బెంగళూరులో హోటళ్లు బంద్‌!? | గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు | Sakshi
Sakshi News home page

బెంగళూరులో హోటళ్లు బంద్‌!?

Mar 9 2026 9:20 PM | Updated on Mar 10 2026 4:43 PM

Bengaluru Hotels Face Shutdown Cooking Gas Supply Crisis Thousands at Risk

వంటగ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.

గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతల ప్రభావం

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్‌ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్‌పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్‌పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్‌పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పెరిగిన ధరల భారం

మరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్‌పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!

Advertisement
 
Advertisement
Advertisement