తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. అయితే వీళ్లలో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటారు. అలాంటి వాళ్లలో ఈమె ఒకరు. హీరోయిన్‌గా కొన్ని వందల సినిమాలు చేసిన నటి ఈమె. కానీ ఇప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో కనిపించడంతో ఫొటోలు వైరల్ అయ్యాయి. మరి ఈ నటి ఎవరో గుర్తుపట్టారా?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు తాడిపత్రి సరస్వతి దేవి. అదేంటి ఈమె పేరు శారద కదా.. వేరే ఏదో పేరు చెబుతున్నారేంటి అనుకోవచ్చు. కానీ అదే ఆమె అసలు పేరు. ఈమె సినిమాల్లోకి వచ్చే టైంకి సరస్వతి పేరుతో పలువురు నటీమణులు ఉండడంతో శారదగా స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు. తెనాలిలో పుట్టిన ఈమె.. చెన్నైలో అమమ్మ దగ్గర పెరిగారు. శారద అమ్మమ్మ ఎంత స్ట్రిక్ట్ అంటే ఆదివారం మాత్రమే రిహార్సల్స్‌కి పంపించేది. సినిమా కోసమైనా సరే హీరోలు తన మనవరాలిని ముట్టుకోనిచ్చేది కాదు.
ఆరేళ్ల వయసు నుంచే డ్యాన్స్ నేర్చుకున్న శారద.. దసరాతో పాటు ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేవారు. 1955లో వచ్చిన తెలుగు సినిమా 'కన్యాశుల్కం'తో నటిగా కెరీర్ ప్రారంభించారు. కానీ తిరిగి నాటకాల్లోకి వెళ్లిపోయి నాలుగేళ్ల తర్వాత అంటే 1959లో మళ్లీ మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో వరస చిత్రాలు చేశారు. 2015లో చివరగా ఓ మలయాళ మూవీ చేశారు. తెలుగులో ప్రభాస్ 'యోగి'లో అమ్మగా నటించారు. చివరగా ఆది 'సుకుమారుడు' మూవీలో కనిపించారు.
(ఇదీ చదవండి: రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ)
కెరీర్‌లో కొన్ని వందల సినిమాలు చేసిన శారద.. తన నటనకుగానూ మూడుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్, నంది పురస్కారాలు కూడా గెలుచుకున్నారు.
సినిమాలు, అవార్డుల సంగతి పక్కనబెడితే శారదకు లోటస్ చాక్లెట్స్ పేరిట ఓ కంపెనీ ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున తెనాలి నుంచి గతంలో ఎంపీగానూ గెలుపొందారు. మలయాళ చిత్రసీమలోని హేమ కమిటీలోనూ ఈమె సభ్యురాలే. వ్యక్తిగత జీవితానికొస్తే నటుడు-నిర్మాత చలంని పెళ్లి చేసుకున్నారు కానీ మనస్పర్థల కారణంగా విడిపోయారు. ప్రస్తుతానికైతే ఈమె.. సోదరుడి కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటున్నారు.
(ఇదీ చదవండి: పవిత్రమైన 'భస్మ హారతి'లో పాల్గొన్న తమన్నా)


