భారత్, మలేషియా నిర్ణయం
కీలక రంగాల్లో పరస్పర సహకారం
ద్వైపాక్షిక, వాణిజ్య బంధాలు బలోపేతం
11 ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు
ప్రధానులు మోదీ, ఇబ్రహీం విస్తృత చర్చలు
ఉగ్రవాదంపై రాజీపడేదే లేదని అధినేతల ఉమ్మడి ప్రకటన
కౌలాలంపూర్: ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, మలేషియా తీర్మానించుకున్నాయి. వాణిజ్యంలో అత్యధిక ప్రాధాన్య రంగాలతోపాటు పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, తయారీ, సెమీకండక్టర్ల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతి బాటలో కలిసి నడవాలని నిర్ణయించాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్, మలేషియా కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
ఆయన ఆదివారం మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్, మలేషియా మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సెమీకండక్లర్ట రంగంలో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంతోపాటు కీలక రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఇందులో ఉన్నాయి.
భేటీ అనంతరం మోదీ, అన్వర్ ఇబ్రహీం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాద భూతాన్ని సమాధి చేయడానికి ప్రపంచదేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు మోదీ బహిర్గతం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు గానీ, రాజీపడడం గానీ ఉండబోదని స్పష్టంచేశారు. భారత్–మలేషియా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాలుగా లోతైన, సౌహార్ధ సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. వ్యూహాత్మక విశ్వాసంతో ఇరుదేశాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు.
‘అంతర్జాతీయ’ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి
మలేషియాలో భారత కాన్సులేట్ జనరల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటం, నిఘా సమాచారం పంచుకోవడం, మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో మలేషియాతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. రక్షణ బంధాన్ని సైతం విస్తృతపర్చుకుంటామని వివరించారు. కృత్రిమ మేధ(ఏఐ), డిజిటల్ టెక్నాలజీతోపాటు సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రతపై భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి గ్రోత్ ఇంజన్‌గా ఎదుగుతోందని వెల్లడించారు.
మలేషియా లాంటి మిత్రదేశాల అండతో ‘ఆసియాన్’ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకుంటామని చెప్పారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ఇండో–పసిఫిక్‌లో ఆసియాన్‌తో కలిసి అభివృద్ది, శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అన్వర్ ఇబ్రహీంతో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, మలేషియా మధ్య స్నేహసంబంధాలు పెరుగుతుండడం ఇరుదేశాలకు మేలు చేస్తుందని వెల్లడించారు. సవాళ్లను అధిగమించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. భారత్–మలేషియా సంబంధాల విషయంలో అన్వర్ ఇబ్రహీం చక్కటి చొరవ చూపుతున్నారని కొనియాడారు.
చరిత్రాత్మక నిర్ణయం: ఇబ్రహీం
భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఇబ్రహీం ప్రశంసించారు. భారత్‌తో భాగస్వామ్యం వల్ల తమకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాల వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలన్నది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.
భారత సంతతి నేతలతో భేటీ
మలేషియాలో భారత సంతతి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత్‌తో వారి భావోద్వేగ అనుబంధం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారత సంతతి వ్యక్తులు ప్రజా జీవితంలో సాధిస్తున్న విజయాలు గర్వకారణమని ఉద్ఘాటించారు. మలేషియాలో అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. భారత్, మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. భారత్‌ను అభివృద్ధి చేయడంలో మోదీ దార్శనికత, కార్యాచరణ స్ఫూర్తిదాయమని భారత సంతతి నేతలు పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తలతో: ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యేందుకు వారు చూపుతున్న ఆసక్తిని ప్రశంసించారు. ఇంధన రంగంలో పునరుత్పాదక, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎల్‌ఎన్‌జీ, పెట్రోకెమికల్స్‌లో భాగస్వామ్యంపై వారితో చర్చించారు. అలాగే భారత్, మలేషియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం రెండు రోజుల మలేషియా పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశం చేరుకున్నారు.


