ఆస్పత్రిలో చేరిన ఎన్‌సీపీ నేత శరద్ పవార్ | NCP chief Sharad Pawar admitted to hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన ఎన్‌సీపీ నేత శరద్ పవార్

Feb 22 2026 12:09 PM | Updated on Feb 22 2026 12:15 PM

NCP chief Sharad Pawar admitted to hospital

పూణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్ పవార్(85) ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప డీహైడ్రేషన్ కారణంగా ఆయన పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన రూబీ హాల్ క్లినిక్‌లో చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్సలో భాగంగా సెలైన్ ఎక్కించామని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.

శరద్ పవార్ ఆరోగ్యంపై రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్‌, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ ఒక  ప్రకటన విడుదల చేస్తూ ఆయనను మరో రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు.  కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ అభిజిత్ లోధా ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఈ నెలలో పవార్ ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 9న ఛాతీలో ఇన్ఫెక్షన్, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా ఇదే ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స అనంతరం ఫిబ్రవరి 14న డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో ఆయన వెంట కుమార్తె సుప్రియ, భార్య ప్రతిభా పవార్ ఉన్నారు.

శరద్ పవార్ 1990వ దశకంలో నోటి క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. భారత్, అమెరికాలో పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. శరద్‌ పవార్‌ తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజా జీవితంలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు అజిత్ పవార్ కన్నుమూయడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఈ విషాదం జరిగిన కొద్ది రోజులకే ఆయన తిరిగి అనారోగ్యానికి గురికావడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement