
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు న్యాయం చేయకపోతే రాజీనామా చేసేస్తానని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ఈ మాటల వెనుక చిత్తశుద్ధి ఎంత? అన్న దానిపై అందరిలోనూ సందేహాలున్నాయి. సినిమా నటుడైన పవన్ ఇప్పుడు రాజకీయాల్లోనూ మేలైన నటనకు అలవాటు పడిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన మాటలకు.. అధికారం వచ్చిన తరువాత చేతలకూ అసలు పొంతన లేకపోవడం ఇందుకు కారణమవుతోంది.
సముద్రజలాల కాలుష్యం పెరిగిపోతుండటం తమ ఉపాధిని దెబ్బతీస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. పిఠాపురం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. తమ సమస్యలు వినేందుకైనా ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే రావాల్సిందేనని భీష్మించుకున్నారు. అనారోగ్యం, ఇంకో కారణం చెప్పి జిల్లా కలెక్టర్ ద్వారా రాయబారం నడిపిన పవన్ వారిని కలవలేదు. త్వరలో వస్తానన్న హామీ మేరకు మత్స్యకారులు తమ ఆందోళన విరమించుకున్నారు కూడా. ఆ తరువాత.. సరిగ్గా వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటన రోజే పవన్ కళ్యాణ్ కూడా తన సభ పెట్టుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని కొందరి అనుమానం పక్కనబెట్టినా.. మత్స్యకారులను కలిసిన పవన్ ఏదైనా నిర్దిష్టమైన హామీ ఇచ్చారా? అంటే అదీ లేదు. వందరోజుల్లోపు న్యాయం జరక్కపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్న నామ్ కా వాస్తే అన్నట్టుగా ప్రకటనైతే చేశారు.

కొన్ని సినిమా డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. సమస్యను అధ్యయనం చేయాలని.. సముద్రంపైకి వెళ్లి తానే పరిశీలిస్తానని కూడా చెప్పారు కానీ.. ఏదీ చేసినట్లయితే తెలియరాలేదు. మాటలు మార్చడం పవన్‌కు కొత్తేమీ కాదు. ఈ విషయాన్ని రుజువు చేసే పలు వీడియోలు సోషల్ మీడియాలో ఏళ్లుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆయనకే చిత్తశుద్ధి ఉండి ఉంటే తాము అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చామన్న విషయం ఒప్పుకునేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతెందుకు.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ప్రకటించిన పవన్ ఈమధ్య కాలంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అనేకానేక వ్యవహారాలపై పల్లెత్తు మాట కూడా అనలేదు కదా? సొంత పార్టీ ఎమ్మెల్యేల దందాలు కానీ.. లంచాలు తీసుకుంటున్నామని బహిరంగంగానే చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నా వ్యతిరేకించలేదు సరికదా.. ఇది తప్పని చిన్న మాటైనా అనలేకపోయారు. నకిలీ మద్యంలో టీడీపీ నేతలే సూత్రధారులు, పాత్రధారులని తేటతెల్లమవుతున్నా.. పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఒట్టు.
గతంలోనూ ఇంతే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించిన చంద్రబాబుకు వపన్ దన్నుగా నిలిచాడు. సనాతని వేషం కట్టి.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు వెళ్లాయని ఆరోపించారు. వాస్తవాలు బయటపడిన తరువాత మాత్రం ఇప్పటివరకూ ఆ అంశంపై కిమ్మనలేదు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన ప్రకటనలు ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారి పొట్టకొట్టబోమని, జీతాలు పెంచుతామని బహిరంగంగానే ప్రకటించారు. అధికారం వచ్చిన తరువాత వాటి ఊసెత్తేందుకూ ఇష్టపడటం లేదు. సుగాలి ప్రీతి విషయంలోనూ అంతే. ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని అధికారం వచ్చిన వెంటనే తొలి ఆదేశం జారీ చేస్తానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదిపాటు ఆ ఊసే ఎత్తలేదే! కూతురికి న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లి రోడ్డెక్కితే మాత్రం ఆమెనే తప్పు పట్టారు. ఇంకో జనసేన నేత ఆ తల్లిపై నీచమైన కామెంట్లు చేశారు.
ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో 30వేల మంది మహిళలు కనపడకుండా పోయారని, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు తనకీ విషయాన్ని చెప్పాయని ఊరంత ఊదరగొట్టిన పవన్ అధికారంలోకి వచ్చాక ఆ ప్రస్తావనే తేవడం లేదు. తప్పిపోయింది కేవలం 34 మంది మహిళలు మాత్రమేనని స్వయంగా కూటమి నేతలే ప్రకటించారు. వాస్తవానికి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసేంత విషయం ఇది. అలాగే.. నాసిరకం మద్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, కిడ్నీలు పాడైపోతున్నట్లు హైదరాబాద్ డాక్టర్లు చెప్పారంటూ కూడా పవన్ అప్పట్లో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు అధికార భాగస్వామి టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ, పంపిణీ కర్త, కర్మ, క్రియలని తెలిసిన తరువాత నోరు కూడా విప్పడం లేదు. పవన్ కళ్యాణ్ కలుగులో దాక్కున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేయడం కూడా ఇందుకే. ఒక్కో నియోజకవర్గంలోని 500 మంది యువకులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి పరిశ్రమలు స్థాపింపజేస్తామని కూడా పవన్ గతంలో చెప్పారు. ఎందుకని ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదో ఆయనకే తెలియాలి.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్ని హామీలను అమలు చేయకపోవడం ప్రజలను వంచించడమే. రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సినంత పెద్ద విషయాలే. కానీ.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో పర్యటిస్తూ, సినిమాలలో నటిస్తూ, అటు అధికారాన్ని.. ఇటు సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటారు? తప్పుకోకున్నా ఫర్వాలేదు కానీ.. తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పినా పవన్‌కు మంచి పేరు వస్తుంది. అయితే ఆయనకు ఆ ధైర్యం ఉందా? అన్నదే ప్రశ్న.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.