breaking news
Mulugu
-
విద్యార్థులు శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచుకోవాలి
వెంకటాపురం(ఎం): శాసీ్త్రయ జ్ఞానాన్ని రంగస్థల నైపుణ్యాలతో విద్యార్థులు పెంపొందించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ సూచించారు. మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్లో సోమవారం జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 10 విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పలు విద్యార్థి బృందాలు నేర్చుకోవాల్సిన అంశాలపై నాటికలు, కథల రూపంలో వివరించారు. ఇందులో పస్రా పరిధిలోని నాగారం సెయింట్ మేరీస్ పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానం, జాకారం సోషల్ వేల్పేర్ పాఠశాల బృందం ద్వితీయ స్థానం, వెంకటాపురం(ఎం) జెడ్పీఎస్ఎస్ పాఠశాల బృందం తృతీయస్థానంలో నిలిచాయని తెలిపారు. ఈనెల 17న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల బృందం పాల్గొనుందని జయదేవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ, డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు సరిత, సుజిత, సమ్మయ్య, శిరుప సతీష్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ -
ధాన్యం కొనుగోళ్లకు
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ములుగు రూరల్: వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగు చేసిన వరి విస్తీర్ణానికి అనుకూలంగా దిగుబడి అంచనా వేశారు. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టనున్నారు. ధాన్యం సేకరణకు అవసరమయ్యే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు. నిబంధనల మేరకు ధాన్యం మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు, వ్యవసాయ అధికారులకు సూచనలు అందించారు. 1.35 లక్షల ఎకరాల్లో వరిసాగు జిల్లాలోని పది మండలాల్లో 1.35లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 22 క్వింటాల దిగుబడి అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వరి దిగుబడి 2.970 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి రానుంది. ఈ మేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం నిర్ధేశించారు. 46 లక్షల గన్నీ బ్యాగుల అవసరం జిల్లాలో ధాన్యం సేకరణకు 46 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయి. దీంట్లో 30.39 లక్షల గన్నీ బ్యాగుల అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పార పట్టే యంత్రాలు, తేమశాతం నిర్ధేశించే పరికరాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు, టార్ఫాలిన్లు సిద్ధం చేస్తున్నారు.ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 176 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, గిరిజన సహకార సంఘాలు, ఐకేపీ, ఎఫ్పీఓల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఆయా సంఘాలకు కేంద్రాలను కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో –93, జీసీసీ 16, ఐకేపీ –61, ఎఫ్‌పీఓ–6 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం అందుబాటులో గన్నీబ్యాగులుధాన్యం సేకరణకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ చేపడుతాం. సేకరణకు సరిపడా గన్ని బ్యాగులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాము. కాంటాలైన వెంటనే జాప్యం లేకుండా ధాన్యం మిల్లులకు తరలిస్తాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం అమ్మకాలు చేపట్టాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. – ఫైజల్ హుస్సేని, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి -
వినియోగదారులకు మెరుగైన విద్యుత్
కన్నాయిగూడెం: వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గంగారంలో 220/11 కేవీ సబ్ స్టేషన్‌ను ఆయన సోమవారం సందర్శించారు. లిఫ్టిరిగేషన్ సబ్ స్టేషన్ నుంచి కన్నాయిగూడెం వరకు 9 కిలో మీటర్లు 33కేవీ ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాపై చర్చించారు. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపంతో ఏర్పడే విద్యుత్ అంతరాయాలు నిరోధించడానికి ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ దోహద పడుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతవాసులకు అంతరాయాలు తగ్గుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్, తహసీల్దార్ సర్వర్, డీఈ సదానందం, ఏడీఏ స్వామిరెడ్డి, ట్రాన్స్‌కో డీఈ రాజు తదితరులు పాల్గొన్నారు. చీకుపల్లి సోలార్ గ్రామంగా ఎంపిక వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామాన్ని సోలార్ గ్రామంగా ఎంపిక చేసినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం చికుపల్లి గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. గృహాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్‌తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ మధుసూదన్, భూపాలపల్లి ఎస్సీ మల్చూర్ నాయక్, డివిజనల్ ఇంజనీర్లు నాగేశ్వరావు, సదానందం, ఆపరేషన్ ఏడీఏ స్వామిరెడ్డి, ఏఈ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి -
సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వాజేడు: పోలీస్ సిబ్బంది విధుల్లో అంకితభావంతో పనిచేయాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సిబ్బంది హాజరు పట్టిక, టర్నవుట్, డిసిప్లిన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పురోగతి, ఆయుధాల భద్రత, స్టేషన్ పరిశుభ్రతపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. విధుల్లో నిబద్ధతతో పాటు క్రమశిక్షణతో ఉండాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం అవసరమన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నేర నియంత్రణ చర్యలు తీసుకోవాలని, గస్తీ అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై సమాచార సేకరణ, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతం, గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయం పెంపొందించుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో వెంకటాపురం సీఐ ముత్యం రమేష్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, వాజేడు ఎస్సై సతీశ్ తదితరులు ఉన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
ట్రిపుల్ టీని అనుసరించిన కాకతీయులు
వెంకటాపురం(ఎం): 13వ శతాబ్దంలోనే కాకతీయులు ట్రిపుల్ టీ (టౌన్, టెంపుల్, ట్యాంక్) విధానాన్ని అనుసరించారని ప్రొఫెసర్ పాండురంగారావు వలంటీర్లకు వివరించారు. మండల పరిధి లోని రామప్పలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ సోమవారం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ టీ విధానంపై పలు వివరాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణ రామప్ప ప్రాంత చరిత్ర, ఈ ప్రాంత ప్రజల జీవన విధానం, సాంస్కృతిక వైవిధ్యం గురించి వివరించారు. ప్రొఫెసర్ సీతారాములు స్ట్రెస్ ఎనాలిసిస్ ఆన్ హెరిటేజ్ స్ట్రక్షర్స్ ఎలా చేయాలో వివరించారు. అనంతరం పాండవుల గుట్ట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలో తెలుసుకున్న అంశాలను పవర్ పాయింట్ ద్వారా వలంటీర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.వలంటీర్లతో ప్రొఫెసర్ పాండురంగారావు -
రెండేళ్లుగా నష్టాలే..!
మిర్చి పంటను ఆశిస్తున్న చీడపీడలుసాధారణ పద్ధతిలో సాగు చేసిన మిర్చి చేను మల్చింగ్ విధానంలో సాగు చేసిన మిర్చి మొక్కలుఏటూరునాగారం: జిల్లాలోని నల్లరేగడి భూముల్లో ఎర్రబంగారాన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో మిర్చిని వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతన్నలు రెండేళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. ఆ నష్టాలను ఈ ఏడాది పూడ్చాలని ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ ఏడాదైనా మిర్చి పంటను మరింత సాగు చేసి గత నష్టాన్ని అదిగమించాలని దేవుడిని వేడుకుంటున్నారు. కాని వర్షాకాలం ముగిసినప్పటికీ కూడా వానలు కురుస్తుండడంతో రైతన్నలు ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో మొక్కేత(మొక్కలను నాటడం) చేయలేదు. ఏడాది పొడువునా సాగు చేసుకునే వాణిజ్య పంట మిర్చి సాగు. ఎండు మిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చి మిర్చిని మాత్ర అన్ని కాలల్లో సాగు చేస్తుంటారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ మార్కెట్లో సరైన ధరలు లేక రైతులు నష్టాల పాలవుతున్నారు. రైతులకు ఎకరాకు 15 నుంచి 30 క్వింటాల్ వరకు దిగుబడి వస్తే వారు నష్టాల నుంచి బయటపడతారు. మిర్చి పంటను ఆశిస్తున్న చీడపీడల నుంచి పంటను రక్షించుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు పలు సూచనలను చేస్తున్నారు. ఎకరానికి మూడు లక్షలు ఒక ఎకరంలో మిర్చి సాగు చేయడానికి రూ.3 లక్షల పెట్టుబడి అవుతుంది. మిర్చి విత్తనాల కొనుగోలు, కౌలు, నీటి పారకం, బలం మందులు, మొక్కలను నాటడం, రసాయన మందులు, డ్రిప్ అమర్చడం, మల్చింగ్ పేపర్లకు పెట్టుబడి కేటాయించాల్సి ఉంది. ఈ విధంగా ఒక్కో రైతు ఒక్కో ఎకరానికి రూ.3 లక్షలు వెచ్చిస్తే గాని మిర్చి దిగుబడి రాని పరిస్థితి ఉంటుంది. ఇలా దిగుబడి ఎకరానికి 15 నుంచి 30 క్వింటాల వరకు వస్తేనే రైతు పెట్టుపెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశాలున్నాయి. అంతకంటే తక్కువ దిగుబడివస్తే పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోతాయి. మార్కెట్లో సరైన ధరలు కరువు నష్టాలను చవిచూస్తున్న రైతులు మల్చింగ్ విధానం మేలు అంటున్న నిపుణులు -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ములుగు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మేడారంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షలు రుణమాఫీ చేసిందన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు రూ. 30 కోట్ల సీడీఎఫ్ నిధులతో దళిత గిరిజన వాడల్లో సీసీ రో డ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణంతో పాటు ఏటూరునాగారంలో బస్‌డిపోకు రూ.80 కోట్లతో టూరిజం డెవలప్మెంట్, పంచా యతీరాజ్ శాఖ నుంచి బీటీ రోడ్ల పనులకు సుమారుగా రూ. 310 కోట్లు నిధులు కేటాయించి పనులను ప్రారంభించామని వివరించారు. నాయకులు, కార్యకర్తలకు మధ్య విబేధాలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే స్థానిక ఎన్నికల్లో టికెట్లు వస్తాయని వెల్లడించారు. ముందుగా మంత్రి సీతక్క పార్టీ నాయకులతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సీతక్కను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ములుగు క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి 48 మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల విలువ గల చెక్కులను సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క లబ్ధిదారులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే 20 శాతం కూడా డబ్బులు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పేదల కోసం 40 శాతానికి పైగా ఆస్పత్రి ఖర్చులను చెల్లిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
నేటి ప్రజావాణి రద్దు
ములుగు రూరల్: కలెక్టరేట్లో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలి’ ఏటూరునాగారం: ఆదివాసీలు తమ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల జాబితా నుంచి లంబాడీల తొలగింపు అంశానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నందున్న వారి అభిప్రాయం మేరకు చేపట్టే ఉద్యమానికి ఆదివాసీ సంఘాలన్నీ మద్దతు తెలుపాలన్నారు. ఆదివాసీ సంఘాల జేఏసీతో కలిసి పనిచేయాలని కోరుతూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చందా మహేశ్, ప్రధాన కార్యదర్శిగా కాపుల సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎట్టి రాజబాబు, సిద్ధబోయిన సర్వేశ్వర రావు, చింత సోమరాజు, జిల్లా కార్యదర్శులుగా పెండేకట్ల బాలరాజు, కూచుంటి చిరంజీవి, ఈక జగ్గారావు, వట్టం సురేష్, పొడెం నర్సింగ రావు, కోశాధికారి సోలం సురేష్, ప్రచార కార్యదర్శులుగా వాసం శ్రావణ్ కుమార్, జవ్వాజి రవి, చింత శ్రావణ్, వజ్జ రవి, సాంస్కృతిక కార్యదర్శిగా కోడె రవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కో కన్వీనర్ పోడెం రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర్క యాదగిరి, గంజి రాజన్న, గంట సత్యం, వట్టం కన్నయ్య, రాష్ట్ర కార్యదర్శులు పూనెం శ్రీనివాస్, పూనెం బాలకృష్ణ, చింత కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పాండవుల గుహలను సందర్శించిన విద్యార్థులు రేగొండ: వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ క్యాంపునకు వచ్చిన విద్యార్థులు ఆదివారం మండలంలోని పాండవుల గుహలను సందర్శించారు. పాండవుల గుట్టకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ అధికారి డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం పాండవుల గుహలలోని పలు ప్రదేశాలను తిలకించారు. మందుబాబులకు అడ్డాగా పాఠశాల భూపాలపల్లి రూరల్:మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్‌పల్లి ప్రాథమిక పాఠశాల రాత్రి సమయంలో మందుబాబులకు అడ్డాగా మారుతుంది. పాఠశాలకు గేటు లేకపోవడం, ప్రహరీ ఓ మూలన కూలిపోవడంతో రాత్రి ళ్లు పాఠశాలలోనే మందుబాబులు మద్యం సేవి స్తున్నారు. పాఠశాలకు గేటు, ప్రహరీని వెంటనే నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
లాభం వస్తుందని సాగు చేశా..
మిర్చి పంటను సాగు చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు. గత రెండేళ్ల నుంచి మిర్చి సాగు చేయడం వల్ల అపార నష్టం వచ్చింది. వేరే విద్య తెలియక మళ్లీ మిర్చి సాగువైపే అడుగులు వేశాం. ఎనిమిది ఎకరాల వరకు మిర్చి సాగు పెట్టాను. గత రెండేళ్ల నుంచి వస్తున్న నష్టాన్ని ఈసారి పూడ్చుకోవాలని గంపెడు ఆశతో పంట సాగు చేశాను. కానీ వ్యాపారులు, ప్రభుత్వం ఏం చేస్తుందో అర్ధం కావడం లేదు. మిర్చి నారు వేసి మల్చింగ్ పేపర్‌ను అమర్చాము. కాని కాత కాసి మార్కెట్ వెళ్లే వరకు ఆందోళనగానే ఉంటుంది. – గడ్డం బాబు, రామన్నగూడెం, మిర్చి రైతు -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్‌జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్‌జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్‌జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్‌జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్‌జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్‌జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్‌జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్‌జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్‌జైలు ఖైదీ ఆత్మహత్య..సబ్‌జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. -
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శనివారం ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఒక బలమైన సాధనమన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఈ చట్టాన్ని అమలు చేయడంతో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అధికారులు కృషిచేయాలని సూచించారు. అనంతరం అఽధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, రవికుమార్, రాజేశ్వర్, ఎర్ర న్న, మారుతి, ప్రదీప్, కార్తీక్, రాజు పాల్గొన్నారు. -
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్‌లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. ఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్‌గా ఇండియా కల్చర్‌పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్‌గా బాగుంది. – హమీద్ దాస్, కోల్‌కతా -
మోడల్ బస్టాండ్ పనుల్లో వేగం పెంచాలి
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు శనివారం మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులను మంత్రి సీతక్క పరిశీలించి మాట్లాడారు. బస్టాండ్ నిర్మాణ పనుల్లో నాణత్య ప్రమాణాలు పాటించాలన్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న పోచమ్మ తల్లి ఆలయానికి ఆటంకం కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పౌడాల ఓం ప్రకాశ్, నల్లెల్ల భరత్‌కుమార్ అహ్మద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని జర్మనీకి చెందిన డానియల్, వోలివా, సారియా కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ బాగుందని కొనియాడారు. అదేవిధంగా ఇంగ్లండ్‌కు చెందిన జొనాతన్ డేవిస్ సందర్శించగా రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ ఆయనకు వివరించారు. రామప్పలో మాజీ డీజీపీ రాముడు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ జేవీ రాముడు శనివారం సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారి హరీశ్ శర్మ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఎస్సై చల్లా రాజు ఉన్నారు. -
మాస్టర్ ప్లాన్‌తోనే అభివృద్ధి సాధ్యం
● రానున్న రోజుల్లో ఏటూరునాగారం మున్సిపాలిటీ ఏర్పాటు ● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: మాస్టర్ ప్లాన్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రానున్న రోజుల్లో ఏటూరునాగారం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని కూరగాయలు, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి రూ.1 కోటితో నిర్మించనున్న పనులకు కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణితో కలిసి శనివారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రణాళికలు తప్పనిసరిగా తయారుచేసుకోవాలన్నారు. ఏటూరునాగారం గతంలో చిన్నపల్లెటూరుగా ఉండి.. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడి 5 మండలాలకు కేంద్రంగా, రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గతంలో ఏటూరునాగారం, ములుగు రెండు ప్రాంతాల మధ్య బస్సు డిపో విషయంలో సమస్య తలెత్తిందని ఈ విషయంపై సంబంధిత అధికారులు, రవాణా శాఖ మంత్రితో చర్చించి ఏటూరునాగారం ప్రాంతంలో రూ. ఏడున్నర కోట్లతో బస్‌డిపో ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఏటూరునాగారం నుంచి గోదావరి నది వరకు రెండున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు మంజూరు చేసినట్లు వివరించారు. అందరి సహకారంతో ఏటూరునాగారం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రానున్న రోజులలో మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని వివరించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో గ్రౌండ్, స్విమ్మింగ్‌పూల్ వంటి అభివృద్ధి పనులను చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు, వావిలాల ఎల్లయ్య, లాలయ్య, సులేమాన్, గౌస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తి క్రాస్ వద్ద చెన్నాపురం తోగులో రూ. 3 లక్షలు, జలగలంచ గొత్తికోయ గూడెంలో రూ. 3 లక్షలతో నిర్మించిన పాఠశాలలను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. అనంతరం మంతిర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జలగలంచ, చెన్నాపురం తోగు గొత్తికోయగూడెం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉండటం ద్వారా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ గొత్తికోయ పిల్లలకు చదువు అందించాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలలను నిర్మించి ప్రారంభించినట్లు తెలిపారు. 53 గొత్తికోయ హబిటేషన్ గూడేలలో సర్వే నిర్వహించి సోలార్ విద్యుత్‌కు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి చిన్నారులకు పలకలు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డీపీఓ దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
హేమాచలుడిని దర్శించుకున్న బీజేపీ నేత
మంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని బీజేపీ ఎండోమెంట్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన ప్రసాద్ తివారీ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యుల గోత్ర నామాలతో ఆలయ పూజారులు స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చన జరిపించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశం సుభిక్షంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలని, బీహార్, జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. సబ్‌స్టేషన్‌కు 33 కేవీ లైన్ ప్రారంభంములుగు రూరల్: మల్లంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌కు 33 కేవీ నూతన లైన్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఈ ఆపరేషన్ రాజు చౌహన్ ప్రారంభించారు. ఈ మేరకు శనివారం విద్యుత్ సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యుత్ లైన్‌తో రామచంద్రాపూర్, కొడిశలకుంట గ్రామాల వినియోగదారుల లోఓల్టేజ్ సమస్యలు తీరుతాయని తెలిపారు. 33 కేవీ లైన్ పునరుద్ధరణ చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, ములుగు ఎస్ఈ మల్చూర్‌నాయక్, డీఈ నాగేశ్వర్రావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రవి, సిబ్బంది పాల్గొన్నారు. కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాలసర్ప, శని పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది. ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ భూపాలపల్లి అర్బన్: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, దిశ ములుగు ఆధ్వర్యంలో శనివారం భూపాలపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీహెచ్సీ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ ఉమాదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, ఆస్పత్రి ఆర్‌ఎంఓలు డాక్టర్ దివ్య, డాక్టర్ రాజేష్, దిశ క్లస్టర్ మేనేజర్ జ్యోతి, మారి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం హాజరై వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రించడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది, మారి సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ పరిశీలన భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోలార్ జీఎం సీతారామ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరలో ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు స్థలం, పరికరాలు, ప్రాజెక్ట్‌కు కావాల్సిన సలహాలు, సూచనలు అధికారులకు వివరించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన్న, మారుతి, అప్పారావు, గోపినాథ్, రాహుల్ పాల్గొన్నారు. -
ఏజెన్సీలో దోమ తెరల పంపిణీ
ములుగు రూరల్: ఏజెన్సీ గ్రామాల్లో శనివారం ఎన్టీపీసీ దక్షిణ విభాగం వారి సహకారంతో దోమతెరల పంపిణీని చేపట్టారు. ఈ మేరకు శనివారం మండల పరిధిలోని సర్వాపూర్, అంకన్నగూడెం, పెగడపల్లి పంచాయతీల్లో వెయ్యి కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ చీఫ్ జనరల్ పాణిగ్రాహి, లయన్స్‌క్లబ్ ఫౌండేషన్ ఏరియా లీడర్ దీపక్భట్టాచార్జి, లయన్స్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యలు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ చీఫ్ జనరల్ పాణిగ్రాహి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు చేయూతనందిస్తున్నామన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సామాజిక సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎజీఎం అఖిల్ పట్నాయక్, లయన్స్ 320 ఎఫ్ వైస్ గవర్నర్లు సుధాకర్‌రెడ్డి, హరికిషన్, వివేకనందపురం క్లబ్ ప్రెసిడెంట్ నరేష్‌చంద్రదాస్, డీఎంహెచ్ఓ అప్పయ్య, ములుగు క్లబ్ అధ్యక్షుడు దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రమణారెడ్డి, ప్రకాశం, పద్మజాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాలనుంచి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు... వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్‌కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌లు పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ)లు దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదే విధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్‌కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణలు, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్‌లు, జనగామ, మహబూబాబాద్‌లకు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్‌జాదవ్, జువ్వాడి ఇందిరారావులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు మార్పు తధ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, కట్ల శ్రీనివాస్‌లతోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్‌రావు, గోపాల నవీన్‌రాజ్, నల్గొండ రమేష్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవిందర్‌రావు, పిన్నింటి అనిల్‌రావు, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణలతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు)ల మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్‌గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్‌లో ఇప్పుడున్న జె.భరత్‌చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాథలతోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్‌లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. డీసీసీ కోసం దరఖాస్తులు చేసుకోండి... జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పరిశీలకులు వస్తున్న సందర్భంగా దరఖాస్తుతోపాటు పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొని బయోడేటా శనివారం మధ్యాహ్నంలోపు మీమీ జిల్లాల అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహులనుంచి దరఖాస్తుల స్వీకరణ 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్‌తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం
ములుగు రూరల్: బీసీలను రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రవింద్రాచారి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కాదని తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ పార్టీ విధానానికి సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాడి వెంకట్, తిరుపతిరెడ్డి, కుమార్, సతీష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా మహదేవపూర్ కేంద్రంగానే..
పలిమెల: పలిమెల మండలం ఏర్పడి నేటికి పదేళ్లు అవుతున్నా మండలంలోని ప్రజలకు మాత్రం మెరుగైన పాలన ఇంకా అందడం లేదు. నేటికీ మండల కేంద్రంలో ఒక పోలీస్‌స్టేషన్ మినహా ఏ ఇతర కార్యాలయాలు లేవు. చిన్న మండలాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ప్రభుత్వ ఉద్దేశంతో మహదేవపూర్ మండలంలో ఉన్న పలిమెలను ఎనిమిది గ్రామపంచాయతీలతో కలిపి మండలంగా చేశారు. మండల ఏర్పాటు తొలి రోజుల్లో సంతోషించిన ప్రజలు సేవలు అందక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి కలెక్టర్ ప్రత్యేక చొరవ.. అక్టోబర్ 11, 2016లో పలిమెల మండల ఏర్పాటైంది. అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి ప్రత్యేక చొరవతో మండల కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండేలా మండల కార్యాలయాల సమీకృత భవనాన్ని నిర్మించారు. కానీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవనే కారణంగా చూపి అధికారులు మహదేవపూర్‌లోనే తిష్ట వేస్తున్నారు. తనిఖీలు ఉంటేనే.. కలెక్టర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, మంత్రుల, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మండల పర్యటనకు వస్తే తప్పా అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో అసలు మండలానికి చెందిన అధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్పా ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదని ప్రజలు బాహాటంగా అనుకుంటున్నారు. ఏం కావాలన్న మహదేవపూర్‌కు వెళ్లాల్సిందే.. విద్యార్థులు, నిరుద్యోగుల, రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు(సర్టిఫికెట్లు), వ్యవసాయ శాఖ సేవలు, మండల పరిషత్‌కు సంబంధించిన సేవలు, తదితర సేవలకు ప్రజలు పాత మండల కేంద్రమైన మహదేవపూర్‌కు పరుగులు పెట్టాల్సిందే. ముకునూరు నుంచి మహదేవపూర్ వెళ్లాలంటే సుమారు 60 కిలో మీటర్లు ప్రయాణించాలి. తీరా అక్కడికి వెళ్లాక అధికారులు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్ కావాలంటే రూ.50లతో అయ్యే పనికి చార్జీలతో కలిపి రూ.500 కావాల్సిందే. అదే కార్యాలయాలు ఇక్కడే కొనసాగితే సులభంగా పనులు అవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చుట్టుపు చూపుగా వచ్చిపోతున్న అధికారులు మెరుగైన పాలన అందని దుస్థితి ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఫైర్ అధికారులు రవికుమార్, శ్రీకాంత్, ప్రవీణ్‌లు అన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రెస్పాన్స్, ఏటూరునాగారం ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల వినియోగంపై అవహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అవిలయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొమ్మాల సంధ్య, అధ్యాపకులు కిషన్, భిక్షం, రాజు, అశోక్, శ్రీలత, యాకూబ్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పిడుగు పాటుతో వ్యక్తి మృతి
వెంకటాపురం(కె): మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగు పాటుతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కొండాపురం గ్రామానికి చెందిన మొర్రం సమ్మ య్య (46) అనే వ్యక్తి గురువారం గ్రామ శివారులో పశువులను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా, ఒక్కసారిగా సమ్మయ్యకు సమీపంలో పిడుగుపడింది. తీవ్రగాయాలైన అతన్ని కుటుంబ సభ్యులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలి ంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయా డు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. -
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
గణపురం: గ్రామాలలో పోషణ లోపంతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసుమిబసు సూచించారు. మండలంలోని బుర్రకాయల గూడెం అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి గురువారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పరిశీలనకు వచ్చిన ఆమెకు చిన్నారులు పూలతో స్వాగతం చెప్పగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని.. వారికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషక ఆహారాన్ని అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం, కిషోర బాలికలకు అందిస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిషోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నట్లు అధికారులు తెలపగా.. సంతృప్తి వ్యక్తంచేశారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం పోషణ మాసంలో భాగంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. గర్భిణులు ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలతో సుఖ ప్రసవాలతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి భూపాలపల్లి: పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధనకు రైతులకు అవగాహన కల్పించాలని నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసుమి బసు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఆకాంక్షిత జిల్లాలో అభివృద్ధి సూచికలపై వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్డీఏ, పశు సంవర్థక శాఖల అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశంలో పా ల్గొని వివిధ రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పౌసమి బసు మాట్లాడుతూ.. వైద్య, విద్యా రంగాల్లో గుణాత్మక మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలి రేగొండ: ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే దృక్పథంతో వైద్యులు పని చేయాలని నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసుమి బసు అన్నారు. గురువారం భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. నీతి ఆయోగ్ అధికారి పౌసుమి బసు బుర్రకాయల గూడెంలో అంగన్వాడీ కేంద్రం పరిశీలన -
ఇప్పటికిక ఇంతే...!
జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతటా కలకలం... రాజకీయ పార్టీల్లో దుమారం... రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఉమ్మడి వరంగల్‌లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించే వారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కారణంగా ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఊరించి, ఉసూరుమనిపించి.. మొత్తంగా 12 నామినేషన్లు.. రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్‌లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు గాను జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్‌పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలో ఒకటి చొప్పున దాఖలైనట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటివారం తర్వాతే... ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర గంటలకు న్యాయస్థానం తీర్పు.. ఉమ్మడి వరంగల్‌లో జెడ్పీటీసీకి 3, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు -
విజృంభిస్తున్న విషజ్వరాలు
జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులుములుగు రూరల్: ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతోంది. వందల సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్యులు ఓపీ సేవలు అందిస్తున్నారు. ఓపీ చిట్టీలు పొందేందుకు కూడా రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జ్వర బాధితులను పరీక్షించిన వైద్యులు నిర్ధారణ పరీక్షలు రాసి రిపోర్టులు వచ్చాక కలవాలని సూచిస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలకు ఒక రోజు సమయం పడుతుండడంతో రెండోరోజు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. జ్వర పీడితులను అడ్మిట్ చేసుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సీజనల్ వ్యాధుల అవగాహన సదస్సులు మొక్కుబడిగా సాగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరపీడితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి.. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఔట్ పేషెంట్లు 2,340 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించారు. ఇందులో అత్యధికంగా జ్వర పీడితులు 1,017 మందికి చికిత్స అందించారు. ఆస్పత్రిలో 295 మంది రోగులను అడ్మిట్ చేసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో రోజురోజుకూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఇందులో అత్యధికంగా వైరల్ ఫీవర్‌తోనే రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోగులతో కిటకిటలాడుతున్న ఏరియా ఆస్పత్రి వారం రోజుల్లో 2,340 మందికి ఓపీ సేవలు నిర్ధారణ రిపోర్టుల ఆలస్యం ఇబ్బందులు పడుతున్న రోగులు -
రోగ నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి..
ములుగు ఏరియా ఆస్పత్రికి రెండు రోజు క్రితం జ్వరంతో పాటు ఫిట్స్ రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. రెండు రోజులు ఐసీయూలో ఉచిత వైద్యం అందించారు. బుధవారం డాక్టర్ వైద్య పరీక్షలు చేయించాలని రాశారు. షాంపిల్ ఇచ్చిన ఇంకా రిపోర్టు రాలేదు. ల్యాబ్‌కు వెళ్లి అడిగితే ఇంకా రాలేదు అని చెబుతున్నారు. వైద్యులు రిపోర్టులు వచ్చాక నిర్ధారించి చెపుతామని అంటున్నారు. సకాలంలో రిపోర్టులు అందించాలి. – జంగిడి ప్రకాశ్, గోవిందరావుపేట జ్వరం తగ్గకపోవడంతో ములుగు ఏరియా ఆస్పత్రిలో చేరాను. ఇంటి వద్ద జ్వరం రావడంతో ఆర్ఎంపీ దగ్గర మూడు రోజులు ఇన్జెక్షన్లు వేయించుకున్నా తగ్గలేదు. ఆస్పత్రిలో చేరి ఆరు రోజులు అవుతుంది. వైరల్ ఫీవర్ అంటున్నారు. పొద్దున, సాయంత్రం డాక్టర్ వచ్చి చూసి గ్లూకోజ్‌లు, సూదులు రాస్తున్నాడు. – హర్షం సారయ్య, నారాయణపురం, వెంకటాపురం(ఎం) మండలంనా భర్తను నాలుగు రోజుల క్రితం దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఇక్కడ అడ్మిట్ చేసుకొని వైద్యం చేశారు. జ్వరం తగ్గింది కాని దగ్గు ఇంకా తగ్గలేదు. – బుర్రి లక్ష్మీ, నిజాంపల్లి, గోరికొత్తపల్లి మండలంఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ఆస్పత్రిలో 13 రకాల ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో మలేరియా, వైరల్ ఫీవర్‌తో రోగులు ఎక్కువగా వస్తున్నారు. జ్వరపీడితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నాం. ఆస్పత్రిలో రోగులకు సరిపడా బెడ్లు, అందుబాటులో ఉన్నాయి. – చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు -
పొగాకు వాడకం ప్రమాదం
ములుగు: పొగాకు తాగిన వారితో పాటు పక్కన ఉండి పీల్చేవారికి అంతే ప్రమాదమని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యువత పొగాకు వాడకాన్ని విడిచిపెట్టేలా 60రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు. పొగాకులోని నికోటిన్ పదార్ధం దూమపానానికి బానిసలుగా మారుస్తుందని తెలిపారు. పొగాకు తాగడం వల్ల ఊపిరితిత్తులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతిఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పవన్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్, చంద్రకాంత్, డీపీఎంఓ సాంబయ్య, సీహెచ్ఓ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
సమాచార హక్కుచట్టంపై అవగాహన తప్పనిసరి
ములుగు రూరల్: సమాచార హక్కు చట్టం –2005పై అధికారులు తప్పనిసరిగా పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, డిప్యూటీ కలెక్టర్ కుశీల్ వంశీ పాల్గొన్నారు. అనంతరం సమాచార హక్కుచట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏఓ రాజ్‌కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వీసీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
గిరిజనులు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గిరిజనులు వందశాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మేడారంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా షెడ్యూల్డ్ తెగల హోదా అనుభవిస్తున్న బంజారాలను తొలగించే వరకు దీర్ఘకాలిక ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. 1976లో రాజ్యాంగానికి విరుద్ధంగా గుర్తించబడిన లంబాడీ తెగ విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ, రాజకీయ రంగాలలో అత్యధికంగా రిజర్వేషన్లు అనుభవిస్తుందని తెలిపారు. దీంతో ఆదిమ లక్షణాలున్న తొమ్మిది తెగలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమ్మక్క– సారలమ్మ జాతర అభివృద్ధి ముసుగులో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలకు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుందని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మక్క– సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ లోగోలో లంబాడీల భాషా పదాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 19న ఆదిలాబాద్‌లో అన్ని ఆదివాసీ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వట్టం ఉపేందర్, వైస్ చైర్మన్ రవి, జేఏసీ బాధ్యులు రామకృష్ణ, నరసింహమూర్తి, రాంచందర్, సాయిబాబు, రవి, సమ్మక్క ప్రధాన పూజారి సురేందర్, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రదేశాలపై విస్తృత ప్రచారం కల్పిస్తూ రాబోయే భావితరాలకు వారసత్వ సంపదను అందించాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు బీవీ.పాపారావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయం ఆవరణలో ప్రపంచ వారసత్వ వలంటీర్ల శిబిరాన్ని ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావుతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపారావు ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి వలంటీర్లకు వివరించారు. ప్రపంచ, దేశ, రాష్ట్రస్థాయిలో వారసత్వ సంపద మూడు దశలలో ఉంటుందని వెల్లడించారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వారసత్వ సంపదను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. రామప్పలో నాలుగేళ్లుగా వలంటీర్ల శిక్షణ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. 10 రోజుల పాటు కొనసాగనున్న వలంటీర్ల క్యాంపునకు దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన 36 మంది వలంటీర్లు, ఇరాన్ దేశానికి చెందిన ముగ్గురు విదేశీయులు వలంటీర్లుగా వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ డిప్యూటీ ఆర్కియాలజిస్ట్ కేఆర్ దేశాయ్, క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు పాపారావు రామప్పలో ప్రపంచ వారసత్వ వలంటీర్ల శిబిరం ప్రారంభం -
పోరాటాలకు సిద్ధం కావాలి
ములుగు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 10 వేలు వేతనం అందించాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలన్నారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ముత్యాల రాజు, ఇంజం కొమురయ్య, బోడ రమేష్, సదయ్య, వినోద్, రాధ, రాజేందర్, సమ్మయ్య, నరేష్, రాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్ల ప్రక్రియ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో జరుగుతున్న మద్యం టెండర్ల దరఖాస్తు ప్రక్రియను బుధవారం వరంగల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సులభతర దరఖాస్తు విధానం అమలు చేయాలన్నారు. అభ్యర్థులకు కావాల్సిన దరఖాస్తు ఫారాలు అందుబాటు ఉంచాలన్నారు. దరఖాస్తుదారులకు మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని స్టేషన్ల ఎకై ్సజ్ సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
తిలా పాపం.. తలా పిడికెడు!
కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సాసాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్‌మిల్లర్లకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యం దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. వివాదమైనప్పుడే స్పందన.. కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం విచారణలో తేల్చిన ‘ఎన్ఫోర్స్మెంట్’ మూడేళ్లయినా పట్టించుకోని యంత్రాంగం సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం మిల్లర్లు, అధికారులకు పప్పుబెల్లంలా సీఎంఆర్ రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలురైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్‌మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్‌కు చెందిన 31 మంది రైస్‌మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. -
బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి
ఏటూరునాగారం: బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని సీడీపీఓ ప్రేమలత, డాక్టర్ సుమలత అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, తల్లిపాలు, వ్యక్తిగత శుభ్రతపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ప్రేమలత, రొయ్యూరు వైద్యురాలు సుమలత మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు పిల్లలకు మంచినీరు తాగించాలన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. శిశువు పుట్టిన మొదటి 30 నుంచి 60 నిమిషాలు వెంటనే తల్లిపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆరు నెలల్లోపు వయస్సు ఉన్న పిల్లలను గృహ సందర్శన కార్యక్రమం చేపట్టి వారిని గుర్తించి అంగన్వాడీ బడిలో చేర్పించాలన్నారు. అలాగే పోషక విలువలు ఉన్న ఆకు కూరలు, కోడిగుడ్లు, పాలు, పప్పు దినుస్సులను తినిపించాలని సూచించారు. ఇదేకాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు, కోడిగుడ్డు, బాలామృతం ప్లస్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ కల్పన, సూపర్వైజర్లు శ్రీవిద్య, వైద్యులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.సీడీపీఓ ప్రేమలత -
మహాజాతరకు.. 112 రోజులే..
వనదేవతల ప్రాంగణ విస్తరణ పనులకు కసరత్తుపనుల డిజైన్ మ్యాప్ చూపిస్తూ కలెక్టర్‌కు వివరాలను తెలుపుతున్న అధికారులు● సమీపిస్తున్న జాతర సమయం● పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నం ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ఇంకా 112 రోజులే సమయం మిగిలి ఉంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మహాజాతర జరగనుంది. ఈ సారి జాతరకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతో వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణ సాలహారం (ప్రహరీ) నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. వంద రోజులే లక్ష్యంగా.. మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు జిల్లా అఽధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ఆలయ గద్దెల చుట్టూ సాలహార నిర్మాణ పనులను మాస్టర్ ప్లాన్ డిజైన్ ప్రకారం రాతితో నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మేడారం జాతరకు 112 రోజుల సమయం మాత్రమే ఉంది. వంద రోజుల్లో అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో జిల్లా అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేలాది మంది కార్మికులను ఏర్పాటు చేసి రాత్రి, పగలు పనులు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గద్దెల ప్రాంగణ విస్తీర్ణ పనులపై మంత్రి సీతక్క ఎప్పటికప్పడు జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేందుకు సన్నద్ధమైంది. -
విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
ములుగు: విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ప్రణాళికతో చదివి ప్రయోజకులు కావాలని ములుగు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ఆవెర్నెస్ ప్రోగ్రాంను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి కష్టాలు వచ్చినా తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో పంచుకోవాలని సూచించారు. సరైన ఆహారపు అలవాట్లు పాటించి శారీరక వ్యాయామాలు, యోగ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం వినోద్‌కుమార్, లయన్స్ క్లబ్ సెక్రటరీ చుంచు రమేష్, సభ్యులు రాజు, సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
ములుగు రూరల్: నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీపీఓ దేవరాజ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సంహరణ అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో 5 జెడ్పీటీసీ, 30 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 మంది రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్వోలకు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయని వివరించారు. జిల్లాలో మొదటి విడతలో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి దివాకర టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు, మంగపేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి గ్రామ పంచాయతీ ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆర్వోలు, ఏఆర్వోల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ధాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిబంధనల మేరకు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో సందేహాలను ఉన్నతాధికారుల నుంచి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, ఆర్వోలు, ఏఆర్వోలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
ట్రైబల్ వర్సిటీ లోగోలో ప్రధాన ఆకర్షణలు ఇవే..
తెలంగాణలో సమ్మక్క– సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగో విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ లోగోను విడుదల చేశారు. ఇందులో పలు విశేషాలు ఉన్నాయి.లోగోలో ప్రధాన ఆకర్షణలు.. ⇒ సమ్మక్క–సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ లోగో మధ్య సమ్మక్క–సారలక్క గద్దెలు ⇒ సమ్మక్క దేవత కుంకుమకు చిహ్నంగా మధ్యలో ఎర్రటి సూర్యుడు ⇒ ప్రశాంతమైన ఆధ్యాత్మిక కోణాన్ని జోడించే పీఠాలపై ఆసీనులైన ఇద్దరు వన దేవతలు ⇒ గిరిజన ఆహార్యం, సౌందర్యానికి సూచికగా నెమలి ఈకలు ⇒ సాంస్కృతిక గౌరవం, ధైర్యం సంప్రదాయాన్ని సూచించే రెండు జంతువుల కొమ్ములతో కూడిన కిరీటం త్వరలో కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపనసాక్షి, న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ సమ్మక్క– సారలమ్మ యూనివర్సిటీని సందర్శిస్తానని, కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి సమక్క– సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు.కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో.. సమ్మక్క– సారలమ్మ కేంద్ర విశ్వ విద్యాలయాన్ని సాధించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.చదవండి: చొక్కా విప్పి.. చితిపై కప్పి -
ఆర్టిజన్ కార్మికులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలి
ములుగు రూరల్: ఆర్టిజన్ కార్మికులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడు పని చేస్తుందన్నారు. ఆర్టిజన్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ మానసిక ఒత్తిడికి చేయడం సరికాదన్నారు. అనంతరం డివిజనల్ విద్యుత్‌శాఖ అధికారి నాగేశ్వర్రావును కలిసి సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ బొల్లి వెంకట్రాజ్, నాయకులు నలువాల స్వామి, భాస్కర్, శ్రీనివాస్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
ఏటీసీలను సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం/వాజేడు: ఏటూరునాగారం, వాజేడు కేంద్రాల్లో నూతనంగా నెలకొల్పిన ఏటీసీ సెంటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏటీసీ, వాజేడు ఏటీసీ లను ఆయన పరిశీలించి పరికరాల పనితీరును తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు ఏటీసీలో చేరి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. శిక్షణ నాణ్యత, వృత్తి విద్య సదుపాయాల విస్తరణ, విద్యార్థుల ప్రాక్టికల్ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. శిక్షణలో మరింత నాణ్యతగా బోధించాలని అధికారులు, ఇన్స్ట్రక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, వాజేడు ప్రిన్సిపాల్ శేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ జగదీష్, మువిన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో కొమురంభీం వర్ధంతి ములుగు రూరల్: కొమురం భీం వర్ధంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ టీఎస్ దివాకర కొమురం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమురంభీం ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, డిప్యూటీ కలెక్టర్ కుశీల్ వంశీ, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, పర్యవేక్షలు మహేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర -
నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు
ఏటూరునాగారం: నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ దివాకర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో సమీక్ష సమావేశం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలన్నారు. జిల్లాలో దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి షా ఫైజల్ హుస్సేని, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాంపతి, జిల్లా సహకార అధికారి సర్దార్‌సింగ్, అధికారులు పాల్గొన్నారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ గోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ అన్నారు. మంగళవారం తాడ్వాయి రైతువేదికలో తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల్లో గన్నీ సంచులు అవసరానికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో కనీస వసతులు మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ప్రతీ రోజు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస రావు, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఫైజల్ హుస్సేనీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మేనేజర్ రాంపతి, జిల్లా సహకార అ ధికారి సర్దార్ సింగ్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 175 కొనుగోలు కేంద్రాలు కలెక్టర్ టీఎస్ దివాకర -
బలమున్న చోట బరి గీసి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్‌రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్‌లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్‌లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదేని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్‌గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా బుధవారం ఉమ్మడి వరంగల్‌కు చెందిన సీపీఎం పార్టీ నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, వేంనరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్‌తో ‘కామ్రేడ్’లు ముందుకు నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ -
డీడీకి సన్మానం
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ డీడీగా పదవీ బాధ్యతలను స్వీకరించిన దబ్బగట్ల జనార్దన్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్స్‌లు సన్మానించారు. గతంలో పనిచేసిన డీడీ పోచం బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జనార్దన్ విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఓ సారయ్య, ఏసీఎంఓ కోడి రవీందర్, స్పోర్ట్స్ ఆఫీసర్లు యాలం ఆదినారాయణ, వజ్జ నారాయణ, చుంచు కొమ్మాలు, ఆలం శ్యామలత, సిద్దబోయిన వెంకన్న, పీఈటీలు తాటి సతీష్, చింత రమేశ్ తదితరులు పాల్గొన్నారు.న్యాయవాదుల నిరసనములుగు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ లాయర్ దాడిని ఖండిస్తూ మంగళవారం ములుగు కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. దాడిని నిరసిస్తూ విధులకు హాజరుకాలేదు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వేణుగోపాలచారి, వినయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సారంగపాణి, సుధాకర్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.అటవీశాఖ భూమిలో పండ్లమొక్కల పెంపకంఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి అటవీశాఖ భూమిలో అధికారుల ఆదేశాల మేరకు పండ్ల మొక్కలను నాటించామని ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఎఫ్ఆర్ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అటవీ శాఖ ఆదీనంలో ఉన్న భూమిలో పండ్ల మొక్కలను నాటి అర్హులైన రైతులకు ఫలసాయం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీశాఖ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడమే తమ బాధ్యతనన్నారు.కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలిఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఇంటింటికీ వివరించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రతీ గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గెలిపించి కేసీఆర్, కేటీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు.సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలిచిట్యాల: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లేష్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపూర్‌తండాలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మినా, కొత్త వ్యక్తులు కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. డయల్ 100, షీ టీమ్స్, సీసీ టీవీ కెమెరాలపై అవగాహన కల్పించారు. అనంతరం నాలుగు బృందాలుగా ఏర్పడి 110 ఇళ్లను తనిఖీ చేయగా ఎనమిది వాహనాలకు సరైనా ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. 350 లీటర్ల గుడంబా పానకం ధ్వంసం చేశారు. పది లీటర్ల గుడుంబాను సీజ్‌చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
డైలీవేజ్ కార్మికుల వంటావార్పు
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో డైలీవైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రంలో చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరింది. మంగళవారం మండల కేంద్రంలో సమ్మె శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ నాయకుడు దావూద్ మాట్లాడుతూ డైలీవేజ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పనిలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, భాగ్యలక్ష్మీ, జయలక్ష్మీ, సత్యం, ఊకే సమ్మక్క, విజయలక్ష్మీ, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిరా, సుమలత, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫారెస్ట్ చెక్‌పోస్టు పునరుద్ధరణ
కాటారం: కాటారం మండలకేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్‌పోస్టును మంగళవారం నుంచి పునరుద్ధరించారు. కొంతకాలంగా చెక్‌పోస్టు నిర్వహణలో లేకపోవడంతో అక్రమ కలప రవాణా, ఇతరత్రా అసాంఘీక కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చాయి. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు చెక్‌పోస్టు నిర్వహణపై దృష్టిసారించి తిరిగి ప్రారంభించారు. కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్‌రెడ్డి చెక్‌పోస్టును ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టు ద్వారా ఇసుక లారీల నుంచి సెస్ ఫీజు వసూలు చేయనున్నట్లు సీసీఎఫ్ తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ సందీప్, మహదేవపూర్ రేంజర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాంకులో బుస్..బుస్
మంగపేట: మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంకులో పాము కలకలం సృష్టించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంకు సిబ్బంది రోజు వారీగా ఉదయం 10 గంటలకు విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగి బాలరాజు ఓచర్లు తీస్తున్న క్రమంలో పక్కనే పాము (జర్రిపోతు) కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. విషయాన్ని సిబ్బందికి చెప్పి అందరూ బ్యాంకు నుంచి బయటకు వచ్చారు. బ్యాంకు పనిపై వచ్చిన వారిని లోపలికి వెళ్లకుండా తలుపులు వేసి మేనేజర్‌కు స మాచారం ఇచ్చారు. ఆయన వెంటనే గ్రామానికి చెందిన యాకూబ్ పాషా (పాములపాష)కు సమాచారం అందించగా.. పాషా వచ్చి పామును పట్టి బయట వదిలేశాడు. దీంతో సిబ్బంది, వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో గంట పాటు బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. -
బీఆర్ఎస్ అంటేనే బోగస్
ములుగు: బీఆర్ఎస్ అంటేనే బోగస్ రాష్ట్ర సమితి అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి అప్పుల తెలంగాణగా మార్చాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే ఇచ్చిన హామీలను నేరవేర్చి ప్రజాప్రభుత్వంగా కొనసాగుతుందన్నారు. అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇస్సార్ ఖాన్, మారం సుమన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, నాయకులు నల్లెల్ల భరత్‌కుమార్, ఓరుగంటి అనిల్, నాగమణి, శంకరాచారి, రఘు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే..!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్‌లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్‌లోడ్ అధికంగా ఉంది. ఇందుకనుగుణంగా పార్ట్‌టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్‌గా నియామకాలు చేపట్టారు. పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్‌లోడ్‌కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలకమండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైనవారిని నియమనిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లనుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండటంతో పాటుగా పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం. ప్రహరీ నిర్మాణానికి ఓకే. కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్లూ ఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలకమండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేష్‌లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు రూ.20కోట్లతో ప్రహరీ నిర్మాణం కేయూ పాలకమండలి సమావేశంలో ఆమోదం -
పోడు భూముల్లో తుమ్మ మొక్కలు నాటొద్దు
ఏటూరునాగారం: అటవీశాఖ అధికారులు పోడు భూముల్లో తుమ్మ మొక్కలు నాటొద్దని.. పండ్ల మొక్కలు మాత్రమే నాటాలని రైతులు ఆందోళన దిగారు. ఈ ఘటన మండల పరిధిలోని చిన్నబోయినపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నబోయినపల్లిలోని పోడు భూముల్లో అధికారులు తుమ్మ మొక్కలు నాటే పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో గతంలో ఆ భూములను సాగుచేసిన రైతులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానాకి దిగారు. పండ్ల మొక్కలను మాత్రమే నాటాలని డిమాండ్ చేస్తూ 163వ జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు వడ్కాపురం సారయ్య, గంట కృష్ణారెడ్డి, చిట్టిపోతుల వినోదలు మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు తమను సాగుచేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమతో అధికారులు పండ్ల మొక్కలను నాటుతామని చెప్పి తుమ్మ మొక్కలను నాటడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం, పాలకులు తమకు న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న ట్రైయినీ ఎస్సై రుచిత్ర సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ విషయంపై అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్‌ను వివరణ కోరగా ఆ భూమిలో వెదురు సాగు చేయగా కొంత మంది రైతులు దున్ని వేశారని తెలిపారు. ఆ రైతులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుందని, మొక్కలను నాటేందుకు వెళ్తుండగా తమను అడ్డుకున్నారని ఎఫ్ఆర్ఓ తెలిపారు. తాము నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం 163వ జాతీయ రహదారిపై రైతుల ఆందోళన -
దుర్గామాత ఆలయం ప్రారంభం
ములుగు రూరల్: మల్లంపల్లి మండల పరిధిలోని రాంచంద్రాపురంలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభోత్సవానికి సైతం హాజరు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు హట్కర్ స్వామి, సాంబయ్య, రాజిరెడ్డి, భూక్య రాజునాయక్, ప్రతాప్‌రెడ్డి, అమృతమ్మ తదితరులు పాల్గొన్నారు.హుండీ ఆదాయం రూ.71,902భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.71,902 వచ్చినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం ఎండోమెంట్ రెవెన్యూ డివిజన్ ఇన్స్పెక్టర్ నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాధాకృష్ణ, మురళీకృష్ణ, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
ములుగు రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం ములుగు మండల పరిధిలోని జాకారం, మల్లంపల్లి మండల కేంద్రంలోని ఆయూష్ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 100 శాతం ప్రసవాలు జరిగే విధంగా చూడాలన్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు, టీబీ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రవన్‌కుమార్, రాజన్న, మంజుల, సుజాత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు -
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
ములుగు రూరల్: ఎంపీటీసీ. జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపారు. జిల్లా కేంద్రంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతీ మండలంలో మూడు లేదా నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారితో పాటు ప్రతీ మండలంలో జెడ్పీటీసీ స్థానానికి సైతం అధికారిని కేటాయించినట్లు తెలిపారు. అధికారులు హ్యాండ్‌బుక్‌లోని అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నామినేషన్ పేపర్లను స్వీకరించి పేర్లను నోటీసు బోర్డులో ప్రచురించాలని సూచించారు. అభ్యర్థులు ఉపసంహరణ ప్రతులను స్వీకరించాలని ఆదేశించారు. నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తెలపాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ పోలింగ్ కేంద్రాలు ఉపయోగించే ముద్రణలు పరిశీలించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
తొలి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద 8 పాఠశాలల ఎంపిక
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు పలు పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులు లేకపోవడంతో ఆర్థిక భారం అయినప్పటికీ తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే నూతన ఆలోచనతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. దీంతో ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కానున్నాయి. మూడేళ్లు పైబడిన చిన్నారులకు ఆటపాటలతో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టనున్నారు. ఇన్స్ట్రక్టర్లు, ఆయాల ఎంపిక విధానం ఇలా.. ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు నూతనంగా ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను ఎంపిక చేయనున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించి విధివిధానాల మేరకు అర్హతలను పరిశీలించి ఎంపిక చేయనున్నారు. ఇన్స్ట్రక్టర్లకు విద్యార్హత ఇంటర్మీడియట్, ఆయాలకు 7వ తరగతి అర్హత కలిగి ఉండాలి. 18– 44 మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులు. ప్రీ ప్రైమరీకి ఎంపికై న పాఠశాలలకు సంబంధించిన గ్రామంలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయాలకు రూ. 6వేలు, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు వేతనం అందించనున్నారు. ఎంపికై న పాఠశాలలకు రూ.1.20 లక్షల రంగులు, పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయించారు. ఇన్స్ట్రక్టర్, ఆయాల ఎంపికను ఎంపీడీఓ చైర్మన్‌గా, మండల వి ద్యాశాఖ అధికారి కన్వీనర్, పంచాయతీ కార్యదర్శి కమిటీ మెంబర్‌గా ఉండి నిర్ణయిస్తారు. ఎంపిక చేసి న దరఖాస్తులను కలెక్టర్‌కు సమర్పించనున్నారు. జిల్లాలో ఎంపికై న పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం. ఇన్స్ట్రక్టర్, ఆయాల నియామకాలను ఎంపికై న మండలాల్లోని ఎంఈఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు విడుదల చేశాం. అక్టోబర్ నెల ఆఖరు వరకు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తాం. ఎంపికై న పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి తగినట్లు రంగులు, పరికరాలు కొనుగోలు చేపడుతాం. – సిద్ధార్థరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిజిల్లాలోని 10 మండలాల్లో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు 8 పాఠశాలలను అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో మల్లంపల్లి మండల పరిధిలోని మాన్సింగ్తండా, గోవిందరావుపేటలోని ఎంపీపీఎస్ చల్వాయి పాఠశాల, ఎంపీపీఎస్ దుంపిల్లగూడెం పాఠశాల, మంగపేట మండలంలోని ఎంపీపీఎస్ మంగపేట, ఎంపీపీఎస్ తిమ్మంపేట, ఎంపీయూపీఎస్ దోమెడ, ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని ఎంపీపీఎస్ కాటాపూర్, వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఎంపీయూపీఎస్ ఎదిర పాఠశాలలు ఉన్నాయి. ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు కసరత్తు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి చర్యలు మూడేళ్లు పైబడిన పిల్లలకు అడ్మిషన్లు -
ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలి
● డీఆర్డీఓ శ్రీనివాసరావు కన్నాయిగూడెం: ఉపాధి కూలీలకు ఆధార్ ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలని డీఆర్డీఓ శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండల పరిధిలోని బుట్టాయిగూడెం, ఏటూరు, చింతగూడెంలో కొనసాగుతున్న ఈ కేవైసీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. వాటిల్లో వచ్చే సాంకేతిక సమస్యలు వీఏ, టీఏలకు వివరించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ కూలీకి ఫేస్ స్క్రీనింగ్ చేయించాలని సూచించారు. దీంతో ఉపాధి పనుల్లో అవకతవకలు జరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపారు. ఉపాధి పనికి వెళ్తే హాజరు నమోదు అవుతుందని వెల్లడించారు. లేని పక్షంలో హాజరు నమోదు కాదని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ కృపాకర్, కన్నాయిగూడెం ఏపీఓ సురేష్, టీఏ కోటేశ్, ఫీల్డ్ అసిస్టెంట్ సునార్కని నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సఖితో భరోసా
ములుగు రూరల్: మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ సమాజంలో పలు రకాల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, బాల్య వివాహాల నివారణకు తక్షణ సహాయం కోసం ప్రభుత్వం సఖి(వన్‌స్టాప్ సెంటర్) కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లాలో పలు రకాల వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం అండగా నిలుస్తోంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సఖి కేంద్రం అందించే సేవలపై సిబ్బంది చైతన్య పరుస్తున్నారు. ఉచిత న్యాయ సహాయం జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రం ఆధ్వర్యంలో 10 మండలాల నుంచి వచ్చే బాధిత మహిళలు, యువతులకు అందించే పోలీస్, న్యాయ సహాయం, వసతి, ఫిర్యాదు విధానాలు, చేకూరే న్యాయంపై సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేధింపులకు గురైన మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి కౌన్సెలింగ్‌తో పాటు సమస్యల పరిష్కారానికి పోలీస్, ఉచిత న్యాయ సహాయం అందించి బాధిత మహిళలకు అండగా ఉంటున్నారు. ఐదు రోజుల పాటు రక్షణ బాధిత మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే సఖి కేంద్రం సిబ్బంది వారికి ఐదు రోజుల పాటు భోజనం, వసతితో పాటు వైద్యం, పోలీస్, ఉచిత న్యాయం, ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తి స్థాయి రక్షణ కూడా కల్పిస్తారు. బాధితులు రక్షణాధికారికి, జిల్లా సంక్షేమాధికారికి, పోలీస్‌స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస, లైంగిక, వరకట్న వేధింపులు, మహిళల అక్రమ రవాణా, ఆడపిల్లల అమ్మకం వంటి వాటిపై హెల్ప్‌లైన్ నంబర్ 181ను ఆశ్రయించవచ్చు. సఖి కేంద్రం ఆధ్వర్యంలో.. ఈ ఐదేళ్ల కాలంలో సఖి కేంద్రం సిబ్బంది ఇప్పటి వరకు సోషల్ కౌన్సెలింగ్ 1,426 మందికి ఇచ్చారు. అలాగే లీగల్ కౌన్సెలింగ్ 846 మందికి ఇవ్వగా వైద్య సదుపాయం 922 మందికి కల్పించారు. పోలీస్ సపోర్టు 148, వసతి పొందిన వారు 497 మంది మహిళలు ఉన్నారు. అలాగే పిల్లల సంరక్షణ 225 మందికి కల్పించగా, పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు 895 మందికి కల్పించారు. సదరం హోంకు 21 మందిని తరలించి సేవలు అందించారు. ఆపదలో అండగా ఉంటాం.. మహిళలకు, బాలికలకు ఆపద సమయంలో సఖీ కేంద్రం అండగా నిలుస్తోంది. సహాయం కోరిన మహిళలకు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. బాధిత మహిళలకు వైద్యం, పోలీస్, ఉచిత న్యాయం, భోజనం అందించడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తాం. ఆపద సమయంలో 181 హెల్ప్‌లైన్ నంబర్ లేదా 08715 2951281, 7013745008లలో సంప్రదించాలి. జిల్లాలో 2020– 25వరకు నమోదైన కేసుల వివరాలు బాధిత మహిళలకు అండగా వన్‌స్టాప్ సెంటర్ వసతి, రక్షణ కల్పిస్తూ న్యాయం చేస్తున్న సిబ్బంది గ్రామాల్లో పలు చైతన్య కార్యక్రమాలుకేసు అందిన పరిష్కరించినవి పెండింగ్‌లో ఫిర్యాదులు ఉన్నవిగృహహింస 615 529 86 వరకట్నం 8 8 0 బాలికలపై లైంగిక దాడులు 44 39 5 బాల్య వివాహాలు 39 36 3 మిస్సింగ్ 43 42 1 చీటింగ్ 35 34 1 ప్రేమించి మోసం 63 61 2 మహిళలపై లైంగిక దాడులు 1 1 0 సీనియర్ సిటిజన్ 2 2 0 ఆస్తి తగాదాలు 15 15 0 ఇతర కేసులు 40 37 3 -
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతిములుగు/ములుగు రూరల్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మోసపూరిత గ్యారంటీలను వివరిస్తూ ఎండగట్టాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్న అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకవెళ్లడానికి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీకార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రతీ కార్యకర్త బాకీ కార్డును ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోరిక గోవింద్‌నాయక్, సకినాల భవాని, అజ్మీర ధరంసింగ్, చెన్న విజయ్, కోగిల మహేష్, పోరిక విజయ్‌రాంనాయక్, దేవరనేని స్వామిరావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మల్లంపల్లి మండల కేంద్రంతో పాటు ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని ఇందిరానగర్‌లో ఏర్పాటు చేసిన కారకర్తల సమావేశాలకు నాగజ్యోతి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ బాకీకార్డులను విడుదల చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని నాగజ్యోతి సూచించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు పాలెపు శ్రీనివాస్, పోరిక గోవింద్‌నాయక్, విజయరాంనాయక్, మహేష్, జంపన్న, విష్ణువర్ధన్, రాములు, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, మేడారం జాతర మాజీ చైర్మన్ రేగా నర్సయ్య, మాజీ ఎంపీటీసీలు ముండ్రాతి రాజమౌళి, దానక నర్సింగరావు, మాజీ సర్పంచులు ఊకే మోహన్ రావు, నాగేశ్వరరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు వచ్చేశాయి..
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన తాడిచర్ల–భూపాలపల్లి రహదారి నిర్మాణానికి అటవీశాఖ నుంచి ఫేజ్–2 అనుమతులు రావడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండటంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాటారం మీదుగా భూపాలపల్లి.. మండల కేంద్రం తాడిచర్ల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. తమ ప్రాంతం నుంచి పెద్దతూండ్ల మీదుగా అటవీ ప్రాంతం గుండా రహదారి నిర్మిస్తే ఎంతో సమయంతో పాటు ఎన్నో రకాల ప్రఝెజనాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లే వారు కూడా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. ఏడాది క్రితం తాడిచర్ల–ఖమ్మంపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై వంతెన అందుబాటులోకి రావడంతో దూరభారం తగ్గింది. -
కోటిన్నర ప్రాపర్టీ పట్టు!
కాళేశ్వరం: ఐదు వేల ఒక రూపాయితో కూపన్ కొనుగోలు చేసి.. లక్కీడ్రాలో మొదటి బహుమతి వరిస్తే కోటిన్నర ప్రాపర్టీ సొంతం చేసుకొనే అదృష్టం లభిస్తుందని వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు వైరల్ అవుతున్నాయి. మొన్నీమధ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద 66 గజాల ప్లాటుకు రూ.500 కూపన్ పెట్టి విక్రయాలు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారింది. అది మరువక ముందే మళ్లీ కాళేశ్వరంలో అలాంటి ప్రాపర్టీ విక్రయ సేల్కు భవన యజమాని కొత్తగా ఆలోచన చేశాడు. కాళేశ్వరంలోని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌ను యజమాని శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల విక్రయానికి పెట్టాడు. కానీ సరైన ధర, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లక్కీడ్రాను ఏర్పాటు చేసి అందరూ కూపన్లు కొనేలా ప్లాన్ చేస్తున్నాడు. రూ.5,001తో లక్కీ డ్రా కూపన్ తీసుకొని కోటిన్నర విలువగల ప్రాపర్టీని పట్టు అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. మొత్తం లక్కీ డ్రా కూపన్లు 2,500 వరకు విక్రయించడానికి సిద్ధమయ్యాడు. మొదటి బహుమతి కోటిన్నర ప్రాపర్టీ, రెండవ బహుమతి రెండు తులాల బంగారం, మూడో బహుమతి కిలో వెండి అందజేస్తామని కూపన్లలో పేర్కొంటున్నాడు. ఈ లక్కీ డ్రా జనవరి 14న డ్రా తీయనున్నారు. దీంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూ పన్లు తీసుకోవడానికి ఆరా తీస్తున్నారు. ఇతర ప్రాంతాల వారు కూడా విషయం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాతో పాటు మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై పోలీసులు, నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కూపన్ కొనుగోలుకు ఉవ్విళ్లూరుతున్న జనం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వైనం జిల్లా పోలీసులు, నిఘావర్గాల ఆరా! -
డీఎస్పీ నవీన్‌కు ఘన సన్మానం
వెంకటాపురం(ఎం): మండల కేంద్రానికి చెందిన దానం నవీన్ ఇటీవల వెల్లడించిన గ్రూప్–1లో ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ మేరకు అదివారం మండల కేంద్రంలో నవీన్‌ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన నవీన్ కలెక్టర్ కావాలనే లక్ష్యంతో తన మేనమామ సమ్మయ్య సహకారంతో చదివి డీఎస్పీగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ నవీన్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్, నాయకులు రాజు, రాజేష్, వెంకటేశ్, తిరుపతి, సమ్మయ్య పాల్గొన్నారు. -
‘కార్యకర్తలు దేశానికి సేవ చేయాలి’
ఏటూరునాగారం: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు దేశానికి సేవ చేయాలని మూడు రాష్ట్రాల గోరక్ష ప్రముఖ్ ఆకుతోట రామారావు తెలిపారు. మండల కేంద్రంలో వై జంక్షన్ నుంచి రామాలయం వరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీ(రూట్‌మార్చ్) పథ సంచాలన కార్యక్రమాన్ని ఆది వారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ దసరా ఉత్సవాల నుంచి మళ్లీ వచ్చే దసరా ఉత్సవాలకు శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు అయిందని తెలిపారు. అందుకోసం ప్రతీ గడపకు ఆర్ఎస్ఎస్ నిబంధనలను తీసుకెళ్లాలన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశశ రక్షణ, భారతమాత కోసం పనిచేయాలన్నారు. నీతి, నిజాయతీగా ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, సమ్మయ్య, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. 13న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్లో ఈనెల 13న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు డీఎస్ఓ అప్పని జయదేవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శ్రీమానవ జాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతికతశ్రీ అనే ఆంశంపై ఫెస్టివల్ నిర్వహంచనున్నట్లు వెల్లడించారు. ఇందులో విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, అందరికీ పరిశుభ్రత, హరిత సాంకేతికతలు అనే ఉప అంశాలు ఉంటాయని వివరించారు. ప్రజెంటేషన్ ఆఫ్ ది డ్రామాకు 50 మార్కులు, సైంటిఫిక్ కంటెంట్ ఆఫ్ ది డ్రామాకు 30 మార్కులు, ఎఫెక్ట్ వెన్సెస్ ఆఫ్ ది డ్రామాకు 20 మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి డ్రామా ప్రోగ్రాం 30 నిమిషాలకు మించరాదని తెలిపారు. ప్రతీ టీంలో డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు 10 మందికి మించి ఎక్కువగా ఉండరాదని వెల్లడించారు. జిల్లా స్థాయి డ్రామా ఫెస్టివల్లో పాల్గోనే విద్యార్థులు ఈ నెల 11వ తేదీలోపు జిల్లా సైన్స్ అధికారి దగ్గర వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. గిరిజన దర్బార్ రద్దు ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఐటీడీఏలో ప్రతీ సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్‌ను రద్దు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన దర్బార్‌ను ఎన్నికల కోడ్ ముగిసే వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. గిరిజనులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. శాంతి స్తూపానికి ఎరుపు రంగు ములుగు రూరల్: ములుగు జిల్లాకేంద్రంలో శాంతి స్తూపానికి గుర్తు తెలియని వ్యక్తులు ఎరుపు రంగు వేశారు. 2004లో సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో మావోయిస్టుల అమరవీరుల స్తూపం నిర్మించి ఎరుపు రంగు వేయడంతో పాటు సుత్తె కొడవలి గుర్తును ఏర్పాటు చేశారు. కొంతకాలం తర్వాత ఆ స్తూపానికి తెలుపు రంగు వేసి శాంతి స్తూపంగా పేరును మార్చారు. అప్పటి నుంచి తెలుపు రంగులో దర్శనమిచ్చిన స్తూపం సగం వరకు ఎరుపు రంగుతో ఆదివారం దర్శమిచ్చింది. జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపానికి ఎరుపు రంగు ఎవరు వేశారనే దానిపై చర్చ సాగుతోంది. కారు బోల్తా చిట్యాల: భూపాలపల్లి నుంచి మొగుళ్లపల్లి వెళ్తుండగా అదుపుతప్పి కారు బోల్లా పడిన ఘటన మండలకేంద్రంలోని క్రోసూరుపల్లి గ్రామశివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ కురిమిళ్ల మహేష్ పని నిమిత్తం భూపాలపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. క్రోసూరుపల్లి గ్రామశివారులో గల ప్రధాన రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు. -
స్పాట్ సెల్లింగ్
హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కా పాస్ కిసాన్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్‌పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ‘కా పాస్ కిసాన్’ యాప్‌ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జండర్, పుట్టిన తేదీ, కులం. చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్‌లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్‌బుక్, రైతు ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేయాలి. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కా పాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్‌ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ప్రత్యేక యాప్‌ను రూపొందించిన సీసీఐ ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్‌పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగుజిల్లా విస్తీర్ణం (ఎకరాలు) వరంగల్ 1,18,547 హనుమకొండ 74,849 మహబూబాబాద్ 85,480 ములుగు 20,593 భూపాలపల్లి 98,260 జనగామ 1,26,119పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్‌లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కా పాస్ కిసాన్’ యాప్‌లో రైతు పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. -
వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. -
– ఎస్‌ఎస్‌తాడ్వాయి
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్‌ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో గల మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
వ్యూహాలకు పదును..
‘స్థానిక’ ఎన్నికలకు పావులు కదుపుతున్న అగ్రనేతలుసాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లా ప్రజాపరిషత్లతో పాటు ఎంపీపీలు, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గస్థాయి సమావేశాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆదివారం నుంచి కార్యాచరణ అమలు చేయనుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్‌తో సంప్రదింపులు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కమిటీ సందేశం పంపింది. ఇక వామపక్షాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు జిల్లా కమిటీ అధ్యక్షులు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఆదివారంనుంచి నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారినుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానంనుంచి నాలుగు నుంచి ఐదు పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదించనున్నారు. స్థానిక అభ్యర్థులకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజాదరణ, కార్యకర్తల మద్దతు ప్రాధాన్యాంశాలు కానున్నాయని, అభ్యర్థుల ఎంపిక అధిష్టానం సూచనల మేరకు పారదర్శకంగా ఉంటుందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలు కీలకమైనందున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం జిల్లా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ముందుగానే నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు జెడ్పీలపై గురి... కాంగ్రెస్, బీఆర్ఎస్... ఈ రెండు పార్టీలు ఆరు జిల్లా ప్రజాపరిషత్ స్థానాలపై గురిపెట్టాయి. బీజేపీ సైతం గట్టీ పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈసారి హనుమకొండ జెడ్పీ ఎస్సీ మహిళ, వరంగల్ ఎస్టీ జనరల్, ములుగు ఎస్టీ మహిళ, జనగామ ఎస్సీ మహిళ, మహబూబాబాద్ జనరల్, భూపాలపల్లి బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. వాస్తవానికి హనుమకొండ, వరంగల్, జనగామలు జనరల్‌కు వస్తాయని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్లు ఉండటంతో ఆశావహుల అంచనాలు దెబ్బతినగా.. ఈ ఆరింటిని ఎలా కై వసం చేసుకోవాలి? అన్న వ్యూహంలో ప్రధాన పార్టీల నాయకత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 75 జెడ్పీటీసీ స్థానాలు.. 75 ఎంపీపీ పదవులను దక్కించుకోవడం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 778 ఎంపీటీసీలు, 1,705 సర్పంచ్ పోస్టులకు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. కాగా ఈ నెల 8న రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ, తీర్పు ఉండగా.. ఆ మరుసటి రోజైన 9వ తేదీనుంచి మొదటి విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికలో ప్రధాన పార్టీలు పావులు కదుపుతుండగా.. పల్లెల్లో ‘స్థానిక’ ఎన్నికల సందడి రోజు రోజుకూ జోరందుకుంటోంది. ప్రధాన రాజకీయపార్టీల్లో సాగుతున్న కసరత్తు ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత నేటినుంచి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు బీఆర్ఎస్, బీజేపీలోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు గెలుపు గుర్రాల వేటలో మూడు ప్రధాన పార్టీలు.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ -
ఆలయ నిర్మాణ పనులు షురూ..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించారు. శనివారం సమ్మక్క– సారలమ్మ గద్దెల చుట్టూ ప్రహరీ(సాలహారం) నిర్మాణ పనులను చేపట్టేందుకు చెట్లను, పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించి శుభ్రం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రహరీని అలాగే ఉంచి నూతనంగా నిర్మించిన అనంతరం పాత ప్రహరీని తొలగించనున్నారు. రాతితో ప్రహరీ నిర్మాణం పనులు మొదలు కానున్నాయి. రేపటి ప్రజావాణి రద్దు ములుగు రూరల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రేపు(సోమవారం) నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని వివరించారు. అర్జిదారులు ఈ విషయం గమనించాలని వెల్లడించారు. ప్రజలు సహకరించాలని కోరారు. భారీ వర్షం వాజేడు: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారుగా రెండు గంటల పాటు వర్షం పడింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. తుపాను ప్రభావంతో ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. పొట్ట దశలో ఉన్న వరి పంటలకు ఈ వర్షం బాగా ఉపయోగ పడుతుందని రైతులు తెలిపారు. వర్షం పడిన సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి ఎస్‌ఎస్‌తాడ్వాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బీరెల్లి, నర్సాపూర్, కాటాపూర్ ఎంపీటీసీ క్లస్టర్ పరిధిలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి సీతక్క జిల్లాలో వందల కోట్ల నిధులతో సీసీ రోడ్లు, రహదారులు, బ్రిడ్జి నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేదల కల సాకారం చేసిన ఘనత మంత్రి సీతక్కకే దక్కుతుందన్నారు. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడి పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్‌గౌడ్, గౌరవ మండల అధ్యక్షుడు జాలపు అనంత రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఇప్ప నాగేశ్వర్రావు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎండీ.ముజఫర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మాజీ సర్పంచులు మంకిడి నరసింహస్వామి, ఇర్ప సునీల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడి సతీష్ సీనియర్ నాయకులు తిరుపతి, రామస్వామి పాల్గొన్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి హన్మకొండ: ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఉప్పల్‌లో వరంగల్ రీజియన్ బస్సులు నిలిచే బస్ పాయింట్‌ను శనివారం ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వెంకన్న, చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్, వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభానుతో కలిసి ఎండీ వై.నాగిరెడ్డి సందర్శించారు. ప్రయాణికులు కూర్చోవడానికి స్థలం, బస్సులు నిలుపు స్థలం, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. వీటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ ఏటూరునాగారం: డైలీవేజ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐటీడీఏ ఎదుట 23 రోజులుగా సమ్మె చేస్తున్న వర్కర్లకు ఆయన శనివారం సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. దసరా సెలవులకు ముందు అనేక హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులతో వంటలు చేయించారని తెలిపారు. అదే మళ్లీ కొనసాగితే పిల్లలతో పాటు వారి కుటుంబ సభ్యులను సమీకరించడంతో పాటు సీఐటీయూ, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల సభ్యులందరినీ సమీకరించి ఐటీడీఏ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎనిమిది నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వస్తున్న వేతనాలను తగ్గిస్తూ జీవో నంబర్ 64ను తీసుకురావడం దారుణమన్నారు. పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ టైం స్కేల్ అమలయ్యే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వర్కర్లు నాగలక్ష్మి, గొంది లక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, జి.సత్యం. ఊకే సమ్మక్క, కమల, విజయలక్ష్మి, రాజు పాల్గొన్నారు. -
వైభవంగా శోభాయాత్ర
● ముగిసిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఏటూరునాగారం: దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. దీంతో నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గాదేవి ప్రతిమలను మండపాల నిర్వహకులు శోభాయాత్రగా వైభవంగా గోదావరిలో నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లారు. శనివారం రామాలయంలోని దుర్గాదేవిని ప్రత్యేక రథంలో అలంకరించి కోలాటంతో అమ్మవారిని సాగనంపారు. అమ్మవారికి నీళ్లు ఆరబోస్తూ కొబ్బరికాయలను కొట్టారు. రామాలయంలో నూతనంగా రథాన్ని తయారు చేయించగా దాంట్లో అమ్మవారి ప్రతిమను పెట్టి తాళ్లతో భవాని మాలధారులు లాగుతూ తీసుకెళ్లారు. అదేవిధంగా స్టార్‌యూత్, శివాలయం, ముత్యాలమ్మ వీధి, క్రాస్‌రోడ్డు లోని అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా సాగనంపారు. డీజే పాటలతో నృత్యాలు చేశారు. శోభాయమానంగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రతిమలను ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. దీంతో దుర్గాదేవి నవరాత్రులు ప్రశాంతంగా ముగిసాయి. -
గాంధీ విగ్రహానికి కార్మికుల వినతి
● రోడ్డుపైన దసరా పండుగ చేసుకున్న డైలీ వైజ్ వర్కర్స్ ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా కార్మికులు .. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి బొడ్రాయి ప్రాంతంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలదండ వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ మాట్లాడుతూ.. గాంధీ అహింసా సిద్ధాంతం మేరకు శాంతియుతంగా 22రోజులుగా సమ్మె చేస్తూ నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని కోరారు. ఓ పక్క గత ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక కుటుంబం గడవక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వేతనాలను తగ్గిస్తూ జీఓ 64ను తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. అర్హులైన అందరికీ టైం స్కేల్ ప్రకారం అమలు అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చిటమట రమేష్, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, సత్యం, సమ్మక్క, కమల, విజయలక్ష్మి, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిర, సుమలత, సాంబయ్య, శివకృష్ణ, సత్యం పాల్గొన్నారు. -
14 ఏళ్లుగా ప్రత్యేకమే..!
ములుగు: క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క ములుగు: జమ్మి(శమీ)పూజలో పాల్గొన్న ప్రజలుమంగపేట: గిరిజనులు.. గిరిజనేతరుల నడుమ మొదలైన పంచాయతీ.. మంగపేట మండల అభివృద్ధికి అంతరాయంగా మారింది. 14 ఏళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజాసమస్యలను పట్టించుకునేవారు లేకుండాపోయారు. మంగపేట మండలం ఏజెన్సీ పరిధిలోకి వస్తుందని ఆదివాసీ గిరిజనులు, కాదని గిరిజనేతరుల మధ్య నెలకొన్న వివాదం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో 2011 నుంచి సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే 2023 జూలై 05న మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్డు ఏరియా పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు వెలురించారు. ఈమేరకు రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు మండలంలో కూడా ఎన్నికలు జరుగుతాయని ప్రజలు భావించారు. కానీ, హైకోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో మండలంలో మళ్లీ ఎన్నికలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం అవినీతిమయం మండలంలో సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోవడంతో 25 గ్రామ పంచాయతీల పరిపాలన 14 ఏళ్లుగా ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఆయా పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి పాల్పడిన అధికారులు సస్పెండ్ అయినా.. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండతో.. అవినీతికి పాల్పడిన సొమ్మును తిరిగి చెల్లించకుండానే విధుల్లోకి చేరడం మండలంలో పరిపాటిగా మారింది. గడిచిన 14 ఏళ్ల ప్రత్యేకధికారుల పాలనలో కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట తదితర పంచాయతీల కార్యదర్శులు మొదలుకుని కొందరు మండల స్థాయి అధికారులు రూ.3 కోట్లకు పైగా పంచాయతీ నిధులను కాజేశారు. మరో రూ.4 కోట్లకు పైగా పనులు చేయకుండానే చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి కాజేసినట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీటీసీ ఎన్నికలు యథాతథం మండంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయినా జెడ్పీటీసీ ఎన్నిలు యథాతథంగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నవంబర్‌లో జరుగనున్న జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మండంలో కూడా ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈనెల 10న జెడ్పీటీసీ స్థానాలకు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను నిర్ణయించగా.. మంగపేట జెడ్పీటీసీ స్థానం జనరల్(మహిళ)కు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. అసలే ప్రజా ప్రతినిధులు లేక ప్రజాసమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని.. కనీసం జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా సమస్యలను ప్రభుత్వం, కలెక్టర్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. సుప్రీం పరిధిలో ఉన్న గిరిజన, గిరిజనేతరుల పంచాయతీ త్వరగా పరిష్కారమై పంచాయతీ ఎన్నికలు జరిగితేనే తమ సమస్యలు తీరుతాయని, అభివృద్ధి జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. మంగపేటలో మళ్లీ ఎన్నికలు ఎప్పుడో..? ఏళ్ల తరబడి స్థానిక ఎన్నికలు నిర్వహించని వైనం హైకోర్టు తీర్పుతో ప్రజల్లో ఆశలు సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అసహనం కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం కుంటుపడుతున్న మండల అభివృద్ధి సమస్యలతో ప్రజల సతమతం మండంలోని 25 గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేకపోవడం, పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన నిధులు దుర్వినియోగం కావడంతో మండలంలోని గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా తయారైంది. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, కనీసం తమకు జీతాలే రావడం లేదని పంచాయతీ కార్యదర్శులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. అదనపు బాధ్యతలు తమకు భారంగా మారాయనే కారణంతో ప్రత్యేకాధికారులు.. పంచాయతీలను పట్టించుకోకపోవడం గమనార్హం. -
సనాతన ధర్మమే శాశ్వతం
● మూలాలు మర్చిపోతే భవిష్యత్ ఉండదు ● ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భగవద్గీత ప్రచారకుడు రాధా మనోహర్‌దాస్ స్వామీజీ ములుగు: భారతీయ మూలాలను మర్చిపోతే భవిష్యత్ ఉండదని, యుగాలు మారినా సనాతన ధర్మమే శాశ్వతమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకుడు శ్రీరాధా మనోహర్‌దాస్ స్వామీజీ అన్నారు. జిల్లా కేంద్రంలో విజయదశమిని పురస్కరించుకొని ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా హాజరైన రాధామనోహర్ స్వామీజీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం, తప్పుపై ఒప్పు విజయం సాధించిందన్నారు. సనాతన ధర్మంలో అందరూ బాగుండాలని కోరుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ, విజయదశమి లాంటి పండుగలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయన్నారు. దేశం కోసం, ధర్మం కోసం యువత పాటుపడాలని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేవారిని వదిలేదిలేదన్నారు. ప్రతీ ఒక్కరూ శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్మాత్మిక, సామాజిక, రాజకీయ ఎదుగుదల సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో దసరా సందర్భంగా నిర్వహించిన రావణాసురవధ ఆకట్టుకుందని, పండుగపూట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాదిమంది కుటుంబాలను ఒకేచోట చేర్చి పండుగ జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మంచి కోసం చేసే ప్రతీ పనిలో తాను పాలుపంచుకుంటానని వెల్లడించారు. అనంతరం శ్రీ రాధామనోహర్ దాస్ స్వామీజీ, సీనియర్ సివిల్ జడ్జితోపాటు పలువురు ప్రముఖులు రావణసుర ప్రతిబకు నిప్పంటించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకర్షించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కన్నోజు సునీల్, చెలుమల్ల రాజేందర్, సుంకరి రవీందర్, గంగిశెట్టి శ్రీనివాస్, పెట్టెం రాజు, ఇమ్మడి రమేష్, వాంకుడోతు జ్యోతి, కర్ర రాజేందర్ రెడ్డి, కొత్తపల్లి బాబురావు, కొమరవెళ్లి హరినాథ్, గండ్రకోట రవీందర్, సానికొమ్ము వినీత్ రెడ్డి, తోకల నందన్, పెట్టెం రాజేందర్, ఎలగందుల మోహన్, రుద్రోజు ఆనందాచారి, రాము, సిరికొండ వెంకన్న, నల్లా దిలీప్, గౌతం, ఏర్ల వెంకన్న, బానోతు సందీప్, కొండి రవీందర్, బద్ధం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యే యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రైతులకు రెండు రూ.లక్షల రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేద కుటుంబాలకు 200 యూని ట్లు ఉచిత కరెంట్, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి అని కొని యాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలి
● జిల్లా అధ్యక్షుడు బలరాం ఎస్‌ఎస్‌తాడ్వాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మండల అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నరేంద్రమోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయాన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలను ప్రజలకు వివరిస్తూ మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి ఏటూరునాగారం: రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు వినుకొల్లా చక్రవర్తి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో బలరాం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మరోసారి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలని అన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకట్, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జవహర్ లాల్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి రామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు భర్తపురం నరేష్, జినుకల కృష్ణ్కార్రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జవహర్లాల్, నాయకులు మల్లెల రాంబాబు, జంగా హన్మంతరెడ్డి, సిద్దబోయిన సురేందర్, మాదరి శ్రీకాంత్, సలేందర్, చెంగల సుభాష్, భర్తపురం నరేష్, మహాలక్ష్మి, సత్యం, జనార్దన్, హరిబాబు, ఎల్లయ్య, సంపత్, రాజశేఖర్, శ్రీనువాస్, ప్రేమలత, జగన్ పాల్గొన్నారు. -
ప్రభుత్వం చొరవ చూపాలి
మండలంపై సుప్రీంకోర్టులో ఉన్న ఏజెన్సీ, నాన్ఏజెన్సీ పంచాయతీని త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. 14 ఏళ్లుగా ప్రజా సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. విద్య, వైద్యంతోపాటు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండల అభివృద్ధి కుంటుపడింది. త్వరగా సమస్య పరిష్కారమై ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు మేలుజరుగుతుంది. – తోట రమేష్, ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్, మంగపేట ప్రజలకు అన్యాయం జరుగుతోంది.. ప్రత్యేకాధికారుల పాలనలో అధికారులపై పర్యవేక్షణ లేకపోవడంతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి లేకుండాపోయింది. అన్నివర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంది. ప్రశ్నించే ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేకధికారులు తమను అడిగేవారు లేరనే ధీమాతో నిర్లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వివిధ శాఖల అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. – కబ్బాక శ్రావణ్‌కుమార్, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!
గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్‌చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు రూరల్: జిల్లాలో ఎంపీటీసీ. జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగపేట మండలంలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిపివేసినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడుతలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతలుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 9 మండలాలలో 146 పంచాయతీలు, 1,290 వార్డులు, 87 షెడ్యూల్డ్, 59 నాన్ షెడ్యూల్డ్ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,306 పోలింగ్ స్టేషన్లు, 217 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 10 జెడ్పీటీసీ స్థానాలకు 3 ఎస్టీ, 2 ఎస్సీ, 4 బీసీ, 1 జనరల్‌కు, అలాగే 69 ఎంపీటీసీ స్థానాలలో సైతం రిజర్వేషన్లు కేటాయించినట్లు వెల్లడించారు. జూలై 10 వరకు నమోదైన ఓట్లలో పురుషులు 1,10,838 మంది ఉండగా మహిళలు 1,18,299, ఇతరులు 22 మంది ఉన్నారన్నారు. షెడ్యూల్‌కు అనుకులంగా నామినేషన్, పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి వసతుల కల్పనపై దృష్టి సారిస్తారని, పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించనున్నట్లు వివరించారు. స్థానిక ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్ 18004257109కు ఫోన్ చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు సహకరించాలి స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, హోర్డింగ్‌లు, ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్‌ల్లో 48 గంటలో తొలగించాలని ఆదేశించారు. ఈ నెల 9న నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీఎస్పీ రవీందర్, డీపీఓ దేవరాజ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా కలెక్టర్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. కరపత్రాల ముద్రణలో నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఏ వ్యక్తి కూడా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు లేకుండా కరపత్రాలు ముద్రించకూడదని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ అమలు కలెక్టర్ టీఎస్.దివాకర -
ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని మూర్కులు రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల ప్రకారం పార్టీ కోసం కష్టపడ్డవారికి అవకాశాలు వస్తాయని పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, ఇస్సార్ఖాన్, నారాయణరెడ్డి, చాంద్ పాషా, సారయ్య, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
దసరాకు సర్వం సిద్ధం
ములుగు: జిల్లా వ్యాప్తంగా నేడు (గురువారం) విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా పండుగ సందర్భంగా ఉదయాన్నే పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. అదే విధంగా ఆయుధపూజ నిర్వహించుకోనున్నారు. రైతులు వ్యవసాయ పనిముట్లు, వాహనదారులు తమ వాహనాలకు, పోలీసులు ఆయుధాలకు ఇలా ఎవరికివారు తమ వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలకు పూజలు చేయనున్నారు. అనంతరం విజయదశమి రోజు శమీ దర్శనం కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పాల పిట్ట దర్శనం ప్రత్యేకం దసరా పండుగ రోజు సాయంత్రం పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం ఉన్నది. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాల పిట్టను చూస్తే పాపాలు, కర్రె పిట్టను చూస్తే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూస్తే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. ఇందుకోసం శమీపూజ అనంతరం కిలో మీటర్ల దూరం అటవీ ప్రాంతంలోకి పోయి పాలపిట్టను దర్శించుకుంటారు. ములుగులో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో.. జిల్లాకేంద్రంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రావణాసుర వధ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ఎస్పీ శబరీశ్లు, వక్త భగవధ్గీత ప్రచారకులు అభయ హిందూ ఫౌండేషన్ శ్రీ రాధమనోహర్దాస్ స్వామిజీ హాజరు కానున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ములుగులో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అదీ నేటికి కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
మహిషాసుర మర్దినిగా అమ్మవారు
ములుగు రూరల్/ఏటూరునాగారం: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మండపానికి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండపంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయి డెవలపర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని రామాలయంలోని అమ్మవారు భక్తులకు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వరశర్మ ప్రత్యేక పూజలు చేశారు. భవాని స్వాములు దుర్గామాత శరణుఘోష చెబుతూ పాటలు పాడారు. మహానైవేధ్యాన్ని సమర్పించారు. అలాగే స్టార్ యూత్, క్రాస్‌రోడ్డు, సాయిబాబా దేవాలయంలో కూడా అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజలు చేశారు. బలిహరణ కార్యక్రమం మండల కేంద్రంలోని రామాలయంలో బలిహరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్రావు శర్మ చేపట్టారు. భవాని స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు ఆలయం చుట్టూ అష్టదిక్కుల పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి గుమ్మడికాయలతో పూజలు చేశారు. అలాగే స్టార్‌యూత్ ఆధ్వర్యంలోని భవాని స్వాములు, అర్చకులు యల్లాప్రగడ రాధాకృష్ణశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి ర్యాలీగా దుర్గాదేవి మండపానికి తరలివెళ్లి పూజలు చేశారు. ఏటూరునాగారంలోని రామాలయంలో.. ములుగులో మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్‌రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
రామప్పలో ఇంగ్లండ్ దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఇంగ్లండ్‌కు చెందిన పర్యాటకుడు నికోలస్ సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ శిల్పకళ విశిష్టతను గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం నికోలస్ లక్ష్మీదేవిపేటలో దసరా క్రీడల్లో భాగంగా కబడ్డీ పోటీలను వీక్షించారు. అమరావతి విద్యాలయం మైదానంలో జరిగిన ఫైనల్ పోటీల్లో పట్వారిపల్లి, నర్సింగాపూర్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో లక్ష్మీపురం ప్రథమ బహుమతి, నర్సింగాపూర్ ద్వితీయ బహుమతి, బూర్గుపేట తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. కబడ్డీ పోటీలు అద్భుతంగా జరిగాయని, క్రీడాకారులు బాగా రాణించారని నికోలస్ ప్రశసించారు. నర్సింగాపూర్‌కు చెందిన తన మిత్రుడి ఇంటికి వచ్చిన సందర్భంలో నికోలస్‌తో పలువురు గ్రామస్తులు, క్రీడాకారులు ఫొటోలు దిగారు. నీటిమునిగిన పంటల పరిశీలన కన్నాయిగూడెం: గోదావరి వరదతో నీట మునిగి దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారి మహేశ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు బుధవారం మండల పరిధిలోని గూర్రేవుల, సింగారం, బుట్టాయిగూడెం, చింతగూడెంతో పాటు ఇతర గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వరి సుమారుగా 83 ఎకరాలు, మిర్చికి 180 ఎకరాల్లో నష్టం వాటిలినట్లు తెలిపారు. వీరి వెంట ఏఈఓ కల్యాణి, రైతులు ఉన్నారు. సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి ● సైబర్ క్రైం డీఎస్పీ నందిరాంనాయక్ ములుగు: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ నందిరాంనాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మీటింగ్ హాల్లో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులం అంటూ ఫోన్ చేసి వాట్సప్ ద్వారా వీడియో కాల్స్ చేసి బాధితులను డిజిటల్ అరెస్టు చేస్తారని తెలిపారు. అనంతరం గదికి వెళ్లి లాక్ చేసుకొనేలాగా భయబ్రాంతులకు గురి చేసి బ్యాంక్ వివరాలు తెలుసుకుని అకౌంట్లో డబ్బులు కాజేస్తారని వివరించారు. గుర్తింపులేని సంస్థలు షేర్ మార్కెట్ చేయకూడదని తెలిపారు. మొబైల్‌కు వచ్చే అనవసర మెసేజ్‌లను, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల లింక్స్, ఏపీకె ఫైల్స్ క్లిక్ చేయకూడదని తెలిపారు. సైబర్ మోసాల భారిన పడితే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వైద్యులు, సిబ్బంది, సైబర్ క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
మంగపేట: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలోని ఉమా చంద్రశేఖరస్వామి ఆలయంలో అమ్మవారిని భక్తులు దుర్గాదేవిగా అలంకరించగా భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. అలాగే బోరునర్సాపురం, రాజుపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో దుర్గాదేవిగా కొలువైన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి అర్చకులు అభిషేకం, కుంకుమార్చన, హోమంతో పాటు తదితర ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేధ్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మండపాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. -
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎన్నికల అంశాలపై నోడల్ అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టాలని సూచించారు. నోడల్ అధికారులు ప్రతిరోజూ రిపోర్ట్‌ను నిర్ణీత పార్మాట్లో సమర్పించాలని వివరించారు. నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల హాండ్బుక్లోని ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. మాన్పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్స్‌ల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్టు, శిక్షణా కార్యక్రమాలు, మెటీరియల్, మీడియా కమ్యూనికేషన్, వెబ్‌కాస్టింగ్ నోడల్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఆర్డీఓ వెంకటేశ్, డీపీఓ దేవరాజ్, సీపీఓ ప్రకాశ్, ఆర్టీఓ శ్రీనివాస్, ఎల్డీఎం జయప్రకాశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూంల భద్రత పటిష్టంగా ఉంచాలి జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పటిష్టంగా ఉంచాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు పరిశీలించారు. స్ట్రాంగ్ రూం కిటికీలు, వెంటిలేటర్లు మూసివేయాలని, రంగులు వేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
తగ్గుముఖం పట్టిన గోదావరి
● ఇంకా నీటిలోనే రోడ్లు, మిర్చి పంటలు వాజేడు: ఉధృతంగా పెరిగిన గోదావరి వరద మంగళవారం నుంచి తగ్గుముఖం పట్టింది. మండల పరిధిలోని పేరూరు వద్ద ఉదయం 17.370 మీటర్లుగా ఉన్న నీటి మట్టం సాయంత్రం వరకు 16.780 మీటర్లకు తగ్గింది. పల్లపు ప్రాంతాల గుండా వచ్చిన గోదావరి వరద మండలంలో పలు చోట్ల మిర్చి పంటలను ముంచెత్తింది. వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ మిర్చి పంటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. అదే విధంగా టేకులగూడెం గ్రామ చివరన జాతీయ రహదారిపైకి చేరిన వరద ఇంకా తగ్గలేదు. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడి దొడ్డి, పేరూరు– కృష్ణాపురం, పూసూరు– ఏడ్జెర్లపల్లి, ఏడ్జెర్లపల్లి– బొమ్మన పల్లి గ్రామాల మధ్యన గోదావరి రహదారులపైకి చేరడంతో ఆయా గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు రహదారులకు అడ్డంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. సమ్మక్కసాగర్‌లోకి తగ్గిన వరద కన్నాయిగూడెం: మండల పరిధిలోని సమ్మకసాగర్ బ్యారేజీలోకి సోమవారం వరకు భారీగా వచ్చిన వరద నీరు మంగళవారం కొంతమేర తగ్గి 9,16,570 క్యూసెక్కుల మేర వచ్చి చేరుతోంది. బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో బ్యారేజీ ప్రాంతంలో గోదావరి కొంత శాంతించింది. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీలో నీటిమట్టం ప్రస్తుతం 83.30 మీటర్లుగా ఉంది. -
హోర్డింగులు, ఫ్లెక్సీల తొలగింపు
ఏటూరునాగారం: ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రోడ్లపై, ప్రధాన కూడళ్లలో ఉన్న హోర్డింగ్‌లు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్, జీపీ కార్యదర్శి రమాదేవి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని బస్టాండ్, తాళ్లగడ్డ, క్రాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయించినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాజకీయ పరమైన వాల్ పెయింటింగ్స్ ఉన్న చోట రంగులు వేయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీపీ సిబ్బంది సుధాకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామంలో మంగళవారం భూపాలపల్లి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో గొడవలకు తావులేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. దసరా పండుగ సందర్భంగా అల్లర్లకు పోవద్దని సూచించారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని చెప్పారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. కాటారం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రగాయాలపాలైన ఘటన కాటారం మండలం కొత్తపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కాటారం మండల కేంద్రానికి చెందిన పంతకాని వినయ్, గౌని నితీశ్ ద్విచక్రవాహనంపై మండలంలోని అంకుషాపూర్‌కు వెళ్లి తిరిగి కాటారం వైపుగా వస్తున్నారు. కొత్తపల్లి శివారులోని రైస్‌మిల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోగా వినయ్ తలకు, నితీశ్ శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినయ్ తలకు గాయం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది. ఎంజీఎం: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నాయకులు ఘన విజయం సాధించారు. ఫైమా జాతీయ కో–చైర్మన్‌గా డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి మద్దతు ఇచ్చిన సహచర వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన ప్రాతినిథ్యం వహిస్తూ, వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీరికి జూడా నాయకులు, వైద్య సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అదనపు ఎస్పీ నరేష్కుమార్ ఆకాంక్షించారు. రేగొండ ఏఎస్సై బి.రవీందర్‌రెడ్డి, కొత్తపల్లిగోరి ఏఎస్సై జి.రాజేషం మంగళవారం ఉద్యోగ విరమణ పొందగా వారిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రత్నం, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
చుక్క.. ముక్క ఎట్లా?
● మద్యం షాపులను మూసివేయనున్న ప్రభుత్వం ● మాంసం విక్రయాలపై వ్యాపారుల సందిగ్ధంములుగు: దసరా పండుగంటేనే అందరికీ సంబురం. చిన్న చితక కూలీ నుంచి మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతిఒక్కరూ ఇంటిల్లిపాది కోసం మాంసం వండుకొని పండుగ పూట తింటారు. తెలంగాణలో దసరా పండుగ అంటేనే మద్యానికి మరో ప్రత్యేకత ఉంటుంది. మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. చుక్క, ముక్కలేనిదే గుక్కె డు బువ్వ కూడా లోపలకి పోదనే సామెతకు తగ్గట్టుగా దసరా పండుగ ఉంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దసరా వస్తుండడంతో మద్యం, మాంసం ప్రియులు ఆలోచనలో పడ్డారు. పండుగ వేళ మద్యంతో పాటు మటన్, చికెన్ కావాల్సిందే అంటూ ముందస్తు కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు. గ్రామాల్లోకి డోర్ డెలివరీ మద్యం షాపు నిర్వాహకులు ముందస్తుగానే మద్యాన్ని గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లోని ప్రతి బెల్ట్‌షాపునకు మద్యాన్ని ప్రత్యేక ఆటోల ద్వారా తరలిస్తూ డోర్ డెలివరీ చేస్తున్నారు. జిల్లాలో 25 మద్యం షాపులు ఉండగా వాటి పరిధిలో సుమారు రెండు వేలకు పైగా బెల్ట్‌షాపులు ఉన్నాయి. ప్రతినెలా ఎకై ్సజ్ శాఖతో పాటు మరో శాఖకు 25 షాపుల నుంచి అక్షరాలా రూ.40 లక్షలు మామూళ్లు వెళ్తుండడంతో ఆ శాఖల అధికారులు బెల్ట్‌షాపులను మామూలుగానే తీసుకుంటున్నారు. జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(కె) మండలంలో మద్యం వ్యాపారులు సాయంత్రంలోగా మద్యాన్ని బెల్ట్‌షాపులకు తరలించి సాయంత్రం 6 గంటలలోపే మద్యం షాపులను మూసి వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయోమయంలో వ్యాపారులు దసరా పండుగకు ప్రతిఇంట్లో మాంసహారం ఉండాల్సిందే. ఇందుకోసం చికెన్, మటన్ వ్యాపారుల వద్ద తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద ప్రజలు క్యూ కడతారు. మరికొంతమంది కాలనీవాసులు, వీధుల్లోని ప్రజలు ఒక సమూహంగా ఏర్పడి గొర్రెలను, మేకలను కొనుగోలు చేసి బుధవారం రాత్రి నుంచే యాటలను కోసుకుని పోగులు పంచుకుంటారు. ఇప్పటికే గ్రామాల్లో గొర్లు, మేకపోతులు కొనుగోలు చేసినప్పటికీ కోయడం ఎట్లా అని అయోమయంలో ప్రజలు ఉన్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో సుమారు 100కు పైగా మటన్, చికెన్ దుకాణాలు ఉండగా దసరా రోజున కోటి రూపాయాలకు పైగా వ్యాపారం జరుగుతుంది. దసరా పండుగ రోజు గాంధీ జయంతి కావడంతో తాము నష్టపోతామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అక్టోబర్ 2వ తేదీ(గురువారం) గాంధీజయంతి ఉండడంతో మద్యం, మాంసం విక్రయాలపై జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలతో పాటు మాంసం దుకాణాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే అన్ని పండుగల మాదిరిగా దసరా పండుగ ఉండదు. ప్రతిఒక్కరూ మటన్, చికెన్లకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా చుక్క వేసేందుకే ప్రాధాన్యత ఇస్తారు. దసరా పండుగ కోసం మద్యాన్ని ముందస్తు కొనుగోలు చేసి భద్రపరుచుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ మటన్, చికెన్ కొనుగోలు ఎట్లా అని తర్జనభర్జన పడుతున్నారు. -
ఓటర్లను ప్రభావితం చేయొద్దు
ములుగు: ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో డబ్బులు, మందు, ఇతర వస్తువులను పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో ఎస్పీ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. కోర్టులో ట్రయల్‌లో ఉన్న ప్రతికేసులోనూ తప్పనిసరిగా సాక్షులకు, ముద్దాయిలకు సమన్లు అందించాలన్నారు. నేరస్తులకు శిక్షపడే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలన్నారు. అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఆటంకాలు కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్స్‌పై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలన్నారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్ల వారీగా ఆరా తీసి, కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ప్రతీ కేసు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని, పోగొట్టుకున్న నగదు లేదా వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలని సూచించారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని వెల్లడించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపైనా నిఘా పెంచాలన్నారు. చెక్ పోస్టులలో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలలో అవగాహన తీసుకొచ్చి కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ వలలో పడి మోసపోకుండా పోలీస్ స్టేషన్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్‌ని ప్రోత్సహిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ నేరాలపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీసీఆర్బీడీ ఎస్పీ కిశోర్‌కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కుమార్, సీఐలు శ్రీనివాస్, సురేష్, రమేష్, దయాకర్, వివిధ మండలాల ఎస్సైలు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచాలి ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
పెరుగుతున్న గోదావరి.. నిలిచిన రాకపోకలు
వాజేడు: గోదావరి వరద భారీగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండల పరిధిలోని పేరూరు వద్ద నీటిమట్టం సోమవారం 17.22 మీటర్లకు చేరుకుంది. దీంతో మండలంలోని టేకులగూడెం వద్ద జాతీయ రహదారి ముంపునకు గురికావటంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు, గుమ్మడి దొడ్డి, పూసూరు, ఎడుచర్లపల్లి, బొమ్మనపల్లి, పేరూరు, కృష్ణాపురం గ్రామాల మధ్యన గోదావరి వరద రహదారిపైకి చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పల్లపు ప్రాంతాల గుండా వచ్చిన వరద నీరు మండలంలోని మిర్చి తోటలు, వరి పొలాలను ముంచెత్తింది. అప్రమత్తమైన అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పల్లపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. సమ్మక్కసాగర్‌లోకి 10,29,130 క్యూసెక్కుల నీరు కన్నాయిగూడెం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. దీంతో మండల పరిధిలోని తుపాకులగూడెం సమీపంలో గల సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 10,29,130 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని అదే మోతాదులో బయటకు వదులుతున్నట్లు బ్యారేజీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 83.90 మీటర్లుగా ఉన్నట్లు వివరించారు. -
స్థానిక పోరుకు సై..
ములుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పల్లెల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. జిల్లాలో 10 మండలాల పరిధిలో 10 జెడ్పీటీసీ, 171 గ్రామ పంచాయతీలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మంగపేట మండలంలో ఎన్నికలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. దీంతో మంగపేట మండలంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం జెడ్పీటీసీ ఎన్నిక మాత్రమే నిర్వహించేందుకు అధికారులు రిజర్వేషన్ ప్రకటించారు. మంగపేట మండలం మినహా జిల్లాలోని 146 గ్రామ పంచాయతీలు, 69 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించనుండగా ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన ఫలితాలు మాత్రం సర్పంచ్ ఫలితాల తర్వాతనే వెలువరిస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. రెండు దశల్లో ఎంపీటీసీ, మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలోని 10 జెడ్పీటీసీ స్థానాలకు, 69 ఎంపీటీసీ స్థానాలకు, 146 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం రిజర్వేషన్లను ఇప్పటికే ప్రకటించింది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ 23, 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీలలో 146 సర్పంచ్ స్థానాలకు 1,290 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, వార్డు స్థానాల ఫలితాలు అదేరోజు ఓటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించనుండగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం నవంబర్ 11వ తేదీన వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఢీ అంటే ఢీ.. గ్రామాల్లో ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు లోకల్ ఫైట్‌గా పేర్కొంటూ రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు ఆరు గ్యారంటీల అమలును, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిందంటూ ఎన్నికల్లో ప్రజల వద్దకు అభ్యర్థులు వెళ్లనున్నట్లు చర్చించుకుంటున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ యూరియా కొరతను ఓట్లుగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చూపెడుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నెలరోజుల పాటు ఎన్నికల సందడి నెలకొననుంది. రిజర్వేషన్లను బట్టి తమకే టికెట్లు ఇవ్వాలంటూ అధిష్టానం వద్దకు పలువురు ఆశావహులు ఇప్పటికే క్యూ కడుతూ పైరవీలు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించేందుకు అధికార పార్టీ గ్రామాల్లో ప్రజలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించేలా సర్వే నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ పల్లెల్లో వేడెక్కిన ఎన్నికల వాతావారణం అధిష్టానం వద్దకు ఆశావహుల పరుగులుజిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వార్డుల వివరాలుజిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులుహనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534 -
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
ములుగు రూరల్: రాష్ట్రంలో రెండు దఫాలుగా నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మూడు దపాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్‌లను తొలగించాలని సూచించారు. పీఓలకు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని -
న్యూ టెక్నాలజీ
ఐటీఐలకు అనుసంధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ఏటూరునాగారం: ఐటీఐలకు అనుసంధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. టాటా కంపెనీ వారి సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఐటీఐలోని ఆరు ట్రేడ్లతో పాటు అడ్వాన్స్ ్డ టెక్నాలజీని నిరుద్యోగ, విద్యార్థులకు అందించనుంది. కేవలం కొన్ని ట్రేడ్లతో శిక్షణ తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదని ప్రభుత్వం ఏటీసీలను నెలకొల్పింది. తెలంగాణ ప్రభుత్వం పాత ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చింది. అందులో భాగంగా జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడులో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈ ఏడాదికి గాను అడ్మిషన్లు స్వీకరించి ఈ నెల 20వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు. మూడు కోర్సులకు ఏడాది.. మూడు కోర్సులకు రెండేళ్లు.. మొత్తం ఆరు కోర్సులు నూతనంగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాగా అందులో మూడు కోర్సులకు ఏడాది పాటు చదివేలా ప్రవేశపెట్టారు. మరో మూడు కోర్సులను రెండేళ్ల పాటు కాలపరిమితిని అధికారులు నిర్ణయించారు. ఐటీఐ ఒక్క సెంటర్‌కు 172 సీట్లను కేటాయించారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు టెన్త్ పూర్తి చేసుకున్న వారు అర్హులు. ఈ కోర్సులను పూర్తి చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా దక్కే అవకాశం ఉంది. రోబోతోనే అన్ని కోర్సులను నేర్పించనున్నారు. రోబోటిక్ పూర్తిగా మరో 50 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే టెక్నాలజీలను ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఏటీసీ సెంటర్లు ప్రారంభం వాజేడులోని ఏటీసీ సెంటర్‌ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ప్రారంభించగా ఏటూరునాగారంలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను స్థానిక ఏపీఓ వసంతరావు ఈనెల 27న ప్రారంభించారు. ఇదే రోజు హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో ఆరు కొత్త కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. టాటా కన్సల్టెన్సీ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టారు. శిక్షణ ఏడాది, రెండేళ్ల కోర్సులు ఉండడంతో శిక్షణ తర్వాత ఉపాధి కూడా కల్పించే విధంగా ఏటీసీ సెంటర్లను రూపొందించారు. నూతనంగా ఆరు కోర్సులు ఆరు ట్రేడ్లతో విద్యార్థులకు శిక్షణ టాటా కన్సల్టెన్సీ సౌజన్యంతో ఉద్యోగ అవకాశాలు మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ రెండు సంవత్సరాల కోర్సు.. 24 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్, అడ్వాన్స్ ్డ సీఎస్సీ టెక్నీషియన్ కోర్సుకు 24 సీట్లను కేటాయించారు. అర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్ ్డ టూల్స్ కోర్సు.. ఏడాది పాటు కోర్సు 20 సీట్లను కేటాయించారు. మాన్యుఫ్యాక్చర్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ఏడాది కోర్సు ఉండగా 40 సీట్లను కేటాయించారు. ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ కోర్సు ఏడాది పాటు కోర్సు ఉండగా 40 సీట్లు కేటాయించారు. అడ్వాన్స్డ్ ఎనిమేషన్ రోబోటిక్ టెక్నాలజీ రెండు సంవత్సరాల కోర్సు ఉండగా 24 సీట్లను కేటాయించారు.విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ నూతనంగా ప్రవేశపెట్టిన ఆరు కోర్సుల్లో చేరితే భవిష్యత్ బాగుంటుంది. శిక్షణతో పాటు ఉపాధి సైతం లభిస్తుంది. రాబోయే తరాలకు ఉపయోగ పడేలా కోర్సులను ప్రారంభించాం. వీటితో ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. పాత ఐటీఐ సెంటర్లలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం నెలకొల్పింది. టాటా కన్సల్టెన్సీ సౌజన్యంతో ఈ నూతన ఒరవడిని ప్రవేశపెట్టింది. భవిష్యత్‌లో ఈ కోర్సులు నేర్చుకునేందుకు విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉంది. – జగన్ మోహన్‌రెడ్డి, ఐటీఐ ఏటూరునాగారం కళాశాల ప్రిన్సిపాల్ -
ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్
● డీఎస్పీ సూర్యనారాయణ మల్హర్: ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని కొయ్యూరు గ్రామంలో సాయంత్రం పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 సివిల్ కానిస్టేబుళ్లు, 20 టీజీఎస్పీ కానిస్టేబుళ్లతో కలిసి ఇళ్లలో తనిఖీలు చేశారు. దీంట్లో భాగంగా నంబర్ ప్లేట్‌లేని 7 వాహనాలు, వాహన పత్రాలు సరిగా లేని 25 వాహనాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గుడుంబా, గంజాయి వంటి చెడు వ్యసనాలు, సీసీ కెమెరాలు, డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ దసరా పండుగని ప్రశాంతమైన వాతావరణంలో జరపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేష్, రాజన్, కాటారం ఎస్సై శ్రీనివాస్, మానస, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
సంపూర్ణ పౌష్టికాహారమే లక్ష్యం
● అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు● కూరగాయలు, ఆకుకూరల సాగుకాటారం: అంగన్వాడీ కేంద్రాల బలోపేతం దిశగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులుగా ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు కేంద్రాల్లోనే పోషకాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు పండించేలా కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా మంజూరు చేయనుంది. ఉద్యాన శాఖ ద్వారా గతంలో ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలతో పాటు మరికొన్ని కొత్త కేంద్రాల్లో కిచెన్గార్డెన్లను ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. రసాయన ఎరువులు వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇలా పండించిన కూరగాయలు, ఆకుకూరలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పెట్టనున్నారు. 643 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు ఉండగా 643 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 50 అంగన్వాడీ కేంద్రాలు కిచెన్గార్డెన్ల ఏర్పాటుకు ఎంపిక కాగా గతేడాది కొన్ని కేంద్రాల్లో, ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశారు. కిచెన్గార్డెన్లలో గత సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల మొక్కలు, ఆకుకూరల విత్తనాలు నాటి పందిర్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలకు అప్పగించారు. కిచెన్గార్డెన్లలో వంకాయ, బెండకాయ, టమాట, సోరకాయ, పాలకూర, తోటకూర, మెంతికూర, కోత్తిమీర లాంటి పోషకాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లోని కిచెన్గార్డెన్లలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు కాపునకు రాగా వాటిని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వండి పెడుతున్నారు. మరికొన్ని కేంద్రాల్లో గత నెలలో కూరగాయలు, ఆకుకూరల సాగు ప్రారంభించారు. ఒక్కో కేంద్రానికి రూ.10 వేలు.. కిచెన్గార్డెన్ల ఏర్పాటుకు ఎంపికై న ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ నిధులను విత్తనాల కొనుగోలు, కుండీలు, మట్టి, ఇతర పనిముట్లు కొనుగోలు చేయడానికి వెచ్చించాల్సి ఉంటుంది. నారు పెట్టేందుకు రూ.3వేలు, రవాణా ఖర్చులకు రూ.వెయ్యి, విత్తనాలు నాటేందుకు, భూమి సిద్ధం చేసే ఖర్చులకు రూ.వెయ్యి, పంట నిర్వహణ, నీటి వసతుల కల్పన కోసం రూ.5వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన రూ.10వేలతోనే ఐదేళ్ల పాటు నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది. కిచెన్ గారెన్లపై ప్రత్యేక దృష్టి.. అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు భోజనంలో అందించాలనే లక్ష్యంతో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశాం. వీలైనన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్న విత్తనాలు, కూరగాయల మొక్కలు నాటేలా చూస్తున్నాం. – రాధిక, సీడీపీఓ, మహదేవపూర్ ప్రాజెక్ట్జిల్లా వివరాలు..మండలాలు 12ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు 02(భూపాలపల్లి, మహదేవపూర్) అంగన్వాడీ కేంద్రాలు 643కిచెన్గార్డెన్ల ఏర్పాటుకు ఎంపికై న కేంద్రాలు 50 -
రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక
మల్హర్: జటాధార ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జెట్ ఇన్నోవేటివ్ రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు. మల్హర్ మండలం తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు వనపర్తి కుమారస్వామి, భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం డీఎన్టీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జయ ఎంపికయ్యారు. నేడు (సోమవారం) సికింద్రాబాద్‌లో హరిహర కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానోత్సవం చేయనున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు వారిని అభినందించారు. అక్టోబర్ 3న సెలవు ఇవ్వాలి భూపాలపల్లి అర్బన్: దసరా పండుగ రోజున గాంధీ జయంతి అవుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులకు అక్టోబర్ 3వ తేదీన సెలవు ప్రకటించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ యాజమాన్యాన్ని కోరారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ, గాంధీ జయంతిని గొప్పగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమైక్యత, సమగ్రత కోసం దసరా పండుగ సెలవుదినాన్ని మార్చాలని యాజమాన్యాన్ని కోరారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
● టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ కాటారం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) కృషి చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ అన్నారు. కాటారం మండలకేంద్రంలో ఆదివారం టీఆర్టీఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్టీయూ రాష్ట్ర బాధ్యుడు హట్కర్ రమేశ్‌నాయక్, మండల అధ్యక్షుడు రేపాల వేణుగోపాల్, పీర్ల మోహన్‌రావు, కోటేశ్వర్, సబిత, వెంకటేశ్, కృపాకర్ తదితరులు టీఆర్టీఎఫ్ సభ్యత్వం తీసుకున్నారు. నూతనంగా చేరిన వారికి రాష్ట్ర అద్యక్షుడు కటకం రమేశ్, మెంబర్షిప్ రాష్ట్ర కన్వీనర్ సుంకేసుల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ టీఆర్టీఎఫ్ సిద్ధాంతం భావజాలం సామాజిక కోణంతో ముడిపడి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువత సంఘంలోకి రావాలని, భవిష్యత్ తరాలకు దిక్సూచి అవుతూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెండెం మధుసూదన్, కార్యదర్శి రవీందర్, కార్యవర్గ సభ్యులు సమ్మయ్య, రఘుకుమార్, ఆజ్మీర అనిల్, రాజునాయక్, పరంసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
సద్దులకు సిద్ధం
ఏటూరునాగారం/వెంకటాపురం(కె): జిల్లాలో ఆడపడుచులు సద్దుల బతుకమ్మ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నేడు(సోమవారం) జరుపుకోనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రేపు(మంగళవారం) వేడుకలు నిర్వహించుకోనున్నారు. ఆయా ప్రాంతాల్లోని వేద పండితుల నిర్ణయం ప్రకారం రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ ఆట స్థలాల వద్ద అధికారులు విద్యుత్ దీపాల ఏర్పాటు, డీజే సౌండ్స్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ మేరకు మహిళలు నూతన వస్త్రాలు, పూల కొనుగోళ్లతో పాటు కంగన్‌హాల్ సామగ్రి కొనుగోళ్లపై దృష్టి సారించారు. పూలకు ఫుల్ డిమాండ్ పండుగ నేపథ్యంలో బంతి పూలను డిమాండ్ పెరిగింది. కిలో బంతిపూలను పలు చోట్ల రూ.100కు విక్రయించారు. అలాగే వెంకటాపురం(కె) మండల కేంద్రంలో రూ.150 నుంచి రూ.200వరకు విక్రయించారు. చామంతి పూలు కేజీ రూ.400వరకు ధర పలికింది. ఇవేకాకుండా గునుగు, తంగేడు, టేకు, సీతజడ పూలను సైతం మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం గమనార్హం. పిండి వంటలను తయారు చేసేందుకు, పల్లీలపొడి, నువ్వులు, కొబ్బరి, సత్తుపిండి తయారీకి మహిళలు కిరాణం షాపుల వద్ద కొనుగోలు చేసేందుకు కిక్కిరిసిపోయారు. నిర్వాహకులకు పోలీసుల సూచనలు ఏటూరునాగారంలోని రామాలయం, బొడ్రాయి, బస్టాండ్, సాయిబాబా, స్టార్‌యూత్ శివాలయం తదితర ప్రాంతాల్లోని ఆట స్థలాలను పోలీసులు పరిశీలించారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలో తోపుకుంట, ఏటూరునాగారంలో జంపన్నవాగు, గోదావరితో పాటు ఆయా మండలాల్లోని చెరువులు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.జిల్లాలో నేడు, రేపు బతుకమ్మ సంబురాలు జోరుగా గునుగు, తంగేడు, టేకు తదితర పూల విక్రయాలు షాపులు, పూల కొనుగోళ్ల వద్ద మహిళల సందడి -
శరవేగంగా అభివృద్ధి పనులు
ములుగు రూరల్: నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.4 కోట్లు ఖర్చుచేసి సెంట్రల్ లైటింగ్‌తో నిర్మించిన సీసీ రోడ్డును ఆదివారం మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు పట్టణంలోని ప్రతీ రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తామని తెలిపారు. ఇటీవల ములుగు ప్రభుత్వ ఆస్పత్రి రహదారి నుంచి తోపుకుంట చెరువు వరకు రూ.4 కోట్లతో సెంట్రల్ లైటింగ్‌తో సీసీ రోడ్డు నిర్మించినట్లు వెల్లడించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుటుంబ సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. 010 పద్దు ద్వారా జీతాలు, కారుణ్య నియామకాల జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, యూటీఎఫ్ నాయకులు చావ రవి, వెంకట్, రాజశేఖర్ రెడ్డి, కొండయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
పండుగ వేళ.. ప్రజలు అప్రమత్తం
సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఎస్పీ రవీందర్ ములుగు: సద్దుల బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ సూచించారు. పండుగలకు సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. శనివారం ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌తో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ప్రజలు ఫోన్‌చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రశ్న: గాంధీ జయంతి రోజున దసరా పండుగ ఉంది.. మద్యం అమ్మకాలపై చేపట్టే చర్యలు ఏంటి? మొర్రి రాజుయాదవ్, మల్లంపల్లి జవాబు: దసరా పండుగ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున వస్తున్నందున ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం దుకాణాలు బందు ఉంటాయి. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. దసరా వేడుకల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుంది. దసరా వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా స్థానిక యువత పోలీసులకు సహకరించాలి. ప్రశ్న: దసరాకు అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చెర్ప రవీందర్, మేడారం జవాబు: పండుగకు వెళ్లేవారు ఇంట్లో బంగారు ఆభరణాలు పెట్టి వెళ్లకుండా వెంట తీసుకెళ్లాలి. మేడారంతో పాటు ప్రతీ గ్రామంలో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. బతుకమ్మ ఆడేటప్పుడు నగలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు బతుకమ్మ ఆడే క్రమంలో అభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రశ్న: సద్దుల బతుకమ్మ రోజు చైన్ స్నాచింగ్‌లు జరగకుండా తీసుకునే చర్యలేంటి? పొదిల్ల చిట్టిబాబు, పస్రాజవాబు: సద్దుల బతుకమ్మ రోజున మహిళలు బతుకమ్మలతో వెళ్తున్న క్రమంలో, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో మహిళలు ధరించిన బంగారు ఆభరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అపహరణకు గురికాకుండా అనునిత్యం పోలీసులతో బందోబస్తు ఉంటుంది. ఆటలు ఆడే క్రమంలో అపహరణకు గురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. ప్రశ్న: సద్దుల బతుకమ్మకు పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉంటుంది? కందకట్ల రణధీర్, మల్లంపల్లిజవాబు: సద్దుల బతుకమ్మ రోజున ప్రతీ గ్రామంలో పోలీసుల బందోబస్తు ఉంటుంది, మహిళా కానిస్టేబుళ్లతో పాటు మఫ్టీలో పోలీసులు కూడా విధుల్లో ఉంటారు. సద్దుల బతుకమ్మ రోజున బంగారు నగలు ధరిస్తే అపహరణకు గురికాకుండా మహిళలు పినీస్తో పుస్తెలతాడుకు లింక్ చేసి నగలను ఉంచితే అపహరణకు గురయ్యే అవకాశం ఉండదు. బంగారు నగల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ప్రశ్న: పండుగకు ఊరికెళ్తే.. ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రామిడి కరుణాకర్‌రెడ్డి, వెంకటాపురం(ఎం) జవాబు: ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. దసరా పండుగకు ఊరికెళ్తే విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలి. ఇంటి పరిసరాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ పక్కన ఉన్న ఇంటివారికి ఊరికి వెళ్తున్న సమాచారం అందించి ఇంటిని చూసే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రశ్న: అనుమానాస్పద వ్యక్తులపై ఎలాంటి నిఘా ఉంటుంది. గ్రామాల్లో యువకులతో కమిటీలు ఏమైనా వేస్తారా? గణపాక సుధాకర్, చల్వాయి జవాబు: అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100కు డయల్ చేయాలి. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా జిల్లా ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిహిస్తున్నాం. గ్రామాల పరిధిలోని యువకులతో కమిటీలు వేసి గ్రామాల్లో నిఘా పెంచాలనే మీ ఆలోచనను పరిగణలోకి తీసుకుంటాం. సొంతూళ్లకు వెళ్తున్న క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరి గాంధీ జయంతి రోజు మద్యం అమ్మితే చర్యలు ‘సాక్షి ఫోన్ ఇన్’లో ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ -
రిజర్వేషన్లు ఖరారు
ములుగు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు సంపత్‌రావు, మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీరాజ్‌శాఖ అధికారుల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి ప్రకారం నిర్వహించగా రాజకీయ కులగణన (ఎస్ఈఈఈపీసీ) ప్రకారం బీసీల రిజర్వేషన్లు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా జెడ్పీ చైర్పర్సన్ ఎస్టీ మహిళకు కేటాయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 10 జెడ్పీటీసీ, 10 ఎంపీపీ స్థానాలతో పాటు ఎంపీటీసీలు 83, సర్పంచ్‌లు 171 స్థానాలతో పాటు వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. అశా వహుల్లో నిరుత్సాహం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో పాల్గొనాలని వేచి చూస్తున్న వారి ఆశలు అడి ఆశలయ్యాయి. గతంలో ఉన్న రిజర్వేషన్ల ఆధారంగా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయని గంపెడాశతో ఉన్న స్థానిక నాయకులు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రిజర్వేషన్ల ప్రక్రియకు హాజరయ్యారు. డ్రా పద్ధతిన ప్రక్రియ నిర్వహించిన రిజర్వేషన్ల ఖరారు ప్రతికూలంగా రావడంతో పలువురు ఆశా వహులు నిరుత్సాహంతో వెనుతిరిగారు. జెడ్పీపీఠం ఎస్టీ మహిళకు ఖరారు.. ములుగు జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ పీఠం ఎస్టీ మహిళకు ఖరారు చేశారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్, రూరల్ ఎంప్లాయ్మెంట్ డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల అథారిటీ శ్రీజాన గెజిట్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018, జీఓ ఎంఎస్ నంబర్ 41 నిబంధనల మేరకు రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలుమండలం జెడ్పీటీసీ ఎంపీపీ ములుగు ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళ మల్లంపల్లి బీసీ మహిళ బీసీ మహిళ వెంకటాపురం(ఎం) ఎస్సీ జనరల్ ఓసీ జనరల్ గోవిందరావుపేట బీసీ మహిళ బీసీ మహిళ ఎస్ఎస్ తాడ్వాయి బీసీ జనరల్ బీసీ జనరల్ ఏటూరునాగారం ఎస్టీ జనరల్ ఎస్సీ జనరల్ కన్నాయిగూడెం ఎస్టీ మహిళ ఎస్టీ మహిళ మంగపేట జనరల్ మహిళ ––– వాజేడు బీసీ జనరల్ బీసీ మహిళ వెంకటాపురం(కె) ఎస్సీ మహిళ ఎస్టీ మహిళ మంగపేట మండలం ఎంపీపీ స్థానం రిజర్వేషన్ ఖరారు చేయలేదు. లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపు ఆశావహుల్లో నిరుత్సాహం జెడ్పీ చైర్పర్సన్ ఎస్టీ మహిళ -
డీఎస్పీగా మౌనిక ఎంపిక
ములుగు జిల్లా: తెలంగాణ గ్రూపు 1 ఫలితాల్లో(Group-1 Results) ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక ప్రతిభ కనబర్చి డీఎస్పీగా(DSP) ఎంపికయ్యారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ తెచ్చుకున్నారు. దీంతో గురువారం మల్లంపల్లిలో ప్రజా సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లంపల్లి (Mallampalli) గ్రామానికి చెందిన సరోజన-సమ్మయ్య దంపతుల కుమార్తె డీఎస్పీ ఉద్యోగం సాధించడం గర్వ కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, చీదర సంతోష్, మొర్రి రాజుయాదవ్, కానుగంటి సతీష్, రవి, సంపత్, అనిల్‌రెడ్డి, సంతోష్, మధు, వేణు తదితరులు పాల్గొన్నారు. -
ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి
● కలెక్టర్ టీఎస్ దివాకర ములుగు రూరల్: చాకలి ఐలమ్మ పోరాటయోధురాలని, ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంతి వేడుకలను వెనకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐలమ్మ విరోచిత పోరాటం ఎన్నటికీ మరచిపోలేనిదన్నారు. భూ హక్కుల కోసం పోరాడిన తొలి మహిళా యోధురాలన్నారు. ఈ కార్యక్రమంలో వెనకబడి తరగతుల అభివృద్ధి అధికారి సర్ధార్‌సింగ్, మణికంఠ రజక సంఘం, ఐలమ్మ జయంతి నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు నగరపు రమేశ్, పరికిరాల రవి, చాపర్తి రాజు, మహేందర్, అరుణ, జాలిగం శ్రీనివాస్, భిక్షపతి, సదానందం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నేడు, రేపు భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టీఎస్ దివాకర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికలో ఉందని, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఏదైన ప్రమాదాలు సంభవిస్తే 18004257109 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి గోవిందరావుపేట: ప్రతీ పౌరుడు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ అదనపు కమాండెంట్ సీతారామ్ అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలోని 5వ బెటాలియన్‌లో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అణ గారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరనారి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ అనిల్ కుమార్, ఆర్ఐలు స్వామి, భాస్కర్, వెంకటేశ్వర్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ లింకింగ్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ములుగు: ఇంటర్ లింకింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ (ఆపరేషన్–2) సీఈ రాజు చౌహాన్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కంపెనీ డైరెక్టర్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎంఆర్టీ కన్స్ట్రక్షన్, డీపీవీ వింగ్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ హాజరు కాగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలన్నారు. అనంతరం తాడ్వాయి మండలంలో 33 కేవీ కవర్డ్ కండక్టర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్ఈ ఆపరేషన్ మల్చూరు నాయక్, డీఈలు పులుసం నాగేశ్వర్రావు, పాపిరెడ్డి, వెంకటేశం, ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.సోలార్ విలేజ్ పథకంపై అవగాహన ఏటూరునాగారం/మంగపేట: మోడల్ సోలార్ విలేజ్ స్కీంపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని టీజీఆర్ఈడీ జిల్లా మేనేజర్ రాజేందర్ అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో అవగాహన సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలు ఎక్కువగా అవుతున్నాయని, అందుకుగాను సోలార్‌ను ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్‌ను ఆదా చేయాలన్నారు. సౌరశక్తి ప్లాంట్లను విరివిరిగా ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్ నవీన్కుమార్యాదవ్లు, ఏఈ అశోక్, లైన్ఇన్స్పెక్టర్, లైన్మెన్లు పాల్గొన్నారు. ఒకేషనల్ కోర్సులో ఇంటర్న్‌షిప్ గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి మోడల్స్కూల్లో విద్యార్థులు సాధారణ విద్యతో పాటు ఒకేషనల్ కోర్సుల్లో 9వ నుంచి 12వ తరగతి వరకు హెల్త్‌కేర్, బ్యూటీ, వెల్నెస్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న క్రమంలో దసరా సెలవుల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు నిర్వహించారు. చల్వాయి మోడల్ స్కూల్ బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రేడ్ విద్యార్థులు ములుగులోని రమ బ్యూటీ పార్లర్లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతూ, వృత్తి పరమైన నైపుణ్యాలను సాధించారు. ఈ సందర్భంగా చల్వాయి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గండు కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు దసరా సెలవులను సద్వినియోగం చేసుకొని వృత్తి విద్యా నైపుణ్యాలను నేర్చుకోవడం సంతోషకరమన్నారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌కేర్ ట్రేడ్ ట్రైనర్ పావని, బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రైనర్ టీ.సౌజన్య, విద్యార్థినులు పాల్గొన్నారు. నేడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఏటూరునాగారం ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను మంత్రి సీతక్క చేతుల మీదుగా నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ బలరాం హాజరుకానున్నారు. ఇందుకోసం ఐటీఐ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. -
స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ములుగు రూరల్: నిబంధనలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల పాఠశాలల్లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ప్రకటించిన నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులు ఎన్నికల నిర్వాహణపై అవగాహన కలిగి ఉండి సమన్వయంతో ముందుకు సా గాలన్నారు. ఇబ్బందులు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. ఎ న్నికల సమయంలో పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, మాస్టర్ ట్రైనర్లు సూర్యనారాయణ, మధుసూదన్, రాజేష్‌కుమార్, రవీందర్, శ్రీకాంత్, వెంకటేశ్వర్‌రెడ్డి, రమేష్, సతీష్, మహేందర్, అధికారులు పాల్గొన్నారు. -
డీఎస్పీతో నేడు ఫోన్ ఇన్
ములుగు: సాక్షి ఆధ్వర్యంలో నేడు(శనివారం) ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఫోన్ఇన్లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూర ప్రయాణా లు, రాత్రిపూట ప్రయాణాలు, సొంత ఊళ్లకు వెళ్లేవారు తమ ఇళ్లలో చోరీలు జరగకుండా తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీతో ఫోన్లో మాట్లాడి తగిన సూచనలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కింది నంబ ర్కు ఫోన్ చేసి డీఎస్పీతో మాట్లాడవచ్చు. -
జీపీ కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సదయ్య అన్నారు. శుక్రవారం వేతనాలు ఇ వ్వాలని కోరుతూ కలెక్టర్ దివాకరకు వినతి ప్రతం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సుమారు ఆరు నెలల వేతనాలు రాక పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైన అధికారులు వేతనాలు చెల్లించాలని, లేదంటే ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నా యకుడు రమేశ్, తదితరులు ఉన్నారు. -
ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
● డీఎంహెచ్ఓ గోపాల్రావుగోవిందరావుపేట: మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈఎన్టీ వైద్య నిపుణులతో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య మహిళా శిబిరాలకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషన్, టీబీ ఈఎన్టీ, కేన్సర్, డెంటల్ వైద్య నిపుణులచే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 65 మహిళా ఆరోగ్య వైద్య శిబిరాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 21,530 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో 1,400 మంది పిల్లలు, 3,300 మంది గర్భినులు, బాలింతలు, 800 మంది కిశోర బాలికలు ఉన్నారన్నారు. గోవిందరావుపేట పీహెచ్సీలో నిర్వహించిన ఈఎన్టీ శిబిరంలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు చేశామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎన్టీ నిపుణుడు డాక్టర్ హర్షవర్ధన్, ఆయూష్ వైద్యురాలు అనూష, డెమో సంపత్, సూపర్వైజర్ శ్యామల, స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. పూల పండుగ బతుకమ్మ మంగపేట: పూల పండుగ బతుకమ్మ అని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో వైద్యాధికారి స్వప్నిత ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, గోవిందరావుపేట మెడికలాఫీసర్ చంద్రకాంత్ హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందన్నారు. -
పెరుగుతున్న గోదావరి
● ముంపునకు గురైన వందలాది ఎకరాల మిర్చి పంట ● నీటిలోనే రహదారులువాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీ టితో గోదావరి వరద పెరుగుతోంది. దీనికి తోడు మండలంలో గత రెండురోజులుగా కురుస్తున్న వ ర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. మండల పరిధిలోని పేరూరు వద్ద బుధవారం సాయంత్రానికి 16.410 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద పల్లపు ప్రాంతాల గుండా ప్రవహిస్తూ మండల కేంద్రం సమీపంలో కొంగాలవాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చి తోటలను ముంచెత్తింది. దీంతో వందలాది ఎకరాల మిర్చి, వరి పంట నీటిలో మునిగింది. గోదావరి ఇలానే పెరిగితే మిర్చి తోటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. రహదారులను ముంచెత్తిన వరద.. ఉధృతంగా పెరిగిన గోదావరి వరద పలు చోట్ల రహదారులను ముంచెత్తింది. మండలపరిధిలోని వాజేడు– గుమ్మడిదొడ్డి, పూసూరు– ఏడ్జెర్లపల్లి, పేరూరు–కృష్ణాపురం, బొమ్మనపల్లి–ఎడ్జెర్లపల్లి గ్రా మాల మధ్య రహదారుల పైకి చేరింది. దీంతో ఆ యా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలను వరదలోకి వెళ్లకుండా స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేశారు. పలు చోట్ల రహదారులకు అడ్డంగా ట్రాక్టర్లు, కర్రలను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య నిలిచిన రాకపోకలు వాజేడు మండలపరిధిలోని టేకులగూడెం గ్రామ సమీపంలో 163 నంబర్ జాతీయ రహదారిని గోదావరి వరద ముంచెత్తింది. జాతీయ రహదారి ముంపునకు గురైన విషయం తెలియని వాహన దా రులు అక్కడికి వచ్చారు. రోడ్డు మునిగి ఉండటంతో ఎటు వెళ్లాలో అర్థంకాక అక్కడే ఉన్నారు. ఇందులో రెండు బస్సులు కూడా ఉండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాల్సిన వారికి మరో మార్గాన్ని నిర్ధేశించారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు ఇటుగా వచ్చారు. రేగుమాకు ఒర్రె ద్వారా వచ్చిన గోదావరి వరద నీరు బ్రిడ్జిని ముంచెత్తడంతో రహదారి ముంపునకు గురైంది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వరదలోకి ఎవరు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని ఎల్బాక లోలెవల్ కాజ్‌వేపై నుంచి జంపన్నవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా ఎల్బాక కాజ్‌వేపై నుంచి శుక్రవారం వరద భారీగా ప్రవహిస్తుంది. దీంతో పడిగాపూర్, ఎల్బాక గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో.. ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తోంది. కలెక్టర్ దివాకర రామన్నగూడెం గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వెంకటాపురం(కె): మండలంలో శుక్రవారం గోదావరి వరద పెరుగుతోతోంతోంది. మండల పరిధిలోని మంగపేట గోదావరి లంకల్లోకి వెళ్లే గో దావరి పాయలోకి వరద నీరు చేరింది. దీంతో మి ర్చి తోటల్లో పనుల కోసం వెళ్లిన రైతులు, కూలీలు పడవల సహాయంతో దాటి వెళ్తున్నారు. -
పేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం
కాటారం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి గురువారం మంజూరుపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్లు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక, తక్కువ ధరకు సిమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో అసమర్థ పాలన సాగించిందని మంత్రి విమర్శించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ తదితర పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ఇతరులు ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే పోలీసు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగకుండా ఎంపీడీఓలు, గృహ నిర్మాణశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని, ఇళ్ల నిర్మాణం ఆగిపోతే అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తామని హెచ్చరించారు. అనంతరం అంగన్వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణులకు సీమంతం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, సీఎంరిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండ్రు రమేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -
వదలని ముసురు
ములుగు: జిల్లాను ముసురు వదలడం లేదు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. ఏటూరునాగారం మండలంలో అత్యధికంగా 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గోవిందరావుపేట మండలంలో అత్యల్పంగా 19.0 మీల్లిమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని వాజేడు మండలంలో గోదావరి పొంగి ప్రవహిస్తుండడంతో తెలంగాణ బార్డర్ టేకులగూడెం దగ్గర జాతీయ రహదారి మునిగిపోవడంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. వాజేడు–గుమ్మడిదొడ్డి, పేరూరు– కృష్ణాపురం మధ్య భారీవర్షం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదతో మిర్చిపంటలు మునిగిపోయాయి. వెంకటాపురం(కె) మండల కేంద్రంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు విరిగి రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గురువారం ఉదయం రహదారిని క్లియర్ చేయగా రాకపోకలు కొనసాగాయి. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి మండలంలో తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గోవిందరావుపేట, వెంకటాపురం(ఎం) మండలాల్లో భారీవర్షానికి పలుసార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెరుగుతున్న గోదావరి వాజేడు: వాజేడు మండలంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. మండల పరిధిలోని పేరూరు వద్ద బుధవారం సాయంత్రానికి 15.370 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద పెరగడంతో మండల కేంద్రం సమీపంలో కొంగాల వాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చి తో టలను వరద నీరు ముంచెత్తింది. రెండు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు పొంగి ప్రవహిస్తున్న వాగులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం -
మేడారానికి జాతీయ హోదా కల్పిస్తాం
ములుగు: మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే కేంద్రం జాతీయ హోదా కల్పించేలా తన వంతు కృషి చేస్తానని మహబుబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ తెలిపారు. ములుగు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత అన్నదాన కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తను ఎంపీగా ఉండి ఆరు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని వెల్లడించారు. ఇప్పుడు మేడారం జాతీయ హోదా కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న జాతర వరకు జాతీయ హోదా కల్పించేలా చర్యలు చేపడతానని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు నగరపు రమేశ్, కొత్త సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ -
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటుములుగు రూరల్: రైతులు సాగు చేసిన పత్తి పంట కొనుగోలుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు వేబ్రిడ్జీ లు, కంప్యూటర్లు, ఇతర వసతులను పరిశీలించారు. జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలను గుర్తించి సీసీఐకి నివేదికలు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కోనుగోలుకు కపాస్ కిసాన్ యాప్‌ను తీసుకువచ్చింది. పత్తి పంట అమ్మకం సమయంలో రైతులు ఈ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో నిర్ధేశిత సమయంలో పంట అమ్మకానికి రైతులకు కేటాయించడం జరుగుతుంది. సమయానుసారంగా రైతులు పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకం చేసుకోవచ్చు. దీంతో పాటు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంట నమోదు ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 20,480 ఎకరాల్లో పత్తి సాగు జిల్లాలోని పది మండలాల్లో 20,480 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పత్తి దిగుబడి అంచనా 1.90 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్, శ్రీ సాయిలక్ష్మీ ఇండస్ట్రీస్, రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీస్‌లను ఎంపిక చేశారు. మార్కెట్ పరిధిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు మద్దతు ధర తేమ నిబంధనల మేరకు రూ.8,110 ప్రకటించింది. 8 శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తోంది. అంత కంటే ఎక్కువ శాతం తేమ ఉంటే 1 శాతం ఎక్కువ ఉంటే మద్దతు ధర నుంచి రూ.81.10 పైసలు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. రైతులు నిబంధనల మేరకు పత్తి పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందవచ్చు. 20,480 ఎకరాల్లో పత్తిసాగు 1.90 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా కొనుగోళ్లకు ప్రత్యేక యాప్ క్వింటాకు మద్దతు ధర రూ.8,110పత్తి సాగు చేసిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. నిబంధనల మేరకు పత్తి అమ్మకాలు చేపట్టి మద్దతు ధర పొందాలి. కపాస్ కిసాన్ యాప్‌తో రైతులకు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వారికి కేటాయించిన సమయంలో అమ్మకం చేసుకోవచ్చు. – సోనియా, ములుగు మార్కెట్ కమిటీ కార్యదర్శి -
ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్
తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ జనగామ సబ్ డివిజన్ సైట్ ఇంజనీర్ సామల రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర అందించేందుకు 2025–26 సంవత్సరంలో కొనుగోళ్లను కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేపట్టనున్నారు. రైతులు స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని పట్టాదారు పాస్‌బుక్‌తో పాటు పత్తి సాగు చేసిన భూమి సర్వేనంబర్, ఆధార్, ఇతర వివరాలను నమోదు చేయాలి. రెవెన్యూ అధికారులు నుంచి పత్తి పంట సాగు ధ్రువీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలను అందించాలి. దీంతో వివరాలు సీసీఐకి చేరుతాయి. రైతులు ఫోన్ ద్వారా లేదా ఆన్లైన్ సెంటర్, వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -
డీఎస్పీతో ఫోన్ ఇన్
ములుగు: సాక్షి ఆధ్వర్యంలో రేపు (శనివారం) ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఫోన్ఇన్లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూర ప్రయాణాలు, రాత్రిపూట ప్రయాణాలు, సొంత ఊళ్లకు వెళ్లేవారు తమ ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీతో ఫోన్లో మాట్లాడి తగిన సూచనలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కింది ఫోన్ నంబర్‌కు కాల్ చేసి మాట్లాడాలి. -
వైన్స్ దరఖాస్తులకు వేళాయె..
కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ గురువారం ప్రకటన చేసింది. గత మద్యం పాలసీలో దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ నిర్ణయించగా.. ఈ సారి నూతన మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. దీంతో ఖజానాకు వైన్స్ కిక్కు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 294 వైన్స్‌లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్ షాపులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో స్వీకరించనున్నారు. జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్తోపాటు సీఐ, ఎస్సై సిబ్బంది దరఖాస్తులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారు. రూ.3 లక్షల డీడీ లేదా చెక్కు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతోపాటు రిజర్వేషన్ల ప్రకారం కులధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్‌లను జతపరిచి దరఖాస్తులు అందజేయాలి. అక్టోబర్ 18వరకు దరఖాస్తుల స్వీకరణ.. వైన్స్‌షాపులను కేటాయించేందుకు అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు వైన్‌షాపులు కేటాయిస్తారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో కేటాయించిన రుసుమును చెల్లించిన తర్వాత డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన వైన్‌షాపులు ప్రారంభిస్తారు. రిజర్వేషన్లు ఇలా... వైన్స్ కేటాయింపులో కులాల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. గౌడలకు 10 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్ల ప్రాతిపదిన కేటాయించిన వైన్స్‌లను గురువారం ఎంపిక చేశారు. కాగా, జిల్లాలోని 67 షాపులు గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు ఒక షాపు కేటాయించారు. గత పాలసీ రిపీట్... గత పాలసీలో గడువు ఉన్న వైన్స్‌ల టెండర్లను మూడు నెలల ముందే ప్రకటించగా.. ఈ సారి అదేపాలసీ రిపీట్ అయ్యింది. డిసెంబర్ 2025 వరకు వైన్స్ గడువు ఉన్నప్పటికీ మూడు నెలల ముందే టెండర్లను ప్రకటించి గత పాలసీ సీన్‌ను రిపీట్ చేసింది. రూరల్ నుంచి అర్బన్‌లోకి రెండు వైన్స్.. వరంగల్ రూరల్ జిల్లాలోని రెండు వైన్స్‌లు వరంగల్ అర్బన్ జిల్లాకు జీడబ్ల్యూఎంసీ పరిధిలో భాగంగా కేటాయించారు. దీంతో వరంగల్ అర్బన్‌లో గతంలో 65 వైన్స్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 67కు చేరింది. అదేవిధంగా వరంగల్ రూరల్‌లో 63 వైన్స్ ఉండగా 61కి చేరింది. వరంగల్ అర్బన్ 67వరంగల్ రూరల్ 61మహబూబాబాద్ 59జనగామ 47భూపాలపల్లి ములుగు 60 ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు అక్టోబర్ 23న లక్కీ డ్రా.. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ -
సౌరశక్తి వినియోగంపై అవగాహన
గోవిందరావుపేట: జిల్లాలో చల్వాయి, పస్రా, గోవిందరావుపేట, వెంకటాపూర్ గ్రామపంచాయితీ కార్యాలయాల్లో గురువారం ఆయా సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్‌పై ప్రత్యేక ప్రచార కార్యక్రమం, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్‌ఈడీసీఓ జిల్లా అధికారి రాజేందర్, ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ అఖిల, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ హాజరై మాట్లాడారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ములుగు, గోవిందరావుపేట, చల్వాయి, పస్రా, వెంకటాపూర్, ఏటూరునాగారం, కమలాపూర్, వెంకటాపురం గ్రామాలను మోడల్ విలేజ్‌గా ఎంపికచేశామన్నారు. ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.కోటి వరకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు మోడల్ సోలార్ విలేజ్ స్కీం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని అమెరికాకు చెందిన లెవ్ కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని ఆయన గురువారం సందర్శించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని ఆయన పేర్కొన్నారు. ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్‌గా దబ్బకట్ల జనార్దన్ గురువా రం బాధ్యతలను స్వీకరించారు. ఇంతకుముందు డీడీగా పనిచేసిన పోచం కమిషనరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. మంచిర్యాలలో డీటీడీఓగా పనిచేసిన జనార్దన్ పదోన్నతిపై ఏటూరునాగారంకు బదిలీ కావడంతో విధుల్లో చేరారు. అనంతరం పీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ పెనక సుగుణ, పీసా కోఆర్డినేటర్ ప్రభాకర్, కాక భాస్కర్, మైనర్‌బాబు, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు. ములుగు రూరల్: రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర కమిటీ కోశాధికారి గుండబోయిన చంద్రయ్య అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ టీఎస్ దివాకరకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. రైతులు సాగు చేసిన పంటలకు సరిపడా యూరియా అందించకపోవడంతో నానాపా ట్లు పడుతున్నారన్నారు. అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాస రాజన్న, వెంకన్న, శ్రీనాథ రవి, సంజీవయ్య, సమ్మయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి రూరల్: వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని నేడు ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ వర్గాలకు సంబంధించిన వారితో పాటు వివిధ కుల సంఘాల పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
27న కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు
● కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు రూరల్: ఈ నెల 27న కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలు సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను అన్ని సామాజిక వర్గాల మహిళలు ఒక్కటిగా జరుపుకోవడం ప్రత్యేకమన్నారు. ఈ బతుకమ్మ సంబురాలకు మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని పండుగ వైభవాన్ని చాటాలని సూచించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌రావు, ఉపాధ్యక్షురాలు శిరీష, కందుల జీవన్‌కుమార్, రామకృష్ణ, రఫిక్, శైలజ, నాగశ్రీ, భగవత్గీత, అనంతలక్ష్మి, రమాదేవి, కావ్య తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణదేవిగా దుర్గామాత
ములుగు: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గామాత అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ దంపతులు పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ యువజన నాయకుడు సిద్ధం రాఘవేందర్ దంపతులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి, వెంకటాపురం ఉత్సవ కమిటీ చైర్మన్ ముప్పు పూర్ణేందర్, సభ్యులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు -
పాతాళగంగ ౖపైపెకి..
● చేతి పంపు నుంచి ఉబికి వస్తున్న నీరు ఎస్‌ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి– మేడారం మార్గంలోని రోడ్డుకు కొద్ది దూరంలో అడవిలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చేతి పంపు నుంచి నీరు ఉబికి వస్తోంది. మేడారానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ చేతి పంపు ఉంది. మేడారానికి వచ్చిన భక్తులు అడవి ప్రాంతంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకునేందుకు చేతి పంపు నీటితో అవసరాలను తీర్చుకుంటున్నారు. భారీ వర్షాలు కురుస్తుడడంతో భూగర్భజలాలు పెరిగి చేతి పంపు నుంచి పాతాళగంగ వ్యవసాయ బోరు మోటారు పోసినట్లుగా ఉబికి వస్తుడడంతో మేడారానికి వచ్చిన భక్తులు, దారిగుండా వెళ్లే వాహనాదారులు అక్కడ కొద్ది సేపు వాహనాలను నిలిపి చూసి వెళ్తున్నారు. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జ్ దోర్నాల రాజేందర్ ఆధ్వర్యంలో వికలాంగులు, చేయూత పింఛన్‌దారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు, చేయూత పింఛన్‌దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలన్నారు. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ల పెంపు కోసం పింఛన్‌దారులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ శ్యాంబాబు, నాయకులు అంబాల చంద్రమౌళి, శ్రీనివాస్, తిరుపతి, ఎర్ర భద్రయ్య పాల్గొన్నారు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ములుగు రూరల్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ములుగు సెక్టార్ సీడీపీఓ శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన పోషణమాసం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు తయారు చేసిన ఆహార పధార్ధాలను ప్రదర్శించారు. పౌష్టికాహార లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల తగ్గుతుందని, మహిళల్లో రక్తహీనత సమస్యలు తలెత్తుతాయని వివరించారు. బాలింతలకు ముర్రుపాల ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం పూలతో బతుకమ్మలు పేర్చి ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ములుగు సెక్టార్ సూపర్వైజర్ కావ్య, డీసీ మమత, ములుగు బ్లాక్ కో ఆర్డినేటర్ వెంకటరాజు, ప్రాజెక్టు సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. సీడీపీఓ శిరీష -
సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ ములుగు: తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ అని, ఐక్యత, సౌభ్రాతృత్వం, ఆడపడుచుల ఆత్మీయత పండుగలో ప్రతిబింబిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎస్వీపీ సూర్య చంద్రకళ తెలిపారు. బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ములుగు బాలరక్ష భవన్ ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని పూలతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహభరితంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ. సూర్య చంద్రకళ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగలోని గొప్పతనం, మహిళల భాగస్వామ్యం, సమాజంలో వారి స్థానం గురించి గొప్పగా వివరించారు. మహిళా శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి, కార్యదర్శి రంగోజు భిక్షపతి, న్యాయవాదులు రామ్‌సింగ్, బాలుగు చంద్రయ్య, మేకల మహేందర్ బానోతు స్వామిదాస్, సీడీపీఓ శిరీష, వివిధ శాఖల మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టు తప్పుతున్న పాలన
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పాలన పట్టు తప్పుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల, పాలకవర్గాల ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అంతటా ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయి రెండేళ్లు కావొస్తోంది. అలాగే 8 నెలల క్రితం మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పూర్తి కావడంతో అంతా ప్రత్యేకాధికారులతోనే పాలనను నెట్టుకొస్తున్నారు. అసలే శాఖాపరమైన బాధ్యతలతో సతమతమయ్యే అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాలో ఏ శాఖలో చూసినా అధికారులు బిజీబిజీగానే కనిపిస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జ్ అధికారులకే మళ్లీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. కొద్దిరోజులుగా వరుసగా సర్వే పనులు, సంక్షేమ పథకాల అమలు పనుల్లోనే అధికారులు నిమగ్నమవుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదంటున్నారు. పర్యవేక్షణ కొరపడడంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే లెక్కగా మారుతోంది. ముఖ్యంగా జిల్లాలో పలు ప్రధాన శాఖలను ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకు రావడంతో పాలన పట్టుతప్పే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితులతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల ఉరుకులు పరుగులు.. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్బెడ్రూం లాంటి పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే, లబ్ధిదారుల ఎంపిక జాబితాలు తప్పుల తడకగానే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అదనపు విధులతో అధికారులపై ఒత్తిడి పెరిగి పోవడంతోనే ప్రభుత్వానికి సరైన నివేదికలు అందడం లేదని తెలుస్తోంది. అలాగే గడువులోగా వివిధ రకాల నివేదికలను అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికారుల సతమతం.. ప్రత్యేక పాలన కొనసాగడంతో కొన్ని శాఖల జిల్లా అధికారులకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు జెడ్పీ సీఈఓ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), మున్సిపాలిటీ, ప్రత్యేక అధికారిగా, మండల ప్రత్యేక అధికారిగా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మైనార్టీ, ఎస్సీ వెల్ఫేర్ శాఖలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 17 శాఖల్లో ఇన్చార్జ్ అధికారులకు ఇన్చార్జ్ విధులను అప్పగించడంతో ఏశాఖలోనూ పూర్తిస్థాయిలో పనిచేసిన పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. జిల్లా మార్కెటింగ్, టీజీఎంఐడీసీ, ఎకై ్సజ్, పరిశ్రమల, లేబర్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, తునికలు కొలతలు, డ్రగ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు విధులతో అధికారులు సతమతమవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు జిల్లా అధికారి అందుబాటులో లేరని చెప్పడంతో నిరాశగా తిరిగి వెళ్లిపోతున్నారు. కనీసం కొందరు అధికారులు ఫోన్లోనైనా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇలా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు పూర్తి కావడం లేదని వారు పేర్కొంటున్నారు. కార్యాలయ సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదని తెలుస్తోంది. అలాగే, దీనికి తోడు తరుచు వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు, వివిధ కార్యక్రమాలతో అధికారులు బిజీబిజీగా మారుతున్నారు. కొరవడుతున్న పర్యవేక్షణఇన్చార్జ్ బాధ్యతలు, అదనపు విధులతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సొంత శాఖల పనితీరు పైననే దృష్టి సారించలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం పని ఒత్తిడి కారణంగానే సొంత శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను పసిగట్టలేక పోయారన్న చర్చ జరుగుతోంది. అదనపు విధులతో సొంత శాఖ పనులపై కొంత నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పలు శాఖల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రస్థాయి అఽధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో ఆయా శాఖల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని పసిగట్టలేకపోవడంతోనే పాలన గాడితప్పుతుందన్న విమర్శలు వస్తున్నాయి. అదనపు విధులతో అధికారులపై తీవ్ర ఒత్తిడి ఒక్కొక్కరికి నాలుగైదు శాఖల ఇన్చార్జ్ బాధ్యతలు ప్రత్యేక పాలనలో ప్రజలకు తప్పని ఇబ్బందులు -
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఏరియాలోని కృష్ణకాలనీలో జరుగుతున్న సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతీ సింగరేణి ఉద్యోగి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. సింగరేణి ఉద్యోగులు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. భూపాలపల్లి నుంచి కోల్ ఇండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ కేటగిరిల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ నరేష్‌నాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, అఽధికారులు పాల్గోన్నారు. దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి జిల్లా కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
స్థానికంపై సందిగ్ధం..
వెంకటాపురం(ఎం): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీ లోగా నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. మరో వారం రోజులే గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీ య పార్టీల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉండేనా.. మళ్లీ వాయిదా పడేనా అని రాజకీయ పార్టీల నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం సన్నద్ధం ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమై ఉంది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను కూడా అధికారులు ప్రకటించారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులు, ఇతర సామగ్రి సైతం సిద్ధం చేశారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు, 10 జెడ్పీటీసీలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,29,159 మంది ఓటర్ల కోసం 1,436 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 2న తుది జాబితాను ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆధారంగా తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమేనని అధికారులు పేర్కొంటున్నారు. వారం రోజులే గడువు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు హామీనిచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినప్పటికీ గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉండడంతో పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల, పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటించి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ఫైల్ పెండింగ్ ఉందని, ఎన్నికల కోసం మరింత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లపై ఎటూ తేల్చని ప్రభుత్వం ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేసిన అధికారులుమండలం జీపీలు వార్డులు ఓటర్లు ఎంపీటీసీలు వెంకటాపురం(ఎం) 23 200 28,236 9 ఏటూరునాగారం 12 114 24,636 9 గోవిందరావుపేట 18 154 25,441 9 కన్నాయిగూడెం 11 90 9,992 5 మల్లంపల్లి 10 90 13,507 5 మంగపేట 25 230 39,369 14 ములుగు 19 172 24,985 9 ఎస్ఎస్ తాడ్వాయి 18 152 18,226 7 వెంకటాపురం(కె) 18 166 25,336 9 వాజేడు 17 152 19,431 7ప్రభుత్వం ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ పార్టీల నేతల్లో గందరగోళం నెలకొంది. గ్రామాల్లో ఆశావహులు ఎన్నికల కోసం ముందస్తు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ షెడ్యూల్ విడుదల కాకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలంటే షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేక కోర్టు ద్వారా గడువు కోరుతుందా అనేది స్పష్టత లేకపోవడంతో అధికార పార్టీ నేతలు సైతం ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని పేర్కొంటున్నారు. -
సరికొత్త మేడారం..!
వనదేవతల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణానికి శ్రీకారం మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సభకు వచ్చిన మహిళలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ములుగు: తెలంగాణ కుంభమేళా, వనదేవతల జన జాతర మేడారం రూపుమారనుంది. సమ్మక్క,సారలమ్మ ప్రాంగణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. వచ్చే జనవరిలో జరిగే మహాజాతరకు శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనుల పరిశీలనకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మేడారం సందర్శించారు. తల్లుల దర్శనం, మొక్కుల చెల్లింపు, పనుల పరిశీలన, బహిరంగ సభలో ప్రసంగం మొత్తంగా ఆయన పర్యటన మేడారంలో 2.04 గంటలపాటు కొనసాగింది. సీఎంతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు. జాతర ప్రాశస్త్యం గుర్తుండి పోయేలా ప్రణాళిక: మంత్రి ధనసరి సీతక్క జాతర ప్రాశస్త్యం అనేక శతాబ్దాలు గుర్తుండి పోయేలా ప్రణాళిక రూపొందించి మేడారంలో అభివృద్ధి పనులు చేయనున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించాం. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధి ప్రణాళి కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి తల్లుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గద్దెల విస్తరణ విషయంలో అనేక అపోహలు ఉన్న నేపథ్యంలో నిర్మాణం ఏ విధంగా జరగాలని, గిరిజనుల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడడం కోసం సీఎం స్వయంగా మన ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది. మాస్టర్‌ప్లాన్‌ను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి సమ్మక్క, సారలమ్మకు మొక్కుల సమర్పణ అభివృద్ధి పనులు పరిశీలించి మంత్రులకు సూచనలు గిరిజన సంప్రదాయాల ప్రకారమే పనులు సాగుతాయని స్పష్టీకరణ రెండు గంటలపాటు సాగిన ముఖ్యమంత్రి పర్యటన –ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. వన దేవతల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క–సారలమ్మ ఆలయం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. -
పెరుగుతున్న గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న బ్యారేజీల నుంచి వస్తున్న వర్షాలతో సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీకి ఎగువన ఉన్న అన్నారం, సరస్వతీ, లక్ష్మీ బ్యారేజీల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 5,13,540 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని వదులుతున్నారు. ప్రస్తు తం బ్యారేజీ వద్ద 80 మీటర్ల నీటిమట్టం ఉంది. సమ్మక్కసాగర్‌లోకి 5,13,540 క్యూసెక్కుల నీటి ప్రవాహం 59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న నీరు -
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
వెంకటాపురం(ఎం): అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా చిన్నారులు, గిర్భణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుందని ఐసీడీఎస్ ములుగు సీడీపీఓ శిరీష తెలిపారు. మండల పరిధిలోని నర్సాపూర్, అడవి రంగాపూర్ అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం పోషణమాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి గర్భిణులు, బాలింతలకు వివరించారు. స్థానికంగా ఉన్న ఆహార పదార్ధాలతో సైతం పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సెక్టార్ సూపర్వైజర్ కళావతి, ములుగు డీసీ మమత, బ్లాక్ కోఆర్డినేటర్ వెంకటరాజు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.సీడీపీఓ శిరీష -
కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేయాలి
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ వసతి, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ల కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా వర్కర్లకు టైం స్కేల్ చేయాలని సీఐటీయూ నాయకులు దావూద్, రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు మంగళవారం ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని మేడారం ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌కు వచ్చిన గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డిలను కలిసి కార్మికులు, నాయకులు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికులకు కేవలం రూ.15,600లు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్ కమిషన్, జీఎస్టీ కలిపి రూ.21వేలు అవుతుందని వీటిని ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి చెల్లిస్తుందని వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 20 మంది వర్కర్లకు టైం స్కేల్ ప్రకారం రూ.19వేలు వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. దానిప్రకారం ఇక్కడ కూడా అప్‌గ్రేడ్ చేయాలని విన్నవించినట్లు వివరించారు. అలాగే వర్కర్లకు రెండు జతల బట్టలు, వారంతపు సెలవులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, కమల, నాగమణి, సరోజన, లలిత, సారబాబు, శాంతమ్మ, రాజమ్మలతో పాటు 140 మంది వర్కర్లు పాల్గొన్నారు.సీఐటీయూ నాయకులు దావూద్, రాజేందర్ -
మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు ● వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చినట్లు అర్చకులు ముడుంబై రఘునాథచార్యులు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భవాని మాలలు ధరించిన స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి ఊరేగింపుగా అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవాలను నిర్వహించనున్నారు. – ములుగు -
అద్దె డబ్బులు అందేనా?
● అద్దె ఇళ్లలో అంగన్వాడీ కేంద్రాల కొనసాగింపు ● పెండింగ్‌లో 6 నెలల బిల్లులు ● సొంతంగా డబ్బులు చెల్లిస్తున్న టీచర్లుములుగు రూరల్: జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో సెంటర్ల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. అద్దె భవనాల వద్ద అరకొర వసతుల నడుమ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. జిల్లాలోని పది మండలాల పరిధిలో ములుగు, ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 640 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 153 కేంద్రాలు అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల బిల్లులు ప్రభుత్వం నుంచి సకాలంలో రాకపోవడంతో టీచర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మిగితావి 276 సొంత భవనాల్లో, 211 ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె నిబంధనలు ఇలా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె చెల్లింపునకు శానిటేషన్, నీటి సదుపాయం, 500 గజాల స్థలం కలిగి ఉండాలి. రెండు గదులతో పాటు కిచెన్ రూం వేరుగా ఉండాలి. నిబంధనల మేరకు అద్దె ఇళ్లు దొరకక పలు సెంటర్లు అరకొర వసతుల మధ్య కొనసాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. నెల వారీగా అండన్వాడీ కేంద్రాలకు వచ్చే బియ్యం, కోడిగుడ్లు, చిన్నారుల ఆట వస్తువులను భద్రపరచడం కూడా కష్టతరంగా మారుతుంది. పట్టణ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాలకు రూ.1,000 నెల వారీ అద్దె చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 750 చెల్లిస్తారు. ఆరు నెలల అద్దె బిల్లు పెండింగ్ జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు గత ఏడు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో అంగన్వాడీ టీచర్లు ఇంటి యజమానులకు సమాధానం చేప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు టీచర్లు చేసేదేమీ లేక సొంత డబ్బుల నుంచి అద్దె చెల్లిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి..అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతినెలా అద్దెకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఫిబ్రవరి–2025 వరకు అద్దె బిల్లులు చెల్లించాం. మిగతా ఆరు నెలల అద్దెకు సంబంధించిన బడ్జెట్ రాలేదు. బడ్జెట్ వచ్చిన వెంటనే అద్దె బిల్లులను చెల్లిస్తాం. –తుల రవి, జిల్లా సంక్షేమ అధికారి ప్రాజెక్టులు సొంత అద్దె ప్రభుత్వ భవనాలు భవనాలు భవనాలుములుగు 26 52 64 ఎస్ఎస్ తాడ్వాయి 58 27 39 ఏటూరునాగారం 100 40 66 వెంకటాపురం(కె) 92 34 42 -
రహదారుల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలి
● వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి ములుగు రూరల్: జాతీయ రహదారుల నిర్మానానికి అవసరమయ్యే భూసేకరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌లు హాజరయ్యారు. దసరా పండుగకు ముందు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబందించిన పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల పరిహారం మొత్తం డిపాజిట్ చేసి భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని వివరించారు.. -
ప్రజా సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాంములుగు రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరుతుందని తెలిపారు. విదేశీ వస్తువులపై ఆధార పడకుండా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని, మేకిన్ ఇండియా ద్వారానే దేశం శక్తివంతం అవుతుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, సురేందర్, స్వరూప, రవీంద్రాచారి, వెంకట్, కృష్ణాకర్ రావు, రాజ్ కుమార్ పాల్గొన్నారు. -
ఓపెన్‌కాస్ట్ సందర్శన
మల్హర్: మండలంలోని తాడిచర్ల బ్లాక్–1 ఓపెన్‌కాస్ట్‌ను జెన్కో ఐఆర్టీసీ, డైరెక్టర్ (కోల్ అండ్ లాజిస్టిక్) నాగ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాగ్య ఓపెన్‌కాస్ట్ వ్యూ పాయింట్ నుంచి ఓసీపీలో జరుగుతున్న పని తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్‌కాస్ట్ ఫ్లాన్లు, పర్యావరణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, సెఫ్టీ ఫ్రికాషన్స్ను నాగ్యకు ఏఎమ్మా అధికారులు వివరించారు. ఓపెన్‌కాస్ట్‌లో జరుగుతున్న పనులు, మైన్‌లో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి అభినందించారు. అనంతరం నాగ్య మాట్లాడుతూ.. అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎమ్మార్ సీఈఓ డీఎల్ఆర్ ప్రసాద్, కేటీపీ ఓవైఎం సీఈ శ్రీప్రకాశ్, ఎస్ఈ రామకృష్ణ, ముత్యంరావ్, జెన్కో జనరల్ మేనేజర్ మోహన్‌రావు, తాడిచర్ల ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్రెడ్టి, సీనియర్ జీఎం కేఎస్ఎన్ మూర్తి, మైన్ జీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
● బిల్లులు లేకుండా విక్రయాలు ● ఎరువుల దుకాణం లైసెన్స్ సస్పెన్షన్కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని అగ్రోస్ ఎరువులమందు దుకాణం నుంచి కాటారం మండలం దామెరకుంటకు బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై కె పవన్‌కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రోస్ ఎరువుల మందుల దుకాణం గుండా దామెరకుంటకు 27 బస్తాలు ట్రాక్టర్లో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. బిల్లులు లేవు..దుకాణం సస్పెన్షన్ అగ్రోస్ ఎరువుల దుకాణంలో మహదేవపూర్ మండలం వ్యవసాయఽ అధికారి సుప్రజ్యోతి సోమవారం తనిఖీ చేపట్టారు. కాటారం మండలం దామెరకుంటకు ట్రాక్టర్లో తరలిస్తూ పట్టుబడ్డ 27 యూరియా బస్తాల్లో 21 బస్తాలకు బిల్లులు ఉన్నాయన్నారు. మిగితా ఆరు యూరియా బస్తాలను ముగ్గురు రైతులకు బిల్లులు లేకుండా విక్రయాలు జరిపినట్లు తేలినట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రికార్డులు స్వాఽ దీనం చేసుకొని సస్పెన్షన్ చేసినట్లు వెల్లడించారు. -
వెయ్యేళ్లు నిలబడేలా మేడారం పనులు
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి : సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారాన్ని వెయ్యేళ్లు నిలబడేలా అభివృద్ధి పనులు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, మాస్టర్‌ప్లాన్ ఆవిష్కరణ కోసం మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మేడారం వస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ములుగులో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 7న మేడారంలో సమ్మక్క, సారలమ్మ దీవెనలు తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారని తెలిపారు. 2024లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంనుంచి ఎన్నికల భేరి మోగించి రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. మేడారానికి మంజూరైన రూ.150 కోట్ల నిధులతో మూడు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. భక్తులకు అనుగుణంగా, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తితో, విశ్వాసంతోనే గద్దెల ప్రాంగణం చుట్టూ సాలాహారం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునే క్రమంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో కొంతమంది తప్పిపోతున్నారని అలాంటి సంఘటనలు జరగకుండా అందరి అభిప్రాయం మేరకు గద్దెల ప్రాంతాన్ని గ్రానైట్‌తో తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. రూ.15 కోట్లతో జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.5 కోట్లతో జంపన్నవాగుకు ఇరువైపులా గ్రీనరీతోపాటు వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రదేశాలైన రామప్ప, లక్నవరం, మే డారం జాతర ప్రత్యేకతలు తెలుపుతూ వాటి కళాత్మకతను పర్యాటకులకు తెలియజేసే విధంగా గట్టమ్మ నుంచి మేడారం వరకు ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి ఉన్నారు. పనుల పరిశీలన, మాస్టర్‌ప్లాన్ ఆవిష్కరణకు నేడు మేడారం రానున్న సీఎం రేవంత్‌రెడ్డి భక్తులు, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల ప్రాంతం అభివృద్ధి రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్కమేడారంలో ఏర్పాట్ల పరిశీలన.. మేడారాన్ని సోమవారం కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణిలతో కలిసి మంత్రి సీతక్క పరీశీలించారు. సమ్మక్క–సారలమ్మ దేవతలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో శంకుస్థాపన, పరిశీలించే పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ పర్యటనకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, ఏపీఓ వసంతరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
యూరియా కష్టాలు..
● క్యూలో చెప్పులు, ఖాళీ మద్యం సీసాలు ములుగు రూరల్: రైతన్నలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్‌లో సోమవారం యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో చెప్పులను ఉంచడంతో పాటు కొంత మంది ఖాళీ మద్యం సీసాలను ఉంచారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రైతులకు యూరియా టోకెన్లు అందిస్తున్న సమాచారం తెలుసుకున్న ములుగు పరిసర ప్రాంతాల రైతులు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి టోకెన్ల కోసం వేచి ఉన్నారు. రైతుల సాగు చేసిన పంటలకు అనుగుణంగా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
అసత్య ప్రచారాలు సరికాదు
ములుగు రూరల్: లంబాడీలను వలసవాదులని అసత్య ప్రచారాలు చేయడం సరికాదని మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో భూక్య అమర్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లంబాడీలతో కలిసి అభివాదం తెలిపిన అనంతరం సీతారాంనాయక్ మాట్లాడారు. రాజకీయ నాయకులు పబ్బం గడుపుకునేందుకు లంబాడీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని పది మండలాల్లో లంబాడీలను కలుపుకొని భవిష్యత్‌లో జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీలతో పాటు భారీ బహిరంగ నిర్వహిస్తామన్నారు. లంబాడీలు ఐకమత్యంతో ఉండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితా నుంచి తొలగిస్తారని వస్తున్న వదంతులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం అడ్‌హక్ కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భూక్య అమర్‌సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా లకావత్ నర్సింహ, కోశాధికారి కుమార్ పాడ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోరిక గోవింద్‌నాయక్ , భూక్య జంపన్న, కొర్ర రాజు, దేవానాయక్, ప్రశాంత్, మూడ్ రాజా, బాలునాయక్, సర్వన్ కుమార్, సదర్లాల్, బబ్లూ, చందులాల్, జగన్నాయక్, వినోద్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ -
ఎంగిలిపూల సంబురం
అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలుఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు ఉదయం నుంచే తీరొక్క పూలను సేకరించి తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలు, ఆట స్థలాల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మలను ఒక దగ్గర చేర్చి ఒక్కేసి పువ్వేసి చందమామ.., బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడిపాడారు. దీంతో ఆయా ప్రాంతాలు పాటలతో మారుమోగాయి. జిల్లాకేంద్రంలోని శివాలయానికి మహిళలు బతకమ్మలతో చేరుకొని ఆడిపాడారు. అనంతరం వాయినాలు ఇచ్చిపుచ్చుకుని సమీపంలోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. – ములుగు రూరల్ -
‘ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి’
ములుగు రూరల్: ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సంఘాల రాష్ట్ర అధికార ప్రతినిధి గోపు జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో ఓసీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓసీలు ఐక్యమత్యంతో ఉండాలన్నారు. ఉద్యమాల ద్వారానే ఓసీ హక్కులను సాధించుకోవాలని సూచించారు. 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను తొలగించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య కుల సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణను వచ్చేనెల రెండోవారంలో వరంగల్‌లో నిర్వహించే సదస్సులో ప్రకటిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మ పిచ్చిరెడ్డి, కొమురవెల్లి రమేష్, సతీష్‌రెడ్డి, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, వెల్పూరి సత్యనారాయణరావు, రవిరెడ్డి, వాసుదేవరెడ్డి, సతీష్‌కుమార్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
90 రోజుల్లోనే అభివృద్ధి పనులు
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్న సీతక్కఎస్ఎస్తాడ్వాయి: 90 రోజుల్లోనే మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రేపు(మంగళవారం) మేడారానికి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను జిల్లా అధికారులు, పూజారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, జిల్లా ఉన్నతాధికారులతో పాటు సమ్మక్క–సారలమ్మ పూజారులతో మంత్రి సీతక్క ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మేడారం పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను సీఎం ఖరారు చేస్తారన్నారు. అనంతరం అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయని స్పష్టం చేశారు. పనుల్లో 2 వేల మంది కార్మికులు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 12 గంటలకు మేడారానికి చేరుకుని తొలుత అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాస్టర్ ప్లాన్ డిజైన్ పూజారులతో కలిసి సీఎం ఎల్ఈడీ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన మరుసటి రోజు నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 90 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన సాగుతాయని, ఈ పనుల్లో 2వేల మంది కార్మికులు పాల్గొనున్నట్లు వివరించారు. మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి వనదేవతలపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న భక్తి విశ్వాసంతో మేడారం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి జాతరకు ముందుస్తుగా మేడారానికి వస్తున్నారని తెలిపారు. గద్దెల ప్రాంగణంలో పనులు చేస్తున్న సమయంలో పూజారులు వెంట ఉండి ఏమైనా చిన్నచిన్న చేర్పులు మార్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమానికి అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. గద్దెల ప్రాంగణం విస్తీర్ణంతో పాటు మేడారం పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు కూడా అంతే వేగంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. 28 జనవరి 2026 నుంచి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సంపూర్ణంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సీతక్క ఉదయం 10 గంటలకు మేడారానికి చేరుకుని పర్యవేక్షించారు. సీఎం హెలీపాడ్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే మార్గాన్ని ఎండోమెంట్ ఆవరణలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, అధికారులు పాల్గొన్నారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై మాస్టర్ ప్లాన్ డిజైన్ ఆవిష్కరించనున్న సీఎం సీఎం వచ్చి వెళ్లిన మరుసటి రోజు నుంచే పనులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
దేవీ శరన్నవరాత్రులకు మండపాలు ముస్తాబు
ఏటూరునాగారం: మండల పరిధిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులను నిర్వహించేందుకు ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకలకు మండపాలను ముస్తాబు చేశారు. అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకువచ్చేందుకు డీజేలు, ప్రత్యేక రథాలను సిద్ధం చేశారు. భవాని మాలలు ధరించే స్వాములు సైతం భద్రకాళి దేవాలయం చేరుకొని మాలలను ధరించారు. అలాగే స్టార్ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి కోసం ప్రత్యేక డిజైన్లతో మండపాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు వేడుకలు -
చెప్పినా వినరు.. నిషేధించినా ఆగరు
వాజేడు: జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనను నిలిపివేసినా.. చెప్పాపెట్టకుండా, అధికారుల కళ్లుగప్పి దొడ్డిదారిన పలువురు పర్యాటకులు వెళ్తున్నారు. రక్షణ లేని జలపాతాలను చూస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పర్యాటకులకు ఎంత చెప్పినా.. ఏర్పాట్లు కట్టుదిట్ట చేసినా వెళ్లడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం మండల పరిధిలోని కొంగాల సమీపంలోని గుట్టల్లో ఉన్న దూసపాటి లొద్ది జలపాతాన్ని చూసేందుకు హైదరాబాద్‌కు చెందిన కొండిశెట్టి మహాశ్విన్(18) తన మిత్రులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి గల్లంతయ్యాడు. మంగళవారం జీపీ సిబ్బంది అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టగా మృతదేహం బయటపడింది. నిషేధిత జలపాతాల వద్దకు వెళ్లొద్దు జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యంధార, మాసన్ లొద్ది, భామన సిరి, గుండం, దూసపాటి లొద్ది మొదలైన జలపాతాల సందర్శనను వెళ్లవద్దని కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వర్షాకాలం ప్రారంభంలోనే అధికారికంగా ప్రకటించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతాలు ఉండడంతో ఫోన్ సిగ్నల్స్‌తో పాటు రక్షణ సౌకర్యాలు లేనందున సందర్శన నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా చెక్ పోస్టులు సైతం ఏర్పాటు చేశారు. కాని కొందరు పర్యాటకులు సిబ్బంది విధులకు రాని సమయం కంటే ముందే, మరికొందరు దొంగదారుల్లో జలపాతాల వద్దకు వెళ్లి వస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ముత్యంధార జలపాతానికి వెళ్లిన కొందరు పర్యాటకులు వెళ్లి ఒక్కరు తప్పిపోవడంతో అధికారులు రాత్రంతా గాలించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన మరచిపోకముందే దూసపాటి లొద్దికి వెళ్లిన యువకుడు మృత్యువాత పడడం విషాదకరంగా మారింది. తమపైన ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న తల్లిదండ్రులను గుర్తుంచుకుని నిషేధిత జలపాతాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటక సురక్షిత ప్రాంతాలైన బొగత, రామప్ప, లక్నవరం వంటి సుందర ప్రదేశాలకు వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. దొంగచాటున నిషేధిత జలపాతాల సందర్శన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పలువురు పర్యాటకులు -
ప్రాణం తీసిన ఫొటోల సరదా
వాజేడు/అబ్దుల్లాపూర్‌మెట్: జలపాతాల వద్ద ఫొటోల సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థి గల్లంతయ్యాడు. ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వాజేడు ఎస్సై జక్కుల సతీశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన హర్షారెడ్డి, శివరాంరెడ్డి, అభిరామిరెడ్డి, మహాశ్విన్(18), సాక్షిత్, అర్జున్, పూజ, రాకేశ్‌లు ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీపంలోని దుసపాటి లొద్ది జలపాతం సందర్శనకు వచ్చారు. ఇందులో పూజ, రాకేశ్ భార్యాభర్తలు. కాగా వీరంతా స్నేహితులు. ఈ క్రమంలో జలపాతం వద్ద ఫొటోలు దిగుతున్న కొండిశెట్టి మహాశ్విన్ నీటిలో జారి పడ్డాడు. వెంటనే పూజ అతడిని రక్షించడం కోసం నీటిలోకి దూకింది. మహాశ్విన్ భయంతో ఆమెను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగారు. వెంటనే హర్షారెడ్డి, శివరాంరెడ్డి నీటిలోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగిపోవడంతో అర్జున్ నీటిలోకి దూకి పూజ, హర్షారెడ్డి, శివరాంరెడ్డిని కాపాడాడు. మహాశ్విన్ను కాపాడేందుకు తిరిగి నీటిలోకి వెళ్లేలోగానే అతడు గల్లంతయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన మిగతావారు, ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు గజఈతగాళ్లను పంపించారు. మధ్యాహ్నం సమయంలో మహాశ్విన్ మృతదేహం లభించింది. మృతుడు హైదరాబాద్‌లో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాడు. ఈ ఘటనపై వాజేడు పోలీసులు కేసు నమోదు చేశారు.ఆనందం కోసం వస్తే.. వారంతా స్నేహితులు. సెలవు రోజు ఆనందంగా గడుపుదామని జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా అందులో ఓ ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బేగంపేట రసూల్‌పుర ప్రాంతానికి చెందిన క్యామ సాయితేజ (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతడు తన స్నేహితులైన సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్‌లతో కలిసి కోహెడ శివారులో ఓఆర్ఆర్ సర్విస్‌రోడ్డు పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు సాయితేజ నీటిలో జారి పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో మిగతావారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలతో రాత్రి వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సాయితేజ ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని కేజీబీవీకి చెందిన నాగేశ్వరి సబ్ జూనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో నాగేశ్వరి ప్రతిభ కనబర్చడంతో నిర్వాహకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి చల్ల సునీత తెలిపారు. ఈ నెల 25నుంచి 28వరకు నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్ఓ పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏరియా స్థాయి లాల్ టెన్నస్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా సర్వే అధికారి శైలేంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాదని ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, కెప్టెన్లు మల్లేష్, శ్రీరాములు, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 30 మంది విదేశీయులు శిక్షణలో భాగంగా శనివారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని ఇరాక్, పాలస్తీనా, అర్మేనియా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, ఈజిప్ట్, దక్షిణ సూడాన్, జిబౌటి, ఉగాండా, టాంజానియా, కెన్యా, కోట్ డివోయిర్, గాంబియా, లైబీరియా, ఘనా, మొజాంబిక్, జాంబియా, నమీబియా, మారిషస్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, సురినామ్ దేశాలకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు, అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్ అంటూ కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి బోటింగ్ చేశారు. -
రహదారులు ఇలా.. వెళ్లేదెలా?
● ఎన్‌హెచ్ 163పై అడుగడుగునా గుంతలు ● ఇసుక లారీల టైర్ల అచ్చులు ● ప్రమాదాల బారిన పడుతున్నా.. పట్టించుకోని అధికారులుగోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలోని జాతీయ రహదారి అధ్వానంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక లారీల రాకపోకలతో టైర్ల అచ్చులు పడడంతో పాటు 163 జాతీయ రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు ఇలా ఉంటే వెళ్లేదెలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలువురు ప్రమాదాల బారిన పడినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 20 కిలో మీటర్లు గుంతలు గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా, గోవిందరావుపేట, చల్వాయి, ఎస్ఎస్ తాడ్వాయి రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. గోవిందరావుపేట మండలంలోని మచ్చాపూర్ గ్రామం నుంచి పస్రా చివరి వరకు సుమారు 20 కిలోమీటర్ల మార్గం పూర్తిగా గుంతలు, లారీ టైర్ల అచ్చులతో ప్రమాదభరితంగా మారింది. వర్షాలు పడితే ఈ గుంతలు చిన్నచిన్న చెరువుల్లా మారిపోతున్న పరిస్థితి. నీళ్లు ఉన్న సమయంలో గుంతలను గుర్తు పట్టలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. భూపాలపల్లి నుంచి బయ్యక్కపేట మీదుగా.. రోడ్ల ధ్వంసంతో మేడారం దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట దారిలో రోడ్లు ఽధ్వంసమై గుంతలను తలపిస్తున్నాయి. భూపాలపల్లి నుంచి బయ్యక్కపేట మీదుగా ప్రైవేటు వాహనాల్లో ఆది, బుధ, గురు, శుక్రవారాల్లో మేడారానికి భక్తులు ఈ రోడ్డు మార్గన వస్తుంటారు. బీటీ రోడ్లు భారీగా దెబతిన్నడంతో రాత్రి వేళలో మేడారానికి వచ్చే వాహనాదారులు అదమరిచి గుంతల్లో పడితే ప్రమాదాల భారీన పడే అవకాశం ఉంది. బయ్యక్కపేట నుంచి గోవిందరావుపేట మండలంలోని పస్రా, నార్లాపూర్‌కు పనుల నిమిత్తం ద్విచక్ర వాహనాలపై వస్తుంటారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తాడ్వాయి– పస్రా మార్గంలో రోడ్లు దెబ్బతిన్నడంతో ఇసుక లారీలను తాడ్వాయి నుంచి మేడారం, నార్లాపూర్ మీదుగా ఇసుక లారీలు బయ్యక్కపేట నుంచి భూపాలపల్లి వైపు వెళ్లడంతోనే రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. -
ప్రజాస్వామ్య విలువలు తెలిపేందుకు ఎన్నికలు
వెంకటాపురం(ఎం): పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య విలువలు విద్యార్థులకు తెలుస్తాయని వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాధిక తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ పదవులకు శనివారం ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాధిక మాట్లాడుతూ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యేందుకు పోటీలో ఉన్న విద్యార్థులతో నామినేషన్ల నుంచి ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల నియమావళిని పాటించినట్లు వివరించారు. ఎన్నికల్లో స్టూడెంట్ కౌన్సిల్ లీడర్లుగా బాలుర నుంచి సృజన్ 42 ఓట్లతో, బాలికల నుంచి వర్షిణి 26 ఓట్లతో విజయం సాధించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. పదవి అనేది హక్కుగా కాకుండా బాధ్యత, సేవతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్‌లో భావిభారత పౌరులుగా, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎండీ. ఫరీనా బేగం, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫిరోజ్, కిరణ్ కుమార్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో రద్దీ
జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్‌ల్లో శనివారం రద్దీ కనిపించింది. పండుగ కావడంతో బస్సులు సమయానికి రాకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్‌లో పడిగాపులు పడ్డారు. హాస్టళ్లు, వసతి గృహాల నుంచి విద్యార్థులు ఇంటిదారి పట్టారు. పూల దుకాణాల వద్ద పూలు కొనుగోలు చేసేందుకు ఆడపడుచులు ఆసక్తి చూపారు. అంతేకాకుండా తంగేడు, టేకు, గునుగు పూల కోసం ఆడపడుచులు ఆడవి బాట పట్టి సేకరించడంలో నిమగ్నం అయ్యారు. ఏటూరునాగారం బస్టాండ్‌లో ప్రయాణికులుబస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు