుద్దమైన ప్రసంగాలు చేశారో లెక్కవేయడం కష్టమే కావచ్చు. అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలైనా పడి ఉండవచ్చు. ఒకసారి పవర్ చేతికి వచ్చాక బాధ్యతాయుతంగా ఉండకపోతే అది సమాజానికి నష్టం చేస్తుంది.గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలకు గురి అవుతున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేసి టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ లబ్ది చేకూర్చాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను తానే కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు గందరగోళంగా ఉండడం ఒక స్పెషాలిటీగా కనిపిస్తుంది. కాకినాడలో కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన మాటలు కొన్నిటిని చూడండి. వైఎస్సార్సీపీ గూండాలను తొక్కి నారతీస్తా.. అధికారంలో లేకున్నా క్రిమినల్స్‌లా ఆ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయడం అంటే ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, లాకప్ డెత్ ఘటనలపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి చేస్తున్న యత్నంగా కనిపించదా!మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ అంటూ అరాచకపు రాజకీయాలు చేస్తుంటే, తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్నట్లుగా పవన్ కళ్యాణ్ తొక్కినారతీసే రాజ్యాంగాన్ని అమలు చేస్తానని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్‌కు ఆ శక్తి ఉంటే ఎవరిని తొక్కి నారతీయాలి? ముందుగా టీడీపీ, జనసేనలలో ఉన్న ఆ గూండా శక్తులను గుర్తించి వారి నార తీసి తదుపరి ఇతర పార్టీలవారి వద్దకు వస్తే బాగుండేది కదా! కొద్ది రోజుల క్రితం దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మరో నేత ఇంటిని కూల్చడానికి వెళ్లారు. ఆయనను ఏమి చేయాలో పవన్ చెప్పాలి కదా! గతంలో ఇదే చింతమనేనిని పవన్ తీవ్రంగా విమర్శించారు. తదుపరి పొత్తు కుదిరాక ఆయనకోసం ప్రచారం చేశారే!శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులపై కనీసం కేసు అయినా పెట్టించారా? వేమూరు నియోజకవర్గంలో కొందరు జనసేన కార్యకర్తలపై టీడీపీ వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు కదా! ఒక యువతిని మోసం చేసి అత్యాచారం చేశారన్న అభియోగం ఎదుర్కోవడమే కాకుండా అసెంబ్లీ నుంచే వీడియోకాల్‌తో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఒక జనసేన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడం సంగతి అలా ఉంచి, డిల్లీ మీటింగ్‌లో పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఏమనుకోవాలి! మరికొందరు జనసేన ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాల మాటేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాలను నడుపుతున్నారన్న కూటమి ఎమ్మెల్యేలను కనీసం మాట మాత్రంగానైనా హెచ్చరించలేకపోతున్నారే.ఇక వైఎస్సార్సీపీ మద్దతుదారులను అణచివేయడానికి పోలీసు యంత్రాంగం రకరకాల అక్రమ కేసులు పెడుతోంది. అది చాలదన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. జనసేన మద్దతుదారు కుటుంబానికి చెందిన సాయికృష్ణ అనే రౌడీషీటర్‌ను పోలీసులే హింసించి చంపేశారని ఆరోపణలు వచ్చాయి. అది చట్ట విరుద్దమైన చర్యగా చెప్పవలసిన ఉప ముఖ్యమంత్రి, అదేమీ తప్పుకానట్లుగా మాట్లాడడం ఏపాటి రాజధర్మం అవుతుంది. మరో వైపు అదే రౌడీషీటర్ కుటుంబం వద్దకు జనసేన బృందం ఎందుకు వెళ్లింది? ఏభై లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం అవ్వాలని మరో జనసేన నేత ఎందుకు రాయబారం చేశారు. అన్నిటికి మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రౌడీషీటర్ కుటుంబాన్ని ఎందుకు పిలిపించుకుని వారిని ఓదార్చి పంపించారు.ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయి కూటమి ప్రభుత్వానికి తీరని నష్టం చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి, డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే నష్టం జరిగింది కదా! క్రిమినల్ కేసులు ఉండడమే వైఎస్సార్సీపీ బలం అంటూ మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌లతో పాటు పవన్‌పై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బయటపెట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కారుమీద ఎక్కి కూర్చుని హడావుడి చేయడం ఏ రకమైన చర్య అవుతుంది? స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయితే, నడిరోడ్డుపై పవన్ కళ్యాణ్ పడుకోవడం చట్టసమ్మతమేనా? విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రి రోజాపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేసినప్పుడు వాటిని సమర్థించినట్లు వ్యవహరించారే! తనపై హోం మంత్రి అనిత చేసిన ఒక వ్యాఖ్యకు బదులుగా మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన విమర్శను పవన్ తప్పుపట్టారు. అది మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరించారు. అందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్‌తో సహా కూటమి ప్రముఖులు చేసిన పలు అభ్యంతర వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని వంటివారు గుర్తు చేశారు.మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ నటి రోజాపై నీచమైన ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని పవన్ అభినందించింది నిజమా? కాదా? ఆ మాట చెప్పింది బండారే కదా! ఇక సుగాలి ప్రీతి అంశంలో మరింతగా పవన్ పరువు పోగొట్టుకున్నారు. జై భీమ్ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధారసహింతంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలియచేశారే. సుగాలి ప్రీతి తల్లి పార్వతి సైతం అదే విషయం తేటతెల్లం చేశారే. తనకు కులం ఆపాదించవద్దని పవన్ కళ్యాణ్ తాజాగా కోరుతున్నారు. మంచిదే. ఆయన మొదటి నుంచి ఇదే ఉద్దేశంతో వ్యవహరించి ఉంటే అంతా అభినందించాలి. కాని కాపులంతా తనకు మద్దతు ఇవ్వాలని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోరిన సంగతి అసత్యమా? ఇప్పుడు అందుకు విరుద్దంగా కులం గురించి మాట్లాడడం దరిద్రం అని, తాను దేశభక్తుడినని సర్టిఫికెట్ ఇచ్చుకుంటే రాజకీయాలలో కుదురుతుందా? మొత్తం ఎన్నికల మానిఫెస్టో సంగతెలా ఉన్నా, కనీసం కాపులకు ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఆయనపై లేదా? తాను హోం మంత్రిని కాకపోవడం అది క్రిమినల్స్ అదృష్టం అని అనడం ద్వారా ప్రస్తుత హోం మంత్రి అనితను అగౌరపరిచినట్లు కాదా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.నిజానికి లా అండ్ ఆర్డర్ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సంగతి ఆయనకు తెలియదా! అన్నిటికి మించి పవన్ కళ్యాణ్‌ను టీడీపీ బాగానే వాడేసుకుంటోందన్న భావన వ్యక్తం అవుతోంది. అందులో భాగంగానే వైఎస్సార్సీపీపై పవన్ చేసే దూషణలకు టీడీపీ మీడియా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది తెలుస్తూనే ఉంది కదా! చేసింది. సాయికృష్ణ కేసులో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడాలని యత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అనవసర వ్యాఖ్యలు చేసి అప్రతిష్టపాలు అవుతుండడమే అందులో ఉన్న మర్మం అన్న విషయం అర్థం అవుతూనే ఉంది కదా! టీడీపీకి, ఎల్లో మీడియాకు అదే కదా కావల్సింది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం!
ఎంతటి పెద్ద కేసు అయినా దానిని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అలాగే ఎంత చిన్న కేసు అయినా దానిని పెద్దదిగా చూపించడం కూడా ఓ కళే. ఇది అందరివల్ల సాధ్యం అయ్యే పని కాదు. కాని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ఉన్న నేర్పరితనం బహుశా దేశంలోనే ఇంకెవ్వరికి ఉండదేమో! దీనిని ప్రశంసగా అయినా తీసుకోవచ్చు. లేదా విమర్శగా అయినా భావించవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పలు ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. వాటిపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయినా వాటిలో తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోగలిగిన తెలివి ఆయనది అని చెప్పాలి. అత్యంత సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ కేసును చంద్రబాబు ఎలా హాండిల్ చేశారో చూడండి. సాయి కృష్ణ తల్లికాని, ఇతర కుటుంబ సభ్యులు కాని తొలుత మాట్లాడినదానికి, చంద్రబాబును కలిసిన తర్వాత చెప్పిన విషయాలకు ఎంత తేడా ఉందో గమనించి అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది.ఆ కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం జరిగిందో ఎవరికి తెలియదు కాని,వారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లతో పాటు లోకేష్‌కు కూడా ధన్యవాదాలు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. వారికి నిజంగా ఏదైనా న్యాయం జరిగి ఉంటే అది ఏరకంగా జరిగిందో చెప్పి ఉండేవారు. బహిర్గతం చేయలేదంటే భయపడ్డారేమో అన్న సందేహం వస్తుంది. లేదా వారికి ఏమైనా ఇతరత్రా సాయం అందించడానికి అవగాహన కుదిరిందేమో అన్న సంశయం కలుగుతుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దీనిపై వ్యాఖ్యానిస్తూ సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండవచ్చని, అయినా తాము ఈ కేసుపై పోరాటం ఆపబోమని అన్నారు. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మరింత గట్టిగా మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబం రాజీ పడినా, తాము వెనక్కి తగ్గబోమని, ఈ హత్య ఏపీ సమాజంపై జరిగిన దాడిగా తాము పరిగణించి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని తెలిపారు. అంతేకాక ఆ కేసులోఎవరెవరి ప్రమేయం ఉండే అవకాశం ఉందో తెలుపుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఎల్లో మీడియా కాని ,టీడీపీ పక్షాన ప్రచారం చేసే డిజిటల్ మీడియా కాని, తొలుత సాయికృష్ణపైన, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్,వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా ప్రచారం చేశాయి.ఆ కుటుంబాన్ని కలవడం ద్వారా జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, రౌడీషీటర్ కుటుంబాన్ని కలుస్తారా అని టీడీపీ నేతలు దూషించారు. సాయి తల్లిని పరామర్శించి జగన్ ధైర్యం చెప్పాక, పరిస్థితి తీవ్రతను గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమెను,ఇతర కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వీరి స్వరం మారింది. ఈ ఉదంతంతో ఎల్లో మీడియా పరువుపోయినట్లయింది. చంద్రబాబు భేటీ తర్వాత ఎల్లో మీడియా ఫ్లేట్ ఫిరాయించేసింది. చంద్రబాబు ఎందుకు ఇంత కంగారుపడి ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు కేవలం సిఐ నాగరాజుకే పరిమితం కాదని,ఆ పైన ఉన్న అధికారులకు,ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవారికి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భావనతో చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుని ఉండవచ్చు. సాయి కుటుంబం వారు జనసేన పార్టీవారని, కాపు సామాజిక వర్గంవారని వెల్లడైంది. ఇటీవలి కాలంలో పలు ఘటనలలో కాపు వర్గానికి చెందినవారు కూడా ఇబ్బంది పడుతుండడం ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటే మొత్తం కేసు బలహీనపడిపోవచ్చని అనుకుని ఉండవచ్చని అంటున్నారు.ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత,ఏపీలో పలు ఇతర పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి లాకప్ హింసలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరిన్ని వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగించి ఉండవచ్చు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే హింసను తాళలేక ఒక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసు కూడా ప్రజలలోకి వెళ్లింది. వైఎస్సార్సీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి తీవ్రమైన విమర్శలు చేశారు. తెనాలి, కౌతాళం, విజయనగరం తదితర చోట్ల కూడా మరికొన్ని వేధింపుల కేసులు మీడియాలో రిపోర్టు అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ పేరుతో జరిగినన్ని అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం అరాచకాలు నిర్వహించడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. సుమారు ఏభై రోజులపాటు సాయికృష్ణ కేసును ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసు అధికారుల చుట్టూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎన్ని రోజులు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కేసులో అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో కలకలం ఏర్పడింది.ఆ తర్వాత విజయలక్ష్మి తన బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని వాపోయిన కధనం సాక్షి మీడియాలో వచ్చినప్పుడు హృదయమున్న ప్రతి వ్యక్తికి ఆవేదన కలిగించింది. హింసించి హతమార్చడమే కాకుండా, ఆ యువకుడిని కాల్చి బూడిద చేయడమేమిటని అందరూ మాట్లాడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజకీయాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది.తదుపరి అర్ధరాత్రి వేళ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ అమ్మిశెట్టి వాసు ఈ బాధిత కుటుంబంతో రాయబేరాలు చేసి డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందన్న అనుమానం బలపడింది. ఈ సంగతిని సాయి మేనమామే తెలిపారు.జనసేన నేతలకు ఈ ఘోరం గురించి చెప్పినా పట్టించుకోలేదని,అందువల్లే తాము అంబటి రాంబాబుకు వివరాలు అంందిచామని ఆయన చెప్పారు. వరంగల్ లో ఒక బాలుడి పలకరించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ,డిజిపిలతో దీని గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక ఎసీపీ స్థాయి అధికారిని దర్యాప్తునకు తొలుత నియమించినా,ఆ తర్వాత ఐపిఎస్ లతో కూడిన ఒక సిట్ ను ఏర్పాటు చేశారు.అయినా కేసులో న్యాయం జరుగుతుందా?లేదా?అన్న సందేహాలపై చర్చలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్ చేస్తోంది. కేవలం ఒక్క సిఐ మాత్రమే ఇలాంటి ఘోరం చేయలేరని, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా కచ్చితంగా ఉందని జడ శ్రావణ్ ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ముందే తెలుసని,వాటిని బయటపెడతానని ఆయన అన్నారు..సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకు రావడం,కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లోను, తదుపరి ఒక ప్రైవేటు హోటల్ లోను పెట్టి తీవ్రంగా హింసించడం, గాయపడ్డ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రాణం కోల్పోయిన సాయికృష్ణు బస్టాండ్ లో అనాధ శవంగా చూపే ప్రయత్నం చేసి, ఆ తర్వాత స్మశానవాటికలో దహనం చేయడం వంటి ఘట్టాలను జడ శ్రవణ్ పూసగుచ్చినట్లు వివరించారు.కాగా తన కుమారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించి పలు ప్రశ్నలు వేసిన సాయికృష్ణ తల్లి,ఆమె సోదరులు శుక్రవారం నాడు చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటూ,ఆయన వంటి మహోన్నత వ్యక్తి,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పాలన సరిగ్గా ఉందని చాటారని మేనమామ నవరంగ్ అనడం పలు సందేహాలకు తావిచ్చింది. ప్రభుత్వం అంత గొప్పగా పని చేసి ఉంటే, ఒకరోజు ముందు ఇదే నవరంగ్ తమను ఎవరూ పట్టించుకోలేదని ఎందుకు విమర్శించారో తెలియదు. ఈ కేసులో వారికి ఎలాంటి న్యాయం జరిగిందో క్లారిటీగా సాయి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ప్రభుత్వమూ వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు పద్దెనిమిదేళ్ల పాలనకాలంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి.నక్సైలైట్ల ఉద్యమ ప్రభావం అధికంగా ఉన్న రోజులలో కొన్ని ఎన్ కౌంటర్లు జరిగాయి. గత టరమ్ లో తిరుమలలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ఇరవై మంది ఎదురుకాల్పులలో మరణించారు. పుష్కరాలలో తొక్కిసలాట లో 29 మంది మరణించిన విషయంలో సిసిటీవీ ఫుటేజీ మిస్ అవడం మిస్టరీ అని అప్పట్లో విపక్షాలు విమర్శించేవి. ఇలాంటి ఘటనలలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ప్రభుత్వానికి,తన పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన జాగ్రత్తపడగలిగారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణించినప్పుడు సీబీఐ విచారణ జరగకుండా చూసుకోగలిగారు. చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు నిశ్చేష్టులై ఉంటున్నారన్న విమర్శ ఉంది. బలహీనవర్గాలవారిపైన ప్రత్యర్ది పార్టీవారిపైన మాత్రం పోలీసులు రెచ్చిపోతున్నారు.ఈ టరమ్ లో ఎన్ని వందలమందిని రెడ్ బుక్ పేరుతో వేధించారో లెక్కలేదు.తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డులో కూర్చోబెట్టి అరికాళ్లపై దారుణంగా పోలీసులు కొట్టడం మొదలు , పలు కేసుల్లో తీవ్రంగా హింసించడం, చిన్న,చిన్న కేసులలో సైతం వైఎస్సార్సీపీవారైతే నడిరోడ్డుపై నడిపించి అవమానించడం, అదే టీడీపీ వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా నామమాత్రంగా కేసు పెట్టడం వంటివి చేస్తున్నారు. అంబటి రాంబాబు,జోగి రమేష్ ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి మాజీ మంత్రుల ఇళ్లపై గంటల తరబడి టీడీపీ క్యాడర్ దాడి చేస్తే మాత్రం పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు.దీనితో ఏపీలో పోలీసు రాజ్యం ప్రజలను ఎలా పీడిస్తోందో వివరిస్తూ జగన్ దేశం అంతటికి తెలియచేసే యత్నం చేశారు. చంద్రబాబు ఎంత మేనేజ్ మెంట్ నేర్పరి అయినా ,ఎన్ని కేసుల్లో ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చినా,ఈ సాంకేతిక యుగంలో అన్నీ తెలిసిపోతున్నాయి.చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్న సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉపన్యాసం లాఫింగ్ స్టాక్‌తో.. పవన్ మళ్లీ సెల్ఫ్ గోల్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రజలు ఏమనుకోవాలి? మంచి జ్ఞాని ఆయనలో ఉన్నారనుకోవాలా? లేక అవగాహన లేకుండా మాట్లాడుతుంటారనుకోవాలా? నిజంగా ఇది ఆసక్తికర అంశమే. కొద్ది రోజుల క్రితం ఆయన సుమతీ శతకంలోని ఒక పద్య భాగాన్ని ఉటంకించి భాష్యం చెప్పిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఆయన పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలు ప్రశ్నలు వెలువెత్తాయి. ఒకప్పుడు యువత అంతా ప్రశ్నించాలని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే యువత ప్రభుత్వాల అక్రమాలను ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ వారిని క్రిములతో, చీమలతో పోల్చడం దారుణంగా ఉంది.ఢిల్లీలో ఆయన జనసేన నేతలతో ఒక సమావేశం పెట్టి చేసిన ఉపన్యాసం లాఫింగ్ స్టాక్‌గా మారింది. ఆయన ప్రసంగాన్ని గమనించండి.. ఈ మధ్య చూస్తున్నారు.. కాక్రోచ్ అనే పాయింట్ గురించి. చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా బలవంతమైన సర్పాలను చంపేస్తాయి.. కోట్ల మంది చిన్న, చిన్న ఆలోచనలు, ఇండివిడ్యువల్ వక్తులు అందరూ కూర్చుని దేశం తాలూకూ ఘాడతను, దేశం తాలూకూ తీవ్రతను అర్థం చేసుకోకపోతే, దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. డివిజివ్ శక్తులు విభజనవాదాన్ని సృష్టిస్తున్నాయి. దానిలో మనం భాగస్వామ్యులు కారాదు. ఎదిరించి పోరాడాలి.. అంటూ ఆయన ఉపన్యసించారు.అసలు సుమతీ శతక కారుడు ఈ పద్యం చెప్పడంలో అర్థం వేరు. 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!' అన్నది ఆ పద్య వ్యాక్యం. దీని అర్థాన్ని గూగుల్‌లో వెతికితే ఏమి ఉందో చూడండి. 'ఈ పద్యం ద్వారా కవి చెప్పిన సారాంశం ఏమిటంటే: తనను మించిన బలవంతుడు లేడని గర్వించి, ఇతరులను చిన్నచూపు చూస్తూ విరోధాలు కొనితెచ్చుకోవడం మంచిది కాదు. బలమైన పామును కూడా చిన్న చీమలు కలిసి కుట్టి చంపగలవు. ఎంతటి బలవంతులకైనా ఐక్యత ముందు ఓటమి తప్పదు. బలవంతమైన సర్పాన్ని చలిచీమలు చంపుతాయి' అని అర్థం. అంతేకాని సర్పం గొప్పదని, దానిని చీమలు చంపడం కరెక్టు కాదని కాదు. ఇది నెగిటివ్ సెన్స్‌లో రాసిన పద్యం.పవన్ తనకు తెలియకుండా కేంద్రాన్ని దేనితో పోల్చుతున్నారన్న సందేహం వచ్చింది. ఇది అవగాహనారాహిత్యంగా కనిపిస్తుంది. అలాగే కాక్రోచ్ పేరుతో పోరాడిన యువతను చలిచీమలుగా ఆయన చెబుతున్నారన్నమాట. పాము అంటే విషం సర్పం అని గుర్తుంచుకోవాలి. బలంతో విర్రవీగితే చిన్న, చిన్న కాక్రోచ్లు కూడా రేపటి రోజు చుట్టుముట్టి అంతం చేస్తాయని చెప్పడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు తమ తప్పులను తెలుసుకుని జాగ్రత్తపడకపోతే తదుపరి ఎన్నికలలో ఓటమికి గురి కావల్సివస్తుందని అర్థం.కొన్నాళ్ల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువకులు చేసిన పోరాటాన్ని తప్పుపట్టాలని ఆయన భావించడమే దారుణం. అందులో కూడా విష సర్పాన్ని సమర్ధించేలా ఆ పద్యాన్ని అవగాహన చేసుకోవడం మరీ చిత్రం. ఆయనకు ఈ స్క్రిప్ట్ రాసినవారికి ఈ విషయం తెలియదా, ఇది సెల్ఫ్ గోల్ వేసుకోవడం కాక ఏమిటి? అని ఒక మహిళా నెటిజన్ వ్యాఖ్యానించారు. విభజన వాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఐ యామ్ అన్ అపాలజిటిక్ హిందూ అని, కులం, మతం ప్రస్తావనలు తెచ్చిందెవరు అని ఆమె ప్రశ్నించారు. ఈ దేశం కోసం పోరాడే హక్కు యువతకు ఉంది. వాళ్ల హక్కుల కోసం, జరిగిన అన్యాయాలపై పోరాడుతున్నారు. అది వారి హక్కు అని గుర్తించకుండా పవన్ ఈ మీటింగ్ పెట్టడం ఏమిటో, ఈ విష సర్పం, చలిచీమల గురించి అర్థం, పర్దం లేకుండా మాట్లాడడమేమిటో అని మేధావులు, పండితులు ఆశ్చర్యపోతున్నారు.నీట్ పరీక్ష లీక్ అవడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. సీబీఐ విచారణకు అప్పగించింది. పలువురు ఈ కేసులో అరెస్టు కూడా అయ్యారు. కాకపోతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ఇందులో రాజకీయం ఎక్కడ ఉంది. ఈ యువత దేశానికి ఏ రకంగా ప్రమాదం?, పవన్ ది రాజును మించి రాజభక్తి ప్రదర్శించడమా? లేక విషయంపై అవగాహన లేకుండా మాట్లాడడమని అనుకోవాలా? ఈ ప్రశ్నలు సహజంగానే బుద్ధి జీవులకు వచ్చాయి.సినిమాలలో వచ్చిన అవకాశాలతో పాటు, కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గత పదేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పలేం. ఈయన పరస్పర విరుద్ధమైన డైలాగులు అన్నిటినీ ఒక చోట పేర్చి సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేశారు. తనకు మాత్రమే దేశ భక్తి ఉన్నట్లు, అన్యాయాలను ప్రశ్నించే వారికి లేనట్లుగా పవన్ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు గురైంది. తోచీ, తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్లిందని సామెత. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఈ ఉపదేశాలు ఇవ్వడం ఏమిటి? ఇదే పవన్ కళ్యాణ్ అంతకు కొద్ది రోజుల ముందు తన పార్టీ పక్షాన సేనాదళం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.జన్ జి ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే దాని లక్ష్యం అని కూడా ఆయన చెప్పారు. అది చెప్పిన కొద్ది రోజులకే మాట మార్చేశారు. కొందరు యువకులు ప్రకటించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీని జన్ జి లో భాగంగానే చూడాలి. దీని అర్థం ఎంత అణచివేతకు గురి అవుతున్నా బొద్దింకల మాదిరి తిరగబడాలని చెప్పడం అన్నమాట. దీని గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒక వ్యాఖ్య చేస్తూ యువత తన ఆకాంక్షల కోసం ఈ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఏపీలో తాను కూడా ఒక కాక్రోచ్‌నే అని కామెంట్ చేశారు. అంటే దాని భావం ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై తాను పోరాడతానని ప్రకటించడమే కదా!రాజకీయాలలో కొందరు వ్యక్తుల తప్పులను వ్యక్తిగత చర్యలుగా కాకుండా వారి కులం, మతం, వర్గాలకు ముడిపెట్టి సామాజిక విభేధాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ సేనాదళం ప్రకటన సందర్భంలో అన్నారు. విశేషం ఏమిటంటే జగన్ పాలన సాగిన ఐదేళ్లలో ఈ రకమైన ప్రయత్నాలు చేసిందంతా టీడీపీ, జనసేనలే. అధికారం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు కలిసి ఎన్నిసార్లు కుల విభేధాలు, మత వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించారో తెలియదా? అధికారంలోకి వచ్చాక కూడా తిరుమల లడ్డూ పేరుతో, ఇతరత్రా మతపరమైన అంశాలను ఏ విధంగా వాడుకున్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. కాని సోషల్ మీడియాలో ఆ చరిత్ర అంతా ప్రత్యక్షమవుతూనే ఉంది కదా!కొద్ది రోజుల క్రితం వరంగల్‌లో ఒక బాలుడి కోరిక ప్రకారం అతనిని కలిసి వచ్చారు. మంచిదే. దానిని స్వాగతించవచ్చు. కాని అదే సమయంలో ఏపీలో తన మద్దతుదారుడైన ఒక యువకుడిని పోలీసులు క్రూరంగా హింసించి చంపేసి, చివరికి కాల్చి బూడిద చేశారన్న అభియోగం వస్తే, ఆ కుటుంబాన్ని పలకరించడానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి ఘటనలపై కూడా యువత కాని, ప్రజలు కాని స్పందించరాదన్నది ఆయన ఉద్దేశమా? అధికారం వచ్చింది కనుక ఆయనకు సంతోషంగానే ఉండవచ్చు. కాని ప్రజలకు ఏమి ఒరిగింది? ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ అరాచకాలతో ఏపీ అల్లాడుతుంటే ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమిటి? కాకపోతే ఏమిటి? అన్న నైరాశ్యానికి ఆయన మద్దతుదారులు గురి అవుతున్నారనిపిస్తుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఓటర్ల జాబితా సవరణ..
దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై(సర్) రాజకీయ పార్టీలకు పలు అనుమానాలు కలిగే పరిస్థితి ఉండడం దురదృష్టకరం. దీనికి దేశంలోని ఆయా వ్యవస్థలు బాధ్యత వహించాలి. దేశంలో ఇప్పటికీ బోగస్ ఓట్లతో ఎన్నికలు జరపడం, కొందరి ఓట్లు గల్లంతవడం, పలువురికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉండడం, ఈవీఎమ్‌ల టాంపరింగ్ అవకాశం, వివిపాట్ స్లిప్‌ల లెక్కింపు జరగకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల కమిషన్ విఫలం అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి ఉపయోగపడేలా పనిచేస్తోందన్న ఆరోపణ వల్ల కమిషన్ చిత్తశుద్ధిపై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం అయింది. రాజకీయ పార్టీలతో ఏపీ, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారులు సమావేశం అయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నందున, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అప్రమత్తం అయ్యాయి. కాంగ్రెస్ అభిమానుల ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీభవన్‌లో ఒక సమావేశం పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కూడా ఒక నియోజకవర్గం బాధ్యతలు తీసుకుని ఓటర్ల జాబితా తీరుపై దృష్టి పెడతామని అనడాన్ని బట్టి ఆ పార్టీ ఎంత సీరియస్‌గా ఉంది అర్థం చేసుకోవచ్చు.ఈ సందర్భంలోనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనిపై శ్రద్ధ వహించడం లేదని, జమిందార్ల మాదిరి వ్యవహరిస్తున్నారని కూడా ఘాటు వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఓటర్ల జాబితా అంశంలో పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. గతంలోనే కొన్ని ఇళ్లలో నలభై, ఏభై ఓట్లు ఉన్న విషయాన్ని గుర్తుచేసి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కాగా బీజేపీ నేతలు మాత్రం పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఆరోపణలను తిప్పికొడుతున్నారు.ఏపీ విషయానికి వస్తే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సర్ లో వైఎస్సార్సీపీకి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గంవారీగా బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి తగు శిక్షణ ఇప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇలాంటి వ్యూహాలలో ఉన్న అనుభవం రీత్యా వైఎస్సార్సీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.విశేషం ఏమిటంటే సర్ కార్యక్రమంపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కూడా పిలుపు ఇచ్చారు. టీడీపీ ఓట్లు తొలగించేలా వైఎస్సార్సీపీ కుట్రలు చేయవచ్చని ఆయన అన్నారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నా, పార్టీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్సీపీ కుట్రపూరితంగా తొలగించిందని ఆయన ఆరోపించారట. అదే ఆయనలో ఉన్న విశిష్టత. తాను ఏదైనా చేయదలచుకుంటే, తొలుత ప్రత్యర్థులపై ఆ బురద చల్లుతారని రాజకీయపార్టీలలో ఒక అభిప్రాయం ఉంది. సరిగ్గా అదే రీతిలో ఆయన మాట్లాడారు.నిజానికి 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ అలా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించినట్లు ఆరోపణలు రాలేదు. పైగా సేవామిత్ర యాప్ పేరుతో చంద్రబాబు ఆధ్వర్యంలోనే టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితాలో లేకుండా చేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో అలా సేవా మిత్ర యాప్ ద్వారా కొందరు ఉద్యోగులు ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో తెలుసుకునే యత్నం చేయడాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆనాడు బహిర్గతం చేశారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమిళనాడు, కర్నాటకలలోని సరిహద్దు గ్రామాలకు చెందినవారిని ఓటర్లుగా చేర్పించారని, తద్వారా సుమారు ముప్పైవేల నుంచి నలభైవేల బోగస్ ఓట్లు అక్కడ ఉన్నాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది.గతంలో చంద్రబాబుపై పోటీచేసిన వైఎస్సార్సీపీ నేత, దివంగత మాజీ ఐఏఎస్ చంద్రమౌళి నిత్యం దీనిపై పనిచేసి 17వేల ఓట్లను తొలగించగలిగారు. అయినా అంతకన్నా డబుల్ బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన చెబుతుండేవారు. తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కుప్పంలో 20వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. బీసీ వర్గాలు అధికంగా ఉండే కుప్పాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవడమే కాకుండా ఇలా బోగస్ ఓట్లను కూడా చేర్పించడం ద్వారా తనకు తిరుగులేని పరిస్థితిని తెచ్చుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి టెక్నిక్‌లు అమలు చేయడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిలేరని గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి నేతలు విమర్శించేవారు.చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ తీసి బోగస్ ఓట్ల జాబితాపై గవర్నర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం, చనిపోయినవారి ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడడం, ఇతర ప్రాంతాలవారు ఓటర్లుగా ఉంటే వాటిని తీసివేయడం వంటి లక్ష్యాలతో ఈ సవరణ జరుగుతుంది. నిజానికి దీని ఆశయం మంచిదే. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే వేలాది మంది ఓటర్లు అటు ఏపీకి, ఇటు తెలంగాణ జిల్లాలకు ఎన్నికల సమయంలో వెళుతుంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటారు. వీరికి రెండేసి ఓట్లు ఉండడం చట్ట విరుద్ధం. దానిని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కనిపించదు.ఒక దశలో ఆధార్ కార్డుకు ఓటుకు లింక్ పెట్టాలన్న ఆలోచన జరిగినా దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ అభ్యంతరాలు చెప్పింది. ఓటు వేసినప్పుడు వేలు ముద్ర వేయడం ద్వారా సాంకేతికంగా డబుల్ ఓట్ల అక్రమాలను నివారించవచ్చన్న సూచన ఉన్నా ఎందుకు పట్టించుకోడం లేదు. మొత్తం వ్యవస్థను సరళీకరించి బోగస్ ఓట్లు లేకుండా చేయడం కన్నా, తమకు ఏది ప్రయోజనమో దానిపైనే అధికార పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్న భావన లేకపోలేదు.పశ్చిమబెంగాల్, బీహారు రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం వివాదం అయింది. ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికి జరిగిన కుట్రగా కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు ఆరోపించాయి. ఈ అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగించారని, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. మమత బెనర్జీ పోటీచేసిన భవానీపూర్‌లో 45982 ఓట్లు తొలగిస్తే 15వేల తేడాతో ఆమె ఓడిపోయారని ఆయన చెప్పారు. స్టాలిన్ పోటీచేసిన కొలత్తూరులో 71 వేల ఓట్లు తీసివేస్తే, ఆయన 8వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని ఉదాహరించారు. బెంగాల్లో 31 లక్షల ఓట్ల తేడాతో, తమిళనాడులో 17 లక్షల ఓట్ల తేడాతో టి.ఎమ్.సి,డి.ఎమ్.కె.లు ఓడిపోయాయని ఆయన వివరించారు.ఏపీలో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోతే, ఆ రాష్ట్రాలలో ఓట్లు తీసివేయడం వల్ల ఓడిపోయారని, రెండూ ప్రమాదమేనని జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం ఓట్ల బోగస్ వ్యవహరం ఒక హిస్టరీ మిస్టరీ అని అన్నారు. ఒక్కో బూత్ పరిధిలో ఏభై చొప్పున వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించినా ఐదువేల ఓట్ల వరకు పోయినట్లే అని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి గ్రామంలో ఆ ఓట్ల తొలగింపు లేకుండా, బోగస్ ఓట్లు చేరకుండా అప్రమత్తంగా ఉండాలని జగన్ తన కేడర్‌కు పిలుపునిచ్చారు. అయితే మరో రెండేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేనందున, ఒకవేళ మరీ తేడా ఉంటే దానిపై పోరాటం జరిపి, సరిచేసుకునే అవకాశం ఉండవచ్చు.ఏపీలో సీఈఓ ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేత పేర్నినాని చేసిన సూచనలు కూడా గమనించదగినవే. బూత్ లెవెల్ అధికారులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండేలా చూడాలని అన్నారు. ఇంతవరకు ఉన్న ఓటర్ల జాబితాలను పార్టీలకు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. కాగా గత ఎన్నికల సమయంలో ఏపీలో 3500 బూత్‌లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిపినట్లు చూపిన వైనంపైన, 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్నదానిపైన ఇంతవరకు ఎన్నికలసంఘం వివరణ ఇవ్వలేకపోయింది.వివిపాట్ స్లిప్‌లతో ఈవీఎమ్‌లను సరిపోల్చి చూపడంలో ఎన్నికల సంఘం విఫలం అయింది. వివిపాట్ స్లిప్‌లను కౌంటింగ్ జరిగిన పది రోజులకే దగ్దం చేయడం అనుమానాలకు దారితీసింది. అలాగే ఈవీఎమ్‌ల బాటరీ చార్జింగ్ కౌంటింగ్ నాటికి పెరిగిందన్న ఆరోపణపై జవాబు ఇవ్వలేకపోయారు.ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా చూసుకోవడానికి వైఎస్సార్సీపీ సన్నద్ధం అయింది. అయినా పలుచోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ నిత్యం ఫిర్యాదు చేయవలసి వస్తోంది. ఏది ఏమైనా రాజకీయ లక్ష్యంతో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లను అదనంగా చేర్చడం వంటివి జరగకుండా ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరించకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అంతా అతని ఆధ్వర్యంలోనే జరిగింది! ఇది నిజం ..
-
రేవంత్‌కు డబుల్ ట్రబుల్?
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ క్రీడలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఫర్వాలేదు కాని, అవి నష్టం చేసేలా ఉంటే మాత్రం చాలా ప్రమాదకర క్రీడ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి అపాయం సంభవిస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కొత్త సంక్షోభంలోకి వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకట పరిస్థితిని సృష్టిస్తున్నదా? లేక ఆయన అనుభవరాహిత్యం కారణమా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను ఆ కంపెనీకి సుమారు 1400 కోట్లు ముట్టచెప్పడానికి, 13600 కోట్ల రుణాన్ని భరించడానికి ఒప్పందం అయినట్లు కూడా వెల్లడించారు. అంతా సజావుగా జరిగితే ప్రభుత్వానికి కొంత భారం అయినా, రేవంత్ సర్కార్‌కు ప్రతిష్ట వచ్చేది. ప్రభుత్వం కోరినట్లు 13600 కోట్ల మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు భారత రైల్వే ఆర్థిక సంస్థ(ఐఆర్ఎఫ్సీ) అంగీకరించింది. దీంతో అంతా హాపీస్ అనుకుంటున్న వేళ ఆ సంస్థ వెనక్కి తగ్గడం రేవంత్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారింది. మెట్రో రెండోదశ నిర్మాణానికి సుమారు నలభై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తూ డీపీఆర్‌ను కేంద్రానికి రాష్ట్రం పంపించింది. దీనికి కూడా ఆమోద ముద్ర పడలేదన్నది రేవంత్ ఆరోపణ.రుణం మంజూరు ఆగిపోవడం కాని, రెండో దశ నిలిచిపోవడానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణమని, ఆయన వెనుక బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. దీనిని కిషన్ రెడ్డి తోసిపుచ్చినా, సహజంగానే కేంద్రంపైన సందేహాలు వస్తాయి. అందులోనూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడటం లేదన్న విమర్శ ఉంది. నిజంగానే రేవంత్ చెప్పినట్లు కేంద్రం కనుక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇలాగే వ్యవహరించి ఉంటే వచ్చే ఎన్నికలలో బీజేపీకి చేటు అవుతుంది. అయితే రేవంత్‌వి తప్పుడు ఆరోపణలు అని బీజేపీ తిప్పికొడుతోంది. కాని నిర్దిష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు కనిపించలేదు.బీజేపీ రాజకీయం ఇలా ఉంటుందని రేవంత్ సర్కార్ ఆలోచించలేక పోయిందా? ఇక్కడే ఆయన అనుభవ రాహిత్యం కనిపిస్తోందా? సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలాంటి గేమ్ ఆడుతూనే ఉంటాయి. అలాగే ప్రతిదానికి కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్రంలోని అధికార పార్టీ తనవంతు రాజకీయం తాను ఆడుతుంది. ఈ గేమ్ ప్రమాదకరంగా మారనంతవరకు ఫర్వాలేదు. కాని ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తు సంకటస్థితిలో పడుతోంది. ఆ ప్రాజెక్టుకు ఏడాదికి 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు 30వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అది కరెక్టు అయితే ఎల్ అండ్ టీ ఎందుకు 15వేల కోట్లకే అంగీకరించిందన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు వేస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ఆస్తులపై రేవంత్ టీమ్ కన్నేసిందని ఆ నేతలు ఆరోపిస్తున్నారు.ఐఆర్టీసీ నుంచి తక్కువ వడ్డీకి రుణం వస్తుందని, అందువల్ల మెట్రోని లాభాల పట్టించవచ్చన్న ఆశ రాష్ట్రానికి ఉన్నా, ఇప్పుడు పరిస్థితి ఎదురు తిరిగింది. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వని వైభవ్, కిషన్ రెడ్డిలు కూడబలుక్కుని రుణం ఆపారా? లేక ఆదాయంలో రుణ వాయిదా చెల్లించాలన్న కండిషన్ కారణంతో రుణం ఆగిందా అన్నది చర్చగా ఉంది. ఆర్బీఐ కూడా ఈ రుణం మంజూరుకు ఓకే చేసిన తర్వాత కేంద్రం అడ్డు పడడం కుదురుతుందా? అలా ఆగిపోవడానికి కేంద్రం నుంచి లేఖ ఏదైనా వెళ్లిందా? లేక మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారా అన్నదానిపై ఎవరికి వారు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఈ డీల్ పూర్తి అయితే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు పేరు వస్తుందని, దానివల్ల బీజేపీకి ఏమి లాభమన్న ఆలోచన జరిగిందన్నది మరో ఆరోపణ. కాగా కేసీఆర్ టైమ్‌లో ప్లాన్ చేసిన రెండో దశను రేవంత్ రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేయడం కూడా నష్టం చేసిందా అన్నది మరో పాయింట్‌గా ఉంది.ఈ మధ్యకాలంలో ప్రధాని మోదీతో రేవంత్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారన్న భావన ఉంది. కొద్ది రోజుల క్రితం నీతి అయోగ్ సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ఆయనతో ముఖాముఖీ మాట్లాడారు. అప్పుడు ఈ మెట్రో గురించి చర్చించారా? లేదా? చర్చించినా ఈ ప్రాజెక్టుకు ఈ సమస్య ఎదురైందంటే ఏమని అర్థం అవుతుంది. రాజకీయాలలో వీటన్నిటిని ముందుగా ఊహించుకుని ఒక వ్యూహంతో వెళ్లాలి. లేకుంటే సహజంగానే ప్రజాస్వామ్య రాజకీయాలలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో కేంద్రం తమకు సహకరించడం లేదని, అనేక ప్రాజెక్టులను పెండింగులో పెడుతోందని టీడీపీ వ్యవస్థాపకుడు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు విమర్శించేవారు. కేంద్రం ఒక మిధ్య అని కూడా సీరియస్ వ్యాఖ్య చేశారు. తెలంగాణకు ఆర్థికంగా రావల్సిన మొత్తాలు రావడం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేయడం లేదని కిషన్ రెడ్డి తదితరులు వాదిస్తుంటారు.ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ద్వారా ఇబ్బంది పెట్టడానికి కొందరు బీజేపీ నేతలు ప్రయత్నించేవారు. జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ గతంలో బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఒక తప్పుడు ఆరోపణతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పట్లో వినతిపత్రం అందచేశారు. తద్వారా విపక్ష టీడీపీకి మేలు చేయడానికి ఆమె యత్నించేవారు. అంతెందుకు! ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ లను కూటమి ప్రయోజనం కోసం బీజేపీ నేతలు పోస్టు చేయించుకున్నారు. అంతేకాక ఏకంగా ఏభై లక్షల మాయ ఓట్లు అదనంగా అర్ధరాత్రి వేళ పోల్ అవడం వెనుక ఎవరు ఉన్నది అర్థం చేసుకోలేరా? దీనిపై పరకాల ప్రభాకర్ ఎన్ని విమర్శలు చేసినా నోరు తెరవడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసకోవచ్చు.ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శించడం మొదలు పెడితే రాష్ట్రాలను చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తుంది. దీనికి తగినట్లు రాష్ట్రాలలోని విపక్ష ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటివెన్నో చేసిందన్నది సర్వవిధితమే. ఆమె తెలివి తక్కువగా సొంత పార్టీ నేతలను కూడా కష్టాల పాలు చేసి జైళ్లలో పెట్టి, చివరికి తన అధికారాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత అధికంగా ఇలాంటి రాజకీయాలు చేస్తోందన్న భావన ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేవంత్ మెట్రో వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్లు వ్యవహరించి ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది.ఏడాదికి మహా అయితే 500 కోట్ల నష్టం రావచ్చు. దానిని భరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. అలాకాకుండా ఏదేదో చేయాలని భావించి ఊబిలో చిక్కుకున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరచి కొత్త ఆలోచన చేయకపోతే అది రాష్ట్రానికి నష్టం చేస్తుందని చెప్పవలసి ఉంటుంది. కాగా మరో అంశం కూడా చూడాలి. కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు పోటీచేస్తే ఆమెపై ఏదో కేసు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే బీజేపీవారికి ఉప్పందించినట్లు వచ్చిన సమాచారం ఆ పార్టీకి తీరని చేటు అవుతుంది. దీని వెనుక రేవంత్ హస్తం ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. అయితే ఈ విషయంలో రేవంత్.. బీజేపీపై ఘాటైన విమర్శలే చేశారు. ఓట్ చోరీతో పాటు సీట్ చోరికి బీజేపీ పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాగా ఓటుకు నోటు కేసులో ఉన్నది రేవంతేనని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా లేదన్నది నిజమే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కాంగ్రెస్‌లో అంతా సజావుగా లేదన్న సంగతి అర్థం అవుతుంది. అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీపరంగా డిఫెన్స్‌లో పడితే అది కాంగ్రెస్‌తో పాటు రేవంత్ భవిష్యత్తు రాజకీయానికి ఇక్కట్లు తేవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబూ, పవన్ మాటల్లో హరితాంధ్ర.. చేతల్లో విధ్వంసాంధ్ర!
రాష్ట్రంలో ఏభై శాతం పచ్చదనమే లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సందేశం.. ఇవి వినడానికి ఎంత బాగున్నాయి.. నిజంగానే వీరిద్దరూ అదే లక్ష్యంతో పనిచేస్తుంటే అభినందించవచ్చు. కానీ జరుగుతున్నదేమిటి?. ఏపీలో ఈ మధ్య కాలంలో జరిగినంత పర్యావరణ విధ్వంసం మరెన్నడూ జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు.ఒకవైపు విశాఖలో కొండలను పిండి చేసేస్తున్నారు. ఇంకో వైపు డేటా సెంటర్ల పేరుతో విపరీతమైన కాలుష్యానికి కారకులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాలలోని పచ్చటి భూములను ఎండబెట్టారు. కృష్ణానది తీరంలోనే నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం అయిన భవనాలలోనే ముఖ్యమంత్రి, కీలక మంత్రి నివసిస్తారు. అయినా పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం గొప్పగా ఉపన్యాసాలు ఇస్తుంటారు. తద్వారా ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఒకటికి పదిసార్లు రుజువు చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అమరావతిలో కానీ, ఇప్పుడు విశాఖలో కాని ఎండలు తగ్గించాలని అధికారులను ఆదేశిస్తే వేడి తగ్గిపోతుందా? ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి బ్యాటరీ సైకిల్ తొక్కి ఫొటోలకు పోజులు ఇస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అయిపోతుందా?.అవసరమైన మేర భూమి తీసుకుని కావల్సిన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి, వేల ఎకరాల పచ్చటి పొలాలను సమీకరించి, వేల కోట్లను ఓ 30 గ్రామాల పరిధిలో వెచ్చిస్తే ఏపీ ప్రజలందరికీ ఎలా ఉపయోగం జరుగుతుందో తెలియదు. అమరావతి గ్రామాలలో భూమి స్వభావం భారీ భవంతుల నిర్మాణానికి అనువుకాదని పలువురు నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు అనుసరించవలసిన పలు షరతులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించినా వాటిని గాలికి వదలివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో అమరావతిలో జరుగుతున్న పర్యావరణ వినాశనం గురించి పవన్ గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్నది తప్పు అని స్పష్టంగా చెప్పారు. అవసరమైతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కూడా ఆయన ఆనాడు హెచ్చరించారు.2024 నాటికి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వెంటనే ఆయన వైఖరి కూడా మారిపోయింది. ఇప్పుడు అమరావతిలో పర్యావరణ విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు కృష్ణా తీరం వెంబడి ఉన్న కరకట్ట ఇంటిలో ఉండడాన్ని కూడా పవన్ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక ఆ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన లింగమనేని రమేష్‌ను జనసేన పక్షాన రాజ్యసభకు పంపారు. ఈయన చంద్రబాబును మించి అవకాశవాదం ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రిషికొండపై అప్పటికే ఉన్న టూరిజం నిర్మాణాలను తొలగించి ప్రతిష్టాత్మకమైన రీతిలో కొత్త భవనాలను నిర్మిస్తే అది పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని, కొండకు గుండు కొడతారా అంటూ దుర్మార్గంగా చంద్రబాబు, పవన్ విమర్శించేవారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అయితే శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు వార్తలు ఇచ్చేది. ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించారు. గూగుల్ అదానీ డేటా సెంటర్ పేరుతో వందల ఎకరాల కొండలను ఇచ్చేశారు. వాటిని ఆ సంస్థలు తవ్విపారేస్తున్నా కిక్కురునడం లేదు. ఇప్పుడు సింహాచలం కొండలకు గుండు కొట్టినా అది సుందరమేనని వీరు భావిస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలు డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం, నీటి సమస్య, కరెంటు సమస్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని వ్యతిరేకిస్తున్నాయి. దానితో ఆ బహుళజాతి సంస్థలు అభివృద్ది చెందని, అభివృద్ది చెందుతున్న భారత్ వంటి దేశాలపై దృష్టి పెట్టాయని అమెరికాకు చెందిన ఒక మీడియా ఓ కథనాన్ని ఇచ్చింది. డేటా సెంటర్లు రావడం వల్ల ఏపీకి ప్రయోజనం అయితే స్వాగతించవచ్చు. కానీ వాటివల్ల ఎక్కువగా పర్యావరణ అనర్థం జరుగుతుంటే, దానికి ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే విశాఖకు తీరని నష్టం జరుగుతుందన్న భావన ఉంది. దానిపై ప్రజలలో కూడా అలజడి ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డేటా సెంటర్ల వల్ల వచ్చే సమస్యలను ఆలోచించకుండా, కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడితే ఏపీకి ముఖ్యంగా విశాఖకు ఏం ప్రయోజనం కలుగుతుంది?. పైగా ఆ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ దీనిపై అభ్యంతరం చెబుతూ ఇప్పటికే చంద్రబాబుకు లేఖ రాశారు. రిలయన్స్ సంస్థ ప్రతిపాదిస్తున్న డేటా సెంటర్‌కు ఏభై వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారని, అయినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదని ఆయన అన్నారు. వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయో, రావో తెలియని గూగుల్ డేటా సెంటర్‌కు 22వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. మరో పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య విశాఖ కొండలను తొలిచివేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కొండపై జగన్ నిర్మాణం చేస్తే విధ్వంసం, కూటమి ప్రభుత్వం చేస్తే అభివృద్ది అవుతుందా? అని ప్రశ్నించారు.ఇక సముద్ర తీరంలో నిర్మాణాల నిమిత్తం సీఆర్‌జడ్ నిబంధనల మార్పునకు సూచనలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు విశాఖ బీచ్‌లో మద్యం పాకలను అనుమతించడంపై కూడా జనం మండిపడుతున్నారు. అమరారాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యాన్ని సరిచేసుకోవాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇస్తే, పరిశ్రమను తరిమేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఘనత టీడీపీది, ఎల్లో మీడియాదే. ఇప్పుడేమో కాలుష్యంపై మరో రకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. ఆయన సందర్భాన్ని బట్టి అభిప్రాయాలను మార్చేసుకుంటారు. కొద్ది కాలం క్రితం సమీక్షలో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇతర శాఖల ప్రతిపాదనలకు గాను అడవులలో చెట్టు నరకడానికి, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన కోప్పడ్డారు. పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం ఏభై శాతం పచ్చదనమే లక్ష్యమని గంభీర ప్రకటనలు చేశారు.ఏపీలో కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది ఈ మద్య పవన్ రాజమండ్రి సందర్శన సందర్భంగా మరోసారి బయటపడింది. పేపర్ మిల్లు వ్యర్ధ జలాలపై తనకు ఎదురైన సమస్యను మంత్రి దుర్గేష్ వివరించగా, ఆయనపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ పరిశ్రమ వారు తనతో మాట్లాడాలని అన్నారట. రాబోయే గోదావరి పుష్కరాలలో కెమికల్ స్నానాలు చేస్తారా అని కూడా పవన్ సీరియస్‌గా ప్రశ్నించారు. దీనిని బట్టే గోదావరిలో ఏ మేరకు కాలుష్యం ఉందో అర్దం చేసుకోవచ్చు. ఏడాదిలోగా దీని నివారణకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారన్నదానిపై ఆయనే సందేహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరిలో నదీ కాలుష్యం తీరుతెన్నులను కూడా ప్రస్తావించారు. చిత్తశుద్దితో ఆయన కాలుష్య నివారణకు ప్రయత్నిస్తే మంచిదే. కానీ, ఏదో సినిమాటిక్‌గా డైలాగులు చెప్పి ఊరుకుంటే ఉపయోగం ఉండదు. గ్రామాలలో చెత్త లేకుండా చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా, పరిస్థితి పెద్దగా మారినట్లు కనబడదు. ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణను ఒక నినాదంగా మార్చేసి తాము చేయవలసిన విధ్వంసం యథావిధిగా కొనసాగిస్తే ఏపీకి తీరని నష్టం చేసినవారు అవుతారేమోనన్న విషయాన్ని కూటమి పాలకులు ఆలోచించుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సర్కార్ గుట్టు రట్టు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతలలో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలలో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాలలో సాధించిన విజయాల గురించికన్నా మాజీ సీఎం జగన్‌ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే, పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నం చేశారే తప్ప, ఏ రకమైన విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు.నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్‌ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమం నిర్మించిన భవనాలలో చంద్రబాబు, కీలక మంత్రి లోకేష్‌లతో పాటు పలువురు పలుకుబడి కలిగినవారు నివసించడం ఏ రకంగా చట్టబద్దమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు.అమరావతి గ్రామాలలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్‌పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా కనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు అంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. కాని ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడిన విషయాలలో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్‌కి ఎల్లో మీడియా హెడింగ్ పెట్టింది.అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు. కాని ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, నాలుగు ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని నిర్మించడం, గ్రామ, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి నిర్మించడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను, ఏవి వీలైతే వాటన్నిటిని ప్రైవేటువారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 95 శాతం వైఎస్ జగన్ చేసి చూపించారు.మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? ఒక్కటి, అరా తప్ప, ఏదైనా స్కీమ్ ను నిక్కచ్చిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని చేసేశామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. ఆయన టైమ్‌లో లక్షన్నర ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యతుత్తు ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేశారు కాని, అందులో జరిగిన అక్రమాలపై జగన్ వీటిపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారు.తనకు నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో ఉంచారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్‌పై కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా! అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు ఏభై వేల కోట్ల అప్పు తీసుకువచ్చి ఒకేచోట ఖర్చుచయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఆరువేల లోపు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 17 వేల నుంచి ఇరవై వేల వరకు వ్యయం చేయడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయా?లేదా? అన్నది చేస్తున్నది వివరించాలి కదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులు ఎత్తివేయడం సరైనదేనా? సంపద సృస్టించడం తెలుసునని ఎన్నికల ముందు కొట్టిన గప్పాలన్నీ అబద్దాలనేనని ఒప్పుకుంటారా? ఈ స్కీమ్‌ను అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే సూపర్ సిక్స్ అన్నీ చేసేశాం అంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అని అన్నారు. మరి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇరాన్ యుద్దంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అంటూ స్పీచ్‌లు ఇచ్చింది చంద్రబాబే కదా! మరి ఇప్పుడు యుద్దం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లు అన్నీ అబద్దాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో పది లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్దమా? నిజమా? అన్నది చంద్రబాబుకు తెలియదా?వైఎస్ జగన్ టైమ్‌లో కరోనా ఉన్నప్పటికీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పు ఎలా చేశారో చంద్రబాబు చెప్పాలి కదా!ఎంతసేపు బురద వేయడమేనా? వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు, లోకేష్‌లు వ్యాఖ్యానించడంపై సజ్జల, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్‌కు వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. తమది పరశురాముడి గొడ్డలి అని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి కూకటి వేళ్లతో పెకలిస్తుందని వారు ధైర్యంగా చెప్పారు.టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న విమర్శను చంద్రబాబు, లోకేష్ లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వంతు అబద్దాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమంటూ నీతులు చెప్పే యత్నం చేశారు. కాని ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎంతగా కుల, మత, విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలియదా! లోకేష్ తన స్పీచ్‌లో జగన్‌పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.ఎందుకంటే గతంలో నార్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్‌లు ఆయనపై చేసిన ఆరోపణల వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైఎస్ జగన్‌పై అనవసర వ్యాఖ్యలు చేసి.. ఈ సమస్య తెచ్చుకోవడం లోకేష్‌కు ప్రయోజనమా? అవి ప్రచారంలోకి రావడం లోకేష్ కు ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. విమర్శలలో హుందాతనం ఉండాలి. సంస్కారయుతంగా ఉండాలి. కాని చంద్రబాబు మాదిరి ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరబడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం.రెడ్‌బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతోందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కుంటూ నిరసనలు తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలావరకు మొక్కుబడిగా ఉన్నట్లు కనిపిస్తే, వైఎస్సార్సీపీ క్యాడర్ హోరెత్తించినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ తన మానిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబేమో ఆ మానిఫెస్టోని, ఎన్నికలలో ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాఫ్టర్ లో వస్తూ చదువుకున్నారట! ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ప్రకటించి, ప్రజలను మభ్య చేసింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికలలో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు కానీ.. ఏభై లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే, పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ ప్రజలలో దూసుకువెళ్లడానికి వెన్నుపోటుకు రెండేళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తికమక పడుతుంటే, జనం తమవైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైఎస్సార్సీపీలో తొణికిసలాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాలం మారింది.. మీకు మిగిలింది మూడేళ్లే జనం మనసులో జగన్
-
మీరు చేసే పని.. జగన్ చేస్తే తట్టుకోగలరా..
-
బాబూ.. పవన్, లోకేశ్ వెళ్తే సరిపోతుందా?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాదం మాటలకందనిది. మామూలుగా వేడి నీళ్లు పడితేనే తట్టుకోలేం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉన్న ఇనుప ద్రవం మీద పడితే అది ఎంత దారుణ పరిస్థితి అవుతుందో చెప్పనవసరం లేదు. అలాంటి వాతావరణంలో పనిచేయడమే కష్టం. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంత కష్టం. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. వారి కుటుంబ సభ్యులు పడే మనోవేదన ఇంతింత కాదు. వారు అంత కష్టంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు వెళ్లి ఓదార్చే యత్నం చేస్తారు. ఆ సమయంలో కార్మిక సంఘాల నేతలు వచ్చి తమ సమస్యలను వివరిస్తారు. వాటిని వినే ఓపిక పరామర్శకు వెళ్లిన నేతలకు ఉండాలి. అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చనుకుంటే అది పొరపాటు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్‌లు కార్మికులను ఎంతవరకు ఓదార్చారో కాని, వారి మాటలు పుండుమీద కారం చల్లినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విశాఖలో కార్మికుల కుటుంబాలను పరామర్శించిన తీరుకు, లోకేష్, పవన్‌ల వ్యవహార సరళికి మధ్య ఉన్న అంతరాన్ని అంతా చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే, జగన్ మాత్రం బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది.ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు వెళ్లాలి. వారికి అవసరమైన భరోసా ఇచ్చి రావాలి. చంద్రబాబుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా మసులుకోవాలో తెలుసు. అయినా ఆయన ఎందుకు విశాఖ వెళ్లలేదో, కార్మికులను పరామర్శించలేదో తెలియదు. బహుశా తన తరపున కీలక మంత్రిగా ఉన్న లోకేష్ వెళితే సరిపోతుందని అనుకున్నారేమో తెలియదు. లేదా గతంలో కార్మికులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు నిలదీసే అవకాశం ఉందని అనుకున్నారేమో చెప్పలేం.మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లారు. సహజంగానే పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్‌కే ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన నేతలు గమనించకపోలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. తాను వెనుకబడిపోకూడదని అప్పటికప్పుడు వెళ్లారేమో తెలియదు. ఇంత పెద్ద ఘటనలు జరిగినప్పుడు కార్మిక వర్గాలలో ఆవేదన, ఆక్రోశం ఉంటుంది. తమ బాధను నేతలకు చెప్పుకునే యత్నం చేస్తారు. కొన్నిసార్లు నేతలను విమర్శిస్తుంటారు. అయినా అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. కాని దురదృష్టావశాత్తు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన విషయాలు చూడండి. కార్మిక నేతలు ప్రశ్నలు వేస్తుంటే, లోకేష్ అసహనానికి గురై ఎందుకు గొడవపడుతున్నారు. రాజకీయం చేయడానికి వచ్చారా? మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదుగా!' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.స్టీల్ ప్లాంట్‌ను తామే కాపాడామని, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వైపు చూస్తూ వీరు పోరాడారు అని లోకేష్ అన్నారు. ఆ మంత్రి ఎప్పుడు పోరాడారో ఎవరికి తెలియదు. పైగా స్టీల్ ప్లాంట్‌ను కాపాడామని లోకేష్ అనగానే అందుకే ఇంతమంది చనిపోయారా?అని కార్మిక నేత ఒకరు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మరో సందర్భంలో టీమ్ లెవెన్ కెప్టెన్ వచ్చారా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించడంపై అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదన్న విషయాన్ని విస్మరించి జగన్ పై వ్యాఖ్య చేయడమేమిటా అన్న ప్రశ్న వచ్చింది.స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కేవలం బ్యాంకు రుణాలు చెల్లించడానికి, కార్మికులకు వీఆర్ఎస్ చెల్లించడానికే ఖర్చు చేశారు తప్ప, ప్లాంట్ అభివృద్దికి పెట్టలేదని, ఇదే ప్రైవేటైజేషన్‌కు జరిగే కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక కర్మాగార యాజమాన్యం 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది. దీనికి లోకేష్ తగు సమాధానం ఇవ్వకపోగా, కార్మిక సంఘాలు అడుగుతాయని, వారిదేం పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరంగా కనిపిస్తుంది.గతంలో విశాఖలో ఎల్.జి.ఫాలిమార్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదమూడు మంది మరణించగా, జగన్ అప్పటికప్పుడు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రభుత్వ పక్షాన ప్రకటించారు. అప్పుడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాని ఇప్పుడేమో ప్రభుత్వపరంగా సాయం ప్రకటించలేదు. ఒకవైపు రకరకాల పబ్లిసిటీ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విశాఖ ఉక్కులో ఇంత ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలవారికి సాయం చేయలేరా అన్న ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ యధా ప్రకారం తనకు ఈ ప్లాంట్ విషయంలో అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడం కార్మిక సంఘాలకు ఆశ్చర్యం కలిగించింది.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణ చేసి మళ్లీ దొరికిపోయారు. మరుసటి రోజు జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత లోకేష్, పవన్ లకు గట్టి జవాబు ఇచ్చారు. తమ హయాంలో ప్రధానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది.. ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆధార సహితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గతంలో ఈ అంశం ప్రస్తావించి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని, అందువల్లే ఆ కార్యక్రమం జరగలేదని చెప్పిన వీడియో కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్లాంట్‌ను జగన్ ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుందని సోషల్ మీడియాలో పవన్‌కు ప్రశ్నలు సందించి ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ వ్యవహార శైలిపై జగన్ మండిపడుతూ లోకేష్ వంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో కార్మిక సంఘాలు అడిగిన సూటి ప్రశ్నలకు జవాబివ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ, ఎదురు సంఘాలపైనే లోకేష్, పవన్ లు విమర్శలు చేయడం కూడా బాగోలేదు. అలా కాకుండా ప్యాకేజీని ఎందుకు ప్లాంట్ అభివృద్దికి వ్యయం చేయలేదు?సుమారు పదివేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? పలు ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగిస్తున్నారు? ప్రైవేటు రంగంలో స్థాపిస్తున్న మిట్టల్ స్టీల్ కు కాప్టివ్ మైన్ ఇంత త్వరగా ఎలా కేటాయించారు. అరవై ఏళ్లకు పైగా నడుస్తున్న విశాఖ స్టీల్‌కు ఎందుకు కాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఓపికగా వీరిద్దరూ జవాబు ఇచ్చి ఉంటే బాగుండేది. కాని వారికి ఆ విషయాలపై అంత పరిజ్ఞానం ఉందో, లేదో గాని, వాటికి సమాధానం ఇవ్వలేదు. జగన్ మాత్రం అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఓపికగా మాట్లాడి స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడానికి తన ప్రయత్నాలను సావధానంగా వివరించారు. అలాగే బాధిత కుటుంబాలవారిని తనదైన శైలిలో ఓదార్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడంతో బాధితులకు కొంత సాంత్వన చేకూర్చినట్లయింది.గతంలో తన ప్రభుత్వం చేసిన మాదిరే అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చంద్రబాబు సర్కార్‌కు ఆయన సవాల్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. జగన్ విశాఖకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. ఏవేవో పిచ్చి ఆరోపణలు చేసి జగన్ టూర్ పై విషం చిమ్మే యత్నం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్, లోకేష్ లు ముందుగా తెలుసుకుని రావాలని కార్మిక సంఘాలు చేస్తున్న సూచన అర్థవంతమైనదే అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రెండేళ్ల బాబు పాలన.. ప్రసంగాలకే పరిమితం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రోజురోజుకు బలహీనపడుతోంది. ప్రజలలో విశ్వాసం కోల్పోతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిత్యం హెలికాఫ్టర్ వేసుకుని ఎక్కడో చోటకు వెళ్లి ప్రసంగం చేయకపోతే ఆయనకు నిద్రపట్టదేమో తెలియదు. ఒకవైపు దుబారా వ్యయం అదుపు చేయాలని ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది.స్వయంగా సీఎం గారే అవసరం ఉన్నా, లేకపోయినా హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలలో పర్యటిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు నీళ్లమాదిరి వ్యయం చేస్తుంటారు. పోనీ ప్రసంగాలలో ఏమైనా నిజాయితీ, ఆదర్శం, నిబద్ధత కనిపిస్తాయా అంటే అదేమీ ఉండదు. ఆయన స్పీచ్ ఇచ్చినంతసేపు వైఎస్సార్ కాంగ్రెస్‌ను, మాజీ సీఎం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకుంటారు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని, విధ్వంసం అని రకరకాల పదజాలాలతో ప్రజలను విసిగిస్తుంటారు. లేదంటే తాను చాలా చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పి ప్రజలు విస్తుపోయేలా చేస్తుంటారు. తత్ఫలితంగా ఆయన సీనియారిటీ అంతా ఇలా ప్రత్యర్ధులపై బురద జల్లడానికే సరిపోతుంది. అందువల్లే ఆయన ప్రజలలో గౌరవం పెంచుకోలేకపోతున్నారు.మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపడుతున్న ఈ నిరసనలలో వైసీపీవారు లేవనెత్తుతున్న అంశాలకు చంద్రబాబు కాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాని, కీలక మంత్రి లోకేష్ గాని సూటిగా జవాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో సాగిన అరాచకాలు, హామీల ఎగవేత మొదలైన అంశాలను వీరు ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ లెట్ కూడా విడుదల చేశారు. వీటిని వైసీపీ నేతలు చదివి వినిపిస్తున్నారు. గ్రామ, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టారు.12వ తేదీన నియోజకవర్గ కేంద్రాలలో భారీ ర్యాలీలు తీసి ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన బాండ్లను దహనం చేయ సంకల్పించారు. ఇది సహజంగానే చంద్రబాబుకు చికాకుగా ఉంటుంది. ఆ బాండ్లలో ఉన్న హామీలు ఏ మేరకు తీర్చింది? ఇంకెన్ని నెరవేర్చాలి? అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు? మొదలైన వాటి గురించి చంద్రబాబు, పవన్, లోకేష్‌లు చెప్పలేకపోతున్నారు. తాము ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ధైర్యంగా ఇవి చేశాం అని చెప్పగలిగితే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుంది. అలాకాకుండా సూపర్ సిక్స్ చేసేశాం అని దబాయించితే సరిపోతుందా! వృద్దాప్య పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే హామీని పూర్తిగా నెరవేర్చినట్లు కనిపించదు.వృద్దాప్య పెన్షన్లలో కొన్ని లక్షల మందికి కోత పెట్టారన్న విమర్శ ఉంది. అలాగే కొన్ని లక్షలమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటికి ఇస్తారో తెలియదు. కాకపోతే ఎల్లో మీడియా అది జరిగిపోతుంది.. ఇది జరిగిపోతుంది అని ప్రజలలో భ్రమలు కల్పించడానికి నానా పాట్లు పడుతోంది. సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన ఆడబిడ్డ నిధి హామీ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఆ మద్య పీ-4 ద్వారా వీరికి ఏదో చేసేశామని చెప్పే యత్నం చేశారు. కాని జనం దానిని అసలు స్వీకరించలేదు. ఆ విషయాన్ని గుర్తించారేమో పీ-4 గురించి పెద్దగా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు మూడువేలు ఇస్తామన్న హామీని అలాగే గాయబ్ చేశారు. పైగా 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజలలో ఆగ్రహానికి కారణం అవుతోంది.బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బాండ్ రాసిచ్చారు. కాని దాని ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు కొత్తగా నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి మూడేళ్లు పడుతుందని సెలవిచ్చారు. ఇంతకీ జగన్ టైమ్‌లో జరిగిన దుర్మార్గం ఏమిటో మాత్రం చెప్పరు. అప్పుడు జరిగిన విధ్వంసం ఏమిటో వివరించలేరు. జగన్ రెండేళ్ల కరోనా సంక్షోభ ఉన్నప్పటికీ, ఐదేళ్లలో చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అయితే, రెండేళ్లలోనే అంత చంద్రబాబు సర్కార్ ఎలా చేసిందని ఎవరు అడిగినా జవాబు ఇవ్వరు. పైగా జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఆయన వయసుకు తగినదేనా?జగన్ కంటే ఎక్కువ సంక్షేమ స్కీమ్‌లు అమలు చేస్తామని చెప్పారా? లేదా? మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఏకకాలంలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేశారట. రెండున్నర లక్షలమంది వలంటీర్లను నియమించి అటు ప్రజలకు సేవలు, ఇటువారికి స్థానికంగా ఉపాది కల్పించిన జగనేమో ఏమీ చేయలేదట. వలంటీర్లకు ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తానని హామీ ఇచ్చి మొత్తానికి మంగళం పలికిన ఆయన పాలనేమో గొప్పదట. సచివాలయ ఉద్యోగులపై రకరకాల భారాలు పెడుతూ వారిని వేధిస్తున్న సంగతి అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి, ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసి, పవర్ చేతికి వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసిన దానిపై ప్రభుత్వ ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. మరి అందుకు జవాబు ఏది?వైసీపీవారిపై ఏది పడితే మాట్లాడతారు. గంజాయి బాచ్ అంటారు. తీరా చూస్తే ఆయన పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సంగతి మాత్రం కనుమరుగు చేయాలని చూస్తారు. ఇది రైతు ప్రభుత్వం అని చెబుతారు. కాని అన్నదాత సుఖీభవ కింద ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇచ్చారు. అసలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఎన్ని స్కీములను ఎగవేసింది ప్రజలకు తెలియదా? మాట్లాడితే గొడ్లలి పార్టీ అని అంటే సరిపోతుందా? ప్రజలకు కడుపు నిండుతుందా? హామీల బాండ్ల గురించి జనం మర్చిపోతారా?జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలో తీసుకువస్తే, వాటిని ప్రైవేటీకరించడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దానిని కదా విధ్వంసం అనాల్సింది. నాలుగు పోర్టులను జగన్ టైమ్‌లో నిర్మించే కృషి ఆరంభించారు. వాటిని ప్రైవేటురంగానికి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నారు. దానిని కదా ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేడం అనేది. ఆర్టీసీని నీరుకార్చి ప్రైవేటురంగానికి ఆస్తిగా మార్చుతున్నారన్న అభిప్రాయం కార్మికులలో ఏర్పడింది. దానిని కదా దోపిడీ అనాల్సింది. అమ్మకానికి మున్సిపల్ ఆస్తులు, పట్టణ సేవలన్నిటిని ప్రైవేటీకరించడం, తద్వారా ప్రజలపై విపరీత భారం వేసే యోచనను కదా ప్రజా వ్యతిరేక పాలన అని అనాల్సింది. బీచ్‌లలో బార్లు, మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని కదా వినాశన విధానాలు అని అనాల్సింది.మద్యం విచ్చలవిడిగా పారిస్తూ ఆంధ్ర సమాజాన్ని పాడు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెబుతారు. అధికారులు ఆశించిన రీతిలో స్పందించలేదని ఆయనే అంటారు. అయినా ప్రభుత్వం బ్రహ్మాండం అని జనానికి చెబితే ఎలా నమ్మాలి. అంతెందుకు కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులపై ఆయనే భయపడిపోయి, తాను ఇన్‌చార్జీగా పెట్టిన వ్యక్తినే మార్చేసుకున్నారే! ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ రెండేళ్లలో కూటమి పాలన గాడితప్పిందని అన్నారు. ఏమి సాధించారని ప్రజలలోకి వెళతారని, స్వర్ణాంధ్ర కాదు.. విషాదాంధ్రగా మార్చారని ధ్వజమెత్తారు.ఇక గొడ్డలి అంటూ చంద్రబాబు చేసే అర్థం, పర్ధం లేని వాఖ్యలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ హీరో, చంద్రబాబు విలన్ అని, అందుకే రాజకీయంగా చంద్రబాబు పాలనను అంతం చేసే గొడ్డలి జగన్ చేతిలో ఉందని ఆయన భయపడుతున్నారని సజ్జల బదులిచ్చారు. పరశురాముడి గొడ్డలి అన్యాయం, అక్రమాలపై వేటు వేసిందని, అలాగే చంద్రబాబు అరాచక పాలనను అంతం చేయడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తాను ఇచ్చిన హామీల మేరకు ఏమి పూర్తి చేసింది చెబితే ఉపయోగం తప్ప, గొడ్డలి, విధ్వంసం అంటూ పిచ్చి డైలాగులు చెబితే తమకు ఏమి లాభం అని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
టీడీపీ గేమ్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ కొత్త వేషం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లు కూడా జెన్-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.నేపాల్‌లో కొంతకాలం క్రితం జెన్-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.అప్పటి నుంచే జెన్-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్‌ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు పెడుతున్నారు.స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.పవన్ కళ్యాణ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్‌లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్‌కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఏపీలో జెన్-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్‌లో కూడా అలా చేయబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు పెట్టిన జనసేన జెన్-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్‌లు ఏదైనా మంచి పని చేస్తే పవన్ కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్ ప్లాన్‌లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రత్యర్థులపై దూకుడు.. రేవంత్ సెల్ఫ్ గోల్స్?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏదో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఎన్.టి.ఆర్ విహ్రహ ఆవిష్కరణ సభలో ఇందిరాగాంధీతో పాటు ఎన్.టి.ఆర్ స్పూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రసంగం చేయడం, తదుపరి మరో సందర్భంలో హిట్లర్ స్పూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం చూస్తే, రేవంత్‌లో ఏదో భయం వెన్నాడుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది.అవసరం ఉన్నా, లేక పోయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రస్తావించి సవాళ్లు విసరడం, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదం అవుతోంది. రేవంత్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తెలియకుండానే అవేవో సాధారణ విమర్శలు అన్నట్లు మాట్లాడుతున్నారా అన్నదానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సభలో రేవంత్ ఉపన్యాసం ఇస్తూ కేసీఆర్‌ను ఉద్దేశించి.. 'కేసీఆర్ రాసిపెట్టుకోండి.. మీ పార్టీని పాలమూరులో మళ్లీ మొలకెత్తనీయం.. మీ పదేళ్ల పాలన.. మా రెండున్నర ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా? చర్చలో ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా.. లేదంటే మీరు ఫామ్ హౌస్‌కే పరిమితం కండి' అని అన్నారు. ఇదో చిత్రమైన సవాల్ కదా!అధికారంలో ఉన్నప్పుడు తిరిగి గెలుస్తామన్న విశ్వాసం ఉండటం తప్పు కాదు. దానిపై ప్రచారం చేయడం కూడా అభ్యంతరకరం కాదు. కానీ, దాని గురించి చెప్పిన తీరు మాత్రం బాగోలేదు. గతంలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిరిగి పవర్లోకి రావడం అసాధ్యమేమో అన్న అభిప్రాయం ఉండేది. కాని రేవంతే పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ అధికారాన్ని సాధించింది. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్నది నానుడి. అది బీఆర్ఎస్ కైనా, కాంగ్రెస్ కైనా మరే పార్టీకైనా వర్తిస్తుంది.కేసీఆర్‌ను చర్చకు సవాల్ చేసినా ఆయన పట్టించుకోరన్న సంగతి తెలిసందే. అదేదో కేటీఆర్ కో, హరీష్ రావుకో సవాల్ విసిరి ఉంటే వారేమైనా స్వీకరించేవారేమో! అయితే, వారితో తనకు పొంతన ఏమిటి అని అనుకుని ఉండవచ్చు. నిజంగా కేసీఆర్ చర్చకు సిద్ధమైతే అది రసవత్తరంగా ఉంటుందని చెప్పవచ్చు. కేసీఆర్‌కు ఉన్న భాష, ప్రసంగ సామర్ద్యంతో పోల్చితే రేవంత్‌కు కాస్త తక్కువే అని చెప్పక తప్పదు. అయినా పోటీపడటంలో తప్పు లేదు. కాకపోతే ఈ చర్చకు ఎవరు మధ్యవర్తిగా ఉండాలి? బయట ఇలాంటి చర్చలు నిర్వహించే రోజులు గతంలో అయితే ఉండేవి కానీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలలో అది సాధ్యం కాదు. తాను చర్చలో ఓడిపోతే క్షమాఫణ చెబుతానని అనడమే వింతగా ఉంటుంది. సవాల్ అన్నది ఇరువైపులా సమాన స్థాయిలో ఉంటుంది. కాని ఇలా ఒకరు క్షమాపణతో, మరొకరు రాజకీయాల నుంచి తప్పుకోవడం జరగదు కదా!ఈ ప్రసంగం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది హిట్లర్ గురించి రేవంత్ మాట్లాడడం. హిందూ దినపత్రిక నిర్వహించిన సెమినార్లో ఆయన హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నిరోధం, ప్రభుత్వ భూములను కాపాడడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా గురించి గొప్పగా చెప్పారు మంచిదే. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ కు షార్ట్ కట్ లో హైడ్రా అంటున్నారు. దీనికి, జర్మని నియంత హిట్లర్ సమయంలో పిలిచిన హైడ్రా పేరుకు అసలు పోలికే లేదు. మరి ఎవరి సలహాతో ఆయన ఈ పదాన్ని వాడి హిట్లర్ ను పొగిడారో అర్థం కాదు. బహుశా హిట్లర్ చరిత్రను రేవంత్ సరిగా అధ్యయనం చేయలేదేమో అన్న అభిప్రాయం కలుగుతుంది.మన దేశంలో గతంలో హిట్లర్ పాలన రావాలి అని కొందరు అనేవారు. దానికి కారణం నియంతృత్వానికి భయపడి అంతా క్రమశిక్షణగా ఉంటారన్న ఉద్దేశం కావచ్చు. ఎమర్జెన్సీ పాలనలో డిక్టేటర్ షిప్ చూసిన తర్వాత హిట్లర్ని ప్రశంసించేవారు లేకుండా పోయారు. ఎమర్జెన్సీ వల్ల ఇందిరాగాంధీకి ఎనలేని అప్రతిష్ట వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పాలనలో జరిగిన అరాచకాలతో జనం అల్లాడారు. నాజీల వంటి కొంతమంది అతివాదులు, మూర్ఖులు మినహా ఎవరూ హిట్లర్ ను సమర్ధించేవారు కారు. చివరికి యుద్ధం ముగింపులో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా రేవంత్ గమనించి ఉండాల్సింది. ఇది ఒక అంశం అయితే హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్స్ ను ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో జరుగుతున్న విధ్వంసంతో పోల్చుకోవడం ఏ మాత్రం సెన్సిబుల్‌గా లేదని చెప్పాలి. దారుణమైన రీతిలో అక్కడ విధ్వంసం జరుగుతుంటే దానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సమర్థిస్తున్నారా? అన్న ప్రశ్న వస్తుంది. అంతేకాదు. నిజంగానే యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించానని ఆయన భావిస్తుంటే అది పెద్ద తప్పు అవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించడానికి రేవంత్‌ను ఎన్నుకున్నారు తప్ప మరొకటి కాదు. యుద్ధ విధ్వంసంతో పోల్చుకోవడం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుందా? అన్న చర్చ కూడా వస్తుంది.హైదరాబాద్‌లో హైడ్రా టీమ్ యాక్టివిటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు చెరువుల ఆక్రమణలు తొలగించినప్పుడు, ప్రభుత్వ భూములను పరిరక్షించినప్పుడు మంచిపేరే వచ్చి ఉండవచ్చు కాని అదే టైమ్ లో అవసరం ఉన్నా, లేకపోయినా పేద, మధ్య తరగతివారి ఇళ్ళలను కూల్చిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. హైడ్రా తీరును పలుమార్లు హైకోర్టు తప్పు పట్టింది. ఆ సంగతి బహుశా రేవంత్ మర్చిపోయారేమో తెలియదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తనను తాను హిట్లర్‌తో పోల్చుకోవడానికి ఇష్టపడరు. దానికి కారణం మన దేశం ప్రజాస్వామ్య దేశం కావడమే. హిట్లర్ ది నియంతృత్వం. ఆయన పాలనలో ఎన్ని ఘాతుకాలు జరిగాయో చెప్పనలవి కాదు. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. అలాంటి వ్యక్తి రేవంత్ కు ఎలా స్పూర్తి అవుతారు?అసలు హిట్లర్ టీమమ్కు హైడ్రా పేరు లేదట. ఒకవేళ రేవంత్ అనుకున్నట్లు అలాంటిది ఉన్నా, ఎట్టి పరిస్థితిలోను దానిని ఆదర్శంగా తీసుకోవడం తెలివైన లక్షణం కాదని చెప్పాలి. నిజంగానే హైడ్రా అంత నిష్పక్షపాతంగా ఉండడం లేదన్న అభిప్రాయమూ ఉంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్య వివాదం ఏర్పడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూమి వివాదంపై హైడ్రా పరిశీలన చేయడానికి కూడా వెళ్లలేదే! అది వాస్తవమా? కాదా? అన్నది చెప్పలేదే! అందువల్లే బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తన కామెంట్లో హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు చేస్తున్నారని, హైడ్రా ఒక హంతక ముఠా అని ధ్వజమెత్తారు.రేవంత్ నిరంకుశ, పాష్టిస్ట్ మనస్తత్వం దేశం అంతటికి అర్థం అయిందని కేటీఆర్ ఎద్దేవ చేశారు. తమకు మాత్రం మహాత్మా గాంధీజి, అంబేద్కర్, జయశంకర్‌లు స్పూర్తి అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దీనిని రాజకీయ విమర్శగా చూడవచ్చు. అది వేరే సంగతి. రేవంత్ కు మిగిలిఉన్న ఇమేజీని కూల్చివేసే మాటలు ఇవి అని ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ అన్నారు. ఏది ఏమైనా రేవంత్ కు స్పూర్తి నివ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటివారు కాని హిట్లర్ కాదన్న సంగతి తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అత్తారింటికి దారేది సీన్ గుర్తొస్తోందా?.. పవన్‌పై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకునైనా మాట్లాడితే ఇంత అప్రతిష్ట మూట కట్టుకునేవారు కారన్న మాట రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హాస్య నటుడు బ్రహ్మానందం అబద్ధాలు చెబితే ఒక చెట్టు ఆకులు రాలుతుంటాయి. దాంతో ఆయన ఇరుకున పడతారు. ఇది పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుందనిపిస్తుంది. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలన్నది ఒక సామెత. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న నేర్పరితనం పవన్ కు ఇంకా రాలేదనుకోవాలి. చంద్రబాబు ప్రత్యర్థులు ఈ విషయం ప్రస్తావిస్తుంటారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవ చేసేవారు. అది వేరే కథ. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాత అనతికాలంలోనే దానికి విరుద్ధంగా మాట్లాడడం వంటివి తరచు చేస్తుంటారన్న విమర్శ ఉంది. వాటిని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపిస్తాయి. గతంలో కాపుకులం వారైనా తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరడం, ఇప్పుడేమో, తాను కాపులకోసమే పార్టీ పెట్టలేదన్నట్లుగా మాట్లాడడం, కాపులు మద్దతు ఇస్తే సీఎం అయి చూపుతానని ఒకసారి, తనకు అంత శక్తి ఎక్కడిదని ఇంకోసారి మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీలోనే దిక్కులేదని, తెలంగాణలో సీఎం అవుతానా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఫ్రస్టేషనా? లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఈ క్రమంలోనే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారేమో అన్న అనుమానంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని వైఎస్ అనుకున్నట్లు, ఆ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైకి వస్తే కాల్చేసే రోజులని, తాను తుపాకి పోలీసులకు ఇచ్చేసి ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఇది విన్న కొత్త తరం వారికి అందులో నిజం ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్న వారికి పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.ఇంత ఘోరంగా అసత్యాలు చెప్పవలసిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న వచ్చింది. దీనిని ఖండించి, ఎవరూ వాస్తవాలు చెప్పలేరులే అన్న ధైర్యమో, లేక నిజాలు తెలిసినా పర్వాలేదులే.. తాను చెప్పినవాటిని నమ్మే జనం ఉంటారులే అన్న భావమో తెలియదు. కాని దీనివల్ల తన పరువుకు భంగం అని ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆ వెంటనే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పాత చరిత్రను తవ్వారు. పవన్ తుపాకి కథకు సంబంధించిన వీడియోలను వెలికి తీశారు. వాటిని చూస్తే పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలుక్కున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా అసందర్భంగా మాట్లాడినట్లు కూడా అర్థం అవుతుంది.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ నేపథ్యంలోనే ఆయనకు సవాల్ విసిరారు. 2005 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పెద్దగా జనంలో ప్రాచుర్యం పొందిన నేతకాదు. కేవలం ఒక సినిమా నటుడిగా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత పవన్ ను యువరాజ్యం అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి అన్న వివాదాస్పద డైలాగుతో పవన్ బాగా ప్రచారంలోకి వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో 2014లో జనసేన ఆవిర్భావంతో ఒక ప్రముఖ రాజకీయ నేతగా అవతరించారు.2005 ప్రాంతంలో చిరంజీవి కుమార్తె ఒకరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబపరంగా ఏవో సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె పవన్ పై ఒక ఆరోపణ చేశారు. ఆయన వల్ల తమకు ప్రమాదం ఉందని అన్నారు. దాంతో పవన్ తన వద్ద ఉన్న తుపాకిని తెచ్చి పోలీసులకు అందచేశారు. ఆ టైమ్ లో అవే విషయాలను ఆయన మాట్లాడారు. కాని రెండు దశాబ్దాల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరించి వైఎస్ఆర్పై నింద మోపడంతో మరోసారి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాలో అబద్ధాలు ఆడితే ఆకులు రాలినట్లుగా, వీడియోలతో అసలు సన్నివేశం తెలిసిపోయింది. దీనిపై తొలుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రౌడీయిజం చేయబోతే చిరంజీవి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని వ్యాఖ్యానించారు.కాస్త ఆలస్యంగా కేవీపీ రామచంద్రరావు ఒక లేఖను పవన్ కు రాస్తూ తన ఆక్షేపణ తెలిపారు. పవన్ అసత్యాలు చెబుతున్నారని అందులో స్పష్టం చేశారు. వైఎస్ పై ఆరోపణలను రుజువు చేస్తే పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదా స్వచ్ఛంద సంస్థకు అందచేస్తామని సవాల్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుటుంబపరంగా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి రాజకీయ కేసులు లేవని కేవీపీ స్పష్టం చేశారు. సంబంధిత పోలీసు అధికారి ఎవరో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే ఈ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు. పవన్ కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు(పంచెలూడగొట్టాలని) చేస్తేనే కేసు పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంలో కేవీపీ కూడా బహుశా కంపల్షన్ రీత్యా ఒక వ్యాఖ్య చేసినట్లు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చాలామందిలాగానే పవన్ కూడా గుర్తించడంలో విఫలం అయ్యారని కేవీపీ అన్నారు. వైఎస్ ఆర్ మరణించాక ఆయన పేరు చార్జీషీట్ లో చేర్చిన రోజే కాంగ్రెస్ తో బంధం తెగిపోయిందని చాలామంది నమ్ముతారు. వైఎస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించి ఉండకపోతే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఆయనను పూర్తిగా వదలివేసి ఉండేదేమో!ఈ మధ్యకాలంలో వైఎస్ ఆర్ పైన, ఆయన కుటుంబంపైన అంత నీచంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా జవాబు ఇచ్చి ఖండించిందా? లేదే! పైగా ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో మిలాఖత్ అయిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి కదా! పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరో అడిగితేనే కాని స్పందించలేదని ఆయనే చెప్పడం కూడా గమనించదగిందే! కనీసం ఇప్పటికైనా స్పందించి అప్పటి పరిస్థితులను వివరించడం ద్వారా తన ఆప్త మిత్రుడైన వైఎస్ కు కేవీపీ కొంతలో కొంత న్యాయం చేసినట్లయింది.కేవీపీ చేసిన ఈ సవాల్ ను పవన్ స్వీకరిస్తారా అన్నది అనుమానమే. దానికి తగినట్లే ఆయన జవాబిచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన అనేక ప్రకటనలు, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఆయనే మాట్లాడిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పవన్, తెలంగాణలో మాత్రం రేవంత్, కేటీఆర్ తదితరులను పొగుడుతున్న తీరును జనం గమనించకపోలేదు. ఎప్పటికీ అది ప్రస్తుతమో అన్నట్లుగా కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తుంటారన్న భావన ఉంది. వైఎస్ పై కూడా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య ఆయనకే తగిలినట్లయింది. పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి వివిధ వర్గాలవారిని రెచ్చగొట్టి ఆంధ్రులకు ఇక్కట్లు తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘అక్కడ టెర్రరిస్టులున్నారా?’.. ఇంటి కూల్చివేతపై బాలశౌరి ఆగ్రహం
మచిలీపట్నం జనసేన లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక అధికారిక సమావేశంలో బందరు మున్సిపల్ కమిషనర్ ను నిలదీసిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎపిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత ఆరాచకపాలన చేస్తున్నదో ఆయన మాటలను బట్టి అర్దం అవుతుంది. మచిలీపట్నంలో జనసేన స్తానిక నేత ఒకరి ఇంటిని మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కూల్చివేయించారు. అందుకు సుమారు 200 మంది పోలీసుల సాయం కూడా తీసుకుని కమిషనర్ ఆ విధ్వంసానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని బాలశౌరి ప్రస్తావించి ఎవరు చెబితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చారని, అతనికి దీనివల్ల నలభై లక్షల నష్టం వచ్చిందని సమాధానం ఇవ్వాలని కోరారు మచిలీపట్నం పౌర సమాజం మంచిది కాబట్టి సైలెంట్ గా ఉన్నారని, మరో చోట అయితే ఇంకో రకంగా ఉండేదని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయా అని ఆయన అడిగారు. అక్కడేమైనా టెర్రరిస్టులు ఉన్నారా. ఇల్లు కూల్చడమన్నది చిన్న విషయం కాదని, ఇద్దరు వ్యక్తుల మద్య ఉన్న ప్రైవేటు తగాదాలో మీరెలా జోక్యం చేసుకున్నారని ఆయనఅడిగారు.మహిళలు కాళ్లమీద పడి బతిమలాడుతున్నా పోలీసులు వినిపంచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకుని ఏమైనా చేశారా.పోలీసుల పాయం కావాలని ఏ ప్రాతిపదికన లెటర్ రాశారు. అదేమి మున్సిపల్ ఆస్తి కాదు కదా అని,ఇంటిలో పెళ్లి చేసుకోవడానికి ఇల్లు కట్టుకుటుంటే దానిని కూల్చుతారా? ఇదేనా ప్రెండ్ లీ ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఎంపీ అడిగినా కమిషనర్ మాత్రం మౌనంగా నిలబడిపోయారు తప్ప జవాబు ఇవ్వలేదు.దాంతో కలెక్టర్ దీనిని తేల్చాలని బాలశౌరి కోరారు. జనసేన కు చెందిన వ్యక్తి ఇంటిని కూల్చడం బందరులో టీడీపీ, జనసేన ల మధ్య రచ్చ రాజుకుంది. ఈ నేపధ్యంలో బాలశౌరి అధికారిక సమావేశంలో కడిగిపారేయడం చర్చనీయాంశం అయింది. జనసేన కార్యకర్తలు తమకు టీడీపీ నుంచి ఇబ్బంది వచ్చినా మౌనంగా భరించాలన్నట్లుగా పార్టీ అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినా ,బాలశౌరి మాత్రం కార్యకర్తల తరపున మాట్లాడడం ఆసక్తికరమైన అంశమే. ఈ ఇంటిని పడగొడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ అడ్డుకోవడానికి యత్నించినా అధికారులు వినిపించుకోలేదు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనల మధ్య పలు చోట్ల ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ఇదే మచిలీపట్నంలో ఒక జనసేన నేత ఏదో వ్యాఖ్య చేశారని ,టీడీపీ స్థానిక నాయకులు అతనిపై దౌర్జన్యం చేసి మోకాలిపై కూర్చోబెట్టిన ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో కలకలం సృష్టించింది. కొల్లూరు వద్ద జనసేన కార్యకర్తపై టీడీపీ మూకలు దాడి చేశాయట. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే , టీడీపీ వారు పోలీస్ స్టేషన్ లో బీతావహ వాతావరణం సృష్టించారని వార్తలు వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత ఒకరికి సంబంధించి వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.అప్పటి నుంచి అనేక చోట్ల ఘటనలు జరగకపోలేదు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ జనసేన తరపున సూటిగా టీడీపీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించడం లేదన్న ఆవేదన జనసేన క్యాడర్ లోను, ఆయన అభిమానులలోను నెలకొంది. మరో విశేషం చెప్పాలి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై లైంగిక వేధింపులు చేశారని, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చినా ఆయనపై చర్య తీసుకోలేదు. చంద్రబాబును విమర్శిస్తూ వేస్ట్ అని శ్రీధర్ వ్యాఖ్య చేసిన వీడియో బయటకు రాగానే అతని విప్ పదవికి పవన్ రాజీనామా చేయించారు. ఈ అంశం కూడా జనసేనలో చర్చకు దారితీసింది. అంతేకాదు.పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు అమిత్ షా తో భేటీ అయిన సందర్భంలో వచ్చిన ఒక సమాచారాన్ని ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించడంపై జనసేన కార్యకర్త కేసు పెట్టడం కూడా వివాదంగా మారింది. రాజకీయ అంశాలపై విశ్లేషణలు వచ్చినా, చర్చలు జరిగినా పోలీసు కేసులు పెట్టడం అంటే పార్టీ అంత బలహీనంగా మారిందా అన్న వ్యాఖ్యకు ఆస్కారం ఇచ్చారు. ప్రోఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసు ఎలా పెడతారని అనేక మంది ప్రశ్నించారు. ఇలాంటివాటిపై కేసులు పెట్టవలసి వస్తే ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టవలసి ఉంటుందో కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పొత్తు పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ఇచ్చింది. అది పవన్ ను బాగా డామేజీ చేసింది. అయినా ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్న వస్తుంది. జగన్ పై అయితే ఎల్లో మీడియా రాసినన్ని కల్పిత కధలు ఇన్నీ అన్నీ కావు. ప్రధాని మోడీని, అమిత్ షాను కలిసిన దాదాపు ప్రతి సందర్భంలోను ,అక్కడ కూర్చుని చూసినట్లు,విన్నట్లు రాసిన స్టోరీలు ఎన్నో ఉన్నాయి. అయినా వైఎస్సార్సీపీ ఎన్నడూ కేసులు పెట్టలేదు.కాని ఇప్పుడు తెలివిగా జనసేనను టీడీపీ ఇరికించి నాగేశ్వర్ పైన,కొన్ని మీడియా సంస్థలపైన టీడీపీ నాయకత్వం కేసులు పెట్టించిందని,దీనివల్ల జనసేనకే తీరని నష్టం వచ్చిందని ఆ పార్టీ వారే బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా నాగేశ్వర్ పై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు సైతం కూటమి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్లపల్లి గ్రామంలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతులను ఎమ్మెల్యే నరేంద్ర అనుచరులు నానా పాట్లకు గురి చేయడంపై ఆందోళన చెలరేగింది. రైతులు తమ మొక్కజొన్న ఉత్పత్తులను ఒక గోడౌన్ లో దాచుకుంటే అది వైఎస్సార్సీపీ నేత అంబటి మురళీదని ఆరోపిస్తూ దానికి సీల్ వేశారు.అది పెద్ద ఉద్యమంగా మారింది. వైఎస్సార్సీపీ నేతలు పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా రచ్చ చేశారు.తీరా చివరికి ఆ పంట అంతా రైతులదే అని తేలడంతో సీల్ తీయకతప్పలేదు.బాలశౌరి బందరులో జరిగిన ఘటనకే పరిమితం అయినా, వైఎస్సార్సీపీపైన ఈ రెండేళ్లలో జరిగినన్ని దాడులు ఇన్నీ అన్నీ కావు.వైఎస్సార్సీపీ తర్వాత జనసేనపై టీడీపీ రెడ్ బుక్ ప్రభావం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా జనసేన ఎంపీ బాలశౌరి ఈ మాత్రం అయినా ప్రతిఘటించి, గట్టిగా మాట్లాడినందుకు అభినందించాలేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ స్క్రిప్ట్‌లో మిస్సయిన మెయిన్ మెసేజ్!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ పార్టీలపైన లొల్లికి దిగడంలో వ్యూహం ఏమైనా ఉందా? లేక కాకతాళీయంగా జరిగిందా? ఆయన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం, తదుపరి హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో మీడియా మీట్ పెట్టి దాదాపు గంటసేపు తన భావజాలాన్ని ప్రదర్శించారు. అప్పుడప్పుడు ఆయనలో కనిపించే సినిమాటిక్ హాహా భావాలు, గొంతెత్తి అరవడం వంటివి ఆయన అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. కాని అసలు ఆయన ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఏమి మాట్లాడాలని అనుకన్నారు? ఏమి మాట్లాడారు? ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం వంటివి యథాప్రకారం జరిగాయనిపిస్తుంది.ఆయన ఏమి చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మెచ్చుకోవాల్సిందే. గందరగోళంగా సాగిన ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయని చెప్పాలి. ఆంధ్రలోనే తనకుదిక్కు లేదని, ఇక తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయన అన్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆంధ్రలో దిక్కులేదని అనడం ఏమిటి? అంటే తాను సీఎం కాలేనని మరోసారి స్పష్టం చేశారని అనుకోవాలా? తెలంగాణలో తానేమి చేయగలనన్నదానికి కట్టుబడి ఉన్నారా! అంటే లేదు. ఈరోజు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పోటీచేస్తుంది అని పవన్ చెప్పారు. తెలంగాణలో బలం లేదని తెలిసి కూడా ఎందుకు పోటీచేస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉండి ఉండాలి.ఇదేదో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నట్లు పిక్చర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీతో కలిసి జనసేన పోటీచేసింది. ఏడుచోట్ల పోటీచేస్తే ఆరుచోట్ల డిపాజిట్లు రాలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో వేళ్లమీద లెక్కించదగిన వార్డులలో గెలిచారట. అది గొప్ప విషయంగా ఆయన భావిస్తున్నట్లు ఉంది. తెలంగాణకు వస్తే తిరగనివ్వమని బెదిరిస్తారా? ఇది మీ అయ్య జాగీరా అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అవును.. ఇది మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల జాగీరే అంటూ ఘాటుగా బదులిచ్చారు. నిజానికి పవన్ ను ఎవరూ ఇక్కడ తిరగనివ్వబోమని అనలేదు. అన్నా దానిని ఎవరూ అంగీకరించజాలరు. కాని తెలంగాణవారిపై ఏపీ పోలీసులతో దాడులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.ఇదంతా డైవర్షన్ రాజకీయమా? అనే చర్చ జరుగుతోంది. తన పదెకరాల పొలం కోడి చెరువులో ఉందన్న ఆరోపణపై ఆయన నేరుగా స్పందించి, అందులో తప్పు జరిగిందా? లేదా? తాను తెలిసి కొన్నారా? తెలియక కొన్నారా? కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నట్లుగా నిషేధిత జాబితా నుంచి ఆ ప్రదేశాన్ని తొలగించడం నిజమా? కాదా? పదెకరాల భూమిని ఒకేసారి కాకుండా మూడు ఎకరాల చొప్పున విడతలవారీగా మ్యుటేషన్ చేయించుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి. అక్కడ బోర్ వేయడం కాని, పెన్సింగ్ ఏర్పాటు చేయడంపై కాని పవన్ కళ్యాణ్ వివరించి, జర్నలిస్టుల వాదన అసంబద్ధమని రుజువు చేసి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తన భూమి చెరువులో ఉందని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది కొంత నయమే అయినప్పటికీ, ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవిగా ఉన్నాయి.రేవంత్ అంటే తనకు ఇష్టం అని, గౌరవం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమి ఉంది? మర్యాద ఇవ్వడం తప్పుకాదు. కోడి చెరువు ప్రస్తావన సమయంలోనే ఈ మాటలు అనేసరికి, ఇదేదో మాచ్ ఫిక్సింగేమో అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీతో పరోక్ష స్నేహం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మామూలుగా అయితే చెరువుల కబ్జా ఆరోపణలు రాగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పలుమార్లు వాయువేగంతో స్పందించి, కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. పేద, మద్య తరగతి ప్రజలు పలువురు దీనితో రోడ్డున పడే పరిస్తితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు చెందిన భూమి విషయంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, ప్రభుత్వం అందులోని నిజానిజాలను ఎందుకు తేల్చలేదో తెలియదు. ఈ విషయంలో తప్పు జరగలేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైతే పవన్ కళ్యాణ్ కే మంచిది కదా!గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పోటీచేస్తున్నట్లే పవన్ చెప్పకనే చెప్పారు. తప్పు లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అది ప్రజాస్వామ్య హక్కు. అయితే టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేస్తారా? లేదా? అన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాగా ఇదంతా బీజేపీ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో రహస్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నది అందరికి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికలలో కాని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాని, ఎన్.టి.ఆర్.విగ్రహావిష్కరణ సభలో కాని ఇవన్ని ఓపెన్ గానే కనిపించాయి.చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆయనకు చెప్పే పవన్ ఇక్కడ ఈ మీడియా మీట్ పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఇరుకున పడతారు. తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పని చేస్తామని వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పడం కూడా గమనించదగిందే. వీరు కాంగ్రెస్ కు మేలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారా? లేక ప్రధాని మోడీ ఆశించినట్లు బీజేపీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారా? అన్నది తేలవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరిగినా బీఆర్ఎస్ ను దెబ్బగొట్టే వ్యూహమే ఉండవచ్చన్నది పలువురి భావనగా ఉంది.ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల వ్యక్తిగత ప్రయోజనాలు అధికంగా ఇమిడి ఉన్నందున కాంగ్రెస్ కు నష్టం చేసే పని చేయకపోవచ్చు. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కూడా పరోక్షంగా పవన్ మాట్లాడారు కాని, అదేమి అర్దవంతంగా లేదని చెప్పాలి. తానేమో అనేక అంశాలను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నాగేశ్వర్ రాజకీయ వ్యాఖ్యలపై జనసేన వారితో కేసులు పెట్టించడం పవన్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెంచింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వడానికి యత్నించినట్లు ఉంది. తానెప్పుడూ కేసీఆర్ ను ఏమీ అనలేదని ఆయన చెప్పడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ అనడం, అందుకు ప్రతిగా కేసీఆర్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని పవన్ అన్నారు. ఆయనది ప్రాంతీయ పార్టీనా? కాదా? అన్నది చెప్పాలి. అసలు ప్రాంతీయ వాదంతోనే పుట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు ఎలా పెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. దీనిని ఎలా చూస్తారు? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీలతో దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటున్నాయే. ప్రాంతీయ, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దహస్తులే అన్న విమర్శలు ఉన్నాయి.తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు నిరశన దీక్ష చేశానని ఆయనే ఒకసారి అంటారు. మరోసారి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతారు. తెలంగాణవారి దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు దగ్ధం అయ్యాయని కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇప్పటికీ తెలంగాణవాదుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుంది. గద్దర్ కు వెన్నులో బులెట్ దిగినప్పుడు ఆయన అడిగితే కారు కొని ఇచ్చానని చెబుతారు.. కాని గద్దర్ పై టీడీపీ ప్రభుత్వ టైమ్ లోనే కాల్పులు జరిగిన సంగతిని విస్మరిస్తారు. కొండగట్టుకు 30 కోట్ల డబ్బు ఇచ్చానని అంటారు. అది టీడీపీ డబ్బు కదా! అందులో తెలంగాణ భక్తుల సొమ్ముకూడా ఉంటుంది కదా అని తెలంగాణ వాదుల వ్యాఖ్య. వంగవీటి రంగాను కాపాడుకోలేకపోయారని కాపునేతలను విమర్శిస్తారు. రంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఈ హత్య చేశారని అంతా చెబుతారు. అయినా అదే టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారు.ఇలా పరస్పర విరుద్ధమైన రీతిలో ఏపీలో అనేక మార్లు వ్యవహరించినట్లుగానే తెలంగాణలో కూడా గందరగోళంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. తద్వారా ఇక్కడ రాజకీయాన్ని కలగాపులగం చేయడం లక్ష్యంగా పవన్ పని చేయడం ఆరంభించారా? అన్న సందేహం వస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
'బాబు'ది నో ఆన్సర్.. ఓన్లీ డైవర్షన్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై తోచిన ఆరోపణ చేయడం, వీలైనంత బురద చల్లడం, తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేయడం ఒక విధానంగా మార్చుకున్నారు. అబద్ధాలకు ఆకాశమే హద్దుగా పెట్టుకున్నారు. అదే బాటలో ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్ నడుస్తున్నారు. వీరి బాటే బాగుందనుకుని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దానినే అనుసరిస్తున్నారు. అందువల్లే ఏపీలో ప్రభుత్వం అంతా అస్తవ్యస్తంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం కాగ్ నివేదిక ఆధారంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దిష్ట విమర్శలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోందని, దానికి చంద్రబాబు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణమని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఆర్ధిక విధ్వంసమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులు పెరిగిపోయి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యాన్ని జగన్ ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు లేదా, ఆర్దిక మంత్రి కేశవ్ లేదా కీలక మంత్రి లోకేష్ వంటివారు ఏ మాత్రం స్పందించలేకపోయారు.రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేసి దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించిందన్న అంశంపై వీరెవ్వరూ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు. నిత్యం జగన్ గత ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. అసలు విషయాలు మాట్లాడకుండా అసత్యాలు వల్లెవేస్తుంటారు. దానికి బదులు ఇస్తే మొత్తం సమస్యను అటువైపు మళ్లించడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. చిత్రమేమిటంటే ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా తొమ్మిదివేల కోట్ల రూపాయల అప్పు చేసి, దానిని రికార్డులలో ఆదాయంగా చూపించారట. ఇది వినడానికే గమ్మత్తుగా ఉంది కదా! మనం ఎవరమైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే అది ఆదాయంగా భావించి ఖర్చు చేస్తామా? అవసరాలకు వాడుకుని, తద్వారా ఏదైనా సంపాదిస్తే, ఆ తర్వాత ఆ రుణ వాయిదా చెల్లించాక మిగిలితే దానిని ఆదాయంగా చూపిస్తాం. కాని ఇంత పెద్ద ప్రభుత్వం అప్పులనే ఆదాయం చూపడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? అవ్వదా ? అన్న ప్రశ్న వస్తుంది.మరో వైపు సొంత పన్నుల రాబడిలో 3.22 శాతం క్షీణించిందని లెక్కలు చెబుతున్నాయి. అయినా 10.75 శాతం వృద్ధిరేటు చూపడాన్ని జగన్ తప్పుపట్టారు. లిక్కర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వేలాది బెల్ట్ షాపులకు కొరత లేదు. అయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం 8.2శాతం తగ్గిందట. అంటే మద్యంలో భారీ స్కామ్ జరుగుతున్నట్లే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో మూల ధన వ్యయం కేవలం 7.31 శాతంగానే ఉండడం ఆందోళన కలిగించే అంశమే. ద్రవ్యలోటు రెండేళ్లలో 32 శాతంపైకి చేరుకుందని కాగ్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఆర్ధిక మంత్రి, లేదా ఆ శాఖ అధికారులు దీనిపై వివరణ ఇస్తారు. కాని వారు కూడా ఎవరూ మాట్లాడడం లేదు.ఈ పరిస్థితి ఇలా ఉంటే జగన్ ప్రభుత్వంలో విధ్వంసం అంటూ పడికట్టు పదాలతో డైలాగులు ప్రచారం చేస్తుంటారు. జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువస్తే వాటిని ప్రైవేటువారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నాలుగు ఓడరేవులను నిర్మించే పని చేపడితే వాటిని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయవలసిందేనని ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బహుశా చంద్రబాబు సూచన మేరకే కొనకళ్ల ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. తద్వారా జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఆయన ఖాతాలో వేయాలన్నది ప్రభుత్వ వ్యూహం కావచ్చు.పైగా మహిళలకు ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీ నష్టపోతోందని, అందువల్ల ప్రైవేటీకరణ చేయాల్సి వస్తోందని అంటున్నారంటే ఏమనుకోవాలి. ఆ వాగ్దానం చేయాలని ఎవరైనా కోరారా? అట్టహాసంగా ఆ స్కీమ్ ను ఆరంభించినప్పుడు వారికి దీనివల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని తెలియదా? దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా! అలాకాకుండా ఆర్టీసీని గాలికి వదలివేస్తారా? ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే అన్నివేల కోట్ల డబ్బు ఎక్కడ ఉందని ఆర్టీసీ చైర్మన్ అమాయకంగా జనాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్యనే సంస్కరణ యోధుడు అన్న అవార్డును అందుకున్న చంద్రబాబునాయుడు వీటికి జవాబు ఇవ్వవలసిన పని లేదా?2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆర్టీసీ 6300 కోట్ల అప్పుల్లో ఉంటే, ఉద్యోగులకు 3200 కోట్ల బకాయి ఉంటే, దానిని జగన్ టైమ్ లో రెండువేల కోట్లకు తగ్గించామని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. తమకు సంపద సృష్టించడం తెలుసునని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు కాకుండా ప్రైవేటువారికి సంపద సమకూర్చే పనిలో ఉన్నారని వైసీపీ మండిపడుతోంది. కొత్తగా తీసుకునే ఈ బస్ లన్నిటిని ప్రైవేటువారికే అప్పగిస్తే, అప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ భావన కావచ్చు. కాని దానివల్ల మొత్తం ఆర్టీసీ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఉచిత బస్ స్కీమ్ కు కూడా మంగళం పాడతారా? అన్న సందేహాన్ని తీర్చవలసి ఉంటుంది.ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి ఎవరికి పడితే వారికి రూపాయికి, అర్ధ రూపాయికి భారీగా భూములు కట్టబెడుతున్నారు. వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. అదే టైమ్ లో ప్రభుత్వం ఆ కంపెనీలకు ఎదురు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న తీరు గమనిస్తే, వచ్చే ఒకటి, రెండు దశాబ్ధాలలో ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ ఉండకపోవచ్చని ఒక ఆర్థిక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కేంద్రం చమురు ధరలు పెంచినా, గతంలో తామే అమరావతి పేరుతో నాలుగు రూపాయల సెస్ వేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రబుత్వం ఒక రూపాయి సెస్ వేస్తే, మొత్తం అంతటిని జగన్ ప్రభుత్వానికి రుద్ది ప్రచారం చేసేవారు. ఇప్పుడేమో పొదుపు అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం ప్రత్యేక విమానాలలో తిరగడం మానుకోరట. నిత్యం ఏదో చోటకు విమానాలలో, హెలికాఫ్టర్ లలో వెళ్లి సభలుపెట్టడం ఆపుతారా? లేదా? అన్నది తెలియదు. అమరావతి పేరుతో జరుగుతున్న దుబారాను అరికట్టడం లేదు. మరి వీటన్నిటిని ఏపీ అభివృద్ధిగా చూడాలా? లేక విధ్వంసంగా చూడాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రెండు పడవలపై రేవంత్ ప్రయాణం!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్‌ను ఏ విధంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడుగా చూడాలా? లేక కాంగ్రెస్‌కు స్పూర్తి ఇచ్చిన నేతగా చూడాలా? నిజంగానే ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. హైదరాబాద్ మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం ఒకవైపు, మహానాడులో తెలుగుదేశం చేసిన తీర్మానం మరో వైపు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్దంగా కనిపిస్తాయి. మహానాడులో చేసిన తీర్మానంలో ఏమి రాశారో గమనించండి.తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి, భవిష్యత్తు దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం అని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెత్తందార్ల మితిమీరిన జోక్యం, అడుగడుగునా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న వైనం ప్రతి తెలుగు గుండెను పిండేశాయి. అన్ని వర్గాలవారు తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నతరుణంలో 1982 మార్చి 28న ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారని ఆ తీర్మానంలో వివరిచారు.కాంగ్రెస్‌పై పోరాటం అన్న తీర్మానంలో ఈ అంశాలను పేర్కొన్నారు. అంటే దాని అర్థం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనే కదా! కాంగ్రెస్ అవినీతిపార్టీ అని చెబుతున్నట్లే కదా! దానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్.. కాంగ్రెస్‌కు ఎలా స్పూర్తి అవుతారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతిరత్నంలా ఎలా కనిపించారు?అందులో కూడా అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరగాంధీలతో సమానంగా ఎన్టీఆర్‌ను పొగిడారు. దీనిని కాంగ్రెస్ వాదులు అంగీకరించగలరా? ఆ రకంగా చూస్తే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రేవంత్ కూడా పెక్కుమార్లు వెళుతున్నారు కదా! అంటే ఇప్పుడు కూడా తెలంగాణవారి ఆత్మగరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లేనా?దానిని ఆయన ఒప్పుకుంటారా?అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడుగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నేత. అలాగే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విజయాలను దేశానికి అందించారు. కాని ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి రావడానికి ముందు సినీమా నటుడు. పలు సాంఘిక పాత్రలతో పాటు రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మాట నిజమే. ఆ రకంగా ఆయన గొప్పవాడే. తదుపరి ప్రజలలో తనపై ఉన్న సినీ క్రేజ్‌ను ఆసర చేసుకుని రాజకీయాలలోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటుు ఆఫర్ చేసి ఉంటే రిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ ఆయన అధికారం చేపట్టగలిగారు.తెలుగుదశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధిగా ఉంది. ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో ఎన్టీఆర్‌ను నాదెండ్ల భాస్కరరావు దించితే, అప్పుడు వచ్చిన ప్రజాందోళన, దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష సహకారం వంటి కారణాలతో తరిగి అధికారంలోకి వచ్చారు. కాని 1995లో స్వయాన అల్లుడి చేతిలో ఘోర పరభవానికి గురై ఆయన మళ్లీ పదవి కోల్పోయారు. 1985లో ఏపీలోని మూడు ప్రాంతాలలో పోటీచేసి గెలిచిన నేతగా రికార్డు ఉన్నప్పటికీ, 1989లో ఆయనే తెలంగాణలోని కల్వకుర్తిలో పోటీచేసి ఓటమపాలయ్యారు. తన పాలన కాలంలో తానిచ్చిన హామీలను నరవేర్చడానికి ఆయన కృషి చేసిన మాట నిజమే.అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దించడానికి నేషనల్ ఫ్రంట్ స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్‌కు స్పూర్తిని ఇచ్చిన అంశం ఏమిటో తెలియదు. అయిన ఫర్వాలేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ టీడీపీ మద్దతుదారులు, ప్రత్యేకించి కమ్మ వర్గంవారు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్‌ను కోరారు. అందుకు అంగీకరించి ఆ ప్రకారం విగ్రహ పెట్టించారు. విశేషం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ప్రచార ప్రకటనలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో విగ్రహం ఆవిష్కరణ చేసి రేవంత్ ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా వెళ్లపోయి ఉంటే ఇబ్బంది లేకుండా పోయేది. కాని ఎన్టీఆర్, ఇందిరాగాంధీల స్పూర్తిగా ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఒక హార్స్ పవర్‌కు ఏభై రూపాయలకే రైతులకు విద్యుత్ అందించారని, ఆ స్పూర్తితోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కర్షకులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పడం విడ్డూరమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం తదితర కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే1998లో మంగళం పలికారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేశాక ఆయన అవసరమే పార్టీకి లేదని, సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారని కూడా ప్రకటనలు చేశారు.ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని కేష్ చేసుకోడానికి చంద్రబాబు మళ్లీ రాగం మార్చి ఉండవచ్చు. కాని ఇందులో కాంగ్రెస్‌కు ఏమి సంబంధం. వైఎస్సార్ సొంతంగా ఉచిత విద్యుత్ స్కీమ్‌ను రూపొందించుకుని కాంగ్రెస్ అధిష్టానంతో ఓకే చేయించుకుని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కన్నా ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా రూ.1.90కే ఆ రోజుల్లో కిలో బియ్యం సరఫరా చేశారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత కాంగ్రెస్ నేత పివి నరసింహరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి దేశానికి ప్రధానిగా సేవలందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన జాతిరత్నం కాకుండా ఎలా పోయారు.బహుశా సోనియాగాంధీ ఆయన అంటే పడదు కనుక పివి పేరు ప్రస్తావించలేదేమో తెలియదు. ఆ మాటకు వస్తే జవహర్ లాల్ వంటి గొప్పనేతలు కాంగ్రెస్‌కు ఉండగా, ఎన్టీఆర్ పేరును అరువుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉంది. పైగా రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలందరిని తీవ్రంగా విమర్శించిన రీతిలోనే ,కాంగ్రెస్‌లోకి వచ్చాక ఎన్టీఆర్‌ను కూడా పరుష పదజాలంతోనే దుయ్యబట్టారు. మరి ఇంతలోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గొప్పదనాన్ని ఎవరూ కాదనరు. మా బోటి వాళ్లం అంతా ఆయన పార్టీని స్థాపించి నప్పుడు కేరింతలు కొట్టినవారమే.కాని వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన మాత్రమే తెలుగుజాతి ఆత్మగౌరవం ఆయన ఒక్కరే అంటే మాత్రం ఒప్పుకోవడం కష్టం. తెలుగుదేశం వారు అలా అన్నారంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ వాదుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. పనిలో పని తనకు గురువైన చంద్రబాబును కూడా ఆయన పొగుడుకున్నట్లుగా ఉంది.ఆయనేమో మహనాడు తీర్మానంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీ అని అంటారు. రేవంతేమో ఆ టీడీపీ గొప్పదని చెబుతున్నారు. అంతేకాదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక టీటీడీపీ నేత ప్రసంగిస్తే, విద్యావ్యవస్థకు ఒక మంత్రి లేకుండా తెలంగాణలో చేశారని, అది దౌర్బగ్యామని, లోకేష్‌తో పోల్చి రేవంత్‌ను మరో టీడీపీ మహిళా నేత విమర్శించారు. అయినా టీడీపీ నేతలను పొగడదలచుకుంటే ఎవరు అభ్యంతరం చెబుతారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని అంటారు.అలాగే కాంగ్రెస్‌ను అవమానించిన టీడీపీని రేవంత్ ఏదో కొన్ని ఓట్ల కోసం పొగుడుకుంటే మొత్తం కాంగ్రెస్ అభిమానుల నుంచి నిరసనలు గురయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికలలో టీడీపీ ఓట్లు గణనీయంగానే కాంగ్రెస్‌కు పడి ఉండవచ్చు. కాని భవిష్యత్తులో బీజేపీ ఒత్తిడి చేసి ఇక్కడ ఉన్న టీడీపీ మద్దతుదారుల ఓట్లను బీజేపీకి వేయాలని గట్టిగా కోరితే అప్పుడు ఇదే రేవంత్‌రెడ్డి ఏమి చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్‌కు సొంత ఐడియాలజీ ఉందన్న సంగతి రేవంత్ గుర్తిస్తే మంచిదేమో! లేకుంటే రేవంత్ రెండు పడవల మీద కాళ్లేసి ప్రయాణిస్తున్నారన్న అనుమానం ప్రజలలో రావచ్చేమో!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తీర్మానాల కంటే తిట్లకే ప్రాధాన్యం.. ఇదేనా మహానాడు?
నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చెప్పు.. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు..ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు.. కొన్ని చోట్ల సరిగా రాలేదు. జనాన్ని పోగు చేసే యత్నాలు చేశారు. కొన్ని చోట్ల చీరెలు కూడా పంచారు.. రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారు... గుడి, బడి, ప్రభుత్వ ఆఫీస్ దేనిని వదలకుండా ఆయా చోట్ల సభలు నిర్వహించి సరికొత్త ట్రెండ్ ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలలో ప్రభుత్వ ఆఫీస్ లకు కూడా పచ్చ జెండాలు కట్టారని వీడియోలు వచ్చాయి. ఇదంతా అధికార దుర్వినియోగమే కదా!ఇక మహానాడు ప్రధాన కార్యక్రమంలో ప్రసంగించిన కొంతమంది వక్తలను చూస్తే మతి పోవల్సిందే. కిరాక్ అంటూ ఒకాయన వైఎస్సార్సీపీ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను అసహ్యమైన బూతులతో దూషిస్తుంటారు. ఆయన ప్రసంగించడానికి మహానాడులో అవకాశం ఇవ్వడం అంటేనే ఆ సభ ఇంత నాసిరకంగా జరిగిందా అన్న అభిప్రాయం పలువురికి కలిగింది. ఏభై ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు అలాంటివారితో మాట్లాడించి, ఆసక్తిగా వినడం ఏమిటా అని పలువురు ముక్కున వేలేసుకున్నారు.ఇంకోక నాయకుడు ఎవరో చంద్రబాబు, లోకేష్ లతో పాటు దేవాన్ష్ అందాన్ని పొగుడుతూ ఉపన్యసించారు. బుద్దిగా చదువుకుంటున్న దేవాన్ష్ గురించి కూడా వీరు ప్రసంగిస్తున్నారంటే వీరికి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా పెద్ద సబ్జెక్టు లేదన్నమాట.గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు అధీనంలోకి పార్టీ స్వాధీనం అయిన తర్వాత కూడా కొన్నేళ్లు పార్టీ విధానాలపైన చర్చ జరిగేది. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై తీర్మనాలు చేసి తమ అభిప్రాయాలను తెలిపేవారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా జరిగిన లోటుపాట్లను కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఈసారి మహానాడులో ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దూషించడానికి, వైఎస్సార్సీపీపై తప్పుడు ముద్రలు వేసి ఆత్మ సంతృప్తి చెందడానికి, ఆత్మ వంచన చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సహజంగానే ఏ పార్టీ సమావేశంలో అయినా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల విధానాలపై విమర్శలు ఉంటాయి. కాదనం. కాని ఈ మహానాడులో అచ్చంగా వైఎస్సార్సీపీని బూతులు తిట్టడానికే టైమ్ కేటాయించినట్లు కనిపిస్తుంది. అంతే తప్ప తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏమిటి? వైఫల్యాలేమిటి? ఎందుకు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయాం. వచ్చే మూడేళ్లలో ఏమి చేయాలని అనుకుంటున్నాం.. తదితర అంశాల గురించి పెద్దగా ప్రస్తావించకుండా, అన్నీ చేసేశాం అన్న భ్రమ కల్పించే యత్నం చేశారు.మరో కీలకమైన పాయింట్ ఏమిటంటే గతంలో ఏ సభ పెట్టినా అమరావతి అంటూ తెగ ఊదరగొట్టేవారు. కాని ఈసారి దాని గురించి పెద్దగా ప్రస్తావించినట్లు కనబడదు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో మహానాడుకు ఫుల్ కవరేజీ ఇచ్చినా, ఈ పాయింట్లపై ఫోకస్ పెట్టకపోవడం గమనించదగ్గ అంశమే. ఇప్పటికే సేకరించిన ఏభై వేల ఎకరాలు కాకుండా అదనంగా ఎందుకు భూమి అడుగుతున్నారు? రైతులకు ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేకపోయారు? ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేయవలసిన అవసరం ఉందా? ఇప్పటికే 47వేల కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంకెంత అప్పు దీనికోసం చేస్తారు? రూపాయి కూడా ప్రభుత్వ ధనం వెచ్చించనవసరం లేదని గతంలో అన్నారు కదా! ఇప్పుడెందుకు మాట మార్చారు? ఇలాంటివాటిపై మహానాడు వంటి సభలలో వివరణ ఇచ్చి ఉంటే అర్థవంతంగా ఉండేది కదా! అన్ని ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకే కాకుండా, ప్రజలకు కూడా ప్రభుత్వ వాదన తెలిసేది కదా!ఎన్నికల మానిఫెస్టోలోని అంశాల గురించి చెప్పి ఎంతవరకు అమలు చేశామో వివరించడానికి కదా ఇలాంటి మహానాడులు జరిపేది. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామన్నారు.. ఎందుకు ఇవ్వలేకపోయారు.. దీని గురించి కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీ పరంగా 33 శాతం సీట్లు ఇస్తామని ప్రసంగిస్తే ఒరిగేదేమి ఉంటుంది? మూడేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?ఎన్నికల టైమ్ లో మహిళలకు పార్టీపరంగా సీట్లు ఎక్కువ ఇస్తే ఓడిపోతామని, అందువల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పరని గ్యారంటీ ఏమి ఉంది? నిరుద్యోగ భృతి మూడువేలు ఏమైంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఏమైంది? ఇలాంటి ప్రస్తావనలే లేకుండా మహానాడు ముగిస్తే ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? జగన్ తీసుకు వచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారో చెప్పాలి కదా!ఒకవైపు అమరావతికి వేల కోట్లు అప్పులు తెస్తూ మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటే టీడీపీ కార్యకర్తలైనా అంగీకరిస్తారా? చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు, అర్థ సత్యాలు చెప్పి పార్టీవారిని మభ్యపెట్టడం సరైన విధానం అవుతుందా? ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసునని, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని బీరాలు పోయారే. ఎన్నికలయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెప్పండని జనాన్ని అడిగారు. మహానాడులో అప్పులు చేసి సంక్షేమ పథకాలు తగదని చెబుతున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమి అవుతున్నాయన్నదానిపై వివరణ ఇవ్వవచ్చు కదా! పైగా పది లక్షల కోట్ల అప్పు జగన్ టైమ్ లో జరిగిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం చంద్రబాబు వంటి సీనియర్ కి తగునా?రాష్ట్రం మొత్తం అప్పు ఎంత? ఈ రెండేళ్లలో ఎంత అప్పు చేశారు? అంతకుముందు టీడీపీ ఐదేళ్ల టరమ్ లో ఎంత అప్పు చేశారు?జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది? ఈ అంశాలపై జగన్ కాగ్ లెక్కల ఆధారంగా విమర్శలు చేస్తే, చంద్రబాబు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా జగన్ టైమ్ లో పది లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పడం ధర్మమేనా? 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం అంటూ అతిశయోక్తులు చెప్పినా జనం నమ్ముతారా? ఇవన్ని ప్రతి నిత్యం చేసే రొటీన్ ప్రసంగాలే కదా! ఏపీలో ప్రాక్టికల్ గా ఏమి జరుగుతుందో తెలుసుకోలేని అమాయకులుగా జనం ఉన్నారని చంద్రబాబు భావిస్తుంటే చేయగలిగింది ఏమీ లేదు.ఈ మహానాడు లో కేవలం తన కుమారుడు, మంత్రి లోకేష్ కు మరింత ప్రాధాన్యత కల్పించడానికి, కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేయడానికి దీనిని ఉపయోగించుకున్నారు. అంతవరకు తప్పు లేదు. కాని చంద్రబాబు తన కుమారుడికి కూడా హుందా లేని రాజకీయాలు అలవాటు చేస్తుండడం బాధాకరం. డీఎస్సీ లో అక్రమాలపై జవాబు చెప్పకుండా లోకేష్ ఏదేదో మాట్లాడి దబాయించారనిపిస్తుంది. ఎల్లో మీడియా కూడా తొలి రోజు లోకేష్ కు మంచి కవరేజీ ఇచ్చి చంద్రబాబు ను తగ్గించడం స్పష్టంగా కనిపిస్తుంది. మహానాడులో చంద్రబాబు కన్నా, వక్తలు లోకేష్ భజనే ఎక్కువగా చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని అన్నారు. అది నిజమే అనిపిస్తుంది. 1983 నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ఇదే తరహాలో ప్రసంగిస్తూ లోకేష్ ను ఉగ్రనరసింహం అని చెప్పి మెప్పుపొందే యత్నం చేశారు.ఏది ఏమైనా ఈ రెండేళ్లలో నిర్దిష్టంగా ఫలానా గొప్ప పనులు చేశామని చెప్పలేని స్థితిలో చంద్రబాబు, లోకేష్ లు ప్రతిదానికి వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేయడం, గొడ్డలి పార్టీ, రక్త చరిత్ర అని, బాబాయిని చంపించారని, తల్లి, చెల్లి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు స్త్రీలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నది, కొందరు ఎమ్మెల్యేలే మహిళల పట్ల ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నది , రెడ్ బుక్ పేరుతో టెర్రర్ సాగుతున్నది అందరికి కనబడుతూనే ఉంది. అయినా వైఎస్సార్సీపీ పై ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లే తెలుగుదేశంపైన, చంద్రబాబు, లోకేష్ లపైన వైఎస్సార్సీపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. వంగవీటి రంగా హత్యతో సహా సహా చంద్రబాబుపై వచ్చిన వచ్చిన ఆరోపణలన్నిటిని వారు ఏకరువు పెట్టి సొంత మామ ఎన్టీఆర్ రామారావు ఆయనను ఉద్దేశించి ఎంత తీవ్రంగా దూషించింది వివరిస్తున్నారు.తడిగుడ్డలతో గొంతులు కోసే రకం అని పేర్ని నాని టీడీపీపై మండిపడ్డారు. మహానాడులో ఆమోదించిన ఏ తీర్మానం చూసినా, అంతా జగన్ పైన దూషణలే కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి వచ్చిన సీట్ల గురించి మాట్లాడారు కాని, పరకాల ప్రభాకర్ ఏభై లక్షల దొంగ ఓట్ల స్కామ్ గురించి సాక్ష్యాధారాలతో సహా వెల్లడించిన అంశంపై మాత్రం నోరెత్తలేకపోయారు. ఇది మహానాడులో పెద్ద బలహీనతగా కనిపిస్తుంది. ఎప్పటి మాదిరి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి వదిలివేశారు. అది రాకపోవడానికే చంద్రబాబే కారణమన్న ఆరోపణలపై మాత్రం జవాబు చెప్పరు. లక్షల మంది మహానాడులో పాల్గొన్నారని అంకెల గారడి చేయవచ్చు. నాణ్యమైన చర్చలు కాని, మంచి ప్రసంగాలు కాని లేకుండా చరిత్రలో నాసిరకం మహానాడుగా ఇది ముగిసిపోయినట్లు అనిపించడం లేదూ! -
కాపులను బెదిరిస్తున్న పవన్ కళ్యాణ్
-
ఏరు దాటాక... బోడి మల్లయ్య అంటున్న పవన్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు కుల నేతలకు సవాలు విసిరారా? బెదిరించారా? రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ వ్యాఖ్యలు చూస్తూ ఇలా అనిపించకమానదు. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కులాన్ని దాటి వెళ్లలేరా అని ఆ సమావేశంలో వ్యాఖ్యానించిన పవన్ ఎన్నికల సమయంలో ‘‘ఆంధ్ర భావన లేకపోతే మానె.. కాపు భావనతోనైనా ఓట్లు వేయాలి’’ అని కోరిన విషయం మరచినట్టున్నారు. అంతేనా... కాపుల మద్దతుతో గెలవాలన్న ఉద్దేశమే లేకపోతే 2019లో ఆ సామాజిక వర్గం అధికంగా ఉండే భీమవరం, గాజువాకల నుంచే ఎందుకు పోటీ చేసినట్టు? రెండో చోట్లా ఓడిపోయేందుకు ఇతర కారణాలు ఉండవచ్చు. అది వేరే సంగతి. 2024లోనూ ఆయన కుల మద్దతు కోసమే కదా ఏరి కోరి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నది? ఈ విషయాలన్నీ జనసేనతోపాటు రాజకీయ పక్షాల వారందరికి తెలియదా! జనసేనలో ఎక్కువ మంది కాపులకే ఎందుకు టిక్కెట్లు ఇచ్చారు? ఏపీ కేబినెట్లో జనసేన మంత్రులు ముగ్గురు ఉంటే, పవన్‌తోపాటు కాపు వర్గానికే చెందిన మరొకరికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇలాంటి వాటితో సరిపెడితే పోతుందని ఆయన అనుకున్నారేమో కాని, కాపు సామాజిక వర్గం సంతృప్తి చెందలేదు. ఇప్పుడేమో తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదంటున్నారు.సినిమా నటుడిగా అన్ని వర్గాల అభిమానులు ఉండవచ్చు. కాని వారిలో కాపులు.. మరీ ముఖ్యంగా యువత ఎక్కువ అన్నది బహిరంగ రహస్యమే. వీరంతా గత ఎన్నికలలో అండగా నిలబడింది వాస్తవం కాదా! వారంతా ఏమని అనుకున్నారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకునే సందర్భంలో జనసేనకు కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తారని, రెండేళ్లు సీఎంగా ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంటారని అనుకుంటే నిరాశపరిచారు. పోనీలే.. భవిష్యత్తులోనైనా కాపు వర్గం నేతగా పవన్ ముఖ్యమంత్రి కాకపోతారా అని సరిపెట్టుకుంటే, పదిహేనేళ్లపాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని చెప్పడం విని వారంతా నిర్ఘాంతపోయారు. చంద్రబాబు కాకపోతే ఆయన కుమారుడు లోకేశ్‌కు పట్టం కట్టినా ఓకే అన్నట్టుగా పవన్ ఈ పదిహేనేళ్ల రాగం అందుకున్నారన్నది అధికుల అభిప్రాయం. ఒకవైపు జనసేన కార్యకర్తలు, కొన్నిచోట్ల నాయకులు కూడా టీడీపీ వారి దౌర్జన్యాలకు గురవుతుంటే, ఎందుకు పవన్ నోరెత్తి గట్టిగా మాట్లాడడం లేదన్నది పలువురి ప్రశ్న. ఇలా ఇబ్బంది పడుతున్న వారిలో కాపు సామాజికవర్గం వారే ఉన్నారని ఆ సంఘం నేత దాసరి రాము చెబుతున్నారు. కాపునేత అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే సరికాదని చిన్న మాట అనలేకపోయారు. అంబటి వైసీపీ నేతగా కాకున్నా ముందు కాపు వర్గం నేత కూడా. ఇలాంటి విషయాలలో కూడా రాజకీయంగానే ఆలోచిస్తారా? ఇవన్ని ఒక ఎత్తయితే తనను విమర్శించే కాపు నాయకులంతా ఏకాభిప్రాయంతో ఒక సీఎం అభ్యర్ధిని పెట్టుకుని గెలిపించుకోవాలని పవన్ చెప్పడం ఇంకో ఎత్తు. ఒక రకంగా కాపు సామాజిక వర్గానికి సవాలు విసిరారు అన్నమాట. ఒకవైపు కులం కోసం రాజకీయాలలోకి రాలేదంటూనే, మరో వైపు కాపుల్లో తన స్థాయి నేత ఇంకెవరూ లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పవన్ రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిది కూడా కాదు. తాము సీఎం అవ్వాలని కోరుకున్న వ్యక్తే కాడి పారేసి తమ వర్గం ప్రయోజనాలను కాలరాసేలా మాట్లాడితే ప్రత్యామ్నాయ నేతను వెతుక్కునే అవకాశం ఉంటుంది. పవన్ సీఎం కానప్పుడు ఏ పార్టీ తమకు మేలు చేస్తుందో ఆ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాపు నేస్తం వంటి స్కీములు అమలు చేయడంతోపాటు , అనేక మంది కాపు నేతలకు మంచి గుర్తింపు ఇచ్చిన వైసీపీనే బెటర్ అని వారు భావించే అవకాశం ఉంది. ప్రస్తుతం కాపు సామాజికవర్గంలో అదే పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. అందువల్లే దాసరి రాము, ఒ.వి.రమణ వంటివారు ఆవేదనతో వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. కాపుల అండ లేనిదేనే ఉప ముఖ్యమంత్రి అయ్యారా అని రాము ప్రశ్నిస్తే, సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి మాది అని మరో కాపు నేత, టీటీడీ మాజీ సభ్యుడు రమణ వ్యాఖ్యానించారు. కులం వద్దని పవన్ నిజంగా అనుకుంటూంటే తనకు కాపు జాతి వద్దని ప్రకటించాలని అన్నారు. కాపు కులం లేకపోతే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చేవారా అని ఆయన ప్రశ్నించారు. కాపు నేతలు మాట్లాడితే వంగవీటి రంగా ప్రస్తావన తీసుకు వస్తున్నారని, ఆయన భార్య కమ్మ అని, వారి బిడ్డలు రెండు కులాలకు చెందినవారు అవుతారని పవన్ చిత్రమైన వాదన చేశారు. తాను సనాతని అంటూ హడావుడి చేసిన పవన్ వ్యక్తిగత జీవితం మాటేమిటి అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అనవసర విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంగా బతికి ఉన్నప్పుడు కాపు నేతలు మాట్లాడలేదని పవన్ అనడం సరికాదు. రంగా కాంగ్రెస్ నేతగా ఉండి కాపులతోపాటు పేద వర్గాలను ఆకట్టుకోవడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అది ఆయనకు ప్రజాబలం పెంచింది. ఆ క్రమంలో ఆయన ఆయా జిల్లాలలో టూర్ చేసినప్పుడు కాంగ్రెస్ కాపు నేతలు బాగా ఆకర్షితులయ్యారు. తాను కూడా వంగవీటి రంగాకు టీ ఇచ్చానని పవన్ ఎందుకు చెప్పుకున్నారు? రంగా హత్యకు గురైనప్పుడు పార్టీలకు అతీతంగా హత్యను ఖండించడమే కాదు. కృష్ణా నది తిన్నెలపై కాపునాడు సభ జరిగితే పార్టీలకు అతీతంగా పెద్ద, పెద్ద నేతలు హాజరయ్యారు. ఆ రోజుల్లో టీడీపీ ఎంపీగా ఉన్న నిశ్శంకరరావు వెంకటరత్నం కాపునాడుకు వెళ్లారు. అప్పట్లో టీడీపీలో మంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. రంగా హత్య చంద్రబాబుకు తెలిసే జరిగిందని ఏకంగా తన పుస్తకంలోనే రాశారు. మరో నేత ముద్రగడ పద్మనాభం కాపులను ఏకతాటిపైకి తీసుకు వచ్చిన కృషి చిన్నది కాదు. చంద్రబాబు ప్రభుత్వం ఆయనను, కుటుంబాన్ని ఏ విధంగా బాధించింది పవన్‌కు తెలియదా! ఆ రోజుల్లో పవన్ సంఘీభావం చెప్పారో, లేదో కాని దాసరి నారాయణరావు, చిరంజీవి వంటి ప్రముఖులు మద్దతు ఇచ్చారు. ముద్రగడను పరామర్శించడానికి వెళుతుంటే చంద్రబాబు ప్రభుత్వం వీరిని రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద నిలువరించిందన్న సంగతి గుర్తు ఉండకపోవచ్చు. చంద్రబాబు ఒకరి నాశనం కోరుకునే వ్యక్తి కాదని పవన్ కళ్యాణ్ చెబుతుంటే కాపులే బిత్తరపోతున్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు పాలనలో ఎంతమంది కాపులతోసహా వివిధ వర్గాల వారు ఎంత నాశనమైంది పవన్‌కు తెలియపోవచ్చని ఆ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నారు కనుక అంతా బాగానే ఉండవచ్చు. కాని ఈ మధ్య జనసేన ఎంపీ బాలశౌరి కూటమిపై చేసిన వ్యాఖ్యలే ఈ ప్రభుత్వం పనితీరుకు దర్పణం పడతాయి. కాపు నేతలు కొందరు చంద్రబాబు పాలనలో నాశనమైందీ లేనిది ఆ వ్యాఖ్యల ద్వారా తెలుసుకోవచ్చు. తాను దేశం, నేల, రాష్ట్రం కోసమే వచ్చా..ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదు.. సీఎం అయ్యే తెలివితేటలు లేకకాదు..సమాజ మార్పు కోసం వేచి చూశానని పవన్ అనడం అచ్చం సినీ డైలాగుల మాదిరి అనిపించడం లేదూ! పార్టీ నడిపే శక్తి లేదని ఆయనే చెబుతారు. తనకు సీఎం అయ్యే తెలివి ఉందని ఆయనే అంటారు. దేన్ని నమ్మాలి! సినిమా గ్లామర్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి, కాపుల అండతో పైకి వచ్చి, ఇప్పుడు కులం ఏమిటంటూ సిద్దాంతాలు చెప్పడం అమాయకుల సంగతేమో కాని,విషయ పరిజ్ఞానం కలిగిన వారెవరైనా విశ్వసిస్తారా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్‌కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్‌లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్‌కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్‌ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్‌పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రతి టూర్లో ఓ సీన్.. ప్రతి సీన్‌కు ఓ ట్రోల్!
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు, చేష్టలు విచిత్రంగా ఉంటున్నాయి. పొయ్యి వెలిగించకుండానే చేపల కూర వండడం మరీ విడ్డూరం. ఇలాంటి చేష్టలతో చంద్రబాబు ప్రజల దృష్టిలో మరీ పలుచనవుతున్నారు. ప్రజలను కలుసుకోవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ.. వీటికి ఓ నాటకీయత అబ్బితేనే వస్తుంది సమస్య. ‘మత్సకారుల సేవ’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మత్సకార కుటుంబం ఇంటికి వెళ్లారు. వెళ్లడానికి ముందు ఒక నలుగురైదుగురు మత్సకార మహిళల నుంచి చేపలు కొంటున్న ఒక సీన్ సృష్టించారు. అక్కడ నుంచి ఆయన మత్సకారుడి ఇంటికి వెళ్లి చేపల కూర చేయించారు.ఆ క్రమంలో ఆ ఇల్లంతా కలియదిరిగారు. వారితో మాట కలిపారు. ఈ క్రమంలోనే అప్పటివరకూ కూర్చుని ఉన్న బాబు అకస్మాత్తుగా లేచి కిచెన్‌లో పొయ్యి మీద ఉన్న చేప ముక్కలను కలియ తిప్పారు. అప్పుడే కూర వండుతున్నట్లు కనిపించాలని అనుకున్నారు. కానీ.., స్టవ్ వెలిగించడం మర్చి పోయారు. దాంతో సోషల్ మీడియా దీన్ని ఒక లాఫింగ్ పీస్ చేసేసింది. స్టవ్ వెలిగించకుండానే చేపల కూర వండుతున్న ముఖ్యమంత్రి అని, సార్..స్టవ్ మర్చిపోయారు సార్..అని ఇదంతా డ్రామా, స్క్రిప్ట ప్రకారం షూట్ చేశారని మరి కొందరు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ ఇంటివారితో కలిసి ఒక స్పూన్‌తో ఒకటి, రెండు ముక్కలు తీసుకున్నట్లు కనిపించింది. ఆయన ఇంటికి రావడానికి ముందు ఆ రహదారిలో ఎవరూ లేకుండా జాగ్రత్తపడ్డారు. కారు దిగినప్పటి నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన నటించారన్న భావన సోషల్ మీడియాలో వ్యక్తం అయింది. ఎందుకంటే తొలి నుంచి ఆయన కెమెరా మైక్ పెట్టుకుని ఉంటే, మత్సకార కుటుంబంలో కూడా ఒకరిద్దరికి మైక్ పెట్టి ఉందట. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? అన్న చర్చ జరగవచ్చు. ముఖ్యమంత్రి జనసామాన్యంలో కలిసి పోతున్నారు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు తనపై తనకే అంత నమ్మకం ఉన్నట్లు లేదు. చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయి ఇలాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఉంది. కాని ఆ స్క్రీప్ట్‌లో పొరపాటు వల్ల దొరికిపోతున్నారన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీ షాపుకు వెళ్లడం, ఒక ఇంటికి వెళ్లి తానే టీ, కాఫీ తయారు చేస్తున్నట్లు కనిపించడం, టీ తయారీ గురించి చర్చిస్తుండడం, ఒక బడ్డీ కొట్టు వద్దకు వెళ్లడం, తాటి ముంజెలు కొనుగోలు చేసి సతీసమేతంగా తినడం, జగన్ టైమ్‌లో నిర్మించిన గృహానికి వెళ్లి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టడం తదితర దృశ్యాలు సోషల్ మీడియాను బాగానే ఆకర్షిస్తాయి. కాని అంతిమంగా ఆయనకు అది రాజకీయ ప్రయోజనం కలిగించడం లేదు. ప్రతిసారి నటిస్తున్నారన్న వ్యంగ్యోక్తులకు గురి అవుతున్నారు. ఈ వయసులో ఇన్ని విన్యాసాలు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక ఇంటికి వెళ్లినప్పుడు వారు తమకు పెన్షన్ రావడం లేదని, మరో చోట్ సొంత ఇల్లు లేదని, ఇంకోచోట తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుకున్నారు. సంబందిత జిల్లా కలెక్టర్‌కు వాటిని నెరవేర్చాలని ఆయన ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. కాని కొన్నిసార్లు అవి ఏ కారణం వల్లనైనా కాని అమలు కావడం లేదట.దాంతో ఈ మధ్య ఒక వ్యక్తి తనకు సీఎం వాగ్దానం చేసి ఆరు నెలలు అయినా అది నెరవేరలేదంటూ రోడ్డుపై ఆందోళనకు దిగాడు. ప్రతి నిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ ల ద్వారా ఎక్కడో చోటకు వెళ్లినప్పుడు ఆయన ఏదో ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని జనాన్ని ఆకర్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాని, కొన్నిసార్లు అవి వికటించి లాఫింగ్ స్టాక్ అవుతున్నాయని కొందరు టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. గత అనుభవాల రీత్యానేమో తెలియదు కాని, ఇటీవల ఆయన వెళ్లిన ఇంటిలో ఉన్నవారిని మీకేం కావాలని అడుగుతున్నట్లు కనిపించలేదు. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పి వచ్చేస్తున్నారు. కాసేపు ఆ కుటుంబం వారితో పొగిడించుకుంటున్నారు.నిజానికి ఇలాంటి సందర్భాలలో తన ప్రభుత్వం గురించి వారు ఏమి అనుకుంటున్నది అడిగి అభిప్రాయ సేకరణ చేసుకుంటే బాగుండేది. తాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అంటున్న నేపథ్యంలో వారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా?లేదా? అన్నది తెలుసుకుని ఉండాల్సింది. ఇవన్ని మైక్ పెట్టుకుని అడగడం ఇబ్బంది కనుక, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి జనాభిప్రాయం గమనించి ఉండాల్సింది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పినా, ఇవ్వలేకపోతున్నానని, అయినా మీరు సంతృప్తిగానే ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలలో తన పరపతి పెంచుకోవడం కోసం ఆకస్మిక తనిఖీల పేరుతోనో, మరో పేరుతోనో టూర్ చేస్తుండే వారు. తొలుత సీరియస్ గానే జరిగినా, రాను, రాను అవి కూడా షో పుటప్ల గానే మారిపోయాయి. కావలి వద్ద ఉన్న జువ్వలదిన్నె సందర్శించడానికి కూడా కారణం లేకపోలేదు. అంతకు కొద్దిరోజుల ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడకు వెళ్లి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. జగన్ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూమి లో కొంత భాగాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని ఇటు మత్సకారులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే తమిళనాడు నుంచి కొందరు వచ్చి దొంగచాటుగా ఆంధ్ర ప్రాంత మత్స్య సంపదను కొల్లగొడుతుంటే, వారిని పట్టుకుని బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాని తదుపరి ఏపీ ప్రభుత్వం వాటిని వదలివేయడంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. టీడీపీ ఎంపీ, పి బీదా మస్తాన్ రావు ప్రోద్బలంతోనే బోట్లు వదలి వేశారని మత్స్య కారులు అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలో ఆ మత్సకారుల వద్దకు జగన్ వెళ్లి వారికి భరోసా ఇచ్చి వచ్చారు. లోకేశ్ జువ్వలదిన్న సందర్శిన తర్వాతే కొద్ది రోజులకు బోట్లను వదలి వేశారని జగన్ ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కొంతమేర ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోబోమని, తాను అధికారంలోకి వచ్చాక దానిని స్వాధీనం చేసుకుని మత్సకారలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా, అది బాగా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్సకార వర్గంపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఆ క్రమంలోనే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ పంచ్ డైలాగులు చెప్పి తృప్తి పరచడానికి యత్నించారు. ఆ రకంగా జగన్ రాక తమకు ఉపయోగపడిందని, చంద్రబాబు ఈ మాటలు అనక తప్పలేదని మత్సకారులు భావిస్తున్నారు. అది నిజమే అనిపిస్తుంది.1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తరచుగా వివిధ చిత్రమైన రీతులలో కనిపించే వారు. రోడ్డుపై స్నానం చేస్తున్న ఫోటోలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు.. సినీ నటుల పార్టీని ఎవరు పట్టించుకుంటారని విమర్శించే వారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతి కాలంలో ఆయనే టీడీపీని కైవసం చేసుకుని, తానే రాజకీయంగా రకరకాల సన్నివేశాలలో నటిస్తుండడం విశేషం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్‌లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌మీడియాలో హైలైట్‌గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్‌ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్‌పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్‌లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్‌కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్‌లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్‌మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆశల పల్లకీలో రేవంత్...
తెలంగాణకు 2034 వరకూ తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఆయన ధీమాకు నిదర్శనం కావచ్చు కానీ... వాస్తవమవడం మాత్రం చాలా పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో. బలహీనంగా ఉన్న అధిష్టానం తన జోలికి రాదని రేవంత్ అనుకోవచ్చునేమో కానీ.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. రేవంత్ ప్రకటనలో ఇంకో విశేషం ఉంది. 2034 తరువాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, తన అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తానని కూడా చెప్పుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎంపీగా రేవంత్ తరచూ తాను ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవారు. అందరూ తేలికగా తీసుకున్నా ఏపీ విభజనతో ఆయన దశ తిరిగిందని అనుకోవాలి.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతినిపోవడం అధినేత చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కలిసివచ్చింది. కాంగ్రెస్‌లో కీలకమైన పదవులు, పీసీసీ అధ్యక్ష స్థానం సులువుగానే దక్కాయి. ఇదంతా ఆయన తన సొంత స్టైల్లో సాధించారు. అంతవరకు వాస్తవమే. నిజానికి ఓటుకు నోటు కేసు వల్ల కొంత ఇబ్బంది పడినా తదుపరి పరిణామలు ఆయనకు అనుకూలంగా మారాయి. చంద్రబాబు హుటాహుటిన విజయవాడ వెళ్లిపోవడం, తెలంగాణలో టీడీపీని పూర్తిగా వదలివేయక తప్పని స్థితి ఏర్పడడం, రేవంత్‌ను జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉండటం వంటి కారణాలు కీలకంగా కనిపిస్తాయి. దానికి తోడు దూకుడుగా రాజకీయం చేయడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు, తీవ్రమైన పరుష భాషలో విమర్శలు చేయడం, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ ఈ స్థాయిలో ప్రజలలోకి వెళ్లలేకపోవడం వంటి కారణాలు కలిసి వచ్చాయి. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు మంత్రులలుగా సర్దుకోక తప్పలేదు. ఎంపీగా ఉండగా రేవంత్ కాంగ్రెస్ హై కమాండ్తోదగ్గరి సంబంధాలు పెట్టుకగలిగారు. పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని ఇవ్వగలిగారు. ఇవన్నీ రేవంత్ సీఎం అయ్యేందుకు దోహదపడ్డాయి. అంతవరకు బాగానే ఉన్నా పదేళ్లపాటు తానే సీఎం అని చెప్పడమే కొంత ఆశ్చర్యం. ఇలా చెప్పడం.. కేవలం ప్రజలలో ఒక అభిప్రాయం కలిగించడానికా?లేక కాంగ్రెస్‌లో తనకు పోటీ లేదని చెప్పడానికా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?అంటే ఏమైనా కావచ్చు.రేవంత్ సర్కార్ నిజంగానే ప్రజలు ఆశించిన రీతిలో పనిచేసి మంచి పేరు తెచ్చుకోగలిగితే ఆయన భావించినట్లు పదేళ్లనే ఏముంది.అంతకుమించి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండవచ్చు.అలాగే ఆయనే సీఎంగా కొనసాగవచ్చు. అలాకాకుండా పదేళ్ల తర్వాత జాతీయ రాజకీయాలలోకి వెళ్లి ఏమి చేస్తారో అంటే అప్పుడే చెప్పలేం. అంతవరకు ఈయన కాంగ్రెస్‌లోనే ఉంటారా?అన్నది కొందరి అనుమానం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో రేవంత్ ను ఉద్దేశించి తనతో కలిసి రావాలని నర్మగర్భంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.అది అధికారికంగా సహకారం కోరడం తప్పమరొకటి కాదని రేవంత్ వివరణ ఇచ్చినా ఎవరికి ఉండే డౌట్లు వారికి ఉంటాయి కదా! గతంలో రేవంత్ తన రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏబీవీపీ స్కూల్లో చేరి, తర్వాత టీడీపీ కాలేజీలో కొనసాగి ,ప్రస్తుతం రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. ఆయన ఆ మాట చమత్కారంగా చెప్పినా అది ఆలోచించదగిందే. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం టీఆర్ఎస్లో కూడా పనిచేశారు.ఆ తర్వాత స్వతంత్రంగా జెడ్పీటీసీ పోటీచేసి గెలిచారు.తదుపరి శాసనసమండలి ఎన్నికలలో పోటీచేసి అన్ని పార్టీలవారి సహకారం తీసుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన నేతగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి మద్దతు పొందడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. రేవంత్ తెలివితేటలను గమనించారో,మరేమో తెలియదు కాని, ఆ తర్వాత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. దాంతో టీడీపీలో ఆయనకు సన్నిహితుడిగా మారారు. ఓటు కు నోటు కేసులో ఎక్కడా చంద్రబాబు పేరు వెల్లడించకుండా ఆయన మనసు చూరగొన్నారు. ఎలాగైతేనేం రెండున్నరేళ్ల సీఎం పదవికాలం తర్వాత ఆయన జాతీయ స్థాయిలో కూడా కొంత గుర్తింపు తెచ్చుకున్న మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణతోపాటు, కర్ణాటక, హిమచల్ ప్రదేశ్ లలోనే అధికారంలో ఉండడం, కేరళలో పార్టీకి అవసరమైన వనరులు అందించడానికి తన వంతు సాయం చేయడం వంటి కారణాలు కూడా ఉపయోగపడ్డాయని చెప్పాలి. పార్టీలో పట్టు పెంచుకున్నంత తేలికగా ప్రజలలో పట్టు నిలబెట్టుకోవడం అంత తేలికకాదు.స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనే ఇచ్చింది.ఆయా అంశాలలో రేవంత్ విధానాలపై ఆ పార్టీ గట్టి పోరాటమే చేస్తోంది.హైడ్రా వ్యవస్థ వల్ల కొంత మంచి పేరు వచ్చినా, నష్టం కూడా గణనీయంగానే కనిపిస్తుంది. అన్నిటికి మించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలను అమలు చేయడానికి సతమతమవుతున్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని,వృద్దాప్య పెన్షన్ నాలుగువేలు చేస్తామని, దళితులకు పది లక్షల ఆర్థిక సాయం తదితర అనేక వాగ్దానాలు ఆకాశమే హద్దుగా ఎన్నికల సమయంలో చేశారు.వాటిని అమలు చేయడం అంత తేలిక కాదని అనుభవం చెబుతోంది. పాలనాపరంగా రేవంత్ ఇంకా బలమైన ముద్ర వేసుకోలేకపోయారు. మరో రెండున్నర ఏళ్ల వ్యవధి ఉంది కనుక ఎంతవరకు ప్రజాదరణ పెంచుకుంటారన్నది అప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే రేవంత్ ప్రభుత్వానికి ఆశించిన రీతిలో మార్కులు ఇచ్చే పరిస్థితి లేదు. పాస్ మార్క్ వస్తే అది పదివేలు అన్నట్లుగా ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరధ కేసులో కాని, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సందర్భంలో కాని రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి కొంత విమర్శలకు గురైందని చెప్పక తప్పదు. దీనివల్లే రేవంత్‌కు బీజేపీ, టీడీపీ వంటి పార్టీలతో అంతర్గత సంబంధాలు ఉన్నాయేమో అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. భగీరధ అరెస్టు అయినప్పటికీ, అది జరిగిన తీరుపై విమర్శలు ఉన్నాయి.సామాన్యుడికి ఒక న్యాయం, పలుకుబడి కలిగినవారికి మరో న్యాయమా అన్న చర్చ జరిగింది. 2028లో జరిగే ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆయన చెబుతున్నప్పటికీ, ప్రస్తుత వాతావరణం అంత తేలికగా లేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం.అంతేకాక ప్రధాని మోడీ,హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు అర్థంఅవుతుంది.బెంగాల్ వంటి రాష్ట్రంలో వారు అనుసరించిన పద్దతులు గమనించిన తర్వాత తెలంగాణలో ఏ పరిణామమైనా జరగవచ్చన్న భావన కలుగుతుంది. ఇక జాతీయ రాజకీయాలలోకి వెళ్లడం అన్న అంశం ఇప్పటికిప్పుడు పెద్ద చర్చీనీయాంశం కాదు.ఆయనకు ఏదో పెద్ద ఊహే ఉండవచ్చు.అది తప్పు కాదు.గతంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో పనిచేశారు.వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ సారధిగా ఉన్న టైమ్ లో ఏపీలో అత్యధిక కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లు వచ్చాయి. అయినా ఆయనను అధిష్టానం కొంత ఇబ్బంది పెట్టింది. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పట్లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండేవారు.ఆయన ఇంకా పూర్తిగా బలపడలేదు.ఆ టైమ్ లో నేదురుమల్లి తాను చక్రం తిప్పగలనని అనుకునేవారు. ఏఐసీసీ సదస్సు కూడా తిరుపతిలో నిర్వహించారు. అప్పట్లో తనకు ఉన్న చొరవతో పీవీని ఉద్దేశించి పంతులుకు తాను ఎంతగా సహకరిస్తున్నది అన్న అంశంపై పార్టీ వారి వద్ద వ్యాఖ్యలు చేశారు.ఆ విషయం పీవీకి తెలియడంతో, తనకు సన్నిహితమైన వ్యక్తి అయినా, అవకాశం రాగానే నేదురుమల్లిని సీఎం పదవి నుంచి దించేశారు.మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో అత్యంత కీలక భూమిక పోషించారు. సీఎంగా రెండుసార్లు ఎంపికయ్యారు.అప్పట్లో ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితుడు అన్న భావన ఉండేది.కాని ఆ రెండుసార్లు పూర్తికాలం సీఎం పదవిలో ఉండలేకపోయారు.అప్పటి రాజకీయాలకు ప్రస్తుత ఉన్న రాజకీయాలకు తేడా ఉన్నప్పటికీ జాతీయ పార్టీలలో ఏమైనా జరగవచ్చని చెప్పడానికి ఇవి ఉదాహరణలు అవుతాయి.ఏది ఏమైనా ముందుగా ప్రజాభిమానం చూరగొనే విధంగా పనిచేసి ఆ తర్వాత ఎంతకాలం ఏ పదవిలో ఉన్నా ఎవరికి అభ్యంతరం ఉండదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కార్డు మిష.. కోతలే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల అర్థాలు వేరు అంటూ ఉంటారు చాలామంది. చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అన్నది ఆయనగారి నైజమన్న విమర్శలూ లేకపోలేదు. ‘‘అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలి’’ అని ఆయన ఈ మధ్య తరచూ చెబుతూ వస్తున్నారు. దీంట్లో తప్పేముంది? అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ.. ఆయనను ఫాలో అయ్యేవారికి, సీనియర్ అధికారులకు మాత్రం అందులోని మతలబు ఏమిటో స్పష్టంగా తెలుసు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించేందుకు ఫ్యామిలీ కార్డులు మంజూరు చేయాలని చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించి ఫ్యామిలీ కార్డే ప్రామాణికంగా స్కీములు అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇది పైపైకి బాగానే అనిపిస్తున్నా మీడియా కథనాలను పరిశీలిస్తే మాత్రం... లబ్ధిదారులకు కోతపెట్టే ప్రమాదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అర్హత అన్న పదంలోనూ రాజకీయం చేస్తున్నారన్నమాట. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వైసీపీకి ఓటు వేస్తారు అనుకున్నవారికి స్కీములలో కోత పెట్టే ఆలోచన చేస్తున్నారని జనసామాన్యం అనుకుంటోంది. ప్రభుత్వం పనితీరుపై అభిప్రాయ సేకరణ అంటూ చేస్తున్న సర్వేల ద్వారా ఈ ప్రయోగం జరుగుతోందని కొందరు అంటున్నారు.ప్రభుత్వ సరళి బాగోలేదన్న వారిని, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారిని బెదిరించడమో, లేక వారికి అందుతున్న స్కీములను కట్ చేయడమో చేసే పన్నాగం జరుగుతోందని కొంతమంది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రాజకీయ కోణం కాకుండా, బాగా సంపన్నులై ఉండి, ప్రభుత్వ స్కీమ్‌లను అన్యాయంగా తీసుకుంటుంటే వారిని తొలగించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కాని చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉండే చంద్రబాబు ప్రభుత్వం విధానాల వల్ల ప్రజలలో అలజడి ఏర్పడుతోంది.చంద్రబాబు మాటల ప్రకారం... వ్యవసాయ భూమి ఉన్నా, మున్సిపాల్టీలో ఆస్తి కలిగి ఉన్నా, గ్రామాలలో రూ.200 కన్నా ఎక్కువ ఆస్తి పన్ను కడుతున్నా, ఏభై యూనిట్లకన్నా ఎక్కువ కరెంట్ వాడుతున్నా, పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నా, ప్రైవేటు ఉద్యోగిగా ఈపీఎఫ్ చెల్లిస్తున్నా..ఇలా పలు కండిషన్లు పెట్టి ఇవేవి ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులే అని తేలుస్తారట. వాస్తవానికి ఈ షరతులు పేదల పొట్టకొట్టే అవకాశాలే ఎక్కువ.ఎన్టీఆర్ భరోసా కింద రూ.నాలుగు వేలు తీసుకుంటూ ఏ కుటుంబానికైనా మరో పథకం ఇవ్వరన్నమాట. ఇప్పటికే దీనికి సంబంధించి సర్వే చేశారట. దాని ప్రకారం ఆయా స్కీములకు ఏకంగా 94 శాతం మంది అనర్హులు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే, ఈ సర్వే ప్రకారం కేవలం 10.2 లక్షల కుటుంబాలే పేదవి. వీరికి మాత్రమే స్కీములు వస్తాయని చెప్పకపోయినా, అనర్హత పేరుతో ఎక్కువ మందికి పథకాలను రద్దు చేయవచ్చని భయపడుతున్నారు. ఏ కుటుంబానికి అయినా రూ. 48 వేలకు మించి ప్రయోజనం రాకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం అని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో అర్థం అవుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా బడా కాంట్రాక్టర్లకు పందేరం చేస్తున్న ప్రభుత్వం పేదల స్కీములపై ఇన్ని రకాల ఆంక్షలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయా కుటుంబాలకు వివిద స్కీముల కింద అర్హత ఉంటే,అవన్ని ఇచ్చేవారు. తద్వారా కొన్ని కుటుంబాలకు ఏడాదికి లక్ష నుంచి లక్షన్నర వరకు లబ్ది పొందాయని అప్పట్లో వారే స్వయంగా చెప్పేవారు. పోనీ తన విధానం వేరని ఒక కుటుంబానికి ఒక పథకమే ఇస్తానని కాని, అర్హత ప్రమాణాలు నిర్ణయిస్తామని కాని ఎన్నికల సమయంలో చెప్పారా అంటే అదేమీ లేదు. ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేశారు. ప్రజాగళం పేరుతో ఇచ్చిన మానిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల గురించి ఏమి రాశారా అని పరిశీలిస్తే ఎక్కడా కండిషన్లు పెట్టలేదు. అర్హులకే ఈ స్కీములు ఇస్తామన్న మాట కూడా చెప్పలేదు. ఎన్నికల ప్రచార సభలలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికి స్కీముల ప్రయోజనాలు దక్కుతాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు పదే, పదే చెప్పేవారు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని, ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే మూడువేలు, ముగ్గురు ఉంటే 4500, నలుగురు ఉంటే ఆరు వేలు అంటూ వేలంపాట మాదిరి చంద్రబాబు పాడేవారు. ఇప్పుడేమో ఆ పథకాన్నే ఎగవేస్తున్నారు.అది ఇవ్వకపోగా ఇస్తున్న అరకొర స్కీములలో కోత పెట్టాలని ప్రయత్నాలు ఆరంభించారు. జగన్ ప్రభుత్వం కుటుంబంలోని ఒక విద్యార్ధికి పదిహేను వేలు ఇస్తుంటే, తాము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్దికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఆ సందర్భంలో ఎక్కడా అర్హత ప్రస్తావనే తేలేదు. ఇప్పుడు వీటిని ఫ్యామిలీ కార్డు ఆధారంగా ఏమైనా తగ్గిస్తారేమో చూడాల్సి ఉంటుంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని అన్నా, మూడువేల నిరుద్యోగ భృతి అని ప్రచారం చేసినా ఎక్కడా కండిషన్లు ఉంటాయని పేర్కొనలేదు. బహుశా ఎలాగూ వాటిని ఇచ్చేది లేదులే అని ముందుగానే అనుకుని మానిఫెస్టోలో పెట్టి ఉండాలి. వలంటీర్లకు జగన్ రూ.ఐదు వేలే ఇస్తున్నారని, తాము రూ.పది వేలు ఇస్తామని చెప్పి అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాగే చేస్తుంటారు. 1996 ఎన్నికలకు ముందు, తాను ఎన్టీఆర్ కన్నా గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తానని, రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం కొనసాగిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక మాట మార్చి మద్య నిషేధం ఎత్తివేశారు. సబ్సిడీ బియ్యం రేటు పెంచారు. 2014 టర్మ్‌లో రైతుల రుణాలు ఎంత ఉంటే అంత మాఫీ చేస్తామని ఊరించారు. తీరా అధికారం వచ్చాక అరొకర చేసి ఆశకు కూడా హద్దు ఉండాలని ఎద్దేవా చేశారు. అదే విపక్షంలో ఉంటే మాత్రం తెలుగుదేశం ధోరణి మరో రకంగా ఉంటుంది. ఉదాహరణకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అనర్హుల రేషన్ కార్డులు తొలగించే కార్యక్రమం చేపడితే నానా రచ్చ చేసిన టీడీపీ, జగన్ ప్రభుత్వంపై కూడా పలు అబద్దాలు సృష్టించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కార్డు పేరుతో సంక్షేమ స్కీముల లబ్దిదారుల కోత పెట్టడం ఆరంబిస్తే చంద్రబాబు ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందేమో! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారుకు సోషల్ మీడియా భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సామజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలివ్వలేక ప్రశ్నించే వారిని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పోలీసు వ్యవస్థ కూడా రెడ్‌బుక్ అరాచకాలకు అలవాటు పడిపోయి అదే పనిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్‌ల ప్రకటనల్లోని డొల్లతనాన్ని, గతంలో చేసినదాని కంటే భిన్నంగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ఎత్తి చూపుతోంది. దీంతో కూటమి సర్కారు గంగవెర్రులెత్తుతోంది. ఎల్లోమీడియా సాయంతో కొద్దోగొప్పో సానుకూల ప్రచారం చేసుకుంటున్నా.. సోషల్ మీడియా ధాటిని మాత్రం తట్టుకోలేకపోతోంది. మామూలుగానైతే సోషల్ మీడియాలో ఏదైనా అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు వస్తే చర్యలు తీసుకుంటూంటారు కానీ... ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను తొలగించేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులే రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి పోస్టుల తొలగింపు కోసం పోలీసులు స్వయంగా గూగుల్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలకు లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టుల వల్ల ఇబ్బంది పడ్డవారు లేదా సంస్థలు కోర్టు ఆదేశాల ద్వారా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూంటాయి కానీ.. అంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నారేమో తెలియదు కాని, పోలీసులు తమ అధికార బలం ప్రయోగిస్తున్నారట. పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే ఫేస్బుక్ తదితర వేదికలు స్పందిస్తున్నాయట. ఒకవైపు కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను భయపెట్టాలని చూడడం, మరో వైపు పోలీసులు సాయంతో పోస్టులు తొలగించేయడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పోలీసుల దుశ్చర్యలపై పోరాటాలు చేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు రీసర్వే, 30 వేల మంది మహిళల మిస్సింగ్ వంటి అనేక అంశాలపై అసత్యాలు ప్రచారం చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా ఆకాశమే హద్దుగా అబద్ధాలు సృష్టించింది. వదంతులు ప్రచారం చేసింది. అయినా అప్పట్లో వారిపై ఈ తరహా కేసులు రాలేదు. కాని కూటమి అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై తమ పెత్తనం చెలాయించే పని మొదలుపెట్టారు. సోషల్ మీడియా విమర్శలకు కూటమి సర్కారు ఎందుకు జంకుతోందో తెలుసుకోవడం ఆసక్తికరం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను హైదరాబాద్‌లోని వారి స్వగృహాల్లో కలిశారు. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందే మంత్రి లోకేశ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో తరిమేశారని, అప్పుడు చంద్రబాబు ఏపీకి వచ్చి ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడపడాన్ని ఆరంభించారని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర మొదలైంది. ‘‘చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి కదా విజయవాడ వెళ్లిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ప్రధాని ఏపీ పాలకులను అమరావతిలో కదా.. కలవాల్సింది? హైదరాబాద్‌లో ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు మంత్రుల కుటుంబాలు అమరావతిలో కాకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నాయని, వీరు చుట్టపుచూపుగా వారం వారం అమరావతి వచ్చిపోతున్నారని వెళుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇదే పాయింట్ ఎత్తిచూపి ఎద్దేవ చేశారు. అంతేకాక 2018లో బీజేపీతో విడిపోయాక చంద్రబాబు, మోడీలు పరస్పరం ఎంత తీవ్రమైన విమర్శలు చేసుకుందీ.. చివరికి వ్యక్తిగతంగా కుటుంబ ప్రస్తావనలు తెచ్చింది కూడా సోషల్ మీడియా గుర్తు చేసింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈవిఎమ్‌ల ట్యాంపరింగ్ జరిగిందని, దమ్ముంటే ఎవరైనా చర్చకు రావచ్చని గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ సవాల్ చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈ వార్తలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరకాల చేసిన వ్యాఖ్యలను ఖండించ లేకపోతోంది. దీనిని ప్రస్తావిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఒక ప్రశ్న సంధించారు. పరకాల ఇన్ని ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసు కూడా పెట్టలేకపోయిందని, దీనిని బట్టి ఆ ఆరోపణలలో వాస్తవం ఉందని అనుకోవల్సి వస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని బెంగాల్ దుర్గ అని కోల్‌కతాలోనే అభివర్ణించారు. మోడీని ఢిల్లీ మహిషాసురుడిగా పోల్చుతూ ఆమె చేతిలో చిత్తు అవుతారని చంద్రబాబు ప్రసంగించారు. అదే చంద్రబాబు ఈసారి బీజేపీ గెలిచిన సందర్భంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీకి నమస్కరిస్తున్న తీరుపై వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.మంత్రి లోకేశ్‌కు మద్దతుగా 99 పైసలకే పరిశ్రమలకు భూములు కేటాయించడం గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అనగానే ఇతర రాష్ట్రాలలో అవే పరిశ్రమలు వందల కోట్లు ఖర్చు చేసి భూములు ఎలా కొనుగోలు చేస్తున్నది వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయడానికి చంద్రబాబు సర్కార్ కూడా నిర్ణయం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ తదితరులు ఆంగ్ల మీడియంపై ఎలాంటి విమర్శలు చేసింది వివరించే పేపర్ క్లిపింగ్గులు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపించాయి. ఇవే కాదు..చంద్రబాబు ఆయా సందర్భాలలో చేసిన చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. సహజంగానే ఇలాంటివి చంద్రబాబు టీమ్‌కు ఇబ్బంది కలిగిస్తూంటాయి. తమ పరువుకు భంగం కలుగుతోందని, ప్రభుత్వ పరపతి దెబ్బతింటోందని భావిస్తాయి. ఇదీ నేపథ్యం.. ఎలాగైనా సోషల్ మీడియాను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధమని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన చేస్తూ టీడీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే పోలీసులు శరవేగంగా స్పందించడం పరిపాటై పోయిందన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్ ) తొలగించాలని, వారి అక్కౌంట్లను బ్లాక్, లేదా సస్పెండ్ చేయాలని పోలీసులే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు నోటీసులు పంపుతున్నారని జగన్ అన్నారు. ఇది సోషల్ మీడియాపై వ్యవస్థీకృతంగా సెన్సార్ షిప్ విధించడమేనని విమర్శించారు. జగన్ ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసుల నుంచి కాని ఎలాంటి సమాధానం రాలేదు. కొద్ది రోజుల క్రితం మాజీ ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి, మాజీ మంత్రి కన్నబాబులు కూడా పలు ఉదాహరణలు ఇస్తూ పోలీసులు అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో మాట్లాడిన విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను తొలగించాలని పోలీసులు లేఖలు రాశారట.ఇ దంతా కొత్త ట్రెండ్. గతంలో రాజకీయ విమర్శలపై ఇలా ప్రభుత్వాలు వ్యవహరించలేదు.మహా అయితే వారి వాదన చెబుతారు. ఖండనలు ఇస్తారు. అవేమీ ఇవ్వకుండా వీడియోలు తొలగించే పనిలో పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం అవుతోంది. ఇవన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే మీరేమన్నా చేసుకోండి..మా మొండి వైఖరి మాదే..మా రెడ్‌బుక్ రాజ్యాంగం మాదే.. ఏమైనా మా తప్పులను ప్రశ్నిస్తే ఊరుకోం..అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అత్యంత దుర్మార్గంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఎప్పటికి మారేనో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలిసి తెలిసి బొంకిన బాబు!
అబద్ధాలు అతికినట్లు చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా నేర్పరి. ఆచరణ సాధ్యం కాని విషయాలను కూడా సులువుగా ప్రచారంలో పెట్టేయగలరు. అధిక సంతానం విషయమే తీసుకోండి. డైవర్షన్ కోసం చేస్తున్నారా? లేక ప్రజలను మభ్యపెట్టేందుకా? అన్నది తెలియదు కానీ తన ప్రతిష్టను సైతం పట్టించుకకుండా ఆయన ముగ్గురు పిలల్ని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు అని ఒక ట్యాగ్‌లైన్ పెట్టేసుకున్నారు. ఇదేం పిచ్చిగోల అని మనకు అనిపించవచ్చు కానీ ఆయన లక్ష్యం వేరు. బాబుగారు గొప్ప సిద్ధాంతకర్త, విజన్ ఉన్న వాడు అని జనాలు అనుకోవాలన్నది ఆయన ఫీలింగ్ కావచ్చు. అయితే.. ఈ సారి చంద్రబాబు వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆక్షేపణ వ్యక్తమవుతోంది. అంతమంది పిల్లల్ని కనడానికి ఆడవారేమైనా యంత్రాలా?అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇస్తానని చెబుతున్న మొత్తం డైపర్లకు కూడా సరిపోదని విమర్శించారు. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా పేరు ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా పుట్టిన పిల్లల ఆహారం, మందులు, చదువు, పెంపకం ఖర్చులు కూడా ప్రభుత్వం చూసుకుంటుందా అని ప్రశ్నించారు. ప్రజలకు కావల్సింది జీవన భధ్రత తప్ప పతాక శీర్షికల్లోకి ఎక్కే స్కీములు కావని ఎద్దేవ చేశారు. సినీనటి పూనమ్ కౌర్ కొంచెం భిన్నంగా స్పందిస్తూ.. ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృస్టిలో పెట్టుకుని ముందు లోకేశ్ ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆశిద్దాం అని వ్యాఖ్యానించారు. మాజీ పోలీస్ ఉన్నతాధికారి కిరణ్ బేడీ మహిళలు తమ అత్యంత ఉత్పాదక జీవిత కాలాన్ని ముగ్గురు, నలుగురు పిల్లలను కనడం, పెంచడానికే వినియోగించాలన్న భావన సరైనదేనా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబుది ఫ్యూడల్ భావజాలంగా ఆమె అభిప్రాయపడ్డార అన్నమాట. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు చెబుతున్న రూ.ముప్పైవేలు బారసాల ఖర్చులకైనా వస్తాయా? అని అడిగారు. మాజీ మంత్రులు, వైసీపీ నేతలు పేర్నినాని, అంబటి రాంబాబు తదితరులు చంద్రబాబు తన కుటుంబంలో దీనిని ఆచరించి చూపించాలని సూచించారు. ఈ విమర్శల మాటెలా ఉన్నా... చంద్రబాబుకు ఇవన్నీ తెలియని అమాయకుడేమీ కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా ప్రజల దృష్టి.. విపక్షాల చర్చ ఇతర సమస్యలవైపు వెళ్లకుండా ఉంటుందన్నది ఆయన అంచనా. సూపర్ సిక్స్ హామీల గురించి కాకుండా సంతానోత్పత్తి గురించి ఆలోచించాలన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన వాగ్దానం ఏమిటో ప్రజలకు గుర్తుకు రాకూడదన్నమాట. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులను తగ్గించి చమురు ధరలు పెరగకుండా చూస్తామని గొప్పలకు పోయారు. అది సాధ్యం కాదని వారికి ఆనాడే తెలుసు. అయినా తన కుమారుడు లోకేశ్‌తో కలిసి జనాన్ని నమ్మించే యత్నం చేశారు. తాను సంపద సృష్టిస్తానని ప్రతి సభలోను జనం చెవులు దద్దరిల్లేలా ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక సంపద సృష్టించే మార్గాలు ఉంటే తనకు చెవిలో చెప్పాలని జనాన్ని కోరారు. గల్లా పెట్టె ఖాళీగా ఉందని చేతులెత్తేశారు. తాజాగా అసలు సంపద సృష్టి మీ చేతిలోనే ఉందని, అది పిల్లలను కనడమేనని చెప్పి ప్రజలందరిని అమాయక గొర్రెలుగా మార్చారన్నమాట. నిజానికి సంపద సృష్టి తన చేతిలో లేదని ఆయనకు ఎన్నికల ముందు కూడా బాగా తెలుసు. అయినా ఎన్నికలలో జనాన్ని మభ్య పెట్టడానికి అలాంటి డైలాగులు చెప్పాలి. సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో విపరీత ప్రచారం చేయాలి.తద్వారా చంద్రబాబు ఏదో చేసేస్తారన్న భావన కలిగించాలి. ఒట్లు దండుకోవాలి.ఇదే లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారు. ఇలా ఒకటి కాదు.. 2014 ఎన్నికలలో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని తెగ చెప్పారు.అదెలా సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రశ్నించినా, చంద్రబాబు కు ఆ మాజిక్ తెలుసునని టీడీపీ వారు వాదించేవారు. వాస్తవానికి చంద్రబాబుకూ తెలుసు తాను చేస్తున్నది తప్పుడు వాగ్దానం అని. బ్యాంకులలో ఉన్న బంగారు నగలను కూడా విడిపించి ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారంటేనే అది మోసపూరితమైన హామీ అన్న సంగతి ఎంతో విజన్ ఉందని చెప్పుకునే ఆయనకు తెలియదా! రైతుల ఆశను ఆయన క్యాష్ చేసుకున్నార అన్నమాట..ఓట్లు వేశారు. ఆ తర్వాత మరీ ఇంత ఆశపోతులుగా ఉంటారా అని వారినే ఎద్దేవ చేశారు. సూపర్ సిక్స్ లో ఉన్న హామీలు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద రూ.1500 చొప్పున ప్రతి మహిళకు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబుకు తెలుసు. అయినా వారిని బురిడి కొట్టించాలంటే ఇదొక్కటే మార్గం అనుకున్నారు. చెప్పేశారు. అధికారం వచ్చాక దాని ఊసే ఎత్తలేదు.మంత్రి అచ్చెన్నాయుడు దానిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని జనానికి చెప్పారు. పేదరికం లేకుండా చేసేస్తాననంటూ ప్రగల్బాలు పోయారు. తదుపరి ధనికులు పేదలను దత్తత తీసుకుంటే సరి అని కొత్త సూత్రం చెప్పేసి చేతులు దులుపుకున్నారు.నిరుద్యోగ భృతి మూడువేలు చొప్పున ఇస్తామని చెప్పారు. గత టరమ్ లో కూడా ఆయన చెప్పినా చేయలేదు. అయినా మళ్లీ అదే వాగ్దానం చేశారు.అధికారంలోకి వచ్చాక 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ కాకి లెక్కలు చెప్పి సరిపెట్టుకోమంటున్నారు.ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అది చాంతాడంత జాబితా అవుతుంది. పిల్లలను కనండని ఎందుకు చెబుతున్నారు. జనాభా తగ్గుతోందన్న కారణంగా ఆయన అంటున్నారని అనుకుంటే పొరపాటే.కేవలం ఇదొక భావజాలంగా మార్చి జనాన్ని ఏమార్చాలి. దక్షిణాదికి నిధులలోనే కాక,లోక్ సభ సీట్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని ఈ రాష్ట్రాలలో వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఈ విషయంలో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడేమో ప్రధాని మోడీని ప్రశ్నించే ధైర్యం ఆయనకులేదు.అందువల్ల దానికి బదులు పిల్లలను కనండి అని సలహా ఇచ్చి ఏపీ జనాన్ని అటువైపు మళ్లిస్తే సరిపోతుందని అనుకున్నారనుకోవాలి. ఆర్ఎస్ఎస్ వారి మెప్పుదల కూడా వస్తుందని భావించి ఉండవచ్చు.అయితే విశ్వహిందూపరిషత్ నాయకుడు ఒకరు మాత్రం ఈ స్కీమ్ కేవలం హిందువులకే అమలు చేయాలని మెలిక పెట్టారు. అది వేరే సంగతి. ఈ మొత్తం ఏపీసోడ్ లో ఇబ్బంది పడుతున్నది ఎవరయ్యా అంటే అది ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ముందుగా ఆయనను పిల్లలను కనమనండి అని మహిళా నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.ఇది లోకేష్ కు ఎంబరాస్ మెంట్ గానే ఉంటుంది. బహుశా దానివల్లనేమో ఇంతవరకు ఈ సంతానోత్సత్తి అంశంలో తండ్రి ప్రతిపాదనపై లోకేష్ స్పందించలేదు.ప్రచారం ఆరంభించలేదు.ఇంకో మాట చెప్పాలి. ముందుగా మొదటి ఇద్దరు పిల్లలకు ఎందుకు ప్రోత్సహాం ఇస్తానని అనడం లేదు?దాంతోనే ఈయన ఏదో ప్రచారం కోసం అంటున్నారులే అన్నభావన కలగదా!పిల్లలు కనడం అన్నది వ్యక్తిగత విషయం.వారి ఆర్ధిక స్తోమతను బట్టి ,వారి ఇతర సమస్యలను బట్టి ఉంటుంది. చంద్రబాబు కనమంటే కనడం,వద్దంటే కనకపోవడం ఉండదు.ఆ సంగతి కూడా ఆయనకు బాగా తెలుసు.ఒకవేళ చంద్రబాబు చెప్పారు కదా అని ఎవరైనా అమాయకంగా ఎక్కువ మంది పిల్లలను కనడం ఆరంభిస్తే వచ్చే సమస్యలను వివరిస్తూ ఒక పిల్లల డాక్టర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.చంద్రబాబు మాటలను పట్టించుకోవద్దని ఆమె సూచించారు. చంద్రబాబు దృష్టిలో ఏపీ ప్రజలు మరీ అమాయక గొర్రెలుగా కనిపిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ది ఉంటే మూడో బిడ్డను కంటే నెలకు ముప్పైవేలు ఇస్తామని చెప్పగలరా?లేదా 30 లక్షల డిపాజిట్ చేస్తామని గ్యారంటీ ఇవ్వగలరా?పెళ్లి చేసుకుంటే లక్షరూపాయల కానుక ఇస్తామని చెప్పిన పెద్దలు ఎంతమేర దానిని ఆచరించారు?ప్రస్తుతానికి చంద్రబాబు చెబుతున్నవి ఉబుసుపోక కబుర్లుగానే అంతా పరిగణిస్తున్నారు.కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా అప్రతిష్ట తెచ్చుకోవడం అవసరమా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పూటకో మాట మాట్లాడితే ఎలా పవన్?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులను చూస్తే జాలేస్తుంది. జనసైనికుల ప్రతినిధిగా సీఎం అవుతాడనుకున్న పవన్... కాపు సామాజిక వర్గ శ్రేయోభిలాషులను అవమానించేలా మాట్లాడుతున్నా చప్పట్లు కొట్టారంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా హీరోలపై కొందరిలో వెర్రి అభిమానం ఉంటుందని అంటారు. హేతుబద్దత, మంచి, చెడు విశ్లేషణ కొరవడతాయని అంటారు. మంగళగిరిలో జనసేన సమావేశంలో జరిగిన ఈ సన్నివేశం చూసిన తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది. తమిళనాడులో పార్టీని స్థాపించి రెండేళ్లలోనే ముఖ్యమంత్రైన విజయ్‌తో తనను పోల్చడంపై పవన్ కళ్యాణ్‌కు అసహనంగా ఉండవచ్చు. దానిపై నేరుగా వివరణ ఇచ్చి ఉండవచ్చు. అలా కాకుండా ‘‘ఊళ్లో పెళ్లికి..’’ అన్న సామెత కాస్త మార్చి ఊళ్లో పెళ్లవుతుంటే పిల్లలు అటూ, ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తుంటారని సర్దుకున్నారు. అయినా ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో విస్తారంగా కథనాలు వచ్చేశాయి. అభిమానులను కుక్కలతో ఎలా పోల్చుతారంటూ ప్రశ్నలు సంధించారు. నిజానికి ఈ సామెతను ప్రస్తావించినప్పుడు జన సైనికులంతా అవమాన భారంతో కుంగిపోయి ఉండాలి. కాని పలువురు చప్పట్లు కొట్టారు. అంటే వారికి ఆయన ఉద్దేశం అర్థం కాలేదన్నమాట. ఇంత అమాయకులు కనుకే పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లుగా వారిని మభ్యపెట్టగలుగుతున్నారా?2008 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ 2014లో సొంత పార్టీ పెట్టినప్పటి తరువాత కూడా... ఆయన ఎన్ని మాటలు మార్చాడో అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పడం, మాటమార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డులు కూడా ఈయన బద్ధలు కొట్టి ఉంటారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులు, కాపు సామాజిక వర్గం గట్టిగా కోరుకుంది. గత ఎన్నికల సమయంలో పవన్ రెండేళ్లపాటు సీఎం పదవి, కనీసం యాభై సీట్ల డిమాండ్‌ను చంద్రబాబు ముందు పెట్టి ఉండాల్సిందని చాలామంది అప్పట్లో సూచించారు కూడా. కానీ ఆయన వీటిని పట్టించుకోలేదు. ఈవీఎంల మాయో, లేక జనం ఓట్లు వేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. తనకు మద్దతిస్తే కాపుల నుంచి సీఎం అయి చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ టీడీపీకి పదిహేనేళ్లపాటు మోస్తానని చెబుతుండడం ఆ వర్గాలను నిరాశ పరుస్తోంది. టీడీపీని మోయడానికి జనసేన పేరుతో పార్టీ పెట్టడం దేనికి అని అభిమానులే ప్రశ్నిస్తున్నారు.తమిళనాడులో విజయ్ సొంత సిద్ధాంతం, వైఖరితో ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించారు. కానీ పవన్‌లో ఈ చిత్తశుద్ది ఎన్నడూ వ్యక్తం కాలేదు. 2014లో పార్టీ పెట్టినప్పుడే పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అది ఎలాంటి వ్యూహం అవుతుంది? తొలుత చెగువేరా వెంట ఆ తరువాత తర్వాత మోడీ అంటే... కమ్యూనిజం నుంచి సనాతనానికి మారిన చరిత్ర పవన్‌ది. అవసరమైతే సీఎం పదవినైనా అయినా వదలుకుంటాను తప్ప కుల, మత రాజకీయాలు చేయను అని స్పష్టంగా చెప్పిన చరిత్ర విజయ్‌ది. పవన్ కళ్యాణ్ నిత్యం తెలుగుదేశం తరపున అనేక అసత్యాలను ప్రచారం చేయడానికి కృషి చేస్తున్నారని కొందరు విమర్శిస్తుంటారు. తనకు కుల భావన లేదని ఒకసారి, కాపులైనా తనకు ఓటు వేయరా అని మరోసారి, అమరావతి కుల రాజధాని అవుతోందని ఇంకోసారి, తాను ఎప్పుడూ అమరావతికి మద్దతు ఇచ్చామని వేరొకసారి ఇలా అనేక అంశాలలో మాటలు మార్చి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ చెప్పిన పచ్చి అబద్దం గురించి ఈనాటికి వివరణ ఇవ్వలేకపోయారు. ఇలా అనేక సార్లు మాట మార్చడానికి వెనుకాడలేదు. వేరే పార్టీవారి కోసం విజయ్ పనిచేయాల్సిన పని లేదు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. 2019లో ఒంటరిగా పోటీ చేశానని పవన్ చెప్పడం అసత్యమా?కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెండు చోట్ల ఓడిపోయింది నిజమే కావచ్చు.కాని దానిపై ఆత్మపరిశీలన చేసుకున్నారా? అప్పట్లో లక్నో వరకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఎన్నికల పొత్తు కోరిన సంగతి ఆయన మర్చిపోయారేమో! ఆ పార్టీతోపాటు సీపీఐ, సీపీఎంలతో జట్టు కట్టిన విషయం ఆయనకు జ్ఞప్తికి లేదనుకోవాలా? ఓటమి తర్వాత వెంటనే బీజేపీతో పొత్తు కోసం డిల్లీ వెళ్లారా? లేదా? ఇదంతా డబుల్ గేమ్ కాదా? పొత్తు పెట్టుకోవడం తప్పుకాదు.కాని తనకేదో సిద్దాంతం ఉన్నట్లు నమ్మబలకడమే బాగోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ఉపయుక్తమని ఈయన ఇచ్చిన సలహాను విజయ్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఏకంగా సీఎం అవడం పవన్‌కు బాగా చికాకుగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా రాజకీయం చేసి ఉంటే ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉండేదని ఆయనకు మద్దతు ఇచ్చే వర్గాలు భావిస్తున్నాయి.అదే విషయం ఆయనకు చెవిలో చెబితే కోపం వచ్చినట్లు ఉంది.తాను సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదని చెప్పడం తనను తాను మోసం చేసుకోవడం కాదా? పలుమార్లు తాను సీఎం అయి చూపిస్తానని అన్నారా? లేదా? సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టానని పవన్ ఇప్పుడు చెబుతున్నారు. దానిని ఎవరైనా నమ్ముతారా? పోనీ ఏమిటి అయన తీసుకువచ్చిన మార్పు. సమాజం సంగతి అటు ఉంచి, ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నది ఆలోచించుకోవాలి! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్ ల గురించి ఎన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడేమని పొగుడుతున్నారు? దానిపై వివరణ ఇచ్చారా? మహిళలపై కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్నడైనా నోరు తెరిచారా?ఎవరిదాకానో ఎందుకు? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఒక యువతి చేసిన ఆరోపణల గురించి స్పందించారా? శ్రీకాళహస్తిలో సొంత పార్టీ మహిళా నేత టీడీపీ ఎమ్మెల్యేపై చెప్పిన సంగతులేమిటి? దానిపై ఎక్కడైనా మాట్లాడారా? వైసీపీపై రాజకీయ విమర్శలు చేయవచ్చు. కాని అలాకాకుండా టీడీపీ నేతల మాదిరి అసత్యమైన వ్యక్తిగత దూషణలకు దిగడం సమర్థనీయం కాదు. చిత్రం ఏమిటంటే వంగవీటి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ఆయన మద్దతుదారులను పవన్ ప్రశ్నించడం చూసి విస్తుపోయారు. రంగాను హత్య చేసిన వారితో, ముద్రగడ కుటుంబాన్ని వేధించిన వారితో, అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారితో అంటకాగుతూ రంగా హత్యపై కాపులనే ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ను పలువురు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గందరగోళంగా మాట్లాడుతున్నారని చాలామంది అంటుంటారు.కాని అది నిజం కాకపోవచ్చని, టీడీపీ కుతంత్రాల రాజకీయం బాగా వంట పట్టించుకుని అదే దారిలో సాగితేనే ప్రజలను మభ్య పెట్టవచ్చన్న ఉద్దేశంతో పవన్ ఉన్నారేమో అన్న అనుమానాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తుంటారు. ఏదో రకంగా తంటాలు పడి రాజకీయాలలో పదవులు పొందవచ్చేమో కాని, ప్రజలలో విశ్వసనీయత, గౌరవ స్థానం పొందడానికి చిత్తశుద్ది,లక్ష్య శుద్ది ఉండాలి. అవమానించినా చప్పట్లు కొట్టే అభిమానులు ఉండడం చూస్తే పవన్ కళ్యాణ్ అంతవరకు అదృష్టవంతుడే అని చెప్పాలేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇదేనా పొదుపు.. చంద్రబాబు డబుల్ యాక్షన్
-
ఫ్లాష్‌బ్యాక్ తిరగేస్తే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే. కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేశ్‌లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాలలో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్ల ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్ కనుక ఆయిల్ పై ఉన్న పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా!. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం లేదని చంద్రబాబు పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. అమరావతి నిర్మాణాలలో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అంతర్జాతీయ నగరమని ఊదరగొట్టి.. మున్సిపాలిటీతో సరిపెట్టి..
వెనకటికి ఒక సామెత ఉంది. ఏమి చేస్తున్నావురా అని అంటే పారబోసి, ఎత్తుకుంటున్నానని చెప్పాడట. ఇప్పుడు అమరావతి రాజధానిలో టీడీపీ,జనసేన, కూటమి సర్కార్ తీరు అలాగే ఉంది. చేసిన పనులే మళ్లీ చేయడం,ఇప్పటికే ఉన్న నిర్మాణాలనే మళ్లీ చేపట్టడం, కోట్లు వ్యయం చేసి కంప కొట్టిస్తుండడం, వరద వస్తే నీళ్లు తోడుతుండడం..ఇలాంటి వైనం అందరిని విస్తుపోయేలా చేస్తోంది. ఫలానా ప్రాంతం వరద వస్తే మునిగిపోతుందని తెలిస్తే ఎవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటారా? కాని ఏపి ప్రభుత్వం మాత్రం వరద వచ్చినా ఫర్వాలేదు..వేల కోట్లు వ్యయం అయినా ఫర్వాలేదు..తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తొలుత 34వేల ఎకరాలు భూముల నుంచి సమీకరించి అంతర్జాతీయ రాజధాని నగరం అవుతుందని ఊదరగొట్టారు. ఇప్పుడు అది కేవలం మున్సిపాల్టీగానే ఉంటుందని, ఇంకా మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.అందులో భాగంగా ఏభైవేల ఎకరాలకు టెండరుపెట్టారు. ఒకప్పుడు చంద్రబాబుకు, టీడీపీకి వీర మద్దతుదారులుగా ఉన్న పలువురు రైతులు, ఆ ప్రాంత గ్రామాలవారు ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు.తాము భూములు ఇవ్వబోమని కరాఖండిగా చెబుతున్నారు. టీడీపీ మద్దతుదారు అయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంటివారే రెండో దశ భూమి సమీకరణ ఒక పెద్ద స్కామ్ అని అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి సీనియర్ నేతలు నెత్తి,నోరు మొత్తుకుని ఇదంతా భూ దందానే అని,ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందని వాపోతున్నారు. అయినా వీటన్నిటిని పెడచెవిన పెట్టి కూటమి సర్కార్ వేల కోట్ల వ్యయం చేసే పనిలో పడింది. కొద్ది రోజుల క్రితం అమరావతి గ్రామాలకు ప్రపంచ బ్యాంక్ బృందం ఒకటి వచ్చింది. అక్కడ వరద నియంత్రణకు జరుగుతున్న పనులను పరిశీలించిందట. అమరావతి అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ లక్ష్మీ పార్దసారధి వారికి వరద నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.కొండవీటి వాగు 24 కిలోమీటర్లు, పాలవాగు 17 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన ఎవెన్యూ ప్లాంటేషన్ తో అభివృద్ది చేస్తామని చెప్పారట.పెనుమాక, శాఖమూరు, నీరుకొండ, లలో కొత్తగా నాలుగు రిజర్వాయిర్లు కడుతున్నామని తెలిపారట.దీనికి మళ్లీ ఈకో టూరిజం అని కలరింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. ఇక్కడే ఎవరికైనా సందేహం రావాలి!అసలు వరద ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఎందుకు కడుతున్నట్లు? ఆ నీటిని మళ్లించడానికి వేల కోట్లు ఎందుకు వ్యయం చేస్తున్నట్లు? ఈ ప్రశ్నను ప్రపంచ బ్యాంక్ బృందం వేయలేదు. ఎందుకంటే వారి వ్యాపారం వారిది. ఇదంతా ఏపీ ప్రజలపై పడే భారమే కదా!అంతేకాదు..కృష్ణ పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడ నేల స్వభావం బహుళ అంతస్థుల భవనాలకు అంత అనువైనవి కావని నిపుణులు మొత్తుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఏ రాజధాని నగరంలో ఇలా వరద ఎత్తిపోయడానికి లిఫ్ట్ లు ,రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదని అర్బన్ వ్యవహారాల నిపుణుడు రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.ఇక్కడ 84 శాతం సాగు,పర్యావరణ భూములు ఉన్నాయని, మూడు పంటలు పండే భూములను నాశనం చేసి పర్యావరణాన్ని దెబ్బ తీశారని మాజీ జనసేన నేత, పర్యావరణవేత్త అయిన బొలిశెట్టి సత్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లలో పలువురు పర్యావరణవేత్తలు సైతం ఇదంతా పర్యావరణ విధ్వంసం అని హెచ్చరించారు. కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ పంట భూములలో రాజధాని వద్దని స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు.ఇటు రేగడి భూములలో కాకుండా,నాగార్జున యూనివర్శిటీ చెంత ఉన్న ప్రభుత్వానికి చెందిన గట్టి భూములలో అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుందని ఎంతోమంది చెప్పినా, చంద్రబాబు వినిపించుకోలేదు. లక్షల కోట్లు ఒకే చోట కుమ్మరించడానికి రెడీ అయిపోయారు.అందులో భాగంగా ఇప్పటికే 47 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు.వేల కోట్ల రూపాయలతో రిజర్వాయిర్లు నిర్మిస్తూ ,వరద ప్రాంతంలో లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం వచ్చిన బుడమేరు వరద కారణంగా పడిన గండ్లనే ఇప్పటికీ పూడ్చలేదట. విజయవాడ మునిగిపోకుండా 35 కోట్ల రూపాయలతో 500 మీటర్ల రక్షణ గోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు.దానికే దిక్కులేదట.అమరావతిలో మాత్రం అంతర్జాతీయ టూరిజం ఏర్పాటు చేస్తారట.చిత్రమేమిటంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటినే కాదు.. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ లు వంటివాటిని మళ్లీ కొత్త డిజైన్ లతో నిర్మిస్తారట.ఏపీ ఆర్దికంగా అంత పటిష్టంగా ఉంటే ఏమి చేసుకున్నా ఎవరూ కాదనరు,కాని ఒక పక్క చెప్పిన హామీలకు డబ్బులు లేవని పదే,పదే వాపోయే ప్రభుత్వం, అనేక వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరిపై లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపడం సరైనదేనా అన్నది చర్చ. మొదటి దశ లో సమీకరించిన భూములకు సంబందించి రైతులకు ప్లాట్లు ఇంతవరకు అభివృద్ది చేసి ఇవ్వలేదు.దానికి ఎన్నివేల కోట్ల వ్యయం అవుతుందో ఎవరూ చెస్పలేరు.ఎప్పటికి ఇస్తారో తెలియదు.దేశంలో ఎక్కడా లేని విధంగా 140 మీటర్ల వెడల్పుతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తారట. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.దీనికోసం తమ భూములను గుంజుకుంటున్నారని వారు నిరసన తెలుపుతున్నారు. దేశంలో ఎక్కడా 70 మీటర్లు మించి అవుటర్ రింగ్ రోడ్లు లేవు.కానీ జనమే పెద్దగా లేని ఇక్కడ మాత్రం ఈ స్థాయిలో రింగ్ రోడ్డు వేసి ఏమి సాధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే రెండో దశ భూముల సమీకరణను రైతులు అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండో దశ భూ సమీకరణకు వ్యతిరేకమని ఆ పార్టీ నేత,మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.ఆ ప్రాంత ప్రజలు కూటమి నేతల తీరుపై మండిపడుతూ తమకు మద్దతు ఇచ్చే వారివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇవన్ని ఒక ఎత్తు అయితే తొలిదశలో ప్లాట్ల కేటాయింపు తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పలుకుబడి కలిగిన ఎల్లో మీడియా పెద్దలకు, ముఖ్యమంత్రి సన్నిహితులకు జగన్ టైమ్ లో దాదాపు పూర్తి అయిన వెస్ట్ బైపాస్ రోడ్డు పక్కన,లేదా ఇతర కూడలి ప్రదేశాలలో వారు కోరుకున్నచోట ప్లాట్లు వస్తున్నాయట.అదే సామాన్య రైతులకు మాత్రం మారుమూల,చివరికి స్మశానాలలో ,వాగులలో ప్లాట్లు ఇస్తున్నారట.దీని గురించి ఆందోళన చెందిన ఒక రైతు కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే.ఇవన్ని ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఐదెకరాల విస్తీర్ణంలో గృహాన్ని ఎలా నిర్మించుకోగలుగుతుందని, అంత పెద్ద ప్లాట్లు ఎలా కొనుగోలు చేయగలిగారని మీడియాలో ప్రశ్నలు వచ్చాయి.ఎకరా 20 కోట్లు ఉందని ఆయన ప్రచారం చేస్తున్నారు కాని, తన వరకు వచ్చేసరికి 3.6 కోట్లకే ఎలా కొనుగోలు చేశారన్న మరో సందేహానికి ఆయన వైపు నుంచి సమాధానం రావడం లేదు. ఆయన ఇంటి పరిసరాలలో మరొకరికి ప్లాట్ రాకుండా దక్షిణవైపు గ్రీన్ జోన్ అని ప్రకటించేశారట.ధనికులు, పలుకుబడి కలిగిన పెద్దలకు ఇదంతా టూరిజంగా కనిపించవచ్చేమో కాని, సామాన్యుడికి మాత్రం కన్నీటి సుడులు సృష్టిస్తుందా అన్న భయం వెంటాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జగనే రైట్ అన్నది కూటమి కూడా గుర్తిస్తోంది!
ఎన్టీ రామారావు నటించిన ఓ సినిమాలో ‘‘కోర్టు కోర్టుకు ఒక తీర్పు...’’ అంటూ ఓ పాటుంది. అప్పట్లో సూపర్‌హిట్ ఈ పాట. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు గమనిస్తే... ఈ పాట మరోసారి గుర్తుకురాక మానదు. విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం అంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడం ఇందుకు కారణమవుతోంది. 2019-2024 మధ్యకాలంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషును ప్రవేశపెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే... తెలుగుదేశం, జనసేన, బీజేపీ తదితర పార్టీలు నానా యాగీ చేశాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆంగ్ల మీడియం వల్లనే ఆంధ్ర పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతూనే వారికి కావాల్సిన మాధ్యమంలో చదువుకునే వెసలుబాటూ కల్పించారు. ఇందుకోసం ఆంగ్లం, తెలుగు భాషలు రెండింటిలోనూ పాఠాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను తీసుకురావడాన్ని ఎద్దేవ చేస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వంటివారు తెలుగు భాషకు ఛాంపియన్ల మాదిరి వాదించారు. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థులు ఇంగ్లీషు అద్భుతంగా మాట్లాడితే అవమానించిన టీడీపీ పెద్దలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ప్రజలలో మాత్రం ఆంగ్ల మీడియంపైనే ఆసక్తి ఉందన్న విషయం అనేక సర్వేలలో వెల్లడైంది. ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఉంటే అభ్యంతర పెట్టని ఈ నేతలు, ప్రభుత్వ స్కూళ్లలో చేరే పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ వద్దని ఎలా అంటారో అర్థం అయ్యేది కాదు. చిత్రంగా తెలుగు మీడియం అంటూ గొంతు చించుకుని మాట్లాడే ప్రముఖులెవ్వరి పిల్లలు, లేదా మనుమళ్లు ఆ మీడియంలో చదవడం లేదు. అంతా పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే ఆంగ్లంలోనే విద్యనభ్యసిస్తుంటారు.ఈ విషయాలన్ని బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకునేవారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ సంస్కరణ తెచ్చిందన్న ఆక్రోశంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దానిని వ్యతిరేకించారనిపిస్తుంది. రాజకీయ దురుద్దేశాలతో కొందరు ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. అప్పట్లో విచారణ చేసిన హైకోర్టు కూడా ఆంగ్ల మీడియం వైపు మొగ్గు చూపలేదు. కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజలలో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో లను రద్దు చేసింది. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.అక్కడ వాదోపవాదాలు చాలాకాలం సాగాయి.అది ఎటూ తేలలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది.దాంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం యధావిధిగా, ఆంగ్ల మీడియం విషయంలోను యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో బోధన భాషగా ఆంగ్లం ఉంటుందని గత నెల 16న ఒక ఆదేశం జారీ చేసింది. దీనిపై ఫ్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేసిన ఛీప్ జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్యల బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్ధులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాలలో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ అందరిని ఏకం చేసే ఒక అంశమని కూడా వ్యాఖ్యానించింది. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా వారు ఇంతర రంగాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. మంచి పరిణామమంటూ వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఇదే అంశంపై గతంలో హైకోర్టు జీవోలను కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆంగ్లభాషను పొరపాటున బోధన భాషగా పేర్కొన్నామని, ఆ ప్రొసీడింగ్స్‌ను సవరించామని నివేదించారు. ప్రభుత్వ స్కూళ్లలో ద్విభాష విధానం అమలలో ఉంటుందని తెలిపారు. దాంతో హైకోర్టు ఈ వ్యాజ్యం నిరర్థకమని తేల్చేసింది. జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడు ఇదే హైకోర్టులో హోరాహోరీగా వాదోపవాదాలు జరిగాయి. ఆంగ్లంతో పాటు తెలుగు ఉంటుందని ఆనాటి ప్రభుత్వం తెలిపినా న్యాయ వ్యవస్థ కూడా పలు సందేహాలు వెలిబుచ్చింది. అంతేకాక సంబంధిత జీవోను కూడా కొట్టివేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినా ద్విభాష విధానాన్నే ఇప్పుడు తెలుగు దేశం ప్రభుత్వం కూడా అమలు చేయక తప్పలేదు. అంటే దీని అర్థం చంద్రబాబు సర్కార్ ఇంగ్లీషులో చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని, తద్వారా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతుండడంతో వెనక్కి తగ్గిందని అనుకోవాలి. అంతేకాక అప్పట్లో రాజకీయంగా వైఎస్సార్సీపీని ఆయా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజలలో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో టీడీపీ పనిచేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకువచ్చిన అనేక సంస్కరణలను, పాలన వ్యవస్థలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడంలేదు. జగన్ టైమ్ లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి పాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? జగన్ సీఎంగా ఉంటే ప్రతిదానిని రాజకీయం చేసి,ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషం చిమ్మిన సంగతి ఒకటికి ,పదిసార్లు నిర్ధారణ అవుతోంది. ఆంగ్ల భాషను మీడియం గా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ ను చూపితే, అప్పట్లో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ తదితరలు సంకుచితంగా వ్యవహరించారు.ఇప్పుడు జనాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎదుటివారికి చెప్పేటందుకేనా ప్రధాని నీతులు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!హైదరాబాద్‌లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్‌తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖను కొత్తగా విశ్వనగరం చేయడం ఏంటి?
మనకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే.. విశాఖ విశ్వనగరి అవుతుంది. లేదంటే ఎందుకు కొరగానిది. సాగర ముప్పు ఎదుర్కుంటుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా వైఖరి. డేటా సెంటర్, లేదా ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ భూములు కేటాయిస్తే రాష్ట్రాన్ని అదానికి రాసిచ్చేస్తున్నట్లు... అదే చంద్రబాబు ఇస్తే... మాస్టర్‌స్ట్రోక్ అన్నమాట. అయితే ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు వాటి పరువును మరింతగా బజారుకీడుస్తున్న సంగతి వాటికి అర్థం కావడం లేదని అనిపిస్తుంది. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి నారా లోకేశ్‌ల ప్రయోజనాలను కాపాడడమే తమ లక్ష్యంగా ఈ రెండు పత్రికలు పని చేస్తున్నాయి. తమ రాతల ద్వారా, ప్రసారాల ద్వారా ప్రజలను నిత్యం మోసం చేయాలని ప్రయత్నిస్తోంది.ఈనాడు పత్రిక కొద్ది రోజుల క్రితం విశ్వనగరి.. మన విశాఖ అని ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అదాని గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేయడానికి రెండు రోజుల ముందు రాసిన స్టోరీ ఇది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల దృష్టి ఇటువైపే అని పేర్కొంది. అంతే... ఏయు శతాబ్ది ఉత్సవాల్లో, డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలోనూ బాబు కూడా అదే రాగం ఎత్తుకున్నారు. నిజానికి విశాఖ ఎప్పటి నుంచో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న నగరం. విశాఖపై దాడికి ప్రయత్నించి పాకిస్థాన్ జలాంతర్గామిని భారత నావికాదళం సముద్రంలో ముంచేసింది ఇక్కడే. ఆ జలాంతర్గామి ఇప్పటికీ అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంటుంది.అంతేకాదు. సుందరమైన సముద్రతీరం దాని సొంతం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ అంతటా జరిగిన పెద్ద ఉద్యమం దేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దానిని నీరుకార్చి ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కోసం కూటమి పెద్దలు తాపత్రయపడుతున్నారు. అది వేరే విషయం. హెచ్పీసీఎల్తో పాటు హిందుస్తాన్ జింక్, అనేక భారీ పరిశ్రమలు కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడ ఏర్పాటయ్యాయి. రెండు పోర్టులు, షిప్ యార్డులు ఉన్నాయి. అందువల్లే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే ఏపీకి మంచి గ్రోత్ ఇంజన్ అవుతుందని భావించారు. దానిని అడ్డుకుంది ఇదే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ ఎల్లో మీడియానే! ఎక్కడ జగన్‌కు పేరొచ్చేస్తుందో అనే దుగ్ధ. ఎలాగైనా దానిపై విషం చిమ్మాలన్న ఏకైక లక్ష్యంతో ఆ మీడియా పనిచేసింది. అందుకే అప్పట్లో ఈనాడు ‘‘తీరంలో చీలిక’’, ‘‘ఈ గాయం తీరనిది’’, ‘‘మరిగే ఎండ కరిగే మంచు, పొంగే సముద్రం ..ఆ నగరాలకు ముప్పు ..జాబితాలో మన విశాఖపట్నం కూడా ,భయపెడుతున్న నాసా అధ్యయనం అని వార్తలు వండి వార్చారు. సముద్రం కారణంగా విశాఖ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని రాశారంటే ఏమని అనుకోవాలి. అంతేకాదు.. తీర ప్రాంతం గుండా భోగాపురం విమానాశ్రయానికి రోడ్డు విస్తరణ చేస్తుంటే ,ప్రజల ఇళ్లు పోతాయని రెచ్చగొడుతూ స్టోరీలు ఇచ్చారు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి 'అదాని అడిగారని..2600 కోట్ల భూమి 130 కోట్లకే సొంతం’ అని రాసింది. కృష్ణపట్నం పోర్టును కట్టబెట్టారు..గంగవరం పోర్టును చుట్టబెట్టి ఇచ్చారు., ఇది అదాని పై సర్కార్ కు ఉన్న ప్రేమ అని విమర్శిస్తూ స్టోరీలు ఇచ్చారు. ఇప్పుడు ఇవే మీడియా సంస్థలు ఆహో, ఓహో అని తెగ పొగుడుతూ వార్తలు ఇస్తున్నాయి. అదాని డెటా సెంటర్‌ను గూగుల్ డేటా సెంటర్ గా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. ఇక అది సాధ్యం కాదని అర్ధం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అదాని డేటా సెంటర్ కే ప్రభుత్వం భూములు కేటాయించవలసి వచ్చింది.ఈ కంపెనీ ఏర్పాటు చేసే డేటా సెంటర్ ను గూగుల్ వాడుకుంటుంది.అంటే ఒక రకంగా అద్దెకు తీసుకుంటుందన్న మాట. తప్పులేదు. కాని జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఆ భూమి ఎకరా విలువ రూ.20 కోట్లు ఉంటుందని లెక్కగట్టింది. ఎకరా కోటి రూపాయలకే ఇచ్చేస్తారా అని తప్పుపట్టింది. ఇప్పుడేమో 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతుంటే అబ్బ! ఎంత గొప్పదనం అని తెగ సంబర పడుతోంది. ఇలా ఉంటుంది ఎల్లో మీడియా ద్వంద్వ నీతి. అదాని డేటా సెంటర్ జగన్ టైమ్ లో వచ్చింది. దానిని మరికొంత పెంచి 490 ఎకరాల భూమిని ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ అన్నారు. ఒకే. ఫర్వాలేదు.ఈ డేటా సెంటర్ వల్ల తక్కువ ఉద్యోగాలు వస్తాయనే కదా జగన్ ఆ రోజుల్లో పలు షరతులు పెట్టి 25 వేల ఉద్యోగాలు కల్పించాలని జి.ఓ.లో పేర్కొన్నారు. ఇప్పుడేమో కేవలం 200 ఉద్యోగాలే వస్తాయని ప్రభుత్వమే అధికారికంగా తెలిపింది. ఆ తర్వాత ఫ్లెక్సీలలో మాత్రం లక్ష ఎనభైవేల ఉద్యోగాలు వస్తాయని టీడీపీ ప్రచారం చేస్తే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు రావని తేల్చి చెప్పారు. ఈ డేటా సెంటర్లపై అమెరికా, మరికొన్ని దేశాలలో ఎందుకు వ్యతిరేకత వస్తుందో కూడా గమనించాలి. విశాఖ నగరానికి సరఫరా చేసే విద్యుత్ పరిణామం అంత ఈ డేటా సెంటర్ కు నిత్యం అవసరం అవుతుందట.అలాగే నీరు కూడా భారీగా వాడుకుంటుంది. ఇవి ఒక ఎత్తు అయితే ఏకంగా ఈ కంపెనీకి 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై సీనియర్ రిటైర్డ్ అధికారి ఈఎఎస్ శర్మ వంటివారు ఆక్షేపిస్తున్నారు. ఒకవైపు ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అని లోకేశ్ చెబుతున్నారు. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా ఆ కంపెనీలు భూమి కొనుగోలు చేసి యూనిట్లను స్థాపించి ఉండేవి కదా అన్నదానికి జవాబు ఉండదు. భూములు 99 పైసలకే ఇవ్వడం ద్వారా విశ్వనగరం విశాఖ బ్రాండ్‌ను చంద్రబాబు సర్కార్ పాడు చేస్తున్నదా అన్న సందేహం కలుగుతుంది. జగన్ టైమ్‌లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుని డెవలప్మెంట్ సెంటర్ ను ఆరంభించింది.దానివల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడలేదు. కాని ఇప్పుడు అదే కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి మూడు నెలలకు రూ.8500 కోట్ల లాభాలు ఆర్జిస్తుంటుంది. అలాంటి సంస్థకు దాదాపు ఉచితంగా భూములు ఇవ్వాల్సిన అవసరముందా? అలాగే ఐటి ముసుగులో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ప్రభుత్వ భూములను ఉదారంగా పందేరం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇలాగైతే విశాఖ విశ్వనగరం ఎలా అవుతుంది? భవిష్యత్తులో ప్రభుత్వ భూములే లేకుండా పోతాయి. ఈ స్థితిలో గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖ అంతర్జాతీయ గేట్ వేగా ఏపీ అవుతుందని, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇకపై బ్రేక్ పడుతుందని చంద్రబాబు చెబితే ప్రజల చెవిలో పూలు పెట్టడం కాకుండా మరొకటి అవుతుందా? గేమ్ ఛేంజర్ వంటి పడికట్టు పదాలను వాడవచ్చు కాని, కేవలం వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే ఈ సంస్థ ద్వారా ఎలా వలసలు ఆగుతాయో తెలియదు.ఈ కంపెనీ తొలుత 85వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని అన్నారు.అది తర్వాత 135000 కోట్లు అని చెప్పారు.ఇప్పుడు మీడియాలో లక్షన్నర కోట్ల పెట్టుబడి అంటున్నారు.నిజంగా ఈ స్థాయిలో పెట్టబుడులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఊహించుకోవచ్చు.నిజంగానే భారి పెట్టుబడులు పెట్టి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే సంతోషించవచ్చు.అలా కాకుండా వైజాగ్ కు ఈ డేటా సెంటర్ లు భారం కాకుండా ఉంటే చాలు అదే పదివేలు అనుకునే పరిస్థితి రాకూడదని చెప్పాలి. కేంద్ర రైల్వే,ఐటిల శాఖల మంత్రి అశ్వనీ వైభవ్ మరింత ఆశ్చర్యకరమైన ప్రకటన ఇచ్చి వెళ్లారు.ఎల్లో మీడియాలో మంచి హెడింగ్ కోసం చెప్పారేమో తెలియదు కాని,అమరావతికి బుల్లెట్ రైలు వచ్చేసిందన్న చందంగా మాట్లాడడడం విడ్డూరం. ఆంధ్ర ప్రజలు అమాయకులని,వారికి ప్రపంచంలో జరిగే విషయాలేవి తెలియదని అనుకుంటున్నట్లుగా ఉంది. మొత్తం మీద ఈ మూడేళ్లు వేలాడే ముంతను చూపుతూ ప్రజలను ఊరిస్తారా? లేక ఏమైనా వాస్తవరూపం దాల్చేలా చేస్తారా అన్నది కాలమే తేల్చుతుంది. కొసమెరుపు ఏమిటంటే ఈ డేటా సెంటర్ నిమిత్తం తర్లుపాడు గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నా, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదట. వారు నిరసన చెబుతారని ఊరును దిగ్బందం చేసి కార్యక్రమం నిర్వహించారట. దీనిని బట్టే ప్రభుత్వం చిత్తశుద్ది అర్థం చేసుకోవచ్చేమో! ఇంతకాలం సైబరాబాద్, హైదరాబాద్ తామే నిర్మించామని చంద్రబాబు చెబుతుండేవారు.ఇకపై విశాఖను తామే విశ్వనగరం చేశామని, తామే నిర్మించామని ప్రచారం చేసుకుంటారేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు గారి కళ్లలో తృప్తి కోసం...
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లింది? మొదట చేసిన ఆరోపణ ఏమిటి? ఆ తర్వాత వేసిన కుప్పిగంతులు ఎన్ని? సీబీఐ విచారణలో నిందితులుగా గుర్తించని వారిపై సైతం కేసులు పెట్టాలని ఎల్లో మీడియా ఎందుకు గొడవ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం క్రితం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏదో జరిగిపోయినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నానా హడావుడి చేశారు. దుర్గగుడి మెట్లు కడిగారు. తిరుపతిలో సభ పెట్టి సనాతన హిందువునని ప్రకటించుకున్నారు కూడా. ఆ తరువాతేమైంది? తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులతో వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో నానా ప్రయత్నాలూ చేసింది. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తన ప్రభుత్వ పోలీసు అధికారులు ఇద్దరు ఉండేలా మాత్రం చేసుకోగలిగారు. అయినప్పటికీ జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసింది. ఫలితంగా కూటమి ప్రభుత్వ పరువు పోయింది. రాజకీయం కోసం నీచమైన ఆరోపణలు చేశారన్న భావన ప్రజలలో ఏర్పడింది. అయితే నెయ్యిలో పామాయిల్ వంటివి కల్తీ అయి ఉండవచ్చని సీబీఐ అభిప్రాయపడి కొందరు డెయిరీ యజమానులపై, టీటీడీ అధికారులపై కేసులు పెట్టింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శాంతించలేకపోయింది. ఎలాగైనా నెపం వైఎస్సార్సీపీ వారిపై నెట్టాలని మరో కమిషన్ ఏర్పాటు చేసింది. సీబీఐ నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి చర్యలపై నివేదిక కోరింది. మొత్తమ్మీద అందులో ఏదో రకంగా అప్పటి ఈఓ ధర్మారెడ్డి పేరు ప్రస్తావించడం ఎల్లో మీడియాకు సంతోషం కలిగించింది. చంద్రబాబు సంతృప్తి చెందారో లేదో తెలియాల్సి ఉంది. చంద్రబాబుకు ఒక లక్షణం ఉంది. అధికారులు తన మనసులోని మాటను కనిపెట్టి నిర్ణయాలు చేసేవరకు మీటింగుల పేరుతో తిప్పుతుంటారని చెబుతుండేవారు. పూర్వం ఆయా ఆరోపణలపై తాము కోరుకున్న నివేదికలు ఇచ్చే విధంగా కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులకు బాధ్యత అప్పగిస్తుంటారన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారేమో తెలియదు.అదే మాదిరి తాను ఆశించిన రీతిలో నివేదిక కోసం మరో రిటైర్డ్ ఐఎఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ నియమించారన్న భావన అధికారవర్గాలలో ఉంది. ఆ కమిషన్ పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోని అంశాలు ఎల్లో మీడియాకే లీక్ చేసినట్లుగా ఉంది. వారు టీడీపీకి ఉపయోగపడే అంశాలనే ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో కీలకమైన పలు అంశాలు మిస్ అయినట్లు అనిపిస్తుంది. 2019-2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి మీద మాత్రమే ఎందుకు రిపోర్టు ఇచ్చారు? అంతకుముందు 2014-2019 మధ్య టీడీపీ పాలనలో సరఫరా అయిన నెయ్యి గురించి ఎందుకు నివేదికలో ప్రస్తావించలేదు? టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే వైఎస్సార్సీపీ హయాంలోనూ నెయ్యి ఇచ్చాయి కదా! తప్పు జరిగితే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా?తక్కువ రేటుకు ఇస్తే కల్తీ జరిగినట్లు అన్న నిర్ధారణకు వస్తే, 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా జరిగినట్లే అవుతుంది కదా?అప్పుడు కూడా కిలో నెయ్యి ధర రూ.400 లోపే ఉంది కదా! నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది, లడ్డూ తయారీలో వాడింది చంద్రబాబు హయాంలోనే అని సీబీఐ నివేదికను ఉటుంకిస్తూ కొద్దికాలం క్రితం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యకు ఇంతవరకు చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేకపోయారు? మరో విశేషం ఏమిటంటే దినేష్ కుమార్ కమిషన్ చాలా విచిత్రమైన ప్రతిపాదన చేసింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులో తక్కువ ధర ఆధారంగా నిర్ణయం చేసే టెండర్ విధానం వద్దని ఈ కమిషన్ సిఫారస్ చేసిందని ఎల్లో మీడియా రాసింది. ఇలా ఎందుకు చేశారు? అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం తక్కువ రేట్లకే నెయ్యి కొనుగోలు చేసినా, ఆ తర్వాత తమకు కావల్సిన ఒక సంస్థ ద్వారా అధిక రేటుకు కిలో సుమారు రూ.650లకు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకోవడానికి జరిగిన ప్రయత్నం కాదా? పైగా ఇదే పద్దతి అన్ని చోట్ల అమలు చేస్తే, ఎవరు ఎక్కువ రేటు వేస్తే వారికి టెండర్ వస్తుంది కదా! ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న దోపిడీకి రాజముద్ర వేయడానికి ఏమైనా ఈ సిఫారస్ ఉపయోగపడుతుందా అన్న చర్చ కూడా ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో టీటీడీ వారు ఇందాపూర్ డెయిరీకి అధిక ధరకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్న ఆరోపణపై, దానికి హెరిటేజ్ సంస్థకు మధ్య ఉన్న సంబంధం మొదలైన అంశాలపై కూడా దినేష్ కుమార్ కమిషన్ పరిశీలన చేసి, వాస్తవాలు నిగ్గు తేల్చాలి కదా! మరో చిత్రమేమిటంటే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి నెయ్యి నాణ్యతపై పరిశీలన చేయాలని ఆదేశాలు ఇచ్చారు కాని, ఆ తర్వాత పట్టించుకోలేదట. అందువల్ల ఆయనను బాధ్యుడిని చేయాలని ఈనాడు మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. అదే ధీరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇతర ప్రభుత్వ పెద్దలకు వర్తింప చేయాలని ఈ మీడియా చెబుతుందా? అధికారిక హోదాలో చంద్రబాబు పలు ఆదేశాలు ఇస్తుంటారు. వాటి ఆయనే చూడాలని, లేకుంటే బాధ్యత వహించాలని ఈ మీడియా ఒప్పుకుంటుందా? అప్పుడేమో అధికారులది తప్పని వీరు చెబుతారు. టీటీడీ విషయానికి వస్తే ఛైర్మన్ ది తప్పంటారన్నమాట. అర్థంపర్థం లేకుండా ఎల్లో మీడియా వార్తలు ఇస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్‌లో వందల కోట్ల స్కామ్ జరిగిందని, సంబంధిత ఫైల్ పై చంద్రబాబే అప్పట్లో సంతకాలు చేశారని, ఆయన ఆదేశాల మేరకే నిధుల విడుదల జరిగిందని, టీడీపీ ఆఫీస్ ఖాతాలోకి కూడా నిధులు వెళ్లాయని గతంలో సీఐడీ ఆరోపణ చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఏమి రాసింది? అబ్బే చంద్రబాబుకు దీనిని ఎలా రుద్దుతారని ప్రచారం చేసిందా?లేదా? అమ్మో చంద్రబాబుపై ఆరోపణ చేస్తారా? అని గగ్గోలు పెట్టిందా? లేదా? వైవి సుబ్బారెడ్డిపై మాత్రం అర్జెంట్ గా చర్య తీసుకోవాలని ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏడుపు లంకించుకుందో తెలియదా! అలాగే మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలకు కూడా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుతో సంబంధం ఉందని ఈ కమిషన్ అభిప్రాయపడిందట. అయినా వారిపై చర్యకు సిఫారస్ చేయకపోవడం ఏమిటని ఎల్లో మీడియా బాధట. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకోవాలని కోరవచ్చు. నెయ్యిలో ఎప్పుడు కల్తీ జరిగినా అరికట్టవలసిందే. కూటమి హయాంలో కల్తీ జరిగితే సమర్ధించడం, అప్పుడు తక్కువ ధరకు నెయ్యి సరఫరా అయినా కల్తీ లేనట్లు, ఆ తర్వాత అయితే ఉన్నట్లు సూత్రికరించడం, అలాగే చంద్రబాబు టైమ్ లో వచ్చిన కంపెనీ అయితే దానిని వదలివేయడం, అదే కంపెనీ జగన్ టైమ్‌లో కొనసాగితే అందుకు ఏకంగా సి.ఎమ్.నే బాద్యుడిని చేయడం..ఇలా ఉంది దిక్కుమాలిన లాజిక్కుల ప్రచారం.దీనివ్లలే వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందన్న అభిప్రాయం కలుగుతుంది.కొందరు అధికారుల మీద చర్య తీసుకోవాలని దినేష్ కుమార్ కమిషన్ సిఫారస్ చేసినా ఎల్లో మీడియా సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.మరి చంద్రబాబు ఏలా స్పందిస్తారో తెలియదు.ఏది ఏమైనా న్యాయం, ధర్మం అందరికి ఓకే మాదిరి కాకుండా టిడిపి హయాంలో స్కామ్ లు జరిగితే వాటిని సమర్ధించడం, వైరిపక్షం పాలనలో స్కామ్ జరిగినా, జరగకపోయినా, అబాంఢాలు వేసి రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేయడం వల్ల ఏపీ ప్రతిష్ట,అందులోను తిరుమల ,తిరుపతి దేవస్థానం పరువును కూటమి నేతలు, ఎల్లోమీడియా దెబ్బతీస్తున్నారని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్‌లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్‌ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎంకి పెళ్లి... సుబ్బి చావుకొచ్చినట్టు....
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాలలో సొంతంగా ఎదిగి తన ప్రత్యేకతను చాటుకోవడంతో తనను తాను రుజువు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండిపోవడమా? లేక స్వయంగా ప్రకాశించడమా?అన్నది తేల్చుకోవడానికి సిద్దమవుతారా?లేదా? అన్నదే ఇప్పుడు చర్చ. టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినంత వరకు ఓకే గాని, అచ్చంగా టీడీపీని మోయడానికే జనసేన ఉన్నట్లు రాజకీయాలు సాగిస్తున్న తీరు ఆ పార్టీ క్యాడర్ కు మింగుడుపడని వైనమే. విజయ్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ సినీ రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చినవారు. కాని వీరిద్దరి మధ్య చాలా వత్యాసం ఉంది. విజయ్ ఇంతవరకు చిత్తశుద్దితో, ధైర్యంగా రాజకీయాలు చేస్తే, మొదటి నుంచి పవన్‌లో ఆ లక్షణాలు లోపించాయి. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అంతేకాక తెలుగుదేశం, బీజేపీలకు మద్దతిచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, నిలదీస్తానని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది మాత్రం సున్నా. అమరావతి రాజధాని నిర్మాణంపై కూడా పూటకో చందంగా మాట్లాడిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒకసారేమో 1800 ఎకరాలలో రాజధాని నిర్మించవచ్చని అన్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాల భూమి సేకరిస్తోందని రైతుల్లో వ్యతిరేకత వస్తే... వారికి మద్దతు పలికారు. ఆ వెంటనే హైదరాబాద్‌లో చంద్రబాబును కలవడమే తడవు మనసు మార్చుకున్నారు. మరో సందర్భంలో బీజేపీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో విజయవాడ తీసుకు వెళ్లి చంద్రబాబుతో భేటీ ఏర్పాటు చేయడంతో ఆయన కరిగిపోయారు. విశాఖ వెళితే అదే రాజధాని, కర్నూలు వెళ్లి ఇదే తన మనసుకు రాజధాని అని ఇలా రకరకాలుగా మాట్లాడారు.చివరికి తెలుగుదేశం పార్టీ అమరావతిని ఒక సామాజికవర్గ రాజధానిగా మార్చుతోందని, గేటెడ్ కమ్యూనిటీ అయిందని కూడా విమర్శించారు. కాని 2024 ఎన్నికలలో పొత్తు పెట్టుకుని అదికారంలోకి వచ్చాక అన్ని మర్చిపోయి, చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊ కొడుతున్నారు.పైగా వేల ఎకరాల అమరావతి రాజధానికి తన మద్దతు ఎప్పుడూ ఉందని అసెంబ్లీలోనే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. 2018లో టీడీపీతో బహిరంగంగా విడిపోయినప్పటికీ, రహస్య సంబంధాలు కొనసాగించారన్న ఆరోపణలు పవన్ పై ఉన్నాయి. 2019 ఎన్నికలలో చంద్రబాబు సహాయ సహకారాలతోనే కొన్ని చోట్ల అభ్యర్ధులను నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజయ్ అలా చీకటి బంధాలకు తావివ్వలేదు. ఉన్నదేదో నేరుగా చెబుతూ వచ్చారు.ఆయా పార్టీలపై తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చారు.అనూహ్యంగా 2019 ఎన్నికలలో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ భయపడిపోయారు. వెంటనే చెగువేరా నుంచి ప్రధాని మోడీ వైపునకు మళ్లారు. చంద్రబాబు సూచనల మేరకు బీజేపీని బతిమలాడుకుని మళ్లీ పొత్తు పెట్టుకున్నారు.తదుపరి టీడీపీని జత చేసేందుకు తాను తిట్లు తిన్నానని ఆయనే చెప్పారు.తన తల్లిని దూషించిన టీడీపీ వారిని క్షమించబోనని బీకర ప్రతిజ్ఞ చేసిన పవన్ తదుపరికాలంలో ఆ విషయాన్ని విస్మరించి, అదే టీడీపీ నేతలను తెగ పొగడడం ఆరంభించారు. విజయ్ మాత్రం బీజేపీని తన సైద్ధాంతిక శత్రువు, డీఎంకే రాజకీయ శత్రువు అంటూ చేసిన ప్రకటనలకు కట్టుబడి రాజకీయం సాగించారు. బీజేపీ విజయ్ను తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాని విజయ్ ఎక్కడా తన విధానాన్ని వీడలేదు. పవన్ కళ్యాణ్ అలాకాదు. వైఎస్సార్సీపీతో జతకలవలేదు కాని, టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాలు అన్నిటితో అవకాశాన్ని బట్టి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ అంతటి అవినీతి పార్టీ లేదని ఆయనే చెప్పారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆ పార్టీని, చంద్రబాబును గొప్పగా అభివర్ణించారు. 2024 ఎన్నికల సమయంలో చాలామంది ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఏభై సీట్లు అడగాలని, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కోరాలని సూచించారు. కాని తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలని, జనసేనకు 21 సీట్లు ఇస్తే హాపీ అని ఆయన సరిపెట్టుకున్నారు. అందులో కూడా పది సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇవ్వడం మరో విశేషం. విజయ్ అలాకాదు.తాను ఏది చెబితే దానికే కట్టుబడి మొత్తం అన్ని సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టారు. తన కారు డ్రైవర్ కుమారుడికి కూడా టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. తను గెలిచినా, ఓడినా, ఇలాగే ఉంటానని విజయ్ స్పష్టం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కాపులకు ముఖ్యమంత్రి పదవి గురించి పలుమార్లు రెచ్చగొట్టారు.కనీసం కులభావన రావాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.ఆ తర్వాత తనకు కులం ఏమిటని ఆయనే ప్రశ్నించారు. పైగా 15 ఏళ్లపాటు టీడీపీని మోయాలన్నది తన నిర్ణయం అన్నట్లుగా ప్రసంగాలు చేస్తూ, జనసేన క్యాడర్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు. కాపు సామాజిక వర్గంలో అనేకమంది ఇప్పుడు ఈయన తమను ముంచేశారని ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు తనకు ఎంతో బలం ఉందని చెప్పుకున్న పవన్ , ఆ తర్వాత కాలంలో టీడీపీకి ఉన్న శక్తి తమకు ఎక్కడ ఉందని క్యాడర్ ను ప్రశ్నించి ఆశ్చర్యపరచారు. విజయ్ మాత్రం ఎక్కడా కులాలు, మతాల జోలికి వెళ్లకుండా తన విధానాలపైనే ప్రసంగాలు చేసేవారని చెబుతారు.విజయ్ ఏ మీడియాపైన ఆధారపడలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియా ను నమ్ముకుని చంద్రబాబు చెప్పినట్లు రాజకీయం చేస్తున్నారన్న భావన ఉంది. సమీప భవిష్యత్తులో చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను సీఎంగా చేయడానికి కూడా పవన్ అంగీకరించినట్లే ఉందన్న అభిప్రాయం పార్టీలో ఉంది.పవన్ కళ్యాణ్ ను తమకు అత్యంత విధేయుడుగా చేసుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విజయ్ తన పార్టీ టీవీకే కార్యకర్తల ఆత్మాభిమానం నిలబెట్టేలా వ్యవహరిస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ వారు అవమానించినా పడి ఉండాల్సిందేనన్న చందంగా ప్రవర్తిస్తున్నారని జనసేన నేతలే మీడియా ముందు వాపోయిన ఘట్టాలు ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన స్వార్దం కోసం, టీడీపీని మోయడం కోసం రాజకీయాలు చేస్తుంటే, విజయ్ మాత్రం సూత్రబద్దమైన రాజకీయాలు చేసేందుకు యత్నిస్తుంటారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందువల్లే రజనీకాంత్, కమల్ హసన్ వంటి పెద్ద నటులు సాధించలేని ఘనతను విజయ్ సాధిస్తే, మంచి పాలోయింగ్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ లో చిత్తశుద్ది లోపం,స్థిరత్వం లేకపోవడం వల్ల టీడీపీపై ఆధారపడి రాజకీయ మనుగడ సాగిస్తున్నారన్నది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే!
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూస్తూంటే.. అప్పుచేసి పప్పు కూడు అన్న పాత సామెతను అప్పు చేసి అమరావతి సోకులు అని మార్చాల్సి వస్తుంది. పేదవాడికి అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ గతి తప్పుతోంది. అమరావతిలో గత జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోట్లు వెచ్చించగల ధనికులకే పరిమితమన్న అభిప్రాయం బలపడుతోంది.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని గ్రామాలలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు కలుగుతుందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అవసరానికి తగ్గట్టు నిర్మాణాలు జరిపేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ... అవగాహన లేకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక నగరాన్ని సృష్టిస్తామన్న పాలకుల వ్యవహారమే మింగుడుపడటం లేదు.ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ నిర్ణయాలను పరిశీలిస్తే సామాన్యుడు ఎవరైనా విస్తుపోవాల్సిందే! అమరావతి నిర్మాణాల్లో కేవలం అద్దాలకు మాత్రమే రూ.2540 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది మంత్రివర్గం. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ వంతెనలకు రూ.798 కోట్ల వ్యయం చేయున్నారు. విశేషం ఏమిటంటటే ఇక్కడ నిర్మాణాల టెండర్లను మంత్రివర్గంలో ఆమోదించారట.సాధారణంగా టెండర్ల ఆమోదం కేబినెట్ వరకు రాదు. కాని మంత్రులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదో సందేహం ఉండి ఉండాలి. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ దోపిడీపై విచారణ చేస్తే మంత్రివర్గ నిర్ణయంగా తోసివేయడానికి ఉపయోగపడుతుందన్న భావన కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని పేరుతో ఏ రాష్ట్రంలోను ఇంతలా డబ్బు వృథా చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పార్లమెంటు భవన నిర్మాణానికి కేవలం రూ.1100 కోట్ల లోపు వ్యయం అయితే, ఏపీలో భవనాల అద్దాలకే రూ.2540 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్టిన తెలంగాణ సచివాలయ భవనానికి అయిన ఖర్చు కూడా రూ.వెయ్యి కోట్ల లోపే.డబ్బు ఉంటే ఎన్ని సోకులు అయినా చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. కానీ... ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆంద్రప్రదేశ్‌లో ఈ దుబారా చేయడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఏ పని చేయాలన్నా, ఏ హామీ గురించి ప్రశ్నించినా, మెడికల్ కాలేజీల వంటి వాటిని ప్రైవేటు పరం చేయవద్దని చెప్పినా, డబ్బులు లేవని చెబుతారు. కాని అమరావతిలో మాత్రం లక్షల కోట్లు వ్యయం చేయడానికి రెడీ అయిపోయారు. ఇందుకోసం వేల కోట్ల అప్పులు చేసేశారు. రాజధానిలో సచివాలయ సిబ్బంది కూడా మూడువేల మందికి మించి ఉండరు.కాని సచివాలయం కోసం చదరపు అడుగుకు రూ.15 వేల వ్యయంతో నలభై, ఏభై అంతస్తుల భవనాలు నిర్మించడం అంటే అంతా విస్తుపోతున్నారు. నలభై ,ఏభై లక్షల చదరపు అడుగుల భవనం నిర్మించడమేమిటో తెలియకుండా ఉంది. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, కిక్‌బ్యాక్‌లు పొందడానికే అని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అది చాలదన్నట్లుగా ప్లంబింగ్, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయల కల్పనకు మరికొన్ని వేల కోట్లు, చివరికి అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.ఈ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వపరంగా వాడుకోవడానికి ఆ స్థాయిలో సిబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల ఈ భవనాలలో అత్యధిక భాగం అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. జాతీయ రహదారికి నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కంపెనీలు అద్దెకు తీసుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు.పైగా ప్రభుత్వ భవనాలలో ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. అలాంటప్పుడు ఇన్ని భారీ భవనాల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో తెలియదు.ఇక అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా వేల కోట్ల వ్యయం జరుగుతుంది.నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి ముప్పై రోజులు కూడా ఉండడం లేదు. ఒకప్పుడు 45 రోజులైనా సభ జరగాలని అనేవారు. ఇప్పుడు అడిగేవారు కూడా లేరు. మొత్తం 300 లేదా 400 మంది కూర్చోవడానికి, భారీ స్థాయిలో భవంతి నిర్మించడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. పోనీ కమిటీ సమావేశాలకు అవసరమవుతాయని అనుకున్నా, అవి కూడా ఎంత మేర పని చేస్తాయో చెప్పలేం. ఆ సమావేశాలకు జరగడానికి రెండు లేదా మూడు సమావేశ మందిరాలు సరిపోతాయి. అయినా అసెంబ్లీ భవనానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు.అమరావతి భవనాల డిజైన్ కోసమే రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.ఈ టవర్లపై ఎక్కి నగరాన్ని చూసే సదుపాయం కల్పిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. దానికోసం ఇన్నివేల కోట్లు వ్యయం చేయాలా? ప్రభుత్వం తన సొంత భూములలో నిర్మాణం చేస్తే అదో పద్దతి. రైతుల నుంచి వారి ఇష్టపూర్వకంగానో,లేక బలవంతంగానో భూమి సమీకరించారు.వారికి కౌలుతోపాటు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో లే అవుట్ లు వేసి, మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి.ఇందుకోసం ఒక ఎకరాకు రూ.రెండు కోట్లు అవుతుందని, ఏడేళ్ల క్రితమే చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. కేంద్రం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఈ టర్మ్‌లో ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పు తీర్చవలసిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. అంటే ఏపీ ప్రజలు వడ్డీతో సహా అప్పులు చెల్లించవలసిందే. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారు ఐదు కోట్ల మంది ఈ మొత్తానికి బాధ్యులైతే, ఇక్కడ పెరిగే భూముల విలువ వల్ల లబ్ది పొందేది కొన్నివేల మంది మాత్రమే. ఇదంతా ఉపాధి కేంద్రం అవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆ స్థాయిలో ఇక్కడకు వస్తున్న కొత్త సంస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ వచ్చినా ఇక్కడ కూడా అలాగే ఉచితంగా భూములు ఇవ్వగలుగుతారా? అలా చేస్తే అమరావతి ద్వారా ఆదాయం కూడా రాదు కదా! విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు.దానికితోడు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి అని గొప్పగా చెప్పి రాజధాని పరువు తీశారు. ఇతర సామాజికవర్గాలలో ఆమెకు తెలియకుండానే వ్యతిరేకత సృష్టించారు. ఇది ఒక కోణం అయితే ఇప్పటికే ఉన్న అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని మళ్లీ నిర్మించడం ద్వారా వృథా వ్యయం చేస్తున్నారన్న విమర్శ ఉంది.ఇవే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న రైల్వేస్టేషన్లు కాదని అమరావతి గ్రామాలలో కొత్త రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న విమానాశ్రయం కాకుండా ఇంకో ఎయిర్ పోర్టు నిర్మించాలని తలపెట్టడం ఏ మేరకు తెలివైన నిర్ణయం అవుతుంది? టీడీపీకి గట్టి మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి వెంకటేశ్వరరావు రెండో దశ పూలింగ్ నిమిత్తం భూములు తీసుకోవడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం వేల ఎకరాల సేకరణకు ముందుకు వెళుతుంటే రైతులు అల్లాడుతున్నారు.ఇంతవరకు తొలిదశ రైతులకు హామీ ఇచ్చిన రీతిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. మరో వైపు పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇచ్చిన 50వేల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలియచేస్తుంది.రాజధానిలో పెద్ద, పెద్ద ప్లాట్లు మాత్రమే ఉండాలన్న వారి ధనిక మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి గ్రామాలలో భూములలో మట్టి స్వభావం కారణంగా పునాది నుంచి అధిక వ్యయం చేయవలసి వస్తోంది. చాలామంది విజయవాడ-గుంటూరు మద్య గట్టి నేలల్లో అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చినా వినకుండా చంద్రబాబు సర్కార్ తన ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు ఒక ప్రాంతంలోనే ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది.జగన్ చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ వల్ల ఇన్ని లక్షల కోట్ల అవసరం ఉండదు.ఆ విషయం జనంలోకి వెళుతుండడంతో దానిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోంది. సాధారణంగా ఆర్థిక కష్టాలలో ఉన్నవారు పొదుపుగా వ్యవహరించాలని అంతా సలహా ఇస్తారు. కాని ప్రభుత్వమే ఇలా దుబారా వ్యయం చేస్తుంటే, ఎవరి మాట విననంటుంటే ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సిందేనా? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తమిళనాడు ఫలితాలు.. పవన్ ఫీలవుతాడా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్‌ను అందరూ విజయ్‌తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్‌కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్‌లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.విజయ్‌కు ఉన్న ధైర్యం పవన్‌కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్‌బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్‌కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్ తీరు... ఏపీకి చేటే!
అసందర్భమైన మాటలు ఎప్పుడైనా పరువు తక్కువే. రాజకీయ నేతలైతే మరీ ఎక్కువ. నోరు జారారో అంతే సంగతులు. ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఏపీ కీలక మంత్రి లోకేశ్ ఇప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో అదానీ గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు వేదికపై ఉండగానే లోకేశ్ అసత్యాలు, అతిశయోక్తులతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసి నగుబాటుకు గురయ్యారు. కొద్దోగొప్పో విషయ పరిజ్ఞానమున్న వీరు సభ నుంచి వెళ్లిపోయాకైనా మంత్రి హోదాలో లోకేశ్ వైఖరిపై చర్చించకుండా ఉంటారా? ‘‘జి అంటే తమకు గూగుల్ అని.. వారికి గొడ్డలి’’ అన్న లోకేశ్ వ్యాఖ్య ఎంత అనుచితమైందో చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. పైగా ఒక ఐటీ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి విమర్శలు చేశారంటే లోకేశ్ ఆ పార్టీకి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి వచ్చి గూగుల్ తమదేనని చెప్పుకుంటారని లోకేశ్ అన్నారు. ఎవరేం చేసిందీ ప్రజలకు తెలియదనుకోవాలా? ఈయన చెప్పే ప్రతిమాటనూ అతిథులు నమ్మేస్తారని అనుకోవాలా? గతంలో అదాని డేటా సెంటర్‌కు జగన్ శంకుస్థాపన చేసినప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు రాలేదా? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా ఏపీకి అన్ని వనరులు ఉన్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్ ఒన్‌గా ఉన్నామని, పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య వచ్చిన ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉండి, పరిష్కరించడానికి చొరవ చూపుతామని చెప్పారు. అది రాష్ట్రంపై ఉండాల్సిన కమిట్మెంట్. లోకేశ్ మాత్రం అసందర్భ వ్యాఖ్యలు చేసి రాష్ట్రానికి నష్టం చేశారనిపిస్తుంది. అందువల్లే లోకేశ్‌కు సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పే పరిస్థితి ఆయనకు ఎంతవరకు ఉందన్నది సందేహమే. గతంలో ఆయన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సభలో ఏది మాట్లాడినా, ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు కనుక. సామాజిక మాధ్యమాలు బాగా వచ్చాక ఆయన చెబుతున్న విషయాలలోని పొంతన లేని సంగతులు, గతంలో ఏమి మాట్లాడింది, ఇప్పుడు ఏమి చెబుతున్నది వెల్లడించే వీడియోలను ప్రదర్శిస్తున్నారు.చంద్రబాబును లోకేశ్ ఫాలో అవ్వదలిస్తే ఆయన ఇష్టం. హుందాతనం లేని రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనే ప్రజలలో పరపతి కోల్పోతారు. వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని లోకేశ్ అనగానే టీడీపీ కేడర్ చేసిన పలు అరాచకాలను ఎత్తి చూపుతూ... అసలు గొడ్డలి పార్టీ మీది కదా అని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నలు వేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డిని బాంబులు వేసి హత్య చేసిన వారు టీడీపీలోనే ఉన్నందున ఈ పార్టీ బాంబుల పార్టీ అవుతుందా అని అడిగారు. ఈ కూటమి ప్రభుత్వంలో లోకేశ్ రెడ్ బుక్ అరాచకాలపై నిలదీస్తున్నారు.ఈ రెండేళ్లలో హత్యలకు గురైన వారి వివరాలు వెల్లడిస్తున్నారు.ఉదాహరణకు వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను ఒక టీడీపీ నేత నడిరరోడ్డుపై నరికి హత్య చేశారు.పల్నాడులోని పిన్నెల్లిలో సాల్మన్ అనే వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.వైఎస్ ఆర్ కడప జిల్లా వేంపల్లె వద్ద కొందరు టిడిపి వర్గీయులు గొడ్డళ్లతో వైఎస్సార్సీపీ నేత నాగభూషణరెడ్డిని నరికి చంపారు. ఇలా ఒకటి కాదు.ఈ రెండేళ్లలో జరిగిన ఘటనలలో పలుచోట్ల అరాచకశక్తులుగా మారిన టీడీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేశారు. వీటికి సంబంధించిన వార్తలన్నిటిని ఒకచోటకు తెచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరింది టీడీపీ కార్యకర్తలే కదా!ఈ అరాచకాలన్నిటికి తెలుగుదేశం పార్టీ జవాబుదారి అవుతుందా? లోకేశ్ వీటిని విస్మరించి తన తండ్రి మాదిరే దబాయించి మాట్లాడితే జనం నమ్ముతారా?చంద్రబాబుకు కుదిరింది కనుక తాను కూడా అలానే మాట్లాడతానని నిర్ణయించుకుంటే ఆయనకే నష్టం. అందులోను అదాని,గూగుల్,తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఇలా ప్రసంగిస్తే, ఈ గొడ్డలి గొడవ ఏమిటని వారు అడిగితే ఏమి చెబుతారు? ఏపీలో శాంతి భద్రతలు లేవని లోకేశ్ జవాబు ఇస్తారా?ఎంత ఇతర రాష్ట్రాలలో ఉన్నా,రెడ్ బుక్ గురించి వారికి మాత్రం తెలియకుండా ఉంటుందా?గతంలో జిందాల్ అనే ఊరిశ్రామికవేత్తను ఒక మోసకారి నటి కేసులో ఇరికించడానికి యత్నించిన ఘటన ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియదా?అదే జిందాల్ కు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడే అవార్డు అందించారే.ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న వార్తలకు, జనం చేస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వలేక చంద్రబాబు కూడా పలు సభలలో గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీపై మీద అర్థం లేని విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.ఇప్పుడు అదే గాత్రాన్ని లోకేశ్ అందుకున్నట్లుగా ఉంది.విశాఖపట్నంలో అన్న ఆంగ్ల పదం అక్షరాలలో జి ఉందని, జి అంటే గూగుల్ అని ఆయన అనగానే అంతా ఆశ్చర్యపోయారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉంటుంది కాని విశాఖలో ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉన్నట్లే ఎ అనే లెటర్ కూడా ఉందని,అంటే అదాని గా తీసుకోవచ్చని,అదాని డేటా సెంటర్ ను జగన్ తీసుకువచ్చారని వైఎస్సార్సీపీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందోకాని, ఏపీ మాత్రం తీరని అప్రతిష్టే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అరాచకం, అస్తవ్యస్త పరిస్థితులే బాబు సుపరిపాలన!
ఆంద్రప్రదేశ్‌లో సుపరిపాలన అందిస్తున్నారట. ఎకనమిక్ టైమ్స్ అవార్డును అందుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి ప్రకటన ఇది. కానీ ఈ అవార్డు వార్తలు ఎల్లోమీడియాలో ప్రముఖంగా ప్రచురితమైన రోజు మీడియా మొత్తమ్మీద వచ్చిన వార్తలను పరిశీలిస్తే వాస్తవం అది కాదన్న విషయం స్పష్టమవుతుంది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెట్రోలు, డీజిళ్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలు నానా కష్టాలూ పడుతున్నట్లు కథనాలు వచ్చాయి.చంద్రబాబుకు నిత్యం బాకా ఊదే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా డీజిల్, పెట్రో కొరతతో వచ్చిన కష్టాలపై కథనాలు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆశ్చర్యకరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే డీజిల్ కొరత ఎందుకుందో? ఈ నేపథ్యంలో చమురు కంపెనీలపై చంద్రబాబు సీరియస్ అయినట్టు... నో స్టాక్ బోర్డులు కనిపించరాదని హుకుం జారీ చేసినట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. నిజానిజాలు దేవుడికెరుక. మరి... దీన్ని సుపరిపాలన అందామా?గతంలో ప్రతిచిన్న సమస్యకూ ముఖ్యమంత్రి జగన్ కారణమని తెగ ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం తప్పు చమురు కంపెనీలదని అంటోంది. కొంత నిజం ఉండవచ్చు కానీ.. చమురు కంపెనీలతో వైసీపీ కూడా కుమ్మక్కు అయ్యిందని చెప్పడమే విడ్డూరం. ఇలా చెప్పడం ద్వారా ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ కొరత సమస్యపై ముందస్తు సమాచారం ఎందుకు లేదు? వచ్చినా పట్టించుకోలేదా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాహనదారులు ఇంధన కొరతతో తీవ్రమైన సమస్యలలో పడ్డారు. ఆటోలవారు,క్యాబ్ ల వారికి ఉపాధికి ఆటంకం ఏర్పడింది. రైతులకు, చిన్న పరిశ్రమలకు కూడా అవసరమైన డీజిల్ లభ్యం కావడం దుర్లభం అయింది. కొన్నిచోట్ల రేషన్ పెట్టినా అది ఏ మూలకు సరిపోలేదు. ఇబ్రహింపట్నం వద్ద డీజిల్ అయిపోయిందని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రయాణీకులను నడిరోడ్డు మీద వదలిపెట్టి వెళ్లిపోయాడట. ఎర్రగొండపాలెంలో ఆయిల్ కోసం బంక్‌కు వెళ్లిన ఒక యువకుడిని పోలీస్ ఇన్్సపెక్టర్ లాఠీతో బాదారట. దీనిని ఏ తరహా పాలన అని అనాలి? పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి భారీ క్యూలు కనిపించాయి. ఈ పాపం చంద్రబాబు సర్కారుదే అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో ఇంధన కొరత ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఈ ప్రోబ్లం కొంత ఉన్నప్పటికీ మరీ తీవ్రం కాదు. విశేషం ఏమిటంటే ఏపీలో కొరత రీత్యా పలువురు సరిహద్దులలోని తెలంగాణ బంకులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ ఒత్తిడి ప్రభావం ఈ రాష్ట్రంపై పడుతోందట. అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేశ్‌లు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.అలా చేయకపోగా, ఇప్పుడు సరఫరా కూడా సరిగా చేయడం లేదని జనం వాపోతున్నారు.ఇక వేరే విషయాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో కారు ఆపారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిర్నేని సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. మహిళా సిబ్బందిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే చంద్రబాబు ఎమ్మెల్యే అనుచరులపై సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యేని మాత్రం ఏమీ అనలేదన్నమాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు ఆరేడు గంటలపాటు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. తూతూ మంత్రంగా కేసు పెట్టి సరిపెట్టారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన టీడీపీ రౌడీలకు అలాగే రక్షణ కల్పించారు.మరో వైపు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు పెడితే కక్ష కట్టి అరెస్టు చేస్తున్నారు. కాని టీడీపీ వారు ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆంధ్రజ్యోతి యజమాని వైఎస్సార్సీపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే, దానిపై అనేక మంది ఫిర్యాదు చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామని, డ్రగ్స్ లేకుండా చేస్తామని చంద్రబాబు, లోకేశ్‌లు పలుమార్లు చెప్పేవారు. ఇప్పుడు అవి విచ్చలవిడిగా లభిస్తున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి.చివరికి మంగళగిరి, దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ల పరిధిలో కూడా చిన్న, చిన్న గ్రామాలలో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించి కొందరిని అరెస్టు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం తర్లువాడ గ్రామంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడంపై రైతులు ఆందోళనకు దిగితే ఊరంతటిని దిగ్భందనం చేశారని వార్త వచ్చింది.ఇది ఏ రకమైన ధర్మం? డేటా సెంటర్ రావడాన్ని అంతా స్వాగతిస్తారు. కాని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడమే ఆశ్చర్యం. ఇక కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు కట్టబెట్టి విశాఖ బ్రాండ్ ను దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు దొరకడం లేదని వివిధ పత్రికలు, టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏభై రకాల మందులకు ఆరుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదట. ఈ విషయాన్ని ఎల్లో మీడియానే తెలిపింది. ఆ మీడియా మందుల సమస్యను కప్పిపుచ్చే యత్నం చేసినా, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించరన్న భయమో,మరే కారణమో కాని, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన మందులు దొరకడం లేదన్నది వాస్తవం. ఇది సుపరిపాలనగా భావించాలి. రైతుల విషయానికి వస్తే జొన్న, మొక్కజొన్న, శనగ, అరటి, బొప్పాయి, ఉల్లి ,టమోటా తదితర పంటలకు మద్దతు ధర రావడం లేదు. దాంతో రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటున్నారు.వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆ మధ్య మొక్కజొన్న కొనుగోలు చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఒకవైపు మూడున్నర లక్షల కోట్ల అప్పులతో దేశంలోనే రికార్డు సృష్టించడం ఏ తరహా సుపరిపాలన అన్నది తెలియదు.ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ, అరడజను మంత్రులను శిక్షణ పేరుతో సింగపూర్ పంపించడం, ఆయా సబ్జెక్ట్ లతో సంబంధం లేని మంత్రులు వెళ్లడం, ఇందుకోసం కోట్లు వెచ్చించడంపై ఎల్లో మీడియానే టిప్ టాప్ ట్రిప్పులు అంటూ ఎద్దేవ చేయడం విశేషం. అలాగే కన్సల్టెంట్ల రాజ్యంగా మారిందని కూడా ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. తాజాగా ఏడాది కాలానికిగాను 18 మంది కన్సల్టెంట్లను నియమించి రూ.76 లక్షల వ్యయం చేస్తున్నారు. ఇక కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కప్పిపుచ్చుతున్నారు. మహిళలను వేధించారన్న ఆరోపణలు వచ్చినా ఆ ఎమ్మెల్యేల జోలికి వెళ్లడం లేదు. ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారని, తమకు అధికారాలు లేకుండా తొక్కివేస్తున్నారని గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ బహిరంగంగానే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఇవన్ని చంద్రబాబు తాను సుపరిపాలన అందిస్తున్నానని చెప్పిన రోజు, ఇటీవలి కాలంలో వచ్చిన కథనాలే. గత రెండేళ్లుగా సాగిన అరాచకాలన్నిటి గురించి చెప్పాలంటే చాంతాడంత జాబితా అవుతుంది.ఇన్ని జరుగుతున్నా తాను సుపరిపాలన ఇస్తున్నానని చంద్రబాబు చెప్పుకోగలుగుతున్నారు.అదే ఆయన ప్రత్యేకత.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘కు’ సంస్కరణలే బాబు మార్కు!
ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందజేసింది. అభినందించాల్సిందే కానీ.... అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను చూస్తే మాత్రం ఆయన ఏ రకమైన రిఫార్మరో అర్థం కాదు. సంస్కరణలకు తానే ఆద్యుడని ఎంత ప్రచారం చేసుకున్నా.. అందులో నిజానిజాలేమిటో కూడా చూసుకోవాలి కదా? రెండేళ్లుగా ఆయన చేపట్టిన మహత్తర సంస్కరణలు ఏమిటన్నది ఎల్లోమీడియానైనా ఇస్తుందేమో అని చూశాను కానీ.. ఎక్కడా కనిపించలేదు. ‘‘రాజకీయ పాలన చేస్తామని, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేవారికి ఏ పని చేయవద్దు’’ అని రెడ్ బుక్ అరాచకాలతో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు పాలన ఏపాటి సంస్కరణో, అవార్డు ఇచ్చిన వారికే తెలియాలి. వాస్తవానికి చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు హుందాగా, అబద్దాలు చెప్పకుండా... నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేయడం కాకుండా... ఆయన సంస్కరణలు చేసినా, చేయకపోయినా అవార్డు ఇవ్వడం తప్పు కాదు. ఒక వైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యం, పాలన రంగాలలో తీసుకు వచ్చిన అనేక సంస్కరణలను నీరుకార్చుతూ, ప్రజల కోసం సృష్టించిన సంపదను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న చంద్రబాబు రిఫార్మర్ అవుతారని ఆ మీడియా ఎలా ప్రకటించిందో, దానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. కేంద్రం తీసుకువచ్చిన డ్వాక్రా మహిళల స్కీమ్, విద్యుత్ సంస్కరణలు తనవే అని ఆయన చెప్పుకుంటుంటారు. ఫర్వాలేదు..వాటికి కట్టుబడి ఉంటే ఒప్పుకోవచ్చు.2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.అది ఏ రకమైన సంస్కరణ అవుతుంది?. అలాగే రైతుల రుణాలన్నిటిని రద్దు చేస్తామని, బ్యాంకులలో తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపించే బాధ్యత తనదే అన్నారు.అసలు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇలా చేసిన నేతను సంస్కరణల సారథి అని చెబితే ఎలా ఒప్పుకోవాలి? పోనీ వీటిని అమలు చేశారా అంటే అదేమీ లేదు. డ్వాక్రా రుణాలను అసలు రద్దు చేయలేదు. రైతు రుణాలను అరకొరగా మాఫీ చేసి, ‘‘అన్నీ చేసేశాంగా, రైతుల ఆశకు హద్దు ఉండాలి’’ అని విసుక్కోవడం కూడా మనం చూశాం. 1999లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న విపక్ష కాంగ్రెస్ డిమాండ్‌పై ‘‘అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలి’’ అని వ్యాఖ్యానించింది కూడా ఈ చంద్రబాబే. అంతేకాక విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పెద్ద ఆందోళన వచ్చింది. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిగాయి. నలుగురు యువకులు మరణించారు. ఆ తర్వాత 2004లో టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ను అమలు చేసి చూపించారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా సంస్కరణ మాట వదలి, ఉచిత కరెంట్ ఘనత తనదేనని పాట ఆరంభించుకున్నారు.2014 టర్మ్‌లో, ప్రస్తుతం ఆయన కూడా ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే, 2019-2024 మధ్య కేంద్రం సూచించిన మేరకు రైతులు వాడే విద్యుత్ లెక్కల నిమిత్తం మోటర్లకు మీటర్లు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మీటర్లు ఉన్నా, మొత్తం వ్యయం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టంగా చెప్పినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు కర్షకుల మోటార్లకు మీటర్లు పెడతారా అని గొడవ చేశారు. ఇది సంస్కరణ వాది చేసే పనే అవుతుందా? లోకేశ్ మరో అడుగు ముందుకువేసి మీటర్లను పగలగొట్టాలని పిలుపు ఇచ్చారు. 2024లో పవర్ సాధించిన తర్వాత దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అదేం లేదు. మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా గృహాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతుంటే విజయనగరంలో ఒక ఇంటి యజమాని వాటిని పగలకొట్టి నిరసన తెలిపారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా భూముల రీసర్వే స్కీమ్ ను జగన్ చేపడితే, భూములు కాజేయడానికే అని అబద్దాలు నిత్యం ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అదే రీసర్వేని కొనసాగిస్తున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం పరస్పర విరుద్దంగా వ్యవహరించడం సరైనదేనా? విజన్ 2020 ఉమ్మడి ఏపీలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు. అసలు విజన్ పేరుతో కథ నడిపిందే 2001-2002 ప్రాంతంలో అందులో ఉన్న విషయాలు చూసి ఐఎఎస్ లు, మేధావులు నవ్వుకునేవారు. ప్రచారం కోసం తప్ప ఆచరణ కానివని ఆ రోజుల్లో వారు వ్యాఖ్యానించేవారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది.ఆ తర్వాత విజన్ 2020 ఊసే లేదు. మరి ఉమ్మడి ఏపీలో ఆ విజన్ ఎప్పుడు అమలయ్యింది.దానివల్ల సాధించింది ఏమిటో తెలియదు. హైదరాబాద్ దాని ఫలితాలు చూస్తోందట. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమే.కాని హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని, నగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటే అదెలా సాధ్యమో ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ఎందుకు అడగలేదో అర్థం కాదు. ఒక భవనం నిర్మించి దానికి హైటెక్ సిటీ అని, సైబరాబాద్ అని పేర్లు పెడితే నగర నిర్మాణం చేసినట్లా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను ఆయన ప్రస్తావించారు. జగన్ టైమ్ లో ఈజ్ఆఫ్ డూయింగ్‌లో దేశంలో కొన్నిసార్లు నెంబర్ ఒన్ స్థానంలో ఉండేది. చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు నెంబర్ ఒన్ అయింది?అమరావతి ద్వారా మరో నగర నిర్మాణం చేసే అవకాశం వచ్చిందట. అంటే హైదరాబాద్ తానే నిర్మించానని చెప్పుకుంటున్నారా?దీనిపైనే తెలంగాణ నేతలు తీవ్ర ఆక్షేపణ చెబుతుంటారు.కులి కుతుబ్ షా 400 ఏళ్ల క్రితం నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతే తప్ప మొత్తం నగరాన్ని అంతటిని ఆయన నిర్మించలేదు. అలా చేస్తానని చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం పదే,పదే నగర నిర్మాణం తనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అమరావతి పేరుతో నగర నిర్మాణం చేపడుతున్నానని చెబుతున్నారు.దీనికోసం లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించడానికి వెనుకాడడం లేదు. ఏభైవేల కోట్ల అప్పు ఇప్పటికే చేశారు.ఇది ఏ రకమై సంస్కరణ అవుతుంది? ఏ రకమైన ప్రగతి అవుతుంది? అప్పు చేసి పప్పు కూడా తినడం సంస్కరణ అని అంటారా? హైదరాబాద్ లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లు, బంగ్లాలు అన్ని కలిపి కేవలం 2250 ఎకరాలలో ఉన్నాయని మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ చెప్పారు.అది నిజమే.కేవలం ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి హైదరాబాద్ లో ఉన్నది 300 ఎకరాల లోపే. కాని అమరావతిలో 54 వేల ఎకరాలు సేకరించడమ కాక, మరో లక్షన్నర ఎకరాలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎకరాకు రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా తయారు చేయడం ప్రజలకు ఎలా ప్రయోజనం అవుతుంది? ప్రభుత్వ ధనం ఈ రకంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటని ఎకనమిక్ టైమ్స్ ఎందుకు ప్రశ్నించదు? వరదలను అరికట్టడానికి వేల కోట్ల వ్యయంతో పలు రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు నిర్మించడం ఏ నగరంలో అయినా ఉందా?ఇవన్ని ఒక ఎత్తు అయితే ,ఇంత పెద్ద సంస్కరణవాది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళికలో ఏ రకమైన హామీలు ఇచ్చారు? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తానని ప్రకటించడం రిఫార్మ్ అవుతుందా? పోనీ దానిని అమలు చేశారా? నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్న రూ.మూడు వేలు ఇవ్వకపోవడం సంస్కరణ అని చెప్పుకోవాలా? ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఎగవేశారు. ఇలా అనేక హామీలు ఎండమావిగా మిగిలాయే! రూ.3.55 లక్షల కోట్ల అప్పు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించడం ఏ విధమైన సంస్కరణ? సంపద సృష్టికి సంస్కరణలే కీలకం అని చెబుతున్న చంద్రబాబు వాటిపై ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉన్నారా? కేవలం అవకాశవాద రాజకీయాలతో ఎప్పటికప్పుడు తను చెప్పినవాటికి తానే విరుద్దంగా వ్యవహరిస్తూ సంస్కరణల గురించి మాట్లాడితే రిఫార్మిస్ట్ అయిపోతారా? ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేది రిఫార్మ్ అయితే చంద్రబాబుకు అవార్డు ఇవ్వడం తప్పుకాదు. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘కోత’ల డ్రామాలతో సమస్య గట్టెక్కగలరా?
తెలంగాణలో మంత్రుల జీతాలు సగానికి కోశారు. రాజకీయ డ్రామానా? ఆదర్శంగా నిలిచే ప్రయత్నమా? ఎమ్మెల్యేల జీతాల్లోనూ కోతలు పెట్టి తద్వారా మిగిలిన డబ్బును రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు వాడతారని సమాచారం. మామూలుగానైతే ఈ చర్యలను అందరూ ప్రశంసించాల్సిందే కానీ... రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతతో మిగిలే డబ్బును పరిగణలోకి తీసుకుంటే దీన్ని డ్రామా అనే అనాల్సి వస్తుంది. బకాయేమో కొండంత.. మిగిలేది పిసరంత మాత్రమే మరి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల అప్పు చేయకపోతే రోజు గడవని స్థితి. అదే సమయంలో అధికారం కోసం ఇచ్చిన అడ్డమైన హామీల అమలు బరువూ ఆయా ప్రభుత్వాలపై పడుతోంది. ప్రజలను ఏమార్చి అధికారం సాధించిన తర్వాత అనేక పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో రిటైర్డ్, సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి సుమారు రూ.14 వేల కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు నెలకు రూ.పది కోట్లు కూడా కాకపోవచ్చు. ఇందులో సగం ఆపుకుని ఉద్యోగులకు చెల్లిస్తామని చెబితే హాస్యాస్పదం అనిపించదా? పోనీ వీరు పూర్తిగా తమ జీతాలు తగ్గించుకుంటే అది వేరే విషయం. అభినందించవచ్చు. కాని హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలు ఆరు నెలలపాటు సగం తీసుకకోకుండా ఆగుతారట. అంటే ఆ తర్వాత మొత్తం బకాయిలతోసహా తీసుకుంటారనే కదా?. ఏపీలో తెలుగుదేశం తరపున భజన చేసే ఎల్లో మీడియాకు అక్కడి ప్రభుత్వం ఒక లీకు ఇచ్చింది. హిమాచల్‌లో మాదిరి సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆ మీడియా పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ స్కీములలో అనర్హుల ఏరివేత, దుబారా వ్యయం నియంత్రణ ఆవశ్యం అంటూ ఆ మీడియా ప్రచారం చేసింది. బహుశా ఆ మీడియా వారిని సంతోషపరచడానికో ఏమో కాని, ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో దానిని పాటించడానికి రేవంత్ సర్కార్ సిద్దం అయిందన్న భావన కలుగుతోంది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కొంతకాలం సగం చొప్పునే తీసుకుంటారట. ఇతర ఆదాయ మార్గాలు కూడా అన్వేషించాలని తలపెట్టారు. అది తప్పు కాదు. కాని అసలు సమస్య తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల భారం అన్నది వాస్తవం కాదా? దానిని కప్పిపుచ్చుకోవడానికి తమకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు కొత్త డ్రామా నడపాలని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఏపీలో కూడా ఈ తరహా సీన్ ను చూస్తామేమో తెలియదు. ఏపీలో ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల మేరకు ఉద్యోగులకు బకాయిపడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రిటైరైన వారికి రావల్సిన ఫైనల్ మొత్తాలు సకాలంలో చెల్లించకపోవడంపై హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఉదాహరణకు వృద్దాప్య ఫించన్‌ను రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలు చేస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తామని.. ఇలా అనేక వాగ్దానాలు చేసింది.పైగా ఇవన్ని వంద రోజుల్లో నెరవేర్చుతామని కూడా ప్రజలను నమ్మించే యత్నం చేసింది. ప్రజలు విశ్వసించారా? లేక ఇతర కారణాల వల్లనా అన్నది చెప్పలేం కాని, కాంగ్రెస్ అధికారంలోకి అయితే రాగలిగింది. ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, మిగులు రాష్ట్రాన్ని లోటు రాష్ట్రంగా చేశారని, కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఇలా పలు విధాలుగా సమస్యలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. ఇవన్నీ తెలియకుండానే ఎన్నికల వాగ్దానాలు చేశారా? ఎల్ల కాలం అది సాగదు కదా? సడన్ గా ఆర్టీసీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సమ్మెకు దిగారు. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ప్రభుత్వానికి పెద్ద కళంకంగా మారింది.దాంతో రేవంత్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కొంత సమయం తీసుకునే కసరత్తు తప్ప ఇంకొకటి కాకపోవచ్చు. ఇలాగే ఆయా వర్గాల వారు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆందోళనలకు దిగితే ప్రభుత్వానికి మరింత ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. రైతులలో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా పొగొట్టాలని రేవంత్ సర్కార్ దశల వారిగా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది.రుణమాఫీని కొంత మేర చేశారు. అయినా ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉంాయి. ఫీజ్ రీయింబర్స్ మెంట్ గురించి ప్రైవేట కాలేజీల వారు కొన్ని నెలల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి హైదరాబాద్‌లో భూముల అమ్మకం వంటివాటి ద్వారా కొంత డబ్బు సంపాదిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వస్తున్న ఆదాయానికి సంబంధం ఉండడం లేదు. దానివల్లే ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేయవలసి వస్తోంది.ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రూ.18900 కోట్ల అప్పు చేయాలని ప్రబుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల సగటున రూ.6300 కోట్ల అప్పు చేయాలన్నమాట. అంటే రోజుకు రూ.210 కోట్ల రుణం! రాష్ట్రం అప్పు ఇప్పటికే సుమారు రూ.ఎనిమిది లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది ఇంకా పెరుగుతుంది.అయినా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం అసాధ్యం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్‌తో యుద్దం నేపథ్యంలో ‘‘జై జవాన్, జై కిసాన్’’ అన్న నినాదం ఇచ్చి ప్రజలు ఒక పూట ఉపవాసం ఉండి ,ఆ డబ్బును సైనికుల నిధి ఇవ్వాలని కోరారు. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కోట్లాది మంది దానిని ఆచరించారు. ఆ రోజుల్లో ఆయన పాటించిన నిరాడంబరత, చిత్తశుద్ధి, దేశ భక్తి మొదలైనవి కారణాలుగా ఉన్నాయి. కాని ప్రస్తుతం ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వాలు విలాసవంతమైన రీతిలో ఖర్చులు చేస్తున్నాయి. అవినీతికి కొదవే లేదు. ప్రజలను మభ్య పెట్టడానికి ఇష్టారీతిన ఎన్నికల ప్రణాళికలను ప్రకటించడం వంటివి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం అమెరికాలో చేసిన ఒక వ్యాఖ్య అర్థవంతమైందే అనుకోవాలి. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా మేము చేయకుండా ఉంటామా? అని అన్నారు. చమత్కారం కోసం ఆ మాట చెప్పినా,అది అక్షరసత్యం!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు.. అంత ద్వేషమెందుకు?
పుట్టినరోజు నాడైనా ఎవరికీ అపకారం చేయకూడదన్నది చాలామంది సెంటిమెంట్. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టిన రోజునే సచివాలయ ఉద్యోగ సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఆ రోజున చేశారో తెలియదు కానీ.. ఈ చర్య వల్ల ఉద్యోగ వర్గాల్లో చంద్రబాబు పరపతి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగులను పలు రకాలుగా వేధిస్తోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్నా ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తున్న ఉద్యోగ నేతను డిస్మిస్ చేయడం ఏమిటని చాలా మంది మదనపడుతున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 200 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. సీనియర్ అధికారులను ఏదో నెపంతో జైళ్లకు పంపించారు. ఇదంతా కక్ష సాధింపు, రెడ్ బుక్ అరాచకాలలో భాగంగానే సాగుతుందన్న విమర్శలున్నాయి. కొంతకాలం క్రితం తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ చంద్రబాబుకు పరువు నష్టం నోటీసు పంపిన పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరయ్యను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉండి, అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొంత విశాల దృక్పథంతో పనిచేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచన చేయాలి. చంద్రబాబు గతంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదని చాలామంది అంటుంటారు. ఇంతకీ వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం చేస్తున్న అభియోగం ఏమిటి? గత ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏవో కొన్ని బస్ డిపోలలో ప్రచారం చేశారట. ఇది అవాస్తవమని, ఆధారాలు చూపాలని ఆయన కోరుతున్నారు.బస్‌డిపో మేనేజర్లు కూడా ఈ మేరకు నివేదికలు ఇచ్చారని ఆయన అంటున్నారు. అయినా ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. దానికి కారణం ఆయన టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి పదే, పదే ప్రశ్నించడమే కారణం. పోనీ తన హయాంలో ఉద్యోగ సంఘ నేతలను టీడీపీకి అనుకూలంగా వాడుకోలేదా అంటే శుభ్రంగా ఉపయోగించుకున్నారు. అప్పట్లో ఉద్యోగ సంఘ అధ్యక్షుడుగా ఉన్న అశోక్ బాబు, తదితర ఎన్జీవో నేతలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన రాజకీయ విన్యాసాలు అన్నిటిలో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆయన సమక్షంలోనే ప్రధాని మోడీని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయినా వారు తప్పు చేయనట్లు లెక్క. ఆ తర్వాత కాలంలో అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన టీడీపీలో కీలకమైన ఒక నేతగా ఉన్నారు. అంటే చంద్రబాబుకు, ఆయనకు మద్య క్విడ్ ప్రోకో జరిగినట్లు కాదా? ఉద్యోగులను ఎన్నికల సమయంలో ప్రభావితం చేయడానికి కొందరు నేతలు ఆ రోజులలో ప్రయత్నించారా? లేదా? అన్నది అందరికి తెలుసు.అయినా 2019లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ వీరెవ్వరిపైన కక్ష సాధింపులకు దిగలేదు. అంతేకాదు.. జగన్ ఐదేళ్ల పాలనలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడానికి గట్టిగానే కృషి చేసినా సంఘాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కృషి చేసింది తెలియదా? టీఏ, డీఏ లేటు అవుతోందని ఆరోపిస్తూ ఒక కానిస్టేబుల్ ముఖ్యమంత్రి జగన్‌ను దూషించిన ఘటనలో సస్పెండ్ అయ్యారు. ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఇదే చంద్రబాబు ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరొకటి ఉంది. నర్సీపట్నంలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్న సుధాకర్ అనే ఆయన టీడీపీ నేత ప్రోద్బలంతో ఆనాటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దానిపై విచారణ చేసి, కావాలని సుధాకర్ అలా దుష్ప్రచారం చేశారని నిర్ణయానికి వచ్చాక సస్పెండ్ చేసింది. దానిని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు.. సుధాకర్ మద్యం సేవించి విశాఖలో రోడ్డుపైన రచ్చ చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ కానిస్టేబుల్ చర్యను కూడా ముఖ్యమంత్రికే ఆపాదించి, చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియా విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఆ తర్వాత కాలంలో సుధాకర్ అనారోగ్యానికి గురై మరణించారు. అందుకు కూడా జగనే కారణం అంటూ అబద్దపు ప్రచారం చేశారు.అప్పుడేమో ఉద్యోగుల పట్ల ఎంతో సానుభూతి ఉన్నట్లు, వారికి మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడేవారు. అధికారంలోకి రాగానే తనకు గిట్టని, తనను ప్రశ్నించే ఉద్యోగ సంఘాల నేతను ఏకంగా ఉద్యోగాల నుంచే డిస్మిస్ చేశారు. వెంకట్రామి రెడ్డిని కంట్రోల్ చేస్తే ఇంకెవరూ మాట్లాడరన్నది ప్రభుత్వ అభిప్రాయం కావచ్చు. కాని దీనివల్ల చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా అప్రతిష్ట అయితే తప్పకుండా వస్తుంది. ఉద్యోగులకు కూటమి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నది వెంకట్రామిరెడ్డి వాదన. గతంలో ఎప్పుడూ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగులో లేవని ఆయన చెబుతున్నారు. జగన్ టైమ్‌లో వచ్చిన సచివాలయాలను ప్రస్తుతం స్వర్ణ గ్రామాల ఆఫీసులు అని పిలుస్తున్నారు. ఆ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులను వేధిస్తున్నారని, వలంటీర్లు చేసే బాధ్యతలను ఈ ఉద్యోగులకు అప్పగిస్తున్నారని, చివరికి పార్కింగ్ ప్రదేశాల వద్ద కాపలా పెడుతున్నారని, వీధి కుక్కలను లెక్కించే పని వీరికి అప్పగిస్తున్నారని వెంకట్రామి రెడ్డి అన్నారు.ఈ సచివాలయాల ఉద్యోగులు పని ఒత్తిడితో గుండెపోటుకు గురైకాని, ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కాని దాదాపు వంద మంది మరణించారని ఆయన చెప్పారు. వీటన్నిటిని ప్రస్తావిస్తున్ననందుకే ఆయనపై కక్ష కట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారన్నమాట. నిజానికి సరైన ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఆధారాలు చూపకుండా ఉద్యోగం నుంచి తీయరాదు. దీనిపై న్యాయ పోరాటానికి ఆయన సిద్దం అవుతున్నారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి. గతంలో చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిలో సోదాలు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలకు సంబంధించిన లావాదేవీలు జరిగాయని సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రాన్ని మేనేజ్ చేసుకుని ఆ కేసు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు చేసుకోగలిగారని చెబుతారు. స్కిల్ స్కామ్ కేసులో విచారించడానికి సీఐడీ శ్రీనివాస్‌ను పిలిస్తే ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండానే అమెరికాకు వెళ్లిపోయారు. దాంతో గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ అభియోగాలన్నిటిని ఎత్తివేసి జీతం బకాయిలతో సహా చెల్లించి ఉద్యోగం ఇచ్చింది. ఇలా చేయడం చట్టబద్దమేనా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక పోలీసు ఉన్నతాధికారి అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్ళారు. అయితే ఆయన ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చేయలేదని ఏకంగా పోలీసునే కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. కాని తన మాజీ పీఎస్ విషయంలో ఎందుకు అంత ఉదారంగా ఉన్నారో ప్రజలకు తెలియదా?.అలాగే మరో పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హోదాలో ఉండి టీడీపీ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించే వారు. ఈ సంగతి ఒక టీడీపీ ఎమ్మెల్యేనే పార్టీ సమావేశంలో వెల్లడించారు. అంతేకాదు అప్పట్లో వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెబుతారు. అది తప్పు కాదా? అవన్ని ఎందుకు! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, ప్రజలందరిని సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేశారు కదా! కాని ఆయనే స్వయంగా వైఎస్సార్సీపీ వారికి ఏ పనులు చేయవద్దని ఎలా అధికారులకు బహిరంగంగా ఆదేశాలు ఇచ్చారు?. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెప్పడం ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది. దేశ రాజ్యాంగం పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఆయన కుమారుడు లోకేశ్ ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు. వెంకట్రామిరెడ్డి నిజంగానే వైఎస్సార్సీపీకి ప్రచారం చేసి ఉంటే తప్పే అయితే, అంతకు మించి వీరంతా తప్పు చేసినట్లు కాదా? ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ పేరుతో టీడీపీ అరాచకాలు చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది.టీడీపీ వారు ఏ ఫిర్యాదు చేసినా ఆగమేఘాల మీద కేసు బుక్ చేసి వైఎస్సార్సీపీ వారిని, చివరికి జర్నలిస్టులు, సామాజిక మాధ్యమాల కార్యకర్తలను కూడా అరెస్టులు చేస్తున్నారే. అదే టైమ్ లో వైఎస్సార్సీపీ వారు తమపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదే! మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై గంటల తరబడి టీడీపీ రౌడీలు, గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే ఎంత మందిని అరెస్టు చేశారు. వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ఆరోపణ చేసి ఉద్యోగం నుంచి తీసివేసిన ప్రభుత్వం ఈ అకృత్యాలకు బాధ్యత వహించదా!. వీటన్నిటిని ప్రశ్నిస్తూ చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు అంటూ మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ఎప్పటికైనా వీటన్నిటికి నైతికంగా, చట్టపరంగా జవాబివ్వక తప్పని రోజు ఒకటంటూ రాకుండా ఉంటుందా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారా?
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కథనమే ఇది. అందులోను ఎల్లో మీడియా ఈ రకమైన స్టోరీలు ఇచ్చిందంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు తగ్గించారని, ఏపీ ఆర్ధిక పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదని, జాగ్రత్తపడకపోతే అధోగతే అంటూ టీడీపీ పక్షాన పనిచేసే ఆంధ్రజ్యోతి బానర్ వార్తను ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలలో ఆరు నెలలపాటు ముప్ఫై శాతం కోత పెట్టాలని , మూడు,నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఖర్చు తగ్గించుకుంటున్నట్లు కనిపించడానికి ఆ రాష్ట్రం ఈ చర్య చేపట్టింది. .తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం దీనిని క్లూగా వాడుకుని తన మీడియాకు ఒక లీక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.ఏపీలో ఆర్ధిక పరిస్థితి అంతంతేనని, అప్పుల భారం అదికం అవుతోందని,అందువల్ల ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలని రాయండని ఎల్లో మీడియాకు పురమాయించి ఉండాలి.తదనుగుణంగా ఆ మీడియా రాజభక్తితో ఆ కధనాన్ని ఇచ్చి ఉండాలి. విశేషం ఏమిటంటే తమిళనాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేంద్రం సహకారంతో ఏపీ బుల్లెట్ వేగంతో అభివృద్ది చెందుతోందని చెప్పారని కూడా ఇదే ఎల్లో మీడియా రాసింది.చంద్రబాబు చెప్పినదానిలో వాస్తవం ఉంటే ప్రభుత్వం పక్షాన పేద ఏడుపులు ఏడుస్తూ ఎల్లో మీడియా ప్రజలను ఎందుకు భయపెట్టింది? చంద్రబాబు అబద్దం చెప్పినట్లా?లేక ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లా?ఇదే ఎల్లో మీడియా 2024 ఎన్నికల సమయంలో కూటమి మానిఫెస్టోకి భజన చేస్తూ అద్భుతం, అమోఘం, చంద్రబాబు సంపద సృష్టించగలరు.తద్వారా సూపర్ సిక్స్ హామీలతో సహా ఎన్నికల మానిఫెస్టో అంతటిని చిటికిన వేలుతో అమలు చేసేయగలరు అని ఎందుకు ప్రచారం చేశారు.అందులో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని, అంటే జీతాలు పెంచుతామని ఎందుకు హామీ ఇచ్చారు? ఉద్యోగుల ఇతర కోర్కెలను నెరవేరుస్తామని ఎలా చెప్పారు?ఇప్పుడేమో ఆర్ధిక క్రమశిక్షణ అవసరం అని సన్నాయి నొక్కులు ఎందుకు రాస్తున్నారు?ఇది ప్రజలను ,అందులోను ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం కాదా ?అన్న ప్రశ్న వస్తుంది కదా!ఉద్యోగుల జీతాలవల్ల ఆర్దిక భారం అధికంగా ఉందని చెప్పడం తో పాటు సంక్షేమ స్కీముల అమలు వల్ల కూడా బాగా ఖర్చు అవుతోందని, ఇందులో చాలా దుబారా ఉందని ఎల్లో మీడియా అంటోంది. ఇది చంద్రబాబు అభిప్రాయంగా తీసుకునే అవకాశం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది చేసినా ముందుగా ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంటుందా?నెగిటివ్ గా ఉంటుందా?అన్నది చూసుకుంటారు.మొదటిసారి సీఎం అయినప్పుడే ఆయన ఇలాంటి సర్వేలు చేసుకునేవారు.1996 ఎన్నికలకు ముందు టీడీపీకి ఓటు వేయకపోతే నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ గెలిస్తే సబ్సిడి బియ్యం ధర ఐదు రూపాయలు అవుతుందని ప్రచారం చేసేవారు. తమకు ఎక్కువ సీట్లు వస్తేనే మద్య నిషేధం కొనసాగించగలుగుతామని చెప్పేవారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తో దాదాపు సమానంగా టీడీపీ, సిపిఐ, సిపిఎమ్ కూటమికి సీట్లు వచ్చాయి. తర్వాత ఆయన రూటు మార్చారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త కధ ఆరంభించారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, సబ్సిడి బియ్యం రేట్లు పెంచకపోతే ప్రభుత్వం భరించలేదని చెప్పేవారు. అంతకు ముందు ఎన్.టి.రామారావు అమలు చేసిన మద్య నిషేధాన్ని కొనసాగించలేమని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని, దానిని నియంత్రించలేకపోతున్నామని, ఆదాయం కూడా రావడం లేదని ప్రచారం చేశారు.ఎన్నికలకు ముందేమో ఎన్.టి.ఆర్ అనుమతించిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు.తద్వారా మద్య నిషేధం పై సీరియస్ గా ఉన్నట్లు చంద్రబాబు పిక్చర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాతేమో మొత్తం ఎత్తివేశారు.ఆ టెక్నిక్ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదేమో!ప్రజాభిప్రాయ సేకరణలో తన వాదనకు అనుకూలంగా ఎక్కువమంది మాట్లాడేలా చూసుకునేవారు.తదుపరి జనం అంతా అలాగే కోరుకుంటున్నారని చెప్పి నిర్ణయాలను మార్చివేసేవారు. ఇదేకాదు.1999లో బిజెపితో కలిసి కూటమి కట్టడంతో మళ్లీ గెలవగలిగారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలపై సమీక్షలు చేసి,వాటిలో లాభాలు ఆర్జించని సంస్థలను మూసివేసే ప్రక్రియ ఆరంభించారు.ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశారు.అప్పుడు ప్రభుత్వరంగ సంస్థలు తెల్ల ఏనుగులుగా మారాయని, వృధా వ్యయం అని పబ్లిసిటీ చేసేవారు.ఆ సంస్థలకు ఉన్న భూములను ప్రైవేటువారికి అప్పగించేశారు.ఆ భూములను ఆ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నాయని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.ప్రభుత్వ ఉద్యోగులు అవసరానికి మించి ఉన్నారన్న భావన కల్పిస్తుంటారు.అప్పట్లో ఉద్యోగులు చంద్రబాబు పాలనపై మండిపడుతుండేవారు. అది ఎంతవరకు వెళ్లిందంటే చంద్రబాబు రిటైర్ మెంట్ వయసును 55 ఏళ్లకు తగ్గించబోతున్నారని ఉద్యోగులంతా నమ్మేవారు.నిజానికి ఆ ప్రతిపాదన లేదని అంటారు.కాని చంద్రబాబు ప్రభుత్వ సరళి చూశాక ఉద్యోగులంతా ఆ వదంతిని నమ్మారు.2004లో టీడీపీ ఓటమికి అది కూడా ఒక కారణం అయింది. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. వాటిలో విద్యుత్ రంగం ఒకటి.దానిద్వారా తనకు క్రెడిట్ వస్తుందని అనుకున్న చంద్రబాబు ఆ సంస్కరణలు అన్నీ తనవే అని ప్రచారం చేసుకునేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని అప్పటి ప్రతి పక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదిస్తే అలా చేస్తే తీగెలపై బట్టలు ఆరేసుకోవల్సిందేనని అనేవారు. తదుపరి వైఎస్ అధికారంలోకి రావడం, దానిని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఘనత తనదేనని కూడా చంద్రబాబు చెప్పుకునేవారు.తదుపరి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన కూడా ఉచిత విద్యుత్ ను కొనసాగించారు.అలా ఉంటుంది ఆయన తీరు.గత టరమ్ లో ఉద్యోగుల జీతాభత్యాలపై ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో ఆయన చేసిన సంభాషణ వీడియో బయటకు వచ్చింది.ఇద్దరూ కూడా ఉద్యోగుల జీతాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లుగా ఆ వీడియో ఉండడం రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేసింది.అధికారంలో ఉంటే సంస్కరణలు గురించి మాట్లాడే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఫ్రీ అని, ఎక్కడలేని వాగ్దానాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర సుమారు 150 హామీలు ఇచ్చారు.వాటన్నిటి ఖర్చు ఏడాదికి లక్షన్నర కోట్లు అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు తాము సంపద సృష్టిస్తామని, వాటిని అమలు చేసి చూపిస్తామని గప్పాలు పలికేవారు.అధికారంలోకి వచ్చాక మాత్రం తెల్లముఖం వేసి వారి హామీలను నమ్మిన ప్రజలను వెర్రివాళ్లుగా చేశారు.ఇటీవల ప్రభుత్వ ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని, అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పడం ఆరంభించారు.అంటే జనాన్ని మానసికంగా తయారు చేయడం అన్నమాట.దాని కొనసాగింపుగా ఎల్లో మీడియా దీనిని భుజాన వేసుకుని సంక్షేమంలో చాలా వృదా అవుతోందని అనర్హులకు స్కీములు వెళుతున్నాయని ప్రచారం మొదలుపెట్టారు.అవన్ని అర్జంట్ గా మార్చేయాలని అంటున్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తే ఇదే ఎల్లో మీడియా జగన్ పై శరాలను వదిలి, జాకీలుపెట్టి టీడీపీని లేపడానికి యత్నించింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే నిజంగానే ఆ హామీలన్నీ అమలు అవుతాయేమో అన్నంతగా నమ్మేలా ప్రచారం చేశారు. ఇప్పుడేమో యధా ప్రకారం వారి శైలిలో అదంతా వృధా ఖర్చు. వాటిలో కోత పెట్టాలి అంటూ వాదన తీసుకు వస్తున్నారు.విశేషం ఏమిటంటే చంద్రబాబు టీమ్ కాని, ఎల్లో మీడియాకాని అమరావతిలో మాత్రం అప్పులు చేసి అయినా లక్షల కోట్లు వ్యయం చేయాలని చెబుతున్నారు.మరి అది ఎవరి ప్రయోజనాల కోసం?ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన హామీల గురించి అడగకుండా, పిఆర్సి, బకాయిల చెల్లింపు మొదలైనవాటి గురించి అడగకుండా ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైన బెదిరింపులు చేశారా అన్న అనుమానం వస్తుంది.జీతాలు ఇస్తే చాలు.. ఉద్యోగాలు ఉంటే చాలు అన్న అభిప్రాయం కలిగిస్తే ఏ ఉద్యోగ సంఘం నేత ఉద్యోగుల తరపున డిమాండ్ల ఊసెత్తడానికి గజగజలాడడానికి ఈ కధనాలు సృష్టించినట్లుగా ఉంది. ప్రజలు సంక్షేమ హామీల గురించి అడగకుండా రాష్ట్ర ప్రయోజనాలపైనే మాట్లాడుకోవాలన్నదే వీరి లక్ష్యం. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కూటమితో పాటు ఎల్లో మీడియా పనిచేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కధనాలను చూస్తే ఉద్యోగులతో పాటు ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారని అనుకోవల్సిందేనా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తమిళనాడులోనూ ‘మేధావితనం’ బయటపెట్టుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎవరికి లాభం చేకూరుస్తోంది? అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికా? లేక అధికారంలో ఉన్న డీఎంకేకా? ద్రవిడ సెంటిమెంట్ ప్రబలంగా ఉండే తమిళనాడులో డీఎంకే పార్టీ చంద్రబాబు వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునేలా కనిపిస్తోంది. చంద్రబాబు తెలుగువారు అధికంగా నివసించే కోయంబత్తూరు తదితర ప్రాంతాలలో పర్యటించారు.ఈ ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన తెలుగు ప్రజలే ఎక్కువ. దశాబ్దాలుగా అక్కడ జీవనం సాగిస్తున్న వారు తమిళులతో మమేకమైపోయారు. అయినాసరే... కాంగ్రెస్, డీఎంకే కూటమిపై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతోనే చంద్రబాబును ఆ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు ప్రసంగం కూడా వైరుధ్యాలతో కూడి ఉంది. పైగా తన బలహీన పాయింట్లను ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అనిపిస్తుంది.తమిళనాడులో యాంటి హింది సెంటిమెంట్ అధికం. కానీ చంద్రబాబు అక్కడకు వెళ్లి హిందీ భాషను ప్రమోట్ చేసేలా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇది సహజంగానే అక్కడి ప్రజలకు నచ్చదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకేకి కూడా ఇది రుచించదు. చిత్రమేమిటంటే తమిళనాడులో ఎన్ని భాషలు వీలైతే అన్ని నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు ఆంధ్రలో మాత్రం ఆంగ్ల మీడియాన్ని వ్యతిరేకించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెడితే దానిని తీవ్రంగా తప్పుపట్టారు.బాబు సన్నిహితులు దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. హిందీ నేర్చుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందా?లేక ఆంగ్లం బాగా చదివితే అధికంగా ఉపయోగం ఉంటుందా అన్నది తమిళులకు తెలియదా! మీడియా సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా డీఎంకేకి మేలు చేసినట్లయిందని కొంతమంది విశ్లేషించారు. అలాగే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన డీఎంకే అదే పార్టీతో కలవడం ఏమిటనే చిత్రమైన వాదన తీసుకువచ్చారు. ఇక్కడే ఆయన పరస్పర విరుద్దంగా మాట్లాడడమే కాకుండా, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ప్రచారం చేసేవారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆరంభించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత ఈయన కాంగ్రెస్ తో కలవకుండా ఉన్నారా అంటే అదీ లేదు. గతంలో అంటే వేరే రాష్ట్రానికి వెళ్లి ఏమి చెప్పినా, అక్కడి జనానికి తెలియదు కనుక ఎలాగో నడిచిపోయేది. ఈ రోజుల్లో అలా కాదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా, అందులో తేడా ఉంటే క్షణాలలో సోషల్ మీడియాలో వీడియోలతో సహా వచ్చేస్తోంది. చంద్రబాబు కూడా అలాగే దొరికిపోయారనుకోవాలి.1983 ఎన్నికలలో కూడా చంద్రబాబు తన మామ ఎన్.టి.ఆర్.ను కాదని కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీలోకి ప్రవేశించి, ఆధిపత్యం సాధించుకున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. బీజేపీతో కొన్నిసార్లు, ఇతర పార్టీలతో కొన్నిసార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు.ఆ క్రమంలో 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వదలి వేసినా, 2023 శాసనసభ ఎన్నికలలో పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు సహకరించారన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వద్ద టిడిపి జెండాలు కూడా అప్పట్లో రెపరెపలాడాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల అనుబంధం తెలిసిందే. కాకపోతే ఈ విషయాలేవీ తమిళులకు తెలియవన్నది ఆయన నమ్మకం కావచ్చు.ఇది ఒక కోణం అయితే కాంగ్రెస్‌తో స్నేహం చేస్తున్న రోజుల్లో సోనీయాగాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి సభలలో పాల్గొన్నారు.బిజెపి నేతలను ముఖ్యంగా ప్రధాని మోడీని తీవ్రమైన పరుష భాషలో విమర్శించేవారు.ఆ క్రమంలో అప్పట్లో తమిళనాడు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీ కన్నా స్టాలిన్ సమర్థమైన నేత అని చంద్రబాబు ప్రశంసించారు. మామూలుగా అయితే ఈ అంశం పెద్దగా ప్రస్తావనకు వచ్చేది కాదేమో. కాని స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో ఈ వీడియోలన్ని బయటకు వచ్చాయి. చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలను తమిళనాడులో మరో సారి బహిర్గతం చేసుకున్నారు. ఇది డీఎంకే కే మేలు చేసే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు ప్రస్తావించి ఎన్డీయే కూటమిని డిఫెన్స్ లో పడేసినట్లు అనిపిస్తుంది.నిజానికి చంద్రబాబు ఈ టూర్లో కాంగ్రెస్‌పై మరీ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేయలేదు. సాధారణంగా ఆయన తన ప్రత్యర్ధులపై వ్యక్తిత్వ హననానికి పాల్పతుంటారు. అందులో మంచి, చెడు కూడా చూడరు. అలాంటిది ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేదా డీఎంకే ముఖ్యనేతలెవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం వివిధ రంగాలలో వైఫల్యం చెందిందని, చెన్నై వెనుకబడిపోయిందని, అప్పులపాలైందని, మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని.. ఇలాంటి విమర్శలేవో చేశారు. అవన్ని విన్నవారు ఇదేదో ఏపీలో తన ప్రభుత్వం గురించి తానే చెప్పుకుంటున్నట్లుగా ఉందని చమత్కరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన రాష్ట్రం. చెన్నై ఉపాధి కేంద్రంగా ఉంది.ఏపీ నుంచి అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అదే టైమ్ లో ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారింది. ఈ రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ రూ.355000 కోట్లకు పైగా అప్పు చేసి దేశంలో రికార్డు సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో అనేకం అమలు కాలేదు.వి శాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చేసినట్లు, ఇతరత్రా ఏదో అభివృద్ది జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయాలేవి తమిళ ప్రజలకు పెద్దగా అవసరం లేనివే. లేని గొప్పలు చెప్పుకుని ఏపీలో ఎల్లో మీడియాకు బానర్ కధనాలు ఇవ్వడమే లక్ష్యం కావచ్చు.ఏపీలో మద్యం బెల్ట్ షాపులు ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. మద్యాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.నకిలీ మద్యం ప్లాంట్ కూడా నడిచిన వైనం బయటపడిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజన్ సర్కార్ తో బుల్లెట్ వేగంతో అభివృద్ది అంటూ ప్రచారం చేశారు.కాని కేంద్రం ద్వారా ఏపీకి ఈ రెండేళ్లలో కలిగిన లాభం ఏమిటో ఆయన వివరించలేకపోయారు. అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు కడుతున్నామని చెప్పుకున్నారు. దాని అవసరంపై టీడీపీ మేధావులే పెదవి విరుస్తున్నారు.అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలను భయపెడుతున్న విషయం తమిళులకు తెలియకపోవచ్చు. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేరే విషయం. చివరిగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యంగ్య వ్యాఖ్యను ప్రస్తావించుకోవాలి.స్టాలిన్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కామెంట్ చేశారట.'చంద్రబాబు 1995లో నన్ను మంచోడు అన్నారు. 2004లో కాదన్నారు. 2009లో మంచోడు అన్నారు. 2014లో కాదు అన్నారు. 2019లో మళ్లీ నన్ను మంచోడు అని మెచ్చుకున్నారు.ఇప్పుడు 2026లో తిరిగి నేను మంచోడిని కాదు అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు తమిళనాడు ప్రజలు పట్టించుకోరు" అని అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి ఉంటుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్‌లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్‌ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్‌పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్‌ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్‌ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్‌సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్‌ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈసీ మాయ.. అర్ధరాత్రి 20 సెకన్లకు ఒక్క ఓటు?
ఒకప్పుడు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు రిగ్గింగ్ చేయడానికి యత్నించేవారు. ఆ రోజుల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ జరిగేది. తదుపరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎంలు)ఆచరణలోకి వచ్చాయి. కొంత కాలం పాటు ఆ వ్యవస్థ బాగానే నడిచినట్లు అనిపించేది. అయినప్పటికీ కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేసేవారు. కానీ, రాను రాను అవి కూడా రిగ్గింగ్‌కు, అక్రమాలకు అతీతం కాదని సాక్ష్యాధారాలతో సహా సమాచారం రావడం ఆరంభమైంది.అసలు ఎన్నికల సంఘమే ఈ తరహా రిగ్గింగ్‌కు కారణభూతమవుతున్నదన్న ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. అందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రయోగశాలగా ఎన్నికల అధికారులు కొందరు మార్చారా? అన్న అనుమానం వస్తోంది. ఇందులో ఒక కీలకమైన అంశం ఏమిటంటే ఆంధ్ర ప్రజలు పట్టపగలు వేగంగా ఓట్లు వేయలేదట. అర్దరాత్రి వేళ యమా స్పీడ్‌గా ఓట్లు వేశారని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతుంటే మనం నోరు వెల్లబెట్టాల్సిందే. గతంలో ఆయా రాజకీయ పార్టీలతో సంబంధ బాంధవ్యాలు కలిగిన ప్రముఖ మేధావి, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ దీనికి సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టడం అత్యంత ఆసక్తికరంగా ఉంది.2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జరిగిన అద్భుతం వెనుక తప్పుడు వ్యవహారం ఉందా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ద వైర్ అనే వెబ్‌సైట్‌కు రాసిన ఒక పరిశోధనాత్మక వ్యాసంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. అది చదివితే కచ్చితంగా 2024 ఎన్నికలలో ఏపీలో ఏదో మోసం జరిగిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా ఆధారంగానే ఆయన ఈ పరిశీలన చేశారు. ఎన్నికలు జరిగిన 2024 మే 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ 68.04 శాతంగా ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తదుపరి రాత్రి ఎనిమిది గంటలకు ఇచ్చిన మరో ప్రకటనలో అది 68.12 శాతంగా ఈసీ తెలిపింది. అంటే కేవలం 0.08శాతం పెరిగిందన్నమాట. ఆ తర్వాత 11.45 నిమిషాలకు ఓట్లు వేసినవారి శాతం 76.50శాతంగా ఈసీ చెప్పుకొచ్చింది.తదుపరి మే 17వ తేదీన చేసిన ప్రకటన ప్రకారం అది 80.66 శాతం కాగా, పోస్టల్ ఓట్లు కూడా కలిపితే అది 81.86 శాతం అయింది. ఈ రకంగా ఓట్ల శాతం అర్ధరాత్రి పెరగడంపైనే ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. సాధారణంగా సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ బూత్‌లలో ఉన్న ఓటర్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. గత అనుభవాల రీత్యా చూస్తే సాయంత్రం మహా అయితే రాత్రి తొమ్మిది, పది గంటల వరకు ఓట్లు వేస్తారేమో!. అంతే తప్ప తెల్లవారుజామున రెండు గంటల వరకు ఓట్లు వేయడం ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. కానీ, ఏపీలో ఇందుకు భిన్నంగా జరగడం అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు కేవలం 0.08 శాతమే ఓట్లు పెరిగాయి. అంటే దాని అర్దం పోలింగ్ బూత్‌లలో దాదాపు ఎవరూ లేరనే కదా అర్థం?. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించకూడదు కదా!. కానీ, చిత్రంగా రాత్రి 8 గంటల నుంచి 11.45 గంటల వరకు ఎనిమిది శాతంపైగా ఓట్లు వేశారట. అంతమంది ఎక్కడ నుంచి వచ్చారు?. అది నిజమే అయితే వారిని ఎలా అనుమతించారు. తదుపరి రెండు గంటల వరకు మరో నాలుగు శాతం పెరగడం ఇంకా చిత్రమే. ఈ రకంగా 12.54 శాతం ఓట్లు అంటే 51,83,249 ఓట్లు అదనంగా పోల్ అయ్యాయి. దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆధార సహితంగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం మరింత అనుమానంగా మారింది.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన దాని ప్రకారం 11.45 నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు సుమారు 17 లక్షల ఓట్లు పోలయ్యాయి. అది కూడా 3500 పోలింగ్ బూత్‌లలోనే కావడం ఒక ప్రత్యేకతగా కనిపిస్తుంది. పగలు నిమిషానికి ఒక ఓటు చొప్పున పడితే, అర్ధరాత్రి వేళ ప్రతీ 20 సెకండ్లకు ఒక ఓటు పోల్ అయిందని లెక్కలు చెబుతున్నాయి. అందులో వీవీప్యాట్ స్లిప్‌లకు 14 సెకండ్లు పోతే మిగిలేది ఆరు సెకన్లన్నమాట. ఇంత తక్కువ సమయంలో ఓట్లు వేయడం అసాధ్యం అన్నది తెలిసిందే. ఈ బూత్‌లలో అర్ధరాత్రి వేళ సుమారు 490 మంది ఉన్నారన్న మాట. మొత్తం మీద ఈ అదనపు ఓట్లను 175 నియోజకవర్గాలకు పంచితే అది ఒక్కో స్థానంలో 29,618 ఓట్లు ఎక్కువగా పోల్ అయ్యాయన్నమాట. ఇవన్నీ పోలింగ్ అధికారుల సమక్షంలోనే జరిగాయా? అప్పుడు అక్కడ ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు?. వారు ఉన్నారా?. లేక వెళ్లిపోయాక ఈ మాయ జరిగిందా?. ఇది ఈవీఎంల మహిమగానే కనిపిస్తోందన్నది మేధావుల భావనగా ఉంది.రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు ఉంటాయి. కానీ, 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అవడంతో పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత జరిగిన పరిశోధనలలో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి తోడు ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, కొన్ని ఈవీఎంలను తిరిగి లెక్కించాలని, వీవీప్యాట్ స్లిప్‌లతో పోల్చి చూపించాలని, ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ తగ్గకపోవడానికి కారణాలు చెప్పాలంటూ వైఎస్సార్సీపీ చెందిన కొందరు నేతలు హైకోర్టుకు వెళ్లినా సరైన న్యాయం దక్కలేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికలలో అక్రమాలు జరిగాయన్నది బలమైన భావనగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కుట్రలు జరిగి ఉండవచ్చని కొందరు సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఆ ఊసే ఎత్తడం లేదు. 2019లో ఆయన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో ఎలాంటి పరీక్షలకైనా సిద్దమేనని ఈసీ తెలిపింది. కానీ, ఈసారి ఈసీ సరైన సమాధానమే ఇవ్వడం లేదు.ఈ ఎన్నికలు జరిగిన పది రోజుల్లోనే వీవీప్యాట్ స్లిప్‌లను దగ్దం చేయడం, సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఓడిపోయిన అభ్యర్ధులు అడిగినా ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం కచ్చితంగా మరిన్ని డౌట్లకు తావిచ్చింది. నిజంగా అర్ధరాత్రి వేళ 3500 బూత్‌లలో ఒక్కో చోట సగటున సుమారు 490 మంది ఉండి ఉంటే దాని తాలూకూ ఫుటేజీ అభ్యర్ధులకు చూపించి ఉండవచ్చు. ఇందులో ఓటర్ల భద్రతకు వచ్చే ముప్పు ఏమిటో తెలియదు. నిర్దిష్ట విధానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏభై లక్షల మంది అదనంగా ఓట్లు వేసి ఉంటే అందులోనూ అర్ధరాత్రి 17 లక్షల మంది ఓట్లు వేసి ఉంటే మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ జరిగి ఉండాలని కొందరు లెక్క గడుతున్నారు.ఎన్నికల కమిషన్‌కు చిత్తశుద్ది ఉంటే, రిగ్గింగ్ జరగలేదన్న నమ్మకం ఉంటే పోటీ చేసిన అభ్యర్ధి ఎవరు కోరినా వారికి వివరణ ఇచ్చి ఉండాలి. అవసరమైన వీడియో ఫుటేజీలు ఇచ్చి ఉండాలి. అలా చేయడానికి నిరాకరిస్తుడటంతో ఎన్నికల వ్యవస్థపై సంశయాలు బలపడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం. అసలే ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ప్రజలు బాధపడుతుంటే, ఇప్పుడు ఏకంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కూడా అందులో భాగమైతే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ బడ్జెట్... కాకిలెక్క.. స్వోత్కర్ష!
పౌరులు తప్పు చేస్తే ప్రభుత్వం జరిమానా లేదా శిక్ష వేయడం సాధారణంగా జరిగేది మరి... ప్రభుత్వమే తప్పుడు గణాంకాలిస్తే? ప్రజలను తప్పుదోవ పట్టిస్తే? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ గురించి ఈ ప్రస్తావన. ఊహాజనిత వాస్తవాలతో సంబంధం లేకుండా, ఊహాజనిత అంచనాలతో చేసిన ఈ అంకెల గారడీపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్లో ఒకలా.. ప్రసంగంలో ఇంకోలా కూడా లెక్కలు చెప్పగలగడం ఈయనకే చెల్లిందేమో. నిజానికి ప్రజలు బడ్జెట్‌ను పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. ఎందుకంటే అందులో ఉన్న దానికి.. వాస్తవానికి అసలు పొంతనే ఉండటం లేదు మరి. ఏటా ఇదో మొక్కుబడి తంతుగా మారిపోయింది. ఎన్నికల్లో తాము చెప్పిందేమిటి? వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నదీ.. అడ్డంకులను అధిగమించేందుకు రచిస్తున్న ప్రణాళికలేమిటన్న వివరాలతో ఉంటే బడ్జెట్‌కు కాస్తో కూస్తో విశ్వసనీయత వస్తుందేమో కానీ.. ఇలా ఓ సోదిలా మాట్లాడేసి పోతే ఫలితం సున్నా. ఈ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి పోకడలు రెండేళ్లుగా ఇలాగే ఉంది. మూడోసారి కూడా భిన్నంగా ఏమీ లేదు. 2019-2024 మధ్యకాలంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించే ప్రయత్నం జరిగింది. అయితే బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి... ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందో అని ఆ రకంగా చేసే సాహసం చేయలేకపోతోంది. అందుకే ఏదో చేసేయబోతున్నామంటూ బడ్జెట్ ప్రసంగం చేయడం... పది రోజులపాటు అసెంబ్లీ, మండళ్లలో చర్చించినట్టు నటించడం ఆ తరువాత ఎవరి దోవన వారు వెళ్లిపోవడం. ఇదీ తంతు. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఏడాది రెవన్యూ రాబడిని రూ. 2.34,140 కోట్లుగా అంచనా వేశారు. పన్ను, పన్నేతర ఆదాయాల ద్వారా ఇంత మొత్తం వస్తుందన్నమాట. అయితే గత ఏడాది రూ.217976 కోట్ల ఆదాయాన్ని కాస్తా రూ.196903 కోట్లకు మార్చారు. పోనీ ఇంతైనా వచ్చిందా? ఊహూ అనుమానమే. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి ఆఖరు వరకు వచ్చిన ఆదాయం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఇంకా యాభై వేల కోట్ల వరకూ తక్కువందన్నమాట. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఉన్న రెండు నెలల్లో ఇంత మొత్తం సంపాదించాలంటే ప్రజల నడ్డి విరిచేంత భారం మోపాలి. లేదంటే ఈ అంచనాలకు కేవలం లెక్కలకు మాత్రమే పరిమితం చేయాలి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఆదాయం రూ.2.34 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి ఎలా ఊహించారో మరి?రెవెన్యూ లోటు విషయంలోనూ కేశవ్ అంచనాలు డొల్లగానే ఉన్నాయి. రెవెన్యూ లోటు గత ఏడాది కన్నా తక్కువ ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గత ఏడాది రెవెన్యూ లోటు రూ.33 వేల కోట్లని అంచనా వేస్తే అది కాస్తా రూ.41 వేల కోట్లకు పెరిగింది. చిత్రంగా వచ్చే ఆర్ధిక సంవత్సరం రెవెన్యూ లోటు రూ.22 వేల కోట్లే అంటున్నారు ఆర్థిక మంత్రివర్యులు. నమ్మే మాటేనా? చివరికి వారికి బాకాలూదే ఎల్లో మీడియా కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఒక చిన్న వార్తను ప్రచురించాయి ఇవి. అప్పుల విషయానికి వస్తే కొత్త ఏడాదిలో రూ.98 వేల కోట్లకు పైగా తీసుకుంటామని బడ్జెట్ పుస్తకంలో తెలిపారు. అది ప్రభుత్వం నేరుగా తీసుకునే అప్పు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తీసుకునే అప్పు గురించి గుట్టుగా ఉంచారు.ఇంతవరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.311182 కోట్లుగా ఉంది. కొత్త బడ్జట్లో ఎన్ని వేల కోట్లు తీసుకుంటారో ఊహించలేం. పెండింగ్ బిల్లులు సుమారు రూ.24 వేల కోట్లు చెల్లించినట్లు బడ్జెట్లో తెలిపారు తప్ప, ఇంకెంత పెండింగు బిల్లుల మొత్తం ఉందో దాచిపెట్టారు. ఉద్యోగులకే సుమారు రూ.40 వేల కోట్ల మేర బాకీలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇతరత్రా బిల్లులు కూడా లెక్కవేస్తే తడిసిమోపెడు కావచ్చు. ఇవి ఒక కోణం అయితే ప్రభుత్వం తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో పెక్కింటిని గాలికి వదలి వేసింది.ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. వాటి ఊసే లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు తదితర స్కీములకు అవసరమైన మొత్తాలకన్నా బాగా తక్కువ కేటాయించారు. బడ్జెట్లో వాటికి ఇంత, వీటికి ఇంత అని చెబుతారు కాని, అవేవి అయ్యేవి కావన్న సంగతి ప్రభుత్వంలోని వారికి, ప్రతిపక్షానికి తెలుసు.అయినా దీనిని ఒక తంతుగా ,ప్రభుత్వ ప్రచారానికి వాడుకుంటారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కూటమి నేతలు ప్రచారం చేసిన అంకెలన్నీ బోగస్ అని తేలిపోతుండడంతో ఈసారి బడ్జెట్లో ఆ వివరాలు ఏవీ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు.అయినా మంత్రి ప్రసంగంలో మాత్రం గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పు చేసిందని తప్పుడు ఆరోపణ చేసి వదలి వేశారు. మంత్రి కేశవ్ మొత్తం 16 సార్లు చంద్రబాబును పొగడడం కూడా అతిగానే ఉంది. మథా ప్రకారం జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం అంటూ ఆవు కథ చెబుతూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రెండేళ్లు సరిపోలేదని వాపోయారు. కూటమి నేతలు సంపద సృష్టిస్తామని ఎన్నికలలో ఊదరగొట్టారు.కాని అధికారంలోకి వచ్చాక అప్పులేమో లక్షల కోట్లు చేశారు.ప్రజల సంపదను ప్రైవేటువారికి అర్ధణాకు,అణాకు కట్టబెట్టేస్తున్నారు.మరో వైపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అసత్యాలు వల్లె వేస్తూ బడ్జెట్ ప్రసంగం చేయడం వల్ల ప్రజలకు ఉపయగం ఏమి ఉంటుంది. స్థూలం గా చూస్తే ఏపీ బడ్జెట్ ప్రజల జ్ఞానానికి సవాలు విసురుతున్నట్లే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అటు నేనే.. ఇటు నేనే!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన్ను భుజాన మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతులకూ ఈ విషయం కొరుకుడు పడటం లేదు. భేషుగ్గా ఉందని చెబుదామా అంటే... మరి ఎన్నికల హామీలు పూర్తిగా నెరవేర్చడం లేదు ఎందుకు? అని ప్రజలు నిలదీస్తారు. పోనీ బాగాలేదు అందామంటే.. అది చంద్రబాబుకు అపకీర్తి. కిం కర్తవ్యం? అని మధనపడుతున్నాయి ఈ పత్రికలు రెండూ. అందుకేనేమో.. ఒకసారి బ్రహ్మాండమని, ఇంకోసారి ఫర్వాలేదని చెబుతూ జనాల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. ఇంకోపక్క ప్రజలపై పన్నుల మోత కూడా జోరుగా సాగుతోంది. సీఎం కూడా అధికారులు అప్పులు సరిగ్గా సమీకరించలేక పోతున్నారని విమర్శిస్తూంటారు కూడా. అదేనోటితో... 18 నెలల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించామని నిట్టూర్పు విడుస్తూనూ ఉన్నారు. అచ్చం తమ నేత మాదిరిగానే ఎల్లోమీడియా కూడా ఒకదానికి ఒకటి పొంతన లేని విధంగా కథనాలు వండివారుస్తోంది. చంద్రబాబు కొన్ని వారాల క్రితం నల్లజర్లలో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు పుట్టడం లేదన్నారు. ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చాలని ఉన్నా.. ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చెప్పుకొచ్చారు.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఏపీ జీఎస్డీపీ భేష్ అని ఓ ప్రెజెంటేషన్ ఇచ్చేశారు. వృద్ధి జాతీయ సగటు కంటే 8.7 కంటే ఎక్కువుందని 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోశాం అని భుజాలు చరుచుకున్నారు కూడా. షరా మామూలుగానే వైసీపీపై తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. వైసీపీ హయాంలో ఏడు లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ నష్టం జరిగిందని ఓ కాకి లెక్క కూడా చెప్పేశారు. జిల్లా కలెక్టర్లు, శాఖల అధిపతుల సమావేశంలోనైతే వైసీపీ పాలనలో పది లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. వాస్తవం ఏమిటన్నది వారికి తెలియదా?డిసెంబర్ 12న ‘‘లక్ష్యం మేరకు ఆదాయం రావడం లేదు..మీదే ఫెయిల్యూర్‘‘ అని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. నిధులు ఉన్నా ఎందుకు ఖర్చు చేయరని, పని చేయకపోతే పోస్టింగ్ ఇవ్వం అని బెదిరించారు కూడా. జీఎస్డీపీకి తగ్గట్లుగా ఆదాయం ఎందుకు లేదని ప్రశ్నించారు. అంటే దాని అర్థం ప్రభుత్వ లెక్కలు ప్రజలను మాయ చేయడానికే అన్న భావన వస్తుంది కదా! అదే సమయంలో మళ్లీ 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించామని, ఇంకా స్పీడ్ పెంచాలని, 70 కొత్త పథకాలను అమలులోకి తెచ్చామని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది.చిత్రంగా డిసెంబర్ 18న అందుకు భిన్నమైన ప్రకటన చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి రాష్ట్రం ఆర్ధిక ఒత్తిడిలో ఉందని, ఆదుకోవాలని, భారీగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఉద్యానవన హబ్ గా మార్చడానికి రూ.41 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని అడిగారు. దాని సంగతి ఏమైందో తెలియదు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటన చేస్తూ చంద్రబాబు అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్ధం కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది. ఈ మొత్తం ప్రసంగాలలో ఎక్కడా ప్రభుత్వం చేసిన రూ.మూడు లక్షల కోట్ల పైబడి అప్పుల గురించి మాట్లాడడం లేదు. అలాగే ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల బాదుడు, రోడ్ సెస్ మొదలైన వాటి గురించి మాట్లాడడం లేదు.కొద్ది కాలం క్రితం వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం సజావుగా లేదు.రెవెన్యూ లోటు నానాటికి పెరిపోవడాన్ని కాగ్ తప్పు పట్టింది. దానికి తగినట్లే తాజాగా వెల్లడైన గణాంకాలు చూస్తే రెవెన్యూ లోటు రూ.60.5 వేల కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు అయితే మరీ ఘోరంగా రూ.85.2 వేల కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాలను మించి 108 శాతం ఇప్పటికే ఈ ఏడాది రూ.85 వేల కోట్ల మేర అప్పులు చేశారు. ఈ సంగతిని కప్పిపుచ్చుతూ ఈ మద్య ఎల్లో మీడియా మరో కోణంలో ఓ కథనాన్ని ఇచ్చింది. ఏపీ రాబడి ఈ తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు దాటిందని పేర్కొంది. మంచిదే. అయినా ఎందుకు ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో వివరించితే బాగుండేది కదా!కాగా కొద్ది రోజుల క్రితం మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఇంకో కథనాన్ని ఇస్తూ ఏపీ ఆర్ధిక సంక్షోభాన్ని 'అదే వ్యధ, పాత కథ" అంటూ అప్పుల వలయం.. ఆర్థిక విలయం అని వ్యాఖ్యానించింది. కాకపోతే యథాప్రకారం అదేదో జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం అని రాసి తన కుళ్లు బుద్ది ప్రదర్శించింది. కూటమి సర్కార్ లోనూ గతుకుల ప్రయాణం సాగుతోందని, అన్ని రకాల ఆదాయాలు కలిపితే లక్షన్నర కోట్లే వస్తోందని, అది వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని పేర్కొంది. పథకాలు, అభివృద్ధి, ఇతర ఖర్చులకి అప్పులే గతి అని వాపోయింది. అప్పుల తిరిగి చెల్లింపునకు ఏడాదికి రూ.75 వేల కోట్లు అవుతోందని, జీతాలు, పెన్షన్లకు మరో రూ.75 వేల కోట్లు అవుతోందని తెలిపింది.డిసెంబర్ నాటికే లక్ష కోట్ల అప్పు దాటిందని కూడా వెల్లడించింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చు గురించి మాత్రం ప్రస్తావించలేదు. పైగా అమరావతిలో నిర్మాణాలకు పెడుతున్న అధిక వ్యయాన్ని సమర్థిస్తూ వార్తలు ఇస్తున్నారే. కేవలం చంద్రబాబు విమాన, హెలికాప్టర్ ఖర్చులకే ఏడాదికి ఏభై కోట్లుపైగా అవుతోంది. పథకాల పులిపై ప్రభుత్వాల స్వారీ, దశాబ్దాలు అమలు చేస్తున్నా తగ్గని పేదరికం అంటూ కొత్త కహాని వినిపించడానికి ఈ ఎల్లో మీడియా యత్నించింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏడాదికి లక్షన్నర కోట్లు కావాలని, అది ఆచరణ సాధ్యం కాదని జగన్ చెబితే, చంద్రబాబు, పవన్‌లతో పాటు ఈ ఎల్లోమీడియా ఏమని వాదించింది? చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసునని, అప్పులు చేయకుండానే సంక్షేమం చేస్తారని, కరెంటు ఛార్జీలు పెంచరని, తగ్గిస్తారని.. ఇలా ఎన్నో కోతలు కోశారు కదా!టీడీపీ సూపర్ సిక్స్‌ను జగన్‌పై ఎక్కుపెట్టిన శరాలుగా అభివర్ణించారే. అంతే తప్ప ఏపీ ప్రజలను టీడీపీ, జనసేన నేతలు మాయదారి మాటలతో మోసం చేస్తున్నారని ఆనాడు రాయలేదే! తీరా అధికారం వచ్చేసింది కనుక ఇప్పుడు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనా?మరో వైపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసేశామని బొంకుతున్నారా? లేదా? ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారా? లేదా?నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.మూడు వేలు ఇచ్చారా? ఇలా అనేక హామీలకు ఎగనామం పెడుతూ అంతా హిట్ అని ప్రచారం చేస్తే సరిపోతుందా? ఎల్లో మీడియా ఆ పథకాల వల్ల పేదరికం తగ్గడం లేదని, వృథా ఖర్చు అన్నట్లుగా రాయడంలో ఆంతర్యం ఏమిటి? ఆంధ్ర ప్రజలు అమాయకులు, వారిని తేలికగా మోసం చేయవచ్చన్న భావన తోనే ఇలా పాలన చేస్తున్నారా? ఎల్లో మీడియా నిత్యం అసత్యాలను వండి వార్చడంలో ఆంతర్యం ఇదేనా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు పలుకులు ప్రచార ఆర్భాటం.. అర్ధ సత్యాలు మాత్రమే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త డైలాగులతో ప్రజలను భ్రాంతిలో ఉంచడానికి యత్నిస్తుంటారు. అందులో సత్యాసత్యాలతో సంబంధం ఉండదు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయనగారు 20 నెలల్లో అరవై విజయాలు సాధించారట! టీడీపీ, జనసేనల సంయుక్త ఎన్నికల మేనిఫెస్టోలో 150 హామీలిస్తే వాటిల్లో ఎన్ని అమలు కాలేదో చెప్పలేకపోయారు కానీ అరవై విజయాలని ఢంకా బజాయించేశారు. దీనికి ఈనాడు కూడా తనదైన స్టైల్లో తలూపింది. ఈ క్రమంలోనే ఈ ఎల్లో పత్రిక ఏమని రాసిందంటే.. చంద్రబాబు ప్రస్తావించిన అంశాలను విజయాలని జనం నమ్మాలట.రాష్ట్ర గవర్నర్ నజీర్ అసెంబ్లీలో చదివిన స్పీచ్‌లో పేదలకు ఏటా రూ.33 వేల కోట్లు నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. కాని ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ రూ.1.5 లక్షల కోట్లు. దీని గురించి వివరణ లేదు. తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం చేశామన్నారు. తల్లుల ఖాతాలో రూ.పది వేల కోట్లు వేశామని చెప్పారు. ఏడాదిపాటు ఎగవేసి, రెండో ఏడు అరకొరగా అమలు చేసిన సంగతి విస్మరించారు.వాస్తవానికి ఈ స్కీమ్‌కు ఖర్చు చేసింది రూ.ఆరు వేల కోట్ల పైచిలుకే కదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్త్రీ శక్తి ద్వారా 43.51 కోట్ల పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారట. ఇందుకు రూ.1532 కోట్లు వ్యయమైందట. ఈ స్కీమ్ గురించి ఎన్నికల ప్రణాళికలో చెప్పిందేమిటి? రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఫ్రీగా వెళ్లవచ్చని. కానీ అమలవుతోంది ఏమిటి? బోలెడన్ని ఆంక్షల పెట్టారు. అలాంటప్పుడు ఇది విజయమెలా అవుతుంది? వంచనే కదా?ఇదే టైమ్‌లో ఈ స్కీమ్‌తో నష్టపోయిన ఆటోల వారికి ఏమైనా సహాయం చేశారా? స్త్రీ శక్తి స్కీమ్ లో అసలైన హామీ ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని కదా! ఆ ఊసే ఎత్తకుండా విజయం చేసేశామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి! నిజంగానే ప్రభుత్వం కనుక రూ.1500 రూపాయల స్కీమ్ అమలు చేస్తే కచ్చితంగా విజయంగా గొప్పగా చెప్పుకోవచ్చు. కాని ఆ పరిస్థితి ఉందా! అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు రెండువిడతలలో రూ.6300 కోట్లు ఇచ్చారట. చంద్రబాబు ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మాట చెబితే, గవర్నర్ స్పీచ్ లో మాత్రం రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున లబ్ది చేకూర్చుతున్నట్లు చెప్పడం గమనార్హం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికి రెండు విడతలలో ఇచ్చింది పదివేలే అన్నది వాస్తవం! అంటే ఒక్కో రైతుకు 30 వేల రూపాయలు బకాయి పడినట్లే!ప్రతి నెల 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇందులో కొత్త ఏమి ఉంది? జగన్ టైమ్‌లో మూడువేల చొప్పున పెన్షన్ ఇస్తే, దానిని ఒక వెయ్యి పెంచిన మాట నిజమే. కాని ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదన్నది కూడా పచ్చి నిజం.సుమారు నాలుగు లక్షల మందికి పెన్షన్ కోత పడిందని చెబుతున్నారు. దాని మాట ఏమిటి? రూ.వెయ్యి కోట్లతో రహాదారులను మరమ్మతులు చేశామని చంద్రబాబు చెప్పినా, రాష్ట్రంలో అనేక రోడ్ల దుస్థితిపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి కదా! మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ లు పెట్టడం కూడా విజయమేనట. ఇది గిన్నిస్ రికార్డు అని భుజాలు చరుచుకున్నారు.ఈ సమావేశాల వల్ల ఏమి లాభం కలిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్ని లక్షల మంది విద్యార్థులు తగ్గారో లెక్కలతో సహా వార్తలు వచ్చాయి కదా! మరి అది విజయమా?లేక అపజయమా? ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద రూ.2600 కోట్లు చెల్లించామని చంద్రబాబు చెప్పుకున్నారు. కాని ఇప్పటికీ సుమారు రూ.ఐదువేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయే. దానిపై విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు కదా!విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ వస్తోందట. జగన్ టైమ్‌లో వచ్చిన అదాని డేటా సెంటర్‌ను గూగుల్ అని ప్రచారం చేస్తున్నారు. దీనికి రూ.22వేల కోట్ల మేర ఎదురు రాయితీలు ఇవ్వడం, అయినా వెయ్యి మందికి కూడా ఉపాధి కల్పించడం లేదన్న విషయం బహిర్గతం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నామని చంద్రబాబు తెలిపినా, రూ.40 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ఎన్.జి.ఓ. సంఘం నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిన విజయాలన్నిటిని పరిశీలిస్తే ఇదంతా ప్రచార ఆర్భాటమే తప్ప వాస్తవం అంతగా లేదన్న సంగతి విశ్లేషణలో బయటపడుతుంది. గవర్నర్ స్పీచ్‌లో పీపీపీ విధానం, పీ-4 ,ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేయబోతున్నట్లు, రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు ,16 లక్షల ఉద్యోగాలు అంటూ అతిశయోక్తులు, అర్ధ సత్యాలే కనిపిస్తాయి.ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన అంశాలలో కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడవద్దని హెచ్చరించారట. అంటే గత సమావేశాలలో యూరియా కొరత వంటి ప్రజా సమస్యలను కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దానిపై ప్రభుత్వం బాగా ఇరుకున పడింది. ఈసారి అలాంటి విషయాలు చెప్పవద్దని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారా అన్న సందేహం వస్తుంది.ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వంటి కొద్దిమంది రాష్ట్రంలో ఉన్న దారుణమైన పరిస్థితుల గురించి పల్లె కన్నీరు పెడుతోందంటూ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం సృష్టించింది.అసెంబ్లీలో కూడా ఆ సంగతులు చెబుతారేమో అన్న భయం టీడీపీ, జనసేన పెద్దలలో ఉన్నట్లు అనుకోవాలి. అయితే 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని కూడా చంద్రబాబు అన్నారట. అసలు ప్రభుత్వమే సరిగా లేదనుకుంటుంటే, తమ గురించి ఏమి ఉంటుందన్నది ఎమ్మెల్యేల భావనగా ఉందట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి పదిహేనేళ్లపాటు కలిసి ఉంటామని ప్రకటించడం హైలైట్. ఏదో భయం వారిని వెంటాడుతున్నట్లుగా ఉంది.వచ్చే ఎన్నికలలో గెలుస్తామో,లేదో అన్న సంశయం ఏర్పడుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలలో ఒక ధైర్యం కలిగించడానికి ఇలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.వైసిపి కులచిచ్చు పెడుతుందని పవన్ కళ్యాణ్ అనడమే విడ్డూరం.కులం పునాదిపైన జనసేన ఏర్పడిందన్న సంగతి, అంతేకాక కులాలకు సంబంధించి గతంలో తెలిసిందే.కులం ప్రస్తావనపై గతంలో రకరకాల ప్రకటనలు చేసిన వీరు నీతులు చెబుతున్నారు!సూటిగా, సుత్తి లేకుండా తక్కువ టైమ్ లో అసెంబ్లీలో ప్రసంగం పూర్తి చేయాలని చంద్రబాబు చేసిన సూచన బాగుంది. అదే సలహాను చంద్రబాబు పాటిస్తే బాగుంది కదా అన్నది కూటమి ఎమ్మెల్యేల అంతర్గత భావనగా ఉంటే ఆశ్చర్యం ఏమి ఉంటుంది!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసంతృప్తులకు రేవంత్ వార్నింగ్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్‌లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండు కార్పొరేషన్ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్‌లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్‌కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్‌లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ రెండో టర్మ్‌లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తాము పవర్లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్‌లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్‌లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్‌లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్‌కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే. ఇది రేవంత్‌కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్ రెండో టర్మ్‌లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్‌గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్ఎస్కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్‌కు సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కోటలు దాటిన మాటలు.. కోట్లు తేలేకపోయాయి ...!
ఈ ఏడాది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమిటి? ఈ ప్రశ్నకు ఎన్డీయే భాగస్వామి పక్షాలైన టీడీపీ, జనసేనలు కూడా సమాధానం చెప్పలేకున్నాయి. ప్రత్యేక కేటాయింపు లేవీ లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లు ముక్తసరిగా ‘హర్షం’ వ్యక్తం చేశారు. ఏపీ దృష్టిపెట్టిన అంశాలపై దూకుడుగా వెళ్లేందుకు ఉపయోగపడుతుందని సీఎం, అభివృద్ధికి ఊతమని పవన్‌కళ్యాణ్, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందని లోకేశ్‌లు పొడిపొడిగా వ్యాఖ్యానించారు.ఫలానా రంగానికి ఇన్ని నిధులు వచ్చాయని మాత్రం చెప్పలేకపోయారు. పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. వేర్వేరు మంత్రులను కలిసి అధిక నిధులు కోరామని ప్రకటనలు గుప్పించినా లభించింది హళ్లికిహళ్లి.. సున్నకు సున్నా! అంతే! కానీ.. ఎల్లో మీడియా మాత్రం తెగ హడావుడి పడిపోయింది.ఈనాడు పత్రిక కథనంలో.. అభివృద్ది బుల్లెట్ పరుగులేనట. అవేమిటంటే రేర్ ఎర్త్ మినరల్ కారిడార్, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీ గుండా వెళతాయట. సెమీ కండక్టర్ 2.0తో ఏపీకి ప్రయోజనం అంటోంది. అదేసమయంలో ఏపీ సమస్యలు, ఆర్థికలోటు వంటివి గాలికొదిలేసింది. పోలవరానికి రూ.3320 కోట్లు, అమరావతికి రూ.2000 కోట్లు వస్తాయని సంబరపడిపోయింది. అప్పుగా అమరావతికి డబ్బులిచ్చినా ఈనాడు చంకలు గుద్దుకుందన్నమాట. అమరావతికి చట్టబద్ధతపై ఏపీ ప్రతిపాదనకు కేంద్రం కొర్రీ పెట్టడంతో ఆలస్యమవుతోందని లేకుంటే ఎప్పుడో అయిపోయేదని కూడా చెప్పుకొచ్చింది ఈ పత్రిక చంద్రబాబు ఈ అంశంపై కూడా అమిత్ షాకు విన్నవించారని తెలిపింది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కూడా చంద్రబాబు ఒకసారి ఢిల్లీకి వెళ్లారు. ఎందుకెళ్లారో స్పష్టత లేదు. పథకాలకు నిధుల కోసమా? తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై బీజేపీ పెద్దలకు వివరణ ఇచ్చుకునేందుకా? ఇదీ కాకుండా.. ఇతరత్రా వ్యక్తిగత పనుల కోసమా? అన్నది తెలియదు. సహజంగానే బాకా పత్రికలు ప్రాజెక్టుల కోసమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమని కథనాలు ఊదాయి. చంద్రబాబు స్టైలు కూడా ఇలా లీకులివ్వడమే. కానీ పోలవరం విషయంలో ఈయన గారు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తే ఈ డొల్ల వ్యవహారం బట్ట బయలవుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పోలవరానికి కేంద్రం బడ్జెట్లో రూ.మూడు వేల కోట్లు కేటాయించింది. ఇంత తక్కువ ఇచ్చారేమిటని కనీసం ప్రశ్నించలేని చంద్రబాబు రెండో దశకు రూ.32 వేల కోట్లు అడిగామని చెప్పుకుంటున్నారు. గత ఏడాది పోలవారినికి రూ.5000 కోట్లు కేటాయించినా.. అంచనాలను సవరించిన తరువాత దక్కింది రూ.మూడు వేల కోట్లే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. చంద్రబాబు అండ్ కో అంకమ్మ శివాలెత్తేది. ‘రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు’’, ‘‘ఆంధ్రుల ఆత్మగౌరవం మంటకలిసింది’’ అంటూ ఊగిపోయేది. గత ఢిల్లీ పర్యటనలోనూ రాయలసీమలో ఉద్యానవన హబ్ ఏర్పాటుకు రూ.41 వేల కోట్లు అడిగామని చంద్రబాబు ప్రకటించారు కానీ ఆ తరువాత ఈ విషయం అయిపు అజా లేకుండా పోయింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడం ఏపీకి నష్టం. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కష్టమతుంది. తొలిదశలో ఇలా ఉంటుంది, ఆ తర్వాత దానిని యథా ప్రకారం 45.72 మీటర్లకు పెంచుతామని కేంద్రం ప్రకటించితే బాగుంటుంది. కాని అలా చేయడం లేదు. ఎందుకంటే పునరావసానికి అధిక నిధులు అవసరం అవుతాయి. నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కనీసం రూ.30 వేల కోట్లు అయినా కావాలి. కాని కేవలం మూడువేల కోట్లతో సరిపెడితే ఏపీ అభివృద్దికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుందని చంద్రబాబు, పవన్ లు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలన్నమాట. ఈ పరిస్థితిలో వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా చెబుతున్నారు? తూతూ మంత్రం చేసి అంతా అయిపోయిందని అంటారా అన్నది నీటి పారుదల రంగ నిపుణుల అనుమానంగా ఉంది.కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడకు టీడీపీ, జనసేనలకు ఉన్న పదిహేడు మంది ఎంపీల మద్దతు కీలకం. అయినా వీరు రాష్ట్రానికి సంబంధించి తగినన్ని నిధులూ సాధించలేకపోయారు.. కొత్త పథకాలూ వచ్చింది లేదు. ఏంటో వీరి బలహీనత! శీతకన్నేసినా... పట్టించుకోకపోయినా కేంద్రం సహకరిస్తోందన్న ప్రచారం చేసుకోవాల్సిన దౌర్భాగ్యమెందుకో? స్కిల్‌స్కామ్‌లో ఈడీతో కూడా క్లీన్ చిట్ ఇప్పించుకున్నట్లు ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయని.. ఢిల్లీ యాత్రల మర్మం ఇదేనని వైసీపీ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూండటం గమనార్హం. గతంలో ప్రధానిని కలిసిన తర్వాత 2026 నాటికి విశాఖ- తిరుపతి బుల్లెట్ ట్రైన్ లు వచ్చేస్తాయని చెప్పారన్న విషయాన్ని మీడియా గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీకిప్రత్యేక రైల్ కారిడార్ ఏర్పాటు కూడా లేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గత ఏడాది మూడువేల కోట్లు కేటాయించినా, ఈసారి కేవలం వంద కోట్లకే పరిమితం చేయడం ఆందోళన కలిగించే అంశమే. ఏదో రకంగా దానిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్న సందేహం రావడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే విభాగాల వారీగా ప్రైవేటువారికి అప్పగిస్తున్నారు. విశాఖ పోర్టుకు గత ఏడాది 750 కోట్లు బడ్జెట్ లో పెట్టగా, ఈసారి అది 450 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంఘం నిధులలో కోత,గ్రామీణ ఉపాధి హామీ నిధులలో కోత వంటివి కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీని కూడా ప్రభావితం చేస్తాయి.మరో వైపు తెలంగాణ కు కూడా అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వాపోయారు. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు కాని, మెట్రో విస్తరణకు కాని నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రస్తావనే లేదు. తామంతా ప్రధానమంత్రిని నిధుల కోసం కలిసినా ప్రయోజనం దక్కలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కొంత శీతకన్ను వేశారని అనుకోవచ్చు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.కేంద్రంలో టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టం అని చెప్పుకుంటారు. చంద్రబాబు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయినా బడ్జెట్ లో ఏపీకి దక్కింది ఏమీ లేకుండా పోయింది. దీనిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఉండడం ఏపీకి మరింత నష్టం చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది. హిందూ మతోద్ధారకుడిగా తరచూ ప్రచారం చేసుకుంటున్న ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి ఈ పోస్టులు.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దిక్కుమాలిన వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై రుద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పైగా.. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తొమ్మిది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బాబుగారికి. అక్కడ కూడా మరోసారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కల్తీ అంటూ ఏదో మాట్లాడబోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని డబ్బుకోసం ఈ కల్తీ జరిగిందని తనకు తోచిన సలహాను చంద్రబాబు చెవిలో చెప్పేయత్నం చేశారు. దానిని అంగీకరించని చంద్రబాబు అవినీతి కాదు.. హిందూమతంపై దాడి చేయడానికి జరిగిన కుట్ర అని ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చెప్పారని, అప్పుడు తాను దానికి వ్యతిరేకంగా మెట్ల ద్వారా తిరుమల వెళ్లి దానిపై వారి పక్షాన క్షమాపణ కోరానని అన్నారు. నిజంగా ఆయన అలా చేశారా? అన్నది గుర్తు లేదు కాని కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు చూపిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మొదలు టీడీపీ మీడియా, ఇతరత్రా వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ఆరంభించాయి. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్లాన్ చేశారు. పంచాయితీ ఎన్నికలు సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవిత్రమైన తిరుమల ప్రాంతంలో ఎన్నికలు జరపడం సరికాదన్న భావనతో వందేళ్లుగా తిరుమల కొండలుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్నికలు జరపవద్దని ఒక జీవో ఇచ్చారు. పచ్చ తమ్ముళ్లు దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సహచర ఎల్లో మీడియా సాయంతో వివాదాన్ని సృష్టించారు. ఆ జీవోను వైఎస్‌కు అంటకట్టి అందులోని వివరాల ప్రకారం రెండు కొండలే పరిధిలోకి వస్తాయని, ఏడు కొండలు రావని అంటూ గొడవ మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న రాజశేఖరరెడ్డి తిరుమల విస్తీర్ణంపై ఉన్న అస్పష్టతను వెంటనే తొలగిస్తూ మొత్తం ఏడు కొండలూ వచ్చేలా కచ్చితమైన జీవో ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో 18 ప్రముఖ హిందూ దేవాలయాలున్న ప్రాంతాలను టెంపుల్ సిటీలుగా ప్రకటించి ఆయాచోట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అన్యమత ప్రచారంపై నిషేధం విధిస్తూ మరో జీవో జారీ చేశారు.అంతేకాదు... వైఎస్ తన హయాంలో తిరుమల విశిష్టతను కాపాడేలా, హిందు మత విశ్వాసాలను పరిరక్షించేలా అనేక చర్యల తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలో ఎస్వీబీసీ ఛానెల్ పెట్టి స్వామివారి ప్రచారం చేయాలని సంకల్పిస్తే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. ఆ ఛానెల్‌కు రూ.40 కోట్లు వృథా అని అని వాదించారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరు వద్ద జరిగిన బైబిల్ మిషన్ ఉత్సవాల్లో చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు కొండలూ తిరుమలేశుడివే అని, అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైఎస్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తామని ఆ సభలో ప్రకటించారు. ఈ జీవోల వల్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు అన్నారట. ఇప్పుడేమో తాను రెండు కొండలు, ఏడు కొండలు పోరాటం చేశానని చెబుతున్నారు. అప్పుడేమో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోను రద్దు చేస్తామన్నారు. 2019-24 మధ్యలో అన్యమత ప్రచారం జరిగిపోతుందన్నట్లు వదంతులు సృష్టించి టీడీపీ మీడియా ప్రచారం చేసేది. ఎంత ఆత్మవంచన.2009లో ప్రముఖ హిందూవాది టి.హనుమాన్ చౌదరి ఒక లేఖ రాస్తూ చంద్రబాబు తీరును తప్పు పట్టారు. అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చే విధంగా జీవో ఇస్తానని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ, ఎస్టీ హిందువులకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మరో హామీని కూడా ఆయన విమర్శించారు. క్రిస్టియన్ ఓట్ల కోసం, మత మార్పిడులను ప్రోత్సహించేలా చంద్రబాబు ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శిస్తూ 2009 ఫిబ్రవరి మూడున రాసిన లేఖ సోషల్ మీడియా యాక్టివిస్టులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది రాకపోతే చంద్రబాబు చెప్పే మాటలు నిజమేనేమో, ఈయన హిందుత్వ కోసం కట్టుబడి ఉండే వ్యక్తేమో అన్న భావన ఉండేది కదా!.1996 ఎన్నికల సమయంలో చంద్రబాబు కమ్యూనిస్టులతో పొత్తులో ఉండేవారు. ప్రచార సభలో బీజేపీని మతతత్వ పార్టీగా, మసీదులు కూల్చే పార్టీగా ధ్వజమెత్తేవారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని మహానాడులో ప్రకటించారు. కానీ, ఆ తర్వాత జరిగిన సంగతులు తెలిసినవే. గుజరాత్లో జరిగిన మత కలహాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి దించాలని డిమాండ్ చేసి, తదుపరి లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఓటింగ్ వరకు ఉండకుండా జారుకున్నారు. 2019లో ప్రధాని మోదీపై వ్యక్తిగత పరుష వ్యాఖ్యలు చేసింది ఇటీవలి చరిత్రే. 2024 వచ్చేసరికి మోదీ ప్రపంచానికి మార్గదర్శి అని, దేశానికి ఆయన గొప్ప సేవలు చేస్తున్నారని ప్రకటించారు. ఇప్పటికీ కూడా ప్రధానిని అదే తరహాలో పొగుడుతున్నారు.ఇక లడ్డూ వివాదంలో తను చేసిన ఆరోపణ నిజమని జనాన్ని నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయన మాటలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదు. అందువల్లే ఢిల్లీ టూర్లో మీడియా లడ్డూ గురించి అడిగినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ పెరుగు నాణ్యతపై వచ్చిన ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ సంస్థ రూ.లక్ష జరిమానా విధించిన సమాచారం రాగానే చంద్రబాబుకు చెందిన ఆ కంపెనీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ల్యాబ్ పరీక్షల తీరుపై హెరిటేజ్ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది. సీల్డ్ ప్యాకెట్ల నుంచి పెరుగు సాంపుల్ తీశారా? లేక లుజ్గా తీసుకున్నారా? అన్న సందేహం వ్యక్తం చేసింది.డెయిరీ ఉత్సత్తులలో వివిధ కారణాల వల్ల స్వల్పంగా విశ్లేషణలలో తేడా రావచ్చని, ఇందులో ప్రమాదకరమైనవి కాని, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవి ఏవీ లేవని పేర్కొంది. ఒక ప్రైవేటు సంస్థ అయిన హెరిటేజ్ ఇంత కంగారుపడి ఈ ప్రకటన చేసిందే. మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తదితరులు పదే పదే జంతు కొవ్వు, పంది మాంసం వంటివి లడ్డూలో కలిశాయని చెబుతున్నారే. అధి ధర్మమేనా ? అంటే తన సంస్థ కైతే ఒక రూల్స్.. అదే ప్రజలందరూ కొలిచే దైవం విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తారా? తన దాకా వస్తేకాని తత్వం బోధపడదని అంటారు! ఇదే అన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పాలన ‘కమ్మ’దనంపై స్వపక్షం పెదవివిరుపు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళుతున్నాయి? రాష్ట్రంలో పాలన ‘కమ్మ’గా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పొలిటికల్ ఆటంబాంబుగా మారింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, ఒక సామాజికవర్గం పెత్తనంపై వ్యతిరేకత పెరిగిపోయిందనేందుకు ఇదో సూచిక. ముఖ్యమంత్రి చంద్రబాబేమో.. కుమారుడు లోకేశ్‌కు పట్టం కట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంటే.. పాలన అధ్వాన్నంగా మారిందన్న అంచనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపులు, తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చేసిన రచ్చ కూడా కూటమి భాగస్వాములు బీజేపీ, జనసేనల అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణమవుతోంది. దీన్నే ఆదినారాయణ రెడ్డి తనదైన రీతిలో బయటపెట్టారు. ఇంకొంరు బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భావన కూడా ఇదే అయినప్పటికీ ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పట్ల విధేయతగా ఉండడంతో తగ్గి ఉంటున్నారు. టీడీపీలో నిజంగానే ఒక సామాజికవర్గం అధికారం చెలాయిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. ఆది నారాయణ రెడ్డి ‘కమ్మ’గా ఉందన్న కామెంట్‌కు సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలంతా చప్పట్లు కొట్టడం కూడా ఒక సంకేతమే. కమ్మ సామాజికవర్గం నాయకత్వం ఎలా ఉన్నా.... మిగిలిన వారిని కూడా కలుపుకొనిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ లేనిదే టీడీపీ, జనసేనలకు ఉనికి ఉండదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు లడ్డూ ప్రసాదం అంశంలో ఎంతో కష్టపడి ప్రచారం చేస్తున్న కుట్ర థియరీ గాలి కూడా ఆదినారాయణ తీసేశారు. లడ్డూ అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌దే పైచేయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు మంత్రివర్గ సభ్యుడు కూడా. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలో ఆయనకు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుపొందిన అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్‌కు మధ్య వర్గపోరు కూడా సాగుతోంది. ఇదో కోణమైతే ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ మాటకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని టీడీపీతోపాటు బీజేపీ, జనసేనల్లోనూ బలంగా నమ్ముతున్నాయి. లోకేశ్ సొంత కోటరీతో షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయా అంశాలలో అహంకార పూరితంగా ప్రవర్తిస్తూ, గిట్టని వారిపై రెడ్‌బుక్ ప్రయోగిస్తూ అరాచకాలు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. ఇతర పక్షాల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. చంద్రబాబు సీనియర్ నేత, ముఖ్యమంత్రి కనుక ఆయన వద్దకు వెళ్లి ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. కాని లోకేశ్ వద్దకు వెళ్లడం మిత్రపక్షాలకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల రాగం ఆలపిస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,ఇతర నేతలు మౌనంగా ఉంటున్నారు. తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు లడ్డూ ప్రసాదంలో కల్తీ లేదని చెప్పడం గమనించదగిందే. అలాగే బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుతున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఇంత గందరగోళం చేస్తున్నా బీజేపీ కేంద్ర పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు.రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు మాధవ్‌ను తన అవసరార్థం పిలిపించుకుని లడ్డూపై ఉమ్మడి సమావేశంలో పాల్గొనేలా చేశారు. ఇవన్ని చూస్తే కూటమిలో అంత సవ్యత లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. క్రెడిట్ ఉంటే చంద్రబాబు, లోకేశ్‌లే తీసుకుంటున్నారని, నెగిటివ్ వచ్చినప్పుడే తాము కావల్సి వస్తున్నామని మిత్రపక్షాలలో ముఖ్యంగా బీజేపీలో ఉందట. ఆదినారాయణ రెడ్డి ఇదే సంగతిని పరోక్షంగా వెల్లడించారు. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని ఆక్షేపించారని వార్తలు వచ్చాయి. అంతకుముందు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు తమ పార్టీ పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా అతను చేసిన కీచక పర్వం ఒక ఎత్తు అయితే, కేవలం ఒక డమ్మీగా స్థానిక టీడీపీ నేత రూపానందరెడ్డి పెత్తనంలో ఉండాల్సి రావడం కూడా గమనించవలసిన అంశం. జనసేనకు సంబంధించి కనీసం పది మంది అంతకుముందు టీడీపీలో ఉన్నవారే. చంద్రబాబు వారిని జనసేనలోకి పంపించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్‌ను మొదటి నుంచి బలహీనుడిగానే నిలబెట్టారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అనేకమంది చేస్తున్న దందాలు ఉండనే ఉన్నాయి. వాటిలో జనసేన, బీజేపీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఆ అసంతృప్తి కూడా ఉంది. రాష్ట్రంలో 95 శాతం మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ వారికే దక్కాయి. పైకి టీడీపీతో కలిసి ఉంటున్నప్పటికీ, ఈ సంగతులు తెలియని స్థితిలో మిత్రపక్షాలు ఉండవు కదా! అందులోను బీజేపీ జాతీయ పార్టీ.ఆ పార్టీ అండతోనే టీడీపీ గెలవగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎన్నికల సంఘం కూటమికి అనుకూల నిర్ణయాలు చేయడం వంటివి ఎన్నికల సమయంలో కనిపించాయి. కేంద్రంలో ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాలను పొగుడుతూ, రాష్ట్రంలో మాత్రం తమ పెత్తనాన్ని చంద్రబాబు సాగించుకుంటున్నారన్నది బీజేపీలో ఒక అభిప్రాయంగా ఉంది.కులపరంగా చూస్తే ఎంత కాదన్నా టీడీపీని కమ్మ సామాజికవర్గం తమ సొంత పార్టీగా భావిస్తుంటుంది.మంత్రివర్గంలో వారికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. పార్టీ అధిష్టానానికి సన్నిహితంగా ఉండేవారిలో ఎక్కువ మంది ఆ వర్గంవారే అంటారు. ఇతర వర్గాల వారి మాట పెద్దగా చెల్లడం లేదన్నది రాజకీయ వర్గాలలో ఉన్న అభిప్రాయం. ఇక జనసేన పార్టీ కాపు సామాజికవర్గంపై ఎక్కువగా ఆధారపడిన పార్టీ అన్నది తెలిసిందే. ఆ వర్గాన్ని ఆకర్షించడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకోగలిగారు. అయినా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం లేదన్న విషయం అర్థమైన తర్వాత ఆ వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. దానికితోడు కాపు వర్గానికి జగన్ టైమ్‌లో లభించిన పథకాలు కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. మాజీ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి జైలుకు పంపడం, ఇంటిపైకి వెళ్లి విధ్వంసకాండ సృష్టించిన వారు టీడీపీ గూండాలైనా అందులో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్య పాత్ర పోషించారన్న ప్రచారం, అంబటిని దూషించిన ఒక కమ్మ సామాజికవర్గ మహిళపై కేసు పెట్టకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబుతో ఉన్న బంధుత్వం కారణంగా అంబటినే తప్పుపట్టారని, అదే అంబటిని తీవ్రగా దూషించిన వారిని ఖండించలేదని, ఇది కుల ప్రభావమేనని కాపు సామాజికవర్గం భావిస్తోంది. అంబటి కుమార్తె మౌనిక మాట్లాడిన పద్దతి కూడా ఆ వర్గాన్ని ఆకట్టుకుంది. ఇక బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టడం, అలా చేసిన టీడీపీ వారిపై చిన్న కేసులు పెట్టి సరిపెట్టడం బీసీ వర్గాలలో కూడా ఆందోళన కనిపించింది. దళిత వర్గాలపై ఈ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు గతంలో ఎప్పుడూ జరిగి ఉండవు. దాంతో ఆ వర్గంలో తీవ్ర అసమ్మతి ఉందని చెబుతున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులపై కక్షతో తప్పుడు కేసులు పెట్టించిన తీరుతో ఆ వర్గం కూడా టీడీపీకి దూరం అవుతోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా లడ్డూలో జంతుకొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ వంటివి ఉన్నాయని చంద్రబాబు, పవన్, లోకేశ్‌లు చెప్పడం పట్ల వారు మండిపడుతున్నారు. తమకు లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటేనే బెరుకుగా ఉంటోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన వ్యాఖ్య దీనికి నిదర్శనం. పైగా టీడీపీ వాళ్లు ఫోన్ పోన్ ఫ్రొఫెసర్ నాగేశ్వర్‌ను తిట్టడం, బెదిరించడం కూడా బాగా ప్రభావం చూపుతోంది. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వర్గాలలో మెజార్టీ భాగం కూటమికే మద్దతిచ్చాయి. అయినా ప్రస్తుతం పరిస్థితి కేవలం ఒక సామాజికవర్గానికే అనుకూలంగా ఉందన్న భావన ప్రజలలో నెలకొంది. దానికి తోడు టీడీపీ పత్రికలుగా పేరొందిన మీడియా యజమానులు కూడా అదే సామాజికవర్గంగా ఉండడం, కూటమి ప్రభుత్వం చేసే అకృత్యాలకు సైతం మద్దతు ఇచ్చేలా కథనాలు రాయడం ఏపీ సమాజం గమనిస్తోంది. ఈ కారణాల రీత్యా ఆదినారాయణరెడ్డి వంటి నేతలు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014 టర్మ్‌లో కూడా టీడీపీ ఇలాగే ఆయా సామాజిక వర్గాలను దూరం చేసుకుంది. ఈసారి మరింత ముందుగానే ఆ పరిస్థితి తెచ్చుకుందన్న భావన వివిధ రాజకీయ పక్షాలలో నెలకొంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలుగువారి పరువు తీస్తున్న బాబూ అండ్ కో!
తమిళనటుడు కమల్‌హాసన్ తెలుగువారి కీర్తి దశదిశలా మారుమోగేలా చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో చేసిన తొలి ప్రసంగంలో తెలుగువారు గర్వించదగ్గ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కవిత ‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్’’ను చదివి వినిపించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ కవితకు ఆర్థం తెలుగువారికి బాగా తెలుసంటూ ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు అది వేరే సంగతి.ఒక పక్క ఓ తమిళ నటుడు తెలుగువారి సాహితీ వైభవాన్ని చాటిచెబితే ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు అందరి ఆరాధ్యదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడటం మాత్రం తెలుగువారికి ఏమంత గర్వకారణం కాదు. అంతేకాదు.. ఈ రాజకీయ బురదలోకి బాబు అండ్ కో బీజేపీ నేత మాధవ్‌ను కూడా దింపేశారు. కల్తీ మకిలిని మాజీ సీఎం జగన్‌పైకి నెట్టేందుకు టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలం కావడం.. జగన్ జనాల్లో తిరుగుతూ ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు ఎటూ పాలుపోవడంలేదుఅందుకేనేమో.. పవన్‌కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మరికొందరు మంత్రులతో మూకుమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టి జగన్, వైసీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. మత కోణాన్ని తెచ్చి జగన్‌ను దెబ్బతీయాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. ఈ క్రమంలోనే పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ చంద్రబాబు హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని వింత వ్యాఖ్యలు చేస్తూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టారు. సహజంగానే ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్ర అసహనం కలిగింది.అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడే చంద్రబాబు తప్పు మాట్లాడుతున్నారని ధైర్యంగా చెప్పగలిగి ఆయన గౌరవం పెరిగేది జనసైనికులలో ఆయనపై నమ్మకం కలిగేది. కాని ఆయన మౌనంగా కూర్చోవడం వారి గుండె మంటకు కారణమైంది. ఎందుకంటే హిందూ ధర్మం అయినా, మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కాని దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి.రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాటేమిటి? ఏ కారణం వల్లనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, మహిళలు హింసను కూడా భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? సంసారాలు విడాకుల వరకు వెళ్లగూడదని చెప్పడం వేరు. అసలు విడాకులు తీసుకోవమే నేరం అన్నట్లు మాట్లాడడం వేరు.ఇది ఒక కోణమైతే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని చంద్రబాబు ఇంకో దిక్కుమాలిన వాదన తీసుకువచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక, ప్రజలలో వచ్చిన అప్రతిష్టను డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థి జగన్‌పై బురద రాయాలన్న తాపత్రయంలో, ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికి తెలుసు.విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే, తాను స్వామివారి భక్తుడిని అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీపై తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నా, గోబెల్స్ మాదిరి అదే తప్పుడు ప్రచారం పదే, పదే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటూ ఉంది.పవన్ కళ్యాణ్ తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత పాతపాటే పాడారు. చంద్రబాబు బతిమలాడారా? బెదిరించారా? ఈ వివాదంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంటీ అంటనట్లే ఉంటున్నారు. కాని చంద్రబాబు ఆయన్నూ పనికట్టుకుని ప్రెస్మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఈయనకు కూడా అంటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి ఏ రకంగా పనిచేసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్రమ పద్ధతిలో వివరించారు. అదంతా వింటే జగన్‌పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. లడ్డూ ప్రసాదం కల్తీపై దర్యాప్తునకు సిట్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దాంతో ఈ విచారణ చాలావరకు చంద్రబాబు చేతి నుంచి జారి పోయింది. రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు సిట్‌లో ఉన్నా ప్రధాన పాత్ర సీబీఐది కావడం వల్లనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదిక ఇవ్వగలిగారు.ఈ పరిణామంతో తాము జనంలో బాగా పలుచనయ్యామన్న సంగతిని అర్థం చేసుకున్న చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని ఏకంగా ఫ్లెక్సీలు కట్టి జగన్, సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలపై దుష్ప్రచారం చేయించారు. జంతు కొవ్వు ఆరోపణ చేయడం, అరాచకపు ఫ్లెక్సీలు కట్టించడం, లడ్డూకు ఏదో అయిందన్నట్లు అదే పనిగా ప్రచారం చేయించడం.. వీటిని కదా వెంకన్నకు మకిలి అంటించే కుట్ర అనేది? జగన్ గుంటూరు పర్యటనకు జనం విశేషంగా రావడం, అక్కడ లడ్డూ అంశాన్ని ప్రస్తావించి చంద్రబాబును తీవ్రంగా తప్పుపట్టడంతో చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి మరింత గందరగోళంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి శాంపిల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా? కాదా? వెనక్కి పంపించిన నాలుగు ట్యాంకర్లు కొన్నాళ్లు శ్రీకాళహస్తిలో ఉంచడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించారని సిట్ తెలిపిందా? లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనా? కాదా? చంద్రబాబు హయాంలోనే కిలో నెయ్యి రూ.291లకే టీటీడీ ఎలా కొనుగోలు చేసింది?ఈ ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్‌లు ఎక్కడా జవాబు ఇవ్వలేదు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికి జవాబు చెబుతోంది. ప్రెస్‌మీట్ లో పాల్గొన్నవారిలో ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క కనిపించడం లేదని, తప్పు చేశామన్న గిల్టితో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న వారి తాపత్రయం కనబడుతోందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది.ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.దానికి పేర్నినాని జవాబు ఇస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని, బాప్టిజం తీసుకున్నానని చెబుతారు. మరోసారి ముస్లిం అని అంటారు. ఇంకోసారి తన తండ్రి దీపారాధన వత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకుంటారని అంటారు..ఇక ఆయన సోదరుడు తాను నాస్తికుడనని చెబుతారు.. మళ్లీ హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు..అని మండిపడ్డారు.వీరంతా రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తుతున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది.నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు హిందూ ధర్మం పట్ల నిబద్దత ఉంటే నిత్యం అబద్దాలు చెబుతారా? మోసపూరిత హామీలు ఇచ్చి జనాన్ని మభ్య పెడతారా? అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తమ అసమర్ధతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే పాలకులు మతాన్ని తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. నిజమే కావచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జనసేనలో మరింత ముదిరిన ముసలం
జనసేనలో అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు అంతరం పెరుగుతోందా? పార్టీని గంపగుత్తగా టీడీపీకి అనుబంధ సంస్థగా చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు నిరసిస్తున్నారా?. తిరుమల లడ్డూ వ్యవహారంలో పార్టీ వైఖరిని స్పష్టం చేయడంలోనూ పవన్ విఫలమయ్యారన్న అసంతృప్తి కేడర్‌లో కనిపిస్తోందా?. ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైనప్పటికీ సాటి కాపు నేతపై టీడీపీ గూండాలు దాడి చేస్తే మాటమాత్రంగానైనా ఖండించలేకపోవడం జనసేన బలహీనతైపోయిందని వారు వాపోతున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఇటీవల సమావేశమైంది. రాజకీయ పరిణామాలపై, అధికార టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేసిన దాడులపై చర్చించాలనుకున్నారు. కానీ.. ఎవరూ ఏ ప్రశ్న వేసే అవకాశమే ఇవ్వకుండా అధినేత పవన్ ఆ సమావేశం నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. కొంచెం సినిమాటిక్ డ్రామాగా అనిపించవచ్చు కానీ.. పవన్ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే ఇలా వ్యవహరించి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు పలు సందర్భాల్లో పవన్ చంద్రబాబు, లోకేష్‌లకు వత్తాసుగా నిలబడటం.. ఎన్ని అరాచకాలు జరిగినా.. సొంత పార్టీ కార్యకర్తలు నేతలను టీడీపీ వాళ్లు అవమానిస్తున్నా పట్టించుకోకపోవడంపై మొదటి నుంచి కూడా జనసేనలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. తమకంటూ సొంత అస్తిత్వం, వ్యక్తిత్వం లేకుండా పోతున్నాయని ఆ పార్టీ నేతలు తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం... తదనంతరం అంబటి కుమార్తె పవన్‌ను ఉద్దేశించి ఓ సూటి ప్రశ్న వేయడాన్ని జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రశ్నలు పవన్ కనీస సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా... పార్టీ వారందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని పవన్ చెప్పినట్లే.. పవన్ సహా జనసేన వారందరి జాతకాలు చంద్రబాబు వద్ద ఉన్న కారణంగానే ప్రశ్నించలేకపోతున్నారని కొందరు చమత్కరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని హిందువులు నమ్మే దేవదేవునికి అపచారం కలిగేలా మాట్లాడిన చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ సనాతని వేషం కట్టి దుర్గగుడి మెట్లు కడిగి, తిరుపతి వెళ్లి ‘‘అన్ అపాలజిటిక్ హిందూ’’ అని గంభీర ప్రకటనలు చేశారు. ఇక్కడే పవన్ తప్పటడుగు వేశారు. చంద్రబాబు ఏమి చెబితే అది గుడ్డిగా చేయకుండా కొంచెం ఆలోచించి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఆయనకు, జనసేనకు అపకీర్తి వచ్చేది కాదు. కానీ చంద్రబాబుతో పోటీ పడి అయోధ్యకు కూడా లక్ష కల్తీ లడ్లు వెళ్లాయని నిరాధార ఆరోపణ చేశారు. నిబద్దత ఉన్న నేత అయితే వెంటనే పొరపాటు జరిగిందని ప్రకటించి ఉండేవారు. కాని చంద్రబాబు దారిలోనే నడుస్తూ పవన్ ఆ విషయాన్ని దాటవేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేయడం, టీడీపీ హయాంలోనే బోలే బాబా కంపెనీ వచ్చిందని, 2019-24 మధ్య తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి వెనక్కి పంపిన నెయ్యి టాంకర్లను తిరిగి వాడారన్న విషయం వెలుగులోకి రావడం.. చంద్రబాబు, పవన్‌ల పరువు తీశాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ లోనే బుకాయించసాగారు. ఈ దశలో అయినా పవన్ కళ్యాణ్ కాస్త హేతుబద్దంగా ఆలోచించి ఉంటే పార్టీ క్యాడర్‌కు సరైన సంకేతం వెళ్లి ఉండేది. అలా చేయకపోగా పార్టీ జనరల్ బాడీ సమావేశం పెట్టి జనసేన నేతలు, కార్యకర్తలు ఎందుకు లడ్డూ అంశంలో వైసీపీని విమర్శించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై టీడీసీ వారు చేసిన దాడి, సృష్టించిన విధ్వంసాన్ని కూడా సమర్ధించే దశకు పవన్ వెళ్లారు. అంబటి కారుపై తొలుత కర్రలతో దాడి చేసి, నీచమైన రీతిలో బూతులు తిట్టిన టీడీపీ వారిని ఒక్క మాట అనకుండా.. అంబటినే తప్పు పట్టిన రీతిలో పవన్ మాట్లాడడం మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ తాము కూడా కాపు బిడ్డలమేనని, తమపైకి మహిళలని కూడా చూడకుండా కులం పేరు ప్రస్తావించి దాడి చేశారని, తన తండ్రిని హత్య చేయడానికి యత్నించారని, దీనిని సమర్ధిస్తారా అని పవన్‌ను ప్రశ్నించారు. అంతేకాక అసలు పవన్ తల్లిని దూషించింది ఎవరో ఆయనకు తెలియదా అని వ్యంగ్యంగా అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుడుతూ కాపులను వేధించడమే చంద్రబాబు లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కూడా పవన్ స్పందించలేదు. మొత్తం ఇష్యూని చర్చించి పార్టీ పరంగా ఒక అవగాహనకు రావల్సిన పరిస్థితి కాకుండా,అసలు ప్రశ్నించడానికే వీలు లేదన్నట్లుగా పవన్ ప్రవర్తించారు. ఇక్కడే క్యాడర్‌కు, పవన్‌కు మధ్య అంతరం బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ప్రశ్నించడానికి వచ్చిన జనసేన కేవలం టీడీపీకి భజనసేనగా మారిపోవడం ఏమిటన్న అంతర్మథనం జనసేన కార్యకర్తలలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా కొంతమంది జనసేన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా వాస్తవ పరిస్థితిపై ఆలోచించడం, మాట్లాడడం ఆరంభించారు. ఆ పార్టీకి చెందిన ఒక మహిళా న్యాయవాది రజని టీవీ డిబేట్లలో మాట్లాడుతూ టీడీపీ తీరును ఆక్షేపించారు. పుటుక్కున అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ వారు కర్రలతో వస్తున్నారు.. రేపు వైసీపీ వారు కత్తులతో వస్తారని హెచ్చరించారు. అసలు లడ్డూపై ఫ్లెక్సీలు పెట్టడం, అంబటిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు? రేపటి పరిణామాలను ఆలోంచుకుని వ్యవహరించాలని అంటూ ‘‘పచ్చ తమ్ముళ్లూ.. గుర్తు పెట్టుకోండి..’’ అని ఆమె స్పష్టం చేశారు. పవన్‌కు ఈ మాత్రం విజ్ఞత లేదా ధైర్యం లేకుండా పోయిందేమిటా అనే భావన జనసేనలో ఏర్పడింది. లాయర్ రజని చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె పార్టీకి దూరం అయ్యేలా జనసేన వ్యవహరించింది. ఈ వ్యవహారంలోనే కాకుండా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా పవన్ సరైన రీతిలో స్పందించలేకపపోయారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఏదో కమిటీ వేసి కాలయాపన చేయడం ఏమిటన్న భావన కూడా ఉంది. మహిళలకు సంబంధించి పవన్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలేమిటి? ఇప్పుడు స్పందిస్తున్న వైనం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. పైగా నేతలు ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ప్రకటన చేయడంపై అంతా విస్తుపోయారు. ఇప్పటికే టీడీపీ వారు విలువ ఇవ్వడం లేదని, నామినేషన్ పదవులలో అన్యాయం జరుగుతోందని రగులుతున్న జనసేన కార్యకర్తలలో ఈ తాజా పరిణామాలు మరింత బాధ కలిగిస్తున్నాయి. అందువల్లే పవన్ కల్యాణ్ తాను ఏమి చెప్పినా పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా క్యాడర్ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ మాట్లాడితే పదిహేనేళ్లు టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం, దానికి తగ్గట్లే టిడిపి వారు చేసే తప్పులను భుజనా వేసుకోవడం వంటివి కూడా వారికి నచ్చడం లేదు.కేవలం టిడిపిని మోయడానికే తాము ఉన్నామా అన్న ఆవేదనను పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాపు సామాజికవర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఒక విషయం వెల్లడించారు.పార్టీకి పనిచేసే వారికి పదవులు దక్కలేదని, పదవులు వచ్చినవారికి జనసేన పేరు తగిలించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అధినేతకు, క్యాడర్ కు మధ్య పెరుగుతున్న అంతరం ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్‌ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్‌బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్‌తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్‌లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్‌బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్‌ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్‌పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్‌బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్‌లో పడవద్దని కేడర్‌కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్‌లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్‌లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్‌ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్‌ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్‌లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
లడ్డూ వ్యవహారంపై మళ్లీ బుకాయింపే!
తప్పు చేసి దొరికినప్పుడల్లా చంద్రబాబు ప్రయోగించే టెక్నిక్.. ఎదురుదాడి!. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చిన నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆయన తాజాగా మళ్లీ గళమెత్తుతున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి అర్థమైనా దాంతో తనకేమీ సంబంధం లేనట్టుగా నటిస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారమే చేయాలని మంత్రులు, టీడీపీ నేతలు, కేడర్‌ను ఆదేశించారట. తప్పని స్థితిలో మంత్రులు తమకు తోచిన ప్రకటనలు చేస్తున్నారు.మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా తప్పుడు ఫోటోలతో వైఎస్సార్సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తోంది. విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు పెట్టించి నీచ రాజకీయాలకు వెనుకాడడం లేదు. కుప్పం టూర్లో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలు శ్రీవెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారట. తనను క్షమాపణ చెప్పాలని అడుగుతారా అని ఆయన రుసరుసలాడారు. లడ్డూలో జంతు కొవ్వు అంటూ మాట్లాడింది ఎవరు? నిత్యం అదే విషయాన్ని దేశం అంతటా ప్రచారం చేసిందెవరు? ఇవి చాలవన్నట్లు టీడీపీని గట్టెక్కించడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా అబద్దపు కథనాలు రాస్తున్నాయి. ప్రతిష్ట పూర్తిగా పోయినా ప్రజలను మోసం చేయడం కోసం ఈనాడు మీడియా లాజిక్కు లేని వ్యాఖ్యలతో దిక్కుమాలిన సంపాదకీయం ఒకటి రాసింది.జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగనట్లేనని జగన్ పార్టీ, మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతోందని రాసి ఈనాడు పత్రిక తుచ్చమైన మీడియాగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఏం చెప్పింది ఈనాడు మీడియాకు తెలియదా?. జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని కదా ఆయన చెప్పారు?. అప్పుడు అదే చంఢాలాన్ని పేజీలకు, పేజీలు రాసి ప్రజలపై రుద్దాయి ఈ పత్రికలు. ఇప్పుడు ఆ జంతు కొవ్వు అంశంలోకి వెళ్లకూడదన్నట్లుగా ఎందుకు రాస్తున్నారు? అసలు ఈనాడు మీడియాకు జంతుకొవ్వు, పామాయిల్‌కు తేడా తెలియదా? పోనీ పామాయిల్ కల్తీ జరిగి ఉంటే మొత్తం లడ్డూలన్నీ అలా తయారు చేస్తుంటే ఒక్క టీటీడీ అధికారి, పోటు తదితర సిబ్బంది, పూజారులు ఎవరూ పసికట్టలేకపోయారా?. అప్పట్లో జగన్ ప్రభుత్వంపై టీటీడీ విషయంలో అనేక వదంతులు, అబద్దాలు ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు తెలియకుండా ఉండేదా?. విపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు తిరుమల వెళ్లినప్పుడు లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఎన్నడూ చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయలేదే!. ఇవన్నీ పక్కనబెట్టి తగుదునమ్మా అటూ క్షమించరాని ఘోరాపచారమిది అంటూ రాసేసి ఈనాడు ఆత్మ వంచన చేసుకుంటే సరిపోతుందా?. తెల్లవారిలేస్తే పూజలతో గడిపే ఈనాడు యజమాని కిరణ్ ఇంతటి పాపానికి ఒడిగడుతున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాల ముందు భక్తి అన్నది ఒక నటనే అని అనుకోవాలా?మరో మాట చెప్పాలి. బహుశా ఆ సంపాదకీయాన్ని రాసిన వారు అంతకుముందు రోజు అదే పత్రికలో వచ్చిన సిట్ నివేదికలోని కొన్ని అంశాలను చదవకుండానో, చదివినా కావాలనో అసత్యాలు పులిమేసినట్లు కనిపిస్తుంది. జనవరి 29న ఈనాడులో వచ్చిన కథనం ప్రకారమే ‘హర్ష్ ఫ్రెష్ డెయిరీ’ 2018 నుంచే టెండర్లలో పాల్గొంటోంది. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2018 ఏప్రిల్ 17న ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అధికారుల కమిటీ ఆ కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్లింది. ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని సిట్ గుర్తించిందట. అప్పట్లో ఆ కంపెనీకి నెయ్యి బిడ్ రాలేదు. కానీ, 2019 ఫిబ్రవరిలో పొందగలిగిందని ఈనాడులోనే రాశారు. అంటే అప్పుడు కూడా ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా!. ఆ తర్వాత 2019 ఆగస్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కంపెనీని రద్దు చేసింది. ఈనాడు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనూ లేదు.అంటే పొరపాటున ఎవరో జర్నలిస్టు నిజాలు రాసేయడంతో వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడడం కోసం సంపాదకీయం రాశారని అనుకోవాలి. ఆ తర్వాత మళ్లీ ‘భోలే బాబా కంపెనీ’గా పేరు మార్చుకుని ఇదే సంస్థ మోసం చేసిందని సిట్ తెలిపింది. మరికొన్ని కంపెనీలు 2013 నుంచి నెయ్యి సరఫరాలో ఉంటున్నాయి. వాటికి ఈ బోలేబాబాతో సంబంధాలు ఉన్నాయా? లేదా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో తిరస్కరించిన నెయ్యిని తిరిగి ఆగస్టులో ఎలా అనుమతించారు?. దీనికి టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించదా?. అసలు 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన కంపెనీల గురించి ఎందుకు విచారించలేదు? జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినందుకు సంతోషించాల్సి టీడీపీ ఎల్లో మీడియా అందుకు విరుద్ధంగా గగ్గోలు పెడుతున్నాయి?. ఇదేనా వీరి భక్తి? హిందూ మతోద్ధరణ? కేసులో ఎలాగొలా టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలను ఇరికించలేకపోయామే అన్నది తప్ప ఇంకొకటి కాదు. అదేదో తమ సొంత సిట్ అయి ఉంటే ఈపాటికి ఎన్ని అరెస్టులు జరిగేవో!. ఎంత బురద వేసేవారమో కదా అన్నది వారి భావన కావచ్చు. ఇదే టైమ్‌లో అప్పట్లో టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిల గురించి ఎందుకు ఎల్లో మీడియా రాయడం లేదు? దీనిని బట్టే వీరి కుట్ర బుద్ధి అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేయడం కొత్త కాదు. ఎన్టీ రామారావును పదవి నుంచి దించివేసిన తర్వాత ఆయనపై ఎన్ని నిందలను మోపింది తెలిసిన విషయమే. గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానాలు, డాక్యుమెంటరీ తీయడం కోసం సాధారణ భక్తులందరినీ నిలిపివేయడంతో తొక్కిసలాట జరిగితే కుంభమేళాలో జరగడం లేదా? రోడ్డు ప్రమాదాలలో జరగడం లేదా? అని దబాయించారు. తుని వద్ద రైలు దగ్దం జరిగితే, అది తన ప్రభుత్వ వైఫల్యం అని అంగీకరించకుండా రాయలసీమ నుంచి గూండాలు వచ్చి దహనం చేశారని ఆరోపించారు. కానీ, గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలపై కేసు పెట్టారు. కందుకూరు, గుంటూరులలో ఆయన సభలలో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృతి చెందితే అది పోలీసుల వైఫల్యం అని విమర్శలు చేశారు. అదే వైఎస్ జగన్ టూర్లో ఒకరు ప్రమాదానికి గురైతే మాత్రం అదంతా కారులో ప్రయాణిస్తున్న జగన్ తప్పని కేసు పెట్టించారు.అలాగే ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది ఆయనే. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర పోషించారు. అది వారికే ఎదురు దెబ్బ తగలడంతో జనాన్ని మోసం చేయడం కోసం కల్తీ జరిగిందంటూ లడ్డూ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి చంద్రబాబు అండ్ కో వెనుకాడటం లేదన్న విమర్శ వస్తోంది. పార్టీ వారితో విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు కూడా పెట్టిస్తున్నారంటే శాంతిభద్రతలపై ఎంత శ్రద్ద ఉన్నది అర్ధం చేసుకోవచ్చు. అదే పని వైఎస్సార్సీపీ వారు చేసి ఉంటే ఈ పాటికి పోలీసులు ఎన్ని కేసులు పెట్టేవారో!. అయితే, అన్నిసార్లు ఎదురుదాడి ఫలించదు. కూటమిలో చాలామంది ఈ పరిస్థితికి చింతిస్తున్నారు. కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఎల్లో మీడియా భజన బృందం సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ వికృత విన్యాసానికి ఫుల్ స్టాప్ పడడానికి ఇంకెంత కాలం పడుతుందో!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మరీ ఇంతలా దిగజారాలా?
ఏపీలో కూటమి నేతల ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య అస్సలు పోలికే ఉండటం లేదు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత కూడా అబద్ధాలు వల్లెవేయించడం కూటమి నేతల దిగజారుడు తనానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్నేళ్లుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయిందని చదివించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం క్షీణించిందని గత ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ఆవిష్కరణ, సంస్కరణలు, సమీక్షలు చేస్తోందని, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్‌తో పలికించారు. రాష్ట్రం కోలుకుంటోందని, మార్పు వైపు ప్రయాణం మొదలైందని, స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలను అమలు చేస్తున్నామని అనిపించారు. గవర్నర్ మాటలలో కొత్తదనం లేకపోవడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంపై బురదచల్లడం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న భ్రమ కల్పించడానికి ఈ ప్రసంగాన్ని వాడుకోవడం ఇంకో ఎత్తు. సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల వంటి జాతీయ ఉత్సవాలలో అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేసింది చెబుతూంటారు. గవర్నర్ ప్రసంగంలో ఆ భాగం ఉన్నట్లు మీడియాలో కనిపించలేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తరచు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. గవర్నర్‌తో కూడా ఆ మాట చెప్పించి ఉండకపోతే అది మంచి విషయమే.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు ఇప్పటికైతే గాలికి వదిలేసినట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆవిష్కరణలు ఏమిటో, అభివృద్ది పునరుద్దరణ ఎక్కడ జరిగిందో ఎవరికి కనిపించదు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు వ్యవస్థలను నీరు కార్చడం, వాటి పేర్లు మార్చి తామే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓడరేవులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం నిలిపి వేయడం అభివృద్ది ఎలా అవుతుంది? గవర్నర్ తన స్పీచ్‌లో రాష్ట్రంలో మార్పు మొదలైందని అనడంలో కూటమి ఉద్దేశం ఏమిటో కాని ఆ మార్పు ప్రజలకు అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా? అన్నది సమీక్షించుకోవాలి. విశాఖపట్నంలో తమ సమీప బంధువు, లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్‌కు చెందిన గీతం కాలేజీ ఆక్రమించిన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడానికి కార్పొరేషన్ చర్చ లేకుండా తీర్మానం చేయడం ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు కాబోలు. ఇందుకోసం ఫిరాయింపుల ద్వారా విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో మార్పుగా భావించాలి. ఈ భూమి విలువ సుమారు రూ.ఐదువేల కోట్లు అంటున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్నపాటి సంశయాన్ని కూడా వదిలేసి అధికారం అండగా బంధుప్రీతికి పాల్పడటం కూటమి తాలూకూ లేటెస్ట్ మార్పు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వంటి వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం మరో మార్పు. విశాఖలో ఒక మీడియా సంస్థకు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. ఇదే విశాఖలో వేలాది మంది నివసిస్తున్న దేవాలయ, ప్రభుత్వ భూములను రెగ్యులైరైజ్ చేయకపోవడం గీతం కాలేజీ యాజమాన్యంతోపాటు కొందరు నేతలు,పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేసిన భూములను గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వాటిని ఆక్రమణదారులకే ధారాదత్తం చేయడానికి వెనుకాడకపోవడం ఏ రకమైన మార్పో? వైసీపీ పాలన సమయంలో విజయసాయిరెడ్డి బంధువులు భూమి కొనుగోలు చేసినా, అదంతా దందా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు ఈ కబ్జాలకు వంత పాడుతుండడం కూడా మార్పే. గవర్నర్ ప్రసంగం ద్వారా అమరావతి రాజధానితోనే అన్ని జరిగిపోతాయన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. ఆ క్రమంలో మళ్లీ సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం తలపెట్టడంపై అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న దానిపై మాత్రం భరోసా ఇచ్చినట్లు కనిపించలేదు. కేంద్రం ఏదో అమరావతిని అవకాశాల గని అని పేర్కొందని ఎల్లో మీడియా తెలిపింది. ఒకప్పుడు కాణి ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అప్పుల ఊబిలో దింపుతున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమా? కాదా? అన్న దానిపై గవర్నర్‌తో వివరణ ఇప్పించి ఉంటే సబబుగా ఉండేది!. పేదరికం లేని సమాజం, ఉపాధి నైపుణ్యం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండ్ స్మార్ట్ గవర్నెన్స్ అంటూ పడికట్టు పదాలను గవర్నర్ స్పీచ్ వాడారు. వీటితో ఏపీ స్వర్ణాంధ్రగా మారిపోతుందని ప్రజలను నమ్మమంటున్నారు. కాని ఇది నిత్యం చెప్పే అబద్దాలలో భాగమేనని ప్రజలకు తెలియదా! సమాన అవకాశాలు కల సమాజాన్ని నిర్మిస్తున్నామని గవర్నర్‌తో చెప్పించారంటే అంతకన్నా పెద్ద అసత్యం ఉంటుందా? ప్రభుత్వం నిర్మించవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. విశాఖలో అతి ఖరీదైన ప్రభుత్వ భూములను పెద్ద, పెద్ద కంపెనీలకు వారు అడగకపోయినా 99 పైసలకే కట్టబెడుతున్నారు. ఇది అన్నిటికంటే అతి పెద్ద మార్పుగా ఏపీ ప్రజలు చూస్తున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కేవలం అమరావతిలోనే వ్యయం చేస్తున్నారు. హామీలు అమలు చేయండంటే పీపీపీ అంటున్నారు. అప్పులు, అవస్థలు ప్రజలకు, ప్రభుత్వ సంపదను కొంతమంది బడాబాబులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుతో ఎంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో క్షీణించిన శాంతిభద్రతలు చెబుతాయి. చివరికి అనుచితమైన విద్వేషపూరిత రాతలన్న ఫ్లెక్సీలకు టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని కాపలా కాస్తుంటే, పోలీసులు భద్రత కల్పించడమే మహా మార్పు. పంతొమ్మిది నెలల్లో తెచ్చిన రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులతో రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సేఫ్ గా ఉందని అనుకోవాలా? లేక అన్‌సేఫ్‌గా మారుతోందని భయం కలుగుతుందా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
2029లో వచ్చేది జగనే... ఊహించని దెబ్బ ఖాయం!
-
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్‌ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్‌ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్‌లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్‌ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్‌పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్‌కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్‌దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా?
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సిట్ ఛార్జ్‌షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!. సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్‌లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి. జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్‌లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్‌ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు. లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు. 2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఎల్లో మీడియా వారు సమర్పించు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటీకరణ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రైవేటు వారికి రాసివ్వడానికి కూటమి ప్రభుత్వం భూమిక సిద్ధం చేస్తోంది. ఇందుకు ఎల్లోమీడియా ఈనాడు విషపూరిత కథనాల ప్రచురణతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడింది. ‘అభివృద్ది కోసమే పీపీపీ’ అంటూ ఇటీవల ప్రచురించిన కథనం ఈ కోవలోనిదే. వీటి ప్రకారం.. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలతోపాటు పోర్టులు తదితర ప్రాజెక్టులు కూడా ప్రైవేటుపరం కానున్నాయి. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి కేటాయిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’’ అనిపించకతప్పదు. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పనంగా ప్రజల సొమ్ము అప్పగించి వారి సంపద పెంచే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోండటం గమనార్హం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే ఈనాడు ఇలాంటి కథనం ప్రచురించడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కూడా సొంతంగా వైద్యకళాశాలలను నిర్మిస్తుంటే.. చత్తీస్‌గఢ్‌లోనూ ప్రభుత్వమే కళాశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం అన్ని వసతులూ సమకూర్చి సిద్ధం చేసిన కాలేజీలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తారట. దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని కాపాడగల వైద్యకళాశాలకు రూ.5,000 కోట్లు కేటాయించలేక... రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగిస్తారన్న మాట. అన్నీ సిద్ధంగా ఉన్న కాలేజీలకు టెండర్లు పిలిస్తే అది ప్రభుత్వ సమర్థత అని పొగిడే స్థాయికి ఈనాడు దిగజారిపోయింది. పైగా పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే వైద్యకళాశాలలను కట్టడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతని కూడా నిస్సిగ్గుగా రాసుకుంది ఈనాడు. అలాగే రాష్ట్ర వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేయగల సామర్థ్యమున్న పోర్టుల నిర్మాణంపై కూడా ఈనాడు జగన్ ప్రభుత్వంపై ఆడిపోసుకుంది. ప్రైవేటు వారికి అప్పగించడాన్ని సమర్థతగా చెబుతోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన తరువాత రాష్ట్రాన్ని మౌలిక వసతుల సమస్య వేధిస్తోందని ఈనాడు రాసింది. మరి... మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామ, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రుల బాగుచేత వంటివన్నీ మౌలిక వసుతులు ఎలా కాకుండా పోయాయో కూడా ఈనాడు వివరించి ఉండాల్సింది. రిషికొండపై జగన్ రూ.250 కోట్లతో సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఒక ఆస్తిని సమకూరిస్తే దాన్ని ప్రైవేటువారికి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆత్మవంచన చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పీపీపీ కింద ప్రాజెక్టుల చేపట్టడానికి ప్రతిపాదనలు అడిగితే ఏపీ రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కోరిందట. విచిత్రంగా ఈ జాబితాలో ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన మూలపేట, రామాయంపేట పోర్టులు ఉన్నాయి. రామాయంపేట పోర్టులో ఒక బెర్త్ పూర్తయ్యేదశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, నాగార్జునసాగర్, కుప్పం, అమరావతి ఎయిర్ పోర్టులు పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయానికి విమానాలే రాని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలకు ఎవరు వస్తారు? విశాఖ, విజయవాడ విమానాశ్రయాలే నష్టాలలో ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలకు ఆశపడి మాత్రమే ఎవరైనా ఈ చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు కట్టేందుకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలను ఎగవేసినా అడిగేవారు ఉంటారా?అన్నది సందేహం. దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందో అందరికి తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీలకు చెందిన కొందరు ప్రముఖులు వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి హాపీగా పదవులలో ఉంటున్నారు కదా! ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అమలైతే ఆ జాబితాలోకి మరింత మంది చేరవచ్చేమో! వీటితోపాటు అప్పర్ సీలేర్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి పరషరా పథకం ప్రైవేటువారికి అప్పగిస్తారట. వారు ఈ స్కీమ్‌ను అమలు చేశాక డబ్బులు తిరిగి రాబట్టడం కోసం ఎంత వసూలు చేస్తారో తెలియదు. అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, తిరుపతి క్రీడా ప్రాంగణం, తిరుపతి బస్టాండ్ మొదలైనవి ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నట్టు ఈనాడు తన కథనంలో చెప్పింది. వీటన్నిటిలో ఒకటి అరా ఏమైనా పూర్తి అవుతాయేమో చెప్పలేం. ఏ ప్రైవేటు వ్యక్తి తన సొంత డబ్బు వినియోగించి ప్రజలకు సేవ చేయడు. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులలో అధిక శాతం బ్యాంకు రుణాల రూపంలోనే తీసుకుంటారు. ఎటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ సొమ్ము వస్తుంది. అయినా నడపలేక చేతులెత్తేస్తే చేసేదేమీ ఉండదు. బాగా నడిచేవి ఉంటే అవన్ని ప్రైవేటు వారికి సొంత ఆస్తులుగా మారతాయి. పైగా వాటిని వినియోగించేవారి నుంచి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తారు. రోడ్లకు, పేదవాడికి ఉపయోగపడే వైద్యకళాశాలలకు తేడా లేకుండా ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. గతంలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లోనే వాటిలో అధిక భాగం మూతపడడమో, లేక ప్రైవేటు వ్యక్తుల పరమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే, వాటిలో అధిక భాగం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి వారికి సంపద తెచ్చిపెట్టాయి. స్థూలంగా చూస్తే లాభాలు వస్తే ప్రైవేటుకు, నష్టాలు వస్తే ప్రభుత్వానికి అన్నమాట. ఇదే అభివృద్ది అని జనం మోసపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ ప్రక్రియ మళ్లీ మొదలవుతోందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దావోస్ సదస్సు విహారయాత్ర?
దావోస్ సమావేశాలు నిజంగానే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయా? లేక అవి విహార యాత్రల్లా మారిపోయాయా? ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లి సాధిస్తున్నది ఏమిటి? పదిహేనుసార్లు దావోస్‌కు వెళ్లి రికార్డు సృష్టించినట్టు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ భారీ కంపెనీ లేదా పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకువచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే నిరాశే ఎదురవుతుంది.ఎందుకంటే.. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి చేస్తున్న దావోస్ పర్యటనలు మొత్తం సొంత డబ్బాలకే వాడుకుంటున్న భావన కలుగుతుంది. ప్రజా ప్రయోజనం ఎంతో కాని, ప్రభుత్వ నేతలకు మంచి టైమ్‌పాస్ అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అలా అని ఇవి పూర్తిగా నిష్ప్రయోజనమనీ చెప్పలేము కాని కాలక్రమంలో షో బిజినెస్‌గా మారుతోందన్నది ఆర్ధిక రంగ నిపుణుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ప్రకటనలు కొన్ని గమనించినా ఈ విషయం స్పష్టమవుతుంది.గత ఏడాది దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక్క ఒప్పందమూ చేసుకోలేకపోయింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, తదితర రాష్ట్రాలు ఓ మోస్తరు నుంచి భారీ ఒప్పందాలే కుదుర్చుకున్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటారు చూడండి.. అచ్చం అలాగే.. చంద్రబాబు అప్పట్లో ‘దావోస్‌కు వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య’ అని వ్యాఖ్యానించారు. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలని కూడా ఒక సలహా పారేశారు. అయితే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని సాగతిస్తున్నానని తెలిపారు. విశేషం ఏమిటంటే ముందుగా ఆయన సరైన సూచన ఇవ్వాల్సింది తన కుమారుడు లోకేశ్‌కే. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్లినప్పుడు గ్రీన్కో వంటి కంపెనీలతో కొన్ని ఒప్పందాలు చేసుకువచ్చారు. కానీ అప్పట్లో లోకేశ్ అండ్ కో ‘విదేశాలకెళ్లి దేశీ కంపెనీని తీసుకొస్తారా’ అని ఎద్దేవా చేశారు. ఈ రకమైన నెగెటివ్ మైండ్‌సెట్ సరికాదని చంద్రబాబు.. లోకేశ్‌కు అప్పుడే చెప్పిఉండాల్సింది.తాజా పర్యటనలో చంద్రబాబు టాటా సన్స్ ఛైర్మన్‌తో సమావేశమైన సందర్భంలో మాట్లాడుతూ గత ఏడాది దావోస్ పర్యటనతో ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తాజా పర్యటనతో కూడా సత్ఫలితాలే అని అన్నారట. అప్పుడేమో మిథ్య అన్నారు.. ఇప్పుడు మాత్రం బోలెడంత పెట్టుబడి వచ్చిందంటున్నారు. ఏది నిజం? ఈయన అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? అది రాష్ట్రానికి అప్రతిష్ట కాదా?. ఏపీ ఈసారి కూడా పెట్టుబడి ఒప్పందాలు ఏవీ చేసుకున్నట్లు కనిపించలేదు. అందువల్లే తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు పత్రికలో చంద్రబాబు దావోస్‌లో తొమ్మిది సెషన్లు, సమావేశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీ పెంచేలా ప్రసంగించారని రాసింది. అంతే తప్ప ఇన్ని వేల లేదా లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని రాయలేకపోయింది. ఆయా రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలు అన్నీ ఆచరణలోకి వస్తాయా? రావా? అన్నది వేరే విషయం. కనీసం పెట్టుబడి పెడతామని ఆయా కంపెనీల సీఈవోలు హామీ కూడా ఇవ్వలేదన్నమాటే కదా!.కాకపోతే చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్ పెట్టుబడులు పెట్టాలని బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్.ఎమ్.జడ్‌ను కోరితే వారు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి తాటికాయంత అక్షరాలతో రాస్తూ ఆ కంపెనీ రూ.91 వేల కోట్ల పెడుతుందని, లక్ష ఉద్యోగాలు వస్తాయని గప్పాలు కొట్టింది. తీరా చూస్తే ఆ కంపెనీ టర్నోవర్ రూ.500 కోట్లు కూడా లేకపోగా ఉద్యోగుల సంఖ్య వెయ్యి మంది మించడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ కంపెనీతో లక్ష ఉద్యోగాలు ఎలా వస్తాయో తెలియక నిపుణులు తలపట్టుకుంటున్నారు. పోనీ ఈనాడు రాసినట్లు ఏపీ బ్రాండ్ ఇమేజీని చంద్రబాబు, లోకేశ్‌లు పెంచారా అంటే ఉన్న పరువు కూడా తీశారన్న విమర్శలు వస్తున్నాయి. లోకేష్ 16 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలని, ఆ సందర్భంలో తాను ఏమి చెబుతున్నానో మర్చపోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని ఒక ఇంటర్వ్యూలో అనడంతో జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నట్లయింది.‘ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త’ విధానం తెచ్చానని, కనీసం లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం నాడు ప్రకటించానని, ఈ ఏడాది ఐదు లక్షల మంది స్త్రీలను తీర్చిదిద్దాలని ప్రకటిస్తున్నానని చంద్రబాబు మరో సమావేశంలో అన్నారు. ఈ లక్ష్యం సాధిస్తే తర్వాత పది లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది తన ఆలోచన అని దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తల గోష్టిలో చెబితే వాళ్లు ఏమనుకుంటారు? పైకి ఏం అనకపోయినా తర్వాత అయినా నవ్వుకోరా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌ను హైదరాబాద్ తెస్తానని అంటూ కొన్ని అతిశయోక్తులు చెప్పినా తన గురించి కాకుండా.. తెలంగాణ, హైదరాబాద్‌లను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. సుమారు రూ.29 వేల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. రేవంత్ తన ఇంటికి సమీపంలో ఉండే గ్రీన్ కో సంస్థతో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, రాజీవ్ శుక్లాలు సైతం దావోస్‌లో ఎంఓయూల తీరును ఆక్షేపించడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే తన మంత్రివర్గ సభ్యుడు ప్రభాత్ లోధాకు చెందిన కంపెనీతో రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకున్నారని జైరాం రమేష్ సెటైర్లు చేశారు.2014-19 టర్మ్‌లో చంద్రబాబు దావోస్ పర్యటనలో చేసిన ప్రకటనలు, రాసిన వార్తలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూడండి. ఏపీకి రక్షణ పరికరాల సంస్థ లాక్ హీడ్, హైబ్రిడ్ క్లౌడ్, రాష్ట్రానికి సౌదీ అరాంకో, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, అలీబాబా రెండో డేటా సెంటర్ ఏపీలోనే.. రాష్ట్రానికి ఎయిర్ బస్, రాష్ట్రానికి 150 సంస్థలు, ఇలా అనేక శీర్షికలతో ఎల్లో మీడియా జనాన్ని ఊరించింది. వాటిలో ఒక్కటైనా వచ్చిందా? ఈసారి కూడా అదే రీతిలో ఎల్లో మీడియా ఎలివేషన్ ఇస్తూ, ఏపీ బ్రాండింగ్ @దావోస్ అంటూ పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. అంటే దీని అర్థం ఈ విడత కూడా పెట్టుబడులు పెద్దగా ఆశించవద్దనే కదా! దీనివల్ల ఒక నష్టం కూడా జరుగుతోంది. గతంలో బ్రాండ్ ఇమేజీ లేదని మనమే దావోస్‌లో డప్పు కొట్టుకున్నట్లుగా ఉంది. పైగా 99 పైసలకే భూములు ఇస్తామన్న ప్రచారం వల్ల రాష్ట్ర ఇమేజీ పడిపోయిందో, పెరిగిందో ఆలోచించుకోవచ్చు.ఇక రెడ్‌బుక్ అరాచకాల విషయం జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అనుభవమే. దావోస్ వరకు వెళ్లి తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం అంతా గమనించారు. దావోస్‌లో తెలుగువారి పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు లేదా అభిమానుల సమావేశం పెట్టి వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్‌ను విమర్శించడం వల్ల ఏపీకి ఏం మేలు కలిగినట్లు!. సీపీఎం నేత బీవీ రాఘవులు దావోస్ పర్యటనలను ప్రజాధనంతో జరిగే తీర్ధయాత్రలుగా అభివర్ణించారు. దావోస్‌లో చంద్రబాబు, లోకేశ్‌లు సొంత డబ్బా కొట్టుకున్నారని, చంద్రబాబు బ్రాండ్ ఇమేజీతో కాకుండా, తెలుగుదేశం బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు ప్రజలకు కనిపిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.ప్రముఖ ఆర్థిక మీడియా సంపాదకురాలు సుచేత దలాల్ ఒక ట్వీట్ చేస్తూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ సదస్సులో పాల్గొనడం ఒక నవ్వులాటగా మారిందని వ్యాఖ్యానించారు. దావోస్ వ్యవహారం అంతర్జాతీయ ఇబ్బందికర వ్యవహారంగా మారిన సంగతిని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ప్రజాధనంతో ముఖ్యమంత్రులు దేశంలో చేసుకోగల ఒప్పందాలను దావోస్‌లో చేసుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల ప్రచార ఆర్భాటం అసహ్యం కలిగిస్తోందని, ప్రపంచం నవ్వుతోందని సుచేత వ్యాఖ్యానించారు. ఏపీ అనుభవం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తాయి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దావోస్ దారి ఖర్చులూ కలిసిరాలేదట.. నిజమేనా?
‘‘టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేము పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు...’’ -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యాఖ్య..‘‘దావోస్ వెళ్లింది పెట్టుబడుల కోసమా? లేక చెత్త ఏడుపు గొట్టు రాజకీయం చేయడానికా? అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లు అయినా మిగిలేవి కదా రాజా!..’’ - సోషల్ మీడియా ప్రముఖుడు పి.వి.ఎస్.శర్మ జవాబు.‘‘ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనం అంతా బ్లైండ్‌గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది’’- లోకేశ్ ప్రసంగంలో ఇంకో భాగం.‘‘నిజమే.. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఇస్తున్నారు కదా! చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా’’- సోషల్ మీడియాలో పలువురు సంధించిన వ్యంగ్యాస్త్రం..‘‘పరిశ్రమలు తేవడానికి లోకేశ్ బాగా కృషి చేస్తున్నారు. ఆయన చొరవ వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది’’ - చంద్రబాబు నాయుడు ప్రశంస..‘‘విశాఖలో జగన్ తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్‌ను గూగుల్‌గా మార్చి క్రెడిట్ చోరీ చేసి, అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారుగా’’- నెటిజన్ల వ్యాఖ్య..పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌లు అక్కడ తెలుగు వారితోనో, తెలుగుదేశం వారితోనో ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. సహజంగానే ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లడం దేనికన్న చర్చ వస్తుంది. ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చంద్రబాబు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు విస్మయంతో ‘‘23 లక్షల కోట్లా’’ అని అనగానే.. వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లు అని, మరోసారి ప్లస్ 22 లక్షల కోట్లు అని చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం విమర్శలకు గురైంది.వయోభారం వల్లో, తడబాటు వల్లో లేక ఇంకో కారణమో తెలియదు కానీ.. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటల్లో పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ బ్రిటిష్ వారితో పోరాడిందని చెప్పడం.. హైదరాబాద్‌ను నిర్మించింది, అభివృద్ధి చేసిందీ, ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేందీ తన వల్లనేనని పదే పదే చెప్పుకుంటూండటం.. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని, ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రమోట్ చేసింది తానేనని, 1984 నుంచి ఈ దేశంలో ఐటీకి మారుపేరు తానేనని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించి, తానే పూర్తి చేశానని, త్వరలో ఏపీకి డ్రోన్ టాక్సీలు వస్తున్నాయని, ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని.. చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేశారీయన.అసత్యాలు మాట్లాడడంలో చంద్రబాబు దిట్ట అని ఒకప్పుడు రాజకీయ నేతలు అనుకునేవారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే ఎద్దేవ చేశారు. ఇప్పుడు అబద్ధాలకు పొంతనలేని అతిశయోక్తులు, అసందర్భ వ్యాఖ్యలు తోడయ్యాయి. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ కాలంలో ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతూండటం కొసమెరుపు. మభ్యపెట్టేందుకు, బాబే తోపు అనేందుకు ఎల్లో మీడియా బాకాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండనే ఉన్నాయి.చిత్రమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఇప్పుడ తండ్రి బాట పడుతున్నారు. రెడ్‌బుక్ అంటూ ఇప్పటికే అరాచకాలు సృష్టిస్తున్న లోకేశ్, అహంభావ పూరిత వ్యాఖ్యలు, అబద్దపు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తల్లి, చెల్లి అంటూ అసందర్భంగా అసత్యపు వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందుతున్నారని వారు అంటున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లో పత్రికలు, టీవీ చానళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తన బురద రాజకీయాన్ని నడిపి ఉండవచ్చునేమో కానీ.. లోకేశ్ కూడా అదే పంథాలో వెళ్లడం ప్రజలలో చులకనయ్యేందుకు దగ్గరి దారి అవుతుందన్నది స్పష్టం.ఆంధ్రప్రదేశ్‌కు నిజంగా పెట్టుబడులు వస్తుంటే, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతుంటే ఎవరూ కాదనరు. మంచిదే.కాని రాని పెట్టుబడులు వచ్చినట్లు చూపించే యత్నం చేయడం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రమ కల్పించడం లోకేశ్‌కు దీర్ఘకాలంలో నష్టం చేసేవే. తండ్రి 23 లక్షల ఉద్యోగాలని, కొడుకేమో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తోచిన అంకెలు చెబుతున్నారు. ‘‘99 పైసలకే భూములు ఇచ్చేస్తానని, అది తన ఇష్టం’’ అని అహంభావ దోరణితో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్‌లు బ్రాండ్ ఇమేజీతో కాకుండా బ్యాండ్ మేళంతో దావోస్ వెళ్లినట్లు ఉందని చమత్కరించారు.అందులో వాస్తవం ఉందన్న భావన కలుగుతుంది అదేకాదు.. ఏదో కంపెనీ పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ మెయిల్ పంపి రావద్దని సూచించారంటూ లోకేశ్ అబద్దం చెప్పారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. డెబ్బై ఐదేళ్ల వయసులో చలిని లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ చెప్పడం విడ్డూరమే. ఇలాంటి అతిశయోక్తులతో అమాయక జనాన్ని నమ్మిస్తారేమో కాని, కాస్త విజ్ఞత ఉన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్‌ను దూషించడానికి దావోస్ వరకు వెళ్లవలసిన అవసరం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబును ఆయన మామ ఎన్.టి.రామారావు ఏ విధంగా దూషించింది వివరిస్తూ సంబంధిత వీడియోలతోసహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడైనా హుందాగా ఉండవలసిన చంద్రబాబు, లోకేశ్‌లు అది మాని ఏపీ బ్రాండ్‌ను బాగు చేస్తున్నారా? లేక చెడగొడుతున్నారా అన్నది వారే ఆలోచించుకోవాలి. తన దావోస్ పర్యటనలో గత ముఖ్యమంత్రి జగన్ హుందాగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేశ్ అంటున్నారని, మరి టీమ్ 164 ముఖం చూసి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యకు జవాబిస్తారా! అంటే దారి ఖర్చులు కూడా రాలేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు ఫ్రస్టేషన్ పతాక స్థాయికి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ పతాకస్థాయికి చేరుకున్నట్టుంది. వయసు కూడా మరచిపోయి వైఎస్సార్సీపీ నేతలపై అధ్వాన్నపు దూషణలకు దిగుతున్నారు. సందర్భమేదైనా సరే ఒకటే అజెండా. జగన్‌ను, ఆయన పార్టీని తిట్టడం. ఈ వైఖరితో ప్రజల దృష్టిలో పలుచనవుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకపోవడం, పాలన గాడి తప్పి అస్తవ్యస్తంగా మారడం.. వీటన్నింటిపై ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో... వారి దృష్టి మరల్చేందుకు ఈ టెక్నిక్‌ను వాడుతున్నారేమో మరి! ఏడాదిన్నరగా రెడ్‌బుక్ పేరుతో సాగిన అరాచకాలు, కొన్ని గ్రామాల్లో దళతల కుటుంబాల బహిష్కరణ, తాజాగా సంక్రాంతి పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ పరువును ఎప్పుడో బజారున పడేశాయి. దీన్ని కవర్ చేయడానికా అన్నట్ట జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతిని వాడుకునే ప్రయత్నం జరిగింది కానీ.. ఆ సభలోనూ ఎన్టీఆర్ గురించి నాలుగు మంచిముక్కలు మాట్లాడటం కంటే వైఎస్సార్సీపీని దూషించేందుకే ప్రాధాన్యమిచ్చారు. షరా మామూలన్నట్టు ఎల్లోమీడియా ఈ వాగుడుకే తానా తందానా అని మురిసిపోయింది. చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు క్రెడిబిలిటీ సమస్యను ఎదుర్కొంటోంది. ఐదేళ్ల పాలనలో భూముల రీసర్వేతోపాటు జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను కొనసాగించలేకపోవడం ఒక కారణమైతే.. 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తన ఖాతాలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం రెండో కారణం. వీటిపై ఎప్పటికప్పుడు సాక్షి, సోషల్ మీడియాల్లో ఆధారసహితంగా కథనాలు వస్తూండటంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు ఉంది. భూమి, ఇసుక, మద్యం, గనులు, గంజాయి, డ్రగ్ మాఫియాలేవైఎస్సార్సీపీ క్రెడిట్ అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఈనాడు పెద్దక్షరాలతో ప్రచురించింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా ఇప్పటికీ మునుపటి ప్రభుత్వంపై ఏడుపే కొనసాగుతోందన్నమాట. పైగా అన్నీ అబద్ధాలు. జగన్ టైమ్‌లో జరిగాయని చెబుతున్న ఎన్ని భూ దందాలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది? ఎన్నింటిని రుజువు చేశారు? కూటమి పాలనలో అనంతపురంలో జరిగిన భూ కబ్జా ఆరోపణ మాటేమిటి? ఊరు, పేరు లేని కంపెనీలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే ప్రభుత్వ భూములు ఇచ్చేయడాన్ని ఏమనాలి? ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది ఎందుకు? జగన్ హయాంలో ప్రభుత్వమే ఇసుక విక్రయించి ఏడాదికి రూ.700 కోట్ల ఆదాయం సమకూరిస్తే మాఫియా అన్నారు మరి.. ప్రస్తుతం ఉచిత ఇసుకపై టీడీపీ నేతలు చేస్తున్న దందాలేమిటి? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారే? వీరిని అదుపు చేయలేక చంద్రబాబువైఎస్సార్సీపీపై విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. గనుల విషయానికి వద్దాం.. టీడీపీ నేతలు కుప్పంలోనే అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన వార్తల మాటేమిటి? నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు గనులు కబ్జా చేసి కప్పం చెల్లించమని డిమాండ్ చేసిన మాటేమిటి? మద్యం మాఫియా అంట! తన హయాంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని ప్రభుత్వ పరం చేశారు జగన్. విక్రయాలకు నిర్ణీత వేళలు నిర్ణయించారు. బెల్ట్ షాపులు లేకుండా చేశారు. మరి.. కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోంది? ప్రైవేటు వారికి, ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు, వారి అనుయాయిలకు షాపులు కేటాయించి, వేల సంఖ్యలో బెల్ట్ షాపులు పెట్టించి, ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకుంటోంది. ఇది కదా మాఫియా అంటే? అవి చాలవన్నట్లు టీడీపీ నేతలే నడుపుతున్న నకిలీ మద్యం ప్లాంట్ ఇటీవలే పట్టు బడింది కదా! సర్వే రాళ్ళపై నవరత్నాల బొమ్మతోపాటు జగన్ చిత్రపటం వాడడం వల్ల రూ.700 కోట్లు వృథా అయ్యాయని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. సర్వే రాళ్లు ఎందుకు వృథా అవుతాయి.ప్రభుత్వానికి చాతకాకపోతే తప్ప. మరో వైపు ప్రభుత్వ ఆఫీసులు, ఇతరత్రా, చివరికి రోడ్డు డివైడర్లపై టీడీపీ పచ్చ రంగు, జనసేన రంగులు వేయడాన్ని ఎలా సమర్థిఃచుకుంటారు. రీసర్వే మీద జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేయలేదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా! మళ్లీ దానిని ఎలా కొనసాగిస్తున్నారు. క్రెడిట్ చోరీ అంటే మాత్రం కోపం వస్తుంది. గంజాయి,డ్రగ్స్ గురించి జగన్ టైమ్‌లో ఉన్నవి, లేనివి కల్పించి ఎన్ని ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక అవి ఏ స్థాయిలో వ్యాప్తి చెందింది కనబడుతూనే ఉంది కదా! విశాఖ,గుంటూరు,తదితర చోట్ల పోలీసులకు గంజాయి పట్టుబడిన మాటేమిటి?జగన్ సొంతగా పెట్టుకుని కష్టపడి ఈ స్థాయిలో ఉన్నవైఎస్సార్సీపీని ఫేక్ అని చంద్రబాబు అంటున్నారంటే ప్రజాస్వామ్యం అంటే ఆయనకు ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు.తన అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని కబ్జా చేశారని, మానవత్వం లేదని, తనకు ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వయంగా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పటికీ ప్రముఖంగానే కనిపిస్తుంది కదా! నేర రాజకీయాలు చేస్తున్నారంటూ మరో తప్పుడు ఆరోపణ. పల్నాడులోవైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్‌ను ను టీడీపీ గూండాలు హత్య చేస్తే, అలాంటి వాటిని నిరోధించడంలో విఫలం అవడమే కాకుండా,వైఎస్సార్సీపీ వారు రెచ్చగొడుతున్నారని అనడం సీఎం స్థాయికి తగునా!ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షన్ హత్య జరిగితే పాడె మోసి రాజకీయ రంగు పులిమిన చంద్రబాబు ప్రస్తుతంవైఎస్సార్సీపీ వారిపై ఆరోపణ చేస్తున్నారు. టీడీపీ వారు వందల కుటుంబాలను గ్రామాలలోకి రానివ్వకుండా బహిష్కరణ చేస్తున్న ఘటనలను అదుపు చేయకుండా అలాంటివాటిని ప్రోత్సహించేలా ప్రభుత్వ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా సిగ్గు చేటైన విషయం ఉంటుందా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వాఖ్యాత -
బాబుగోరూ.. ఓసారి మీ మొహం అద్దంలో చూస్కోండి..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రాజకీయమంతా... అబద్దాలు, డాబుసరి కబుర్లు, వక్రీకరణలు, బురద జల్లుడులపైనే ఆధారపడి ఉంటోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి బట్టబయలైంది. గోదావరి జిల్లా రాయవరం వద్ద పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా చంద్రబాబు అబద్ధాలు బహిరంగమయ్యాయి. ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు అందరికీ అందాయా?’’ అనే చంద్రబాబు ప్రశ్నకు అసలు సమాధానమే లేకపోయింది. అందిన వారు చేతులెత్తాలంటే ఎవరూ స్పందించలేదు. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు ఒకరిద్దరిని నేరుగా అడిగారు. ‘‘అందలేదు’’ అని వారు ఠకీమని సమాధానం చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియకుండా పోయింది చంద్రబాబుకు. ఆ అసంతృప్తిని కాస్తా అక్కడి అధికారులపై విసుక్కుని తీర్చుకున్నారు. ‘‘సరిగా ఆర్గనైజ్ చేయడం రాదా’’ అంటూ జాయింట్ కలెక్టర్‌పై కూడా విసుగు చూపించారు. ఆర్గనైజ్ చేయడం అంటే రైతులను మభ్యపెట్టడం అన్న అర్థం వస్తుంది. చంద్రబాబు అప్పటికే ఒకట్రెండు కుటుంబాలతో కలిసి పొలాల్లోకి వెళ్లి పాస్ పుస్తకాలు అందినట్లు హడావుడి చేశారు. ఆయా కుటుంబాల వాళ్లు కూడా తాము సంతోషపడుతున్నట్టుగానే చెప్పారు. కానీ సభలో మాత్రం దీనికి భిన్నమైన స్పందన రావడంతో పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో ఏం జరగలేదని అందరికీ తెలిసిపోయింది. ఆ సభలో ఒకవైపు చంద్రబాబు మాట్లాడుతూండగానే ప్రజలు ఒక్కరొక్కరుగా వెళ్లిపోవడమూ కనిపించింది. నిజానికి ఈ సర్వే కొత్తగా చేపట్టిందేమీ కాదు. జగన్ సీఎంగా ఉండగా భూముల రీసర్వే చేపడితే చంద్రబాబు, ఎల్లోమీడియా విపరీతమైన దుష్ప్రచారం చేసింది. జగన్ భూములు లాగేసుకుంటారని రైతులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అధికారంలోకి వచ్చాక టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని చెబుతున్నారు. దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటి? కేంద్రం ఆదేశాల ప్రకారమే జగన్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి భూముల రీసర్వే నిర్వహించారు. అంతేకాక భూముల సర్వే పూర్తి అయ్యాక, అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు తెలపాలని, ఆ తర్వాత ప్రభుత్వం రైతులకు భూమి గ్యారంటీ పత్రాన్ని ఇస్తుందని చట్టంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ దానిని బలపరిచారు కూడా. కాని ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఇదే రీసర్వేపై చిలవలు, పలవలు చేసి, ఏదో అయిపోతుందంటూ వదంతులు సృష్టించారు. జగన్ ఫోటో ఉంటే భూములు అన్ని పోయినట్లు అబద్దాన్ని నూరిపోసి రైతులలో భయం నింపే యత్నం చేశారు. ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ అంశంపై చేసిన నీచమైన ప్రచారానికి అంతేలేదు.. ఎలాగైతే రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేని ఆపారా అంటే లేదు. జగన్ ప్రభుత్వం టైమ్‌లో నిర్వహించిన సర్వేనే కొనసాగించి, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆరంభించారు. జగన్ సర్వేని సమర్థంగా అమలు చేసినందుకు కేంద్రం ఇచ్చిన ఇన్సెంటివ్ సుమారు రూ.400 కోట్లను కూటమి ప్రభుత్వం పొందింది. ఇంత లబ్ది పొందినా, కూటమి ప్రభుత్వం రాకపోతే మీ భూములు గోవిందా అయ్యేవి అని చంద్రబాబు స్పీచ్ ఇచ్చారు. ఇది అసత్యమని ఆయనకు తెలుసు. అయినా తను ఆడిన అబద్దాన్ని నమ్మే స్థితిలోనే జనం ఉండాలన్నది ఆయన సిద్ధాంతం అన్నమాట. కాని వాస్తవం ఎప్పటికైనా జనానికి తెలియకుండా పోతుందా! సర్వే రాళ్లపై ఉన్న పటం కారణంగా రూ.700 కోట్లు వృథా అయ్యాయని అర్థం లేకుండా మాట్లాడారు. అంటే ఆ రాళ్లను వృథా చేయబోతున్నామని చెబుతున్నారు. అదే జరిగితే బాధ్యత చంద్రబాబు సర్కార్‌దే అవుతుంది కదా! మాజీ ముఖ్యమంత్రి జగన్ భూముల రీసర్వేపై ప్రతిపక్షంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఆడిన నాటకాన్ని... అధికారం దక్కిన తరువాత చేస్తున్న మోసాలను, క్రెడిట్ చోరీని మీడియాకు పూస గుచ్చినట్లు వివరించారు. ఈ విమర్శలు వేటికీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జవాబు ఇవ్వలేకపోయారు. కాకపోతే యథాప్రకారం జగన్‌ను దూషించడానికి మాత్రమే పరిమితమయ్యారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే 6800 గ్రామాలలో సర్వే పూర్తయిన విషయాన్ని అంగీకరించక తప్పలేదు. ఒక వైపు అమరావతి పేరుతో రైతుల భూములు వేల ఎకరాలను కైవసం చేసుకుంటున్న చంద్రబాబు గత ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. జగన్ 22ఎ నిబంధన తెచ్చి భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. తీరా చూస్తే ఆ నిబంధనను అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని వెల్లడవుతోంది.దీనిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నినాని సవాల్ చేస్తూ జగన్ టైమ్‌లో ఒక్క భూమిని అయినా నిషేధిత జాబితాలో చేర్చారేమో రుజువు చేయాలని అన్నారు. పైగా ఆ జాబితా నుంచి వేల ఎకరాల భూమిని విడిపించి జగన్ రైతులకు న్యాయం చేశారని అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆధునిక సర్వే వ్యవస్థనే అమలు చేస్తూ బ్లాక్, క్లౌడ్ అంటూ రైతులకు అర్థం కాని పదాలు వాడుతూ మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని నాని వ్యాఖ్యానించారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీయడం తప్ప, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. చంద్రబాబు గతంలో ఈ సేవ సర్టిఫికెట్లపై తన ఫోటో ఎలా వేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. బురద వేయడమే తప్ప, ఎదుటివారు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం చంద్రబాబు ప్రత్యేకత. రైతులను చంద్రబాబు పాస్ పుస్తకాల గురించే కాక మరికొన్ని ప్రశ్నలు వేసి ఉండాల్సింది. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వవలసిన రూ.నలభై వేలలో రూ.ఐదు వేలే ఇచ్చారు. ఆ స్కీమ్ అందిందా? లేదా? యూరియా అందుతోందా? రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయా? లేక ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ప్రభుత్వం పని చేయడం బాగుందా? అన్న ప్రశ్నలు రైతులకు వేసి సమాధానాలు తెలుసుకోవాల్సింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించడం సరైనదేనా? కాదా? 99 పైసలకే పాతిక ఎకరాలు ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తున్నాం.. మీకు సంతోషమేనా అని అడిగితే తన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నది తెలిసేది కదా!. దేశ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం బాగుందా?అని ప్రశ్నించగలిగితే ఇంకా బాగుండేది. పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో అయినా తన ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉంది చంద్రబాబుకు తెలియడం కొంతలో కొంత బెటర్.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేశ్.. ఇది పాయె.. అదీ పాయె!
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అయితే ఆంధ్రప్రదేశ్ సకల శాఖల మంత్రి నారా లోకేశ్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఈయనేమో ఐటీ, విద్యాశాఖల మంత్రి. కానీ ముఖ్యమంత్రి తనయుడిగా ఇతర శాఖలన్నీ తనవే అన్నచందంగా వ్యవహరిస్తూంటారు. ఒకపక్క రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఏటా లక్షల్లో తగ్గిపోతూంటే దాన్ని పట్టించుకోకపోగా.. ఇతర శాఖలపై పెత్తనం ఏమిటన్నది ప్రశ్న. చిత్రంగా ఎల్లోమీడియా మాత్రం లోకేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బోలెడన్ని మార్పులు తీసుకొచ్చేశారని ఊదరగొడుతూంటుంది. అందుకే చాలామంది రెండు శాఖలలోను లోకేశ్ పనితీరు అంతంతమాత్రమేనంటున్నారు. తాజా సమాచారం ద్వారా తెలుస్తున్నది కూడా ఇదే. ఎలివేషన్ ఇచ్చేందుకేమో... చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్‌కు కీలకమైన విద్య ఐటీ శాఖల మంత్రిగా చేశారు. యువకుల్లో లోకేశ్‌కు ఒక గుర్తింపు వస్తుందని కూడా భావించి ఉండవచ్చు. తల్లికి వందనం స్కీమ్ లోకేశ్ ఐడియానే అని చంద్రబాబు చెప్పడం కూడా ఎలివేషన్‌లో భాగమే. కాకపోతే ఈ పథకాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ పేరుతో మొదలుపెడితే.. క్రెడిట్ లోకేశ్‌కు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఐటీ శాఖకు సంబంధించి కూడా.. ఇదే రకమైన ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తెప్పించానికి లోకేశ్ కృషి చేసినట్టుగా చెప్పారు ఆయన. ఆసక్తికరంగా ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. బెడిసికొట్టాయి కూడా. చంద్రబాబు బ్రాండ్ చూసి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు పరుగులు పెడతాయని ఒకప్పుడు ఊదరగొట్టిన లోకేశ్ ఆ తరువాత ఆ విషయం ఎత్తకపోగా.. ఐటీ అభివృద్ది పేరుతో 99 పైసలకే ఎకరాలకు ఎకరాల భూమి కంపెనీలకు కట్టబెట్టడం మొదలుపెట్టారు. పోనీ అలాగైనా కంపెనీలు వచ్చాయా? ఊహూ లేదు. అది చాలదన్నట్టు మంత్రివర్గం స్థాయిలో తీసుకోవాల్సిన భూ కేటాయింపు నిర్ణయాలను తానే తీసుకుంటూ విమర్శలకు గురయ్యారు. తొంభై తొమ్మిది పైసలకే భూములెలా పంచుతారంటే అహంకారపూరిత ధోరణిలో తన నిర్ణయాలను సమర్థించుకుంటున్న తీరును అందరూ తప్పు పడుతున్నారు. లోకేశ్ శాఖల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర శాఖల విషయంలో జోక్యం చేసుకోవడం ,ముఖ్యంగా రెడ్‌బుక్ అంటూ హోం శాఖను తానే నడుపుతున్నట్లుగా ప్రవర్తించడం, పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటివి ఆయన ఇమేజ్ను డామేజీ చేస్తున్నాయి. గత ప్రభుత్వం విద్య,ఆరోగ్య రంంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. కాని కూటమి ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి.దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేశ్ బాధ్యులవుతారా? కాని ఏపీ ప్రభుత్వం తీరుతెన్నులు ఏ మాత్రం బాగోలేదని ఈ విషయం స్పష్టం చేస్తుంది. మీడియా కథనం ప్రకారం.. 2023-24తో పోలిస్తే చంద్రబాబు పాలనలో హైస్కూలు స్థాయి లోపు 18 లక్షల మంది విద్యార్ధులు చదువులకు దూరం అయ్యారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే ఐదు శాతం మంది తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రాథమికోన్నత స్థాయిలో ఒక శాతం, హైస్కూలు దశలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది. జగన్ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమాల ద్వారా, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విద్యపై ఆసక్తి రేకెత్తించారు. పేదలు తమ పిల్లలను పనులకు తీసుకువెళ్లకుండా స్కూళ్లలో చేర్చే అవకాశాలు కల్పించారు. ‘‘నాడు-నేడు’’ కింద ప్రభుత్వ పాఠశాల భవనాల రూపురేఖలను పూర్తిగా మార్చేసి వాటికి కొత్త కళ తీసుకొచ్చారు. స్కూల్ పిల్లలకు ఉపయోగపడే డిజిటల్ బోర్డులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్‌లు ఇచ్చారు. ఎల్లో మీడియా విష ప్రచారం చేసేది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు.అమ్మ ఒడి ద్వారా తల్లులకు ఏటా రూ.14 వేల చొప్పున ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో మెనూ గురించి కూడా శ్రద్దపెట్టారు. పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్, బూట్ల నుంచి అన్నింటినీ టైమ్‌కు అందించే ఏర్పాటు చేశారు. కానీ టీడీపీ, ఎల్లో మీడియాలు మాత్రం టీచర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి. టీచర్లు కూడా కొంత వరకూ వీరి ట్రాప్‌లో పడినట్లు చెబుతారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటివరకు ఉన్న పద్దతులను యధాతధంగా పాటించినా మంత్రి లోకేశ్‌కు మంచి పేరే వచ్చేదేమో! కానీ.. ఏడాది పాటు తల్లికి వందనం ఎగవేయడం, రెండో ఏడాది అరకొరగా మాత్రమే అమలు చేయడంతో విద్యార్థులు చదువులకు దూరమై ఉండవచ్చని చెబుతున్నారు. గ్రామాలలో, పట్టణాలలో మనీ సర్కులషన్ బాగా పడిపోయిందని అంటున్నారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నారు.దీని ప్రభావం కార్మికరంగంపై కూడా ఉంటుంది. వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారస్తులు చెబుతున్నారు. జగన్ హయాంలో వివిధ స్కీముల ద్వారా జనంలో డబ్బు చెలామణిలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో పనుల్లేక జనాలు వలస వెళుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులు పాఠశాలలకు దూరం కాకుండా చూసేందుకు ప్రయత్నించడం అత్యవసరం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అది ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమే!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికి గౌరవమే. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదమూడేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా చేయని పనిచేసి ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్‌పై అభిమానం ఉంటే ఓకే కానీ.. ప్రజాధనాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఆక్షేపణీయమే. ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్‌ను అవమానించినట్లే కూడా. ఎందుకంటే.. ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని రామరావు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు. పైగా గుజరాత్లో రూ.3,500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో రూ.మూడు వేల కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తుందా? అని అప్పట్లో బాబుగారు నిలదీశారు కూడా. ఇప్పుడు ఆ జోరు లేదనుకోండి.ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒకపక్క నిధులు లేవని నిత్యం వాపోతూ, ఇంకోపక్క ఇలా విగ్రహానికి అంత ఖర్చు పెట్టడంపై అందరి అభ్యంతరం. చిత్రమేమిటంటే ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు విలువలు లేవని, సినిమా వాళ్ల రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే, తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తిరునల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఏపీలో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి దానిని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి, మరికొందరి విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్‌ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్‌కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్లో ఈ కార్టూన్లు కూడా పెడతారా? అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు.. దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏడాదిన్నర కాలంలోనే రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే, ఎన్టీఆర్ విగ్రహస్థాపనకు రూ.1750 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు రూ.250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. నిజంగానే ఏడాదిన్నరగా నిరర్ధకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు అడుగుతుంటే, వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజల కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు. గత టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది కాని, పనులు ముందుకు తీసుకువెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా, విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ,ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్లకపోగా.. దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేవారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటివారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. నీరుకొండలో 1986 ప్రాంతంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండేది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్నివర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలియదు కాని, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1750 కోట్లు వ్యయం చేయడానికిపూనుకోవడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నమాట నిజం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు తానే రాజకీయ బురద జల్లుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం లేదంటే మంత్రులపై పట్టు పెంచుకునే క్రమంలో ఆయన చేస్తున్న విన్యాసాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నట్లుగా ఉంది. దీనికి తోడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అధికంగా నమ్ముకుంటున్నారన్న భావన కలుగుతోంది. దానివల్ల తెలంగాణ రాజకీయాలపై ఆ పత్రికలో ఏ కథనం వచ్చినా అది ఎంత వివాదాస్పదమైనా, చెత్త పలుకైనా అదంతా రేవంత్ భ్రీఫింగ్ వల్లేనని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మీడియాను ప్రమాణాలతో నిమిత్తం లేకుండా నీచమైన రాతలు రాసేవారిని నమ్ముకుంటే.. అది ఎప్పటికైనా భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక కథనం మహిళా ఐఏఎస్‌లను కించ పరిచేదిగా ఉందన్నది అభియోగం. దీనిని ఎవరూ సమర్థించరు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఖండన ఇవ్వడం, దానిపై ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పింది. అయినా తప్పు చేశారని అనుకుంటే కేసు పెట్టవచ్చు. చర్య తీసుకోవచ్చు. కాని ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. ఆ పోలీసులు విచారణ పేరుతో చట్టబద్దమైన నిబంధనలు పాటించకుండా ఆ టీవీ ఛానల్లో సోదాలు చేయడం, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరు? బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించడంతో నీళ్లు నమలడం పోలీసుల వంతైంది. అంతటితో ఆ ఉదంతానికి ఫుల్స్టాప్ పడినట్లయింది. పోలీసులు ఈ వ్యవహారంలో అతిగా చేశారన్న విమర్శలు వచ్చాయి. అది వేరే కథ. ఇంతలో ఏమి జరిగిందో కాని సడన్‌గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో ఆ గాయాలను మళ్లీ కెలికారు. వ్యాపార ప్రయోజనం కోసమో, లేక ముఖ్యమంత్రి రేవంత్‌కు ఉపయోగపడుతందని అనుకున్నారో తెలియదు కాని ఓ కథ వండి జనం మీదకు వదిలారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈ వివాదంలోకి లాగారు. ఎన్టీవీ యజమానికి సంబంధించిన కంపెనీకి బొగ్గు టెండర్ రావడానికి మల్లు భట్టి రూల్స్ మార్చారని ఆరోపించారు. పోనీ ఈ స్కామ్ వరకు రాసి ఉంటే అది వేరే విషయం అయ్యేది. అలా కాకుండా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి ఆ టెండర్ దక్కకుండా ఉండడం కోసం ఎన్టీవీ ఆయనపై అనుచితమైన స్టోరీ ప్రసారం చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయనకు మహిళలపట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు నటించారు. పనిలో పనిగా, ఆవు కథ మాదిరి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మీడియాకు స్వేచ్చ లేదంటూ ఒక పచ్చి అబద్దాన్ని కూడా జోడించారు. రాధాకృష్ణకు నిజంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన ఉంటే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన దారుణమైన అశ్లీల నృత్యాలపై ఎక్కడైనా సరైన రీతిలో స్పందించారా? ఎల్లోమీడియాలో వైసీపీ మహిళా నేతలపై కక్ష కట్టినట్లు ఎన్ని తప్పుడు కథనాలు వచ్చేవో కూడా తెలిసిందే. ఈ మధ్యనే మాజీ సీఎం జగన్‌పై నీచమైన శీర్షికలతో కథనాలు లో ప్రసారం చేశారో కూడా చూశాం. ఈయన ఒక వైపు నీచమైన రాతలు రాస్తూ, ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. తన వ్యాసంలో మల్లు భట్టిపై ఆరోపణలు చేయడంతోపాటు రేవంత్ ను అమాయకుడన్నట్లు చిత్రీకరించే యత్నం చేశారు. సిట్ వేసిన సంగతి రేవంత్‌కు తెలియదని అందులో రాశారు. దీనివల్ల రేవంత్‌కు నష్టం జరిగింది. అయితే.. రేవంత్ భ్రీఫింగ్తోనే రాధాకృష్ణ ఈ వ్యాసం రాశారా అన్న సందేహాన్ని వివిధ రాజకీయ పక్షాలు కాని, చివరికి కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు కాని అనుమానించాయి. దానికి తోడు టీవీ కథనం వచ్చిన రోజున కాని, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన రోజున కాని రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, రాధాకృష్ణ వ్యాసం రాసిన తర్వాత స్పందించడం చర్చనీయాంశం అయ్యాయి. మీడియా సంస్థలు ఆంబోతుల మాదిరి తన్నుకుని తమను అందులోకి లాగవద్దని ఆయన అనడం విడ్డూరంగా అనిపించింది. ఒక వేళ నిజంగానే రాదాకృష్ణ తప్పుడు వ్యాసం రాసి ఉంటే ఆయనపై కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఉండవచ్చు! కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోనే ఈ గొడవలన్ని బయటకు వచ్చాయన్న భావన ప్రజలలో ఏర్పడింది. దాంతో ఆ బురదను కడుక్కోవడానికి రేవంత్ స్టేట్ మెంట్ ఇచ్చి మంత్రులను బద్నాం చేయవద్దని కోరారు అంతేకాక తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు మల్లు భట్టి ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, రాధాకృష్ణ కథనం వెనుక ఎవరు ఉన్నారో తర్వాత చెబుతానని అన్నారు. పైగా తెలంగాణ వనరులు, సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత నేరస్తులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మరో మాట కూడా చెప్పారు. బీఆర్ఎస్కు లబ్ది జరిగేలా కథనాలు ఉండవద్దని అన్నారు. తనకు డామేజీ అవుతోందని అర్థం చేసుకుని ఈ వ్యాఖ్య చేసి ఉండాలి. నిజంగానే బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేయడం, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులలో ఉన్న ముగ్గురి మధ్య కాంట్రాక్ట్ కోసం పోటీ జరిగిందని, మంత్రివర్గంలో పలువురు మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖతం చేసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆయన అన్నారు. అదే ఎన్టీఆర్‌కు నివాళి అని కొత్త సూత్రీకకరణ చేశారు. అదేదైనా అయితే చంద్రబాబుకు కానుక అవుతుంది కాని, ఎన్టీఆర్‌కు ఎలా శ్రద్దాంజలి అవుతుందో తెలియదు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ఉన్న కాస్తో, కూస్తో బలాన్ని, ఆ పార్టీకి ప్రధానంగా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణలో టీడీపీ ఖతం అవడానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్‌ల పాత్ర కారణమన్నది బహిరంగ రహస్యమే కదా! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకారు. అయినా పాత వాసన వదులుకోలేక పోతున్నట్లు ఉంది. కాంగ్రెస్‌ను అంతం చేయడానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను రేవంత్ పొగడడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సంతోషిస్తారో చెప్పలేం.ఏది ఏమైనా ఈ మద్యకాలంలో పలు ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుటివారిపై బురద చల్లబోయి.. తనపై కూడా వేసుకుంటున్నట్లు ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలో నాయకత్వ కోర్సులో చేరిన రేవంత్ బీఆర్ఎస్ గద్దెలు గ్రామాలలో లేకుండా చేయాలని అనడం ఏ పాటి నాయకత్వ ప్రమాణం అవుతుందో!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాబు నువ్ సెప్పు.. ఆయన్ని కొట్టమని డప్పు!
ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోబుల్ పర్సన్ అట! కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ మేరకు ఆయనకు కితాబిచ్చినట్లు ఈమధ్యే ఈనాడు చాలా ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ భవిష్యత్తు కోసం చంద్రబాబు తన జీవితాన్నే అంకితం చేశారని కూడా ఆయన అన్నట్టు.. వీళ్లు చెప్పుకున్నారు. రాజకీయ నేతలు ఒకరినొకరు ప్రశంసించుకోవడం మామూలే కానీ.. అవి కొంచెం అతిగా అనిపిస్తే మాత్రం మెచ్చుకున్న వ్యక్తిని కూడా శంకించాల్సి వస్తుంది. ఇంతకీ నోబుల్ అన్న పదానికి అర్థం తెలుసా?.. ఉత్తమమైన, ఆదర్శవంతమైన, విశిష్టమైన రీతి అని. .. చంద్రబాబు నలభై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో పైన చెప్పుకున్నవి మచ్చుకైనా కనిపించాయా అన్నదే ప్రశ్న! అధికారం కోసం ఎంతకైనా దిగజారే అవకాశవాదం చంద్రబాబుదని ప్రత్యర్ధులు అభివర్ణిస్తారు. ముఖ్యమంత్రి పీఠమెక్కేందుకు పిల్లనిచ్చిన మామనే కూలదోసిన చరిత్ర బాబుది. ఏ ఎండకా గొడుగు అన్నట్టు ఎన్నికలొచ్చిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తులు కలుపుకున్న వైనమూ అవకాశ వాద రాజకీయాన్ని ధ్రువీకరిస్తాయి. అంతెందుకు.. ప్రస్తుత ప్రధాని.. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఉగ్రవాదని ఆరోపించింది ఈయనే. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించిందీ బాబే. వ్యక్తిగత దూషణలు బహిరంగంగా చేసిందీ ఈయనే. కానీ.. 2024 ఎన్నికల సమయం రాగానే.. అవసరాన్నిబట్టి.. అన్నీ మరచిపోయి.. బీజేపీతో పొత్తుకు వెంపర్లాడింది కూడా ఈయనే. పోనీ అధికారంలోకి వచ్చిన తరువాతైనా ఈయన తీరు ఏమైనా మారిందా? ఊహూ లేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలకు ఎలాంటి పనులూ చేయవద్దని అధికారులను ఆదేశించడం ఏ రకమైన ఆదర్శమవుతుందో ఈనాడుకే తెలియాలి. 2019లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీనే ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ మరో కేసులో ఆయనకు నోటీసు ఇచ్చింది. విచిత్రంగా.. కేంద్ర ప్రభుత్వం వాటి గురించి మళ్లీ అసలు ప్రస్తావించనే లేదు. నోబుల్ పర్సన్‌గా గుర్తించిందేమో మరి!. గడ్కరీ పొగిడిన వార్త వచ్చిన రోజునే వివిధ మీడియాలలో వచ్చిన కొన్ని వార్తలు గమనిస్తే ఇలా కూడా నోబుల్ కావచ్చా? అన్న సంశయం వస్తుంది. చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసు వచ్చింది.స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం ఇది. దీనిని తొలుత గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ, ఈడీ అధికారులే. కొంతమందిని ఈడి అరెస్టు కూడా చేసింది. వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా... చంద్రబాబు ఆదేశాల మేరకే బోగస్ కంపెనీకి రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా కొన్ని నిధులు టీడీపీ బ్యాంక్ ఖాతాలలోకి కూడా వచ్చిందని సీఐడీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు 53 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆరోగ్య కారణాలతో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. 2024లో అధికారంలోకి రావడంతో ఈ కేసును క్లోజ్ చేసే పనిలో కొందరు ప్రముఖ లాయర్లను నియమించారు. వారు ఇందుకు మార్గాలను అన్వేషించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కొత్త టెక్నిక్ ను ప్రయోగించి కేసు పెట్టిన సీఐడీ ద్వారానే ఉపసంహరించేలా చేశారు. ఈ స్కామ్‌పై ఫిర్యాదు చేసిన అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి పిటిషన్ కూడా కోర్టు అనుమతించలేదు. చంద్రబాబు నిజంగానే నోబుల్ పర్సన్ అయిఉంటే ఆ కేసు విచారణను ఎదుర్కొని తన తప్పు ఏమీ లేదని రుజువు చేసుకుని ఉండవచ్చు!. దురదృష్టవశాత్తు అవినీతి కేసులను విచారణ చేయకుండా మూసివేతకు న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించడం ఎంతవరకు మంచి సంప్రదాయం అవుతుందన్న ప్రశ్నను పలువురు న్యాయ నిపుణులు వేస్తున్నారు. మద్యం స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్‌లలోనూ చంద్రబాబు కేసులు లేకుండా చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన తీర్పు సర్టిఫైడ్ కాపీలను థర్డ్ పార్టీకి ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించకపోవడంపై కూడా పలువురు అభ్యంతరం చెబుతున్నారు.. పారదర్శకంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ ఇలా వ్యవహరించరాదన్నది న్యాయ నిపుణుల భావన. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. అది ఏమవుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితమే సాంకేతిక కారణాలతో కొందరు అధికారులపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తిరిగి విచారణకు ఆదేశించింది. అవినీతి కేసులను ఉపసంహరించే అధికారం కింది కోర్టులకు లేదని కూడా గతంలో పేర్కొంది. వీటితో సంబంధం లేకుండా చంద్రబాబు కేసుల నుంచి బయటపడడం విశేషం. ఇదంతా నోబుల్ పర్సన్ చంద్రబాబు చేయవచ్చని గడ్కరీ భావిస్తున్నారా?..పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టో, అందులోని అంశాలు, వాటిని అమలు చేయలేకపోయినా, అన్నీ చేసేసినట్లు కలరింగ్ ఇవ్వడం, మత రాజకీయాలు చేయడానికి వెనుకాడకపోవడం, చివరికి తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసినా, ఇంతవరకు దానిపై వివరణ ఇవ్వకపోవడం, తను చేసే తప్పులన్నిటిని ఎదుటివారిపై రుద్దడం, చివరికి ప్రజల ప్రాణాలకు హానికరమైన మద్యపానాన్ని ప్రమోట్ చేసేలా ఎన్నికలలో ప్రచారం చేయడం.. ఇలాంటి వాటన్నిటిని చేసినా నోబుల్ పర్సన్ అవుతారేమో తెలియదు! పోనీ ఇకనైనా అబద్దాలు చెప్పడం మాని చంద్రబాబు నోబుల్ పర్సన్ అనే పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తే సంతోషించవచ్చు.! ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్‌తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్‌కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్‌కు పేరు వస్తుందనా? లేక రేవంత్‌కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?.. చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ను విమర్శిస్తూ జగన్‌కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు. తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!. ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్‌కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్‌కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా! తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇదెక్కడి రాజకీయం పవనూ?!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి కీర్తించారు. తమిద్దరి మధ్య అరమరికలు లేవని అన్నారు. మంచిదే. తప్పు కూడా లేదు కానీ.. ఒకప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీని పెట్టి, ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరాదని, ప్రశ్నించవద్దని చెబుతూండటం ఏ రకమైన రాజకీయమన్నది మనం ప్రశ్నించాల్సిందే. స్వోత్కర్ష, కులమతాలకు అతీతమన్నట్టు, దేశం కోసమే పనిచేస్తున్నాన్న బిల్డప్పులు చూస్తే.. పవన్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్లోకి వచ్చేశారనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ఏ హామీలిచ్చి గద్దెనెక్కాము?కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది? మిగిలిన వాటి గురించి ఏం చేయాలి? వంటి అంశాల జోలికి పోకుండా సంక్రాంతి సంబరాలలో నృత్యం చేసి ప్రజలను ఆనందపెట్టామని సంతృప్తి చెందినట్లుగా ఉంది.కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని ఆయన ఎద్దేవ చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాలలో నటించవచచ్చు.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని డాన్స్ చేయవచ్చన్న మాట. పవన్ డాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం లేదు. కాని రాంబాబును ఆయన అన్నమాట గుర్తు చేయాల్సి వస్తుంది.చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాలలో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం సులువు అని ఆయన అన్నారు. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి వీక్ అయిపోతోందన్న భయమేదో పట్టుకున్నట్లుగా ఉంది.2014లో జనసేన అభ్యర్ధులను పోటీలో దించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రోజులలో ఆ కూటమికి దూరమై వామపక్షాలు, బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? 2019లో ఓటమి పాలు కాగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి ఆ పార్టీతో, తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలి కదా! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌ల పై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ తూచ్ ఎలా పెట్టారు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనన్న భయంతో 15 ఏళ్లపాటు కూటమి అంటూ కూనిరాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్య పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్లకు అర్థమవుతూనే ఉన్నాయి. పవన్ ఒక రకంగా అధృష్టవంతుడు. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించినా నోరెత్తనక్కర్లేదు. మూడు లక్షల కోట్ల అప్పు చేసినా ఎందుకు అని అడగనక్కర్లేదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టడమేమిటిన ప్రశ్నించనవసరం లేదు. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు. ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు? వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు?ఒకసారి కులం ఏమిటి? మతం ఏమిటి అని అంటారు. మరోసారి సనాతని హిందూ అంటూ ప్రజలను రెచ్చగొడతారు. తనకు కులమైనా మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని అభ్యర్ధించిన సంగతి ప్రజలు మర్చిపోతారన్నది ఆయన నమ్మకం కావచ్చు. కూటమిని ఎవరూ బలహీనపర్చనవసరం లేదు. ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ వారే కూటమిని కూల్చుతారు. పోలీసు బలగంతో, రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలోనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఏమి చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్షకు గురయ్యామని చెబితే, ఒక గ్రామంలో దళితుల బహిష్కారం వంటివి జరిగితే వాటిని చాలా చిన్న విషయాలుగా ఆయన పరిగణిస్తున్నారు. అది నిజమే అయితే ఇదే సమస్యపై వినతిపత్రం ఇవ్వడానికి రాబోయిన ఒక మహిళను ఎందుకు మూడు రోజులపాటు హౌస్ అరెస్ట్ చేశారని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతగా పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డారని వారు అడుగుతున్నారు.పవన్ ఉప్పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే. కాని దానిని చూపించి అక్కడి వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాము ఫలానా మంచి చేశామని చెప్పలేని ఆయన వైసీపీపై పిచ్చి విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. జగన్ పై, ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారు. ఆయన గత టర్మ్‌లో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది? చెప్పులు ఎలా చూపింది.. అన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రభుత్వమా? చట్టవిరుద్దంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్లు, కీళ్లు విరగగొడతానని రౌడీ భాష మాట్లాడడం.. ఇవన్ని ఎవరు చేస్తున్నారు. ఒకరకంగా జనసేన కేడర్‌ను చూసి జాలి పడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు గురి అవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్‌ది. అంతేకాదు. ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక పోలేదు. కాని టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలకు చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించవలసిందే కదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ యాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదో! మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా కూటమి నేతలే కదా! చంద్రబాబును పొగిడినంత సేపే ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనించినట్లు ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పొగుడుతూ గడిపేస్తున్నారు. పదవే పరమావధిగా భావిస్తే ఇలాగే చేస్తారేమో! ఆత్మస్తుతి, పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దానిని పవన్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉన్నదంటే ఉలికిపాటెందుకు ఎల్లోమీడియా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా వ్యవహారం మితిమీరుతోంది. బాబుపై వారి భక్తి హద్దులు దాటుతోంది. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎల్లోమీడియా ప్రతినిధులు మరింత దిగజారిపోయి వ్యక్తిత్వ హననానికి, అనుచిత, దారుణమైన భాషను వాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విషయం ఏమిటంటే.. అమరావతి మలిదశ భూసేకరణపై జగన్ ‘‘తొలిదశకే దిక్కులేదు.. మళ్లీ రెండో దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు’’ అని అనడం మాత్రమే. రెండు గంటలపాటు సాగిన ప్రెస్మీట్లో భోగాపురం విమానాశ్రయంపై బాబు క్రెడిట్ చోరీ మొదలుకొని అనేక అంశాలపై జగన్ మాట్లాడితే.. వాటన్నింటినీ వదిలేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని తమ ఊహాశక్తినంతా జోడించి కథలల్లాయి! పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. మొత్తం సమస్యను పక్కదారి పట్టించేందుకు విశ్వయత్నం చేశాయి. ఆ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయవచ్చు. విశ్లేషించవచ్చు. అంతేకానీ దారుణమైన భాషతో విమర్శిస్తారా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసిందెలా? అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ చాలాకాలంగా ఆధారాలతోసహా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు కూడా. అంతేకాదు అమరావతి ఒక కుల రాజధానిగా మారుతోందని కూడా విమర్శించారు. ఎల్లోమీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించలేదు. తొలి దశలో సేకరించిన ఏభై వేల ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి తదితర సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.రెండు కోట్లు ఖర్చు టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు కదా! ఇప్పుడు మరో ఏభై వేల ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే రూ.రెండు లక్షల కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే! రాజధాని పెద్ద స్కామ్అని, చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపికి చేసిఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా! చాలామంది నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములను పాడు చేయవద్దని కూడా చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రింకోర్టు కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణా నదికి, ఇటు కొండవీటి వాగు, తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం. నల్ల రేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి లు జగన్ మళ్లీ విషం కక్కారంటూ నానా చెత్త అంతా రాశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై వీరు ఎన్నడైనా స్పందించారా? టీడీపీ మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్ల ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ‘రివర్ బేసిన్’ అన్న పదాన్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ, ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైమ్‌లో ఆ నగరాలలో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అన్నది చెప్పలేదు. వేల కోట్ల ఖర్చు చేసి మూడు, నాలుగు వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో! అంతేకాదు.. చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి పది వేల వరకు ఖర్చుపెట్టడం కూడా మరో రికార్డే. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తోందంటూ తప్పుడు కథనాలు రాసింది.అది విషం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకు ఉంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముంపును గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటారు. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం కక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి, వదంతులు వ్యాప్తి చేసి, అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని భ్రమ కల్పించి, రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచపు రాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే, పదే రుజువు చేసుకుంటోంది.చివరిగా ఒక మాట. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే ఎందరిని బాధ పెట్టి అయినా తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లు ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా?అవును నష్టపోతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి! -
ఈసారి బాబు పప్పులు ఉడకలేదు!
ఎవరైనా మీతో అభ్యంతరకరంగా మాట్లాడితే ఏం చేస్తారు? వెంటనే ఆయనకు ధీటుగా జవాబిస్తారు. అలా కాకుండా మీ పక్కనున్న వ్యక్తిని తిట్టారనుకోండి.. దానిని ఏమంటారు? ఏదో భయంతో అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే కదా! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అదే పని చేశారు. తాను కోరితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటిస్తే చంద్రబాబు జవాబు ఇవ్వకపోగా... వైఎస్సార్ కాంగ్రెస్‌పై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు.. మంత్రులతో మాట్లాడించారు. అంతేకాక మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుని, గోదావరి జలాల గురించి, రాష్ట్రాల మధ్య సహకారం గురించి సుద్దులు చెప్పారు. పోనీ చంద్రబాబు నిజంగానే అంత చిత్తశుద్దితో ఈ విషయాలు మాట్లాడారా అంటే అదీ కనిపించదు. ఆయన విపక్షంలో ఉంటే ఒక రకం, అధికారంలో ఉంటే మరో రకం. చంద్రబాబు గత చరిత్ర అంతా ఇలా వైరుధ్యాలతోనే సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో 2011లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కొన్నిచోట్ల టీడీపీ కూడా పోటీచేసింది. ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నందున గెలిచే అవకాశాలు లేవన్న అంచనాకు వచ్చారు. అందువల్ల పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసే సానుకూల పరిస్థితులు లేవని భావించిన చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయం చేశారు. మహారాష్ట్రలో కట్టిన బాబ్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని, రెండు రాష్ట్రాల ఒప్పందానికి వ్యతిరేకంగా నిర్మించారని ఉమ్మడి ఏపీ రాజకీయ పార్టీలు ఆరోపించేవి. ఆ వివాదాన్ని చంద్రబాబు వ్యూహాత్మకంగా తన భుజాన వేసుకుని ఆ ప్రాజెక్టుపై పోరాటం ప్రకటించారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాజెక్టును సందర్శించి హడావుడి చేయడానికి సిద్దమయ్యారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 75 మందిని వెంటబెట్టుకుని దండయాత్ర మాదిరి మహారాష్ట్రకు బయల్దేరారు. ఆ రాష్ట్ర పోలీసులు దానిని అడ్డుకున్నారు. వారు పెట్టిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లే యత్నం చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని వదలిపెట్టేశారు. అయినా తమను బాబ్లి ప్రాజెక్టు వద్దకు మీడియాతో సహా అనుమతించాలని డిమాండ్ చేస్తూ అక్కడే భైఠాయించారు. ఒక దశలో లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. దీనికి ముందు రాష్ట్ర సరిహద్దులో దాదాపు గంటన్నర సేపు వీరంతా ధర్నా చేశారు.మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి రావాలంటే పాస్ పోర్టు కావాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తాము యుద్దం చేయడానికి రాలేదంటూనే అంటూనే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా హంగామా సృష్టించారు. దాంతో పోలీసులు చంద్రబాబుతో సహా ఆందోళనకారులపై కేసు పెట్టి అరెస్టు చేశారు.వారందరిని ఒక కాలేజీ ఆవరణలో ఉంచారు. .ఆ సమయంలో కొందరు నేతలు అక్కడనుంచి వచ్చేసినా, ఎక్కువమంది కేసులో ఇరుక్కున్నారు. కేసు రిజిస్టర్ కావడంతో టిడిపి నేతలు ఆందోళనకు గురయ్యారు. ఆ తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు పరిస్థితిని టీడీపీ నేతలు వివరించడంతో ఆయన ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఏపీకి తీసుకువచ్చారు. ఆ కేసు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణకు వచ్చే సమయానికి చంద్రబాబు విభజిత ఏపీకి సీఎం కావడంతో బిజీ షెడ్యూల్స్ అంటూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. అక్రమంగా నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీటి సంక్షోభం వస్తుందని ఆరోపించేవారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేది రెండు,మూడు టీఎంసీలే కావడం విశేషం. విపక్షంలో ఉండగా చంద్రబాబు వ్యవహరించిన తీరు అది. అప్పుడు రాష్ట్రాల మధ్య రాజకీయాలు వద్దని అనలేదు. ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అనేవారు. భావోద్వేగాలు రెచ్చగొడుతున్నట్లు ఆయన ఫీల్ కాలేదు. ఇప్పుడేమో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వల్ల వచ్చేవి 22 టీఎంసీలే అంటూ అర్ధం లేని వాదన తీసుకువచ్చారు. అది నిజమే అయితే రేవంత్ కు ఆ మాటే చెప్పి ఉండవచ్చు కదా! ఈ స్కీమ్ వల్ల రాయలసీమకు పెద్దగా కలిసి వచ్చేది లేదని, అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడనవసరం లేదని లేఖ రాసి ఒప్పించి ఉండవచ్చు కదా! రేవంత్ తో కుమ్మక్కై చీకటి ఒప్పందం చేసుకున్నారన్న అభిప్రాయం ఏర్పడినా చంద్రబాబు మాత్రం దానిని ఖండించలేకపోయారు. దీంతో రేవంత్ చెప్పిందంతా నిజమేనని, ఆయన డిమాండ్‌కు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను చంద్రబాబు నిలిపివేశారని ఏపీ ప్రజలకు అర్థమైంది. తన శిష్యుడుగా పేరొందిన రేవంత్ ను ఒక్క మాట అనలేకపోవడంతో ఈయనలో ఏదో భయం ఉందన్న భావన రాజకీయవర్గాలలో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లోనే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కు స్టే వచ్చిందని తొలుత ప్రచారం చేశారు. అయినా జగన్ పనులు ఎక్కడా ఆపకుండా 85 శాతం పూర్తి చేశారని వీడియోలతో సహా కధనాలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు, ఆయన మంత్రులు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టే అవసరం లేదన్నట్లు మాట్లాడి మరింత తప్పు చేశారు.ఒక తప్పును కవర్ చేసుకోబోయి మరిన్ని తప్పులు చేశారన్నమాట. పోనీ అన్ని ప్రాజెక్టులు అనుమతులతోనే ఆరంభం అవుతున్నాయా అంటే ఏ రాష్ట్రంలో అలా జరగదు.చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను అలాగే చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు అనుమతులు కేంద్రం నుంచి సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే కుడి, ఎడమ కాల్వలను తవ్వించారు. కుడి కాల్వకు టిడిపి వారే అడ్డుపడడానికి యత్నించిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు తాను అడ్డు పడడం లేదని చంద్రబాబు ఏపీలో ఆయా సభలలో చెప్పడాన్ని ఎద్దేవ చేస్తూ తెలంగాణకు చెందిన 16 ప్రాజెక్టులపై ఎపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ మీడియా వెల్లడించింది.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2015-2017 మధ్య ఐదుసార్లు చంద్రబాబు ప్రభుత్వం లేఖలు ఎలా రాశారని ఆ మీడియా ప్రశ్నించింది. ఇదే కాదు..ఓటుకు నోటు కేసు సమయంలో హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని, గవర్నర్ శాంతిభద్రతలు పర్యవేక్షించాలని, ఏపీ ప్రభుత్వం కూడా హైదరాబాదఃలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని చంద్రబాబు బృందం వాదించేది. మరో విశేషం ఏమిటంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పమంటే, కేసీఆర్ టెలిఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించేవారు. ఏపీలో కేసీఆర్‌పై కేసులు పెట్టించారు.ఆత్మరక్షణలో పడిన ప్రతిసారి ఇలా డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని చరిత్ర చెబుతోంది. అయినా ఈసారి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విషయంలో మాత్రం డైవర్షన్ రాజకీయం ఫలించలేదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


