'నైపుణ్యం' గజిబిజి | Confusion in guidelines of newly issued Labour Codes | Sakshi
Sakshi News home page

'నైపుణ్యం' గజిబిజి

Feb 9 2026 1:46 AM | Updated on Feb 9 2026 1:46 AM

Confusion in guidelines of newly issued Labour Codes

కొత్తగా ఇచ్చిన లేబర్‌ కోడ్స్‌ మార్గదర్శకాల్లో గందరగోళం

ఉద్యోగాలను 4 కేటగిరీలుగా విభజించిన కేంద్రం 

అన్‌ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌ కేటగిరీల్లో 668 ఉద్యోగాలు 

అన్ని కేటగిరీల్లోనూ ఒకే రకమైన ఉద్యోగాలు

అయోమయంగా కేటగిరీలు

వస్తువులు, యంత్రాల పేరుతోనూ జాబ్‌లు

మార్గదర్శకాలపై కార్మీక సంఘాల అభ్యంతరం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌కు సంబంధించిన మార్గదర్శకాల్లో (రూల్స్‌) నిర్దేశించిన ఉద్యోగాలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు అమలు చేసిన నిబంధనల్లో ఉండే ఉద్యోగాల సంఖ్యకు తాజాగా కోత పడగా... కొత్తగా నిర్దేశించిన ఉద్యోగాలు చాలావరకు రిపీట్‌ అయ్యాయి. కొన్నిచోట్ల ఉద్యోగం పేరును యంత్రాలు, పనిముట్ల పేర్లతో ప్రకటించడం.. మరికొన్ని చోట్ల అర్థం లేని పదాలను వినియోగించడంతో కార్మికులు, కార్మీక సంఘాల్లో తీవ్ర అయోమయం నెలకొంది. 

దేశంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న 29 కార్మీక చట్టాలను రద్దు చేస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆయా చట్టాల్లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌ 21 నుంచి నాలుగు లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ లేబర్‌కోడ్‌ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను గతేడాది డిసెంబర్‌ 30న వెల్లడించింది. ఇందులో షెడ్యూల్‌ ‘ఇ’లో అత్యంత కీలకమైన ఉద్యోగాల ఖరారు పూర్తిగా గజిబిజిగా మారింది. ప్రధానంగా అన్‌ స్కిల్డ్‌ కేటగిరీ ఉద్యోగాలే స్కిల్డ్, సెమీ స్కిల్డ్‌ కేటగిరీలో కనిపిస్తున్నాయి. మరికొన్ని హైలీ స్కిల్డ్‌ కేటగిరీలోనూ దర్శనమిస్తున్నాయి. అన్నింటా ఇదే తరహా ఉద్యోగాలుండడం గమనార్హం. 

నైపుణ్యానికి ఏదీ ప్రామాణికం ? 
ఉద్యోగాల విభజన పూర్తిగా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అందులో భాగంగానే ఉద్యోగాల విభజన నాలుగు కేటగిరీలుగా చేశారు. ఎలాంటి నైపుణ్యం లేని ఉద్యోగాన్ని అన్‌ స్కిల్డ్‌గా, నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాన్ని సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా ఖరారు చేయాల్సి ఉంటుంది. తాజాగా వెల్లడించిన మార్గదర్శకాల్లో పేర్కొన్న ఉద్యోగాల్లో చాలా వరకు అన్‌స్కిల్డ్‌ కేటగిరీలో ఉన్నవే సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌ కేటగిరీల్లో పునరావృతమయ్యాయి. అంతే కాకుండా నైపుణ్యం ఆధారంగా ఖరారు చేసే ఉద్యోగాలు కూడా అన్‌స్కిల్డ్‌ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఇలా ప్రమాణాలు లేకుండా ఉద్యోగాలు నిర్ధారించడం అందోళనకు గురి చేస్తోంది. 

– అన్‌ స్కిల్డ్‌ కేటగిరీలో జంపర్‌మెన్, కామిన్, కలాస్, బ్రిడ్జి, ఎలక్ట్రికల్, మరెన్, మోప్లా, స్టోర్, స్టీమ్‌రోడ్, షేర్, రోలర్‌ సర్వే, టాల్‌బాయ్, డిస్మెంటలింగ్‌ స్టాక్స్, క్యారీయర్, స్ట్రైకర్, నంబర్‌ టేకర్‌ ఉద్యోగాలున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటివేవీ ఉద్యోగాల పేర్లు కావని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. 
– సెమీ స్కిల్డ్‌ కేటగిరీలో అటెండెంట్, హెల్పర్, బ్రేకర్, అసిస్టెంట్, గేట్‌ కీపర్, హామర్‌మెన్, స్టాకర్, కీమెన్, కలాసి, లేబర్, మాలీ ఉద్యోగాలను పేర్కొనగా.. ఇవన్నీ అన్‌స్కిల్డ్‌ కేటగిరీలోనూ చూపించారు. 

– డ్రైవర్, వాహనం మెకానిక్‌ హెల్పర్‌ ఉద్యోగాన్ని అన్‌ స్కిల్డ్‌లో చేర్చారు. కోల్‌మైన్‌ ఉద్యోగం కూడా అన్‌ స్కిల్డ్‌లో చూపారు. వాస్తవానికి డ్రైవర్, కోల్‌మైన్‌ ఉద్యోగాలకు నైపుణ్యం అవసరం. కానీ ఇక్కడ నైపుణ్యం లేని కేటగిరీలో చూపారు. సిగ్నల్‌మెన్‌ గతంలో సెమీ స్కిల్డ్‌ కేటగిరీలో ఉంటే ఇప్పుడు అన్‌ స్కిల్డ్‌ కేటగిరీలోకి తీసుకొచ్చారు. 
– సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌ కేటగిరీలో ఒకే రకమైన ఉద్యోగాలున్నాయి. వాటిని ఏ విధంగా వర్గీకరించాలనే దానిపై స్పష్టత లేదు. కొన్ని ఉద్యోగాలకు మాత్రం గ్రేడ్‌–1, 2, 3, క్లాస్‌–ఏ, బీ వర్గాలుగా ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాణాలు కావాలి...ఎంతటి నైపుణ్యం ఉండాలనేది ఎక్కడా ప్రస్తావించలేదు. 

– రోడ్‌ రోలర్, మెకానికల్‌ రోడ్‌ రోలర్, ట్రాన్స్‌ప్రేయర్, వర్క్, పర్మనెంట్‌ వే, గ్యాంగ్, టోపస్, మిల్‌్కవ్రైటర్, పంప్, డంపర్, ఎక్సావేటర్, ఫోర్క్‌ లిప్‌్టŠ, జనరేటర్, గ్రేడర్, ట్రాక్టర్, వైబ్రేటర్‌ పేర్లు వివిధ కేటగిరీ ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. వాస్తవానికి ఈ పేర్లు యంత్రాలకు సంబంధించినవి. వీటిని ఉద్యోగ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం... ఇందుకు సంబంధించిన నైపుణ్యం, వివరణ ఎలాంటివి ప్రస్తావించలేదు. ఇక వృత్తిలో అనుభవానికి సంబంధించిన అంశాన్ని కూడా వివరించలేదు.  

అస్తవ్యస్తంగా ఉద్యోగాల జాబితా  
లేబర్‌ కోడ్స్‌ మార్గదర్శకాల్లో ఉద్యోగాలన్నీ అస్తవ్యస్తంగా ఇచ్చారు. ప్రతి అంశాన్ని పకడ్బందీగా రూపొందించి నిర్ధారించుకోవాలి. కానీ కొత్తగా వచ్చిన లేబర్‌ కోడ్స్‌ ఉద్యోగాల నిర్ధారణలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వస్తువులు, యంత్రాల పేర్లను ఉద్యోగాల్లో చేర్చారు. కొన్నిచోట్ల బ్రిటిష్‌ కాలంలో వినియోగించిన మాలీ, బెల్‌ఉమెన్‌ లాంటి పేర్లను కూడా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో కామన్‌ లాంగ్వేజీని వినియోగించకపోవడంతో ఉద్యోగాలు తలకిందులయ్యాయి. వీటన్నింటినీ సవరించాలి. త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఐఎన్‌టీయూసీ తరపున సవరణ ప్రతిపాదనలు సమర్పిస్తాం. ఉద్యోగ కేటగిరీలు నాలుగు నుంచి ఏడుకు పెంచాలని డిమాండ్‌ చేస్తాం. 
 – దేవసాని బిక్షపతి, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు 

Advertisement
 
Advertisement
Advertisement