టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు.
కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్ నమీబియా మ్యాచ్‌తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.
యూఎస్‌ఏ మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్ డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది.
అభిషేక్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్ అవుతుంది. అభిషేక్ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్ ఫలితాన్ని భారత్‌కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్ ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.
కాగా, నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్‌లో (యూఎస్‌ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.
గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూ
అభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు.
అయితే ఆతర్వాతి బంతికే బౌలర్ బెన్ షికోంగో ఉచ్చులో (స్లో బాల్) చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్ కిషన్ 11, తిలక్ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.
తుది జట్లు..
భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో


