‘మైనస్‌’కూ పీజీ సీటా?.. కడిగిపారేస్తున్న వైద్య నిపుణులు! | NEET-PG Eligibility Marks Slashed, Low Scoring Students Get Seats In Prestigious Medical Colleges, Sparking Nationwide Concern | Sakshi
Sakshi News home page

‘మైనస్‌’కూ పీజీ సీటా?.. కడిగిపారేస్తున్న వైద్య నిపుణులు!

Feb 9 2026 9:02 AM | Updated on Feb 9 2026 10:05 AM

Single Digit Scores Land PG Seats in Top med Colleges

న్యూఢిల్లీ: దేశంలో వైద్యవిద్యకు ఎంతో ఆదరణ ఉందనే విషయం తెలిసిందే. అయితే ఈ వైద్య విద్యలో ప్రమాణాలు దిగజారుతుండటం అందరినీ కలవరాన్ని గురిచేస్తోంది. తాజాగా ‘నీట్-పీజీ’ అర్హత ప్రమాణాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారీగా తగ్గించడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని క్లినికల్ స్పెషాలిటీల్లోని సీట్లను తక్కువ మార్కులకు కేటాయించడం వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా కౌన్సెలింగ్‌లో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు కూడా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు దక్కడం గమనార్హం.

హర్యానాలోని రోహ్‌తక్‌లోగల ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో 800 మార్కులకు గాను కేవలం 4 మార్కులు సాధించిన అభ్యర్థికి ఎంఎస్ ఆర్థోపెడిక్స్ సీటు లభించింది. అలాగే ఢిల్లీలోని ఒక ప్రముఖ మెడికల్ కాలేజీలో 44 మార్కులు వచ్చిన విద్యార్థికి  గైనకాలజీ విభాగంలో సీటు దక్కింది. జనరల్ సర్జరీ విభాగంలో 47 మార్కులకే సీట్లు లభ్యం అయ్యాయి. నాన్-క్లినికల్ విభాగాలైన అనాటమీ, బయోకెమిస్ట్రీలలో అయితే మైనస్ మార్కులు (-8) వచ్చిన వారికి కూడా రిజర్వేషన్‌ కోటాలో సీట్లు లభించడం విశేషం.

అర్హత మార్కులను పూర్తిగా తగ్గించడం వల్ల వైద్య విద్య నాణ్యత దెబ్బతినడమే కాకుండా, రోగుల ఆరోగ్య భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని సీనియర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం సీట్లు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో సామర్థ్యం లేని వారికి ప్రవేశాలు కల్పించడం వల్ల భవిష్యత్తులో నిపుణత లేని వైద్యులు తయారవుతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం.. వైద్య విద్యలో కనీస ప్రమాణాలు పాటించకపోతే అది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ విధానాన్ని సమర్థిస్తూ, ఎగ్జిట్ ఎగ్జామ్స్,  శిక్షణ ద్వారా వైద్యుల నైపుణ్యాన్ని నిర్ధారించవచ్చని అంటున్నారు. మెడికల్ ఎడ్యుకేటర్లు దీనిపై స్పందిస్తూ, సీట్లు పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా నిపుణులైన అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేవన్నారు. ప్రవేశ పరీక్షలో కనీస ప్రతిభ చూపని వారు శస్త్రచికిత్స లాంటి కీలక విభాగాల్లో రాణించడం కష్టమని, ఇది దీర్ఘకాలంలో ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మాస్ అండ్ క్లాస్: సంగీత ప్రపంచంలో బీటీఎస్‌ శాసనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement