జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయిల్ ఎటర్నల్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది. ఇది ఫిబ్రవరి 1న అమల్లోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. “ఇటీవల నేను అధిక రిస్క్, ప్రయోగాత్మకత కలిగిన కొత్త ఆలోచనల వైపు ఆకర్షితుడనయ్యాను. ఇవి పబ్లిక్ కంపెనీ అయిన ఎటర్నల్ పరిధి వెలుపల మరింత సమర్థంగా అమలయ్యే ఆలోచనలు” అని వాటాదారులకు రాసిన లేఖలో గోయిల్ పేర్కొన్నారు.
అలాగే, “ఎటర్నల్ తన ప్రస్తుత వ్యాపార నమూనాకు అనుబంధంగా కొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించాలంటే పూర్తి దృష్టి, క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో సంస్థలో కొనసాగుతూ బయట కొత్త ఆలోచనలను అన్వేషించడానికి కావాల్సిన వ్యక్తిగత సమయం లేదని నేను భావిస్తున్నాను. భారతదేశంలోని పబ్లిక్ కంపెనీ సీఈవో బాధ్యతలు పూర్తిస్థాయి నిబద్ధతను కోరుకుంటాయి” అని తెలిపారు.
బోర్డులో కొనసాగనున్న గోయిల్
సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, దీపిందర్ గోయిల్ ఎటర్నల్ డైరెక్టర్ల బోర్డులో వైస్ చైర్మన్‌గా కొనసాగుతారు. “నా జీవితంలో దాదాపు 18 సంవత్సరాలు ఈ సంస్థ నిర్మాణానికి అంకితం చేశాను. ఇకపై కూడా అదే నిబద్ధతతో పనిచేస్తాను. మా భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం యథాతథంగా కొనసాగుతుంది. అన్ని వ్యాపార విభాగాల సీఈవోలు ఇప్పటివరకు ఉన్న స్వతంత్రతతోనే పని చేస్తారు” అని గోయిల్ స్పష్టం చేశారు.
కొత్త సీఈవోగా అల్బిందర్ ధిండ్సా
ఎటర్నల్ గ్రూప్ నూతన సీఈవోగా బ్లింకిట్ వ్యవస్థాపకుడు, సీఈవో అల్బిందర్ ధిండ్సా బాధ్యతలు స్వీకరించనున్నారు. రోజువారీ కార్యకలాపాలు, ఆపరేటింగ్ ప్రాధాన్యతలు మరియు కీలక వ్యాపార నిర్ణయాల అమలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది.
బ్లింకిట్‌ను స్థాపించడానికి ముందు, ధిండ్సా జొమాటోలో అంతర్జాతీయ విస్తరణ విభాగం అధిపతిగా పనిచేశారు. సంస్థ గ్లోబల్ విస్తరణ వ్యూహానికి ఆయన కీలక పాత్ర పోషించారు.
2013లో బ్లింకిట్‌ను సహ-వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన ధిండ్సా, ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు.


