ట్రంప్‌నకు హైబీపీ తెప్పించిన ఇరాన్​! | Trump Comments Over Iran Mojtaba Khamenei As Supreme Leader | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు హైబీపీ తెప్పించిన ఇరాన్​!

Mar 9 2026 8:15 AM | Updated on Mar 9 2026 9:42 AM

Trump Comments Over Iran Mojtaba Khamenei As Supreme Leader

ఇరాన్ అధికారికంగా మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. తీవ్ర తర్జన భర్జనల తర్వాత (మార్చి 8–9, 2026) ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆయన వారసుడిగా మోజ్తాబానే ఎన్నుకుంది.

ఇరాన్​ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత మతపరమైన మండలి తమ కొత్త నాయకుడిగా ఖమేనీ తనయుడు సయ్యద్ మోజ్తాబాను (అలీ ఖమేనీ రెండవ కుమారుడు)ని ఎన్నుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి సుప్రీం లీడర్ పదవి తండ్రి నుండి కుమారుడికి వారసత్వంగా వెళ్లడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం.

అయితే ఇరాన్‌లో సాధారణంగా సుప్రీం లీడర్‌ను మతపరమైన మండలి ఎన్నుకుంటుంది. కానీ ఈసారి తండ్రి నుండి కుమారుడికి పదవి రావడం హెరిడిటరీ సక్సెషన్ (వంశపారంపర్య వారసత్వం)పై విమర్శలు వెల్లువెత్తవచ్చని అంతా భావించారు. దీనికి తోడు.. అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​.. మోజ్తాబా ఎంపిక అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్‌లో వారసత్వ ఎంపిక ఏ రకంగానూ చెల్లదని, మోజ్తాబా ఒక మూర్ఖుడు అని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్​ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరపాలని, ఆ ఎంపికలో తమ దేశ ప్రమేయం(తనకు అనుకూలంగా ఉండాలనే..) ఉంటుందని ప్రకటించారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన హెచ్చరించారు.

కాగా, ట్రంప్​ వ్యాఖ్యలను ఇరాన్​ చాలా తేలికగా తీసుకుంది. ప్రాంతీయ యుద్ధ పరిస్థితుల్లో.. మోజ్తాబా ఎంపికే సరైందని భావించింది. అయితే ఆ ప్రకటన తర్వాత ఇరాన్​ అంతటా అనూహ్య పరిస్థితులు కనిపించాయి. వ్యతిరేకతకు బదులు.. ఇరాన్​ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), సైనిక ప్రధాన సిబ్బంది మోజ్తాబాకు మద్దతు ప్రకటించారు. ఇది అగ్రరాజ్యం, ఇజ్రాయెల్‌ ఏమాత్రం ఊహించిన ఉండకపోవచ్చు!.

56 ఏళ్ల వయసున్న మోజ్తాబా ఖమేనీ గతంలో ఎన్నికైన పదవులు చేపట్టకపోయినా, తన తండ్రి కార్యాలయం ద్వారా సైనిక, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతూ వచ్చారు. అలాగే హెజ్‌బొల్లా లాంటి అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక గుంపులతోనూ ఆయన సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే మోజ్తాబా, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధం తీవ్ర ప్రతిస్పందనలతో నిండింది. మోజ్తాబాపై పలు రాజకీయ(ఎన్నికల్లో అవకతవకలు, అవినీతి సంబంధిత) విమర్శలు ఉన్నా.. కరడుగట్టిన ట్రంప్​ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మోజ్తాబా నియామకమే సరైందని భావించి.. అమెరికాకు ప్రత్యక్ష సవాలు విసిరింది ఇరాన్.

మొత్తంగా.. మోజ్తాబా నియామకంతో ఇరాన్ మతపరమైన నాయకత్వం “సమరాన్ని ఎంచుకుంది, రాజీని కాదు” అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ మోజ్తాబాను “అంగీకరించలేని నాయకుడు” అని చెబుతున్నారు. కాబట్టి తాజా నిర్ణయం ఆయనకు మరింత మంట పుట్టించి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఉద్రిక్తతలకు ధీటుగానే స్పందించాలనే ధోరణిని మోజ్తాబా కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.  అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో జరిగిన నాయకత్వ మార్పు .. మధ్య ప్రాచ్యంలో(మిడిల్​ఈస్ట్‌లో) ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement