పరీక్షలను పండుగలా భావించాలి
మార్కులు ఒక్కటే పరమావధి కాదు
జీవితాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలి
బలమైన సంకల్పం ఉంటే జీవన విధానం మారుతుంది
ఆశించిన లక్ష్యం కోసం కష్టపడాలి
‘పరీక్షా పే చర్చ’లో విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచన
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం అంటే మోయలేని భారంగా భావించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కేవలం మార్కులపైనే కాకుండా జీవితాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇతరులు చెప్పేది వినాలని.. చివరకు మన జీవితానికి సంబంధించిన నిర్ణయం మనమే తీసుకోవాలని పేర్కొన్నారు. మారాలన్న బలమైన సంకల్పం ఉన్నప్పుడే మన జీవన విధానం మారుతుందని స్పష్టంచేశారు.
పరీక్షలు వస్తున్నాయంటే భయపడాల్సిన పని లేదని, పరీక్షలను పండుగలా భావిస్తూ ఆనందంగా జరుపుకోవాలని వెల్లడించారు. ‘ప్రధానమంత్రితో పరీక్షా పే చర్చ–2026’కార్యక్రమంలో భాగంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచి్చన పాఠశాల విద్యార్థులతో మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. త్వరలో పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.
ఒత్తిడిని జయించి, పరీక్షలకు హాజరైతే విజయం సొంతమవుతుందని అన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను మోదీ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పరీక్షలను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడంపై విద్యార్థులతో చక్కటి చర్చ జరిగిందని వివరించారు. ఈ వీడియోను అందరూ తిలకించాలని కోరారు. పరీక్షా పే చర్చలో ప్రధానమంత్రి ఏం చెప్పారంటే.
మనపై మనకు విశ్వాసం ఉండాలి
‘‘కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతే జీవితం మారదు. అందుకోసం జీవన విధానం మార్చుకోవాలి. విద్యను భారంగా భావించకుండా అందులో పూర్తిగా నిమగ్నం కావాలి. అరకొరగా చదివితే ఉపయోగం ఉండదు. కేవలం మార్కులే పరమావధిగా భావించకుండా జీవితంపైనా దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు, టీచర్లు, మిత్రులు ఏం చెప్పారన్నది కాకుండా మనపై మనకు విశ్వాసం ఉండాలి. ఇతరులు చెప్పేది మనసులో పెట్టుకోవాలి.
మన జీవితాన్ని మార్చే నిర్ణయం మనమే తీసుకోవాలి. ఆశించిన లక్ష్యం సమీపంలోనే ఉంటుంది. కానీ, దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. మనసును అదుపులో పెట్టుకొని చదివితే అనుకున్నది సాధించడం సులభమే. మార్కుల కోసం ఎక్కువ ఆరాట పడొద్దు. గత ఏడాది బోర్డు పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి పేరు ఎవరికైనా గుర్తుందా? చాలావరకు గుర్తుండదు. అలాంటి విద్యార్థిని కొద్దిసేపు ప్రశంసిస్తాం, తర్వాత మర్చిపోతాం. అందుకే పరీక్షల్లో మార్కులే ముఖ్యమని భావించడానికి వీల్లేదు.
చదువులో సొంత విధానం ఉండాలి
విద్యార్థుల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. చదువు విషయంలో ఒత్తిడి చేస్తుంటారు. చదివే విధానం గురించి తల్లిదండ్రులు ఒకలా, టీచర్లు మరొకలా చెబుతుంటారు. విద్యార్థులు ఇంకోలా భావిస్తుంటారు. మొత్తానికి వారిలో గందరగోళం ఏర్పడుతుంది. ఏది సరైందో నిర్ణయించుకోలేరు. ఒక ఇంటిలో తోబుట్టువుల్లోనే ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. ఎవరి సొంత విధానం వారికే ఉంటుంది. అందుకే చదువు విషయంలో మీకు ఏది నచి్చతే అదే చేయండి.
కొందరు రాత్రిపూట చదువుకోవడానికి, మరికొందరు ఉదయం పూట చదువుకోవడానికి ఇష్టపడుతుంటారు. మీకు ఎప్పుడు చదుకోవడం వెసులుబాటుగా ఉంటుందో అప్పుడే చదువుకోండి. సొంత విధానాన్ని నమ్ముకోవాలి. ఇతరుల సూచనలు జాగ్రత్తగా వింటూ.. సొంత అనుభవాల ద్వారా ఆ విధానంలో మార్పులు చేసుకోవచ్చు. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా అనుసరించాల్సిన పనిలేదు. నేను ‘పరీక్షా పే చర్చ’ను ప్రారంభించినప్పుడు కొన్నాళ్లు ఒకేలాగా కొనసాగింది. తర్వాత మెరుగుపర్చాం. వేర్వేరు రాష్ట్రాల్లో సెషన్లు నిర్వహించాం. మూలానికి కట్టుబడి ఉంటూనే ఫార్మాట్ మార్చాం.
జరిగిపోయిన దాని గురించి ఎందుకు?
విద్యార్థులు గతాన్ని తవ్వుకుంటూ సమయం వృథా చేయొద్దు. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. జరిగిపోయిన దాని గురించి నేను అంతగా పట్టించుకోను. ఇకపై ఏం జరగబోతోందో దానిపైనే నా దృష్టి ఉంటుంది. పరీక్షల్లో రాబోయే ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు మాత్రమే టీచర్లు బోధించే విధానం గతంలో ఉండేది. పరీక్షల్లో మంచి మార్కుల కోసం అలా చేసేవారు. నిజానికి ఒక మంచి టీచర్ జీవితానికి పనికొచ్చే అన్ని అంశాలూ బోధిస్తాడు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాడు. జీవితం అంటే పరీక్షలు ఒక్కటే కాదు, జీవితంలో పైకి ఎదగడానికి విద్య ఒక సాధనం. నేను ప్రధానమంత్రిని అయ్యాను. విభిన్నంగా పనిచేయండి అని ప్రజలు చెబుతుంటారు. మీరు కూడా విభిన్నంగా చదవడం ప్రయత్నించండి.
ఇంటర్నెట్‌పై సమయం వృథా చేయొద్దు
ఇంటర్నెట్‌లో గేమింగ్‌లు పక్కనపెట్టి చదువుపైనే దృష్టి పెట్టాలంటూ విద్యార్థులపై సమాజం నుంచి ఒత్తిడి ఉన్నమాట నిజమే. గేమింగ్ అంటే ఒక అభిరుచి మాత్రమే కాదు.. అదొక నైపుణ్యం. అందులో రాణించాలంటే వేగం, అప్రమత్తత అవసరం. సెల్ఫ్ డెవలప్‌మెంట్‌కు గేమింగ్ తోడ్పడుతుంది. నాణ్యమైన గేమ్‌ల్లో అనుభవం పెంచుకోండి. అదేసమయంలో చదువును నిర్లక్ష్యం చేయొద్దు. గేమింగ్‌లో జూదానికి దూరంగా ఉండాలి. జూదాన్ని అరికట్టే చట్టాలు మనదేశంలో ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు చాలా ప్రమాదకరం.
దేశంలో ఇంటర్నెట్ చౌకగా దొరుకుతోంది కదా అని దానిపైనే సమయం వృథా చేయకండి. నిర్మాణాత్మక నైపుణ్యాలు పెంచుకోవడం కోసం గేమ్‌లు ఆడొచ్చు. భారతీయ సంస్కృతి, పురాణ గాథలతో ముడిపడి ఉన్న స్టోరీ టెల్లింగ్ గేమ్‌లను అభివృద్ధి చేయండి. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటే చక్కటి గుర్తింపు లభిస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. మరింత ప్రోత్సహిస్తారు. కొత్త ఐడియాలు ఇస్తారు. పంచతంత్ర కథల ఆధారంగా గేమ్‌ను అభివృద్ధి చేయొచ్చు. మీరు క్రియేటర్‌గా మారండి. సొంతంగా సోషల్ మీడియా పేజీ ప్రారంభించండి.
విద్యార్థి ఒక అడుగు ముందే ఉండాలి
విద్యార్థి వేగం ఎల్లప్పుడూ టీచర్ వేగం కంటే ఎక్కువే ఉండాలి. అలా ఉండేలా చూసే బాధ్యత టీచర్లదే. అంటే టీచర్ కంటే విద్యార్థి ఒక అడుగు ముందే ఉండాలి. విద్యార్జనలో సమతూకం ఉండేలా జాగ్రత్తపడాలి. చదువుతోపాటు విశ్రాంతి, నైపుణ్యాలు, అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలి. లైఫ్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ అని రెండు రకాల నైపుణ్యాలు ఉంటాయి. ఆ రెండింటినీ విడదీసి చూడలేం. కేవలం ఒకదానివైపే మొగ్గు చూపితే జీవితంలో విఫలమవుతారు. రెండు రకాల నైపుణ్యాలూ సమానమే’’అని ప్రధాని మోదీ వివరించారు.
గిన్నిస్ రికార్డుకెక్కిన చర్చ
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ‘పరీక్షా పే చర్చ’2018లో ప్రారంభమైంది. ప్రతిఏటా ఆయన విద్యార్థులతో సంభాషిస్తున్నారు. వార్షిక పరీక్షల ముందు వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇది దేశంలో అతిపెద్ద విద్యా కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పరీక్షా పే చర్చలో పాల్గొనడం కోసం 2023లో 38.8 లక్షల మంది విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకోగా, 2025లో ఆ సంఖ్య 3.53 కోట్లకు చేరింది. ఈ ఏడాది 4.5 కోట్ల మంది రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది.
ఇంకా 25 ఏళ్లు ఉన్నాయి
పరీక్షా పే చర్చలో విద్యార్థులతో మోదీ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ 17వ తేదీన ఆయన 75వ జన్మదినం జరిగింది. ఈ సందర్భంగా ఓ నాయకుడు ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు 75 ఏళ్లు వచ్చాయంటూ గుర్తుచేశారు. మోదీ బదులిస్తూ.. 75 ఏళ్లు రావడం కాదు, ఇంకా 25 ఏళ్లు ఉన్నాయని చెప్పారు.
మణిపూర్ సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన ఇమోటా కె.శ్యామ్ అనే విద్యార్థి మోదీతో మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి మీరంటే ఎంతో స్ఫూర్తి అని అన్నాడు. తన పుట్టినరోజు గురించి తెలిపాడు. మోదీ స్పందిస్తూ... ‘జరిగిపోయినదాన్ని నేను లెక్కపెట్టను. జరగబోయేది మాత్రమే లెక్కిస్తా. మీకు నేను చెప్పేది ఒక్కటే. పాత విషయాల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్టు చేసుకోకండి. జరగబోయేదే ఆలోచించండి. మిగిలిన జీవితం ఎలా జీవించాలో యోచించండి’’అని సూచించారు.


