Alluri Sitarama Raju
-
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్: మునిపాలిటీ పరిధి సోమలింగపాలెం సమీపంలో గోకివాడ ఆనకట్ట వద్ద శారదానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.ఇక్కడ నదిలో తేలుతూ ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలో జారిపడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం స్థితిని బట్టి ప్రమాదం జరిగి ఒకరోజు కావచ్చని ఎస్ఐ తెలిపారు.మృతదేహాన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని,మృతుని చిరునామా,ఇతర వివరాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796104 నంబరులో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
వేధింపుల పర్వం
ఏయూలో దళిత పరిశోధకుడిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఈ దారుణ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్.. ఏడు రోజుల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని వీసీ రాజశేఖర్‌కు కస్టమ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ వర్సిటీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. కమిషన్ తాజాగా ‘అత్యవసర’ రిమైండర్‌ను పంపింది. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్‌కు ఉన్న సివిల్ కోర్టు సమానమైన అధికారాలను ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. మద్దిలపాలెం: జాతీయ స్థాయిలో ఘన చరిత కలిగిన విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వర్సిటీ ఉన్నతాధికారుల అనుచిత వైఖరి, మొండితనం కారణంగా జాతీయ స్థాయిలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ పేరుతో నడుస్తున్న ప్రతిష్టాత్మక పీఠం(చైర్)లోనే ఒక దళిత పరిశోధక విద్యార్థికి ఘోర అవమానం ఎదురైంది. ‘జాతీయ ఎస్సీ కమిషన్’ఆదేశాలను సైతం వర్సిటీ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కుతూ ఒక మేధావిని మానసికంగా కుంగదీస్తున్న వైనంపై జాతీయ కమిషన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఫెలోషిప్ నిలిపివేత.. వీసీ, డీన్లపై వేధింపుల ఆరోపణలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పీఠం కింద డాక్టరల్ ఫెలోగా అత్యున్నత పరిశోధన చేస్తున్న యాడాల ప్రవీణ్‌కుమార్ ఏడాది కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రకారం.. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఆర్ అండ్ డీ డీన్లు తనను పదేపదే వివక్షకు గురిచేస్తున్నారు. పరిశోధనకు సంబంధించిన ఫెలోషిప్ సొమ్మును ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. కన్నతల్లిని కోల్పోయినా కరగని మానవత్వం తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకునేందుకు వీసీ కార్యాలయానికి పదేపదే తిరిగినా ప్రవీణ్‌ను కనీసం గదిలోకి కూడా రానివ్వలేదు. చివరకు వీసీ కారు ఎక్కి వెళ్తుండగా.. పరుగున వెళ్లి వేడుకున్నా కనీస మానవతా దృక్పథం చూపకపోగా, ‘అంబేడ్కర్ చైర్‌ను మూసేస్తాం, నిన్ను యూనివర్సిటీలో లేకుండా చేస్తాం’అంటూ చిన్నచూపు చూస్తూ మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల మనసు కరగలేదు. చివరకు వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేదనను భరిస్తూనే, తల్లికి సరైన వైద్యం అందించలేక ప్రవీణ్‌కుమార్ తన తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. సీపీకి ఎస్సీ కమిషన్ లేఖ మరోవైపు ఈ ఘటనపై అట్రాసిటీల నిరోధక చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నగర పోలీసులు రంగంలోకి దిగి, ఈ వేధింపుల ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించడంతో ఏయూ వర్గాల్లో వణుకు మొదలైంది. బాబాసాహెబ్ సందేశమే నన్ను బతికించింది: ప్రవీణ్ కుమార్ ‘వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేధింపులను తట్టుకోలేక, ఒక దశలో ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ హక్కుల కోసం పోరాడాలి, ఉద్యమించాలి అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సందేశం నన్ను బతికించింది. ధైర్యాన్ని కూడగట్టుకుని, అన్ని ఆధారాలతో జాతీయ కమిషన్‌ను ఆశ్రయించాను’అని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
పెదబయలులో 24 నుంచి మోదమ్మ ఉత్సవాలు
పెదబయలు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర ఉత్సవాల గోడపత్రికలను ఆదివారం ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహం, అమ్మవారి పాదాలు, ఘటాలతో ఊరేగింపుగా వెళ్లి శతకంపట్టు వద్ద కొలువు దీరుస్తారు. అక్కడ మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్సవాల చివరి రోజైన 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం నుంచి అమ్మవారి విగ్రహంతో భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, అదే రోజు భక్తులు ఆలయంలో తమ మొక్కులు తీర్చుకుంటారని కమిటీ సభ్యులు వివరించారు. పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ముగిసిన తర్వాత వారంలో పెదబయలు ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితిగా వస్తోందని వారు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు రాత్రి వేళల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు భక్తులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మండల ప్రజలు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కిమంకరి బొంజుబాబు, కమిటీ గౌరవ పెద్దలు గంపరాయి సూరయ్య, దడియా రాంబాబు, పలాసి కొండబాబు, శశిధర్, చంద్రమౌళి, పలాసి తిరుపతిరావు, పాంగి పాల్గుణ, సమరెడ్డి పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పోస్టర్లు ఆవిష్కరణ -
రెండు లారీలు ఢీ
మాకవరపాలెం: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున తాళ్లపాలెంవైపు నుంచి రాచపల్లి వద్దగల పయినీర్ కంపెనీకి బొగ్గులోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ప్రమదంలో బొగ్గులారీ డ్రైవర్ గాయపడడంతో వెంటనే విశాఖ తరలించినట్టు స్థానికులు తెలిపారు. బొగ్గు లారీ ముందు భాగం బాగా దెబ్బతినడంతో సాయంత్రం వరకు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం స్థానిక పోలీసులు దగ్గరుండి లారీని పక్కకు తొలగించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.డ్రైవర్‌కు గాయాలు -
కేంద్ర గిరిజన మంత్రి దృష్టికి ఆదివాసీల సమస్యలు
పాడేరు రూరల్: ఆదివాసీ ప్రాంతాల్లో నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ హక్కుల చట్టాల పరిరక్షణపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఒరామ్‌ను ఆయన అధికార నివాసంలో ఏఏఆర్ఎం నేషనల్ చైర్మన్ జితేంద్ర చౌదరి, జాతీయ ఉపాధ్యక్షురాలు బృందాకారత్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌లతో కలిసి ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం అప్పలనర్స కేంద్ర మంత్రికి సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఐదో షెడ్యూల్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో అన్ని రకాల హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నూరు శాతం అమలు చేయాలని, ప్రస్తుతం అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. అలాగే పీఎం జన్మన్ బకాయి సొమ్మును వెంటనే విడుదల చేయాలన్నారు. గ్రామసభల ఆమోదం లేకుండా గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైడ్రోపవర్ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలన్నారు. ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2026 నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరామన్నారు. గతంలో ఉన్న జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకురావాలని విన్నవించామన్నారు. గత 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నాన్–షెడ్యూల్ ఆదివాసీ గ్రామాలన్నింటినీ 5వ షెడ్యూల్ ప్రాంతాలలో విలీనం చేస్తూ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పీఎం జన్మన్ పథకం కింద ఇచ్చే ఇంటి యూనిట్ విలువను ప్రస్తుతం ఉన్న రూ. 3.39 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ఆదివాసీ మాతృభాషా వలంటీర్లతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సానుకూలంగా చర్చించినట్లు అప్పలనర్స తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స -
ముగిసిన రాష్ట్ర స్థాయివాలీబాల్ పోటీలు
పాడేరు రూరల్: పట్టణంలోని తలారిసింగి బాలుర పాఠశాల మైదానంలో ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈటోర్నిలో సుమారు 40 జట్లు తలపడ్డాయి. ప్రథమ స్థానం హకుంపేట. ద్వితీయస్థానం పాడేరు మండలం చీడిమెట్ట జట్లు సాధించాయి. వీటికి అమ్మవారి జాతర ముగింపు రోజు ఈనెల 19న నగదు బహుమతులు అందజేస్తామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. మహేష్, కృష్ణ, పీడీలు మహేష్‌బాబు, మన్మథరావు, సింహాచలం, వినోద్ పాల్గొన్నారు. -
జి.మాడుగులలో భారీ వర్షం
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదుర గాలులు, పిడుగులతో భారీ వర్సం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. జి.మాడుగుల– లంబసింగి జాతీయ రహదారి మార్గంలో మట్టిరోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించేందుక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డుంబ్రిగుడ: డుంబ్రిగుడలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురవడంతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. వర్షం వల్ల వేరుశనగ, అల్లం పైరుకు మేలు చేకూరుతుందని రైతులు తెలిపారు. -
శివపురంలో బంగారు ఆభరణాలు చోరీ
నర్సీపట్నం: పట్టణంలోని శివపురంలో నివాసం ఉంటున్న మద్దికొండ సిరిల్‌పాల్ ఇంట్లో ఈ నెల 15వ తేదీ రాత్రి చోరీ జరిగినట్టు టౌన్ సీఐ ఎస్.కె.గఫూర్ తెలిపారు. సిరిల్‌పాల్ కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఎవరైనా ఇతర ఊళ్లకు వెళ్లే సమయంలో తమ విలువైన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలని, లేదా తమ వెంట తీసుకువెళ్లాలని సీఐ సూచించారు. -
భక్తజన ప్రమోదంగా..
పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజు, కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా అమ్మవారి ఊరేగింపు ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తొలుత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తలపై ఎత్తుకోగా, అమ్మవారి పాదాలను, ఘటాలను కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు ఈశ్వరి కొద్దిసేపు తమ తలపై మోశారు. అనంతరం అమ్మవారి ఆలయం నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న సతకం పట్టు వరకు ఊరేగింపు సాగింది. వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, సన్నాయి మేళాలు, నేలవేషాలు, వివిధ రకాల సంప్రదాయ నృత్యాల నడుమ ఈ ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. ● అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను తాకి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పోటీ పడ్డారు. ఊరేగింపు అనంతరం సతకం పట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఉత్సవ విగ్రహం, ఘటాలు, పాదాలను అక్కడ ప్రతిష్టించారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పాడేరు నుంచి అన్ని ప్రధాన మార్గాల్లో 100 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా పట్టణంలో ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు జాతర తొలిరోజు సందర్భంగా పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లతో పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో అధికారులు భారీ ఎత్తున ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జాతర తొలిరోజు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టాళ్లు ప్రారంభించిన కలెక్టర్ నిశాంతి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాళ్లను కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో కాఫీ ప్రాజెక్టు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధిపై డీఆర్డీఏ, జీసీసీ, బాల్యవివాహాల నిర్మూలనపై సీడ్ ఆర్గనైజేషన్, ఉద్యానవన శాఖ, సుగంధ ద్రవ్యాల బోర్డు తదితర ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన వైద్యారోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అధికారికంగా ఏర్పాటు చేసిన స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి అభిషేక్, రాష్ట్ర సృజనాత్మక, జానపద కళాల అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లలో ‘కూటమి’ వైఫల్యం ఘనంగా పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయకమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజు దర్శించుకున్న కలెక్టర్ నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ ఆలయం నుంచి సతకంపట్టు వరకు భారీగా ఊరేగింపు ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ కట్టుదిట్టమైన పోలీసు భద్రత పాడేరు: రాష్ట్ర గిరిజన జాతరగా వైభవంగా సాగాల్సిన పాడేరు శ్రీ మోదకొండమ్మ ఉత్సవాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న అధికార యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో భక్తులు, ప్రభుత్వ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. జాతర తొలి రోజైన ఆదివారం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాల ఊరేగింపును తిలకించేందుకు ఆలయం నుంచి సతకం పట్టు వరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అయితే, ఎండ తీవ్రతకు అల్లాడిపోయిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేకపోయారు. ఆహార పొట్లాలు ఐటీడీఏకే పరిమితం.. సాయంత్రం జాతరకు వచ్చే భక్తులకు ఉచితంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకున్న నిర్వాహకులు.. తీరా చూస్తే కేవలం ఒక్క ఐటీడీఏ ఆవరణ రహదారి వద్ద మాత్రమే ఆ ప్రక్రియను ముగించారు. దీంతో కొద్దిమందికి తప్ప మెజార్టీ భక్తులకు ఆహార పొట్లాలు అందలేదు. ఇక జాతరకు పోటెత్తిన మహిళా భక్తులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. విధుల్లో ఉన్న సిబ్బందికి ‘సొంత’ ఖర్చులు! మరోవైపు, జాతర పర్యవేక్షణ కోసం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు విధుల్లో ఉండాలని 17 మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. వీరికి ఆహారం సంగతి దేవుడెరుగు.. కనీసం గుక్కెడు మంచినీరు కూడా అందించే నాథుడు కరువయ్యాడు. రాత్రింబవళ్లు విధుల్లో ఉండే తమను కనీసం పట్టించుకోకపోగా.. మీ సొంత డబ్బులతోనే ఆహారం ఏర్పాటు చేసుకోండి అని నిర్వాహకులు ఉచిత సలహా ఇవ్వడంపై సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా మిగిలిన రెండు రోజులైనా అన్ని సౌకర్యాలు సక్రమంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తులకు కరువైన తాగునీరు మహిళలకు తప్పని మరుగుదొడ్ల తిప్పలు కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి గుక్కెడు నీరివ్వని నిర్వాహకులు -
నిండు గర్భిణికి నరకయాతన
పెదబయలు : మన్యం ప్రాంతంలో డోలీ మోతలు లేకుండా చేస్తాం.. ప్రతి గ్రామానికీ రోడ్డు సదుపాయం కల్పిస్తాం అని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పెదబయలు మండలం గోమంగి పీహెచ్సీ పరిధిలోని బొంగరం పంచాయతీ వెదురుగొయ్యి గ్రామంలో ఆదివారం ఒక గర్భిణి పడిన అవస్థలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. ప్రసవ వేదనతో.. వెదురుగొయ్యి గ్రామానికి చెందిన చిక్కుడు సిమ్మలి అనే మహిళకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు భర్త చిక్కుడు చిక్కన్న, ఆశా కార్యకర్త విజయకుమారి, బంధువులు ఇబ్బందులు పడ్డారు. గర్భిణిని సుమారు రెండు కిలోమీటర్ల దూరం కొండల మధ్య కాలినడకన వంచుర్భ గ్రామం రోడ్డు పాయింట్ వరకు నడిపించాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్నాక గోమంగి పీహెచ్సీ అంబులెన్స్‌కు సమాచారం అందించగా, వాహనం వచ్చిన తర్వాత ఆమెను పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తరలింపు.. సిమ్మలికి ఇది రెండో కాన్పు. గోమంగి పీహెచ్సీలో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, ప్రసవ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం, శరీరంలో రక్తం శాతం తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి చైతన్య తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, తల్లికి అవసరమైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి తమ గ్రామానికి వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు మాధవరావుతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేశారు. లింగేటి పంచాయతీ లింగేరిపుట్టు నుండి వెదురుగొయ్యి గ్రామానికి, అలాగే వంచుర్భ నుండి వెదురుగొయ్యికి రోడ్లు వేయాలని కోరారు. రోడ్డు లేకపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు అందడం లేదని, చివరికి పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ సామగ్రిని కూడా గ్రామానికి తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండు కిలోమీటర్లు నడవడంతోరక్తస్రావం వంచుర్బ నుంచి గోమంగి పీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలింపు ముంచంగిపుట్టు ఆస్పత్రిలో కాన్పు తల్లీబిడ్డ క్షేమం -
భక్తులకు మజ్జిగ,మంచినీరు పంపిణీ
పాడేరు రూరల్: మోదకొండమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా గిరి కై లాస క్షేత్రం శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ రాజేశ్వరి అమ్మవారి దేవాలయ ఆధ్యాత్మిక సేవా బృందం ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తాగునీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరి కై లాస క్షేత్రం ఆలయ చైర్మన్, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ నర్సింగరావు దంపతులు హాజరై పంపిణీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... దైవ మార్గంతోనే మానసిక ప్రశాంతత, ముక్తి కలుగుతాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. గిరి కై లాస క్షేత్ర ధర్మకర్తల మండలి సభ్యురాలు రమాదేవి, ప్రధాన అర్చకులు ఉప్పల సీతారామశాస్త్రి, నిర్వాహకులు రామారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వ్యాపారం ‘పచ్చ’గా...
● చెరువులు గుల్ల చేస్తున్న టీడీపీ నేతలు ● ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు ● పట్టించుకోని అధికారులు కోటవురట్ల : అడ్డదారులు తొక్కేందుకు పచ్చనేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమాలకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. మనల్ని ఆపేదెవడు అంటూ పేట్రేగిపోతున్నారు. వరాహనది నుంచి ఇసుక, కొండలను తవ్వేసి గ్రావెల్ తరలించుకుపోతుండగా ప్రస్తుతం పలువురి టీడీపీ నేతల దృష్టి మట్టిపై పడింది. చెరువులను జంకూ గొంకూ లేకుండా తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. పెట్టుబడి లేకుండా మట్టి వ్యాపారం రూ.లక్షలు తెచ్చిపెడుతుండడంతో మండలంలోని పలువురి టీడీపీ నేతల కన్ను చెరువులపై పడింది. దీనికి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు తమకేమీ తెలియనట్టు మిన్నకుండిపోవడంతో మట్టిని ఇష్టానుసారం తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు మట్టి రూ.2500లకు విక్రయించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. బి.కె.పల్లి, రామచంద్రపాలెం రెవెన్యూ పరిధిలోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చీకటి పడితే చాలు పచ్చనేతలు పొక్లెయిన్, ట్రాక్టర్లతో చెరువులో వాలిపోతున్నారు. అడ్డేవారు లేకపోవడంతో తెల్లవార్లూ మట్టిని తవ్వేసి తరలించుకుపోతున్నారు. ఆదివారం రాత్రి రామచంద్రపాలెంలోని ఎర్ర చెరువులో గ్రామానికి చెందిన టీడీపీ నేత నేరుగా పొక్లెయిన్‌తో మటి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో తాజా మాజీ సర్పంచ్ పరదేశమ్మ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు తమరాన కన్నంనాయుడు అడ్డగించారు. చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డుగా ద్విచక్ర వాహనాన్ని నిలిపి అడ్డగించారు. దాంతో టీడీపీ నాయకుడు వాగ్వాదానికి దిగినట్టు కన్నబాబు తెలిపారు. కన్నబాబు మాట్లాడుతూ చెరువులో పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి 5 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం తవ్వగా అడ్డుకున్నామని, తిరిగి ఆదివారం కూడా తవ్వకాలు జరపడంతో అడ్డుకుని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫోన్ చేసినట్టు తెలిపారు. అయితే అధికారులు స్పందించలేదని ఆరోపించారు. -
చెరువులో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్: మండలంలోని జంపపాలెం సమీపంలో మొండి గెడ్డ చెరువులో ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పొక్లెయిన్‌తో మట్టి తవ్వకాలు చేపట్టడంపై ఆ గ్రామానికి చెంది దాడి జగ్గ అప్పలనాయుడు అధికారులకు ఫిర్యాదు చేశారు.కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారని ఫిర్యాదుచేయడంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలను రెవెన్యూ అధికారులకు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టు చేశారు. తహసీల్దార్ వరహాలు స్పందించి అక్కడకు వెళ్లాల్సిందిగా వీఆర్వో నూకరాజు,వీఆర్ఏలు రమాదేవి,అప్పారావులను ఆదేశించారు.వాళ్లు అక్కడకు వెళ్లేసరికే అక్రమ తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులు వాహనాలతో పరారయ్యారు.అయితే అప్పటికే కొంత మట్టిని తరలించుకుపోయారు.తాను ఆరు నెలల క్రితమే మొండి గెడ్డలో పూడిక తీయిస్తానని జలవనరుల శాఖ అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చానని,కానీ తనకు అనుమతి ఇవ్వకపోగా ఇప్పుడు అక్రమార్కులు దర్జాగా మట్టి తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని అప్పలనాయుడు ప్రశ్నించారు.అదేవిధంగా చెరువు గట్టుపై యూకలిప్టస్ చెట్లను కొందరు నరికి పట్టుకుపోయారన్నారు.అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ఆలయ ఏఈవో పిల్లా శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు పెదకోరాడలో ఉరి వేసుకుని ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా నారిపల్లి మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన ఎద్దుల హనుమంతురెడ్డి పెదకోరాడ గ్రామానికి చెందిన చీపిరి కృష్ణవేణిని సుమారు ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. పెదకోరాడలో ఈ నెల 12న జరిగిన పండగకు భార్య, తల్లితో కలిసి హనుమంతురెడ్డి వచ్చాడు. భార్యాభర్తల మధ్య శనివారం చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తాను ఇంటికి వెళ్తానని చెప్పి హనుమంతురెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లాడు. సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.మృతుడు అనంతపురం జిల్లా వాసి -
‘రాపెప్’ శిక్షణలో రాటు దేలుతున్న అగ్రి విద్యార్థులు
● ఉపయుక్తంగా గ్రామీణ వ్యవసాయ పని అనుభవ (రాపెప్) కార్యక్రమం ● వ్యవసాయ విద్యార్థులకు గ్రామాల్లో ప్రత్యేక శిక్షణఅనకాపల్లి: అధునిక యుగంలో అగ్రికల్చర్ డిగ్రీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. శ్రీకాకుళం జిల్లా నైరా అగ్రికల్చర్ నాలుగో ఏడాదికి కళాశాల 38 మంది విద్యార్థులు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలో ఫిల్డ్ విజిట్‌లో భాగంగా శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం మండలాల్లో 38 మంది విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి ఒక విభాగంలో 18 మంది, మరో విభాగంలో 20 విద్యార్థులుగా ఒక్కో బృందానికి రైతులను అప్పగించి, గ్రామాల్లో రైతులు పండిస్తున్న పంటలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అధికారిగా ఆర్‌ఏఆర్‌ఎస్‌లో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త దాడి ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఒక హోస్ట్ రైతును కేటాయించి, ఆయా రైతుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ భూముల వివరాలు, పంటల సాగు విధానాలు తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు గ్రామాల్లో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై, గ్రామ సచివాలయం ద్వారా గ్రామానికి సంబంధించిన వివిధ వివరాలను సేకరిస్తున్నారు. రైతుల పొలాలను సందర్శించి పంటలలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి తగిన శాసీ్త్రయ సూచనలు అందిస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా వ్యవసాయ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి, పంటలలో వచ్చే చీడపీడలు, వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ, సాంకేతికతలు, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రామ వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ సమాచారాన్ని నిరంతరం చేరవేసే పనిలో అగ్రికల్చర్ విద్యార్థులు చేస్తున్నారు. రాపెప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మట్టి నమూనాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించి, మట్టి పరీక్షల ప్రాముఖ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులతో సమూహ చర్చలు నిర్వహించి, పొలాల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. రైతులను నూతన సాంకేతికతలు, ఆధునిక వ్యవసాయ ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నారు. గ్రామ ప్రజల అభిప్రాయాలు, అవసరాలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిస్థితులపై సమగ్ర అవగాహన విద్యార్థులతో పాటు రైతులు పొందుతున్నారు. నూతన వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన కొత్త వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు పొలాల్లో మెథడ్ డిమానిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను ప్రదర్శిస్తూ మెరుగైన దిగుబడులు సాధించే మార్గాలను తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రైతులు అనుసరిస్తున్న పద్ధతులు, శాసీ్త్రయ సిఫార్సుల మధ్య ఉన్న తేడాలను గుర్తిస్తూ ‘గ్యాప్ అనాలిసిస్’నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి, పంటలలో మెరుగైన దిగుబడుల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవం లభించడంతో పాటు రైతులకు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. -
చెత్తమయం
జిల్లా కేంద్రం..పాడేరు రూరల్: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా పడకేసింది. పురవీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోవడమే కాకుండా, కల్వర్టులు, డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక అస్తవ్యస్తంగా మారాయి. ● ముఖ్యంగా ప్రభుత్వ పాత ఆసుపత్రి, కోర్టు భవనాల సమీపంలో, ఐటీడీఏ కార్యాలయం వెనుక వైపు, జీసీసీ చైర్మన్ క్యాంపు కార్యాలయం ఎదురుగా, అలాగే కింద బజార్‌లోని మాంసం దుకాణాల సెంటర్ వద్ద పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి, ఈగలు, దోమల బెడద తీవ్రమైంది. ● పలు వీధుల్లో మురుగు కాలువలు మురిగిపోయి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో వీధుల్లో పిల్లలను ఆటలాడించాలన్నా ఎక్కడ వ్యాధులు ప్రబలుతాయోనని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్రతకు కేరాఫ్.. పాడేరు పట్టణం పేరుకే జిల్లా కేంద్రంగా చలామణి అవుతోంది కానీ, క్షేత్రస్థాయిలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు వీధుల్లో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పురవీధుల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ● గత కొన్నాళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండటంతో పారిశుధ్య నిర్వహణ మరింత అధ్వాన్నంగా తయారైందని, ఈ సమస్యపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నామని స్థానికులు వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పండగ వేళల్లోనూ పట్టించుకోరా? ఈ నెలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోదకొండమ్మ తల్లి రాష్ట్ర జాతర వేడుకలు జరగనున్నాయి. ఇంతటి పెద్ద పండగ వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాపాలనను గాడికి వదిలేసి, కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. మంచినీటికీ ఇబ్బందే! గత కొద్దిరోజులుగా కురుస్తున్న వరుస వర్షాలకు డ్రైనేజీలు వ్యర్థాలతో పూర్తిగా పూడుకుపోయాయి. పట్టణంలో ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వంటి కేసులు నమోదవుతున్నాయని, ఇప్పటికై నా అధికారులు తేరుకుంటారా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు వీధుల్లో వచ్చే రక్షిత మంచినీటి పైప్‌లైన్ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంటోందని, పర్యవేక్షణ లోపంతో ప్రజా సేవలు పూర్తిగా కుంటుపడ్డాయని స్థానికులు మండిపడుతున్నారు. పాడేరులో అధ్వానంగా పారిశుధ్యం పేరుకుపోయిన వ్యర్థాలు దోమలు, ఈగలతో వ్యాధుల భయం జాతర వేళ కూడా పట్టించుకోని అధికార యంత్రాంగం స్థానికుల ఆగ్రహం -
700 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ అమిత్‌బర్దర్
జాతర సందర్భంగా మూడు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాడేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర రద్దీ దృష్ట్యా ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి పట్టణంలోకి భారీ వాహనాల అనుమతిని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 700 మంది సిబ్బందితో పాటు రెండు శక్తి బృందాలు, మూడు డ్రోన్ కెమెరాలు, క్రైమ్ పార్టీ సిబ్బందిని రంగంలోకి దించామన్నారు. విశాఖపట్నం వైపు నుంచి పాడేరు వచ్చి పోయే వాహనాలు వంతాడపల్లి చెక్‌పోస్టు నుంచి తుంపాడ, సన్యాసమ్మపాలెం మీదుగా చింతలవీధి మార్గం మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. అరకు, ముంచంగిపుట్టు మార్గాల నుంచి వచ్చే వాహనాలు కూడా చింతలవీధి వరకే అనుమతి ఉందన్నారు. జి. మాడుగుల ప్రాంతం నుంచి విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వచ్చేపోయే వాహనాలు గొందూరు సెయింటాన్స్ పాఠశాల జంక్షన్ నుంచి లగిసిపల్లి, నక్కలపుట్టు మీదుగా వెళ్లాలని ఎస్పీ సూచించారు. -
జిల్లా కేంద్రం.. చెత్తమయం
జిల్లాకు గుండెకాయ లాంటి ప్రధాన పట్టణం.. ఐటీడీఏ సహా కీలక ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొలువై ఉన్న కేంద్ర స్థానం.. కానీ క్షేత్రస్థాయికి వెళ్తే పారిశుధ్యం పడకేసి మురుగు నిలయంగా దర్శనమిస్తోంది. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా నిర్వీర్యమవడంతో పురవీధులన్నీ నరకకూపాలుగా మారాయి. డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక, వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీనికితోడు ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవడంతో ఈగలు, దోమల బెడద తీవ్రమై, పట్టణ ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల భయంతో అల్లాడిపోతున్నారు. -
కృష్ణాపురంలో మార్మోగిన రామనామం
రామనామం జపిస్తున్న భక్తులు జి.మాడుగుల: చింతపల్లి మండలం కృష్ణాపురంలోని శ్రీ పాకలపాటి గురుదేవుల ఆశ్రమంలో జరుగుతున్న అఖండ రామనామ జప యజ్ఞానికి మద్దతుగా.. జి.మాడుగులలో శ్రీరామ ఆలయ సన్నిధిలో సోమవారం 24 గంటల అఖండ రామనామ జప యజ్ఞం ప్రారంభమైంది. శ్రీ పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం ఆధ్వర్యంలో భక్తులంతా ఏకమై శ్రీరామ జయరామ జయ జయ రామ నామ జపాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సంఘం అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ అఖండ రామనామ స్మరణ మంగళవారం ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా 24 గంటల పాటు సాగుతుందని వెల్లడించారు. లోకకల్యాణార్థం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీరామాలయం పూజారి నాగేశ్వరరావు, శ్రీ మత్స్య మాడుగులమ్మ ఆలయం పూజారి సన్యాసిరావు, పాకలపాటి గురుదేవుల భక్త బృందం సభ్యులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మోదమ్మ జాతరలో కూటమి రాజకీయం
● పండగ తేదీల మార్పు.. గిరిజన సంప్రదాయాలపై దాడే! ● వైఎస్సార్సీపీ నేతల మండిపాటు డుంబ్రిగుడ: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ తల్లి రాష్ట్ర గిరిజన జాతరను సైతం కూటమి ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వేదికగా మార్చుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం క్యాంపు కార్యాలయంలో డుంబ్రిగుడ మండల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలతో పాటు అన్ని పక్షాలు కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన మోదకొండమ్మ జాతర తేదీలను.. కూటమి నేతలు తమ వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం మార్చడం గిరిజన సంప్రదాయాలపై దాడి చేయడమేనని విమర్శించారు. టీడీపీ నేత వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ రానున్న నేపథ్యంలో.. ఆయన పర్యటనకు వీలుగా ఇన్చార్జ్ మంత్రి సంధ్యారాణి, టీడీపీ పాడేరు ఇన్‌చారిర్జ గిడ్డి ఈశ్వరి కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చి, జాతర తేదీలను ఏకపక్షంగా మార్పించారని ఆరోపించారు. పోస్టర్లలో ప్రొటోకాల్ ఎక్కడ? ఇంతటితో ఆగకుండా జాతరకు సంబంధించిన అధికారిక, సాంస్కృతిక పోస్టర్లలో కూడా కూటమి నాయకులు రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగారని నాయకులు ధ్వజమెత్తారు. పాడేరులో స్థానిక ఎమ్మెల్యేనే ఆలయ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఆ హోదాలో ఉన్న ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోతో పాటు జిల్లాలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పొటోలను ప్రొటోకాల్ ప్రకారం పోస్టర్లలో ముద్రించడం ఆనవాయితీ అని గుర్తుచేశారు. కానీ, గిడ్డి ఈశ్వరి రాజకీయ ద్వేషంతో ప్రస్తుత ఎమ్మెల్యే, జిల్లా ప్రజాప్రతినిధుల ఫొటోలు ఎక్కడా లేకుండా చేసి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, సంధ్యారాణి ఫొటోలతో పాటు తన పొటోను పెద్దదిగా ముద్రించుకున్నారని విమర్శించారు. ఇది రాష్ట్ర గిరిజన జాతరలా ఉందా? లేక టీడీపీ కూటమి జాతరలా ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు చేస్తున్న కుట్రలను మన్యం ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో గుంటసీమ, లైగండ ఎంపీటీసీలు గోపాల్ రావు, బి. రామరావు, తుమ్నాథ్, అర్జున్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మోదకొండమ్మ జాతర
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఈనెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని అన్ని వర్గాల ప్రజలు, భక్తులు నిర్ణయించారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల భద్రత కారణాలను సాకుగా చూపిస్తూ, భక్తుల మనోభావాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం ఈ ఉత్సవాల తేదీలను ఈనెల 17, 18, 19 తేదీలకు మార్చింది. ఈ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల కోసం 100 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు పాడేరు నుంచి వివిధ మార్గాల్లో సుమారు 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తెలిపారు. రోజువారీ సర్వీసులు యథావిధిగా సాగుతూనే.. ఈ ప్రత్యేక బస్సులు 24 గంటల పాటు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయన్నారు. మద్యం దుకాణాలు మూసివేత జాతర ఉత్సవాలు ముగిసే వరకు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పాడేరు పట్టణంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఆచారి తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా, నాటుసారా, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.పాడేరులో మూడు రోజులు నిర్వహణ -
పాలపొంగు
గిరి క్షేత్రంలో..ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో విస్తారంగా బత్తిరి సాగు దుంప నుంచి పాలు సేకరణ ● ఎండబెట్టి గుండ తయారీ ప్రకృతి వనరులతో పండిస్తున్న గిరి రైతులు ● సిరులు కురిపిస్తున్న పైరు కిలో రూ.300 నుంచి రూ.350 వరకు ఆదాయంమన్యంలో సాంప్రదాయ పంటల వైభవం మళ్లీ సంతరించుకుంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజన ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలతో పాటు సరిహద్దు ఒడిశా పరిధిలో పాలగుండ (బత్తిరి) సాగు విస్తారంగా సాగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజనుల జీవన విధానంలో, ఆహార అలవాట్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ పంటకు ప్రస్తుత వేసవి సీజన్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రసాయనాలకు దూరంగా, పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండే ఈ పాలగుండను కొనుగోలు చేసేందుకు మైదాన ప్రాంతాల ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్థానిక వారపు సంతల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది.ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలుతో పాటు ఒడిశాలోని లంతాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకడిల్లీ ప్రాంతాల్లో పాలపిండి (బత్తిరి) సాగు విస్తారంగా జరుగుతోంది. పూర్వకాలం నుంచి గిరిజన ప్రాంతాల్లో ఈ పంటకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం వేసవి కావడంతో మార్కెట్లో దీని ధర ఒక్కసారిగా పెరిగింది. ముంచంగిపుట్టు మండలంలో కరిముఖిపుట్టు, కించయిపుట్టు, సుజనకోట, బంగారుమెట్ట, పెదబయలు మండలంలో పన్నెడ, గోమంగి, గంపరాయి, గలగండ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విరివిగా సాగుచేస్తున్నారు. శాసీ్త్రయ నేపథ్యం.. ఈ మొక్కను శాసీ్త్రయంగా కర్క్యుమా ఆంగుస్టిఫోలియా అని పిలుస్తారు. దీనినే ’ఈస్ట్ ఇండియన్ యారోరూట్’ అని కూడా అంటారు. ఇది ఉష్ణమండల పంట. వేడి, తేమతో కూడిన వాతావరణం ఈ సాగుకు చాలా అనుకూలం.నీరు నిల్వ ఉండని, సారవంతమైన ఇసుకతో కూడిన లోమ్ నేలల్లో మంచి దిగుబడి వస్తుంది. పైరు పసుపు మొక్కను పోలి ఉంటుంది. ● వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ మొదటి వారంలో తల్లి దుంపలను లేదా చిన్న చిన్న దుంప ముక్కలను విత్తనంగా వాడి నాటుకుంటారు. ● వరుసల మధ్య 30–45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15–20 సెంటీమీటర్ల దూరం ఉండేలా 5–7 సెంటీమీటర్ల లోతున నాటాలి. ● ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువులే ఈ పంటకు మేలు చేస్తాయి. ● ఇది ఏడు నుంచి తొమ్మిది నెలల పంట. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నప్పుడు (జనవరి–ఫిబ్రవరిలో) పంట కోతకు వస్తుంది. ఎకరాకు సుమారు 10–15 టన్నుల పచ్చి దుంపల దిగుబడి వస్తుంది. తయారీ.. శ్రమతో కూడిన ప్రక్రియ దుంపల నుంచి పిండిని సేకరించడం ఎంతో ఓపికతో కూడిన పని. మొదట దుంపలను సేకరించి శుభ్రం చేస్తారు. వాటిని జల్లెడపై గంటల తరబడి రుద్ది, పిప్పి నుంచి రసాన్ని సేకరిస్తారు. దీనినే బత్తిరి పాలు అంటారు. ఈ రసాన్ని రాత్రంతా నిల్వ ఉంచి (ఊరబెట్టి), మరుసటి రోజు ఉదయం చాపలపై లేదా పాత్రల్లో పోసి ఎండబెడతారు. సుమారు వారం రోజుల తర్వాత అది గట్టిగా కేకు ఆకారంలో మారుతుంది. అప్పుడు చిన్న ముక్కలుగా కోసి భద్రపరుస్తారు. ● గిరిజన రైతులు వారపు సంతల్లో కిలో రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో దీని ధర కిలో రూ.500 పైనే పలుకుతోంది. పాలపిండి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నీరసంగా ఉన్నవారికి, చిన్నారులకు ఇది మంచి శక్తినిచ్చే ఆహారమని గిరిజనులు చెబుతున్నారు.మైదాన ప్రాంతంలో గిరాకీ పాలగుండ నీటిని తాగడం వల్ల చలువ చేస్తుంది. ఎటువంటి ర సాయనాలు వినియోగించకుండా ప్రకృతి వనరు లతో పండించిన దుంపల నుంచి పాలపిండిని సేకరిస్తాం. ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం. వారపు సంతల్లో, మండల కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తాం. మైదాన ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – కిల్లో బుద్రి, దొరగూడ, ముంచంగిపుట్టు మండలంసాగును ప్రోత్సహించాలి పాలపిండి సాగును ఐటీడీఏ ప్రోత్సహించాలి. రాయితీపై దుంపను రైతులకు అందించాలి. పెట్టుబడి సాయం అందిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. డిమాండ్ ఉన్న పాలపిండిని పండిస్తేనే ఆర్థికంగా మేలు కలుగుతుంది. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు బత్తిరి సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. – పాంగి రాంబాబు, కిందుగూడ, ముంచంగిపుట్టు మండలం -
ముత్యాలమ్మతల్లి హుండీ ఆదాయం లెక్కింపు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న కమిటీ సభ్యులు చింతపల్లి: స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి మూలవిరాట్ హుండీ ఆదాయం రూ. 68,600 వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి జాతర మహోత్సవాలు గత నెల 14వ నుంచి 17 వరకు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జాతర సందర్భంగా భక్తులు హుండీలో వేసిన విరాళాలను శనివారం కమిటీ పెద్దల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సుర్ల అప్పారావు, సుర్ల వీరేంద్ర, కమిటీ సభ్యులు మాదల తిరుపతి, పెదిరెడ్ల బేతాళుడు, మాజీ వైస్ సర్పంచ్‌లు గంజారి రమణ, బండారు అప్పలనాయుడు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. -
మా వీధిలో అన్నీ సమస్యలే
మా వీధిలో అన్నీ సమస్యలే ప్రబలుతున్నాయి. సక్రమంగా తాగునీరు అందడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ అస్సలు లేదు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కె.జ్యోతి, బక్కలపనుకు, పాడేరు పేరుకే జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలో అన్ని రకాల సమస్యలు పేరుకుపోయాయి. మా వీధిలో ఎప్పటి నుంచో డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. మురుగునీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోంది. ఈగలు, దోమలు మరింత ప్రబలుతున్నాయి. – బొండ కనకరత్నం, సుండ్రుపుట్టు, పాడేరు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగిస్తాం. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – రమేష్, ఈవో (ప్రత్యేకాధికారి), పాడేరు -
ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దుతాం
పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణే ధ్యేయంగా ‘గ్రీన్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఆంధ్ర’ విభాగాలను మరింత బలోపేతం చేయనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. పాడేరు మండలంలోని కిండంగి పంచాయతీ కేంద్రంలో ఉన్న తడి, పొడి చెత్త ద్వారా సంపద సృష్టి కేంద్రాన్ని శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన పరిశ్రమలకు ప్రాధాన్యం ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ.. పరిశుభ్రమైన, హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో జిల్లాలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాను వంద శాతం ఆర్గానిక్ (సేంద్రియ) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని పునరుత్పాదక ఇంధన వనరుల వాడకానికి, అలాగే వ్యర్థాలను పునర్వినియోగం చేసే గ్రీన్ ఎంటర్ప్రైజెస్ పరిశ్రమలకు జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛతపై నిరంతర నిఘా ఉంచుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన, వ్యర్థాల నిర్మూలనకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లాలో సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులకు, క్లాప్ మిత్రలకు వారి రక్షణ కొరకు చేతి తొడుగులు, గం బూట్లు, యూనిఫాం, శానిటేషన్ పరికరాలు, టోపీలు, మాస్క్‌లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, సీపీఆర్ కమిషన్ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో చంద్రశేఖర్, స్థానిక అధికారులు, గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పులి సంచారంతో గుబులు
కొయ్యూరు: రాజవొమ్మంగి–కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం అటు అటవీ అధికారులను కలవరానికి గురిచేస్తుంటే, ఇటు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. సరిహద్దుల్లోని కొమ్మిక, రాజులపాలెం, చిన్నరెల్లలపాలెం, బరతనపల్లి గ్రామాల మధ్య ఉన్న యూకలిప్టస్ తోటల్లో పులి సంచరిస్తున్నట్టు శనివారం అటవీ అధికారులు గుర్తించారు. పులి రోజుకు చాలా తక్కువ దూరం మాత్రమే కదులుతుండటంతో.. ఒకటి లేదా రెండు రోజుల క్రితమే అది ఏదైనా వన్యప్రాణిని లేదా పశువును వేటాడి తిని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులి వెళ్లేందుకు మూడు మార్గాలు.. ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయని అటవీ సిబ్బంది చెబుతున్నారు. బకులూరు మీదుగా తాండవ జలాశయం వైపు వెళ్లడం లేదా ఇటు నుంచి మంప వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు అది వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భయపడొద్దు.. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు, తోటల్లో పనులు చేసుకునే రైతులు అప్రమత్తంగా ఉండాలని పెదవలస రేంజ్ అధికారి (రేంజర్) ప్రశాంతికుమారి, ఎఫ్ఎస్వో శ్రీరాములు సూచించారు. కొమ్మిక, మంప పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పులి కదలికలను రేడియో కాలర్ ట్రాకింగ్ సాంకేతికత ద్వారా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఒకవేళ పులి దాడిలో పశువులు మృతి చెందితే రైతులకు తక్షణమే ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. భయం గుప్పిట్లో గిరిజనం అప్రమత్తమైన అటవీశాఖ యూకలిప్టస్ తోటల్లో ఆనవాళ్ల గుర్తింపు రేడియో కాలర్ ట్రాకింగ్‌తో కదలికలపై నిఘా కూలీలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
చింతపల్లి: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండగలరని ఎంపీడీవో సీతామహాలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగి పంచాయతీ కేంద్రంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పురవీధుల్లో పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జి.మాడుగుల: మండలంలోని అన్ని గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్లలో ఉద్భవించే తడి, పొడి చెత్తను విడివిడిగా వేరు చేసి పంచాయతీ వాహనాలకు అందించాలని ఎంపీడీవో డేవిడ్‌రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జి.మాడుగుల కేంద్రంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక ప్రధాన కూడలిలో (సెంటర్లో) భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, పంచాయతీ స్వచ్ఛరథం వాహనాలకు మాత్రమే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పీఆర్ ఏఈ మాణిక్యాలరావు, ఏపీఎం రుద్రరావు, ఏపీవో కొండబాబు, వెలుగు స్వయం సహాయక సంఘాల మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కొయ్యూరు: రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మర్రిపాలెం మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.సుధా పిలుపునిచ్చారు. శనివారం కళాశాల ఆవరణలో ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాన్ని ప్లాస్టిక్ రహితంగా నిర్మించడంలో భాగంగా మన పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలంతా పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీకేటీ మహాలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ మహమ్మారి ప్రకృతి సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌ను పూర్తిగా నిలిపివేయడం ఎంతో మంచిదన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజుబాబు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, వాతావరణం పూర్తిగా కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను వాడబోమంటూ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. డుంబ్రిగుడ: మండల కేంద్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, ప్రజలు అటవీశాఖ, పంచాయతీ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఎంపీడీవో విశ్వనాథ్ కోరారు. మండల కేంద్రంలో మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకార్యక్రమంలో భాగంగా.. స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సముదాయాల వద్ద ప్లాస్టిక్ నిషేధంపై శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రస్తుతం కిరాణా దుకాణాలు, హోటళ్లు, చికెన్ సెంటర్ల వద్ద ప్లాస్టిక్ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై పారేసే ప్లాస్టిక్ కవర్లను ఆహారంగా భావించి తింటున్న మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్ మహమ్మారిని నివారించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, ప్రజలు కూడా ఇళ్ల నుంచి వచ్చేటప్పుడే గుడ్డ సంచులను తెచ్చుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విజయ్, గౌతమి పాల్గొన్నారు. -
ఎంపీ నిధులతో వీధి లైట్ల పంపిణీ
వీధిలైట్లు పంపిణీ చేస్తున్న ఎంపీపీ తదితరులు కొయ్యూరు: అరకు ఎంపీ తనూజరాణి ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన వీధిలైట్లను శుక్రవారం ఎంపీపీ బడుగు రమేష్, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు,డౌనూరు ఎంపీటీసీ బి. అప్పారావు పంపిణీ చేశారు. మండలానికి వీధిలైట్లు కేటాయించడంపై వారంతా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. మండలానికి మరిన్ని నిధులను కేటాయించాలని వారు ఎంపీని కోరారు. కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.నేడు కంటి వైద్య శిబిరం పెదబయలు: మండలంలోని గోమంగి పీహెచ్సీలో ఈ నెల 16 తేదీన కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారి చైతన్య తెలిపారు.ఈ శిబిరాన్ని విజయనగరం పుష్పగిరి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. దృష్టిలోపం ఉన్న వారు శిబిరానికి హాజరు కావాలని కోరారు.అవసరమైన వారికి శస్త్ర చికిత్స చేసేందుకు రిఫర్ చేస్తామన్నారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
భలే రుచి!
కొండమామిడి తాండ్రపుల్లపుల్లగా.. తియ్యతియ్యగా.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మన్యం మామిడి తాండ్రకు మళ్లీ టైం వచ్చింది. ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రుచి కావాలంటే.. గిరిజన పల్లెల్లో తయారయ్యే తాండ్రను రుచి తినాల్సిందే. ప్రస్తుతం మన్యంలో ఎటు చూసినా కొండ మామిడి పండ్ల గుజ్జుతో తాండ్రను తయారు చేసే పనుల్లో గిరిజన మహిళలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక్కడి సంప్రదాయ రుచికి మార్కెట్లో డిమాండ్ మామూలుగా లేదు. ముంచంగిపుట్టు: మన్యంలోని కొండ కోనల్లో, అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర రుచి చూడాలే కానీ, మరెక్కడా దొరకదు. మన్యంలోని గిరిజన గ్రామాల్లో ప్రస్తుతం ఎటు చూసినా తాండ్ర తయారీ పనులే కనిపిస్తున్నాయి. ఎటువంటి రసాయనాలు కలపకుండా, కేవలం ఎండను నమ్ముకుని గిరిజన మహిళలు ఈ తాండ్రను తయారు చేస్తున్నారు. సంతల్లో జోరుగా అమ్మకాలు గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తున్న ఈ తాండ్రకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. స్థానిక వారపు సంతల్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు ధర పలుకుతున్నా, వినియోగదారులు ఆ రుచికి ఫిదా అయి ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మామిడి పండ్ల సీజన్ అయిపోయినప్పటికీ, ఈ తాండ్రను ఎక్కువ కాలం భద్రపరుచుకుని తినే వీలుండటంతో దీనికి డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తయారీ విధానం.. మన్యం తాండ్ర తయారీలో గిరిజన కుటుంబాలు పడే శ్రమ ఎంతో ఉంటుంది. కొండ ప్రాంతాల్లోని అడవి మామిడి చెట్ల నుంచి రాలిపడిన పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి సేకరిస్తారు.వీటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు లేదా బిందెల్లో వేస్తారు. రోకలితో దంచి మామిడి రసాన్ని వేరు చేస్తారు. తీసిన రసాన్ని చాపలు, చేటలు లేదా స్టీలు ప్లేట్లలో పలుచని పొరలుగా పోస్తారు.ఒక పొర ఆరిన తర్వాత మళ్లీ దానిపై మరో పొర వేస్తూ, ఇలా వారం నుంచి పది రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. ఏ రకమైన రసాయనాలు లేదా కృత్రిమ రంగులు కలపకపోవడమే ఈ తాండ్ర విశిష్టత. పది పొరలు ఆరిన తరువాత వచ్చే తాండ్ర తింటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండి జిహ్వకు అమృతప్రాయంగా అనిపిస్తుంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన గిరిజన మహిళలు, తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి తాండ్ర ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తున్నారు.ప్రకృతి సిద్ధమైన ఆహారం జిహ్వకు అమృతప్రాయం మార్కెట్లో మంచి డిమాండ్ గిరిజన పల్లెల్లో సందడి -
స్నేహితుడి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
బుచ్చెయ్యపేట: మండలంలో కశింకోట– బంగారుమెట్ట(కేబీ) రోడ్డులో నీలకంఠాపురం వద్ద విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి అనకాపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు స్నేహితులు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. రాజాం గ్రామానికి చెందిన మరిసా శివ పని మీద అనకాపల్లి వెళ్లాడు. అర్ధరాత్రి వాహనాలు లేకపోవడంతో తన స్నేహితులైన మరిసా సాయి, పడాల శివకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లడానికి రావాలని కోరాడు. స్నేహితుడిని తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై మరిసా సాయి, పడాల శివ అనకాపల్లి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు వస్తుండగా, రాత్రి 2 గంటల ప్రాంతంలో నీలకంఠాపురం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. 108 వాహనంలో పడాల శివ, మరిసా శివలను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడి కారులో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి వెళ్తున్న మరిసా సాయి(20) జంగాలపాలెం గ్రామ దగ్గర ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో పడాల శివ కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరిసా శివ అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివాహమైన ఏడాదికే.. మరిసా సాయి తురకలపూడికి చెందిన మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి తన గ్రామంలో పొలం అమ్మడానికి 20 రోజుల క్రితం భార్యతో కలిసి రాజాం వచ్చాడు. రెండు రోజుల క్రితం భూమి రిజిస్ట్రేషన్ అయింది. మళ్లీ హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. తన స్నేహితుడు అనకాపల్లిలో ఉండిపోవడంతో అర్ధరాత్రి తీసుకురావడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య మాధవి ప్రస్తుతం ఆరో నెల గర్భిణి. భర్త మృతితో ఆమె రోదిస్తున్న తీరును చూసి పలువురు చలించిపోయారు. సాయి తల్లి లచ్చమ్మ అనారోగ్యంతో మంచాన ఉండగా, తండ్రి సన్యాసినాయుడు కుమారుడు మృతితో భోరున విలపిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. సాయి మృతదేహానికి పోస్టుమార్టం జరిపి, సాయంత్రం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. కేబీ రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని మార్చాలని ఫిర్యాదులు చేస్తున్నా ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాలో 89 లక్షల మొక్కల పెంపకం
కె.కోటపాడు: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని 80 వన నర్సరీల్లో వివిధ రకాలకు చెందిన 89 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు సోషల్ ఫారెస్ట్ అధికారి(డీఎఫ్‌వో) ఎం.సోమసుందరం తెలిపారు. కె.కోటపాడు మండలం కొత్తూరు, ఎ.కోడూరు, సింగన్నదొరపాలెం, రామచంద్రపురం, పొడుగుపాలెం, బత్తివానిపాలెం గ్రామాల్లో వన నర్సరీలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవి ఉష్ణోగ్రత్తలు ఎక్కువగా ఉండడం వల్ల నర్సరీల్లో మొక్కలకు నీటి తడులను తరచూగా ఇవ్వాలని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి జిల్లా ఫారెస్ట్ కమిటీ సమావేశం అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. ఏయే మొక్కలు రైతులకు, ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా ఇవ్వాలనేది కమిటీ నిర్ణయిస్తుందన్నారు. పరిశ్రమలకు నిర్దేశించిన ధరలకు ఈ మొక్కలను అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెంచుతున్న మొక్కల్లో 70 లక్షల సరుగుడు మొక్కలతోపాటు మిగిలిన 19 లక్షలు జీడి, మహగణి, ఎర్రచందనం, ఏగిస, యూకలిప్టస్, నేరేడు, రోజ్‌వుడ్, కందంబ, ఫెల్టోఫారం తదితర మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. గతేడాది రోడ్లకిరువైపులా రహదారి వనాల కార్యక్రమంలో బాగంగా మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు బ్లాక్ ఫ్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటామన్నారు. ఈ ఏడాది ఎన్టీపీసీ(సింహాద్రి) నిధులతో రహదారి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వన నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వీబీ జీ రాంజీ, ఎన్టీపీసీ, ఆగ్రో ఫారెస్ట్రీ, కాంపా నిధులతో పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శివరంజిని, డిప్యూటీ రేంజ్ అధికారి నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు. -
అతిగా మద్యం తాగి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : అతిగా మద్యం తాగి వికాష్ కుష్వా (26) అనే యువకుడు మృతి చెందిన ఘటన చీమలాపల్లి రెవెన్యూ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. వికాష్ కుష్వా మడుతూరు కూడలిలో ఉన్న మై చాయిస్ ఐస్ క్రీమ్ కంపెనీలో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11 తేదీన విధులు ముగించుకుని దగ్గర్లో ఉన్న మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, అతిగా మద్యం తాగాడు. శివ ప్రియా గార్డెన్స్ వద్ద మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం వెళ్లి పరిశీంచి, మృతి చెందిన వ్యక్తి వికాష్ కుష్వాగా గుర్తించారు. ఎక్కువగా మద్యం తాగడం వల్లే మృతి చెంది ఉంటాడని ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు. -
కేకే లైన్‌తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలి
సీతంపేట: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కె.కె. లైన్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంపీ శ్రీభరత్ బీచ్ రోడ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేయనున్నట్లు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి. రామారావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘కె.కె. లైన్‌తో ఉన్న రైల్వే జోన్ – భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలను ఇతర జోన్లకు అప్పగించి విశాఖకు కేవలం పేరు మాత్రమే ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.కె. లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ అసంపూర్ణమని, దీని సాధన కోసం పాదయాత్రలు, ర్యాలీలు, ‘చలో ఢిల్లీ’ వంటి కార్యక్రమాలతో దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పటికై నా గళమెత్తాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు అడారి కిషోర్ కుమార్, కస్తూరి వెంకట్రావు, గొలగాని రాము, ఎం.ఎల్.ఎన్. పట్నాయక్ , పలు మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అప్పన్న సాక్షిగా ట్రస్ట్ కోల్పోయిన కూటమి
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుల నియామకంలో పారదర్శకత లోపించిందని కూటమి నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన సొంత పార్టీల నేతలకు మొండిచేయి ఎదురైంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని పక్కనపెట్టి, కూటమితో ఏమాత్రం సంబంధం లేని వారికి, స్థానికేతరులకు బోర్డులో చోటు కల్పించడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. జగన్ హయాంలో పారదర్శకత సింహాచలం దేవస్థానానికి 2005 నుంచి 2019 వరకు ట్రస్ట్‌బోర్డు నియామకం జరగలేదు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2020 మార్చిలో, మళ్లీ 2022 ఏప్రిల్‌లో ట్రస్ట్‌బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో స్థానికులకు, ఆలయ విశిష్టతను కాపాడే వారికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. అయితే 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు బోర్డును నియమించకపోవడం సొంత నేతల్లోనే అసంతృప్తికి దారితీసింది. ఎట్టకేలకు శుక్రవారం 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ పార్టీ శ్రేణులకు కనీస సమాచారం లేకుండా ఆగమేఘాల మీద ఈ జాబితాను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో అనర్హులకు పెద్దపీట ప్రకటించిన జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఒక హోటల్ సీఈవో గుత్తికొండ శ్రీలతకు టీడీపీ కోటాలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె అసలు పార్టీ కోసమే పనిచేయలేదని టీడీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే టీడీపీ సానుభూతిపరుడైన మధుపాడ సన్యాసిరావును బీజేపీ ప్రతినిధిగా చూపించి నియామకం చేపట్టడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పేరుతో లబ్ధి పొందుతూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు కూడా తగిన ప్రాధాన్యం దక్కలే దని జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పట్టించుకోని ఎమ్మెల్యే సిఫార్సులు నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను నమ్ముకుని పదవుల కోసం ఆశించిన వారికి తీవ్ర భంగపాటు ఎదురైంది. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు సూచించిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి, సింహాచలం దేవస్థానంతో నేరుగా ముడిపడి ఉన్న అడవివరం గ్రామానికి చెందిన వారికి కూడా బోర్డులో కనీస అవకాశం కల్పించకపోవడం పట్ల స్థానికులు, కూటమి నేతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అవమానం ఏపీలో బీజేపీ పూర్తిగా టీడీపీమయమైపోయింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలపై అవగాహన లేని వారిని నియమించి అపప్రధ పాలవుతోంది. కూటమి వల్ల లబ్ధి పొందుతూనే బీజేపీని ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూస్తోంది. కనీసం బీజేపీ నగర, రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండానే, తమకు అనుకూలంగా ఉండేవారిని బీజేపీ కోటాలో నియమించుకోవడం పార్టీని దెబ్బతీయడమే. గత ప్రభుత్వం 80 శాతం వరకు భక్తులకు ప్రాధాన్యం ఇస్తే, ప్రస్తుత బోర్డు మాత్రం దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై నోరు మెదపని వారి కోసం వేసినట్లుగా ఉంది. –విజయశంకర్ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ -
బైక్‌ల దొంగ అరెస్టు
రూ.12.70 లక్షల గంజాయి స్వాధీనం నాతవరం: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. రోడ్డుపై పలు కార్యాలయాలు, దుకాణాలు వద్ద నిలిపి ఉంచిన వాహనాలు చోరీకి గురైనట్టు చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇటీవల తాండవ జంక్షన్లో జరిగిన చోరీ కేసులో అనుమానితులపై ప్రత్యేంగా నిఘా పెట్టామన్నారు. శుక్రవారం వల్సంపేట జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఆ సమయంలో వచ్చిన నిందితుడు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన కె.దుర్గాప్రసాద్‌ను పట్టుకుని, చోరీ చేసిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించాలమని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన మైత్రి బృందానికి ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పన్న కొండపై తవ్వకాలు అపచారం
డాబాగార్డెన్స్ (విశాఖ): హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న సింహాచలం కొండను చంద్రబాబు ప్రభుత్వం బోడిగుండు చేస్తోందని సీపీఎం నాయకుడు గంగారావు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల కొండ ప్రాంతంలో డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారని మండిపడ్డారు. నరసింహ స్వామి కొలువై ఉన్న పవిత్ర కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యలను భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాగే సింహాచలం కొండ నుంచి వచ్చే వర్షపు నీరు ముడసర్లోవకు చేరే సహజ ప్రవాహ వ్యవస్థ దెబ్బతింటుందని, కొండను తవ్వడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం కలిగే ప్రమాదం ఉందని గంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. -
● ఇద్దరి అరెస్టు
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముందుస్తుగా వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్ఐ రాజారావు, సిబ్బందితో చింతపల్లి రూట్లో నెల్లిమెట్ట జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన చల్లా గోపి(25), ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెల మండలం పపులర్ పంచాయతీకి చెందిన మహాదేబ్ ఖిలా(23)ను అరెస్ట్ చేసినట్ట సీఐ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.12.70 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రెండు సెల్ఫోన్లు, రూ.1000 నగదు సీజ్ చేసినట్టు సీఐ చెప్పారు. -
గంజాయి రవాణా కేసులో నిందితుడికి జైలు
అనకాపల్లి: జిల్లాలో మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి రవాణా కేసులో నిందితుడికి 2 సంవత్సరాల 7 నెలల జైలుశిక్ష విధిస్తూ విశాఖ 1వ అదనపు న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించారని, జరిమానా చెల్లించని పక్షంలో ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా విల్లవంకోడ్ గ్రామానికి చెందిన పుష్పరాజ్ 2023 నవంబర్ 8న ఏజెన్సీ ప్రాంతం నుంచి తమిళనాడుకు ఏడు కిలోల గంజాయిని తరలిస్తుండగా అప్పటి మాకవరంపాలెం ఎస్ఐ పి.రామకృష్ణ పట్టుకున్నట్టు ఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా వాదోపవాదాలు అనంతరం జైలు శిక్షణ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు తెలిపారు. కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించారని చెప్పారు. -
నిధుల గండం
పల్లెకుపన్నులు వసూలుకాక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలు కొయ్యూరు: జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు, ప్రస్తుత ఏడాది పన్నులు కలిపి మొత్తం రూ. 7.73 కోట్లకు చేరుకున్నాయి. గ్రామ పంచాయతీల మనుగడకు ప్రధాన వనరుగా ఉన్న ఇంటి పన్నుల వసూలు మందగించడంతో, స్థానిక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. జనగణన బాధ్యతలతో.. సాధారణంగా ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను పర్యవేక్షించాల్సిన సచివాలయ సిబ్బందికి ప్రస్తుతం జనగణన పనులను అప్పగించడమే ఈ మందగింపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ● గతంలో ప్రతి జనగణన ప్రక్రియకు ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే, ఈసారి వారిని మినహాయించి కేవలం సచివాలయ సిబ్బందిని మాత్రమే వినియోగించడంతో, వారిపై పనిభారం పెరిగి పన్నుల వసూలు కుంటుపడింది. ● జిల్లాలోని ఏ ఒక్క మండలంలో కూడా కనీసం 5 శాతం వసూళ్లు కూడా సాధించలేకపోవడం గమనార్హం. పాలనపై తీవ్ర ప్రభావం గ్రామ పంచాయతీలు తమ దైనందిన కార్యకలాపాలకు, ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణకు ఇంటి పన్నుల నుంచి వచ్చే ఆదాయంపై అధికంగా ఆధారపడి ఉంటాయి. ● గ్రామాలలోని చెత్తను సేకరించి, శుభ్రం చేసే ‘క్లాప్ మిత్రల’కు వేతనాల చెల్లింపులు ఈ పన్నుల ఆదాయం నుంచే జరుగుతాయి. ● వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతర అత్యవసర గ్రామాభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ● కొయ్యూరు మండలంలో పన్నుల వసూలును వేగవంతం చేసేందుకు అధికారులు కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో ప్రజలు నగదు చెల్లించడానికి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా వాట్సాప్ ద్వారా గానీ, సచివాలయాల్లో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా గానీ సులభంగా పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. గడువు విధించినా.. జనగణన పనులలో కొందరు సిబ్బంది నిమగ్నమైనప్పటికీ, మిగిలిన సిబ్బంది ద్వారా ఇంటింటికీ డిమాండ్ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు పన్నులు చెల్లించాలని గడువు విధిస్తున్నారు. దృష్టిపెట్టకుంటే కష్టమే.. ఆర్థిక సంవత్సరం ముగిసిన తరుణంలో, కనీసం సగం మొత్తమైనా వసూలు కాకపోతే పంచాయతీల మనుగడ కష్టం కానుంది. జనగణన పనులతో పాటు పన్నుల వసూలుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపుల విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని పలువురు సూచిస్తున్నారు. -
● మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు ● పక్కా ప్లాన్‌తోనే హత్య ● హైదరాబాద్ పారిపోతుండగా నిందితుడి అరెస్టు ● 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
అద్దె అడిగితే గొంతు కోశాడుఅల్లిపురం(విశాఖ): అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్‌తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమైపె కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధు రి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు ● కలెక్టర్ నిశాంతి హెచ్చరిక ● పాడేరు ఐటీడీఏలో పీజీఆర్ఎస్ నిర్వహణపాడేరు: పీజీఆర్ఎస్లో స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు పలు సమస్యలపై 62, రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 41 వినతులను స్వీకరించారు. ఫిర్యాదులను ఎంత గడువులోగా పరిష్కారిస్తారో అర్జీదారులకు వివరించాలన్నారు. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించే పీజీఆర్ఎస్కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని, కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అధికారులు ఉండాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమం తప్పకుండా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో, ప్రతి రోజు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కారించాలని సూచించారు. ఫిర్యాదుదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విద్యసాగర్, డీఆర్డీఏ పీడీ మురళి, టీడబ్ల్యూ డీడీ పరిమళ, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, డీపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవ పోస్టర్లలోనూ రాజకీయమా?
పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర సందర్భంగా ముద్రించిన సాంస్కృతిక పోస్టర్లు ఇప్పుడు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి, ఏకపక్షంగా వ్యవహరించారని వైఎస్సార్సీపీ, బీజేపీ శ్రేణులతో పాటు సామాన్య భక్తులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై విమర్శలు సాధారణంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉంటే వారే అమ్మవారి ఆలయానికి ఐదేళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జాతర ఉత్సవాల గోడ పత్రికలలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ ఫొటోను ముద్రించడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది ఉత్సవ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న గిడ్డి ఈశ్వరి.. రాజకీయ కక్షతో ప్రస్తుత ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఫొటోను ముద్రించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, సంధ్యారాణిల ఫొటోలతో పాటు తన ఫోటోను పెద్దదిగా ముద్రించి, స్థానిక ఎమ్మెల్యేను విస్మరించడంపై భక్తులు తప్పుపడుతున్నారు. పోస్టర్లలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములమనే విషయాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు మరచిపోయారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు ముద్రించి.. ప్రధాని నరేంద్ర మోదీ, స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఫొటోలను విస్మరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని నిలదీశారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల జాతరను ప్రశాంతంగా నిర్వహించలేరని హితవు పలికారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రవికుమార్, పాపిడిరాజు, సల్లా రామకృష్ణ, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వేశ్వరరాజుకు దక్కని గౌరవం కనిపించని ఫొటో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ నేతల అభ్యంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఏకపక్ష నిర్ణయం ఆమె తీరుపై భక్తుల మండిపాటు -
దైవ దర్శనానికి వెళ్లి వృద్ధుడు అదృశ్యం
మాడుగుల రూరల్: తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వృద్ధుడు 12 రోజులైనా తిరిగి ఇంటికి చేరలేదు. మండలంలోని వీరనారాయణం గ్రామానికి చెందిన కోరుకొండ కళ్యాణం అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాడి పెంటయ్యతోపాటు అతడు ఈ నెల 1న వృద్ధాప్య పింఛను తీసుకుని 4వ తేదీన అనకాపల్లిలో తిరుమల రైలు ఎక్కి 5వ తేదీన తిరుపతికి చేరుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని వెంగమాంబ భోజన శాల వద్ద భోజనాలు చేశారు. పెంటయ్య తన బ్యాగ్‌ను కళ్యాణంకు ఇచ్చి చేతులు కడుక్కోని వచ్చేలోగా కనిపించలేదు. బ్యాగ్‌లో నగదు, బట్టలు ఉండటంతో పెంటయ్య ఆందోళనకు గురయ్యాడు. అక్కడ మైక్‌లో అనౌన్స్ చేసినా ఆచూకీ తెలియరాలేదు. తర్వాత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి గాలించినా సరే జాడలేదు. దీంతో పెంటయ్య కట్టుబట్టలతో తిరిగి ఈ నెల 14వ తేదీన స్వగ్రామం వీరనారాయణం చేరుకున్నాడు. ఈ విషయం కళ్యాణం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నారు. -
మ్యూజియం పనులు మరింత వేగవంతం
చింతపల్లి: మండలంలోని తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సుధాభార్గవి ఆదేశించారు. గురువారం ఆమె మ్యూజియం నిర్మాణ ప్రాంతాలను సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష మ్యూజియంలోని బ్లాక్–1, బ్లాక్–2లలో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి ఆమె సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రస్తుత స్థితిగతులను, నిర్మాణ నాణ్యతను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఈ సందర్భంగా సుధాభార్గవి మాట్లాడుతూ.. మ్యూజియం నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన గిరిజన వీరుల చరిత్రను భావితరాలకు అందించడమే ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగం గిరిజన వీరుల పోరాట పటిమను నేటి తరానికి వివరించేలా అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ, ఆడియో విజువల్స్ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసే ప్రతి శిల్పం, ప్రతి చిత్రం వారి పోరాట స్ఫూర్తిని రగిలించేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ, చీఫ్ ఇంజనీర్ వసంత, టీఆర్ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాణి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, ఈఈ డేవిడ్‌రాజ్, డీఈ రఘునాథ్నాయుడు, జేఈ యాదకిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
మాయమాటలతో పసిబిడ్డ అపహరణ
పాడేరు: వైద్య చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చిన నెలన్నర బాబును ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి అపహరించిన ఘటనను పోలీసులు అత్యంత చాకచక్యంగా గంటల వ్యవధిలోనే ఛేదించారు. పాడేరు సీఐ డి. దీనబంధు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం, సలుగు పంచాయతీ, బూరుగుచెట్టు గ్రామానికి చెందిన పాంగి రామారావు, కాంతమ్మ దంపతుల నెలన్నర బాబు అనారోగ్యానికి గురవ్వడంతో, గురువారం వారు పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఓ గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి, బాబును ఎత్తుకుంటానని వారిని నమ్మించింది. వారిని మాటల్లో పెట్టి, అదును చూసి బాబుతో సహా అక్కడి నుంచి పరారైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాబు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పాడేరు సీఐ దీనబంధు, హుకుంపేట సీఐ విజయ్‌కుమార్, ఎస్ఐ విజయ్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లా ఆసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సదరు మహిళ బిడ్డను ఎత్తుకొని హుకుంపేట మార్గంలో వెళ్తున్నట్లు గుర్తించారు. కొంతిలి సమీపంలో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాబును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో తల్లిదండ్రులకు బాబును అప్పగించారు. బాబును అపహరించిన మహిళ హుకుంపేట మండలం, ఉప్ప గ్రామానికి చెందిన సంతరి కృష్ణవేణి (భర్త దామోదర్) గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ దీనబంధు తెలిపారు. తమ బిడ్డను గంటల వ్యవధిలోనే ప్రాణాలతో తిరిగి అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. -
మేలురకం కాఫీ మొక్కలు సరఫరా చేయాలి
గూడెంకొత్తవీధి: రైతులకు అధిక దిగుబడినిచ్చే మేలురకపు కాఫీ మొక్కలను సరఫరా చేయాలని కోరుతూ అరకులో గురువారం కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్, సీఈవో ఎం. కూర్మారావులకు కాఫీ రైతుల సంఘం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో కాఫీ రైతుల సంఘం అధ్యక్షులు అడపా విష్ణుమూర్తి, అభ్యుదయ కాఫీ రైతు అడపా లక్ష్మి పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని, అధునాతన పద్ధతుల్లో సాగు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అందించాలని కోరినట్టు వారు తెలిపారు. అలాగే ఆధునిక కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రైయింగ్ యార్డులు, నిల్వ గోదాములు, విలువ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలను మంజూరు చేయాలని విన్నవించామని వారు పేర్కొన్నారు. మార్కెటింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతు ఉత్పత్తి గ్రూపులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరారు. కాఫీ ధరల్లో స్థిరత్వం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సేంద్రియ సాగును ప్రోత్సహించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్స వేడుకలను జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వీటిపై కాఫీ బోర్డు చైర్మన్, సీఈవో సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని అడపా విష్ణుమూర్తి తెలిపారు. కాఫీ బోర్డుకు గిరి రైతుల విన్నపం -
లారీ బోల్తా.. తప్పిన ప్రాణాపాయం
కొయ్యూరు: జాతీయ రహదారి 516–ఈ విస్తరణ పనుల్లో భాగంగా సరకు చేరవేస్తున్న ఒక లారీ గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంపుల ప్రాంతానికి సరకు అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా, నడింపాలెం మలుపు వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ మలుపు వద్ద లారీని వేగంగా పోనివ్వడంతో అదుపు తప్పి ఎడమవైపునకు పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులందరూ భయాందోళనతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ ఎడమవైపునకు బోల్తా పడటంతో డ్రైవర్ సీటు వైపు ఖాళీ ఉండటంతో డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
యలమంచిలి రూరల్ : పార్క్ చేసి ఉంచిన ద్విచక్రవాహనాలను చాకచక్యంగా చోరీ చేస్తున్న వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీన పర్చుకున్నామన్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లికి కోడిగుడ్డు సన్యాసిరావు ద్విచక్రవాహనాలను చోరీ చేసి వాటిని తెలిసిన వారి వద్ద తాకట్టు పెట్టి డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. యలమంచిలి పట్టణ ఠాణాలో 2023లో రెండు, 2024 నాగుల చవితి జాతర రోజు ఒకటి మొత్తం మూడు ద్విచక్ర వాహనాలను నిందితుడు అపహరించాడు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మూడు కేసుల్లో నిందితుడిగా సన్యాసిరావును పోలీసులు నిర్థారించుకున్నారు. గురువారం 16వ నెంబర్ జాతీయ రహదారిపై పెదపల్లి కూడలి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీకి గురైన మూడు వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. -
పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలి
కశింకోట: జిల్లాలోని ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బి. విజయకుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో జిల్లా స్థాయిలో మండల విద్యా శాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, హైస్కూలు ప్లస్ ప్రధానోపాధ్యాయులకు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంపొందిస్తూ బలోపేతం చేయాలన్నారు. జిల్లా విద్యా పరంగా అన్ని అంశాల్లో ముందుండాలన్నారు. పదో తరగతి పునశ్చరణ తరగతులు నిర్వహించి మార్చిలో ఉత్తీర్ణులు కాని వారందరిని అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ కావడానికి ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు, రాష్ట్ర పరిశీలకుడు నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం
అనకాపల్లి: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్‌తో అడుకుంటున్న నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా గురవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరం అసాంఘిక కార్యక్రలాపాలకర పాల్పడుతున్న, గంజాయి స్మగ్లర్‌పై ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉత్తర్హులు మేరకు పీటీ ఎన్డీపీఎస్ యాక్టును ప్రయోగించి జైలుకు తరలించడం జరుగుతుందన్నారు. రోలుగుంట మండలం, బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన చిన్నికృష్ణ(35) కొంతకాలంగా వరుసగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడుతున్నాడని, ఇతనిపై జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌లో ఐదుకు పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ సమాజానికి ముప్పుగా మారిన చిన్ని కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని, దీనిపై పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఈనెల 11న పీటీ యాక్టు అమలు చేయాలని ఆదేశించినట్టు ఎస్పీ చెప్పారు. కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్ఐ పి.రామకృష్ణారావు చిన్నికృష్ణను అదుపులోనికి తీసుకుని, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. ఈ చట్టం కింద అరెస్టుయిన వ్యక్తికి ఏడాది వరకూ బెయిల్ వచ్చే అవకాశం ఉండదన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సాదారణ సెక్షన్లతో పాటు పీటీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. -
భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తాం
అనకాపల్లి: జిల్లాలో పెండింగ్‌లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తెలిపారు. గురువారం స్థానిక గాంధీనగరంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సంక్షేమ భూములకు సంబంధించిన భూ కబ్జా, సర్వే కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులకు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా తదుపరి చర్యల కోసం లేఖలు పంపించామన్నారు. 54 మంది ఫిర్యాదులు చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, సోషల్ వెల్ఫేర్ డీడీ బి.రామానందం, డీవీఎంసీ సభ్యులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూ వివాదంపై విచారణ దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లిలో రెవెన్యూ పరిధిలో దళితులు, కల్లుగీత కార్మికులు మధ్య నెలకొన్న భూ వివాదంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గురువారం విచారణ చేపట్టారు. మండలంలోని కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన కణితి అర్జున్ ముషిడిపల్లిలోని తన భూ సమస్యపై రాష్ట్ర ఎస్సీ కమీషన్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ సూచనల మేరకు సదరు వివాదాస్పద స్థలాన్ని స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, ఎస్ఐ వి. సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం సదరు స్థలానికి సంబంధించి ఇరువురి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించారు. ఇరువర్గాల వారి వాదనలను వినడంతో పాటు స్థానిక పెద్దలను, అధికారులను సైతం భూమికి సంబంధించిన పూర్వపరాలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల వారు పరస్పర వాదోపవాదనలకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదాయించారు. -
18 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్టు
చీడికాడ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన గురువారం అందించిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని అప్పలరాజుపురం లలితా దేవి మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు స్కూటీలపై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా ఆపి తనిఖీ చేయగా రెండు వాహనాల్లో 18 కిలోల గంజాయిని గోనె సంచిల్లో గుర్తించామన్నారు. దీంతో విజయవాడ ప్రాంతానికి చెందిన ఎం.యువనాగ సాయి సుధర్, వాసి గోపితో పాటు 17 సంవత్సరాల మైనర్ బాలుడిని పట్టుకున్నామన్నారు. వీరు అల్లురి జిల్లా పాడేరు ఏజేన్సీకి చెందిన గుంత నర్సు, నారీస్ పాంగి వద్ద నుంచి గంజాయిని సేకరించి విజయవాడకు తరలిస్తున్నట్టు విచారణలో తెలిపారన్నారు. వారి వద్ద రెండు స్కూటీలు, గంజాయిని, మూడు సెల్ఫోన్లను స్వాధినం చేసుకుని కోర్టుకు తరలించామని తెలిపారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్ బుచ్చెయ్యపేట : గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకుని కోర్టుకి అప్పగించినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన బుచ్చెయ్యపేట వద్ద 194 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న చీడికాడ మండలం బైలపూడికి చెందిన గొల్లవిల్లి గోపిని వడ్డాదిలో వాహనాల తనిఖీల్లో భాగంగా గురువారం పట్టుకున్నామన్నారు. గంజాయి కేసులో పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తించి సీఐ కోటేశ్వరరావు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. పట్టుబడిన గంజాయి నిందితులతో ఎస్ఐ సతీష్ బుచ్చెయ్యపేటలో పట్టుకున్న వ్యక్తితో సీఐ, ఎస్ఐ -
భూ సమస్యలపై ఆదివాసీల రిలే దీక్షలు
రోలుగుంట: మండలంలోని కె.అడ్డసరం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే దీక్షలు గురువారం చేపట్టారు. గతంలో కె.అడ్డసరం రెవెన్యూ గ్రామంలో ఖాతా నెంబర్ 559లో భూములను ఫోర్జరీ వారసత్వ ధ్రువపత్రంతో రాయివరపు చంద్రశేఖరరావు పేరున మార్చారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్లైన్లో నమోదు కావడంతో సాగుదారులైన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టి తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చంద్రశేఖరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. భూముల హక్కు పత్రాలపై తహసీల్దార్ డిజిటల్ సంతకం రద్దు చేసే వరకూ రిలే దీక్షలు కొనసాగుతాయని కె.అడ్డసరం ఆదివాసీలు, కొంతలం ఓబీసీ రైతులు తేల్చిచెప్పారు. జాయింటు కలెక్టర్ కోర్టులో ఆర్వోఆర్ అపీల్‌పై ఆర్డరు వచ్చేంత వరకూ తమ జోలికి రావ్వొద్దని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా కార్యదర్శి మూసూరి రాజు, కేదారి దేవి, వెంగళరావు సత్య, తుర్రి నూకరాజు, అర్జున్ పాల్గొన్నారు. -
కానరాని పర్యాటక సందడి
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయలో సందర్శకుల తాకిడి గణనీయంగా తగ్గింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకులోని పర్యాటక ప్రాంతాలన్నీ గత కొన్ని రోజులుగా పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి.ఈ పరిస్థితికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పర్యాటకుల రాకపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం పర్యాటక రంగంపై కనిపిస్తోంది.రవాణా ఖర్చులు పెరగడం, ఇంధన కొరత కూడా పర్యాటకులు తగ్గడానికి ఒక కారణమని పర్యాటక ప్రాంతాల్లో నిర్వాహఖులు భావిస్తున్నారు. వీకెండ్లో అంతంత మాత్రంగా.. సాధారణ రోజుల్లో పర్యాటకుల తాకిడి అసలు కనిపించడం లేదని, కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని స్థానిక వ్యాపారులు, పర్యాటక కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యాటక రంగంపై ఆధారపడిన స్థానిక గిరిజనులు, చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణనీయంగా తగ్గిన సందర్శకుల సంఖ్య -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
మాకవరపాలెం: మండలంలోని వజ్రగడ శివారు తమ్మయ్యపాలెంలో గురువారం మధ్యాహ్నం బొడ్డు అప్పలనాయుడు(50) మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరి కొందరితో మంగళవారం హనుమాన్ జయంతి రోజున నిర్వహించిన అన్నసమారాధనలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పలనాయుడుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు తమ్మయ్యపాలెం వెళ్లగా, అతడు భయంతో మనస్తాపానికి గురై తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లే సరికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. దీనిపై మృతుడు భార్య రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ దామోదర్‌నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
పిడుగుపాటుకు మూడు ఆవుల మృతి
జి.మాడుగుల: మండలంలోని సింగర్భ పంచాయతీ కంబాలుబయలు గ్రామంలో గురువారం సాయంత్రం ప్రకృతి ప్రకోపం చోటుచేసుకుంది. ఉరుములు, మెరుపులు, భీకర శబ్దాలతో కూడిన పిడుగుపాటుకు ఇద్దరు గిరిజన రైతులకు చెందిన మూడు ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంబాలుబయలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పశువులను మేత కోసం తోలుకెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. ఈ ప్రమాదంలో మేత మేస్తున్న పశువులపై పిడుగు పడటంతో కిముడు బొజ్జాచారికి చెందిన రెండు ఆవులు, కొమ్మంగి మత్స్యలింగంకు చెందిన ఒక ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. మృతి చెందిన ఆవుల విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశువులే తమకు జీవనాధారమని, పిడుగుపాటుతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి, తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత గిరిజన రైతులు వేడుకుంటున్నారు. -
కాఫీ రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం
1అరకులోయ టౌన్: గిరిజనుల జీవితాల్లో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం గొప్ప మార్పును తీసుకువచ్చిందని కాఫీ బోర్డు రాష్ట్ర కార్యదర్శి కూర్మరావు అన్నారు. గురువారం కేంద్ర కాఫీ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పున్నమి హరిత వ్యాలీ రిసార్ట్స్‌లోని గోష్టి సమావేశ మందిరంలో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 15 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న కాఫీ ఉత్పత్తిని 50 వేల మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 2.15 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని 4 లక్షల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేంద్రియ జిల్లాగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ నిశాంతి కాఫీతో పాటు హార్టికల్చర్ సాగును కూడా ప్రోత్సహిస్తామని, జిల్లాను పూర్తిస్థాయి సేంద్రియ వ్యవసాయ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ టి.నిశాంతి ప్రకటించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని, ఇక్కడి నమూనాను స్ఫూర్తిగా తీసుకుని ఒడిశాలోని మరో 8 జిల్లాల్లో కాఫీ సాగుకు అక్కడి అధికారులు ఆసక్తి చూపుతున్నారని ఆమె తెలిపారు. మొదటి స్థానమే లక్ష్యం: కాఫీ బోర్డు డైరెక్టర్ భార్గవి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అరకు కాఫీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేక వెనుకబడిందని కాఫీ బోర్డు డైరెక్టర్ భార్గవి అభిప్రాయపడ్డారు. దేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని.. భవిష్యత్తులో మన రాష్ట్రం ప్రథమ స్థానానికి చేరుకోవాలంటే అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. లోగో ఆవిష్కరణ ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల లోగో, థీమ్‌ను అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు డైరెక్టర్ చందుల్ కుమార్, బెంగళూరు ఐహెచ్ఆర్ డైరెక్టర్ తుషార్ కాంతి బెహరా, కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్, జీసీసీ ఎండీ శేఖర్ బాబు, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధిక సంఖ్యలో కాఫీ రైతులు పాల్గొన్నారు. -
మహిళ దారుణ హత్య
● బంగారు నగల కోసమే ఘాతుకం ● అక్కయ్యపాలెంలో ఘటనపార్వతి మృతదేహంతాటిచెట్లపాలెం: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని పీఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న పార్వతి (53)ని దుండగులు హతమార్చారు. మృతురాలి భర్త దొండపర్తిలో పాన్‌షాప్ నిర్వహిస్తుండగా, ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తన దుకాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి చేరుకునేసరికి పార్వతి విగతజీవిగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి ప్రవేశించి, కాళ్లు చేతులు బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మంగళసూత్రం, నల్లపూసల తాడు, చెవి రింగులు, చేతి గాజులను దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు. నేరం జరిగిన ప్రదేశంలో క్లూస్ దొరకకుండా ఉండేందుకు దుండగులు కారంపొడి చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి మెడపై గాయాలు ఉండటాన్ని బట్టి, నిందితులతో ఆమె తీవ్రంగా పెనుగులాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పార్వతి సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో తన పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. దీనిని బట్టి ఆ తర్వాతే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న ఫోర్త్‌టౌన్ క్రైం పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. క్రైం డీసీపీ, ఏసీపీలతో పాటు లా అండ్ ఆర్డర్ ఏసీపీలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మోదమ్మ ఉత్సవాల సాక్షిగా కూటమి కుట్ర
పాడేరు: గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల విషయంలో కూటమి నాయకులు కుట్రలకు తెరలేపారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో పాడేరు, అరకు మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, గిరిజన సంఘాలు, అన్ని పక్షాల ఏకగ్రీవ నిర్ణయం మేరకు ఈ నెల 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహించాలని అనుకున్నాం. కానీ, కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఇంచార్జ్ మంత్రి సంధ్యారాణి, గిడ్డి ఈశ్వరి రాజకీయ జోక్యంతో ఉత్సవాల తేదీలను ఏకపక్షంగా మార్చేశారన్నారు. ఎన్నికల దృష్ట్యా పోలీసు బందోబస్తు ఇవ్వలేమని, అందుకే ఉత్సవాలు నిర్వహించలేమని అప్పట్లో సాకులు చెప్పారన్నారు. మరి ఇదే నెల 13న పాడేరులో జరిగిన జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ వివాహానికి, మంత్రి లోకేష్ పర్యటనకు ఐదు రోజుల ముందు నుంచే వందల సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఎలా ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. బెదిరింపులతో జనసమీకరణ చేపట్టారని ధ్వజమెత్తారు. కిడారి శ్రవణ్ కుమార్ వివాహానికి 64 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి, మంత్రి లోకేష్ సమావేశానికి రాకపోతే పెన్షన్లు, రేషన్ కార్డులు, జాబ్ కార్డులు తొలగిస్తామని గిరిజనులను బెదిరించి తరలించారని ఆరోపించారు. తరలించిన ప్రజలకు కనీసం మంచినీరు, ఆహారం కూడా అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. మంత్రి పర్యటన, టీడీపీ నేత వివాహం కారణంగా పట్టణంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయిందని, కనీసం అంబులెన్స్‌లకు కూడా దారి ఇవ్వలేదని విమర్శించారు. అసలు మంత్రి లోకేష్ వచ్చింది ప్రభుత్వ కార్యక్రమానికా లేక ప్రైవేట్ కార్యక్రమానికా అని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు రామసత్యవతి, ఎంపీటీసీ రాజేశ్వరి, మాజీ సర్పంచ్‌లు వంతాల రాంబాబు, పాంగి నాగరాజు, నాయకులు మోద బాబురావు, పలాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయవిదారక ఘటన అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్. ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు కూడా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్న బంధువులు అత్తారింట్లో అడుగుపెట్టి ఆనందంగా ఉండాల్సిన వధువు ప్రమాదంలో తీరనిలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. పెళ్లి వేడుక ముగిసి 24 గంటలు కూడా కాకముందే పెళ్లికూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
చీడికాడ: మండలంలోని జి.కొత్తపల్లి శివారు చినగోగాడకు చెందిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ తాటిచెట్టుపై నుంచి జారి పడి మృతి చెందినట్లు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోన నారాయణమూర్తి(43)గురువారం మధ్యాహ్నం తమ కల్లం సమీపంలో తాటికాయలు కోసేందుకు తాటిచెట్టు ఎక్కాడన్నారు. ప్రమాదవశాత్తూ కాలుజారి చెట్టు పైనుంచి కిందికి పడిపోవడంతో తలకు,శరీరంపై బలమైన గాయాలై మృతి చెందాడన్నారు. ఘటనపై మృతుని భార్య వెంకట వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం
చోడవరం: పట్టణ శివారు అన్నవరం ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ప్రధాన విద్యుత్ వైర్లపై చెట్లకొమ్మలు పడి షార్ట్ సర్క్యూట్ జరగడంతో పలు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధమై సుమారు రూ.10 లక్షల నష్టం జరిగింది. 40 ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు కాలిపోవడంతో పాటు, ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం విద్యుత్ శాఖ ఏఈ రాజుతోపాటు సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఏఈని చుట్టుముట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన విద్యుత్‌లైన్లపై పలుచోట్ల చెట్ల కొమ్మలు తాకుతున్నాయని, దీనివల్ల సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా వైర్లపై కొమ్మలు పడి షార్ట్‌సర్క్యూట్‌తో తమ ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి చూసి పోవడమే తప్ప ఏ పనీ సక్రమంగా చేయడంలేదని ఆరోపించారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఏఈ నిర్లక్ష్యం వల్లే... అన్నవరం సబ్‌స్టేషన్ పరిధిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమై తరుచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌శాఖ ఏఈ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా గతంలో అనేక ఫిర్యాదులు కూడా వెళ్లాయి. మండల సమావేశాల్లో సైతం ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు ఇక్కడ ఏఈపై ధ్వజమెత్తినా మార్పురాకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలుతీసుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చోడవరం పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న కారు... ఒకరు మృతి
పాయకరావుపేట : జాతీయ రహదారి పై విశాఖపట్నం వైపునకు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ ఆలీ తెలిపారు. నామవరం గ్రామం వద్ద మంగళవారం రాత్రి కారు ముందు ప్రయాణిస్తున్న మోటార్ బైక్ హఠత్తుగా బ్రేక్ వేయడం వల్ల అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు వ్యాపారం నిమిత్తం శ్రీకాకుళం వెళ్తున్నారు. కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రాధా ఆలీసామను తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. కారులో వున్న మరో వ్యక్తి సోమ మహామ్మద్ అనే వ్యక్తి గాయపడడంతో తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి గుజరాత్‌కు చెందిన వ్యక్తి అని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకన్న
దేవరాపల్లి: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దేవరాపల్లికి చెందిన డి.వెంకన్న ఎన్నికయ్యారు. అమలాపురంలో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు వెంకన్న బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వృత్తిదార్లు, సన్న,చిన్నకారు రైతులు పాల్గొన్న ఈ మహాసభలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు తీర్మానాలు చేశామన్నారు. దళితులపై దాడులు, కుల వివక్షను అరికట్టాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్టు చెప్పారు. దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని వెంకన్న విమర్శించారు. క్రైస్తవ మతం తీసుకున్న దళితులను ఎస్సీలు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని వారి సర్టిఫికెట్లను రద్దు చేయించాలని చూస్తుండటాన్ని మహాసభలో తీవ్రంగా ఖండించినట్టు చెప్పారు.ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
ఆగని మట్టి అక్రమ తరలింపు
మంగళవారం రాత్రి తరలించుకు వచ్చిన చెరువు మట్టి ఎస్.రాయవరం : ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా తమ బట్టీలకు అక్రమ మట్టి రవాణా ఆపబోమని ఇటుక బట్టీల యజమానులు యధావిధిగా మంగళవారం రాత్రి వమ్మవరం గ్రామంలో బట్టీల వద్దకు మట్టిని తరలించారు. యలమంచిలి కృష్ణాపురం చెరువులో అనుమతులు పొందినట్టు జేసీబీలను ఉపయోగించి దర్జాగా వమ్మవరానికి మట్టి తరలించుకు రావడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షించినా మట్టి తరలింపు ఆపకపోవడం పట్ల ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్, అధికారులు విజిలెన్స్ ఉన్నతాధికారులకు బుధవారం మరో మారు ఫిర్యాదు చేశారు. -
వేసవి శిక్షణ విజ్ఞానదాయకం
మాట్లాడుతున్న ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ జోగారావు మునగపాక : వేసవి సెలవులను వృఽథా చేయకుండా విజ్ఞానాన్ని అందించే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ మళ్ల జోగారావు కోరారు. మునగపాక గ్రామీణ యువజన మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. లక్ష్యం కోసం చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. కర్ర సాము, చెస్, క్యారమ్, గీత శ్లోకాలపై శిక్షణ పెంచుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మందిర సభ్యులు ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్య చంద్రరావు, వెలగా ప్రవీణ పాల్గొన్నారు. -
‘పాలిటెక్నిక్’ దరఖాస్తుల విక్రయం ప్రారంభం
దరఖాస్తుల విక్రయాన్ని ప్రారంభిస్తున్న ఎండీ ప్రసాద్ కశింకోట: స్థానిక ఆర్ఈసీఎస్లోని రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ వినియోగదారుల కోటా కింద ప్రవేశానికి దరఖాస్తుల విక్రయం బుధవారం ప్రారంభమైంది. దరఖాస్తుల విక్రయాన్ని ఎమ్‌డి జి.ప్రసాద్ ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులను పొందవచ్చు. ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, విభాగాధిపతులు గణేష్, రమణ కుమార్, ఆఫీస్ సూపరింటిండెంట్ కె. శివరాం తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్ హంటర్స్!
● ఉదయం 7.45 గంటలు.. జ్యోతి నగర్.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి మొదటి సవాల్ విసిరారు. ● ఉదయం 8.05 గంటలు.. పంజాబ్ హోటల్ జంక్షన్లో మహిళ మెడలోంచి చైన్ తెంచేసి పారిపోయి హడలెత్తించారు. ● ఉదయం 8.15 గంటలు కంచరపాలెం జయభారత్నగర్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళే లక్ష్యంగా చైన్ అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమయ్యారు. ● ఉదయం 11.30 గంటలు... విమాన్‌నగర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైపోయారు. నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు మార్చిలో 7 ఏప్రిల్‌లో 5 మే 13 వరకూ 4 సాక్షి, విశాఖపట్నం: మహానగరంలో ‘గోల్డ్’వేట మొదలైంది. గన్ పట్టుకున్న వేటగాడు అడవిలో పొంచి ఉన్నట్టు.. బైక్ ఎక్కిన దొంగలు.. జనం మధ్యే ‘స్నాచింగ్’పంజా విసిరారు. నాలుగు గంటల వ్యవధిలో 13 తులాల బంగారాన్ని కొట్టేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ వీధులు ఇప్పుడు ‘గోల్డ్ హంటర్స్’దూకుడుతో ఉలిక్కిపడుతున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో, నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హంటర్స్ చేసిన హడావుడి చూస్తుంటే.. పోలీసుల నిఘా వ్యవస్థకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది. టైమ్ ఫిక్స్.. టార్గెట్ గోల్డ్.! బుధవారం ఉదయం నుంచి జరిగిన చైన్‌స్నాచింగ్ కేసుల్లో దొంగల రూట్ మ్యాప్ చూస్తే ఎవరికై నా ఆందోళన కలగాల్సిందే. వచ్చింది ద్విచక్ర వాహనంపై.. పోయింది సుమారు 13 తులాల పసిడి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. అయితే.. నాలుగు చోట్లా చేసింది ఒక్కరేనా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా పనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ‘నిఘా’నేత్రాలు నిద్రపోతున్నాయా.? నగర రక్షణ కోసం సిటీలో ఏర్పాటు చేసిన ‘మూడో కన్ను(సీసీ కెమెరాలు)’అనేక చోట్ల రెప్పవాల్చిన విషయం చైన్ స్నాచింగ్ ముఠా పసిగట్టినట్లుందనే వదంతులు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న విశాఖ నగరం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోల్డ్ హంటర్స్ సిటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ సిటీ పోలీస్ అధికారిక గణాంకాల ప్రకారం... నగర వ్యాప్తంగా 13,485 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారిక రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా, ఇటీవల పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్ నివేదికల ప్రకారం.. వీటిలో పోలీస్ శాఖవే కాకుండా ‘నేను సైతం’ప్రోగ్రామ్ కింద ప్రజలు, షాపుల యజమానులు పెట్టినవి కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ పంపుతున్నాయనే లైవ్ స్టేటస్ ద్వారా దాదాపు 40 శాతం అంటే 5,394 సీసీ కెమెరాలు మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని గుర్తించారు. ఇదే.. దొంగలకు అనువుగా మారిందనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసుల యాక్షన్ ప్లాన్ షురూ..! వరుస ఘటనలతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే నిందితులు కావడంతో.. బుధవారం జరిగిన చోరీలు కూడా వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, పనిచేస్తున్న కొన్ని కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల వేటలో నిమగ్నమయ్యారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా గోల్డ్ హంటర్స్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. -
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందాలి
విద్యార్థులకు క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేసిన కలెక్టర్ విజయ్ కృష్ణన్ తుమ్మపాల : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సమ్మర్ క్యాంప్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి కలెక్టరేట్లో బుధవారం క్రీడా సామాగ్రి కిట్లను ఆమె విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌లను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి.శైలజ, కోచ్ సిహెచ్ సూరి అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
మహారాణిపేట(విశాఖ) : వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలుం ఇలా శుభకార్యాలతో కళకళలాడే వేళకు తాత్కాలికంగా విరామం పడింది. గురువారం నుంచి వరుసగా 36 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది. వేద పండితుల ప్రకారం ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ప్రధాన శుభకార్యాలను చాలామంది వాయిదా వేస్తున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ పెళ్లి సందడి జూన్ 19న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ పలు శుభముహూర్తాలు లభించనున్నాయి. గత డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా వివాహాలు జరగడంతో పట్టణాలు, గ్రామాలు పెళ్లి వేడుకలతో కళకళలాడాయి. ఇప్పుడు మరోసారి జూన్ చివరి నుంచి అదే సందడి కనిపించనుంది. పెళ్లి రంగానికి తాత్కాలిక మందగమనం శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలకు అనుబంధంగా ఉన్న వందలాది వృత్తులు తాత్కాలికంగా మందగించనున్నాయి. కళ్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్‌లు, డెకరేషన్, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, హోటళ్లు, లాడ్జిలు ఇలా అనేక రంగాలపై ప్రభావం పడనుంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాల సీజన్ ప్రారంభం కావడంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకోనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19 వరకు ఆగాల్సిందే.. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు ప్రధాన శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు -
● కంచరపాలెం, ఎయిర్‌పోర్టు స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు ● ఉదయం 7.30 నుంచి 11.30 మధ్యే చోటు చేసుకున్న వైనం
గోపాలపట్నం:విశాఖనగరంలో ఒకేరోజు గంటల వ్యవధిలో నాలుగు చోట్ల జరిగిన చైన్‌స్నాచింగ్‌లతో ప్రజలు హడలెత్తిపోయారు. కంచరపాలెం,ఎయిర్పో ర్టు పోలీ స్ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7.30 నుంచి 11.30 మధ్య నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. మహిళల మెడల్లో ఉన్న చైన్లను తెంచు కుపోయారు. బాధితులు,పోలీసులు తెలిపిన వివరాలు.. మొదటి చోరీ.. ఉదయం 7.30 సమయంలో మర్రిపాలెం జ్యోతీనగర్ వద్ద పంచముఖి లక్ష్మి(62) కాయగూరలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. 7.45 గంటలకు తిరుగుముఖం పడుతూ ఇంటి సందులో మలుపుతిరుగుతున్న సమయంలో కాపుకాసి ఉన్న దుండగుడు వెనక నుంచి వచ్చి మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన లక్ష్మి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెంచుకుపోయాడు. లాకెట్టు, చైన్‌లో సగభాగం తన చేతిలో ఉండిపోయింది. సుమారు రెండున్నర తులాల వరకు దుండగుడు లాక్కెళ్లిపోయినట్లు బాధితురాలు వాపోతోంది. రెండో చోరీ : పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఉదయం 8.05 గంటల సమయంలో రాజీవ్‌నగర్‌కు చెందిన నిడమల రత్నకుమారి విధులకు హాజరయ్యేందుకు బస్టాప్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆటో కోసం నిరీక్షిస్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెల తాడు, నల్లపూసల దండ తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో చేతిలో పుస్తెలు, నల్లపూసల దండ కొంతభాగం ఉండిపోయింది. మిగిలిన సుమారు రెండున్నర తులాలు తెంచుకుపోయాడు. మూడో చోరీ : ఉదయం 8.15 గంటల సమయంలో కంచరపాలెం జైభారత్‌నగర్ వద్ద ఎస్ కోట దరి జామి వెళ్లేందుకు వర్రి అరుణ బస్టాప్‌కు నడుస్తూ వస్తోంది. కాపుకాసిన దుండగుడు రెండు తులాల గొలుసు, రెండు తులాల నల్లపూసల దండ లాక్కుపోయాడు. నాలుగో చోరీ : విమాన్‌నగర్ వద్ద అదే ప్రాంతానికి చెందిన ఎం.అచ్చయ్యమ్మ(56) ఉదయం 11.30కు నగరంలో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు బస్టాప్ వద్ద నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను సమీపించాడు. బైక్‌పై మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 తులాల నల్లపూసల దండ, చైన్ తెంచుకుని బైక్‌పై వెళ్లిపోయారు. గమనించిన ఓ వ్యక్తి తన బైక్‌తో వెంబడించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిని ఢీకొట్టేందుకు యత్నించి తప్పించుకుపోయారు. కరాసా వద్ద బైక్ చోరీ : ఆ సమయంలోనే కరాసాకు చెందిన ఓ యువకుడి ద్విచ్రవాహనం చోరీకి గురైంది. కరాసా వద్ద నైట్ ఫుడ్ స్టాల్స్ ఉన్న చోట 10.30 సమయంలో పార్కింగ్ చేసిన తన బైక్‌ను ఎవరో దొంగిలించడంతో బాధితుడు వెంటనే వాట్సాప్ ఫిర్యాదుతో పాటు, స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశాడు. తన బైక్‌తోనే ఈ చోరీలకు పాల్పడ్డారేమోనని బాధితు డు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం 7.30 నుంచి దొంగతనాలు జరుగుతుండటంతో ఈ వాహనం వాడి ఉండరని పోలీసులు చెప్తున్నారు. చైన్ స్నాచింగ్‌లపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. ‘చైన్’చోరీలతో బెంబేలు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
దేవరాపల్లి: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి ఓ కుమార్తె తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంది. పలువుర్ని కంటతడి పెట్టించిన ఈ ఘటన మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పెదనందిపల్లి గ్రామానికి చెందిన వేచలపు గోవింద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన గోవిందకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలకు వివాహం అయింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అంజలి తల కొరివి పెట్టడానికి ముందుకు వచ్చింది. కుండ పట్టుకుని తండ్రి అంతిమ యాత్రలో పాల్గొని, దహన సంస్కారాలు పూర్తిచేసింది. అంజలి విశాఖపట్నంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తోంది. తండ్రికి కుతూరు తల కొరివి పెట్టిన దృశ్యాని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో పెదనందిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పరిశోధనలే ఊపిరిగా..
మన్యం కాఫీకి ప్రాణం పోసి, ఐదు దశాబ్దాలుగా రైతులకు దిశానిర్దేశం చేస్తున్న ఆర్వీనగర్ కాఫీ పరిశోధనా కేంద్రం నేడు స్వర్ణోత్సవ మైలురాయిని చేరుకుంది. ఒక చిన్న మొక్కతో ప్రారంభమై వేలాది ఎకరాల తోటలకు విస్తరించిన ఈ కేంద్రం, మన్యం కాఫీ సాగు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. స్వర్ణోత్సవ వేడుకల వేళ.. సరికొత్త సాగు విజ్ఞానంతో మన్యం కాఫీ కీర్తిని దశదిశలా చాటేందుకు ఈ పరిశోధనా కేంద్రం సిద్ధమైంది. గిరి రైతుకు తోడుగా..గూడెంకొత్తవీధి: ఒకప్పుడు కేవలం అడవి బిడ్డల జీవనాధారంగా మొదలైన కాఫీ సాగు, నేడు మన్యం ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపింది. అరకు కాఫీ బ్రాండ్ పేరు వింటేనే అంతర్జాతీయ మార్కెట్ పులకించిపోయే స్థాయికి చేరిందంటే దానికి కారణం దశాబ్దాల కష్టం.. శాసీ్త్రయ పరిశోధనలే. సరిగ్గా ఇదే తరుణంలో, మన్యం కాఫీ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం యాభై వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం. 50 ఏళ్ల ప్రస్థానమిలా.. ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానాన్ని కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారులు బుధవారం సందర్శించారు. బోర్డు సీఈవో ఎం. కూర్మారావు, చైర్మన్ డాక్టర్ దినేష్ కుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో సాగువుతున్న మేలు రకపు వంగడాలను పరిశీలించారు. ఆర్వీనగర్ కేంద్రం ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా (గోల్డెన్ జూబ్లీ), ఇక్కడ జరిగిన పరిశోధనలు రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయో ఇన్చార్జి సునీల్‌బాబు నుంచి తెలుసుకున్నారు. నేడు ప్రత్యేక సదస్సు ఈ స్వర్ణోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం అరకులోయలో ఒక భారీ సదస్సును నిర్వహిస్తున్నారు. దీని గురించి సీఈవో కూర్మారావు మాట్లాడుతూ..ఈ సదస్సు కేవలం వేడుక మాత్రమే కాదు, భవిష్యత్తు కాఫీ సాగుకు ఒక దిశానిర్దేశం. కాఫీ సాగులో అద్భుత ఫలితాలు సాధించిన రైతులు, శాస్త్రవేత్తలు,అధికారులను ఒకే వేదికపైకి తెస్తున్నాం. వారి అనుభవాలు, సూచనల ఆధారంగా రాబోయే రోజుల్లో కాఫీ దిగుబడిని, నాణ్యతను మరింత పెంచేలా కార్యాచరణ సిద్ధం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. గిరిజన జీవితాల్లో కాఫీ విప్లవం మన్యంలో కాఫీ కేవలం ఒక పంట కాదు, అదొక జీవనశైలి. గూడెంకొత్తవీధి, చింతపల్లి, అరకు ప్రాంతాల్లోని వేలాది గిరిజన కుటుంబాలు నేడు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయంటే దానికి కాఫీ సాగే ప్రధాన కారణం. అరకు కాఫీలో ఉండే ప్రత్యేకమైన రుచి, సువాసన అంతర్జాతీయ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఆర్వీనగర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన మేలురకపు మొక్కలు, తెగుళ్లను తట్టుకునే శక్తి గల వంగడాలు రైతులకు వరంగా మారాయి. భవిష్యత్తులో కాఫీ సాగును మరిన్ని గ్రామాలకు విస్తరించడమే లక్ష్యంగా బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. వేడుకల ఏర్పాట్లలో కాఫీ బోర్డు ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ స్వామి, ఆఫీస్ ఇన్చార్జి సునీల్ బాబు, ఏడీ బొంజు బాబు, హెచ్‌వో అరుణకుమారి, జేఎల్‌వో నాగేశ్వరరావు నాయక్ నిమగ్నమయ్యారు.వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అరకులోయ టౌన్: స్థానిక పున్నమి హరిత వ్యాలీ రిసార్ట్స్‌లోని గోస్టి సమావేశ మందిరంలో గురువారం కేంద్ర కాఫీ బోర్డు ఆధ్వర్యంలో ఆర్వీనగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్టు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ హెచ్ఆర్ మురళీధర్, అరకులోయ జేఎల్‌వో వీవీకేఎం లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ నిశాంతి , ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జీసీసీ,కాఫీ బోర్డు ఉన్నతాధికారులతో పాటు కాఫీ రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ఆర్వీ నగర్ కాఫీ పరిశోధనా కేంద్రం విశేష కృషి ఆధునిక వంగడాల సాగులో కీలకపాత్ర గిరి రైతుల ఆర్థిక స్థితిగతుల మెరుగే లక్ష్యంగా సేవలు వేలాది కుటుంబాలకు జీవనోపాధి నేడు అరకులోయలో స్వర్ణోత్సవ వేడుకలు -
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
● కలెక్టర్ నిశాంతి ● మోదమ్మ జాతర నిర్వహణపై సమీక్ష పాడేరు : పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాలను ఈనెల 17,18,19 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టి. నిషాంతి ఆదేశించారు. జాతర ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అత్యంత పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. పారిశుధ్యం, తాగునీటి సమస్య తలెత్తకుండా నిత్యం తాగునీరు సరఫరా చేయాలని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాయిలెట్లతో పాటు మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తేవాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వంద ప్రత్యేక బస్సు సర్వీసులను 24/7 పాటు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జాతర మూడు రోజుల పాటు ప్రత్యేక వైద్య శిభిరాలు నిర్వహించాలని, పూర్తి స్థాయిలో మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ పథకాల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
జన సమీకరణ తుస్సు..
● జీసీసీ చైర్మన్ శ్రవణ్‌కుమార్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్ ● వెలవెలబోయిన పర్యటన ● బెడిసికొట్టిన పచ్చనేతల ప్రయత్నాలు పాడేరు: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాడేరు పర్యటన ఆశించిన స్థాయిలో సాగలేదు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్ వివాహ వేడుకకు బుధవారం హాజరైన మంత్రికి స్వాగతం పలికేందుకు జనం కరువయ్యారు. మంత్రి మెప్పు పొందేందుకు స్థానిక టీడీపీ నేతలు చేసిన జనసమీకరణ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బస్సులు ఉన్నా.. జనం లేరు! పట్టణ శివారులోని తుమ్మరమెట్ట వద్ద జరిగిన ఈ వివాహ వేడుకకు లోకేశ్ వస్తున్నారని తెలియడంతో, ఎలాగైనా భారీ జనసమీకరణ చూపాలని పచ్చనేతలు భావించారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు జనం లేకపోతే అబాసుపాలవుతామని భయపడి, మైదాన ప్రాంతాలతో పాటు పాడేరు డిపో నుంచి ఏకంగా 64 ఆర్టీసీ బస్సులను సమకూర్చుకున్నారు. సాధారణంగా వివాహ వేడుకలకు అభిమానంతో జనం రావాలి.. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. పాడేరు, హుకుంపేట మండలాల్లో తిప్పిన ఈ బస్సుల్లో జనం రాక సీట్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. లోకేష్ అసంతృప్తి చెందుతారనే భయంతో అక్కడక్కడ ఉన్న కొద్దిమందిని హెలీప్యాడ్ వద్ద అటు ఇటుగా నిలబెట్టి హడావుడి చేశారు. మంత్రి పర్యటన కోసం బస్సుల్లో వచ్చిన కొద్దిమందికి, వివాహానికి వచ్చిన అతిథులకు సరైన భోజన సదుపాయాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో అసంతృప్తితో వెనుదిరిగారు. మరోవైపు, వర్తనాపల్లి గ్రామంలో కొంతమంది యువకులు మంత్రి లోకేష్‌ను కలిసి జీవో నంబరు3ను పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు. స్తంభించిన ట్రాఫిక్.. లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారు. వాహనాల రద్దీ పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న లోకేష్ పర్యటన, జన సమీకరణ వైఫల్యంతో చప్పగా ముగిసింది. -
మేలైన యాజమాన్యంతో అధిక దిగుబడి
పాడేరు రూరల్: పసుపు పంటలో అధిక దిగుబడి సాధించాలంటే రైతులకు సాగు పద్ధతులపై పూర్తి అవగాహన ఉండాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని వంట్లమామిడి పంచాయతీ చోడిపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు విత్తనాలు నాటే ముందే నాణ్యతను పరిశీలించుకోవాలని సూచించారు. మొక్కలకు వచ్చే వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువుల వినియోగానికే రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నూతన సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, కొత్త రకం వంగడాలను సాగు చేయాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ ఫీల్డ్ అధికారి కళ్యాణి, ఉద్యాన అధికారి శరణ్య మాధురి, రైతులు పాల్గొన్నారు. పసుపు రైతులకు ఏరువాక శాస్త్రవేత్త ప్రదీప్ కుమార్ సూచన -
నాణ్యమైన కాఫీ దిగుబడులకు పూర్తి సహకారం
చింతపల్లి: మన్యంలో నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర కాఫీ బోర్డు పూర్తి సహకారం అందిస్తుందని బోర్డు సీఈఓ ఎం. కూర్మారావు అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలో కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ ఎంజే దినేష్‌తో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా పెంటపాడు గ్రామంలోని మాతోట రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహిస్తున్న కాఫీ పల్పింగ్ యూనిట్‌ను అధికారులు పరిశీలించారు. గంతన్నదొర రైతు ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర కాఫీ బోర్డు సహకారంతో నిర్మించిన సోలార్ టన్నల్ డ్రయర్‌ను వారు ప్రారంభించారు. గంతన్నదొర ఎఫ్‌పీవోకు సోలార్ టన్నల్ ఏర్పాటు కోసం కాఫీ బోర్డు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించిందని సీఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతోట, గంతన్నదొర రైతు సంఘాల పరిధిలోని గిరిజన రైతులు పండిస్తున్న కాఫీని శాసీ్త్రయంగా ప్రాసెస్ చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడి వస్తుందని, దీనివల్ల మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చేపడుతున్న అధునాతన ప్రాసెసింగ్ పద్ధతులను సామాన్య రైతులందరూ అనుసరించాలని ఆయన కోరారు. అనంతరం ఐటీడీఏ, మాక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్‌ను పరిశీలించి, రైతులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌ఐ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సెంథిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ శివకుమార్, పాడేరు హెచ్ఆర్ మురళీధర్, ఆర్‌సీఆర్‌ఎస్ ఇన్ఛార్జ్ సునీల్ బాబు, జేఎల్ఓ రవికుమార్, కాఫీ ఏడీ బొంజుబాబు, గిరిజన వికాస సంస్థ సీఈఓ ఎన్. సత్యనారాయణ, మాతోట సీఈఓ చిన్నారావు పాల్గొన్నారు. కాఫీ బోర్డు సీఈవో కూర్మారావు -
ఇంటర్ సీబీఎస్ఈ ఫలితాల్లో తన్విత ప్రతిభ
● 90.2 శాతం మార్కుల సాధన చింతపల్లి: స్థానిక ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ (సీబీఎస్ఈ – బైపీసీ) చదువుతున్న పాంగి తన్విత అద్భుత ప్రతిభ కనబరిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 500 మార్కులకు గాను 451 (90.2శాతం) మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన పాంగి సురేష్ కుమార్ దంపతుల కుమార్తె తన్విత సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన్వితతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇదే పాఠశాలకు చెందిన లక్ష్మీ దుర్గా ప్రసన్న 450 మార్కులతో ద్వితీయ స్థానం, గౌరీ శంకర్ 447 మార్కులతో తృతీయ స్థానం, శెట్టి రాహిత్య హ్యుమానిటీస్ విభాగంలో 435 మార్కులు సాధించారు. తన్విత సాధించిన విజయంతో ఆమె కుటుంబంలో పండగ వాతా వరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. గిరిజన ప్రాంత విద్యార్థులకు తన్విత విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. -
అక్రమ అరెస్టులు, వేధింపులు ఆపాలి
జి.మాడుగుల: వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలుపై జరుగుతున్న అక్రమ అరెస్టులు, పోలీసు వేధింపులను నిరసిస్తూ బుధవారం జి.మాడుగులలో మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, పోలీసు వేధింపులతో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు త్రీటౌన్ పోలీసులు బాలును నిరంతరం వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు ఎస్.మహేష్, బి.రవి, జి.శ్రీను పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ యువజన విభాగం డిమాండ్ -
బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా– ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు బుధవారం ఒడిశాలోని ఒనకడిల్లీ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాలు 2025– 2026 నీటి సంవత్సరంలో బలిమెల జలాశయం నుంచి ఎంతెంత వాడుకున్నారో లెక్కించారు. ఈ నీటి సంవత్సరంలో ఏప్రిల్ 2026 నాటికి ఒడిశా 77.3178 టీఎంసీలు, ఆంధ్రా తన వాటాగా ఏప్రిల్ 2026 నాటికి 57.7851 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు గుర్తించారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఒడిశా ఆంధ్రా కంటే 14.6480 టీఎంసీల నీటిని అధికంగా వాడుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం బలిమెలలో 37.27 టీఎంసీలు, జోలాపుట్టులో 6,6312 టీఎంసీలు నిల్వలు ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి బలిమెలకు నదీ పరివాహక ప్రాంతం నుంచి ఒక టీఎంసీ నీటి నిల్వలు చేకూరుతాయని వెల్లడించారు. జోలాపుట్టులో 0.90 టీఎంసీల నీటి నిల్వలు వచ్చి చేరుతాయని, కలిపి బలిమెల, జోలాపుట్టులో మొత్తంగా 45.8012 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు లెక్కలు కట్టారు. ఇందులో ఏపీ వాటాగా 32.66695 టీఎంసీలు, ఒడిశా వాటాగా 13.13425 టీఎంసీలు పంపకాలు జరిపారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్, ఇరిగేషన్ అవసరాల నిమిత్తంగా ఆంధ్రాకు ఆరు వేల క్యూసెక్కులు, ఒడిశాకు 3100 క్యూసెక్కుల నీటిని వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఒడిశా అధికారులు, సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, ఈఈ టి.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
అడవికి నిప్పుతో జీవకోటికి ముప్పు
● ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ ముంచంగిపుట్టు: అడవులకు నిప్పు పెట్టడం వల్ల విలువైన అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ముంచంగిపుట్టు ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని భూసిపుట్టు పంచాయతీ కేంద్రం, సరియాపల్లి గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ’అడవిలో నిప్పు.. మానవాళి మనుగడకే ముప్పు’ అనే అవగాహన కార్యక్రమం, ర్యాలీ చేపట్టారు. అనంతరం రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. వేసవిలో ఎండుటాకులు, ఎండిన చెట్ల కారణంగా చిన్న నిప్పు రవ్వ పడినా అది దావానలంలా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. దీనివల్ల వేలాది ఎకరాల్లోని వృక్షసంపద బూడిదవ్వడమే కాకుండా, అడవిలోని జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతాయన్నారు. మంటలు, పొగ వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. అడవులకు నిప్పు పెట్టడం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులను కాపాడుకోవడం ద్వారానే వన్యప్రాణులను, పర్యావరణాన్ని రక్షించుకోగలమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు కార్తీక్, వెంకటరాజు, శ్రీను పాల్గొన్నారు. -
అంగన్వాడీ భవనాల పూర్తికి ప్రతిపాదనలు
రావికమతం : జిల్లాలో 9 ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 208 అంగన్వాడీ భవనాలను పూర్తి చేసేందుకు రూ.11 కోట్లు నిధులు మంజురూ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం స్దానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కిశోర వికాసంపై రూపొందించిన 18 అంశాలపై బాలికులకు అవగాహన కల్పించారు. తదనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లో 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు పరిధిలో 1908 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయని, వీటిలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే 24 ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయాలు, కార్యకర్తలకు సంబంధించి 236 మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె తెలిపారు. మే ఒక్కటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులలో కిశోర బాలికలకు కిశోర వికాసం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, పోషకాహార ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 15 నుంచి 20 మందిని గ్రూపులుగా విభజించి మంగళవారం, శుక్రవారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో మంగతాయారు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. రమేష్ పాల్గొన్నారు. -
ఇటుక బట్టీలపై విజిలెన్స్ దాడులు
ఎస్.రాయవరం : మండలంలో ఇటుక బట్టీలపై విజులెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వమ్మవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా చెరువు మట్టిని తరలించి ఇటుక తయారికి వినియోగిస్తున్నారని మంగళవారం సాక్షి దినపత్రికలో ‘హోంమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా’ అనే శీర్షికన వార్త వెలువడింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు స్పందించి వమ్మవరం ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు. మట్టి నిల్వలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. మట్టి ఎన్ని క్యుబిక్మీటర్లు ఒక్కో బట్టీవద్ద ఉన్నదీ, ఆ యజమాని ఎక్కడ నుంచి మట్టి తరలించారనే వివరాలు నమోదు చేసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ తనిఖీలల్లో మైన్ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి, నర్సీపట్నం ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, సీఎస్‌డీటీ సూరి స్థానిక వీఆర్ఏలు పాల్గొన్నారు. -
కన్నీట్ సుడులు
రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్నే పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది.ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది.● నీట్ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతం ● ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం ● రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని ఆవేదన సాక్షి, విశాఖపట్నం/మద్దిలపాలెం : వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్‌తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ’అమ్మా, నాన్నా.. నేను డాక్టర్ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది. ప్రతిభావంతులు బలి రాజస్థాన్‌లో వెలుగు చూసిన ’పేపర్ లీక్’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు. ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది. మా తప్పేంటి? నిజాయితీగా చదివి, కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ అదే ఒత్తిడిని భరించాల్సి వస్తోంది. ఒకరి అక్రమంం లక్షల మందికి శిక్షగా మారిందనే భావన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ‘మళ్లీ చదవాలి.. మళ్లీ ఒత్తిడి భరించాలి.. మళ్లీ పరీక్ష హాల్లో కూర్చోవాలి’.. అనే ఆలోచన వారిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది. ఎన్టీఏ భరోసా సరిపోతుందా? రీ–ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసిక స్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే. వ్యవస్థ మారేది ఎప్పుడు? ఒక పేపర్ లీక్.. ఒక రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కొత్త షెడ్యూల్ రావచ్చు.. కొత్త హాల్ టికెట్లు జారీ అవ్వొచ్చు.. కానీ, పోగొట్టుకున్న సమయాన్ని, మానసిక ప్రశాంతతను మళ్లీ తెచ్చి ఇచ్చేది ఎవరు? దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి మే నెల 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీతో రద్దు అయినట్టు వార్తల్లో చూశాం. నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలను పోలిన సుమారు 140 ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ సోషల్ మీడియాలో లీకై ందంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్ధమవుతుంది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఈ పేపర్ లీకేజీ వెనక ఎవరున్నా..వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. – గిరిజారాణి, నీట్ విద్యార్థిని తల్లి -
బస్సు మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన
ఆర్టీసీ డ్రైవింగ్స్కూల్ల్లో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మెకానికల్ ఇంజినీర్ అశ్విని అనకాపల్లి : నిరుద్యోగ యువతీ, యువతులకు ఉద్యోగ ఆవకాశాల్లో భాగంగా ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఆధ్వర్యంలో 13 వ డ్రైవింగ్ స్కూల్ బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజారవాణాశాఖ అనకాపల్లి డిపో గ్యారేజ్ మెకానికల్ ఇంజినీర్ అశ్విని అన్నారు. మంగళవారం డ్రైవర్లకు బస్సు మెకానిక్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు బస్సు మెకానిజంపై శిక్షణ, అవగహన కల్పించడం వల్ల వారిలో నైపుణ్యాన్ని వెలికితీయవచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు మార్గమధ్యంలో ఆగిపోయినపుడు ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ అసిస్టెంట్ బాపు నాయుడు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ పాల్గొన్నారు. -
లోతుగెడ్డ రేంజ్లో చిరుత సంచారం
● అప్రమత్తంగా ఉండాలి ● డీఆర్వో అప్పారావు సూచన చింతపల్లి: మండలంలోని లోతుగెడ్డ అటవీ రేంజ్ పరిధిలోని బందబయలు, లింగాలగుడి పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతుగెడ్డ డీఆర్వో అప్పారావు సూచించారు. మంగళవారం బందబయలు, లింగాలగుడి గ్రామాల్లో అటవీశాఖ అధికారులు దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం లింగాలగుడి గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి మేకను చిరుత ఎత్తుకెళ్లిందని, అలాగే మరో గిరిజనుడిపై దాడి చేయబోగా అతను చాకచక్యంగా తప్పించుకున్నాడని తెలిపారు. లింగాలగుడి పరిసరాల్లో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిరుత గ్రామాలపై పడి పశువులు, మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గిరిజనులు పంట చేలకు, ఊటగెడ్డలకు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లరాదని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిరుతపులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయే వరకు అటవీశాఖ గాలింపు చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు. ఒకవేళ చిరుత పశువులపై దాడి చేస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి బాబూరావు, ఎఫ్‌బీవోలు నాగరత్నం, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో జనుము విత్తనాలు
అనకాపల్లి: చెరకు, కూరగాయ పంటలకు అవసరం మేరకు నీటి సదుపాయం కల్పించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ టి.శ్రీలత తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు అందించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పంటలను బెట్ట నుంచి కాపాడటానికి పంట వ్యర్థాలతో మల్పింగ్ చేయాలి. ఖరీఫ్‌కు ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవాలి. వర్షాలు పడగానే విత్తుకోవడానికి వీలుగా విత్తనాలను ముందుగా సేకరించుకోవాలి. పరిశోధన స్థానంలో జనము విత్తనాలు ఎస్యూఐఎన్.037, జేఆర్జే 610 రకాలు కిలో రూ.130 చొప్పున అందుబాటులో ఉన్నాయి. విత్తనాల కోసం రైతులు సంప్రదించాలని సూచించారు. చెరకు మొక్క, కార్శి తోటలలో వరుసల మధ్య అంతర కృషి చేపట్టాలి. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ పంటగా నువ్వులు వేసుకోవడానికి నేలను తయారు చేసుకుని అధిక దిగుబడినిచ్చే వైఎల్‌ఎం. 66, 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కూరగాయల్లో బొగ్గు కుళ్లు తెగులు ఆశించవచ్చని, నివారణకు లీటరుకు 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను మొక్కమొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. మామిడిలో పండు ఈగ నివారణకు 2 మి.లీ మిథైల్ యూజినాల్, 3 గ్రా, కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ సీపాలో పోసి తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వేలాడ దీయాలి. ఖాళీ పొలాల్లో వేసవిలోతు దుక్కులు దున్నుకోవాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్.సరిత, వి.చంద్రశేఖర్, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పాడేరు: జిల్లాలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని కొత్త పాడేరు గ్రామంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు నూతనంగా నిర్మించిన నివాస గృహంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఒకే ప్రాంగణంలో నివాస గృహాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం శుభపరిణామన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ మరింత సేవ చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అతిథులను ఘనంగా సన్మానించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ విప్ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. అత్యధిక స్థానాలు కై వసంచేసుకునేందుకు కృషి వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు పాడేరులో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం -
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మాకవరపాలెం : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలకు 273 మంది విద్యార్థులు హాజరయ్యారు. తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఈ నెల 18 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రావు తెలిపారు. నిత్యం రెండు విడతల్లో జరిగే పరీక్షలకు గంటన్నర ముందుగా కేంద్రానికి హాజరుకావాలన్నారు. మొదటి రోజు 273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. -
బీసీ వసతిగృహ విద్యార్థినికి
అవార్డు ప్రదానంబీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత నుంచి అవార్డు అందుకుంటున్న బీసీ వసతిగృహ విద్యార్థిని రుత్తల దుర్గ నర్సీపట్నం: ఇటీవల విడుదులైన టెన్త్ ఫలితాల్లో 574 మార్కులు సాధించిన బీసీ బాలికల వసతిగృహం విద్యార్థిని రుత్తల దుర్గ మంగళవారం రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది. టెన్త్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతిగృహాల విద్యార్థులకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున్‌రావు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ చేతుల మీదగా విద్యార్థిని దుర్గ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకుంది. దుర్గను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహం వార్డెన్ బి.వెంకటలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
సుమారు రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట, జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న 194 కేజీల గంజాయితో పాటు(వీటి విలువ సుమారుగా రూ.97లక్షలు) కారు, ముగ్గురు వ్యక్తులు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి రవాణాపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక మార్గాల్లో రవాణా చేయడం జరుగుతుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది గంజాయి(డ్రైయి) రవాణా తగ్గినప్పటికీ హషీష్ అయిల్ పెరిగిందన్నారు. ఈనెల 11న జిల్లాలో బుచ్చియ్యపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పర్యవేక్షణలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుచ్చియ్యపేట పోలీసులు బంగారుమెట్ట–అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. గంజాయితో వెళుతున్న కారుకు రూట్ మ్యాప్ ద్వారా వెళుతున్న సమయంలో బైక్‌ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, వెనుక కారులో 194 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పటుబడ్డారని తెలిపారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గుమ్మాల పేరునాయుడు (గతంలో 6 కేసులు), అల్లూరి జిల్లా పెదబయలు మండలం, గజ్జేడు గ్రామానికి చెందిన మండిపల్లి సత్తిబాబు(గంజాయి సాగుదారు), చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గొల్లవిల్లి గణేష్(కారు డ్రైవర్)ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందుతుల కోసం గాలిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా తక్షణమే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. రెండేళ్లలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది ఇప్పటి వరకూ 46 కేసులు నమోదు చేసి, మొత్తం 1,177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశామని, ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేటి వరకూ రూ.1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్ఐ ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. బుచ్చెయ్యపేట ఎస్ఐకు ఎస్పీ అభినందన బుచ్చెయ్యపేట: స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావును ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం అభినందించారు. బుచ్చెయ్యపేట రోడ్డులో సుమారు రూ.కోటి విలువ గల సుమారు 194 కిలోల గంజాయి, స్మగ్లర్లను చౌకచక్యంగా పట్టుకోవడంతో ఎస్ఐని సత్కరించారు.ఎస్ఐతో పాటు బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
వందో రోజు కొనసాగిన దళిత రైతుల దీక్షలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం వందవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎటువంటి పరిహారం ఇవ్వకుండా దళిత రైతులకు చెందిన డీ పట్టా భూములను లాక్కొనేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.దళితులు దీక్షలు చేపట్టి వంద రోజులైనా కూటమి నేతలు పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు.నిరుపేదలైన దళితుల భూముల్ని లాక్కొంటున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాలకు దోచిపెడుతోందని విమర్శించారు.పంచదార్ల రైతులకోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.అనంతరం దీక్ష శిబిరం వద్ద పలువురు దళిత సంఘాలు,విదసం నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీ బాబు,జి.దేముడు నాయుడు,చందక రామకృష్ణ,ధోనీ కాసియా,రేబాక రాము,ఎం.డి. రాజు,సూర్య,శివ,ఆర్ కృష్ణ,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
మిన్నంటిన సంబరం
సాక్షి, పాడేరు: మన్యవాసుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఉదయం 6 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, శివరత్నం దంపతులు ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ టి. నర్సింగరావు దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహించగా, వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతిదేవి, కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, విశాఖపట్నంకు చెందిన నేతలు గణేష్‌గౌడ్, పద్మశేఖర్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రముఖులకు శాలువాలు కప్పి సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. వైభవంగా ఊరేగింపు అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది. సాయంత్రం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు కలిసి ఉత్సవ విగ్రహానికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. పాడేరు పురవీధుల్లో సాగిన ఈ ఊరేగింపులో తీన్మార్ వాయిద్యాలు, కేరళ డప్పులు, శక్తి, పులి, రాక్షస వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవంతంగా వేడుకలు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకల నిర్వహణపై ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ముందుగా ప్రకటించిన విధంగానే మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం వాతావరణం అనుకూలించడంతో ఊరేగింపు ప్రశాంతంగా, భారీ భక్తజన సందోహం మధ్య ముగిసింది. పాడేరులో ఘనంగా మోదమ్మ పుట్టినరోజు వేడుకలు పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు తరలివచ్చిన భక్తజనం దర్శించుకున్న ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు సత్తాచాటిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
ఎమ్మెల్సీ రవిబాబు దంపతులకు సత్కారం
సాక్షి,పాడేరు: పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు దంపతులను, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నర్సింగరావు దంపతులు ఘనంగా సన్మానించారు.అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కరణం ధర్మశ్రీ, వెంకట్రామయ్య, మాజీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, వడ్డాది జెడ్పీటీసీ దొండా రాంబాబు, చింతపల్లి ఎంపీపీ అనుషాదేవి తదితర నేతలకు భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. -
మహిళా భద్రతకు పాటుపడాలి
నర్సీపట్నం : మహిళా భద్రతపై మహిళా పోలీసు సిబ్బంది దృష్టిసారించాలని, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ, నర్సీపట్నం ఇన్ఛార్జీ డీఎప్పీ ఈ.శ్రీనివాసులు సూచించారు. స్థానిక ప్రవేటు కళ్యాణమండపంలో డివిజన్లోని మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను ఆరికట్టేందుకు కృషి చేయాలని, మహిళల రక్షణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రచార రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ అవశ్యకతను మహిళలు, బాలికలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలు గపూర్, రేవతమ్మ, పాయకరావుపేట సీఐ శంకర్రావు, డివిజన్ పరిధిలో మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం
నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం. ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పరిపాటిగా మారింది. నీట్ నిర్వహణలో లోపాన్ని గుర్తించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వానికి తగదు. మా పాపతో పాటు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి ఏడాది పాటు ప్రిపేరు అయ్యారు. తీరా పరీక్ష రాసిన తరువాత పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఈ విధమైన చర్య విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. – వి.వి.ఎన్.హరికృష్ణ, విద్యార్థిని తండ్రి, నర్సీపట్నం -
వైద్య రంగంలో నర్సులు కీలకపాత్ర
సాక్షి, పాడేరు: నర్సింగ్ వృత్తిని దైవంగా భావించి, ప్రజలకు విశేష సేవలు అందించిన ఆదర్శ మూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ స్మృత్యర్థం మంగళవారం జిల్లా ఆస్పత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నైటింగేల్ చిత్రపటానికి నర్సింగ్ సూపరింటెండెంట్లు ఎం. అన్నపూర్ణ (గ్రేడ్–1), ఎం. ఇందిర, జి. చంద్రకళ (గ్రేడ్–2) పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి తోటి సిబ్బందికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో నర్సింగ్ వ్యవస్థ పోషిస్తున్న కీలక పాత్రను, వారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి నర్సింగ్ బృందం మొత్తం పాల్గొంది. సేవ, త్యాగాలకు నిదర్శనం నర్సులు ముంచంగిపుట్టు: సేవాభావానికి, త్యాగానికి నిదర్శనం నర్సులని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి కొనియాడారు. మంగళవారం మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని వైద్యులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా, ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నర్సులందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. వైద్య రంగంలో వారు అందిస్తున్న విశేష సేవల గురించి పలువురు ప్రసంగించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధరణి మాట్లాడుతూ..ఆసుపత్రుల్లో నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో నర్సులు తమ ప్రాణాలకు తెగించి వైద్యులతో కలిసి పనిచేశారని, ప్రజల ఆరోగ్య రక్షణలో వారు చేస్తున్న కృషి వర్ణనాతీతం అని పేర్కొన్నారు. వైద్యులు రమేష్, ఆదిత్యతో పాటు సీహెచ్‌సీ సిబ్బంది సురేష్, రమేష్, రాంబాబు, నూకాల మ్మ, వనిత, నాగమణి, తేజవతి పాల్గొన్నారు. ఘనంగా ప్రపంచ నర్సుల దినోత్సవం -
ప్రమాదవశాత్తూ ఆర్మీ ఉద్యోగి మృతి
వార్షిక ప్రణాళిక అమలుతో మహిళా సంఘాల అభివృద్ధి సబ్బవరం: వార్షిక ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని డీపీఎం ఐబీ పి.వెంకటరమణ సూచించారు. సబ్బవరం మండల సమాఖ్య కార్యాలయంలో ఏఏపీ–1 సెక్షన్ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సబ్బవరం మండల సమాఖ్యతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, గొలుగొండ, చోడవరం, యలమంచిలి మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వీవో స్థాయిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారీ, కార్యవర్గ సభ్యులకు, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అవగాహన కల్పించడం, బడ్జెట్ ప్రక్రియపై శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. వీఎంవోఎస్ఏ అంఽశాలపై టీవోటీ కె.శ్రీనివాసరావు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధి వంటి అంఽశాలపై సభ్యులతో చర్చించి గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు సబ్బవరం మండలంలోని 58 గ్రామ సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆవుల శేఖర్ నర్సీపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు దక్కే వరకు పోరాటాలు ఆగవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆవుల శేఖర్ పేర్కొన్నారు. అనకాపల్లిలో జిల్లా అధ్యక్షుడు అర్జున్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో శేఖర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామీణ పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూములన్నీ రాజకీయ పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూములు అందుతాయన్నారు. పేదల సంక్షేమ పథకాలు కత్తిరించాలనే గ్రామాల్లో సర్వే చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలుగుల అర్జున్‌రావు, బాలేపల్లి వెంకటరమణ, జిల్లా ఆఫీస్ బేరర్లు కొండలరావు, అప్పలనాయుడు, లవరాజు, బంగారయ్య, అప్పారావు, నాగేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి సెలవుల్లో పనులు అప్పగించడం అన్యాయం
అనకాపల్లి: సెలవుల్లో వాట్సాప్ ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని, లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా, కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా విద్యా సంబంధిత పనులను అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు అన్నారు. స్థానిక డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికీ, జిల్లాలో మాత్రం మే 12 నాటికి ఫౌండేషన్ ప్లాన్, మండల ప్లాన్, స్కూల్ లెవల్ ప్లాన్న్లను సిద్ధం చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ఈ ఒత్తిడి ఆపాలని, ఉపాధ్యాయుల సెలవు హక్కు గౌరవించాలని, వాట్సాప్ ద్వారా కాకుండా అధికారిక ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే విధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో జిల్లా కార్యదర్శి యేశపోగు సుధాకర్‌రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎస్.దుర్గాప్రసాద్, గొంది చిన్నబ్బాయ్, కె. పరదేశి, కార్యవర్గ సభ్యుడు వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులంటే ఇంత చులకనా...?
చోడవరం : గోవాడ చెరకు రైతులు ఉద్యమానికి మరోసారి సిద్ధమౌతున్నారు. రైతు సంఘాల నాయకులు, పలు రైతు ఉద్యమకారులు కలిసి చోడవరంలో బుధవారం సమావేశమయ్యారు. భారతీయ జనతాపార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రైతు ఉద్యమకారుడు ఎ.ఆర్.జి శర్మ ఇంటి వద్ద రైతు సంఘాల నాయకులంతా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారంతా తప్పుబడ్డారు. రైతులంటే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని, మరోసారి ఉద్యమానికి చెరకు రైతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మికులంతా సిద్ధం కావాలంటూ ఈ సమావేశం నిర్ణయించింది. అవసరమైతే రైతుల తరపున న్యాయపోరాటానికై నా వెళదామని ఏ.ఆర్.జి శర్మ ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు తెలిపారు. పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని, 24 వేల మంది చెరకు రైతులు, కార్మికుల జీవన్మరణ సమస్యగా మారిన గోవాడ ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే మొదటి దశ ఉద్యమం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగిందని, వారి హామీ మేరకు ఏమీ జరగకపోవడంతో మరోసారి ఉద్యమానికి అంతా సిద్ధమవ్వాలని నిర్ణయించారు. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీత బకాయిలు రూ. 30 కోట్లు వరకూ ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉందని, అవి ఇప్పటి వరకూ చెల్లించలేదని, అంతేకాకుండా వచ్చే సీజన్ గానుగాట ఆడిందీ లేనిదీ ఏమీ చెప్పకపోవడంతో రైతులు చెరకు పంట వేయాలా వద్దా అనే మీమాంశలో ఉన్నారని, అదీ ప్రభుత్వం తేల్చలేదని సమావేశంలో రైతు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటికై నా వీటిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయకపోతే త్వరలోనే రెండో దశ ఉద్యమం చేయడానికి అంతా సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో రైతు సంఘం జిల్లా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, జనసేన నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీ, రైతు సంఘాల ప్రతినిధులు మహాలక్ష్మినాయుడు, దాడి అమర్, పెదబాబు పాల్గొన్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
పాయకరావుపేట : పట్టణానికి చెందిన యువకుడు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్టు ఏఎస్ఐ గోవిందు తెలిపారు. పట్టణంలో రాజుగారిబీడుకు చెందిన పంజాబీ పవన్ కుమార్ (21) తాటిముంజులు తీయడం కోసం స్థానికంగా గల తాటిచెట్టు ఎక్కి 40 అడుగులు ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుల సహాయంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఏఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. -
‘రహదారి లేదని చెప్పడం అన్యాయం’
మాట్లాడుతున్న బుద్ద మురళీ తాతారావు అనకాపల్లి: స్థానిక మెయిన్‌రోడ్డు రఘరాం లే అవుట్‌ను ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 1535/3లో 7.603 సెంట్ల జీరాయితీ భూమిలో గేటు నిర్మిస్తున్న సమయంలో లే అవుట్ ప్రతినిధి కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావు ఈనెల 9వ తేదీన తమ భూమిలో గేటు నిర్మించుకోవడం తప్పు అని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్థల యజమాని బుద్ద మురళీ తాతారావు అన్నారు. స్థానికంగా ఉన్న తమ భూమిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లే అవుట్‌కు ఆనుకుని ఉన్న తమ స్థలానికి ఇటు రహదారి లేదని చెప్పడం అన్యాయమన్నారు. లే అవుట్ సైడ్ గేటు ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 లక్షలు చెల్లించాలని పరమేశ్వరరావు చెప్పడం తగదని మురళీ తాతారావు అన్నారు. ఇదే విషయంపై సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాతారావు కుటుంబ సభ్యులు విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలంటు రైతుల నిరసన భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన తుమ్మపాల: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్ కాకూడదని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి వారితో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు 123, రెవెన్యూ క్లినిక్‌కు 145 మొత్తం 268 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం నిలిపేయాలి.. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రైతుల భూములకు అనధికారక లేఅవుట్ చూపించి తప్పుడు పద్ధతిలో చేస్తున్న రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేసి రైతులకు రక్షణ కల్పించాలంటు పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందించారు. గ్రామంలో సర్వే నంబర్ల 274, 276, 279, 290, 291, 298, 347లో మొత్తం 60 ఎకరాల రైతుల భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసిన ఓ ప్రైవేటు రియల్టర్ మిగిలిన రైతుల భూములను కూడా కలిపి అనధికారక లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అనధికారక జీపీఏ పత్రాలతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తూ రైతుల భూముల్లోకి వచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారని, రౌడీమూకలతో భూముల్లోకి వచ్చి వివాదాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు సివిల్ వివాదం అంటూ చేతులు దులుపుకోవడం, అధికారులు జీపీఏలతో కొనసాగిస్తున్న రిజిస్ట్రేషన్లను నిలిపివేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టి తమ భూములకు సంబంధించి సృష్టిస్తున్న తప్పుడు పత్రాలను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. సాగు భూములను కాపాడాలి.. ఎస్ఈజెడ్ నిర్మాణం కోసం కె.కోటపాడు మండలం పలు గ్రామాల్లో చేపడుతున్న బలవంతపు భూసేకరణ నిలిపేసి సాగు భూములను కాపాడాలంటు ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలో అత్యధిక రిజర్వాయర్లు కలిగి ప్రతి ఎకరం నీటి సౌకర్యంతో నిత్యం పంటలు పండే చోట ఎస్ఈజెడ్ అంటు భూములను సేకరించి కంపెనీలతో కలుషితం చేయడం మానుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వేల ఎకరాల భూముల సేకరణ జరిగిందని, జిల్లాలో మిగిలిన భూములను వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ కార్యాలయానికి 65 ఆర్జీలు అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వేధింపులు, ఇతర విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. వాస్తవాల ఆధారంగా సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామ సమీపం నెల్లిమెట్ట వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. రోలుగుంట మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన లాలం సాయి కుమార్ (30) ఈ నెల 10వ తేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన సతీష్, రాజేష్, నానాజీలతో కలిసి గబ్బాడ గ్రామం, నెల్లిమెట్ట వద్ద మద్యం సేవించినట్టు ఎస్ఐ తెలిపారు. అనంతరం మృతుడు సాయికుమార్, రాజేష్ బైక్‌పై నర్సీపట్నం వైపు రావడం జరిగిందన్నారు. బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి సాయికుమార్ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తి చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ప్రముఖ వైద్యుడు శ్రీరామ్మూర్తి మృతికి సంతాపం
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో పేదల వైద్యుడిగా పేరొందిన ప్రముఖ వైద్యుడు బెన్నాబత్తుల శ్రీరామ్మూర్తి (68) (పెంటబాబు డాక్టర్ ) గుండె పోటుతో మృతి చెందారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం విశాఖలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా బుచ్చెయ్యపేట, చినఅప్పనపాలెం, బంగారుమెట్ట, దిబ్బిడి, ఎల్బీ పురం, భీమవరం, వడ్డాది, వీరవల్లి, పోతనపూడి, కుముదాంపేట, లోపూడి, శింగవరం తదితర గ్రామాల ప్రజలకు తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలతో పాటు నిరుపేదలకు ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని సమయంలో, కరోనా కాలంలో కూడా పలువురికి వైద్య సేవలు అందించి పేదల పెన్నిధిగా పేరొందారు. శ్రీరామూర్తి అకాల మరణంతో పలు గ్రామాల ప్రజలు, పలువురు వైద్యులు, నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని పెద్ద కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య, కుమారుడు ఉన్నారు. -
దూరవిద్య పరీక్ష కేంద్రం మంజూరు
అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ మహి ళా డిగ్రీ కళాశాలకు ఆంధ్రాయూనివర్సిటీ దూరవిద్య పరీక్ష కేంద్రం మంజూరైనట్టు ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు సోమవారం తెలిపారు. ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ 167ను కేటాయించారన్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి యూజీ థియరీ పరీక్షలు, బీఏ, బీకాం, బీఎస్సీ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దూర విద్య పరీక్ష కేంద్రం మంజూరు చేసిన ఏయూ వైస్ చాన్సలర్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఇతర అధికారులకు చలపతిరావు, కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. -
దేవాలయ భూములకు నష్టపరిహారం ఇప్పించండి
అచ్యుతాపురం రూరల్ : దుప్పితూరులో పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతీ సమేత భావనాఋషి ఆలయ భూములకు నష్టపరిహారం ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు అనకాపల్లి కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా తమ సొంత నిధులతో స్వామికి నిత్య దీప ధూప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఆలయ భూములకు పరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్‌ను కోరారు. నష్టపరిహారం చెల్లించకుండా ఆలయ భూములను ఆక్రమిస్తున్న ఏపీఐఐసీ, బ్రాండిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ప్రహారీ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ మాడెం సూరి అప్పారావు, ఉపాధ్యక్షుడు శేశెట్టి రాంబాబు, సెక్రటరీ మాడెం అప్పారావు, కమిటీ సభ్యులు అంజూరి అప్పలరాజు, శేశెట్టి నర్సింగరావు, శేశెట్టి నానాజీ, వానపల్లి ముకుందేశ్వరరావు, వానపల్లి సన్యాసిరావు, అముదూరి అర్జునరావు తదితరులు ఉన్నారు. -
చిరిగిన దోమతెరలే గతి
రెండేళ్లుగా చిరిగిన దోమతెరలతో ఇబ్బందులు పడుతున్నాం.వాటిని సూదులతో కుడుతున్నా ఫలితం లేక పోతోంది.దోమతెరలన్నీ చిరిగిపోవడంతో వాటిని కట్టుకున్నా దోమలు లోపలికి వచ్చి కుడుతున్నాయి.సాయంత్రం అయితే దోమల బెడద అధికంగా ఉంది.పొగపెడుతున్నా దోమ కాట్లు తప్పడం లేదు.ఈఏడాది కూడా తమ గ్రామంలో ఏకుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయలేదు. –వంతాల మదు, ఎర్రగుప్ప గ్రామం, పాడేరు మండలందోమల నివారణ మందు పిచికారీ చేయలేదు దోమకాట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.నా భర్త భాస్కరరావు మలేరియా జ్వరంతో పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా ఇంటి వద్ద గాని, చుట్టు పక్కల ఇళ్ల వద్దగాని ఇంత వరకు దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.దోమతెరలు కూడా పంపిణీ చేయలేదు. –వంతాల లక్ష్మి, బక్కలపనుకు గ్రామం, పాడేరు -
ఘాట్‌రోడ్డులో తప్పిన ప్రమాదం
సాక్షి, పాడేరు: మైదాన ప్రాంతం నుంచి జి.మాడుగుల జీసీసీ బంక్‌కు పెట్రోల్,డీజిల్ రవాణా చేస్తున్న ఆయిల్ట్యాంకర్కు పాడేరు ఘాట్‌లో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.పాడేరు ఘాట్ రోడ్డు నుంచి అతివేగంగా దిగుతున్న టిప్పర్‌ను తప్పించేందుకు ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కనున్న కొండవైపునకు మళ్లించాడు.కొండకు ఆనుకుని ట్యాంకర్ ఒరిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.టిప్పర్,ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.పాడేరు ఘాట్‌లోని ఏసుప్రభువు విగ్రహం మలుపు సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ లీకు అయింది.పొక్లెయినర్ సాయంతో ట్యాంకర్‌ను రోడ్డుపైకి తీశారు.కొండకు ఆనుకుని ఒరిగిన ఆయిల్ ట్యాంకర్ -
ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కుట్ర
పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని కాఫీ రైతుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పాలికి లక్కు తెలిపారు. మండలంలో వంట్లమామిడి పంచాయతీ ఓనూరు తదితర గ్రామాల్లో ఆయన సోమవారం ఉపాధి హామీ పథకం వేతనదారులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో పాత విధానాన్ని కొనసాగించాలన్నారు. కొత్త విధానం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సక్రమంగా పనులు కల్పించకపోవడంతో గిరిజనులు వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని తెలిపారు. రోజు వారీ కూలీ రూ.600కి పెంచాలని డిమాండ్ చేశారు. -
లబ్బూరు వద్ద మూడు బైకులు ఢీ
ఒకరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలో ఆదివారం మూడు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ పి.నాని అందించిన వివరాలు... మండలంలోని మాకవరం పంచాయతీ కిందుగూడ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై ముంచంగిపుట్టు నుంచి కిందుగూడ వెళ్తుండగా అదే సమయంలో మేభ గ్రామానికి చెందిన సుబ్బరావు, రెడ్డి బైకు ముంచంగిపుట్టు బయలుదేరారు. జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలోని ఏకలవ్య పాఠశాల ఎదురుగా ఈ రెండు బైకులు ఢీ కొన్నాయి. అదే సమయంలో కించాయిపుట్టు పంచాయతీ కేంద్రానికి చెందిన నాగేశ్వరరావు బైకుపై వస్తుండగా.. ప్రమాదానికి గురైన రెండు బైకులు అతనిపై దుసుకుపోయాయి.దీంతో అందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగ్రాతులను హూటహూటిన ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.రెడ్డి పరిస్థితి విషమయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి,అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ రెడ్డి(25) సోమవారం మృతి చెందాడు.కిందుగూడకు చెందిన నాగేశ్వరరావు పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నాడు. మేభకు చెందిన సుబ్బరావు ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్నాడని, కేసు నమోదు చేశామని ఎస్ఐ నాని తెలిపారు. -
విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా కృషి
జి.మాడుగుల: మండలంలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పాడేరు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ ఆదేశించారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు స్థానిక బాలుర ఆశ్రమ పాఠశాలలో–2లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న తరగతులను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రాలకు సబ్జెట్ టీచర్లు తప్పని సరిగా తరగతులకు హాజరయ్యే విధంగా ఆశ్రమ పాఠశాల హెచ్ఎంలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల అందించే బోధనను సక్రమంగా వినియోగించుకుని ఉత్తీర్ణులు కావాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
సీలేరు రూట్లో మరో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు
సీలేరు: విశాఖపట్నం డిపో నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా సీలేరు దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్డులో మరో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని విశాఖ ఆర్టీసీ డీఎం మాధురి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు సీలేరు వస్తుందని చెప్పారు. బస్సు సిబ్బంది భోజనానంతరం బయలుదేరి 6.30 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని, మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అక్కడ బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటలకు సీలేరు చేరుకుంటుందని ఆమె తెలిపారు. అక్కడి నుంచి విశాఖప ట్నం బయలుదేరుతుందని డీఎం చెప్పారు. రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించామని, ఈ సర్వీసును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. -
విస్తారంగా వర్షాలు
సాక్షి.పాడేరు: వేసవిలోనూ జిల్లాలో రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఉదయం పొగమంచు,మధ్యాహ్నం వరకు అధిక ఎండ,సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడం వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి.సోమవారం జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.రోజు వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన గెడ్డలు,వాగుల్లో వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. వర్షపాతం వివరాలు: పెదబయలు 29.5, పాడే రులో 26.5, హుకుంపేటలో 26.5,చింతపల్లిలో 17.5, ముంచంగిపుట్టులో 9, కొయ్యూరులో 5.5, జి.మాడుగులలో 4.3, జీకే వీధిలో 1.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. పాడేరులో కురుస్తున్న వర్షం -
పౌడర్ రాస్తేనే ముఖ హాజరు నమోదు
ముంచంగిపుట్టు: ఫొటోలు తీసుకోడానికి, ఏదైనా శుభకార్యాలకు,ఫంక్షన్లకు వెళ్తే ముఖానికి పౌడర్ రాసుకుని వెళ్లడం అందరికీ తెలుసు. గిరిజన ప్రాంతంలో ఉపాధి వేతనదారులు మాత్రం పనులు చేసేందుకు వెళ్లినప్పుడు పౌండర్ రాసుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల చేసేందుకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు ప్రవేశపెట్టింది. ఆ యాప్ సక్రమంగా పని చేయకపోవడంతో హాజరు నమోదుకాక జిల్లాలో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముఖానికి పౌడర్ రాసుకుంటే కొంతమందికి హాజరు నమోదవుతోంది. దీంతో వేతనదారులు పనికి వెళ్లే ముందు తప్పనిసరిగా పౌడర్ రాసుకోవలసి వస్తోంది. సోమవారం వనుగుమ్మ పంచాయతీ పనస గ్రామంలో చాలా మంది ఉపాధి కూలీలు పౌడర్ రాసుకుని వెళ్లి ముఖ హాజరు నమోదుకు యత్నించారు. కానీ కొంతమందికే హాజరు నమోదు అయింది.దీంతో మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ హాజరు విధానాన్ని తక్షణమే రద్దు చేసి,పాత పద్ధతిలోనే పనులు కల్పించాలని వనుగుమ్మ పంచాయతీ పనసగ్రామానికి చెందిన వేతనదారులు కోరుతున్నారు.పనసలో ముఖంపై పౌడర్‌తో వచ్చి హాజరు నమోదు చేసుకుంటున్న వేతనదారుడుముఖ హాజరు కోసం పని ప్రదేశంలో నిరీక్షిస్తున్న వేతనదారులు -
పోర్టులో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ 100 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ లక్ష్యంతో పాటు.. కాలుష్య రహిత పోర్టుగా మార్చడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నామని విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ అంగముత్తు స్పష్టం చేశారు. పోర్టు పరిధిలో పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. పబ్లిక్ ప్రొమెనెడ్ అభివృద్ధి, పోర్టు నిర్వహణ వ్యవస్థ, 38 టీకేఎం రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ, పరిపాలనా భవనంలోని డిస్ప్లే కారిడార్, ఎస్టీపీ సమీపంలో 170 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ప్రస్తుత ఎంసీహెచ్వీ రైల్వే ట్రాక్ అప్‌గ్రెడేషన్, ఎస్ఎల్ కాలువ జెట్టీ సమీపంలో మరమ్మతులు, రైల్వే ట్రాక్‌ల్లో మలుపుల సవరణతో మెరుగుదల పనులతో పాటు కస్టమ్స్ సరిహద్దు గోడ నిర్మాణాన్ని చైర్మన్ డా.అంగముత్తు ప్రారంభించారు. భద్రత, మౌలిక సదుపాయాల బలోపేతానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో అన్ని గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్‌ల ఏర్పాటు, కార్గో గేట్ల వద్ద రేడియోలాజికల్ డిటెక్షన్ పరికరాల ఏర్పాటు, కాన్వెంట్ జంక్షన్ ఆర్చ్ నుంచి హెచ్–7 జంక్షన్ వరకు బీటీ రోడ్డుకు రీగ్రేడింగ్ పనులు, ఓహెచ్సీ లోపలి రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, సీనియర్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేడు మోదమ్మ పుట్టినరోజు ముగింపు ఉత్సవం
సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాల భక్తుల ఆరాధ్యదేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.మూడు రోజుల పుట్టిన రోజు వేడుకలకు మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శ్రీకారం చుట్టారు.ఆదివారం పుట్టిన రోజు ప్రారంభ ఉత్సవాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.సోమవారం కూడా మోదమ్మకు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.మంగళవారం అమ్మవారి పుట్టిన రోజు ముగింపు ఉత్సవాలకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఉదయం నుంచి మోదమ్మకు పూజలు చేయడంతో అమ్మవారి ఘటాలను ఉరేగిస్తారు.మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి మోదమ్మ ఉత్సవ విగ్రహం,పాదాలను పాడేరు వీధుల్లో ఊరేగిస్తారు.నేలవేషాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు,డప్పు వాయిద్యాల హోరులో మోదమ్మ ఊరేగింపు సంబరం జరగనుందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తెలిపారు.రాత్రి కళా ప్రదర్శనలను ఏర్పాటు చేశామని,అన్ని వర్గాల భక్తులు మోదమ్మ పుట్టిన రోజు వేడుకను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
విజృంభన
మలేరియా ● అరకొరగా దోమ తెరల పంపిణీ ● 1.50 లక్షల కుటుంబాలకు గాను ఇచ్చింది 34వేలే ● దోమల నివారణ మందు పిచికారీ 1604 గ్రామాలకే పరిమితం సాక్షి, పాడేరు: జిల్లాలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి.కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడం, పారిశుధ్యం కొరవడడం తదితర కారణాలతో దోమలు వృద్ధి చెంది మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. దీంతో పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలకు క్యూ కడుతున్నారు. ఒక్క పాడేరు జిల్లా ఆస్పత్రిలోనే ఆరుగురు గిరిజనులు మలేరియాతో చికిత్స పొందుతున్నారు. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్ అనే టెన్త్ విద్యార్థి ఈనెల 9వతేదీన మలేరియాతో మృతిచెందాడు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడం, గిరిజన విద్యార్థి మృతిచెందడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మలేరియా నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు. క్రమంగా పెరుగుతున్న కేసులు జిల్లాలోని 11 మండలాల పరిధిలో 1604 మలేరియా పీడిత గ్రామాలను మలేరియాశాఖ గుర్తించగా,ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 399 మలేరియా కేసులు నమోదయ్యాయి.ఈఏడాది జనవరి 21, ఫిబ్రవరిలో 43, మార్చిలో 106, ఏప్రిల్‌లో 165,మే నెలలో ఇంత వరకు 64 మంది మలేరియా జ్వరాల బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి,ముంచంగిపుట్టు,చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రులు, పాటు పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు మలేరియా రోగుల తాకిడి ఎక్కువగా ఉంది.కొంతమంది రోగులు మైదాన ప్రాంత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో మలేరియా కేసులకు అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం పాడేరు పట్టణ పరిధిలోని లోచలిపుట్టుకు చెందిన కె.నీలకంఠం,బక్కలపనుకుకు చెందిన వంతాల భాస్కరరావు,వంట్లమామిడి గ్రామానికి చెందిన జనపరెడ్డి జస్వంత్,జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి చెందిన భార్యభర్తలు సీదరి బంగారయ్య,చిలకమ్మ,మరో గిరిజనుడు జగ్గారావులు మలేరియా జ్వరాలతో వైద్యసేవలు పొందుతున్నారు. చిరిగిన దోమతెరలు చూపిస్తున్న ఎర్రగుప్ప ఆదివాసీలుభయపెడుతున్న దోమలు జిల్లాలో పలు ప్రాంతాలు దోమల అడ్డాగా మారాయి. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు గ్రామాల్లోను అదే పరిస్థితి.సాయంత్రం 4గంటల నుంచే దోమలు దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరులో మలేరియా కేసులు నమోదవుతున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ఇంటి వద్ద దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.జిల్లాలో 3,500 గ్రామాలుండగా,1,604 గ్రామాల్లోనే దోమల నివారణ మందు పిచికారీ చేశారు. ఆయా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు జరపలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు నెలల్లో 399 కేసులు ఓ గిరిజన విద్యార్థి మృతి జిల్లా కేంద్రం పాడేరులోనూమలేరియా కేసులు భయాందోళన చెందుతున్న ప్రజలు నివారణపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం 34,900 దోమతెరలే పంపిణీ జిల్లాలో అన్ని గ్రామాల్లోను దోమల బెడద అధికంగా ఉంది. దోమ కాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అరకొరగా దోమతెరలను పంపిణీ చేసింది. 1.50 లక్షల కుటుంబాలు ఉంటే కేవలం 34,900 దోమతెరల పంపిణీకి గత నెలలో కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. అవి కనీసం మలేరియా పీడిత గ్రామాలకు కూడా సరిపడని పరిస్థితి. గత ఏడాది ఒక్క దోమతెర కూడా పంపిణీ చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన దోమతెరలనే ప్రస్తుతం గిరిజనులు వినియోగిస్తుండగా, వాటికి కాలం చెల్లడంతో చిరిగిపోయాయి. దోమతెరలు లేక దోమకాట్లతో గిరిజనులు రాత్రి సమయంలో నరకయాతన అనుభవిస్తున్నారు. -
క్రీడా శిక్ష ణ కేంద్రాలకు విశేష స్పందన
● ఆరోగ్యం, ఆత్మరక్షణ కల్పించేందుకు యోగా, తైక్వాండోలో శిక్షణ చోడవరం: వేసవి సెలవులు రావడంతో వివిధ క్రీడల్లో ప్రారంభమైన వేసవి శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయా విభాగాల స్పోర్ట్స్ యూనిట్లు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించాయి. ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణలకు కీలకంగా మారిన తైక్వాండో, యోగాలో జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30రోజుల పాటు ఈ కేంద్రాలు నిర్వహించనున్నారు. తైక్వాండో అసోషియేషన్, చోడవరం పతంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ప్రారంభమయ్యాయి. తైక్వాండోలో... ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ చాలా అవసరం. అందులో బాలికల ఆత్మరక్షణ విషయంలో అప్రమత్తత అవసరమని భావించి స్పోర్ట్స్ అథారిటీ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో తైక్వాండో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. బాలబాలికలు కలిపి 30రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్వంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో తైక్వాండో జూడో క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. చోడవరం, అనకాపల్లిపట్టణం, అనకాపల్లిలో గాంధీనగరం, పరవాడ, బుచ్చెయ్యపేట(వడ్డాది) ప్రాంతాల్లో వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. 5నుంచి 16సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి నెలాఖరు వరకూ నిర్వహించే శిక్షణ తరగతులకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో హాజరవుతున్నట్టు మురళి తెలిపారు. యోగాలో .. అందరికీ ఆరోగ్యాన్ని అందించే యోగాలో శిక్షణ ఇచ్చేందుకు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. ఇక్కడి ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న యోగా కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని యోగా గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. యోగా వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, శరీర సౌష్టవంతోపాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. ఈ కేంద్రాన్ని ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. -
ఏపీ వెటర్నరీ అసోసియేషన్ జోన్–1 జాయింట్ సెక్రటరీగా ప్రదీప్ కుమార్
ముంచంగిపుట్టు: ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసోసియేషన్ జోన్–1 జాయింట్ సెక్రటరీగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ లావేటి ప్రదీప్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని వెట్ హోమ్‌లో ఆదివారం నిర్వహించిన అసోసియేషన్ ఎన్నికల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు తోటి పశువైద్యాధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి, పశువైద్యుల సంక్షేమానికి మరియు వృత్తిపరమైన ఐక్యత కోసం అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అందరి సహకారం కోరారు. -
రహదారి కోసం వినూత్న నిరసన
తాడిగుడ జలపాతం మార్గంలో డోలీ యాత్ర అనంతగిరి (అరకులోయ టౌన్): తమ గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతూ అనంతగిరి మండలంలోని అమలగుడ గ్రామ గిరిజనులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మండల కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలగుడ నుంచి తాడిగుడ జలపాతానికి వెళ్లే మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ‘డోలీ యాత్ర’ చేపట్టి ప్రభుత్వానికి తమ గోడును వినిపించుకున్నారు. విన్నవించినా స్పందన కరువు : ఈ సందర్భంగా గ్రామస్తులు కొర్రా గోపి, కౌసల్య మాట్లాడుతూ.. గ్రామంలో రహదారి, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని గతంలోనే ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) ద్వారా కలెక్టర్‌కు, ఎంపీడీవోకు వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. అయినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులకు తప్పని ఇబ్బందులు : ఈ రహదారి కేవలం స్థానిక గిరిజనులకే కాకుండా, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాడిగుడ జలపాతానికి వెళ్లే పర్యాటకులకు కూడా ప్రధాన మార్గమని వారు గుర్తు చేశారు. ప్రతిరోజూ అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారని, సరైన రోడ్డు లేక అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి, అమలగుడ గ్రామం వరకు తక్షణమే రహదారి నిర్మించాలని, గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. -
క్రీడాకారులు ఫూల్
స్విమ్మింగ్ పూల్..విశాఖ స్పోర్ట్స్: ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి ఈ కాంప్లెక్స్ వెళ్లినప్పటి నుంచి క్రీడాకారుల శిక్షణ గాలికొదిలేసి, కేవలం లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సుమారు 1500 నుంచి 1800 మంది వరకు, వింటర్ సీజన్లో కూడా రోజుకు 300 మందికి పైగా శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. సమ్మర్ సీజన్లో ఒక్కొక్కరు నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. ఇంతమంది వస్తున్నా అందుకు తగ్గట్టుగా కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్ నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు. తీవ్ర ఇబ్బందులు శిక్షణార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పూల్‌లో ఈత నేర్చుకోవడం కంటే, ఒడ్డున నిరీక్షించడానికే ఎక్కువ సమయం వృథా అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మూడు గంటల పాటు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టైమ్ స్లాట్లు కేటాయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస పర్యవేక్షణ కరువైంది. 16 అడుగుల లోతు గల ప్రధాన పూల్..పక్కనే ఉన్న 3 నుంచి 6 అడుగుల లెర్నింగ్ పూల్‌లో కలిపి నిత్యం వందలాది మంది కిక్కిరిసిపోతున్నారు. గంట స్లాట్‌లో ఒక చిన్నారికి కేవలం అరనిమిషం పాటు మాత్రమే నీటిలో స్విమ్మింగ్ చేసే అవకాశం దక్కుతోందని, మిగిలిన 20 నిమిషాల నుంచి అరగంట సమయం కేవలం క్యూలో నిలబడటానికే సరిపోతోందని వాపోతున్నారు. కోచ్‌ల కొరత వందలాది మంది పిల్లలకు కేవలం ముగ్గురు కోచ్‌లు, నలుగురు లైఫ్ గార్డులు మాత్రమే అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శిక్షణ గురించి ప్రశ్నిస్తే ‘కోచ్‌లు దొరకడం లేదు’ అనే రొటీన్ సమాధానం వస్తోందని, అసలు బాధ్యతాయుతమైన కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేద్దామన్నా విపరీతమైన రద్దీ వల్ల నిరాశే ఎదురవుతోంది. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోనే ఇదే పరిస్థితి ఇదే తరహా పరిస్థితి ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోనూ కనిపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల క్రీడాకారుల భద్రత, రక్షణ, నాణ్యమైన శిక్షణ అనే అంశాలు మరుగున పడిపోయి, క్రీడా ప్రాంగణాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనేది నగ్న సత్యం. విశాఖ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ కమిషనర్ , కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రైవేట్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
నూకాంబికను దర్శించుకున్న క్రీడల ఉన్నతాధికారి
బంగార్రాజు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ తటపర్తి బంగార్రాజు దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్డుకు వచ్చి అక్కడ నుంచి కారులో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ బంగార్రాజు దంపతులను శాలువాలతో సత్కరించి అమ్మవారి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ టెన్నికోయిట్ అసోసియేషన్ చైర్మన్ కె.ఎన్.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. -
పోయిన పర్సు బాధితుడికి అందజేత
మునగపాక : మునగపాక పీఏస్‌కు చెందిన హెచ్‌సీ సాగర్ మానవత్వం చాటుకున్నారు. ఉమ్మలాడకు చెందిన ఆడారి సాయి ఆదివారం సాయంత్రం తన పర్సును పోగొట్టుకున్నాడు. ఈ పర్సులో రూ.15వేల నగదుతో పాటు పలు ఏటీఎం కార్డులు ఉన్నాయి. పర్సు కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిస్సహాయకునిగా ఉండిపోయాడు. కాగా కేసు విచారణలో భాగంగా ఆదివారం రాత్రి ఉమ్మలాడ వెళ్లిన హెచ్‌సీ సాగర్‌కు పర్సు కనిపించింది. దీంతో పర్సులోని అడ్రసు గుర్తించి బాధితుడు సాయికి ఫోన్ చేశారు. సంబంధిత పర్సును మునగపాక పోలీసు స్టేషన్లో బాధితుడు సాయికి హెచ్‌సీ సాగర్ అందజేశారు. దీంతో స్టేషన్ ఎస్ఐ ప్రసాదరావుతో పాటు ఇతర సిబ్బంది సాగర్ మానవత్వం పట్ల అభినందనలు తెలిపారు. పోయిన పర్సు దొరకడంతో హెచ్‌సీ సాగర్‌కు బాధితుడు సాయి కృతజ్ఞతలు తెలిపాడు. -
అంబులెన్సులు మూలకు.. గిరిజనుల ప్రాణాలు గాలికి..
పట్టించుకోని అధికారులు సీలేరు: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందక గిరిజనులు విలవిలలాడుతున్నారు. అత్యవసర సమయంలో రోగులను మెరుగైన చికిత్స కోసం మైదాన ప్రాంతాలకు తరలించే అంబులెన్సులు నెలల తరబడి మూలన పడి ఉన్నా, జిల్లా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతం.. సమస్యలు అధికం సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, ఇతర అత్యవసర వైద్యం అవసరమయ్యే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మెరుగైన చికిత్స కోసం ఇక్కడి నుంచి రోగులను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతపల్లి లేదా చింతూరు ఏరియా ఆసుపత్రులకు తరలించాల్సి ఉంటుంది. మూలకు చేరిన రెండు వాహనాలు సీలేరు ఆసుపత్రికి చెందిన ప్రధాన అంబులెన్సు మూడు నెలల క్రితం మరమ్మతులకు గురై ప్రస్తుతం పాడేరులోని గ్యారేజీలో ఉంది. దీని స్థానంలో అధికారులు ఒక పాత అంబులెన్సును కేటాయించారు. అయితే అది కేవలం నెల రోజులు మాత్రమే తిరిగి, మళ్లీ చెడిపోయింది. ప్రస్తుతం అది దుప్పులవాడ సబ్ సెంటర్ వద్ద నిరుపయోగంగా పడి ఉంది. గత మూడు నెలలుగా సీలేరు ఆసుపత్రికి సరైన అంబులెన్సు సౌకర్యం లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. జెన్కో అంబులెన్సే దిక్కు ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో జెన్కో సంస్థకు చెందిన సీఎస్సార్ అంబులెన్సు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకే వాహనం అటు జెన్కో ఉద్యోగులకు, ఇటు సీలేరు ఆసుపత్రి పరిధిలోని సుమారు 50 గూడాల గిరిజన ప్రజలకు సేవలు అందించాల్సి వస్తోంది. ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు రోగులకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎవరిని తరలించాలో తెలియక సిబ్బంది, రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు ఇప్పటికై నా స్పందించి సీలేరు ఆసుపత్రికి తక్షణమే ఒక నూతన అంబులెన్సును మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్యారేజీలో ఉన్న పాత వాహనాలకు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
ఆర్మీ ఉద్యోగి భౌతికకాయం ఊరేగింపు
పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళుతున్న ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు భౌతికకాయం అనకాపల్లి టౌన్: వెంకుపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు(37) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ శుక్రవారం డెహ్రాడూన్‌లో మృతి చెందారు. ఈయన మృతదేహం ఆదివారం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా, పట్టణం గుండా గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. తన విధుల్లో భాగంగా ట్రక్ నడుపుతుండగా ప్రమాదానికి గురై మరణించినట్టు బంధువులు తెలిపారు. చంద్రశేఖర్‌కు భార్య గ్రేషి, ఐదేళ్ల కుమారుడు కనిష్క్, రెండేళ్ల కుమార్తె కారుణ్య ఉన్నారు. ఈ అనుకోని సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
పంట పొలాలు ముంపునకు గురైతే బాధ్యులెవరు..?
మునగపాక: భూసేకరణ చేపట్టకుండా మునగపాక దరి సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి సాగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ మునగపాక, తోటాడ రెవెన్యూ పరిధిలో వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మూసేసి రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదన్నారు. ముందుగా రైతుల నుంచి భూసేకరణ చేపట్టి కాలువల నిర్మాణాలు చేపడితే బాగుండేదన్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే విపత్తు సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రహదారి విస్తరణను ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతులు కూడా సమ్మతిస్తున్నారని అయితే రైతులకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదన్నారు. బాధితులకు ఇచ్చే పరిహారం నేరుగా అకౌంట్లో వేసేలా చూడాలన్నారు. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు లోచల సుజాత,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు, పాటిపల్లి ఎంపీటీసీ ఇల్లా శిరీషా నాగేశ్వరరావు పాల్గొన్నారు. భూసేకరణ చేపట్టకుండా సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు సరికాదు బాధితులకు పరిహారం నేరుగా అందించాలి టీడీఆర్‌లు వద్దంటున్నా ప్రభుత్వంలో కానరాని స్పందన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ -
లేబర్ కోడ్ జీవో ప్రతుల దహనం
చింతపల్లి: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జీవో ప్రతులను పారిశుధ్య కార్మికులతో కలిసి ఆస్పత్రి ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం కార్మికులపై కక్ష కట్టి నాలుగు కోడ్లను అమలు చేసేందుకు చూస్తుందన్నారు. ఆ కోడ్లు అమలు జరిగితే బ్రిటీష్ కాలంలో పోరాటం చేసి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలు రద్దవుతాయన్నారు. చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది రోడ్డెక్కి ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటాలకు కేంద్రం సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. కోడ్లు అమలైతే ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పొడిగిస్తారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పాలన చూస్తుంటే బ్రిటీష్ కాలంలో ఉన్నామన్న పరిస్థితి నెలకొందన్నారు. దీనిలో ఆస్పత్రి పారిశుధ్య కార్మికుల సంఘ అధ్యక్షుడు రామారావు, లక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల జోరు
పాడేరు: మన్యంలో వర్షాల పరంపర కొనసాగుతోంది. ఉదయం పూట మంచు కురుస్తున్నా, మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. అయితే సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం పాడేరుతో పాటు ఏజెన్సీలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల జనజీవనానికి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ, రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలకు వ్యవసాయ భూములన్నీ తడిసి ముద్దవుతుండటంతో, వేసవి దుక్కులకు ఎంతో మేలు జరుగుతుందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జి.మాడుగులలో.. జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు మరియు భీకర శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వర్షం ధాటికి మండలంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా లంబసింగి–జి.మాడుగుల, పాడేరు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో, మట్టి రోడ్డు కాస్తా బురదమయంగా మారింది. దీనివల్ల వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులకు కొంత సమయం ఆటంకం ఏర్పడింది.ఉరుములు, మెరుపుల ప్రభావంతో జి.మాడుగుల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.భీకరమైన శబ్దాలతో పిడుగులు పడటంతో ఏ క్షణాన ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని గ్రామస్తులు వణికిపోయారు. అయితే, ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం -
పడకేసిన వైద్యం
కేజీహెచ్ మందుల కౌంటర్ల వద్ద రోగుల పడిగాపులుఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలం ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. యూపీహెచ్సీ, పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కాని రాని స్పెషాలిస్ట్ వైద్యులు 66 యూపీహెచ్‌సీలు, 9 పీహెచ్‌సిల్లో అరకొర సౌకర్యాలు -
మోదమ్మకు నీరాజనం
ప్రత్యేక పూజలు నిర్వహి స్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు.శివరత్నం దంపతులు,ఆలయ కమిటీ ప్రతినిధులువిద్యుత్ వెలుగుల్లో మోదకొండమ్మ ఆలయంసాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాల గిరిజనుల ఆరాధ్యదైవం, పాడేరు గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల తొలిరోజే పాడేరు పురవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ ఆదివారం వేకువజామున 5.30 గంటల నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ శివరత్నం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం వారికి వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల హోరులో పట్టువస్త్రాలతో ఎమ్మెల్యే దంపతులు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు దంపతులు ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, అమ్మవారికి భక్తిశ్రద్ధలతో వస్త్రాలను అందజేశారు. లోక కల్యాణార్థం ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ● పుట్టినరోజు వేడుకల సందర్భంగా మోదకొండమ్మ తల్లి విగ్రహాన్ని నూతన వర్ణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల తేదీలను కూటమి ప్రభుత్వం మే 17, 18, 19 తేదీలకు మార్చినప్పటికీ, భక్తులు మాత్రం తమ మనోభావాలకు అనుగుణంగా పాత తేదీలనే పరిగణనలోకి తీసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైదాన ప్రాంతాల నుంచే కాకుండా స్థానికంగా ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఘటాలు సమర్పించారు. ● ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉచిత ప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. విశ్వబ్రాహ్మణ సంఘం నేత కొమ్మోజి వెంకటరమణ, పలువురు భక్తుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కూడా సురేష్, ఉర్వశిరాణి, సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు సల్లా రామకృష్ణ, బోనంగి వెంకటరమణ పాల్గొన్నారు. 12న ప్రధాన వేడుక: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు శ్రీ మోదకొండమ్మ తల్లి అసలు పుట్టినరోజు వేడుకను ఈనెల 12వ తేదీన (మంగళవారం) అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.మంగళవారం ఉదయం 101 డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఘటాలను పాడేరు పురవీధుల్లో ఊరేగిస్తామని తెలిపారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు మరియు ఘటాలతో శోభాయాత్ర ఉంటుందన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. : వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, భక్తులందరూ ఈ వేడుకలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ విశేశ్వరరాజు కోరారు. పాడేరులో ఆధ్యాత్మిక కాంతులు మన్యం ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారు ఆదివారం నాడు కొత్త రంగుల అలంకరణలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పుట్టినరోజు వేడుకల (జన్మదినోత్సవం) సందర్భంగా ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగురంగుల అలంకరణలు, మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయానికి విద్యుత్ వెలుగుల శోభ నెలకొంది. ఘనంగా పుట్టినరోజు వేడుకలు ప్రారంభం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దంపతులు తొలిపూజలు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ తరలివచ్చిన భక్తజనం -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు పాల్గొన్నారు. ● శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. -
అధికారుల ‘చెత్త’ ఆలోచన
కొయ్యూరు: అధికారుల అనాలోచిత నిర్ణయాలకు బూదరాళ్ల పంచాయతీకి కేటాయించిన ట్రాక్టరే నిదర్శనం. సాధారణంగా చెత్త తరలింపు కోసం రహదారులు బాగున్న ప్రాంతాలకు ట్రాక్టర్లు ఇస్తారు. కానీ, అందుకు భిన్నంగా కొండ ప్రాంతంలో ఉండి, కనీసం వాహనం వెళ్లడానికి వీలులేని బూదరాళ్ల పంచాయతీకి ట్రాక్టర్‌ను కేటాయించారు. ఫలితంగా ఆ వాహనం గత మూడేళ్లుగా మూలన పడి తుప్పు పడుతోంది. వింత పోకడలు.. అదనపు భారం ఈ కేటాయింపులో మరో విచిత్రం ఏమిటంటే.. ట్రాక్టర్ ఇంజిన్‌ను 2023లో ఇవ్వగా, దానికి తగిలించే ట్రాలీని (తొట్టెను) 2025 డిసెంబర్లో ఇచ్చారు.బూదరాళ్ల పంచాయతీకి ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి రూ. 1.30 లక్షలు కూడా దాటదు. ట్రాక్టర్‌కు డ్రైవర్ జీతం నెలకు రూ. 15 వేల చొప్పున ఏడాదికి రూ. 1.80 లక్షలు అవుతుంది. దీనికి డీజిల్, మరమ్మతుల ఖర్చులు కలిపితే ఏడాదికి రూ. 2 లక్షలు దాటుతుంది. ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీకి ఇది మోయలేని భారం. అవసరం ఉన్న చోట ఇవ్వకపోవడమే శాపం కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలు ఉండగా, రాజేంద్రపాలెం, బూదరాళ్లను గ్రేడ్–1 పంచాయతీలుగా గుర్తించారు. బూదరాళ్లలోని ఐదు గ్రామాల్లో ట్రాక్టర్ తిరగడానికి అనువైన వీధులు పది కూడా లేవు. అదే ఈ ట్రాక్టర్‌ను రాజేంద్రపాలెం వంటి మైదాన ప్రాంత పంచాయతీకి ఇచ్చి ఉంటే ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం రాజేంద్రపాలెంలో రిక్షాల ద్వారా చెత్తను తరలిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి లీలాకృష్ణ స్పందిస్తూ.. గ్రామాల్లో ట్రాక్టర్ వెళ్లడానికి దారి లేకపోవడంతో ప్రస్తుతం రిక్షాల ద్వారానే చెత్తను తరలిస్తున్నాం. ట్రాక్టర్ వినియోగంలో లేని విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం అని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, ఈ ట్రాక్టర్‌ను కొయ్యూరు, రాజేంద్రపాలెం లేదా చీడిపాలెం వంటి అవసరమున్న పంచాయతీలకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. కొండపై గ్రామానికి ట్రాక్టర్ కేటాయింపు! -
అరకు పైనరీ అందాలు అద్భుతం
● అరుణాచల్ప్రదేశ్అటవీ శాఖ బృందం ప్రశంస డుంబ్రిగుడ: స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న అరకు పైనరీ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని అరుణాచల్‌ప్రదేశ్ అటవీ శాఖ బృందం చైర్మన్ నాలోంగ్ మిజే, నాంసై ఎమ్మెల్యే జెడ్ నామ్సూన్ ప్రశంసించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ పైనరీని సందర్శించి, బస చేశారు. గిరిజన సంప్రదాయ, సంస్కృతి పరిరక్షణపై హర్షం వ్యక్తం చేశారు. వీఎస్ఎస్ సభ్యులు, పైనరీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలు, అరకు కాఫీని ఆస్వాదించారు. సంప్రదాయ థింసా నృత్యంతో సందడి చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పీసీడీఎఫ్ పి.సుబ్రహ్మణ్యం, ఏపీఎఫ్డీసీ శ్రీకంఠనాథ్‌రెడ్డి, పాడేరు డీఎఫ్‌వో ఉమా మహేశ్వర్, పైనరీ మేనేజర్ చంద్రశేఖర్, వీఎస్ఎస్ చైర్మన్ భారతి పాల్గొన్నారు. -
సకాలంలో గ్యాస్ అందక ఇబ్బందులు
● ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పడిగాపులు ● మాకవరపాలెంలో ఆందోళనకు దిగిన వినియోగదారులు మాకవరపాలెం: సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులకు ప్రతి శనివారం, సోమవారం గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటారు. అయితే గత నెల రోజులుగా సకాలంలో సిలిండర్లు అందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని సుమారు 50 మంది వినియోగదారులు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలైనా గ్యాస్ వ్యాన్ రాకపోవడంతో పడిగాపులు కాశారు. తీరా 8 గంటలకు వ్యాన్ వచ్చినా 20 సిలిండర్లు మాత్రమే ఉండడంతో వినియోగదారులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న 50 మందికి సిలిండర్లు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆందోళనకు దిగారు. ఇదే విషయమై సివిల్ సప్లయి డీటీ అశోక్‌కు వినియోగదారులు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ సమయంలో గ్యాస్ పంపిణీ చేస్తారో ముందుగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామన్నారు. దీనిపై స్పందించిన డీటీ మాట్లాడుతూ సిలిండర్ల కోసం ఉన్న 50 మందికీ గ్యాస్ పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి ఏ సమయంలో గ్యాస్ అందజేస్తామనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయడంతో పాటు నిర్ణీత సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
నీలిబందలో వైద్య శిబిరం
రోలుగుంట: మండలం అర్ల గిరిజన పంచాయతీ శివారు నీలబంద గ్రామంలో బుచ్చింపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీలిబందలో జ్వరాలు శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వైద్యుడు ఎల్.శివప్రసాద్ సిబ్బందితో కలసి గ్రామంలో జ్వరపీడితుల ఇళ్లను సందర్శించారు. రోగులను కలసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తపు నమూనాలు తీశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వేడి ఆహారం, మరగకాచిన నీటిని తాగాలన్నారు. -
ఓ(ఆ)న్ డ్యూటీ!
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని ప్రధాన పోర్టులతో పోటీపడుతూ సముద్ర వాణిజ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం పోర్టు.. ప్రస్తుతం కొందరు అధికారుల ‘సొంత’ ప్రయోజనాలకు వేదికగా మారుతోంది. పోర్టు ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన యంత్రాంగం, దిశానిర్దేశం లేక చతికిలపడుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది. ఏటా ప్రతిష్టాత్మక ఐఐఎంల నుంచి మేధావులను నియమించుకుంటున్నా, వారి మేధస్సు పోర్టు అభ్యున్నతికి కాకుండా.. ట్రాఫిక్ విభాగాధికారుల వ్యక్తిగత పనులకు పరిమితమవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. విధి నిర్వహణలో ఉండాల్సిన సిబ్బందిని అధికారుల సొంత పనులకు వినియోగించుకుంటూ ‘ఆన్ డ్యూటీ’ని కాస్తా ‘ఓన్ డ్యూటీ’గా మార్చేయడం పోర్టు భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ప్రచారమెక్కడ? ప్రగతి ఏది? ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదు.. ఆ వసతులను ప్రపంచానికి చాటిచెప్పే బలమైన ప్రచార యంత్రాంగం ఉండాలి. విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ సహా తొమ్మిది సంస్థలు కార్గో నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. నిజానికి ఈ సంస్థల నుంచి కార్గో ఉత్పత్తి పెరగాలంటే పోర్టు యాజమాన్యం చొరవ చూపాలి. ఎప్పటికప్పుడు వాణిజ్య వర్గాలతో సమావేశమై, ‘ట్రేడ్ మీట్స్’ నిర్వహిస్తూ ఎగుమతి, దిగుమతిదారులకు అవసరమైన సౌకర్యాలపై చర్చించాలి. కానీ, ఇక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పోర్టు ఆదాయంలో 90 శాతం కేవలం భూములు, భవనాల లీజుల ద్వారానే వస్తోంది తప్ప, సరకు రవాణా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి శూన్యం. కార్గో నిర్వహణ చేసే ప్రైవేటు సంస్థలు వృద్ధి సాధిస్తున్నా, దానివల్ల పోర్టుకు రావాల్సిన రాబడి పెరగకపోవడం అధికారుల ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనం. ఐఐఎం మేధస్సు.. ఫైళ్లకే పరిమితం పోర్టు కార్యకలాపాలను విస్తరించాలని, అంతర్జాతీయ స్థాయి విక్రయ వ్యూహాలను రచించాలని ప్రతి రెండేళ్లకోసారి ఐఐఎం నిపుణులను నియమించుకుంటున్నారు. వీరిని మార్కెటింగ్ ప్రమోషన్ కోసం వినియోగించాల్సి ఉండగా, ట్రాఫిక్ విభాగాధికారులు వీరిని తమ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే ‘అసిస్టెంట్లు’గా మార్చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయ ఫైళ్లను సిద్ధం చేయడం, అధికారుల ఇంటి పనులు, వ్యక్తిగత పనులు చక్కబెట్టడానికే వీరి సమయం సరిపోతోందని సమాచారం. పోర్టు మార్కెటింగ్‌కు ఊపిరి పోయాల్సిన నిపుణులను ఇలా వినియోగించుకోవడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలన్నీ పక్కదారి పడుతున్నాయి. సామర్థ్యం ఉన్నా.. సాఫల్యమెక్కడ? కాగితాల్లో పోర్టు సామర్థ్యం అద్భుతంగా పెరుగుతోంది. 2008–09లో 80 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న సామర్థ్యం ఇప్పుడు 120 మిలియన్ టన్నులకు చేరింది. కానీ, ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా కార్గో నిర్వహణ జరుగుతుందా అంటే సమాధానం ‘లేదు’ అనే వస్తోంది. ఉదాహరణకు కంటైనర్ టెర్మినల్ సామర్థ్యం 1.3 మిలియన్ టీయూవీలు కాగా, ప్రస్తుతం అందులో సగం కూడా వాడకం జరగడం లేదు. ఇతర ప్రాంతాలకు మళ్లుతున్న కార్గోను ఆకర్షించేలా దూకుడుగా వ్యవహరించాల్సిన పోర్టు ట్రాఫిక్ విభాగం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సరకు రవాణా వృద్ధి కూడా అక్కడ ఉన్న ప్రైవేటు సంస్థల సొంత ప్రయత్నాలే తప్ప, పోర్టు అధికారుల చొరవ ఏమాత్రం లేదన్నది బహిరంగ రహస్యం. నిర్లక్ష్యం నీడలో ‘సాగర’ వాణిజ్యం పోర్టుకు వచ్చే నౌకలు బెర్తుల కోసం రోజుల తరబడి బయటే వేచి చూడాల్సిన దైన్యం నెలకొంది. ట్రాఫిక్ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో, అక్కడ అధికారులదే రాజ్యంగా మారింది. సంస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ట్రేడ్ మీట్లు నిర్వహించి పోర్టు సౌకర్యాలను వివరించాల్సిన బాధ్యతను గాలికొదిలేశారు. ఎక్కడో ఒకచోట ఏడాదికో, రెండేళ్లకోసారి తూతూమంత్రంగా సమావేశాలు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. మార్కెటింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగమే సర్వస్వంగా వ్యవహరిస్తోంది. అధికారుల ఈ ‘సొంత’ పోకడల వల్ల విశాఖ పోర్టు అపారమైన నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మార్కెటింగ్ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పోర్టు ప్రగతికి బాటలు వేయకపోతే.. విశాఖ పోర్టు తన పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పోర్టు వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు అడ్డాకుల సేకరణ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడం లేదు. ప్రభుత్వం, జీసీసీ అడ్డాకులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో దళారీ వ్యాపారులదే రాజ్యమవుతోంది. ప్లాస్టిక్ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన
సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలల్లో అడ్డాకులకు ఆదరణ బాగుంది. దీంతో అడ్డాకుల వ్యాపారం మన్యం సంతల్లో భారీగా జరుగుతోంది. అయితే గిరిజనులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. అడవుల్లో ప్రాణాలకు తెగించి అడ్డాకులను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఆరబెట్టి, ఎండిన తరువాత కావిడలుగా కట్టి సంతలకు మోసుకెళ్లి అమ్మకాలు జరుపుతుంటారు. అడవుల్లో జంతువుల బెడదను కూడా తప్పించుకుని కష్టపడి అడ్డాకులను సేకరిస్తే ధరల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుంది. వారపు సంతల్లో వ్యాపారుల దోపిడీ ఏజెన్సీలోని వారపు సంతల్లో రెండు వారాలుగా అడ్డాకుల వ్యాపారం జరుగుతుంది. వంట్లమామిడి, హుకుంపేట, అరకు, సుంకరమెట్ట, డముకు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, అన్నవరం, లోతుగెడ్డ, చింతపల్లి, దారకొండ వారపు సంతల్లో ప్రతి వారం రూ.లక్షల్లో అడ్డాకుల వ్యాపారం సాగుతుంది. గిరిజనులంతా మారుమూల గ్రామాల నుంచి అడ్డాకులను కాలినడకన సంతలకు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. కావిడ అడ్డాకుల(రెండు దిండ్లు)కు మైదాన ప్రాంతాలలో రూ.6 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంది. అయితే ఎస్.కోట, గాజువాక, కొత్తకోట, నర్సీపట్నం వ్యాపారులు కేవలం రూ.3 వేల ధరకు మించి కొనుగోలు చేయకపోవడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడంతో అడ్డాకులను అమ్మే గిరిజన రైతులంతా ఉసూరుమంటున్నారు. తక్కువ ధరకు భారీగానే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు లారీలు, వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు తరలించి మంచి లాభాలు పొందుతున్నారు. కొనుగోలుకు జీసీసీ దూరం గిరిజనుల అడవుల్లో సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేయాల్సిన జీసీసీ.. 15 ఏళ్ల నుంచి దూరంగానే ఉంది. అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో సంతల్లో దళారీ వ్యాపారులదే రాజ్యంగా మారింది. ప్లాస్టిక్ నిషేధంతో అడ్డాకులకు మైదాన ప్రాంతాల్లో గిరాకీ పెరిగింది. హోటళ్లలో అడ్డాకులను అధికంగా వినియోగిస్తున్నారు. నగర ప్రాంతాల్లో హోటళ్ల యాజమానులు అడ్డాకులను వ్యాపారుల నుంచి అధిక ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఆ మేరకు గిరిజనులకు ఆ ధర దక్కడం లేదు. వంట్లమామిడి ఘాట్ రోడ్డులో అడ్డాకులను విక్రయిస్తున్న గిరిజనులు ఏజెన్సీ సంతల్లో దళారుల దోపిడీ మైదాన ప్రాంతాల్లో అడ్డాకులకు డిమాండ్ మన్యంలో గిట్టుబాటు ధర కరువు కష్టానికి తగ్గ ఫలితమివ్వని అడ్డాకుల సేకరణ ఉసూరుమంటున్న గిరిజనులు జీసీసీ కొనుగోలు చేయాలి అడ్డాకులకు సంతల్లో దళారీల బెడద ఉంది. పూర్వం వలే జీసీసీ అడ్డాకులను కొనుగోలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి. మైదాన ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న అడ్డాకులను తక్కువ ధరకు కొని మైదాన ప్రాంత వ్యాపారులు అధిక లాభాలు పొందుతున్నారు. గిరిజనులను మోసం చేయడం దారుణం. – పాంగి లక్కు, గిరిజన రైతు సంఘం నేత, గుర్రగరువు, పాడేరు మండలం గిట్టుబాటు ధర కల్పించాలి ఏజెన్సీలోని సంతల్లో అడ్డాకులకు గిట్టుబాటు ధర కరువైంది. కావిడ అడ్డాకుల దిండును రూ.3 వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మోసం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. – గొల్లోరి హిరమ్మ, సంతవలస గ్రామం, డుంబ్రిగుడ మండలం -
డయాలసిస్‌కు వెళ్తూమృత్యు ఒడికి
గాజువాక: కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఒక వ్యక్తి డయాలసిస్ కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. కూర్మన్నపాలేనికి చెందిన ఇందుకూరి సతీష్ (45) హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. డయాలసిస్ చేయించుకోవడం కోసం చినగంట్యాడ జంక్షన్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం కోసం ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. వందడుగుల రోడ్ సిగ్నల్ జంక్షన్‌కు వచ్చేసరికి జాతీయ రహదారిపై కుక్కలు అకస్మాత్తుగా అడ్డంగా వచ్చాయి. దీంతో సతీష్ తన ద్విచక్ర వాహనాన్ని స్లో చేశాడు. దీంతో వెనకనే వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు అతడిని బలంగా ఢీకొట్టి ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుని బావమరిది దండు గోపాల కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు సీఐ ఎస్కే హుస్సేన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మలేరియాతో గిరిజన విద్యార్థి మృతి
చింతపల్లి: మలేరియాతో ఓ గిరిజన విద్యార్థి మృతి చెందిన సంఘటన అంజలిశనివారం పంచాయతీ గింగవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడు తండ్రి కిముడు సింహాచలం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగవరం గ్రామానికి చెందిన కిముడు దయాకర్(15) అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఇటీవల పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం విద్యార్థికి జ్వరం రావడంతో శుక్రవారం లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయగా.. మలేరియా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి దినేష్ విద్యార్థి తండ్రి సింహాచలానికి తెలియజేశారు. ఆస్పత్రిలో మలేరియాకు సంబంధించిన మందులు లేవని, బయట మెడికల్ షాపులో కొనుగోలు చేసుకోవాలని చెప్పి ఇంటికి పంపేసినట్టు సింహాచలం తెలిపారు. ఇంటికి వెళ్లిన తరువాత బయట కొనుగోలు చేసిన మాత్రను బాలుడికి వేశారు. ఆ మాత్ర వేసిన కొంత సేపటికే బాలుడు అవస్మారక స్థితికి చేరుకోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడ్ని పరీక్షించిన వైద్యాధికారి లావణ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. లంబసింగి వైద్యులు పరీక్షలు చేసి, పాజిటివ్ వచ్చిన వెంటనే చింతపల్లి ఆస్పత్రికి తరలించి ఉంటే తమ బిడ్డ బతికే వాడని, వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా తమ బిడ్డ మరణించాడని బాలుడి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.ఇటీవల పది ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత -
13వ తేదీలోగా గిరిజన హోంస్టే క్లస్టర్ల గుర్తింపు
● జేసీ తిరుమణి శ్రీపూజ ● అధికారులతో సమీక్ష సమావేశం సాక్షి, పాడేరు: పీఎం దాజుగౌ పథకంలో భాగంగా జిల్లాలో హోంస్టే క్లస్టర్లను ఈ నెల 13వ తేదీలోగా గుర్తించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ స్థానిక మహిళలు, యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. చింతపల్లి మండలం లంబసింగి, అరకులోయ, డుంబ్రిగుడ కేంద్రాలుగా మూడు హోంస్టే క్లస్టర్లను గుర్తించి, సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలంతా గిరిజన గ్రామాలను సందర్శించి, పర్యాటకానికి అనువైన క్లస్టర్లను గుర్తించాలన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటకుల ఆకర్షణ వంటి ఆంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అరకు, డుంబ్రిగుడ, అనంతగిరి, చింతపల్లి మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా హోంస్టేలను చేపడుతున్నామన్నారు. 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. కొత్త గదుల నిర్మాణాలకు రూ.5 లక్షలు, ఇళ్లు ఉండి మరమ్మతులకు రూ.3 లక్షలు, పర్యాటకుల వసతుల అభివృద్ధి పనులకు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా టూరిజం అధికారి దాసు, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ తిరుమణి శ్రీపూజ తెలిపారు. గ్యాస్ బుకింగ్ ప్రక్రియ అనంతరం ఓటీపీ వచ్చిన వారంతా గ్యాస్ పొందాలన్నారు. గ్యాస్ సిలెండర్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. -
రాయల్ బెంగాల్ టైగర్‘మంజునాథ్’ దత్తత
కై లాసగిరిపై‘త్రిశూలం’ అందాలు ఆరిలోవ: కై లాసగిరిపై వీఎంఆర్డీఏ ఏర్పాటు చేసిన డమరుకంతో కూడిన త్రిశూలాన్ని శనివారం మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను కూడా వారు ప్రారంభించారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, లోకం మాధవి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్ పాల్గొన్నారు. ఖర్చుపై పొంతన లేని ప్రకటనలు.. త్రిశూలం ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. త్రిశూలం నిర్మాణ వ్యయంపై ఆయన భిన్నమైన లెక్కలు చెప్పడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. గతేడాది ఆగస్టులో శంకుస్థాపన చేసిన సమయంలో దీని వ్యయం రూ.1.55 కోట్లుగా శిలాఫలకంపై పేర్కొన్నారు. అయితే, నిర్మాణం పూర్తయిన అనంతరం.. ప్రారంభోత్సవ శిలాఫలకంపై రూ.3కోట్లుగా ముద్రించారు. కానీ, ఎంపీ శ్రీభరత్ ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించడంతో అధికారులు అవాక్కయ్యారు. వాస్తవ లెక్కల కంటే రెట్టింపు ఖర్చు చేసినట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ‘మంజునాథ్’ అనే రాయల్ బెంగాల్ టైగర్‌ను ఏడాది కాలానికి కమల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ దత్తత తీసుకుంది. ఆ సంస్థ యజమాని దీపక్ కర్నాని బృందం శనివారం జూ క్యూరేటర్ జి.మంగమ్మను కలిసి, పులి వార్షిక నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.54,000ల చెక్కును అందజేశారు. అనంతరం పులి ఎన్‌క్లోజర్ వద్ద క్యూరేటర్ ఇతర అధికారులతో కలిసి దాతలకు దత్తత పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. దత్తత తీసుకున్న సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బృందం సభ్యులు బి.భానువెంకట ప్రతాప్, ఉదయ కిరణ్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను తదితరులు పాల్గొన్నారు. -
జోన్ సరే.. కొలువుల బోర్డు ఏది?
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందన్న సంతోషం నిరుద్యోగ యువతలో కనిపించడం లేదు. 2019లో జోన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడినప్పటి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. దీనిపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తున్నా.. టీడీపీ, జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో కేంద్రం ఇక్కడ బోర్డు ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, అందులో ఆర్ఆర్బీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దేశవ్యాప్తంగా 19 జోన్లలో 21 ఆర్ఆర్బీలు ఉండగా, విశాఖ విషయంలో మాత్రం సాంకేతిక కారణాల సాకుతో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి లేని ‘పేపర్ జోన్’? సాధారణంగా భారతీయ రైల్వేలో ఏ జోన్ ఏర్పడినా, ఆ పరిధిలో ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ఆర్బీ ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. సికింద్రాబాద్, భువనేశ్వర్లలో ఇప్పటికే బోర్డులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇక్కడి నియామకాలు చేపట్టవచ్చనేది అధికారుల వాదనగా కనిపిస్తోంది. అయితే, ఒక భారీ జోన్‌ను నిర్వహించేటప్పుడు దానికి స్వయంప్రతిపత్తి కలిగిన నియామక మండలి లేకపోతే, అది కేవలం ఒక ‘పేపర్ జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఆర్బీ ఇవ్వరెందుకు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ప్రధాన కార్యనిర్వాహక జోన్లు ఉండగా, ఆర్ఆర్బీలు మాత్రం 21 ఉన్నాయి. కొన్ని పెద్ద జోన్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ బోర్డులు ఉండగా, మరికొన్ని బోర్డులు రెండు, మూడు జోన్ల అవసరాలను తీరుస్తున్నాయి. గతంలో వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ బోర్డు పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్ కేంద్రంగా విశాఖ అవతరించిన తర్వాత కూడా పాత బోర్డులపైనే ఆధారపడటం ఈ ప్రాంత అభ్యర్థుల ఉపాధి హక్కులను కాలరాయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర యువత ఉపాధికి ముప్పు ఆర్ఆర్బీ విశాఖకు కేటాయించకపోతే నియామక ప్రక్రియ మొత్తం ఒడిశా లేదా తెలంగాణలోని బోర్డుల నియంత్రణలోకి వెళ్తుంది. దీని వల్ల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు స్థానిక అవసరాల కంటే ఆయా బోర్డుల పరిధిలోని ఇతర ప్రాంతాలకే ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులు తమ సొంత ప్రాంతంలోని రైల్వే లైన్లలో పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడనుంది. పరీక్షలు, దరఖాస్తుల పరిశీలన, వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు వందల కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లడం భారంగా మారుతుంది. రైల్వే గ్రూప్–డి వంటి పోస్టులకు స్థానిక భాషా పరిజ్ఞానం కీలకం. ఇతర రాష్ట్రాల బోర్డులు నియామకాలు చేపట్టినప్పుడు, తెలుగు అభ్యర్థులకు సమాచారం చేరవేయడంలోనూ, ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల తెలుగు విద్యార్థులు సాంకేతికపరంగా వెనుకబడే ప్రమాదం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. కేవలం భవనాలు, ప్లాట్‌ఫాంలు పెంచితే అది అభివృద్ధి అనిపించుకోదు. స్థానిక యువతకు ఉపాధి దొరికినప్పుడే రైల్వే జోన్ కల సాకారమవుతుంది. తక్షణమే కేంద్రం స్పందించి విశాఖకు ప్రత్యేక ఆర్ఆర్బీ మంజూరు చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. జోన్ ఇచ్చి.. బోర్డును విస్మరిస్తే ఎలా? నేను గత మూడేళ్లుగా రైల్వే గ్రూప్–డీ, ఇతర పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్నాను. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కలలు నిజం కావాలంటే విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం అత్యవసరం. స్థానికంగా బోర్డు అందుబాటులో లేకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లలో దొర్లే తప్పులను గానీ, ఫలితాల జాప్యాన్ని గానీ ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేకుండా పోతుంది. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, ఫిర్యాదు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలకు వెళ్లడం మాలాంటి వారికి ఆర్థికంగా, మానసికంగా పెనుభారం. విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటించి, ఆర్ఆర్బీని మాత్రం కేటాయించకపోవడం అంటే.. నియామకాల కోసం మమ్మల్ని మళ్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడేలా చేయడమే. – కె.అప్పారావు, రైల్వే ఉద్యోగ అభ్యర్థి స్థానికతకు ప్రాధాన్యం పెరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర యువతలో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కాలంటే విశాఖలోనే సొంత బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ భువనేశ్వర్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగితే, వారు పరీక్ష కేంద్రాలను కూడా అక్కడే కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల స్థానిక అభ్యర్థుల కంటే ఇతర ప్రాంతాల వారికే ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఒక స్వతంత్ర జోన్‌కు స్వయంప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు లేకపోతే, అది అధికారాలు లేని కేవలం ఒక నామమాత్రపు కార్యాలయంగానే మిగిలిపోతుంది. – ఎం.మన్మధరావు, ఉద్యోగార్థి -
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు
మండుటెండలో మంచు విందు● పోలీసుల కృషితోనే భార్య హంతకుడికి శిక్ష ● ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మేఘాల కొండలుగా పేరొందిన వంజంగి హిల్స్ మండు వేసవిలోను ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తున్నాయి. శనివారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు వంజంగి కొండల నిండా మేఘాలు, పొగమంచు ఆకట్టుకున్నాయి. – సాక్షి, పాడేరు నేటి నుంచి మోదమ్మ జాతర సాక్షి, పాడేరు: మినుములూరు గ్రామంలో ఆదివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు మోద కొండమ్మతల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మినుములూరు పాత ఊరు నుంచి మోదకొండమ్మతల్లి పాదాలు, ఘటాలను ఉదయం 7 గంటలకు ఊరేగించిన అనంతరం మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన శతకంపట్టు వద్ద కొలువుదీర్చనున్నారు. అనంతరం మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మోదమ్మకు ప్రత్యేక పూజలతో పాటు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల భక్తులు సహకరించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు, ఇతర కమిటీ ప్రతినిధులు కోరారు.చింతపల్లి: ఏజెన్సీలో మహిళల రక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నవరం పంచాయతీ పరిధి పూతికమెట్ట గ్రామంలో భార్యను హత్యచేసిన భర్త రామారావుకు యావజ్జీవ కారాగార శిక్ష పడడం పోలీసుల కృషి ఫలితమేనన్నారు. ఈ హత్యానేరంపై సీఐ లోతుగా విచారణ జరిపి సాక్షుల వివరాలతో న్యాయస్థానం ముందు హాజరుపరిచారన్నారు. ఈ తీర్పు మహిళలను వేధించే వ్యక్తులకు కనువిప్పు లాంటిందన్నారు. మహిళలను వేధించినా, హత్య చేసినా, శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. ప్రతి పోలీసు స్టేషన్లోను శక్తి బృందాలను పోలీసు శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. మహిళలను ఆకతాయిలతో పాటు ఏ ఒక్కరూ వేధించినా, హింసించినా శక్తి బృందాల అప్రమత్తమై రక్షణ కల్పించడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షిస్తాయన్నారు. గిరిజన ప్రాంతంలో గంజాయిని పూర్తి స్థాయిలో కట్టడి చేశామన్నారు. గంజాయితో పట్టుబడిన నిందితులకు న్యాయస్థానం కఠినంగా శిక్షలు విధిస్తుందన్నారు. ఈ సమావేశంలో చింతపల్లి, అన్నవరం ఎస్ఐలు వెంకటరమణ, సాయికుమార్ పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం
కె.కోటపాడు: మండలంలోని పైడంపేటలో శనివారం ఉదయం జామి ఈశ్వరరావు, జామి హరికృష్ణ ఇళ్లలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో గల డోర్కర్టెన్స్కు, ఇంటి దూలాలకు మంటలు వ్యాపించాయి. అదుపు చేసేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లలో గల దుస్తులు, నిత్యావసర సరుకులు, బంగారం, నగదు, ధాన్యం కాలిబూడిదయ్యాయని బాధితులు హరికృష్ణ, ఈశ్వరరావు తెలిపారు. స్థానికుల సమచారంమేరకు చోడవరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. డి.గొటివాడలో...మాడుగుల: మండలంలో డి.గొటివాడలో వంట గ్యాస్ లీక్ అవడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు సమాచారం మేరకు వివరాలు... శుక్రవారం రాత్రి గ్యాస్ స్విచ్ ఆఫ్చేయకుండా గ్రామానికి చెందిన చుక్కల జగ్గారావు నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున టీ పెట్టడానికి గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇంటిలో సామగ్రి దగ్ధమైంది. జగ్గారావుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో జస్వంత్ ప్రతిభ
నాతవరం: రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అనిమిరెడ్డి జస్వత్ మండలానికే వన్నె తెచ్చాడని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న జస్వంత్ అనకాపల్లి జిల్లా జట్టు తరపున బేస్‌బాల్ పోటీలలో పాల్గొన్నారన్నారు. ఈ నెల 5,6,7, తేదీల్లో కర్నూల్ జిల్లా వెనుగొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జస్వంత్ ప్రతిభ చూపించడంతో సెమీఫైనల్‌కు చేరుకోవడం జరిగిందన్నారు. మారుమూల నాతవరం మండలం నుంచి జిల్లా తరఫున క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఈ జట్టు తరుఫున పోటీల్లో నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని ఎస్ఐ తెలిపారు. -
హైవేపై డివైడర్‌ను ఢీకొన్న కారు
● ఎనిమిది మందికి గాయాలు ● నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం వెళ్తుండగా ప్రమాదం యలమంచిలి రూరల్: డ్రైవర్ నిద్రమత్తు,నిర్లక్ష్యం కారణంగా శనివారం నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో రహదారి పక్కన నడిచి వెళ్తున్న మహిళ,కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తల్లి తీవ్రంగా గాయపడగా మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలు..విశాఖపట్నం అక్కయ్యపాలెంలో శుక్రవారం వివాహం జరిగిన నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి కారులో బయలుదేరారు.యలమంచిలి దాటిన తర్వాత మర్రిబంద వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొంది. కారు అతివేగంగా ప్రయాణిస్తుండడంతో ముందు చక్రాలు రోడ్డుపై ఊడి పడ్డాయి.డివైడర్ పక్కనున్న సోలార్ పలకలు విరిగిపోయాయి.విరిగిన సోలార్ పలక రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో డ్రైవర్ తల్లికి కాలు విరిగింది.మిగిలిన ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.కారు ముందు భాగం నుజ్జవడం బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పాదచారి రుత్తల లక్ష్మి భర్త రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మోదమ్మ పుట్టినరోజు వేడుకలకు
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026సర్వం సిద్ధం!ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లుసాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం, పాడేరు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలను మినీ జాతరను తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12న అమ్మవారి జన్మదినం సందర్భంగా, పాత సంప్రదాయాల ప్రకారం మే 10వ తేదీ ఆదివారం నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తేదీల మార్పుపై కూటమి కుట్ర! మోదకొండమ్మ ఉత్సవాలను మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అధ్యక్షతన కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.42 లక్షల వ్యయంతో కోల్‌కతా నుంచి ప్రత్యేక లైటింగ్, సాంస్కృతిక ప్రదర్శనలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో అడ్వాన్సులు కూడా చెల్లించారు. అయితే, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగితే తమకు మైలేజీ రాదని భావించిన కూటమి ప్రభుత్వం, రాజకీయ కుట్రకు తెరలేపింది. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, జిల్లా ఇన్చార్జి మంత్రి సంధ్యారాణి ఒత్తిడితో కలెక్టర్ ద్వారా ఉత్సవాల తేదీలను మే 17, 18, 19కి మారుస్తూ ప్రకటన చేయించారు. దీనిపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అమ్మవారి పుట్టినరోజు వేడుకలను మాత్రం పాత తేదీల ప్రకారమే నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ముస్తాబవుతున్న మోదమ్మ ఆలయం వేడుకల నేపథ్యంలో మోదకొండమ్మ ఆలయం నూతన శోభను సంతరించుకుంది. అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక రంగులు వేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ వెలుగులతో తీర్చిదిద్దనున్నారు. ఈనెల 10న ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే డప్పు వాయిద్యాల నడుమ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, భక్తులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ప్రారంభిస్తారు. 11వ తేదీ సోమవారం లోక కల్యాణార్థం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. 12వ తేదీ మంగళవారం ఉదయం 101 డప్పుల హోరుతో పాడేరు పట్టణంలో ఘటాల ఊరేగింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్నసమారాధన, మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాల ప్రతిమలతో గ్రామ ప్రదక్షిణ జరుగుతుంది. ● రాత్రి వేళ పాత బస్టాండ్, ఆలయ ఆడిటోరియంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్సవాలను వాయిదా వేసినప్పటికీ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తన సొంత ఖర్చుతో ఈ వేడుకలను నిర్వహిస్తుండటంపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పాత తేదీల ప్రకారమే ఈనెల 10 నుంచి 12 వరకు నిర్వహణ కూటమి సర్కారు తేదీల మార్పుపై భక్తుల ఆగ్రహం మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల మనోభావాలు తగ్గట్టుగా చర్యలు


