శుభ లేఖలు పంచుతూ.. పెళ్లివారింట తీరని శోకం | Family Distributing Wedding Cards On Bike 3 Killed | Sakshi
Sakshi News home page

శుభ లేఖలు పంచుతూ.. పెళ్లివారింట తీరని శోకం

Feb 8 2026 9:37 AM | Updated on Feb 8 2026 12:18 PM

Family Distributing Wedding Cards On Bike 3 Killed

రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో పెళ్లివారింట తీవ్ర విషాదం నెలకొంది. ఫిబ్రవరి 24న జరగబోయే పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు శుభలేఖలు తీసుకుని బైక్‌పై వెళ్లిన తండ్రి, కొడుకుతో పాటు మరో బంధువు మృత్యువాత పడ్డారు. రేవా-ప్రయాగ్‌రాజ్ హైవేపై కోస్టా గ్రామం సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

బాధితులు తమ ఇంటికి  రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో, ప్రయాగ్‌రాజ్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు వీరి బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నుజ్జునుజ్జవ్వగా, బైక్‌పై ప్రయాణిస్తున్న భగవత్ విశ్వకర్మ (55), ఆయన కుమారుడు శివం విశ్వకర్మ, బంధువు శీతల్ విశ్వకర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ కారు డివైడర్‌ను బలంగా ఢీకొని ఆగిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో భగవత్, శివం చాచాయ్ గ్రామానికి చెందిన వారు కాగా, శీతల్.. రథారా నివాసిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం  కోసం రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతులను చూసి వారు చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. పెళ్లి పత్రికలతో వెళ్లిన వారు శవాలై తిరిగిరావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఘజియాబాద్ విషాదం: మరో దారుణం వెలుగులోకి..

Advertisement
 
Advertisement
Advertisement