పాడేరు: మన్యంలో వర్షాల పరంపర కొనసాగుతోంది. ఉదయం పూట మంచు కురుస్తున్నా, మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. అయితే సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం పాడేరుతో పాటు ఏజెన్సీలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల జనజీవనానికి కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ, రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలకు వ్యవసాయ భూములన్నీ తడిసి ముద్దవుతుండటంతో, వేసవి దుక్కులకు ఎంతో మేలు జరుగుతుందని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు మరియు భీకర శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వర్షం ధాటికి మండలంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా లంబసింగి–జి.మాడుగుల, పాడేరు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండటంతో, మట్టి రోడ్డు కాస్తా బురదమయంగా మారింది. దీనివల్ల వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులకు కొంత సమయం ఆటంకం ఏర్పడింది.ఉరుములు, మెరుపుల ప్రభావంతో జి.మాడుగుల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.భీకరమైన శబ్దాలతో పిడుగులు పడటంతో ఏ క్షణాన ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని గ్రామస్తులు వణికిపోయారు. అయితే, ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం


