చికిత్స చేసి పంపిన సిబ్బంది
జర్మనీలో గమ్మత్తైన ఉదంతం
బెర్లిన్: అది సముద్ర తీర ప్రాంతాల్లో కనిపించే పక్షి. ఎలా జరిగిందో గానీ ఓ చేపల గాలం కాస్తా దాని ముక్కులోకి గుచ్చుకుపోయింది. తాళలేని బాధతో ఆ పక్షి దగ్గర్లోని ఓ భవనం తాలూకు అద్దాల తలుపును ముక్కుతో పదేపదే కొట్టి సాయం అర్థించింది! అది ఓ ఆస్పత్రి తాలూకు ఎమర్జెన్సీ గది కావడం విశేషం! తలుపు తట్టిన చప్పుళ్లు విని అక్కడికొచ్చిన ఆస్పత్రి సిబ్బంది కాస్తా ఆ పక్షిని చూసి ముక్కున వేలేసుకున్నారు.
దాని బాధ గమనించి, అగ్నిమాపక విభాగం సభ్యులతో కలిసి లోపలికి చేర్చారు. గాలాన్ని జాగ్రత్తగా తీసేసిన అనంతరం గాయానికి చికిత్స చేసి వదిలేశారు. ఈ గమ్మత్తైన ఉదంతం జర్మనీలోని బార్మెన్ నగరంలో ఆదివారం జరిగింది. ఈ పక్షులను కోర్మరాంట్‌గా పిలుస్తారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలు వీటి ఆవాసం. చివరన కిందివైపుకు మెలిదిరిగి ఉండే ముక్కు వీటి ప్రత్యేకత.


