న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(సోమవారం) ‘పరీక్షా పే చర్చా’ 2026 రెండో ఎపిసోడ్‌లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. పరీక్షల సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి? బోర్డు, పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో ఎలా సిద్ధం కావాలనే అంశాలపై ప్రధాని కీలక సూచనలు చేశారు. పరీక్షలను ఒక భయానక అంశంగా కాకుండా, ఒక ‘ఉత్సవం’లా జరుపుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సానుకూల దృక్పథానికి ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ చర్చా కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా చదువుతో పాటు కళలు, క్రాఫ్ట్స్ ఎలా కొనసాగించాలంటూ కోయంబత్తూరు విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. చదువును, కళలను విడివిడిగా చూడవద్దని మోదీ సూచించారు. సైన్స్ ప్రయోగాలను బొమ్మల రూపంలో గీస్తూ, చదివితే సబ్జెక్టు సులభంగా అర్థమవుతుందని, రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కళలు ఒక ఔషధంలా పనిచేస్తాయని ప్రధాని వివరించారు. స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే వారు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, పరిశ్రమ నిపుణులను కలిసి, వారు ఎలా పనిచేస్తారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.
పరీక్షా పే చర్చా 2026 ఎడిషన్ గత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఏకంగా 4.5 కోట్ల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇతర అనుబంధ కార్యకలాపాలతో కలిపి మొత్తం 6.76 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 2023లో 38.8 లక్షలుగా ఉన్న రిజిస్ట్రేషన్లు, 2025 నాటికి 3.53 కోట్లకు చేరుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించగా, ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరగడం గమనార్హం.
దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ వేదిక దోహదపడింది. ఈ కార్యక్రమం దూరదర్శన్ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియాతో పాటు ఆల్ ఇండియా రేడియో, పలు ప్రైవేట్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. అలాగే పీఎంఓ, విద్యా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లు, యూట్యూబ్, ఫేస్‌బుక్ లైవ్ తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.


