‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు.. | Washington Post publisher Will Lewis steps down after layoffs | Sakshi
Sakshi News home page

‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు..

Feb 8 2026 8:23 AM | Updated on Feb 8 2026 8:24 AM

Washington Post publisher Will Lewis steps down after layoffs

వాషింగ్టన్‌: ప్రముఖ అంతర్జాతీయ దినపత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పబ్లిషర్, సీఈఓ విల్ లూయిస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పత్రికలో దాదాపు మూడొంతుల మంది సిబ్బందిని, అంటే సుమారు 300 మంది జర్నలిస్టులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న మూడు రోజుల అనంతరం లూయిస్ తప్పుకోవడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.

సంస్థలో రెండేళ్ల పాటు సాగిన సమూల మార్పుల ప్రక్రియ తర్వాత ‘తాను పక్కకు తప్పుకోవడానికి ఇదే సరైన సమయం’ అని లూయిస్ తన ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో పేర్కొన్నారు. ఆయన స్థానంలో ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎప్‌ఓ) జెఫ్ డి ఒనోఫ్రియో తాత్కాలిక పబ్లిషర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ వారం ప్రారంభంలో వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించిన వివాదాస్పద వ్యయ నియంత్రణ చర్యలు సంస్థలో ప్రకంపనలు సృష్టించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో పనిచేస్తున్న 300 మందికి పైగా జర్నలిస్టులను తొలగించడమే కాకుండా, క్రీడలు, పుస్తక విభాగాలను కూడా పత్రిక మూసివేసింది. దీనితో పాటు ఆసియాతో పాటు పలు విదేశీ బ్యూరోలకు తాళం వేశారు. గత కొన్నేళ్లుగా పత్రిక చందాదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం,  ప్రతిభావంతులైన జర్నలిస్టులు సంస్థను వీడటంతో, పత్రిక భవిష్యత్తును కాపాడటానికి ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పలేదని లూయిస్ తన వీడ్కోలు లేఖలో పేర్కొన్నారు.

జనవరి 2024లో బాధ్యతలు చేపట్టిన విల్ లూయిస్ పదవీకాలం ఆద్యంతం వివాదాలతోనే సాగింది. బ్రిటన్‌లో జర్నలిస్టుగా ఉన్న సమయంలో సమాచారం కోసం డబ్బులు చెల్లించారనే నైతికపరమైన ఆరోపణలు ఆయనను వెంటాడాయి. అలాగే పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాలీ బుజ్బీ నిష్క్రమణకు ఆయన నాయకత్వమే కారణమనే విమర్శలు వినిపించాయి. లూయిస్ నిష్క్రమణపై స్పందించిన వాషింగ్టన్ పోస్ట్ గిల్డ్ (యూనియన్), ఆయన రాజీనామా ఎప్పుడో జరగాల్సిందని, ఒక గొప్ప జర్నలిజం సంస్థను నాశనం  చేశారని ఘాటుగా విమర్శించింది.

ఈ భారీ లేఆఫ్స్ ప్రభావం భారతీయ జర్నలిస్టులపై కూడా పడింది. ప్రముఖ కాంగ్రెస్ నేత శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్, అలాగే ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రాన్షు వర్మ వంటి వారు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇషాన్ థరూర్ అంతర్జాతీయ రాజకీయాలపై రాసే ప్రసిద్ధ న్యూస్‌లెటర్ నిలిచిపోయింది. ఫోటోగ్రఫీ విభాగాన్ని పూర్తిగా రద్దు చేయడం, మెట్రో, అంతర్జాతీయ వార్తల కవరేజీని తగ్గించడం లాంటి నిర్ణయాలు పత్రిక ప్రాభవాన్ని దిగజార్చాయని  విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: గుజరాతీ రుచులకు గ్లోబల్ క్రేజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement