అరుణగ్రహమే టార్గెట్‌ | US WOMEN Alyssa Carson wish to be first to set foot on Mars in 2033 | Sakshi
Sakshi News home page

అరుణగ్రహమే టార్గెట్‌

Feb 20 2026 5:36 AM | Updated on Feb 20 2026 5:36 AM

US WOMEN Alyssa Carson wish to be first to set foot on Mars in 2033

అలిస్సా కార్సన్‌ .. మూడేళ్ల వయస్సులో చూసిన ఒక చిన్న కార్టూన్‌ ఆమె జీవిత లక్ష్యాన్నే నిర్ణయించింది. అమెరికాలోని లూసియానాలో 2001లో జన్మించిన అలిస్సా ‘ద బ్యాక్‌ యార్డిగాన్స్‌’ అనే కార్టూన్‌ను ఇష్టంగా చూసేది. అప్పుడే తన మనసులో ఒక ఆలోచన పుట్టింది. మార్స్‌ గ్రహంపైకి వెళ్లాలని. అప్పటి నుంచి ఆమె తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉంది. నాసా నేరుగా పిల్లలకు శిక్షణ ఇవ్వదు, కాబట్టి ఆమె ప్రతి అవకాశాన్ని తన ఆశయసాధనకు అనుకూలంగా మలుచుకుంది. 

17 ఏళ్ల వయస్సులోనే అప్లైడ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ సర్టిఫికేషన్‌ సాధించి, సబ్‌–ఆర్బిటల్‌ అంతరిక్షంలో పరిశోధనలు చేసే అర్హత పొందింది. 18ఏళ్లకే ప్రపంచంలోని అన్ని నాసా స్పేస్‌ క్యాంపులను పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందింది. 2022 లో నాటో తన కార్యకలాపాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదుగురిలో అలిస్సా ఒకరు కావడం విశేషం. అలిస్సా ఇంగ్లీష్‌తో పాటు స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ దేశాల వ్యోమగాములతో కలిసి పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. అలిస్సా ప్రస్తుతం ఆస్ట్రోబయాలజీలో ఉన్నత చదువులు అభ్యసిస్తూ, అరుణ గ్రహంపై మానవ మనుగడకు అవసరమైన పరిస్థితులపై పరిశోధనలు చేస్తోంది. ఆమె కేవలం తన గమ్యం వైపు పయనించడమే కాకుండా స్టెమ్‌ (సైన్స్ , టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌) రంగాల్లో బాలికల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి కూడా కృషి చేస్తోంది. 

అలిస్సా ప్రస్తుతం అధికారికంగా నాసా వ్యోమగామి కాకపోయినప్పటికీ, ఆమె ఒక అంతరిక్ష శిక్షణలో ఉన్న వ్యక్తిగా, అంతరిక్ష ఔత్సాహికురాలిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే గుర్తింపు ఆమెను 2033 లో నాసా చేపట్టబోయే మార్స్‌ యాత్రలో నిలబెట్టనుందని నిపుణులు భావిస్తున్నారు. సో యూ వాంట్‌ టు బి ఆన్‌ ఆస్ట్రోనాట్‌ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. సోషల్‌ మీడియా ద్వారా తన ట్రైనింగ్‌ని మిలియన్ల మందికి చూపిస్తూ, సైన్స్ ను ఒక కూల్‌ అంశంగా మార్చేసింది. ఒక సాధారణ అమ్మాయి అసాధారణ లక్ష్యం వైపు సాగిస్తున్న ఈ ప్రయాణం, రాబోయే తరాలకు ఒక దిక్సూచి. ఎంతో మంది ఆడపిల్లలకు స్ఫూర్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement