నాంపల్లి ప్రమాదం.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సీజ్‌ | Telangana Police Seize Forensic Lab At Nampally | Sakshi
Sakshi News home page

నాంపల్లి ప్రమాదం.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సీజ్‌

Feb 8 2026 10:37 AM | Updated on Feb 8 2026 12:35 PM

Telangana Police Seize Forensic Lab At Nampally

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆదివారం ఉదయం ల్యాబ్‌ను సీజ్‌ చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ రానున్నారు. ల్యాబ్‌లో​ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.

కాగా, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో నేడు మరోసారి క్లూస్ టీం ఎస్పీ తనిఖీలు చేపట్టనున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఆఫీసులో ఎవరు ఉన్నారు? అనే దానిపై ఎస్పీ ఆరా తీయనున్నారు. అలాగే, కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించనున్నారు. మరోవైపు.. కార్యాలయంలో అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం. చేశారు. ఈ ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లు, పెన్ డ్రైవ్ దగ్ధం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ పరిశీలించిన అనంతరం, మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 

ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రకోణం దాగి ఉందా అని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కంప్యూటర్‌ గదిలోంచి ఉదయం 10.30 గంటలకు దట్టమైన పొగ రావడాన్ని గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆఫీస్‌బాయ్‌ అగ్నిమాపక పరికరంతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటల తీవ్రత పెరిగి పొగ దట్టంగా కమ్మేయడంతో అందులో చిక్కుకుని అస్వస్థతకు గురయ్యాడు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఇక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ డీజీ శిఖాగోయల్, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్‌ మాన్, హైదరాబాద్‌ నార్త్‌ రేంజ్‌ డీఐజీ శ్వేతారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.  ‘కేసు సంబంధిత ఆస్తి, ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చెందిన సామగ్రి సురక్షితంగానే ఉందని జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం’ అని శిఖా గోయల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎంతో కీలకం 
వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, డీఎన్‌ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్‌లో పరిశీలించి నివేదికలు తయారుచేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంతమేర పడనుందనేది ఆందోళనకరమైన విషయం.

Advertisement
 
Advertisement
Advertisement