మహిళల వస్త్రధారణ, మోరల్ పోలీసింగ్‌పై చర్చ నడుస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఒక సంఘటన భారతదేశంలో మహిళల భద్రత, సామాజిక సమస్యలపై పెద్ద చర్చకు దారి తీసింది. మహిళల యోగా భంగిమల్లో ఉన్న పబ్లిక్ వాల్ పెయింటింగ్‌లను అసభ్యంగా మార్చడం వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.
గ్వాలియర్‌లో ‘‘స్మార్ట్ సిటీ" ప్రాజెక్ట్‌లో భాగంగా యోగా చేస్తున్న మహిళల చిత్రాలను అక్కడ కొన్ని గోడలపై చిత్రించారు. యోగా అవగాహనకోసం చిత్రాలతో ఉన్న ప్రభుత్వ కళాకృతులను కొందరు వ్యక్తులు అభ్యంతరకరంగా గీసి, అవమానించడం ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది, వివిధ యోగా భంగిమలతో మహిళల నల్లని సిల్హౌట్‌లుగా గోడలపై చిత్రీకరించారు. అయితే ఎవరో వాటిని ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకరంగా, అవమానపర్చేలా మార్చేశారు. స్త్రీశరీరంలోని కొన్ని నిర్దిష్ట భాగాలను హైలైట్ చేసేలా గీతలు గీశారు. దీన్ని గమనించిన ఒకరు తిరిగి ఈ చిత్రాలపై తిరిగి నల్లరంగు పూశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విస్త్రృతంగా షేర్ అవుతోంది.
“గ్రాఫిటీలో కూడా మహిళలకు భద్రతలు లేదు” అంటూ విజువల్స్‌తో పాటు ఒక యూజర్ ట్విటర్లో షేర్ చేశారు, దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర విమర్శలు చెలరేగాయి.ఇది మనుషుల్లో కొరవడుతున్న సివిక్ సెన్స్, మహిళల భద్రత,ప్రజా కళను విధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. పబ్లిక్ ప్రాపర్టీని విధ్వంసం చేయడం మాత్రమే కాదు, మహిళలను అగౌరవపరిచే తీవ్రమైన కేసు, దోషులపై చర్య తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇది చౌకబారు ఆలోచన అని కొందరు అభివర్ణించారు. ఆడవారి దుస్తులను కాదు ఈ పైత్యాన్ని ప్రశ్నిద్దాం మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ చర్య మహిళల పట్ల అగౌరవానికి, స్మార్ట్‌సిటీ హోదాకు భంగకరమనే ప్రజాగ్రహానికి దారితీసింది.
ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
మరోవైపు ఈ విధ్వంసం ఎప్పుడు జరిగింది, ఎవరు బాధ్యులు, లేదా స్థానిక అధికారులతో ఏదైనా ఫిర్యాదు నమోదైనా అనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు. అలాగేదీనిపై గ్వాలియర్ మున్సిపల్ పరిపాలన లేదా పోలీసులు ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.


