కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన షూటర్‌గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన ‘రాజ్ సింగ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజ్ సింగ్ ఎవరు?
బల్లియాలోని ఆనంద్ నగర్‌కు చెందిన రాజ్ సింగ్ స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. అఖిల భారత క్షత్రియ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే ఇతడి పేరు గతంలో ఒక కాల్పుల ఘటనలోనూ వినిపించింది. ప్రొఫెషనల్ షూటర్లతో సహా కనీసం ఎనిమిది మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్నోలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా, అయోధ్యలో రాజ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బిహార్‌లోని బక్సర్‌లో మయాంక్ మిశ్రా, విక్కీ మౌర్యాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్‌ను తదుపరి విచారణ నిమిత్తం కోల్‌కతాకు తరలించారు.
నా కొడుకు నిర్దోషి.. పోలీసులదే కుట్ర
తన కొడుకును ఈ కేసులో అకారణంగా ఇరికించారని రాజ్ సింగ్ తల్లి జామవంతి సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య జరిగిన సమయంలో తాము ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నామని, 2026 మే 9 ఉదయం అయోధ్యలో గుడికి వెళ్లామని ఆమె ఆజంగఢ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అయోధ్యలో ఐదుగురు వ్యక్తులు తన కొడుకును బలవంతంగా ఎత్తుకెళ్లి, ఆ తర్వాత బక్సర్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని ఆమె మండిపడ్డారు. తమకు కోల్‌కతాతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడికి ఎన్నడూ వెళ్లలేదని పేర్కొన్నారు.
ఫోన్ రికార్డులే సాక్ష్యం.. దర్యాప్తు ముమ్మరం
రాజ్ సింగ్ లక్నోలో పెళ్లికి హాజరై, మార్కెట్లో షాపింగ్ చేసినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తల్లి జామవంతి చెబుతున్నారు. ‘నా కొడుకుకు న్యాయం జరగాలి, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ రికార్డులను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి’ అని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ దారుణాన్ని ముందస్తు కుట్రగా అభివర్ణించడంతో బెంగాల్ ఎస్టీఎఫ్, సీఐడీ, యూపీ, బీహార్ పోలీసుల సంయుక్త బృందాలు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశాయి.


