న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్‌లో ‘గెస్ పేపర్’ లీకైందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగింది?
కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో ‘గెస్ పేపర్’ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయింది? దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేతికి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సీబీఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.
త్వరలోనే రీ-ఎగ్జామ్.. విద్యార్థులకు ఊరట
పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగినా, పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహులకు న్యాయం చేయడానికే ఈ రీ-ఎగ్జామ్ జరగనుంది. త్వరలోనే అధికారిక మార్గాల ద్వారా కొత్త తేదీలను ప్రకటించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూ విద్యార్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది.
కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఫీజు వాపసు
మళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలే దాదాపు చెల్లుబాటు అవుతాయి. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరు సరికాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును విద్యార్థులకు వాపసు (రీఫండ్) చేయనున్నారు. కొత్త పరీక్ష తేదీకి ముందు ఎన్టీఏ తాజా అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది.


