జుట్టు రాలడం అనేది ఇక గతం.. బట్టతల సమస్యకు కాలం చెల్లింది. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు నూతనంగా ఆవిష్కరించిన ‘స్మార్ట్ క్యాప్’ ధరిస్తే చాలు.. రాలిపోయిన జుట్టు మళ్లీ వచ్చేస్తుంది. జుట్టు వృద్ధాప్యానికి కారణమయ్యే ఎంజైమ్‌లను ఏకంగా 92 శాతం వరకు తగ్గించే వినూత్న ‘లైట్ థెరపీ’ టెక్నాలజీతో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నారు ‘కైస్ట్’ పరిశోధకులు. ఇటు మందులు లేవు, అటు సైడ్ ఎఫెక్ట్స్ లేవు.. కేవలం కాంతి కిరణాల మాయాజాలంతో జుట్టు కుదుళ్లకు తిరిగి ప్రాణం పోసే ఈ అద్భుత ఆవిష్కరణ వివరాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా చర్చ
వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న బట్టతల సమస్యకు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్న విప్లవాత్మక పరిష్కారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాశంగా నిలిచింది. ‘స్మార్ట్ క్యాప్’తో రాలిపోయిన జుట్టు మళ్లీ చిగురిస్తుందని వారు నిరూపిస్తున్నారు.
92 శాతం ఫలితం.. పరిశోధనలో సంచలనం
దక్షిణ కొరియాలోని ప్రముఖ కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కైస్ట్) పరిశోధకులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. వారు రూపొందించిన ప్రత్యేక లైట్ థెరపీ ద్వారా జుట్టు వృద్ధాప్యానికి కారణమయ్యే మార్కర్లు ఏకంగా 92 శాతం తగ్గినట్లు గుర్తించారు. ఈ వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్ కమ్యూనికేషన్స్'లో ప్రచురితం కావడంతో ప్రపంచమంతా ఈ పరిశోధనలపై దృష్టి సారించింది.
అసలు కారణంపై పరిశోధనలు చేసి..
జుట్టు ఎందుకు రాలుతుంది? వయసు పెరిగే కొద్దీ జుట్టు కుదుళ్లలో ‘బీటా-గెలాక్టోసిడేస్’ అనే ఎంజైమ్ పెరుగుతుంది. ఇది కణాల వృద్ధాప్యానికి సంకేతం. కొరియన్ శాస్త్రవేత్తలు నేరుగా జుట్టు మొదళ్లలో ఉండే ‘హ్యూమన్ డెర్మల్ పాపిల్లా’ కణాలపై దృష్టి సారించారు. ఈ కణాలను ఉత్తేజితం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని వారు కనుగొన్నారు.
నియర్-ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ సాయంతో..
ఈ చికిత్సలో 730 నుండి 740 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం కలిగిన ‘నియర్-ఇన్‌ఫ్రారెడ్’ కాంతిని వినియోగించారు. ఈ ప్రత్యేక కాంతి కిరణాలు చర్మం లోపలికి చొచ్చుకుపోయి, నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్లను మేల్కొల్పుతాయి. ప్రయోగశాల పరీక్షల్లో, ఈ కాంతి సోకిన కణాలు సాధారణ కణాల కంటే ఎంతో ఆరోగ్యంగా, యవ్వనంగా మారినట్లు తేలింది.
కాంతి ప్రసారంతో అద్భుతం
గతంలో కూడా ఇలాంటి లేజర్ హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి బరువుగా, అసౌకర్యంగా ఉండేవి. అయితే కైస్ట్ శాస్త్రవేత్తలు ఫ్లెక్సిబుల్ ఓఎల్‌ఈడీ (వంగే గుణం ఉన్న లైట్లు) టెక్నాలజీని వాడారు. ఇది చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. దీనిని మనం రోజూ పెట్టుకునే టోపీలో కూడా అమర్చుకోవచ్చు. ఇది తల ఉపరితలానికి పూర్తిగా అంటుకుని ఉండి, కాంతిని సమానంగా ప్రసరింపజేస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స
ప్రస్తుతం జుట్టు కోసం వాడే మినోక్సిడిల్ లేదా ఫినాస్టరైడ్ వంటి మందుల వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ లైట్ థెరపీ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు వాడనవసరం లేదు. అందుకే ఇది అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్లినికల్ ట్రయల్స్ దిశగా..
ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు ల్యాబ్ స్థాయిలో విజయవంతమయ్యాయి. త్వరలోనే వీటిని మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, మార్కెట్లోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ గనుక అందుబాటులోకి వస్తే, బట్టతల అనేది ఇక భవిష్యత్తులో కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కానున్నదనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ‘నేషనల్ ఏఐ ప్లాన్’తో దూకుడు..


