ఓటీసీ 'మందు' | OTC medicines for minor health problems: Telangana | Sakshi
Sakshi News home page

ఓటీసీ 'మందు'

Feb 9 2026 1:49 AM | Updated on Feb 9 2026 4:28 AM

OTC medicines for minor health problems: Telangana

చిన్న ఆరోగ్య సమస్యలకు ఓటీసీ ఔషధాలు 

నేరుగా ఫార్మసీల నుంచే జనం కొనుగోలు 

అత్యధికంగా న్యూట్రాస్యూటికల్స్‌ వినియోగం

చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుల దగ్గరకు వెళ్లడం గతం. ఇప్పుడు ముందుగా గూగుల్‌లో సెర్చ్‌ చేయడం.. లేదంటే బంధువులు, సన్నిహితుల సలహా తీసుకుని సమీపంలోని ఫార్మసీకి వెళ్లి కావాల్సిన మందులు తెచ్చుకోవడం. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలైతే ఒక అడుగు ముందుకేసి ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అందుకే భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) ఔషధాల వినియోగం పెరుగుతోంది.    – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

వినియోగదార్లకు అవగాహన పెరగడం, అందుబాటు ధర.. వెరసి ఓటీసీ ఔషధాల వినియోగం క్రమంగా అధికం అవుతోంది. మన దేశంలో ఓటీసీ మందుల వ్యాపారం 2020–24 మధ్య సగటున ఏటా 10% పెరిగింది. 2026–30 మధ్య ఇది 13% వృద్ధి చెందుతుందని ఈవై పాథనాన్‌ నివేదిక చెబుతోంది. భారత్‌లో 2024లో రూ.47 వేల కోట్ల విలువైన ఓటీసీ మందులు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో ఈ విలువ రెండింతలు దాటుతుందని అంచనా.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో వీటి వ్యాపారం చాలా తక్కువ. కానీ వృద్ధి వేగం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.17.37 లక్షల కోట్ల బిజినెస్‌ జరుగుతోంది. అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్‌ ప్రధాన మార్కెట్లు. ఈ దేశాల్లో ఏటా సగటున ఒక్కో వ్యక్తి ఓటీసీ మందులకు రూ.6,300–11,700 ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ఇది కేవలం రూ.270–360 మధ్య ఉంది.  

జాగ్రత్తగా వాడితేనే..
ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) మెడిసిన్‌ అంటే ప్రి్రస్కిప్షన్‌ లేకుండా వినియోగదారులకు నేరుగా ఫార్మసీల్లో విక్రయించే ఔషధాలు. తలనొప్పి, జలుబు, అలెర్జీలు, నొప్పి వంటి చిన్న చిన్న సమస్యల చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్లడానికి బదులుగా నేరుగా మందుల షాపు నుంచి జనం కొనుగోలు చేస్తారు. ఊళ్లలో అయితే స్థానిక మందుల షాపు యజమానితో నేరుగా పరిచయం ఉండటంతో సమస్య చెబితే మందులు ఇస్తారన్న నమ్మకమూ ఉంటుంది. నిర్దేశించిన సూచనలకు అనుగుణంగా వీటిని జాగ్రత్తగా వినియోగిస్తేనే ప్రభావవంతంగా ఉంటాయి. అతిగా వాడితే దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చిన్న సమస్యలు ఎక్కువకాలం ఇబ్బంది పెడితే వైద్యులను సంప్రదించాల్సిందే. దేశంలో ఓటీసీ ఔషధాలను సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) నియంత్రిస్తుంది.  

ప్రివెంటివ్‌ కేర్‌కు ప్రాధాన్యం 
జబ్బులు రాకుండా జనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవనశైలి మారడంతో మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి రోగాలు పెరుగుతున్నాయి. వీరితోపాటు కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలున్న వారు సపోర్ట్‌ థెరపీలో భాగంగా సప్లిమెంట్స్‌ వాడుతున్నారు. వీరికి ఎక్కువ కాలంపాటు సప్లిమెంట్స్‌ అవసరం. అందుకే న్యూట్రాస్యూటికల్స్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. ఎంతో కాలంగా ఔషధ రంగంలో ఉన్న కంపెనీల నాణ్యమైన ఓటీసీ ఉత్పత్తులను కొనేందుకే జనం మొగ్గు చూపుతున్నారు.  – ఆళ్ల లీలా రాణి, డైరెక్టర్, లీ హెల్త్‌ డొమెయిన్‌  

2024లో ఆరోగ్యం కోసం.. 
స్కిన్‌కేర్, వెయిట్‌ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌కు సంబంధించి 2.7 కోట్ల ఆన్‌లైన్‌ సెర్చ్‌లు నమోదయ్యాయి
25 లక్షల మంది ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
ఆరోగ్య స్థితిని పర్యవేక్షించేందుకు 40% మంది వేరబుల్స్‌ వాడుతున్నారు

Advertisement
 
Advertisement
Advertisement