అదర్‌సైడ్
ప్రపంచానికి మాత్రం ధగధగలాడుతూ వెలిగిపోతున్న ఆమె కిరీటం కనిపించవచ్చు. అయితే ఆ వెలుగుల వెనుక కనిపించని చీకట్లు ఎన్నో ఉన్నాయి. ‘డిస్లెక్సియా’ వల్ల ఆమె బాల్యం అవమానాలు, అవహేళనలతో నిండిపోయింది. అయితే ఆ అవమానాలను గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోలేదు ఈ మెక్సికో సుందరి.
‘ఆ అవమానాలే లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’ అంటుంది 74వ మిస్ యూనివర్స్ పోటీలో విశ్వసుందరి కిరీటాన్ని గెల్చుకున్న ఫాతిమా బాష్. ఆమె ఇంటి పేరు ‘బాష్’కు అడవి అని అర్థం. అడవిలో ‘పచ్చదనం’ అనే సానుకూల శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే ప్రతికూలతలను అధిగమించి అందాల కిరీటాన్ని గెలుచుకుంది.
ఫాతిమా బాష్ బాల్యం అందరిలా ఉండేది కాదు. ‘మాట్లాడినా వెటకారాలే... మాట్లాడకపోయినా వెటకారాలే’ అన్నట్లుగా ఉండేది. డిస్లెక్సియా, అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధ పడుతున్నట్లు ఆరేళ్ల వయసులో నిర్ధారణ అయింది. తోటి పిల్లలు ఎప్పుడూ ఫాతిమాను అవమానిస్తుండే వారు. ఉపాధ్యాయులు కూడా ఏదో రకంగా తిడుతూనే ఉండేవారు.
అమ్మో... అల్లరి పిల్ల!
ఫాతిమా ఇంటికి వస్తుందంటే చుట్టాలు, పక్కాలు భయపడి పోయేవాళ్లు, ఎందుకంటే ‘ఏడీహెచ్‌డీ’ వల్ల ఆమె తెగ ఆల్లరి చేస్తుండేది. అది భరించడం ఇతరులకు కష్టంగా ఉండేది. ఆమె అతి చురుకుదనం అందరికీ సమస్యగానే ఉండేది. స్కూలుకు వెళుతున్న మాటేగానే...‘డిస్లెక్సియా’ అనే అభ్యాస వైకల్యం వల్ల చదవడం, రాయడం, పాఠాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడేది.
కాలమే దారి చూపింది
‘ఎందుకు ఇలా?’ అని సీరియస్‌గా విశ్లేషించుకునే వయసు కాదు. వయసు పెరుగుతున్న క్రమంలో తన గురించి తనకు అర్థం అవుతూ వచ్చింది. అయితే ఫాతిమా ఎప్పుడూ నిరాశకు గురి కాలేదు. సానుకూల ఆలోచనలు ఆమెకు బలాన్ని ఇచ్చాయి. ‘ఏదో ఒకటి సాధించాలి. అప్పుడు నాతో అందరూ చక్కగా మాట్లాడతారు’ అని తెలిసీ తెలియని వయసులోనే అనుకుంది. ఏం సాధించాలో తెలియదు. ఎలా సాధించాలో తెలియదు. అయితే కాలమే ఆమె ముందు దారులు పరుస్తూ వెళ్లింది.
సామాజిక సేవలో...
ఎంత ఇబ్బందిగా ఉన్నా చదువుకు మాత్రం దూరం కాలేదు. మెక్సికోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. క్యాన్సర్ బాధితులైన పిల్లలకు అండగా నిలవడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది.
ఆ రోజు రానే వచ్చింది!
మెక్సికన్ రాష్ట్రం టటాస్కోలోని టీపా అనే చిన్న పట్టణంలో జన్మించింది ఫాతిమా. టటాస్కో రాష్ట్రంలో జరిగే అందాల పోటి ‘ఫ్లోర్ టటాస్కో’ (2018) టైటిల్ గెలుచుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది. పరిచితులు, అపరిచితులు, ఆత్మీయుల అభినందనలతో ఫాతిమా మనసు నిండిపోయింది.
‘ఈరోజు కోసమే కదా నేను వేచి చూసింది’ అనుకుంది. అయితే ఇంకో రోజు కూడా ఆమె కోసమే ఓపికగా ఎదురు చూస్తూనే ఉంది. అది ఆమె మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న రోజు. అది ఆమెకే పరిమితమైన విజయం కాదు. అవమానాలు ఎదురైతే ‘నా జీవితం ఇంతేనా’ అని కుంగుబాటు చీకట్లోకి వెళ్లిపోయే వారికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. ‘పట్టుదలగా ప్రయత్నించు. నువ్వు సాధించడానికి ఎంతో ఉంది’ అని గుర్తు తెచ్చే విజయం.
క్షమాపణ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు!
ఫాతిమా బాష్‌కు అవమానాలు, ఈసడింపులు కొత్తేమీ కానప్పటికీ తాజా అవమానం ఆమెను తీవ్రంగా బాధ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది షాక్ అయ్యేలా చేసింది. ‘సోషల్ మీడియాలో తన ప్రమోషన్ కంటెంట్‌ను పోస్ట్ చేయడంలో ఫాతిమా విఫలమవుతుంది’ అని ఆరోపిస్తూ మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్ నవత్ ఇట్సారగ్రిసిల్ బహిరంగంగా ఆమెను ‘తెలివి తక్కువ’ అని అర్థం వచ్చేలా అవమానించారు.
నవత్ మాటలను నిరసిస్తూ ఫాతిమా వాకౌట్ చేసింది. గత సంవత్సరం మిస్ యూనివర్స్‌తో సహా అనేకమంది పోటీదారులు ఫాతిమాకు సంఘీభావంగా వాకౌట్ చేశారు. ‘సాధికారత ఉన్న మహిళలం మనం. మన గళాన్ని వినిపించే వేదిక ఇది’ అని తన గళాన్ని వినిపించింది ఫాతిమా. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నవత్ నోటిదురుసుతనాన్ని ఖండించింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ఫాతిమాకు మద్దతుగా మాట్లాడింది. వాకౌట్ తరువాత తిరిగి పోటీలో పాల్గొన్న ఫాతిమా బాష్ అందాల కిరీటాన్ని గెలుచుకుంది.
‘నవత్‌లాంటి వ్యక్తుల అహంకారానికి చెంపపెట్టులాంటి అద్భుత విజయం ఇది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న నవత్ ఫాతిమాకు బహిరంగ క్షమాపణ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


