లోపభూయిష్టంగా విద్యాకమిషన్ సిఫారసులు
ఏటూరునాగారం: తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు లోపభూయిష్టంగా, విద్యారంగానికి ఉపాధ్యాయులకు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ వీరభద్రం అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగిన సంఘ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ సొంత అభిప్రాయాలను విద్యారంగం ఉపాధ్యాయులపై రుద్దడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని సిఫారసులు ఇవ్వడం అర్ధరహితమన్నారు. రాష్ట్రంలోని విద్యావవస్థపై సమగ్ర అధ్యయనం చేసి పాఠశాలల పరిస్థితులు, విద్యా ప్రమాణాల పెంపు, విద్యా రంగ పురోగతిపై ప్రభుత్వానికి మంచి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సమగ్రంగా సర్వేలు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అడప రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాంబాబు, కందుకూరి రాజు, రాజేంద్రప్రసాద్, నాయుడు, విష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


