breaking news
Women Power
-
మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా
మిస్ టీన్ యూనివర్స్ ఇండియాగా ఒడిశాకు చెందిన ప్రసుచి పాండా కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఘన విజయం అనంతరం తొలిసారిగా భువనేశ్వర్‌కు వచ్చిన ఆమె అక్కడ స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఇది తనకు ఎంతో భావోద్వేగంతో కూడిన క్షణంగా అభివర్ణించింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవం, గొప్ప బాధ్యతగా పేర్కొంది. ఇది తన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని అన్నారు. కచ్చితంగా తాను తన తల్లిదండ్రులు, ఒడిశా రాష్ట్రం, గర్వపడేలా కృషి చేస్తానని చెప్పారామె. అసలు ఇలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది తన చిరకాల కోరిక అని, అందువల్ల నాదేశం మిస్ టీన్ యూనివర్సిటీ కిరీటాన్ని దక్కించుకునేలా తనవంతుగా పూర్తి అంకితభావంతో పనిచేస్తానని అన్నారామె. కాగా, టీనేజర్ల కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన 'మిస్ టీన్ యూనివర్స్' అంతర్జాతీయ పోటీలో వచ్చే ఏడాది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది ప్రసుచి. ఆమె ఎవరంటే..ధరణిధర్ పాండా, స్వప్న రాణి పాండాల కుమార్తె. ఆమె కుటుంబం ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపూర్‌లోని హిల్పట్నాకు చెందినది. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ పట్ల అమితాశక్తి ఉంది. అదే ఆమెను తన కలలను సాకారం చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లేలా ప్రేరేపించింది. అక్కడ ఆమె యువ మోడల్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రసూచి తన నాలుగేళ్ల వయసులోనే ఈ శిక్షణ ప్రారంభించి, 2026లో వృత్తిపరంగా ర్యాంప్‌వాక్‌లో అడుగుపెట్టింది. ఆమె నిరంత పట్టుదల, అంకితభావం, ఈ ప్రతిష్టాత్మకమైన మిస్‌టీన్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకునేలా చేశాయి.(చదవండి: కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్ ప్రమాదకరమా?) -
జెన్ జీ క్వీన్
పదమూడేళ్ల వయసులోనే తన ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది లియోనోర్. ‘బిడ్డా! భవిష్యత్తులో నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది’ అని భవిష్యత్ బాధ్యతల గురించి ఆరోజు చెప్పాడు తండ్రి. ఆ రోజు రానే వచ్చింది. 150 ఏళ్ల తరువాత స్పెయిన్ దేశాన్ని పరిపాలించబోయే తొలి మహారాణిగా చరిత్రపుటల్లో నిలవనుంది ఇరవై ఏళ్ల లియోనోర్....స్పెయిన్ రాజు ఫిలిప్, రాణి లెటిజియాల పెద్ద కుమార్తె లియోనోర్ స్పెయిన్ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు పదమూడేళ్లు. ప్రసంగిస్తున్నంతసేపు లియోనోర్ ఎక్కడా భయపడినట్లు కనిపించలేదు. చాలా సహజంగా, ఆత్మవిశ్వాసంతో ప్రసంగించింది.ప్రశంసల వెల్లువలియోనోర్ ప్రసంగం ముగిసిన తరువాత తండ్రి ఫిలిప్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. ‘లియోనోర్ మొట్ట మొదటి ప్రసంగం మహా అద్భుతం’ అని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. పన్నెండేళ్ల వయసులోనే స్పెయిన్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘ఆర్డర్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్’ను అందుకుంది లియోనోర్. ఏడాది తరువాత ప్రత్యేక ప్రసంగం చేసింది. రాణిగా బాధ్యతలు చేపట్టే దిశగా రాకుమార్తె సాగిస్తున్న ప్రయాణంలో ఇది ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నిలిచింది.సవాళ్లు ఎదురుచూస్తున్నాయి!ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాన్ని కూతురికి అందిస్తూ రాజు ఫిలిప్ ఇలా అన్నారు...‘నువ్వు ఎదుర్కోవలసిన సమస్యలు, సవాళ్లు, భుజాలకెత్తుకోవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. నీకు కష్టంగా అనిపించవచ్చు. కాని స్పెయిన్‌లో నీ శ్రేయస్సును కోరుకునే ఎంతోమంది నీ వెనుక ఉన్నారనే విషయం మరచిపోవద్దు’బహు భాషల్లో అనర్గళంగా...150 ఏళ్ల తరువాత స్పెయిన్‌ను పరిపాలించబోయే మొదటి రాణిగా చరిత్ర సృష్టించనున్నారు లియోనోర్. త్రివిధ దళాల్లో మూడు సంవత్సరాలు శిక్షణ పొందిన లియోనోర్ స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు చేపడతారు. ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్లాంటి భాషలు ఎన్నో అనర్గళంగా మాట్లాడగలరు. మాడ్రిడ్‌లోని ఒక యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ చదవనున్నారు.మహిళా సాధికారతపై తీసిన సినిమాల నుంచి పర్యావరణ అంశాల వరకు లియోనోర్‌కు మంచి అవగాహన ఉంది.‘సరైన సమయంలో సరైన అవకాశాలు కల్పించడం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికి ఉంది’ అంటారు లియోనోర్. నా రోల్‌మోడల్స్ వారు కాదు...నా రోల్‌మోడల్స్ ప్రసిద్ధ వ్యక్తులు కాదు. ఆకర్షణీయమైన వ్యక్తులు కూడా కాదు. తమలోని నైతిక విలువలు, కష్టపడే తత్వం ద్వారా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, తమ ప్రతిభాసామర్థ్యాలతో లోకానికి కొత్త విషయాలు తెలియజేసే వ్యక్తులు, సమస్యలకు భయపడకుండా ముందుకువెళ్లే ధైర్యవంతులు నా రోల్‌మోడల్స్.– లియోనోర్ -
తన బరువుతోనే అసలు యుద్ధం
కామన్వెల్త్... గ్లాస్గో... ఆదివారం రాత్రి. 31 ఏళ్ల మీరాబాయి చాను మళ్లీ నిరూపించింది. 48 కిలోల బరువు విభాగంలో 190 కిలోలు ఎత్తి హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్ సాధించింది. కానీ ఈ బంగారం వెనుక ఒక అదృశ్య పోరాటం ఉంది. అది తానెత్తే బరువులతో కాదు... తన బరువుతో. పన్నెండేళ్లుగా మీరాబాయి 48 కిలోల బరువునే మెయింటైన్ చేస్తోంది. 2014లో గ్లాస్గోలో ఏ బరువుతో కామన్వెల్త్లో మొదటిసారి పాల్గొందో, 2026లో గ్లాస్గోలో కూడా అదే బరువుతో పాల్గొని మూడో బంగారం తెచ్చింది. మహిళలకు వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం సహజం. కానీ మీరా మాత్రం ఒకే బరువు, ఒకే క్రమశిక్షణ. ఆమె ఫిట్నెస్ రహస్యం ఏమిటి?‘వెయిట్లిఫ్టర్లం అనగానే అందరూ మేము విపరీతంగా తినేస్తాం అనుకుంటారు. కానీ అది తప్పు, మేం చాలా తక్కువ తింటాం. బ్రెడ్, పాలు కూడా ముట్టలేము. ప్రతి గ్రాముకూ లెక్క ఉంటుంది’ అంటుంది మీరాబాయి చాను. బరువులెత్తడంలో ప్రపంచ విజేతగా నిలుస్తున్న మీరాబాయి తన బరువు విషయంలో కూడా అంతే విజేత. ‘బరువు తగ్గడం సాధ్యం కావడం లేదు’ అనేవారికి మీరాబాయి 12 ఏళ్లుగా స్థిరంగా మెయిన్‌టెయిన్ చేస్తున్న బరువు తప్పక స్ఫూర్తి కలిగించవచ్చు.ఆమె విజయం సులభం కాదుప్రపంచ వేదికల మీద పతకాలు సాధిస్తున్న మీరాబాయి జీవితం మనకు కనిపించేంత గ్లామరస్ కాదు. ‘ట్రైనింగ్‌లో పిచ్చిగా కష్టపడాలి. లేదంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం’ అంటుందామె. సాధన ఒకటే కాదు గాయాలూ వెంటాడుతాయి. 2023లో తొడ గాయం. ఈ ఏడాది భుజం నొప్పి. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళలకు సహజంగా వచ్చే మెన్స్ట్రువల్ పెయిన్‌తో బాధ పడుతూనే పోటీ రోజు వేదిక ఎక్కింది. గ్లాస్గో పోటీకి కొన్ని రోజుల ముందు శిక్షణలో చిన్న గాయం. అయినా సాధన ఆపలేదు. కోచ్ విజయ్‌శర్మతో ఉదయం 5 గంటల నుండి బరువు ఎత్తే సాంకేతికతను వేలాదిసార్లు ప్రాక్టీస్ చేయడం. ఒక మిల్లీమీటర్ తేడా వచ్చినా పతకం జారిపోతుందని ఆమెకు తెలుసు.చిన్నప్పటి నుంచి కష్టాలుమణిపూర్లోని నోంగ్‌పోక్ కచింగ్ గ్రామం మీరాబాయిది. పేద కుటుంబం. మీరాకు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. తండ్రి రోజు కూలీ. తల్లి చిన్న టీ కొట్టు నడిపేది. చదువు 12వ తరగతితో ఆగిపోయింది. కానీ ఆమెకు బలం ఉండేది. ఆరేళ్ల వయసులో అన్నయ్య మోయలేని కట్టెల మోపును తనే మోసేది. ఇంట్లో బియ్యం బస్తాలు, నీళ్ల కుండలు లేవనెత్తేది. ‘ఈ పిల్లకు చేతుల్లో బలం ఉంది’ అని ఒక కోచ్ గుర్తించాడు. పన్నెండేళ్లకే ఇంటి నుండి ముప్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఇంఫాల్ స్టేడియానికి ప్రాక్టీసుకు వెళ్లేది. అమ్మ నగలు అమ్మి, అన్నయ్య జీతం నుండి డబ్బులు ఇచ్చి పోటీలకు పంపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పుడు దేశమంతా విమర్శించింది. కానీ, ఆ విమర్శలనే ఇంధనంగా మార్చుకుని 2017లో ప్రపంచ ఛాంపియన్ గా, 2020 టోక్యోలో ఒలింపిక్ రజత విజేతగా నిలిచింది. ఈరోజు ఆమె ధరించే చెవిపోగులు రియోకు ముందు అమ్మ చేయించినవే. ‘అవి నాకు అదృష్టాన్ని తెస్తాయి’ అంటుంది.ముగింపుమీరాబాయి చాను మనకు నేర్పింది ఒకటే. బరువు తగ్గడం అంటే అందం కోసం కాదు. ఆత్మగౌరవం కోసం. ఆరోగ్యం కోసం. లక్ష్యం కోసం. శరీరం బరువు 48 కేజీలైనా ఆమె మనసు 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తోంది.‘నా శరీరం నా ఆలయం. దాన్ని బలంగా ఉంచుకోవడం నా బాధ్యత’ అంటుంది మీరాబాయి చాను. ఈ మాట ఒక్కటి చాలు. మనం కూడా మన శరీరాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి. ఆహార నియమాలుఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. 48 కిలోల క్రీడాకారిణిగా ఉండాలంటే ప్రతి గ్రామూ లెక్కే. పండగ భోజనం, జిలేబి ముక్క కూడా బరువు పెంచేస్తుంది. పోటీకి ముందు రోజులలో నీళ్లు కూడా తక్కువ తాగుతుంది. చెమట పట్టించి, సౌనా బాత్‌లో కూర్చుని ఆవిరితో ఒక్కో గ్రాము తగ్గిస్తుంది. మీరాబాయి ఫిట్‌నెస్‌కు 3 స్తంభాలు ఉన్నాయి. ఆహారం, సాధన, మానసిక బలం.1. ఆహారంఉదయం: గోరువెచ్చని నీళ్లు, తేనె, గుడ్డు తెల్లసొన, ఓట్స్, పండ్లు.మధ్యాహ్నం: ఉడికించిన చికెన్ లేదా చేప, గోధుమ రొట్టెలు, పెద్ద సలాడ్.సాయంత్రం: పాలు, బాదం, ప్రోటీన్ పానీయం.రాత్రి: సూప్, ఉడికించిన కూరగాయలు, పప్పు.నూనె, తీపి, వేయించిన పదార్థాలకు దూరం. రోజుకు 4 నుండి 5 లీటర్ల నీళ్లు. ఆకలి వేసినా నీళ్లు తాగి కంట్రోల్ చేస్తుంది.2. సాధనఉదయం: జిమ్‌లో సాంకేతిక సాధన. బరువు ఎత్తడం, పట్టు.మధ్యాహ్నం: కార్డియో, పరుగు, సైక్లింగ్, తాడు దూకడం. సాయంత్రం: యోగా, స్ట్రెచింగ్. గాయాలు రాకుండా శరీరాన్ని సాగదీయడం.ఒక్కరోజు కూడా సెలవు లేదు. ‘నా క్లాస్రూమ్ జిమ్’ అంటుంది.3. మానసిక బలం‘నా కళ్ల ముందు ఎప్పుడూ దేశ జెండా ఉంటుంది’ అంటుంది మీరా. గ్లాస్గోలో మొదటి ప్రయత్నం విఫలమైనా ఆందోళన చెందకుండా, స్మైల్ ఇస్తూ తర్వాతి రౌండ్లో రికార్డు కొట్టడం ఆమె మానసిక బలానికి నిదర్శనం. -
జస్ట్ రూ. 5వేలు, మొబైల్ ఫోన్‌తో.. రూ. 50 కోట్ల వ్యాపారం!
వ్యాపారం అనేది వినయోగదారుల అవసరం, నమ్మకం నుంచే పుడతాయని అంటారు పారిశ్రామిక నిపుణులు. ఏ బ్రాండ్ అయినా మొదట్లో చిన్నగా మొదలవుతుంది. అశేష ప్రజాదరణతోనే బ్రాండ్‌గా స్థిరపడుతుందని అంటారు. అచ్చం అలానే చాలామంది ఎదుర్కొనే, పెదవివిప్పని సమస్యను పరిష్కారం చూపుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఓ నటి. అంతేగాదు కేవలం చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టి..కోట్లలో డబ్బులు ఆర్జిస్తూ..ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప వ్యాపార సూత్రాలను చెబుతోందామె. ఆ నటి ఎవరంటే..నటిగా కెరీర్ ప్రారంభించి, వ్యాపారవేత్తగా అవతరించిన పరుల్ గులాటికి తన బిజినెస్ జర్నీ ఎలా మొదలైందో ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. చాలామంది బహిరంగంగా చర్చించడానికి సిగ్గుపడే సమస్యను పరిష్కరించి..అత్యంత గుర్తింపు పొందిన నిష్ హెయిర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మారింది. తాను దీన్ని కేవలం రూ. 5 వేలు పెట్టుబడితో మొదలుపెట్టి..ఇవాళ ఏకంగా రూ. 50 వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా మార్చినట్లు వెల్లడించింది. ఆమె ప్రస్థానం మొదలైందిలా..తాను నటిగా పనిచేస్తూ, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నప్పుడు వ్యాపారం ప్రారంభించాలనే కోరిక తనలో పుట్టిందని వెల్లడించింది పరుల్. ఆ రోజు నుంచి తనకంటూ వ్యాపారం ఉండాలని నిశ్చయించుకుని..హెయిర్ ఎక్స్ టెన్షన్లపై దృష్టిసారించినట్లు తెలిపింది. ఆమె కేవలం జుట్టు సమస్యలకు పరిష్కారాలను అందరికీ అందుబాటులో, సరసమైన ధరలలో, ఆన్లైన్లో లభించేలా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. అలా ఆమె కేవలం రూ. 5 వేలతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిజానికి 2017లో 'నిష్ హెయిర్' ప్రారంభమైనప్పుడు, క్రియేటర్ ఎకానమీ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేటిలా అభివృద్ధి చెందలేదు, అలాగే పరుల్ తన కొత్త బ్రాండ్ కోసం సెలబ్రిటీల ప్రచారాన్ని ఇష్టపడలేదు. బదులుగా ఆమెనే స్వయంగా కంపెనీ ప్రతినిధిగా మారింది. ఇది తాత్కాలికమేనని, ఆ తర్వాత ప్రముఖ తారలనే అంబాసిడర్లుగా నియమించుకోవాల్సిందేనని అనుకుంది. అప్పటి వరకు ఆమె తన ఫోన్లో వీడియోలను రికార్డు చేసి..క్రమం తప్పకుండా కంటెంట్‌ను పోస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆ తర్వాత బ్రాండ్ వృద్ధికి అతిపెద్ద కారణాలలో ఒకటిగా నిలిచింది. అలా ఆమె ఉదయం రాత్రి అని భేదం లేకుండా చాలా పోస్టులు చేసినట్లు తెలిపింది. చివరికి తాను నిష్ హెయిర్ మార్కెటింగ్ విభాగంగా మిగిలిపోయానని అంటోంది. వాళ్లకి తాను బడ్జెట్‌ని ఇవ్వనని, కేవలం రీల్స్ మాత్రమే చేస్తానని అన్నారు. ఎలా సక్సెస్ అయ్యిందంటే..ఆమె తరచుగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనల ఆడిషన్లకు హాజరయ్యేది, అక్కడ డజన్ల కొద్దీ మోడళ్లు వెయిటింగ్ రూములలో కలిసి కూర్చునేవారు. అక్కడ, ఆమె ఉద్దేశపూర్వకంగా ప్రజల ముందు తన హెయిర్ ఎక్స్‌టెన్షన్‌ను తీసివేసి, వారిలో ఉత్సుకతను, సంభాషణను రేకెత్తించేది. ఆ వ్యూహం ఫలించి..త్వరలోనే, తోటి నటీనటులు, మోడళ్లు ఆ ఉత్పత్తి ఎక్కడ నుంచి వచ్చిందని, తాము కొనుగోలు చేయగలమా అని అడగడం ప్రారంభించారు. అలా మొదటి కస్టమర్‌ని సంపాదించుకుంది. అయితే ఈ ఉత్తత్తులు ప్రారంభ ధరే రూ. 10 వేలు నుంచి రూ. 12 వేలు మధ్య ఉంటుంది. కానీ ఆమె పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి సహాయపడుతుందన్న ఉద్దేశ్యంతో రూ. 5,000కే అమ్మడానికి అంగీకరించింది. అంతేగాతు తన మొదటి అమ్మకం జరగడానికే నెల పట్టిందని అంటోంది. సోషల్‌మీడియాని ఉపయోగించుకోవడాని కంటే ముందు..పరుల్ వారాంతాల్లో ఫ్లీ మార్కెట్లలో గడుపుతూ, చాలామంది అంతకుముందెన్నడూ చూడని ఒక ఉత్పత్తిని వినియోగదారులకు పరిచయం చేసేది. అంతేగాదు కొనుగోలుదారులను కలసి..ఆ హెయిర్ ఎక్స్టెన్షన్లను ప్రయత్నించమని ప్రోత్సహించేది. ముఖ్యంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నంపై ఫోకస్ పెట్టేది. ఈ వ్యూహం అమ్మకాలను పెంచేందుకు, అవగాహన కల్పించడానికి ఉపయోగ పడింది. అలా వివిధ నగరాల్లో సుమారు 12 ఫ్లీ మార్కెట్ ఈవెంట్లను పూర్తి చేసే సమయానికి, వ్యాపారం గణనీయమైన సామర్థ్యాన్ని చూపించడం ప్రారంభించింది. ఆ విధంగా పరుల్ అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష రూపాయలు సంపాదించిన విషయాన్ని వెల్లడించింది. అంతేగాదు వైరల్ అయిన ప్రతీది అమ్మకాలను తీసుకు రాదు. అందుకు ప్రభావవంతమైన కంటెంట్ కావాలి. వీటన్నింటి తోపాటు అత్యంత ప్రభావవంతమైన కంటెంట్ వ్యూహం, కాబోయే కస్టమర్లకు ఉత్పత్తిని కొన్ని సెకన్లలోనే అర్థమయ్యేలా చేయడం అని చెబుతోంది. బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ..మార్కెటింగ్ చేసే విధానం మారాలి..బ్రాండ్ పెరిగేకొద్దీ, పరుల్ దానిని మార్కెట్ చేయడానికి అసాధారణమైన మార్గాలను అన్వేషించారు. అందుకోసం నిష్ హెయిర్ సరఫరా చేసిన నిజమైన మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులు ధరించి ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాదు ప్రతి వ్యవస్థాపకుడు తనకు సాధ్యమైన చోటల్లా తన ఉత్పత్తిని ప్రోత్సహించేలా నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చివరగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మిమ్మల్ని పూర్తిగా నమ్మండి, అలాగే మీ ఆలోచనను పదిమందితో పంచుకోండి అని చెబుతున్నారు. అంతేగాదు తన విజయం అనేది నిధుల సమీకరణతోనో లేదా ప్రకటనల బడ్జెట్లతోనో ప్రారంభం కాదు, నిజమైన సమస్యను పరిష్కరించడంతోనూ, ఉత్పత్తిని నమ్మడంతోనూ, అలాగే రోజు కెమెరా ముందు నిలబడటానికి సిద్ధంగా ఉండటంతో మొదలైందని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పరుల్. View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) (చదవండి: ప్లాస్టిక్ కవర్లలో పట్టు చీరలను పెడుతున్నారా..? జానపద గాయని శారీ టిప్స్..) -
మట్టిలో మాణిక్యం.. 'సుష్మ'
పుట్టింది రైతు కుటుంబంలో అయినా పట్టుదల, క్రమ శిక్షణతో కూడిన విద్య ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విక్రమ్ –1 రాకెట్ విజయంలో కీలక పాత్ర పోషించేలా చేసింది. జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన మారక సుష్మ విజయగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇటీవల విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది.హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ప్రయోగ విజయంలో రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లికి చెందిన యువ ఇంజినీర్ మారక సుష్మ కీలక పాత్ర పోషించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. శభాష్.. సుష్మ అంటూ జిల్లా వాసులందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్‌లో కీలక బాధ్యతలు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్ అండ్ ల్యాబ్‌వ్యూ ఇంజినీర్‌గా పని చేస్తున్న మారక సుష్మ, రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక పరీక్షలు, గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్, ల్యాబ్‌వ్యూ సాఫ్ట్వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. విక్రమ్–1 ప్రయోగ బృందంలో సభ్యురాలిగా శ్రీహరికోటలో జరిగిన ప్రయోగ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.రైతు కుటుంబం నుంచి...మారక సుష్మ వయస్సు 26 సంవత్సరాలు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన రైతు మారక సుబ్బారెడ్డి, మారక సుజాత దంపతుల కుమార్తె. రైతు కుటుంబంలో జని్మంచిన సుష్మ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచి క్రమశిక్షణతో ముందుకు సాగారు. వారి కుటుంబం ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటోంది.అభినందనల వెల్లువరైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, దేశ చరిత్రలో నిలిచిపోయే అంతరిక్ష ప్రయోగంలో భాగస్వామ్యం కావడంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత సుష్మను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సుష్మ నిరూపించిందంటున్నారు. దేశానికి సేవ చేయడమే లక్ష్యం : సుష్మభారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చరిత్రాత్మకమైన విక్రమ్–1 ప్రయోగంలో భాగస్వామ్యం కావడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని సుష్మ తెలిపారు. భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని విజయవంతమైన ప్రయోగాల్లో పాల్గొని దేశానికి సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.లక్ష్యసాధనలో విజయంసుష్మ తన పాఠశాల విద్యను అనంతపురంలోని నారాయణ హైస్కూల్లో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత కర్నూలు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్‌లో పవర్ సిస్టమ్స్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత 2024 ఆగస్టులో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో ల్యాబ్‌వ్యూ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్‌కు సంబంధించిన సాంకేతిక పనుల్లో సేవలందిస్తున్నారు. -
స్కామ్‌ని జామ్ చేసే షీల్డ్ ఇది..!
అకస్మాత్తుగా అపరిచిత వ్యక్తి నుంచి కాల్ రావడం. బంపర్ ప్రైజ్ వచ్చిందని, మొబైల్‌కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే సరిపోతుందని చెప్పి మోసం చేసిన ఘటనలు మన దేశంలోనే వేలల్లో ఉన్నాయి. వయసులో పైబడ్డవారు, టెక్నాలజీ మీద అవగాహన లేనివారే ఇలా ఆన్లైన్ స్కామర్ల చేతిలో మోసపోతుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు రూపొందించిందే షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్. దీనిని రూపొందించింది అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 17 ఏళ్ల యువతి.ఆమె పేరు తేజస్వీ మనోజ్, భారతీయ సంతతికి చెందిన ఈమె రెండేళ్ల కిందట ఆన్లైన్ మోసగాళ్ల వల్ల తన తాతయ్య మోసం పోవడం గమనించింది. చిన్నప్పటి నుంచి కోడింగ్ మీద ఇష్టం ఉండడంతో ఆన్లైన్ స్కామర్లను అడ్డుకునేందుకు ఒక భద్రతావలయాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. అప్పుడు వచ్చిందే ఈ షీల్డ్ సీనియర్ వెబ్సైట్. దీని ద్వారా కాల్స్, మెసేజెస్, సైట్ డొమైన్... ఇలా ప్రతి దాన్ని జల్లెడ పట్టి అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవచ్చు. తేజస్వీ ప్రతిభని గుర్తించిన టైమ్స్ మేగజైన్ 2025లో ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. -
నింగిని వదిలి.. మట్టితో మమేకమై!
ఆమె చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం శాటిలైట్ పేలోడ్స్ తయారు చేసే ఏరోస్పేస్ సంస్థలో ఉద్యోగం. కెరీర్ పరంగా ఎంతో ఉన్నతమైన స్థానం. కానీ, ఆ ఏసీ ల్యాబ్‌లు, కంప్యూటర్ స్క్రీన్లు ఆమెకు ఏ మాత్రం తృప్తినివ్వలేదు. తన మూలాల్లోకి తిరిగి వెళ్లాలని అనుకుంది. ఉద్యోగాన్ని వదిలేసి, మట్టితో మమేకమై, పర్యావరణానికి మేలు చేసే ఒక అద్భుతమైన ‘జీరో–వేస్ట్ కేఫ్’ను ప్రారంభించింది 27 ఏళ్ల నిష్ఠా చౌహాన్....నిష్ఠా చౌహాన్ ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో పెరిగింది. ఆమె తాత చిరుధాన్యాలను పండించేవారు. అలా ఆమె తన చిన్నతనంలోనే రాగులు, జొన్నలు, సజ్జల వంటి సంప్రదాయ ఆహార ప్రాముఖ్యతను తెలుసుకుంది.అహ్మదాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్’ ప్రాంగణంలో నిష్ఠా మొదటి కేఫ్‌ను ప్రారంభించింది. ఈ కేఫ్‌లో మిల్లెట్ వంటకాలు మాత్రమే ఉంటాయి. ప్లాస్టిక్, డిస్పోజబుల్ వస్తువులు ఇక్కడ పూర్తిగా నిషేధం. గాజు పాత్రల్లోనే ఆహారాన్ని అందిస్తారు. పార్సిల్స్ కోసం అరెకా లీవ్స్, చెరకు పిప్పితో చేసే పాత్రలను వాడుతున్నారు. ఇక్కడ పర్యావరణానికి హాని చేసే ఎయిర్ కండిషనర్లకు బదులుగా, కేఫ్‌ను చల్లబరచడానికి వాటర్–కూలింగ్ సిస్టమ్స్, మిస్టింగ్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు.పిల్లలకు ఎకో వర్క్‌షాప్స్!నిష్ఠా చౌహాన్ పలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌తో కలిసి 5 నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా ఎకో–వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలు నేరుగా తోటలోకి వెళ్లి మట్టిని తాకడం, మొక్కలను గుర్తించడం, కూరగాయలను స్వయంగా కోయడం నేర్చుకుంటారు. ఆపై వంటింట్లోకి వెళ్లి సొంతంగా మిల్లెట్ సలాడ్లు, జ్యూస్‌లు తయారు చేస్తారు. సంప్రదాయక ఆహారానికి, జంక్ ఫుడ్‌కి గల తేడాని గమనిస్తారు. -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్‌గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
ఫీఫా ట్రోఫీ నెత్తుకున్న యువరాణి, ఎవరీ మనోహరి : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
స్పెయిన్ చరిత్రలో ఆసక్తికర పరిణామం కొత్త చరితను లిఖించనుంది. దాదాపు 150 సంవత్సరాల విరామం తర్వాత అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 20 ఏళ్ల లియోనోర్ డి టోడోస్ లాస్ శాంటోస్ డి బోర్బోన్ వై ఓర్టిజ్ ఆ దేశ సింహాసనాన్ని అధిష్టించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. 150 ఏళ్లకు పైగా కాలంలో స్పెయిన్‌ను పాలించబోతున్న తొలి మహారాణి ఈమే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ పరిణామం గురించి తెలుసుకుందామా. 2026 ఫీఫా ప్రపంచ కప్ పోరులో అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ ఫుట్‌బాల్ తర్వాత స్పెయిన్‌కు చెందిన లామిన్ యమాల్‌తో కలిసి స్పెయిన్ యువరాణి లియోనోర్ , యువరాణి సోఫియా ఫీఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తుకున్నారు. దీంతో యువరాణిపై మరింత ఆసక్తి పెరిగింది. స్పెయిన్ అస్టూరియాస్ రాజకుమారి (Princess of Asturias) ఓర్తిజ్ వేల్స్‌లోని యూడబ్ల్యూసీ అట్లాంటిక్ కాలేజ్ నుండి ఇంటర్నేషనల్ బాకలారియేట్ పట్టా పొందారు. స్పెయిన్ సాయుధ దళాలలోని మూడు విభాగాలలోనూ మూడేళ్ల సైనిక శిక్షణను ఆమె ఇప్పుడే పూర్తి చేశారు. ఇటీవల స్పెయిన్‌కు చెందిన మూడు రక్షణ దళాలలో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మూడేళ్ల సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఎనిమిది భాషల్లో ఆమెమాట్లాడగలదు.వారసత్వ చట్టం, రాజకుమారిస్పెయిన్ 1978 రాజ్యాంగంలోని ఆర్టికల్ 57 ప్రకారం, వారసత్వంలో మగపిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. దీని ప్రకారం పెద్ద సంతానం వారసత్వంగా పొందుతారు. అలా ప్రస్తుత రాజు ఫెలిపే VI, తన కంటే పెద్దవారైన ఇద్దరు అక్కలను కాదని రాజు అయ్యారు.2005లో లియోనోర్, 2007లో ఇన్ఫాంటా సోఫియా జన్మించారు. అయితే వారసత్వ చట్టం ప్రకారం ఒకవేళ లియోనోర్‌కు తమ్ముడు పుట్టి ఉంటే, ఈమె స్థానాన్ని ఆ తమ్ముడు ఆక్రమించేవాడు. ఈ నేపథ్యంలోనే లియోనోర్ వారసత్వ స్థానాన్ని కాపాడటానికే రాజు దంపతులు మూడో సంతానం వైపు వెళ్ళలేదని అంచనాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం రాజు ఫెలిపే VI, రాణి లెటిజియా దంపతుల పెద్ద కుమార్తె యువరాణి లియోనోర్ భవిష్యత్ రాణిగా సిద్ధమవుతోంది. ఆమె సింహాస నారోహణతో, స్పానిష్ రాజవంశంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. అరుదైన సైనిక శిక్షణ2023 అక్టోబర్‌లో తన 18వ పుట్టినరోజున పార్లమెంట్ ఎదుట రాజ్యాంగానికి విధేయురాలిగా ఉంటానని ప్రమాణం చేశారు. తండ్రి బాటలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కఠిన శిక్షణ పొందారు. యుద్ధ విమానాలు నడపడం నేర్చుకున్నారు. అంతేకాదు పారాచ్యూట్ కోర్సు పూర్తి చేసిన ఏకైక రాజకుటుంబ సభ్యురాలిగా నిలిచారు. 2026 జూలై నాటికి ఈ శిక్షణను పూర్తి చేసుకుని 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఏరోనాటికల్ మెరిట్' పురస్కారాన్ని పొందారు.సెప్టెంబర్ నుండిమాడ్రిడ్లోని 'కార్లోస్ III విశ్వవిద్యాలయం'లో నాలుగేళ్ల పొలిటికల్ సైన్స్ డిగ్రీని ప్రారంభించ నున్నారు. రాజవంశ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈమె చదువును కొనసాగించనున్నారు. ఇదే కోర్సును ఆమె సోదరి సోఫియా కూడా అభ్యసిస్తోంది. ఇక స్పెయిన్‌ను చివరిగా పాలించిన మహిళ రాణి ఇసాబెల్లా II. ఆమె పాలన 1868లో ముగిసింది. ఆమె తర్వాత మళ్లీ స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించబోతున్న మహిళా పాలకురాలు రాజకుమారి లియోనోర్ కావడం విశేషం.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలియువరాణి లియోనోర్ సైనిక శిక్షణలో ఇప్పటికే పలు చారిత్రక మైలురాళ్లను అధిగమించారు. నావికా శిక్షణలో భాగంగా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో నౌక సిబ్బందితో కలిసి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సుమారు 17 వేల మైళ్ళ ప్రయాణం చేశారు. అంతేకాదు, బ్లాస్ డిలెజో అనే యుద్ధనౌకపై కూడా సేవలందించారు. ఇక విమానయాన శిక్షణలోనూ ప్రత్యేక రికార్డులు ఆమె సొంతం. 2025లో పిలాటస్ PC-21 విమానాన్ని ఒంటరిగా నడిపిన తొలి స్పానిష్ యువరాణిగా చరిత్రలో నిలిచారు. అలాగే రాబోయే కొన్నేళ్లలో రాజ్యాంగపరమైన బాధ్యతలను స్వీకరిస్తుందని భావిస్తున్నారు. దీంతో స్పెయిన్‌కు శక్తివంతమైన రాణిగా, సింహాసనారోహణ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికి -
ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..
గోల్డె మెడలిస్ట్ గురించి విని ఉంటారు గానీ ఏకంగా ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్లను ఉండరు. అత్యంత అరుదు. అలాంటి అరుదైన ఘనతను సాధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ డాక్టర్. వైద్య విద్యలోనే ఇన్ని పతకాలు సాధించడం విశేషం. డాక్టర్ కావాలన్న చిన్న నాటి కోరికను సాకారం చేసుకోవడమే కాదు..వైద్య విద్యను అభ్యసిస్తున్న కాలేజీకే గర్వకారణంగా నిలిచేలా ప్రతిభను చాటుకుని ప్రశంసలందుకుంటోందామె.ఆ అమ్మాయే ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్పూర్కు చెందిన రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి కుమార్తె దీప్తి శర్మ. ఇటీవలే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) నుంచి వైద్య విద్యను పూర్తి చేసిన యువ పట్టభద్రురాలు. ఆ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఇతర ప్రముఖుల సమక్షంలో మొత్తం 19 మెడల్స్ అందుకుంది. ఇన్ని పతకాలు ఆమెనే ఎలా వరించాయంటే..ఎంబీబీఎస్ ఫైనల్ ప్రొఫెషనల్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినందుకు ప్రతిష్టాత్మకమైన హెవెట్ గోల్డ్ మెడల్, అన్ని ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ పరీక్షలలో అత్యధిక మొత్తం మార్కులు సాధించినందుకు ఛాన్సలర్ గోల్డ్ మెడల్, అన్ని MBBS పరీక్షలలో అత్యధిక సంఖ్యలో గౌరవాలు, సర్టిఫికేట్లు పొందినందుకు యూనివర్సిటీ ఆనర్స్ గోల్డ్ మెడల్‌తో సహా మొత్తం 19 పతకాలను సాధించింది. వాటిలో 11 బంగారు పతకాలే.అంతేగాదు విశ్వవిద్యాలయ చరిత్రలోఆ పతకాలలో హెవెట్ గోల్డ్ మెడల్, ఛాన్సలర్ గోల్డ్ మెడల్ రెండింటిని గెలుపొందిన ఏడవ విద్యార్థిగా నిలవడం విశేషం. ఈ మేరకు దీప్తి మాట్లాడుతూ..గడిపిన ప్రత గంట కష్టానికి దక్కిన ప్రతిఫలంగా పేర్కొందామె. ఇన్ని పతకాలు గెలుపొందడం కన్నా.. పేరెంట్స్ పొందుతున్న సంతోషమే తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పింది. తన వైద్య విద్య ప్రారంభమైన రోజులను గుర్తు చేసుకుంటూ..2021లో సరిగ్గా మహమ్మారి సమయంలో ఇంటర్ నీట్ రెండిటినీ పూర్తి చేశాను. నీట్లో తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి కేజీఎంయూ (KGMU)లో సీటు సంపాదించడం ఒక కల నిజమైనట్లుగా ఎంత సంబరపడ్డానో మర్చిపోనంటోందామె. ఆ సమయంలో తన పేరెంట్స్ ఎలా సంబరాలు చేసుకున్నారో మర్చిపోనని భావోద్వేగంగా చెబుతోంది. ఇంటర్న్‌గా చేస్తున్నప్పుడూ.. తన దృష్టిని పాఠ్యపుస్తకాల నుంచి రోగుల సంరక్షణ వైపుకి ఎలా మళ్లించిదో కూడా వెల్లడించింది. ఈ ప్రశంసలన్నీ తన కెరీర్‌కు ఒక నాంది మాత్రమేనని అంటోందామె. అవార్డులు, సర్టిఫికెట్లు కేవలం ఒక ఆరంభం మాత్రమేన అనడానికి ఇదొక నిదర్శనం అని అంటోంది. ఒక ఇంటర్న్‌గా రోజుల రోగులను కలుస్తాను, వాళ్లు తమ డాక్టర్ని చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆశ అనే మెరుపు ఆ అంచనాలకు అనుగుణంగా జీవించడంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందని చెబుతోంది. వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసేలా స్వస్థత చేకూరేలా చేయడం తన కర్తవ్యమని అంటోంది. అంతేగాదు గందరగోళం కన్నా..స్థిరత్వమే మేలు అని నొక్కి చెబుతోంది. ఏం చదివినా..పూర్తి ఏకాగ్రతతో చదవడం,పునశ్చరణే అత్యంత కీలకం అని చెబుతోంది. కేవల మనం వేసుకున్న ప్లాన్‌ని విజయవంతం చేయడం కోసమే ఆందోళన పడండి తప్ప..ఇంకేం అవసరం లేదని అంటోంది. అదనపు ఒత్తిడిని నివారించి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే..ప్రతిదీ దానంతట అదే సర్దుకుంటుందని చెబుతోందామె. భవిష్యత్తులో పునశ్చరణే కీలకం! మాస్టర్స్ డిగ్రీని అభ్యసించినా, సొంత క్లినిక్‌ను ప్రారంభించినా, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవను కొనసాగించినా, ఒక విషయం మాత్రం నిశ్చయం..అది ఆమె ఇప్పుడే వైద్య ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న వైద్యురాలు అనేది. View this post on Instagram A post shared by Dr. Deepti Sharma (@deepti._bhardwaj) (చదవండి: భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్) -
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది, యాసిడ్ బాధితురాలు..! కానీ ఇవాళ ఆమె..
జీవితంలో ఎడతెగని సమస్యలు ఎదురైతే..ఎవ్వరికైనా జీవితంపై విసుగు వచ్చేస్తుంది. పుట్టుకతోనే కష్టాలు అనేవి..మనిషిలో ఒక విధమైన నిరాసక్తత పెంచుతుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం వాటన్నింటితో మరింత ఉన్నతంగా ఎదిగి..గొప్ప తల్లిగా మారింది. కంటేనే తల్లి కాదు అంటూ 'అమ్మ' అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చింది. ఆ మహిళే దేవాంశి యాదవ్. ఏ బిడ్డ మోయకూడదని వేదనను ఎదుర్కొంది చిన్నతనంలో. తండ్రి ఆమెకు తొమ్మిది నెలల వయసున్నప్పుడే ఉగ్రవాద బాంబు దాడిలో మరణించాడు. ఆమెకు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. పోలీసు అధికారి అయిన తల్లి ఆధ్వర్యంలో పెరిగిందామె. పోనీ అక్కడితో ఆ చిన్నారికి కష్టాలు ఆగిపోలేదు. ఆ తర్వాత లైంగిక దాడి, యాసిడ్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారియర్ ఆమె. ఈ రెండు చేదు అనుభవాలు ఎవ్వరినైనా ఒంటరిగా నిస్తేజంగా మార్చేస్తాయి. కానీ ఆ కష్టాలు ఆమెను మరింత దృఢంగా మార్చాయి. ఎంతలా అంటే తాను తల్లిలా ఒక బిడ్డకు పూర్తి ప్రేమతో కూడిన జీవితం ఇవ్వాలనేంత విశాల హృదయాన్ని అందించే స్థాయికి మార్చింది. టీనేజ్‌లో ఉండగా ఏ అమ్మాయి అయినా..తన తోటి పిల్లలతో ఎంజాయ్ చేస్తే దేవాంశి మాత్రం తాను జీవసంబంధమైన తల్లిగా కాకుండా దత్తత తల్లిగా ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పెరిగడం విశేషం. అది నిజం కావడానికి చాలా సమయమే పట్టింది. View this post on Instagram A post shared by Devanshi 🇮🇳 (@devanshi__yadav) ఆ చిన్నారితో నెరవేరిన కల..ఇరవైలలో దేవాంశి ఢిల్లీలోని ఒక అనాథాశ్రమంలో బోధిస్తున్నప్పుడు, వినికిడి, మాటల లోపంతో బాధపడుతున్న చిన్నారిని చూసింది. దేవాంశి ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంది. ఆ సంస్థ అందుకు అనుమతించలేదు. ఆ అనుభవమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఎందుకంటే తక్షణమే దత్తత తీసుకునేందుకు ప్లాన్ చేసుకుని కావల్సిన డాక్యమెంట్లు సిద్దంచేసుకుని కోర్టు అనుమతితో వన్మయిని అనే ఐదు నెలల చిన్నారిని సొంత చేసుకుంది. ఆ ఒక్కక్షణంలో ప్రదీది తనకు అపురూపమైనదిగా మారిందని అంటోంది దేవాంశి. ప్రస్తుతం ఆ బిడ్డకు ఏడు సంవత్సరాలు..కానీ ఆమెకు అన్ని తెలిసేలానే పెంచింది. దత్తత, సరోగసి అనేవి ఆ చిన్నారికి తెలుసు. పైగా తన గురించి అభద్రతా భావంతో కాకుండా.. ఎంతగానో ప్రేమించే గొప్ప తల్లితో ఉన్నా అనే భావనతో పెంచింది ఆ చిన్నారిని దేవాంశి. అంతా తనను ఒంటరి తల్లిగా ఎలా పెంచేస్తావని ప్రశ్నిస్తే..వాటికి ఆమె తన చేతల ద్వారా సమాధానిచ్చింది. పితృస్వామ్యాన్ని నిశ్శబ్దంగా బద్దలుకొట్టేలా ఆ చిన్నారి అధికారిక పత్రాలన్నింటిలో తన పేరుతో రిజిస్ట్రర్ చేసి..ఎంతో సాధించిన విజయంలా అనిపిస్తుందని సగర్వంగా చెబుతోంది దేవాంశి. అంతేగాదు తన తల్లి సైతం ఆ బిడ్డను ఎంతో అపురూపంగా చూస్తుందని చెబుతోంది. ఇక దేవాంశి లైంగిక హింస, గృహ హింస బాధితులు, బాలల సంక్షేమం కోసం పనిచేసే 'షహీద్ రామశ్రయ వెల్ఫేర్ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ఆమె ఒక న్యాయవాది కూడా. ఇవన్ని చేస్తూ తల్లిగా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇదేమంతా ఈజీ కాకపోయినా..తన కూతురు తనతోపాటు ఉంటూ..న్యాయవాదం, మానసిక ఆరోగ్యం గురించి పాఠ్యపుస్తకాల ద్వారా కాకుండా తన తల్లి రోజు వారీ ఆచరణ ద్వారా నేర్చుకునేలా చేస్తున్నా అని నవ్వుతూ చెబుతోందామె. ఇది పెంపకానికి, తల్లి అను మాటకు గొప్ప అర్థంలా ఉంది కదా ఆమె స్టోరీ. View this post on Instagram A post shared by Devanshi 🇮🇳 (@devanshi__yadav) (చదవండి: రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..) -
అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో ఆర్మీ అధికారిగా ఆమె.!
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం చాలా వాటిని కోల్పోయేలా చేస్తుంది. కానీ ఆమె విషయంలో అలా కాదు..ఆ విషాదం పట్టుదల, సహనం వంటి వాటిని అందించి..తన కలల మార్గంలో దూసుకుపోయేలా చేసింది. అదే ఆమెపూ దేశసేవ వైపు నడిపించి ఏ మహిళ చేయని సాహసాలకు పురొకొల్పింది. పైగా మంచుతో కూడిన అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో అడుగుపెట్టిన మహిళా సైనికురాలిగా ఘనత సృష్టించింది. ఆ లేడి సింగం ఎవరంటే..ఆ మహిళే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్. ఆమె తండ్రి మరణించినప్పుడు శివ వయసు కేవలం 11 ఏళ్లు. ఇంటి పెద్దదిక్కుని కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఆమె తల్లి కుటుంబానికి అండగా నిలవడమే గాక..ఎలాంటి పరిస్థితుల్లోనైనా..ఇద్దరు కుమార్తెలను పాఠశాల చదువుకు దూరం చేయకుండా బాధ్యత తీసుకుందామె. పరిస్థితులు కఠినంగా మారినప్పుడల్లా ఆమె అక్క ముందుకు నడిపించే శక్తిగా నిలిచింది. ఇంట్లో డబ్బు కొరత తీవ్రంగా ఉండేది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్న శివ మాత్రం ఆర్మీ అధికారి కావాలనే లక్ష్యంపైనే దృష్టిసారించేది. ఆ విధంగా ఆమె పాఠశాల విద్య పూర్తి అయిన తదనంతరం సివిల్ ఇంజనీరింగ్ చదివింది. అది సైనికి వృత్తికి ఉపయోగపడుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఆ తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి-టెక్) మార్గం ద్వారా సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకు హాజరైంది. అలా ఆమె 19వ ఎస్ఎస్బి అలహాబాద్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి..ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందింది. ఆ తర్వాత 2021లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో నియమితురాలైంది. ఇది ఆర్మీకి సంబంధించిన అత్యంత సాంకేతిక సవాలుతో కూడిన విభాగాలలో ఒకటి. ఇక్కడ ఆర్మీ అధికారులు వంతెనలు నిర్మించడం, మందుపాత్రలు తొలగించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, అత్యంత కఠినమైన భూభాగాలలో కార్యకలాపాలకు మద్దుతి ఇవ్వడం వంటివి చేస్తారు. ఆ తర్వాత ఆమెను లడఖ్‌లోని భారతదేశ ఉత్తర సరిహద్దులకు కాపలాగా ఉండే ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్కు నియమించారు. కెప్టెన్ శివ తన శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించడం జియాచెన్తో మొదటిసారి కాదు. జూలై 2022లో, కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా, ఆమె "సురా సోయ్ సైక్లింగ్ యాత్ర"కు నాయకత్వం వహించారు. ఆ యాత్రలో శివ సియాచిన్ యుద్ధం స్మారక చిహ్నం నుంచి కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వరకు 11 రోజుల్లో దాదాపు 508 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ ప్రదర్శనే ఆమెను సియాచిన్ పోస్టింగ్ రేసులో నిలబెట్టింది. ఇది సైన్యం ఇచ్చే అత్యంత కఠినమైన నియామకాలలో ఒకటి. ఆమె వెళ్ళడానికి ముందు, కెప్టెన్ శివ ఇతర అధికారులతో పాటు సియాచిన్ యుద్ధ పాఠశాలలో ఒక నెల గడిపారు. అదంతా పూర్తి చేసిన తర్వాతే ఆమెకు మోహరించడానికి అనుమతి లభించింది. అలా ఆమె ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో అడుగుపెట్టిన తొలి మహిళా సైనికురాలిగా చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఏ మహిళా అధికారి చేయని సాహసం ఆమె చేయడం విశేషం. సియాచిన్ హిమానీనదంపై సుమారు 15,600 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్‌కు బదిలీ అయ్యారు. అక్కడ కార్యాచరణ పాత్రలో పనిచేసిన తొలి మహిళా అధికారిగా నిలిచింది. ఈ నియామకం మూడు నెలల పాటు కొనసాగింది. మహిళలను సైన్యంలో మరింత మందిని చేర్చుకునేందుకు జరుగుతున్న మార్పుకి ప్రతీకగా శివ సాహసం నిలిచింది. అక్కడ కెప్టెన్ శివను కుమార్ పోస్ట్‌లోని ఒక ఇంజనీరింగ్ బృందానికి ఇన్చార్జ్గా నియమించారు. ఈ ఘనత భారత సాయుధ దళాలలో మహిళలకు పెరుగుతున్న అవకాశాలు, కేవలం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు తెరుచుకుంటాయనే విషయాన్ని ఎలుగెత్తి చాటింది. (చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!) -
తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్ సక్సెస్ స్టోరీ
లక్నో: లక్నోలోని గోమతి నగర్‌కు చెందిన డిగ్దిగా గ్రామానికి చెందిన నీలు సకాలంలో వైద్య చికిత్స అందించే స్థోమత లేకపోవడంతో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది..అత్యంత బాధాకరమైన ఆ క్షణమే ఆమె జీవితానికి కొత్త లక్ష్యాన్ని చూపించింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ఉత్తీర్ణత సాధించి తన సాకారం వైపుగా తొలి అడుగు వేసింది.నీలు 8వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి మరణించడంతో వారి కుటుంబ ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు పడింది. అయితే, ఈ కష్టాలు, నష్టాలు ఆమెను ఆమెను కృంగ దీయలేదు. వైద్యం అందక పేదరికం వల్ల ఎవరూ తమ ప్రియమైన వారిని కోల్పోకూడదనే లక్ష్యంతో డాక్టర్ కావాలని ఆమె నిశ్చయించుకుంది. మరోవైపు కుటుంబానికి ఏకైక సంపాదనపరురాలైన ఆమె తల్లి, ఆసుపత్రి లోనూ, ఇటు గృహ సహాకురాలిగా పనిచేస్తుంది. కూతుళ్ల చదువును మాన్పించి, వారికి పెళ్లిళ్లు చేయమని బంధువులు, ఇతరులుఎంత ఒత్తిడి చేసినా బిడ్డల్ని చదివించేందుకు నిర్ణయించుకుంది.తండ్రి మరణంతో సంకల్పంఆర్థిక ఇబ్బందుల కారణంగా తన తండ్రికి సరైన వైద్యం అందించలేకపోయామని, చివరికి అనారోగ్యంతో కన్నుమూశారని నీలు చెప్పింది. పేదరికంతో సరైన చికిత్స అందించలేక నాన్నను కోల్పోయాను. అందుకే పేదరికం వల్ల మరే కుటుంబం కూడా ఇలాంటి నష్టాన్ని అనుభవించకూడదని ఆ రోజే తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను అని నీలు తెలిపింది. అట్టడుగు వర్గాల బాలికల కోసం స్టడీ హాల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (SHEF) నడుపుతున్న ప్రేరణ బాలికల పాఠశాలలో నీలు తన విద్యను ప్రారంభించి, ఆ తర్వాత 11, 12 తరగతుల కోసం స్టడీ హాల్ పాఠశాలలో స్కాలర్షిప్ సంపాదించింది. కష్టపడి చదివి నీట్లో ఉత్తీర్ణత సాధించి తన కల వైపు మొదటి పెద్ద అడుగు వేసింది. పట్టుదలతో చదివి నీట్ పరీక్షను విజయవంతంగా క్లియర్ చేసింది. ఈ ఏడాది సిబిఎస్ఇ క్లాస్ 12 బోర్డు పరీక్షల్లో నీలు 94 శాతం మార్కులు సాధించింది. . ప్రస్తుతం ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించేందుకు సిద్ధ మవుతోంది. భవిష్యత్తులో కార్డియాలజీ (గుండె జబ్బుల విభాగం) లో స్పెషలైజేషన్ చేసి, ఆర్థికంగా వెనుకబడిన రోగులకు సరసమైన ధరకే వైద్యం అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.నీలు అకడమిక్ ప్రతిభను గుర్తించి ఆమెకు ప్రతిష్టాత్మకమైన 'వహానీ స్కాలర్షిప్' లభించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 50 మంది మాత్రమే ఎంపికైన తుది జాబితాలో నీలు చోటు దక్కించుకుంది. ఈ స్కాలర్షిప్ ఆమె వైద్య విద్యకు అయ్యే ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చులను భరిస్తుంది.స్ఫూర్తిగా నిలిచిన నీలుస్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఊర్వశి సాహ్ని మాట్లాడుతూ... సరైన అవకాశాలు, సాయం లభిస్తే విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలరని చెప్పడానికి నీలు విజయమే నిదర్శనమని అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ మీనాక్షి బహదూర్ కూడా నీలును ఎంతో కష్టపడే, పట్టుదల గల విద్యార్థిగా అభివర్ణిస్తూ, ఆమె విజయం ఎంతో మంది యువతులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ : నిద్రలేమే వరంలా మారింది -
నేవీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా రిద్ధి
భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల యువతి రిద్ధి చౌహాన్ యూఎస్ నేవీ సహకారంతో నడిచే ప్రతిష్టాత్మక హైస్కూల్ మిలిటరీ ప్రోగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్‌లోని ప్రముఖ బెంజమిన్ ఎన్. కార్డోజో హైస్కూల్ నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ విభాగంలో అత్యున్నత హోదా అయిన బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.తన పాఠశాల పరిధిలోని 300 మంది క్యాడెట్లకు నాయకత్వం వహిస్తున్న ఆమె వారి శిక్షణ, విధివిధానాలు, సంక్షేమ బాధ్యతలను పర్యవేక్షిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఈ ఎన్జీఆర్వోటీసీప్రోగ్రామ్లోనే అత్యున్నత హోదా సాధించిన తొలి భారతీయ సంతతి విద్యార్థినిగా రిద్ధి నిలిచారు.రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రుచిక, దిలీప్ చౌహాన్‌ల కుమార్తె రిద్ధి కుటుంబం ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తోంది. బాల్యం నుంచే దేశసేవపై ఆసక్తి పెంచుకున్న రిద్ధి, కేవలం స్కూల్ స్థాయికే పరిమితం కాకుండా భవిష్యత్తులో యూఎస్ నేవీలో ఆఫీసర్‌గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే, యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీకి తొలిమెట్టుగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక నావల్ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్లో ప్రవేశించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ వంటి అరుదైన బాధ్యత పొందడానికి ముందు, రిద్ధి అకడమిక్ కమాండర్, స్టెమ్ కమాండర్, ΄్లాటూన్ లీడర్, ఇన్స్పెక్షన్ కమాండర్‌గా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.పర్సనల్ మెంటర్‌గానూ..రిద్ధి అకడమిక్ కమాండర్‌గా వ్యవహరిస్తూ, జాతీయస్థాయి అకడమిక్ పోటీలలో తన టీమ్‌కు ప్రథమ స్థానాన్ని అందించారు. వరుసగా రెండేళ్లపాటు ‘లీడర్షిప్ అండ్ అకడమిక్ బౌల్’ పోటీల్లో తన స్కూల్‌ను ముందంజ లో నిలపడమేకాకుండా రోబోటిక్స్‌లో శాస్త్రవేత్తల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు, తన ఈ ప్రయాణంలో తనతోపాటుగా ఉన్న మరో 200 మంది క్యాడెట్లకు పర్సనల్ మెంటార్‌గా వ్యవహరిస్తూ, వారిని కూడా సమర్థమైన నాయకులుగా తీర్చిదిద్దారు.ఆధ్యాత్మిక స్ఫూర్తితోనే!తనలో ఉన్న నాయకత్వ లక్షణాలు, సేవా గుణం పుస్తకాలతో వచ్చింది కాదనీ.. తన కుటుంబం నేర్పించిన విలువలు, భారతీయ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక గురువుల బోధనల వల్లే ఈరోజు తను ఇంతమందికి దిశానిర్దేశం చేయగలుగుతున్నానని చెబుతోంది రిద్ధి చౌహాన్. -
వినిపించే కవితా స్వరాలు..
ప్రతినెలా అందరికీ వీలైన రోజున ఒక మధ్యాహ్నం, జలంధర్‌లోని ఒక సభ్యురాలి ఇంట్లో కొంతమంది మహిళలు సమావేశమవుతుంటారు. అది ఏదో సాంఘిక సమావేశమో లేక లాంఛన్రపాయమైన సభో కాదు. తాము స్వయంగా రాసుకున్న కవిత్వాన్ని చదవడానికి చేసుకున్న ఒక ఏర్పాటు. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, గృహిణులు, వివిధ రంగాలకు చెందిన మహిళలు చేతుల్లో నోట్‌బుక్‌లతో ఒకచోట చేరతారు. బయటకు చెప్పుకోని తమ భావోద్వేగాలను, అనుభవాలను, ఆలోచనలను వ్యక్తపరచడానికి పద్యరూపంలో ఒక వేదికను వారు కనుగొంటారు.రచయిత్రి నరేష్ నాజ్ స్థాపించిన మహిళా కవయిత్రుల వేదిక అయిన ’మహిళా కావ్య మంచ్’ ఈ సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థ రాష్ట్రంలోని పలు ్రపాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, జిల్లాస్థాయి విభాగాలు స్వతంత్రంగా పనిచేస్తూ నెలవారీ కవితా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.ఎలాంటి రుసుమూ లేదు...అనేక సాహిత్య సంస్థల వలె కాకుండా మహిళా కావ్యమంచ్ సభ్యత్వ రుసుమును వసూలు చేయదు. కవిత్వం రాయడంపై ఆసక్తి ఉన్న ఏ మహిళ అయినా, ఆమె వృత్తి లేదా సాహిత్య నేపధ్యంతో సంబంధం లేకుండా సభ్యురాలుగా చేరచ్చు. సభ్యుల సౌలభ్యాన్ని బట్టి సమావేశాలు ఆన్ లైన్ లోనూ, ఆఫ్‌లైన్ లోనూ జరుగుతాయి. అయితే ఆఫ్‌లైన్ సమావేశాలు సాధారణంగా సభ్యురాలి నివాసంలో నిర్వహిస్తారు.ఈ సమావేశంలో పాల్గొనేవారి సంఖ్య నెలా నెలా పెరుగుతూనే ఉంది. దీంతో ఇది ఒక సాహిత్య వేదిక కంటే ఎక్కువగానే మారింది. ఒత్తిడితో కూడిన వృత్తి, ఇంటి బాధ్యతలు, కుటుంబ కట్టుబాట్ల నడుమ, ఈ నెలవారీ సమావేశాలు సృజనాత్మకతకు, స్వీయ వ్యక్తీకరణకు ప్రత్యేక సమయాన్ని అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన ప్రేక్షకుల ముందు తమ రచనలను చదివి వినిపించడం వల్ల, వారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, తమ రోజువారీ పాత్రలకు అతీతంగా ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు సహాయపడిందని సభ్యులు చెబుతున్నారు.సోషల్ మీడియా కవిత్వాన్నీ విస్తృతంగా పరిచయం చేస్తున్నప్పటికీ అర్థవంతమైన సాహిత్య సంఘాలను కలుసుకోవడం కష్టంగానే మారింది. కవిత్వం కేవలం రాయడానికి మాత్రమే కాదని, దానిని వినేవారూ ఉండాలని ఇలాంటి సమావేశాలలో పాల్గొనేవారికి గుర్తుచేస్తూనే ఉంది.ఒకే వేదికపైకి..ఈ సంస్థ ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయి సమావేశాలను కూడా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన మహిళా కవయిత్రులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. తమ ఇళ్లలో కవితలు చదవడం ద్వారా ఎందరో కవులకు, తమ రచనలను మరింత విస్తృతమైన ప్రేక్షకులతో పంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది.కజిన్స్, ఫ్రెండ్స్, బంధువులలో కొంతమంది సభ్యులు ప్రతినెలా ఒకరింట్లో సమావేశమై ఆనందాన్ని పంచుకోవడం గురించి మనకు తెలిసిందే..! పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో మాత్రం ప్రతినెలా మహిళా కవితాబృందం ఒకరి ఇంట్లో కలుసుకుంటారు. తమ అనుభవాలను, అనుభూతులను కవిత్వం ద్వారా పంచుకుంటారు. కాగితాలకే పరిమితం కాని ఒక గొంతుకను అందిస్తారు. రచయిత్రి నరేష్ నాజ్ స్థాపించిన మహిళా కవయిత్రుల వేదిక ‘మహిళా కావ్య మంచ్’ ద్వారా నెలవారీ కవితా సమావేశాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు. -
వ్యవసాయానికి మించిన కథ..! 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ డ్రైవింగ్ ..
జీవితాన్ని మార్చే కొన్ని నిర్ణయాలు తగరతి గదుల్లోనో లేక పెద్ద పెద్ద సమావేశాల్లోనో కాదు భరింపరాని దుఃఖం నుంచి మొదలవుతుంది. మనకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయిన తీవ్ర దుఃఖం ఒకవైపు.. ఒక్కసారిగా మీదపడ్డ కుటుంబ బాధ్యతలు ఇంకోవైపు.. ఆ తరుణంలో తీసుకునే సరైన నిర్ణయాలే ఆ మనిషి గొప్పతనాన్ని చాటుతాయి. అందుకు నిదర్శమే ఈ గుజరాత్ ధీరవనిత కథ. ఆ మహిళే గుజరాత్‌లోని కచ్ జిల్లాలో నివశిస్తున్న శాంతాబెన్. భర్త మరణంతో ఒక్కసారిగా పిల్లల చదువులు, కుటుంబాన్ని పోషించడం వంటి బాధ్యతలు ఆమె మీద పడిపోయాయి. అప్పటి వరకు ఇంటి పట్టున భర్త నీడలో బతికిన ఆమెకు ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఎందుకంటే వ్యవసాయ పనులు గురించి గానీ, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలన్న దానిపై గానీ ఏ మాత్రం ఆలోచన, అవగాహన లేదు. ఆ క్లిష్ట సమయంలో తనముందుకు ఉన్న ఒకే ఒక్క దారి.. కుటుంబానికి ఆధారమైన వ్యవసాయ క్షేత్రాన్ని భర్త తదనంతరం తానే స్వయంగా నిర్వహించడం ఒక్కటే. నిజానికి ఆ పనులు ఏవీ ఆమెకు తెలియదు. కనీసం వ్యవసాయ పనిముట్లు ఎలా వాడాలో కూడా తెలియదు. ప్రతీది నేర్చుకోవాల్సిందే. అయినా వెనకడుగు వేయలేదు. భావిని తవ్వడం నుంచి, ఎలాంటి ఎరువులు కొనాలి, ఎలాంటి పురుగులు మందులు ఉపయోగించాలి అన్నింటిని వేగంగా నేర్చుకుంటూ వ్యవసాయం చేయడం మొదలు పెట్టింది. అంతేగాదు ఆఖరికి 40 ఏళ్ల వయసులో ట్రాక్టర్ని నడపడం కూడా స్వయంగా నేర్చుకుంది. అయితే ఇంతలా కష్టపడుతున్నా.. అప్పటికే ఇంటి మీద ఉన్న అప్పులు, కారణంగా కుటుంబ నిర్వహణ మరింత కష్టంగా మారిపోయింది. చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఇక ఉన్న ఆ ఒక్క పొలం అమ్మితే కానీ పరిస్థితి చక్కబడేట్లు కనిపించని దస్థితి. కానీ ఆమె ఆ సమయంలో ఎంతో సమన్వయంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం కుటుంబ సభ్యులు పొలాన్ని అమ్మేద్దామని అంటున్నా..అందుకు ఆమె నిరాకరించింది. తానే ఎలాగోలా కష్టపడి అప్పులు తీరుస్తాని హామీ ఇచ్చి మరీ.. వ్యవసాయం చేసేందుకే మొగ్గు చూపింది. అలా శాంతాబెన్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి ఏడింటి వరకు పొలంలోనే ఉంటూ కష్టపడేది. ఆమె కష్టానికి ఫలితం లభించింది.. పొలం చక్కగా పండటం మొదలైంది. దాంతో ముందుగా ఇంటి మీద ఉన్న అప్పులు తీర్చేసి, పిల్లలను చదివించడం మొదలు పెట్టింది. అప్పటి వరకు బ్యాంకు ఖాతా తెలియని ఆమె..తనలాంటి మహిళా రైతులకు బ్యాంకులు అప్పులు ఇస్తాయని తెలుసుకుని, దాని సాయంతో మరింతగా వివిధ రకాల పంటలు వేసి పండించి ఆదాయం గడించటం మొదలు పెట్టింది. చివరికి పిల్లలను మంచి చదువులు చదివించే స్థాయికి చేరుకుని ఆదర్శంగా నిలిచింది. ఆమె కష్టానికి ఫలితంగా కుమారుడు సివిల్ ఇంజనీర్ అయ్యాడు. ఇప్పడు అతను అమ్మకు పొలంలో సహాయం చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. శూన్యం నుంచి జీవితాన్ని మొదలు పెట్టి శిఖరాగ్రానికి చేరుకునేలా జీవితాన్ని అందంగా మలుచుకుంది శాంతాబెన్. విషాదం అనేది తన మిగిలిన జీవితానికి ముగింపు కాదని ధైర్యంగా ముందుకు సాగితే మంచి రోజులు ఉంటాయనే చెప్పే స్ఫూర్తిదాయక కథ ఆమెది. అంతేగాదు కష్టకాలంలో తప్పుడు నిర్ణయాలు కాదు..వాటిని అధిగమించేలా ధైర్యంగా నిలబడాలని నొక్కి చెబుతోంది ఆమె కథ.(చదవండి: ఆ డీఆర్డీఓ శాస్త్రవేత్త అడిగిన ఒకే ఒక్క ప్రశ్న..లైఫ్‌నే మార్చేసింది!) -
విద్యార్థినులకు ఫ్రీ
‘ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచిత ప్రయాణం’ అని రాసి ఉన్న గులాబీ రంగు ఆటో అందరినీ ఆకర్షిస్తుంటుంది. చెన్నైలోని టి.నగర్, కోడంబాక్కం, అన్నానగర్, పెరంబూర్ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా తన ఆటోలో అమ్మాయిలను ఉచితంగా తీసుకువెళుతోంది రాజీ అశోక్...‘మేము మా చదువు పూర్తి చేసి ఉంటే మా జీవితాలు బాగుండేవి’ గతాన్ని గుర్తుచేసుకుంటూ అంటుంది రాజీ. ఆర్థిక సమస్యల కారణంగా కాలేజీ చదువును అర్థంతరంగా మానేయాల్సి వచ్చింది చెన్నైకి చెందిన రాజీ అశోక్. తనలాగే ఎవరూ చదువు మధ్యలో మానెయ్యకుండా ఉండడానికి తనవంతు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది 54 ఏళ్ల రాజీ.అక్క కనిపిస్తే... ఎంత ఆనందమో!ప్రతిరోజు ఉదయం విద్యార్థినులను బడిలో దింపడంతో పాటు సాయంత్రం బడి నుంచి తీసుకువస్తుంటుంది రాజీ. రోజూ పది నుంచి పదిహేనుమంది బాలికలకు సహాయం చేస్తుంది. ఇలా చేయడం అంటే తన సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని వదులుకోవడమే. అయితే అదేమీ తనకు ఇబ్బందిగా లేదు. ‘స్కూల్, బస్‌స్టాప్, ఆటోస్టాండ్ల దగ్గర పిల్లల కోసం ఎదురుచూస్తాను. గులాబీ రంగు ఆటోను గుర్తు పట్టి వెంటనే ఎక్కేస్తారు. నన్ను చూడగానే వారికి సంతోషంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చుంటారు. కొందరు ఇంటికి వెళ్లే దారిలో ఆటోలోనే నిద్రపోతారు. ఆకలి వేస్తే తినడానికి నా ఆటోలో బిస్కెట్ ప్యాకెట్లు ఎప్పుడూ ఉంటాయి’ అంటుంది రాజీ.అంతులేని ఆనందం‘అక్కా... నన్ను గుర్తు పట్టావా? ఒకసారి నీ ఆటోలో నన్ను తీసుకెళ్లావు!’‘నీ గురించి మా అమ్మాయి ఎన్నిసార్లు చెప్పిందో’... ఇలాంటి మాటలు విన్నప్పుడు రాజీకి వెయ్యి ఏనుగుల బలం, అంతులేని ఉత్సాహం వస్తుంది.ఇంకా ఏదైనా చేయాలని అనిపిస్తుంది. ‘సేవ చేయడంలో ఉన్న అంతులేని ఆనందం మరో దాంట్లో దక్క లేదు. ఈ ప్రయాణంలో ఎందరినో కలిశాను. వారి భావాలను పంచుకున్నాను. ఒక టీవీ ఛానల్ అవార్డుల సమయంలో ఒక యువతి వచ్చి నేను కూడా రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను అని చెప్పడం సంతోషంగా అనిపించింది.నేను రాజీ అక్క ఆటోలో ప్రయాణించాను... అంటూ ఎంతో మంది సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌లు పెడుతుంటారు. అవి చదివిన వారు నా గురించి ప్రశంసపూర్వకంగా కామెంట్స్ పెడుతుంటారు. ఆ కామెంట్స్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. నా వయసు 54 ఏళ్లు. ఇక స్వస్థలానికి వెళ్లి పోదామని నిర్ణయించుకొని వెళ్లాను. అక్కడకు వెళ్లినా మనసు మాత్రం చెన్నైను వదల లేదు. దీంతో మళ్లీ వచ్చేశాను. నా భర్త కేరళలో ఒక సంస్థ ఇచ్చిన అంబులెన్స్ ద్వారా ఫ్రీ సర్వీసు చేస్తుండటం, చెన్నైలో నేను నా వంతు సేవ చేయడం మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం నన్ను అభినందించడం మరిచిపోలేని జ్ఞాపకం. ప్రస్తుతం నేను ఒక చిన్న పాటి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. కొంచెం పెద్ద ఆటో ఉంటే, ప్రతి రోజూ మరి కొంత మంది అమ్మాయిలకు సేవలు అందించేందుకు వీలుంటుంది’ అంటుంది రాజీ అశోక్.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
15 ఏళ్లకే చదువు మానేసింది..! కట్‌చేస్తే రూ 7 వేల కోట్ల కంపెనీ..
సాధారణంగా కష్టపడి చదివి..నైపుణ్యాలు అందిపుచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ సక్సెస్ అందుకుంటాం. కానీ కొందరు చిన్న వయసులోనే అపార ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ కోవకు చెందిన పిల్లలు అందరి పిల్లల్లా క్లాస్రూమ్ పాఠాలకు అంకితమవ్వరు. అలా టైం వేస్ట్ చేసే కంటే..తనకేది ఇష్టమే ఏం చేస్తే బాగుంటుందో.. అంత చిన్న వయసులోనే నిర్ణయించుకోగలరు. ఆ దిశగా తమ టాలెంట్‌ని ప్రదర్శించి దిగ్గజ కంపెనీలే వచ్చి తమ సంస్థలో చేర్చుకునేలా చేసుకుంటారు. అలాంటి టాలెంటెడ్ గర్ల్ హర్షిత అరోరా. ఆమె స్కూల్ చదువుని మధ్యలోనే ఆపేసి పేరెంట్స్‌కి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత అత్యంత చిన్న వయసులోనే కోట్ల విలువ చేసే కంపెనీని నిర్మించి..ఇంటెలిజెన్స్‌కి కేరాఫ్‌గా నిలిచింది. ఆ అమ్మాయే ఉత్తప్రదేశ్‌లోని సహారన్పూర్ నగరానికి చెందిన హర్షిత అరోరా. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు ఇంజీనర్ లేదా డాక్టరో అవ్వాలనే అనుకుంటారు. కానీ హర్షిత తన తల్లిదండ్రులే ఆందోళన చెందేలా భయానక నిర్ణయం తీసుకుని షాక్‌కి గురి చేసింది. చదువుకి అత్యంత కీలకమైన టీనేజ్ దశ అంటే 15 ఏళ్ల వయసుకే ఈ చదువులు నావల్ల అయ్యే పని కాదని స్టడీస్‌కి బై..బై చెప్పేసింది. తనకు తాను సొంతంగా టెక్నాలజీ గురించి నేర్చుకోవడం ప్రారంభించింది. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ సాయంతో 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక క్రిప్టో పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్ యాప్‌ను సృష్టించింది. అది చాలా సరళంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ఆపిల్ దీన్ని గమనించి తన ఫ్లాట్ఫామ్లోకి చేర్చింది. ఈ యాప్ అమెరికా, కెనడా దేశాల వ్యాప్తంగా రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఫైనాన్స్ యాప్‌గా నిలిచింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, ఒక కంపెనీ దీనిని కొనుగోలు చేసింది. అలా 2020లో, భారత ప్రభుత్వం హర్షిత విజయాలను గుర్తించింది. అందుకుగానూ ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల పురస్కార్‌ను అందుకుంది కూడా. అదే ఏడాది ఆమె అమెరికా వెళ్లడానికి O-1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ రంగంలో అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ వీసా ఇస్తారు. అందుకోసం ఆమెకు మొత్తం పదిమంది సీఈవోల నుంచి సిఫార్సులు అవసరం. కానీ హర్షితకు ఏకంగా 15 సిఫార్సులు లభించాయి. అంతేగాదు శాన్ ఫ్రాన్సిస్కో ఆమెకు స్వాగతం పలికింది. 2019లో, ఆమె విజ్ఞాన్ వెలివేల తుషార్ మిశ్రాలతో కలిసి AtoB అనే స్టార్టప్‌ను స్థాపించారు. వాళ్ల మంచి ఆలోచనతో స్టార్టప్‌ని ప్రారంభించడంతో Y కాంబినేటర్ సమ్మర్ 2020 బ్యాచ్‌కు ఎంపికయ్యారు.ఈ Y కాంబినేటర్ (Y Combinator) అనేది 2005లో స్థాపించిన ఒక ప్రముఖ అమెరికన్ స్టార్టప్ యాక్సిలరేటర్. ఇది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి (స్టార్టప్‌లకు) అవసరమైన ప్రాథమిక పెట్టుబడి (Seed Fund), శిక్షణను అందిస్తుంది. అయితే వారి ఆలోచన ప్రారంభం కాకముందే కరోనా మహమ్మారితో వారి స్టార్టప్‌కి బ్రేక్‌లు పడ్డాయి. అకస్మాత్తుగా మారిపోయిన ప్రపంచం ఒకవైపు..ఏదో నిర్మించాలనే తపనతో కష్టపడుతున్న హర్షిత బృందం ఇంకోవైపు. నిజానికి ఆ టైంలో చాలా స్టార్టప్‌లు మూతపడ్డాయి. చాలామంది వ్యవస్థాపకులు తిరిగి ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు కూడా. అయితే హర్షిత బృందం మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ట్రంక్ స్టాప్లకు వెళ్లారు. వారాల తరబడి అక్కడే నిలబడి ఆ ట్రక్ డ్రైవర్లతో మాట్లాడేవారు. వారి సమస్యల గురించి, చెల్లింపుల గురించి అడిగారు. అలాగే ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిజానికి హర్షిత బృందానికి ట్రక్కింగ్ పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. దానికి సంబంధించి..ఫ్లీట్ల కోసం చెల్లింపు వ్యవస్థల గురించి కూడా ఏమీ తెలియదు. వాళ్లకు అర్థమయ్యే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంది ఆ బృందం. అలా వారు AtoBని మళ్ళీ మొదటి నుండి నిర్మించారు. ఈసారి ఈసారి అమెరికన్ ట్రక్కింగ్ పరిశ్రమ కోసం ఆర్థిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి..దశాబ్దాలుగా పాత పద్ధతులను ఉపయోగిస్తున్న పరిశ్రమ కోసం ఆధునిక టెక్నాలజీని అందించారు.అలా ఇప్పుడు అమెరికాలోని 30 వేలకు పైగా ఫ్లీట్లు AtoBని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు $800 మిలియన్లు, అంటే దాదాపు రూ. 7,600 కోట్లు. ఇక్కడ హర్షిత చదువు మానేసి మరి..తనకు ఏ మాత్రం పరిచయంలోని పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రారంభించాలనుకున్నా.. స్టార్టప్‌కు బ్రేకులు పడ్డాయేమో గానీ తనకు కాదని తన సక్సెస్‌తో నిరూపించింది. ఏప్రిల్ 2026లో, వై కాంబినేటర్ హర్షితను జనరల్ పార్టనర్‌గా పదోన్నతి కల్పించింది. అంతకుముందు ఏడాది ఆ సంస్థలో అత్యంత పిన్న వయస్కురాలైన విజిటింగ్ పార్టనర్‌గా ఉంటూ..ప్రారంభ దశలో ఉన్న వ్యవస్థాపకులకు ఒక కంపెనీని నిర్మించడంలో సహాయసహకారాలు అందించేది. దాంతో హర్షిత 24 ఏళ్లకే ప్రపంచంలోని అత్యంత తెలివైన బిల్డర్లతో పనిచేసే అవకాశం దక్కించుకుంది. ఇక్కడ ఆమె ఏ స్టార్టప్‌లకు నిధులు అందాలో, ఏ వ్యవస్థాపకులకు ప్రపంచాన్ని మార్చే అవకాశం లభించాలో హర్షితానే నిర్ణయిస్తుంది. కెరీర్ ప్రారంభించే వయసుకే వై కాంబినేటర్‌లో జనరల్ పార్టనర్ అవ్వడం అంటే మామలు విషయం కాదు. ఎవ్వరికైన ఏదైనా మొదలు పెట్టేటప్పుడూ ఆటంకాలు వస్తాయి..దాన్ని అధిగమించి ఎలా ముందుకు సాగుతున్నావనే దానిపై సక్సెస్ మొత్తం ఆధారపడి ఉంటుందని హర్షిత నిరూపించింది. (చదవండి: పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!) -
లగ్జరీ లైఫ్ వదిలి.. భారత్‌లోని మారుమూల గ్రామంలో ఆమె!
చాలామంది ఏళ్ల తరబడి కష్టపడితే గానీ సాధించుకోలేని జీవితం ఆమె సొంతం. మంచి కార్పొరేట్ ఉద్యోగం..సొంతంగా ఒక అపార్ట్మెంట్..ఫైనాన్షియల్‌గా కూడా ధీమాగా బతికే చక్కటి జీవితం ఆ విదేశీ మహిళది. అయినా అవేమి వద్దని భారతదేశంలోని ఓ మారుమూల గ్రామానికి వచ్చి ఉచితంగా పాఠశాలను నిర్వహిస్తుంది. అభాగ్యులకు, నిరుపేద ప్రజల పిల్లలకు గురువుగా మారి వారి జీవితాలను చక్కదిద్దుతోందామె. ఎవరా ఆ మహిళ అంటే..ఆ మహిళే స్విట్జర్లాండ్‌కు చెందిన శాండ్రా లావీ గోజ్కోవిచ్. ఆమె స్విట్జర్లాండ్‌లోనే పెరిగింది. అక్కడే చదువుని పూర్తి చేసి దుబాయ్‌లో మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని కూడా సంపాదించింది. ప్రపంచమంతా పర్యటించింది. ఒక అందమైన అపార్ట్‌మెంట్‌ని కూడా సొంతం చేసుకుంది. మంచి కారుతో సహా ఆర్థిక పరంగా ధీమాగా ఉండే లైఫ్ ఆమెది. కానీ ఆమె మదిలో వెంటాడే ప్రశ్న ఏంటంటే..ఇంతమంది చాలీచాలనీ జీవితం గడుపుతుంటే..తనకే ఎందుకు ఇంత లగ్జరీ లైఫ్ అని... అలా ఆమె పదిహేనేళ్ల క్రితం శాండ్రా తన లగ్జరీ లైఫ్‌ని వదులకోవాలనే గట్టిగా నిశ్చయించుకుంది. తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామ చేసి మరి భారత్‌కి వచ్చేసింది. భారతదేశంలోని సాంస్కృతి తనను ఫిదా చేసిందని, ఇది తన దృక్పథాన్నే మార్చేసిందని అంటోందామె. శాండ్రా తీసుకున్న ఆ నిర్ణయమే పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపంలో వందలాది మంది పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడింది. అక్కడి మహిళలు, వారి కుటుంబ జీవితాన్ని మార్చేసింది.రెండు చొక్కాలు, రెండు ఫ్యాంటులు..వన్‌వే టికెట్‌తో..శాండ్రా భారతదేశమంతటా ఒంటరిగా ఎలాంటి నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా కేవలం రెండు చొక్కాలు, రెండు ఫ్యాంటులతో పర్యటించినట్లు చెప్పుకొచ్చింది. కనీసం తెలిసిన వాళ్ల భరోసా కూడా లేదని తెలిపింది. తను చేసిన పని గురించి తలుకుంటే చాలా పిచ్చిపనిగా అనిపిస్తుందని అంటోందామె. అయితే జీవితం మొదటిసారి పూర్తి స్వేచ్ఛను అనుభవించానని మాత్రం అంటోంది. ఇక్కడ పర్యటించడం అంత సులభం కాకపోయినా..ఏదు తెలియని ఆనందం దొరికేదని అంటోందామె. అయితే తను ఏదో సేవ చేయాలనుకున్నానని..అందుకోసం ఇప్పటికే ఉన్న స్వచ్ఛంద సంస్థలకు మద్దతిచ్చి చేతులు దులిపేసుకోవచ్చు కానీ అది తనకు నచ్చలేదని అంటోంది. ఇక్కడ ఆ సంస్థల సొమ్ము దుర్వినియోగం అవ్వడం గమనించానని తెలిపింది. అసలు ప్రజలకు కావల్సింది..వాళ్ల అభ్యున్నతికి తోడ్పడే దిశగా అభివృద్ధి పనులు ఉండాలని తెలుసుకున్నానని అంటోందామె. ఆ మార్పు నగరాల్లో కాదని, గ్రామీణ ప్రాంతాల నుంచే సాధ్యమని గ్రహించా..అందుకోసమే..బయటవాళ్లకు కూడా తెలియని మారుమూల గ్రామానికి తీసుకువెళ్లమని చెప్పి మరి పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామమమైన సాగర్ ద్వీపానికి చేరుకున్నానని చెబుతోందామె. తను రెండున్నర గంటలు రైలు ప్రయాణించి, తదుపరి ఒక గంట పడవ జర్నీ చేసి మరి ఆ మారుమూల ద్వీపానికి చేరుకున్నట్లు తెలిపింది. ఆ ద్వీపం అత్యంత ఆధ్యాత్మికమైనది, కపిల ముని ఆశ్రమానికి నిలయం. ఆ ద్వీపంలో మూడు గ్రామాలను సందర్శించి..అక్కడ గ్రామస్తుల అవసరాలు స్వయంగా తెలుసుకుంది.ప్రతి ఇంటి తలుపు తట్టి..ఇంటింటికి తిరిగి ఒక విదేశీయురాలిగా తనపై నమ్మకం కలిగేలా చేసుకుని మరి..తమ పిల్లలను పాఠశాలకు పంపమని కోరినట్లు వెల్లడించింది. కొన్ని కుటుంబాలు సంకోచించగా, మరికొన్ని కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చాయి. అలా ఒక చిన్నారితో మొదలై..క్రమంగా వందల మంది అయ్యారు. ప్రస్తుతం, శాండ్రా సంస్థ ఒకటి నుంచి ఐదు తరగతులలో 150 మంది పిల్లలకు విద్యను అందించే ఒక ఉచిత ప్రాథమిక పాఠశాలను నడుపుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మరో 120 మంది పిల్లలు ట్యూషన్ ఫీజు, పౌష్టికరమైన రోజువారీ భోజనాన్ని అందిస్తోంది. ఈ సంస్థ 20 మంది మహిళలకు కుట్టుపనిలో శిక్షణ కూడా అందించి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించే నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో వారికి సహాయపడుతుంది. అంతేగాదు తన బృందంతో కలిసి గృహ హింస, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి వాటిపై అవగాహన కల్పిస్తుంది. అలా మొదలైంది ఈ జర్నీ..చాలా చిన్న వయసులో తన తల్లిదండ్రులు చేసే పర్యటనల వల్ల బాల్యంలోనే అత్యంత వైవిధ్యభరితమైన ప్రదేశాలు, సంస్కృతులు మనసులు బలంగా ముద్రపడిపోయాయి. ముఖ్యంగా కారవాన్ ప్రయాణాలు ప్రతి దేశంలోని ప్రజలతో సులభంగా మమేకమయ్యేందుకు అవకాశం కల్పించింది. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులను కలవడం వల్ల మన నేపథ్యానికి భిన్నంగా ప్రంపంచాన్ని చూడటం ఎలాగో చిన్నప్పుడే నేర్చుకున్నానని చెబుతోందామె. అయితే తాను వదులుకున్న కార్పొరేట్ లైఫ్ వైపుకి తిరిగి చూడలేదని అంటోందామె. ప్రస్తుతం తన సక్సెస్‌ని పదోన్నతులు, అధిక వేతనంతో చూడనని..పిల్లలతో నిండిన తరగతి గదులలో, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్న మహిళలలో, నెమ్మదిగా ఆశను కనుగొంటున్న కుటుంబాలలో చూస్తానంటోందామె. అంతేగాదు భౌతిక ఆస్తులు తాత్కాలికమైనవని, ఇతరులకు సేవ చేయడం, అవకాశాలను సృష్టించడం, అభాగ్యులకు అండగా నిలబడటంలో దొరికే సంతృప్తే వేరేలెవెల్ అని అంటోందామె. పైగా అభ్యాగులకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యం అని, తను బతికి ఉన్నంత కాలం కొనసాగిస్తానని చెబుతోందామె. View this post on Instagram A post shared by Sandra Lavie (@sandralavie) (చదవండి: 56 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ..! పట్టరాని సంతోషంలో కుమార్తె..) -
14 ఏళ్ల వయసులో టాయిలెట్ క్లీనింగ్.. ఇప్పుడేమో మార్స్ మిషన్‌కు లీడర్!
చిన్న పని అంటూ ఏదీ ఉండదు... ప్రతి అవకాశం గొప్ప విజయానికి పునాది కావచ్చు. ఈ మాటలను నిజం చేసింది బ్రిటన్‌కు చెందిన క్లేర్ పార్ఫిట్(Claire Parfitt). 14 ఏళ్ల వయసులో అంతరిక్ష కేంద్రంలో స్పేస్ టాయిలెట్‌ను శుభ్రం చేసిన ఆమె.. ఇవాళ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA)లో భవిష్యత్ మార్స్ అన్వేషణ మిషన్లకు నాయకత్వం వహిస్తోంది..ఆమె ప్రస్థానం ఎలా మొదలైందంటే..నాటింగ్హామ్కు చెందిన క్లేర్‌కు చిన్నప్పటి నుంచే అంతరిక్షంపై మక్కువ. వర్క్ ఎక్స్‌పీరియెన్స్ కోసం తొలుత నాసాకు దరఖాస్తు చేసినా అవకాశం రాలేదు. తర్వాత లీసెస్టర్‌లోని నేషనల్ స్పేస్ సెంటర్( National Space Centre)లో అవకాశం దక్కింది. ఆ సమయంలో స్పేస్ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా, కొత్తగా వచ్చిన ప్రదర్శన వస్తువులను విప్పడం, శుభ్రపరచడం వంటి బాధ్యతలను ఆమె నిర్వహించారు.ఆ పనుల్లోనే అంతరిక్ష యాత్రల్లో ఉపయోగించే స్పేస్ టాయిలెట్‌ను శుభ్రం చేయడం కూడా ఒకటి. అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన తొలి బ్రిటిష్ వ్యోమగామి హెలెన్ షార్మన్ Helen Sharman ఉపయోగించిన స్పేస్‌సూట్‌ను విప్పి పరిశీలించే అవకాశం కూడా ఆమెకు లభించింది. ఆ సూట్‌ను చూసిన క్షణం.. " ఏదో నిధి పెట్టెను తెరిచినంత ఆనందం కలిగింది" అని ఆ రోజులను క్లేర్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.ఆ చిన్న అవకాశం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఫిజిక్స్‌లో డిగ్రీ, స్పేస్‌క్రాఫ్ట్ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేసిన క్లేర్ అంతరిక్ష పరిశోధన రంగంలో అడుగుపెట్టి, వరుసగా కీలక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ముఖ్యంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఎక్సోమార్స్ రోవర్ మిషన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2028లో ప్రయోగించనున్న ఈ రోవర్ అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం అన్వేషణ చేపట్టనుంది. అలాగే భూమిపై సౌర గాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసే స్మైల్ (SMILE) మిషన్‌లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.2019లో నెదర్లాండ్స్‌లోని ESA పరిశోధనా కేంద్రంలో చేరిన క్లేర్ ప్రస్తుతం..మార్స్‌పై భవిష్యత్ మానవ, రోబోటిక్ మిషన్ల ప్రణాళిక బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా మార్స్ పరిశోధనలను సమన్వయం చేసే International Mars Exploration Working Groupకు ఛైర్‌గా కూడా ఉన్నారు.మార్స్‌ను అధ్యయనం చేయడం మానవాళి భవిష్యత్తుకు ఎంతో కీలకమని క్లేర్ చెబుతున్నారు. 2028లో రోసాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ ప్రయోగం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఆ తర్వాత మానవ యాత్రలకు అవసరమైన సాంకేతికత, ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో మార్స్ సహజ స్వరూపానికి ఎలాంటి నష్టం జరగకుండా శాస్త్రీయ పరిశోధనలు కొనసాగించడం కూడా తమ బాధ్యత అని స్పష్టం చేశారు.తన విజయానికి చిన్ననాటి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, నేషనల్ స్పేస్ సెంటర్లో లభించిన తొలి అవకాశం ప్రధాన కారణాలని క్లేర్ చెబుతున్నారు. ఆ సంస్థకు అప్పటి డైరెక్టర్‌గా ఉన్న మహిళను చూసి తానూ ఒకరోజు అంతరిక్ష రంగంలో నాయకత్వ స్థాయికి చేరాలనే ఆత్మవిశ్వాసం కలిగిందని గుర్తు చేసుకున్నారు.స్పేస్ టాయిలెట్‌ను శుభ్రం చేసిన విద్యార్థిని నుంచి మార్స్ మిషన్లకు నాయకత్వం వహించే శాస్త్రవేత్తగా ఎదిగిన క్లేర్ పార్ఫిట్ ప్రయాణం... చిన్న అవకాశాన్ని కూడా అంకితభావంతో స్వీకరిస్తే అది జీవితాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో చెప్పే స్ఫూర్తిదాయక గాథగా నిలిచింది.(చదవండి: ప్లీజ్ మంచి తల్లిగా మారండి..! ఆ తర్వాతే ఇంకేదైనా..) -
ప్లీజ్ మంచి తల్లిగా మారండి..! ఆ తర్వాతే ఇంకేదైనా..
ప్రస్తుతం సమాజం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో మంచి ఉన్నత హోదాలో ఉన్నవాళ్ల పిల్లలే పెడదోవ పట్టి..ఎలా నేరస్థులుగా మారుతున్నారో తెలిసిందే. ఒక పక్క డిగ్రీలు పెరుగుతున్నా..నేరాలు కూడా వాటికి తగ్గట్టుగా ఉండటం బాధకరం. అందుకు కారణం వృత్తిపరమైన విజయానికి ఇచ్చినంత ప్రాధాన్యత వ్యక్తిత్వ నిర్మాణానికి ఇవ్వకపోవడమేనని మేధావులు, వ్యక్తిత్తత్వ నిపుణులు నొక్కి చెబుతున్నారు. సరిగ్గా ఈ తరుణంలో యూపీ గౌవర్నర్ కుటుంబ విలువలు, పేరెంట్స్ బాధ్యత గురించి ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆలోచింపచేయడమే గాక..విద్య, వ్యక్తితత్వం ఎంత కీలకమైనవో తెలియజేసేరామె. ముఖ్యంగా ఆడపిల్లలకు ఇచ్చిన సందేశం మహిళా శక్తి గొప్పతనం, ఆమె ఏవిధంగా సమాజానికి మూలస్థంభమో వివరించారామె.కాన్పూర్‌లో ఛత్రపతి షాహు జీ మహారాజ్ విశ్వవిద్యాలయం 41వ స్నాతకోత్సవంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కుటుంబ విలువలు గురించి యువతను మేల్కొలిపేలా అద్భతంగా ప్రసగించారు. ఈ మేరకు ఆనందీ బెన్ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళలు గొప్ప వృత్తులను చేపట్టడం కంటే ముందు..మీరు గొప్ప తల్లులుగా మారండి అని పిలుపునిచ్చారు. వివాహం తర్వాత కుటుంబంలో తమ పాత్రలను సమతుల్యం చేస్తూ..వృత్తిపరమైన విజయాలు సాధించాలని ఆనందీ బెన్ అన్నారు. అలాగే పెళ్లితో చదువుకి స్వస్తి పలకొద్దని యువతులకు హితవు చెప్పారు. అన్నింటికంటే మహిళలు మంచి నిపుణురాలైన తల్లిగా మారండని, ఆ తర్వాత ఐఏఎస్ అధికారి అయినా, టీచర్ అయినా అని పిలుపునిచ్చారామె. అలాగే టీనేజ్ పిల్లలు కళాశాలల్లో చేరిన తర్వాత తల్లిదండ్రలు తమ బాధ్యత ముగిసిపోయిందని భావించకూడదని, వాళ్లని ఓ కంట కనిపెట్టాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా వాళ్ల జీవితంలో జరిగే ప్రతీ కీలక విషయంలోనే పేరెంట్స్‌గా మీరు పాలుపంచుకోవాలని సూచించారు. ఆ సమయంలో ప్రవర్తించాల్సిన తీరు, నైతిక విలువల గురించి బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. వాళ్లకు విద్యా నైపుణ్యం తోపాటు వ్యక్తిత్వ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టేలా చేయాలన్నారు. అలాగే విశ్వవిద్యాలయ హాస్టళ్లు, వాటి పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారామె. దీంతోపాటు సమాజంలో గృహ హింస, మహిళలపై నేరాలు పెరగడానికి నైతిక విలువల క్షీణతే కారణమని అన్నారామె. విద్య కేవలం విద్యాపరమైన విజయాలకే పరిమితం కాకూడదని అన్నారు. డిగ్రీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సమాజంలో ఇలాంటి నేరాలు కొనసాగుతున్నాయంటే..అది మన విద్యా వ్యవస్థ సక్రమంగా లేదనేందుకు సంకేతమన్నారు. అందుకే విద్యా పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలు కూడా అంతే ముఖ్యం అని నొక్కి చెప్పారామె. (చదవండి: దుఃఖాన్నే శక్తిగా మార్చింది..! స్ఫూర్తిగా నిలిచింది) -
ఎనర్జిటిక్ ఉమెన్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మల్లిఖేడ గ్రామం. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని గ్రామాలలో ఇదొకటి. చాలామంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా డీజిల్‌ను ఎంచుకునేవారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆమె పేరు సుమన్. భర్త చిన్నపాటి ఉద్యోగమేదో చేస్తాడు. తక్కువ ఆదాయం కారణంగా, కుటుంబాన్ని పోషించడానికి ఒక చిన్నపాటి షాపు నిర్వహిస్తోంది సుమన్. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు, ప్రింటింగ్, ఫొటో కాపీయింగ్, ఆధార్ అనుసంధాన సేవలను అందిస్తోంది. కరెంట్ సమస్య...నెత్తి మీద కత్తి!కరెంట్ సమస్య వల్ల ఆమె షాప్ సరిగ్గా నడిచేది కాదు. రోజూ ఎంతోమంది కస్టమర్లు వచ్చినా, కరెంట్ లేకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లేవారు. అలాంటి రోజుల్లో ఒకరోజు...ఊళ్లో జరిగిన గ్రామసభలో పాల్గొంది సుమన్. ఆ సభలో కరెంట్ కష్టాలను ఏకరువు పెట్టింది. ‘సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే మీకు ఏ సమస్యా ఉండదు’ అని సూచించారు అధికారులు.స్వయం సహాయక బృందాల నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తరువాత 1 కిలోవాట్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అలా సోలార్ సిస్టమ్‌కు చేరువైంది. ఇప్పుడు ఆమెకు ఎలాంటి కరెంట్ కష్టాలు లేవు. సుమన్‌కు నెలవారీ ఆదాయం పెరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ భయపెట్టడం లేదు. ఎంతో కొంత డబ్బు పొదుపు చేయగలుగుతోంది.త్రిబుల్ ఫ్రేమ్వర్క్భారతదేశ ఇంధనరంగంలో మహిళల భాగస్వామ్యం 22 శాతమే. అయినప్పటికీ పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఆశాజనకమైన పరిస్థితి కనిపిస్తోంది. సౌర, పవన ఇంధనంతో పాటు ఇతర ఇంధనాలకు సంబంధించి సాంకేతిక కార్యక్రమాలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు.‘మన దేశంలో పునరుత్పాదక శక్తి ఇంజినీరింగ్‌కు సంబంధించి ప్రత్యేక డిగ్రీ కోర్సు లేదు. మనం పూరించాల్సిన లోటు ఇది’ అంటున్నారు లూమినస్ పవర్ టెక్నాలజీ ఎండీ ప్రీతీ బజాజ్.‘మహిళలకు ఇంధనరంగం గురించి అవగాహన కలిగించాలి. ఈ రంగంలో ఉండే అద్భుతమైన కెరీర్ అవకాశాలను గురించి వివరంగా తెలియజేయాలి’ అంటారు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌లో సీఎస్ఆర్ విభాగ అధిపతి భావన కృపాల్. ఇంధన రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి 3 ఉ ఫ్రేమ్‌వర్క్ గురించి చెబుతున్నారు ప్రీతి బజాజ్.ఫస్ట్ E–ఎంకరేజర్స్ ( ప్రోత్సాహకులు)నాయకత్వ స్థానాల్లోకి మహిళలు అడుగు పెట్టడానికి ప్రేరేపించే, ప్రోత్సహించే వ్యక్తులు.సెకండ్ E – ఎన్రిచర్స్ (సుసంపన్నం, సారవంతం చేయడం) మహిళల ప్రతిభను గుర్తించి వారి కెరీర్ పురోగతికి మార్గాలు చూపించే సీనియర్లు.థర్డ్ E – ఎంగేజర్స్ (నిమగ్నపరిచేవారు)తమకు ఉన్న విశ్వసనీయతను, ఇన్‌ఫ్లూయెన్స్‌ను ఉపయోగించి మహిళలకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, వారికి అండగా ఉంటూ, ఉన్నతస్థానాలకు చేర్చడంలో తోడ్పడేవారు.ప్రత్యామ్నాయాల దారిలో...దశాబ్దాల కాలం నుంచి మన ఇంటి వంటకు ఎల్పీజీ వెన్నెముకగా ఉంది. అయితే పెరుగుతున్న ధరలు, సరఫరాకు సంబంధించిన సమస్యలు, పర్యావరణ అవగాహన కారణంగా చాలామంది గృహిణులు ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలు అన్వేషించడం ప్రారంభించారు. ఎల్పీజీపై ఆధారపడడాన్ని తగ్గించగల ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించారు.గృహిణులకు అత్యంత సులభంగా అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలలో ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్‌టాప్ ఒకటి. ఇండక్షన్ స్టవ్‌లు విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి పాత్రలను నేరుగా వేడి చేస్తాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేని పట్టణాలలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.మోడ్రన్ ఇండక్షన్ కుక్‌టాప్‌లు భారతీయ వంటకాల కోసం ముందుగా సెట్ చేసిన మెనూలతో వస్తున్నాయి. దీని వల్ల సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వారికి కూడా వీటిని ఉపయోగించడం సులభం అవుతుంది. అమెరికా– ఇరాన్ యుద్ధ నేపథ్యంలో పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఆధునిక, పురాతన సంప్రదాయ పద్ధతులను ప్రజలు అనుసరించారు.అవసరంలో ఉన్నప్పుడు ఆవిష్కరణ పుడుతుంది అంటారు. నిన్నామొన్నటి ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం నేపథ్యంలో ఆ మాట మరోసారి గుర్తుకు వస్తుంది. యుద్ధం రెండు దేశాల మధ్య జరిగిందా? రెండు దేశాలు కలిసి సామాన్యులపై చేశాయా? అనేది అంతుచిక్కని జవాబు. యుద్ధం వల్ల ఎల్పీజీ సంక్షోభం ఒక కోణం అయితే, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వెదుక్కోవడం, పాత పద్ధతుల్లోకి తిరిగి వెళ్లడం మరో కోణం. ప్రత్నామ్నాయ ఇంధన వనరుల విషయంలో మహిళలు ముందున్నారు. ఎనర్జిటిక్‌గా ముందుకు వెళుతున్నారు.. -
ఆదర్శ వనిత.. అద్భుత ప్రతిభ
తూర్పుగోదావరి: అందం, చదువు, ఆటలు.. ఈ మూడింటిలో దూసుకుపోతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నిహారిక. ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతూ, సివిల్ సర్వీసెస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పాశర్లపూడిలంకకు చెందిన తెలగారెడ్డి నిహారిక కుటుంబం ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడింది. గ్రామ దేవత చింతాలమ్మ జాతరకు స్వగ్రామం వచ్చిన నిహారిక తన అభిరుచులు, లక్ష్యాలను సోమవారం స్థానిక మీడియా ప్రతినిధులకు వివరించారు. View this post on Instagram A post shared by krshna (@thisiskrshna)బహుముఖ ప్రజ్ఞ నిహారిక సౌందర్య పోటీల వేదికపై భారతీయ ముద్దుగుమ్మగా మెరిసింది. శాస్త్రీయ నృత్య వేదికలపై ఆధ్యాత్మిక ఘనతను చాటింది. క్రీడా మైదానంలో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా దూసుకుపోతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశ, విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న నిహారిక బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. విజయాల ప్రస్థానం... మిస్ టీన్ గార్జియస్ ఆఫ్ ఇండియా విజేతగా జాతీయ స్థాయిలో నిహారిక గుర్తింపు పొందింది. మిస్ ఉత్తరాంధ్రగా ప్రాంతీయ కిరీటం, మిస్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. మిస్ వైజాగ్ గ్లోబ్ పోటీల్లో టాప్–5లో నిలిచి అత్యంత ప్రతిభ చాటింది. భారతీయ సంప్రదాయ కళలను గుండెల్లో నింపుకొన్న ఆమె.. చక్కని శాస్త్రీయ నృత్య కారిణిగా రాణిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాశీ, తిరుపతితో పాటు ఎన్నో దేవస్థానాల వేదికలపై అనేక ప్రదర్శనలు ఇచ్చింది.ప్రధాని మోదీ ప్రశంసలు కళలు, క్రీడలు, చదువులో నిహారిక చూపిస్తున్న అసాధారణ ప్రతిభను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన అంబేడ్కర్ జయంతిలో ప్రధాని చేతుల మీదుగా అభినందనలు అందుకుంది. -
దుఃఖాన్నే శక్తిగా మార్చింది..! స్ఫూర్తిగా నిలిచింది
మనకే ఈ కష్టాలు అనుకుంటాం. కానీ ఏ ఒక్కరిని పలకరించినా లేక మాటలు కలిపినా..మనమే నయం అనిపిస్తుంది, పైగా ధైర్యంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తాం కూడా. అలాంటి కన్నీటి కథే ఇది. ఒంటరిగా పోరాడుతూ అలిసిపోయినా ఓ రిటైర్డ్ మహిళా టీచర్ కన్నీటి వ్యథ. ఇంతటి స్థితిలో కూడా ఆశను వదులుకోనంటూ సరికొత్త జీవితానికి నాంది పలికి అండగా నిలిచే సంతోషాన్ని వెతుక్కుంటూ సాగిపోతోంది. నిజంగా ఆమె ధైర్యానికి మాటల్లేవ్ అంతే..!.ఆ మహిళే హర్యానాకు చెందిన సునీతా చౌదరి తన కథను సోషల్ మీడియా వేదికగా పంచుకుందిలా. అందరి అమ్మాయిల్లానే 20 ఏళ్ల వయసులో మీరట్‌లో పెళ్లి చేసుకుంది. ఆమె భర్త ఒక న్యాయవాది. ఆయనొక స్కూల్‌ని కూడా నడిపేవారు. ఆ తర్వాత కొన్నేళ్లకు సునీతా ఆ పాఠశాల్లోనే బోధించడం ప్రారంభించిది. చాలామంది అమ్మాయిల్లానే ఆమె కూడా తన భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంది. కానీ కొన్నేళ్లకే ఊహించని విధంగా కష్టాలు ఒకదానివెంట ఒకటిగా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆమెకు అత్తమామల అండ లేకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంది. మొదటి గర్భధారణ సమయంలో ఎవ్వరి మద్దతు లభించలేదామెకు. ఆ పట్టణం కూడా కొత్త అవ్వడంతో ఎవ్వరిని సహాయం అడగాలో తెలియని స్థితి. సరిగ్గా ఆ సమయంలో ఉమ్మనీరు లీక్ అయ్యి..ఆస్పత్రిలో చేరేందుకు ఒంటరిగా వెళ్లిన ఘటన ఇప్పటికీ మర్చిపోనంటోందామె. అక్కడ ఎవరో ఇద్దరు మహిళలు చూసి క్లినిక్ తీసుకువెళ్లారు..అక్కడ తనని పరీక్షించి సెలైన్ ఎక్కించారని, ఆ తర్వాత ఆ విషయాన్ని స్కూల్లో ఉన్న భర్తకు చేరవేశానని చెప్పుకొచ్చారు. ఆయన వచ్చి మెరుగైన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ మొదటి బిడ్డకు జన్మనిచ్చానని అన్నారు. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో సైతం తన పరిస్థితి బాగోలేదని ఆ సమయంలో తన భర్త రూర్కీలో ఉన్నారని తెలిపింది. అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆమె ముందుకు రాలేదని, తన మామగారే పక్కింటావిడిని పిలుచుకొచ్చారని చెప్పుకొచ్చింది. సరిగ్గా తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రసవం జరిగిందని, ఆ తర్వాత ఏమైనా తిన్నవా అని అడిగేవారే లేరంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి ఉదయం 5 గంటలకు తనే లేచి పాలు కాసి పాల సీసాలో పోసి పెద్ద కొడుక్కి పట్టించానని ఆవేదనగా చెప్పింది. ఇక మూడో ప్రసవం సమయంలో అస్సలు మద్దతు లేదని, తన భర్త పక్కనే ఉన్నా..ఎన్ని పనులు అని చేయగలరని ఆక్రోశంగా చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా కాలం పాటు అనారోగ్యంతో బాధపడ్డానని, టైఫాయిడ్, క్షయ వంటి వ్యాధుల అటాక్ అయ్యాయని, చూసుకునేవారు లేరని బాధగా తెలిపింది. ఇంకోవైపు పుట్టిన పాప చాలా బలహీనంగా ఉండటంతో తీవ్రమైన కామెర్లతో బాధపడింది. దీనికి తోడు హర్ట్‌లో హోల్ ఉన్నట్లు వైద్యులు నిర్థారించడంతో పెద్దపీడుగు పడ్డట్లు అనిపించిందని తన బాధను ఏకరవు పెట్టింది. చివరికి ఏదోలా ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ చేయించాం కదా ఇక కష్టాలకు పులిస్టాప్ పడింది అనుకుంటే..విధి మరోలా తలిచింది. సరిగ్గా ఆ తర్వాత\భర్త అనారోగ్యం బారిన పడ్డారు. ఆయనకు కేన్సర్ ఉన్నట్లు తెలిసింది. పైగా ఎలాంటి వైద్య బీమా లేకపోవడంతో పిల్లల చదువులు, ట్యూషన్లు, స్కూల్ వ్యవహారాలు తదితర ఇంటి బాధ్యతన్నీ తానే స్వయంగా చూసుకోక తప్పలేదు. పోనీ భర్తకు ఆపరేషన్ చేయించి బతికుంచి కుంటే మరోసారి విధి కన్నెర్రజేసిందంటూ తన బాధన వివరించింది. ఈసారి యాక్సిడెంట్ రూపంలో వచ్చి..తన భర్తను మరోసారిఆస్పత్రి పాలయ్యేలా చేసింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. చివరిక ఆయన డయాలిసిస్‌పై ఆధారపడి జీవించాల్సి వచ్చింది. అంత కష్టంలోనూ అత్తమామల నుంచి ఎలాంటి సహయా సహకారాలు లభించలేదని వాపోయింది. ఆయన కోసం తన వల్ల అయ్యిందంతా చేసినా..చిరికి ఆయన 52 ఏళ్ల వయసులో తనను వదిలి వెళ్లిపోయారని బాధగా చెప్పింది. ఆ తర్వాత కరోనా వచ్చి..ఇంట్లోనే బంధీగా మార్చింది. ఇక అప్పటికే శారీరకంగా, మానసికంగా అలిసిపోయాను, ఆర్థికంగా దెబ్బతిన్నాను. పోనీ మా వద్ద డబ్బు తీసుకున్నవాళ్లు సైతం మొండిచేయి చూపించారు. ఇక ఆ క్లిష్ట సమయంలో ఎందుకోసం బతకాలి ఏంటీ జీవితం..అని చాలా విరక్తిగా అనిపించింది. దాంతో జీవితాన్ని ముగించేద్దాం అనే కఠిన నిర్ణయం కూడా తీసుకున్నా. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె యూటర్న్ తీసుకుని.. ఉపాధ్యాయురాలిగా బోధించే వృత్తిలో ఉన్న నాకు బోధించడమే తెలుసు..ఓడిపోవడం కాదు అని తనకు తనే ధైర్యం చెప్పుకుంది. తక్షణమే చనిపోయిన తన భర్త ఫోన్‌ని చేతికి తీసుకుని దీనిలోనే తన సంతోషాన్ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఎలాగో లాక్డౌన్ కావడంతో..సోషల్ మీడియాలో రీల్స్ చేద్దాం అని డిసైడ్ అయ్యింది. అప్పటికీ ఆమెకు 60 ఏళ్లు టీచర్‌గా పదవీ విరణమ చేశారు కూడా. కానీ ఎలా మొదలుపెట్టాలి, ఏం చేయాలో తెలియలేదు. దాంతో తన కథనే సోషల్ మీడియాలో పంచుకోవడం మొదలు పెట్టింది. తన ఆవేదనను బంధువులు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోతేనేం..నెటిజన్ల మనసును తాకింది, అమితంగా ఆకర్షించింది కూడా. వాళ్లంతా ఆమెను సూపర్ ఉమెన్ అంటూ మా సపోర్ట్ మీకే అమ్మ అన్న మాటలు ఆమెకు ఊపిరిపోశాయి. దాంతో మరిన్ని వీడియోలు నెట్టింట షేర్ చేయడం మొదలు పెట్టింది. ప్రతీదీ వైరల్ అవ్వడమే గాక సుమారు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఈ సోషల్ మీడియా తనకు ఎవ్వరూ లేరనే బాధ తీర్చి..,ఇంతమంది మద్దితిచ్చేలా ఓ పెద్ద కుటుంబాన్ని కానుకగా ఇచ్చిందని ఆనందంగా చెప్పుకొచ్చింది సునీతా. కానీ భర్తను కోల్పోయిన బాధ మాత్రం తనను ఎప్పటికీ వీడదంటూ తన స్టోరీను ముగించింది. ఆమె కథ దుఃఖాన్ని శక్తిగా మార్చుకోవడం ఎలా అని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. ఇలానే అందరి జీవితాల్లో కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి..ఎంత ధైర్యంగా ఫేస్ చేశామన్నదే ముఖ్యం కానీ..నాకే ఎందుకు అన్న ప్రశ్నకు తావివ్వకూడదనే సందేశాన్ని ఇస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Sunita Chaudhry (@retired_sunita) (చదవండి: ఆ రోజు అమ్మ ఆభరణాలు అమ్మడం వల్లే.. ఇవాళ ఏకంగా రూ. 1.9 కోట్లు..) -
గాయపడ్డ శరీరాలు.. బాంబులకు బదులు బంతితో సమాధానం!
ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్ ఉత్సాహంలో మునిగిపోయింది. స్టేడియాలు అభిమానుల సందడితో మారుమోగుతున్నాయి. కానీ గాజాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. కరెంట్ ఉండే కొద్దిసేపైనా టీవీ ముందు గుమిగూడటం.. ఇంటర్నెట్ సిగ్నల్ కోసం భవనాలపైకి ఎక్కడం.. బ్యాటరీని పొదుపుగా వాడుకుంటూ మ్యాచ్‌లు చూడటం అక్కడి ప్రజల దైనందిన దృశ్యం. అలాంటి యుద్ధ వాతావరణంలోనూ ఫుట్‌బాల్ మాత్రం వారికి కాసేపైనా భయాన్ని మరిచిపోయే ప్రపంచంగా మారింది.అయితే అక్కడి నుంచే ఇప్పుడు మరో ఫుట్‌బాల్ కథ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అవయవాలు కోల్పోయిన గాజా యువతులు.. ఇప్పుడు ఫుట్‌బాల్ మైదానంలో తమ జీవితానికి కొత్త అర్థం వెతుకుతున్నారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్న అమ్మాయిలతో కలిసి పాలస్తీనాలో తొలి మహిళల అంప్యూటీ ఫుట్‌బాల్ జట్టుగా ఏర్పడి(amputee).. చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి వారం.. డీర్ అల్-బలాహ్‌లో దాడుల్లో మిలిగిన కొద్దిపాటి గడ్డి మైదానంలో వారు సాధన చేస్తున్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. ఒకరోజు ప్రపంచ వేదికపై పాలస్తీనా జెండాను ఎగురవేయడం.గాజా ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ దాదాపు ఆరు వేల మంది అవయవాలు కోల్పోయారు. వీరందరికీ కృత్రిమ అవయవాలు, దీర్ఘకాలిక పునరావాసం అవసరమైంది. ఈ పరిస్థితుల్లోనే 2018లో స్థాపించబడిన పాలస్తీనా అంప్యూటీ ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ఆశాకిరణంగా మారింది. యుద్ధం తర్వాత వికలాంగుల సంఖ్య పెరగడంతో మహిళల జట్టులో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.‘‘మా మైదానాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి లేదు. అయినా ఈ అమ్మాయిల సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది" అని అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఫౌద్ అబూ ఘూలియన్ చెబుతున్నారు. ప్రపంచకప్ సందర్భంగా గాజా నుంచి వినిపించాల్సిన గొంతులు కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఈ మహిళలు నిజమైన ఛాంపియన్లని ఆయన అంటున్నారు. 2027లో జరగనున్న మహిళల అంప్యూటీ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనడమే తమ లక్ష్యమని వెల్లడించారు.24 ఏళ్ల రోజాన్ ఖైరా జీవితాన్ని మాత్రం యుద్ధమే ఒక్కసారిగా మార్చేసింది. 2023 నవంబరులో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబ ఇంటిపై బాంబు పడటంతో ఆమె ఒక కాలును కోల్పోయింది. ఒకప్పుడు పరుగుపందేల్లో పతకాలు గెలిచిన ఆమెకు అది పెద్ద దెబ్బే. కానీ అదే సంఘటన ఆమె సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇప్పుడు అంప్యూటీ ఫుట్‌బాల్ జట్టులో చేరి తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటోంది.గోల్‌కీపర్ ఐషా అల్ అబద్లా కథ మరింత హృదయవిదారకం. 2008 యుద్ధ సమయంలో ఆమె తల్లి తెల్ల భాస్వర(వైట్ పాస్పరస్) రసాయన ప్రభావానికి గురికావడంతో ఐషా ఒక చేయి పూర్తిగా అభివృద్ధి చెందకుండా జన్మించింది. అయినా దానిని ఆమె ఎప్పుడూ బలహీనతగా భావించలేదు. ఎనిమిదేళ్లుగా ఫుట్‌బాల్ ఆడుతున్న ఆమెకు ఆటే జీవితం. "మైదానంలోకి దిగితే యుద్ధానికి ముందు ఉన్న రోజులు గుర్తొస్తాయి. మా జీవితంలో ఆనందం మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది" అని చెబుతోంది.అయితే వీరి పోరాటం మైదానంలోనే ముగియడం లేదు. చాలామందికి శరణార్థి శిబిరాల నుంచి సాధనకు రావడానికి ప్రయాణ ఖర్చులే భారంగా మారుతున్నాయి. ఆహార కొరత, పోషకాహార లోపం, క్రీడా సామగ్రి కొరత వంటి సమస్యలు ప్రతిరోజూ వెంటాడుతున్నాయి. అయినా "పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మా పట్టుదల మాత్రం తగ్గదు" అని రోజాన్ ధైర్యంగా చెబుతోంది.ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్‌ను చూస్తుంటే... డీర్ అల్-బలాహ్లోని ఈ యువతులు కూడా వీలైనప్పుడల్లా ఆ మ్యాచ్‌లను చూస్తున్నారు. కానీ వారు కేవలం ప్రేక్షకులుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఒకరోజు అదే ప్రపంచం తమ ఆటను కూడా చూడాలని... తమ గాయాలను కాదు, తమ గెలుపును గుర్తించాలని కలలు కంటున్నారు. యుద్ధం వారి అవయవాలను దూరం చేసినా... ఫుట్‌బాల్‌పై ప్రేమను, జీవితంపై ఆశను మాత్రం ఏ బాంబూ చెరిపేయలేకపోయింది. -
మిషన్ శక్తిశాట్‌లో మహిమ..
శక్తిశాట్ అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌లో 108 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మన దేశం నుంచి పదవతరగతి చదువుతున్న మహిమా రాజ్‌పుత్ ఎంపికైంది.ఉపగ్రహాలు, అంతరిక్ష మిషన్లకు సంబంధించి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఉపయోగపడే 365 పాఠాలను ఈ శిక్షణ కార్యక్రమంలో బోధిస్తారు.నూట ఎనిమిది దేశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘మిషన్ శక్తిశాట్’లో ఉపగ్రహాల తయారీపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్ట్ 23న దిల్లీకి వెళ్తారు. అక్కడ, మిషన్‌లో భాగంగా ఉపగ్రహాల తయారీ ప్రక్రియలో పాల్గొంటారు. ఉపగ్రహాల తయారీతో పాటు ఇతరత్రా సాంకేతిక విషయాలపై పాఠశాల విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే ‘మిషన్ శక్తిశాట్’ అక్టోబర్‌లో మొదలవుతుంది. -
భర్త వార్నింగ్.. ఆ భార్యను 'అన్నపూర్ణ'గా మార్చింది..!
ధనవంతులు కాబట్టి దానధర్మాలు చేస్తుంటారు అనుకుంటాం. డబ్బులు, నిధులతో పనిలేకుండా..కనీసం తాము బతకడానికే లేకపోయినా గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న మనసున్న మారాజులే కాదు మారాణులు కూడా ఉన్నారు. ఆకలి బాధల మధ్య పెరిగి..అనునిత్యం ఆ సమస్యతో బాధపడిన ఆ మహిళే అన్నమో రామచంద్రా అని అల్లాడుతున్న వారి పాలిట అన్నపూర్ణగా మారి ఎందరికో కనువిప్పు కలిగించే మహోన్నతమైన వ్యక్తిగా నిలిచింది. దానం చేయాలంటే ధనంతో పనిలేదని..సాయం చేసే మంచి మనసు ఉండాలని చాటి చెప్పింది. ఆ మహిళే కాజులి బిస్వాస్. ఎవ్వరిని ఆకలితో అలమటించకుండా చేసే తల్లిగా పేరు ఆమెకు. పశ్చిమబెంగాల్‌కి చెందిన కాజులి ఒక పేద కుటుంబంలో జన్మించింది. ఒక పూట భోజనంతో రోజంతా గడపాలి. అలాంటి దుర్భర పరిస్థితుల మధ్య పెరిగింది కాజులి. పేదరిక జీవితంలో ప్రతినిర్ణయాన్ని ఆకలి ఎలా ప్రభావితం చేస్తుందో ఆమె కళ్లారా చవి చూసింది. అప్పుడే ఆమెకు తెలిసింది ఆకలి అనేది తాత్కాలికి సమస్య కానే కాదు. అది ఒక పెద్ద పోరాటం, పెను సమస్యని అర్థం చేసుకుంది. రోడ్డు పక్కన ఆకలితో నకనకలాడుతున్న వాళ్లను చూస్తే కాజులికి మనసు కకలా వికలం అయిపోయేది. ఆ దృశ్యాలు ఆమెను తీవ్రంగా కలిచివేసేవి. వాళ్లలో తనను తాను చూసుకుని బాధపడేది. ఆ కష్టాల కొలిమిలో కాజులి జీవితం మరో ములుపు తిరిగింది. పెళ్లి చేసేస్తే అక్కడైన మంచి జీవితం లభిస్తుందని అంతా నచ్చచెప్పి మరి .. ఆమెకు 15 ఏళ్లకే పెళ్లి చేసేశారు. అందరి అమ్మాయిల్లానే ఇక నుంచి తన జీవితం హాయిగా సాగిపోతుందనుకుంది. అక్కడ మరింత ఘోరం. ఆకలి కోసం అత్యంత ఘోరమైన పోరాటం కనిపించిందామెకు. ఈలోగా ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టేశాడు. చిన్నప్పటి నుంచి బాధలు, పెళ్లాయ్యాక కూడా అవే బాధలతో నలిగిపోయిన ఆమె మనసు ఒక అనుహ్య నిర్ణయం తీసుకునేందుకు దారితీసింది. ఈ ఆకలిని చూసి విసుగుపుట్టింది..అందుకే ఆకలి అని బాధపడుతున్న వాళ్లందరికీ అన్నం పెట్టాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలాగని ఆమె వద్ద ఎలాంటి నిధులు, డబ్బులు లేవు. సహాయం చేసే వ్యక్తులు కూడా లేరు.. తన వల్ల అయ్యింది చేసైనా ఈ మహత్తర కార్యానికి పూనుకోవాలి, ఆకలి బాధలు అడ్డుకట్టవేయాలి.. అని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే ఆమె అసాధ్యమైన నిర్ణయానికి భర్త, అతడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఈ సేవకార్యక్రమాలు చేయాలనుకుంటే తనతో ఉండటమో లేదా రోడ్లపై ప్రజలకు అన్న పెట్టే సేవనో .. ఏదో ఒకటే ఎంచుకోవాల్సిందిగా తెగేసి చెప్పారు. ఇక్కడ కాజులి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆకలితో అలమటించే అన్నార్తుల కడుపు నింపడమే తన ఆశయం అంటూ దానివైపుకే మొగ్గు చూపింది. ఏదో తీసుకుంది గానీ..అంత మందికి కాదు కదా..తనకే తింటానికి తిండి లేదు ఎలా పెట్టాలన్నది ఆమె ముందున్న ప్రశ్న. అయినాసరే తన చెవిపోగులను తాకట్టు పెట్టి తొలి రోజు రోడ్లపై అలమటిస్తున్న వాళ్ల ఆకలిని నింపింది. తన కొడుకుతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఈ సేవా పనులు చేస్తుండేది. వనరులు తక్కువగా ఉన్నా, సాయం చేసే వాళ్లు లేకున్నా..తనవల్ల అయ్యింది చేస్తూనే ఉండేది. అందుకోసం డబ్బు సంపాదించడానికి ఆహర్నిశలు కష్టపడేది. సంపాదించిన మొత్తం తన జీవనం కోసం కాకుండా..ఇతరుల పొట్ట నింపడమే ధ్యేయంగా వంటలు చేస్తుండేది. కాజులి ప్రచారం కోసం లేదా గుర్తింపు కోసమో ఇది చేయడం లేదని కొద్దిరోజుల్లోనే స్థానిక ప్రజలు గుర్తించారు. ఇవాళ ఆమెకు చాలామంది మద్దతిచ్చేందుకు ముందుకు రావడమే కాదు..కొందరు ఆహార పదార్థాలను విరాళంగా కూడా ఇస్తున్నారు. మరికొందరు ఆమెకు అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇవాళ ప్రతి రోజు దాదాపు 100 మందికి పైగా ఆహారం అందిస్తోంది. అంతేగాదు వీధుల్లో కాజులి రాక కోస ఎదురు చూడటం మొదలైంది. ఆహారం అంటే ఆకలి మాత్రమే కాదని, శ్రద్ధ చూపడం, ఆకలి భయాన్ని పోగొట్టడం అని అంటుందామె. అంతేగాదు అక్కడితో ఆగాలని అనుకోవడం లేదు కాజులి. ఒక అనాథశ్రమాన్ని నిర్మించి అవసరంలో ఉన్న ప్రజలకు సురక్షితమైన వసతి అందించాలన్నదే తదుపరి ధ్యేయమని చెబుతోంది. ఇక్కడ కాజులి కథ సంపద, హోదా వంటి స్థాయిలతో కొలిచేది కాదు. ఆమె ఎంచుకున్న మార్గంలో సాధించిన విజయాన్ని వడ్డించే ప్రతి భోజనపు పళ్లెంలోనో లేక ఇకపై ఆకలితో నిద్రపోని ప్రజల కృతజ్ఞతలోనో చూడొచ్చు. ఆమె కథ తను ఉన్న స్థితికి మించిన నిర్ణయమే అయినా..ఇతరుల మేలు కోరడంతోనే విజయం తనంతాట తాను వొళ్లోకొచ్చి వాలుతుంది అనే చెప్పే స్టోరి. (చదవండి: అరుదైన ఆరోగ్య సమస్యతో పోరాడుతూ..డాక్టర్ అయ్యింది!) -
ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ
రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం నుండి ఆల్ ఇండియా 23వ ర్యాంకు వరకు డాక్టర్ సునీతా జాట్ జీవిత ప్రయాణం, సాధించిన అసాధారణ విజయం ఎంతోమందికి స్పూర్తిదాయకం. రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం నుండి UPSC CMS పరీక్షలో ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించే వరకు సునీత ప్రయాణం అంత ఆషామాషీగా ఏమీ సాగలేదు. వ్యక్తిగత విషాదాలు, సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలను ఎదుర్కొని తన ఆశయాన్ని సాధించన ధీర మహిళ ఆమె.రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా ‘సువానా’ అనే చిన్న గ్రామంలో సునీత జన్మించారు. ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచనలున్న ఆ ఊరిలో, సునీత తండ్రి మాత్రం భిన్నంగా ఆలోచించారు. బంధువులు, చుట్టుపక్కల వారి మాటలను పక్కనపెట్టి, ఆయన సునీతను డాక్టర్ చదివించడం కోసం కోటా పంపారు. ఆమె మెడికల్ ఎంట్రన్స్ పాసై, BAMS (ఆయుర్వేద వైద్యం) కాలేజీలో చేరారు.కానీ దురదృష్టం ఏమిటంటే ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే సునీత తండ్రి అకస్మాత్తుగా మరణించారు. ఆ వార్తతో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయారు సునీత. కానీ,అంతలోనే తేరుకుని, ధైర్యం తెచ్చుకుని, తన కోసం తండ్రి చేసిన త్యాగాలను గుర్తుచేసుకుని, డిగ్రీని విజయవంతంగా BAMS పూర్తి చేశారు. ఇదీ చదవండి: షాకింగ్ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!పెళ్లి తరువాత ఒత్తిడిచదువు పూర్తయ్యాక, దేశానికి సేవ చేయాలనే తన ఆశయాన్ని పెళ్లికి ముందే భర్తకు, అత్తమామలకు స్పష్టంగా చెప్పారు. వారు మొదట ఒప్పుకున్నా, పెళ్లయ్యాక మాత్రం సునీతను ఉద్యోగం చేయనివ్వకుండా వంటింటికే పరిమితం కావాలని ఒత్తిడి తెచ్చారు. అయినే ఇంటి నుంచే పనిచేస్తూ వచ్చింది. అదే సమయంలో సునీత గర్శం దాల్చింది. దీన్నిసాకుగా చూపి సరిగ్గా ఆమె ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, ఉద్యోగమైనా వదులుకో.. లేదా సంసారమైనా వదులుకో అంటూ పెద్ద ఛాలెంజ్ విసిరారు అత్తింటి వారు. గర్భవతిగా ఉన్న సమయంలోనే ఒంటరిగా ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశారు.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్2023 ఏప్రిల్ 20న, ఆమె భర్త ఆమెను వాళ్ళ అమ్మానాన్నల ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. సునీత చెప్పిన ప్రకారం, ఆ రోజు తర్వాత అతను ఆమెను బ్లాక్ చేశాడు. ఎలాంటి కాల్స్ లేవు, మెసేజ్‌లు లేవు, ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం లేదు, ఏమీ లేదు. దీంతో తండ్రి, తన ఆశయ సాధన కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సునీత తన ఆత్మగౌరవాన్ని, దేశానికి సేవచేయాలనే కల సాకారంకోసం కట్టుబడి ఉండేలా నిర్ణయించుకున్నారు. ఒంటరి తల్లిగా పోరాటంఒక పక్క విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగడం, చిన్న బిడ్డను పెంచడం, మరోపక్క సమాజం నుండి ఎదురైన సూటిపోటి మాటల వల్ల సునీత మళ్లీ తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యారు. ఆ సమయంలో ఆమె తల్లి కొండంత అండగా నిలిచారు. తల్లి బిడ్డను చూసుకుంటుంటే, సునీత రాత్రుళ్లు బాబును ఒడిలో పడుకోబెట్టుకుని గంటల తరబడి UPSC పరీక్ష కోసం చదివేవారు. ఆమె నిరంతర శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. కేంద్ర ప్రభుత్వ వైద్య సేవల రిక్రూట్మెంట్ (UPSC CMS) ఫలితాలు వచ్చినప్పుడు ఆమె ఏకంగా ఆల్ ఇండియా 23వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె దేశానికి సేవలందిస్తూ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు."జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకుంటే, ముందు మీకంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి. సమస్యలను చూసి భయపడితే లాభం లేదు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. దారి కష్టంగా ఉన్నా, పట్టుదల ఉంటే విజయం మీ సొంతమవుతుంది." అంటారామె. -
సముద్ర గర్భంలో సాహసతార
స్కూటీ డ్రైవింగ్‌కు, స్కూబా డైవింగ్‌కు తేడా తెలియని చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది అతుల్య. స్కూబా డైవింగ్ గురించి తెలుసుకోవడానికి ఆమెకు చాలాకాలమే పట్టింది. అయితే... భవిష్యత్ కాలాలు కూడా గుర్తు పెట్టుకునే విజయాలను స్కూబా డైవింగ్‌లో సాధించింది. స్కూబా డైవింగ్ శిక్షణ పూర్తి చేసిన కేరళకు చెందిన మొదటి మహిళగా, కమర్షియల్ స్కూబా డైవింగ్‌లో ఐఎన్సీఏ సర్టిఫికేషన్ పొందిన మొదటి భాతీయురాలిగా రికార్డ్ సృష్టించింది...సముద్రం ఇప్పటికీ ఒక అంతచిక్కని రహస్యమే. పాలక్కాడ్‌కు చెందిన 29 ఏళ్ల అతుల్య బెల్గాడ్కు ఆ రహస్య ప్రపంచంలోకి తొంగిచూడాలనే ఆసక్తి ఒక శక్తిగా మారింది. ఆ శక్తితోనే మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్న స్కూబాడైవింగ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. నీటి అడుగున చేసే కమర్షియల్ డైవింగ్ అనేది పైప్లైన్లు, ఇంటర్నెట్ కేబుళ్ల నిర్వహణ, వెల్డింగ్...మొదలైన వాటికి సంబంధించిన సాంకేతిక వృత్తి. దీనికి శారీరక బలం, సముద్రంపై అవగాహన, క్రమశిక్షణ అవసరం.మహిళలు ఒక్కరూ లేరు!త్రిస్సూర్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో స్కూబాడైవింగ్ గురించి తొలిసారిగా విన్నది అతుల్య. స్కూబాడైవింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనే విషయం కూడా తెలుసుకుంది. ఆ సమయంలోనే ‘నేను ఎందుకు ప్రయత్నించ కూడదు!’ అని ఆలోచించి స్కూబాడైవింగ్పై ఆసక్తి పెంచుకుంది.‘నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని అన్వేషించాలనే ఆలోచన నన్ను ఎంతగానో ఆకర్షించింది. సముద్రగర్భంలో ఏముందో చూడాలనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది’ అంటున్న అతుల్యకు ఈత కొట్టడంలో మంచి ప్రావీణ్యం ఉంది. స్కూబా డైవింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి సంబంధించి తల్లిదండ్రులను ఒప్పించింది. వారు ఓకే అనడంతో మరింత ధైర్యం వచ్చింది. స్కూబా డైవింగ్ కోసం కోవలం వెళ్లింది. మహిళలు ఒక్కరూ కనిపించలేదు! ఏవేవో భయాలే ఉండేవి. అయితే శిక్షణ సజావుగా సాగింది. ఆ తరువాత కమర్షియల్ స్కూబాడైవింగ్‌లో శిక్షణ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడే కమర్షియల్ స్కూబాడైవింగ్‌లో సర్టిఫికేషన్ పొందింది. కేరళకు తిరిగి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు కోస్టల్ పోలీసులకు ట్రైనర్‌గా పనిచేసింది.ఆ తరువాత అండమాన్‌లో సంవత్సరం పాటు పనిచేసింది. ఆ సమయంలో అతుల్య పనితీరును గమనించిన దక్షిణాఫ్రికాలోని ఒక డైవింగ్ కంపెనీ ఆమెను సంప్రదించింది. అలా ఆమె దక్షిణాఫ్రికా ప్రయాణం మొదలైంది.ఆహ్లాదమే కాదు... ప్రమాదం కూడా!సముద్రగర్భ ప్రయాణాలు ఎంత ఆహ్లాదకరమైనవో అంతే ప్రమాదకరమైనవి కూడా. ‘ప్రమాదాలకు దూరంగా ఉండడానికి ప్రతి డైవ్‌కు ముందు ఆ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తాను’ అంటున్న అతుల్య ‘నీటి అడుగున దేనినీ తాకరాదు’ అనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తుంది. స్టోన్‌ఫిష్ అచ్చం రాయిలాగే కనిపిస్తుంది. మనం దానిని తాకితే, దాని విషపూరితమైన ముళ్లతో తీవ్రమైన గాయమై ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని కాటుకు సరిౖయెన చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ‘సముద్రపు అడుగున ఉన్న ఏదీ మనకు చెందినది కాదు. మనలాగే అక్కడ నివసించే జీవులకు కూడా వాటి సొంత జీవితాలు ఉంటాయి. మనం వాటికి ఆటంకం కలిగించకూడదు. వాటి స్థలాన్ని మనం గౌరవించాలి’ అంటుంది అతుల్య.తన సాహసాలను సముద్రం దగ్గరే ఆపాలనుకోవడం లేదు అతుల్య. ‘జీవితంలో మరిన్ని సాహసాలు చేయాలనుకుంటున్నాను. దీనికోసం కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాను. కేరళలో ఒక స్కూబా డైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉంది’ అంటుంది అతుల్య. అది నిజం కాదు!‘సాధారణంగా మేము సుమారు 50 మీటర్ల లోతు వరకు డ్రైవ్ చేస్తాము. నీటి అడుగున స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను తీసుకువెళ్తామని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు’ అంటుంది అతుల్య. వారు ఉపయోగించే గాలిలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్ ఉంటాయి. నిర్దిష్ట లోతుకు మించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉపయోగిస్తే అది విషపూరితంగా, ప్రమాదకరంగా మారుతుంది. లోతైన డైవ్‌ల కోసం హీలియం మిశ్రమాలను ఉపయోగిస్తారు. కొన్ని డైవ్‌ల తరువాత గొంతు మారే అవకాశం ఉంటుంది.చరిత్ర గర్భంలోకి!కోజికోడ్ సమీపంలో కుంజలి మారక్కర్ చరిత్రతో సంబంధం ఉందని నమ్మే ప్రాంతంలో డైవ్ చేస్తున్నప్పుడు రాళ్లతో మూసివేయబడిన అనేక పురాతన కట్టడాలను అతుల్య చూసింది. తిరువనంతపురంలో డైవ్ చేస్తున్నప్పుడు గుహల ప్రవేశద్వారాల్లా కనిపించే ఒక కట్టడాన్ని చూసింది. ‘సముద్ర గర్భం ఒక రహస్య భాండాగారం లాంటిది. ఈ ప్రదేశాలను మనం లోతుగా అధ్యయనం చేస్తే తెలియని విషయాలెన్నో కనుగొనవచ్చు’ అంటుంది అతుల్య.మరో ప్రపంచంలోకి...ఆసక్తి, ధైర్యం, శారీరక బలం ఉంటే ఎవరైనా కమర్షియల్ స్కూబా డైవింగ్ చేయవచ్చు. నీటి అడుగులోకి వెళ్లినప్పుడు అత్యంత సుందర దృశ్యాలు కనిపిస్తాయి. బయట మనం ఎప్పుడూ, ఎక్కడా చూడని రంగులు, అద్భుతాలు కనువిందు చేస్తాయి. చేపలు గుంపులుగా కలిసి తిరగడం, ఆక్టోపస్ రంగు మార్చుకోవడం చూడటం వంటివి అద్భుతమైన అనుభవాలు. నీటి అడుగున ఉన్న ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంది. దీనితోపాటు ప్రమాదాలు కూడా ఉంటాయి. బలమైన ప్రవాహాలు, సుడిగుండాలు, నీటి అడుగున విద్యుత్‌తీగలు, స్టోన్‌ఫిష్, స్ట్రింగే, లయన్‌ఫిష్ వంటి ప్రమాదకరమైన సముద్ర జీవులు, వీటితో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులు స్కూబా డైవింగ్‌ను సవాలు చేస్తాయి. లోతుకు వెళ్లే కొద్దీ చుట్టూ చీకటి ఆవహిస్తుంది. దారి తెలుసుకోవడానికి టార్చ్‌లైట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదునైన రాయిలాంటి చిన్న వస్తువు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. డైవింగ్ చేస్తున్నప్పుడు భద్రతకు సంబంధించిన ఆలోచనలు వస్తూ పోతుంటాయి.– అతుల్య -
నెయిల్ ఆర్టిస్ట్‌గా నెలకు రూ. 10 లక్షలు..! కట్‌చేస్తే కొద్ది నెలల్లోనే..
ఏ వ్యక్తి కెరీర్ అయినా.. చిన్న ఉద్యోగిగా మొదలవ్వుతుంది. కానీ కొందరే ఉన్నత స్థాయికి చేరేలా కష్టపడతారు, విజయం సాధిస్తారు. మరికొందరు అక్కడితే ఆగిపోతే.. కొందరు ఇంకో అడుగు ముందుకేసి..పదవీ విరమణ జీవితాన్ని కూడా అందంగా ప్లాన్ చేసే పనిలో ఉంటారు. ఇక్కడ ఈ మహిళ కూడా అలానే చేస్తోంది. ఆ విషయాన్నే ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేగాదు నచ్చినట్లు మన తలరాతను మనమే రాయాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఎవరామె అంటే..వియత్నాంకు చెందిన 32 ఏళ్ల న్గుయెన్ ఫుయోంగ్ అన్హికి అపారమైన నెయిల్ ఆర్ట్ నైపుణ్యం ఉంది ఆ నేపథ్యంలోనే ఆరేళ్ల క్రితం దుబాయ్‌కి వచ్చి..నెయిల్ టెక్నీషియన్‌గా పనిచేశారు. ఆమె పువ్వులు, జంతువులు, చార్మ్స్ వంటి త్రీడీ నెయిల్ డిజైన్లలో మంచి నైపుణ్యం గల మహిళ. మొదట రూ. 89 వేలకు చిన్న సెలూన్లో రెండేళ్లు కాంట్రాక్ట్‌పై పనిచేసింది. ఆ తర్వాతర ఫ్రీలాన్సర్‌గా మారిది. ఆమె క్లయింట్లలో యువతలే ఉండేవారు. ఆమె ధరలను అందుబాటులో ఉంచుతూనే క్లిష్టమైన డిజైన్లపై దృష్టి సారించింది. దాంతో ఆమె ఆదాయం ఏకంగా నెలకు రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలు సంపాదించే రేంజ్‌కు చేరింది. ఆ తర్వాత 2026లో, ఫుల్లా అన్ని ప్రాథమిక సౌకర్యాలతో 'బ్యూటీ బై ఫుల్లా'అనే సెలూన్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి జీతం తీసుకోకుండా సంపాదించిన మొత్తం తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడి పెడుతూ లాభాల బాట పట్టించింది. అందేగాదు ఇతరులకు ఉపాధి కల్పిస్తూ..మునుపటి ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. తన ఖర్చులను తగ్గించుకుంటూ తన వ్యాపార విజయం కోసం ఆహర్నిశలు కష్టపడేది. నెల ఖర్చులు లక్షలోపే ఉండేలా చూసుకుంటూ..కొత సొమ్ముని వియత్నాంకు పంపించి..అక్కడ రెండిళ్లు కొనుగోలు చేసింది. మిగిలిన మొత్తం తన సెలూన్ మెయింటైనింగ్ ఖర్చుపెడుతుంది. తాను ఈ పనిని 2012 నుంచి చేస్తున్నానని, అలాగే తన సెలూన్ వ్యాపారాన్ని విస్తరించేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది. తద్వారా 20 ఏళ్లలోనే రిటైర్మెంట్ తీసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. తన 50 ఏళ్ల ప్రారంభంలోనే పదవీ విరమణ చేయడానికి సరిపడా నిష్క్రియాత్మక ఆదాయాన్ని సంపాదించాలని చూస్తున్నట్లు పేర్కొంది. తన సెలూన్ బ్రాంచ్‌లు కేవలం దుబాయ్‌లోనే కాకుండా అబుదాబి లేదా ఫుజారా వంటి ఇతర ఎమిరేట్స్‌లో కూడా ఐదు బ్రాంచ్‌లు పెట్టేలా పెట్టుబడు పెట్టాలని చూస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కొంత పొలం కొనుగోలు చేసి..తన శేష జీవితాన్ని వ్యవసాయం చేస్తూ గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఈమె కథ..మన నైపుణ్యానికి పదును పెట్టి..అనతి కాలంలోనే వ్యాపారంగా మార్చుకోవడం..దాన్ని అంచెలంచెలుగా విస్తరించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, తద్వారా భవిష్యత్తు ప్రణాళికకు అనుగుణంగా చీకు చింత లేని వృద్ధాప్య జీవితాన్ని గడిపేలా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెబుతోంది. అలాగే సక్సెస్ అంటే పులిస్టాప్ కాదు..కామ అని తన సక్సెస్‌తో నిరూపించింది. !.(చదవండి: బస్స్టాపే పాఠశాలగా..! జస్ట్ నాలుగు గోడల మధ్యే కాదు..) -
ఈ మార్కెట్ అమ్మలదే!
ప్రపంచం మొత్తంగా ఉన్న మార్కెట్లు కేవలం లాభనష్టాల లెక్కల మీదే నడుస్తాయి. కానీ, మణిపుర్‌లోని ఇమాకైథెల్ మార్కెట్ త్యాగం, పోరాటం, మాతృశక్తి మీద నడుస్తుంది. 500 ఏళ్లుగా వేలమంది మహిళలు ఒకేచోట చేరి ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే పూర్తిగా మహిళలచే నడుస్తున్న అతిపెద్ద మార్కెట్‌గా ఇమా కైథెల్కు పేరుంది. మణిపురి భాషలో ఇమా అంటే అమ్మ, కైథెల్ అంటే మార్కెట్. అంటే తల్లుల మార్కెట్. దాదాపు 5,000 నుంచి 6,000 మంది మహిళా వ్యాపారులు ఇక్కడ నిత్యం వ్యాపారాలు సాగిస్తుంటారు. వీరిలో చాలామంది తరతరాలుగా తమ దుకాణాలను వారసత్వంగా పొందుతున్నారు. పురుషులు ఇక్కడికి కేవలం వస్తువులు కొనడానికి మాత్రమే రావాలి. వ్యాపారం చేయడానికి వారికి అస్సలు అనుమతి ఉండదు.తుపాకులకీ భయపడలే!ఈ మార్కెట్ కేవలం వ్యాపార కేంద్రం మాత్రమే కాదు, మణిపురి మహిళల పోరాట పటిమకు నిదర్శనం. 16వ శతాబ్దంలో లల్లూప్–కాబా అనే వ్యవస్థ ఉండేది. ఇది ఒక వెట్టిచాకిరి పద్ధతి. దీని ప్రకారం పురుషులు యుద్ధాలకో లేదా సుదూర ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికో వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇళ్లను కాపాడుకుంటూ, మిగిలిన పంటను అమ్ముకోవడానికి మహిళలు స్వయంగా ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. అయితే బ్రిటిష్ వారు ఈ మార్కెట్‌ను విదేశీయులకు అమ్మేయాలని చూశారు. అప్పుడు ఇక్కడి మహిళలంతా ఏకమై నుపి లాన్ (మహిళల యుద్ధం) ప్రకటించి ప్రాణాలకు తెగించి పోరాడారు. ఆ దెబ్బతో బ్రిటిష్ వారు వెనక్కి తగ్గక తప్పలేదు. ఆ తరువాత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనూ, బ్రిటిష్ పాలకులు మణిపుర్ నుంచి బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంతో రాష్ట్రంలో కరువు ఏర్పడింది. దీనిని అడ్డుకోవడానికి ఇమా కైథెల్ మహిళలు ప్రాణాలకు తెగించి పోరాడారు. పోలీసులు కాల్పులు జరిపినా వెనకడుగు వేయలేదు.రంగుల ప్రపంచంఈ మార్కెట్ ఒక రంగుల ప్రపంచం. తాజా కూరగాయలు, పండ్లు, మణిపుర్ స్పెషల్ నగారి వంటి ఆహార పదార్థాల నుంచి.. చేనేత వస్త్రాల వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి. ముఖ్యంగా మణిపురి సాంప్రదాయ దుస్తులైన ఫానెక్స్, ఇన్నాఫీస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచిన ఈ మార్కెట్ పర్యాటక కేంద్రంగానూ మారింది! -
భవిష్య దృష్టి
శుభా వెంకటేష్ అయ్యంగార్ పెద్దగా మాట్లాడడం ఎవరూ పెద్దగా చూడలేదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకొని పోవడం చిన్నప్పటి నుంచి ఆమె అలవాటు. భౌతికశాస్త్రంలో ఎన్నో బంగారు పతకాలు సాధించిన అయ్యంగార్ స్ఫూర్తిదాయకమైన సైంటిస్ట్ స్థాయికి ఎదిగారు. ‘దృష్టి’ పేరుతో ఎయిర్పోర్ట్ వెదర్, రన్‌వే విజిబిలిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న శుభా అయ్యంగార్ గురించి...నాలుగు దశాబ్దాలకు పైగా నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ (ఎన్.ఎ.ఎల్.)లో పనిచేసిన శుభా అయ్యంగార్ ఎయిర్పోర్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి నాయకత్వం వహించారు. పద్మ పురస్కారాల నేపథ్యంలో... ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన విమాన కార్యకలాపాలకు తోడ్పడే వ్యవస్థ రూపకల్పనకు సంబంధించి శుభా అయ్యంగార్ కృషిని భారత ప్రభుత్వం ప్రశంసించింది.బంగారు బాటలో...బెంగళూరు యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన అయ్యంగార్ రెండింటిలోనూ మొదటి ర్యాంక్ సాధించారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో బంగారు పతకాలు సాధించారు. ఎంఎస్సీ ఫిజిక్స్‌లో మొదటి ర్యాంక్ సాధించిన శుభా అయ్యంగార్ భారత ప్రభుత్వ మెరిట్ స్కాలర్షిప్ను అందుకున్నారు. రాత పరీక్ష, ఇంటర్యూ్య ప్రక్రియతో పనిలేకుండా కేవలం విద్యాప్రతిభ ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆమెకు జూనియర్ సైంటిఫిక్ ఫెలోషిప్ ప్రదానం చేసింది.ప్రపంచం ‘దృష్టి’లో ఆమె ప్రతిభ‘దృష్టి’ పేరుతో ఎయిర్పోర్ట్ వెదర్, రన్‌వే విజిబిలిటీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు శుభా అయ్యంగార్. ఈ సాంకేతికత... పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు రియల్ టైమ్ రన్‌వే విజువల్ రేంజ్ (ఆర్వీఆర్)ను అందిస్తుంది. దృశ్యాలు అస్పష్టంగా ఉన్నప్పుడు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతోంది. దీనిని ఇప్పుడు భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో, భారత వైమానిక దళంలో ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత దేశానికి గణనీయంగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలో సహాయపడింది. భారతీయ విమానాశ్రయాలలో సాధారణంగా ఎదురయ్యే సవాళ్లలో దట్టమైన పొగమంచు ఒకటి. భారీ వర్షపాతం, ధూళి తుఫాను పరిస్థితులలో కూడా ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ‘దృష్టి’ వ్యవస్థను రూపాందించారు. ‘దృష్టి’కి ముందు మన విమానశ్రయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ట్రాన్సోమీటర్లపై ఆధారపడేవి. ‘దృష్టి’ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.నాసా గుర్తింపుశుభా అయ్యంగార్ శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్న రోజుల్లో ఇంటర్నెట్ సదుపాయం, అత్యాధునిక ప్రయోగశాలలు లేవు. ‘ఇంటర్నెట్, ఇతరత్రా సదుపాయాలు లేకుండానే 1986లో మూడు పరిశోధన పత్రాలను ప్రచురించాను. అది మా పేర్లతో నాసాలో ఒక రిపోర్ట్‌గా రికార్డ్ అయింది’ అంటారు శుభ.శుభా అయ్యంగార్ చేసిన కృషి భారతదేశ రక్షణ సామర్థ్యాలకు దోహదపడింది. భారతదేశం గర్వించదగిన ‘అగ్ని’ క్షిపణికి సంబంధించి క్లిష్టమైన సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. స్వదేశీ సాంకేతిక అభివృద్ధి, స్వావలంబనను పెంపొందించడంలో చేసిన కృషికి గుర్తింపుగా మొట్ట మొదటి జాతీయ ‘మేక్ ఇన్ ఇండియా’ అవార్డ్ అందుకున్నారు శుభా అయ్యంగార్. ఫ్యామిలీ పవర్‘మహిళలు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థానంలోకి వెళ్లగలరు’ అని బలంగా నమ్మేవారు శుభా అయ్యంగార్ నాన్నగారు. కూతురిని చదువు విషయంలో బాగా ప్రోత్సహించేవారు. శాస్త్రీయ విషయాలపై అవగాహన కలిగించేవారు. కూతురు ఉన్నతస్థాయిని చూడకుండానే, శుభ ఎం.ఎస్సీ. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ‘నాన్న ద్వారానే సైన్స్ పట్ల ఆసక్తి కలిగింది’ అని చెబుతుంటారు శుభ. తొమ్మిది మంది తోబుట్టువులలో అందరికంటే చిన్నదైన శుభ తన కుటుంబాన్నే వెన్నెముకగా భావిస్తారు. పదవీవిరమణ తరువాత కూడా అవసరమైనప్పుడు వివిధ సంస్థలు ఆమె సలహాలు తీసుకుంటున్నాయి. వ్యక్తిగత గుర్తింపు కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శుభా అయ్యంగార్. -
పోష్ ఉందిగా... జోష్‌గా ఉందాం!
పనిచోట మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పడేలా వ్యవహరించడం కొనసాగుతూనే ఉంది. ‘పోష్’ చట్టం వచ్చి 13 ఏళ్లు అవుతున్నా కార్యాలయాల్లో మొక్కుబడి చర్యలే తప్ప గట్టి మేలు తలపెట్టని నేపథ్యంలో మహిళా ఉద్యోగులు ‘సీన్ క్రియేట్ చేసైనా’ రక్షించుకోవాలి అంటున్నారు మహిళా సంఘాల నేతలు. పనిచోట భయం ‘ఔట్ పంచ్’ కొట్టేలా చేయగలిగామా? ప్రతి ఆఫీసు క్యాబిన్ లో గౌరవం. ‘ఇన్ పంచ్’ కొట్టేలా చూడగలిగామా? మహిళా ఉద్యోగులకు తమ కోసం ‘పోష్’ ఉందన్న ఎరుక ఉందా? ‘ఫ్రెండ్లీ’ ముసుగులో భుజం తాకే చేయి, ‘జోక్’ పేరుతో గుచ్చుకునే మాట – ఇవి రిపోర్ట్ అవుతున్నాయా? లేక ‘కెరీర్ ఏమవుతుందో’, ‘సీన్ అవుతుందేమో’ అని నోరు నొక్కుకుంటూనే ఉన్నారా? అయితే అది ఇంకా మహిళా ఉద్యోగుల పట్ల మంచి, సురక్షిత ఆఫీసుగా మారలేదని అర్థం. అక్కడి మగ ఉద్యోగులు వారికి తగిన సపోర్టు, రక్షణ ఇవ్వడంలో వెనుకబడి ఉన్నారని అర్థం. అందుకే ఇటీవల మహిళా సంఘాల నేతలు ‘సీన్ క్రియేట్ చేసైనా మిమ్మల్ని మీరు రక్షించుకోండి’ అంటున్నారు.13 ఏళ్లయినా మొక్కుబడేనా?2013లో ‘పోష్ చట్టం’ వచ్చింది. ఆఫీసుల్లో ఇంటర్నల్ కమిటీలు వచ్చాయి. SHe-Box పోర్టల్ వచ్చింది. కానీ 2026లోనూ నైట్ షిఫ్ట్ అంటే మహిళా ఉద్యోగికి గుండె దడ. ఏదైనా ఇబ్బంది వస్తే కమిటీ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఫిర్యాదు ఎలా ఇవ్వాలో తెలియదు. ఏడాదికోసారి లైంగిక వేధింపుల అవగాహన సదస్సు పెట్టి ‘గవర్నమెంట్ పెట్టమంది పెట్టాం’ అంటున్నాయి సంస్థలు. అందుకే పద్ధతి మారాలి. ప్రాక్టీస్ మారాలి.కేస్ స్టడీ 1డిపార్ట్మెంట్ మీటింగ్. సీనియర్ ఎంప్లాయీ శ్యామల డౌట్ రైజ్ చేసింది. బాస్ నవ్వుతూ, ‘శ్యామల గారూ, మీరు నీట్‌గా తయారై మీటింగ్‌కు వస్తే చాలు. ఏం చేయాలో నాకు వదిలిపెట్టండి’ అన్నాడు. రూమ్ అంతా నవ్వింది. శ్యామల ముఖం చిన్నబోయింది. కానీ మరో మహిళా కలీగ్ రాధిక అలెర్ట్ అయ్యింది. ‘సీన్ క్రియేట్ చేయకపోతే, రేపు ఇదే నార్మల్ అవుతుంది’ అనుకుని వెంటనే లేచి నిలబడింది. గొంతు పెంచలేదు, అరవలేదు. కానీ రూమ్ అంతా వినేలా క్లియర్‌గా అంది– ‘సర్, అది సరైన కామెంట్ కాదు. శ్యామల డౌట్ వాలిడ్. టీమ్‌లో ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడటం మన కల్చర్ కాదు’. పిన్ డ్రాప్ సైలెన్స్. బాస్ మొహం మారింది. రాధిక ‘అపాలజైజ్ చేయండి’ అనలేదు. ‘ముందుకు వెళ్దాం, కానీ రెస్పెక్ట్‌తో’ అని చెప్పి కూర్చుంది. ఆ ఒక్క మాటతో శ్యామలకు గౌరవం దక్కింది, బాస్‌కి లైన్ అర్థమైంది, జూనియర్లకు ధైర్యం వచ్చింది.కేస్ స్టడీ 2టీమ్ అవుటింగ్. సరదా వాతావరణం. సేల్స్‌లో సీనియర్ రవి కొత్తగా జాయిన్ అయిన అనన్యను పదే పదే టచ్ చేస్తున్నాడు. అందరూ నవ్వుతున్నారు. టీమ్ లీడ్ శ్రావ్య చూసింది. వెంటనే వెళ్లి అనన్య పక్కన నిలబడి ‘పద, నీతో పని ఉంది’ అని అక్కడినుంచి తీసుకెళ్లిపోయింది. అందరూ గమనించారు. రవి తడబడ్డాడు. మర్నాడు శ్రావ్య హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేసింది. ‘ఎవరు కంప్లైంట్ చేశారో పేరు వద్దు, కానీ అవుట్‌సైడ్ ఎథిక్స్ సెషన్ పెట్టండి’ అని కోరింది. ఆ వారమే సెషన్ పడింది. రవికి వార్నింగ్ వెళ్లింది. డైరెక్ట్‌గా గొడవ పడక్కర్లేదు. బాధితురాలిని సీన్ నుంచి తప్పించడం, ఫాలో అప్ చేయడం కూడా బై స్టాండర్ ఇంటర్వెన్షనే.మహిళా ఉద్యోగులు ఏం చేయాలి?→ ఆపు: ‘నాకు నచ్చలేదు, రిపీట్ చేయొద్దు’ అని క్లియర్‌గా చెప్పాలి.→ రికార్డు: వాట్సాప్, మెయిల్, కాల్ టైమ్, ఎవరున్నారు – నోట్ చేసుకోండి. ఇదే మీ ఎవిడెన్స్.→ రిపోర్ట్: ఐసీకి మౌఖికంగా చెప్పినా చాలు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. ‘ఉద్యోగం పోతుంది’ అనే భయం వద్దు. అతిక్రమణ చేస్తే కంపెనీకి 50 వేల ఫైన్.→ SHe-Box: అంతర్గతంగా న్యాయం జరగదనిపిస్తే షీ బాక్స్‌లో ఫిర్యాదు చేయండి. మీ మాటే మీ లాయర్. ‘సర్దుకుపో’ అనే సలహా చెత్తబుట్టలో వేయండి. మీరు సర్దుకోవడానికి రాలేదు, సాధించడానికి వచ్చారు.మగ ఉద్యోగులు ఏం చేయాలి?‘నాకెందుకు’ అనే మాట మానేయండి. పక్క క్యూబికల్ అమ్మాయి కూడా ఎవరికో చెల్లి, కూతురే. మరి మీ రోల్ ఏంటి?→ అడ్డుపడండి: తప్పు కనిపిస్తే ‘పద, పని ఉంది’ అని బాధితురాలిని అక్కడి నుంచి తప్పించండి.→ కరెక్ట్ చేయండి: బాస్ పిచ్చి జోకులేస్తే ‘ఇది సరి కాదు’ అని అక్కడికక్కడే కట్ చేయండి. నవ్వితే మీరూ నేరస్థులే.→ సాక్షిగా నిలబడండి: ఆమె కంప్లైంట్ ఇస్తే ‘నేను చూశాను’ అని ఇంచార్జీకి చెప్పండి. మీ ఒక్క మాట ఆమెకు కొండంత ధైర్యం.→ కల్చర్ సెట్ చేయండి: ‘సీన్ క్రియేట్ చేయకు’ అని బాధితురాలికి బోధించవద్దు. ‘సీన్ క్రియేట్ చేసి ఆపే’ వారిగా నిలవండి.కవచం: పోష్ ఒక కవచం. ఆ కవచం మీ దగ్గరే ఉందని గ్రహించండి. మహిళా ఉద్యోగి ‘నో’ చెప్పడానికీ, మగ ఉద్యోగి ‘ఆపు’ అని తోటి మగ ఉద్యోగిని ఆపడానికీ ఆ కవచం ఉపయోగించాలి. ‘నాకు సంబంధం లేదు’ అని ఏ ఉద్యోగి అనకూడదు. ‘ఇక్కడ ఇది నడవదు’ అనేదే నినాదం. అప్పుడే అర్ధరాత్రి క్యాబ్ ఎక్కినా ఆమె కళ్లలో భయం ఉండదు. అందుకై అవసరమైనప్పుడల్లా సీన్ క్రియేట్ చేయండి– ఆపడానికి, కాపాడటానికి, మార్చడానికి! -
తలసేమియా, మోకాలి ఆపరేషన్.. ఆమెను ఆపలేకపోయాయి..!
అందరికీ ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఏవో కారణాలతో చేరుకోలేకపోతారు. కానీ ఈ మహిళ ఒకపక్క కుటుంబ బాధ్యతలు మరోవైపు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా తన కలను నెరవేర్చుకునేందుకు సన్నద్ధమైంది. అనుకున్నట్లుగానే విజయం అందుకుని..అనారోగ్యం వంటి కారణాలతో కలను నిజం చేసుకోలేకపోతున్నాం అని బాధపడే వాళ్లలో స్ఫూర్తిని నింపింది. ఇలా అనారోగ్యంతో ఇలాంటి సాహసం కృత్యం చేసిన మహిళగా ఘనత సృష్టించింది. ఆ మహిళే రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన నీలిమ అరోరా. ఇద్దరు పిల్లల తల్లి, తలసేమియా బాధితురాలు అయినా కలల శిఖరాన్ని అధిరోహించాలనే కలను నిజం చేసుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంది. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం వరకు ఆమెకు పర్వతారోహణతో ఎలాంటి సంబంధం లేదు. అప్పటి వరకు ఆమె కాలిఫోర్నియాలో సిలికాన్ వాలిడేషన్ ఇంజనీరింగ్ పనిచేస్తుండేది. అయితే ఆమెకు మెకాలి శస్త్ర చికిత్స తర్వాతనే శిఖరాలను అధిరోహించాలనే కోరిక కలగడం విశేషం. ఆ క్రమంలోనే 8,849 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి నీలిమ చరిత్ర సృష్టించింది. మొత్తం కఠినమైన 50 రోజుల యాత్రో ఆమె హై-ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడెమా (HAPE) అనే ప్రాణాంతకమైన పరిస్థితిని మూడుసార్లు ఎదుర్కొంది. నిజానికి ఇది ఊపిరితిత్తులలో ద్రవం చేరే ప్రాణాంతక పరిస్థితి. ఆఖరికి గుండె జబ్బులు లేని ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతే ఈ పరిస్థితే ఎదురవ్వుతుంది. అలాంటి ప్రాణాంతక పరిస్థితిని ఖాతరు చేయకుండా ఎవరెస్టు అధిరోహణకు సై అందామె. ఆఖరికి వైద్యులు వద్దని వారించినా..వెనక్కి తగ్గలేదామె. మే 25, 2026న మధ్యాహ్నం సుమారు 1 గంటకు తాను ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నప్పుడు, అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు ఒంటరిగా ఉన్నానని నీలిమ ఆ అనుభవాన్ని పంచుకుంది. ఆ క్షణం తన జీవితంలోని అద్భుత క్షణంగా పేర్కొంది. ఇలా తలసేమియా మైనర్ ఉండి, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహళగా చరిత్ర సృష్టించింది నీలిమ.ఇక నీలిమ ఎవరెస్ట్‌కు ముందు అప్పటికే మాంట్ బ్లాంక్, మాటర్‌హార్న్ (ఫ్రాన్స్), కోటోపాక్సి (ఈక్వెడార్), అకోన్కాగ్వా (అర్జెంటీనా), అమా దబ్లామ్ (నేపాల్) వంటి సవాలుతో కూడిన శిఖరాలను అధిరోహించింది. అంతేగాదు గతేడాది 40 ఏళ్లు పైబడిన వారిలో అమా దబ్లామ్ను విజయవంతంగా అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా నీలిమ నిలిచింది. కాగా, తన విజయాలన్నింటికి తన గైడ్ గస్మాన్ తమాంగ్, తన కుటుంబమే కారణమంటూ క్రెడిట్ అంతా వారికే ఇచ్చేసింది.(చదవండి: అల్కా యాగ్నిక్‌కి అరుదైన వినికిడి సమస్య..ఎందువల్ల వస్తుందంటే..) -
ట్రెక్కింగ్ స్టార్ @ 52
ప్రముఖ నటుడు జెమిని గణేషన్ మనవరాలు డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో మౌంట్ ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించింది. చెన్నైకి చెందిన ప్రియా సెల్వరాజ్ ఎన్నో నెలల సాధన ద్వారా 8,849 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. డాక్టర్ ప్రియ పర్వతారోహణ ప్రయాణం నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో ట్రెక్కింగ్‌తో మొదలైంది. ఆ తరువాత పర్వతారోహణపై ఆమెలో అంతకంతకూ ఆసక్తి పెరుగుతూ పోయింది. ‘ప్రతి సంవత్సరం ట్రెక్కింగ్ చేస్తుంటాను. ట్రెక్కింగ్ నా జీవితాన్ని మార్చేసింది’ అంటుంది ప్రియ. ఎవరెస్ట్ అధిరోహణకు ముందే పర్వతారోహణలో సత్తా చాటింది డాక్టర్ ప్రియ.నేపాల్‌లోని 8,163 మీటర్ల ఎత్తైన పర్వతమైన మానస్లును విజయవంతంగా అధిరోహించింది. ఓర్పు, శారీరక బలం, మానసిక దృఢత్వానికి ఒక పరీక్షగా భావించే ఎవరెస్ట్ అధిరోహణకు మానస్లు విజయం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితమే డా. ప్రియ ట్రెక్కింగ్ మొదలుపెట్టడం వల్ల ఆమె ఎవరెస్ట్ అధిరోహణ అనేది ఆసక్తిగా మారింది. ఈ తాజా విజయం ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. -
అడవి ఆమెను సీఈఓ చేసింది...
20 ఏళ్లకే అమెరికా మీడియా సంస్థ ‘అన్ టేమ్డ్ ప్లానెట్’ సీఈఓ అయ్యింది మలైకా వాజ్. గోవా తీరంలో అలలతో ఆడుకున్న అమ్మాయి నేడు అడవుల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపిస్తోంది. ‘వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకింగ్‌తో అడవిని రక్షించవచ్చు’ అని చదువు మానేసి అడవినే యూనివర్సిటీ చేసుకుంది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్‌గా ఎంపికైంది. ‘అవకాశాలు ఎదురుచూడవు, దూకెయ్యాలి’ అంటున్న మలైకా వాజ్ పరిచయం ఇది.‘టీవీ అడవికీ, నిజమైన అడవికీ తేడా ఉంది. నేను టీవీలో జనం లేని అడవిని చూశాను. కానీ నిజమైన అడవిలో ఎక్కడ చూసినా మనిషి పాదముద్రలే. జనం ప్రమేయం ఇంతగా ఉంటే అడవి, అటవీ జంతువులు ఏం కావాలి?’ అంటుంది మలైకా. అడవిని నిజరూపంలో చూపిస్తేనే మనిషి దాని పట్ల వివేకంతో వ్యవహరిస్తాడని ఆమె నమ్మకం.పచ్చటి బాల్యం...గోవాలోని సలిగావ్లో 1997లో పుట్టిన మలైక ఇంటి పక్కనే సముద్రం... పచ్చటి చెట్ల మధ్య ఉన్న స్కూలుతో పచ్చటి బాల్యాన్ని చూసింది . ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే మలైక పాముల కోసం చెట్లు ఎక్కేది. గాయపడిన జంతువులను రక్షించేది. స్కూబా డైవింగ్, విండ్సర్ఫింగ్, సెయిలింగ్ నేర్చుకుంటూ సముద్రాన్నే ప్లేగ్రౌండ్ చేసుకుంది. తండ్రి మాక్ వాజ్, తల్లి మరుషా వాజ్లది గోవాలో ప్రముఖ వ్యాపార కుటుంబం. వారు కూతురిని వ్యాపారంలోకి కాని, అకడెమిక్స్ వైపుగాని ఒత్తిడి చేయలేదు. నచ్చింది చేయనిచ్చారు. ఆ స్వేచ్ఛే మలైకాకు రెక్కలు తొడిగింది.జీవితంలో మలుపు...మలైకా ఈ దారిలోకి రావడానికి కారణం వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్ మైక్ పాండేను కలవడం. అప్పటికి ఆమె వయసు 14. ఆయన డాక్యుమెంటరీలు ప్రభుత్వాల పర్యావరణ నిర్ణయాలను ప్రభావితం చేశాయని తెలుసుకుంది. ‘అంటే మన కథలతో మార్పు సాధ్యం’ అని గ్రహించింది. ‘పర్యావరణం గురించి ఆలోచించడానికి నా వయసు చిన్నదేం కాదు’ అనుకుని హైస్కూల్ తర్వాత కాలేజీకి వెళ్లలేదు. డైరెక్ట్‌గా ప్రొడక్షన్ హౌస్‌లలో చేరింది. షార్ట్ ఫిల్మ్స్ తీసింది. 18 ఏళ్లకే ఆర్కిటిక్, అంటార్కిటికా రెండు చోట్లకు వెళ్లిన అతి పిన్న భారతీయురాలిగా లిమ్కా బుక్ రికార్డ్ కొట్టింది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్‌గా ఎంపికైంది. ‘లివింగ్ విత్ ప్రిడేటర్స్’ అనే సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసి, హోస్ట్ చేసింది. భారత్‌లో చిరుత, పులి, ఎలుగుబంట్లతో మనుషులు ఎలా కలిసి బతుకుతున్నారో చూపించింది. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్‌లో ‘ఆన్ ది బ్రింక్’ ఎనిమిది భాగాల సిరీస్ చేసింది.మంటా రేస్ రక్షకురాలు...సముద్రంలో ఏడు మీటర్ల రెక్కలతో తిరిగే ‘మంటా రేస్’ చేపల అక్రమ రవాణాపై సాహసోపేతమైన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చేస్తోంది మలైకా. మంటా రేస్ మొప్పలకు ఔషధ గుణాలున్నాయనే మూఢనమ్మకంతో వాటిని క్రూరంగా వేటాడుతున్నారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుంచి చైనా మార్కెట్‌కు అవి ఎలా స్మగుల్ అవుతున్నాయో అండర్‌కవర్‌గా షూట్ చేసింది. కెమెరాను ఆయుధంగా మార్చి మాఫియాను ఎక్స్పోజ్ చేస్తోంది. రువాండా వాల్కానోస్ నేషనల్ పార్క్‌లో మౌంటెన్ గొరిల్లాలపై విలువైన డాక్యుమెంటరీ చేసింది. ‘వాటి ఫ్యామిలీ డైనమిక్స్ చూస్తే అద్దంలో మనల్ని చూసుకున్నట్టే ఉంటుంది’ అంటుంది.20 ఏళ్లకే సీఈఓ...‘అన్ టేమ్డ్ ప్లానెట్’ మీడియా సంస్థను 2017లో స్టార్ట్ చేసి సీఈఓ అయ్యింది మలైక. న్యూయార్క్, బెంగళూరులో ఆఫీసులు నడుపుతూ బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్, అల్ జజీరా, డిస్కవరీకి కంటెంట్ ఇస్తోంది. ఆమె ‘నగర ఆఫీసు’ల్లో ఉండేకన్నా ‘అడవి ఆఫీసు’లో ఉండటమే ఎక్కువ. ‘అమ్మాయిలను బయటకు పంపొద్దు’ అనేవాళ్లకు మలైకా సమాధానం– ‘వారి చేతికి కెమెరా ఇవ్వండి, ప్రపంచాన్ని మారుస్తారు’. ‘నీకు భయం వేయదా? అడవిలో అంత రిస్క్ ఎందుకు అని అందరూ అడుగుతారు. భయం వేస్తుంది. కానీ ఏమీ చేయకుండా కూర్చుంటే అంతకన్నా బోర్ కొడుతుంది’ అని నవ్వుతుంది మలైకా.‘నా కంఫర్ట్ జోన్ అడవే. నా ఆఫీస్ జీప్, బోట్, కెమెరా... ఇవి ఉంటే చాలు’ అంటోందామె. -
పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..
అప్పటి వరకు గృహిణిగా గడిపిన ఆమె పారిశ్రామికవేత్తగా మారడం అంటే సాధారణ విషయం కాదు. కానీ ఒక మహిళ తలుచుకుంటే లక్ష్యాన్ని సాధించకుండా ఏది ఆపలేదు అనేందుకు ఉదాహరణగా మారింది గుజరాత్‌కు చెందిన ఈ గృహిణి. అంతేగాదు ఆమె గ్రామీణ భారతదేశంలోని మహిళ పారిశ్రామికవేత్తకు ప్రతీకగా నిలిచించి. ఇంటి పనులు నిర్వహిస్తూనే పశువుల సంరక్షణతో కోట్లాది రూపాయాలు ఆర్జిస్తోందామె.గుజరాత్‌కు చెందిన దర్యాబెన్కు 18 ఏళ్లకే వివాహమైంది. ఆ తర్వాత అత్తగారింట్లో గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. తన అత్తమామలకు చేదోడు వాదుడుగా ఉంటూ.. పశువుల సంరక్షణ కూడా చూసుకుంటూ ఉండేది. అలా దర్యాబెన్ డైరీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. కాలక్రమేణ తాను దాంతోనే వ్యాపారాన్ని నిర్మిస్తానని అనుకోలేదు. మొదట్లో పశువుల పోషణ, పాలు సేకరించడం వరకే చూశారామె. తన వంతు ఇంటికి సహాయపడదామనే ఉద్దేశ్యంతో పశువుల సంరక్షణనే వ్యాపారంగా మార్చుకుంది. అలా చిన్న డైరీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. అందుకోసం పాల ఉత్పత్తిని మెరుగుపరిచింది. ఆ తర్వాత ఇంట్లో ఉండే కొన్ని పశువుల సంఖ్యను కూడా పెంచి అనతి కాలంలోనే అతిపెద్ద డైరీగా మార్చింది. ప్రస్తుతం ఆమె వద్ద సుమారు 200 గేదెలు, 100 ఆవులు, వెరసి మొత్తం 300 పశువులు ఉన్నాయి. అంతేగాదు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి 14 మంది కార్మికులను కూడా నియమించుకుంది. ఆమె రోజు ఉదయం 3.30 గంటలకు పాలు సేకరించడంతో మొదలై ఫామ్ నిర్వహణకు సంబంధించిన పనులతో పూర్తవుతోంది. ప్రతిరోజు సుమారు వెయ్యిలీటర్లపైనే పాలు బనస్ డైరీకి సరఫరా చేసేది. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా నెలకు సుమారు రూ. 20 లక్షల పైనే చొప్పున ఏటా ఏకంగా రూ. 1.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందామె. ఇక్కడ 48 ఏళ్ల దర్యాబెన్ పాడి పరిశ్రమను సొంతం చేసుకోవడమే కాకుండా సమర్థవంతమైన నిర్వహణ, పాల ఉత్పత్తి వ్యూహాలు, పాడి సహకార సంఘాల నెట్‌వర్క్‌తో బలమైన అనుసంధానం తదితరాలతో మంచి విజయం అందుకుంది. ఇక బనాస్ డైరీ గుజరాత్‌లోనే అతిపెద్ద పాడి సహకార సంఘాల నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది లక్షలాదిమంది పాల ఉత్పత్తిదారులతో అనుసంధానమై ఉంది. ఈ డైరీ రైతులకు క్రమం తప్పని చెల్లింపులు, సాంకేతిక మార్గదర్శకత్వం, నమ్మకమైన మార్కెట్ సదుపాయం అందించి గ్రామీణ ఆదాయాలను గణనీయం పెంచడంలో సహాయపడుతుండటం విశేషం. అంతేగాదు ఎంతోమంది మహిళలను పారిశామ్రికవేత్తలుగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అలా లబ్ధి పొందిన అనేకమంది మహిళల్లో దర్యాబెన్ కూడా ఒకరు. ఒకరకంగా ఇది గ్రామీణ పాంతంలోని మహిళలు కేవలం ఇంటి పనులకు, పశువులను చూసుకోవడానికే పరిమితం కాదని ఈ డైరీ నిరూపించింది కదూ. (చదవండి: ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..) -
ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..
ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదలుకుని మరి కేఫ్ పెట్టింది. అదికూడా ఆహార వృధాను అరికట్టేలా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా పెట్టడం విశేషం. అధిక జీతం వచ్చే మంచి ఉద్యోగానికి కాదనుకుని మరీ పర్యావరణ హితమైన వ్యాపారం మొదలుపెట్టడమే కాదు అందరూ శెభాష్ అని మెచ్చుకునేలా సక్సెస్‌ని అందుకుంది. పైగా పర్యావరణ హితమైన వ్యాపారాలు చేయడం ఎలాగో యువత తెలసుకునేలా ఆదర్శంగా నిలిచిందామె. ఆ అమ్మాయే అహ్మదాబాద్‌కు చెందిన నిష్టా చౌహాన్. ఆమె గతంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేసిందామె. ఆ ఉన్నతోద్యోగాన్ని వదిలి మరి మిల్లెట్ కేఫ్‌ని ప్రారంభించింది. ఆమె చిరుధాన్యాలు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కేఫ్‌ని ప్రారంభించింది. ఆ కేఫ్ పేరే ఆరంభ్. విలువలను ప్రతిబింబించే వ్యాపారంతో అందర్నీ ఆకట్టుకుంటోందామే. మొదట్లో ఆమె నిర్ణయాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకించినా..ఆమె అందుకున్న సక్సెస్‌ని చూసి సాధించావ్ అంటూ ప్రశంసించడం విశేషం. ఏ కేఫ్ అయిన ట్రెండీ మెనూలతో కస్టరమర్లను ఆకట్టుకుంటే..ఈ కేఫ్ మాత్రం ఆహారం గురించి ప్రజలు ఆలోచించే విధానాన్ని మార్చాలనే ఉద్దేశ్యంతో పెట్టింది నిష్టా. ఇక్కడ అన్ని డెజర్ట్‌లు హెల్దీగా చేసినవే. ముఖ్యంగా రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యలతో చేసిన వంటకాలే కనువిందు చేస్తాయి. అంతేగాదు ఆహార వ్యర్థాలను సైతం తిరిగి వినియోగించుకునేలా కిచెన్‌ని రూపొందించడం విశేషం. ఈ కేఫ్‌లో టన్నుల కొద్దీ చెత్త డంప్‌యార్డ్‌లకు వెళ్లదు. సింపుల్‌గా చెప్పాలంటే ఆహార వ్యర్థాల సంస్కృతిని సవాలు చేసే జీరో-వేస్ట్ కేఫ్ ఇది. లోపలకి అడుగుపెట్టగానే ఇది మాములు కేఫ్ కాదని ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తూ..ప్రతి గింజను, ప్రతి ఆకును, ప్రతి నీటి చుక్కను అత్యంత గౌరవప్రదంగా ఉపయోగిస్తారు నిర్వాహకులు. అలాగే ప్లాస్టిక్ వాడకం ఉండదు. నిష్టా కేఫ్ ఆరంభ్ చాలా సృజనాత్మకతతో పర్యావరణ హితంగా ఆహార వృధాకు తావులేకుండా వ్యర్థాలను పునర్వినియోగించడంతో కొద్దికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. పైగా నెలకు రూ. 12 లక్షలు ఆర్జనతో ఏడాదికి రూ. 1.44 కోట్లు టర్నోవర్ పలుకుతుండటం విశేషం. అంతేగాదు ఈ కేఫ్ చిన్నారుల కోసం వర్క్‌షాపుల కూడా నిర్వహిస్తుంటుందట. ఈ వర్క్‌షాపులలో యువతను ఆహారంతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా చేస్తూ..కూరగాయలు ఎలా పండుతాయ్, మట్టిని ఎలా కాపాడుకోవాలి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఎలా అర్థం చేసుకోవాలి వంటి వాటి గురించి వివరిస్తుంటారు. పైగా వాళ్లకు చిరుధాన్యలతో స్వయంగా వంటకాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తుంటారట కూడా. అంతేగాదు విలువలకు అనుగుణంగా ఉండే వ్యాపారం ఏ నాటికైనా విజయం సాధిస్తుందని నిరూపించింది నిష్టా.Most cafes chase menus.This one chased a mission.Inside a small cafe in Ahmedabad, something different is cooking.Not just food. A mindset shift.Nishtha Chauhan left a high-paying aerospace job.To build something most people thought was risky — a zero-waste, millet-first… pic.twitter.com/fdf8mFOHhx— The Better India (@thebetterindia) June 12, 2026 (చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..) -
నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడి.. నేడు అందరూ మెచ్చే చెఫ్‌గా!
జీవితం ఎప్పుడు అందరికీ ఒకేలాంటి కష్టాలు, సవాళ్లను ఇవ్వదు. ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కొందరికి పెద్దయ్యాక కష్టాలు వెంటాడితే మరికొందరికి పుట్టుకతో కష్టాలు వెంటాడతాయి. అంతేగాదు ఆ దుర్భరమైన జీవితం సాగించలేక కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయ్. అయినా తట్టుకుని నిలబడిన వాడికే మంచిజీవితం లభిస్తుంది, గొప్ప స్థాయికి చేరుకుంటారు అనేందుకు ఈ ఢిల్లీ మహిళ కథే ఉదాహరణ. ఈమె కథ వింటే 'బిచ్చగాడు' మూవీలోని ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడంజానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడంకడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్నమనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా అన్న పాట గుర్తొస్తుంది. మరి ఆమె పడ్డ కష్టాలు..ఎలా వాటిని అధిగమించి ఉన్నతస్థాయి చేరుకుందో సవివరంగా చూద్దామా.!.ఆ మహిళే లిలీమా ఖాన్. ఢిల్లీలోని తైమూర్ నగర్‌కు చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఒక సోదరుడు. తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడేవారు. అయినప్పటికీ..మూడేళ్ల వయసున్న లిలీమా తన తండ్రి ఇరుగుపొరుగు వారి కోసం ప్రేమగా వండే కిచిడీ, రోటీ వంటి సాదాసీదా భోజనం వండటం చూసేది. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితం ఆకస్మికంగా కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. మొదట 2001లో, లిలీమాకు కేవలం ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి కన్నుమూశారు. ఆరు నెలల తర్వాత, ఆమె తల్లి క్షయ వ్యాధితో మరణించింది. ఆ తర్వాత తన కళ్లముందే అక్క వైవాహిక సమస్యలతో మరణించడం చూసింది. ఈ వరుస కష్టాలు ఆమెను కుంగదీస్తుంటే..మరోవైపు సోదరుడు డ్రగ్స్‌కి బానిసై దొంగతనాలకు అలవాటుపడటంతో జైలుపాలయ్యాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిపోయింది లిలీమా. అయితే ఆమె అత్త తన తమ్ముడిని చేరదీసింది గానీ ఆమెను మాత్రం దగ్గరకు తీసుకోలేదు. దాంతో అనాధగా మిగిలిన లిలీమాను తైమూర్ నగర్ మురికివాడలకు చెందిన ఒక మహిళ ఆశ్రయం ఇచ్చినా..ఒక పూట భోజనం కోసంతెల్లవారుజామున ఫ్రెండ్స్ కాలనీ వీధుల్లో చెత్త ఏరడానికి ఇతర పిల్లల తోపాటు పంపేది. అక్కడ మాల్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి ప్రాంతాల్లో చెత్తబుట్టల్లో వెతుకుతూ, మిగిలిపోయిన చికెన్ లేదా మటన్ ఎముకలు, సగం తిన్న బర్గర్లను తింటూ గడిపేది. అలా కష్టాలు పడుతున్న లిలీమాను 11 ఏళ్ల వయసులో ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) సహాయం అందించి, చదువు చెప్పించడంతో ఆమె పరిస్థితి మెరుగవ్వడం ప్రారంభమైంది. అయితే కొద్దికాలానికే తిరిగి వచ్చి..తన అత్త, తమ్ముడి వద్దకు వచ్చి..అక్కడే ఉండేందుకు ఇష్టపడింది. అయితే లిలీమా అత్త ఆమెను అక్కడ షుఫ్యాక్టరీలో పనికి పెట్టింది. ఆ వ్యక్తి రాకతో చిగురించిన జీవితం..సరిగా పనిచేయకపోతే అత్త చేతిలో దెబ్బలు తింటూ మళ్లీ కష్టాల కడలిలో చిక్కుకుంది. ఆ తర్వాత ఎన్జీవో కార్యకర్త హర్ష్ మందర్‌ను సంప్రదించింది. ఆయన కాశ్మీరీ గేట్‌లోని బాలికల అనాథాశ్రమమైన కిల్కారి రెయిన్బో హోమ్‌లో చేరడానికి సహాయం చేశారు. అక్కడే ఉన్న సమయంలో లిలీమాకు వంటపై ఆసక్తి కలిగింది. అయితే 2015లో, అనాథాశ్రమానికి తరచుగా వచ్చే ఒక సందర్శకుడు లిలీమా వంట నైపుణ్యాలను గమనించి, ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లో ఆమెకు ఉద్యోగం ఇప్పించారు. అక్కడ సిబ్బందికి భోజనం తయారుచేయడమే లిలీమా ఉద్యోగం. అందుకు రూ. 7000లు జీతం ఇచ్చేవారు. అలా తన వంట నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో అక్కడుండే హెడ్ చెఫ్ వద్ద మ్యాష్డ్ పొటాటోస్ తయారుచేయడం, బర్గర్లు, సలాడ్లను చేయడం వంటి ప్రాథమిక విషయాలను నేర్చుకుంది. 2019లో, లిలీమా 'డియర్ డోనా'లో చెఫ్ డి పార్టీగా చేరి, ఒక్క ఏడాదిలోనే సూస్ చెఫ్‌గా పదోన్నతి పొందింది. ఇవాళ ఆమె 35 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె తయారు చేసే ప్రత్యేక వంటకాల్లో రిసోటో, రావియోలీ, సాల్మన్ గ్రావ్లాక్స్, రౌలేడ్, బీఫ్ వెల్లింగ్టన్ తదితరాలు ఉన్నాయి. తన అభిరుచినే బలంగా మార్చుకుని ముందుకు సాగి జీవితాన్ని అందంగా మలుచుకుంది. మన నైపుణ్యం, ఆసక్తులే మనల్ని మందుకు నడిపించే ఆస్తులనే లిలీమా కథ చెప్పకనే చెబుతోంది కదూ..!.(చదవండి: పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్‌గా కరీనా కపూర్! ఏకంగా రూ. 1.3 లక్షల..) -
పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ..!
ఎన్నో సివిల్స్ విజయగాథలు చూసుంటాం. కానీ పుట్టుకతో ముజేయి లేని ఈ దివ్యాంగురాలి కథ అత్యంత విభిన్నం. సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా..అనుకున్న ఐఏఎస్ పదవీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. కానీ ఈ సారి వరుస వైఫల్యాలు ఎదురవ్వుతున్నా.. వెనక్కి తగ్గకుండా ప్రయత్నించి ఐఏఎస్ అధికారి అయ్యింది. అపజయం అంటే విజయానికి ముగింపు కాదని..ప్రయత్నం ఆపకపోవడం అని చాటిచెప్పి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే కేరళకు చెందిన కాజల్ రాజు. ఆమె పుట్టుకతో ఫోకోమెలియా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కారణంగా కుడి ముంజేయి లేకుండా జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి చదువులో ముందంజలో ఉండేది. అలా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన ఐఐటి మద్రాస్‌లో డెవలప్మెంట్ స్టడీస్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిందామె. అయితే క్యాంపస్‌లో ఉన్నప్పుడే ప్రజా సేవపై మక్కువ ఏర్పడింది. అలా సివిల్స్ వైపు అడుగులు వేసింది. అయితే తొలి ప్రయత్నంలోనే విజయం అందుకుని ఆల్ ఇండియా 910వ ర్యాంకు దక్కించుకుని ఐఆర్ఎస్కు ఎంపికైంది. అయితే కాజల్ అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. అందుకే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరడమే లక్ష్యంగా మరోసారి సివిల్స్‌కి సన్నద్ధమైంది. ఈసారి మరింతగా ర్యాంకును మెరుగుపరుచుకోవాలనుకుంటే..మరింతగా ర్యాంకు దిగజారగా, మూడోసారి ఏకంగా ప్రిలిమ్స్‌లోనే ఓటమిని చవి చూసింది. నిజానికి ఈ వరుస వైఫల్యం ఎవ్వరికైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయేలా చేస్తుంది. కానీ కాజల్‌కి మరింతగా బలంగా ప్రిప్రేరవ్వాలన్న కసి అంతకంతకు పెరిగింది. అలా ఆమె సివిల్స్‌లో చివరికి ఆల్ ఇండియా ర్యాంక్ 167కి మెరుగుపరుచుకుని ఐఏఎస్ అధికారి అయ్యింది. ఇక్కడ కాజల్‌కి రైల్వే సర్వీస్ శిక్షణ, యూపీఎస్సీ ప్రిపరేసన్ అత్యంత సవాలుగా మారింది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చదవడం అత్యంత కష్టంగా ఉన్నా..ఏదోరకంగా ప్రిపరేషన్ కొనసాగించేది. తనకు ఏ కాస్త చిన్న సమయం దొరికినా..పుస్తకాలతో కుస్తీ పట్టేది. అంతేగాదు ఉద్యోగ బిజీ షెడ్యూల్‌ని, ప్రిపరేషన్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రమశిక్షణతో కూడిన నిలకడ అవసరం. ఈ కథ ఎదురుదెబ్బలు విజయాన్ని ఆలస్యం చేయొచ్చేమో గానీ అందుకోసం ప్రయత్నం మాత్రం ఆపకూడదనే స్ఫూర్తిని సివిల్స్ ఔత్సాహికుల్లో నింపుతోంది కదూ..!.(చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
ట్రిలియనీర్ మస్క్ వెనుక.. ఆ లేడీబాస్!
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచి మరో చరిత్ర సృష్టించారు ఎలాన్ మస్క్. ఐపీవో విజయవంతం కావడంతో ఆయన ‘స్పేస్ఎక్స్’ కంపెనీ విలువ రికార్డులు బద్ధలు కొట్టింది. అలా.. మస్క్ సంపద అమాంతం పెరిగిపోయింది. అయితే వివిధ కంపెనీలతో వ్యాపార రంగాన్ని శాసిస్తున్న మస్క్ ‘స్పేస్ఎక్స్’ సక్సెస్ వెనుక.. ఓ మహిళ పాత్ర ఉందని తెలుసా?. స్పేస్ఎక్స్ పని అయిపోయిందనుకున్న టైంలో ఆమె అడుగు సీన్ మొత్తాన్ని మార్చేసింది.మస్క్ కలలకు వ్యాపార రూపం ఇచ్చి, సంక్షోభాల్లో సంస్థను గట్టెక్కించి, స్పేస్‌ఎక్స్‌ను ప్రపంచ అగ్రశ్రేణి అంతరిక్ష సంస్థగా తీర్చిదిద్దిన ఆ మహిళే గ్విన్ షాట్వెల్. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న షాట్‌వెల్‌ను చాలామంది "మస్క్ విజన్‌కు ఎగ్జిక్యూషన్ ఇంజిన్"గా అభివర్ణిస్తారు. మస్క్ అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను ప్రకటిస్తే.. వాటిని సాధ్యమైన వ్యాపార ప్రణాళికలుగా మార్చి అమలు చేయడంలో షాట్వెల్ కీలక పాత్ర పోషించారని అంటారు. అందుకే తాజాగా మస్క్ ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన వేళ.. ఆయన వెనుక నిలిచిన ఈ లేడీబాస్ పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది.సంక్షోభ సమయంలో అండగా..స్పేస్ఎక్స్ ప్రారంభ దశలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా 2006 నుంచి 2008 మధ్య జరిగిన తొలి మూడు ఫాల్కన్-1 రాకెట్ ప్రయోగాలు వరుసగా విఫలమవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. కంపెనీ వద్ద నగదు నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయని, మరో ప్రయోగం కూడా విఫలమైతే స్పేస్ఎక్స్ మూతపడే పరిస్థితి ఏర్పడిందని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలోనే గ్విన్ షాట్వెల్ తన వ్యాపార నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నాసా చేపట్టిన కమర్షియల్ రీసప్లై సర్వీసెస్ (CRS) కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరకు రవాణా చేసే 1.6 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని ఆమె కుదుర్చగలిగారు. అప్పటివరకు అంతరిక్ష రంగంలో పెద్దగా గుర్తింపు లేని ప్రైవేట్ సంస్థకు నాసా ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం సంచలనంగా మారింది. ఈ ఒప్పందం ద్వారా వచ్చిన నిధులు స్పేస్ఎక్స్కు ఆర్థిక ఊపిరి పోయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంస్థపై విశ్వాసాన్ని పెంచాయి. చాలామంది విశ్లేషకులు ఈ డీల్‌ను స్పేస్ఎక్స్ చరిత్రను మలుపుతిప్పిన ఘట్టంగా, గ్విన్ షాట్వెల్ కెరీర్లో అత్యంత కీలక విజయంగా పేర్కొంటారు.స్పేస్ఎక్స్కు అసలు బలమే ఆమె2002లో సంస్థ ప్రారంభమైనప్పుడు.. అందులో 11వ ఉద్యోగిగా చేరారు షాట్వెల్. ప్రభుత్వ సంస్థలు, ఉపగ్రహ కంపెనీలు, వాణిజ్య భాగస్వాములతో సంబంధాలు పెంచుతూ స్పేస్ఎక్స్కు విశ్వసనీయత తీసుకొచ్చారు. బిలియన్ డాలర్ల ఒప్పందాలు సాధించడంతో పాటు స్టార్‌లింక్ విస్తరణ, వేలాది మంది ఉద్యోగుల నిర్వహణ, సంస్థ రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఆమెను స్పేస్ఎక్స్కు ‘వెన్నెముక’గా అభివర్ణిస్తుంటారు.మస్క్ కలలకు వ్యాపార రూపంచిన్నతనంలో రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ.. ఒకరోజు మనుషులను అంగారక గ్రహానికి పంపాలనే కలలు కనేవాడట ఎలాన్ మస్క్. ఆ స్ఫూర్తితోనే.. స్పేస్‌ఎక్స్‌ను స్థాపించి మార్స్ కాలనీలు, పునర్వినియోగ రాకెట్లు, స్టార్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టగలిగారు. అయితే మస్క్ ఊహించిన ఆ భారీ లక్ష్యాలకు ఆర్థిక బలం చేకూర్చడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యాపార ఒప్పందాలు కుదుర్చడం, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం వంటి బాధ్యతలను గ్విన్ షాట్వెల్ భుజాన వేసుకున్నారు. తొలి ట్రిలియనీర్‌గా మస్క్స్పేస్ఎక్స్ షేర్లు నాస్డాక్లో చరిత్రాత్మకంగా లిస్ట్ కావడంతో సంస్థ విలువ భారీగా పెరిగింది. దీంతో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద 1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ప్రపంచ చరిత్రలో ట్రిలియనీర్‌గా గుర్తింపు పొందిన తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. టెస్లా, స్పేస్ఎక్స్, స్టార్‌లింక్, న్యూరాలింక్ వంటి సంస్థల్లోని వాటాలు ఆయన సంపదను ఈ స్థాయికి చేర్చాయి.గ్విన్ షాట్వెల్ వ్యక్తిగత జీవితం..1963 నవంబర్ 23న అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఎవాన్‌స్టన్‌లో జన్మించిన గ్విన్ షాట్వెల్.. చికాగో సమీపంలోని లిబర్టీవిల్లో పెరిగారు. ఆమె తండ్రి మెదడు శస్త్రచికిత్స నిపుణుడు (బ్రెయిన్ సర్జన్) కాగా, తల్లి కళాకారిణి. చిన్నతనంలో అంతరిక్ష రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, టీనేజ్‌లో మహిళా ఇంజినీర్ల సమావేశానికి హాజరైన తర్వాత ఇంజినీరింగ్ వైపు ఆమె ఆకర్షితులయ్యారు. అనంతరం నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL)లో ఇంజినీర్‌గా పనిచేసిన రాబర్ట్ షాట్‌వెల్‌ను ఆమె వివాహం చేసుకుని జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లైన గ్విన్.. కుటుంబ జీవితం, స్పేస్ఎక్స్ బాధ్యతలను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్ ప్రాంతంలో స్పేస్ఎక్స్ రాకెట్ పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న సుమారు వెయ్యి ఎకరాల పశువుల ఫారాన్ని కూడా కుటుంబంతో కలిసి నిర్వహిస్తున్నారు.స్పేస్ఎక్స్-అలా.. స్పేస్ఎక్స్ (Space Exploration Technologies Corp.)ను ఎలాన్ మస్క్ 2002లో స్థాపించారు. అంతరిక్ష ప్రయాణ వ్యయాన్ని తగ్గించడం, భవిష్యత్‌లో మనుషులను అంగారక గ్రహానికి పంపడం సంస్థ ప్రధాన లక్ష్యాలు. ఫాల్కన్-9, ఫాల్కన్ హెవీ రాకెట్లు, డ్రాగన్ వ్యోమనౌకలు, స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌తో స్పేస్ఎక్స్ అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాసాకు మానవ, సరకు రవాణా సేవలు అందిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా గుర్తింపు పొందింది. -
క్లిక్ @ కిక్
ఫొటో జర్నలిస్ట్‌గా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలను ఒక్కసారి కవర్ చేయడమే విశేషంగా భావిస్తారు. అస్సాంకు చెందిన గీతికా తలుక్దార్ మన దేశం నుంచి వరుసగా మూడోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను కవర్ చేసే అవకాశం పొందిన ఏకైక ఉమెన్ ఫోటో జర్నలిస్ట్‌గా ప్రత్యేకత సాధించారు. వరుసగా మూడుసార్లు పురుషుల ఫిఫా వరల్డ్ కప్‌కు అధికారిక గుర్తింపు పొందిన గీతిక అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగానికి సంబంధించి రిపోర్టింగ్, ఫొటోగ్రఫీలో అపారమైన అనుభవం ఉన్న మీడియా నిపుణుల ప్రత్యేక బృందంలో చేరారు.గీతికా తలుక్దార్కు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను కవర్ చేయడంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2018లో రష్యా, 2022లో ఖతార్ తర్వాత ఇది ఆమెకు వరుసగా మూడవ ఫిఫా ప్రపంచకప్ అసైన్మెంట్.అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జన్మించారు గీతిక. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెరిగారు. కేంద్రీయ విశ్వవిద్యాయంలో చదువుకున్నారు.దక్షిణ కొరియాలోని ‘సియోల్ నేషనల్ యూనివర్శిటీ’లో గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేశారు. దక్షిణ కొరియా క్రీడా, సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి స్కాలర్షిప్ అందుకున్నారు. ‘సియోల్ నేషనల్ యూనివర్శిటీ’లో చదువుకోవడం ఆమె ప్రాపంచిక దృక్పథాన్ని విశాలం చేసింది.ఈశాన్య ప్రాంత ప్రతిభ ఏ అంతర్జాతీయ వేదికపైనైనా పోటీపడగలదనే ఆమె నమ్మకాన్ని బలపరిచింది. ఆ తరువాత క్రీడా జర్నలిజం వైపు అడుగులు వేసి ఫొటోగ్రఫీని తన కెరీర్‌గా ఎంచుకున్నారు గీతిక.మానవీయ కోణంలో....ఒక ఫొటో న్యూస్ ఏజెన్సీతో గీతిక కెరీర్ మొదలైంది. ఆ తరువాత పూర్తిస్థాయిలో స్పోర్ట్స్ జర్నలిజం, స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ వైపు వచ్చారు. స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ అంటే కేవలం ప్లేయర్స్ గోల్స్ కొడుతున్నప్పుడు ఫొటోలు తీయడం మాత్రమే కాదు. ఇలా కనిపించి అలా క్షణాల్లో మాయమయ్యే ఒత్తిడి, ప్రతిచర్యలు, భావోద్వేగాలను వేగంగా బంధించడం కూడా. ఆ కళలలో ఆరితేరారు గీతిక. ఆటలను చూసే క్రమంలో అభిమానుల స్పందన, అథ్లెట్ల సంబరాలు, ఒత్తిడిలో ఉన్న జట్టు... ఇలా క్రీడలు, క్రీడా కార్యక్రమాల చుట్టు ఉన్న వాతావరణాన్ని, క్రీడలలోని మానవీయ కోణాన్ని డాక్యుమెంట్ చేస్తాయి ఆమె తీసిన ఫొటోలు. గణాంకాలు ఎప్పటికీ తెలియజేయలేని కథలను గీతిక తీసిన ఫొటోలు చెబుతాయి.అత్యంత పోటీలో... అరుదైన అవకాశంరష్యా, ఖతార్‌లలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌తోపాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌లు, టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్, ఐపీయల్ సీజన్లు, కామన్వెల్త్ గేమ్స్, ఐసీసీ టోర్నమెంట్స్ కవర్ చేశారు గీతిక. ఆమె కెరీర్లో ఫిఫా అక్రిడిటేషన్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ టోర్నమెంట్లలో ప్రవేశం పొందడం అత్యంత పోటీతో కూడుకున్నది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు దరఖాస్తు చేసుకుంటారు.కెరీర్లో మైలురాయిఫిఫా వరల్డ్ కప్ కోసం అంతర్జాతీయ మీడియా కవరేజ్ బృందంలో మూడోసారి ఎంపిక కావడాన్ని తన కెరీర్లో ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ, తనకు మద్దతు ఇచ్చిన ఫిఫా, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలకు గీతిక ధన్యవాదాలు తెలియజేశారు.స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ ఇప్పటికీ పురుషాధిక్యతతోనే ఉంది. నిరంతర ప్రయాణాలు, ఎక్కువ పనిగంటలు అవసరమయ్యే ప్రపంచస్థాయి టోర్నమెంట్లలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లని ప్రోత్సహించడంలో భాగంగా 2024లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, పారిస్ ఒలింపిక్స్‌ను కవర్ చేయడానికి గీతికకు నేరుగా గుర్తింపు ఇచ్చింది. భారతదేశం నుండి ఈ గుర్తింపు పొందిన తొలి, ఏకైక మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు గీతిక.ఇదొక సుదీర్ఘ ప్రయాణంఏదీ ఒక్కరోజులోగానీ, ఒక్క ప్రయత్నంలోగానీ రాలేదు. ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం. నా అభిరుచి, నేను ఎంచుకున్న ప్రొఫెషన్లో పడిన కఠోరశ్రమ, అంకితభావం ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇచ్చింది. అవకాశాలను అందించింది. నా ప్రయాణంలో నాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన వారికి, విలువలు నేర్పిన కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.– గీతికా తలుక్దార్ -
Women Power: ‘కోటి’ ఆశల మహిళా మార్ట్!
ప్రకృతి ఒడిలో లభించే వస్తువులతో ఉత్పత్తులు తయారు చేయడం ఆ మహిళలు ఉపాధిగా మార్చుకున్నారు. కానీ వారి రెక్కల కష్టానికి దక్కాల్సిన ఫలితం వారికి దక్కక΄ోయేది. దళారులే దండుకునేవారు. అయితే అప్పటి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చొరవతో ఏడాది క్రితం ఆ మహిళలంతా కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ మార్ట్‌నిప్రారంభించారు. ఇపుడు అదే రూ.కోటి టర్నోవర్‌కు చేరుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది.జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు అటవీ ఉత్పత్తులతో, చిరుధాన్యాలతో పలు రకాల వస్తువులు, ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తుండేవారు. అయితే ఈ ఉత్పత్తులకు మొదట సరైన మార్కెటింగ్ లేక.. పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వ స్టాల్స్ పెట్టినపుడో, లేదా వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడో మాత్రమే విక్రయించడానికి అవకాశం ఉండేది. ఇదే అవకాశంగా తీసుకున్న కొందరు వ్యాపారులు వీరి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలు ΄÷ందేవారు.ఉపాధికి తోవ చూపిందిమేము జూట్ బ్యాగ్‌లు, జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామలుతో మిల్లెట్‌ఫుడ్ తయారు చేస్తాం. ఈ ఆర్గానిక్ ఫుడ్‌ను ఎక్కడ విక్రయించాలో ముందు మాకు తెలిసేది కాదు. ఖమ్మంలో మహిళామార్ట్ వల్ల మాకు ఉపాధి లభించింది. నెలకు రూ.35 వేల వరకు ఆదాయం వస్తోంది. – చాగంటి లావణ్య, ముదిగొండ, ఖమ్మంమా జీవితాల్లో వెలుగులు నింపింది!వినియోగదారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన స్వీట్లను తయారు చేసివ్వాలని మేము శ్రీవారాహి హోంఫుడ్స్‌ప్రారంభించాం. ధర ఎక్కువగా ఉందన్న కారణంతో మొదట్లో అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న మహిళామార్ట్ గురించి తెలిసి, అక్కడికి మా స్వీట్స్‌ని సరఫరా చేస్తున్నాం. అప్పటి నుంచి మాప్రోడక్ట్స్‌కి మంచి స్పందన లభించి ప్రతినెలా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు వ్యాపారం చేయగలుగుతున్నాం. – మృణాళిని, శ్రీ వారాహి హోంఫుడ్స్, సరఫరాదారుఇలా ఆరంభం!గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ముజమ్మిల్‌ఖాన్ మండలాల్లో పర్యటించినప్పుడు మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను, మార్కెటింగ్ చేసేందుకు పడుతున్న ఇబ్బందులను గమనించారు. అపుడే ఖమ్మం మహిళామార్ట్ ఆలోచనకు అంకురార్పణ చేశారు. స్థానికంగా ఉత్పత్తి అయిన సరుకులకు ప్రోత్సాహం కల్పించడం, మహిళా సంఘాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. బ్లాక్‌రైస్, రెడ్ రైస్ నుంచి వెదురు ఉత్పత్తుల వరకు సుమారుగా 200 రకాల ఉత్పత్తులు లభించే ఈ మార్టు అతి తక్కువ సమయంలోనే లాభాల బాటలో నడిచి రూ. కోటి టర్నోవర్‌ను చేరుకుంది. – బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం రాధారపు రాజు, సీనియర్ ఫొటోగ్రాఫర్ -
డైనమిక్ డయాన్ @ 79
విజయానికి ఎన్ని మెట్లో ఎవరు చెప్పగలరు? కొందరు మాత్రం కొన్ని మెట్ల తర్వాత ఆగిపోతారు. కొందరు మాత్రం ప్రతి మెట్టులో ప్రతికూలతలు ఎదురైనా వెనక్కి తగ్గరు. ‘ఫోర్బ్స్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదవసారి చోటు సాధించిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల డయాన్ హెండ్రిక్స్ రెండో కోవకు చెందిన మహిళ. ‘పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలి’ అని చిన్నప్పటి నుంచే కలలు కన్న డయాన్ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసిన రోజులూ ఆమె జీవితంలో ఉన్నాయి. ‘విజయం అంటే కొత్తగా ఆలోచించడం. మార్కెట్లోని లోటుని భర్తీ చేయడం’ అంటున్న డయాన్ హెండ్రిక్స్ గురించి...పదేళ్ల వయసు నుంచే ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కనేవారు డయాన్ హెండ్రిక్స్. ‘చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం... అవి నిజమవుతాయా!’ అని ఆ తరువాత అనుకోలేదు డయాన్. తన ‘లక్ష్యం’ అనే మొక్కను పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. కలను సాకారం చేసుకొని ‘సెల్ఫ్–మేడ్ ఉమెన్ బిలియనీర్’గా జేజేలు అందుకుంటున్నారు డయాన్.అప్పులు చేసి.. ఆస్తులు తాకట్టు పెట్టి...తాజాగా... తొమ్మిదవసారి అమెరికా రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్(2026) జాబితాలో చోటు సాధించి తన ప్రత్యేకత నిలుపుకున్నారు డయాన్. ఆమె సంపదలో అధిక భాగం ఆమె రూఫింగ్ మెటీరియల్ కంపెనీ ‘ఏబీసీ సప్లై’కి చెందినదే. తన భర్త కెన్ హెండ్రిక్స్‌తో కలిసి 1989 లో ఈ కంపెనీని స్థాపించారు. ఆరోజుల్లో వివిధ తయారీదారులు తయారు చేసిన రూఫింగ్ మెటీరియల్స్ ఒకేచోట దొరికే దుకాణాలు చాలా తక్కువగా ఉండేవి. ఇది గ్రహించిన డయాన్ ‘ఏబీసీ సప్లై’ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీప్రారంభించడానికి బ్యాంక్ నుంచి అప్పు చేయాల్సి వచ్చింది. ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. విస్కాన్సిన్లోని బెలోయిట్ కేంద్రంగా మొదలైన కంపెనీ కొన్ని సంవత్సరాలలో లాభాల బాట పట్టింది.విజయ రహస్యం‘నా విజయ రహస్యం... మార్కెట్లోని ఒక లోటును భర్తీ చేయడం’ అంటారు డయాన్. ఒస్సియో(యూఎస్)లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెరిగిన డయాన్ పెద్ద నగరంలో ఉండాలని, నీలం రంగు సూట్లు ధరించి, ఖరీదైన కార్లు నడపాలని కలలు కనేవారు. చిన్న వయసులోనే పెళ్లి అయి గర్భవతి కావడంతో ఇంటి నుంచే చదువు పూర్తి చేశారు. కాలేజీ చదువు కంటే రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ వెదుక్కోవడానికి చిన్నాచితకా పనులు చేశారు. చిన్న వయసులో తల్లి అయిన డయాన్ తన ఖర్చుల కోసం ప్లేబాయ్ బన్నీ(ప్లేబాయ్ క్లబ్లో పనిచేసే కాక్టెయిల్ వెయిట్రెస్)గా కూడా పనిచేశారు.క్యాన్సర్‌ను జయించి...రెండు సార్లు క్యాన్సర్ బారిన పడ్డారు డయాన్. తన సంకల్పబలమే క్యాన్సర్‌ను జయించే శక్తిని ఇచ్చింది. భర్త మరణం ఆమెను దుఃఖంలో ముంచెత్తింది. కష్టకాలం లో, నిరాశానిస్పృహల చీకటిలో కూడా...‘సాధించాలి. తప్పకుండా సాధించాలి’ అని గట్టిగా ఒకటికి పదిసార్లు అనుకునేవారు డయాన్. ప్రారంభ రోజుల్లో...ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసేవారు. పాత ఇంటిని కొని స్వయంగా మరమ్మతు చేసి కాలేజీ స్టూడెంట్స్‌కు అద్దెకు ఇచ్చేవారు.చాలా కష్టం...అయినా సరే...డయాన్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ‘ఏబీసీ సప్లై కో’ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ మార్కెట్ లో దూసుకుపోతోంది. మార్కెట్ పోకడలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై దృష్టి పెడుతోంది. రైతుబిడ్డ నుండి బిలియనీర్ వ్యాపారవేత్తగా డయాన్ ప్రయాణం అనేది పట్టుదల, అపారమైన ధైర్యసాహసాల కలబోత. ఎంతోమంది ఔత్సాహికులకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అపూర్వ విజయం.‘ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘వ్యాపారవేత్తగా రాణించడం అనేది చాలా కష్టం. మూస ఆలోచనలు కాకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. మీరు చేయాలనుకుంటున్నది మార్కెట్‌కు ఎంత అవసరం... అనేది మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. వ్యాపారంలో విలువైన సమయంతోపాటు, డబ్బు కూడా కోల్పోవలసి రావచ్చు. అలా అని భయపడకూదు. రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్కైనా సరే!’ ఎంతోమంది ఔత్సాహికులు తమ కలలను నిజం చేసుకోవడంలో సహాయపడిన డయాన్ దాతృత్వ కార్యక్రమాలలోనూ ముందుంటారు. టెన్ కమాండ్మెంట్స్కష్టపడి పనిచేసి నా కలలను నిజం చేసుకున్న ఒక సాధారణ అమెరికన్ అమ్మాయిని, రైతు బిడ్డను. వ్యక్తిగత, వృత్తి జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది నా తల్లిదండ్రులు. మా నాన్నగారు ఏది సరైనదో, ఏది కాదో చెప్పేవారు. ‘నేను చేస్తున్న పని సరైనదేనా అని నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది’ అని చెప్పేవారు. టెన్ కమాండ్మెంట్స్ నా వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిజీవితంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి. నేను వాటిని మళ్లీ మళ్లీ చదువుతాను. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఏది సరిౖయెనదో, ఏది త΄్పో అవి వివరిస్తాయి.– డయాన్ హెండ్రిక్స్ -
సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు
సెలవులు అయిపోయాయి.రేపో మాపో బడిగంట. ఇక అమ్మ ‘లేవరా’ అంటుంది. బయట స్కూల్ బస్ హారన్ మోగుతుంది. టీచర్ గుర్తొచ్చి భయమేస్తుంది. స్కూలుకు పోబుద్ధి కాదు. రెండు నెలల సెలవుల తర్వాత పిల్లలకు ఇలా అనిపించడం మామూలే. దీనిని స్కూల్ ఫీవర్ అనొచ్చు. అయితే ‘ఇలా నీకొక్కడికే కాదు... క్లాసంతా’ అని చెప్పాలి. పిల్లల్ని బడికి హుషారుగా సిద్ధం చేయాలి.తెలుగు రాష్ట్రాల్లో బడిగంట మోగే వేళన పిల్లలకు ఎన్నో సందేహాలు, లోలోపలి భయాలు, చిన్నపాటి ఆందోళనలు ఉంటాయి. కొత్త స్కూల్‌కి, కొత్త క్లాస్‌కి, కొత్త సెక్షన్‌కి మారడం... మళ్లీ ఆ భారీ స్కూల్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టడం... కొత్త టీచర్లను ఫేస్ చేయడం... అదీగాక ఇన్నాళ్లూ ఫోన్ చూసిన కళ్లతో రేపు బ్లాక్‌బోర్డ్ చూడాలంటే కష్టమే. అందుకే స్కూల్ ఫీవర్ తెచ్చుకుంటారు. అయితే దానికి విరుగుడు మాత్ర ఉంది.‘స్కూల్ ఫీవర్’ ఎందుకు?రెండు నెలలు ఇష్టానుసారం గడిచి ఉంటాయి. లేట్‌గా లేవడం, ఆడుకోవడం, టీవీ, నో హోంవర్క్.... ఇప్పుడు మళ్లీ టైమ్‌కి లేవాలి, ఇంట్లో స్కూల్లో రూల్స్ వస్తాయి... బ్రెయిన్ కి ఇది సడన్ బ్రేక్‌లా ఉంటుంది. అందుకే కడుపులో తిప్పేసినట్టు, ఏడుపు వచ్చేట్టు, చిరాకు కోపం, ఏదైనా ఎత్తుగడ వేయాలనిపించడం... పిల్లల్ని గమనించి మొదట వారిని ‘చిన్న పనుల్లో’ పెట్టాలి. ‘పుస్తకాలకు అట్టలు వేద్దాం రా’, ‘కొత్త పెన్ను పెన్సిలు బాక్స్‌లో పెట్టుకున్నావా?’, ‘యూనిఫామ్ సైజ్ చెక్ చేద్దాంరా’... ఈ పనులు చేయిస్తుంటే పిల్లల మైండ్‌కి ‘ఓకే, స్కూల్‌కి రెడీ అవ్వాలన్నమాట’ అనే ఫీలింగ్ వస్తుంది. ఫీవర్ దానంతట అదే తగ్గిపోతుంది.కొత్త బ్యాగ్ బెంగను పోగొడుతుందా?పోగొడుతుంది. కానీ బ్యాగ్ ఒక్కటే చాలదు. స్కూల్ ఫస్ట్ డే ఉదయం పిల్లలు లేచి చేసే మూడు పనులు వారి స్కూల్ ఫీవర్‌ని తరిమి కొడతాయి. ∙లేవగానే వారు చక్కగా తయారయ్యేలా చూసి అద్దంలో వారిని వారికి చూపించాలి. కొత్త యూనిఫామ్‌లో భలే బాగున్నావ్ అనాలి. ఏదో ఒక సరదా మాట చెప్పి నవ్వించాలి. నవ్వితే బ్రెయిన్ ‘నేను హ్యాపీ’ అని ఫిక్స్ అవుతుంది. ముందురోజు రాత్రే ఇష్టమైన టిఫిన్ కనుక్కుని ‘నీ ఫేవరెట్ టిఫిన్ రెడీ’ అని చెప్పాలి. కడుపు ఫుల్ అయితే మూడ్ ఆటోమేటిక్ సెట్. ∙స్కూల్‌కి వెళ్లేటప్పుడు ‘నీ బెస్ట్ ఫ్రెండ్ నీ సెక్షన్లోనే పడొచ్చు’ అనో, ‘ఈసారి ఎవరు కొత్త ఫ్రెండ్స్ అవుతారో’ అనో ఉత్సాహ పరచాలి. ‘క్లాస్‌రూమ్‌లకు కొత్తగా పెయింట్ చేయించారట’ అని చెప్పాలి. అలాంటివి వింటే పిల్లలు ఎగ్జయిట్ అవుతారు.హుషారుగా ఎలా ఉండాలి?‘మొదటిరోజు కాబట్టి నువ్వు ఈరోజు హుషారుగా ఉంటే సంవత్సరం అంతా హుషారుగా ఉంటావ్’ అని చెప్పాలి. ‘టీచర్ క్లాస్‌లోకి రాగానే గుడ్ మార్నింగ్ మేడం అని కాస్త గట్టిగా చెప్పు. లంచ్‌టైమ్‌లో ఒంటరిగా కూర్చోకు. ఇంకో విషయం... ఫస్ట్‌డే ఎవరూ నీ ర్యాంక్ అడగరు. నీ కొత్త షూస్, నీ నవ్వు చూస్తారు. నేను అందరితో కలిసిపోతా అనే ధైర్యంతో ఉండు’ అని చెప్పాలి.బస్సెక్కించేటప్పుడు ‘నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నీ సెక్షన్లో ఉండే అందరు పిల్లలూ అలాంటి ఫీలింగ్‌తోనే ఇవాళ స్కూల్‌కి వస్తారు. ఏం పర్వాలేదు. వెళ్లు. అక్కడ బెంచీలు, బ్లాక్‌బోర్డు, బెల్ అన్నీ నీ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఏడాది నీదే. స్కూల్లో చదువు, ఆడు, కథలు విను, ఫ్రెండ్షిప్ చెయ్...’ అని చెప్పాలి. మొదటిరోజు దాటితే ఈ సంవత్సరం దాటేసినట్టే. కేస్ స్టడీ 1: కార్తికేయ, 7వ తరగతికార్తికేయ గుంటూరులో చదువుతున్నాడు. రేపు స్కూల్ తెరిస్తే సెవెన్త్‌లో కూచోవాలి. పోయిన సంవత్సరం ఆరుకు వచ్చినప్పుడు ఫస్ట్ డే ΄÷ద్దున్నే ‘కడుపునొప్పి’ అన్నాడు. అమ్మ టెంపరేచర్ చూసింది, జ్వరం లేదు. బస్సెక్కించబోతే మొహం అదోలా పెట్టి ‘కొత్త సెక్షన్లో నా ఫ్రెండ్స్ ఉండరు’ అన్నాడు. అమ్మ వాడితో ‘మా బుజ్జి కదూ. బ్యాగ్‌లో నీకిష్టమైన ఫుడ్ పెట్టాను. అది లంచ్‌లో నీ పక్కవాడితో షేర్ చేసుకో’ అని చెప్పింది. కార్తికేయ నసుగుతూనే బస్సెక్కాడు. డల్‌గా కూచున్నాడు. కాని సాయంత్రం ఇంటికి హుషారుగా వచ్చి ‘కొత్త ఫ్రెండ్ దొరికాడు మా’ అన్నాడు. స్కూల్ ఫీవర్ పోయింది. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఈ ఫస్ట్‌డేకి ప్రిపేర్ చేయాలి.కేస్ స్టడీ 2: శ్రావ్య, 10వ తరగతిశ్రావ్య హైదరాబాద్‌లో ప్రయివేట్ స్కూల్. ఇప్పుడు 10కి వచ్చింది. 9వ క్లాస్‌లో మ్యాథ్స్‌లో 55 మార్కులు వచ్చాయి. సెలవులు అయిపోతున్నాయంటే శ్రావ్యకు మూడ్ పాడవుతోంది. ‘రేపు మ్యాథ్స్ మేడం సెలవుల్లో ఏం చేశావ్ అంటే ఏం చెప్పాలి? నన్నే లెక్క చేయమంటుందేమో’ అని ఏడుపు. అప్పుడు నాన్న పక్కన కూర్చుని ఒక పేపర్ ఇచ్చాడు. ‘దీనిమీద రాయి. టీచర్... నాకు లెక్కలు కష్టం. కానీ నేను నేర్చుకోవడానికి రెడీ. దయచేసి హెల్ప్ చేయండి. ఫస్ట్ డే ఇది మేడం డెస్క్ మీద పెట్టు. చదివిన ఏ టీచరూ హెల్ప్ చేయకుండా ఉండదు’ అన్నాడు. శ్రావ్యకు స్కూల్ ఫీవర్ పోయింది. బుర్రలో ‘భయం’ పోయి ‘భరోసా’ రావడంతో స్కూల్‌కు వెళ్లడానికి రెడీగా ఉంది. -
యుద్ధభూమిలో... జెండర్ పోరాటం
భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలట్‌గా చరిత్ర సృష్టించిన అభిలాష బరాక్ తాజాగా... ప్రతిష్ఠాత్మకమైన ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ అందుకున్నారు. లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి దళంలో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్‌గా భారత బెటాలియన్‌లో పనిచేస్తున్నారు అభిలాష. లెబనాన్‌లో సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలకు అండగా నిలవడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్‌లో పనిచేస్తున్న మేజర్ బరాక్, దక్షిణ లెబనాన్‌లోని భారతీయ బెటాలియన్‌లో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్‌గా సేవలందిస్తున్నారు. గత సంవత్సరం జూన్‌లో ఈ మిషన్‌లో చేరినప్పటి నుంచి స్థానిక ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మహిళలు, బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. వేలాది మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.ఐరాస ప్రశంసలుఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో మహిళలతో కూడిన గస్తీ బృందాలకు నాయకత్వం వహించారు అభిలాష. ‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ ఆమె విజయాలలో ఒకటి.‘లెబనాన్ జెండర్ ఇనిషియేటివ్’ అనేది ఏఐ–బేస్డ్ ప్లాట్‌ఫామ్. లింగ–ఆధారిత హింసను గోప్యంగా నివేదించడానికి, సహాయసేవలు, ఆత్మరక్షణ సమాచారాన్ని పొందడానికి పిల్లలకు సాయపడే వేదిక.శాశ్వత శాంతి వైపుగా...ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద దక్షిణ లెబనానుకు చెందిన 75 మంది మహిళలకు స్కాలర్షిప్లు ఇప్పించడంలో సహాయపడ్డారు అభిలాష. ‘ఐటీఈసీ’ అనేది పునరుత్పాదక శక్తి, ఫైనాన్స్ వంటి రంగాలలో శిక్షణ అందించడంలో మహిళలకు సహాయపడుతుంది. శాంతి పరిరక్షకులకు, స్థానిక సమాజాలకు మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, మహిళలకు సహాయ సహకారాలు అందించే వ్యవస్థలను మెరుగుపరచడానికి అభిలాష చేసిన కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.‘శాంతి పరిరక్షక మిషన్లను లింగ సమానత్వం అనేది ఎలా బలోపేతం చేయగలదో, శాశ్వత శాంతికి ఎలా దోహద పడగలదో బరాక్ నిరూపించారు’ అని అభిలాషను ప్రశంసించారు ఐక్యరాజ్య సమితి శాంతి కార్యకలాపాల అధిపతి జీన్–పియర్ లాక్రోయిన్స్. శాంతిభద్రతలలో మహిళల భాగస్వామ్యాన్నిప్రోత్సహించే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లే సైనిక శాంతి పరిరక్షకులకు 2016 నుండి యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ఇది ఇయర్’ అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డ్ అందుకున్న మూడో మహిళా అధికారి మేజర్ అభిలాష.బాల్యం నుంచే సైనిక క్రమశిక్షణహరియాణా రోహ్తక్ జిల్లా బాలంద్ గ్రామంలోని సైనిక కుటుంబంలో అభిలాష బరాక్ జన్మించారు. ఆమె తండ్రి కల్నల్ ఎస్.ఓమ్ సింగ్ జమ్మూ అండ్ కశ్మీర్ లైట్ ఇన్్రపాంటీలో సేవలందించగా, సోదరుడు ప్రస్తుతం భారతసైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక కంటోన్మెంట్లో పెరగడం వల్ల అభిలాషలో క్రమశిక్షణ, సేవాభావం, దృఢసంకల్పం లాంటి విలువలు బాల్యంలోనే పాదుకున్నాయి.దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీలో చదువుకున్న అభిలాష బీటెక్ (ఈసీయీ) చేశారు. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని డెలాయిట్‌లో బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించారు అభిలాష. దేశానికి సేవ చేయాలనే సంకల్పం అభిలాషను భారత సాయుధ దళాల పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బి) ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (వోటీఏ)లో శిక్షణ పొంది సెప్టెంబర్ 2018లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్పస్‌లో కమిషన్ పొందారు. కఠిన పరీక్షలు జయించి...భారత సైన్యం 2021లో మహిళా అధికారులకు యుద్ధవిమానయాన రంగం (కంబాట్ ఏవియేషన్)లో ద్వారాలు తెరిచింది. సాయుధ దళాలలో లింగ సమాన్వతం కోసం చేపట్టిన విస్తృత కార్యక్రమాలకు అనుగుణంగా ఈ విధాన మార్పు జరిగింది. కంబాట్ ఏవియేషన్‌లో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మహిళా అధికారులలో అభిలాష బరాక్ ఒకరు.పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ ఎవల్యుయేషన్స్తో సహా... రకరకాల కఠినమైన ఎంపిక ప్రక్రియల తర్వాత కేవలం ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. అందులో బరాక్ ఒకరు. ప్రీ–ఆర్మీ పైలట్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తన బ్యాచ్‌లో ప్రథమస్థానంలో నిలిచినందుకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఫ్లెడ్జింగ్’ ట్రోఫీని అందుకున్నారు. -
27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ.75 లక్షల టర్నోవర్
దృఢ సంకల్పానికి, స్ఫూర్తికి ప్రతీక ఆమె కథ. జీవితంలో అడుగడుగునా కష్టాలే అయినా పట్టుదలతో అద్భుతమైన విజయం సాధించింది. అచంచల కృషితో తన జీవితాన్ని మార్చుకోవడం మాత్రమే కాదు, తన తోటివారికి స్వీయ సాధికారత స్ఫూర్తి నందించిన మహిళ. కేవలం రూ. 500 పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం నేడు ఏటా రూ.75 లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది.ఎవరా మహిళ? ఆమె విజయ రహస్యం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోఅస్సాంలోని నల్బారి జిల్లాకు చెందిన కనికా తాలూక్దార్ కథ ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక ప్రయాణం. 27 ఏళ్ల వయసులోనే 2008లో ఒక రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు.ఉన్నత చదువులు లేవు, స్థిరమైన ఆదాయం లేదు. ఉన్నదల్లా నాలుగు నెలల కూతురు, అత్తామామలను పోషించేబాధ్యత. కానీ, ఆమె అధైర్యపడకుండా ఎదురొడ్డి నిలబడాలని నిర్ణయించుకుంది.ఆమె చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. 2014లో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. స్థానిక స్వయం సహాయక సంఘం (SHG)లో చేరారు. అక్కడ 'జీవిక సఖి'గా బాధ్యతలు చేపట్టడం వల్ల పొదుపు, బృందకృషి, చిన్న తరహా వ్యాపారాలపై ఆమెకు అవగాహన వచ్చింది.రూ.500 పెట్టుబడితో ప్రయోగంనల్బారిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ మనోషి చక్రవర్తి ఇచ్చిన వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ శిక్షణ కనికను ఎంతగానో ఆకర్షించింది. దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదని గ్రహించిన ఆమె, కేవలం రూ. 500లతో తన తల్లిదండ్రుల ఇంటి పెరట్లో ఒక కిలో వానపాములతో వర్మీ కంపోస్ట్ వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో, ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆవు పేడ ,ఆకుల వంటి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుంటూ, వర్మీకంపోస్టింగ్ తయారీ పనిని స్వీకరించింది.మొదట్లో అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కనిక పట్టుదల ఫలించింది. కొనేందుకు డబ్బుల్లేక చుట్టుపక్కల లభించే కూరగాయల వ్యర్థాలు, ఎండిన ఆకులను సేకరించి మొదటి బ్యాచ్ ఎరువును సిద్ధం చేసేది. ఇదే 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' సంస్థకు పునాది. రసాయన ఎరువులకు అలవాటు పడిన స్థానిక రైతులు మొదట్లో ఆమె సేంద్రియ ఎరువును కొనేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. కానీ కనిక వెనకడుగు వేయలేదు.2018 నుండి ఆమె స్వయంగా రైతులను కలిసి, చిన్న చిన్న సంఘాలను ఏర్పాటు చేసి వర్మీకంపోస్ట్ వల్ల నేల తల్లికి జరిగే మేలును వివరించడంతో పాటు, స్థానిక రేడియో ఛానళ్ల ద్వారా కూడా దీనిపై అవగాహన కల్పించేది. ఆమె పట్టుదలకు ఫలితంగా మెల్లమెల్లగా రైతులు ఆమె ఉత్పత్తులను నమ్మడం, కొనడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది, తన కార్యకలాపాలను విస్తరించింది. తన ఉత్పత్తులను వైవిధ్యపరిచింది. వర్మీకంపోస్ట్ వ్యాపారం నెలకు రూ. 3.5 లక్షల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది. అలా 2017లో 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' బ్రాండ్‌ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. 2019లో జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) మద్దతుతో ఆమె తన ఉత్పత్తులను Amazon, Flipkart , ప్రభుత్వ రంగ పోర్టల్ GeM (Government e-Marketplace) లలో విక్రయించడం ప్రారంభించింది. GeM పోర్టల్ ద్వారా ప్రభుత్వ శాఖల నుండి పెద్ద మొత్తంలో వార్షిక కాంట్రాక్టులు రావడంతో వ్యాపారం స్థిరపడింది.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ (NeedHub), IIM కలకత్తా, NRETP ల నుండి ఆమెకు రూ. 27.50 లక్షల బిజినెస్ గ్రాంట్లు లభించాయి. ఈ నిధులతో ఆమె మౌలిక సదుపాయాలను పెంచుకున్నారు. కేవలం ఒకటిన్నర బిఘాల సొంత స్థలం నుంచే ఈ వ్యాపారాన్ని నడుపుతుండటం విశేషం.ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!నెలకు ఏకంగా 70 టన్నుల వర్మీకంపోస్ట్‌ను ఉత్పతి చేస్తూ, ఈ విక్రయాల ద్వారా ఆమె ఏడాదికి రూ. 70 లక్షల నుండి రూ.75 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. వర్మీకంపోస్ట్‌తో పాటు ఆర్గానిక్ పురుగుమందులు, ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ (గోమయ అగర్బత్తి) కూడా తయారు చేస్తున్నారు. దీనికిగానూ 2019లో ICAR నుంచి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తన ఆన్లైన్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని, అలాగే తనలాంటి ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి, రసాయన రహిత స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కనిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సాధారణ మహిళ అనుకుంటే జీరో నుంచే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలదు అనేందుకు కనికా తాలూక్దార్ జీవితమే ఒక సజీవ సాక్ష్యం.ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం! -
భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు
ఢిల్లీలోని జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్ సైన్స్ టీచర్ సోమా మండల్ ఈ ఏడాది గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 129 దేశాల నుంచి వచ్చిన 12,000 నామినేషన్లలో ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ (కేంబ్రిడ్జ్)లోని అంతర్జాతీయ విద్యా విభాగం సోమా గ్లోబల్ విజేతగా నిలిచిందని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది ఇతర ప్రాంతీయ విజేతలతో హోరాహోరీగా జరిగిన పోటీలో, సోమా 40 శాతం ప్రజా ఓట్లను సాధించి.. భారత్ నుంచి గెలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించింది. సుమారు పదేళ్లకు పైగా బోధనా అనుభవం ఉన్న సోమా తన సైన్సు పాఠాలలో వాతావరణ విద్యను పొందుపరిచి..ఆ దిశగా విద్యార్థులను చైతన్యవంత చేయడమే కాదు, ఆచరణత్మక పరిష్కారాలను రూపొందించేలా ప్రోత్సహించారామె. ఈ మేరకు సోమా మాట్లాడుతూ..తాను ఈ గ్లోబల్ అవార్డు ఎంపికైనట్లు తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. అంతేగాదే తన తల్లిదండ్రలు, సోదరుడితో కలిసి సోమా న్యూఢిల్లీలోని కేంబ్రిడ్జ్ కార్యాలయాలకు చేరుకుని ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుని అందుకున్నారు. ఈ పురస్కారం తోపాటు ఆమెకు కేంబ్రిడ్జ్ వర్చువల్ ఎన్రిచ్మెంట్ కోర్సులో ఒక స్థానాన్ని కూడా ప్రధానం చేశారు. నిజంగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని క్షణం అని సోమా భావోద్వేగంగా చెప్పింది. ఇదిలా ఉండగా, కేంబ్రిడ్జ్‌లోని అంతర్జాతీయ విద్య గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాడ్ స్మిత్ సోమాని అభినందిస్తూ..ఆమె రూపొందించిన వాతావరణ మార్పుల పాఠ్యప్రణాళిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ప్రతిరోజూ తరగతి గదిలో విద్యార్థులకు తమ పర్యావరణ, గ్రహం పట్ల ఎలా ఉండాలో చెప్పడం నిజంగా అభినందనీయం అని అన్నారు. ప్రపంచంలో ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు వాతావరణ మార్పులు..అలాంటి దానిపై విద్యార్థుకు అవగాహన కల్పిస్తూ..ఆచరణాత్మక పరిష్కరాల దిశగా చైతన్య పరిచే ఆమె అభిరుచికి ధన్యవాదాలని అన్నారు. అంతేగాదు నవంబర్ 2026 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న కొత్త కేంబ్రిడ్జ్ పాఠ్యపుస్తకాల ముందు భాగంలోని 'ధన్యవాదాలు' పేజీలో కూడా ఆమె కనిపించనుంది. అలాగే సోమా ప్రాంతీయ విజేతగా, తన తరగతి కోసం 500 పౌండ్ల విలువైన పుస్తకాలను కూడా గెలుచుకుంది. (చదవండి: చింతగింజలతో మైక్రో ప్లాస్టిక్‌కి చెక్..!) -
ఫోర్బ్స్‌లో మన ఐకాన్
కొన్నిసార్లు అనుకోని సంఘటనలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి సంఘటనే న్యూయార్క్‌లో చదువుకునే భవిత మండవ జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఉన్నత చదువు కోసం వెళ్లి ఫ్యాషన్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. ఇదంతా రెండేళ్ల కిందట జరిగింది. ఓ రోజు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్వే స్టేషన్లో నిలబడి ఉండగా ఓ మోడలింగ్ ఏజెంట్ ఆమెను సంప్రదించాడు. అంతే ఆశ్చర్యకరంగా రెండు వారాల్లో ఇటలీలోని మిలాన్‌కు వెళ్లి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘బోటెగా వెనెటా’ కోసం ర్యాంప్ వాక్ చేసింది.భవిత హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి. జేఎన్టీయూలో చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లింది. మోడలింగ్ రంగంలో భవితకు డియోర్, కొరేజెస్ వంటి ప్రముఖ ఫ్యాషన్ హౌస్‌లలో పని చేసే అవకాశం వచ్చింది. అంతేకాదు 2025లో ప్రముఖ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఒకటైన ‘చానెల్’ నిర్వహించిన ఆర్ట్ షోను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్‌గా చరిత్ర సృష్టించింది. ఆ షో కూడా న్యూయర్క్ సబ్వే స్టేషన్లో జరగడం విశేషం. 2026 మార్చిలో చానెల్ ఆమెను భారతీయ అంబాసిడర్‌గా నియమించింది. ఫోర్బ్స్ ఏషియా 30 అండర్ 30 జాబితాలో ఆర్ట్స్ విభాగంలో ఆమెకు స్థానం లభించింది. అవకాశం రావడం కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి స్థాయికైనా ఎదుగుతారనడానికి భవిత నిదర్శనంగా నిలిచింది.చదవండి: 60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు -
పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్ ..! ప్రముఖ బ్రాండ్లకు..
ఒక సాధారణ నైపుణ్యంతో విజయవంతమైన వ్యాపారవేత్తగా మారి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందామె. పరిమిత వనరులతో ప్రారంభించిన వ్యాపారం..చూస్తుండగానే నెమ్మదిగా వృద్ధి చెందడం ఒక ఎత్తైతే..ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలే వచ్చి కొనుగోలు చేసేలా పేరుగాంచడం మాములు విషయం కాదు. కేవలం ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన ఆమె చిన్న సాధారణ నైపుణ్యంతో ఉపాధి ఏర్పరుచుకుని ఉన్నతస్థాయికి ఎదగడమే గాక ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం విశేషం. మరి ఆ మహిళ స్ఫూర్తిదాయక కథేంటో చూద్దామా..!.ఆ మహిళే లూధియానాలోని సమ్రాలా సమీపంలో ఉన్న భగవాన్పురా గ్రామానికి చెందిన 54 ఏళ్ల చరణ్‌జిత్ కౌర్. పుట్టిన దగ్గర నుంచి పేదరికంలో పెరిగిన ఆమెకు డబ్బు విలువ గురించి బాగా తెలుసు. ముఖ్యంగా ఉపాధి విలువేంటో బాగా తెలుసామెకు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదో ఒకటి చేయాలనుకుంది. అందుకోసం జనపనార సంచులను తయారు చేయడం నేర్చుకోవాలని అనుకుంది. మొదట్లో చరణ్‌జిత్‌కు మద్దతు లభించలేదు. అయినా సరే ఎలాగైనా నేర్చుకుని తీరాలన్న పట్టుదలతో కృషి విజ్ఞాన్ కేంద్ర (KVK) కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలలో చేరింది. అది ఆమెకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికే కాకుండా వ్యాపారం గురించి మరింతగా అవగాహన ఏర్పరుచుకోవడాని వీలు కల్పించింది. అలా చిన్నగా వ్యాపారం ప్రారంభించింది. అయితే మొదట్లో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఆర్డర్లు రాక ఇబ్బందిపడ్డది కూడా. అలా నెమ్మదిగా ఆర్డర్లు దక్కించుకుంటూ చిన్నగా మొదలైన వ్యాపారం కాస్తా సంస్థగా మారింది. అంతేగదు ఏకంగా టాటా, జోంటీ ఆగ్రో వంటి కంపెనీలు నుంచి ఆర్డర్లు అందుకునేలా పేరు సంపాదించించుకుంది. అలా తన వ్యాపారం ద్వారా నెలకు దగ్గర దగ్గర రూ. 50 వేలు వరకు సంపాదించుకునే రేంజ్‌కి వచ్చింది. సాధారణ ప్రజలు కూడా కొనుగోలు చేసే ధర, అనుకున్న సమయానికి ఆర్డర్ ఇచ్చేలా ఆమె నిబద్ధత వ్యాపారానికి కీలకంగా మారి ప్రముఖ కంపెనీల నుంచి ఆర్డర్లు అందుకునేందుకు దారితీసింది. మరోవైపు ఆమె తన ఆదాయంతో కుటుంబ పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇతర మహిళలకు ఉపాధి అవకాశాలు ఇచ్చే స్థాయికి వచ్చారామె. అంతేగాదు ఆమె జనపనారతో సంచులు ఎలా తయారు చేయాలో చెబుతూ..స్వయంగా డబ్బులు సంపాదించుకునే మార్గాల గురించి ఇతర మహిళలకు వివరిస్తుంటుంది. విదేశాల నుంచి వచ్చి మరి ఆమె తయారు చేసే జనపనార సంచులను కొనుగోలు చేస్తుంటారట. మన్నిక, వినియోగం ఆధారంగా కొన్ని జనపనార సంచులు అధిక ధర పలుకుతాయని చెప్పుకొచ్చింది చరణ్‌జిత్ కౌర్. ఈ కథలో ఆర్థిక ఇబ్బందులు, చదువు లేకపోవడం వంటి సమస్యలు ప్రతిబంధకం కాదు..తనపై తనకు నమ్మకం ఉంటే..చిన్న నైపుణ్యంతో విజయం సాధించొచ్చు, కలలు నిజం చేసుకోవచ్చని నిరూపించింది చణ్జిత్ కౌర్.(చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..) -
ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..
మనకెదురయ్యే సమస్యల నుంచే అద్భుత ఆవిష్కరణలు పుట్టుకొస్తుంటాయి. బహుశా సమస్య కూడా సౌకర్యాలు సమకూర్చుకునేదే కాబోలు. ఇదంతా ఎందుకంటే..ఇక్కడ ఓ ఐదేళ్ల చిన్నారి తనలాంటి పిల్లలు పడుకోవడానికి ఇబ్బందిపడే నిద్ర సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపింది. పేరెంట్స్‌కి పిల్లలను నిద్రపుచ్చుడం ఓ సవాలులా ఉంటుంది. ఆ సమస్యకు ఈ చిన్నారి భలే అద్భుతంగా చెక్‌పెట్టడమే కాదు. ఆమె ఆవిష్కరణకు పేటెంట్ కూడా మంజూరవ్వడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..ఇంతవరకు పిల్లల నిద్రపై ఏ ఆవిష్కరణ ప్రభావవంతంగా లేదు. పిల్లలు నిద్రపోవడం లేదంటూ డాక్టర్లు వద్దకు వెళ్లి మెడిసిన్ తెచ్చుకుని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలా ఔషధల ప్రభావం లేకుండా సహజసిద్ధంగా వాళ్లను నిద్రపుచ్చే టెక్నీక్ కోసం పిల్లలు, నిపుణులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదోక పరిష్కారం కానీ సమస్యలా ఉన్న జఠిల సమస్యకు కాలిఫోర్నియాకు చెందిన ఐదేళ్ల చిన్నారి వెన్నెల అత్తిలి అద్భుతంగా చెక్ పెట్టింది. తన తల్లి వీపుపై జోకొడుతూ ఉంటే తనకు నిద్రపట్టేది లేదంటే నిద్రపట్టేది కాదామెకు. ఒక్కోసారి ఆమె తల్లి త్వరగా నిద్రపోయేది దాంతో తనకు నిద్రరాకి ఎలా ఇబ్బంది పడేదో బాగా తెలుసు. అయితే ఒక రోజు స్కూల్లో ఉపయోగకరమైన ఏదైనా వస్తువును కనిపెట్టమని ఇచ్చిన అసైన్మెంట్ ఆవిష్కరణకు దారితీసింది. అదేదో తాను రోజు ఎదుర్కొంటున్న నిద్రసమస్యకు చెక్‌పెడితే చాలని అనుకుంది వెన్నెల. అందుకోసం ఒక టెడ్డీబేర్, గుడ్డ, పుల్లలు, వైబ్రేటింగ్ మోటర్ని ఉపయోగించింది. ఆ బొమ్మ మన పక్కన ఉంటే మన తల్లిదండ్రులు ఉన్నట్లుగా శ్వాస, వెచ్చదనం ఇచ్చేదనం అందించే బొమ్మ అయ్యి ఉండాలని అనుకుంది. అలా ఆమె ‘హ్యాపీ స్లీప్’ అనే శ్వాస తీసుకుని వెచ్చదనం అందించే బొమ్మను రూపొందించింది. నిజానికి ఇంట్లో చాలామంది పిల్లలు పడుకునేటప్పుడు తమకు నచ్చిన ఏదోఒక బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోతుంటారు. ఆ బొమ్మతో పిల్లలకు భావోద్వేగపరమైన సంరక్షణతో కూడిన అనుబంధం ఉంటుంది. అలా వెన్నెల ఆవిష్కరించిన బొమ్మ నిజంగానే ప్రభావవంతంగా ఉంది. ఇది నిజంగా పిల్లలకు తమ పక్క సంరక్షకులు ఉన్నారనే భావంతో హాయిగా నిద్రపోయారు. పైగా అధ్యయనంలో మంచి ఫలితాలు లభించాయి. దాంతో ఈ ఆవిష్కరణను 2019 కాలిఫోర్నియా ఇన్వెన్షన్ కన్వెన్షన్‌లో ప్రదర్శించగా, అక్కడ ఆ చిన్నారి మెరిట్ అవార్డును అందుకోవడమే కాకుండా యుఎస్ పేటెంట్ కూడా మంజూరవ్వడం విశేషం. కాగా, ఈ ఆవిష్కరణ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా కీమోథెరపీ చేయించుకుంటున్న వారికి లేదా ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉన్న వారికి సాంత్వన చేకూరుస్తుందని చెబుతోంది ఆ చిన్నారి. (చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!) -
పచ్చగా ఉందాం
మంచి చెప్పాలనే ఆలోచన కొందరిలోనైనా మార్పు తీసుకురావాలనే తపన వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చింది. ‘భూమాతకు జవం జీవం కల్పించండి’ అంటూ సోషల్‌మీడియా ద్వారా సస్టెయినబులిటీ, జీరోవేస్ట్, రీ సైక్లింగ్ గురించి వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఇళ్లలో పోగవుతున్న చెత్తఫ్రెంచ్ సబ్జెక్ట్‌లో పిల్లలకు పాఠాలు చెబుతుంది విధి. ఐదేళ్లక్రితం పర్యావరణ అనుకూల జీవనంవైపు ప్రయాణం ఆరంభించింది. మిలియన్‌కు పైగా వీక్షకులు ఉన్న విధి ట్రేషీ సిస్టర్ పేరుతో బోలెడన్ని ఇంటి చిట్కాలు చెబుతుంది. ‘మహిళలు ఉపయోగించే మెనుస్ట్రువల్ కప్‌ను కనుక్కోవడంతో ఈ దిశగా నా ఆలోచనలు సాగాయి. మహిళలు రుతుక్రమ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యా డ్స్ వల్ల చెత్త ఎంత ఎక్కువగా వస్తుందో గ్రహించాను. దీంతోపాటు వివిధ రకాల వ్యర్థాలు పర్యావరణంపైనే కాకుండా మన ఆరోగ్యంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నాను. ఇళ్లలో పోగవుతున్న చెత్త గురించి నా పేజీ ద్వారా మాట్లాడుతుంటాను. చిరిగిన బట్టలు, అరిగిన చెప్పులు, వాడేసిన టూత్‌బ్రష్షులు, గడువు ముగిసిన ఉత్పత్తులు.. వీటన్నింటినీ తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతుంటాను. నా కంటెంట్ చూసి, ఒక్కరు మారినా చాలు’ అంటుంది విధి.ప్రకృతి ప్రేమికురాలు.. స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్ ఛేంజ్ అడ్వకేట్, ఫొటోగ్రాఫర్, సస్టెయినబిలిటీ ఇన్ఫ్లూయెన్సర్ గా పేరొందారు శివ్యానాథ్. సోలో ట్రావెలర్ అయిన శివ్యా పదేళ్లుగా మాంసాహార ఉత్పత్తుల నుంచి దూరమై వీగన్ ఫుడ్వైపుగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. వాయిసెస్ ఆఫ్ రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు కో–ఫౌండర్‌గా వర్క్ చేస్తున్నారు. రూరల్ స్టోరీ టెల్లర్గా తన గొంతుకను వినిపిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా లక్షల్లో ఫాలోవర్లు ఉన్న శివ్యా సోలో ట్రావెలర్‌గా ప్రకృతి, పర్యావరణం గురించి తన అనుభవాలన్నీ ఇందులో జోడిస్తుంది.చెట్లను రక్షిద్దాం..హిమాచల్‌ప్రదేశ్ వాసి శివాని కన్వర్ స్వచ్ఛభారత్ మిషన్‌లోనూ వర్క్ చేస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్, సస్టెయినబిలిటీ మీద కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అమృత్సర్ జిల్లాలోని మజీతాలోని స్థానిక సంస్థలలో చేసిన కృషికి గాను ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాన్నీ పొందింది. ‘చెట్లను నాటడం ముఖ్యం. కానీ, ఇప్పటికే ఉన్న పెద్దచెట్లను రక్షించడం మరింత కీలకం. ఒక చెట్టుకు హాని జరుగుతుంటే చూస్తూ మౌనం వహించకండి. దానిని రక్షించండి. ఇలా దేశమంతటా చేస్తే పచ్చదనాన్ని కాపాడుకున్నవారం అవుతాం. ఎవరైనా అక్రమంగా చెట్లను నరుకుతుంటే దాని గురించి పోలీసులకు తెలియజేయండి. ఒక్క ఫోన్ కాల్ ఒక చెట్టును కాపాడగలదు. కాపాడిన చెట్టు తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ప్రచారం చేసే శివానీ ఎకో ఎఫర్ట్స్ పేరుతో పర్యావరణ హితానికి కృషి చేస్తోంది.రీ యూజ్ప్రకృతిలో మమేకం అవుతూ ఎలా జీవించవచ్చో తన పేజీ ద్వారా విరిస్తుంది ఇండోర్‌వాసి ‘శ్వేత కటారియా’. వీగన్ న్యూట్రిషన్‌పై వర్క్ చేస్తున్న శ్వేత తన పేజీ ద్వారా సస్టెయినబిలిటీ జీవన విధానాల గురించి వివరిస్తుంది. వంటగదిలో వాడే క్లీనింగ్ ప్రొడక్ట్స్, వేస్టేజ్, రీయూజ్ దుస్తుల గురించి మొక్కల పెంపకం, చెట్ల ప్రాముఖ్యత.. ఇలా ప్రతిదీ వివరిస్తుంది. లక్షకు పైగా ఫాలోవర్లు తన కంటెంట్‌ను ఫాలో అవుతున్నారు. -
60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు
హుషారు కోసమో, లేదా బేజారు తగ్గడం కోసమో శరీరానికి కాస్త వ్యాయామం అవసరమని సైకిలింగ్ చేసేవాళ్లను చూశాం. బ్యాటరీ సైకిళ్లు, స్కూటర్లు వచ్చాక పెడల్ మీద కాలు పెట్టేవారే కరువయ్యారు. కాని రాజస్థాన్‌లోని ఓ మహిళ తన అనితర సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జైపూర్‌కి చెందిన రేణు సింఘి వయసు అక్షరాల 60 ఏళ్లు. అయితేనేం? టీనేజర్లు కూడా షాక్ అయ్యేలా సైకిలింగ్ చేస్తూ ఛాలెంజ్ విసురుతోంది. సైకిలింగ్ అంటే అదేదో ట్రాక్లోనో స్మూత్‌గా ఉన్న రోడ్డు మీదో కాదు. మిట్టపల్లాలు, కొండలు, గుట్టలు ఇలా ప్రదేశమేదైనా తగ్గేదేలే అంటూ సైకిల్ తొక్కేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె సైకి లింగ్ మొదలుపెట్టింది 51 ఏళ్ల వయసులో..కాని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె 1.5 లక్షల కిలోమీటర్లు సైకిలింగ్ చేసింది. అలాగే ‘1200 కి.మీ పారిస్ బ్రెస్ట్ పారిస్’ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే.. ఇలా పలు రేసుల్లో పాల్గొంటూ తన తోటి వయసు వారికి ఆదర్శంగా నిలుస్తోంది. -
52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..
చదవాలన్న కోరిక బలంగా ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ఎందరో నిరూపించారు. అయితే ఓ మహిళ కుటుంబ బాధ్యతలతో తలమునకలులవ్వుతూ ఐదుపదుల వయసులో చదవాలనుకోవడం అంటే.. అంత ఈజీ కాదు. మాటల్లో చెప్పినంత సులువు కూడా కాదు. కానీ ఓ మహిళా దాన్ని సాధ్యం చేసి చూపించింది అది కూడా 52 ఏళ్ల వయసులో. కష్టపడి చదవడానికి భయపడే యువతరానికి ఆమె కథ ఓ స్ఫూర్తి.గుజరాత్‌కు చెందిన, కామర్స్ గ్రాడ్యుయేట్ అనితా కప్డి 23 ఏళ్ల పాటు విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బోధించారు. అయితే, ఆమెకు గణితం, అకౌంటెన్సీలో మంచి అభిరుచి, నైపుణ్యం ఉన్నాయామెకు. పూర్తికాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే ఎంకామ్, బీఎడ్ పూర్తి చేశారామె. అలాగే ఆమెకు సీఏ చేయాలనే జీవితకాల డ్రీమ్ కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే 48 ఏళ్ల వయసులో, పదవీ విరమణకు దగ్గరవుతున్నప్పుడు ఎలాగైనా సీఏ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. పైగా ఆ సీఏ డిగ్రీని తన సీఏ తండ్రి (ఒక కంపెనీ సెక్రటరీ) 75వ పుట్టినరోజుకి గిఫ్ట్‌గా ఇవ్వాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలా ఆమె 2012లో, ఆమె ICAI డైరెక్ట్ ఎంట్రీ మార్గం ద్వారా సీఏ(CA) కోసం నమోదు చేసుకున్నారామె. అలా అని హాయిగా కూర్చొని చదువుకునే తీరిక మాత్రం లేదు. ఆమె చదవుకోవాలనే జర్నీ ఎంతో సవాలుతో మొదలైంది. ఒక పక్క కుమార్తె వివాహ సన్నహాలు, మరోవైపు కుమారుడి బోర్డు పరీక్షలకు మద్దతివ్వడం, వంటి కుటుంబ బాధ్యతలతో సతమతమవ్వుతూనే సీఏకి ప్రిపరయ్యారామె. పైగా కోచింగ్ లేకుండా సీఏ రెండో దశ ఐపీసీసీ(IPCC)ని క్లియర్ చేసింది. ఆ తర్వాత కూడా సరిగ్గా చదువుకునే అవకాశం చిక్కలేదు అనితకు. సరిగ్గా సీఏ ఫైనల్ పరీక్షలకు సన్నద్ధమవ్వుతుండగా అత్తగారిని కోల్పోవడం, ఆ బంధువుల హడావిడి మధ్య అలానే నిశబ్దంగా చదువు కొనసాగించి అనుకున్నట్లుగా క్లియర్ చేసి సీఏ అయ్యారామె. అలాగే అనిత తను కోరుకున్నట్లుగానే తండ్రి 75వ పుట్టినరోజు నాడు సీఏ డిగ్రీని గిఫ్ట్‌గా ఇచ్చింది. అలా అనిత 52 ఏళ్ల వయసులో సీఏ అయ్యింది. (చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపునులు సైతం..) -
అందం కమ్మేసిన అద్భుతం
‘సెక్స్ సింబల్’... ‘డంబ్ బ్లాండ్’.... ప్రపంచం ఆమెకు వేసిన ముద్రలివి... కానీ చరిత్ర ఇప్పుడు చెబుతోంది... ‘మన్రో ఒక జీనియస్’. అందం వెనుక దాగిన అక్షరాస్యురాలు. కెమెరా ఎదుట కవ్వించిన ఆమె ఓ పుస్తకాల పురుగు. 2026 జూన్1కి ఆమెకు నూరేళ్లు. జీవించి ఉంటే నూరవ బర్త్‌డే కేక్ కట్ చేసేది. కానీ 36 ఏళ్లకే లైట్స్ ఆఫ్ అంది. 100 ఏళ్ల తర్వాత కూడా వెలుగుతూనే ఉంది. మన్రో కేవలం అందగత్తె కాదు. తెర మీద కనిపించినట్టుగా ‘డంబ్ బ్లాండ్’ కాదు. ఆమె ఒక తిరుగుబాటుదారు. కవయిత్రి. ఫెమినిస్ట్. సినిమా ప్రొడక్షన్‌కు అధినేత. అప్పటికి దస్తోయెవ్స్కీని ఇతర గొప్ప రచయితలను చదివిన అరుదైన హాలీవుడ్ నటి. కాని లోకం ఆమెకు ‘ఖాళీ బుర్ర’ అని ముద్ర వేసింది. నిజం ఏంటంటే మన్రో ఐ.క్యూ. చాలా ఎక్కువగా ఉండొచ్చని కొందరు అంచనా కడతారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐ.క్యూ. కంటే ఎక్కువ అనేవారూ ఉన్నారు. మార్లిన్ మన్రో చాలా తెలివైనది, మేధావి. అందుకు ఆమె చనిపోయినప్పుడు ఇంట్లో కనిపించిన 400లకు పైగా పుస్తకాల లైబ్రరీయే సాక్ష్యం. అవి అలంకారానికి అక్కడ లేవు. మన్రో వాటిని చదివినట్టుగా జేమ్స్ జాయిస్ ‘యులిస్సెస్’, దోస్తోయెవ్స్కీ ‘ది బ్రదర్స్ కరమజోవ్’, ఫ్రాయిడ్, రిల్కే, వాల్ట్ విట్మన్... అన్నీ పుస్తకాల్లో అండర్లైన్ చేసి, మార్జిన్ లో నోట్స్ రాసుకుని ఉంది. ఆమెను ‘మీరేం చదువుతారు?’ అని ఎవరో అడిగితే ‘నేను కవిత్వం చదువుతాను. ఎందుకంటే కవిత్వం నిజం చెబుతుంది. హాలీవుడ్ అబద్ధం చెబుతుంది’ అని జవాబు చెప్పింది. కవిత్వం రాసేది. ఆమె డైరీల్లో దొరికిన కవిత ఒకటి:‘మనం ఇతరులను పూర్తిగా తాకలేం; మనలోని కొంతే వారిలోని కొంతను తాకుతుంది. ప్రతి ఒక్కరి సత్యం వారికి మాత్రమే సొంతం’ఇది ‘డంబ్ బ్లాండ్’ రాసే కవిత్వమా? ఇది తత్త్వం. 1950ల్లో హీరోయిన్లంటే స్టూడియోల చేతిలో కీలుబొమ్మలు. కాంట్రాక్ట్ చేసుకున్న డబ్బే జీతం. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే హక్కు లేదు. డైరెక్టర్ని ప్రశ్నించే ధైర్యం లేదు. మార్లిన్ ఏం చేసిందో తెలుసా? 1954లో ట్వంటియెత్ సెంచరీ ఫాక్స్‌తో ఏడేళ్ల కాంట్రాక్ట్‌ను తెంచుకుని న్యూయార్క్ వెళ్లిపోయింది. లీ స్ట్రాస్‌బర్గ్ దగ్గర ‘మెథడ్ యాక్టింగ్’ నేర్చుకుంది. 1955లో సొంతంగా ‘మార్లిన్ మన్రో ప్రొడక్షన్స్’ అనే కంపెనీ పెట్టింది. హాలీవుడ్ చరిత్రలో స్టూడియోల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టిన తొలి ఫీమేల్ స్టార్ మన్రో. ఆ దెబ్బకు ఫాక్స్ దిగొచ్చింది. కొత్త కాంట్రాక్ట్ ఇచ్చింది. పారితోషికం ఎంతో తెలుసా? సినిమాకు లక్ష డాలర్లు, అంతేకాదు లాభాల్లో వాటా, డైరెక్టర్నీ, స్క్రిప్ట్‌నీ అప్రూవ్ చేసే హక్కూ. ఆ రోజుల్లో ఒక హీరోయిన్ కి ఇన్ని హక్కులు రావడం అంటే విప్లవం. అలాంటి విప్లవ వనిత మన్రో. లాస్ ఏంజిల్స్‌లో మోకాంబో అనే ఫేమస్ నైట్‌క్లబ్ ఉండేది. అక్కడ నల్లజాతి గాయనిలకు అనుమతి లేదు. ఎల్లా ఫిట్జ్‌గెరాల్డ్ అనే గొప్ప సింగర్‌కు అక్కడ పాడే అవకాశం ఇవ్వలేదు క్లబ్. మెర్లిన్ ఫోన్ చేసింది. క్లబ్ ఓనర్‌తో మాట్లాడింది. ‘నువ్వు ఎల్లాకు వారం బుకింగ్ ఇస్తే, నేను ప్రతి రాత్రి ఫ్రంట్ టేబుల్లో కూర్చుంటా. ప్రెస్ మొత్తం వస్తుంది. నీ క్లబ్‌కి ఫ్రీ పబ్లిసిటీ’ అంది. ఓనర్ ఒప్పుకున్నాడు. వారం రోజులు మెర్లిన్ ఫ్రంట్ రోలో కూర్చుంది. నల్ల గాయని ఎల్లా కెరీర్ ఆ వారం రోజుల్లో మారిపోయింది. తర్వాత ఎల్లా ‘నేను మార్లిన్ మన్రోకు నిజంగా రుణపడి ఉన్నాను. ఆమె మాట ఇచ్చినట్టుగా ప్రతి రాత్రి ముందు వరుస టేబుల్లో కూర్చుంది. ఆమె ఊహించినట్టుగానే ప్రెస్ వాళ్లు పిచ్చెక్కిపోయారు.’ ఇది గ్లామర్ డాల్ చేసే పనా? కాదు. ఇది జెండర్, జాతి వివక్ష గోడలను బద్దలు కొట్టిన యోధురాలి పని. ప్రపంచమంతా పేరు గడించిన ఈ తార బాల్యానిది ఊరు పేరూ లేని అనాథ బతుకు అనంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పుట్టింది జూన్ 1, 1926. లాస్ ఏంజిల్స్‌లో. అసలు పేరు నార్మా జీన్. తండ్రి ఎవరో తెలీదు. తల్లి గ్లాడీస్కు మానసిక ఆరోగ్యం బాగుండేది కాదు. దాంతో నార్మా జీన్ జీవితం అనాథాశ్రమాలలో అక్కడా ఇక్కడా గడిచింది. ఈ బాధల నుంచి విముక్తికి 16 ఏళ్లకే పొరుగింట్లో ఉండే జేమ్స్ డోహెర్టీ అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేడియోప్లేన్ కంపెనీలో డ్రోన్ పార్ట్స్ తనిఖీ చేసే ఉద్యోగాన్ని వారానికి 20 డాలర్లు లెక్కన చేస్తుంటే 1944లో ఆర్మీ ఫొటోగ్రాఫర్ డేవిడ్ కొనోవర్ ఆ ఫ్యాక్టరీలో ఫొటోలు తీయడానికి వచ్చి ఈమెను చూశాడు. ‘నువ్వు మోడలింగ్ చేస్తే బాగుంటుంది‘ అన్నాడు. ఫొటోలు తీశాడు. ఆ ఫోటోలతోనే నార్మా జీన్ జీవితం మలుపు తిరిగింది. కొన్నాళ్లు మోడలింగ్ చేశాక మన్రోకు ట్వంటియెత్ సెంచరీ ఫాక్స్ స్టూడియో కాంట్రాక్ట్ ఇచ్చింది. కండిషన్ ఒకటే– పేరు మార్చుకోవాలి, జుట్టు బ్లాండ్ చేసుకోవాలి. ఆ స్టూడియో ఎగ్జిక్యూటివ్ బెన్ లియాన్ ‘మార్లిన్’ అనే పేరు సజెస్ట్ చేశాడు. ‘మన్రో’ తనే జత చేసుకుంది. అది ఆమె అమ్మమ్మ ఇంటిపేరు. అలా నార్మా జీన్ ‘మార్లిన్ మన్రో’ అయ్యింది. మొదట్లో చిన్న చిన్న వేషాలు. డైలాగ్ ఒక్క ముక్క. కానీ ఆ ఒక్క ముక్కలో, ఒక్క నవ్వులో హాలీవుడ్‌ని కట్టిపడేసింది. జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లాండ్స్ (1953), హౌ టు మ్యారీ ఎ మిలియనీర్ (1953), ది సెవెన్ ఇయర్ ఇచ్ (1955), బస్ స్టాప్ (1956), సమ్ లైక్ ఇట్ హాట్ (1959), ది మిస్ఫిట్స్ (1961)... సూపర్హిట్లు. హాలీవుడ్లో అందరూ ‘స్ట్రాంగ్’గా కనిపించాలని చూస్తారు. మెర్లిన్ మాత్రం ‘నాజూకు’గా కనిపించింది. ఆమె కళ్లలో అభద్రత, అమాయకత్వం... ప్రేక్షకుడు చూడగానే ‘అయ్యో పాపం, ఈమెని నేను కాపాడాలి’ అనుకునేవాడు. అదే ఆమె ట్రంప్ కార్డ్. బలంగా కాదు బలహీనంగా కనిపించి గెలిచిన ఏకైక స్టార్ ఆమె.ఆమె గొంతు మామూలుగా ఉండేది కాదు. ‘బ్రెతీ వాయిస్’ అంటారు. గొంతుతోనే శృంగారం పలికించగలిగిన నటి. షాట్ తీస్తున్నప్పుడు లైట్ ఎక్కడ పడాలో ఆమెకు తెలుసు. తల కొంచెం వంచడం, గడ్డం కిందికి దించి పైకి చూడడం, భుజం తిప్పడం ప్రతి కదలికా లైటింగ్‌తో డ్యాన్ ్స చేసినట్టు ఉండేది. ‘సెవెన్ ఇయర్ ఇచ్’లో ఐకానిక్‌గా నిలిచి డ్రెస్ ఎగిరే సీన్ కోసం, గాలికి ఎలా రియాక్ట్ అవ్వాలనే ఎక్స్ప్రెషన్ కోసం 11 టేకులు రిహార్సల్ చేసింది. ఆమెది స్క్రీన్ మ్యాజిక్ కాదు, స్క్రీన్ సైన్ ్స. సాధారణంగా స్త్రీలు కామెడీ చేయరు. కాని మార్లిన్‌ది అద్భుతమైన కామిక్ టైమ్. చార్లీ చాప్లిన్ తర్వాత కామెడీని పండించిన స్టార్ ఆమె. ఇక మన్రో లిప్‌స్టిక్ పెదాలు జగద్విదితం. తన పెదాలకు ఎర్రదనం కోసం ఐదు షేడ్స్ కలిపేదట. ఆ కిటుకు ఇతరులకు తెలియదు. ఆగస్ట్ 5, 1962. లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్వుడ్ ఇంట్లో శవమై కనిపించింది మన్రో. అప్పటికి వయసు 36. అధికారిక కారణం నిద్రమాత్రల ఓవర్‌డోస్. కొందరు ఆత్మహత్య అన్నారు. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ. కెన్నెడీ బ్రదర్స్, మాఫియా, ఎఫ్.బి.ఐ.... చాలా థియరీలు ఉన్నాయి. ఆమె సమాధి లాస్ ఏంజిల్స్‌లో వెస్ట్‌వుడ్ విలేజ్ మెమోరియల్ పార్క్‌లో ఉంది. నార్మా జీన్ గా పుట్టి, మార్లిన్ మన్రోగా ఎదిగి, లెజెండ్‌గా మిగిలిపోయింది. 16 సినిమాలే చేసింది. 36 ఏళ్ల చిన్న జీవితమే కావ చ్చు. కానీ 100 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఆమె పుట్టినరోజును జరుపుకుంటోంది.కొందరు స్త్రీలు నటీమణులు. కొందరు స్త్రీలు సూపర్స్టార్లు. కానీ మార్లిన్ మన్రో ఒక్కత్తే. కల్చరల్ ఫినామినన్. అమరం అయిన అందం. – ఖదీర్ -
Women Power: పక్కా పల్లెటూరులో... ఫైవ్‌స్టార్ లైబ్రరీ!
బిహార్‌లోని జమయి జిల్లాలోని దబిల్ గ్రామంలో.... దినపత్రికలు, పుస్తకాలు చదువుకునేవారు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు పట్టణంలోని లైబ్రరీలు తప్ప ఇతరత్రా సదుపాయాలు ఉండేవి కాదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చింది సర్పంచ్ దబిల్.‘మన ఊరికి మంచి లైబ్రరీ ఉండాలి. అది మన పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని గ్రామ ప్రజలను ఒప్పించింది దబిల్. ఇప్పుడు ఈ గ్రంథాలయం వందలాది మంది విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఈ లైబ్రరీకి రెగ్యులర్‌గా వస్తుంటారు.విద్యార్థులకు సహాయం చేయడానికి ఈ లైబ్రరీలో ఇద్దరు ఉద్యోగులను నియమించారు. ఎయిర్ కండిషన్డ్ గదులతో పాటు భద్రతా పర్యవేక్షణ కోసం సీసీ టీవి కెమెరాలు అమర్చారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించకుండా, ప్రభుత్వ ఫండ్స్ కోసం ఎదురుచూడకుండా గ్రామస్థులే పదిహేను లక్షల ఖర్చుతో ఈ ఫైవ్–స్టార్ లైబ్రరీని నిర్మించుకోవడం విశేషం. -
డాక్టర్ పట్టా అందుకున్న గిరిపుత్రిక!
చిన్నప్పుడు అమ్మానాన్నలతో పాటు పొలంలో వ్యవసాయ పనులు చేసే లక్ష్మీ ప్రసన్న డాక్టరేట్ పట్టా అందుకుంది. పొలంలో చెమటలు చిందిస్తున్న ఆ చిన్నారిని చూసి భూదేవి... ‘చదువులో కూడా నువ్వు ఇలాగే కష్టపడాలి బిడ్డా’ అని ఆశీర్వదించిందేమో ఆదివాసి పల్లెలో పుట్టి పెరిగిన లక్ష్మీ ప్రసన్న ఎంతో కష్టపడి యూనివర్శిటీలో పీహెచ్డీ చేసింది. ఎంతోమంది ఆదివాసీ బిడ్డలకు స్ఫూర్తిని ఇస్తోంది.తెలంగాణ రాష్ట్రం... మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో గట్టిగా వంద కుటుంబాలు కూడా ఉండని మారుమూల గ్రామం తాటివారివేంపల్లి. చుంచా పద్మ, లక్ష్మయ్యలకు ఇద్దరు కుమార్తెలు... లక్ష్మీప్రసన్న, మాధురి. ‘ఇద్దరూ కూతుళ్లే!’ అని ఎగతాళి చేసేవారు కొందరు. అలా హేళన చేసిన వారికి సమాధానం చెప్పాలని అనుకున్నారు పద్మ, లక్ష్మయ్య దంపతులు.లక్ష్మీప్రసన్న పదవ తరగతిలో 9.7 జీపీఏ సాధించింది. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ‘కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ’లో సీటు సాధించి ఇంటర్ చదివింది. 940 మార్కులు స్కోర్ చేసింది. అశ్వారావుపేట అగ్రికల్చర్ కళాశాలలో బీఎస్సీ చేసింది. అక్కడ 8.45 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిన లక్ష్మీప్రసన్న బెంగళూరులోని గాంధీక్రిష్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ సీటు సాధించింది.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా... లక్ష్యం సాధించాలి...'మారుమూల ఆదివాసీ గూడేలలో చదువుకున్నవారి సంఖ్య తక్కువ. పెద్ద చదువులు చదివిన వారు మరీ తక్కువ. చిన్ననాటి నుండి అమ్మానాన్నలు పెద్ద చదువులు చదవాలి అని చెప్పేవాళ్లు. వారిప్రోత్సాహమే నాకు బలాన్ని ఇచ్చింది. మా గ్రామం నుండి సమీప పట్టణాలకు వెళ్లాలంటే కాలినడకన కొంత దూరం నడిస్తే కానీ బస్సులు ఎక్కలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆడ బిడ్డలు చదవడం అంటే ఇబ్బందే. అయితే మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు మనకు అడ్డుగోడలు కావు. వ్యవసాయ శాస్త్రవేత్తగా చిన్న సన్నకారు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు మాలాంటి గిరిజన, ఆదివాసీ గూడేల్లో ఉన్న ఆడపిల్లలు చదువులో రాణించడానికి, తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన సహకారం అందిస్తాను.' – చుంచ లక్ష్మీ ప్రసన్నతల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులువ్యవసాయ పనులలో అమ్మానాన్నలకు తోడు ఉండేది లక్ష్మీప్రసన్న. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, నాట్లు వేయడం, కలుపులు, కోతలు అన్ని పనులు చేసేది. ‘సాయిల్ సైన్స్ ఎన్విరాన్మెంట్’ అంశంపై సీనియర్ ఆచార్యులు డీవీ నవీన్ ఆధ్వర్యంలో పరిశోధన మొదలుపెట్టింది.భూసారం తగ్గడం, సేంద్రీయ ఎరువుల వినియోగం లేకపోవడం, రసాయన ఎరువులతో భూమి విషతుల్యం కావడం మొదలైన అంశాలపై పరిశోధన మొదలు పెట్టింది లక్ష్మి. పరిశోధనలో తన చిన్ననాటి అనుభవాలు బాగా ఉపయోగపడ్డాయి. లక్ష్మీప్రసన్న ప్రజెంట్ చేసిన పరిశోధన వ్యాసం చూసి శభాష్ అన్న ఆచార్యుల బృందం డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. కర్నాటక గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా తీసుకుంది లక్ష్మీప్రసన్న.– ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
తొక్కలో బిజెనెస్‌తో క్లీన్ స్వీప్..!
ఆవిష్కరణలు యూనివర్శిటీ డిగ్రీల నుంచి కాకుండా... అవసరాల నుంచే ఎక్కువగావస్తాయి అని చెప్పడానికి తాజా ఉదాహరణ ముంబైకి చెందిన సోనియా వర్మ, ఫర్హీన్. సాధారణ గృహిణులు అయిన వీరు, వాడి పారేసిన నిమ్మకాయ తొక్కలతో ఎకో ఫ్రెండ్లీ క్లీనర్స్ తయారు చేస్తూ ‘ఊర్థి’ బ్రాండ్‌గా సక్సెస్ అయ్యారు...ఇంటిని శుభ్రపరిచే ద్రావణాలలో ఉండే కఠినమైన రసాయనాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎలర్జీకి కారణం అవుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సోనియా వర్మ, ఫర్హీన్ అలీల ఆవిష్కరణ సూపర్‌హిట్ అయింది. ‘ఊర్థి’ బ్రాండ్‌గా ఫేమ్ అయింది.ఇల్లే ప్రయోగశాలగా...సోనియ, ఫర్హీన్లు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని ఒక హోమ్‌స్కూల్ కమ్యూనిటీ ద్వారా స్నేహితులు అయ్యారు. ఇద్దరికీ ఒకే రకమైన ఆసక్తులు ఉన్నాయి.వివిధ విషయాలకు సంబంధించి ‘ఇలా కాకుండా అలా ఉంటే ఎలా ఉంటుంది!’ అని మాట్లాడుకునేవారు. ఇంటిని శుభ్రపరిచేటప్పుడు గృహిణులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఒకసారి మాట్లాడుకున్నారు.‘కఠినమైన రసాయనాలు లేని క్లీనర్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఊర్థి. వారి ఆలోచనలకు ఇల్లే ప్రయోగశాలగా మారింది.స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్ చేసిన ఫర్హీన్ కుటుంబ బాధ్యతల వల్ల ఇంటికే పరిమితం అయింది. అయినప్పటికీ బయోఎంజైమ్లతో రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉండేది. తన కుటుంబ సభ్యులు నిర్వహించే కేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం నుంచి తప్పుకొని ఇంటి బాధ్యతలకే పరిమితం అయింది సోనియా వర్మ. ఫర్హీన్ తో పరిచయం ఆమెను ప్రయోగాల దిశలోకి తీసుకెళ్లి ‘ఊర్థి’ రూపంలో స్వచ్ఛమైన ప్రత్యామ్నాయాన్ని అందించేలా చేసింది. ‘మేము ప్రయోగాలు చేయడానికి డ్రమ్ములు, విశాలమైన స్థలం అవసరం. ఎలా? అని ఆలోచిస్తున్నప్పుడు తన ఇంటి టెర్రస్‌ను వాడుకోవచ్చు అని ఫర్హీన్ చెప్పింది. అలా టెర్రస్‌పై మా ప్రయోగాలు మొదలయ్యాయి’ అంటుంది సోనియ.రెండు డ్రమ్ములతో మొదలై...రెండు డ్రమ్ములతో మొదలైన ప్రయోగాలు సఫలం అయ్యాయి. ఆ తరువాత వేరే చోట స్థలం తీసుకొని డజన్ల కొద్దీ్ద డ్రమ్ములతో ఫెర్మెంటేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. స్థానికంగా జ్యూస్ అమ్మే వారి నుండి నిమ్మపండ్ల తొక్కలు సేకరిస్తారు. నిమ్మజాతి పండ్ల తొక్కలు, బెల్లం, నీటి మిశ్రమాన్ని సుమారు మూడు నెలలపాటు గాలి చొరబడని డబ్బాలలో ఉంచుతారు. అది పులిసిపోయి సహజమైన క్లీనర్‌గా మారేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.‘పులియబెట్టిన తరువాత బయటకు వచ్చే ద్రవంలో మంచి బ్యాక్టీరియా, ఎంజైములు ఉంటాయి. ఆ ఎంజైములు ఉత్ప్రేరకాలుగా పనిచేసి మురికిని తొలగిస్తాయి’ అంటుంది ఫర్హీన్.‘ఊర్థి’ అనేది ఇప్పుడు నలభైకి పైగా ఫెర్మెంటేషన్ యూనిట్లుగా విస్తరించింది. ఈ యూనిట్లలో రకరకాల నేచురల్ క్లీనింగ్ ప్రాడక్ట్స్‌ను తయారు చేస్తున్నారు.‘మేము తొలి అడుగులు వేసినప్పుడు మా దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్గానీ, బిజినెస్ ΄్లాన్గానీ లేదు. ఏది సరిౖయెనది అనిపించిందో అదే చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత వాటంతట అవే చక్కబడ్డాయి’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సోనియా. ఎకోఫ్రెండ్లీ బయో ఎంజైమ్లుచాలా రసాయన క్లీనర్లు వాడిన తరువాత మురికి కాలువల్లోకి, నదుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి భిన్నంగా ‘ఊర్థి’ క్లీనర్స్ కాలువల్లోకి వెళ్లినప్పుడు అక్కడ కూడా సేంద్రియ వ్యర్థాలను (ఆర్గానిక్ వేస్ట్) విచ్ఛిన్నం చేస్తూనే ఉంటాయి. నీటి వ్యవస్థను కూడా శుభ్రం చేస్తాయి. అనేక రకాల మేలు చేసే సూక్ష్మజీవులను చంపే కఠినమైనక్రిమిసంహారకాల వలే కాకుండా ఊర్థిలోని బయో ఎంజైమ్‌లు పర్యావరణంలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు జీవించడానికి వీలు కల్పిస్తాయి.– సోనియ, ఫర్హీన్ -
శ్రమశక్తికి ‘సలాం’...
‘కష్టం వస్తే కాడిపట్టగల.. అవసరమైతే గన్నీ సంచులూ మోయగలం. ఇల్లు అలకడం వంట చెయ్యడమే కాదు.. సమాజం కష్టాల్లో ఉంటే ఆదుకోవడమూ మాకు తెలుసు’ అంటూ మగవారికే పరిమితం అనుకున్న హమాలీ పనిలోనూ తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మహిళలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పెద్దంపేట్, ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్ పేట గ్రామాల్లో ఒక అద్భుతం జరిగింది. మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసి ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనన్న రైతుల ఆందోళనను చూస్తూ ఆ గ్రామ మహిళలు చేతులు ముడుచుకుని కూర్చోలేక పోయారు. ‘మగవారే చేయాలి అనే పని ఏదీ లేదు.. రైతు కష్టం మా కళ్లముందే వృథా కాకూడదు’ అంటూ ఇంటి పనులకే పరిమితమయ్యే ఆ చేతులు.. ఒక్కసారిగా గన్నీ సంచులను అందుకున్నాయి. శ్రమను నమ్ముకున్న ఆ భుజాలు.. క్వింటాళ్ల కొద్దీ ధాన్యం బస్తాలను మోసేందుకు సిద్ధమయ్యాయి. మండుటెండను, అకాల వర్షపు ముప్పును లెక్కచేయకుండా, ఒకరు గన్నీసంచుల్లో ధాన్యం నింపుతుంటే.. వాటిని మోసి తూకం వద్దకు తీసుకెళ్లడం, వరుసగా పేర్చడం వంటి పనులు చేస్తూ రైతులకు భరోసానిస్తున్నారు. పనికి ఫలితంగా క్వింటాకు రూ.25 చొప్పున వేతనం అందుకుంటున్నారు. సాధారణంగా మగవారే చేయగలరని భావించే అత్యంత కష్టమైన హమలీ పనిని, ఆ మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఐకమత్యంతో చేసి చూపించారు. మండుటెండైనా చెమటలు కారుతున్నా అలసట ముంచుకొస్తున్నా వారి అడుగులు ఆగలేదు. అన్నదాత ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో వారు హమాలీలుగా మారిపోయారు. సమాజం తరచూ మహిళలను ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసే భావనను ఆ మహిళలు చెదరగొట్టారు. వారు కేవలం గన్నీ సంచులు మాత్రమే మోయలేదు. మహిళలపై ఉన్న అపోహలను కూడా తమ భుజాలపై మోసి దూరంగా విసిరేశారు. వారి ఐకమత్యం చూసి రైతులు ‘‘మా ధాన్యం కాపాడారు మా కష్టం వృథా కాకుండా చేశారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.హమాలీల కొరతతో...మా ఊర్లోని కొనుగోలు కేంద్రంలో హమాలీ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు చూడలేక కొంతమంది మహిళలం రెండు గ్రూప్‌లుగా మారి ధాన్యాన్ని బస్తాల్లో నింపడం, నింపిన బస్తాలను కాంటా వేయటం, కాంటా వేసిన బస్తాలను ఒక క్రమపద్ధతి లో అమర్చటం చేస్తున్నాం. ఇందుకు రైతులు క్వింటాకు రూ.25 రూపాయలు ఇస్తున్నారు. దీంతో మాకు ఉపాధి దొరుకుతుంది. రైతులకు మేలు జరుగుతుంది.– బోయిని లక్ష్మి, పెద్దంపేటరైతన్నలకు ఆసరాగా...బెంగాల్ ఎన్నికలకు హమాలీలు పోవడంతో, వడ్లు, మొక్కజొన్న పంట కాటా వేయటంలో జాప్యం జరుగుతోంది. దీంతో మావాడ కట్టు వాళ్లం అందరం కలిసి గ్రూప్‌గా ఏర్పడి కాంటా వేయడం లాంటి పనులు చేస్తున్నాం. మేము జోకిన బస్తాలను మగ హమాలీలు లారీల్లో లోడ్ చేస్తారు. దీంతో సమయం కలిసి వచ్చి రైతన్నలకు ఆసరా అవుతుంది. – దబ్బెట స్వప్న, పెద్దంపేటఎండ రాకముందే...అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో హమాలీల సేవలు సరిపోక, ధాన్యం కాంటా వేయటానికి జాప్యం జరుగుతోంది. దీంతో మేమే హమాలీలుగా అవతారమెత్తాం. ఎండరాకముందే ఉదయం 11 లోపు తూకం వేసి కాంటాలు పెడుతున్నాం. పురుషుల ప్రొత్సాహంతోనే రైతులకు ఆసరాగా నిలుస్తున్నాం.– మానుక భీమక్క, పెద్దపేట – గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లిఫోటోలు: మర్రి సతీష్ రెడ్డి -
రాకుమారి... మూడు ఉద్యోగాలు!
‘నాకు చాలా డబ్బు ఉంది. కాలు మీద కాలేసుకొని బతుకుతాను. కష్టపడను’ అనుకోవడం ఒక రకం. ‘ఎంత డబ్బున్నా సరే, కష్టపడతాను. కష్టంలోనే ఇష్టాన్ని వెదుక్కుంటాను’ అనుకోవడం రెండో రకం. రాజస్థాన్‌లోని మేవార్ రాకుమారి జాహ్నవి రెండో కోవకు చెందిన మహిళ.‘ సంపన్న కుటుంబంలో పుట్టాను. భారతదేశంలో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన చివరి రాజు మా తాతగారి అన్నయ్య. ఆ తర్వాత రాచరికం ఉనికిలో లేదు. నేను చాలామంది పిల్లల్లాగే పెరిగాను. తేడా ఏమిటంటే నేను మా కజిన్స్‌తో కలిసి రాజభవనంలోనే స్కూల్‌కు వెళ్లాను’ అంటుంది జాహ్నవి.‘రాజ కుటుంబంలో పెరగడం అంటే అపరిమితమైన విలాసం కాదు’ అంటున్న జాహ్నవి మెల్బోర్న్లో చదువుకుంటున్నప్పుడు క్యాటరింగ్, టెలి మార్కెటింగ్, క్లబ్ ప్రమోషన్‌కు సంబంధించి మూడు వేర్వేరు ఉద్యోగాలు చేసేది. అసైన్మెంట్లు చేస్తూ, క్లాస్‌లకు వెళ్తూనే మూడు ఉద్యోగాలు చేసేది.‘కుటుంబ ఆస్తులను అతిథులకు చూపించేదాన్ని. ప్రముఖుల సంభాషణలను దగ్గరి నుంచి వినేదాన్ని. ఈ అనుభవాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇదంత ఒక ఎత్తయితే మెల్బోర్న్లో మూడు ఉద్యోగాలు చేయడం మరో ఎత్తు. ఎన్నో నేర్చుకున్నాను’ అంటుంది రాకుమారి జాహ్నవి. -
లబ్... డబ్బు లయ తప్పొద్దు!
ధరల భయం అంటే... కుటుంబ నిర్వహణ భయం. కుటుంబ నిర్వహణ భయం అంటే... గృహిణి భయం. భర్త సంపాదిస్తాడు సరే... సరిపెట్టాల్సిన బాధ్యత తనదే కదా. అందుకే ఇటీవల ఆదాయం ఉన్నా, లేకున్నా మహిళలు ‘ఫైనాన్షియల్ యాంగ్జయిటీ’తో బాధపడుతున్నారు. దీనిని ఎలా ఎదుర్కొనాలి? రెండు కేస్ స్టడీస్ చూడండి.కేస్ స్టడీ1లత హౌస్‌వైఫ్. వయసు 42 ఏళ్లు. భర్త ప్రైవేట్ ఉద్యోగం. ఇద్దరు పిల్లలు ఇంటర్, డిగ్రీ. నెల జీతం అరవై వేలు. అప్పుల్లేవు, సొంత ఫ్లాట్ ఉంది. కానీ లతకి ప్రతి నెలా ఒకటవ తారీఖు వచ్చిందంటే గుండె దడ. జీతం పడిన వెంటనే లెక్కలు మొదలైపోతాయి. వెచ్చాలు, మెయింటెనెన్సు, ఇంటర్నెట్ బిల్లు, ఓటీటీ బిల్లు, పాలబిల్లు... కరెంట్... వంటగ్యాస్... పిల్లల ఫీజు... భర్తకు పెట్రోలు ఖర్చు, అత్తగారికి మావగారికి పంపాల్సినవి... ‘డబ్బులు సరిపోతాయా... రేపటికి మిగులుతాయా’... దాంతో యాంగ్జయిటీ మొదలు.సింప్టమ్స్యాంగ్జయిటీ వల్ల అదుపులేని చర్యలు మొదలవుతాయి. కూరగాయలు తగ్గించి కొనడం, కొత్త చీర కొనుక్కోకపోవడం, బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతి గంటకి చెక్ చేయడం, రేపు ఆయన ఉద్యోగం పోతే అని ప్రతి రోజూ ఊహించుకుని ఏడవడం. దాంతో అసిడిటీ, తలనొప్పి, షుగర్ లెవెల్స్ పైకి కిందకి. భర్త ‘అన్నీ నేను చూసుకుంటా కదా’ అన్నా ఆవిడ భయం తగ్గలేదు. ఎందుకంటే సమస్య డబ్బు కాదు, మైండ్ మీద కంట్రోల్ లేకపోవడం. భర్త ఇది చూసి చూసి కౌన్సిలర్‌తో మాట్లాడించాడు. «ధరలు పెరగడం అందరికీ ఉన్న సమస్యే. నీ ఒక్కదానికే కాదు’ అని ఆమెకు అవగాహన కల్పించారు. కౌన్సిలర్ సలహాలతో లత మారింది.లత చేసిన మార్పులు...మనీ డేట్... అంటే నెలకు ఒకసారి భర్తతో కూర్చుని ముప్పై నిమిషాలు లెక్కలు మాట్లాడుకుంది. ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది... దాచడం, దాపరికం లేదు. ఈ పారదర్శకత వల్ల భయం తగ్గింది. ‘ఎమర్జెన్సీ ఫండ్’ పేరుతో బ్యాంకులో 50 వేలు ఎఫ్.డి. వేసి దానికి ‘హాస్పిటల్/జాబ్ ప్రాబ్లమ్ ఫండ్’ అని పేరు పెట్టుకుంది. ఆ డబ్బు ముట్టుకోకూడదు. ఆ పేరు చూడగానే బుర్రకి ధైర్యం. వర్రీ టైమ్ ఫిక్స్ చేసింది. అంటే రోజంతా డబ్బు గురించి ఆలోచించడం మానేసి సాయంత్రం 6 నుంచి 6:15 వరకు మాత్రమే ‘డబ్బు కష్టాలు’ ఆలోచించేది. టైం అయిపోగానే బలవంతంగా ఆపేసేది. మెల్లగా ఈ మంత్రం పని చేసింది. లత కోలుకుంది. మనం జాగ్రత్తగా ఉంటే అంత ఆందోళన చెందాల్సింది లేదు. అందరితో పాటుగా మనం కూడా ఆర్థిక గండాలను తట్టుకుంటూ ముందుకుపోవచ్చు అని భరోసా కలిగింది.కేస్ స్టడీ 2కవిత వర్కింగ్ ఉమన్. వయసు 35 ఏళ్లు. సింగిల్ విమెన్. తల్లిదండ్రులు, తమ్ముడి చదువు అన్నీ ఆవిడ సంపాదనే. నెల జీతం 80 వేలు. పైకి ‘లేడీ బాస్’. కానీ లోపల మాత్రం వణుకు. కవిత సమస్య ఏమిటంటే ‘గోల్డెన్ హ్యాండ్‌కఫ్స్ యాంగ్జయిటీ’. అంటే జాబ్ నచ్చకపోయినా మానేయలేని పరిస్థితి. బంగారు సంకెళ్లు. ‘నేను ఉద్యోగం మానేస్తే ఇల్లు గడవదు’ అనే ప్రెజర్. బయట పరిస్థితులు బాగా లేవు అనే ఆందోళన.సింప్టమ్స్స్లీప్ రివెంజ్... అంటే నిద్ర మీద పగ. రాత్రి 2 వరకు ఫోన్ చూడటం. ‘పగలంతా నాది కాదు, రాత్రైనా నాది అవ్వాలి’ అనే ఫీలింగ్. ఇంపల్స్ షాపింగ్... అంటే స్ట్రెస్‌లో రెండు వేలు మూడు వేలకు ఆన్ లైన్ షాపింగ్ చేసి, తర్వాత గిల్టీ ఫీల్ అవ్వడం. రిజెక్షన్ సెన్సిటివిటీ:... అంటే బాస్ చిన్న మాట అన్నా ‘నన్ను తీసేస్తారేమో’ అని ఏడవడం. ఫ్యూచర్ బ్లైండ్నెస్... ‘పెళ్లి, పిల్లలు వద్దు. డబ్బు సరిపోదు’ అని జీవితాన్ని పోస్ట్‌పోన్ చేయడం.కవిత కలీగ్ ఇదంతా గమనించింది. కవితను కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లింది. ‘అంతా నార్మల్‌గా ఉన్నా అనవసర ఆందోళనతో బాధపడుతున్నావు’ అని కౌన్సిలర్ చిన్న సూచనలు చేసింది.కవిత చేసిన మార్పులు...ఒన్ పర్సెంట్ రూల్... అంటే తన జీతంలో ఒన్ పర్సెంట్ అంటే 800 తన సంతోషం కోసం అప్పుడప్పుడు ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. కాఫీ, పుస్తకం, మూవీ... ‘నేను కేవలం ఏటీఎం కాదు, మనిషిని’ అని గుర్తుచేసుకోవడానికి స్కిల్ ఇన్సూరెన్స్... అంటే వీకెండ్లో రెండు గంటలు ఫ్రీలాన్స్ కోర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ‘ఈ జాబ్ పోయినా నేను బతకగలను’ అనే ధైర్యం కోసం. జాబ్ కంటే స్కిల్ మీద నమ్మకం పెంచుకుంది. నో–బడ్జెట్ డే... నెలకు ఒక రోజు బడ్జెట్, లెక్కలు, ఫోన్లో బ్యాంక్ బేలెన్స్ చూడకూడదు. ఆ రోజు బుర్రకి హాలిడే. దీనివల్ల మిగతా 29 రోజులు బుర్ర కంట్రోల్లో ఉంటుంది. ఆరు నెలల తర్వాత కవిత మొదటిసారి మూడు రోజులు గోవా వెళ్లొచ్చింది. ‘అదే సంపాదన. ఆరు నెలలు కొంచెం కొంచెం దాచాను. నా వల్ల అయ్యింది’ అని ఏడ్చేసింది ఎయిర్‌పోర్ట్‌లో. డబ్బు భయం ‘పేదవాళ్ల’ సమస్య మాత్రమే కాదు. బ్యాంక్‌లో లక్షలు ఉన్నవాళ్లకు కూడా ఫైనాన్షియల్ యాంగ్జైటీ ఉంటుంది. ఇది పర్సు సమస్య కాదు, ‘పర్సనల్ సెక్యూరిటీ’ ఫీలింగ్ సమస్య. దీన్ని మందులతో కాదు, మనసుతో గెలవాలి.కుటుంబం ఏం చేయాలి?భర్త, భార్య, పిల్లలు... ఇంట్లో అందరికీ బేసిక్ లెక్కలు తెలియాలి. భారం ఒక్కరి మీద పడితే యాంగ్జైటీ వస్తుంది. ప్రతి సమస్యను అందరూ చర్చించుకుంటే ఏవి కొనసాగించాలో ఏవి వదులుకోవాలో అందరికీ తెలుస్తుంది. ఫైనాన్షియల్ యాంగ్జయిటీతో రోజూ ఏడుపు, గుండె దడ, నిద్ర లేకపోవడం రెండు వారాలకు మించి ఉంటే – సైకాలజిస్ట్‌ని కలవండి. డబ్బు ప్లానింగ్ రాకపోతే సెబి రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవండి. ఇందులో సిగ్గు పడాల్సింది ఏమీ లేదు. -
స్క్వాడ్రన్ లీడర్ సాన్యా సరికొత్త చరిత్ర : సర్వత్రా ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి (IAF) చెందిన స్క్వాడ్రన్ లీడర్ (Sqn Ldr) సాన్యా సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్' (Cat-A Qualified Flying Instructor - QFI) అర్హత సాధించిన దేశంలోనే మొట్టమొదటి మహిళా అధికారిగా ఆమె నిలిచారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది.Excellence takes flight.Sqn Ldr Saanya achieved a historic first by becoming the first woman officer to earn the coveted Cat-A Qualified Flying Instructor (QFI) qualification. Her achievement embodies dedication and relentless pursuit of excellence.A proud milestone for the… pic.twitter.com/K6hWya0iUi— Indian Air Force (@IAF_MCC) May 18, 2026సాన్యా సాధించిన ఘనతపై వైమానిక దళ అధిపతి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్.. స్క్వాడ్రన్ లీడర్ సాన్యాను కలిసి ఆమె సాధించిన ఈ అద్భుత విజయానికి గాను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఐఏఎఫ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. "ఉత్కృష్టత సరికొత్త శిఖరాలను తాకింది. స్క్వాడ్రన్ లీడర్ సాన్యా ఎంతో ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్యూఎఫ్ఐ' అర్హతను సాధించి, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఆమె సాధించిన ఈ విజయం అంకితభావానికి, నిరంతర ప్రతిభా సాధనకు నిదర్శనం" అని వైమానిక దళం పేర్కొంది.దేశానికి స్ఫూర్తిఈ విజయం భారత వైమానిక దళానికి ఒక గర్వకారణమైన మైలురాయి అని, దేశవ్యాప్తంగా విమానయాన రంగంలోకి రావాలనుకునే ఎంతోమంది యువతీయువకులకు ఇది గొప్ప స్ఫూర్తినిస్తుందని ఐఏఎఫ్ కొనియాడింది.ఇదీ చదవండి: టీవీకే విజయం : డిజిటల్ సునామీపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలుకాగా 2015 జూన్ 20న సాన్యా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఫ్లయింగ్ బ్రాంచ్‌లో కమిషన్ అయ్యారు. ఈమె 42 ఎస్ఎస్సి (SSC) కోర్సు ద్వారా ఎంపికయ్యారు. ప్రస్తుత బాధ్యతల్లో భవిష్యత్తులో ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం, ఇతర ఇన్స్ట్రక్టర్లకు మార్గదర్శకత్వం వహించడం, విమానంలో ఉన్నప్పుడు తప్పులను సరిదిద్దడం వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తారు.ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?ఇదీ చదవండి: ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్ -
కష్టాలే... గెలుపు పాఠాలై!
‘కష్టపడేవారిని అదృష్టం ఇష్టపడుతుంది’ అనేది సామెత. చైనాకు చెందిన జౌక్విన్ ఫేయ్ని ‘అదృష్టవంతురాలు’ అంటారు చాలామంది. అయితే ఆమె కష్టమే ఆమెను అదృష్టవంతురాలిని చేసింది. చదువు మధ్యలో మానేసి పొట్టకూటి కోసం వాచ్ లెన్స్ కంపెనీలో పనిచేసిన జౌక్విన్ ఫేయ్ నేడు ప్రపంచ ప్రసిద్ధ ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ యజమానురాలు...అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన విందులో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న మహిళ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు... జౌక్విన్ ఫేయ్.అదిగో... అవకాశంగ్రామీణ హునాన్ ప్రావిన్స్‌లో జౌక్విన్ ఒక ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలిగా పనిచేసేది. స్మార్ట్ఫోన్ల విశ్వరూపాన్ని ప్రపంచం చూడని రోజుల్లోనే గ్లాస్ ్రపొడక్షన్లో నైపుణ్యం సాధిస్తుండేది. పదహారేళ్ల వయసులో చదువుకు దూరమైన జౌ పని వెదుక్కుంటూ షెన్జెన్కు వెళ్లింది. ఎంతోమంది వలస కార్మికులలాగే సుదీర్ఘమైన షిఫ్టులు, ఒత్తిడితో కూడిన వాతావరణంలో పనిచేసింది. 1993లో వాచ్గ్లాస్పై స్క్రీన్ ప్రింటింగ్‌కు సంబంధించి చిన్న వర్క్‌షాప్‌ను ప్రారంభించింది.తొలిరోజుల్లో వర్క్‌షాప్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ఆ రోజుల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గుర్తించని ఒక అవకాశాన్ని జౌ గుర్తించింది. ‘ఎలక్ట్రానిక్స్ పలుచగా, తేలికగా, అధునాతనంగా మారేకొద్దీ గాజు తయారీకి విలువ అంతకంతకూ పెరుగుతుంది’ అనేది ఆమె గుర్తించిన విషయం. ఈ ముందుచూపు జౌను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆమె చిన్న సంస్థ ‘లెన్స్ టెక్నాలజీ’ అనే అతి పెద్ద కంపెనీగా మారింది. ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగించే అధునాతన కవర్గ్లాస్, టచ్–స్క్రీన్ భాగాలను సరఫరా చేసే కీలకసంస్థగా అవతరించింది. స్మార్ట్‌ఫోన్, ఏఐ హార్డ్‌వేర్, స్మార్ట్ వెహికిల్స్, కాక్‌పిట్ వ్యవస్థలు, రోబోటిక్స్ పార్ట్స్ నుండి ఏరోస్పేస్ సంబంధిత తయారీ రంగం వరకు విస్తరించింది.స్పీడ్ స్పీడ్‌గా...టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌లాంటి దిగ్గజాల మధ్య జౌ కూర్చోవడం అనేది ఆమెకు సంబంధించిన విశేషమే కాదు, అనేక పరిశ్రమలలో పెరుగుతున్న లెన్స్ టెక్నాలజీకి ప్రతీకాత్మక చిత్రం. ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీకి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల నుండి అధిక ఆదాయం వస్తున్నప్పటికీ, ఏఐ గ్లాసెస్, ఇంటెలిజెంట్ వెహికిల్స్, ఫ్లెక్సిబుల్ గ్లాస్ టెక్నాలజీ, ఏరో స్సేస్ ఉత్పత్తుల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలోకి వేగంగా విస్తరించింది.‘చైనా మాన్యుఫాక్టరింగ్’ అంటే చాలా తక్కువ ఖర్చు అనే అభి్రపాయం ఉంది. ‘లెన్స్ టెక్నాలజీ’ లాంటి సంస్థలు ఇప్పుడు ఆ అభి్రపాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే... విజయ రహస్యంనా కష్టాలు చిన్న వయసులోనే మొదలయ్యాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నాన్న కంటిచూపు కోల్పోయాడు. అయిదేళ్ల వయసులో అమ్మ చని΄ోయింది. ‘తర్వాతి భోజనం ఎక్కడ దొరుకుతుంది? దాన్ని ఎలా సంపాదించుకోవాలి?’ అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. పదహారేళ్ల వయసులో ఒక వాచ్ లెన్స్ ఫ్యాక్టరీలో అసెంబ్లీ వర్కర్‌గా చేరాను. రాత్రిపూట అకౌంటింగ్ క్లాస్‌లకు హాజరయ్యేదాన్ని. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కనేదాన్ని. వ్యాపారవేత్తగా నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అయినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేసి ఉంటే ‘లెన్స్ టెక్నాలజీ’ కంపెనీ ఉండేది కాదు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడు చాలామందిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా పట్టుదలతో ముందుకు సాగడమే అసలు సిసలు విజయం.– జౌక్విన్ ఫేయ్ -
ఫైర్‌పై బోర్ కొట్టకుండా!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాక΄ోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.ఏ విషయమైనా బోర్ కొట్టకుండా మన సంభాషణ పిల్లలతో సరదాగా ఉండాలి. పెద్దలకు కూడా ఇది ఎక్సర్సైజ్ పాఠమే అవుతుంది. ఉదాహరణకు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’... సినిమాటిక్‌గా ఓ డైలాగ్ చేప్పండి. వెంటనే పిల్లల అటెన్షన్ మీ వైపు తిరుగుతుంది. అమ్మో ‘నిప్పు’ అని భయపెట్టకూడదు. ఆశ్చర్యం, జాగ్రత్త, విజ్ఞానం.. కలిపి ‘నిప్పు’ గురించి తెలుసుకునేలా ఉండాలి.వెలుగు దీపాలు→ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో అందంగా అలంకరించిన కేక్ పైన క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగు ఎలా ఉంటుందో అడగండి. డ్రాయింగ్‌లో చూపమనండి.→ కిచెన్‌లో వంట వండటానికి ఏం వాడతారో అడగండి → దీపం వెలగడానికి ఏం అవసరం, లైటర్ ఎలా వెలుగుతుంది? → ఇంధనపు వేడి వల్ల ఏయే వాహనాలు, ఇంజన్లు నడుస్తాయో గెస్ చేయమనండి → అడవిలో మంటలు వస్తే, షార్ట్ సర్క్యూట్ జరిగితే, అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు ఏయే చోట్ల జరుగుతాయి... వాటినే చిత్రాల్లో చూపమనండి → కొవ్వొత్తి వెలుగుకి గాలి లేక΄ోతే ఏమవుతుంది, వేడికి కొవ్వొత్తి ఎందుకు కరిగి΄ోతుంది, మంట ఎందుకు రెపరెపలాడుతుంది?... మన రోజువారీ పనుల్లో ‘నిప్పు’ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చెప్పమనండి.సేఫ్టీ హీరో రోల్అగ్ని ప్రమాద సమయంలో 101కు కాల్ చేసే వ్యక్తి, ఇంట్లో గ్యాస్ వాడకంలో పొదుపు, వంట చేసేటప్పుడు జాగ్రత్త పడే వాళ్లు, కాలిన గాయాలకు నివారణ ఉపాయాలు సూచించే వ్యక్తి ... వీటిలో ఏవి చేసినా ‘హీరో’నే. ఏయే వస్తువులు నిప్పును పుట్టిస్తాయి. పిల్లలు అగ్గిపెట్టె, వంటగ్యాస్.. మొదలైన ‘నిప్పు’ కు కారణమయ్యే వస్తువులకు దూరంగా ఎందుకు ఉండాలి.. చూపమనాలి.నిప్పు కథలు→ ఆదిమ మనిషి నిప్పు కనుగొన్న విధానం → హనుమంతుడు లంక దహనం కథ → చలి పెట్టినప్పుడు వేడికోసం మంట ఎలా ఉపయోగపడుతుంది → సూర్యుడు వేడిని ఎలా పుట్టిస్తున్నాడు. వేసవిలోనే ఎందుకు అంతగా మండుతుంటాడు → నిప్పుకు ఎన్ని పేర్లు ఉన్నాయి. ఏయే భాషల్లో ఎలాంటి పేర్లు ఉన్నాయి.. ‘నిప్పు’ గురించి చేసే ఈ ప్రయోగం పిల్లలను ఆలోచింపజేస్తుంది. కొత్త విధానాల రూపకల్పన జరుగుతుంది. ఎన్నో విషయాలు ‘నిప్పు’ అనే టాపిక్ ద్వారా తెలియజేయవచ్చు. పిల్లల వయసు, వారు అర్ధం చేసుకుంటున్న విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ప్రోత్సహిస్తే పిల్లలు కూడా ‘నిప్పు’రవ్వల్లా మెరుస్తారు.నిర్వహణ: నిర్మలారెడ్డి -
సిరాచుక్కల సిరిచుక్క
కుంతీపుత్రిక, ఈ తరం నది, జూనియర్ ఆర్టిస్ట్, అశ్రుతర్పణ, జీవితం గెలుపు నీది, మనస్విని, పిపాసి, వెన్నెల తేటి వంటి విభిన్నమైన 26 నవలలు, ఎనిమిది కథాసంపుటాలు, పలు నృత్య నాటికలు, నాటకాలతో సహా మొత్తం 82 పుస్తకాలు వెలువరించారు. ప్రముఖ సినీనటి భానుమతికి అత్యంత ఆత్మీయమైన స్నేహితురాలు, తెలుగు సినిమాకి పాట రాసిన మొదటి మహిళ శారద అశోక వర్ధన్ గురువారం కన్ను మూశారు. ఆమెకు నివాళిగా...భక్త ధ్రువ మార్కండేయ, గోడ మీద బొమ్మ వంటి చిత్రాలకు పాటలు రాసినా ఉద్యోగ ధర్మంగా పూర్తిగా అటు వెళ్లలేదు. వీరి ‘వినాయక సుప్రభాతం’ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గళంలో నేటికీ సుప్రసిద్ధం. అలాగే ఆంధ్రభూమి దినపత్రికలో ‘మరమరాలు’ పేరిట కాలమ్ నిర్వహించారు. 13 ఎపిసోడ్స్ సీరియల్ రాసి ఉత్తమ రచయిత్రిగా 1990. 1997, 2000లో నంది అవార్డులు పొందారు. వచన కవితలకేగాక నాటక రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్నారు. రాజ్యలక్ష్మి అవార్డు, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, గృహలక్ష్మి స్వర్ణ కంకణం వంటి ఎన్నో అవార్డులు పొందిన ప్రతిభామతి శారద అశోక వర్ధన్. ఆకాశవాణిలో పని చేసిన కాలంలాగే ఆ తర్వాత జవహర్ బాల భవన్ డైరెక్టర్‌గా శారద అశోక వర్ధన్ పని చేసిన కాలం ఓ స్వర్ణయుగమే. బాలచంద్రిక పత్రికతోపాటు సాహిత్యానికి ఎంతో ప్రోత్సాహం కల్పిస్తూ వందలాది గ్రంథాలు ప్రచురింపజేయడమేగాక తానే స్వయంగా పిల్లలకోసం బాలవికాస గ్రంథాలు రాశారు. పన్నెండుకుపైగా కవితాసంపుటులు వెలువరించారు. 28 జులై 1938లో సికిందరాబాద్‌లో జన్మించిన శారద తన జీవితమంతా ఆ నగరంతోనే పెనవేసుకున్న నేపథ్యంలో ఆత్మకథనాత్మక రచనగా నా (సుధామ) ముందుమాటతో బాటు ‘నా సిరిచుక్క సికింద్రాబాద్’ అనే గ్రంథాన్ని వెలువరించి ఒక నగర చరిత్రను కూడా అక్షర నిక్షిప్తం చేసిన వారయ్యారు. ఆమె తొలిసారిగా రాసిన ‘ఆత్మార్పణం’ అనే నాటకం స్థానం నరసింహారావుగారి దర్శకత్వంలో రేడియో నాటకంగా ప్రసారమైంది. సమాచారశాఖ లో చేరాక ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అనేక కథలు, కవితలు, నవలలు వెలయించారు. డిప్యుటేషన్‌పై ఆకాశవాణి కుటుంబ సంక్షేమ విభాగంలో కొన్నేళ్లు పని చేశారు. ‘మనసాయెరా మాధవా’ వంటి లలిత గీతాలెన్నింటినో రచించి ఒక కవయిత్రిగానూ ఖ్యాతి పొందారు. కుటుంబ సంక్షేమం గురించి ఆరుద్ర, సినారె, శశాంక వంటి వారి చేత పాటలు రాయించి, ‘గీత మాలిక’ గా ప్రసారం చేయించిన ఘనత ఆమెదే. బుర్రకథలు సైతం కుటుంబ నియంత్రణ ఇతివృత్తంగా రాసిన ఘనత వారిదే! ఆ సామర్థ్యంతోనే ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనపై బుర్రకథ రచించి, నాజర్ బృందంతో ప్రశంసలందుకున్న ఘనత ఆమెది. అతి పిన్న వయసులో వచ్చిన టీచర్ ఉద్యోగాలు తనకు సరిపడవని వినమ్రంగా తిరస్కరించి అనంతర కాలంలో అదే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉద్యోగ విరమణ చేశారు. భర్త అశోక వర్ధన్ లేకున్నా తమ నలుగురు ఆడపిల్లలనూ ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి వివాహాలు చేసి నలుగురు మనుమలు, నలుగురు మనుమరాండ్రతో ఉద్యోగ విరమణానంతరం విశ్రాంత జీవనాన్ని గడుపుతూ కొంత అస్వస్థతతో 88వ ఏట గురువారం పెద్దకుమార్తె అరుణ ఇంట కన్నుమూశారామె. శ్రీమతి శారద అశోకవర్ధన్ నింగికెగసిన సికిందరాబాద్ సిరిచుక్క మాత్రమే కాదు.. తెలుగు సాహిత్యలోకం మరువలేని మంచి సాహితీవేత్త. మరపురాని మహిళామణి. సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న అశ్రు నివాళులే సాక్షి. – సుధామ -
ఉమెన్ పవర్
‘మైనింగ్ రంగంలో మహిళలు ఏమిటి?’ అనే ఆశ్చర్యం... మహిళా ఉద్యోగులు సునిత్నమైన పనులు మాత్రమే... అదీ ఆఫీసు నాలుగు గోడల మధ్యే పనిచేయాలనే నమ్మకాలు, అపోహలు...వాటన్నింటినీ బద్దలు కొడుతూ ఉమెన్ పవర్ చాటి చూపుతున్నారు మహిళలు.తాజా విషయానికి వస్తే... మైనింగ్ రంగంలో 50, 100 టన్నుల బరువులు మోసుకెళ్లే హెవీ డ్యూటీ డంపర్లను మహిళలు నడిపిస్తున్నారు. తొలి అడుగు ఉత్తర భారతంలోని టాటా స్టీల్స్ కంపెనీలో పడగా, రెండో అడుగుకు తెలంగాణలోని సింగరేణి వేదికైంది.పదమూడు మంది మహిళా కార్మికులు సిరిసిల్లలోని ‘తెలంగాణ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’లో హెవీ ఎర్త్ మూవర్ మెషిన్లను నడపడంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఇంటర్నల్ రిక్రూట్ ద్వారా సంస్థ పరిధిలోని పదిహేడు ఓపెన్ గనుల్లో విధులు నిర్వహించనున్నారు...వారిలో కొందరి హెవీ వాహన ప్రయాణం గురించి వారి మాటల్లోనే...ఆర్మీ మిస్సైనా... మరుదనాయగం శిరీషమాది మంచిర్యాల జిల్లా మందమర్రి. చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. మా తాత, తండ్రులు, బాబాయ్‌లు సైతం సైన్యంలో పనిచేశారు. వాళ్ల స్ఫూర్తితో పోలీస్ శాఖలో చేరాలని ప్రయత్నించాను. ఎస్.ఐ. పరీక్షల్లో పల్టీ కొట్టినా, ఆ తర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమయ్యాను. ఆర్మీలో జాయిన్ అవడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న సమయంలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తోన్న నాన్న రఫేల్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో అమ్మ విక్టోరియా కోరిక మేరకు కుటుంబంకోసం ఆర్మీ కలలను పక్కనపెట్టి సింగరేణి కార్మికురాలిగా 2024 మార్చిలో జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపే అలవాటు ఉంది. ఆ తర్వాత కార్లు కూడా ధైర్యంగా నడిపించేదాన్ని. అయితే, గనుల్లో వాటికంటే పరిమాణంలో, సామర్థ్యంలో పెద్దవైన ప్రొక్లెయినర్లు, డంపర్లు, షావెల్స్ క్రేన్లు కనిపించేవి. కార్లు, బైకులు నడిపిన నాకు వాటిని కూడా నడిపించాలని అనిపించినా, ఎవరిని అడగాలో తెలియక ఆశను మనసులోనే దాచుకున్నాను. సీఎండీ బలరామ్‌నాయక్ 2024 చివర్లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో నేరుగా కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే అదనుగా సీఎండీ సార్‌తో మాట్లాడుతూ ‘సార్, నాకు గనిలో ఎప్పుడు తిరుగుతూ కనిపించే డంపర్లు నడపాలని ఉంది. నాకు ఆ అవకాశం ఇస్తారా’ అని అడిగాను. దానికి ఆయన ‘అవి నడపాలంటే డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి. నీకు ఉందా?’’ అని ప్రశ్నించారు. దీంతో చిన్నప్పటి నుంచి బైకులు, కార్లు నడపడంలో నాకున్న అనుభవం గురించి వివరిస్తూ.. మాకు కూడా పురుషులతో సమానంగా డంపర్లు నడిపే ఛాన్స్ ఇవ్వండి అని మరోసారి కోరాను. నా ఉత్సాహం చూసిన సీఎండీ సార్ ‘ సరే,. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాను’ అని హామీ ఇచ్చారు. నిలబెట్టుకున్నారు.ప్రతీ చోట సవాలే.. ప్రయత్నిస్తే విజయాలే – తోకల త్రివేణిమాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. మా నాన్న తోకల ఎల్లయ్య సింగరేణి కార్మికుడు. నాకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో జాయిన్ అయ్యాను. పెళ్లికిముందు నాకున్న కార్ డ్రైవింగ్ అనుభవం తర్వాత పనికి వచ్చింది. మహిళా కార్మికులకు డంపర్ ఆపరేటర్‌గా అవకాశం ఇస్తామంటూ 2025 ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను. సిరిసిల్ల ట్రైనింగ్ సెంటర్లో మొదటి వారం థియరీ, సిమ్యులేషన్ మీద క్లాసులు తీసుకున్నారు. తర్వాత 16 అడుగుల పొడవైన స్కూల్‌బస్సును, 26 అడుగుల పొడవు ఉండే ట్రక్ (లారీ)ని నడిపించడంపై గ్రౌండ్లో శిక్షణ ఇచ్చారు. కానీ శిక్షణ మలిభాగంలో అవే హెవీ వెహికల్స్‌ను నేరుగా రోడ్డుపై నడపమన్నారు. మొదట్లో కొంత భయపడ్డప్పటికీ, నా ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తు తెచ్చుకుని క్లచ్ వదిలి, ఎక్సలేటర్ తొక్కి గేరు మార్చాను అంతే!కెరీర్ గ్రోత్ కోసం...– షేక్ రహమత్ ఉన్నీసామా నాన్న షేక్ అబ్దుల్ ఖదీర్ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పని చేసేవారు. ‘మనది సంప్రదాయ కుటుంబం, కట్టుబాట్లు పాటించాలి’ అనే పరిధిలోనే నేను డిగ్రీ పూర్తి చేయడం. పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే. ఐటీ సర్వీసెస్‌లో పనిచేసే నా భర్త జుబేర్ అహ్మద్‌తో పెళ్లి తర్వాత ఆయన నా ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. కొత్తగా ఆయన కారు కొనుక్కోవడమే కాకుండా నాకు పట్టుబట్టి డ్రైవింగ్ నేర్పించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో బదిలీ వర్కర్‌గా జాయిన్ అయ్యాను. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో 2025 ఆగస్టులో డంపర్ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరెన్ని విధాలుగా వెనక్కి లాగాలని చూసినా వినలేదు. సంప్రదాయ పద్దతిలో రెగ్యులర్ ఆఫీస్ జాబ్‌కే పరిమితం అవడం కంటే కెరీర్ గ్రోత్ ఉండే డంపర్ ఆపరేటర్‌గా వెళ్లడమే ఉత్తమం అనుకుని ముందడుగు వేశాను. కొత్త బాటలో నడిచేటప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, తిరస్కారాలు ఎదురుకావచ్చు. వాటిని లెక్కచేయక ముందుకు సాగి విజయం సాధిస్తే తరువాత అదే బాటని మిగిలిన వాళ్లు అనుసరిస్తారు.– తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ఇద్దరు సిస్టర్స్ కృషి: 'యాత్రి'కుల కోసం..
వాన రాకడ, ప్రాణం పోకడ వరుసలో రైలు రాకడను కూడా చేర్చారు చమత్కారులు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాము ప్రయాణిస్తున్న ట్రైన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ముంబైకి చెందిన లఖీ సకరియ, రీవ సకరియ సిస్టర్స్ క్రియేట్ చేసిన ‘యాత్రి’ యాప్ మన దేశంలోని ప్రధాన నగరాలలో ప్రాచుర్యం పొందింది. ఈ యాత్రి యాప్ ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్ సిస్టమ్, సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేల అధికారిక యాప్‌గా ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్., ఎంబీఏ చేసింది లఖీ. బి2బి, బి2జీ రంగాలలో సాఫ్ట్వేర్ అప్లికేషన్లను డెవలప్ చేసింది. రీవ కొన్ని సంవత్సరాలు కన్సల్టింగ్ కంపెనీలో పనిచేసింది. యాప్ ప్రారంభానికి ముందు రైల్వే అధికారులతో మాట్లాడి ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది లఖీ. రాకపోకలను కచ్చితంగా ట్రాక్ చేయడానికి ప్రతి స్టేషన్ చుట్టూ వర్చువల్ జియో ఫెన్స్‌లను సృష్టించి, దానికి జీపీఎస్ పరికరంలోని మోషన్ సెన్సర్లను జోడించారు. లైవ్ లొకేషన్ అప్డేట్లలో జాప్యాన్ని తొలగించడానికి పదిహేను మంది సభ్యులతో నెలరోజుల పాటు ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణిస్తూ మాన్యువల్ పరీక్షలు నిర్వహించారు. యాప్ పరీక్షలో భాగంగా సిగ్నల్ అడ్డంకులను, టాంపరింగ్ సమస్యను తగ్గించడానికి జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పనితీరును పరీక్షించడానికి వివిధ రూట్ ప్యాచ్‌లలో సిగ్నల్ కనెక్టివిటీని విస్తృతంగా పరీక్షించారు. ‘యాత్రి’ ప్రధాన లక్ష్యం రియల్ టైమ్ లోకల్–ట్రైన్ ట్రాకింగ్. తమ సొంత జీపీఎస్ పరికరాల ద్వారా నేరుగా రైల్వే కంట్రోల్ బోర్డ్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది యాత్రి. క్రౌడ్ సోర్స్ చేయదు. ట్రైన్ లొకేషన్, ట్రైన్ ఆలస్యం కావడానికి సంబంధించిన సమాచారం, ఫ్లాట్‌ఫారమ్ మార్పు, నోటిఫికేషన్లు, అంతరాయాల అప్డేట్లు.. మొదలైన వాటిని ప్రయాణికులు ‘యాత్రి’ ద్వారా తెలుసుకోవచ్చు.ప్రత్యామ్నాయ మార్గాలుఒక ట్రైన్ దాని నిర్దేశిత వేగంలో మూడో వంతు వేగంతో వెళితే వెంటనే ఆలస్యం జరగదు. కానీ రద్దీ సమయాలలో దాని ప్రభావం మొత్తం లైన్‌పై పడుతుంది. వివిధ కారణాల వల్ల రైళ్ల రాకపోకలలో ఆలస్యం జరుగుతుందని, అందువల్ల వేలాది మంది ప్రయాణికులకు సమాచారం త్వరగా చేరాల్సిన అవసరం ఉంది’ అంటుంది లఖీ. ట్రైన్లు ఆలస్యంగా నడవడం అనే సమస్య కంటే ఆ ఆలస్య సమాచారం ప్రయాణికులకు చేరకపోవడమే అసలు సిసలు సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘యాత్రి’ రైల్వే కంట్రోల్ రూమ్‌ల నుండి నేరుగా డేటాను తీసుకుంటుంది. ‘మేము తప్పుడు సమాచారాన్ని అందించే యాప్‌గా ఉండాలనుకోవడం లేదు. ప్రయాణికులు యాత్రి యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే తాము ప్రయాణించే రైలుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోగలగాలి. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే అదే మార్గంలో ప్రత్యామ్నాయాలను చూడగలగాలి’ అంటుంది రీవ.అయిదు నగరాలలో...రియల్–టైమ్ ట్రాకింగ్‌తో పాటు ముంబై మహానగరంలోని మెట్రో, మోనోరైల్, బస్సులు, ఫెర్రీలతో సహా ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్ ఆధారిత సమాచారాన్ని ‘యాత్రి’ అందిస్తోంది. ప్రయాణికులు తమ ప్రారంభ స్థానం, గమ్యస్థానాన్ని నమోదుగా చేయగానే యాత్రి సమస్యలు లేని సరిౖయెన మార్గాన్ని మ్యాప్ చేస్తుంది. మెట్రో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా క్యూలో సమస్యలు లేకుండా చేస్తుంది. దాదాపు మూడు మిలియన్ల డౌన్లోడ్లతో ‘యాత్రి’ ఇప్పుడు ముంబైతో సహా. దిల్లీ, కొచ్చి, కాన్పూర్, పుణే నగరాల్లో అందుబాటులో ఉంది.నిరంతరంనగర జనాభాలో సగం మంది రైళ్లలో ప్రయాణిస్తారు. విద్యార్థుల నుంచి శ్రామికుల వరకు ఎన్నో వర్గాల ప్రయాణికులు ఉంటారు. అన్ని వర్గాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని యాప్‌కు సంబంధించిన యూఐని రూపొందించాం. తక్కువ డేటా కనెక్టివిటీ, వ్యక్తుల డిజిటల్ అక్షరాస్యతను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఎప్పటికప్పుడూ ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటూ యూఐనీ నిరంతరం మెరుగుపరుస్తున్నాం.– లఖీ సకరియ, రీవ సకరియ, యాత్రి–ఫౌండర్స్ -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)...మరింత సహజంగా
‘రోబో’ సినిమాలో చిట్టి(రోబో) దూకుడు చూసి... ‘అయ్ బాబోయ్... ఎంతైనా యంత్రం యంత్రమేనండీ. అది మనిషిలా ఎందుకు స్పందిస్తుంది!’ అనుకున్నాం. ఏఐ టూల్స్ మొదట్లో అబ్బురపరిచినా... మనుషులతో పోల్చితే ఎక్కడో ఏదో లోపం కనిపించడం మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. టూల్స్‌లో సహజమైన మానవీయ స్పందనలు తీసుకురావడానికి ‘ఇంటరాక్షన్ మోడల్స్’తో నడుం కట్టారు ‘ఓపెన్ ఏఐ’ మాజీ సీటీవో, ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఫౌండర్ మీరా మురాటి.... ఏ.ఐ. విప్లవ కాలంలో ఉన్నాం మనం. అయితే ఏఐ అనేది చాలావరకు వాకి–టాకిలా పనిచేస్తోంది అనే అభిప్రాయం ఉంది.భవిష్యత్ సూచనమనం ఏదైనా అడుగుతాం. ఆగి, విని, ఆలోచించి చివరికి సమాధానం ఇస్తుంది ఏఐ సాధనం. ఆ తర్వాత మళ్లీ వేచి చూస్తుంది. చాట్‌జీపీటి, జెమిని, క్లాడ్, గ్రోక్... ఏది ఉపయోగిస్తున్నా దాదాపుగా ప్రతి ఏఐ సాధనం ‘టర్న్–బేస్డ్’ నమూనానే అనుసరిస్తోంది. మొదట మనుషులు మాట్లాడతారు. ఆ తరువాత యంత్రాలు స్పందిస్తాయి. ఈ విధానంపై సిలికాన్ వ్యాలీలోని ఏఐ దిగ్గజాలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ రంగానికి సంబంధించి ‘భవిష్యత్‌లో ఏం జరగబోతుంది?’ అనేదానికి సంబంధించి ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఒక సిగ్నల్ ఇచ్చింది. కేవలం ప్రాంప్ట్‌లకు సమాధానం ఇవ్వడానికి కాకుండా, సూచనల కోసం వేచి చూసే చాట్‌బాట్‌లా కాకుండా కొలీగ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి సహజత్వాన్ని ఏఐ సాధనాలలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది మీరా మురాటి.ఇక ముందు అలా ఉండదు!ఏఐ సాధనాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. వినియోగదారులు(యూజర్లు) మాట్లాడినప్పుడు లేదా టైప్ చేసినప్పుడు మోడల్ ఆ అభ్యర్థనను ప్రాసెస్ చేసి ఆ తర్వాతే స్పందిస్తుంది. ఈ విధానాన్ని మార్చడానికి సంభాషణలను 200–మిల్లీ సెకన్ల చిన్న చిన్న భాగాలుగా ప్రాసెస్ చేసే సిస్టమ్‌లతో ప్రయోగాలు చేస్తోంది మీరా కంపెనీ థింకింగ్ మెషిన్ ల్యాబ్స్. దీనివల్ల వ్యక్తి మాట్లాడుతుండగానే ఏఐ స్పందించగలుగుతుంది.తక్కువ లేటెన్సీ అంటే...‘ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడడానికి సంభాషణ మొత్తం పూర్తి కానక్కర్లేదు. ఇక ఏఐ సాధనాల విషయానికి వస్తే... అవి సంభాషణ మొత్తం ముగిసే వరకు వేచి ఉండి దానిని ప్రాసెస్ చేసి, ఆ తరువాతే దాని గురించి ఆలోచిస్తాయి. తక్కువ లేటెన్సీ అంటే ఒక కంప్యూటింగ్ సిస్టమ్ లేదా నెట్వర్క్ తక్కువ ఆలస్యంతో ప్రతిస్పందించే సామర్థ్యం. ఈ నేపథ్యంలో మీరా మురాటి థింకింగ్ మెషిన్ ల్యాబ్స్ ప్రయోగాలు అతిపెద్ద బలంగా మారనున్నాయి. థింకింగ్ మెషిన్ ల్యాబ్స్‌కు సంబంధించి రియల్–టైమ్ ఇంటరాక్షన్ సిస్టమ్, ఇంటరాక్షన్ మోడల్స్ విషయానికి వస్తే మనతో మాట్లాడుతూనే ఈ మోడల్ ఆలోచించగలదు. చూడగలదు. ఇది చాలా శక్తిమంతమైన మోడల్’ అంటున్నారు ఏఐ ఎక్స్పర్ట్, ది కటింగ్ ఎడ్జ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అన్ష్ మెహ్రా.భారీ మార్పుఏఐ రూపాన్ని గణనీయంగా తీర్చిదిద్దడంలో ఇంటరాక్షన్–మోడల్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆదేశాలను ఎలా టైప్ చేయాలో, సమర్థవంతంగా ఎలా శోధించాలో, సూచనలను ఎలా ఇవ్వాలో యంత్రాలకు నేర్పించాం. ఇప్పుడు ఆ యంత్రాలు మావవ ప్రవర్తన, స్పందనలకు మరింత సహజంగా అలవాటు పడేలా చేయడానికి ....‘టు మేక్ ఏఐ ఫీల్ లెస్ మెషిన్ అండ్ మోర్ హ్యూమన్’ నినాదంతో మీరా మురాటి మానస పుత్రికలు ‘ ఇంటరాక్షన్ మోడల్స్’ రంగం మీదికి వచ్చాయి. భారీ మార్పు... ఇంటరాక్షన్– స్మాల్‘ ఇంటరాక్షన్ మోడల్స్ రూపంలో భారీ మార్పు సాంకేతికపరమైనది మాత్రమే కాదు తాత్విక పరమైనది కూడా’ అంటున్నారు నిపుణులు. ‘ఇంటరాక్షన్–స్మాల్’ అని పిలువబడే ఈ సిస్టమ్ ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. దీని ఫలితాలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.దీనిలో కొన్ని కీలక ఫీచర్లు...’ సీమ్‌లెస్ డైలాగ్ మేనేజ్మెంట్:మాట్లాడే మనిషి ఆలోచిస్తున్నారా, ఒత్తిడిలో ఉన్నారా...ఇలాంటి విషయాలను ఈ మోడల్ పరోక్షంగా ట్రాక్ చేస్తుంది.’వెర్బల్ అండ్ విజువల్ ఇంటర్జెంక్షన్స్: యూజర్లు మాట్లాడడం పూర్తి చేసే వరకు వేచి చూడకుండా, సందర్భాన్ని బట్టి ప్రతిస్పందించడానికి ఈ మోడల్ అనుమతిస్తుంది’సైమన్టెనీయస్లీ స్పీచ్‘లైవ్ ట్రాన్స్లేషన్’లాంటి సందర్భంలో యూజర్, మోడల్ ఒకే సమయంలో మాట్లాడేలా వీలు కల్పిస్తుంది.’ కంకరెంట్ టూల్ మాట్లాడుతూనే, వింటూనే శోధించడానికి, బ్రౌజ్ చేయడానికి, యుఐ (యూజర్ ఇంటర్ఫేస్) రూపొందించడానికి వీలుకల్పించే సాధనాలను ఏకకాలంలో ఉపయోగిస్తుంది.’ టైమ్ అవేర్నెస్సంభాషణల సమయంలో గడిచిన సమయాన్ని మోడల్‌కు తెలియజేస్తుంది. -
ఎవరీ సుసాన్ ఇలియాస్? 145 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న..
నూట నలభై అయిదు సంవత్సరాల ఘనచరిత్ర ఉన్న సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకోవడమే గొప్పగా భావిస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసే అవకాశం రావడం ఎంత ఘనత! సెయింట్ స్టీఫెన్ కాలేజీకి తొలి మహిళా ప్రిన్సిపల్‌గా నియామకం కావడం ద్వారా ప్రొఫెసర్ సుసాన్ ఇలియాస్ చరిత్ర సృష్టించారు....రాబోయే జూన్‌లో సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కానుంది. సుసాన్ ఇలియాస్ ఈ ప్రసిద్ధ కాలేజీ మొదటి మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.మూడు దశాబ్దాల అనుభంఫిబ్రవరి 1,1881న దిల్లీలో స్థాపించిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ మన దేశంలోని అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సెయింట్ స్టీఫెన్ కాలేజీ అంటే... తత్త్వశాస్త్రం, రాజనీతి, లిబరల్ ఆర్ట్స్... మొదలైన మానవీయ శాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కాలేజీ. గతంలో ఈ కాలేజీలో పనిచేసిన వారికన్నా భిన్నమైన విద్యా నేపథ్యం నుంచి వచ్చారు సుసాన్. ఇంజినీరింగ్, కంప్యూటింగ్ పరిశోధనలలో ఆమెకు మూడు దశాబ్దాల అనుభం ఉంది. ‘ప్రిన్సిపల్‌గా సుసాన్ నియామకం సెయింట్ స్టీఫెన్స్కు అత్యాధునిక సాంకేతికతను తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను’ అన్నారు కాలేజీ చైర్మన్ పాల్ స్వరూప్. ప్రిన్సిపల్ ఎంపిక సరిౖయెన విధానంలోనే జరిగిందని అంటారు స్వరూప్. ప్రిన్సిపల్ పదవి కోసం బహిరంగ ప్రకటన ఇవ్వడం, ఆ తర్వాత ఇంటర్వ్యూలు, షార్ట్‌లిస్టింగ్, అభ్యర్థుల ప్రజెంటేషన్ల తరువాత తుది ఎంపిక జరిగింది. ప్రిన్సిపల్‌గా సుసాన్ నియామకాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు కాలేజీ అకడమిక్స్ డీన్, చరిత్ర విభాగాధిపతి మలయ్ నీరన్. సెయింట్ స్టీఫెన్ కాలేజీకి తొలి భారతీయ ప్రిన్సిపల్‌గా 1906లో సుశీల్ కుమార్ రుద్ర చరిత్ర సృష్టించారు. తాజాగా అలాంటి ఘనతను సుసాన్ సొంతం చేసుకున్నారు.ఉన్నతమైన బాధ్యతలుసుసాన్ చెన్నైలో పుట్టి పెరిగారు. ఆమె విద్యా, ఉద్యోగ ప్రస్థానానికి చెన్నై ప్రధాన కేంద్రంగా ఉంది. భారత్ ఇంజినీరింగ్ కాలేజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, అన్నా యూనివర్శిటీ నుండి మల్టీ మీడియా టెక్నాలజీలో మాస్టర్స్ ఆఫ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేశారు. ఎన్నో ప్రైవేట్ యూనివర్శిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలలో ఉన్నతమైన బాధ్యతలు నిర్వహించారు. హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో పరిశోధన డైరెక్టర్‌గా, డిజిటల్ హెల్త్ అండ్ బయో–ఇన్నోవేషన్స్ సెంటర్‌కు హెడ్‌గా పనిచేశారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (సెన్స్) డీన్‌గా, అదే సంస్థలో అడ్వాన్స్డ్ డేటా సైన్సెస్‌కు డిప్యూటి డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాతి కాలంలో ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఏఐ అప్లికేషన్లపై దృష్టి సారించారు. మెషిన్ లెర్నింగ్, ఎక్స్ప్లెయినబుల్ ఏఐ, మెడికల్ ఇమేజింగ్, ఫెడరేటెడ్ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్ హెల్త్‌లాంటి రంగాలలో పరిశోధనలు చేశారు. లక్నోలోని చండీగఢ్ యూనివర్శిటీలో ప్రో వైస్ చాన్సలర్(పరిశోధన)గా పనిచేశారు.ఇక ఏఐపై దృష్టిసెయింట్ స్టీఫెన్స్ ఎంతోమంది మేధావులు, నాయకులను తీర్చిదిద్దింది. తమ కాలానికంటే ముందే ఆలోచించే పరిశోధకులు, పారిశ్రామికవేత్తలకు ఈ కాలేజీ పుట్టిల్లు. క్వాంటం కంప్యూటింగ్ యుగంలోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలి. ఎందుకంటే అదే మన సమీప భవిష్యత్. ఈ కోర్సులు విద్యార్థులకు మాత్రమే కాదు డిజైనర్లు, న్యాయవాదులు, జర్నలిస్ట్‌లతో సహా వివిధ రంగాల వారికి ఉపకరిస్తాయి. ∙యూనివర్శిటీలో ఏఐ సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నాం. విద్యార్థులను ఏఐకి సిద్ధం చేయడానికి, క్వాంటంపై అవగాహన కలిగించడానికి ప్రిన్సిపల్‌గా పనిచేయడం అనేది గొప్ప అవకాశం. ∙కళాశాల ఘనమైన వారసత్వాన్ని కాపాడుతూనే, పరిశోధనలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పిస్తాం.– సుసాన్ ఇలియాస్ఎందరో ప్రతిభావంతులుభారతదేశ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని, ప్రముఖ చరిత్రకారిణి ఉపిందర్ సింగ్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ, నటి రీచా చద్దా, ప్రముఖ న్యాయవాది, ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ వృందా గ్రోవర్, నటి కొంకణ సేన్ శర్మ, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, సుప్రీం కోర్ట్ మాజీ జడ్జీ హిమా కోహ్లీ... సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకున్న ఎంతోమంది ప్రతిభావంతులలో కొందరు. -
ఆ కుంచె గొంతులోమళ్లీ అమృతం
ఆమె మరణించి 85 ఏళ్లు అవుతున్నా భారతీయ కళారంగం తలుచుకుని అబ్బురపడుతూనే ఉంది. 28 ఏళ్లకే ఆమె చేతి కుంచెను మృత్యువు లాక్కున్నా ఆమె గీసిన చిత్రాన్ని 62 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంటూనే ఉంది. అమృతా షేర్గిల్. భారతీయ అద్భుత చిత్రకారిణి. ఆమె బయోపిక్ త్వరలో రాబోతూ ఉంది. దర్శకురాలు మీరా నాయర్ దీని రూపకర్త. ఒక స్త్రీ మరో స్త్రీ జీవితాన్ని కెమెరా కేన్వాస్పై దించనుంది. వివరాలు....ఈ సినిమా కచ్చితంగా మీరా నాయర్ ఇంతకుముందు సినిమాల కంటే భిన్నమైనది. ఆమె ఇప్పటి వరకూ బయోపిక్స్ తీయలేదు. తీయాలనుకున్నది సామాన్యమైన వ్యక్తి గురించీ కాదు. ‘నేను సినిమాలు తీశానంటే అమృతా షేర్గిల్ గీసిన బొమ్మల ప్రభావం వల్లే. అందుకే ఆమె బయోపిక్ తీయడానికి ధైర్యం చేశా’ అంటారు మీరా నాయర్. అమృతా షేర్గిల్ పేరు భారతీయ చిత్రకళలో మరణం లేనిది. అమె గురించి తెలియడం, తెలియకపోవడం రెండూ కళాభిమానులను బాధించే విషయాలు. తెలిస్తే ‘అరె చిన్న వయసులో మరణించిందా’ అని బాధ. తెలియకపోతే ఇంత గొప్ప మనిషి తెలియకుండా పోయిందా... అనే బాధ. మన దేశంలో స్త్రీలు వంటిల్లు దాటడానికి కూడా భయపడిపోయే రోజుల్లో అమృతా షేర్గిల్ ΄్యారిస్కు వెళ్లి మరీ చిత్రకళ అభ్యసించింది. అక్కడి మహా చిత్రకారులతో భుజాలు రాసుకు తిరిగింది. తిరిగి భారతదేశానికి వచ్చి యూరోపియన్ వాసనలు లేకుండా తన కుంచె మెరుగుదనంతో భారతీయ సౌందర్యాన్ని చూపింది. అందుకే ఆమె కథ విశిష్టమైనది... ఆమె బొమ్మల్లానే. మీరా నాయర్ ఈ పాత్రకు తగిన నటి కోసం, రాయాల్సిన స్క్రిప్ట్ కోసం చాలా పరిశ్రమించింది. అమృత పాత్రకు త్రిప్తి డిమ్రి, తాన్య మణిక్తలా పేర్లు పరిశీలనకు వచ్చినా ‘బ్యాడ్ గర్ల్’ ఫేమ్ అంజలి శివరామన్ లోని భావగాఢత నచ్చి ఆమెను ఎంచుకుంది.దిగ్గజ బృందంతాను ఎవరి గురించి బయోపిక్ తీస్తున్నదో మీరాకు బాగా తెలుసు. భారతీయ ఆధునిక కళకు అమ్మగా, ‘పయొనీర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్’గా పిలువబడే షేర్గిల్ను తెర మీద సాక్షాత్కరించడం... సవాల్. తీశాక అభిమానులు, విమర్శకులు వేయికళ్లతో పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. వారి అభిమానం కంటే తన అభిమానమే గొప్పదని నిరూపించుకోవడానికి పరీక్షకు సిద్ధమైంది మీరా నాయర్. అమృతా షేర్గిల్ను అందరూ ‘అమ్రి’ అని ముద్దుగా పిలుస్తారు. మీరా కూడా అలానే పిలుచుకుంటుంది. అదే టైటిల్ ‘అమ్రి’.స్క్రిప్ట్ పనిలో ఫ్రెంచ్ స్క్రీన్ రైటర్ క్లారా రాయర్ సహాయం తీసుకుంది. ప్రియాంక చోప్రాను ముఖ్యపాత్ర వేయమని కోరడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండేలా మెప్పించింది. ఎమిలీ వాట్సన్ , జైదీప్ అహ్లావత్, జిమ్ సర్భ్, అంజనా వాసన్ మంచి ఆర్టిస్టులను ఇతర పాత్రలకు తీసుకుంది. ఇండియా, హంగేరీలలో షూటింగ్ చేసింది.మృత్యువు గీసిన చివరి గీతఅమృతా షేర్గిల్ అనూహ్య ధోరణిలో ఎదిగింది. పురుష చిత్రకారులు దేవతల్ని గీస్తున్న రోజుల్లో అమృత గ్రామీణ స్త్రీల వేదనను గీసింది. పెళ్లి, ప్రేమ, సెక్స్– దేన్నీ దాచుకోలేదు. అందువల్ల స్కాండల్స్ వెంటాడినా పట్టించుకోలేదు. అందుకే ఆమెను ఎరిగినవాళ్లు ‘50 ఏళ్లు ముందు పుట్టింది’ అంటారు.‘ఆమె జీవితం ఒక సినిమా కన్నా నాటకీయం. ప్రతి ఫ్రేమ్‌లో పోరాటమే’ అని ఆమె జీవిత చరిత్రకారిణి యశోధర దాల్మియా వ్యాఖ్యానిస్తారు. ఇంత గొప్ప భవిష్యత్తు ఉన్న అమృత డిసెంబర్ 5, 1941న లాహోర్‌లో మరణించడం పెద్ద షాక్. అప్పటికి వయసు కేవలం 28. మరణానికి కారణం డాక్టర్లు ‘పెరిటోనైటిస్’ అన్నారు... అంటే ΄÷ట్టలో ఇన్ఫెక్షన్. చరిత్రకారులేమో ‘ఫెయిల్డ్ అబార్షన్’ అన్నారు. తల్లి మాత్రం ‘నా కూతుర్ని మొగుడే చంపేశాడు’ అని ఏడ్చింది. ఏది నిజమో ఎవరికీ తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే– భారతీయ ఆధునిక కళ ఉచ్ఛస్థితికి చేరుకుంటున్న సమయంలో, ఆ కళకు అమ్మ లాంటి అమృత చేతిలోంచి కుంచె జారిపోయింది.బయో పోయెమ్‘సలామ్ బాంబే’,‘మాన్ సూన్ వెడ్డింగ్’, ‘ది నేమ్‌సేక్’ తీసిన మీరాకు ‘అమ్రి’ పర్సనల్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ మైఖేల్ నోజిక్ మాటల్లో చె΄్పాలంటే ‘మీరా నాయర్ దర్శకత్వంతో అంజలి పెర్ఫార్మెన్ ్స అద్భుతంగా ఉండబోతోంది’. అమృతగా అంజలి ఫస్ట్లుక్కే ప్రశంసలు వస్తున్నాయి. అమృతలోని క్రాస్ కల్చరల్ ఐడెంటిటీ, కళాత్మకత, ధిక్కారం ఇవన్నీ మీరా నాయర్ కెమెరాలో ఒదిగితే ‘అమ్రి’ ఒక విజువల్ పోయెమ్ అవుతుంది. 85 ఏళ్ల తర్వాత అమృత మళ్లీ బతుకుతుంది. అమృతా షేర్గిల్ ఎవరు?మీరా నాయర్‌నే కాదు ప్రపంచ కళాభిమానులను ఆకర్షించే అమృతా షేర్‌గిల్‌ది భిన్నమైన జీవితం. హంగేరీ తల్లి, పంజాబీ సిక్కు తండ్రికి 1913లోబుడాపెస్ట్లో జన్మించింది. పారిస్‌లోని ఆర్ట్ స్కూల్ ‘అకాడెమీ దె బోజార్’లో అతి చిన్న వయసులో చదువుకుంది. యూరోపియన్ టెక్నిక్‌తో భారతీయ గ్రామీణ స్త్రీల వేదన, ఒంటరితనం, దైనందిన జీవితాన్ని కాన్వాస్ పైకి తెచ్చింది.‘త్రీ గరల్స్’, ‘బ్రైడ్స్ టాయిలెట్’, ‘విలేజ్ సీన్’... ఈ మూడు చిత్రాలతో భారతీయ కళలో మోడర్నిజానికి తొలి అడుగులు వేసింది. అందుకే ఆమెను ఆమె 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్ 2023లో 61.8 కోట్లకు అమ్ముడుపోయిందంటే ఇక ఆలోచించండి ఆమె కళావైశిష్ట్యం.– కె. -
చిలుకల తల్లికి గ్రీన్ ఆస్కార్
చంబల్... ఒకప్పుడు బందిపోట్లకు నెలవు. ఇప్పుడు అదే చంబల్ అంతరించిపోతున్న అందమైన పక్షి జాతికి అభయారణ్యం. ఆ మార్పుకు కారణం – పర్వీన్ షేక్. నిప్పుకణిక లాంటి ముక్కుతో చిలుకల్లా ఉండే ‘ఇండియన్ స్కిమ్మర్’ పక్షులు ఒరిజినల్‌గా ఏ దేశానివి. అవి మన దేశానికి వలస పక్షులా? లేక మన దేశంలో ఉంటాయా? ఆ పక్షులు అంతరిస్తుంటే ఆమె వాటి సంఖ్యను పెంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అందుకే ‘గ్రీన్ ఆస్కార్స్’గా పిలిచే ‘విట్లీ అవార్డు’ ఆమెను వరించింది.లండన్ లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ హాల్... వేదిక మీద బ్రిటన్ రాకుమారి ప్రిన్సెస్ ఆన్... ఆమె చేతిలో 50,000 పౌండ్ల చెక్... ప్రిన్సెస్ ఆన్ నుంచి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘విట్లీ అవార్డు’ అందుకునేందుకు పర్వీన్ షేక్ వేదిక ఎక్కగానే చప్పట్లు మార్మోగాయి. అంతరించిపోతున్న ‘ఇండియన్ స్కిమ్మర్’ అనే చంబల్ చిలుకలను కాపాడినందుకు ఆమెకు గౌరవం. ‘ఈ అవార్డు నాకు కాదు, చంబల్ ఇసుకలో గూళ్లకు కాపలా కాసిన నా గ్రామీణ సోదరులకు’ అని వేదిక మీద ఆమె చెప్పిన మాటలకు హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది. ‘గ్రీన్ ఆస్కార్’గా భావించే విట్లీ అవార్డును అందుకున్న పర్వీన్ తాను చేసిన సుదీర్ఘ పోరాటాన్ని తలుచుకుని ఉద్వేగం పొందింది.పక్షి ప్రేమికురాలు...పర్వీన్ షేక్ ముంబై అమ్మాయి. రామ్‌నరైన్ రూయా కాలేజీలో జువాలజీ చదివిన రోజుల్లోనే పక్షుల మీద పిచ్చి పట్టుకుంది. ‘‘నా కాలేజ్ చదువే నన్ను బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వైపు నడిపించింది’’ అంటారామె. 2012లో బాంబే నేచురల్ హిస్టరీలో సైంటిస్ట్‌గా చేరిన పర్వీన్ కి ఒక క్లారిటీ ఉండేది– ‘అంతరించిపోతున్న పక్షి జాతుల కోసం పని చేయాలి’ అని. ఆ అన్వేషణలోనే ఒకరోజు ఆమె దృష్టి ఒక మేగజీన్లోని ఒక పక్షి ఫొటో మీద పడింది. నల్లటి రెక్కలు, తెల్లటి పొట్ట, నిప్పు అంటుకున్నట్టు ఎర్రగా మెరిసే ముక్కు. కింది దవడ పైదవడ కంటే పొడుగు. పేరు ‘ఇండియన్ స్కిమ్మర్’. ఒకప్పుడు దక్షిణ ఆసియా అంతటా కనిపించే ఈ పక్షి, ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్‌లలో మాత్రమే మిగిలింది. మన దేశంలో 1990లో 10,000 ఉండే ఈ పక్షులు 2017కి 400కి పడిపోయాయని తెలిశాక ఆమె గుండె విలవిలలాడింది. వీటిని కాపాడలేనా అనుకుందామె.చంబల్ లోయకు ప్రయాణం...మన దేశంలో ఇండియన్ స్కిమ్మర్ పక్షులు ఎక్కువగా చంబల్ లోయలో ఉంటాయి. అందుకే డిసెంబర్ 2016లో పర్వీన్ బృందం చంబల్ నది మీద బోట్లో సర్వే మొదలుపెట్టింది. ఇది ఇండియాలో ఇండియన్ స్కిమ్మర్ మీద జరిగిన మొదటి శాస్త్రీయ సర్వే. అక్కడ కనపడిన దృశ్యాలు ఆమె మనసును ఇంకా వికలం చేశాయి. ఇండియన్ స్కిమ్మర్ పక్షి నది ఒడ్డున ఇసుక లోడి గుడ్లు పెడుతుంది. అదే దాని గూడు. అలాంటి గూళ్ల మీద ఆవుల మందలు నడుస్తూ నాశనం చేస్తున్నాయి. ఇసుక మాఫియా ట్రాక్టర్లకు మిగిలినవి బలి అవుతున్నాయి. మిగతావి కుక్కలు, నక్కలు, మనుషుల ఆటలకు. ‘పక్షులను చంపుతోంది ప్రకృతి కాదు. మన నిర్లక్ష్యం’’ అని ఆ రోజు డైరీలో రాసుకుంది.నెస్ట్ గార్డియన్స్...‘గూళ్లకు కాపలా పెడితే?’– పగిలిన గుడ్డు చేతిలో పట్టుకుని పర్వీన్ వేసుకున్న శపథం అది. కానీ చెప్పడం తేలిక. చేయడం? బందిపోట్ల లోయ అనే పేరున్న చంబల్‌లో, ఇసుక మాఫియా రాజ్యమేలే చోట, ముంబై నుంచి వచ్చిన ఒక మహిళా సైంటిస్టు మాట ఎవరు వింటారు? పర్వీన్ గ్రామాల్లో తిరిగింది. ‘ఈ పక్షులు నది ఆరోగ్యానికి గుర్తు. ఇవి పోతే నది చచ్చిపోయినట్టే. నది చస్తే మనమూ బతకలేం’ అని అర్థమయ్యే భాషలో చెప్పింది. మొదట్లో నవ్వారు. తర్వాత విన్నారు. అర్థం చేసుకున్నారు. అలా 30 మందికి పైగా స్థానిక యువకులు, మత్స్యకారులు ‘నెస్ట్ గార్డియన్స్’గా మారారు.వాళ్లు చేసే పని మామూలుది కాదు. ఆ పక్షుల బ్రీడింగ్ సీజన్ మార్చి నుంచి జూన్ దాకా ఎండనకా వాననకా, ఇసుక తిన్నెల దగ్గర కాపలా కాస్తారు. గూళ్ల చుట్టూ వెదురు కంచె వేసి ‘పక్షులు గుడ్లు పెడుతున్నాయి, దయచేసి దూరంగా వెళ్లండి’ అని బోర్డులు పెడతారు. ఫలితం? 2025లో పక్షుల సంఖ్య 400 నుంచి 1000 దాటింది. అంతకంటే గొప్ప విషయం ఏంటే, ‘ఇవి మన పక్షులు’ అని గ్రామస్తులు ఓన్ చేసుకున్నారు. ఇదే పర్వీన్ కి అతిపెద్ద విజయం. పర్వీన్ చేతిలో తుపాకీ లేదు. ఇసుక తిన్నెల మీద వెలిసిన పక్షుల గూళ్ల మీద అవ్యాజమైన ప్రేమ ఒక్కటే ఉంది. అందుకే ఇవాళ చంబల్ చిలుకలు తిరిగి ఆకాశంలో ఎగురుతున్నాయి. ‘గ్రీన్ ఆస్కార్’ పర్వీన్ కి దక్కిన గౌరవం కాదు, చంబల్ నది ఆమె పాదాలు కడిగి చెప్పిన కృతజ్ఞత. -
భవిష్య కిరణం
కొన్ని సంవత్సరాల క్రితం... ‘ఎందుకలా భయపడుతున్నావు?’ అని ఆ అమ్మాయిని అడిగారు కిరణ్ మజుందార్ షా. ‘కంపెనీ నిర్వహణకు నా వయసు సరిపోదేమో’ అని సందేహించింది ఆ అమ్మాయి. ‘నేను బయోకాన్ ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని చెప్పి ఆమెను ఒప్పించారు కిరణ్. బయోకాన్ అనుబంధ సంస్థ ‘బికార’ ఫౌండర్–సీఈవోగా ఆ అమ్మాయి తనను తాను నిరూపించుకుంది. ఆ అమ్మాయి పేరు... క్లెయిర్ మజుందార్. కిరణ్ మజుందార్ షా మేనకోడలు. బయోకాన్ వ్యాపార సామ్రాజ్య వారసురాలిగా తెర ముందుకు వచ్చారు క్లెయిర్ మజుందార్....ప్రఖ్యాత బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ నిర్వహణ బాధ్యతలను చైర్పర్సన్ మజుందార్ షా నుంచి ఆమె మేనకోడలు క్లెయిర్ మజుందార్ షా స్వీకరించనున్నారు.– బంగారు కుండ‘నాకు ఒక బంగారు కుండ దొరికితే, తీవ్రమైన వ్యాధులను నయం చేసే కొత్తమందులను తయారు చేయడానికి ఆ కుండను అత్తయ్యకు ఇస్తాను’ అని ఆరేళ్ల వయసులో ఎరిక్ మజుందార్ ఒక కుండ బొమ్మ వేసి కాగితంపై రాశాడు. ఆ అబ్బాయి క్లెయిర్ సోదరుడు. విశేషం ఏమిటంటే అప్పుడెప్పుడో రాసిన ఆ బొమ్మల కాగితం ఇప్పటికీ కిరణ్ మజుందార్ షా దగ్గర భద్రంగా ఉంది.‘ఆరేళ్ల వయసులో ఎరిక్ నాకు పంపిన అందమైన సందేశం ఇది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కిరణ్.ఎరిక్ తన గౌరవనీయ అత్తయ్యకు బంగారు కుండ ఇవ్వలేదు. అయితే కిరణ్ మాత్రం ఎరిక్ సోదరి, తన ప్రియమైన కోడలు క్లెయిర్ మజుందార్‌కు ‘బయోకాన్ బాధ్యతలు’ అనే బంగారు కుండను ఇచ్చారు!– అడుగడుగునా సవాళ్లే... అయినా సరే...కిరణ్ మజుందార్ షా అసాధారణ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. గాలివాటుగా లేదా అదృష్టవశాత్తూ వచ్చింది కాదు. ఒక గ్యారేజీలో 1978లోప్రారంభమైన ఆమె ప్రయాణం... ప్రతికూల వాతావరణం లో సవాళ్లను అధిగమిస్తూ నిరంతర పోరాటంగా సాగింది.బయోటెక్నాలజీ అంటే పెద్దగా ఎవరికి తెలియని రోజుల్లో పెట్టుబడుల కోసం అన్వేషించడం, బయోటెక్నాలజీని పెద్దగా గుర్తించని కాలంలో పాజిటివ్‌గా ముందుకు సాగడం, స్వల్పకాలిక లాభాలపై దృష్టి సారించే మార్కెట్లతో పోరాడటం... ఇలా ఎన్నో అనుభవాలు కిరణ్‌కు ఉన్నాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ కూడా ఆవిష్కరణల ఆధారిత బయోటెక్ వ్యవస్థను నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు.‘నేను విజయం సాధించే వరకు నాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు’ అంటారు కిరణ్ మజుందార్ షా.– క్లెయిర్ది నల్లేరుపై నడక కాదుబయోకాన్ సామ్రాజ్య వారసురాలిగా క్లెయిర్ మజుందార్‌ది నల్లేరు మీద నడక కాదు. ఎన్నో సవాళ్లు ఉంటాయి. ‘సవాళ్లను అధిగమించి సత్తా చాటడంలో తన మేనత్తను గుర్తుతెస్తోంది’ అనిపించుకోవాలి.వ్యాపారం, ఔషధ ఆవిష్కరణలో పునరావిష్కరణ(రీఇన్వేషన్) కిరణ్ కార్యాచరణ సూత్రం. కంపెనీకి సంబంధించి ప్రతి దశాబ్దంలోనూ ఒక కీలక మలుపు ఉండేది. మొదటి మలుపు... పారిశ్రామిక ఎంజైమ్‌లపై దృష్టి సారించడం.ఆ తరువాత దశాబ్దంలో బయోకాన్ ఇన్సులిన్‌పై దృష్టి సారించి ప్రపంచంలోని టాప్ 3 ఇన్సులిన్ తయారీదారులలో ఒకరిగా నిలిచారు. 2009 తరువాత పేటెంట్ పొందిన బయోలాజికల్ ఔషధాల రివర్స్–ఇంజినీరింగ్ వెర్షన్లు అయిన బయోసిమిలర్స్‌పై దృష్టి సారించి భారతదేశపు ఏకైక గ్లోబల్ బయోసిమిలర్ సంస్థగా, ప్రపంచంలోని టాప్ 5 సంస్థలలో ఒకటిగా నిలిచింది బయోకాన్.→ ధైర్యం ఇచ్చి... దారి చూపారుఅమెరికాలోని బయోకాన్ అనుబంధ సంస్థ బికారాకు నాయకత్వం వహించడానికి ఒక సీఈవో కావాలని కిరణ్ అనుకొని అందుకోసం తన మేనకోడలైన క్లెయిర్ మజుందార్‌ను ఎంపిక చేసుకున్నారు. క్లెయిర్ మజుందార్ బయోలాజికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ నుండి ఎంబీఏ, స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి క్యాన్సర్ బయాలజీలో పీహెచ్డీ చేశారు.‘థర్డ్ రాక్ వెంచర్స్’ అనే వెంచర్ క్యాపిటల్(వీసి) సంస్థలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేసేవారు. బికారాలో చేరడానికి మొదట్లో ఆమె విముఖత వ్యక్తం చేశారు.‘ఈ వయసులో అంత పెద్ద బాధ్యతలను నిర్వహించలేను’ అనేది క్లెయిర్ విముఖతకు కారణం. అలా అని అత్తయ్య ఊరుకోలేదు.‘నేను బయోకాన్ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని క్లెయిర్‌ను ఒప్పించారు కిరణ్. అలా బికారలో ఫౌండర్–సీఈవోగా చేరి సత్తా చాటారు క్లెయిర్ మజుందార్. అమెరికాలోని వెంచర్ క్యాపిటల్ కమ్యూనిటీతో పనిచేసిన అనుభవం మూల«ధనాన్ని ఆకర్షించడంలో ఆమెకు సహాయపడింది.కిరణ్ ఆరోజు ఇచ్చిన ఆ ధైర్యమే భవిష్యత్‌లో క్లెయిర్ మజుందార్‌ను ముందుకు నడిపించనుంది. అందుకే ఆమె నా వారసురాలునా వారసురాలికి మూడు లక్షణాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవి... రిస్క్ తీసుకునే సామర్థ్యం, వ్యూహాత్మకంగా ఆలోచించే తత్వం, విలువను సృష్టించే నైపుణ్యం. నేను బయోకాన్‌కు యజమానిని. నా సంస్థను మంచి వ్యక్తికి అప్పగించానని నేను నిర్థారించుకోవాలి. నా మేడకోడలు క్లెయిర్‌ను నా వారసురాలిగా చూస్తున్నాను. ఆమెలో నేను కోరుకునే మూడు లక్షణాలు ఉన్నాయి. కంపెనీని క్లెయిర్ విజయవంతంగా నడిపించగలదని నమ్ముతున్నాను.– కిరణ్ మజుందార్ షా -
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్‌లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్‌కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్‌లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్‌కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
అమ్మకు రెండు తరాల బరువు
కూతురి కాలేజ్ ఫీజు ఒకవైపు... మామగారికి పక్షవాతం మరోవైపు... 50 దాటిన మహిళలు ఇలా ఒకేసారి రెండు తరాల మధ్య స్ట్రెస్ అనుభవిస్తున్నారు. దీనినే ‘శాండ్విచ్ జనరేషన్ స్ట్రెస్’ అంటారు. భర్తతో అడ్జస్ట్ అవడం, మెనోపాజ్ సమస్యలు ఇందుకు అదనం. ఒక సర్వే ప్రకారం అర్బన్ ఇండియాలో 35 శాతం మహిళలు ఇలా పిల్లలూ పెద్దల మధ్య నలుగుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఒక అమ్మ ఏం చేసింది?ఆమెలాంటి అమ్మను మనం చాలామందిని చూసి ఉంటాం. వయసు 49 ఏళ్లు. హైదరాబాద్‌లో స్కూల్ అడ్మిన్‌గా ఉద్యోగం. మధ్యతరగతి జీవితం. ఈమె చన్నీళ్లకు భర్త సంపాదన వేణ్ణీళ్లు. ఇద్దరూ సంపాదించకపోతే బండి నడవదు. ఆమె పని ఉదయం ఏడుకే మొదలైపోతుంది. గిన్నెలు, టిఫిన్ వండటాలు... చేయదగ్గవే. కాని అత్తగారిని చూసుకోవాలి. డెబ్బై అయిదేళ్ల అత్తగారికి డైపర్ మార్చడం, మందులు వేయడం, టిఫిన్ తినేలా చూసి ఆ తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేసుకొని ఆఫీసుకు పరుగు పెట్టడం... ఒకరోజు కాదు రెండు రోజులు కాదు... నిత్యం.ఆఫీసులో ఉండగా కూతురి ఫోన్ వస్తుంది. కాలేజీ ఫీజు గురించి. కొడుకు ఫోన్ వస్తుంది... దొరకని ఉద్యోగం గురించి... చేరాల్సిన కోర్సు గురించి. ఆఫీసులో బాసు పని మీద పని చెప్తుంటాడు. అలిసి సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ డ్యూటీ. అత్తగారికి డిన్నర్, కూతురికి కౌన్సెలింగ్, కొడుకుకి మోటివేషన్. రాత్రి పదకొండుకు మంచం మీద వాలితే ఆమెకు కలిగే భావన ఏమిటి?ఆమెలో మార్పులురోజులు గడిచే కొద్దీ ఆమెలో మార్పులు వచ్చాయి. అవి ఆమె అదుపులో లేవు. ఏమిటవి? ఎవరిని చూసినా కోపం రావడం. అత్తగారు మంచం తడిపితే అరిచేసి తర్వాత గిల్టీ ఫీల్ అయ్యి ఏడవడం. రోజురోజుకూ ఖర్చులు పెరిగి ఇప్పుడే రూపాయి మిగలకపోతే నాకు అరవై వచ్చేసరికి ఏం మిగులుతుంది అనే ఆందోళన. అద్దంలో చూసుకుంటే తనకు తానే గుర్తు పట్టని రూపం. మెనోపాజ్ చికాకు, నడుము నొప్పి, బి.పి... ఒకరోజు ఆఫీస్‌లో కళ్లు తిరిగి పడిపోయింది. డాక్టర్ ఆమె సంగతి అంతా గ్రహించి ‘మీరు ఇప్పుడు మారకపోతే, మీ అత్తగారి పక్క బెడ్ మీదే మీరుంటారు’ అన్నాడు. ‘మీకూ జీవితం ఉండాలి. మీరు అమ్మగా మాత్రమే బతుకుతున్నారు’ అన్నాడు.మొదలైన మార్పుడాక్టర్ మాటతో ఆమెలో ఆలోచన రేగింది. ఒక స్నేహితురాలి సహాయంతో ఒక సైకాలజీ కౌన్సిలర్‌తో మాట్లాడింది. ‘శాండ్విచ్ జనరేషన్ స్ట్రెస్’ గురించి కొంత క్లారిటీ తెచ్చుకుంది. కొన్ని మార్పులు చేసుకుంది. జీవితం అంటే తనకు తాను మిగిలేలా బతకడం అనే ఎరుక తెచ్చుకుంది. ఈ అమ్మ మరి ఏం చేసింది?‘సూపర్ ఉమన్’ టైటిల్ వదిలేసిందికుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టి భర్త, కొడుకుతో ఖచ్చితంగా చెప్పింది– ‘నేను ఒక్కదాన్నే చేయలేను. మీరు కూడా చేయాలి’. ఇప్పుడు ఉదయం అత్తగారి మందులు భర్త బాధ్యత. సాయంత్రం భోజనం కొడుకు పెడతాడు. డైపర్ మార్చే పనిలో కూతురు సాయం పడుతుంది. సాయం అడగడం బలహీనత కాదు, తెలివి అని ఆమెకు అర్థమైంది.తనకంటూ రెండు రోజులునెలకు రెండు రోజులు... అంటే ఆదివారాలు తను పూర్తి విశ్రాంతి తీసుకోదలిచింది. ఆ రెండురోజుల కోసం ఒక హోమ్ నర్స్‌ను అత్తగారి కోసం ఏర్పాటు చేస్తుంది. అలాగే వంట పూర్తిగా బంద్ చేసి పిల్లలు చేసేదో బయటి నుంచి తెచ్చేదో ఉండాలంటోంది. ఆ రెండు రోజులు సినిమా, నిద్ర, ఫ్రెండ్స్‌తో కబుర్లు. ఆ రెండు రోజుల బలంతో మిగిలిన 28 రోజులు లాగించగలుగుతోంది.ఆర్థిక బరువు తగ్గించికూతురితో స్పష్టంగా చెప్పింది– ‘ఈ సెమిస్టర్ ఫీజు కడతాను. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకో. నా రిటైర్మెంట్ ఫండ్ ఖాళీ అయితే, రేపు నేను మీ మీద భారం అవుతాను’. కొడుక్కి కూడా కోర్సులు చేరాలంటే పార్ట్‌టైమ్ చేసి సంపాదించు అని.తన సమయం– ‘మీ’ టైమ్రోజులో తన సమయం కొంత ఉండాలనుకుంది. ప్రతిరోజూ ఉదయం కాసేపు టెర్రస్ మీద నిలబడి కాఫీ తాగుతుంది. ఆ టైమ్‌లో చేతిలో ఫోన్ ఉండకూడదు, వేరే ఆలోచనలు ఉండకూడదు. అలాగే సాయంత్రం డిన్నర్ తర్వాత కాసేపు పచార్లకు సమయం. 6 నెలల తర్వాత ఆమె బి.పి. కంట్రోల్లోకి వచ్చింది. అందరూ దారికి వచ్చారు. నేను నా జీవితాన్ని కాపాడుకున్నాను అనుకుంది ఆ అమ్మ. కాదు మహిళ. కాదు కాదు ఒక జీవని. -
హౌస్ మెయిడ్ నుంచి అసెంబ్లీకి...
సమాజంలో పెద్దగా పలుకుబడి లేదు... హోరెత్తించే ప్రచారాలూ లేవు.. ఆర్భాటాలూ లేవు.. ప్రతిపక్షాన్ని ఆరోపణలతో ఎండగట్టిందీ లేదు.. ఆర్థికంగానూ అంతంత మాత్రమే... నాలుగిండ్లల్లో పనిచేసుకుంటేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి.. అయినా నేడు తాను ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమే బెంగాల్‌కు చెందిన ఓ సాధారణ మహిళ కలితా మాఝీ తాను ప్రతి రోజూ ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రజల ముందుంచి.. వాటి వాటి పరిష్కారం కోసం పనిచేయడమే తన ముందున్న కర్తవ్యమంటూ తన విజయానికి బాటలు పరచుకొంది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే కలితా మాఝీ, ఇప్పుడు ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. ఆస్గ్రామ్ స్థానంలో కలితా మాఝీకి 1,07,692 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు.జీవితమంతా కష్టాలే...తూర్పు బర్దామన్ జిల్లాలోని గుస్కరా మున్సిపాలిటీ నివాసి అయిన కలితా మాఝీ ప్రయాణం కటిక పేదరికం నుంచి మొదలైంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్న పెద్ద కుటుంబం ఆమెది. తండ్రి దినసరి కూలీ కావడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వివాహం తరువాత కూడా ఆమె ఆర్థిక పరిస్థితిలో మార్పు రాలేదు. కలితా భర్త ప్లంబర్. అందువల్ల ఆమె గత రెండు దశాబ్దాలుగా పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ.. నెలకు రూ. 4,500 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు.2021లో ఓటమికలితా మాఝీ రాజకీయ ప్రయాణం రాత్రికి రాత్రి మొదలైంది కాదు. దాదాపు పదేళ్ల పాటు ఆమె ఓ సాధారణ కార్యకర్తగా కష్టపడింది. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. అప్పుడు టీఎంసీ అభ్యర్థి అభేదానంద థండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ 41 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఇపుడు మరోసారి ఆమె పార్టీ టికెట్‌ను పొందేలా చేస్తే.. ప్రజలతో ఆమెకున్న అనుబంధం భారీ విజయాన్ని సాధించిపెట్టింది.సమస్యలే ప్రచార అస్త్రాలుభారీ బహిరంగ సభలు, ఆర్భాటాలు లేకుండా కలితా మాఝీ ప్రచారం సాగింది. తాను అనుభవించిన కష్టాలనే ఓటర్ల ముందుంచింది. వైద్యంకోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, తాగునీటి ఎద్దడి, మహిళల భద్రత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేవలం ప్రభుత్వ పథకాలపై ఆధారపడటం కాకుండా, ప్రజలకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె గళం విప్పింది. అవినీతిపై ఆమె చేసిన సూటి విమర్శలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.అదే ఉత్సాహంతో...నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, నేను రెండు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ నెలకు రూ. 4,500 సంపాదిస్తున్నాను. నేను పని చేసుకోవడానికి వీలుగా నా అత్తగారు ఇంట్లో వంట పనుల్లో సహాయం చేసేవారు. నేను ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు ప్రజల కోసం కూడా పనిచేయడానికి అదే ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాను.ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలే నా లక్ష్యం. – కలితా మాఝీ -
రూ. 2 వేల నుంచి కోటి టర్నోవర్ దాకా : హోంమేకర్ సక్సెస్ స్టోరీ
ఒక గృహిణి తలచుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగగలదని నిరూపించిన లలితా పాటిల్ స్ఫూర్తి దాయక కథ ఇది. కేవలం రూ. 2,000 పెట్టుబడితో ప్రారంభించి, ఏడాదికి ఒక కోటి టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగారు థానేకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త లలితా పాటిల్. పదండి ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.మహారాష్ట్రలోని థానేకు చెందిన లలితా పాటిల్‌కు 20 ఏళ్లకే వివాహమైంది. వేణ్ణీల్లకు చన్నీళ్లు తోడు అన్నట్టు భర్తకు ఆసరాగా ఉండేందుకు, ఆర్థిక స్వతంత్రత కోసంట్యూషన్లు చెప్పడం, మందులు అమ్మడం లాంటి పనులు చేసింది. అయినా ఆశించిన ఫలితం రాలేదు. లలిత భర్త గ్యాస్ ఏజెన్సీ నడిపేవారు, కానీ ప్రభుత్వ పైప్‌లైన్ పథకం వల్ల ఆ వ్యాపారం దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఫిజిక్స్‌లో పట్టభద్రురాలైన లలిత, తాను ఎప్పుడూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావించేవారు. ఈ నేపథ్యంలోనే సమయం చూసి ఆమె పెద్ద సాహసం చేశారు.ఇదీ చదవండి: భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామంటిఫిన్ సర్వీస్ ప్రస్థానంఆ క్లిష్ట పరిస్థితుల్లో లలిత 2016లో కేవలం రూ. 2,000లతో టిఫిన్ బాక్సులు కొని, మరో రూ. 500లతో పాంప్లెట్లు ముద్రించి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. తన సంస్థకు 'ఘరాచి ఆఠవణ్' (Gharachi Athavan) అంటే 'ఇంటి జ్ఞాపకం' అని పేరు పెట్టారు. థానేలోని ఉద్యోగులు, విద్యార్థులనుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఇక్కడితో ఆమె పయనం ఆగిపోలేదు.టర్నింగ్ పాయింట్ ఒక ఏడాది తర్వాత, తనను కేవలం గృహిణిగా కాకుండా ఒక బిజినెస్ ఉమెన్‌గా నిరూపించుకోవాలని ఆమె తపించారు. కానీ పెట్టుబడికి డబ్బు లేదు. 2019లో బ్రిటానియా ఇండస్ట్రీస్ నిర్వహించిన స్టార్టప్ పోటీ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ పోటీలో విజేతగా నిలిచి రూ. 10 లక్షల ప్రైజ్ మనీని (పన్నుల తర్వాత రూ. 7 లక్షలు) అందుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు.చిన్న టిఫిన్ సెంటర్ నుంచి రెస్టారెంట్ దాకా2019, జూలైలో థానేలోని కోప్రి ప్రాంతంలో ఆమె సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించారు. ఇంటి రుచులతో కూడిన భోజనం, కేటరింగ్ మరియు టిఫిన్ సర్వీసులతో ఆమె వ్యాపారం శరవేగంగా విస్తరించింది. ఆమె విజయప్రస్థానాన్ని చూసి, భర్త కూడా తన పాత ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో తోడుగా చేరారు. మరో 10 మంది ఉపాధి కల్పించారు. ఫలితంగా ఆమె ఆదాయం నెలకు రూ. 6-7 లక్షలు సంపాదిస్తున్నారు. వార్షిక ఆదాయం రూ. 1 కోటికి చేరుకుంది."ఇంటి నుండి పనిచేసే మహిళను ఎప్పుడూ గృహిణిగానే చూస్తారు. ఆమె ఇంటి గడప దాటి బయటకు అడుగుపెట్టి, సమాజం 'ముఖ్యమైనది'గా భావించే ఏదైనా సాధించినప్పుడే ఆమె కష్టానికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి" -లలితా పాటిల్ -
చిరునవ్వుతో స్ఫూర్తిదాయక విజయం!
వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించింది శ్రీనగర్‌కు చెందిన జైనబ్ బిలాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాల్లో ఈ దృష్టి లోపం ఉన్న విద్యార్థిని ఏకంగా 95 శాతం మార్కులతో సత్తా చాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 500 మార్కులకు గాను జైనబ్ 475 మార్కులు సాధించింది. మరీ ముఖ్యంగా, ఆమెకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ అయిన కంప్యూటర్ సైన్స్‌లో 100కు 100 మార్కులు సాధించడం విశేషం.శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్థిని అయిన జైనబ్, ఈ విజయం ద్వారా ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి సహాయకునిపై ఆధారపడతారు. కానీ జైనబ్ ఎవరి సహాయం తీసుకోలేదు. నేరుగా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి పరీక్షలు రాసిన మొదటి అంధ విద్యార్థినిగా సరికొత్త చరిత్ర సృష్టించిందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.అంతేకాదు జైనబ్ బిలాల్ (zainab bilal) ఇతర రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తన 12వ ఏటనే రేడియో డీపీఎస్ కోసం మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నేను సాధించగలిగినప్పుడు, ఎవరైనా సాధించగలరు. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకం ఉంచి, వారికి అండగా నిలబడితే చాలు’ అంటూ తన ఉత్తీర్ణత సందర్భంగా జైనబ్ ఇచ్చిన సందేశం ఎందరికో స్ఫూర్తిదాయకం.మాటలు రావడం లేదుతనకు చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి వెళ్లాలని ఉందని జైనబ్ బిలాల్ తెలిపింది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటున్నట్టు ఆమె పీటీఐతో చెప్పింది. కాగా, చదువు పూర్తయ్యేంత వరకు అండగా నిలిచినందుకు తన పాఠశాలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది. అడుగడుగునా తోడుగా నిలిచిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు రావడం లేదని పేర్కొంది. చదవండి: సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే -
బెంగాల్ పోరులో ఒక సెన్సేషన్ కలితా మాఝీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సాధారణ డొమెస్టిక్ వర్కర్ (Domestic Worker) పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఇళ్లలో పాచిపని చేస్తూ అతి సాధారణ జీవనం సాగిస్తున్న ఆమె, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిమిత వనరులతో జీవిస్తున్న లక్షలాది మందికి బెంగాల్ ఎన్నికల్లో కలితా మాఝీ ఎంట్రీ స్ఫూర్తివంతంగా నిలుస్తోంది. నేటికీ ఆమె ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్, లేదా ఎయిర్ కండిషనింగ్ వంటి కనీస సౌకర్యాలు లేవు. అయినప్పటికీ, ఆమె నిరాడంబరత, అవిశ్రాంత పోరాటం ఆమెకు గుర్తింపును, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని సంపాదించిపెట్టాయి. ఒకప్పుడు నలుగురి ఇళ్లలో అలసిపోకుండా పాత్రలు కడిగిన అవే చేతులు, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, మార్చడానికి సిద్ధంగా ఉన్నాయిపశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ (Ausgram) నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 37 ఏళ్ల కలితా మాఝీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేదరికం నుండి వచ్చి, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, క్షేత్రస్థాయి నుండి ఎదిగిన నాయకురాలిగా గుర్తించిన బీజేపీ ఆమె రెండోసారి పోటీలో నిలపడం విశేషం. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఇదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2026లో కూడా పార్టీ ఆమెపై నమ్మకంతో మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఇంటింటి ప్రచారం నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఆమెకు భర్త (ప్లంబర్), ఒక కుమారుడు ఉన్నారు.ఆమె పనిచేసే ఇంటి యజమాని ప్రతీలాల్ పాత్ర మాట్లాడుతూ.. "ఆమె మాకు కూతురు లాంటిది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె పనికి వస్తానంది, కానీ మేమే ఆమెను ప్రచారానికి వెళ్లమని పంపించేశాం. ఆమె లేకపోవడంతో ఇంట్లో పనులు చేసుకోవడం మాకు కష్టమవుతోంది, కానీ ఆమె ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాం" అన్నారు. అంతేకాదు ఆమె ప్రచారంలో తలనమునకలై ఉన్నప్పటికీ, ఆమె యజమానులు ఈ నెల జీతాన్ని కూడా ఇస్తామని హామీ ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కుఎవరీ కలితా మాఝీఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన కలితా ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ, నెలకు సుమారు రూ.4,500 సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. కలిత తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో తాను పనిచేసే ఇళ్లలో కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. ఇపుడు ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. కలితా కుటుంబ మద్దతు కూడా బాగానే లభిస్తోంది. ఆమె అత్తగారు ఇంటి పనుల్లో సాయం చేస్తుండగా, ఆమె కుమారుడు పార్థ తన తల్లి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కలిత బావ కార్తీక్ బాగ్ 2006లో ఇదే నియోజకవర్గం నుండి సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆ కుటుంబంతో వీరికి ఎటువంటి సంబంధం లేదు.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్‌కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు"నాలాంటి ఒక సామాన్య మహిళ కూడా ఎమ్మెల్యే కాగలదని నిరూపించాలనుకుంటున్నాను. గెలిచిన తర్వాత నాలాంటి పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడతాను" అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్మికురాలు ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. కలిత గెలుపు కోసం మే 4 వరకు ఎదురు చూడాల్సిందే. కాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 91.78శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంఓలని అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీదీని ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ, షాలు తీవ్రప్రయత్నాలు చేయగా, నాలుగోసారి సీఎం పదవే తనదేనని దీదీ ధీమాగా ఉన్నారు. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఇదీ చదవండి: బంపర్ ఆఫర్ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు -
కార్పొరేట్ జాబ్ వదిలేసి 50 ఏళ్ల వయసులో కోట్ల డాలర్ల కంపెనీ
50 ఏళ్లు రాగానే చాలామంది ఇక కష్టపడింది చాల్లే రిటైర్మెంట్ తీసుకుందాం అని ఆలోచిస్తుంటారు. కానీ కాథరిన్ బ్రికెన్ మాత్రం ఇందుకు భిన్నం. 50 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించడమేకాదు, కోట్లాది డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎంతటి కష్టాలనైనా జయించి విజయం సాధించవచ్చని నిరూపించిన కేథరీన్ స్టోరీ తెలుసుకుందాం.లండన్‌కు చెందిన కాథరిన్ బ్రికెన్ తన ఉద్యోగాన్ని వదిలేసి, ఇంటి నుండే ఏదైనా పని చేయాలనుకుంది. మొదటి కాన్పులో కవలలు, ఆ తరువాత కొద్ది కాలానికే మరో బిడ్డ పుట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలా పిల్లలునిద్రపోయే సమయంలో కేకులు, కుకీలు తయారు చేయడం ప్రారంభించింది.2017లో 'డోలిషియస్' అనే బహుళ-మిలియన్ డాలర్ల స్నాక్ బ్రాండ్‌కు నాంది పలికింది.వ్యాపార ఆలోచన ఎలా పుట్టింది2008లో అమెరికా నుండి లండన్‌కు మారినప్పుడు, అక్కడ అమెరికన్ తరహా సాఫ్ట్ కుకీలు దొరకడం లేదని గమనించింది. అలాంటివే తాను తయారు చేసి విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా 2017లో50 ఏళ్ల వయసులో, 'డోలిషియస్' 'Doughlicious' అనే సంస్థను స్థాపించింది. వ్యాపారం ప్రారంభంలో ఆమె రోజుకు 20 గంటలు పని చేసేవారు. నిరంతరం పిండి కలపడం వల్ల ఆమె చేతి వేలి కీలు దెబ్బతిని, శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.బ్రెస్ట్ క్యాన్సర్2019లో ఆమెకు స్టేజ్-1 రొమ్ము క్యాన్సర్ సోకింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. సర్జరీ, రేడియేషన్ తీసుకుంటూనే వ్యాపారాన్ని నడిపించింది. అంతే కాదు వ్యాపారంపై ఉన్న ధ్యాస తన బాధను మర్చిపోయేలా చేసిందని తెలిపింది.ప్రస్తుతం ఆమె వయసు 59 ఏళ్లు. ఆమె గత ఐదేళ్లుగా క్యాన్సర్ నుండి విజయవంతంగా కోలుకుంది. అలాగే ఆమె బ్రాండ్ 'Doughlicious' ఇప్పుడు వారానికి 10 లక్షలకు పైగా కుకీలను ఉత్పత్తి చేస్తోంది. టెస్కో, హోల్ ఫుడ్స్, టార్గెట్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాల స్టోర్లలో ఆమె ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలుఅలుపెరుగని శ్రమ, ఎన్నో సవాళ్లుఅయితే తన సక్సెస్ అంత ఈజీగా రాలేదు అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది. అటు కేటరింగ్ పనులు చేయడం, కుకీలు తయారు చేయడం, ఇటు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రలేకుండా ఉండటం, మళ్ళీ ఉదయం 7 గంటలకు లేచి అమ్మగా బాధ్యతలు నిర్వర్తించడం తనకు ఒక సవాల్ గా ఉండేదని తెలిపారు. కానీ క్యాన్సర్ గురించి గానీ, లేదా నొప్పి గురించి గానీ ఆలోచించే సమయం లేకుండా తన సంస్థ తనకు ఎంతో మేలు చేసిందన్నారు. ఎందుకంటే తన గురించి తన వ్యాధి గురించి మథనపడటానికి అస్సలు సమయమే లేదు, తాను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనే విషయాన్ని తన బాధ్యత గుర్తు చేసిందని అదే తన విజయానికి బాటలు వేసిందంటారు కాథరిన్ బ్రికెన్ . ఇదీ చదవండి: రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ -
దాపుడు అరలో దాగిన గౌరవం..!
స్త్రీ జీవితంలో అనేక ఖాళీ అరలు ఉంటాయి. కాని స్త్రీ జీవితంలో తప్పక ఉండాల్సిన ఒక ‘దాపుడు అర’ గురించి ఎందరు ఆలోచిస్తారు? ‘తాయి కెళవి’ సినిమాలో ముసలవ్వ ఈ దాపుడు అర మాట్లాడుతుంది. ఆ ఒక్క అర ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో కూడా ఈ సినిమా చెప్పింది. ఇది అచ్చంగా ఒక బతుకు గోరే తల్లి కథ.‘తాయి కెళవి’ చూస్తే తెలుగు వారి గొప్పతనం తెలిసొస్తుంది. ఇది గతంలో అంటే 1990లోనే వచ్చిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ‘బతుకుగోరే తల్లి’, ఆర్.ఎం.ఉమామహేశ్వర రావు ‘బిడ్డలు గల్ల తల్లి’ కథలను గుర్తు చేస్తుంది. పైకి గయ్యాళులుగా కనిపించే ఆ తల్లులు బిడ్డల క్షేమం కోసం లోపల ఎంత దయాళువుగా ఉంటారో పై రెండు కథలు గొప్పగా చూపాయి. అవి సినిమాలుగా తీసి ఉంటే మన గొప్ప తెలిసేది. తమిళంలో ‘తాయి కెళవి’ (జేజమ్మ) గా తీయడం వల్ల ఆ పేరు వారికి దక్కింది.పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథలో ఇలాగే ఒక తల్లి ఉంటుంది. ఆమెను అందరూ ‘జేబు రమణమ్మ’ అని పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఆమె తన చిన్నప్పుడు ‘మగవాళ్లకు జేబు ఉన్నట్టుగా ఆడవాళ్లకు ఎందుకు ఉండదు’ అని ప్రశ్నిస్తుంది. మగవాళ్ల బలానికి, అహానికి జేబు కారణం అని, దాని నుంచి పుట్టే డబ్బు కారణమని జేబు రమణమ్మ అర్థం చేసుకుంటుంది. తను మరణించే వరకు తన ఆర్థిక స్వాతంత్య్రం గురించి నిర్లక్ష్యం వహించదు. అంతేకాదు, సొంత కోడలి పేర్న ఉన్న ఆస్తిని కొడుకు అమ్మడానికి చూస్తూ... అమ్మమని కోడల్ని బలవంతం చేస్తుంటే కోడల్ని వారించి ‘నీ ఆస్తి వాడికిచ్చావంటే నువ్వు బానిస బతుకు బతకాల్సి వస్తుంది’ అని చెప్పి, కొడుకు ఆగ్రహానికి గురయ్యి చావు కొని తెచ్చుకుంటుంది. మగవాళ్లు ఆడవాళ్లకు డబ్బు అందనివ్వరు. వారి దగ్గర ఉన్నది లాక్కునే దాకా ఊరుకోరు.‘తాయి కెళవి’ పాత్ర పోషించిన రాధిక ఈ లోకరీతిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మన దగ్గర పైసలు ఉంటే లోకం మన ముఖం చూస్తుంది, ఖాళీచేతులు ఉన్నవారిని ఈసడిస్తుంది అని గ్రహిస్తుంది. డబ్బు లేనప్పుడు దయచూపని లోకంతో దయగా వ్యవహరించాల్సిన పని లేదనుకుంటుంది. అందుకే కఠినంగా వడ్డీ వసూలు చేస్తుంటుంది. ‘సుఖంగా బతకడానికి డబ్బు కావాలో వద్దో తెలియదు గానీ గౌరవంగా బతకడానికి డబ్బు కావాలి’ అంటుంది. అందుకై మంచంలో ఒక రహస్య అరను ఏర్పాటు చేసుకుంటుంది. పైసా పైసా దాచి ఆ డబ్బుతో బంగారం కొని అదంతా ఆ అరలో భద్రం చేసుకుని ఉంటుంది. ప్రతి స్త్రీకి, గృహిణికి ఈ రహస్య అర అవసరం ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది.తాయి కెళవి కుమార్తె సురళిని మొగుడు మూడు తులాల బంగారం ఇవ్వలేదని వదిలేసి ఉంటాడు. అతను కూతురిని పీడించుకుని తింటున్నాడని రాధిక గ్రహిస్తుంది. సహించడం త్యాగం కాదు, బానిసత్వం ఆమె దృష్టిలో. అందుకే కూతురిని తన దగ్గర ఉంచుకుని స్వేచ్ఛాజీవిగా మారుస్తుంది. తల్లిగా తన దగ్గర డబ్బు లేక΄ోతే దీనమైన మాటలు చెప్పి భర్త దగ్గరకు పంపేదేమో. కాని ఈ తల్లి దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూతురికి కొత్త జీవితం ఇవ్వగలదు. అందుకే నీచుడైన అల్లుడితో విడాకులు ఇప్పించి రెండో మనువు చేస్తుంది. సొంత డబ్బు కలిగి ఉన్న తల్లికి వచ్చే ధైర్యం ఎలాంటిదో ఈ సినిమా చూపి దోవను సంకేతం చేస్తుంది.‘చదువుకోండి. దానితోపాటు సంపాదించడం నేర్చుకోండి. మీ పర్సులో ఉన్న నాలుగు నోట్లే మీకు రక్షణ. మీ జీతమే మీకు స్వేచ్ఛ. మీరు డబ్బు దాచిన అర మీ పిల్లల జీవితాలు సరిదిద్దే మంత్రదండం’ అని నాలుగు తిట్లు కలిపి మరీ చె΄్తోంది ‘తాయి కెళవి’.– కె.(చదవండి: పెరిమెనోపాజ్ ఎఫెక్ట్: ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!) -
ఉ‘మెన్’కోసమే!
స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారిపట్ల సమాజ ధోరణి వేగంగా మారాలన్నా, వేధింపులు తగ్గాలన్నా ముందు పురుషుల్లో మార్పురావాలి. దానికోసమే ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి చారు సిన్హా. డీజీపీగా పదోన్నతి పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో చారు సిన్హా మాటామంతి.‘‘ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం ‘సేఫ్ మొబిలిటీ ఇనీషియేటివ్’ను నిర్వహించాం. దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా అనేక విద్యాసంస్థలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారితో సంభాషించాం. విద్యార్థినులు 90 శాతం, స్వయం సహాయక సంఘాల సభ్యులు 100 శాతం ప్రయాణ సమయంలో వేధింపులకు గురయ్యారని తెలిసింది. బస్సులు, మెట్రోలు, రైళ్లల్లో వీరిని అసభ్యంగా తాకడం, అత్యంత హేయంగా మాట్లాడటం ఆ వేధింపుల్లో భాగం. ఈ వేధింపుల భయంతో అనేకమంది విద్యార్థినులు తాము ప్రయాణించే మార్గం, వినియోగించే రవాణా, రాకపోకల సమయాలు మార్చుకున్నారు. మా అధ్యయనం ప్రకారం ప్రయాణ సమయంలో మహిళలు 20 రకాల వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.సైబర్‌లోనూ డాడులే!ఒకప్పుడు మహిళలకు ఇంట్లో, వీధిలో, విద్యాసంస్థలు, పనిప్రదేశాల్లోనే వేధింపులు ఉండేవి. సోషల్‌మీడియా విస్తరణ తర్వాత ఇది ఆన్లైన్కూ పాకింది. ఏదైనా అంశానికి సంబంధించి ఓ మహిళ పోస్టు పెడితే... వారిపై వేలమంది కామెంట్లతో దాడి చేస్తున్నారు. ఈ సైబర్ మాబ్ అబ్యూజ్ విషయంలో పోలీసులూ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు. కేవలం అసభ్యకరమైన కామెంట్లు ఉండే మాత్రమే కేసు నమోదు తదుపరి చర్యలకు ఆస్కారం ఉంటుంది. మహిళల మనసును గాయపరిచే వారిలో అసభ్యతతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. దీనికితోడు ఓ పోస్టుకు వేల కామెంట్లు ఉన్నప్పుడు అందరిమీదా చర్యలు తీసుకోవడం ఆచరణ సాధ్యం కాని విషయం.పురుషుల్లో మార్పు రావాలిమహిళలను వివిధ రకాలైన వేధింపులకు గురి చేస్తున్న వారికి అది అలవాటుగా మారింది. కనీసం అది తప్పని కూడా తెలియట్లేదు. ఇప్పటివరకు మహిళల భద్రతకు సంబంధించి అనేక క్యాంపెయిన్స్ జరిగాయి. అవన్నీ స్త్రీలలో అవగాహన కల్పించడానికి ఉద్దేశించినవే. అయితే సమాజంలో ఉన్న పురుషుల్లో మార్పు తీసుకువస్తేనే ఈ సమస్య తీరుతుంది. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా పోకిరీ యువతి లేదా మహిళకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే... అదేబస్సులో ఉన్న ఎవరైనా అడ్డుకోవాలి. ఘర్షణ, దాడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం నిలువరిస్తే మరోసారి ఆ పోకిరీ అలాంటి పని చేయడానికి ఆలోచిస్తాడు. దీంతోపాటు ఎవరికి వారుగా మహిళలను గౌరవించడం, వారి ఆత్మాభిమానాన్ని గుర్తించడం అలవర్చుకోవాలి. దీనికోసమే ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్ ప్రారంభించాం’’ అని చెప్పారు చారు సిన్హా.వర్శిటీల్లో చర్చలుఈ క్యాంపెయిన్ ఏడాది పాటు చేస్తాం. సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో కలిసి ప్రతి నెలా ఒక్కో థీమ్‌తో ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇందులో భాగంగా నాలుగు వీడియోలు, ఒక ప్యానల్ డిస్కషన్ నిర్వహిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం (జూన్, జులై) నుంచి యూనివర్శిటీలకు వెళ్లనున్నాం. ప్రతి వర్శిటీలో ప్రొఫెసర్ల నేతృత్వంలో గ్రూపులు ఏర్పాటు చేసి మేము రూపొందించిన వీడియోలు చూపించి ప్యానల్ డిస్కషన్ పెడతాం. ఆపై ఏది గుడ్ బిహేవియర్, ఏది బ్యాడ్ బిహేవియర్ గుర్తింమని వారినే అడుగుతాం. ఇలా యువతరం నుంచే బాధ్యత పెంచి... వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తాం. – చారు సిన్హా, డీజీ – సీఐడీ, ఏసీబీ, మహిళ భద్రత విభాగాల చీఫ్– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
ఫేక్ అయితేనేం... ఫేమ్ అయ్యింది!
సమాజం సవ్యంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాల కోసం పిల్లల పెంపకం నుంచి ఇంటిపనుల వరకు మహిళలు ఎంతో శ్రమిస్తారు. తల్లుల కష్టమే కుటుంబ రథానికి ఇంధనం అవుతుంది. అయితే వారి శ్రమ ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. పైగా... ‘పురుషులు బయటకి వెళ్లి కష్టపడతారు. స్త్రీలు ఇల్లు కదలకుండా సుఖంగా ఉంటారు’ అనే ప్రచారం ఒకటి. వారి శ్రమకు వెల కట్టేవారు లేరు. వారి శ్రమ కనిపించని శ్రమ అయింది. తాజా విషయానికి వస్తే.,...‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్‌లో ఉందని చెబుతుంటారు.‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టే శిల్పం ఇది. జోస్ లూయిస్ ఫెర్నాండేజ్ రూపొందించారని చెబుతున్న ఈ శిల్పంలో... ఒకవైపు పిల్లలను చేతిలో పట్టుకొని, మరోవైపు... చీపురు, వాషింగ్ మెషిన్, బకెట్‌లాంటి ఇంటిబరువును వీపున మోస్తున్న స్త్రీ కనిపిస్తుంది. ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను వీపుపై మోస్తున్న ఈ స్త్రీ శిల్పం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అసలు విషయం ఏమింటే, ఇలాంటి శిల్పం నిజంగా లేదు. పూర్తిగా కల్పితం. అయినప్పటికీ ఈ కల్పిత శిల్పం విపరీతంగా వైరల్ అయింది. లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకొని ‘వైరల్ స్టాచ్యూ’ గా పేరు తెచ్చుకుంది. ‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్‌లో ఉందట! ‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్నిబద్దలు కొట్టే శిల్పం ఇది. -
కుంగిపోలేదు... రంగుల బాట పట్టింది
ఆమె దివ్యాంగురాలు.. దానికితోడు భర్త మరణించాడు. ఎదిగిన కొడుకు ప్రమాదంలో కన్నుమూశాడు. కష్టపడి పెళ్లి చేస్తే... కూతుర్ని కాస్తా అల్లుడు వదిలేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె మాత్రం జీవితం నుంచి పారిపోలేదు.. వైకల్యాన్ని ధైర్యంగా ఎదిరిస్తూ.. పెయింటింగ్ పనులను గుత్తకు తీసుకుని శెభాష్ అనేలా పని చేయిస్తోంది. ఆమే కరీంనగర్‌లోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ములిగె బాలవ్వ.బాలవ్వ పుట్టినిల్లు సిరిసిల్ల. గోపాల్‌రావుపల్లెకు చెందిన శంకరయ్యతో 40 ఏళ్ల కిందటే పెళ్లి అయింది. భర్తతో పాటు సున్నం వేసే పనికి వెళ్లేది. బాలవ్వ, శంకరయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక్క కొడుకు, ఒక బిడ్డ. భర్తతో కాపురం సాగుతుండగా.. శంకరయ్య గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆమెను కుంగదీసినా.. కుటుంబ భారాన్ని మీదేసుకుని భర్త చేసిన పనిలోనే కొనసాగుతూ.. పెయింటింగ్ పనిలో చేరి కొడుకు నాగరాజు, కూతురు సంధ్యలకు పెళ్లి చేసింది.→ వెంటాడిన విధి..పెయింటింగ్ పని చేస్తూ.. జీవిస్తున్న బాలవ్వను విధి వెంటాడింది. పని చేసే చోటి నుంచి కింద పడడంతో కాలు విరిగి దివ్యాంగురాలైంది. అయినా సరే, కుంగిపోలేదు. మెతుకువేటలో.. బతుకుబాటలో మళ్లీ పెయింటింగ్ పని చేపట్టింది. ఇంతలో కొడుకు నాగరాజు సెంట్రింగ్ పనిలో ఉండగా ప్రమాదవశాత్తూ కింద పడి తలపగిలి మరణించాడు. నాగరాజు భార్య, ఇద్దరు పిల్లలు ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. వాటిని అధిగమించి వారు ఇప్పుడు వేరుగా జీవిస్తున్నారు. కూతురు సంధ్యను ఖమ్మం ఇవ్వగా.. అతను ఆమెను వదిలేయడంతో సంధ్య ఒంటరిగానే ఉంటోంది. ఇన్ని సమస్యల మధ్య బాలవ్వ మాత్రం మొక్కవోని ధైర్యంతో తనకున్న చిన్న ఇంట్లో ఒంటరిగానే జీవిస్తూ.. నిత్యం పెయింటింగ్ పని చేస్తూ.. కష్టాలను ఎదురిస్తోంది.→ కష్టమైన పనిలో రాణిస్తూ...పెయింటింగ్ పని చాలా కష్టంగా ఉంటుంది. భవనం పైకి ఎక్కాలి.. జోలె కట్టుకుని రంగులు వేయాలి. అయినా భయపడదు.. పెద్ద ఇళ్ల పనులను కాంట్రాక్టు తీసుకుంటూ.. ఇతర లేబర్లను తోడుగా తీసుకెళ్తూ... పనిని సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తుంది. దివ్యాంగురాలైన బాలవ్వకు ప్రభుత్వం ఆరు నెలల కిందట మూడు చక్రాల ఈ–బైక్ ఇచ్చింది. ఆ బైక్‌పై ప్రయాణం చేస్తూ... ఉపాధి పొందుతుంది.మంచి రోజుల్లోనే పని ఎక్కువగా ఉంటుందిదసరా నుంచి ఉగాది వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్న రోజుల్లో పని చేతినిండా ఉంటుంది. ఇతర రోజుల్లో అందుబాటులో ఉన్న పనులు చేస్తూ.. ΄పొట్టపోసుకుంటా. నాకు ప్రభుత్వం ద్వారా చేయూత పెన్షన్ నెలకు రూ.4వేలు వస్తుంది. ప్రభుత్వం ఈ–బైక్ ఇవ్వడంతో నా కష్టాలు కొంత తీరినయి. నేను పనిని గుత్త(కాంట్రాక్టు) తీసుకుని ఓ నలుగురికి పని కల్పిస్తూ.. జీవనం సాగిస్తున్నా... కాలు మంచిగ లేకున్నా.. తోడు ఎవరూ లేకున్నా... పని చేస్తూ బతుకడమే జీవితం. – ములిగె బాలవ్వ, దివ్యాంగురాలు – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల– ఫొటోలు: వంకాయల శ్రీకాంత్,స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిరిసిల్ల -
హండ్రెడ్స్ ఆర్ వెయిటింగ్
ఒక మహిళ గర్జన ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తోంది. రాజకీయ ర్యాలీలు, నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేసి, స్కూల్ పిల్లలను, అంబులెన్స్ లను, ఆఫీస్‌కి వెళ్లే వాళ్లను గంటలు గంటలు ఆపేయడం మామూలైపోయిన ఈ రోజుల్లో ఒక నిరసన స్వరం దేశానికి తన బాధ్యతను గుర్తు చేస్తోంది. ‘ఎవరూ మాట్లాడరులే’ అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా ఉన్న వారికి ‘సామాన్యులతో పెట్టుకోకు’ అని ఈ ఘటన చెప్పినట్టయ్యింది.అసలేం జరిగింది?ఏప్రిల్ 22, మంగళవారం ముంబైలోని వర్లీలో బిజెపి పార్టీ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించింది. దాంతో వర్లీ జంభోరీ మైదాన్ నుంచి డోమ్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక స్థానిక మహిళ తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తూ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. విసుగెత్తి పోయిన ఆవిడ కారు దిగి, నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో వాగ్వాదానికి దిగింది. ‘గెట్ అవుట్ ఆఫ్ హియర్! మీరు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నారు’ అని నిలదీసింది. ‘వందలమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా’ అని పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చూపిస్తూ గట్టిగా అరిచింది. పోలీసులు జోక్యం చేసుకోబోతే వాళ్ల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ‘సీనియర్ ఆఫీసర్స్తోనే మాట్లాడతా’ అని తెగేసి చెప్పింది. మంత్రి మహాజన్ సర్ది చెప్పబోయినా ఆవిడ వినలేదు. వెళ్లి మళ్లీ వచ్చి ‘మీకు అర్థం కాలేదా? వందల మంది వెయిట్ చేస్తున్నారు’ అని మళ్లీ గట్టిగా అడిగింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీఐపీ కల్చర్‌కి చెక్ పెట్టాలని చాలామంది కోరుతున్నారు. నగరాల్లో అసలే ట్రాఫిక్ జామ్‌లతో బాధ పడుతున్న జనం ఈ ర్యాలీలు, ప్రదర్శనల వల్ల మరెంత అవస్థ పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. జనం ఆగ్రహం ఇలా కట్టలు తెంచుకోక ముందే పాలనా వ్యవస్థలు మేలుకోవాలి. -
అక్షరాలా ఆమె కోసం...
పుస్తకాల రూపంలోని మహిళల క్రియేటివిటీని సెలబ్రేట్ చేసే పండగ, ప్రతిష్ఠాత్మకమైన... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షకు అడ్డుకట్ట వేసి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించి, ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పాటైన అపురూపమైన బహుమతి... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. ఈ సంవత్సరం విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ లాంగ్‌లిస్ట్‌కు ఎంపికైన పదహారు పుస్తకాలలో కొన్ని పుస్తకాల పరిచయం...గోడలు కూలుతున్నాయి...జీవితాలు మారుతున్నాయిషీనా కలయిల్ రాసిన హృదయాన్ని కదిలించే నవల... ది అదర్స్. అది 1989 సంవత్సరం. తూర్పు జర్మనీలోని డాయిష్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో విభిన్న నేపథ్యాలు ఉన్న ముగ్గురు యువతీ యువకులు స్నేహితులవుతారు. మొజాంబిక్‌కు చెందిన ఆర్మాండో ఫ్యాక్టరీ కార్మికుడు. లోలిత భారతదేశానికి చెందిన వైద్యవిద్యార్థిని. థియో తూర్పు బెర్లిన్‌కు చెందిన యువకుడు. రచయిత కావాలని కలలు కంటుంటాడు. తూర్పు ఐరోపా అంతటా నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తుండగా ఈ ముగ్గురి జీవితాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలే... ది అదర్స్.కాసింత ప్రేమ కోసం...పందొమ్మిదేళ్ల గ్లోరియా కాలేజీకి వెళ్లదు. మరి ఏం చేస్తుంది? పార్కుల చుట్టూ తిరుగుతుంది. స్నేహితుల కోసం వెదుకుతుంది. రోజూ జాక్ ఇంటికి వెళుతుంటుంది. ఈ జాక్ ఉన్నట్టుండి అనూహ్యంగా ప్రవర్తిస్తాడు. లోకం మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఒక హింసాత్మక సంఘటన తరువాత గ్లోరియా, జాక్‌ల స్నేహం ముగిసిపోతుంది. గ్లోరియా ఒంటరిదైపోతుంది. ఈ హింసాత్మక ప్రపంచంలో అనుబంధాలు, కాసింత ప్రేమ కోసం ఆరాటపడే ఒక మహిళ అంతరంగాన్ని లోతుగా చిత్రించే నవల... గ్లోరియా డోంట్స్పీక్. ‘లూసీ యాప్స్ రాసిన గ్లోరియా డోంట్ స్పీక్ ఒక అద్భుతమైన పుస్తకం. హింస, దోపిడి, స్వీయనిర్ణయాధికారం... మొదలైన అంశాలతో రాసిన శక్తిమంతమైన పుస్తకం’ అన్నారు విమర్శకులు.చరిత్రపై ఫ్లాష్లైట్యుద్దం తరువాత జపాన్ పరిస్థితి, అమెరికాలోని శివారు ప్రాంతాలు, ఉత్తర కొరియా పాలన... ఇలా 20వ శతాబ్దపు పరిణామాలకు సాక్షిగా నిలిచిన ఒక కుటుంబంపై రాసిన పుస్తకం... ఫ్లాష్‌లైట్. కొరియా నుండి అమెరికాకు వలస వచ్చి అమెరికన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే సెర్క్, అతడి పదేళ్ల కూతురు లూయిసా, సెర్క్ భార్య ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రలు. లూయిసా తండ్రి అదృశ్యం కావడం ఆ చిన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. సుసాన్ చోయ్ రాసిన ‘ఫ్లాష్‌లైట్’ ఒక కుటుంబం చుట్టూ తిరిగే చారిత్రక పుస్తకం. అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూ ఆసక్తిని రేకెత్తించే పుస్తకం.ఉత్తరాలమ్మ‘ఉత్తరాలు రాయడానికే జన్మించిందా!’ అన్నట్లుగా ఉంటుంది సిబిల్ వాన్. ప్రతి ఉదయం ఉత్తరాలు రాయడానికి కూర్చుంటుంది. తన సోదరుడికి, ప్రాణస్నేహితురాలికి, విశ్వవిద్యాలయ అ«ధ్యక్షుడికి, తన అభిమాన రచయితల తాజా పుస్తకాలపై అభి్రపాయాన్ని తెలియజేయడానికి ఉత్తరాలు రాస్తుంటుంది. డెబ్బై మూడు సంవత్సరాల సిబిల్ చమత్కారమైన, వివేకవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వర్జీనియా ఇవాన్స్ రాసిన ‘ది కరస్పాండెంట్’ ఒక వృద్ధ మహిళ దృష్టి కోణం నుంచి ఉత్తరాల రూపంలో వినూత్నంగా, భావోద్వేగ తీవ్రతతో రాసిన నవల. ‘సిబిల్ ఉత్తరాలు అసాధారణమైనవి కాకపోవచ్చు. అయితే మీకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో ఆమె ఒకరు కావచ్చు’ అన్నారు విమర్శకులు.దొంగా... సంరక్షకులు!ఒక వారం వ్యవధిలో సాగే పరిణామాలతో ‘ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్’ రెండు కథలను చెబుతుంది. మా, బూంబా అనే రెండు పాత్రల కేంద్రంగా నడిచే పుస్తకం ఇది. ఈ రెండు పాత్రలు తమ కుటుంబం కోసం ఒకే సమయంలో సంరక్షకుడిగా, దొంగగా ప్రవర్తిస్తాయి. తన కుటుంబాన్ని పోషించాలనే ఆరాటం బూంబాను దొంగగా మారుస్తుంది. వరుస నేరాలకు పాల్పడేలా చేస్తుంది. ప్రగాఢమైన తల్లిదండ్రుల ప్రేమ, మెరుగైన జీవితం కోసం ఆరాటం, లోపిస్తున్న నైతిక విలువల చుట్టూ తిరిగే నవల ఇది. తమ ప్రియమైన వారిని రక్షించుకునే నేపథ్యంలో నిస్సహాయ పరిస్థితులు ప్రజలను విలన్ లేదా హీరోగా ఎలా మారుస్తాయో ఈ నవల కళ్లకు కడుతుంది. ‘మేఘా మజుందార్ రాసిన ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్ మానవజాతి నైతిక సందిగ్ధతల గురించి పాఠకులను నిరంతరం సవాలు చేసేలా రాసిన అద్భుతం పుస్తకం’ అన్నారు విమర్శకులు.లింగ వివక్ష ను నివారించడానికి...మహిళల రచనలను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలి, కొత్త గొంతులను ప్రపంచానికి పరిచయం చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులను ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే లక్ష్యంతో ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ ప్రారంభమైంది. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షను నివారించడానికి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి యూకేలో 1996లో ఈ పురస్కారానికి శ్రీకారం చుట్టారు. విజేతకు నగదు బహుమతితోపాటు కళాకారిణి గ్రిజెల్ నివెన్ తయారు చేసిన ‘బెస్సీ’ అనే కాంస్య విగ్రహాన్ని ప్రదానం చేస్తారు. బాగా పుస్తకాలు చదివే, వివిధ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న అయిదుగురు మహిళలతో కూడిన ప్యానెల్ ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ విజేతను ఎంపిక చేస్తుంది. లాంగ్‌లిస్ట్‌కు ఎంపికైన పుస్తకాలలో కొన్ని షార్ట్ లిస్ట్‌కు ఎంపిక అవుతాయి. షార్ట్ లిస్ట్ నుంచి విజేతను ఎంపిక చేస్తారు. -
లైఫంతా టెస్ట్ ఇంటర్లో బెస్ట్
అప్పుల బాధతో....తండ్రి ఆత్మహత్య. పద్దెనిమిదేళ్లకే కుటుంబ బాధ్యత. పెళ్లయిన రెండేళ్లకే కన్నుమూసిన భర్త విషాదం తట్టుకోలేక... పక్షవాతానికి గురైన తల్లి. జీవితమే పరీక్షగా మారింది. చేతిలో పసిబిడ్డతో ఆ పరీక్షలో నెగ్గడానికి మళ్లీ చదువు బాట పట్టింది హిమబిందు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న పేదింటి బిడ్డ హిమబిందు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించింది. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తోంది.డాక్టర్ కావాలనేది తన చిన్నప్పటి కల. దర్జీ పనులు చేసుకునే తండ్రి బట్టలు కొలిచే టేప్ మెడలో వేసుకుంటే, ఆదే టేప్ తాను వేసుకొని ‘ఇది నా స్టెతస్కోప్’ అని సంబరపడేది హిమబిందు. ‘కచ్చితంగా నువ్వు డాక్టరవుతావు బిడ్డా’ అని ఎప్పుడూ ఆశీర్వదించే తండ్రి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతలను తల్లి భుజాన వేసుకుంది. పద్దెనిమిది సంవత్సరాల వయసులో హిమబిందుకు పెళ్లి చేసింది. పెళ్లి అయిన రెండేళ్లకు అప్పుల పాలైన బిందు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం తట్టుకోలేని తల్లికి పక్షవాతం వచ్చింది.→ దుఃఖసముద్రంలో...ఒకవైపు అనారోగ్యంతో తల్లి, మరోవైపు పసిబిడ్డ... దుఃఖసముద్రంలో మునిగిపోతున్నట్లుగా అనిపించింది హిమబిందుకు. అయినా ఆ విషాదాన్ని తట్టుకొని నిలబడింది.‘ఎన్ని కష్టాలు వచ్చినా చదువుకోవాల్సిందే’ అని గట్టిగా అనుకుంది హిమబిందు. మళ్లీ చదువు కొనసాగించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించి డాక్టర్ కావాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతోంది తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నడివాడకు చెందిన దుస్సా హిమబిందు.→ ఎంత కష్టమైనా..‘ఇంటర్లో తెచ్చుకున్న మార్కులు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం... నీట్. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేరవుతున్నాను. దాతలు సహకరిస్తే నా లక్ష్యానికి త్వరగా చేరగలననుకుంటున్నాను’ అంటోంది హిమబిందు.కన్నీళ్లు దిగమింగుతూ.. కాలేజీకి..చిన్నతనంలోనే తండ్రి, పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే 11 నెలల పసిపాపను చేతిలో పెట్టి భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు తల్లి ఆనారోగ్యానికి గురైనా తన లక్ష్యం మాత్రం మరచిపోలేదు హిమబిందు. అటు తల్లిని, ఇటు బిడ్డనూ చూసుకుంటూ పెళ్లితో ఆగిపోయిన ఇంటర్ చదువును మళ్లీ మొదలు పెట్టింది. లెక్చరర్లు, తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి వెయ్యి మార్కులకు 985 మార్కులు సాధించింది. ఇప్పుడు నీట్ పరీక్షకు సిద్ధం అవుతోంది. – ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ఫొటో: మురళీ మోహన్ -
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్‌లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్‌గా కారు నడుపుతుంది. ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.→ మొదటి గోవా అమ్మాయిభువనేశ్వర్లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్‌లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్‌గా మహారాష్ట్రకు చెందిన రజ్నందిని పవార్, రెండో రన్నరప్‌గా జమ్మూ కశ్మీర్‌కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సాధ్వీ సతీష్ ఈ టైటిల్‌ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.→ నాన్న ప్రోత్సాహంఅమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.→ సోలో ట్రావెలర్‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్‌గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.→ బ్యూటీ విత్ ఏ పర్పస్మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం. -
ఆశాకు ఆమె నేర్పిన షాహీ కబాబ్
ఆశా భోంస్లేకు దుబాయ్, కతార్, సింగపూర్, యూరప్‌లలో ‘ఆశాస్’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. అన్నింట్లోనూ ఒక పదార్థం చాలా గిరాకీ. దాని పేరు ‘షాహీ కబాబ్’. మెనూ తెరిస్తే షాషీ కబాబ్ పక్కన చిన్న అక్షరాల్లో ‘లెర్న్›్ట ఫ్రమ్ మిసెస్ మజ్రూ సుల్తాన్ పురి’ అని ఉంటుంది. ప్రఖ్యాత సినీ కవి మజ్రూ శ్రీమతి బేగంజీ నేర్పిన షాహీ కబాబ్ రెసిపీ ఆశాకు ఒక పెద్ద వరంగా మారింది. ఆ వంట మహత్యం కథ ఇది.ఆశా రికార్డింగ్స్‌తో బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి పిల్లలకు ఏదో ఒకటి వండి పెట్టాలని తల్లిగా కోరుకునేది. ఒక్కోసారి వీలయ్యేది కాదు. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చేసరికి చిన్న కుమారుడు ఆనంద్ చాలా హుషారుగా ఉన్నాడు. ‘ఏంట్రా’ అని అడిగితే బజారులో కబాబ్ తిన్నాడట... అది తినడం మొదటిసారట... ‘చాలా బాగుంది... ఇక మీదట దానిని చేసి పెడుతుండు’ అని అడిగాడు. కాని ఆశాకు కబాబ్ చేయడం రాదు. కబాబ్ చేయడం ఎవరు నేర్పిస్తారా అని ఆలోచిస్తే మజ్రూ సుల్తాన్‌పురి శ్రీమతి గుర్తుకొచ్చింది. మజ్రూ స్నేహితులు, బంధువులు అందరూ ఆమెను ‘బేగంజీ’ అని పిలుస్తారు. బేగంజీకి ఫోన్ చేసి ‘నా కొడుకు కోసం కబాబ్ ఎలా చేయాలో నేర్పిస్తావా?’ అని అడిగింది ఆశా. ‘ఓ అదెంత సేపు... ఇంటికి రా’ అని పిలిచింది బేగంజీ.అలా మజ్రూ ఇంటికి నాలుగైదుసార్లు వెళ్లిన ఆశా ‘కబాబ్’ చేయడం నేర్చుకుంది. అయితే ఆమెకు మెల్లగా ఒక విషయం అర్థమైంది. ముంబైలో ఆ తర్వాత ఎన్నోచోట్ల ఆశా కబాబ్ ట్రై చేసినా మజ్రూ శ్రీమతి చూపించిన కబాబ్ రుచి వేరు బయట బజారులో దొరుకుతున్న కబాబ్ రుచి వేరు. ఏంటా అని ఆలోచించి మళ్లీ మజ్రూ ఇంటికి వెళ్లింది ఆశా. అప్పుడు బేగంజీ నవ్వేసి ‘ఆశా... నీకు నేర్పింది షాబీ కబాబ్. అది కేవలం లక్నోలో ఉండే కొందరు నవాబుల ఇళ్లల్లోని స్త్రీలకు మాత్రమే తెలిసిన రెసిపీ. ఆ రెసిపీ రహస్యాన్ని నీకు చెప్పాను’ అంది. షాహీ అంటే బాదుషాహీ... రాజస అని అర్థం. అలనాడు ఒక లక్నో నవాబు గారికి నోట్లో పళ్లు లేకపోతే నోట వేయగానే మెత్తగా కరిగిపోయే షాహీ కబాబ్‌ను వంటవాళ్లు కనిపెట్టారట. అలా పుట్టిందా కబాబ్. దాని రెసిపీ బేగంజీ దయ వల్ల ఆశా వశమైంది.బేగంజీ ఆశాకు నేర్పిన పాఠం ఏమిటి? ‘ఆశా... కబాబ్ చేయడానికి కావాల్సింది మసాలా కాదు... సబర్. అంటే ఓర్పు. రాత్రంతా మాంసాన్ని మసాలాలో నానబెట్టాలి. మెత్తగా రుబ్బిన జీడిపప్పు, గసగసాలు, దహీ, పచ్చి బొప్పాయి... ఇవన్నీ కలిపి 12 గంటలు ఊరనివ్వాలి. తొందరపడితే రుచి రాదు. పాటలాగే వంట కూడా సాధన చేస్తేనే వస్తుంది’ అని చెప్పిందామె. తర్వాతి రోజుల్లో ఆశా చేసిన షాహీ కబాబ్‌లు తిన్న భర్త, సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ ‘ఆశా... నువ్వు పాడటం మానేసినా పర్లేదు. కబాబ్‌లు చేస్తూ బతికేయొచ్చు’ అనేవాడు. ఆశా ఇంట్లో పార్టీ జరిగితే మెనూలో షాహీ కబాబ్ తప్పనిసరి. అక్కాచెల్లెళ్ల మధ్య ఎన్ని స్పర్ధలు ఉన్నా ఆశా చేసిన కబాబ్‌ని లతా ఇష్టపడేది. ఒకసారి లతాకి నలతగా ఉంటే ఆశా స్వయంగా షాహీ కబాబ్ చేసి పంపిందట. తిన్నాక లతా ఫోన్‌చేసి ‘చాలా బాగుంది’ అని ఒక్క మాట అందట. మాటల్లేని తమ మధ్య షాహీ కబాబ్ అలా మాట కలిపింది. అన్నట్టు కబాబ్ వెనక కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆశా చెప్పింది – ‘నేను బాధలో ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్తాను. కబాబ్ కోసం మసాలా దంచుతూ, ఉల్లిపాయ కోస్తూ ఏడుస్తాను. కన్నీళ్లు ఉల్లిపాయవే అని అందరూ అనుకుంటారు’ అని. ఏమైనా మజ్రూహ్ సుల్తాన్ పురి తన కలంతో అక్షరాలకు రుచి అద్దితే, ఆయన భార్య బేగంజీ కబాబ్‌కి రుచి అద్దింది. ఆ రుచిని ఆశా ప్రపంచమంతా పంచుతోంది. – కె -
ఆ నవవధువు ధైర్యానికి..అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్..!
ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శారీరక లోపం పైకే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా చులకనగా చూసేస్తాం. ఎక్కడో కొందరే మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి వాళ్లు పక్కనే ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఇట్టే జయించగలరు. ముఖ్యంగా తమలోని లోపాన్ని ఆనందంగా స్వీకరించి ధైర్యంగా నిలబడగలుగుతారు, స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకు నిదర్శనం ఈ నవవధువే. ఆమె కథ వింటే అందం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయే మహిమా ఘాయ్. ముంబైకి చెందిన మహిమ తన పెళ్లి రోజున జుట్టు లేకుండా వేడుకలోకి అడుగుపెట్టి..అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా అక్కడ ఎవ్వరు నవవధువు బట్టతలను చూడలేదు. ఆమె స్థైర్యం, ఆత్మవిశ్వాసం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. సహజత్వం గొప్పతనాన్ని చాటుతున్నట్లుగా అనిపించింది. అందం ప్రమాణాలకు అతీతమైనదని నిరూపించిన గొప్ప దృశ్యం అది. హుందాతనం, ఆత్మవిశ్వాసానికి మించిన సౌందర్యం ఇంకొకటి లేదని ఆ ఘటన నిరూపించింది. పెళ్లికూతురు అంటే ఇలానే ఉండాలనే అభిప్రాయాల్ని బేఖాతురు చేస్తూ వచ్చిన విధం అందర్నీ కట్టిపడేసింది. మహిమ అంత ధైర్యంగా అంత ముఖ్యమైన ఘట్టంలో అలా ఎలా కనిపించిందంటే..మహిమ కథేంటో తెలుసుకోవాల్సిందే..!.అంగీకరించక తప్పని పరిస్థితి..మహిమ చిన్నతనంలో అలోపేసియా బారిన పడింది. దాంతో జుట్టు ఊడిపోతుండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ తలపై జుట్టపెరగక మచ్చలు ఎక్కువవుతుండేవి. మళ్లీ జుట్టురావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఇంటి చికిత్సలు, వైద్య చికిత్సలు ఎన్నో చేయించుకుంది. ఏవి ఫలితం ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆమె కుటుంబం. చివరికి వైద్యులు ఆమె వ్యాధిని నిర్థారించారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. నవ్వు మాయమైన క్షణం..పెద్దయ్యే కొద్ది ఆత్మనూన్యత భావంతో తీవ్ర క్షోభని అనుభవించింది. తనలో తాను కుంగిపోవడం, తరచుగా ఎవరు పట్టించుకోవడం లేదనే భావన వంటి అభద్రతాభావం ఎక్కువైపు తుండేవి. తన పరిస్థితిని దాచేందుకు, అందరి దృష్టిని మరల్చడానికి విగ్గులు ధరిస్తుండేది. ఇది కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వకపోగా ఆభద్రతా భావాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసేవి. ఒక రోజు కాలేజ్‌లో చేసిన చిలిపి పని అందరి ముందు ఆమె నిజరూపం భయటపడంతో అలా గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. సరిగ్గా ఆ కష్టసమయంలో తాను చేసే కళాకృతులే మహిమకు కొండంత బలాన్ని ఇచ్చేవి. మహిమ స్వతహగా విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలేయడంలో దిట్ట.అతడి రాకతో వచ్చిన మార్పు..ఆ క్రమంలో ఆన్లైన్ ఆర్డర్లపై ప్రాజెక్టులు తీసుకోవడంతో..శశాంక్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వృత్తిపరమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఆలోచనాత్మక ప్రవర్తన, నిజాయితీ ఆమెను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. అతడితో ఉంటే మహిమకు అభ్రతభావం మొత్తం తొలిగిపోయేది. అయితే తన గురించి శశాంక్‌కి పూర్తిగా తెలియాలని విగ్గు తీసి చూపింది. తన నిజ స్వరూపాన్ని చూసినప్పుడు కూడా శశాంక్ ఆమెతో మెలిగిన తీరు మహిమను మరింతగా ఆకట్టుకున్నాయి. అది శారీరక లోపం కంటే మంచి మనసుని చూసే అతడి విధానం మహిమలో ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. ఆ తర్వాత ఇద్దరు 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. అయితే శశాంక్ కుటుంబ తనను ఎలా చూస్తుందో అని ఆందోళన చెందింది. వాళ్లు కూడా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించారు. ఆ నేపథ్యంలోనే మహిమ ఇక ఎప్పటికి ముసుగు వెనుక దాగుడు మూతలు వద్దు అనుకుని ఇలా జుట్టు లేకుండానే నవ వధువుగా పెళ్లిపందిరిలోకి వచ్చింది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్లు సైతం ఆమె బట్టతలను చూడలేదు, పెళ్లి కూతురు ఆత్మవిశ్వాసం, స్థైర్యం అందరి మనసులను కదిలించాయి. తన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ వధువుని అంతా గౌరవప్రదంగా చూశారు. మన లోపాన్ని(స్థితిని) మనం అంగీకరించడంతోనే గుర్తింపు మొదలవ్వుతుందని ఈ వధువు మహిమ నిరూపించింది. తనను తాను యథావిధిగా స్వీకరించడమే అందం అని అంటోంది మహిమ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: సైకిల్‌పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!) -
సైకిల్‌పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌ను (17,560 అడుగుల ఎత్తులో ఉన్న) సైకిల్‌పై చేరుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది దివ్యసింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సాహసాన్ని చేసిన రెండో మహిళగా దివ్య చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఆ సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మార్చి 16న కాఠ్మండు నుంచి ప్రారంభమైన ఆమె సైకిల్ యాత్ర సుమారు 14 రోజుల పాటు సాగింది. ఈ ప్రయాణంలో ఆమె కాఠ్మండు, సల్లేరి, సుర్ఖే, ఫక్డింగ్, సాగర్మాత నేషనల్ పార్క్, నామ్చే బజార్, డెబోచే, ఫెరిచే, లోబుచే, గోరక్ షేప్ గుండా వెళ్లింది. చివరగా ఆమె మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకుంది.దీని వెనుక ఉన్న ప్రేరణ..సుమారు ఏడాదిన్నర క్రితం తాను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు.. ఏ భారతీయ మహిళా ఇంతవరకు సైకిల్‌పై అక్కడికి చేరుకోలేదని తెలియడం వల్ల ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపింది. అదీగాక ఈ మౌంట్ ఎవరెస్ట్ గురించి తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడూ దాన్ని చూస్తానా అని వేయికళ్లతో ఎదురుచూశానని ఆనందంగా చెబుతోందామె. యాత్రలో ఎదురైన సవాళ్లుఅధిక ఎత్తులో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రయాణం అత్యంత సవాలుతో కూడుకున్నదని చెబుతోంది దివ్య. ఈ జర్నీలో ట్రావెల్ హెల్త్ సిక్నెస్, వేగంగా గుండె చప్పుడు వంటి శారీరక ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించింది. అలాగే తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు అలవాటు పడాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక దివ్య గురువు కుమార్ సింగ్ మాట్లాడుతూ..ఇంతరకు ఏ భారతీయ మహిళ సైకిల్‌పై ఇలాంటి సాహస యాత్ర చేయలేదని అన్నారు. అందువల్ల దివ్య ఈ సవాలు స్వీకరించిందని చెప్పారు. వ్యక్తిగతంగా ఏర్పర్చుకున్న ఈ లక్ష్యం కోసం దివ్య తన శరీరాన్ని సన్నద్ధం చేసుకునేలా తీవ్రమైన శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. చివరికి అనుకున్నట్లుగా విజయాన్ని సాధించిందన్నారు. ఇక దివ్య గోరఖ్‌పూర్ జిల్లాలోని బనౌడా గ్రామానికి చెందింది. ఆమె తండ్రి సంత్రాజ్ సింగ్ రైతు కాగా, తల్లి ఊర్మిళ సింగ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. కాగా, దివ్య కూడా తల్లిలానే టీచర్ వృత్తిలో కొనసాగడం విశేషం. (చదవండి: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..) -
ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్‌గా..!
వైవాహిక జీవితంలో ముసిరిన చీకట్లు ఊపిరి సలపనివ్వలేదు. పోనీ పిల్లలు పుట్టాకన్నా.. తన స్థితి మారుతుందనుకుంటే మరింత నరకప్రాయమైంది. చేతిలో ఇద్దరు పిల్లలతో అక్కడే ఉండాలా? బయటకు వచ్చేయాలా? అన్న మీమాంస..ఇక తప్పని స్థితిలో ఇంటి నుంచి ఒంటరిగా ఇద్దరి పిల్లలతో బయటపడింది. అలా అనాడు నిస్సహాయ స్థితిలో అందరి జాలి చూపులతో కనిపించిన ఆ అభాగ్యురాలు.. ఇవాళ అందరు చేతులెత్తి సలాం కొట్టే పొజిషన్‌కి చేరుకుంది. ఓ జిల్లాకే అధికారిగా పాలన చేస్తూ..స్ఫూర్తిగా నిలిచారామె. పరిస్థితులు మన జీవితాన్ని తలకిందులు చేస్తాయేమో..కానీ మన మనః స్థితిని కాదు అని అంటారామె.ఆ అసామన్య ధీరురాలే సవితా ప్రధాన్. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లా మడై గ్రామంలో ఓ ఆదివాసి కుటుంబంలో పెరిగారు. తండ్రి వరి కోయడం, బీడి ఆకులు ఏరడం, మహువా పువ్వులు సేకరించడం వంటి పనులు చేస్తుంటాడు. ఓ పల్లెటూరి అమ్మాయిలా పెరిగినా సవితా ఇంటర్ పూర్తి చేసిన కొద్ది రోజులకే 16వ ఏటనే పెళ్లి చేశారు. అది కూడా తన కంటే పదకొండేళ్లు పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేశారు. అయితే అత్తగారింట్లో ఆమె జీవితం నరకప్రాయంగా ఉండేది. భర్త, అత్తమామలు, ఆడపడచు వేధింపులకు తాళ్లలేకపోయింది. పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుందని నచ్చచెప్పేవారు తల్లిదండ్రులు. ఇద్దరు కుమారులు అథర్వ, యూజుస్లు పుట్టాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా, మరింత దిగజారింది. ఇక తన వల్ల కాదంటూ ఇద్దరు పిల్లలతో బయటకొచ్చేసింది. చాలా తక్కువ వస్తువులతో బయటకొచ్చిన ఆమె ఒక బంధువు ఇంట్లో చేరి స్థానిక బ్యూటీపార్లర్‌లో పనిచేసింది. అంతటి నిస్సహాయ స్థితిలో ఉన్న సవితకు ఎలాంటి భరోసా లేదు. కనీసం ఆర్థిక సాయం కూడా లేదు. పైగా ముందుకు సాగడానికి స్పష్టమైన మార్గం కూడా లేదు. తనకు తన పిల్లలకు ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలనే అచంచలమైన సంకల్పం మాత్రమే ఉంది. అదే ఆమెను ధైర్యంగా నడిపించేది. ఇంటర్‌తో ఆపిన చదువుని మళ్లీ కొనసాగించాలని నిశ్చయించుకుంది. ఎక్కువ గంటలు పనిచేస్తూ..మరోవైపు తన కుమారులను ఒంటరిగా పెంచుతూ చదువు కొనసాగించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన పరీక్ష అయినా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరవ్వడం ప్రారంభించింది. అయితే ఎలాంటి కోచింగ్‌లు లేవు, కనీసం విద్యాపరమైన మద్దతు కూడా లేదు. తీరిక సమయంలోనే చదువుకోవడం ఒక్కటే తప్ప ఇంకే వెసులుబాటు లేదు. అయినప్పటికీ 2005 ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారామె. అప్పుడామెకు పోలీస్ సర్వీస్ స్థానంలో పోస్ట్ వచ్చింది. అయితే సవితకు పరిపాలన సేవ చేయడమే ఇష్టం అందుకని మరోసారి 2006లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి తను కోరుకున్న పోస్ట్‌ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 83వ ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్ పరిపాలన సర్వీస్ అధికారిణిగా స్థానం పొందారు. ఆమె తన వృత్తి జీవితాన్ని నరసింగ్‌పూర్ జిల్లాలోని గోటేగావ్ మున్సిపల్ కౌన్సిల్లో ప్రారంభించారు. ఆ తర్వాత గ్వాలియర్‌లోని పట్టణ పరిపాలన అభివృద్ధి శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఐఏఎస్ కాదు..అయితే సవితా కథను పలు మీడియాల్లో ఐఏఎస్‌గా అభివర్ణించాయి. ఆ విషయాన్ని స్పష్టంగా చేసేందుకు మళ్లీ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. తాను మధ్యప్రదేశ్ పరిపాలనా సేవా అధికారిణి అయిన PCS అధికారిణిని మాత్రమేనని, భారత పరిపాలనా సేవ (IAS) సభ్యురాలిని కాదని స్పష్టం చేశారు. PCS అంటే ప్రధానంగా ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ (Provincial Civil Service) అని అర్థం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నిర్వహించే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక సవితా భవిష్యత్తులో ఐఏఎస్‌గా పదోన్నతి పొందే అవకాశం ఉన్నప్పటికీ..ప్రస్తుతానికి తాను ఏ హోదాలో ఉన్నానో దానికే గర్విస్తున్నానని క్లియర్‌గా చెప్పారు. అయితే పలు మీడియా కథనాల్లో తనను ఐఏఎస్ అధికారిగా చెబుతూ ఏవేవో రాసేశారని, అదంతా కరెక్ట్ కాదంటూ తన స్టోరీని చెప్పుకొచ్చారామె. ఇక సవితా ప్రధాన్ కథ అసంతృప్తికరమైన వైవాహిక బంధం, చేతిలో ఇద్దరి పిల్లల బాధ్యత అయినా జీవితంపై ఆశ వదులుకునేందుకు ఇష్టపడ లేదు. తనకెదురైన కష్టాలకు ఎదురెళ్లి మరీ..శివంగిలా పోరాడింది. పోనీ పుట్టింట వాళ్లు సైతం ఆదుకోలోని పరిస్థితే అయినా..తన తలరాతను చూసి తిట్టుకుంటూ కూర్చోలేదు. ఎలాగైన తన జీవితాన్ని కన్నీళ్లమయంగా కాదు కాంతిమయం మార్చుకోవాలి, ఆనందకరంగా జీవించాలి అని అనుకుంది. కోరుకున్నట్లుగానే సాధించింది, "దటీజ్ సవితా" అని అనిపించుకున్నారామె.(చదవండి: తొలి అంధ బధిర న్యాయవాది..! చిమ్మ చీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!) -
అక్షరాలా... మహిళా సాధికారతకే ఓటు
‘మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు?’ అనే ప్రశ్నకు 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా చెప్పే జవాబులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జవాబులకు ఉపయోగపడే పుస్తకం... ఉమెన్ అండ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. తరుణ్ బెహూరియా రాసిన ఈ పుస్తకంలో రిజర్వేషన్ల ప్రాముఖ్యత, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంపై దాని ప్రభావాన్ని గురించి వివరంగా చర్చించారు. ‘సరిౖయెనప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరం’ అనే అంశంతో ‘ఉమెన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా’ పుస్తకం రాశారు. పంచాయతీరాజ్‌లో రిజర్వేషన్ల ప్రభావం, భారతదేశంలో మహిళా సాధికారత: రాజకీయ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు: ఒక సామాజిక అవసరం, జాతీయ బాధ్యత, భారతదేశంలో మహిళలకు కోటాల అమలు, మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా సాధికారతకు ఒక మైలురాయి. స్థానిక స్వపరి పాలన, మహిళలు, రాజకీయ భాగస్వామ్యం: శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్... ఇలా ఆసక్తికరమైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్ర, ΄÷రుగుదేశాలలో మహిళల రాజకీయ భాగస్వామాన్ని గురించి వివరించే పుస్తకం... ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ పాలిటిక్స్– పోస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భారతదేశంలో మహిళలకు ఉన్న రిజర్వేషన్లను విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం. నాలుగు విభాలుగా విభజించిన ఈ పుస్తకం మహిళా రిజర్వేషన్ చట్టంలోని వివిధ కోణాలను వివరిస్తుంది. -
...ఆల్ ది బెస్ట్
భారతీయ మహిళలకు ఆల్ ది బెస్ట్. చైతన్యవంతమైన తెలుగింటి మహిళలకు ఆల్ ది బెస్ట్. మేధస్సులో, దార్శనికతలో, భవిష్యత్తు నిర్మాణంలో గొప్ప దక్షత, దీక్ష కలిగిన మన నారీశక్తికి ఆల్ ది బెస్ట్. అదిగో... చట్టసభల్లో స్త్రీలకు సంబంధించిన గొప్ప ఘట్టానికి తెర లేవనుంది. నేటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఎన్నాళ్ల కల ఇది! ఎన్నో తరాల కల. అందుకే ఇది చారిత్రాత్మక ఘట్టం. ప్రజాస్వామ్యంలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉందని చాటే అపురూప ఘట్టం. ఇక చట్టసభల్లో స్త్రీల గళం మరింత బలంగా వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. విధాన నిర్ణయాల్లో స్త్రీ దృక్పథం చేరితే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని స్త్రీలు చూపబోతున్నారు. ఇంటిని నడిపిన అనుభవంతో దేశాన్ని నడిపే సామర్థ్యం స్త్రీలకు ఉంది. ఈ బిల్లు కేవలం సీట్ల గురించి కాదు, గౌరవం గురించి. ఆత్మగౌరవం గురించి. స్త్రీలు ద్వితీయశ్రేణి పౌరులు కాదని ఎలుగెత్తి చాటడం గురించి. ఈ సందర్భం స్త్రీల పోరాటానికి, పట్టుదలకు తార్కాణం. చర్చ సజావుగా సాగి, బిల్లు కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిద్దాం. ఒక కొత్తప్రారంభానికి సిద్ధమవుదాం. భారత నారీ శక్తికి మరోసారి ఆల్ ది బెస్ట్. ... మీరు గెలవాలి!మహిళలకు అధికారం ఇస్తే వారు ఎంత అద్భుతంగా పనిచేస్తారో అనడానికి మన గ్రామ పంచాయతీలే నిదర్శనం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 14.5 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తాగునీటిప్రాజెక్టుల అమలులో సుమారు 60% పైగా మెరుగుదల కనిపించినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మహిళా నాయకత్వం స్థానిక పాలనను ప్రజల అవసరాలకు మరింత దగ్గరగా తీసుకువస్తుందని స్పష్టంగా చూపిస్తుంది.అప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యంప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, పార్లమెంటులో మహిళలప్రాతినిధ్యం సగటున 27.5%గా ఉంది. మహిళ లప్రాతినిధ్యం పెరిగిన దేశాల్లో సమాజం ఎంతోవేగంగా అభివృద్ధి చెందిందని గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యధికంగా 64% మంది మహిళలు పార్లమెంటులో ఉన్న రువాండాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అక్కడ మహిళా నాయకత్వం వల్ల భూమిపై మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు వచ్చాయి, ప్రస్తుతం అక్కడ 26% భూమి మహిళల పేరు మీదనే ఉంది. తల్లి మరణాల రేటు సగానికి పైగా తగ్గడమే కాకుండా, ఆడపిల్లలందరికీప్రాథమిక విద్య అందేలా అక్కడి మహిళా నాయకులు అద్భుతమైన కృషి చేశారు. అర్జెంటీనా వంటి దేశాల్లో 42.4% మంది మహిళలు చట్టసభల్లో ఉండటం వల్ల మహిళల హక్కులకు సంబంధించిన బిల్లుల సంఖ్య భారీగా పెరిగింది. కుటుంబాల్లో మహిళలు చేసే అప్రకటిత సేవలకు (అన్‌పెయిడ్ కేర్ వర్క్) గుర్తింపు తెచ్చేలా వారు విధానాలను మార్చగలిగారు.సామాజిక జీవనం మారి పోయిందిస్వీడన్, నార్వే వంటి నార్డిక్ దేశాల్లో మహిళలప్రాతినిధ్యం 45% పైగా ఉండటం వల్ల అక్కడ సామాజిక జీవనమే మారి పోయింది. పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవడమే కాకుండా, తండ్రులకు కూడా సమానంగా పేరెంటల్ లీవ్స్ ఇచ్చేలా చట్టాలను రూపొందించారు. దీనివల్ల మహిళలు ఉద్యోగాల్లో, వ్యా పారాల్లో రాణించడానికి గొప్ప అవకాశం దక్కింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా 21% పైగా మహిళాప్రాతినిధ్యం ఉండటం వల్ల పేద కుటుంబాల సంక్షేమంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. జనాభాలో సగం ఉన్న మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే సమ్మిళిత ప్రజాస్వామ్యం సంపూర్ణమవుతుంది. ఎన్ని సవాళ్లు ఉన్నా...ఈ రిజర్వేషన్ల విధానం సమాన అవకాశాలు అనే రాజ్యాంగప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తుందని కొందరు విమర్శకులు భావిస్తారు. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక వారి అర్హతలు, ప్రజాబలం, సిద్ధాంతాల ఆధారంగా జరగాలి కానీ, కేవలం జెండర్ ఆధారంగా జరగకూడదని వారు వాదిస్తారు. చట్టసభల్లో మహిళలకు స్థానాలు కేటాయించినప్పటికీ, వాస్తవంగా వారి కుటుంబాల్లోని పురుషులే పెత్తనం చెలాయించే అవకాశం ఉందనే విమర్శలు బలంగా ఉన్నాయి. అలాగే, ఓటర్ల స్వేచ్ఛ పరిమితం అవుతుందని, పార్టీల అంతర్గత విభేదాలు తలెత్తి భవిష్యత్తులో ఇతర వర్గాల నుండి కూడా ఇలాంటి కోటా డిమాండ్లు పుట్టుకొచ్చి వ్యవస్థను సంక్లిష్టం చేస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. పలువురు మహిళా నాయకులు సైతం తమను కేవలం ఒక మహిళగా కాకుండా, తమ నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాలని కోరుకోవడం కూడా గమనించాల్సిన అంశం. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, మహిళలకుప్రాతినిధ్యం కల్పించే విధానం కేవలం రాజకీయ స్థానాలను పెంచే సాధారణ చర్య కాదు. ఇది భారతీయ సమాజాన్ని మరింత సమానత్వపూర్వకంగా మలిచే ఒక గొప్ప నిర్మాణాత్మక సంస్కరణ. చట్టసభల్లో మహిళలు అడుగుపెట్టడం వల్ల విధానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మానవీయ కోణాన్ని సంతరించుకుంటాయి. చట్టసభల వేదికగా మహిళలు ధైర్యంగా మాట్లాడటం, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువతులకు వారు సజీవ ఆదర్శంగా, మార్గదర్శకులుగా నిలుస్తారు.– బాల లత మల్లవరపు సివిల్స్ మెంబర్, డైరెక్టర్, ధనిక్ భారత్ప్రోత్సాహం అవసరంమామూలుగా ఒక బిల్లు అమలు చేయనున్నారనే వార్త రాగానే అందరం థ్యాంక్స్ చెబుతాం... ఎన్నో మాట్లాడతాం. కానీ ఆ బిల్లు పాస్ అవ్వాలి.. అంతటితో ఆగకూడదు... అమలు చేశాక దాని తాలూకు పనులు సరిగ్గా జరుగుతున్నాయా... లేదా అనేది ముఖ్యం. ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రతిసారీ మహిళల కోసం ఏదో చేస్తాం అని మాటలు చెబితే చాలామంది నమ్మే పరిస్థితుల్లో లేరు. చెప్పినది అమలు చేయాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇలాంటివి అమలు చేసినా... చేయక పోయినా అన్ని రంగాల్లో మహిళలు తమను నిరూపించుకుంటున్నారు. పాలిటిక్స్, జర్నలిజమ్, డాక్టర్స్, పైలట్స్... ఇలాంటి రంగాల్లో ముందుంటున్నారు. కష్టమైనా, ఒడిదుడుకులు ఎదురైనా తమ కలలను నిజం చేసుకుంటున్నారు. అయితే జనరల్‌గా మహిళల శాతం ఏ రంగంలో అయినా తక్కువే ఉంటోంది. అంతెందుకు? పొలిటికల్ మీటింగ్స్ తీసుకోండి... 20 మంది మగవాళ్లు ఉంటే అందులో ఓ ముగ్గురు లేదా నలుగురు మహిళలు ఉంటే అది పెద్ద విషయం. అదే ఒక బిల్లు పాస్ అయినప్పుడు, అది ఒక ‘లా’ అయినప్పుడు కేటాయించిన ‘శాతం’లో మహిళలకు పూర్తి అవకాశం దక్కుతుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలదే. రూరల్ ఏరియాస్‌లో కొన్ని చోట్ల ఇంకా మహిళల పట్ల కాస్త వివక్ష ఉందనిపిస్తోంది. చె΄్పాలంటే ఈ విషయంలో నార్త్ కంటే సౌత్ కొంత బెస్ట్. అక్కడితే పోలిస్తే ఇక్కడ మహిళలకు ప్రోత్సాహం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ‘గ్రాస్ రూట్’ లెవల్లో ఉన్న అమ్మాయిలకు ఇంకా ఎంకరేజ్మెంట్ అవసరం. ఇప్పుడు మారుమూలప్రాంతాల్లో కూడా అమ్మాయిలను చదివిస్తున్నారు. ఆ తర్వాత కూడా వాళ్లను ఎంకరేజ్ చేయాలి. ‘గ్రాస్ రూట్’ లెవల్ నుంచి ఆ నెక్ట్స్ లెవల్ వరకూ అందరూ ముందుకు వస్తే అప్పుడు మొత్తం 33 శాతం రిజర్వేషన్ ఫుల్ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ చట్టం అమలులోకి తెచ్చినా మహిళలు సద్వినియోగం చేసుకోక పోతే ఇక ఉపయోగం ఏం ఉంటుంది? అందుకే ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలచుకున్నాను. కాస్త ధైర్యంగా మాట్లాడే మహిళలను ఎలా ఎదగనివ్వకుండా చేయాలా... అని కొంతమంది చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడి, అనుకున్నది సాధించిన మహిళలు ఉన్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోవాలి. మహిళలకు కేటాయించినవి దక్కించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ముందుకు రండి... నిరూపించుకుని నిలబడండి. – జయసుధ, నటిఇదో గొప్ప ముందడుగుఈ 33 శాతం రిజర్వేషన్ బిల్లు మహిళా సాధికారతకు భరోసా ఇస్తుంది. నారీ శక్తి కేవలం మాటలకే పరిమితం కాదు, ప్రధాని దానిని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, చెందుతుంది అంటే మహిళలకు సాధికారత కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ బిల్లు వ్యవస్థపై, పాలకవర్గంపై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ బిల్లు ఒక గొప్ప ముందడుగు, ఒక కల నిజమైన క్షణం. – ఖుష్బూ, నటిస్ఫూర్తిదాయకం33 శాతం బిల్లు అనేది కచ్చితంగా ఆహ్వానించదగ్గది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించే ఇలాంటి నిర్ణయాలు స్వాగతించదగ్గవి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే బాగుంటుంది. రాజకీయాలైనా, సినిమా అయినా... ఏ రంగం అయినా మనకు వచ్చిన చాన్స్‌ని ఉపయోగించుకోవాలి. సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఇలాంటి రిజర్వేషన్లు ఉండవు. కానీ, 33 శాతం అనేది ఇతర రంగాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వాలి. అలాగే ఎవరో ఒకరు ప్రోత్సహించాలని ఆశించకుండా అమ్మాయిలు తమకు తాముగా కూడా ముందడుగు వేయాలి. – మానస శర్మ, యువ దర్శకురాలుఐపీయూ (ఇంటర్– పార్లమెంటరీ యూనియన్) అనేది ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లకు సంబంధించిన సంస్థ. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఏర్పాటైంది. పార్లమెంట్లు మరింత బలంగా, పర్యావరణహితంగా ఉండడానికి, లింగసమానత్వం సాధించడానికి కృషి చేస్తోంది ఐపీయూ. ∙ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వంలో మహిళలప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనీ, అత్యంత శక్తిమంతమైన నిర్ణయాలు ఇప్పటికీ పురుషులే తీసుకుంటున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.ఐపీయూ, యూఎన్ ఉమెన్ విడుదల చేసిన గణాంకాలలో ముఖ్యాంశాలు...27.5%ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ సీట్లలో 27.5 శాతం మహిళలు ఉన్నారు. ఇది 2025 నాటి 27.2 శాతం కంటే కొద్దిగా ఎక్కువ. రాజకీయప్రాతినిధ్యానికి సంబంధించి మహిళలు ఎంత నెమ్మదిగా పురోగమిస్తున్నారో ఇది తెలియజేస్తుంది.19.9%జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 54 మంది మహిళలు పార్లమెంట్ స్పీకర్లుగా ఉన్నారు. మొత్తం స్పీకర్లలో ఇది 19.9 శాతం.76%రాజకీయాల్లోని మహిళలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో వివిధ రకాలుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మహిళా పార్లమెంటేరియన్లలో 76 శాతం మంది బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. సమాన రాజకీయ అధికారం దిశగా మహిళల పురోగతిని మందగింపచేసే ప్రయత్నాల్లో భాగమే ఈ బెదిరింపులు.మహిళలు నాయకత్వ స్థానాలకు చేరుకున్నప్పటికీ తరచుగా అ్ర పాధాన్య శాఖలకే పరిమితమవుతున్నారురక్షణ, హోం, న్యాయ, ఆర్థిక, ఆరోగ్య, విద్య వంటి మంత్రిత్వశాఖలను దాదాపుగా పురుషులే నిర్వహిస్తున్నారు. 14 దేశాలుప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల క్యాబినెట్లో లింగసమానత్వాన్ని సాధించాయి. సమానప్రాతినిధ్యం సాధ్యమేనని నిరూపించాయి. ఎనిమిది దేశాలలో ఇప్పటికీ ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. -
చిమ్మ చీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!
మనదేశంలో ఉన్న ప్రతి సౌకర్యం సక్రమంగా ఉన్నవారికే. పుట్టుకతో దివ్యాంగులు లేదా ప్రమాదవశాత్తు దివ్యాంగులైన వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించే యత్నం చేయడం లేదనేది చాలామంది నిపుణుల వాదన. ఇంతలా ఏఐ సాంకేతికత వేగంగా దూసుకొస్తున్నప్పటికీ.. వాళ్ల విషయంలో ఇంకా పక్షపాత బుద్ధి, చిన్నచూపు మారడం లేదు. దాన్ని మార్చేందుకు కంకణం కట్టుకోవడమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తూ..అందర్నీ చైతన్యవంతుల్ని చేసేలా ఆలోచింప చేసింది ఈ మహిళ. పైగా అందర్నీ బలవంతులుగా మార్చుదాం అనే సరికొత్త నినాదం ప్రతి ఒక్కరి మనసులో నాటేలా చేస్తోంది. ఆ అమ్మాయే హబెన్ గిర్మా. అమెరికాకు చెందిన గిర్మాది ఎరిట్రియన్ వలస కుటుంబ నేపథ్యం. ఆమె పుట్టుకతో చెవిటి అంధ వ్యక్తి. కాలక్రమేణ అవయవాలు క్షీణించే సమయానికి తన బాల్యం గురించి క్షణ్ణంగా అర్థం చేసుకుంది. నెమ్మది..నెమ్మదిగా కనుమరుగవ్వుతున్న దృష్టి, కోల్పోవుతున్న వినికిడి శక్తికి భయపడలేదామె. తన సవాళ్లకు అనుగుణంగా తనను తాను మార్చుకుంది. అలాగే ఆమె తన సహాయక సాధనాలను అదనపు వస్తువులుగా కాకుండా తన జీవితంలో ఒక భాగంగా భావించడం నేర్చుకుంది. సాధారణ పాఠశాలలో చదువుకుంది, బ్రెయిలీ నేర్చుకుంది. చాలామంది అంధ బధిరలకు లభించని అన్ని సౌకర్యాలతో పెరిగిందామె. ఇలాంటివి తనలాంటి వాళ్లందరికీ అందుబాటులో ఉంటే..వాళ్లు కూడా శక్తిమంతులవుతారనేది ఆమె ఆకాంక్ష. స్వతహగా చదువులో అపార ప్రతిభ కనబర్చే గిర్మా హార్వార్డ్ యూనివర్సిటీలో చదివే ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందెన్నడూ అంధ బధిరలు లేని ఆ ప్రదేశంలో హెచ్ఎల్ఎస్లో చేరిన 'తొలి అంధ బధిర విద్యార్థి' గిర్మానే. అక్కడ పాఠాలు వినేందుకు డిజిటల్ రీడింగ్‌లను, బ్రెయిలీ డిస్ప్లేను ఉపయోగించింది. సోక్రటిస్ పద్ధతిలో వేగవంతంగా అర్థం చేసుకునే తర్కాన్ని అవపోశన పట్టింది. అలాగే తరగతిగది చర్చలను వాయిస్ ట్రాన్స్లిటర్ల సాయంతో తన ఇయర్‌ఫోన్‌లో వినిపించేలా ఒక వ్యవస్థను రూపొందించింది. అలాగే ఎక్కువ శబ్దం ఉన్న ప్రదేశాలలో ప్రజలు నేరుగా తనకు చెప్పలేని వాటిని టైప్ చేసేందుకు బ్రెయిలీ డిస్ప్లేకు బ్లూటూత్ కీబోర్డుని జత చేసింది. ఇలా ఇన్ని సౌకర్యాలతో తాను లా చదివి ఉత్తీర్ణురాలయ్యా..మరి నాలాంటి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటనే ఆమె మదిని తొలిచేస్తున్న ప్రశ్న అది. ఆ నేపథ్యంలోనే ఆమె లా అనంతరం బర్కిలీలోని డిసేబిలిటీ రైట్స్ అడ్వకేట్స్లో స్కాడెన్ ఫెలోగా చేరి, ఆ తర్వాత అక్కడ స్టాఫ్ అటార్నీగా పనిచేశారు. పైగా అక్కడ వికలాంగులకు సాంకేతికత అందుబాటులో ఉంచేలా చేయడంలో సహాయ సహకారాలు అందించింది. అంతేగాదు వర్చువల్ వ్యాపారాలకు అమెరికన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ వర్తిస్తుందని వాదించారామె. దివ్యాంగులకు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా అన్నింట సాంకేతికత అందుబాటులో ఉండేందుకు కృషి చేశారామె. ఆమె కృషిని గుర్తించిన అమెరికా వైట్‌హౌస్ 2013లో ఆమెను ఛాంపియన్ ఆఫ్ చేంజ్‌గా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె పబ్లిక్ స్పీకర్‌గా, యాక్సెస్ అడ్వకేట్‌గా మారారు. దివ్యాంగులకు విద్యను చేరువ చేసే సాంకేతికతను పొందడంలో ఉండే అడ్డంకులను తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేశారామె. 2019లో తన ఆత్మకథ హబెన్: ది డెఫ్‌బ్లైండ్ వుమన్ హూ కాంకర్డ్ హార్వర్డ్ లా'ను ప్రచురించారు. ఇదే ఆమె తొలి పుస్తకం కూడా. అది వైకల్యం చుట్టూ ఉన్న ప్రజల భాషను మార్చేందుకు ఉపకరించింది. అంతేగాదు వికలాంగులు స్ఫూర్తికోసమే ఉన్నారనే భావనను గిర్మా పదే పదే వ్యతిరేకించేవారు. దానికి బదులుగా వాళ్లను గౌరవంగా బతికేలా సౌకర్యాలు అందివ్వండని విజ్ఞప్తి చేస్తోంది. ఆమె పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ వ్యవస్థలలో దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినప్పుడు ప్రతిభ అసాధారణంగా ఉండదని, తాము కూడా మీలాంటి వాళ్లమనే భావన ఇరువురిలో కలుగుతుందని అంటోందామె. దయచేసి ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తోంది. పైగా తాను సవాళ్లను అధిమించిన గొప్ప వ్యక్తిని కాదని, సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో సాధారణ వ్యక్తులు సాధించిన విజయంగా పరిగణించండి చాలు అని అంటోంది. అంతేగాదు మనం మాత్రమే బలవంతులం అవ్వడం కాదు, అందరూ ఇదే కోవకు చెందుతారు అని గుర్తురెగండి అని కోరుతోందామె.(చదవండి: 98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!) -
వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యం
లైంగిక అంశాలపై సమాజంలో అందరికీ ఆసక్తే. కానీ, లైంగిక విజ్ఞానమంటే పచ్చి బూతు, పరమ రోత అనుకొనే చిత్రమైన కుహనా విలువలతో కూడిన వ్యవస్థ మనది. విచిత్రం ఏమిటంటే, అసలు భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం అనేక శతాబ్దాల క్రితం నుంచే ఓ అవిభాజ్యమైన భాగం. ధర్మ, అర్థ, కామములనే త్రివర్గాల ద్వారానే నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలమని నమ్మిన సనాతన భారతీయ ధర్మం మనది. ధర్మ మార్గంలో అర్థాన్ని (ధనాన్ని) సంపాదించాలనీ, ఆ ధర్మబద్ధమైన అర్థం ద్వారా కామాన్ని (కోరికలను) తీర్చుకోవాలనీ, వెరసి ఆ త్రివర్గ సాధనే... మోక్షానికి మార్గమనీ మన ఋషిసత్తముల మాట. అలా క్రీ.శ. మూడో శతాబ్ద కాలంలోనే వాత్స్యాయనుడు ‘కామసూత్ర’ గ్రంథాన్ని అందించిన నేల మనది. అలాంటి కామసూత్ర విశేషాలను వేదికపై సంప్రదాయ కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించే సాహసం చేస్తే?నాట్య, యోగశాస్త్రాల మేలు కలయికగా...హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా ఏప్రిల్ 13, సోమవారం సాయంత్రం అదే జరిగింది. ప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి, నాట్య గురువు స్వాతీ సోమనాథ్ తన శిష్య బృందంతో ‘అర్ధనారీశ్వరమ్’ (Ardhanareeswaram) పేరిట ఆ విలక్షణ సాహస ప్రయోగం చేశారు. ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ బి.పి. రావు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, కళాపోషకురాలు ప్రవీణా యజ్ఞంభట్, ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల సేతురామ్, ‘యక్షగాన కంఠీరవ’ పసుమర్తి శేషుబాబు, దేవదాసీ సంప్రదాయ నాట్యంలో దిట్ట యశోదా ఠాకూర్, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ సహా వివిధ రంగాలలోని పలువురు ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై, ప్రశంసించారు.ఆనందమయ జీవితం గడపాలంటే, లైంగిక జీవితం ఆహ్లాదంగా సాగాలన్నది మొదటి మెట్టు. అయితే, ఆ కోరికను సైతం ధర్మబద్ధమైన మార్గంలో తీర్చుకోవడమే అసలు కీలకం. ఆ విషయాన్నే వివరిస్తూ... స్త్రీ పురుషులు ప్రకృతి – పరమేశ్వరులకు ప్రతీకలని గుర్తు చేస్తూ, వారి సంయోగం అర్ధనారీశ్వర తత్త్వానికి ప్రతిబింబమంటూ సాగిన అపురూప కూచిపూడి నృత్య రూపకం ‘అర్ధనారీశ్వరమ్’. భరతుని ‘నాట్యశాస్త్రం’లోని నృత్తాన్ని ఆసరాగా చేసుకొని, అటు ‘వాత్స్యాయన కామసూత్రాల’లోని కొన్ని ప్రధానాంశాలనూ, ఇటు ‘పతంజలి యోగశాస్త్రం’లోని యోగ భంగిమలనూ సమ్మిళితం చేసి, భారతీయ శాస్త్రీయ సంగీతంలోని సప్తస్వరాలు ఆలంబనగా, కూచిపూడి నృత్య శైలిలో ఎంతో శ్రమించి, స్వాతీ సోమనాథ్ ఈ డ్యాన్స్ బ్యాలేను రూపొందించారు.రెంటాల వారి ఆ ప్రామాణిక రచనే ఆధారంగా...వాత్స్యాయన కామసూత్రాలంటే ((Vatsayana Kamasutra) అదో అశ్లీల గ్రంథంగా పొరబడుతుంటారు. లైంగిక విజ్ఞానాన్ని శాస్త్రీయంగా అందించిన ఆ ప్రాచీన కామశాస్త్రానికి ఉన్నవీ లేనివీ చేర్చి, చౌకబారు నకిలీ అనుకరణలతో వచ్చిన చిల్లర పుస్తకాలే ఆ అపప్రథకు కారణం. “ప్రముఖ అభ్యుదయ కవి, ద్విశతాధిక గ్రంథకర్త, జర్నలిస్టు స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణ (1920 – 1995) మాత్రం వాత్స్యాయనుడు రాసిన సంస్కృత సూత్రాలను యథాతథంగా అందిస్తూ, సులభంగా అందరికీ అర్థమయ్యేలా 1980లలోనే ఈ కామశాస్త్ర గ్రంథాన్ని తేటతెలుగులో ‘వాత్స్సాయన కామసూత్రాలు’ పేరిట అందించారు. ఈ నాట్య రూపక రచనకు ప్రామాణికమైన ఆ రచననే ఆధారంగా చేసుకున్నాం. ప్రఖ్యాత రచయిత – చిత్రకారుడు బ్నిమ్ (Bnim) గారు అలా ఈ నృత్య రూపక రచన చేశారు” అని నృత్య దర్శకురాలైన స్వాతీ సోమనాథ్ వివరించారు.“సృష్టికి మూలం సంయోగ భోగం... ప్రకృతీ పురుషుల మధుర సంగమం” అని బ్నిమ్ అందంగా చెప్పిన ఈ సాహసోపేత ప్రయోగానికి గరిమెళ్ళ గోపాలకృష్ణ సంగీతం అందించగా, ఎన్. సురేశ్ ప్రసాద్ సంగీత సారథ్యం వహించారు.కూచిపూడి నాట్య కళాకారిణిగా స్వాతీ సోమనాథ్ (Swathy Somanath) మొదటి నుంచి రంగస్థలంపై ఓ అగ్గిబరాటా. ‘ద్రౌపది’, ‘ఆది శంకరాచార్య’ లాంటి వైవిధ్యభరితమైన అంశాలను ఎంచుకొని, ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఆలోచన రేపాలనుకోవడం ఆమె శైలి. నిజానికి, ఇప్పటికి 23 ఏళ్ళ క్రితం 2003లోనే ఆమె తొలిసారిగా ఈ వాత్స్యాయన కామసూత్రాలను సశాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా, కూచిపూడి నృత్యశైలిలో వేదిక మీదకు తెచ్చారు. ఆ ‘కామసూత్ర’ నృత్య రూపకం అప్పట్లో ఓ సంచలనం. ఇలాంటి శృంగారభరిత అంశాలను రంగస్థలంపై నర్తించవచ్చా, అది కళకూ – సమాజానికీ ఏ రకంగా మేలు చేస్తుందంటూ విమర్శలూ వెల్లువెత్తాయి. అయితే, అసభ్యతకు తావివ్వని తన నృత్య రూపకంతోనే ఆ విమర్శలకు దీటుగా బదులిస్తూ, దేశ విదేశాల్లో అనేక చోట్ల స్వాతి ఆ ‘కామసూత్ర’ను ప్రదర్శించారు. “అప్పట్లో ఈ నాటకానికి సుశిక్షితులైన కూచిపూడి పురుష కళాకారులు నాకు అందుబాటులో లేరు. దాంతో, సినీ – టీవీ నటులు జె.ఎల్. శ్రీనివాస్, హీరో జాకీ లాంటి వారితో ప్రదర్శించి, రక్తి కట్టించాం. ఇప్పుడు దానికే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి, మరింత అందంగా తీర్చిదిద్ది, అందరూ సుశిక్షితులైన కూచిపూడి కళాకారులతోనే ‘అర్ధనారీశ్వరమ్’ పేరిట అందించాం. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన మా ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకులం ట్రస్ట్‌లో నా వద్ద ఎనిమిదేళ్ళుగా శిక్షణ పొందిన యువ శిష్య బృందంతోనే ఈ డ్యాన్స్ బ్యాలేను ప్రదర్శించాం” అని స్వాతి వివరించారు.మద్రాసుకు నాటి ‘కళాక్షేత్ర’... మనకు నేటి ‘సంప్రదాయం’దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ లలిత కళా శిక్షణకు విశిష్ట కేంద్రాలున్నాయి. మన తెలుగు నాట అలాంటివి కొంత అరుదే. అయితే, తమిళనాట మద్రాసు (నేటి చెన్నై)లోని రుక్మిణీ అరండేల్ ‘కళాక్షేత్ర’, కేరళలోని ‘కళామండలం’ లాగా కొన్నేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అపురూప లలితకళా కేంద్రం ‘సంప్రదాయం’. శ్రీకాకుళంలోని కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుందీ గురుకుల శిక్షణ సంస్థ. ప్రపంచంలో గురుకుల పద్ధతిలో కొనసాగుతున్న ఏకైక కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రం ఇది. జిల్లా కలెక్టరే చైర్మన్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానమ్ కార్యనిర్వహణాధికారి సహా పలువురు ట్రస్టీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 2015 నుంచి సాగుతున్న ఈ యజ్ఞంలో భాగంగా శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులే ఇప్పుడీ ‘అర్ధనారీశ్వరమ్’ రూపకాన్ని ప్రదర్శించారు. వారంతా అరకు, సీతంపేట సహా చుట్టుపక్కలి ప్రాంతాల్లో ఉండే గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలబాలికలే. దిగువ మధ్యతరగతికి చెందిన తల్లితండ్రులు ఎంతో నమ్మకంతో అప్పగించిన ఆ పిల్లల్ని చాలీచాలని నిధులు, పేరుకుపోయిన బకాయిల మధ్యనే ఆ కేంద్రం అద్భుతంగా తీర్చిదిద్దింది. సామాన్య స్థాయి నుంచి వచ్చి మెరికల్లా తయారైన ఆ పిల్లలు ఇప్పుడు కూచిపూడిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు.ఆలుమగలను ఆనందతీరాలు చేర్చే సూత్రాలుఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఆ యువ కళాకారులు తాజాగా హైదరాబాద్‌లో సోమవారం చూపిన నృత్య కౌశల ప్రదర్శనే అందుకు సజీవ సాక్ష్యం. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో నిండిన రవీంద్రభారతి ప్రాంగణం ఈ యువ కళాకారుల ‘అర్ధనారీశ్వరమ్’ ప్రదర్శనను ఆద్యంతం కరతాళ ధ్వనులతో అభినందించింది. “దాంపత్య ధర్మ నిర్దేశనం కామసూత్ర కథనం” అని పేర్కొంటూ, “ఇహమందు మోక్షమునిచ్చే సూత్రము... కామసూత్రమ”ని ఈ రూపకం ద్వారా రచయిత – నృత్య దర్శకులు ఢంకా బజాయించారు. “అధోగతికి చేర్చు వ్యామోహం ఇదే కదా” అంటూ వాత్స్యాయన మహర్షితో రాజు విభేదించి, కామశాస్త్ర అవసరమేమిటని సంవాదించినట్టుగా ఈ రూపకాన్ని మొదలుపెట్టారు. ధర్మం తప్పి కామంతో చరించిన రావణాసురుడు, కీచకుడు లాంటివారికి పట్టిన దుర్గతిని కళ్ళకు కడుతూ, సాక్షాత్తూ జగద్గురు ఆదిశంకరులు సైతం ఆధ్యాత్మిక జ్ఞానంలో ఓ భాగంగా కామాన్ని గుర్తించిన తీరును బ్యాలేలో ప్రస్తావించారు. “ఏమిది మైకము... ఏమిది తమకము... ఏదో తెలియని వ్యామోహము” అంటూ తృతీయ పురుషార్థ ప్రతిపాదన చేశారు. ఈ ధర్మార్థానంతర పురుషార్థ సాధనలో “ఆలుమగలను ఆనంద తీరాలు చేర్చే సూత్రాలు” కామసూత్రాలు అన్నది నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. సమయ, సందర్భోచితంగా ‘భర్తృహరి శృంగార శతకం’లోని అంశాలను సైతం రూపకంలో చేర్చారు.“చంద్రహారాలు... ప్రేమ కలాపపు ప్రియచిహ్నాలు... మగని తలపించు తీయని గురుతులు”గా నఖ క్షతాలు, అలాగే దంత క్షతాలు, ఆలింగనాలు, సంయోగ భంగిమలను యువ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ‘ఉత్సాహానికి ఉత్పలకం’, ‘విశృంఖలతకు విజృంభితకం’, ‘ఇష్టరాగమునకు ఇంద్రాణికం’ తదితర సంక్లిష్టమైన సంభోగ బంధనాలను అంతే సమర్థంగా నర్తకులు చూపడం విశేషం. ఎక్కడా అసభ్యత, అశ్లీలం అనిపించకుండా ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను ప్రేక్షకుల ముందుకు తేవడం కత్తి మీద సామే! దాన్ని ఓ సవాలుగా తీసుకొని, సంప్రదాయ శైలి నృత్య ముద్రలు, దరువులతో... నృత్య సంయోజనం చేయడంలో నాట్యాచారిణిగా స్వాతి తన అసమాన ప్రతిభ కనబరిచారు. అందరినీ మంత్రముగ్ధులను చేశారు. వాత్స్యాయనుడిగా రవితేజ, రాజుగా – శివుడిగా మెహర్ ప్రభాకర్, పార్వతిగా దూసి వైష్ణవి, సూత్రధారిణులుగా హేమాంజలి, శ్రుతి కొంజర్ల, గీతిక, యశస్విని, కవలలైన అక్కాచెల్లెళ్ళు భానుశ్రీ – భవ్యశ్రీ, తదితరులు ఉత్తమ ప్రదర్శన అందించారు.ఒక హీరో... ఇద్దరు హీరోయిన్లు... అద్భుత సమన్వయంముఖ్యంగా కథానాయకుడిగా అరకు ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు కొర్రా బలరామ్ అలుపూ సొలుపూ లేకుండా గంటన్నర పైగా ఈ అపురూప నాట్యవిన్యాసాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ రూపకానికి మూలస్తంభంగా నిలిచారు. ఇంగ్లీషులో సాగిన నేపథ్య వ్యాఖ్యానం, రూపకంలో అడుగడుగునా సందర్భోచిత వాద్య సంగీతం, గాత్ర మాధుర్యం, వేణునాదం సహా పలు వాద్య పరికరాల వినియోగం... ప్రదర్శనను ఆసక్తిగా మలిచి, ఆహ్లాదభరితం చేశాయి.చదవండి: మనకు తెలియని మన భీముడి కోణంలో భారతం“సిగ్గే సుదతికి సింగారం... అది చెలికానికి ఆకర్షణం” అనే అంశంలో తొలి కథానాయికగా సీతంపేటకి చెందిన నిమ్మల అంజలి ముద్దరాలి సిగ్గును అభినయించిన తీరు ఆకట్టుకుంది. నాయికను ప్రేరేపించే సఖిగా లిఖిత అభినయం అంశానికి నిండుదనం తెచ్చింది. ఇక, ఈ రూపకంలో ద్వితీయ కథానాయికగా చేరడేసి కళ్ళు, చెరగని చిరునగవు మోముతో, అణువణువునా అభినయం నింపుకొని నర్తించిన యామినీ కసిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. నృత్యపరిశోధనకు పీహెచ్డీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ పొందిన యామిని రానున్న రోజుల్లో నర్తకిగా మరింత రాణించడం ఖాయం.ఆద్యంతం లోపరహితంగా, అత్యంత సమన్వయంతో, అతి ప్రసన్న వదనంతో సాగిన ఈ నాయకా, నాయికల ముగ్గురి ప్రదర్శన నిస్సందేహంగా వారి పట్టుదల, కఠోరశ్రమ, నిత్యం గంటలకొద్దీ వారు చేసిన నిరంతర సాధన ఫలితమే. గూఢకమ్, బిందుమాల, ప్రవాళమణి, మణిమాల లాంటి పలు వాత్స్యాయన ప్రయోగాల ప్రదర్శన చూసి, ప్రేక్షకులు అచ్చెరువొందారంటే అతిశయోక్తి కాదు. నాట్య బృందమంతా కేవలం వేదికపై నటిస్తున్నట్టు కాకుండా, ఆ పాత్రలు తామే అయినట్టుగా ఇహం మరిచి ఆ క్షణంలో జీవించి, రససిద్ధి కలిగించడం ఈ ప్రదర్శనకు పంచప్రాణాలైంది. ఇలా ఈ శిష్యులందరినీ తీర్చిదిద్దడానికి సమస్త శక్తియుక్తులూ ధారపోసిన స్వాతీ సోమనాథ్ అంకితభావానికి పదే పదే వినిపించిన సభికుల హర్షధ్వానాలు తరగని కితాబులుగా నిలిచాయి.దాదాపు పాతికేళ్ళ క్రితమే... స్వాతి సంచలన ప్రయోగంఒకప్పుడు 1980లో రవీంద్రభారతి వేదికపైనే అరంగేట్రం చేసి, 2003లో తాను స్వయంగా అదే వేదికపై ‘కామసూత్ర’ డ్యాన్స్ బ్యాలే ప్రదర్శనతో సంచలనం రేపి, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తన శిష్యులతో దాన్నే ‘అర్ధనారీశ్వరమ్’గా అందించిన కళాకారిణి స్వాతీ సోమనాథ్‌కు ఇది అక్షరాలా ఓ ప్రత్యేకమైన సందర్భం. జీవితంలో మరపురాని అపురూప జ్ఞాపకం. “ఈ పిల్లల కౌశలం వెనుక ఎనిమిదేళ్ళ నిరంతర కృషి, సుదీర్ఘ సాధన దీని వెనక ఉంది. నిజానికి, ఈ ‘సంప్రదాయం’ ఏర్పాటుకు ముందు స్వాతి వేరు. తరువాతి స్వాతి వేరు. నా జీవితమే మొత్తం మారిపోయింది. పన్నెండేళ్ళుగా శ్రీకాకుళానికే పరిమితయ్యాను. అపరిమిత అవకాశాలకు కేంద్రమైన హైదరాబాద్ నగరాన్నీ, కుటుంబాన్నీ వదిలి శ్రీకాకుళానికి వెళ్ళి పనిచేయడం కష్టమే. ‘సంప్రదాయం’ ట్రస్ట్ వ్యవస్థాపనకు ప్రభుత్వ కృషిలో భాగమై, నాట్యగురువుగా అక్కడ జీతానికి పనిచేస్తున్నఇన్నేళ్ళుగా ఎన్నో అవస్థలు పడ్డాను. వ్యక్తిగతంగా మరెన్నో త్యాగాలూ చేశాను. కానీ, ఇవాళ అద్భుతంగా తయారై, నాట్యంలో పీహెచ్డీ చేసే స్థాయికి ఎదిగిన ఈ నవతరం పిల్లల్ని చూసినప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోతుంటాను. కళాజీవితంలో నా కృషికి అర్థం, పరమార్థం సిద్ధించినట్టు భావిస్తుంటాను” అని నీళ్ళు నిండిన కళ్ళను అదుపు చేసుకుంటూ స్వాతీ సోమనాథ్ వ్యాఖ్యానించారు.అభివృద్ధిలో వెనుక.. అసమాన ప్రతిభలో ముందు... అర్ధనారీశ్వర స్తోత్రంతో నర్తకీ నర్తకులు ప్రస్తుతించగా, శివపార్వతుల కేళీ విలాసంతో ముగిసిన తాజా ‘అర్ధనారీశ్వరమ్’ నృత్యరూపక ప్రదర్శనను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా ప్రేక్షకులు రావడం ప్రత్యేకించి గమనార్హం. ముఖ్య అతిథిగా హాజరైన ‘భారత్ బయోటెక్’ మేనేజింగ్ డైరెక్టర్ ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా (Suchitra Ella) తదితర ప్రముఖులు కళాకారులను అభినందించారు. తమిళనాట నైవేలిలో పుట్టి పెరిగి, మద్రాసులో చదువుకున్న తనకు బాల్యం నుంచి సంగీతం, నాట్యం తదితర లలితకళలతో ఉన్న అనుబంధాన్ని సుచిత్ర పంచుకున్నారు. “మా ఊరికి కేవలం గంట ప్రయాణంలో చిదంబరం పట్టణం, ప్రపంచానికి కేంద్రబిందువుగా భావించే చిదంబరం నటరాజస్వామి ఆలయం ఉంటాయి. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళితే చిదంబరం దర్శిస్తుంటాను” అని ఆమె తెలిపారు. ఇలాంటి నృత్యరూపక ప్రదర్శనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం, సంస్కృతి ఘనతను ప్రపంచానికి చాటతాయని అభిప్రాయపడ్డారు.ఇక, స్వాతి సమకాలికురాలు – కూచిపూడి శిక్షణలో ఒకప్పటి సహాధ్యాయి అయిన యశోదా ఠాకూర్, “పదం, జావళీలతో దేవదాసీ నృత్యం ద్వారా స్వయంగా శృంగార రసాభినయాన్ని విద్యార్థులకు బోధిస్తున్న నేను స్వాతికి వీరాభిమానిని. సాహసించి, ఎన్నో ప్రయోగాలు చేసే ఆమె నాకు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిత్యస్ఫూర్తి” అని అభినందించారు. “ఆద్యంతం కళ్ళకూ, చెవులకూ విందు”గా బి.పి. రావు అభివర్ణించిన ఈ రూపకానికి మూలస్తంభాలుగా నిలిచిన వారంతా శ్రీకాకుళం ప్రాంత వాసులే కావడం విశేషం. స్వయానా శ్రీకాకుళం ప్రాంతమే పురిటిగడ్డ అయిన స్వాతీ సోమనాథ్‌తో పాటు ఆమె శిష్యబృందం, బ్యాలే ప్రదర్శనకు లైటింగ్, కాస్ట్యూమ్స్, సంగీతం అందించిన అందరూ ఆ ప్రాంతానికి చెందినవారే. అభివృద్ధిలోనే తప్ప అసమాన ప్రతిభలో ఉత్తరాంధ్ర వెనుకబడలేదనడానికి ఇది నిదర్శనమని అతిథులు అభిప్రాయపడ్డారు.కూచిపుడి నాట్యచరిత్రలో కొత్త అధ్యాయంస్వాతీ సోమనాథ్ తొలి గురువైన భాగవతుల రామకోటయ్య కుమారుడూ – కూచిపూడి సంప్రదాయంలోనే పుట్టి పెరిగి, స్వయంగా నాట్యాచార్యుడైన భాగవతుల సేతురామ్ అన్నట్టు, “కూచిపూడి నాట్యచరిత్రలో ఇది ఓ కొత్త అధ్యాయం”. సాహిత్యం, సంగీతం, నృత్యసంయోజనం త్రివేణీ సంగమమై, వేదికను రసప్లావితం చేసిన అరుదైన ఘట్టం. అదీ ఎక్కడో మారుమూల ఉత్తరాంధ్ర నుంచి, వెనుకబడిన ప్రాంతంగా భావించే చోట నుంచి, వెనుకబడిన గిరిజన వర్గాల నుంచి ఇలాంటి అపురూప ప్రతిభావంతులైన యువ కళాకారులు పైకి రావడం అపూర్వం. సముద్రపుటొడ్డున శాంతినికేతనంలా ఉండే ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకుల ట్రస్ట్ చేసిన ఓ అద్భుతం. ఇలాంటి ప్రతిభా సుమాలు మరిన్ని పల్లవించాలంటే, ఆర్థికంగా ఇప్పటికీ అస్తుబిస్తుగా ఉన్న ‘సంప్రదాయం’కి ప్రభుత్వంతో పాటు కళాభిమానులు, దాతలు కాపుగా నిలవాలి. ‘అర్ధనారీశ్వరమ్’ లాంటి ప్రదర్శనలు ఊరూరా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటా అన్ని దేశాల్లో ప్రదర్శించాలి. సుచిత్రా ఎల్లా తదితరులు పేర్కొన్నట్టు, ‘మన తెలుగువారి కూచిపూడి ఘనతనూ, మన భారతీయ కళా, సాంస్కృతిక ప్రాభవాన్నీ ప్రపంచానికి చాటడానికి’ అదే సరైన మార్గం!- రెంటాల జయదేవ -
నో మెన్... ఓన్లీ విమెన్ : 300మంది వీడియో వైరల్
అప్పుడప్పుడూ కిట్టీ పార్టీలు, ఏ పార్క్కో, చిన్నపాటి తీర్థయాత్రకో వెళ్లడం తప్ప మహిళలకు పెద్దగా రిక్రియేషన్ ఏమీ ఉండదు. అందుకే మహిళల కోసం, మహిళల ద్వారా నిర్మితమైన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్రాన్స్‌లో ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేయడానికి సుమారు 300 మంది మహిళల ప్రయత్నం, వీడియో ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. అదేంటో తెలుసుకుందాం. ఒక చారిత్రక కట్టడాన్ని కొనుగోలు చేసి, దానిని మహిళల కోసం ఒక ప్రత్యేక హేవెన్‌గా మార్చాలనే 300 మంది మహిళల సాహసోపేతమైన ప్రయత్నం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి, తోటి మహిళలతో కలిసి సరదాగా గడపడానికి, కొత్త ఉత్సాహం పొందేలా దాదాపు 300 మంది మహిళలు కలిసి ఫ్రాన్స్‌లోని ఒక పురాతన మధ్యయుగ కోటను (Medieval Chateau) కొనుగోలు చేశారు. దాని పేరే 'క్యాంప్ చాటో' (Camp Chateau).ముఖ్య విశేషాలుమహిళలు దైనందిన ఒత్తిళ్లకు దూరంగా, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి, ఒకరితో ఒకరు అనుబంధాన్ని పంచుకోవడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది 100 శాతం మహిళల సొంతం. వారి నిధులతోనే నడుస్తుంది. 'ఫౌండర్ మెంబర్' అనే ప్రత్యేక మోడల్ ద్వారా దీనిని కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ మగపురుగు కూడా ఉండదన్నట్టు.. ఉండేదంతా సిస్టర్ హుడ్. ఇక్కడ సమ్మర్ క్యాంప్స్, విశ్రాంతి గదులు, ఆన్లైన్ కమ్యూనిటీ ద్వారా మహిళలకు ఒక 'వర్చువల్ స్వర్గాన్ని' అందిస్తున్నారు. ఈ కోట రోజువారీ ఒత్తిళ్ల నుండి దూరంగా,ఒక స్లీప్ అవేలా, రిట్రీట్‌గా పనిచేస్తుంది. ఇక్కడ మహిళలు కలిసి సమయం గడపవచ్చు. అలాగే ఒక చారిత్రక ప్రదేశంలో గడిపిన అనుభూతి పొందవచ్చు.ఈకోటలో ఎలాంటి భయాలు, ఆటంకాలు లేకుండా పచ్చని ప్రకృతి మధ్య, ఇష్టమైన నెచ్చెలులతో ఆడి పాడవచ్చు. నిస్సంకోచంగా నచ్చిన పని చేసుకోవచ్చు. “మీరు మీ ప్రాణస్నేహితురాలు, పెద్ద కుమార్తె , మరో 300 మంది మహిళలతో కలిసి ఒక మధ్యయుగపు కోటను కొనుగోలు చేశారు. ఇప్పుడు మీరంతా ఒకచోట చేరి, ఆలింగనం చేసుకుని, వేడుకలు జరుపుకుని, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఒక స్థలాన్ని సృష్టించారు. స్వేచ్ఛగా. ఆనందంగా. మనస్ఫూర్తిగా.” అనే క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన వీడియో షేర్ అయింది. దీనిపై బోలెడు ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు మీ దేశంలో కూడా మీరు ఇలాంటి కోటనొకదాన్ని ఏర్పాటు చేసుకుంటారా అనే ప్రశ్నను సంధించడం విశేషం.నెటిజన్ల స్పందనఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియా భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చాలా మంది మహిళలు దీన్ని "రిటైర్మెంట్ ప్లాన్" అని కొనియాడుతోంటే, "ఇది చాలా అద్భుతమైన ఆలోచన, ఇలాంటి కలయికలు, కమ్యూనిటీలు మనశ్శాంతిని ఇస్తాయి" అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది అని మరి కొంతమంది ఆరా తీశారు.మరోవైపు కొందమంది నెటిజన్లు వ్యంగ్య బాణాలు విసిరారు. "ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు లేదా పైకప్పు కారితే ఎవరు బాగు చేస్తారు? ఖచ్చితంగా మగవారిని పిలవాల్సిందే కదా" (ఇలాంటి పనులు ఆడవాళ్లు చేయలేరు అన్నట్టు) అంటూ కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు మేల్ చావనిస్ట్లేమో ఇలాంటి ఆడోళ్లు సమాజం నుండి విడిపోవడమే మంచిది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.A group of 300 women buy a Medieval French Chateau so they can have a place for women to gather. Would you buy a castle with other people in another country? pic.twitter.com/C8VlKKvj3a— Richie Rich (@gofishh77) April 7, 2026ఏది ఏమైనా "మహిళలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఉత్సాహంగా, స్వేచ్ఛగా గడిపే ఒక వేదికను సృష్టించడమే మా ఉద్దేశ్యం." అని క్యాంప్ చాటో వెబ్సైట్ చెప్పినట్టు, ఆడవారి దుస్తులు, వేషధారణమీద ఎలాంటి జడ్జ్మెంట్లు, విమర్శలు, విరుపులు లేని ఒక ఉత్సాహపూరిత క్షణాలు నిజంగానే కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏమంటారు? -
పట్టుదలకు ప్రతిరూపం పాయల్
నిరాశ, నిస్పృహలు అనేవి ఓటమికి క్లోజ్ ఫ్రెండ్స్. ఆశ, ఆత్మవిశ్వాసం అనేవి విజయానికి క్లోజ్ ఫ్రెండ్స్. కాళ్లు, చేతులు లేని పాయల్ నాగ్ ఆశ, ఆత్మవిశ్వాసాలతో స్నేహం చేసింది. బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో స్వర్ణం గెలుచుకొని మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఫైనల్లో తన ఆరాధ్య దేవతలాంటి శీతల్‌దేవిని ఓడించి స్వర్ణం గెలుచుకుంది పద్దెనిమిదేళ్ల పాయల్ నాగ్. ఇది కేవలం విజయం మాత్రమే కాదు. క్రీడలకు అతీతమైన అనుభూతి.ఒకప్పుడు శీతల్‌దేవి గురించి విని పాయల్ పులకించిపోయేది. ఆమె వీడియోలు అదేపనిగా చూసేది. ‘శీతల్దేవిలా పేరు తెచ్చుకోవాలి’ అని కల కనేది. ఆ కల నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అయితే అది అదృష్టంతో వచ్చిన విజయం కాదు. అంకితభావం, కష్టపడేతత్వంతో వచ్చిన విజయం...అనాథాశ్రమంలో...ఒడిశాకు చెందిన పాయల్ తండ్రి కూలి. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన విద్యుత్ ప్రమాదంలో నాలుగు అవయవాలను కోల్పోయింది పాయల్. పోషించే స్థోమత లేక తల్లిదండ్రులు ఆమెను అనాథాశ్రమంలో చేర్పించారు. దురదృష్టం సంగతి ఎలా ఉన్నప్పటికీ పాయల్ నిరాశ చీకట్లో మగ్గిపోలేదు. ఎప్పుడూ చురుగ్గా ఉండేది. పాయల్ తన నోటితో పెయింటింగ్ వేస్తున్న ఒక వైరల్ వీడియో కోచ్ కుల్దీప్ కుమార్ వేద్వాన్ దృష్టిని ఆకర్షించింది. పాయల్లోని ప్రతిభను గుర్తించి కత్రాలోని తన అకాడమీకి తీసుకువచ్చాడు. పాయల్ కోసం ప్రత్యేకంగా విల్లు తయారుచేయించాడు. ఆర్చరీలో ఆమెను తీర్చిదిద్దాడు.భుజం, నోటితో...విల్లును పట్టుకోవడానికి కాళ్లను ఉపయోగిస్తుంది శీతల్‌దేవి. ఆమెలా కాకుండా తన భుజం, నోటిని ఉపయోగించి విల్లును సంధిస్తుంది పాయల్. ఇదేమీ అంత సులువైన విషయం కాదు. బోలెడు కష్టపడాలి. సహనం ఉండాలి. ఆ రెండు పాయల్లో ఉండడం వల్లే ఆర్చరీలో అద్భుత ప్రతిభ చూపగలుగుతోంది.బ్యాంకాక్‌లో పాయల్ పాల్గొన్న ఈవెంట్ తన మొదటి సీనియర్ అంతర్జాతీయ ఈవెంట్ అయినప్పటికీ శీతల్‌ను ఓడించడం ఇదే మొదటి సారి కాదు. జైపూర్‌లో 2025లో జరిగిన పారా ఆర్చరీ నేషనల్స్‌లో శీతల్‌ను స్వల్ప తేడాతో ఓడించింది.ఇక బ్యాంకాక్ విషయానికి వస్తే...శీతల్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా పాయల్ ప్రశాంతంగా విజయాన్ని కైవసం చేసుకుంది.ఇద్దరి గురువు ఒకరే...శీతల్‌తో పాటు, పాయల్‌ను ఆర్చరీలో తీర్చిదిద్దిన వ్యక్తి కుల్దీప్ కుమార్ వేద్వాన్. ఆయన ఒక రైతు కుమారుడు. ఆ రైతు ఎలాంటి వ్యక్తి అంటే... ‘నీ దగ్గర సంపద లేకపోవచ్చు. వనరులు లేకపోవచ్చు. నీ మీద నీకు మాత్రం గట్టి నమ్మకం ఉండాలి’ అని నమ్మిన వ్యక్తి.తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్న వేద్వాన్ ఇతరులకు కూడా దారి చూపుతున్నాడు. శీతల్, పాయల్లాంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేశాడు.Payal Nag.Daughter of a daily-wage mason from Odisha. Electrocuted at the age of eight. Lost all four limbs.And then, found a bow.Spotted through her paintings by coach Kuldeep Vedwan, the same man who shaped world champion Sheetal Devi. Defeated her idol Sheetal Devi at… pic.twitter.com/KdWGcuAJ9X— anand mahindra (@anandmahindra) April 6, 2026 -
ఉమెన్ పవర్...పంచ్
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్లు ఫైనల్లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి). కుంచె నుంచి పంచ్ దాకా...చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్‌కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్‌గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్‌పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్‌లోకి వచ్చింది ప్రీతి పవార్.పానిపట్‌లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్‌తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్‌లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.ఎంతోసేపు ఏడ్చిన తరువాత..రాజస్థాన్‌లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్‌పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్‌ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.‘బాక్సింగ్‌లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్‌లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.మట్టి కరిపించేలా...మాజీ ప్రపంచ ఛాంపియన్‌ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్‌ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.తాతగారు ససేమిరా అన్నా...జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్‌లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్‌కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.కష్టమైనా... ఇష్టంగా!హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. బాక్సింగ్‌లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్‌లాండ్‌కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.అనుకోకుండా వచ్చి...అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్‌పూర్‌లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా. ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్‌లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. -
నిజమైన ధైర్యం, తిరుగులేని శక్తికి కేరాఫ్ ఆమె..!
సకల సౌకర్యాలతో ఎటువంటి వైకల్యం లేకుండా సాధించిన విజయాలను ఎన్నో చూసి ఉంటాం. కానీ కడు పేదరికం, ఓ పక్క వైకల్యంతో సతతమతమై చిన్నారులు..ఏదో సాదించాలన్న ఆశతో బతుకుతున్న వైనం మనల్ని ఎంతగానో కదలిస్తుంది. పైగా అలాంటి వాళ్లు సాధించి విజయాలు అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, ప్రశంసనీయమైనవి కూడా. అలాంటి వ్యక్తులు అసామాన్య ధైర్యానికి, తిరుగలేని శక్తికి అర్థాన్నిచ్చేలా నిలబడతారు, గెలుస్తారు అని చెబుతున్నారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేరణాత్మక కథలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా ఈసారి కూడా మనసుని తాకే సరికొత్త స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకొచ్చారు. తనకు నిరాశనిస్ప్రుహలు కలిగినప్పుడల్లా అలాంటి మహోన్నత వ్యక్తుల వైపుకి చూస్తానంటూ ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అనే పారా ఆర్చరీ కథను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆనంద్ మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. రోజువారీ కూలీ అయిన ఒక మేస్త్రీ కుటుంబంలో జన్మించిన పాయల్ బాల్యం అంతా కష్టాలతో నిండిపోయింది. కేవలం ఎనిమిదేళ్ల వయసులో, విద్యుదాఘాతానికి గురై తన నాలుగు అవయవాలనూ కోల్పోయింది. నిజానికి ఆమె ఎదుర్కొన్న ప్రమాదం జీవితానికి ముగింపు పలికేలా చేసే దారుణమైన ఘటన. అయితే పాయల్ తన పరిస్థితిని ధిక్కరించేలా అద్భుతమైన ఆరంభానికి నాంది పలకడం విశేషం. ఆమె నేరుగా ఈ విలువిద్య శిక్షణలోకి రాలేదు. ఆమె మొదటగా తన ఐడెంటీటిని చిత్రీకరణతో తెచ్చుకుంది. అవయవాలు లేకపోయినా..పట్టుదలతో చిత్రాలు గీయాలన్న ఆమె తాపత్రయం అందర్నీ కట్టిపడేసేది. ఆ విలక్షణ ప్రతిభను శీతల్ దేవికి శిక్షణ ఇచ్చిన కుల్దీప్ వేద్వాన్ గుర్తించారు. ఆమె పట్టుదల, స్ఫూర్తిని గుర్తించి, పారా ఆర్చరీ శిక్షణతో ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గనిర్దేశం చేశారు. అలా అలుపెరగని పట్టుదలతో పాయల్ తన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. కాలక్రమేణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండిటిని పెంపొందించుకుంటూ..ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె సామర్థ్యాలు ప్రపంచానికే తెలిసేల చేసిన కీలక మలుపు ఏప్రిల్ 2026లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్. ఆ పోటీల్లో ఫైనల్‌కు చేరుకుని తన ఆరాధ్య దేవత అయిన శీతల్ దేవిని ఎదుర్కొని, ఓడించింది. అలా ఆ పోటీల్లో పాయల్ స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపైకి అద్భుతంగా అడుగుపెట్టింది. Here is that moment!! Payal Nag receives her GOLD medal at Bangkok and the national anthem plays.And right beside her, Sheetal - gracefully helping move her wheelchair.Two champions. One podium. One unforgettable frame.Pure inspiration. ❤️ pic.twitter.com/wrobtOCSIL— Manas Muduli (@manas_muduli) April 6, 2026 అంతేగాదు ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్‌గా ఘనత అందుకుంది పాయల్. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ కోచ్ కుల్దీప్ వేద్వాన్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృత్రిమ కాళ్లతో ఆపరేట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్లును తయారుచేశారు. ఇందులో భాగంగా, విల్లును పైకి ఎత్తడంలో సహాయపడటానికి ఆమె కుడి కృత్రిమ కాలుపై ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పరికరాన్ని, అలాగే శీతల్ మాదిరిగానే ఛాతీ నుంచి విల్లును విడుదల చేసే యంత్రాంగాన్ని కూడా అమర్చారు. ఆమెను ఆ పరికరాలకు అలవాటు చేయడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని వేద్వాన్ వెల్లడించారు. పాయల్ కేవలం 2023లో శిక్షణ ప్రారంభించి..జస్ట్ మూడేళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడే స్థాయికి ఎదిగి, విజయకేతనం ఎగరవేసింది. అని పోస్ట్‌లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు తనకు ఎప్పుడైనా నిరాశగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు నిలదొక్కుకోవడానికి, సరైన దృక్పథాన్ని పొందడానికి పాయల్, శీతల్ సక్సెస్ జర్నీల వైపు చూస్తానని అన్నారు. వీళ్లు ఒక్కరోజుకే పరిమితమై స్ఫూర్తిప్రదాతలు కాదని, అసాధారణమైన అడ్డంకులను చేధించిన మహోన్నతమైన క్రీడాకారిణులని, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు మహీంద్రా.Payal Nag.Daughter of a daily-wage mason from Odisha. Electrocuted at the age of eight. Lost all four limbs.And then, found a bow.Spotted through her paintings by coach Kuldeep Vedwan, the same man who shaped world champion Sheetal Devi. Defeated her idol Sheetal Devi at… pic.twitter.com/KdWGcuAJ9X— anand mahindra (@anandmahindra) April 6, 2026 (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
ఆమె జీవితం..ఆమె ఇష్టం
మీరట్‌లో ఒక రిటైర్డ్ జడ్జి విడాకులు పొందిన తన కుమార్తెను మేళతాళాలతో ఇంటికి తీసుకువచ్చి అదే తన తీర్పు అన్నాడు. ‘ఐ లవ్ మై డాటర్’ టీ షర్ట్లు ధరించి బంధువులంతా ఆమెను స్వాగతించారు. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తన కంటే 20 ఏళ్లు ఎక్కువ వయసున్న భర్తతో వేగలేకపోతున్న భార్యను విడాకులకు ముందే తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండే తీర్పును వెలువరించింది. వివాహం ఎంతో బాధ్యతతో నిర్వహించాల్సిన బంధం. పురుషుల వ్యవహారశైలిలో మార్పును ఈ రెండు తీర్పులు సూచిస్తున్నాయి.‘వివాహ బంధంలో మా అమ్మాయి ఇబ్బంది పడుతోంది. అది సరయ్యే మార్గం లేదు. ఆమెను బయటకు తేవడమే ఉత్తమం అని భావించాను. అదే నా తీర్పు’ అన్నారు మీరట్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర కుమార్ శర్మ. శనివారం (ఏప్రిల్ 4న) ఆయన కుమార్తె ప్రణిత వశిష్టకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి ఇంటికి ఆయన తన కూతురుని బ్యాండ్ బాజాలతో, పూలహారాలతో, స్వీట్స్‌తో ఊరేగింపుగా తీసుకొని వచ్చాడు. బంధువులు అందుకు తోడు నిలిచారు. వీరంతా నల్లటి టీషర్టులు ధరించారు. ఆ టీషర్ట్‌ల పై ‘ఐ లవ్ మై డాటర్’ అనే నినాదం ఉంది. సమాజానికి విడాకులంటే చిన్న చూపు పోవడానికే ఇదంతా చేయాల్సి వచ్చిందని ఆ తండ్రి తెలియచేశాడు.2018లో వివాహంజ్ఞానేంద్ర కుమార్ శర్మ తన కుమార్తె ప్రణిత వివాహాన్ని 2018లో షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక ఆర్మీ మేజర్‌తో జరిపించారు. అయితే పెళ్లయిన నాటి నుంచి భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడు. ఒక బిడ్డ జన్మించినా అతని వైఖరిలోమార్పు లేదు. తండ్రిగా ఇదంతా చూసి ఆమెకు ధైర్యమివ్వడానికి తోడు నిలిచాడు జ్ఞానేంద్ర కుమార్ శర్మ. ‘కుమార్తె బాధలో ఉంటే దాని నుంచి బయట పడేసే బాధ్యత తండ్రిగా నా మీద ఉంది. ఆమె గౌరవాన్ని కాపాడటం ముఖ్యం. ఏ కుమార్తే, తన తల్లిదండ్రులకు బరువు కాదు’ అన్నాడాయన. ప్రణిత పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక సంస్థలో ఫైనాన్షియల్ డైరెక్టర్‌గా పని చేస్తోంది. ‘మేము భరణం ఆశించలేదు. మాకు వద్దు కూడా’ అన్నారు ఆ తండ్రీ కూతుళ్లు. ‘ఇన్నాళ్లు అత్తగారింటిలో నేను మానసికంగా బలహీనపడుతూ వచ్చాను. దీనికి ముగింపు పలకాలనుకున్నాను. నేను చెప్పేది ఒకటే.... కష్టాలను సహిస్తూ కూచోవద్దు. పరిష్కారం వెతకండి’ అంది ప్రణిత. కళ్లకు కనపడుతున్న ఇలాంటి తీర్పులను చూసి వివాహ వ్యవస్థ లోటుపాట్లను తల్లిదండ్రులు, భార్యాభర్తలు మరింతా మెరుగ్గా సరి చేసుకోవాలి. ఎవరి బాధ్యతలు, హక్కులు వారు తెలుసుకోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. నచ్చిన వ్యక్తితో ఉండొచ్చుమధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియెర్ బెంచ్ ఏప్రిల్ 2న ఇచ్చిన మరో తీర్పు కూడా స్త్రీ నిర్ణయానికి వత్తాసు పలికింది. 40 ఏళ్ల వయసు కలిగిన భర్త తన భార్య కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా అతని 19 ఏళ్ల భార్య కోర్టు ముందు ప్రత్యక్షమైంది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తన సమ్మతం ప్రకారమే మరో వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయానని ఆమె కోర్టుకు తెలిపింది. కోర్టులో భర్త, అత్తామామలు, తల్లిదండ్రుల ఎదుట తన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించింది. దాని ప్రకారం 19 ఏళ్ల వయసున్న తనకు రెట్టింపు వయసున్న భర్తతో జీవించాలని లేదని, ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా భర్త వినక బాధిస్తున్నాడనీ, ఇంటి నుంచి పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు బలవంతంగా మళ్లీ అతని వద్దకే పంపుతున్నారనీ, ఈ నేపథ్యంలో తనకు నచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్లిపోవాలన్నది ఆమె అభ్యర్థన. ఈ వేడుకోలు విన్న కోర్టు ఇప్పటి వివాహంలో ఇంకా విడాకులు జరక్కపోయినా ఆమెను తనకు నచ్చిన వ్యక్తితో ఉండవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. అంతే కాదు ఆమెకు నచ్చిన కుర్రాడిని పిలిచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంది. విడాకులయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని, అంతవరకుగాని ఆ తర్వాత గాని ఆమెను ఏ విధంగానూ బాధించనని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కోర్టు ఆరునెలల పాటు ‘శౌర్య దీదీ’ పరిశీలనలో ఉండాలని ఆమెను ఆదేశించింది. కోర్టు నియమించిన మహిళా అడ్వకేట్ ఆమెతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ ఆరు నెలల పాటు ఆమె జీవితాన్ని పరిశీలిస్తూ ఏదైనా సహాయం కావాలంటే చట్టపరంగా తక్షణం అందిస్తారు. ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ‘శౌర్య దీదీ’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ. -
మన అమెరికన్
స్టూడెంట్ లీడర్‌గా జాత్యహంకారంపై పోరాడిన రిని సంపత్‌కు సమస్యల మూలాలు తెలుసు. ఆ సమస్యలపై అలుపెరగని పోరాటం తెలుసు. ‘నేను వలస ప్రజల బిడ్డను’ అని గర్వంగా చెప్పుకునే రినికి ఆత్మగౌరవ నినాదం తెలుసు. తమిళనాడులోని తేనిలో జన్మించిన 31 ఏళ్ల రిని సంపత్, వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళగా నిలిచారు.ఏడు సంవత్సరాల వయసులో రిని సంపత్ తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. ‘యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యుఎస్సి)లో చదువుకున్న రిని విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. యుఎస్సీ అధ్యక్షురాలిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. వారి హక్కుల కోసం నినదించారు. జాత్యహంకారాన్ని, వేధింపులను వ్యతిరేకించారు.వారే నిజమైన అర్హులుడెమొక్రటిక్ పార్టీకి చెందిన రిని సంపత్ ప్రభుత్వ కాంట్రాక్టర్. ప్రాథమిక అవసరాలు తీర్చండి’ ‘ఒక కొత్త డీసీ’ నినాదాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ‘నగరవాసులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం, వినాశకరమైన మురుగునీరు పొంగి పొర్లడాన్ని ఆపడం, గుంతలను పూడ్చడం, ధరలను తగ్గించడం అనేవి నా ప్రాధాన్యత అంశాలు. వాషింగ్టన్ డీసీని అందరికీ ఉపయోగపడేలా చేస్తాను. తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారే మేయర్ పదవికి అర్హులు’ అని తన ప్రచార వెబ్సైట్లో పేర్కొన్నారు రిని. వాషింగ్టన్ డీసీని ప్రధానంగా డెమొక్రాట్లు పాలిస్తున్నారు. 1975లో మేయర్ పదవికి ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి రిపబ్లికన్ మేయర్‌గా ఎవరూ ఎంపిక కాలేదు.ఇదే సరిౖయెన సమయంతాను రాజకీయనాయకురాలు కాదని నొక్కి చెబుతుంటారు రిని. ‘నేను సంప్రదాయ రాజకీయ నాయకురాలిని కాదు. నేను ఒక ఫెడరల్ కాంట్రాక్టర్‌ని. నా వృత్తిజీవితమంతా ప్రభుత్వ కార్యక్రమాలలో, పౌర సేవలను మెరుగుపర్చడంలో గడిపాను.మనకు ఒక కొత్త వ్యక్తి కావాలినగరానికి సేవలను అందించడంపై అవిశ్రాంతంగా దృష్టి సారించే వ్యక్తికి ఇది సరిౖయెన సమయం. అందుకే నేను మేయర్ రేస్‌లో ఉన్నాను. మనం కలిసి పనిచేసి, మెరుగైన డీసీని నిర్మించగలమని నమ్ముతున్నాను’ అని ప్రజలను ఉద్దేశించి అంటున్నారు రిని.విజయానికి స్పష్టమైన మార్గంఫిబ్రవరి ఆరంభంలో వచ్చిన మంచుతుఫాన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు. వికలాంగులు ఎక్కడో ఒకచోట చిక్కుకుపోయారు. నిత్యావసర సేవలు అందలేదు. ఉద్యోగులు రకరకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. తన ప్రచారయాత్రలో ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు రిని.‘విజయం సాధించడానికి మనకు స్పష్టమైన మార్గం ఉంది. కేవలం నాలుగు వారాల్లోనే డీసీ చరిత్రలో మేయర్ బ్యాలెట్‌కు స్థానం సంపాదించిన మొట్టమొదటి దక్షిణాసియా అభ్యర్థిగా నిలిచాము. తక్కువ వనరులతో, ప్రజల మద్దతుతో సాగిన ప్రచారం ఇంతటి విజయాన్ని సాధించింది. నగరవ్యాప్తంగా ప్రతి ఓటరును చేరుకోవడానికి అవసరమైన వనరులు మనకు సమకూరి ఉంటే ఇంకా పెద్ద విజయం సాధించవచ్చు’ అంటున్నారు రిని సంపత్. చారిత్రక మైలురాయిమేయర్ ప్రైమరీ ఎన్నిక జూన్ 16న జరగనుండగా, సాధారణ ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. అమెరికా రాజకీయాలలో ప్రాతినిధ్యానికి సంబంధించి రిని ప్రచారం చారిత్రక మైలురాయిగా నిలవనుంది. ఉన్నత స్థాయికి ఎంపికైన పదవులలో భారతీయ అమెరికన్లకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. వారి రాజకీయ భాగస్వామ్యం పెరుగుతున్న తరుణంలో మేయర్ బరిలో రిని సంపత్ నిలవడం విశేషంగా మారింది. మేయర్‌గా ఎన్నికైతే ఆమె డీసీ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్ అవుతారు. చిన్న వయసులోనే అమెరికాకు వెళ్లినా తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు రిని. ‘మా తాతగారు ఎప్పుడూ నాకు చోదకశక్తిగా, స్ఫూర్తితేజంగా ఉన్నారు’ అంటారు.ఆ శక్తి ఏమిటో నాకు తెలుసువాషింగ్టన్ డీసీ మేయర్ పదవికి బ్యాలెట్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణాసియా వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది. అమెరికా కలను సాకారం చేసుకోవాలనే తపనతో తల్లిదండ్రులతో కలిసి ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చాను. వలసదారుల కుమార్తెగా, కఠోర శ్రమ, పట్టుదలల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఆ విలువలని నగర పాలక సంస్థ(సిటీ హాల్)లోకి తీసుకు రావడానికి, వాషింగ్టన్ వాసులందరికీ సత్ఫలితాలు అందించడానికి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను. డీసీ మేయర్ పదవికి నన్ను బ్యాలెట్లో చేర్చడానికి నా పిటిషన్‌పై 4,500 మందికి పైగా సంతకాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు దక్షిణాసియా ప్రజల సహకారం ఎంతో ఉంది. కానీ ప్రభుత్వంలో వారికి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉండటం విచారకరం.– రిని సంపత్, మేయర్ అభ్యర్థి, వాషింగ్టన్ డీసీ -
రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్‌చేస్తే..
మంచి హోదాలో హుందాగా సాగిపోతున్న లగ్జరీ లైప్‌ని వదులుకుని నిలకడగా డబ్బులు రాని రంగంలోకి వెళ్లడానికి చాలా ధైర్యం కావాలి. పోనీ వెళ్లినా..నిలదొక్కుకోలేకపోతే అంతే సంగతులు. ఈ యువతి అలాంటి నిర్ణయం తీసుకుని ఎంతో సతమతమై చివరకు సక్సెస్ అయిన విధానాన్ని నెట్టింట షేర్ చేసుకుంది. అంతేగాదు తనలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఎలా ధైర్యంగా ముందడుగు వేయాలో సూచనలివ్వడమే గాక, ఆ ఛాలెంజ్‌కి ఎలా కట్టుబడి ఉండాలో ఆలోచింపచేసేలా చెబుతుండటం విశేషం.ఆ అమ్మాయే సాన్యాబాత్ర. కంటెంట్ క్రియేషన్ రంగంలోకి ప్రవేశించడానికి మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులకున్న తన ప్రయాణం గురించి సోషల్ మీడియా వేదికగా వివరించింది. ఆ నిర్ణయం వల్ల కలిగిన భయం, అనిశ్చితి, రిస్క్‌లు గురించి హైలెట్ చేసింది. ఏడాదికి రూ. 50 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని వదిలేసినప్పటి క్షణాన్ని గుర్తు చేస్తుకుంటూ..ఆ నిర్ణయం ఏ మాత్రం సులభం కాదని త్వరలో అర్థమైందన్నారు. ముఖ్యంగా చుట్టూ ఉన్నవారి సందేహాలు, అనుమానాలు తనను వెంటాడాయని అన్నారు. అలాగే తన తీసుకున్న రంగంలో సక్సెస్ అందుకోగలనా అనే భయం అంకంతకు పెరిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కువ జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకున్న వెర్రిదాన్ని తానేనేమో అనే భయంతో నిద్ర కూడా పట్టేది కాదని అంటోంది. నిజానికి కంటెంట్ క్రియేషన్ అన్నది సరైన కెరీర్ కాదు. పైగా ఉద్యోగాన్ని వదిలేయడం అంటే ఆర్థిక భద్రతను కాదనుకోవడమే అని ఆ సమయంలోనే తెలుసొచ్చిందని అంటోంది. అయితే ఇన్ని సవాళ్లు, భయాలు వెన్నాడినా..స్థిరత్వంతో నీపై నువ్వు నమ్మకంతో సాగిపో అని అంతరాత్మ చెప్పే ప్రబోధం వైపుకే ధైర్యంగా సాగి విజయవంతమయ్యానని ఆనందంగా చెబుతోంది. అంతేగాదు కంటెంట్‌ను క్రియేట్ చేయడం, నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం చేస్తూ..నెమ్మదిగా మెరుగుపడ్డానని అంటోంది. కానీ నిలకడగా చేశానని అదే సక్సెస్ అయ్యేలా చేసిందని చెబుతోంది. అంతేగాదు సందిగ్థాలు ఎదురై టైంలో మనల్ని మనం నమ్మడం గురించి తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుందని అంటోంది. పెద్ద నిర్ణయం తీసుకుని దాని అంచున నిలబడి ఉంటే..బహుశా మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా నమ్మడానికి ఇది సంకేతం కావొచ్చు అని గుర్తించుకోండి అని చెబుతోంది. చివరగా ఏ నిర్ణయం తీసుకున్నా..ఎన్ని సవాళ్లు, భయాలు వెంటాడినా..నిలకడగా చేయడం అత్యంత ముఖ్యమైనది, అదే మిమ్మల్ని విజయతీరాల వైపుకి నడిపిస్తుందని చెబుతోంది. నెటిజన్లను ఈ పోస్ట్ అమితంగా ఆకర్షించడమే కాదు..మీలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు మేడమ్..పలానా అవ్వాలని అనుకోవచ్చేమో గానీ..అంతలా డేర్ చేయలేరంటూ సాన్యపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Sanya Batra | Travel & Lifestyle (@insanyaty) (చదవండి: మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!) -
రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!
రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి..తల్లి అయ్యాక మళ్లీ కెరీర్‌కి బ్రేక్ ఇస్తే..తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఉద్యోగం కోల్పోవడంతో కొంత భయం, కాన్ఫిడెన్స్ మాయం అవ్వడం సహజం. అందులోనూ ఓ పక్క తల్లి అవ్వడంతో పెరిగిన బాధ్యతలు నడుమ ఒక విధమైన మానసిక ఒత్తిడి ఎదురవ్వుతుంది. అవన్నీ తట్టుకుని మళ్లీ ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్లపై నిలబడాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాల్సి ఉంటుంది. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది 39 ఏళ్ల మహిళ.డాక్టర్ ప్రియా పోర్వాల్ రెండుసార్లు ఉద్యోగాన్ని కోల్పోయి, తల్లి అయ్యాక కొంత కాలం కెరీర్‌కి విరామ ఇచ్చి..మళ్లీ తన ఉద్యోగ కెరీర్‌ని నిర్మించుకోవడానికి ఎంతలా పాట్లు పడిందో పంచుకున్నారు. విద్యారంగంలో ప్రారంభమైన తన ఉద్యోగ కెరీర్ ఊహించని మలుపు తీసుకునే ముందు..దశాబ్దానికి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారామె. ప్రియ తాను 35 ఏళ్ల వయసులో తల్లి అయ్యానని, ఈ మైలు రాయి తన 12 ఏళ్ల కెరీర్‌కు విరామం ఇచ్చేలా చేసిందని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయి చాలా ఏళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ అనుభవం తనను చాలా కలవరపరిచిందని అన్నారు. కోలుకోవడానికి నెలలు పట్టిందని, తన కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా అనిపించిందంటూ ఆ మానసిక క్షోభను గుర్తుచేసుకున్నారు. తిరిగి ఎలాగైన పుంజుకోవాలనే పట్టుదలతో ప్రియా పలు సంస్థలలో విజిటింగ్ ఫ్యాకల్టీ సభ్యురాలిగా అవకాశాలు అన్వేషించారు. ఆ తర్వాత మరో విద్యాసంబంధమైన పదవిని కూడా పొందారు. అయితే అక్కడి వాతావరణం ఆమె అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మరోసారి అక్కడ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తిరిగి ప్రారంభించడం అంత సులభం కాదని తేలింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది. 37 ఏళ్ల వయసులో, ఒక చిన్న బిడ్డను పెంచుతూ, అనిశ్చితిని ఎదుర్కొంటూ..తన కెరీర్‌పై పూర్తి నియంత్రణ సాధించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నారామె. తాను తిరిగి కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను, అదికూడా తనకు నచ్చిన విధంగా అని చెప్పుకొచ్చింది. ఆర్థిక స్వాతంత్యానికి మించిన చోదకశక్తి మరొకటి లేదని అంటోంది. తన సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టానని, కేవలం డబ్బుకోసం కాదు, వ్యక్తిగత ప్రాముఖ్యత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ రోజు, ఆ నిర్ణయం ఫలించిందని, గతేడాది తాను డాలర్లలో ఐదు అంకెల జీతం కూడా సంపాదించినట్లు పేర్కొంది. ఇతర మహిళలకు ఆమె ఇచ్చే సందేశం ఏంటంటే.. “ప్రసూతి అనేది వృత్తికి ముగింపు కాదు.” అని నొక్కి చెబుతోంది. (చదవండి: వివాహిత మహిళలు గూగుల్‌లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!) -
రుతుక్రమం వైకల్యం కాదు
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన బహిష్టు సెలవుల ఉత్తర్వు చట్టపరమైన చర్చకు దారితీసింది. దీనిని సవాలు చేస్తూ 15 మంది మహిళా వృత్తి నిపుణులు హైకోర్టు మెట్లెక్కారు. రుతుక్రమ సెలవును ‘కపట వివక్షగా’ అభివర్ణించారు. ఇది బంగారు పంజరం లాంటిదని.. పైకి మహిళల మేలు కోసమే అన్నట్లుగా కనిపించినా.. ఇలాంటివి వారి కెరీర్‌ని దెబ్బతీస్తాయని వారు వాదించారు. మూసధోరణులకు ముగింపు పలకాలన్నారు.ఉత్తర్వు ఏం చెబుతుంది?కర్ణాటక ప్రభుత్వం బహిష్టు సెలవు విధానాన్ని నవంబర్ 2025లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రవేశపెట్టారు. ఇది మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవును తప్పనిసరి చేస్తుంది. అంటే ఏడాదికి 12 రోజులు. ఈ ఉత్తర్వు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాలకూ వర్తిస్తుంది. అంటే ఐటీ సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేసే 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అవసరం గల ప్రతి మహిళా సెలవు తీసుకోవచ్చు. దీనికి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే ఉపయోగించని సెలవులను తదుపరి నెలకు బదిలీ చేయడం సాధ్యపడదు.మూసధోరణుల్ని ప్రోత్సహించడమేప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ‘బహిష్టు సెలవు’పై ప్రశ్నిస్తూ ఉన్నత హోదాల్లో ఉన్న 15 మంది మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఇది మృదువైన వివక్షకు నిదర్శనమన్నారు. సమానత్వాన్ని పెం పొందించడానికి బదులుగా, ఈ విధానం దానికి విరుద్ధమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల నియామక ప్రక్రియలలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని, యజమానులు మహిళలను పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలవారిగా చూసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ చర్య ఆనాటి మూస పద్ధతులను బలపరిచే ప్రమాదం ఉందని, వారి ఎదుగుదలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెలవు మహిళలను బలహీనులుగా చిత్రీకరిస్తుందని, తద్వారా సమానత్వ చట్టాల అసలు ఉద్దేశ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని వారు వాదించారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో మహిళలు ప్రత్యేక రాయితీలు, నిర్బంధ సెలవులు కోరుకోవడం లేదు, కేవలం సమాన అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కోరుతున్నారు. రుతు క్రమాన్ని ఒక వైకల్యంగా మార్చడం తమ వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం’’ అని ఈ మహిళల వాదన.పని ప్రదేశాల్లో ఈ రకమైన వివక్షను గుర్తించడం కష్టం, ఎందుకంటే ఇది ప్రేమ, మర్యాద రూపంలో వస్తుంది. ఈ బంగారు పంజరం నుంచి బయటపడాలంటే, మహిళలను కేవలం రక్షించాల్సిన వ్యక్తులుగా కాకుండా, సమాన సామర్థ్యం గల భాగస్వాములుగా గుర్తించడం నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. -
మరో చరిత్రకోసం...
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్‌లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.రికార్డ్ సృష్టించి...2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్‌తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్‌లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్‌గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.అంటార్కిటికాలో...‘ఆర్టెమిస్–2’ మిషన్‌కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్‌లో అసైన్డ్ క్రూ బ్రాంచ్‌కు చీఫ్‌గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో సెంటర్ డైరెక్టర్‌కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్‌గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.అంతరిక్ష యోగా!‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్‌కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?‘యస్’ అంటున్నారు కోచ్. తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్. శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్‌కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.రికార్డ్‌లు బద్దలు కావాల్సిందే!→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్‌ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్‌ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?క్రిస్టినా కోచ్: నేను రికార్డ్‌లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్‌లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్‌లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.→ అంతరిక్ష అనుభూతి గురించి...కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. -
నాటి నర్స్.. నేటి ఆరోగ్య మంత్రి
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో... నర్సుగా శిక్షణ పొందిన నిశా మెహతా. నేడు నేపాల్ ఆరోగ్య మంత్రి అయ్యారు. ఆమె పరిచయం.రాజకీయాలలోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖా మంత్రులుగా పని చేయడం చూశాం. అయితే నేపాల్‌లో ఒక నర్సు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. మార్చి 27న ప్రధాని బాలేంద్ర షా మంత్రి వర్గంలో నర్స్ నిశా మెహతా ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఒక విశేషమైతే ఆమెకు భారత్‌తో అనుబంధం ఉండటం మరో విశేషం.ఎయిమ్స్‌లో చదువుకునినేపాల్లోని కోషిప్రాంతానికి చెందిన 39 ఏళ్ల నిశా మెహతా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ చదివారు. ఆ తర్వాత గ్వాలియర్ యూనివర్సిటీలో నర్సింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తమ పూర్వవిద్యార్థిని నేపాల్ ఆరోగ్యమంత్రిగా ఎదగడం తమ సంస్థకే కాకుండా, మొత్తం నర్సింగ్ వృత్తికే ఘనతగా మారిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.మెహతా చురుకైన వ్యక్తి అని, బహుముఖ ప్రజ్ఞ గల విద్యార్థిని అని ఆమె చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లతా వెంకటేశన్ తెలిపారు. మెహతా విద్యార్థి దశలో రాజకీయంగా చురుకుగా లేనప్పటికీ నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటూ, ఆమె ఒక విశేషమైన వ్యక్తిగా కనిపించేవారని కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజు వత్సా గుర్తు చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక నేపాల్ తిరిగి వెళ్లిన నిశా అక్కడి ధారణ్లోని బి.పి.కోయిరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో క్లినికల్ నర్స్‌గా పని చేశారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆవిర్భావం నుంచి పని చేయడం మొదలుపెట్టారు. 2022 ఎన్నికలలో పదవికి కొద్దిదూరంలో ఆగిపోయినా ఈసారి కేంద్రమంత్రి కాగలిగారు.నర్స్‌గా సామాన్యుల సమస్యలను దగ్గరి నుంచి చూడటం వల్ల జాతీయ స్థాయిలో ఆమె చేయనున్న హెల్త్ పాలసీలపై అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ల విషయంలో ఆమె గట్టి మార్పు తేనున్నారని భావిస్తున్నారు. -
చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!
60 దాటగానే చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. అలాంటిది ఈ బామ్మ 103 ఏళ్ల వయసులోనూ టీ స్టాల్ నడుపుతూ స్ఫూర్తిగా నిలిచింది. ఎవ్వరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకాలన్న ఆమె దృఢసంకల్పానికి హ్యాట్సాప్ అనాల్సిందే. అంతేగాదు కష్టపడేతత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ బామ్మ ప్రూవ్ చేసింది.ఆ బామ్మే గుజరాత్‌లోని వడోదరకు చెందిని 108 ఏళ్ల కాశీబా. ఆమె మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం సమీపంలోని చొన్న టీ స్టాల్ నడుపుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందామె. ఆమె అల్లం టీకి ఉన్న క్రేజీ అంత ఇంత కాదు. అక్కడ విద్యార్థులకు దశాబ్దాలుగా తన టీ రుచితో ఆకర్షిస్తుంటుందామె. స్వయంగా ఆమె అల్లం తురిమి తయారు చేస్తుంటుంది ఈ బామ్మ. ఆమె వయసులో అందరూ విశ్రాంతి ఆశిస్తారు..కానీ ఆమె అచంచలమైన సంకల్పంతో తన చిరు వ్యాపారాన్ని నడుపుతూ ఆత్మనిర్భరతకు అసలైన అర్థంగా మారింది. 1993 నుంచి ఆమె ఈ టీస్టాల్‌ని నడుపుతుంది. అక్కడ ఎందరో విద్యార్థులకు అదొక మధుర జ్ఞాపకాల ప్రదేశం. కొందరు విద్యార్థులు అక్కడకు వచ్చి స్నేహితులతో కలిసి ఈ బామ్మ చేతి టీ తాగుతూ నాటి మధురస్ముతులను గుర్తుచేసుకుంటుంటారట. ఆమెకు కొడుకు, కోడలు, మనవళ్లు ఉన్నా..తను మాత్రం స్వతంత్రంగా బతికేందుకే ఆసక్తి కనబరుస్తుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ బామ్మ..అందంగా జీవించడం అంటే ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sakshi Singh l Journalist (@_.sakshieee) (చదవండి: కేవలం 'ఫ్లవర్ అనుకుంటివా.. పోషక విలువలున్న ఫుడ్'..!) -
ఆమె... అమెజాన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్‌కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.మూడింతలు పెంచేలా...సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్‌ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు. ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.హైపర్ పర్సనలైజ్డ్అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్‌ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.ఏఐ ఆధారిత ఆవిష్కరణలుసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్‌కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్‌లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్. అమెజాన్ సహేలి‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్‌లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్‌బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. -
అక్షరాల... సినిమా బయోపిక్
ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్ రోల్ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత అయి, శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం. పైగా, రచయిత్రి పల్లవి రాసిన మహానటి సావిత్రి జీవితకథ ‘సావిత్రి’ లాంటివి గతంలో బెస్ట్ సెల్లర్స్ కావడమూ అందుకు నిదర్శనం. ఆ రకమైన రచనా సంవిధానంలో మెప్పించే మెరుపులు చాలానే ఉంటాయి కానీ, కొన్నిసార్లు... అసలు జరిగిన వాస్తవమేదో, కొసరు కవికల్పన ఏదో తెలియనంతగా పాలు, నీళ్ళు కలసినట్టు సాగిపోతాయి. వీలైనంత వరకు చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను పేర్కొంటూనే, సంఘటనను నాటకీయంగా చెప్పడంలో రచయిత నిజాయతీ, నైపుణ్యం రాణకెక్కుతాయి. ఉత్తమ పత్రికా రచయితగా నంది అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ భగీరథ తన తాజా ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచనలో అక్షరాలా చేసినది అదే!ఒక మంచి ఇతివృత్తం చేయి తిరిగిన వ్యక్తి చేతిలో పడినప్పుడు అది కొత్త సొబగులు సంతరించుకోవడం సహజం. రచయితగా, పత్రికా రచయితగా ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న భగీరథ ఈ రచనలో దాన్ని సమర్థంగా వినియోగించారు. ఇటీవల ఎన్టీఆర్‌పై ‘తారకరామం’, ‘శకపురుషుడు’ లాంటి పుస్తకాలు, అలాగే కృష్ణదేవరాయల కాలంపై రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి’ ద్వారా నవతరం పాఠకులకు సైతం ఆయన సుపరిచితులే. సినీ సుప్రసిద్ధుల జీవిత కథలు రాయడం కూడా ఆయనకేమీ కొత్త కాదు. గతంలో నటి జమున అంతరంగావిష్కరణ ‘జమునా తీరం’, భాగ్యనగర్ స్టూడియోస్ వ్యవస్థాపక అధినేత బాదం రామస్వామిపై ‘మహర్జాతకుడు’, హీరో జగపతి బాబు తండ్రి – ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌పై ‘దసరా బుల్లోడు’ లాంటి సినీ జీవిత కథలు ఆయన కలం నుంచి వచ్చి, అశేష ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు అలనాటి హీరోయిన్ కృష్ణవేణి కుమార్తె, ప్రముఖ నిర్మాత ఎన్.ఆర్. అనూరాధాదేవి పనుపున భగీరథ ఈ ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచన చేశారు. కృష్ణవేణి జీవితంతో పాటు ఆ సమకాలీన పరిస్థితుల్ని రచనలో ప్రతిబింబించేందుకు రచయిత కసరత్తు చేశారు. నిజానికి, నటుడు ఎన్టీఆర్ – సంగీత దర్శకుడు ఘంటసాల – సుస్వరాల రమేశ్ నాయుడు... ఇలా ఎందరో మహామహుల్ని సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.చిన్న వయసులోనే తల్లి లేని బిడ్డగా సవతి తల్లితో ఇబ్బందులు పడడం, పిన్ని – బాబాయ్ వద్ద పెరగడం, రంగస్థలంపై ఆసక్తి పెరగడం, అప్పట్లో భానుమతి, రేలంగి, అంజలీదేవి సహా ఎందరినో స్టార్లుగా తీర్చిదిద్ది ‘తారాబ్రహ్మ’గా పేరొందిన సినీ దర్శక – నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహం లభించడం, ఎనిమిది – తొమ్మిదేళ్ళ వయసులోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ’లో టైటిల్ రోల్ పోషించడం, పితృసమానుడైన పుల్లయ్య గారి మీద అపార గౌరవంతో యర్రంశెట్టి కృష్ణవేణి కాస్తా చిత్తజల్లు కృష్ణవేణిగా మారడం, ఆ పైన హీరోయిన్గా రాణించడం, మీర్జాపురం రాజా వారు (మేకా వెంకట్రామయ్య అప్పారావు)తో వివాహం, భర్త జస్టిస్ పార్టీ అయితే తాను కాంగ్రెస్ సానుభూతిపరురాలిగా ‘మన దేశం’ (1949) లాంటి చిత్ర నిర్మాణం సాగించడం, ‘కీలుగుర్రం’ – ‘గొల్లభామ’, 'లక్ష్మమ్మ' లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాల రూపకల్పన లాంటి తొలినాళ్ళ సినీ చరిత్రలోని ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఈ రచనలో చదవవచ్చు. నిండు నూరేళ్ళు జీవించిన ఆమె ప్రస్థానంలోని అనేక ఘట్టాలను చదువుతుంటే... అచ్చంగా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రచనా శైలి సాగుతుంది. ప్రతి సంఘటననూ దృశ్యమానమయ్యే రీతిలో రాయడంతో... ఒక రకంగా ఇది కాగితంపై అక్షరాలలో కనిపించే ఓ బయోపిక్ అనవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ మొదలు ‘సాక్షి – ఎక్సలెన్స్ అవార్డ్’ (లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్) సహా ఎన్నో గుర్తింపులు పొందిన సి. కృష్ణవేణి జీవితకథ చదువుతుంటే... కేవలం ఓ వ్యక్తి జీవితంగా అనిపించదు. దాదాపు నూరేళ్ళ కాలగతిలో సమాజంలోనూ, సినిమాలోనూ వచ్చిన మార్పులు సైతం కళ్ళ ముందు రీళ్ళు తిరుగుతాయి. మహిళలను ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చూస్తూ, సమాజం ఇంతగా పురోగమించని రోజుల్లోనే... కృష్ణవేణి సాగించిన జీవితం, సాధించిన విజయం అబ్బురపరుస్తాయి. ఇవాళ్టికీ ఎందరికో స్ఫూర్తిమంత్రంగా నిలుస్తాయి. అరుదైన ఫోటోలతో పాటు, అవి అందుబాటులో లేని కీలక ఘట్టాలకు రేఖాచిత్రాలను సుప్రసిద్ధ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్‌తో ప్రత్యేకంగా గీయించడం ఈ 516 పేజీల రచనకు వన్నె తెచ్చింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనేక అడ్డంకులున్న ఆ రోజుల్లోనే ఎంత సమున్నత స్థాయికి చేరి, నూరేళ్ళ జీవితాన్ని పండించుకుందో తెలిపే ఈ రచన నేటి తరానికీ ప్రేరణనిచ్చే పాఠం. ఆపకుండా చదివించడంతో పాటు... అన్నీ కళ్ళ ముందే జరుగుతున్న అనుభూతిని కలిగించడంతో... ఈ జీవితకథ సినీచరిత్రపై ఆసక్తి గలవారికి అందమైన బహుమానం.మీర్జాపురం రాణి... కృష్ణవేణి (నటి కృష్ణవేణి జీవితకథ), రచన – భగీరథ, ప్రతులకు – నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్. మొబైల్ – 92474 71361).– రెంటాల జయదేవ -
తొలి ట్రాన్స్‌జెండర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్..!
కుటుంబం, యావత్తు సమాజం తన పుట్టుకను అంగీకరించలేదు. అడగడుగున వివక్ష, హేళనలు అవమానాలు. వాటన్నింటిని తన పని, గుర్తింపుతోనే తగిన సమాధానమివ్వగలనని భావించి నిశబ్దంగా పట్లుదలతో సాగింది. ఇవాళ ఆ నమ్మకమే గెలిచి..ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టింది. ట్రాన్స్‌జెండర్ విలక్షణమైన మనిషి, విభిన్నంకాదు అని అందరు అంగీకరించేలా తన గెలుపుతో చాటిచెప్పింది. ఆ మహిళే డాక్టర్ ఎన్ జెన్సీ.తమిళనాడులో పీహెచ్డీ పట్టా పొందిన తొలి ట్రాన్స్ జెండర్. ఆ తర్వాత ఆమె లయోలా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందారు. యూజీ,పీజీలలో స్వర్ణ పతక విజేత అయిన ఆమె ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఉచిత విద్య, జీవనోపాధి సహాయం అందించడంతో తోడ్పడుతున్నారు. తమిళనాడులోని తిరుత్తని సమీపంలో ఉన్న ఆర్కే పేట అనే చిన్నగ్రామంలో జెన్సీ బాల్యం సాగింది. అంత చిన్న వయసులోనే కఠోర సత్యం తెలుసుకుంది తనను ఈ ప్రపంచం మనుగడ సాగించనివ్వదని. తల్లిదండ్రులు మద్దతు లేకుండా సాగుతున్న ఆమెకు గుర్తింపు కోసం పోరాటం ఆ క్షణం నుంచి మొదలైంది. తనకు రక్షణగా ఉండేది ఏది అని అన్వేషించడం మొదలుపెట్టింది. అనుక్షణం వెంటాడుత్ను వివక్షకు విరుగుడు విద్య మాత్రమే అని అర్థం చేసుకున్నా అని ఓ ఇంటర్వూలో జెన్సీ స్వయంగా చెప్పింది. అది మొదలు ఎప్పుడు గుర్తింపు పొందేలానే చదవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అలా వలక్కనంపూడిలోని స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యలో కూడా ప్రథమ స్థానంలో ఉండేది. ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు నుంచి తన ప్రతిభతో గుర్తింపు, గౌరవం దక్కించుకునేలా ఆహర్నిశలు కష్టపడింది. ఆ పరుగు తిరుత్తానిలోని అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చేరి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువు వరకు కొనసాగించిది. అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఆమె డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మాస్టర్స్, ఎంఫిల్ చేసింది. ఆ రెండింటిలోనూ గోల్డ్ మెడల్ ఆమెదే కావడం విశేషం. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కళాశాల నుంచి ఆంగ్లంలో పిహెచ్డి పూర్తి చేసి, అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందింది. అలా ఆమె తమిళనాడు డాక్టరేట్ పొది అసిస్టెంట్ ప్రొఫెస్ర్గా నియామకం పొందిన తొలి ట్రాన్స్ జెండ్ మహిళగా నిలిచింది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం బహిరంగంగా ఆమెను అభినందించారు. అయితే జెన్సీ ఈ క్రెడిట్‌ని తన ట్రాన్ కమ్యూనిటికీ చెందనదని అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో పోరాటాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నానని అన్నారామె. ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా చూస్తూ ప్రతి ఏడాది వారికోసం ఏడు నుంచి 12 సీట్లు రిజర్వ్ చేసేలా కాలేజీ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్నారు. సమాజ పక్షపాత వైఖరికి ఓటమితో తలవంచకుండా.. విద్యతో ధీటుగా సమాధానమిచ్చి ఆమోదించేలా చేసుకోవాలని జెన్సీ తన కథ ద్వారా చక్కటి సందేశం ఇచ్చింది కదూ..!.(చదవండి: దంతాలతో కళాఖండాలు..! ఆమె టాలెట్కి ఫిదా అవ్వాల్సిందే) -
‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..!
కళ్లు పొడుచుకున్నా కనిపించనంత చీకటి. దుర్భేద్యమైన కొండలు. దారంతా రాళ్ళూరప్పలు...అవన్నీ దాటాలి. 150 అడుగుల లోపలకు వెళ్లాలి. అక్కడో మనిషి ఉన్నాడు. ఒళ్లంతా దెబ్బలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. అతడిని బయటకు తీయాలి. ఆ ప్రాణం కాపాడాలి. ఇదేమీ సినిమా కథ కాదు. నిజజీవిత విజయ గాథ. పర్యాటకుడి ప్రాణలు కాపాడిన సాహస బృందంలో శ్రీకాకుళం జిల్లాలోని మెట్టూరు గ్రామానికి చెందిన మేజర్ కవిత ఉన్నారు....భయపడితే భయమే మిగులుతుంది. ఆ భయం మరింత భయపెడుతుంది. ఆ భయాన్ని కాలదన్ని ముందుకు వెళితే సాహసం అవుతుంది. విజయం సొంతం అవుతుంది. ప్రాణరక్షణ చేసే ఆపద్భాందవ శక్తి అవుతుంది.ఉసిమలై లోయలో...మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఒక వ్యక్తి లోయలోకి పడిపోతే ఆపసోపాలు పడి బయటకు తీస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా ఊసిమలై లోయలో ఉన్న నీడల్రాక్ వ్యూ పాయింట్ దగ్గర జరిగింది. ఈ నెల 19న ఈ వ్యూ పాయింట్ దగ్గర ఒక పర్యాటకుడు సెల్ఫీ దిగుతూ 150 అడుగుల లోయలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ విషయం వెల్లింగ్టన్లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్ (ఎంఆర్సీ)కు తెలియజేయడంతో ఇండియన్ ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 29 ఏళ్ల సిక్కోలు సివంగి మేజర్ డాక్టర్ వాసుపల్లి కవిత కీలక పాత్ర పోషించారు. ఆమెది వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు. రెస్క్యూ ఆపరేషన్పర్యాటకుడు పడిపోయాడని సమాచారం అందగానే అగ్నిమాపక అధికారులు, అటవీ అధికారులు, సహాయక బృందాలు సంయుక్తంగా సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ చీకటి పడడంతో అంతా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఆర్మీ బృందం లెఫ్టినెంట్ కల్నల్ చందన్ మోహతా నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.రాత్రి 9.15 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో చిమ్మ చీకటి అలుముకుని ఉంది. కఠినమైన భూభాగం, ఎత్తైన ప్రదేశాలు, లోయలను దాటుకుంటూ 150 అడుగుల లోయకు చేరుకున్నారు. టార్చీల వెలుగులో బాధితుడిని గుర్తించారు. అప్పటికే ఛాతీ, చేయి, వీపు, తుంటి ఎముకలు విరిగి కదలలేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని గుర్తించారు. ప్రాణాలు కాపాడారు...టార్చ్‌లైట్ వెలుగులో క్షతగాత్రునికి మేజర్ డాక్టర్ కవిత ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అక్కడే స్ట్రెచర్‌ను ఏర్పాటు చేశారు. లోయ పక్కన ఉన్న రెండు పర్వతాల మధ్య 70 మీటర్ల టైరోలియన్ ట్రావర్స్ లైవ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. గురువారం రాత్రి 9.15 గంటలకు ప్రారంభించిన ఈ ఆపరేషన్ వేకువజాము 3.30 గంటల వరకు సాగింది. ఈ ఆపరేషన్‌లో కవిత కీలక పాత్ర పోషించారు. గత సంవత్సరం బ్రహ్మపుత్ర నదిలో 1,040 కిలోమీటర్లు రాఫ్టింగ్ యాత్ర పూర్తి చేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు.– కె. చలపతిరావు, వజ్రపు కొత్తూరు, రూరల్ సాక్షి, శ్రీకాకుళం (చదవండి: పొయ్యి వెలిగించకుండానే వండే వంటకాలు..!) -
బధిరులకు ఆమె మెంటార్
కమ్యూనికేషన్ సమస్యల వల్ల ఒకప్పుడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురైన ఒక మహిళ, నేడు దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బధిర (చెవుడు, మూగ) మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఆమే నాగ్‌పూర్‌కు చెందిన కృతిక ధుండే. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన కృతిక బాల్యం అంతా సవాళ్లతోనే సాగింది. బడిలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు సైన్ లాంగ్వేజ్ తెలియక΄ోవడంతో ఆమె ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ, ఆ అడ్డంకులే ఆమెలో పట్టుదలను పెంచాయి. తన తల్లిదండ్రుల అండతో చదువు పూర్తి చేసిన కృతిక, పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయ్యాక తన కాళ్ల మీద తాను నిలబడాలని నిర్ణయించుకున్నారు. 2023లో ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కమ్యూనికేషన్ సమస్య వల్ల ఇంటర్వ్యూలు మధ్యలోనే ఆపివేసేవారు. అయితే, ఆమె పట్టువదలకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. దీపికా భాటియా నేతృత్వంలోని మహిళా పారిశ్రామికవేత్తల నెట్వర్క్ గురించి తెలుసుకున్న కృతిక అందులో చేరారు. మొదట్లో లైవ్ క్యాప్ష¯Œ ్స సాయంతో విషయాలు అర్థం చేసుకునేవారు. క్రమంగా ఆ బృంద సభ్యులు కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఆమెకు సహకరించడంతో కమ్యూనికేషన్ సులభంగా మారింది. అనంతరం కృతిక తనలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర బధిర మహిళలను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. నేడు ఆమె 1,000 మందికి పైగా బధిర మహిళలకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెట్వర్క్ ద్వారా వారు నెలకు రూ. 70,000 వరకు సంపాదిస్తున్నారు. ‘ఆర్థిక స్వాతంత్య్రం నా జీవితాన్ని మాత్రమే కాదు, నన్ను చూసే సమాజపు చూపును కూడా మార్చింది. వికలాంగులలో అపారమైన ప్రతిభ ఉంటుంది, వారికి కావాల్సిందల్లా కేవలం అవకాశం మాత్రమే’ అని కృతిక సందేశమిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఇ¯Œ స్ట్రాగామ్‌లో సంజ్ఞా భాషలో వీడియోలు చేస్తూ లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారు. సంజ్ఞా భాష అనేది కేవలం సైగలు మాత్రమే కాదు, అది ఒక గొప్ప భావ వ్యక్తీకరణ అని నిరూపిస్తూ కృతిక సాగిస్తున్న ఈ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. -
వ్యర్థాలకూ వైద్యం
డెంటిస్ట్‌గా క్షణం తీరికలేనంత బిజీగా ఉండే డాక్టర్ శాంతి తుమ్మల, బెంగళూరు నగరంలోని చెత్త కుప్పలను చూసి బాధపడేవారు. అధికారులకు ఫిర్యాదు చేసి ఊరుకోవడం కాకుండా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. బస్సు, ట్రైన్, బస్‌స్టేషన్, చౌరస్తా... ఇదీ అదీ అని తేడా లేకుండా తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఎందుకు డాక్టరమ్మా ఇది నీకు’ అన్నారు చాలామంది. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి తన వృత్తిని వదులుకొని పూర్తిస్థాయి ప్రచార కార్యకర్తగా మారారు. లక్షలాది మందిలో మార్పు తీసుకువచ్చారు...బెంగళూరు హెచ్ఎస్ఆర్ లే అవుట్లో నివసిస్తున్న శాంతి తన ఇంటిసమీపంలో ట్రక్కుల నిండా చెత్తను చూసేవారు. ఆ చెత్తగుట్టలు ఆమెను తీవ్రంగా కలవర పరిచేవి. సమస్య పరిష్కారానికి తానే నడుం బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, ΄÷డి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను ఎలా వేరు చేయాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.అయితే... చాలామంది డాక్టర్ శాంతి మాటలకు అసహనంగా ముఖం పెట్టేవాళ్లు. కొందరికి ఆమె చెప్పింది వినడం టైమ్ వేస్ట్‌గా అనిపించేది. ‘పబ్లిసిటీ కోసమే ఈ ప్రచారం చేస్తుంది’ అని కొందరు చెవులు కొరుక్కున్నారు. ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరమ్ ద్వారా లక్షమందికి పైగా వ్యర్థాల విభజనలో సహాయపడ్డారు. ఆమె తన ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి ‘కంపోస్ట్ లెర్నింగ్ సెంటర్’ కూడా ్రపారంభించారు.మై వేస్ట్ మై మేనేజ్మెంట్కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆచరణాత్మక ప్రచారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు డాక్టర్ శాంతి. తన ఇంట్లోకి ΄్లాస్టిక్ను అనుమతించరు. గుడ్డ సంచులను ఉపయోగిస్తారు. పాత చీరెలు ధరిస్తారు. నిల్వ చేయడానికి స్టీల్ డబ్బాలనే వాడతారు.‘మై వేస్ట్ మై మేనేజ్మెంట్’ అనేది శాంతి నినాదం.ప్రజలు వ్యర్థాలను వేరు చేయడం ప్రారంభించినప్పటికీ, సేకరణ సమయంలో కాంట్రాక్టర్లు వాటన్నింటినీ మళ్లీ కలిపేస్తున్నారని ఆమె గమనించి, అలా జరగకుండా ఉండడానికి అధికారుల సహకారం తీసుకున్నారు.వృత్తిని త్యాగం చేసి...వృత్తిని, సామాజిక కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం డా. శాంతికి కష్టంగా మారింది. క్లినిక్‌లో రాత్రంతా పనిచేయడం వల్ల ఆమె అలసిపోయేవారు. ఇలా అయితే కుదరదనుకొని వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఉద్యోగం వదులుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.తన పట్టుదలతో పరిసర ప్రాంతాలను మాత్రమే కాకుండా, ఎంతోమంది బెంగళూరు వాసుల ఆలోచనా విధానాన్ని మార్చారు.ఉమ్మడి బాధ్యతతన ప్రచారానికి బస్సులను కూడా వేదికగా ఉపయోగించుకుంటారు డా.శాంతి. ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో బస్సులో నిలబడి ‘దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయవద్దు’ అని ప్రయాణికులకు విన్నపం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ‘నగరాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి ఉమ్మడి బాధ్యత’ అని ఒకటికి రెండు సార్లు చెబుతుంటారు. వ్యర్థాల విభజన అనేది సక్రమంగా జరగడం ప్రారంభమైన తరువాత ఆమె కంపోస్టింగ్‌పై దృష్టి సారించారు. -
వనదుర్గలు
కజిరంగ నేషనల్ పార్క్‌లో 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా వేటగాళ్ల బారిన పడలేదు. ఇది రికార్డు. ఇందుకు కారణం ఆ పార్కులో వేటగాళ్లకు సింహస్వప్నంగా మారిన మహిళా గార్డ్స్ దళం ‘వన దుర్గ’ ఆగస్టు 2023లో మొదలైన దళం కేవలం రెండేళ్లలోనే వేటగాళ్ల భరతం పట్టి కజిరంగను విముక్తం చేయగలిగింది. వారి గస్తీ గురించి కథనం.పురుషులు సాధించలేకపోయిన ఘనత స్త్రీలు సాధించారు. కజిరంగ అరణ్యాలలో దశాబ్దాలుగా సాగుతున్న ఖడ్గమృగాల వేటకు అడ్డు కట్ట వేయగలిగారు. వేటగాళ్ల పట్ల దుర్గలుగా మారి చెండుకు తిన్నారు. అందుకే వన్యమృగాల పరిరక్షణలో, అడవుల రక్షణలో ప్రతి చోటా వనదుర్గ గార్డ్స్ లాంటి దళాలు ఉండాలని వన్య ప్రేమికులు భావిస్తున్నారు.వేటగాళ్ల ఉనికిప్రపంచంలోనే అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు మనదేశంలో ఉన్నాయి. ప్రపంచంలోని ఖడ్గమృగాల మొత్తం సంఖ్యలో ఇది దాదాపు 70 శాతం. అస్సామ్ రాష్ట్రంలోని కజిరంగ జాతీయ పార్క్‌లో దశాబ్దాలుగా ఖడ్గమృగాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వేట పెద్ద సవాలుగా మారింది. కొమ్ములు కోశాక చనిపోయిన ఖడ్గమృగాల కళేబరాలు, వాటి పక్కన పడి ఉన్న తూటాలు అక్కడ. ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వనదుర్గలు రక్షణ కవచాలుగా మారి ఖడ్గమృగాలను రక్షిస్తున్నాయి. వేటగాళ్లకు సింహస్వప్నంగా మారిన మహిళా గార్డ్స్ దళం ‘వనదుర్గ’. 2023లో మొదలైన ఈ దళం రెండేళ్లలోనే వేటగాళ్ల భరతం పట్టి కజిరంగను విముక్తం చేయగలిగింది.వేటగాళ్లను చంపడం న్యాయమేనా? అక్కడ ఆయుధాలతో కనిపిస్తే కాల్చమని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇది ప్రాణాంతకమని, సైనిక చర్య అని పలువురు విమర్శించారు. ఇప్పటికి ఇరవైమంది వేటగాళ్లను కాల్చి చంపినట్లు బీబీసీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ‘దేశానికి తాజ్‌మహల్ ఎలాగో, అస్సాంకు ఖడ్గమృగం అలాగే’ అని చెబుతూ తన వైఖరిని సమర్థించుకుంది. ఈ సమష్టి ప్రయత్నాలు శాశ్వత ఫలితాలను చూపిస్తున్నాయి. 2009లో 2,048గా ఉన్న ఖడ్గమృగాల సంఖ్యను, 2022 జనాభా లెక్కల ప్రకారం పార్క్ 2,613కి పెంచింది. అనుమానిత వేటగాళ్లతో కాల్పుల ఘటనలు కూడా తగ్గాయి. 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా కజిరంగలో వేటగాళ్ల తుపాకీకి చిక్కలేదు. ఇది చాలా పెద్ద సంగతి. ఈ విజయానికి పూర్తిగా హక్కుదార్లు, ఆ వనాల దేవతలు వన దుర్గ గార్డ్సే. ఐదు చదరపు కిలోమీటర్లకు ఒక అవుట్పోస్టుకజిరంగలో ఖడ్గమృగాల రక్షణ కోసం మహిళా గార్డ్స్ దళం ‘వనదుర్గ’ మొదలయ్యాక ఎవరైనా అక్కడ ఆయుధాలతో కనిపిస్తే కాల్చమని ప్రభుత్వం వారికి ఆదేశాలిచ్చింది. వారి కోసం పార్కులో ప్రతి ఐదు చదరపు కిలోమీటర్లకు ఒక అవుట్‌పోస్టు ఏర్పాటు చేశారు. వన దుర్గ గార్డ్స్ పార్క్ క్యాంపులో 24 గంటలూ ఉంటారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుంటారు. అలాగే వేటగాళ్లపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది. పార్క్ అంతటా ఎలక్ట్రానిక్ కళ్ళు, థర్మల్ సెన్సార్లు, కెమెరా ట్రాప్‌లు, నైట్ విజన్ కెమెరాలను వ్యూహాత్మకంగా అమర్చారు. వీటిని వనదుర్గ గార్డ్స్ పర్యవేక్షిస్తూ వేగంగా స్పందిస్తారు. డ్రోన్ నిఘా, శాటిలైట్ ఫో¯Œ లు కూడా ఉన్నాయి. కజిరంగలో ప్రమాదం ఎల్లప్పుడూ వేటగాళ్ల నుండే రాదు. కోపంగా ఉన్న ఖడ్గమృగాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడి చేసి, తమ కొమ్ములతో ప్రాణాంతకంగా గాయపరచగలవు. వన దుర్గలు ఈ ప్రమాదాల నుంచి కూడా రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ‘ఖడ్గమృగం దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, కొన్నిసార్లు మేము గాలిలో కాల్పులు జరపాల్సి వస్తుంది‘ అని వన దుర్గ గార్డ్స్ తెలిపారు. -
బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!
ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచంలో, బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అన్న బిరుదును స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!1874లో లండన్‌లోని న్యూహామ్లో పేద కుటుంబంలో జన్మించింది మేరీ ఆన్ బెవాన్, నర్సింగ్ కోర్స్ చదివి 1894లో నర్సుగా మారింది. ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. అంతుచిక్కని వ్యాధి - వికృత రూపంమేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి. చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి. దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుపిల్లల కోసం తల్లి మనసు ఆరాటంరూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును." అనే ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్‌లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా త్వరలోనే సర్కస్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. 1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్‌లోని డ్రీమ్‌ల్యాండ్ సైడ్షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా పనిచేసింది.మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది. వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన విద్యావంతుల్ని చేసింది.తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ". చరిత్రలో "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా నిలిచిపోతుంది. ఏమంటారు? -
స్ట్రాంగెస్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..
ఓ మహిళ ఎంత శక్తి స్వరూపిణి అని చెప్పే ఘటన ఇది. అందరు నిర్ఘాంతపోయేలా మగవాళ్లను చిటికెలో ఎత్తిపడేసింది. నిజానికి ఆమె శారీరక బలం, ఓర్పుకి సలాం అనాల్సిందే. అంతలా సులభంగా మగవాళ్లను ఎత్తిపడేసి గిన్నిస్ రికార్డు సృష్టించిందామె. ఎవరా ఆ మహిళ అంటే..సినా రుప్పెంతాల్ అనే అథ్లెట్ ఈ ఘనతను సృష్టించింది. ఒక మహిళ ఎంత బలవంతురాలు అనేది చెప్పకనే చెప్పింది తన అసాధారణమైన సాహసంతో కేవలం 37.44 సెకన్లలో సుమారు 10 మంది పురుషులను ఎత్తి విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డుని నెలకొల్పింది. ఈ క్రీడాకారిణి తన అసాధారణమైన శక్తి, వేగం, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ఛాలెంజ్‌లో ఆ మహిళ ప్రతి ఒక్కర్ని ఎత్తి వారిని తన భుజంపై నుంచి వేగంగా ఒకరి తర్వాత ఒకరిని నిర్ధిష్ట సమయంలో విసిరి పూర్తి చేస్తింది. ఇక్కడ శారీరక బలం తోపాటు కచ్చితమైన సమన్వయం, ఓర్పు అవసరం. ఇక్కడ ఆమె ప్రతి ఒక్కరిని చాలా సురక్షితంగా ఎత్తి నియంత్రిత కదలికలతో విసిరింది. ఆమె అలా అలవోకగా అంతమంది మగవాళ్లను ఎత్తిపడేస్తున్న విధానం చూసి ప్రేక్షకులు సైతం విస్తుపోయారు. ఈ రికార్డు వాస్తవానికి ఆగష్టు 2025లో మ్యూనిచ్‌లో జరిగిన 'డై గ్రోస్సే షో డెర్ వెల్ట్రికోర్డే' అనే టీవీ కార్యక్రమంలో నెలకొల్పింది సినా రుప్పెంతాల్. ఈ ఛాలెంజ్ సాంప్రదాయ స్ట్రాంగ్‌మ్యాన్ ఈవెంట్లను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ అథ్లెట్లు బరువైన రాళ్లను ఎత్తడం, వాహనాలను లాగడం, భారీ బరువులను మోయడం, వంటి విన్యాసాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తారు. కానీ సినా రుప్పెంతాల్ రికార్డు మాత్రం అత్యంత విలక్షణమైన రికార్డుగా వార్తల్లో నిలిచింది. ఎవరీ సినా రుప్పెంతాల్సినా రుప్పెంతాల్ ఒక జర్మన్ స్ట్రాంగ్వుమన్. ఆమె ఉన్నత స్థాయి అథ్లెట్, స్పోర్ట్స్ సైంటిస్ట్. ఆమె ప్రపంచంలో నాల్గవ అత్యంత బలవంతురాలైన సహజ మహిళగా ర్యాంక్ పొందింది. అంతేగాదు స్ట్రెంత్ స్పోర్ట్స్‌లో అనేక జర్మన్ రికార్డులను కలిగి ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే రుప్పెంతాల్ STRONGESTకు బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించొచ్చు. అంతేకాదండోయ్..ఆమె మహిళా స్ట్రెంత్ అథ్లెట్లకు ఒక వేదికను అందించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ స్ట్రాంగ్వుమెన్ జర్మనీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఎల్పీజీ గ్యాస్ కొరత..ఆ స్టవ్‌లకు పెరుగుతున్న డిమాండ్) -
అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!
మహిళల్ని గౌరవించాలి...అనేది మన భారతీయ సంప్రదాయంలో కీలకమైన విషయం. అయితే గౌరవించడం అలా ఉంచి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడినా.. ఆ సమయంలో గొడవతో సంబంధంలేని మహిళలను అవమానపరిచేలా తిట్లు దుర్భాషలు ఉపయోగించడం మన దగ్గర సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో తరచుగా ఎందరో తల్లులు, అక్కలు...బాధితులుగా మారుతున్నారు. మన రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు సైతం దీనికి అతీతంగా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో అలాంటి తిట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోని ఓ మారుమూల గ్రామం తొలి అడుగు వేసింది.ఒకరి తల్లి లేదా సోదరిని ఉద్దేశించి దుర్భాషలాడే వ్యక్తులను వెనువెంటనే శిక్షించాలని ఒక వినూత్న తీర్మానాన్ని ఆ గ్రామం ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళా సాధకులను సత్కరించడానికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక స్వయం సహాయక సంఘ సభ్యురాలు ఈ ఆలోచనను సూచనప్రాయంగా తెలియజేశారు. .అహల్యానగర్‌లోని శ్రీగొండలోని కోల్గావ్ గ్రామ పంచాయతీ దీనిని ఆమోదించింది.విభిన్న కులాలు మతాలకు చెందిన సుమారు 9,000 మంది నివాసితులున్న కోల్గావ్ గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, సీనియర్ అంగన్ వాడీ సేవిక (కార్యకర్త) శకుంతల దేశ్‌ముఖ్ అధ్యక్షతన ప్రత్యేక మహిళా గ్రామసభను ఏర్పాటు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జగ్తాప్ అనే మహిళ లేవనెత్తిన మాటలతో మహిళల్ని అవమానించే అంశం గ్రామ సభలో వివరణాత్మక చర్చకు దారితీసింది. సుదీర్ఘ మధనం తర్వాత, మహిళలను కించపరిచేలా అవమానకరమైన భాషను ఉపయోగించే వారికి జరిమానాగా రూ. 500 విధించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నిబంధన దుర్వినియోగాన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్భాషలు ఆడినట్టు డిజిటల్ ఆధారాలు అందించినప్పుడు మాత్రమే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ‘అవమానకరంగా మాట్లాడిన వారిని గుర్తించడడంలో మహిళలు ( అవసరమైతే, వారి పిల్లలు) ముందుండాలని పంచాయతీ కోరింది, అలా వసూలు చేసిన జరిమానాలను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని వీరు చెబుతున్నారు.‘తల్లి లేదా సోదరిని ప్రస్తావిస్తూ తిట్టడం ద్వారా మహిళల్ని అవమానించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. అమ్మాయిలు కుటుంబ బాధ్యతలను భరించే మహిళలుగా ఎదుగుతారు. అలాంటి దుర్వినియోగాలను సాధారణం గా అంగీకరించే స్థాయికి వారి గుర్తింపులను కించపరచకూడదు’అని జగ్తాప్ అంటున్నారు. ఇలాంటివే అనూహ్యమైన మరికొన్ని తీర్మానాలతో ఈ పంచాయితీ గత కొంతకాలంగా ఆదర్శవంతంగా నిలుస్తోంది.గతేడాది తీసుకున్న ఓ నిర్ణయం కూడా అనేకమందిలో ఆలోచన రేకెత్తించేలాంటిదే. దీని ప్రకారం.. గ్రామంలో పిల్లలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లో టెలివిజన్ లేదా సెల్‌ఫోన్ వినియోగించరు. పుస్తకాలు మాత్రమే చేతబట్టుకోవాలి. ప్రస్తుతం గ్రామంలో తల్లిదండ్రులు కూడా పాటించే నియమం ఇది. గ్రామసభ పరిశుభ్రతకు సంబంధించి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించింది, నివాసితులు తమ ఇళ్లలో వాణిజ్య సంస్థలలో పరిశుభ్రతను కాపాడుకోవాలని కోరింది. గ్రామ పంచాయతీకి సమర్పించిన ఫోటో/వీడియో ఆధారాల ద్వారా ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లు తేలిదే, వారికి రూ. 100 జరిమానా విధిస్తారు. (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..) -
సివిల్స్‌లో సత్తా చాటిన మహిళామణులు..!
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...24-35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో మహిళల ప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.41%: 2023 ఐఏఎస్ బ్యాచ్‌లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ∙డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్‌కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడిపోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్‌లో ఆమె 483 ర్యాంక్. పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్‌దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్‌లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. గుజరాత్‌లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు.పంజాబ్‌లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్‌దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్‌సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణిమధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్‌సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్.ఒకే ఒక్కరు!సిక్కింలోని రాయ్‌గావ్‌కు చెందిన అన్నీలా షెర్పా, యూపీఎస్సీ పరీక్షలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక అభ్యర్థిగా నిలిచి ఆల్ ఇండియా ర్యాంకు 893 సాధించింది. (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..) -
ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..
ఆడపిల్లలను బయటకు పంపించని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాహసోపేతమైన రైడర్ ఆమె. భర్త ప్రోత్సాహంతో సవాలుతో కూడిన డ్రైవ్‌లను సర్క్యూట్ రేసింగ్‌లను చాలా చాకచక్యంగా చేసేసిందామె. అలాగే విధి కన్నెర్రజేసి భర్తను తీసుకుపోయినా..అజేయమైన ధైర్య సాహసాంతో కుటుంబాన్ని నడిపించింది. భర్త నింపిన స్థైర్యాన్ని కొనసాగిస్తూ.. ఎనిమిది పదుల వయసులోనూ డ్రైవింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలిచింది. సమస్యలు, కష్టాలు నీ గమనాన్ని ఆపే యత్నం చేస్తాయి..అంతమాత్రాన చేతులెత్తేస్తే జీవితమే ఉండదు అని అంటోంది ఈ డైనమిక్ బామ్మ..!.ఆ ధీర వనితే ముంబైకి చెందని 82 ఏళ్ల జరీన్. బొంబాయిలోని ముస్లీం కుటుంబంలో పెరిగిన ఆమె..కళాశాలకు వెళ్ళి చదువుకున్న మొట్టమొదటి అమ్మాయి కూడా జరీనానే. సాంప్రదాయ అడ్డంకులని ఆ టీనేజ్ వయసులోనే అధిగమించి శెభాష్ అనుపించుకుంది. అంతేగాదు బాల్య దశలోనే డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. అయితే అందుకు ప్రోత్సాహం, నేర్పేవాళ్లు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. పెళ్లితో ఆమె భర్త తన అభిరుచికి అండగా నిలిచాడు, ప్రోత్సహించాడు. హైవేలపై మినీ బస్సులను నడపడం నుంచి బెంగళూరు నుంచి దాదాపు నిరంతర డ్రైవింగ్ సవాలు వరకు అన్ని డ్రైవ్‌లను స్వీకరించేలా ప్రోత్సహించాడు. ఇరవైల నాటికి సర్క్యూట్ రైసింగ్ ప్రయత్నించి..థ్రిల్ ఫీల్‌ని ఎంజాయ్ చేసింది. ప్రతి అనుభవం సాయంతో డ్రైవింగ్‌లో మరింత స్కిల్‌ని పుణికిపుచ్చుకుంది జరీన్. దాంతో ఆమెకు డ్రైవింగ్ అభిరుచికి మించినదిగా జీవితంలో భాగమైంది. 1996లో ఆమె భర్త అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టింది. పిల్లలను పెంచుతూ..సొంతంగా డిపార్ట్మెంట్ స్టోర్‌ని నడిపేది కూడా. ప్రస్తుతం ప్రతి ఉదయం మనవరాళ్లను పాఠశాలకు తీసుకువెళ్తోంది. ఆమె రోజు అపాయింట్మెంట్లు, సామాజిక పని, సమావేశాలతో బిజీగా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది కూడా. అంతేగాదు జరీన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఒక మార్గానికి మించినదని చెబుతోంది. ఇది స్వాతంత్ర్యం, విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు చిహ్నం. చాలా మందికి, చక్రం తిప్పడం అనేది వారి స్వంత మార్గాన్ని రూపొందించుకునేలా చేయడమే గాక సాహసోపేతంగా సవాళ్లను స్వీకరించే శక్తిని, పరిమితుల నుంచి విముక్తి పొందే సామర్థ్యాన్ని అందిస్తుందని ఆత్మస్థైర్యంగా చెబుతోంది జరీన్. నెటిజన్లు కూడా ఈ అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఎనభైలలో కూడా డ్రైవింగ్ చేస్తున్న ఈ బామ్మ సదా స్ఫూర్తి, ప్రేరణ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!
కురుగంటి కవిత... మన దేశంలో రైతుల హక్కులు, సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఓ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి. దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు, రైతు శాస్త్రవేత్తలు, దేశీ విత్తన పరిరక్షకులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, పౌర సంస్థలు, వ్యక్తులతో కూడిన ఒక విస్తృతమైన నెట్వర్క్ ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా)’. దీనికి కవిత జాతీయ కన్వీనర్‌గా సేవలందిస్తున్నారు. ఆషా–కిసాన్ స్వరాజ్, జాతీయ మహిళా రైతుల హక్కుల సంఘం (మకాం), ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ (ఎన్సీఎన్ఎఫ్), కోలిషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా వంటి అనేక జాతీయ వేదికల్లో ఆమె దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. స్వావలంబనే శ్వాసగా కదిలే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులకు, రైతు శాస్త్రవేత్తలకు, రైతుల హక్కుల కోసం కృషి చేసే స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలకు బలమైన సమష్టి గొంతుకగా ఆషా–కిసాన్ స్వరాజ్ నెట్వర్క్ నిలుస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మితేనే వారికి సముచిత ఆదాయం వస్తుంది. సేంద్రియ మార్కెట్ల నిర్వహణకు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో రైతులకు కాస్త చోటివ్వమని నగర/పట్టణవాసులకు ఆమె పిలుపు ఇచ్చారు. ఆరో కిసాన్ స్వరాజ్ సమ్మేళనాన్ని (kisan swaraj sammelan 2026) ఇటీవల మైసూరులో ఘనంగా నిర్వహించిన కవిత కురుగంటితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు.‘ఆషా’ ఎప్పుడు, ఎలా పుట్టింది? కురుగంటి కవిత (kavitha kuruganti): 15 ఏళ్ల క్రితం ‘ఆషా’ కిసాన్ స్వరాజ్ సంస్థ పుట్టింది. బీటీ వంగ ప్రతిఘటన ఉద్యమకాలంలో ‘కోలియేషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా’ను మేమంతా 2004లో సేవాగ్రామ్‌లోని గాంధీ ఆశ్రమంలో కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. బీటీ పత్తి మన దేశంలోకి వచ్చి అప్పటికి రెండేళ్లు గడిచాయి. బీటి పత్తి (BT Cotton) వల్ల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు ఆధారసహితంగా తెలిసివస్తున్న రోజులవి. కార్పొరేట్ కంపెనీల నియంత్రణ నుంచి బయటకు రావటం కోసం, స్వావలంబన సేద్యం కోసం రైతులు అనుసరించవలసిన పద్ధతులు, విష ముక్త, రుణ ముక్త, ఆత్మహత్య ముక్త జీవనోపాధుల వ్యవస్థ సాధించాలన్నది మా లక్ష్యం. అప్పుడు మేం అనుకున్నదేమిటంటే.. రైతు తన పొలంలో నడుము వంచి పనిచేసుకుంటున్నప్పుడు ఏదైనా ఎద్దు చేనులోకి చొరబడితే చేతిలో పని ఆపేసి ముందు ఆ ఎద్దును బయటకు తరమాలి కదా. అలాగే మిగతా పనులన్నీ పక్కనపెట్టి జన్యుమార్పిడి పంటలను పారదోలాలని అనుకున్నాం. ఆ విధంగా దేశంలో ఒక ఉద్యమం నిర్మించటానికి ఆరేళ్లు విపరీతంగా కష్టపడ్డాం.కేంద్ర పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ 2009 డిసెంబర్ నుంచి జీఎం వంగపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల చేత నో అనిపించటం కోసం, సైంటిస్టులను, డాక్టర్లను ఈ ఉద్యమంలోకి తేవటం కోసం దేశమంతా తిరుగుతూ, చర్చలు పెడుతూ.. రాత్రి, పగలు అవిశ్రాంతంగా పని చేశాం. 2010 ఫిబ్రవరి 9న బీటీ వంగపై నిరవధిక మారటోరియం ప్రకటించారు. అదే మా తొలి విజయం. అదే సంవత్సరం మార్చిలో నాగపూర్‌లో మేం మళ్లీ కలిసి కార్యాచరణ నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో ‘కిసాన్ స్వరాజ్ యాత్ర’ చేపట్టాం. 71 రోజులు 220 మందిమి 20 వేల కిలోమీటర్లు 20 రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేసి రాజ్‌ఘాట్‌లో ముగించి, సోనియా గాంధీకి మా డిమాండ్ల పత్రాన్ని ఇచ్చాం.మేము బయలుదేరిందేమో ఆత్మహత్య దారితీయని సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వ్యాప్తి కోసమని. అయితే, దేశవ్యాప్తంగా రైతులు ఇతర సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ఆర్గానిక్ సేద్యం (Organic Farming) కన్నా ముందు గిట్టుబాటు ధర, భూసేకరణ, వ్యవసాయంపై పారిశ్రామిక కాలుష్యం ముప్పు వంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో రైతులు కోరారు. సిటీల్లో ప్రజలు తమకు రసాయన అవశేషాల్లేని ఆహారం కావాలని అడిగారు. ముంబైలో మహేశ్ భట్ వంటి బాలీవుడ్ పెద్దలూ మాకు స్వాగతం పలికారు. ఈ యాత్ర నుంచే ‘ఆషా–కిసాన్ స్వరాజ్’ పుట్టింది. ‘కిసాన్ స్వరాజ్ నీతి’ పేరుతో మార్గదర్శకాలను నిర్దేశించుకొని, వాటి సాధన కోసం పని చేస్తున్నాం.మీరు సాధించిందేమిటి?కవిత: దేశంలో వ్యవసాయం మీద ఇష్టం ఉన్నవాళ్లకి మనం ముందుకెళ్లాల్సిన దారి ఏమిటో దిశా నిర్దేశం చెయ్యటంలో ఆషా–కిసాన్ స్వరాజ్ విజయం సాధించింది. గందరగోళాన్ని పారదోలింది. బీటీ వంగ పంట రాకుండా ఆపింది. రసాయనిక వ్యవసాయంతో ఎదురవుతున్న రకరకాల సంక్షోభాలు, జన్యుమార్పిడి పంటలతో (genetically modified crops) సమస్యలు వంటి వాటిపై వాస్తవ గణాంకాల ఆధారిత నివేదికలను రూపొందించటం, సంబంధిత సమగ్ర జ్ఞానాన్ని అందుబాటులోకి తేవటంలో మేం సఫలమయ్యాం. ఉదాహరణకు.. రైస్ ఫోర్టిఫికేషన్. అధ్యయన నివేదికలు రూపొందించాం. ఇది ప్రజారోగ్యానికి హానికరం కాబట్టి వద్దు అని చెప్పాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాం. 23 ఏళ్లుగా మరో జన్యుమార్పిడి పంటను వాణిజ్యపరంగా బయటకు రాకుండా ఆపగలిగాం. అంతేకాదు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ క్షేత్ర ప్రయోగాలు జరపకుండా కూడా ఆయా ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించగలిగాం.ప్రజల నుంచి మీరేమి ఆశిస్తున్నారు?కవిత: ఆరోగ్యదాయకమైన ఆహారం గురించి అందరూ చైతన్యం పెంచుకోవాలి. మీ కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఈ పని చెయ్యగలిగితే.. అనేక విధాలుగా మేలు కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగవుతుంది. వ్యవసాయంపై కార్పొరేట్ కంపెనీల నియంత్రణ కొంత తగ్గుతుంది. ఎక్కువ మంది రైతులు స్వావలంబనతో కూడిన వ్యవసాయం వైపు మొగ్గుచూపుతారు. నగరాలు, పట్టణాల్లో ప్రజలను నేను కోరుతున్న మరో విషయమేమిటంటే.. సేంద్రియ/ ప్రకృతి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి చోటివ్వండి. మీ ఇళ్లు/ గేటెడ్ కమ్యూనిటీలు/ కాలనీల్లో తరచూ సేంద్రియ సంతల నిర్వహణకు చోటు కల్పించండి. తద్వారా మధ్యవర్తుల బెడద తీరి, రైతుల ఆదాయం పెరుగుతుంది. అర్హులైన రైతులను గుర్తించి, సమన్వయపరచడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు కొదువ లేదు. చెన్నై, మాండ్యలలో రైతులే నిర్వహించుకునే సేంద్రియ మార్కెట్లే ఇందుకు నిదర్శనాలు.ఏమిటా ‘కిసాన్ స్వరాజ్ నీతి’ సూత్రాలు?కవిత: డా. జయతీఘోష్, డా. డి. నరసింహారెడ్డి వంటి చాలా మంది మేధావులతో లోతుగా చర్చించి 4 మార్గదర్శకాలను నిర్దేశించుకున్నాం. 1. కనీస మద్దతు ధర కావాలని రైతులు అడుగుతుంటారు. అయితే, అది దొరికినా ఆదాయ భద్రత దొరక్కపోవచ్చు. అందుకే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి. 2. ప్రభుత్వం వ్యవసాయ విధాన నిర్ణయం ఏది చేసినా అది పర్యావరణ సుస్థిరతకు లోబడి ఉండేలా చూడాలి. 3. భూమి, విత్తనం, నీరు వంటి వ్యవసాయ వనరులపై హక్కు రైతు సముదాయం చేతుల్లోనే ఉండాలి. 4. వినియోగదారులందరికీ వైవిధ్యభరితమైన, భద్రమైన, పుష్కలంగా, పోషక సంపన్నమైన ఆహారాన్ని అందించాలి. మా లక్ష్యం కేవలం సుస్థిర వ్యవసాయం కాదు. ఇవన్నీ కలిసి ఉండే హోలిస్టిక్ అగ్రికల్చర్. ఈ మార్గదర్శకాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. మహిళా రైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతుల హక్కులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.‘ఆషా’ నిర్మాణం ఎలా ఉంది?కవిత: మాది సభ్యత్వం, ఎన్నికల ఆధారంగా పనిచేసే సంస్థ కాదు. దేశవ్యాప్తంగా భావసారూప్యత ఉన్న సంస్థలు, వ్యక్తుల్ని కలుపుకొని వెళ్లే ఒక వేదిక మాత్రమే. ఆషా స్వచ్ఛంద సంస్థ కాదు. మాకు బ్యాంకు ఎకౌంట్ లేదు, ఆఫీసు, సిబ్బంది లేరు. ఇళ్ల నుంచే మేం పనిచేస్తున్నాం. మా సొంత డబ్బునే ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. వేరే యూనియన్ల మాదిరిగా ఇది వద్దు, అది వద్దు అనే వైఖరికి పరిమితం కాకుండా.. సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలను చూపే సంఘర్ష్, నిర్మాణ్లతో కూడిన వేదికగా ‘ఆషా’ను తీర్చిదిద్దాం. మాలో చాలా మందిమి ధర్నాల్లో పాల్గొంటాం, ప్రభుత్వ సలహా బృందాల్లోనూ సభ్యులుగా ఉంటాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యటానికని కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్ దల్వాయి వర్కింగ్ కమిటీలో నేను, కిరణ్ సభ్యులుగా ఉండి, మూడు సంపుటాలలో మా సూచనలిచ్చాం. అదే సమయంలో కిసాన్ ముక్తి యాత్ర వంటి ఆందోళనలు నిర్వహించాం.చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’తెలుగు బిడ్డ!కురుగంటి కవిత తెలుగింటి బిడ్డే! ఆమె తల్లిదండ్రులు గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్ (గుంటూరు). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే చదివిన తర్వాత జహీరాబాద్ వద్ద పస్తాపూర్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)లో దళిత మహిళా రైతుల అభ్యున్నతి కోసం ఐదేళ్లపాటు పనిచేశారు. తదనంతరం బెంగళూరులో (ఈ మధ్యనే మైసూరుకు మారారు) స్థిరనివాసం ఉంటూ జాతీయ రైతాంగ ఉద్యమం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 400కుపైగా సంస్థలు, వ్యక్తులతో కూడిన ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా) ఉద్యమాన్ని గత 15 ఏళ్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పు కోసం జరిగే పోరాటాల్లో ఆమె కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
ఉమెన్ సివిల్ పవర్
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...⇒ 24 - 35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో మహిళలప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.⇒ 41%: 2023 ఐఏఎస్ బ్యాచ్‌లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.⇒ 18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ⇒ డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్‌కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడి΄ోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్‌లో ఆమె 483 ర్యాంక్. ⇒ పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. ⇒ పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్‌దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. ⇒ కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్‌లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. ⇒ గుజరాత్‌లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. ∙పంజాబ్‌లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్‌దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్‌సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణి.⇒ మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్‌సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్. -
ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!
తమిళనాడులో కాలానుగుణ నది నాగనది. గత 20 ఏళ్లుగా ఎండిపోయి నిర్జీవంగా మారిపోయింది. చక్కగా నీటితో కళకళలాడే నది కాస్తా..బీడు వారిపోయింది. ఈ నదే అక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు ఆధారం. అలాంటి నదికి నారీ శక్తి ప్రాణం పోసి 365 రోజులు నీటితో పారేలా చేస్తోంది. అదెలా ఈ మహిళామణులకు సాధ్యమైందో తెలుసుకుందామా..!.సరిగ్గా ఆ టైంలోనే గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికతతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేశవ్యాప్తంగా నదీ పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించడానికి నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో నీటి కొరత నిర్వహణలో భాగంగా నాగనది నది పునరుజ్జీవన పనిని అమలు చేసే నిమిత్తం 2014లో వెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సర్వే చేసేందుకు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్వచ్ఛంద సేవకులతో సహా సాంకేతిక నిపుణుల బృందం కదిలివచ్చింది. ఈ నదిని తిరిగి పునరుజ్జీవింప చేయాలంటే బావులు, బండరాళ్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలన్సి అవసరం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన నదులను పునరుద్ధరించేందుకు దాదాపు 20 వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఈ వార్త దావానలం ఆ చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద స్వచ్ఛంద సేవకులుగా ఈ పనుల్ల పాలుపంచుకునేవాళ్ల సంఖ్య అనుహ్యంగా 40 వేలకు పైగా చేరింది. వారంతా మహిళామణులే కావడం విశేషం. ఈ మహిళా స్వచ్ఛంద సేవకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్గదర్శకత్వంలో బావులు తవ్వడం, సిమెంట్ రింగులు నిర్మించడం వంటి వాటితో అవిశ్రాంతంగా పనిచేశారు. ఫలితంగా భూగర్భజల మట్టాలు ఒక మీటర్ నుంచి ఎనిమిది మీటర్లకు పెరిగాయి. దెబ్బతో నదికి తిరిగి జీవం వచ్చినట్లైంది. ఇదంతా కేవలం మహిళా శ్రామిక శక్తి వల్ల సాధ్యం కావడం విశేషం. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన వందవ 'మన్ కీ బాత్' ఎపిసోడ్లో చెప్పి..ఆ నారీ శక్తి జట్టు కృషిని ప్రశంసించారు. ఒకరకంగా సమాజం కోసం అందరూ నడుబిగించాలని చెప్పడమే కాదు..ఐక్యతను సైతం చాటి చెప్పింది ఈ నారీ శక్తి. మహిళ తలుచుకుంటే భూమిని స్యశ్యామలంగా ఉంచగలరు. అలాగే ప్రకృతి సైతం పులకరించిపోయేలా అందంగా అపురూపంగా మార్చగలరు. అలాంటి మహిళామణులకు, మహిళా శక్తికి సదా జోహార్లు అని కీర్తిద్దాం, గౌరవిద్దాం. కేవలం విమెన్ డే ఒక రోజున మాత్రమే కాదు..ప్రతి సందర్భంలోనూ అవకాశంలోనూ మహిళలను పురుషులతో సమానంగా చూస్తే చాలు. అంతకుమించి ఇంకేమి ఆశించరు అని గుర్తిస్తే చాలు కదూ..!. View this post on Instagram A post shared by Art of Living (@artofliving) (చదవండి: చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..! టెక్ ఉద్యోగం వద్దనడానికి కారణం అదే..) -
తల్లీబిడ్డల ‘ఎల్లిపాయ కారం’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల నగరానికి చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ కొత్త రకం వంటలను రుచి చూపిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల సోనీ టీవీ మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్–9 వంటల రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించారు. గతంలోనే ఎల్లిపాయ కారంతో వైరెటీలు చేస్తూ కొత్త రుచులను పరిచయం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఎల్లిపాయ కారం పేరుతో ఓ రెస్ట్రారెంట్ నిర్వహిస్తున్నారు. చందన తన భర్త రవీందర్ సహకారంతో మంచిర్యాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక కూతురు సాయిశ్రీ బీటెక్ చేయగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ తనకు ఇష్టమైన వంటల రంగాన్నే ఎంచుకున్నారు. నాలుగో తరగతి నుంచే వంట చేసేందుకు ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు అదే దిశగా ప్రోత్సాహించారు. గతంలో జెమిని టీవీలో తెలుగు మాస్టర్‌లో పాల్గొన్నప్పటికీ ఫైనల్ వరకు చేరలేదు. తాజాగా తల్లీకూతురు మాస్టర్ ఇండియా చెఫ్ జోడిగా కొనసాగిన 45ఎపిసోడ్స్‌లో వంటల్లో వైవిధ్యతను ప్రదర్శించారు.పుష్పరాజ్ చికెన్, స్పెషల్ లడ్డురియాలిటీ షోలో కఠిన పరీక్షలైన అగ్ని పరీక్ష, నీరు లేకుండా వంట, కట్టల పొయ్యిపై వండడం, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు చేశారు. దేశంలో పలు ప్రాంతాల వంటకాల్లో మసాలాలు, పదార్థాలతో కొత్త రుచులు వచ్చేలా చేసి సత్తా చాటారు. ప్రఖ్యాత చెఫ్ సంజీవ్ కపూర్‌తోపాటు న్యాయనిర్ణేతలు వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్, కునాల్ కపూర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.ఆ సమయంలో పుష్పరాజ్ పేరుతో వండిన చికెన్‌తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ‘మా రెస్టారెంట్లో లడ్డుకు ప్రత్యేక ఆదరణ ఉంది. మహిళలు వంట తెలియకుండానే నేర్చుకునే ఓ గొప్ప నైపుణ్యం. మా పాప అభిరుచి కోసం నేను తోడుగా నిలిచా’ అని తల్లి చందన చెబుతుంటే, అమ్మ అందించిన ప్రోత్సాహంతోనే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని సాయిశ్రీ అంటున్నారు. -
ఎవరీ నమ్రత స్టాన్లీ..? ఏకంగా వైన్ బ్రాండ్‌ని..
మహిళా సాధికారత, మహిళా చైతన్యం అని ఏవేవో చెబుతుంటారు గానీ ఇంకా వివక్ష తగ్గలేదనే గణాంకాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా సమాజంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలే ఉదాహరణ. వాటిని చూస్తే..ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. మహిళలు పురుషులతో సమానమని పైపై మాటలుగా చెబుతుంటారే గానీ వాస్తవికంగా అది పూర్తి స్థాయిలో జరగదు. అయినప్పటికీ కొందరు ధీర వనితాలు.. ఆ మాటను అక్షరాల నిజం చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్‌ని అందుకుంటున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వివక్ష, గృహహింసను ఎదుర్కొంటూనే అంచలంచెలుగా ఎదిగిన ఈ నారీమణి గురించి తెలుసుకుందామా. పైగా పురుషాధిక్య వ్యాపారమైన వైన్ బిజినెస్‌లో రాణిస్తున్న ఏకైక మహిళగా పేరు కూడా తెచ్చుకుందామె. ఇంతకీ ఎవరామె అంటే..ఆ శక్తిమంతమైన మహిళే 45 ఏళ్ల నమ్రత స్టాన్లీ. బెంగళూరు చెందిన నమ్రత కుటుంబంలో కూడా ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకు అనే భావజాలం ఎక్కువగా ఉండేది. అంతగా ఆడపిల్లలకు ప్రాధాన్యతలోని తన కుటుంబంలో తండ్రి తీరు అస్సలు నచ్చేది కాదు నమ్రతకు. ఆమె తల్లి గృహిణిగి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఆయన ఇంటి నిర్ణయాలన్నింటిని తీసుకునేవారు. మా అమ్మకు ప్రతిభ ఉన్న ఇంటి గోడలకే పరిమితం చేశారాయన. ఇక నమ్రత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హాస్పిటాలిటీ చదివింది, అలాగే పాటిస్సేరీ(డెజర్ట్స్ తయారీ) నైపుణ్యం ఉందామెకు. 2024లో సరిగ్గా పెళ్లైంది. ఇక అక్కడ కూడా ఆడపిల్లలకు జాబ్ అనవసరం అనే అభిప్రాయమే బలంగా ఉండేది. అంతేగాదు ఆమె అత్తారింటిలో చీరకట్టుకుంటే గానీ బయటకు రాకూడదు, కనీసం స్నేహితులను కలవకూడదు, బేకరీ లాంటి వ్యాపారం వంటివి ఏమి చేయకూడదు. ఇంతలో 2007లో తనకు పాప జన్మించడంతో గృహహింస, ఛీత్కారాలు మొదలయ్యాయి. ఇవన్ని కూడా ఆమెను ఆపలేకపోయాయి. వీటన్నింటిని తట్టుకుంటూనే బెంగళూరులోని అలయన్స్ ఫ్రాంకైస్ స్థానిక కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఆమె రహస్యంగా ఫ్రెంచ్ తరగతుల్లో చేరింది. మార్కెట్‌కి వెళ్తున్నా అని ఫ్రెంచ్ క్లాస్‌లకు వెళ్లేది. రాత్రిపూట కూతుర్ని పడుకోబెట్టి హెడ్ఫోన్లలో చదువుకునేది. ఇక తన కుటుంబానికి తానెంటో చూపాలనే ఉద్యేశ్యంతో 2013లో రెజ్యూమ్ని ఒక జాబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే స్టాన్లీ స్కిల్స్‌కి ఫిదా అయ్యి ఒక ఫ్రెంచ్ ఐటీ సంస్థ ఆమెను పారిస్‌లో నియమించుకుని శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తన పాపను అమ్మ చూసుకుంటుందని ఒప్పించి, భర్త అనుమతితో వెళ్లింది. అది కూడా ఒక నెలపాటు ట్రైనింగ్‌కి మాత్రమే పంపించారు స్టాన్లీని. అయితే స్టాన్లీ అక్కడ విజయవంతంగా ట్రైనింగ్‌ని పూర్తిచేసుకుని కుమార్తె కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఫ్రెంచ్‌కి వెళ్లినప్పుడు సరదాగా భుజం మీద వేయించుకున్న టాటు కారణంగా భర్త ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్‌లు అన్వేషిస్తున్న ఆమెను వారించే ప్రయత్రం చేయడమే గాక, ఆమె పాస్‌పోర్ట్‌ని మాయం చేయడం, అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పంపించేయడం వంటి టార్చర్ ఎక్కువైంది. దాంతో ఆ గృహహింస నుంచి బయటపడి 2017లో తల్లి మద్దతుతో ఫ్రాన్స్ బోర్డియక్స్‌లో వైన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ MBA ప్రోగ్రామ్‌లో చేరింది. చెప్పాలంటే ఆ క్లాస్‌లో అందరికంటే పెద్దది స్టాన్లీనే..అయినా సరే..లక్ష్యంపైనే ఫోకస్ పెట్టేది స్టాన్లీ. వైన్ తయారీ ప్రక్రియకు సంబంధించి.. ద్రాక్షపండను పండించడం నుంచి వైన్‌గా మారే వరకు ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అదీగాక బోర్డియక్స్లోని కఠినమైన చట్టాలు నీటిపారుదలను నిషేధిస్తాయి, దాంతో ద్రాక్ష పాదులను పండించడం చాలా సవాలుగా ఉండేది. అదే తనకు స్ట్రాంగ్‌గా పోరాడుతూ నిలబడటం ఎలాగో నేర్పిందని అంటోంది స్టాన్లీ. అలాగే ఈ వైన్ తయారీలో ప్రతి దశ చాలా కచ్చితత్వం అవసరమని అంటోంది. ఆ తర్వాత వైన్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని..వైన్ తయారీ కేంద్రాల నుంచి నేరుగా సోర్సింగ్ చూస్తూ..కంపెనీని బోర్డియక్స్‌లో నమోదు చేయించుకుంది. క్రమేణ తన సొంత బ్రాండ్ 'సోలికాంటస్' పేరుతో వైన్‌ని విక్రయించే రేంజ్‌కు చేరింది. ఇక్కడ సోలి అంటే నేల, కాంటస్ అంటే లాటిన్లో శ్రావ్యత. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వైన్ వ్యాపార సామ్రాజ్యంలో శక్తిమంతమైన వ్యాపారవేత్తగా సాగుతూ..మహిళలు ఎందులోనైనా రాణించగలరు అని చాటి చెబుతోంది. అంతేగాదు స్టాన్లీ వైన్ నాణ్యత, రుచిని నిర్ణయించేది కూడా ఆమెనే కావడం విశేషం. (చదవండి: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ) -
కుటుంబ బాధ్యత.. ఆర్థిక భరోసా!
మూసాపేట: మహిళలు ఆర్థికంగా ఎదిగనప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత తరంలో ఎందరో మహిళలు చిన్న ఉద్యోగాల నుంచి రైలు, విమానాలు నడిపిస్తున్నారు. ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రభుత్వాలు పేద, మద్య తరగతి మహిళలను, చదువురాని మహిళలు కూడా తమ కాళ్లపై నిలబడేవిధంగా ప్రోత్సహిస్తున్నాయి. మూసాపేట పరిసర ప్రాంతాల్లో సమైఖ్య మహిళ గ్రూపులో ఉండి బ్యాంకు లోన్లు తీసుకుని చిన్న, చిన్న వ్యాపారాలు ఎదుగుతూ తోటి వారికి ఆదర్శంగా ఉన్న పలువురి మహిళల గురించి అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. లోన్‌తో మేకప్ టీచర్‌గా... మూసాపేటలో నివాసం ఉండే భాగ్యవతి వైష్ణవి దేవి మహిళ గ్రూపులో 10 మంది మహిళల్లో ఆమె ఒక్కరు. మూడు సంవత్సరాల క్రితం గ్రూపునకు బ్యాంక్ లోన్ మంజూరైంది. తన భాగానికి వచ్చిన రూ. 60 వేలతో మేకప్‌గా శిక్షణ తీసుకుంది. అనంతరం వాటికి మరికొంత డబ్బు జమ చేసి మేకప్ కిట్ కొనుగోలు చేసింది. అనంతరం మూసాపేట భవానీనగర్‌లో ఉన్న మేకప్ స్టూడియోలో 12 మందికి టీచింగ్ చేస్తుంది. బ్యాచ్‌కు 12 మందికి టీచింగ్ ఇస్తూ వారిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక ఈవెంట్లు, పెళ్లిలకు మేకప్‌లు వేస్తూ నెలకు రూ.50 నుంచి 70వేల వరకు సంపాదిస్తుంది. బ్యాంక్ లోన్ తానేకడుతూ మేకప్‌లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందేకు కృషి చేస్తుంది. ప్రముఖ సింగర్ గీత మాధురికి కూడా మేకప్ వేసి ఔరా అనిపించింది. గోలీసోడా వ్యాపారంలో.. గోలిసోడా కొడుతూ వ్యాపారంలో రాణిస్తుంది భరత్‌నగర్‌కాలనీకి చెందిన ఎస్. సంధ్య. కాలనీలోని కల్వరి మహిళ పొదుపు సంఘంలో పది మందిలో తాను ఒక్కరు. నెలన్నర క్రితం గ్రూపునకు భ్యాంక్ లోన్ రావడంతో తన భాగం రూ.1.80 లక్షలు వచ్చాయి. వాటితో కొన్ని అప్పులు తీర్చుకుని సుమారు రూ.50వేలతో ఆరెంజ్ గోలి సోడా షాపును ఏర్పాటు చేసుకుంది. వేసవికాలంలో గోలిసోడకు ఆదరణ ఉండటంతో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పిల్లలను స్కూల్‌కు పంపి, భర్తను ఉద్యోగానికి పంపి గోలి సోడా కొడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు షాపు నడిపిస్తుంది. ఒక్కరి వద్ద ఉద్యోగం చేసే బదులు వ్యాపారం ఎంతో మేలు అని అంటుంది. రాజకీయాల్లో రాణిస్తూ బోటిక్ నడిపిస్తూ.. గృహిణిగా పిల్లలు, భర్త బాధ్యతలు చూసుకుంటూనే రాజకీయాలపై మక్కువతో బీఆర్ఎస్ మహిళ కార్యకర్తగా, సోషల్ మీడియా వారియర్‌గా రాణిస్తుంది మూసాపేట జనతానగర్‌కు చెందిన శిరీష. కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుని శ్రీహర్ష పేరుతో బోటిక్ నడిపిస్తుంది. భర్త ఇచ్చిన డబ్బులతో పాటు మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ రూ. 35వేలతో కుట్టు మిషన్ ఇప్పించడంతో షాపును ఏర్పాటు చేసింది. షాపులో ప్రస్తుతం ముగ్గురు పనివారు, నాలుగు కుట్టు మిషన్స్ ఏర్పాటు చేసుకుంది. చీరలు అమ్మడంతో పాటు సంక్రాంతికి గాలి పటాలు, దీపావళికి టపాసులు, రాఖీ పౌర్ణమికి రాఖీలు విక్రయిస్తుంది. -
AI నైపుణ్యాల్లో మహిళల దూకుడు.. అధ్యయనంలో వెల్లడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో... భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో సమానంగానే కాకుండా, వారి కంటే ముందున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' తాజా పరిశోధనలో వెల్లడైంది.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలోని మహిళా నిపుణుల్లో 90 శాతం మంది... కార్యాలయాల్లో ఏఐ సాధనాలను ఉపయోగించడం పట్ల తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పారు. ఇది పురుషుల (86%) కంటే ఎక్కువ. అంతేకాకుండా, ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో కూడా మహిళలు మరింత చురుకుగా ఉన్నారు. తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి 35 శాతం మంది మహిళలు చురుకుగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటుండగా, పురుషుల్లో ఈ సంఖ్య 29 శాతంగా మాత్రమే ఉంది.ఈ సానుకూల ధోరణి కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తల విభాగంలో కూడా... తమ కంపెనీల వృద్ధిపై పురుషుల (66%) కంటే మహిళా వ్యవస్థాపకులు (78%) అత్యంత సానుకూలంగా ఉన్నారు. తమ వ్యాపారాలను మరింత విస్తరించడానికి వీరు 'ఏఐ ఆధారిత ఆటోమేషన్', స్మార్ట్ వర్క్‌ఫ్లోలు మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తమ సంస్థల్లో 'డిజిటల్ పరివర్తన'కు నాంది పలుకుతున్నారు.దీనిపై లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ.. “భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐ సాధనాలను ఉపయోగించడంలో బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త నిరాశజనకంగానే ఉన్నాయి. లింక్డ్ఇన్ డేటా ప్రకారం, భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం ఇప్పటికీ 28.1% శాతంతో చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేవలం సాంకేతికత ఒక్కటే సరిపోదు. అయితే ఇక్కడో ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటికే విధుల్లో ఉన్న అనేక మంది మహిళలు ఏఐ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మరింత ఉత్పాదకతను సాధించే సాధనంగా వారు ఏఐని చూస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన ఏఐ నైపుణ్యాలను వారు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. పనిలో (ప్రాజెక్టులలో) తమ ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపించడానికి, నాయకత్వ పాత్రల్లో ఎదగడానికి మహిళలకు ఏఐ ఒక బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది," అని అన్నారు.వృత్తిపరమైన ఎదుగుదలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో మహిళా నిపుణుల కోసం లింక్డ్ఇన్ చెబుతున్న ఐదు సూచనలు ఇక్కడ ఉన్నాయి:👉మనిషి చేసే పనులకు ఏఐని జతచేయండి: విశ్లేషించడం, నిర్వహించడం మరియు పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐని ఉపయోగించండి. ఆ మిగిలిన సమయాన్ని... మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే నైపుణ్యాలైన బృంద స్ఫూర్తిని పెంపొందించడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు సానుభూతిని ప్రదర్శించడం కోసం కేటాయించండి.👉మీ సొంత అభ్యాసానికి ఏఐని ఉత్ప్రేరకంగా మార్చుకోండి: అనుబంధ రంగాలను అన్వేషించడానికి, కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాల లోపాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగించండి. మీ ఉద్యోగ పాత్ర, లక్ష్యాలు మరియు ఇప్పటికే ఉన్న నైపుణ్యాల ఆధారంగా నేర్చుకోవాల్సిన కొత్త కోర్సులను... లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క 'ఏఐ-పవర్డ్ కోచింగ్’ మీకు సూచిస్తుంది. అసలు ఎక్కడ ప్రారంభించాలో తెలియని గందరగోళాన్ని ఇది తొలగిస్తుంది.👉 మీ మానవ నైపుణ్యాలను విస్తృతం చేసుకోండి: మీ సామర్థ్యాలను పదునుపెట్టే సహచరుడిగా ఏఐని భావించండి. కొత్త ఆలోచనలను పరీక్షించడానికి, సృజనాత్మక పరిష్కారాల కోసం లేదా రాబోయే ఫలితాలను ముందుగానే అంచనా వేయడానికి దీనిని ఉపయోగించండి. ఏఐతో మీ భాగస్వామ్యం మీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. మంచి ఆలోచనలను... అందరూ ఆమోదించదగిన, డేటా-ఆధారిత ప్రతిపాదనలుగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.👉 ప్రాంప్ట్ ఇవ్వడంలో ప్రావీణ్యం పొందండి: ఏఐ సాధనాల వాడకంపై అవగాహన ఉండటం నేడు తప్పనిసరి. అయితే ఆ సాధనాలకు సరైన ఆదేశాలు ఇవ్వడం తెలిస్తేనే అసలైన ప్రయోజనం కలుగుతుంది. సమర్థవంతమైన ప్రాంప్ట్‌లను (కమాండ్స్‌ను) రూపొందించడం నేర్చుకోండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని హైబ్రిడ్ ప్రొఫెషనల్‌గా మారుస్తుంది. ఏ సంస్థకైనా మీరు అత్యంత ఆవశ్యకమైన ఉద్యోగిగా మారుతారు.👉 కేవలం రోజువారీ పనులకే కాదు, మీ కెరీర్ కోసం ఏఐని ఉపయోగించండి: ఏఐని కేవలం ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి మాత్రమే పరిమితం చేయకండి. మీ వృత్తిపరమైన భవిష్యత్తును నిర్వహించుకోవడానికి దాన్ని అనుమతించండి. లింక్డ్ఇన్ యొక్క 'ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్' వంటి సాధనాలతో, మీరు సహజ భాషను ఉపయోగించి మీ లక్ష్యాలు మరియు నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతకవచ్చు. ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో లింక్డ్ఇన్ యొక్క 'జాబ్ మ్యాచ్' మీకు స్పష్టంగా చూపిస్తుంది.👉ఏఐ కేవలం మీరు పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మాత్రమే కాకుండా... మీ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన సమయాన్ని కూడా ఇస్తుంది. వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళా నిపుణులకు, ఏఐని స్వీకరించడం అనేది ఒక కెరీర్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు.. వారు కోరుకునే కెరీర్ వైపు పయనించడానికి ఇది ఒక స్పృహతో కూడిన పిలుపు. -
పరుగే జీవితం
బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్‌లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ బాధ్యతలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రన్నింగ్ రేసులో పాల్గొని పతకాలూ సాధిస్తోంది. ‘వయసు మీద పడినా పనిలో చురుగ్గా ఉండాలంటే మహిళలకు క్రీడలు తప్పనిసరి’ అంటూ తన క్రీడా జీవితాన్ని వివరించింది లక్ష్మి.‘‘రోజూ ఉదయమే నాలుగున్నర గంటలకు డ్యూటీలో ఉంటాను. అంటే, మూడు గంటలకు నిద్రలేస్తాను. తిరిగి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తా. ఇంటి పనులు చూసుకొని, కాసేపు రెస్ట్ తీసుకొని, సాయంకాలం గ్రౌండ్‌కి వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. పాతికేళ్లుగా కంటోన్మెంట్లో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, రన్నింగ్‌లోనూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.మార్చుకున్న షెడ్యూల్...చదువుకునే రోజుల్లో రన్నింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఆ తర్వాత కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. మా వారు ప్రైవేట్ ఉద్యోగి. మాకు ఓ బాబు. ఇంటర్ చదువుతున్నాడు. ఇంటి పనులు, ఉద్యోగం చేసుకున్నా ఇంకా సమయం మిగిలే ఉండేది. దీంతో చదువుకున్న రోజుల్లో వదిలేసిన రన్నింగ్‌ను ఉద్యోగంలో చేరాక కంటిన్యూ చేశాను. పదిహేనేళ్ల క్రితం ఆర్టీసీలో ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. దీంతో రన్నింగ్ అంటే ఇష్టం ఉండి, ప్రాక్టీస్ చేస్తున్న నాకు మంచి అవకాశం లభించినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబుల్‌ను నేనే మార్చుకున్నాను. ఉదయం డ్యూటీకీ వెళ్లి పోయి, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, సాయంకాలానికి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం... ఇన్నేళ్లుగా ఇదే షెడ్యూల్లో నా జీవన శైలి ఉంటుంది. విదేశీ పోటీల్లోనూ...దీంట్లో భాగంగానే ఇండోనేషియా, మలేషియాలో జరిగే రన్నింగ్ కాంపిటిషన్లలో పాల్గొని బంగారు పతకాలను సాధించాను. దేశీయస్థాయిలో రాజస్థాన్, చండీగడ్, ఢిల్లీలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. ఈ యేడాది జనవరిలో అజ్మీర్‌లో జరిగిన రన్నింగ్ రేస్‌లో పాల్గొన్నాను. 400 మీటర్ల పరుగులో సెకండ్ ప్రైజ్, 800 మీటర్ల పరుగులో థర్డ్ ప్రైజ్ వచ్చింది. పోటీలలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు వసతి సదుపాయాలు నిర్వాహకులే చూస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం నేను ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాను.మా మహిళా కండక్టర్లు కలిసినప్పుడు ‘మేమంతా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. కానీ, డ్యూటీ చేస్తూ ఈ వయసులో కూడా నువ్వు యాక్టివ్‌గా ఉన్నావు’ అంటుంటారు. పనిలో యాక్టివ్‌గా ఉండాలంటే ఏదో ఒక క్రీడ ఉంటేనే మంచిది. క్రీడల్లో పాల్గొంటే మన జీవనమే మారి పోతుంది. ప్రతీది ఛాలెంజ్‌గా తీసుకుంటాం. ధైర్యం వచ్చేస్తుంది. ఆరోగ్యంగానూ ఉంటాం. అందుకే, మా మహిళా ఉద్యోగులకు ‘ పోటీలో పాల్గొనక పోయినా సరే, ఏదో ఒక గేమ్‌ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని చెబుతుంటాను’ అని వివరించింది ఈ క్రీడా కండక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విజయ వర్ణాలు
కాంతిపుంజంలో ఏడు రంగులు దాగి ఉంటాయి. స్త్రీ సామర్థ్యం ఒక కాంతి కిరణమే! ప్రసరించే ప్రతిచోటా వెలుతురై వెల్లివిరుస్తుంది. ప్రతి రంగూ మరో రంగుకు బలం ఇస్తుంది. స్త్రీలు ఆకాశంలో సగం మాత్రమే కాదు.. ఆకాశమంతా నిండిన ఏడు వర్ణాలు. ఇక్కడ ఏడు రంగాల్లో ఏడు గెలుపు కథలు చదవండి.మ్యాథ్స్ మాస్ట్రో నళిని అనంత రామన్ రంగం గణితంప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలలో నళిని అనంత రామన్ ఒకరు. డైనమిక్ సిస్టమ్స్, క్వాంటంపై నళిని విశేష కృషి చేశారు. ఆమె పరిశోధన హెన్రీ పాయింకేర్ ప్రైజ్, ఇన్ఫోసిస్ ప్రైజ్‌తో పాటు అనేక అంతర్జాతీయ గుర్తింపులను సాధించింది. గణితంపై పని చేస్తున్న ప్రముఖ పరిశోధకులలో ఒకరిగా నిలిచింది. తల్లిదండ్రులిద్దరూ గణిత శాస్త్రవేత్తలు కావడంతో నళినికి అంకెలతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఏర్పడింది. గణితానికి సంబంధించిన విశేషాలు వినడం అంటే కథలు విన్నంత సంతోషంగా ఉండేది. ‘గణితాన్ని బాగా ఇష్టపడేదాన్ని. అలా అని ఇతర సబ్జెక్లను నిర్లక్ష్యం చేయలేదు’ అని బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు నళిని. పదహారు సంవత్సరాల వయసులో ఫ్రాన్స్‌లో గణితానికి ప్రసిద్ధి చెందిన ‘ఎకోల్ నార్మల్ సుపీరియర్’ విద్యాసంస్థలో చేరింది. పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత అనేక పరిశోధన సంస్థలలో పనిచేశారు నళిని. ప్రస్తుతం స్ట్రాస్బోర్గ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సంక్లిష్టమైన గణిత సమస్యలను తేలికైన ఉదాహరణలతో అర్థం చేసుకునేలా చేయడం ఆమె ప్రత్యేకత. డైనమిక్ సిస్టమ్‌కు సంబంధించిన సారాంశాన్ని బిలియర్డ్స్ టేబుల్‌పై దొర్లే బంతిని ఉదాహరిస్తూ చెబుతుంటారు.చరిత్ర సృష్టించిన విజయంపూజా కృష్ణమూర్తిరంగం: క్రీడలుబ్రెజిల్ 135 ఆల్ట్రాను పూర్తి చేయడం ద్వారా పూజా కృష్ణమూర్తి చరిత్ర సృష్టించింది. 135 మైళ్ల కఠినమైన రేసుకు అర్హత పొంది విజయం సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. 48 గంటలలోనే ఈ రేసును పూర్తి చేసింది. ఈ ఘనత ఆమెను ప్రపంచ ప్రఖ్యాత రన్నర్లలో ఒకరిగా నిలిపింది. పర్వతాలతో ప్రేమ పూజాకు చిన్న వయసు నుంచే మొదలైంది. పూజ ను, ఆమె సోదరి ప్రియాను వారి తల్లి హిమాలయాలలో ట్రెక్కింగ్‌కు తీసుకెవెళ్లేది. ‘ట్రెక్కింగ్ వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఓర్పు, క్రమశిక్షణ’ అని చెబుతుంది పూజ. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన పూజ ఆ తరువాత ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరింది. పరుగు అనేది ఆమె జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. 2011లో తల్లి, సోదరితో కలిసి హాఫ్–మారథాన్‌కు వెళ్లింది. ‘ఐదు కిలోమీటర్ల నా మొదటి పరుగు ప్రయాణం అలా మొదలైంది’ అంటూ జ్ఞాపకాల దారులలోకి వెళుతుంది పూజ. హాఫ్–మారథాన్ తరువాత పది కిలోమీటర్ల రేసులలో పాల్గొనడం మొదలుపెట్టింది. సరదాగా మొదలైన పూజాకృష్ణమూర్తి పరుగు ప్రయాణం చరిత్ర సృష్టించే వరకు వెళ్లింది.నవ యువ స్వర సంచలనం హన్సికా పరీఖ్రంగం: సంగీతంఇండియన్ పాప్ మ్యూజిక్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హన్సికా పరీఖ్. అజ్మీర్‌లోని సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన హన్సికా పరీఖ్‌కు సంప్రదాయ సంగీతం మాత్రమే కాదు నవతరం సంగీతం అంటే కూడా ఇష్టం. చిన్నప్పటి నుంచి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మునిగి తేలింది హన్సిక. అలా అని అక్కడే ఉండి పోలేదు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సంగీత ధోరణుల గురించి తెలుసుకునేది. ఆమె పాట ప్రస్థానం ఎలా ప్రారంభం అవుతుంది అంటే.. మొదట ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ట్యూన్ క్రియేట్ చేస్తుంది. ఆ ట్యూన్‌ను మెల్లగా మనసు పొరల్లోకి తీసుకుంటూ పదాలు అల్లుతుంది. ‘కొత్త సంగీత ధోరణుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కొత్త ఆర్టిస్ట్‌లతో పనిచేయడం కూడా అంతే ముఖ్యం’ అంటుంది హన్సికా పరీఖ్.చిత్ర సంచలనంగీతా గంభీర్రంగం: సినిమాఈ సంవత్సరం ఆస్కార్ డాక్యుమెంటరీ రేసులో సంచలనం సృష్టించారు భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్ గీతా గంభీర్. రెండు వేర్వేరు చిత్రాలకు రెండు నామినేషన్లు సాధించారు. ‘ది పర్ఫెక్ట్ నైబర్’ అనే ఆమె చిత్రం ఫీచర్స్ విభాగంలో ‘బెస్ట్ డాక్యుమెంటరీ’కి నామినేట్ అయింది. మరో చిత్రం ‘ది డెవిల్ ఈజ్ బిజీ’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌కు నామినేట్ అయింది. నామినేషన్లకు ముందే ఈ రెండు చిత్రాలు అకాడమీ 15 షార్ట్ లిస్ట్‌లో ఉన్నాయి. ‘రెండు చిత్రాలను చాలా ప్రేమతో, శ్రద్ధతో నిర్మించాను. ఈ చిత్రాలకు వచ్చిన స్పందన సంతోషంగా ఉంది’ అంటున్నారు గీత. గీతా గంభీర్ బోస్టన్‌లో జన్మించారు. ఆమె తండ్రి శరద్ ఇంజినీరింగ్ చదవడానికి భారతదేశం నుండి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న గీత డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకింగ్‌తో తన చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫిల్మ్ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత నాన్ ఫిక్షన్ ప్రోగ్రామింగ్ విభాగంలో అత్యుత్తమ పిక్చర్ ఎడిటింగ్‌లో రెండు ఎమ్మీ అవార్డ్‌లను గెలుచుకున్నారు.గేమ్ చేంజర్ఆశా శర్మరంగం: గేమింగ్తమ గేమింగ్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీయీవోగా ఆశా శర్మను నియమించింది మైక్రోసాఫ్ట్. యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటాలోని కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్న ఆశాశర్మకు టెక్నాలజీ, ప్రాడక్ట్, ఆపరేషన్ లీడర్‌షిప్‌లకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. 2011లో మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ విభాగంలో తన కెరీర్ ప్రారంభించింది ఆశ. రెండు సంవత్సరాల తరువాత పోర్చ్ గ్రూప్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది. ప్రొడక్షన్, ఇంజినీరింగ్, అమ్మకాలు, మార్కెటింగ్... మొదలైన వాటికి సంబంధించిన బాధ్యతలు చూసేది. ‘ఏ బాధ్యత తీసుకున్నా విజయవంతం చేస్తుంది’ అని పేరు తెచ్చుకున్న ఆశాశర్మ సరికొత్త బాధ్యతతోనూ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఏ.ఐ. ఐకాన్ అశ్వినిఅశోకన్రంగం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సిలికాన్ వ్యాలీలో పది సంవత్సరాలు పని చేసిన అశ్విని అశోకన్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చి, ఏఐ ప్లాట్‌ఫామ్ ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ ప్రారంభించింది. అత్యంత ఆధునిక ఏఐ ఉత్పత్తులను నిర్మించడంలో ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ‘మన దేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అదే సమయంలో నిరుద్యోగం ఉంది’ అంటున్న అశ్విని తన కంపెనీ కోసం ప్రతిభావంతులను వెదకడంలో ఎప్పుడూ ముందుంటుంది. కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్‌లో మాస్టర్స్ చేసింది అశ్విని. ‘ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్‌ను గమనించడం మంచిదేగానీ, వాటిని మనం గుడ్డిగా అనుసరించలేం. మన దేశ నిర్దిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి’ అంటున్న అశ్విని ఏ.ఐ నాడి తెలిసిన నిపుణురాలు. ఏ.ఐ.ని సామాన్య ప్రజలకు ఎలా చేరువ చేయాలో తెలిసిన ఎంటర్ప్రెన్యూర్.ఆరోగ్య భాగ్యం సౌమ్య స్వామినాథన్రంగం: హెల్త్శిశు వైద్యురాలు, క్లినికల్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై విశేష కృషి చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రెటరీగా పనిచేశారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌గా చేరారు. అదే సంస్థలో చీఫ్ సైంటిస్ట్ అయ్యారు. కోవిడ్ కాలంలో శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించి కృషి చేశారు. 2009 నుండి 2011 వరకు యూనిసెఫ్, యూఎన్‌డీపి/ వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ల ‘రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రాపికల్ డిసీజెస్’ అనే స్పెషల్ ప్రోగ్రామ్‌కు కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. ‘మన దేశంలో అందరికీ పోషకాహారం అందడం లేదు’ అంటారు. ఆమె తరచూ ‘హిడెన్ హంగర్’ అనే మాట అంటుంటారు. అంటే... తగినంత ఆహారం తీసుకుంటున్నప్పటికీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందక పోవడం. పిల్లలకు తగినంత పోషకాలు లభించక పోతే జరిగే దీర్ఘకాలిక నష్టాల గురించి ఎన్నో వేదికలపై నొక్కి చెప్పారు. చెన్నైలో పుట్టిన సౌమ్య ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కూతురు. -
ఎవరీ సృజన ఘల్లీ..? సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సైన్యంలోకి..
ఓ గ్రామ నేపథ్యం నుంచి కార్పొరేట్ స్థాయి ఉద్యోగం చేయడమే స్ఫూర్తిదాయకం. అందులోనూ వైట్‌కాలర్ ఉద్యోగం అంటే చక్కగా హాయిగా ఏ మాత్రం శారీరక శ్రమ పడకుండా ఏసీ గదుల్లో కూర్చొని చేసే జాబ్. అలాంటి జాబ్‌ని వద్దనుకుని దేశ సేవలోకి రావడం మాటలు కాదు. పైగా ఆర్మీలో కఠినతరమైన శిక్షణను తట్టుకుని ఏకంగా ఆఫీసర్ స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది భూటాన్‌కి చెందిన అమ్మాయి. యువతరం అంటే ఎంజాయ్మెంట్కి, జోష్‌కి కేరాఫ్ కాదు..దేశ సేవలో మనము భాగం కావాలి..మన దేశ భవిష్యత్తుకు మనమే రూపకర్తలం అని చాటి చెప్పి..జయహో సృజన అని అనిపించుకుందిఆ అమ్మాయే విదేశాంగ అధికారి క్యాడెట్ సృజన ఘల్లీ. అసలు సాయుధ దళాల కుటుంబ నేపథ్యం కాకపోయినా..ఎప్పుడో చిన్నతనంలో ఒక సైనిక అధికారిని చూసి..మనం కూడా అలాంటి యూనిఫాం ధరిస్తే..అని సరదాగా అనుకుంది. అది ఆమె మనసు అంతరాళంలో ముద్రపడినా..పెద్దయ్యాక అంతగా దాన్ని పట్టించుకోలేదు సృజన. భూటాన్‌లోని సామ్ట్సే అనే గ్రామంలో పుట్టి పెరిగిన సృజన తన కెరీర్‌ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఉన్నత విద్యవైపుగా అడుగులు వేసింది. అలా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్‌తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి, భూటాన్‌లోని సెలిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించింది. టెక్నాలజీ రంగంలో మరిన్ని ఉన్నత హోదాల్లో పనిచేసే అవకాశం ఉన్నా..దాన్నికాదనుకుని చిన్నతనంలో ఇష్టపడ్డ ఆర్మీయూనిఫాంని ధరించేందుకు ఇష్టపడింది. సౌకర్యవంతమైన కార్పొరేట్ లైఫ్‌లో సంతోషం లేదని, వ్యక్తిగత సక్సెస్ కన్నా..దేశ సేవలో ఉన్న ఆనందమే వేరు అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. అలా ఆమె సాఫ్ట్వేర్ కెరీర్‌ని వదిలేసి సైనికురాలిగా సేవలందించాలని భావించి..చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. అక్కడ ఆమె ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్‌గా చేరింది. అక్కడ ఆమె జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. తొమ్మిది నెలల కఠిన సైనిక శిక్షణలో ఆహోరాత్రలు శ్రమించింది. ఆ క్లిష్టతరమైన శిక్షణ శారీరకంగానూ మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉండేలా చేశాయి. కంఫర్ట్‌జోన్ దాటి వస్తేనే అసలైన మజా ఉంటుందని గ్రహించింది. ఆ సైనిక శిక్షణలో ఎదురైన కష్టాలు, సవాళ్లు ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. ఒకరకంగా ఆ ట్రైనింగ్‌లోనే సంకల్పం, పట్టుదల, ఓర్పు విలువల గురించి మరింతగా తెలుసుకుంది. అలా సైనిక నాయకత్వ బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకుని రాయల్ భూటాన్ ఆర్మీలో కమిషన్డ్ సభ్యురాలి పనిచేసే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం సృజన దేశానికి ఒక కవచం, సురకత్తిలా మారనుంది. సౌకర్యవంతమైన జీవితాన్ని కాదనుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అలాగే కఠినతరమైన ఆర్మీ శిక్షణలో నెగ్గుకురావాలంటే..అచంచలమైన ఓపిక, ధైర్యం తోపాటు దేశభక్తి ఉండాలి. నిజంగా సృజనే శక్తిమంతమైన మహిళ. ఆదర్శవంతమైన నారీ కూడా. (చదవండి: రణరంగంలో నారీ శక్తి..!) -
బతుకులో జీవం నింపే కళ
‘మనసుకు నచ్చిన పని ఎంతటి సంతృప్తిని ఇస్తుందో హస్తకళల ద్వారానే అర్థం చేసుకోవచ్చు అంటారు’ మరియా క్లారా. సికింద్రాబాద్‌లోని నాగోల్‌లో ఉంటున్న మరియా ఉద్యోగాన్ని వదిలేసి, కలంకారి, బాతిక్ పెయింటింగ్ నేర్చుకొని కలంబాతిక్ మరియా క్లారా గా తన కళకు గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళ జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు ఆమె మనసును ఎలా గాయపరుస్తాయో, తిరిగి ఆమె జీవితం కొత్తగా ఎలా మార్పు చెందుతుందో ఈ కళ కూడా వస్త్రం మీద అలాగే కళ్లకు కడుతుంది’ అంటూ కళాత్మకమైన విశేషాలను పంచుకున్నారు...‘‘కరోనా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. రెండు దశాబ్దాల పాటు ప్రైవేట్ ఉద్యోగంలో యాంత్రికంగా రోజులు గడిచిపోయాయి. జీవితంలో జీవం ఉండేదెలాగో అన్వేషిస్తుండగా హస్త కళలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో బాతిక్ ఆర్ట్‌తో గొప్ప అనుభూతిని పొందాను. మావారు ప్రైవేట్ జాబ్ చేసి, రిటైర్ అయ్యారు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఎవరి ప్రయాణం వాళ్లదే. నేను వాళ్లకు సపోర్ట్ చేస్తాను. వాళ్లు నాకు సపోర్ట్ చేస్తారు. నా ఇష్టాన్ని వాళ్లు కాదనరు.అర్థమెంతో...వ్యాక్స్‌తో క్లాత్ మీద ముందుగా గీతలను డిజైన్ వచ్చేలా గీస్తాం. తర్వాత దానిని ముందే సిద్ధం చేసుకున్న రంగులలో ముంచుతాం. దాంతో ఆ క్లాత్‌మీద ఉన్న వ్యాక్స్ లైన్ అంతా విరిగిపోతుంది. ఆ గీతల స్థానంలో రంగు లైన్లు లైన్లుగా ఇంకిపోయి, ఒక చెప్పలేని అందం కనిపిస్తుంది. ఎక్కడైతే ఎవరి వల్లనైతే మనం బాధపడతామో, ఆ తర్వాత అదే బాధ అవతలి వారు పడుతున్నప్పుడు దానిని తొలగించాలని చూస్తాం. ఎందుకంటే ఆ నొప్పిని అనుభవించిన వాళ్లకే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. అంటే, ‘నువ్వు నొప్పిని అనుభవిస్తేనే, అవతలి వారికి ఉపశమనం ఇవ్వగలవు..’. అని ఈ బాతిక్ ద్వారా జీవితపు అర్థం ఏంటో తెలిసి వచ్చింది. అంటే నొప్పిని అనుభవించిన స్త్రీయే, నొప్పికి మందుకూడా వేయగలదు. అది ఈ బాతిక్ చూపుతుంది. మనసుకు అయిన గాయాలకు రంగులు పూసి, మనకే అందంగా చూపించే కళ ఇది.ఆసరా అయ్యేలా కూడా ఉండాలిమన గురించి బయటివారికి చెప్పలేని భావాలను ఆర్ట్ రూపంలో చెప్పవచ్చు. నటించాల్సిన అవసరం లేకుండా చేసేవి హస్తకళలే. నేను చేసేది కమర్షియల్ వర్క్ కాదు. ఎవరైనా తమకు నచ్చిన అంశం డిజైన్‌లో వచ్చేలా చేసి ఇవ్వమని అడిగితే దానికి తగినట్టు చేసి ఇస్తాను. ఉదాహరణకు.. ‘మా ఇంట్లో పెళ్లి ఉంది, వధూవరుల డిజైన్ చేసి ఇవ్వాలి’ అని అడిగితే అలాగే చేసి ఇస్తాను. మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు పది మందికి ఆసరా అయ్యేలా కూడా ఉండాలని కోరుకుంటాం.ఉపాధి కల్పిస్తున్నాను..కొన్ని చీరలు, డ్రెస్సులు కలం బాతిక్ పెయింటింగ్ చేసి, బొటిక్స్కి ఇస్తాను. ఈ వర్క్‌ని కొంతమంది మహిళలకు నేర్పి, వారికి ఉపాధిని కల్పిస్తున్నాను. గుజరాతీ, బెంగాల్ రాష్ట్రాలలో ఈ బాతిక్ పెయింటింగ్ బాగా ్రపాచుర్యంలో ఉంది. మన దగ్గర బ్లాక్ ప్రింట్ అచ్చులతో వేస్తారు. నేను మాత్రం పూర్తిగా చేతితోనే వేస్తాను. కాలేజీలు, స్కూళ్లకు కూడా వెళ్లి అక్కడి విద్యార్థులకు ఈ వర్క్ నేర్పిస్తున్నాను. ఈ కళ గురించి ఏమీ తెలియని వారు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పనిని నేర్చుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జరిగే కార్యక్రమంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ వర్క్ నేర్పించే అవకాశం లభించింది. ఇష్టంతో నేర్చుకున్న పని నన్ను ఎంతో మంది కళాకారులకు చేరువ చేసింది. భావోద్వేగాల సమతుల్యతను నేర్పించింది’ అంటూ హస్తకళల గొప్పతనాన్ని అందంగా వివరించారు ఈ కళాకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
స్త్రీ సాధికారతను సానుకూలంగా చూడాలి
ఎంపవర్మెంట్ కుటుంబ బాధ్యతల నుంచి స్త్రీ సాధికారత వరకు, ఆధునిక కాలంలో కుటుంబ బంధాల నుంచి స్త్రీ శక్తి వరకు... జస్టిస్ బీవీ నాగరత్న ఏది మాట్లాడినా... అది ఆణిముత్యమే. ఆత్మావలోకన దృశ్యమే. ఆమె మాటలు స్త్రీ సాధికారత, చైతన్యానికి వెలుగు బాటలు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా విముక్తి... మొదలైన విషయాలపై వివిధ సందర్భాలలో జస్టిస్ బీవీ నాగరత్న వెలువరించిన అభ్రిపాయాలు.→ వివాహం లేదా ప్రసవం తరువాత మహిళలు తమ కెరీర్‌ను వదులుకోకూడదు. ఆర్థిక స్వయంప్రతిపత్తి అనేది మహిళలకు సంబంధించి పఠిష్టమైన భద్రతావలయం.→ పురుషాధిక్య రంగాలలో మహిళల సంఖ్య పెరగడం ‘చొరబాటు’ కాదు. చారిత్రాత్మకంగా వారికి నిరాకరించబడిన స్థలాలను తిరిగి పొందడం.→ ప్రభుత్వ, చట్టపరమైన స్థానాల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం ఉండాలి.→ భారతదేశంలో మహిళలు ఎదుర్కొనే మొదటి అడ్డంకి... ఆడపిల్లగా పుట్టడమే!→ ఎన్ఎఫ్హెచ్ఎస్–డేటా ప్రకారం 15–19 సంవత్సరాల వయస్సుగల ఆడపిల్లల్లో 59 శాతం మంది తగిన పోషకాహారం లేకుండా, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఆడపిల్లల అభ్యున్నతికి ఆటంకంగా మారవచ్చు.→ బాలికలపై పెరుగుతున్న డిజిటల్, లైంగిక హింసను నిరోధించడానికి న్యాయ, చట్ట విధానాలను మరింత విస్తరించాలి. 2018–2022ల మధ్య పదివేలకు పైగా కేసులు నమోదైతే వాటిలో శిక్షార్హత రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. సకాలంలో బాధితులకు న్యాయం జరగాలి. పరిహారం అందాలి.→ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ వేగంగా మార్పు చెందుతోంది. ఈ మార్పులు కుటుంబ నిర్మాణాన్ని మాత్రమే కాదు న్యాయవ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చదువు ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం బలపడడం కూడా ఈ మార్పుల్లో ఒకటి. విద్య, ఉపాధి ద్వారా మహిళలు పొందే సామాజిక–ఆర్థిక విముక్తిని సమాజం సానుకూలంగా చూడాలి. ప్రోత్సహించాలి. అలాంటి మహిళలు కుటుంబ శ్రేయస్సుకు మాత్రమే కాదు దేశశ్రేయస్సుకు కూడా దోహదపడతారు.→ కోర్టులలో ఉన్న కుటుంబ వివాదాల్లో ఎక్కువ కేసులు రెండు పార్టీలు రెండు అడుగులు వేస్తే పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలలో ఒకరికొకరు ఆసక్తి, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు భార్యాభర్తలు ఎవరికి వారు అవతలి వ్యక్తి దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి.→ భార్యాభర్తల మధ్య వివాదాలు పెరగడానికి కారణం మహిళల ఆర్థిక, సామాజిక విముక్తి కాదు. మారుతున్న సామాజిక–ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మన అభి్రపాయాలు, వైఖరులను మార్చుకోకపోవడమే.→ మహిళలకు స్వతంత్రం ఇవ్వండి. సలహాలు, సూచనల నెపంతో వారిని నిరంతరం పర్యవేక్షించకండి. వారు స్వతంత్రంగా ఎదగడాన్ని కోరుకోండి. ఈ దేశ మహిళలందరూ అదే కోరుకుంటున్నారు.→ వీధిలోకి వెళ్లినా, బస్సు లేదా రైల్వేస్టేషన్లో అడుగు పెట్టినా తన భద్రతకు సంబంధించిన ఆలోచనల భారాన్ని స్త్రీ మోయాల్సి ఉంటుంది. ఇల్లు, పని, సమాజంలో తన బాధ్యతలకు సంబంధించిన మానసిక భారానికి ఇది అదనపు భారం. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, బేటీ బచావోలాంటి కార్యక్రమాల ద్వారా గత దశాబ్ద కాలంలో పురోగతి సాధించాం. చెడుకు అడ్డుకట్ట వేసే ప్రతి నివారణ చర్య, రక్షణ వ్యవస్థ హాని చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాలికలు అభివృద్ధి చెందడానికి ఒక మార్గాన్ని నిర్మిస్తాయి. -
తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..
సంగీతంలో పెర్కషన్ వాయిద్యాలు వాయించడం అంత సులభం కాదు. చాలామటుకు వాటిని మగవాళ్లే వాయిస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే పెర్కషన్ కళాకారులుగా మగవాళ్లే ఉంటారు ఎందుకంటే వాటిలో కొన్ని వాయిద్యాలు అత్యంత బరువుతో ఉంటాయి. పైగా వాయించాలంటే అపారమైన ఓపిక, శారీరక నొప్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాటిలో అత్యంత కష్టతరమైన వాయిద్యం తవిల్..అలాంటి వాయిద్యాన్ని అద్భుతంగా ఆలపిస్తూ..గుర్తింపు తెచ్చుకుంటోంది ఓ మహిళా కళాకారిణి. అంతేగాదు ఈ తవిల్ వాయిద్యాన్ని ఆలపిస్తున్న తొలి మహిళా కళాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఎవరామె అంటే..ఆ అమ్మాయే ఆరు తరాల సంగీతకారుల కుటుంబం నుంచి వచ్చిన అమృతవర్షిణి మణిశంకర్. తమిళనాడులోని తిరువూరు, మన్నార్గుడికి చెందిన ఆమె, తండ్రి నాగస్వరం కళాకారుడు ఎపి మణిశంకర్ కాగా, తల్లి జయంతి శంకర్ వయోలిన్ విద్వాంసురాలు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తవిల్ నేర్చుకుంటూ తరతరాల నాటి సంప్రదాయాన్ని ధిక్కరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మహిళలు అరుదుగా అభ్యసించే వాయిద్యాన్ని ఆమె అలవోకగా వాయిస్తుంది. ఇంతవరకు మహిళా తవిల్ కళాకారులు ఎవ్వరూ లేరని చెప్పిన తల్లిదండ్రుల మాటలు ఆమెలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పెంచాయట. ఆ నేపథ్యంలోనే ఈ వాయిద్యాన్ని వాయించడం పట్టుదలతో నేర్చుకుంది అమృతవర్షిణి. ఆమె కోవిలూర్ కె.జి. కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో ఈ వాయిద్యాన్ని వాయించడంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ఆధునాతన శిక్షణను తీసుకుంటోంది. ఇందులో మరింత రాణించేలా తవిల్ కళాకారుడు తంజావూరు టి.ఆర్. గోవిందరాజన్ వద్ద సలహాలు సూచనలు తీసుకుంటూ తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటోంది. ఇక అమృత వర్షిణి గురువు సలహాల మేరకు ఈ వాయిద్యాన్ని నేలపై ఉంచడానికి బదులు తన ఒడిలో ఉంచి వాయించడం ప్రారంభించింది. దాదాపు 60 కిలోలు బరువు ఉండే వాయిద్యం ఎక్కువసేపు వాయించడానికి అపారమైన ఓర్పు అవసరం. ఎందుకంటే భుజం, కాళ్లలో నొప్పి అధికమవుతుంది. పైగా వేళ్లు రక్తస్రావం అవుతాయి కూడా. అవన్నీ నయం అవడానికే సుమారు పది రోజులు పడుతుంది. కచేరికి ముందు వేళ్ల చుట్టూ టేప్ చుట్టి..ధ్వనిని ఉత్పత్తి చేసే క్యాప్‌లను తొడిగేందుకు జిగురు రాసుకోవాల్సి ఉంటుందట. అయితే ఇప్పుడు ఆధునిక ఆడియో వ్యవస్థల కారణంగా కాస్త ప్రదర్శన సులభతరం అయ్యిందని, శారీరక ఒత్తిడి కూడా తగ్గిందని అంటోంది.బహిరంగ ప్రదర్శనలివ్వడం అప్పటి నుంచే..పదకొడేళ్ల ప్రాయం నుంచి అమృతవర్షిణి బహిరంగ ప్రదర్శనలివ్వడం ప్రారంభించింది. తొలి ప్రదర్శన హరిధ్వర్మంగళంలోని అరుల్మిగు ముత్తుమైరామ్మన్ ఆలయంలో జరిగింది. 2020లో తమిళనాడు విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీ (వాయిద్య విభాగం)లో మూడవ స్థానం దక్కించుకుంది. 2022లో మళ్ళీ పాల్గొన్నప్పుడు బ్యానర్‌పై తన చిత్రాన్ని చూసుకుని మురిసిపోయానంటోంది. View this post on Instagram A post shared by Indian Women Blog (@indianwomenblog) ప్రస్తుతం ఆమె సంగీత కచేరీల నిమిత్తమే టూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఈ వారాంతంలో బెంగళూరులో జరిగే మహీంద్రా పెర్కషన్ ఫెస్టివల్లో ప్రదర్శించే ‘ఉమెన్ హూ డ్రమ్’ అనే పూర్తి మహిళల పెర్కషన్ బృందంలో భాగం కానుంది. ఇది పూర్తిగా మహిళా సంగీత కళాకారులతో కూడిన బృందం. ప్రముఖ సంగీత విద్యాంసుడి నుంచి పిలుపు..అన్నింటికంటే అత్యంత విశేషమైనది “రెహమాన్ సర్ 'వండర్మెంట్ టూర్' కచేరీలో అమృతవర్షిణిని వాయించమని కోరడం. అదే తనకు తొలిసారి అని ప్రేక్షకుల ముందు సోలోగా ప్రదర్శన ఇవ్వడం అంటూ తనకు ఆ అవకాశం ఎలా వచ్చిందో గుర్తుచేసుకుంది 18 ఏళ్ల అమృతవర్షిణి. గత అక్టోబర్‌లో రెహమాన్ సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో అవ్వడం చూసి.. చాలా ఆశ్చర్యపోయిందట. కొంతకాలం తర్వాత, ఆయన మేనేజర్ స్వయంగా ఫోన్ చేసి ఫిబ్రవరిలో రెండు రోజులు చెన్నైలో ఉండి కచేరీలో పాల్గొనాలని చెప్పడం ఎప్పటికీ మర్చిపోను అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. మహిళలు వాయించలేని సంగీత పరికరాన్ని వాయించడం సాధన చేయడమే గాక..అందులో రాణిస్తూ..ఏకంగా ప్రముఖ సంగీత విద్వాంసుల నుంచి పిలుపు అందుకోవడం మాములు విషయం కాదు కదా..!. ఇది నిజంగా మహిళా సాధికారతకు, ఆమె అజేయమైన శక్తికి నిర్వచనం కూడా. (చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
అయిదు వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించారు!
‘ఆరోగ్యానికే ప్రథమ స్థానం’ అనే ఒకే ఒక మాటతో అయిదు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు బెంగళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని, అనిందిత సంపత్. ఈ బ్రాండ్ నగరంలోని అతిపెద్ద బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇది గాలివాటు విజయం కాదు. విద్య, క్రమశిక్షణ, పోషకాహారం పట్ల లోతైన అవగాహన, వ్యాపార దక్షత ఒక దగ్గర చేర్చితే కనిపించిన ఫలితం.ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు కూతుళ్లు దూరంగా ఉండేలా చూసుకునేది సుహాసిని తల్లి. ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారుచేసేది. ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎప్పటికప్పుడూ అవగాహన కలిగించేది. చివరికి ఆ అవగాహనే వారి వ్యాపారానికి కేంద్రబిందువు అయ్యింది. అనిందిత బిట్స్ పిలాని, ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి. న్యూయార్క్‌లోని ఎర్న్స్ అండ్ యంగ్‌లో మేనేజర్‌గా పనిచేసింది. సుహాసిని లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ, వార్టర్ స్కూల్ నుండి సీఏ చేసింది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేసింది.ఒకరోజూ ప్రొటీన్బార్ తింటూ...‘మనం ఎప్పుడైనా వ్యాపారం ప్రారంభిస్తే ఆ కంపెనీ పేరు యోగా బార్’ అని సరదాగా చెప్పింది సుహాసిని. ఆమె సరదాగా అన్నా, ఆ మాట నిజమైంది.క్లీన్ లేబుల్ స్నాక్స్‌ను సృష్టించే లక్ష్యంతో సుహాసిని, అనిందిత భారతదేశానికి తిరిగివచ్చారు. ఇందిరానగర్‌లోని తమ ఇంట్లో మూడు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమ ఫలించింది. ‘యోగా బార్’ రూపంలో వారి కంపెనీ పట్టాలకెక్కింది. రిటైల్ వ్యాపారులు, వియోగదారులలో తమ ప్రాడక్ట్ గురించి నమ్మకాన్ని కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు విజయకేతనం ఎగరేశారు.ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసి దృష్టిని ఆకర్షించింది యోగా బార్. యోగాబార్ మాతృసంస్థ స్ప్రౌట్స్లైఫ్ ఫుడ్స్‌లో దాదాపు 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఐటీసీ. కంపెనీ సీయీవోగా అనిందిత ప్రాడక్ట్ డెవలప్మెంట్, క్రియేటివ్ విజన్‌కు సంబంధించిన బాధ్యతలను, సీవోవోగా సుహాసిని మేనేజింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ డిసిప్లేన్‌కు సంబంధించిన బాధ్యతలను చూస్తున్నారు. -
రంగుల లోకపు రాణులు
భారతీయ కళా ప్రపంచంలో ప్రత్యేకంగా కనిపించే, విస్తృతంగా గుర్తింపు పొందిన లక్షణం ఏమిటంటే అత్యంత ప్రభావవంతమైన గ్యాలరీ నిర్వాహకులు, క్యురేటర్లు, కళా పరిరక్షకులలో అనేకమంది మహిళలే కావడం! భారతదేశంలోని అనేక రంగాలు ఇప్పటికీ పురుషాధిక్యంగా ఉన్నప్పటికీ, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోని సమకాలీన కళా వేదికలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నా సమానత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ ఈ వేదికలను మహిళలు ముందుండి నడిపిస్తున్నారు. కళకు నా పరిచయం అమృతా షేర్–గిల్ చిత్రాలతో చిన్నప్పుడే మొదలైంది. కాలక్రమేణా ఆమె గురించి నా అవగాహన మారింది. విద్యార్థిగా ఆమెను ఆధునిక భారతీయ చిత్రకళలో మార్గదర్శిగా చూశాను. కానీ క్యురేటర్‌గా చూస్తే, ఆమె మన దృక్కోణాన్ని మార్చిన వ్యక్తి. భారతీయ మహిళలకు ఒక అంతరంగాన్ని, సజీవమైన ఉనికిని ఇచ్చిన కళాకారిణి. ఆ మార్పు నేను చిత్రకళను అర్థం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేసింది. అక్కడి నుంచి ఈ పరంపర విస్తరిస్తోంది.స్త్రీ వాదం... జీవన పోరాటంమాటలకందని భావాలను, సమాజంలో జరుగుతున్న విషయాలను, రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో చిత్రీకరిస్తారు అర్పితాసింగ్. నళిని మలాని పౌరాణిక కథలను, చరిత్రను, హింసను, స్త్రీవాద సమస్యలను, జీవన పోరాటాలను ‘న్యూ–మీడియా‘ ద్వారా చూపిన తొలి కళాకారిణి. మృణాలిని ముఖర్జీ సాధారణమైన అల్లిక పద్ధతికి కొత్త కోణాన్ని జోడించి వాటితో ఫైబర్ శిల్పాలను సృష్టించి, తన కళాఖండాలకు విభిన్నమైన స్థాయిని కల్పించారు. ఛాయాచిత్రాల ద్వారా గత స్మృతులు కవితాత్మకంగా ఉండవచ్చని, సేకరణ పద్ధతి కూడా స్వయంగా ఒక కళారూపమని షీబా ఛాచ్ఛి మనకు తెలియజేశారు.కళాసేవకులునేను క్యురేటోరియల్ విభాగంలోకి అడుగుపెట్టిన తరువాతే మహిళలు కేవలం కళాఖండాలను మాత్రమే కాదు, కళా వ్యవస్థలనే మలిచారని నాకు అర్థమైంది. ‘ఖోజ్’ అనే ఒక కళా–సేవా సంస్థను, వస్తువులు అమ్మే అంగడిలా కాక – సంభాషణ, ప్రయోగాల వేదికగా, వర్ధమాన కళాకారుల మేలు కోసం పూజ సూద్ మరికొంతమందితో కలిసి స్థాపించారు. వస్త్రాలు, వస్తుసంస్కృతిపై అన్నపూర్ణ గరిమెళ్ల చేసిన పరిశోధన చిత్రకళకూ హస్తకళలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, హెచ్చుతగ్గులనూ తొలగించడంలో కీలకంగా మారింది. మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళా కళాకారులు, కేవలం కళా సృష్టిలోలోనే కాదు, బోధనలో, సంస్థల నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు, స్వాతంత్య్ర సమరంతో పాటు సాంస్కృతిక రంగంలో కృషి చేసిన సంగం లక్ష్మీబాయి నుంచి ఆంధ్ర ఆధునిక చిత్రకళలో తనదైన శైలి చాటుకున్న దామెర్ల సత్యవాణి వరకు తరతరాల కళాకారులను తీర్చిదిద్దిన కవితా దేవుస్కర్, అంజని రెడ్డివంటి వారి నుంచి నిశ్శబ్దంగా ‘సంస్కృతి స్కూల్ ఆఫ్ ఆర్ట్’ను లాభాపేక్షలేని వేదికగా నిలబెడుతున్న ‘ప్రింట్ మేకర్’ పద్మారెడ్డి వరకు, జేఎన్ ఏఎఫ్ఏయూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడిన నిర్మల బిలుకా నుంచి, విద్యావేత్తగా నిబద్ధతతో పనిచేస్తున్న ప్రీతి సంయుక్త వరకు, వీరందరి కృషి ఎంతోమంది చిత్రకళా విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దారు. అలాగే, గౌరి వేముల, ప్రియాంక ఏలే వంటి కళాకారిణులు హైదరాబాద్ చిత్రకళా స్వరాన్ని జాతీయ వేదికలపై వినిపించారు.మహిళగా ఎన్నో సవాళ్లుఎదుగుతున్న మహిళా గ్యాలరిస్ట్‌గా నాకు సవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నమ్మకాన్ని కాపాడుకోవడం, నిధులు సమకూర్చడం, సారూప్య భావనలు కలవారితో చర్చలు జరపడం, అందరికీ పరస్పరం ఉపయోగపడే వ్యవస్థను అలుపెరుగక నిర్మించడం లాంటివి. భారతీయ చిత్రకళలో మహిళలు చూపిన దారులు మనకెంతో ధైర్యాన్నిస్తాయి. వసతులపై ఆధారపడకుండానే వారు సంస్థలను నిర్మించారు. అంగడి లేకుండానే వ్యవస్థను సృష్టించారు. సాంస్కృతిక వేదికలు పట్టుదలతో, సహకారంతో నిర్మితమవుతాయని తెలుసుకున్నాను. ్రపాంతీయతతో ముడిపడిన దళిత, ఆదివాసీ మహిళల స్వరాల వైవిధ్యం నన్ను ఎప్పటికీ ఉత్తేజ పరుస్తుంది. ఈ మహిళా కళాకారులు ప్రకృతి, జ్ఞాపకాలు, శ్రమ ఆధారంగా సమకాలీన భారతీయ చిత్ర–హస్తకళలను పునర్నిర్మిస్తున్నారు. వారి శైలికి తగ్గట్టు, నిదానంగానూ, సహకారాత్మకంగానూ పనిచేసే క్యురేటోరియల్ విధానాలను కోరుకుంటారు; జ్ఞానమనేది కేవలం సంస్థలకే పరిమితం కాదని, వాటి బయట కూడా ఎంతో విజ్ఞానం ఉందని గుర్తుచేస్తున్నారు.ఆ పునాది పైనే!శాంతి స్వరూపిణి (శిల్పి) వరుణికా సరాఫ్ వంటి కళాకారులెందరో జాతీయ కళా వేదికపై తమదైన ముద్ర వేశారు. వీరందరి సమష్టికృషి, ఓర్పుతో, నిర్మితమైన పునాది పైనే మనమందరం నిలబడ్డాం. వీరు ‘బోధన, సృజన, సంస్థ నిర్మాణం’ అనే మూడు రంగాలపై దృష్టి సారించారు. తాత ముత్తాతల నుండి వచ్చిన స్మృతులు, కథల ద్వారా తెలుసుకున్న విషయాలను కళా రంగంలోకి వీరు తీసుకువచ్చారు. వారు పాటించిన పద్ధతులను పరిశోధించడం వలన నా ఆలోచనా విధానం కూడా ప్రభావితమయ్యింది. ప్రదర్శనలు కేవలం యాంత్రికంగా జరిగేవి కావు! అవి పరిశోధనతోనూ, బోధనతోనూ, ప్రజలతోనూ అనుసంధానాన్ని కలిగిన ప్రక్రియలు. ఆ ప్రదేశంలోకి ఎవరు వస్తున్నారు? మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? మొదటిసారి చూసే వారికి ఇది ‘తమదే’ అన్న భావన ఎలా కలిగించాలి? ఈ ప్రశ్నలే మహిళల నేతృత్వంలోని సాంస్కృతిక కృషిలో ముఖ్యమైనవి. – అన్నపూర్ణ ఎం.ఇండిపెండెంట్ ఆర్ట్ క్యూరేటర్, ఆర్టిస్ట్, ఫౌండర్, డైరెక్టర్– ఏక్చిత్రా ఆర్ట్‌గ్యాలరీ, హైదరాబాద్ ఆర్ట్ షో, కో–ఫౌండర్ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకంగ్యాలరీలోకి అడుగుపెట్టక ముందే చిత్రకళ గురించిన కథలు వింటూ పెరిగాను. మా నాన్నగారు ఎర్రమిల్లి రోహిణీ కుమార్ గారు చిత్రకారులవటం చేత, ఆయనకు తెలిసిన చిత్రకారుల గురించి మాట్లాడినప్పుడు, దగ్గరి బంధువుల గురించి చెప్తున్నారేమో అని అనిపించేది. రావాల్సినంత గుర్తింపు రాకపోయినా, సృజనాత్మక వేదికలను నిలబెట్టిన మహిళల గురించి నేను విన్న ఆ సంభాషణలే నా తొలి జ్ఞాపకం. వారు కేవలం చిత్రాలను గీయడంతో ఆగలేదు, శిల్పాలు మాత్రమే చెక్కి ఊరుకోలేదు. కళను ఎలా పరిశీలించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలకు కార్యరూపం ఇచ్చారు. ఇప్పుడు నేనొక క్యురేటర్‌గా, ఎదుగుతున్న గ్యాలరిస్ట్‌గా వాటి గురించి ఆలోచిస్తుంటాను. భారతీయ కళలలో మహిళల పాత్ర అనేది కొత్తగా చేర్చాల్సిన విషయం కాదు, అది ఎప్పటినుంచో అంతర్లీనంగా ఉన్నదే. -
ముళ్లున్న చోటే పూలు
కుటుంబం సవ్యంగా సాగుతున్నప్పుడు మధ్యలో అనుకోకుండా ఎదురయ్యే కుదుపులు సమస్యలను సృష్టిస్తాయి. వాటినుంచి బయటపడడంలోనే మన జీవన పోరాటం దాగి ఉంటుంది. నల్గొండ జిల్లా దుగ్గపల్లికి చెందిన కర్ర శశికళ జీవితంలోనూ ఇదే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం భర్త ఆకస్మిక మరణంతో ఆమెను శూన్యం ఆవరించింది. కానీ, సమస్యకు ఎదురొడ్డి తను కష్టాల నుంచి బయటపడటమే కాదు, తన చుట్టూ ఉన్నవారికి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. ఈ సందర్భంగా శశికళతో మాట్లాడినప్పుడు ఆమె పంచుకున్న విశేషాలు ఇవి.‘‘మనం ఒకటి అనుకుంటాం. కానీ, విధి మరొకటి తలుస్తుంది అంటారు. అందుకు నా జీవితమే ఉదాహరణ అనిపిస్తుంది. నాకు పల్లెటూరు, పొలాలు కన్నా పట్టణ జీవితం అంటేనే ఇష్టం ఉండేది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరం మిర్యాలగూడ టౌన్లో ఉండేవాళ్లం. మాకు ఒక బాబు. పెళ్లయ్యాక పీజీ, తర్వాత బీఇడీ చేశాను. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి సమయంలో మా వారు వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో ఊరికి వెళ్లిపోదాం అన్నారు. కానీ, పల్లెటూరుకు వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. దీంతో కొంతమంది స్నేహితులతో కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. అందులో పెద్ద నష్టం. అప్పుల్లో కూరుకుపోయాం. ఇది చాలదన్నట్టు ఆయన ఆరోగ్యం క్షీణించింది. పరీక్షలు చేయిస్తే గుండె సంబంధిత వ్యాధి అని తేలింది. ఆసుపత్రులు, చెకప్‌లు అంటూ తిరుగుతుండగానే ఆయన వెళ్లిపోయారు. పూర్తిగా డిప్రెషన్ ఆవరించింది. ఆరునెలలైనా మామూలు మనిషిని కాలేకపోయాను. చనిపోదాం అనుకున్నాను. అలాంటి సమయంలో అమ్మనాన్నలు, తోడబుట్టినవాళ్లు అండగా నిలిచారు.నచ్చని వ్యవసాయాన్నే ఎంచుకున్నాను..నా భర్త కల వ్యవసాయం చేయాలని. కానీ, అప్పటికి మాకు ఆస్తి ఎంత ఉందో, అంతకుమించి అప్పు ఉంది. ఏం చేయాలా అనుకుంటున్న సమయంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ‘ఉన్న ఆస్తులు అమ్మేసి అప్పు తీర్చేసి, ఉద్యోగం చేసుకుంటూ బతుకుదామా..’ అని ఆలోచించాను. కానీ, ఉద్యోగాన్నే వదులుకున్నాను. నా భర్త కల నెరవేరాలంటే వ్యవసాయమే సరైనది అనుకున్నాను. ఆ రంగంలో ఓనమాలు కూడా తెలియవు. ప్రతీది నేర్చుకుంటూ, రాణిస్తున్నాను. అగ్రికల్చర్ లోను తీసుకొని, వ్యవసాయం మొదలుపెట్టాను. వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం ఎలా.. అని చాలా ఆలోచించేదాన్ని. మూడు వేల రూపాయలతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారుచేసి, బత్తాయి తోటను కాపాడే ప్రయత్నం చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది. కొద్ది కొద్దిగా అప్పులు తీరుస్తూ వచ్చాను. ఈ రంగంలో ఇంకా ఏమైనా చేయవచ్చా అనే ఆలోచనలు చేసినప్పుడు నర్సరీ నాకు సరైన ఎంపిక అనిపించింది.నర్సరీ ఆలోచన మేలు చేసింది.. నర్సరీలలో మొక్కల పెంపకానికి చేపడుతున్న చాలా మంది ఉత్తమమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఆ వైపుగా ఆలోచించాను. నర్సరీ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల ఊళ్లలో రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఉన్న పొలంలోనే నర్సరీ ఏర్పాటు చేశాను. ఈ నర్సరీలో పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల డెకార్‌కు సంబంధించిన మొక్కలను పెంచుతున్నాను. దీంతో పాటు తోటలకు సంబంధించిన మామిడి, బత్తాయి, జామ, నిమ్మ మొక్కలు సైతం ఆర్డర్లపై అందిస్తున్నాను. వీటికి తోడు గోవులను పెంచుతూ, వాటి ఉత్పత్తులను పంటలకు వాడుతున్నాను. కొన్నాళ్లకు మా వారి పేరు మీదుగా శ్రీ సాయి మాధవ గో సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాను. ఈ పని నాకు చాలా మెరుగైన ఫలితాలను ఇచ్చింది. మొదట్లో ఊళ్లో అందరూ నా వెనక మాట్లాడుకున్నవారే ఇప్పుడు వ్యవసాయంలో సలహాలు, సూచనలు అడుగుతుంటారు. హార్టీ కల్చర్ షోలలోనూ పాల్గొంటుంటాను. నర్సరీ, వ్యవసాయానికి ఉపయోగించే ఆర్గానిక్ ఉత్పత్తులనూ సప్లై చేస్తుంటాను. ఈ రంగంలో ఉత్తమ మహిళా రైతు అవార్డులూ అందుకున్నాను. మా అబ్బాయిని పై చదువులకోసం విదేశాలకు పంపగలిగాను. మహిళ శక్తి ఆమెకు మొదట తెలియదు. కానీ, తలుచుకుందంటే చేసి చూపగలదు. ఆ ధైర్యం, తెగువ ఆమెలో స్వాభావికంగానే ఉంటాయి’ అని వివరించింది శశికళ. ఇన్నేళ్లుగా వ్యవసాయం రంగంలో ఉన్నాను. కానీ, ఇప్పటికీ ప్రతిరోజూ ప్రకృతితో పోరాటమే. ఎప్పుడే సమస్య వస్తుందో తెలియదు. తెల్లవారకముందే నా పనులు మొదలవుతాయి. ఒకప్పుడు ఎంతమాత్రం ఇష్టం లేని పనే ఇప్పుడు నాకు ప్రాణమైంది. పచ్చని మొక్కలు, గోవులు నా ఆత్మీయ నేస్తాలు అయ్యాయి. ప్రకృతికి ఎంత ఎక్కువగా దగ్గరవ్వగలను.. అనేదే ప్రతీక్షణం ఆలోచిస్తాను. అదే ఈ రోజు నన్ను ఇలా మార్చింది అనుకుంటాను. – కర్ర శశికళ, సేంద్రియ వ్యవసాయ రైతు– నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా -
శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్‌గా పనికి వచ్చేయాలి..
మార్చి నెల అనగానే మహిళా దినోత్సవం అని ఠక్కున గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే..అంతగా గుర్తించని శక్తిమంతమైన మహిళలు ఎందరో ఉన్నారు. ఒక్కోక్కరిని కదిలిస్తే వాళ్ల కన్నీళ్లు ఇంకిపోయేలా పడుతున్న బాధలు, వేదనలు తెలుస్తాయి. అయినా వాటన్నింటిని పంటి బిగువున పెట్టి..పనులకు వచ్చేస్తుంటారు. ఏం కాదు, ఏం జరగలేదు అన్నట్లుగా చకచక పనులు చేసుకుపోయే ఆ మహిళామూర్తుల జీవితాలు ఎందరికో ఆదర్శం..స్త్రీ శక్తికి నిదర్శనం. అలాంటి నారీమణే ఈ శాంతి. ఎవరీమె అంటే..ఆమె నాలుగిళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ.. బతుకు బండిని లాగిస్తుంటుంది. ఆమెకు ఇంట్లో ఎంత కష్టం ఎదురైనా..తప్పక పనికి టెన్షన్‌గా వచ్చేయాల్సిందే. ఆమె అవసరం కష్టాలు అలాంటివి. భర్త ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగి. కొండంత ఆశలతో కుటుంబంతో సహా మహాగనగరానికి వస్తే..దేవుడి స్క్రిప్ట్ మరోలా రాసిపెట్టి ఉందామెకు. ఆమెకు ఇద్దరు పిల్లలు, కొడుకు ఆంటిజం బాధితుడు, కాగా కూతురు ఇటీవలే పదినెలల క్రితం అనుహ్యంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. కూతురు చనిపోయినా కనీసం రెండు వారాల కూడా ఇంట్లో కూర్చోకుండా పనులకు వెళ్లిపోయేది. ఎందుకంటే..కొడుకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇంట్లో కూర్చొంటే కష్టం. గుండెల్ని పిండేసే బాధ అయినా సరే మౌనంగా పనికి రాకపోతే..నెల వచ్చేటప్పడికీ తడిసిమోపిడి అవుతాయి ఖర్చులు. ఎందుకంటే కొడుకు తన పనులు తానుచేసుకోగలగాలి, తనే కాళ్లపై నడవగలగాలి అదే శాంతి ఆకాంక్ష. అందుకోసం ట్రీట్మెంట్ తప్పనిసరి. అతని చికిత్స సెషన్‌కు రూ. 13000 ఖర్చు అవుతుంది. భర్త సంపాదనలో ఎనిమిదివేలు నేరుగా ఇంటి అద్దెకు వెళ్లిపోతాయి. మిగతా డబ్బులు అతడి స్కూల్ఫీజ్, ఆహారానికి, ట్రీట్మెంట్ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ శాంతి హాయిగా పనులకు వెళ్లే వెసులుబాటు కూడా లేదామెకు. ఎందుకంటే కొడుకుకి అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకోవాలి. ఆమె ఉదయం స్కూల్లో కొడుకుని దించడం నుంచి మొదలవుతుంది ఆమె రోజు. ఆ తర్వాత పనికోసం ఇళ్లకు వెళ్లి..మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి..3 గంటల కల్లా కొడుకుని స్కూల్ నుంచి తీసుకువస్తుంది. ఆ తర్వాత మళ్లీ పనికోసం ఇళ్లకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఆ చుట్టుపక్కల వాళ్లే కాస్తచేదుడువాదోడుగా ఉంటారు. ఆమె పనికి వెళ్లినప్పుడు కొడుకు బాగోగులు వాళ్లు చూసుకుంటారు. కానీ ఇంత కష్టాన్ని, భారాన్ని మోస్తున్నా..అవేమి ఆమె కళ్లల్లో కనిపించదు, కనీసం కన్నీటి చారను బయటకు కనపడనివ్వకుండా..చకచక పనులు చేసుకుంటూ పోతున్నా ధీశాలి ఈ శాంతి. ఒక్కసారి తరచి చూస్తే ఇలాంటి శాంతి లెందరో మన సమాజంలో ఉన్నారు. వాళ్లందరికీ జోహార్లు..ఎందుకంటే పిల్లలను కోల్పోయి..మరోవైపు కుటుంబ కోసం ఆహర్నిశలు కొవ్వుత్తిలా కరిగిపోతూ..ఇంటికి వెలుగుని పంచే ఇలాంటి మహిళామణులే అసలైన హీరోలు. ఇక్కడ ఈ శాంతి ఇవేమి కోరుకోవడం లేదు, కేవలం తన కొడుకు బాగైతే చాలు.. అదొక్కటే ఆమెను అచంచలంగా నడిపిస్తోంది. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
ఆరోగ్యం.. ఒక డైనమిక్ ప్రయాణం
స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు, సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి. ఈ మూడు దశల్లో హార్మోన్ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.టీనేజ్ దశలో...యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా వేయించాలి. సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.పునరుత్పాదక వయస్సులో...20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్ చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్‌ఫాక్స్, హెచ్‌పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్ స్మియర్ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ ప్లానింగ్‌కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి. యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.మెనోపాజ్ దశలో...నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్ అంటారు. ఈ దశలో హార్మోన్ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్ చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలి.మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!) -
ఉర్దూ కథా కోకిల
మత విశ్వాసాలు, కట్టుబాట్లు, పురుషుల పెత్తనం మూసిన కిటికీలు తెరవడానికీ లేని కట్టడి... వీటి మధ్య జీలాని బానూ కథా రచయిత్రిగా జన్మెత్తగలిగింది. దశాబ్దాల పాటు ఉర్దూ కథకు, దక్కనీ సాహిత్యానికి ఆమె ధ్రువతారగా నిలిచింది. జీలానీ బానూ వల్ల హైదరాబాద్ పేరు ప్రపంచ దేశాల ఉర్దూ సాహిత్య ప్రేమికులకు తెలిసింది. ఆదివారం కన్నుమూసిన జీలానీ బానూ (89) నివాళి.ఇప్పటి మాట కాదు. ఒక డెబ్బయి అయిదు... ఎనభై ఏళ్ల క్రితం సంగతి. అప్పట్లో హైదరాబాద్ నాంపల్లి సమీపంలోని మల్లెపల్లి బస్తీ ‘ఏ’ టైప్ క్వార్టర్లో పెరట్లో పిల్లలు రాత్రయితే కథలు చెప్పుకునేవారు. వాళ్లు అప్పటికే మల్లెపల్లిలో ఆడే భాగవత, రామాయణ, భారతం కథలు నాటకాలుగా చూసుండేవారు. అవే చెప్పుకునేవారు. ఆ అమ్మాయి రామాయణం కథ చెప్తుండేది. అందులో లక్ష్మణరేఖ గీసి లక్ష్మణుడు వెళ్లి΄ోయాక సీతను ఎత్తుకెళ్లడానికి రావణుడు వస్తాడు. అంతవరకూ ఆ అమ్మాయి సరిగానే చెప్పేది. ఆ తర్వాత మార్చేసేది. దాని ప్రకారం సీత గీత దాటదు. పైగా రావణుణ్ణి చితకబాది తరిమికొడుతుంది. ఇలా మార్చి చెప్పడం ఇతర పిల్లలకు నచ్చేది కాదు. కాని సీత కష్టాలు పడటం ఆ అమ్మాయికి నచ్చేది కాదు.ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి కష్టాలు పడే స్త్రీలకు మనోధైర్యం ఇస్తూ ఎన్నో కథలు రాసింది. జీలానీ బానూగా ప్రఖ్యాతి పొందింది.జీలానీ బానూ తల్లిదండ్రులది ఉత్తర ప్రదేశ్‌లోని ‘బదయూ’ ప్రాంతం. అక్కడంతా స్త్రీలకు రకరకాల కట్టుబాట్లు ఉండేవి. వారు కిటికీల్లో నుంచి బయటకు చూడకూడదు. మగాళ్లు తిరిగే చోట్లకు వెళ్లకూడదు. చాయ్ తాగకూడదు. పాన్ తినకూడదు. అలాంటి చోటు నుంచి జీలానీ బానూ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తరలి వచ్చారు. బానూ తండ్రి హసన్ హైరత్ నిజాం సంస్థానంలో ఉర్దూ శాఖలో పని చేసేవారు. స్వయంగా పెద్ద కవి. ఆయన పేరుతో మల్లేపల్లిలో ‘హైరత్ బదయూని రోడ్డు’ ఉంది. ఆయన తన సంతానంలోని ముగ్గురు ఆడపిల్లలను పుస్తకాలు చదివించడానికి ప్రోత్సహించారు. ‘ఇళ్లల్లో తప్పనిసరిగా ఆడపిల్లలకు ఉర్దూ నేర్పించేవారు. ఉర్దూను స్త్రీలే కాపాడారు’ అంటారు జీలానీ బానూ. అలా బానూకు ఉర్దూ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది.జీలానీ బానూ బాల్యంలో ఆమె తండ్రి కోసం ఎందరో సాహితీ వేత్తలు ఇంటికి వచ్చేవారు. వారిలో సినీ కవులు షకీల్ బదయూనీ, కైఫీ ఆజ్మీతో పాటు హైదరాబాద్ కవి మగ్దూమ్ మొహియుద్దీన్ కూడా ఉండేవారు. పుస్తకాలు చదివీ చదివీ, రాయడానికి కాగితాలు దొరక్క సూపరిటెండెంట్ అయిన తన మేనమావ పారేసిన ఫైళ్లలోని కాగితాలు సేకరించి వాటి వెనుకవైపు ఖాళీపై కథలు రాయడం మొదలు పెట్టారు జీలానీ బానూ. అప్పట్లో బొంబాయి రేడియోకి పిల్లల నాటకం రాసి పంపితే దానిని ప్రసారం చేయడమే కాకుండా 10రూపాయల పారితోషికం పంపారు. ఆ రోజుల్లో 10 రూపాయలు చాలా పెద్ద మొత్తం. అది జీలానీ బానూ తొలి సంపాదన. ప్రయివేటుగా మెట్రిక్ చదివి, ప్రయివేటుగా ఉస్మానియా నుంచి బి.ఏ. చేసిన బానూ, ప్రయివేటుగానే ఎం.ఏ. ఉర్దూ కూడా చదివారు. ఆ సమయంలోనే తమ బస్తీలోని ఒక అమ్మాయిని పురుషులు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఆ ఘటనకు చలించి ‘మోమ్ కి మరియమ్’ (1954) అనే కథ రాశారు. దానిని లాహోర్‌లోని ‘అదబే లతీఫ్’ అనే పత్రికకు పంపితే ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. ఆ రోజు నుంచి జీలానీ బానూ దక్కన్ ప్రాంతంలో ఎంత ప్రసిద్ధి చెందారో లాహోర్‌లో కూడా అంతే ప్రసిద్ధి చెందారు.జీలానీ బానూ ఇంట్లో లక్ష్మీ అనే ఆయా పని చేసేది. ఆ ఆయా మంచి మాటకారి. కామారెడ్డిలోని భిక్నూర్ వాళ్ల ఊరు. ఆ ఊరిలో బావికి లోను ఇచ్చామని చెప్పి అధికారులు బావి తవ్వకుండా డబ్బు మింగేశారని లక్ష్మీ జీలానీ బానూకు చెప్పింది. ఆ సంఘటన ఆధారంగా బానూ రాసిన ‘నర్సయ్యా కి బావ్డీ’ (నర్సయ్య బావి) ప్రపంచ సాహిత్యంలో అత్యుత్తమ కథగా నిలిచింది. దానిని శ్యామ్ బెనగళ్ ‘వెల్డన్ అబ్బా’గా సినిమా తీశాడు. జీలానీ బానూ ఇలాగే సమకాలీన ఇతివృత్తాలపై రచనలు చేశారు. దక్కనీ నవాబుల కాలంలో స్త్రీల స్థితిగతులపై ఆమె రాసిన ‘ఐవానే గజల్’ ఉత్తమ రచన. అలాగే తెలంగాణ పల్లెటూళ్లలో భూస్వాముల దురాగతాలపై ‘బారిషే సంగ్’ నవల రాశారు. మొత్తం 22 పుస్తకాలు బానూ కలం నుంచి వెలువడ్డాయి. ఆమె రచనలు రష్యన్ భాషలో అనువదితమై ఆమెకు ‘సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్’ సంపాదించి పెట్టాయి. సాహిత్య అకాడెమీ పురస్కారం, పద్మశ్రీ, ఇంకా దేశ విదేశాల నుంచి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. హైదరాబాద్ వచ్చిన ప్రఖ్యాత పాకిస్తానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీలానీ బానూ ఇంటనే బస చేశారు. అంత గౌరవం జీలానీ బానూ అంటే.జీలానీ బానూ భర్త అన్వర్ మొఅజ్జం స్కాలర్, పరిశోధకుడు. వీళ్ల పెళ్లిని కవి మగ్దూం మొహియుద్దీన్ కుదర్చడం విశేషం. జీలానీ బానూ కుమారుడు ఫర్హాన్ కంప్యూటర్ నిపుణుడు. అతను ఉర్దూ ఫాంట్‌ను, ఉర్దూ ఫాంట్‌తో పేజ్ నేషన్‌ను తయారు చేసి పత్రికల ప్రచురణలో పెద్ద మార్పు తీసుకొచ్చాడు. జీలానీ బానూ సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేశారు. ‘యూత్ ఫర్ యాక్షన్’ అనే సంస్థ ద్వారా స్త్రీల జీవనంలో మార్పు కోసం కృషి చేశారు. ఉర్దూ కథకు చిరకీర్తి సంపాదించిపెట్టిన జీలానీ బానూ తరాలు గుర్తుంటారు.– ఖదీర్ -
వేదకాలం నుంచి నేటి కాలం వరకు.. విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరుప్పావై’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
సువర్ణ రేఖలు!
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.ఎవరి అండా లేదు...నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్‌కు వచ్చి, ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.కష్టాలే మార్చాయి...పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు. రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. సారా ముంచింది...పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పరిశోధనల్లో దారి దీపాలు
‘ఈసురోమని మనుషులుంటే ఇస్రో వరకు వెళ్లగలమా!’ అనేది సరదా పేరడీ అయితే కావచ్చుగానీ... అక్షరాలా నిజం.సైన్స్‌లో ‘రాణించాలంటే ఆసక్తి అనే శక్తి ఉండాలి. ఆ శక్తికి ఉత్సాహశక్తితోడైతే ‘అన్వేషణ’ అనే భవన నిర్మాణం జరుగుతుంది.ఆ భవనంలో ఎన్నో పరిశోధన చిత్రాలను ఆవిష్కరించారు మన మహిళా శాస్త్రవేత్తలు. ‘సైన్స్ అనేది పురుషుల రంగం’ అనే మాటకుకాలం చెల్లిందని తమ ప్రతిభ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. సైన్స్ సామ్రాజ్యంలో సగర్వంగా విజయ పతాకం ఎగరేస్తున్నారు...శాస్త్రరంగంలో ‘షా’జీఆదిత్య ఎల్ 1 విజయవంతంగా ప్రారంభించిన తరువాత అక్కడి మిషన్ కంట్రోల్ సెంటర్ పోడియం దగ్గర నిలబడి ‘ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన కల నిజమైంది’ అన్నారు ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ. ‘కల నిజమైంది’ అనుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇస్రోలోకి అడుగు పెట్టినప్పుడు ‘నా కల నిజమైంది’ అనుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటూ వస్తున్నారు. 1987లో షాజీ ఇస్రోలోకి అడుగు పెట్టారు. ‘వీనస్ మిషన్’కు అధ్యయన డైరెక్టర్‌గా, రిసోర్సెస్–2 ఏకి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు ఎన్నో ఉపగ్రహ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి సౌరమిషన్ ‘ఆత్య–ఎల్1’కి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సేవలందించడం ఆమె కెరీర్లో మైలు రాయి. శాస్త్ర రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న షాజీ ఇమేజ్ కంప్రెషన్, సిస్టమ్ ఇంజినీరింగ్‌లపై రచనలు చేశారు.ఆకాశదేశాన...చిన్నతనంలో అన్నపూర్ణి ఆకాశంలోని నక్షత్రాలను ఆసక్తిగా చూసేవారు. నక్షత్రాలు, ఖగోళ విషయాలపై అమితాసక్తి ఆమెను ఎక్కడి వరకు తీసుకు వెళ్లిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్‌గా పనిచేసేవరకు.‘సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌ల గురించి చాలా మంది పిల్లలు భయపడతారు. ముందు ఆ భయాలను వదిలి వేయండి. నిస్సంకోచంగా, నిర్భయంగా వాటిని అధిగమించి దగ్గరకు వచ్చేయండి. ఆ తరువాత అవి మీకు ఆత్మీయ నేస్తాలు అవుతాయి’ అంటారు డా.అన్నపూర్ణి సుబ్రమణ్యమ్.సైంటిఫిక్ ఫిలాసఫీకంప్యుటేషనల్ బయాలజీ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త సంఘమిత్ర బందోపాధ్యాయ. ఎవల్యూషనరీ కంప్యుటేషన్, మెషిల్ లెర్నింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) తొలి మహిళా డైరెక్టర్‌గా పనిచేసిన సంఘమిత్ర ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. పాఠశాల రోజుల్లో సంఘమిత్ర జీవశాస్త్రం అంటేనే భయపడేవారు. ఆ తరువాత కాలంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకున్నారు. శాస్త్రరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ‘అంకితభావంతో పనిచేసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చు’ అనేది ఆమె సైంటిఫిక్ ఫిలాసఫీ. ‘ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్’ విభాగంలో ఇన్ఫోసిస్ ప్రైజ్, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్లు గెల్చుకున్నారు. .....శాస్త్రరంగంలో సత్తాచాటుతున్న మహిళల్లో వీరు కొందరు మాత్రమే. అందరికీ వందనాలు.అప్పుడే మహిళల పురోగతిగౌరవప్రదమైన వాతావరణంలోనే సైన్స్ రంగంలో మహిళల పురోగతి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. నాయకత్వ సామర్థ్యం, సంస్థాగత సంస్కృతి వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో స్వయంగా చూశాను. నా పీహెచ్డీ తరువాత పరిశోధనలను విలువైనవిగా భావించినప్పటికీ, శాస్త్రీయ సమాజానికి మద్దతు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రభావాన్ని కలిగించవచ్చుని గ్రహించాను. ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లో బయో–ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, స్కేలింగ్ చేయడం అనేది నా వరకు ఒక మైలురాయిగా మారింది. నా దృష్టిలో ‘సైన్స్‌లో పురోగతి’ అంటే జ్ఞానం నుంచి ఆవిష్కరణల వరకు నా ప్రభావ పరిధిని విస్తరించడం.– డా. ప్రియాంకన ముఖర్జీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–బయోనెస్ట్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్వారి ప్రోత్సాహమే నా బలంసైన్స్ రంగంలో మహిళల ప్రయాణం సంవత్సరాలుగా సాగుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను. మహిళలు శాస్త్రీయరంగంలోకి ఎలా అడుగు పెడుతున్నారు అనేదానికి నిదర్శనమే నా ప్రయాణం. సైన్స్‌లో చాలామంది మహిళల మాదిరిగానే వృత్తిపరమైన, బాధ్యతలను కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకున్నాను. మైక్రోబయాలజీలో ఎం.ఎస్సీ. పూర్తి చేసిన తరువాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నా కెరీర్ ప్రారంభించాను. ఇతరులతో కలిసి పనిచేస్తూనే మైక్రోబయాలజీలో పీహెచ్‌డీని విజయవంతంగా పూర్తి చేశాను. శాస్త్రీయ ఆలోచనలను సంస్థలుగా రూపాంతరం చెందేలా చేయడంలో సాయం చేస్తున్నాను.– డాక్టర్ సుధా కళ్యాణి, సీనియర్ మేనేజర్ అండ్ హెడ్, లైఫ్ సైన్స్ ఇంక్యుబేటర్, ఏకేపీ నాలెడ్జ్ పార్క్కాదంబిని గంగూలీకలకత్తా మెడికల్ కాలేజీ (1884)లో ప్రవేశం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబిని. తొలి మహిళా డాక్టర్, ప్రాక్టిషినర్గా చరిత్ర సృష్టించారు.మేరీ పూనెన్ లూకోస్భారతదేశంలో తొలి మహిళా సర్జన్ జనరల్ మేరీ పూనెన్ లూకోస్. మన దేశంలో తొలి మహిళా ప్రసూతి వైద్యురాలు.ఆనందీ బాయి జోషిపాశ్చాత్య వైద్యంలో పట్టా పుచ్చుకున్న తొలి మహిళా వైద్యురాలు ఆనందీ బాయి. బాంబే ప్రెసిడెన్సీ నుండి యూఎస్‌కు వెళ్లి పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీ చేశారు.జానకీ అమ్మాల్ఎడవలత్ కక్కట్ జానకి అమ్మాల్ ప్రసిద్ధ బోటనిస్ట్. మొక్కల పెంపకం, సైటోజెనెటిక్స్, పైటోజియోగ్రాఫీలో పరిశోధనలు చేశారు. అల్హాబాద్లోని సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ తొలి డైరెక్టర్ (1952)కమలా సోహోనీకమలా సోహోనీ ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త. 1939లో శాస్త్రీయ విభాగంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళ.అసిమా ఛటర్జీఅసిమా ఛటర్జీ ప్రముఖ సేంద్రియ రసాయన శాస్త్రవేత్త. కలకత్తాలోని ఇండియన్ యూనివర్శిటీ నుండి 1944లో సైన్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి మహిళ.కమల్ జయసింగ్ రణదివేకమల్ రణదివే ప్రసిద్ధ బయోమెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు. ముంబైలోని ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో తొలిసారిగా టిష్యూ కల్చర్ రిసెర్చ్ ల్యాబ్‌ని ప్రారంభించారు.బీబా చౌదరిభారతదేశంలోని తొలి మహిళా భౌతికశాస్త్రవేత్తలలో బీబా చౌదరి ఒకరు. ఎన్నో విలువైన పరిశోధనలు చేసినప్పటికీ మహిళా శాస్త్రవేత్తగా ఆమెకు రావల్సిన గుర్తింపు రాలేదు.పూర్ణిమా సిన్హాభౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి బెంగాలీ మహిళలలో పూర్ణిమా సిన్హా ఒకరు. ఎక్స్–రే క్రిస్టలాగ్రఫీ రంగంలో విశేష కృషి చేశారు.అన్నా మణిఅన్నా మణి ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. భారతవాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. పుణేలోని వాతావరణశాస్త్ర విభాగంలో చేరిన తొలి మహిళ. విండ్ ఎనర్జీ ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించి విశేష కృషి చేశారు. -
తొలి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..
పితృస్వామ్య విధానం బలంగా ఉన్న రోజుల్లో..ఉద్యోగం చేయడం అంటేనే అతి కష్టమైన, అనితరసాధ్యమైన ఆశయం. అలాంటిది ఈ మహిళ ఏకంగా ఐఏఎస్ అవ్వాలనుకుంది. అస్సలు ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఏకైక మహిళ కూడా ఆమెనే కావొచ్చు. పోనీ కష్టపడి ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్‌లో ఉత్తీర్ణురాలైనా..కూడా ఎన్ని అవరోధాలంటే..ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గవర్నర్ వరకు అందరు ఒక మహిళ ప్రజావసేవలోనా..! అని కనుబిమ్మలు, పెదవులు విరిచారు. పైగా ఆమెకు మరో హోదాని ఎంచుకోమని సూచించేవారు. కానీ ఆమె అచంచలమైన ధైర్యంతో వాళ్లందర్నీ ఒప్పించి మరి..భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి అయ్యింది. పురుషులతో సమానంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తూ..అందరిచేత మన్ననలను అందుకోవడమే గాక..ఇలాంటి అత్యుతన్నపదవిలో పురుషుల కంటే మహిళలే మేటీ అని రుజువు చేసిందామె.ఆ మహిళే..అన్నా రాజమ్ మల్హోత్రా. కేరళలోని కోజికోడ్‌లో జన్మించిన అన్నా మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ (అప్పటి మద్రాస్)లో బి.ఏ. ఆనర్స్ పూర్తి చేసింది. ఆ సమయంలో మహిళలకు కొన్ని వృత్తిపరమైన అవకాశాలు అందుబాటులో ఉండటంతో, అన్నా చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉన్నత డివిజన్ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించింది. 1950లో తన ఇంజనీర్ బంధువు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఇంటికి తీసుకువచ్చే వరకు ఆమెకు సివిల్ సర్వీస్‌లో చేరాలనే ప్లాన్స్ ఏమి లేవు. చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అంత పెద్ద ఆశయాలు మొదట్లో ఏమిలేవు. పైగా ఆ బంధువు పంపించిన ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ దరఖాస్తు రుసుము రూ. 140లు. అది ఆ సమయంలో ఆమెకు పెద్ద మొత్తమే. అయితే ఆ ఫీజు కట్టేందుకు తన స్నేహితుడి తల్లి ముందుకు వచ్చింది. సరిగ్గా 1952లో ఇంటర్వ్యూ రౌండ్లో, అన్నా IAS అధికారిణి కావాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఇంటర్వ్యూ కమిటీ ఆమెకు విదేశీ సేవ కోసం ప్రయత్నించమని సూచించింది. ఎందుకంటే అది మహిళలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతేగాదు ఆఖరికి ఆమె ఏ పోస్ట్ ఇవ్వాలన్నిది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది నాయకులకు, అధికారులకు. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి..ఎందుకంటే..భారతదేశ మాజీ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (అప్పటి మద్రాస్) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మహిళలు ప్రజాసేవలో కొనసాగడం ఇష్టం లేదని నిర్మోహమాటం లేకుండా ఆమె ముఖం మీదే చెప్పేశారు. ‘మీరు నాకు అవకాశం ఇవ్వాలి’ అంటూ ఆయన్ను ఒప్పించి మరి ఐఏఎస్ అధికారి అయ్యింది అన్నా. అయితే బాధ్యతలు తీసుకునే ముందు సైనిక శిక్షణతో సహా గుర్రపు స్వారి, రివాల్సర్ ఉపయోగించటం తదితరాలన్ని పురుషులతో సమానంగా శిక్షణ తీసుకున్నారామె. ఆమె మొదటి పోస్టింగ్‌లో తిరుపత్తూరు (తమిళనాడు) సబ్-కలెక్టర్‌గా ఉంది. అన్నా రాజంకు మద్రాస్ కేడర్ కేటాయించారు. తరుచుగా అన్నా పురుష అధికారులతో నిండిన గదిలో ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఒక స్తీకి ఉండాల్సిన కనీస వసతులు ఏమి లేవు అన్నాకి. ఆమె ధైర్యం ఏ రేంజ్లో ఉండేదంటే..తమిళనాడులోని డెంకనికొట్టై అడవి నుంచి ఏనుగులు గుంపు దారితప్పి బహిరంగ వ్యవసాయ భూమిలోకి తిరుగుతూ..గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుండేది. దాదాపు 18 మైళ్ళు నడిచిన తర్వాత, జంతువులు హోసూర్ చేరుకున్నాయి. ఆందోళన చెందుతున్న నివాసితులు సహాయం కోసం అన్నా చక్కటి పరిష్కార మార్గం చూపారు. ఏనుగులు శబ్దానికి భయపడతాయి కాబట్టి..పెద్ద శబ్దం వచ్చే వాటితో ఆ ఏనుగుల మందవైపు సాగి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ప్లాన్ ఫలించి..ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. అయితే ఓ మహిళ అధికారి కావడంతో ఆమె చేసిన ఘనకార్యాన్ని అభినందించకపోగా..తీవ్రమైన అల్లర్లు చెలరేగితే ఆమె అణిచివేయగలదా? కాల్చమని ఆదేశాలు ఇవ్వగలదా?, మత పిచ్చివాళ్ళ దాడిని ఎదుర్కొనగలదా..?. అయినా అస్సలు మహిళకు ఎలా అంతటి అత్యున్నత పదవి ఇచ్చారంటూ విమర్శలు కురిపించారు. వాటిన్నంటిని అన్నా లెక్కచేయలేదు. ఇలాంటి ఎన్నో సవాళ్లను తన కెరీర్లో అధిగమించి ఉన్నతాధికారుల మన్ననలను అందుకున్నారామె. విద్యుత్ సరఫరా దగ్గర నుంచి ముంబైలోని నవా శేవా ఓడరేవు నిర్మాణం వరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారామె. అందుకుగానూ 1989లో అన్నాకు పద్మభూషణ్ లభించింది. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యభరితమైన హోదాలను అలకరించారామె. అయినా ఎప్పుడూ కూడా ఆమె తాను ఒక మహిళగా కొన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వమని ఏ సమయంలోనూ అగడలేదామె. అంతేగాదు నియామక సమయంలో కూడా వివాహం జరిగితే మీ సేవ రద్దు చేయబడుతుందనే నిబంధన ఉండేది. దాన్ని కూడా ఆమె అంగీకరించింది. ఎందుకంటే ఆ టైంలో అవివాహిత మహిళలు లేదా వితంతువులు మాత్రమే సేవ రంగంలో ఉండాల్సి వచ్చేది. పెళ్లి, కుటుంబం..అన్నా తన ఐఏఎస్ బ్యాచ్‌మేట్ రామ్ నారాయణ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్నారు. తన వివాహం సామాజిక ప్రతీకారానికి దారితీస్తుందని పూర్తిగా తెలిసినా (వారి మతాలు వేర్వేరు) వెనకడుగు వేయలేదు. వారిద్దరూ 1975లో వాషింగ్టన్, డిసిలో వివాహం చేసుకున్నారు. రామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ స్థాయికి ఎదిగి 1997లో మరణించారు. ఇక అన్నా 2018లో మరణించారు. ఆమె ఆనాడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు ఇవాళ ఎంతోమంది మహిళామణులు ఐఏఎస్‌లు అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. ఆమె మొదట ఈ అత్యున్నత పదవిలోకి వచ్చేటప్పుడూ..మొత్తం దారి చాలా కఠినంగా ఇరుకుగా ఉంది.. ఇప్పుడది..పువ్వులతో పరిచి అందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా మారింది. (చదవండి: ఆ కమెడియన్‌కి వెయిట్‌లాస్ మందులు అస్సలు పనిచేయలేదు..! కారణం అదేనా..) -
లక్షల వేతనం కాదనుకుని తోలుబొమ్మలాట..!
కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద స్థాయిలో వెలిగిన మహిళ... లక్షలాది రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలి తోలుబొమ్మలాటనే కెరీర్‌గా ఎంచుకుంటుందా? మహానగరాలను కాదనుకొని మారుమూల పల్లెల్లోకి వెళుతుందా? ‘అవును’ అని చెప్పడానికి కచ్చితమైన సమాధానం... కలిత అసోంలోని హజో అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ద్రిషన కలిత చిన్నప్పటి నుంచి తోలుబొమ్మలాటను చూస్తూ పెరిగింది. అసోంలో ‘పుటోల నాస్’ అని పిలవబడే తోలుబొమ్మలాట తరతరాలుగా మగవాళ్లకే పరిమితం అయింది. ‘తోలుబొమ్మలాట మగవాళ్లు మాత్రమే ఆడాలి’ అనే సంప్రదాయాన్ని కలిత బ్రేక్ చేసింది. ‘తోలుబొమ్మలాట నేర్చుకోవడం కష్టమే. అయితే నాకు ఉన్న ఆసక్తి కారణంగా కష్టమైనా సరే....ప్రతి అంశం గురించి వివరంగా నేర్చుకున్నాను’ అంటుంది కలిత. ఆరేళ్ల వయసు నుంచే అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడే కలిత దిల్లీలో కార్పొరేట్ రంగంలో ఏడు సంవత్సరాలు పనిచేసింది. అయితే ఆమెకు ఆ ఉద్యోగం అంతగా సంతృప్తి ఇవ్వలేదు.తన మాతృరాష్ట్రం కోసం ఏదైనా చేయాలనిపించి సామాజిక మార్పు కోసం తోలుబొమ్మలాటను ఉపయోగించుకోవాలి’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. ఢిల్లీ నుంచి గౌహతికి తిరిగి వచ్చిన కలిత తనలాంటి తోలుబొమ్మలాట అభిమానులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది. ‘ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు తగాదా పడుతుంటారు. అయితే ఆ ప్రభావం పిల్లలపై ఎంత ప్రతికూలంగా పడుతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు’ అంటున్న కవిత తోలుబొమ్మలాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం మొదలు పెట్టింది. మరోవైపు అసోం అపురూప జానపద కథలను ఈతరం పిల్లలకి తోలుబొమ్మలాట ద్వారా పరిచయం చేయడం ప్రారంభించింది. జానపదానికి సామాజిక అంశం జోడించింది.కలిత బలం... మహిళలు. ఎన్నో గ్రామాల్లోని మహిళలు కలితకు అభిమానులుగా మారారు. తమ గ్రామాలలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. ఒక గ్రామానికి చేరుకోగానే కలిత బృందం చేసే పని....ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. స్థానికంగా ఉన్న మూఢనమ్మకాల గురించి తెలుసుకోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా తోలుబొమ్మలాటను మార్చేది కలిత.మద్యపానం వల్ల జరిగే నష్టం నుంచి అక్షరాస్యత వల్ల కలిగే ప్రయోజనాల వరకు ఎన్నో అంశాలపై మారుమూల పల్లెల్లో సైతం తోలుబొమ్మలాట ద్వారా ప్రచారం చేస్తోంది కలిత. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. పనిచేస్తున్న చోట ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయి. వారి సమస్యలను తోలుబొమ్మలాట ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం తోలుబొమ్మలాట మాత్రమే కాకుండా తన థియేటర్ గ్రూప్ ద్వారా రకరకాల సామాజిక అంశాలపై స్ట్రీట్ ప్లేలు, స్కిట్స్ ప్రదర్శిస్తోంది. యువత కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ అందరి చేతా శభాష్ అని అనిపించుకుంటోంది.(చదవండి: టెర్రస్.. కామన్ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది! ) -
ఆటో డ్రైవర్ బామ్మ @ 65
‘నువ్వు నాకు ఆటోడ్రైవింగ్ నేర్పించాలిరా కన్నా’ అని కుమారుడిని అడిగింది మంగళ. ‘ఈ సరదా ఏమిటి!’ ఆశ్చర్యంగా అడిగాడు కుమారుడు. ‘సరదా కోసం కాదు, ఆటో నడిపి నాలుగు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను’ అని చెప్పింది తల్లి. మనసులో ఏమనుకున్నాడో తెలియదుగానీ, తల్లి కోరినట్లే ఆటో నడపడం నేర్పించాడు కుమారుడు. పదిహేను రోజుల్లో పర్ఫెక్ట్గా ఆటోనడపడం నేర్చుకుంది మంగళ. ఆ తరువాత ఆటోరిక్షా డ్రైవర్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. మహారాష్ట్ర సతార జిల్లాలో కరాడ్–ఉండాలే రోడ్డులో రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆటో నడుపుతుంది. నెలకు అయిదు నుంచి ఏడు వేల వరకు సంపాదిస్తుంది. ఇది తక్కువ మొత్తమే కావచ్చు. ఆమెకు మాత్రం కోట్లతో సమానం! ఎందుకంటే ఆ డబ్బులో శ్రమ ఫలం ఉంది. ఆత్మగౌరవం ఉంది. ‘నేను చాలారోజులు ఇంట్లోనే ఉన్నాను. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అనిపించింది. ఏదో ఒక పని చేయాలనుకున్నాను. నా కొడుకు ్రపోత్సాహంతో ఆటో నడపడం నేర్చుకున్నాను. ఇంటి ఖర్చులకు, నా వైద్య అవసరాలకు నేను సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి, ఎలాంటి భయం ఉండదు. ఇతర డ్రైవర్లు నన్ను గౌరవంగా చూస్తారు. ముందు అమ్మను వెళ్లన్విండి అంటారు’ అని ఆసందంగా చెబుతోంది 65 సంవత్సరాల మంగళ. -
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్‌కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్‌కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా! -
కథల కళల బండిలో బడిబాటకు...
‘పిల్లలందరూ ఆర్టిస్ట్‌లే. ఆర్టిస్ట్‌లందరూ పిల్లలే’ అనే మాట ఉంది. రూబుల్ నాగి ప్రసిద్ధ మ్యూరల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. పిల్లల మనసు చిత్రం తెలిసిన మనసెరిగిన మహిళ. ‘రూబుల్ నాగి ఫౌండేషన్’ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది మంది పేదింటి పిల్లలకు విద్య అందిస్తోంది. తన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్–2026’ అందుకుంది. ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అనేది యునెస్కో సహకారంతో యూకేలోని వర్కీ ఫౌండేషన్ ఇచ్చే వన్ మిలియన్ డాలర్ల అవార్డ్...‘రూబుల్ నాగి విద్యావేత్త. అణగారిన వర్గాల పిల్లలకు అక్షరాన్ని చేరువ చేసిన మార్గదర్శి’ అని ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అవార్డు కమిటీ అభివర్ణించింది. 130 దేశాల నుండి వచ్చిన 5,000 నామినేషన్ల నుండి నాగిని అవార్డు కోసం ఎంపిక చేశారు. జమ్మూకశ్మీర్‌లో పుట్టిన నాగి రాజకీయ శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. తరువాత లండన్‌లోని స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చదువుకుంది. సోథెబీస్ లండన్‌లో యూరోపియన్ ఆర్ట్‌ను అభ్యసించింది.చదువు పూర్తయిన తరువాత ‘న్యూ డిజైన్ స్టూడియో’ ప్రారంభించి ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 800 మ్యూరల్స్ వేసింది. 150పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించింది. రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో నాగి కళాకృతులను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి స్వయంగా ఎంపిక చేయడం విశేషం.కళ పేదల కోసం‘కళ కళ కోసమే’ అనేది ఒక వాదం. ‘కళ ప్రజల కోసం’ అనేది మరో వాదం. నాగి రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆర్టిస్ట్‌గా ఏకాంత దీవిలో, ఊహల మధ్య మాత్రమే ఉండిపోలేదు ఆమె. సామాన్య ప్రజల మధ్యకు వచ్చింది. ‘సమాజం కోసం ఏం చేయగలను?’ అని ఆలోచించింది. తన దగ్గర ‘కళ’ అనే శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి చదువుకు దూరం అయిన పేదపిల్లలకు చదువును దగ్గర చేయాలని నిర్ణయించుకుంది.లెర్నింగ్ సెంటర్లతో...దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో గ్రామాల్లో 800 లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘కళ’ అనే మాధ్యమంతో వందలాది మంది పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించింది. ఈ విద్యాకేంద్రాలకు ముందు పిల్లలెవరూ బడి ముఖం చూడలేదు. అక్షరం ముక్క రాదు. అలాంటి పిల్లలు కూడా లెర్నింగ్ సెంటర్లో చేరిన తరువాత చదువులో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. పెద్ద స్కూల్స్‌లో చదివేవారితో సమానంగా పోటీ పడుతున్నారు. లెర్నింగ్ సెంటర్లు ప్రారంభించడానికి ముందు ‘పిల్లలు బడికి ఎందుకు దూరం అవుతున్నారు?’ అనే కోణంలో అధ్యయనం చేసింది నాగి. పేదరికం, ఇంటిపనులు, పొలం పనులు, బాల కార్మిక వ్యవస్థ... ఇలా ఎన్నో కారణాలు కనిపించాయి. ఈ కారణాలను అడ్డంకులుగా భావించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు, స్ఫూర్తిదాయకమైన మాటలతో ఎంతోమంది పేదపిల్లలు బడి బాట పట్టేలా చేసింది. విద్యారంగంలో నాగి చేసిన రెండు దశాబ్దాల కృషికి గుర్తింపుగా ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ దక్కింది.పిల్లలతో కలిసిపోయి...రూబుల్ నాగి దేశమంతటా విస్తృతంగా ప్రయాణిస్తుంటుంది. విద్యాకేంద్రాలలో పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటుంది. ఆరువందల మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆమె సైన్యం. విద్యాకేంద్రాల ద్వారా ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తోంది.ఆ మాటే మంత్రంగా...కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని నాగి ఆర్ట్ స్టూడియోకు దగ్గరలోని మురికివాడ నుంచి ఒక పిల్లాడు వచ్చి ఆర్ట్‌వర్క్స్‌ను ఆసక్తిగా చూస్తున్నాడు. ‘ఏ క్లాసు చదువుతున్నావు?’ అని అడిగింది నాగి. ‘చదవడం లేదు’ అన్నాడు. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా దగ్గర డబ్బులు లేవు’ అన్నాడు. ఆ మాట నాగిని బాగా ఆలోచించేలా చేసింది. స్టూడియో అనే నాలుగు గోడలకే పరిమితం కావద్దు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజే మురికి వాడకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. తన ఆర్ట్‌తో మురికివాడలలోని గోడలను అందంగా కనిపించేలా చేసింది. రెండో అడుగుగా లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘క్లాస్‌రూమ్‌లో మాత్రమే పాఠాలు’ అని కాకుండా చెట్ల కింద, ప్రకృతి మధ్య పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.‘విద్యా కార్యక్రమాలు మరింతగా విస్తరించడానికి, నైపుణ్య ఆధారిత, డిజిటల్ అభ్యాస కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి ఈ ప్రైజ్‌మనీ వినియోగిస్తాను’ అని చెప్పింది రూబుల్ నాగి. సవాళ్లు ఉన్నాసరే...మురికివాడల్లో మేము గోడలపై పెయింటింగ్ వేస్తున్నప్పుడు పిల్లలు గుమిగూడేవారు. ‘మీలో ఎవరికైనా కథ వినాలని ఉందా?’ అని అడిగితే ‘నేను వింటాను’ అంటూ అందరూ ఉత్సాహంగా స్పందించేవారు. అలా కథలు, బొమ్మల ద్వారా వారు బడిలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం విజయవంతం అయింది. ఆర్ట్–బేస్డ్ లెర్నింగ్ ప్రక్రియ ద్వారా పిల్లలు పాఠాలను సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాలుగు గోడల మధ్యే పాఠాలు చెప్పాలనుకోలేదు. ఆసక్తిగా చెబితే పిల్లలు ఆరుబయట కూర్చోనైనా వింటారు. రెండు మూడు రోజులు లెర్నింగ్ సెంటర్‌కు వచ్చిన విద్యార్థి మరుసటి రోజు రాకపోతే మా వాలెంటీర్లు ఆ విద్యార్థి ఇంటికి వెళతారు. కారణం ఏమిటో తెలుసుకుంటారు. ఆ విద్యార్థి రోజూ స్కూల్‌కు వచ్చేలా చేస్తారు. లెర్నింగ్ సెంటర్ల నిర్వహణ అనేది సులువైన విషయమేమీ కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వాటిని నిర్వహిస్తున్నాం.– రూబుల్ నాగి -
ఏఐ: ఆల్ ఉమెన్ ఇంటెలిజెన్స్
‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) అనేది సిలికాన్ వ్యాలీ వాసుల, బడా కంపెనీల వ్యవహారం’ అన్నట్లుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. కాలం మారింది. మారుమూల పల్లెలోని పార్వతమ్మకు కూడా ఇప్పుడు ‘ఏ.ఐ.’పై ఆసక్తి పెరిగింది. స్వయం సహాయక బృందాల నుంచి వ్యాపారాన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్లాలనుకునే చిన్న స్థాయి మహిళా వ్యాపారుల వరకు ఏ.ఐ. సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026’ అనేది సాంకేతిక దిగ్గజాల సదస్సు మాత్రమే కాదు, సామాన్య మహిళలు సైతం ఆసక్తి చూపే సదస్సు అయింది...వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి మార్పులు తేనున్నది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ హైలెట్ చేసింది. అట్టడుగు స్థాయిలో మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విషయంలో భాష, మార్కెట్ యాక్సెస్, పరిమిత వనరులలాంటి అడ్డంకులను అధిగమించడంలో గ్రామీణ మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతోంది.బహుళ ప్రయోజన శిక్షణ‘షీ లీడ్స్ భారత్’లాంటి ఏఐ ఇన్నోవేటివ్ ప్లాట్‌ఫామ్‌లు గ్రామీణ ప్రాంతాలలోని చిరు మహిళా వ్యాపారులు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించి మెరుగైన శిక్షణ ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ భాగసామ్యంతో 25,000 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇస్తోంది షీ లీడ్స్. ఎలాంటి వస్తువులకు అధిక డిమాండ్ ఉందో గుర్తించడం నుంచి వాటికి సరిౖయెన ధరలను నిర్ణయించడం, కస్టమర్ల సంఖ్యను ఎలా పెంచుకోవాలి, కీలకమైన వ్యాపార సవాళ్లను ఎలా అధిగమించాలి... మొదలైన విషయాలను తెలుసుకోవడానికి, ‘మేరీ సహేలి’ యాప్‌లో విలీనం చేసిన ఏఐ సాధనాలను ఉపయోగించుకోవడానికి తద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ‘మహిళల నేతృత్వంలోని గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడానికి, ఏఐకి సంబంధించిన బాధ్యతాయుతమైన, ఆచరణాత్మక ఉపయోగాల అవగాహనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’ అంటుంది షీ లీడ్స్ భారత్.గల్లీ నుంచి దిల్లీ వరకుఉత్తర్ప్రదేశ్లోని వారణాసి జిల్లా నవహానిపూర్ గ్రామానికి చెందిన రుచిసింగ్ స్వయం సహాయక బృందంలో సభ్యురాలు. స్మార్ట్‌ఫోన్ ల నుంచి ఏఐ–ఎనేబుల్డ్ ఫ్లాట్‌ఫామ్‌ల వినియోగం వరకు ఎంతోమంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా రుచిసింగ్లాంటి మహిళలకు దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులోని విశేషాలు ఆసక్తికరంగా మారాయి. ‘ఏఐ సమ్మిట్’లో తమకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్–ఆమెదిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026లో వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ అంశాలపై తమ గళాన్ని వినిపించారు. ఈ సదస్సులో ‘ఏఐ కాలంలో మహిళలకు ఎదురవుతున్న భద్రతా సమస్యలు–డిజిటల్ ప్రపంచంలో అసమానతలు’... మొదలైన వాటి గురించి నటి, రచయిత్రి సోహ అలీఖాన్ ప్రసంగించారు. ఏఐ టూల్స్ విస్తృతస్థాయి ఉపయోగాలతో పాటు దుర్వినియోగాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.‘ఏఐ సాంకేతికత వల్ల ఫేక్ ఇమేజ్‌లను సృష్టించడం నుంచి డాటా దుర్వినియోగం వరకు హానికరమైన పనులు అత్యంత వేగంగా జరుతున్నాయి’ అని ఏఐలోని ప్రతికూలతల గురించి ప్రస్తావించారు సోహ అలీఖాన్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భయాలు, అపోహలు ఉన్నాయి. అవి నిజం కాదు’ అంటూ వైద్య రంగానికి ఏఐ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... అనివార్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వైద్యుల అవసరాన్ని లేకుండా చేసేది కాదు. వైద్యుల భారాన్ని తగ్గించేది. ఏఐ సాంకేతికతపై రకరకాల భయాలు, అపోహలు ఉన్నాయి. అయితే ఇది నిజం కాదు. వైద్య సమాజానికి ఏఐ సాంకేతికత అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నిపుణులు కాని వారు ఏఐ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. మన దేశంలోని విస్తారమైన జనాభా, ప్రాంతాల మధ్య వైవిధ్యాలు, వైరు«ధ్యాలు, గ్రామీణ–పట్టణ విభజన, సవాళ్లు విసురుతున్న అంటువ్యాధులు... ఈ నేపథ్యంలో సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనివార్యమైన సహాయకారిగా మారుతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్స వరకు ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. – అనుప్రియ పటేల్, కేంద్రమంత్రిపవర్ హిట్టర్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాంకేతికతను మాత్రమే కాదు వ్యూహాలు, నాయకత్వం, నిర్ణయాలకు సంబంధించిన అంశాలను కూడా పునర్నిర్వచిస్తోంది. ఏఐ అనేది టీ 20 క్రికెట్లో ‘పవర్ హిట్టర్’లాంటిది. టీ 20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ను చూశారు. ఇలాంటి పవర్ హిట్టరే ఏఐ. సంస్థలు పనిచేసే విధానాన్ని పునర్నిర్వచించే సామర్థ్యం ఏఐకి ఉంది. ఏఐ వల్ల అభివృద్ధి చెందడం మాత్రమే కాదు కొత్త శక్తితో, కొత్త దారులలో సంస్థలు పయనిస్తాయి. వ్యాపార నమూనాలు మారుతాయి. వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ నైపుణ్యంతో పనిచేస్తారు. ఏఐ సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుంది అనేది ముఖ్యం కాదు ఎంత బాధ్యతతో ఉందనేది ముఖ్యం. బాధ్యతాయుతమైన ఏఐ అనివార్యం.– రోహిణి నాడర్ మల్హోత్రా, చైర్పర్సన్, హెచ్సీఎల్ఏఐ... ఎన్నో ద్వారాలు!లక్షలాది మంది భారతీయ మహిళలు వినడానికి, నేర్చుకోవడానికి, పని చేయడానికి టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఆ అవకాశాలను వినియోగించుకోవాలంటే ఆన్లైన్ సురక్షితమని మహిళలు భావించాలి. ఏఐతో దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. యువతులు ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తున్నారు. బాలికలు వీరి విజయగాథల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు సృజనాత్మకతకు సంబంధించి కూడా మహిళలకు ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో ద్వారాలు తెరుస్తున్నాయి. మహిళా సాధికారతకు ఆన్లైన్ టూల్స్ కొత్త దారులు చూపుతున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా ఏఐ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే సమాజంలో ఉండే అసమానతలు డిజిటల్ ప్రపంచంలో ప్రతిఫలిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి.– సోహా అలీఖాన్, నటి, రచయిత్రి -
అరుణగ్రహమే టార్గెట్
అలిస్సా కార్సన్ .. మూడేళ్ల వయస్సులో చూసిన ఒక చిన్న కార్టూన్ ఆమె జీవిత లక్ష్యాన్నే నిర్ణయించింది. అమెరికాలోని లూసియానాలో 2001లో జన్మించిన అలిస్సా ‘ద బ్యాక్ యార్డిగాన్స్’ అనే కార్టూన్‌ను ఇష్టంగా చూసేది. అప్పుడే తన మనసులో ఒక ఆలోచన పుట్టింది. మార్స్ గ్రహంపైకి వెళ్లాలని. అప్పటి నుంచి ఆమె తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉంది. నాసా నేరుగా పిల్లలకు శిక్షణ ఇవ్వదు, కాబట్టి ఆమె ప్రతి అవకాశాన్ని తన ఆశయసాధనకు అనుకూలంగా మలుచుకుంది. 17 ఏళ్ల వయస్సులోనే అప్లైడ్ ఆస్ట్రోనాటిక్స్ సర్టిఫికేషన్ సాధించి, సబ్–ఆర్బిటల్ అంతరిక్షంలో పరిశోధనలు చేసే అర్హత పొందింది. 18ఏళ్లకే ప్రపంచంలోని అన్ని నాసా స్పేస్ క్యాంపులను పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందింది. 2022 లో నాటో తన కార్యకలాపాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదుగురిలో అలిస్సా ఒకరు కావడం విశేషం. అలిస్సా ఇంగ్లీష్‌తో పాటు స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ దేశాల వ్యోమగాములతో కలిసి పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. అలిస్సా ప్రస్తుతం ఆస్ట్రోబయాలజీలో ఉన్నత చదువులు అభ్యసిస్తూ, అరుణ గ్రహంపై మానవ మనుగడకు అవసరమైన పరిస్థితులపై పరిశోధనలు చేస్తోంది. ఆమె కేవలం తన గమ్యం వైపు పయనించడమే కాకుండా స్టెమ్ (సైన్స్ , టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో బాలికల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి కూడా కృషి చేస్తోంది. అలిస్సా ప్రస్తుతం అధికారికంగా నాసా వ్యోమగామి కాకపోయినప్పటికీ, ఆమె ఒక అంతరిక్ష శిక్షణలో ఉన్న వ్యక్తిగా, అంతరిక్ష ఔత్సాహికురాలిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే గుర్తింపు ఆమెను 2033 లో నాసా చేపట్టబోయే మార్స్ యాత్రలో నిలబెట్టనుందని నిపుణులు భావిస్తున్నారు. సో యూ వాంట్ టు బి ఆన్ ఆస్ట్రోనాట్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. సోషల్ మీడియా ద్వారా తన ట్రైనింగ్‌ని మిలియన్ల మందికి చూపిస్తూ, సైన్స్ ను ఒక కూల్ అంశంగా మార్చేసింది. ఒక సాధారణ అమ్మాయి అసాధారణ లక్ష్యం వైపు సాగిస్తున్న ఈ ప్రయాణం, రాబోయే తరాలకు ఒక దిక్సూచి. ఎంతో మంది ఆడపిల్లలకు స్ఫూర్తి. -
అనన్య బిర్లాకు కథ చెప్తారా ?
ఏవిఎం చెట్టియార్.. జెమిని వాసన్ .. విజయా నాగిరెడ్డి ఒకప్పుడు సినిమాలంటే మగవారి నిర్మాణం. ఇప్పుడు దేశంలో స్త్రీలు సినీ నిర్మాణాన్ని లీడ్ చేస్తున్నారు. బిర్లా కుటుంబం నుంచి అనన్య బిర్లా ‘బిర్లా స్టూడియోస్’ మొదలెట్టడం తాజా ఉదాహరణ. భారీ మూలధనం కేటాయించి దేశీయ భాషల్లో సాంస్కృతిక మూలాలున్న సినిమాలు తీస్తానంటున్నారు అనన్య. దర్శకులూ... ఆమెకు కథ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా?సంప్రదాయ మేకింగ్ నుంచి కార్పొరేట్ మేకింగ్‌కు సినీ రంగం వెళ్లేకొద్దీ స్త్రీల ప్రమేయం పెరుగుతూ ఉంది. బాలాజీ సంస్థలో ఏక్తా కపూర్, తమిళనాట రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తెలుగులో అశ్వినీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న, అన్నపూర్ణ నుంచి సుప్రియా యార్లగడ్డ, చిరంజీవి కుమార్తె సుస్మిత... ఇలా ఇన్ని పేర్లు ఒకప్పుడూ ఊహకే అసాధ్యం. ఇప్పుడు ఈ మహిళా శక్తికి మరో ప్రచండ శక్తి తోడయ్యింది. బిర్లా గ్రూప్ నుంచి అనన్య బిర్లా తాజాగా సినిమా రంగంలోకి వచ్చారు. ‘బిర్లా స్టూడియోస్’ స్థాపించి ప్రాదేశిక చిత్రాలను తీయాలని నిశ్చయించుకున్నారు. ఇది దర్శకులకు మంచి కబురే.ఎలా మేలు?సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఏకకాలంలో అనేక సినిమాలు తీయరు. కాని కార్పొరేట్ సంస్థలకు ఆ సౌలభ్యం, సామర్థ్యాలు, వ్యవస్థ ఉంటాయి. సంప్రదాయ ప్రొడ్యూసర్లు ఫార్ములాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అనన్య బిర్లా చెప్పేదాని ప్రకారం మూసకు భిన్నంగా ఉండే కథలకు అవకాశం దొరుకుతుంది. పక్షపాతాలు, సిఫార్సులతో పని లేకుండా టాలెంట్‌కు అవకాశం దొరికే వీలు ఎక్కువ.కుబేరుల్లో కళాహృదయంఆదిత్య బిర్లా గ్రూప్ దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి. అటువంటి సంస్థకు వారసురాలు అనన్య బిర్లా. కుమార మంగళం బిర్లా, నీర్జా బిర్లా దంపతుల పెద్ద కుమార్తె. బిర్లా కుటుంబంలో ఆరవ తరం వారసురాలు. అయితే అది మాత్రమే ఆమె ప్రత్యేకత కాదు. అనన్యది కళాహృదయం. ఆమె ప్రముఖ గాయని. పదకొండేళ్ల వయసులోనే సంతూర్ వాయించడం నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ఆల్బమ్స్ విడుదల చేసి అభిమానులను పొందారు. మరోవైపు అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదువు పూర్తి చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. 17 ఏళ్ల వయసులోనే సొంతంగా మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఇది దేశంలో రెండవ అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థ. 2016లో అనన్య లగ్జరీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఇకాయ్ అసాయ్’ను స్థాపించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఆసియాలో ప్రముఖ మహిళలలో ఒకరిగా’ నిలిచారు. గతేడాది ఆమె ‘బిర్లా కాస్మెటిక్స్’ పేరుతో కన్సూ్యమర్ బ్రాండ్లు ప్రారంభించారు.దేశీయ కథలకే ప్రాధాన్యం‘బిర్లా స్టూడియో’ పేరుతో కొత్త ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాక వాణిజ్యపరంగా లాభదాయకమైన సినిమా లు తీస్తూనే కథనంలో విలువల పరంగా ఏమాత్రం రాజీపడనని అనన్య తెలిపారు. ‘మనమందరం కథలు వింటూనే పెరిగాం. కథలు వినేందుకు మన చుట్టూ ఉన్న శక్తిమంతమైన మాధ్యమాలలో సినిమా ఒకటి. దాన్ని సమర్థంగా వినియోగించుకుంటే ప్రేక్షకులకు అద్భుతాలు చూపించొచ్చు’ అని ఆమె వివరిస్తున్నారు. ‘వినోద విలువలతో సాంస్కృతిక ప్రాముఖ్యతను చూపే చిత్రాలు తీయడంపైనే మా నిర్మాణ సంస్థ నుంచి దృష్టి పెడుతుంది’ అంటున్నారు. త్వరలో బిర్లా స్టూడియోస్ హిందీ, గుజరాతీ, మలయాళంతోపాటు ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో చిత్రాలు తీయాలని చూ స్తోంది. ఇంగ్లిషు సినిమాలు సైతం తీసే యోచనతో ఉంది.పెద్ద దర్శకులతో చర్చలుబి స్టూడియోస్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే చాలా మంది పెద్ద దర్శకులతో అనన్య బిర్లా చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అనీజ్ బాజ్మీ, సూజిత్ సర్కార్, నీరజ్ పాండే తదితరులు ఉన్నారని సమాచారం. -
ఆమె అడుగుజాడలు
మన దేశంలోని మొట్ట మొదటి మహిళా ఆంత్రపాలజిస్ట్ ఐరావతి కార్వే. జర్మనీలో శిక్షణ పొందిన కార్వే పుణేలోని దక్కన్ కళాశాలలో మావనశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, నాగరికత, కులవ్యవస్థపై ఆమె విలువైన రచనలు చేశారు. ఆంత్రపాలజీ అంటే గుర్తుకు వచ్చే మహిళ అయినప్పటికీ కార్వే జీవితం గురించి చాలా విషయాలు తెలియవు. ఈ లోటును పూరించేలా ఆమె మనవరాలు ఉర్మిలా దేశ్‌పాండే, విద్యావేత్త థియాగో బార్బోసాతో కలిసి ‘ది రీమార్కబుల్ లైఫ్ ఆఫ్ ఐరావతి కార్వే’ అనే పుస్తకం రాశారు.ఆమెదే రిస్క్అండమాన్, నికోబార్ దీవులలోని ఆదిమజాతి ప్రజలపై పరిశోధన చేసిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త మధుమాల చటోపాధ్యాయ. అండమాన్ దీవులలో ఫీల్డ్‌వర్క్ చేయడానికి మధుమాలను అనుమతించే ముందు ఆంత్రపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించదని నిర్ధారిస్తున్న పత్రాలపై సంతకం చేయాలని కోరింది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. అండమాన్, నికోబార్ దీవులలోని వివిధ తెగలపై ఆరు సంవత్సరాలు పరిశోధన చేశారు.ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ20వ శతాబ్దంలో ‘ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ’ ఊపందుకుంది. పురుషాధిపత్య వాదనలు, వివరణలను సవాలు చేసింది. మన దేశంలో వర్గం, కులం, ప్రాంతాల వారీగా మహిళల స్థితిగతులను అధ్యయనం చేయడంలో ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ కీలక పాత్ర పోషించింది. ఉదాహరణకు దళిత మహిళలు పితృస్వామ్య భావజాలానికి మాత్రమే కాకుండా కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం గురించి విశ్లేషించింది.


