గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై? | Is Gambhir to quit India head coach role RR offer triple role ahead of IPL 2026 | Sakshi
Sakshi News home page

గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Feb 17 2026 11:32 AM | Updated on Feb 17 2026 11:53 AM

Is Gambhir to quit India head coach role RR offer triple role ahead of IPL 2026

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ త్వరలోనే తప్పుకోనున్నాడా? తన కాంట్రాక్టు ముగిసేంత వరకు కూడా అతడు పదవిలో కొనసాగడా?... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)తో మళ్లీ అతడి బంధం బలపడనుందా?..

భారత క్రికెట్‌ వర్గాల్లో ఈ సందేహాలు తలెత్తడానికి ప్రధాన కారణం దైనిక్‌ జాగరణ్‌లో వచ్చిన కథనం. ఈ జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌ రాయల్స్‌ గంభీర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్న వేళ.. గంభీర్‌కు ఆ ఫ్రాంఛైజీ బంపరాఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.

వాటా ఇస్తారా?.. ట్రిపుల్‌ ధమాకా!
ఫ్రాంఛైజీలో 2-3 శాతం వాటా ఇవ్వడంతో పాటు సీఈఓ పోస్టు కూడా ఇస్తామని గంభీర్‌ (Gautam Gambhir)కు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టు మెంటార్‌గానూ అతడికి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు మొత్తం గంభీర్‌ కనుసన్నల్లోనే నడుస్తుంది. సర్వం తానై జట్టును నడిపించే బాధ్యత ఈ మాజీ వరల్డ్‌కప్‌ విన్నర్‌కు దక్కుతుంది.

ఒకవేళ గంభీర్‌ గనుక ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే టీమిండియా హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భారత క్రికెట్‌లో ఓ పదవిలో ఉన్న వ్యక్తి.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదు. 

రెండుచోట్లా సదరు వ్యక్తి పనిచేసినట్లయితే అయితే ‘కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌’ కిందకు వస్తుంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తిపై వేటు పడుతుంది.

టెస్టులలో ఫ్లాప్‌
అయితే, రాజస్తాన్‌ ఆఫర్‌ను గంభీర్‌ అంగీకరించే అవకాశాలు దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. టెస్టుల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్‌ ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌, పాతికేళ్ల తర్వాత సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.

అదే విధంగా ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోల్పోయింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం గంభీర్‌కు వరుస విజయాలు దక్కుతున్నాయి. 2025లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. ఆసియా టీ20 కప్‌ 2025ని కూడా కైవసం చేసుకుంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హిట్‌
ప్రస్తుతం డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీ20 ప్రపంచకప్‌-2026 బరిలో దిగిన టీమిండియా ఈసారీ టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవి చేపట్టిన గంభీర్‌ పదవీ కాలం 2027 వరల్డ్‌కప్‌ వరకు ఉంది. 

ఇలాంటి తరుణంలో గంభీర్‌ టీమిండియా విధులను కాదని.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆఫర్‌కి అంగీకరించే అవకాశం లేదని చెప్పవచ్చు. పట్టుదలకు మారుపేరుగా పేరొందిన గంభీర్‌ భారత్‌కు మరో ఐసీసీ టైటిల్‌ అందించిన తర్వాతే హెడ్‌కోచ్‌గా వైదొలిగే అంశంపై ఆలోచిస్తాడని అతడి అభిమానులు అంటున్నారు.

ఐపీఎల్‌ వీరుడు
టీమిండియా ఓపెనర్‌గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన గౌతం గంభీర్‌ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా రెండు టైటిళ్లు అందించాడు. అంతేకాదు.. 2024లో అదే జట్టుకు మెంటార్‌గా పనిచేసి మరోసారి ట్రోఫీని ముద్దాడేలా చేశాడు. 

అంతకుముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కూడా గంభీర్‌ మెంటార్‌గా పనిచేశాడు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఐపీఎల్‌లో మొత్తంగా 154 మ్యాచ్‌లు ఆడి 4218 పరుగులు సాధించాడు.

చదవండి: గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement