పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ( సోమవారం) కీలక భేటీ జరగబోతుంది. G-7 దేశాలు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంయుక్తంగా భేటీ నిర్వహించనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న చమురు సంక్షోభం నేపథ్యంలో అత్యవసర సమయంలో విడుదల చేయాల్సిన చమురు నిల్వలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయు. గల్ఫ్ దేశాలతో పాటు ప్రధానంగా ఆయిల్ సరఫరా దేశాలకు ఆటంకం తలెత్తడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో G-7 దేశాల ప్రతినిధులు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరపనున్నాయి.
ప్రస్తుతం చమురు సంక్షోభం తలెత్తడంతో అత్యవసర సమయంలో విడుదల చేయాల్సిన చమురు నిల్వలపై IEA కు చెందిన 32 సభ్య దేశాలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నిల్వలు మొత్తంగా సుమారు 1.2 బిలియన్ బ్యారెళ్లుగా ఉండగా వాటిలో 300 మిలియన్ నుండి 400 మిలియన్ బ్యారెళ్ల వరకు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుత యుద్ధానికి .. అమెరికా అధ్యక్షుడు ప్రధాన కారణం కావడంతో ట్రంప్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో అమెరికా సైతం ఈ విషయంపై సానుకూలంగా ఉంది. అంతే కాకుండా అక్కడ గత వారంలో 2.98 డాలర్లు పలికిన గాలన్ ధర వారం రోజుల్లోనే 3.45 డాలర్లకు చేరుకుంది. ఆర్థిక నిపుణులు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం తలెత్తి చమురు సంక్షోభం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతి దారులైన చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్, జర్మనీతో పాటు మరికొన్ని దేశాలలో క్రూడాయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా ప్రమాణమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర.. ఆసియా ట్రేడింగ్‌లో సోమవారం ఒక దశలో 24% పెరిగి బ్యారెల్‌కు $116.71కు చేరింది. తరువాత కొంత తగ్గి $110.85కి చేరుకుంది. మొత్తంగా గల్ఫ్ యుద్ధం ప్రభావంతో ప్రపంచ చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి G7 దేశాలతో పాటు IEA తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.


