
ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలంటే.. ప్రభుత్వ కార్యకలాపాల సమీక్షలు, లోటుపాట్ల సవరణ వంటిపై చర్చలు జరుగతాయని అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ తీరు వేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని కూడా ఆత్మస్తుతి, పరనిందకు వేదికలుగా మార్చేసుకుంటున్నారు. ఈ మధ్యే రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల కష్టాల గురించి కాకుండా రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలకే అధిక ప్రాధాన్యం లభించింది. ఒక పక్క రైతులకు యూరియా అందక నానా అగచాట్లూ పడుతూంటే.. టమోటా, ఉల్లి, తదితర పంటలకు తగిన ధరలు దొరక్క సతమతమవుతూంటే చంద్రబాబు వాటి గురించి కాకుండా దుష్ప్రచారం జరుగుతోందని ఒకసారి, అధికారుల వైఫల్యమని ఇంకోసారి మాట్లాడారు.
జగన్ హయాంలో మాదిరిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలనో ఇంకో మార్గమో చూపాలి కదా? అదేది చేయలేదు బాబు. ఈ వైరుద్ధ్యం ప్రజల దృష్టిలో పడదన్నది ఆయనగారి ధైర్యం! ఈ సదస్సుల్లో ఒక విషయమైతే స్పష్టమైంది. జగన్ హయాంలో మాదిరిగా ప్రజాభివృద్ధికి అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాలను ప్రోత్సహించరాదని చంద్రబాబు తీర్మానించుకున్నట్టు కనిపిస్తోంది. ఆరోగ్య శాఖ బడ్జెట్లో 30 శాతం కోతకు, విద్యాసంస్థల బాగుకు విరాళాలపై ఆధారపడాలన్న ఆలోచనలను ప్రోత్సహిస్తూండటం ఇందుకు కారణం. మద్యం ఆదాయం 10.29 శాతం పెరిగిందన్న సమాచారం కూడా ఏమంత ప్రజానుకూలమైన విషయం కాదు.
రాష్ట్రంలో హోం, రెవెన్యూ, మున్సిపల్ శాఖల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చంద్రబాబు ఈ సమావేశాల్లో ప్రకటించారు. పాలనపై పట్టు తప్పడం, రెడ్‌బుక్ రాజ్యాంగం పెచ్చరిల్లడం, టీడీపీ, జనసేన దౌర్జన్యాలు, కబ్జాకాండలు, ఇసుక, మద్య అక్రమ వ్యవహారలు కారణం కావచ్చ కానీ చంద్రబాబు వీటిని ప్రస్తావించడం లేదు. తనది రాజకీయ పాలనే అని బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. ఇది కాస్తా పార్టీ శ్రేణులకు గ్రీన్ సిగ్నల్‌లా మారిపోయింది. మరింత రెచ్చిపోతూ రాష్ట్రాన్ని అధ్వాన్న స్థితిలోకి నెట్టేశారు. పోలీసులు కూడా అధికారంలో ఉన్న పార్టీలతో ఒకలా.. ప్రతిపక్షాలతో ఇంకోలా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో భూముల రీసర్వే చేపడితే టీడీపీ, జనసేన ఎల్లో మీడియాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనర్థం వీరు గత ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేసినట్లే కదా?
జగన్ సీఎంగా తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చంద్రబాబు వడివడిగా అడుగులేస్తున్న ఈ పరిస్థితుల్లో తాజాగా విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకో ఆందోళనకరమైన ప్రకటన చేశారు. పాఠశాలల మౌలిక వసతులకు అవసరమైన రూ.2820 కోట్లను ఎన్నారైలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీల నుంచి సేకరించాలని సంబంధిత శాఖ మంత్రి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. లీడ్ యాప్‌లో డోనార్స్ స్పాన్సర్‌షిప్ అనే ఆప్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఓకే అనుకుందాం. ఒకవేళ ఇంత మొత్తం విరాళాలుగా రాకపోతే? మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యావ్యవస్థను మరింత నీరుగారుస్తారా? ఆరోగ్య శాఖ సమీక్షలో రూ.20 వేల వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్లో 33 శాతం తగ్గించినా డబ్బు భారీగా ఆదా అవుతుందని చంద్రబాబు అన్నారట. సంజీవని కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని అంటున్నారు. ఆ మధ్య ఈ ప్రోగ్రాం గురించి చెబుతూ మనిషి కనీస ఆయుష్షు 120 ఏళ్లు అని అన్నట్లు వచ్చిన వీడియోలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడేమో నిధులలో కోత పెట్టాలంటున్నారు. ఈ సమావేశాల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2500 కోట్ల గురించి, నెట్‌వర్క్ ఆసుపత్రుల సమ్మె గురించి ఎందుకు మాట్లాడ లేదని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం అస్సలు దొరకదు.
ప్రభుత్వానికి అందుతున్న దరఖాస్తుల్లో ఆరవైశాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవని చెప్పడం ద్వారా చంద్రబాబు గత ప్రభుత్వ సమర్థతను, ప్రస్తుత ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని బయటపెట్టుకున్నట్లు అయ్యింది. గతంలో రాష్ట్రమంతా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల పుణ్యమా అని ఎక్కడి సమస్యలక్కడే పరిష్కారమైపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సహజంగానే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతుంది. రైతు సమస్యలను కూడా ఎక్కడికక్కడ పరిష్కరించే లక్ష్యంతో జగన్ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసేసింది. ఫలితమే రైతుల ఇక్కట్లు! ఇన్ని అంశాలపై బహిరంగ చర్చ జరిపిన ఈ సదస్సులో శాంతి భద్రతల గురించి మాత్రం రహస్యంగా సమీక్షించారట. ఎందుకో మరి? పైకి ఒకలా..లోపల ఇంకోలా వ్యవహరించే తన వైఖరి బయటపడిపోతుందనా? సీఎం గారు నేరాలు 33 శాతం తగ్గాయని ఈ సమావేశాల్లో చెప్పారట. టీడీపీ, జనసేన నేతల అరాచకాలను అరికట్టేందుకు ఏం చేయాలన్నదానిపై కూడా అధికారులకు సలహా ఇచ్చారా? అలా చేయకుండా కేవలం రెడ్ బుక్‌కే ప్రాముఖ్యత ఇస్తూంటే శాంతిభద్రతల అదుపు ఎలా సాధ్యం?
కలెక్టర్లు, జిల్లా ఎస్పీల ఈ సమావేశం జరుగుతున్న తీరుపై ఎల్లో మీడియా రాసిన ఒక వార్త మాత్రం ఆసక్తికరమైంది. ‘‘సారు మారారు..’’ అంటూ ఇచ్చిన ఒక కథనంలో చంద్రబాబు టైమ్ కీపర్ అవతారమెత్తారని చంద్రబాబును కొనియాడారు. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు పది లక్ష్యాలు పెట్టినట్లు ఎల్లో మీడియా రాసింది. ఇవి ప్రజలకు ఏ మేరకు ఉపయోగమో తెలియదు. జీఎస్పీడీపీలో 15 శాతం వృద్ది రేటు సాధించాలని నిర్దేశించారు కానీ... అది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుందన్నది మరిచినట్లు ఉన్నారు. ఎక్కువమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలని వర్క్ ఫ్రం హోం విధానాలు రావాలని బాబు గారు నిర్దేశించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో వర్క్ ఫ్రం హోం నిమిత్తం చంద్రబాబు ఆయా పట్టణాలకు వెళ్లి ఏమి చెప్పారో గుర్తు చేసుకోవాలి కదా! అదేమి చేయకుండా కలెక్టర్లను దానికి బాధ్యులను చేస్తే ఏమి ప్రయోజనం? ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ పానెళ్లు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలని సీఎం సలహా ఇచ్చారు.
సీఎం ఇతర మంత్రులు కూడా వీటిని వాడుతున్నారో లేదో తెలియదు. సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వాలట.అందులో పోలీసు వ్యవస్థ భాగస్వామి కావాలట. కొత్త, కొత్త పదాలు వాడడంలో మాత్రం చంద్రబాబు దిట్ట అని చెప్పాల్సిందే. ఈ సర్కులర్ ఎకానమీ ఏమిటో, అందులో పోలీసుల పాత్ర ఏమిటో జనానికి అర్థం కాదు. రోడ్లు, హైవేలు, పోర్టుల, రైల్వేలు, విమానాశ్రయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని అవన్ని వేగంగా జరిగేలా కలెక్టర్లు చూడాలట. నిధులు ఇస్తే ఆటోమాటిక్ గా సాగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. అమరావతిలో తప్ప మిగిలిన చోట్లకు ఏ మేరకు నిధులు కేటాయించారో చెప్పి ఉంటే బాగుండేది. సంక్షేమ పథకాలు నిరాటంకంగా క్షేత్రస్థాయికి వెళ్లాలట. సూపర్ సిక్స్, ఎన్నికల మానిఫెస్టో దగ్గర పెట్టుకుని వెల్ప్ ర్ పై తగు ఆదేశాలు ఇస్తే ఏమైనా చేస్తారు కాని రొటీన్ గా మాట్లాడితే ప్రయోజనం ఏమిటి? వేగంగా అనుమతులు ఇవ్వాలని, శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలని చెప్పడం బాగానే ఉంది. కాకపోతే ప్రభుత్వంలోని వారే వాటిని చెడగొడుతున్న సంగతిని విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి . అధికారులంతా ఫిట్ నెస్ తో ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.