నీట్‌–పీజీ అర్హత స్కోర్‌ను  ఎందుకు తగ్గించారు?  | Supreme Court Asks NBEMS To Explain Reasons To Reduce Qualifying Percentile | Sakshi
Sakshi News home page

నీట్‌–పీజీ అర్హత స్కోర్‌ను  ఎందుకు తగ్గించారు? 

Feb 7 2026 5:22 AM | Updated on Feb 7 2026 5:22 AM

Supreme Court Asks NBEMS To Explain Reasons To Reduce Qualifying Percentile

సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: నీట్‌–పీజీ 2025–26కు క్వాలిఫయింగ్‌ కటాఫ్‌ పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంపై వివరణ ఇవ్వాలని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంఎస్‌)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరా«ధేల ధర్మాసనం ఎదుట శుక్రవారం పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ వాదనలు వినిపించారు. 

పీజీ స్థాయిలో ప్రమాణాలను నెలకొల్పేందుకు కఠినమైన నిబంధనలు అవసరమన్నారు. ప్రత్యేకమైన కారణాలుంటే తప్ప, పీజీ ప్రవేశాలకు అర్హత మార్కులను తగ్గించరాదన్నారు. స్పందించిన ధర్మాసనం..‘సీట్లను ఖాళీగా వృథా ఉంచరాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో, ప్రవేశాల కోసం ఎక్కువ మంది అభ్యర్థులు ముందుకు రావడం లేదు. అందుకే కటాఫ్‌ను తగ్గించాల్సి వస్తోంది. 

అయితే, సీట్లను ఖాళీగా ఉంచరాదనే నెపంతో ప్రమాణాల విషయంలో రాజీ పడటం తగదన్న వాదనలున్నాయి. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని మనం వెదకాలి’అని అభిప్రాయపడింది. ఈ అంశంపై సరైన పరిష్కారంతో ముందుకు రావాలని ఎన్‌బీఈఎంఎస్‌ను ఆదేశిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. నీట్‌ పీజీ–2025 ప్రవేశాల్లో 18 వేలకు పైగా పీజీ మెడికల్‌ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. 

దీంతో, బోర్డు రిజర్వుడు కేటగిరీల అభ్యర్థుల అర్హత పర్సంటైల్‌ను 40 నుంచి సున్నాకు తగ్గించింది. దీనర్థం 800కు గాను మైనస్‌ 40 స్కోరు సాధించిన అభ్యర్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశమేర్పడింది. అదేవిధంగా, జనరల్‌ కేటగిరీ నీట్‌ పీజీ అభ్యర్థుల అర్హత స్కోరును 50 నుంచి 7కు తగ్గించారు. అయితే, ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 14, 21లకు భంగం కలిగించడమేనంటూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 4వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement