టీ ఇలా చేయాలి.. అలా కాదు! | A Perfect Cup Or A Hidden Poison? The Truth About Overboiled Tea, Read Out Explaination Inside | Sakshi
Sakshi News home page

టీ ఇలా చేయాలి.. అలా కాదు!

May 11 2026 2:01 PM | Updated on May 11 2026 2:55 PM

Over boiled tea turns poisonous Explanantion Here

అనగనగా ఒక ఊరు.
రచ్చబండ దగ్గరే రోజూ ఉదయాన్నే...
జనంతో కిక్కిరిసే టీకొట్టు!
కొట్టు యజమాని అనయ చేతి టీ తాగితే...
గుండె గట్టిపడుతుందని కొందరు... మెదడు చురుకుగా మారుతుందని ఇంకొకరు..
ఇలా అందరూ కలిసి ఆ కొట్టు.. అక్కడ దొరికే టీని వైరల్‌ చేసేశారు.
మరి... ఇదంతా నిజమేనా? టీకి... గుండెకు లింకేమిటి?..

అనయ కథతోనే ముందుకెళదాం.. టీ కొట్టు బ్రహ్మాండంగా నడుస్తూండగానే రవి అనే కొత్త కుర్రాడు పనోడిలా చేరాడక్కడ. అందరూ అక్క చేతి టీ ఆరోగ్యానికి మంచిదంటున్నారు కదా... దాన్ని మరింత స్ట్రాంగ్‌ చేద్దాం అనుకున్నాడీ కుర్రాడు. అక్క రెండు నిమిషాలు మాత్రమే కాస్తోంది. నేను ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ ఉడకబెడతా అని ప్రయోగం మొదలుపెట్టాడు.  అలాగే ఉడికించాడు కూడా. ఈ టీ తాగినవాళ్లు.... వాసన కమ్మగా ఉందని మెచ్చుకున్నారు కానీ... కొంచెం చేదుగా ఉందని ఫిర్యాదు కూడా చేశారు. ఒకట్రెండు రోజులు అంతా బాగానే ఉండింది కానీ.. ఆ తరువాత ఊళ్లో చాలామంది నీరసంగా ఉందని, తలనొప్పి దంచేస్తోందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు కడుపులో గడబిడగా ఉందంటే.. మరికొందరు నిద్రపట్టడం లేదని వాపోవడం మొదలుపెట్టారు. వీళ్లందరూ అనయ కొట్టులో టీ తాగే వాళ్లే. ఊళ్లో జరిగే విషయాలు తెలిసిన అనయ కించిత్‌ ఆశ్చర్యపోయింది. ఏమై ఉంటుందా? అని ఆలోచించింది. రవితో మాటలు కలిపింది. విషయం వెంటనే అర్థమైపోయింది..

‘‘బాబూ రవి... మనం కాచే టీ మందులా పనిచేస్తుంది. కాకపోతే అది మనం దాన్ని సక్రమంగా ఎలా తయారు చేయాలో తెలిసినంత వరకే. మంచి వాసన వస్తోంది కదా అని ఎక్కువ సేపు ఉడికించావనుకో.. అంతే సంగతులు. మందు కాస్తా విషమైపోతుంది’’ అని అసలు విషయాన్ని బయటపెట్టింది...

మరగిస్తే విషమే..
టీని మరిగించిన కొద్దీ అందులోని పాలిఫినాల్స్‌ ముక్కలు ముక్కలైపోతాయి. ఫలితంగా వాటితో మనకు మంచి జరక్కపోగా... హాని జరిగే అవకాశాలు పెరిగిపోతాయి. టీని ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మరిగించడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అప్పుడు రుచి, పోషకాలు రెండూ సమతౌల్యతతో ఉండి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా కాకుండా... మూడు నుంచి ఐదు నిమిషాలపాటు ఉడికించినా సరే... పాలిఫినాల్స్‌ తాలూకూ లాభాలు తగ్గిపోతాయి. 

పది నిమిషాలపాటు ఉడికిస్తే... ప్రయోజనం మరింత తగ్గిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మరిగించిన టీతో మేలు జరగదు. తలనొప్పి, కడుపులో గడబిడ, నిస్సత్తువ వంటి అసౌకర్యాలు మొదలవుతాయి. అంతేకాదు... టీ ని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసుకుని తాగాలని, చల్లారిందని టీని పదే పదే ఉడికించడమూ మంచిది కాదని అనయ రవికి వివరించింది. 

ఉదయాన్నే తాగే టీ శరీరానికి శక్తినిచ్చి ఫోకస్‌న పెంచితే.. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో తాగే టీ ఒత్తిడిని దూరం చేసే మనల్ని రిఫ్రెష్‌ చేస్తుందని రవికి తెలిపింది. సాయంత్రం ఆరు గంటల తరువాత తాగే టీ నిద్రను పాడు చేసే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేసింది.

టీ లవర్స్‌ మాత్రమే కాదు.. ‘‘మేము రోజూ గ్రీన్‌ టీ తాగుతామండి.. కానీ ఎందుకో మాకేమీ ఆరోగ్య లాభం లభించడం లేదు’’ అని చెప్పే వారు కూడా టీని ఎంత సేపు మరగిస్తున్నారో ఒకసారి గమనిస్తే మేలని అనయ సూచిస్తోంది. ‘‘అక్క చెప్పిన మాటల్లో లాజిక్కు ఉంది’’ అని తెలుసుకున్న రవి కూడా టీని రెండు కంటే ఎక్కువ నిమిషాలు మరగించకపోవడంతో ఇప్పుడు ఊళ్లో అందరూ హ్యాపి!

టీని పద్ధతిగా చేస్తే... 
1. శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 
2. చురుకుదనాన్ని పెంచుతుంది. 
3. గుండెకు మంచిది.
4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఎక్కువగా మరిగిస్తే...
1. టానిన్లు ఎక్కువవుతాయి. అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి, తలనొప్పిలాంటివి వస్తాయి.
2. శరీరం ఇనుమును శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడవచ్చు.
3. పొట్ట లోపలి పొరను చీకాకు పెడుతుంది. ఇది కాస్తా గ్యాస్‌ ఏర్పడేందుకు, అసౌకర్యానికి దారితీయవచ్చు.
4. జీర్ణ సమస్యలతోపాటు కేన్సర్‌ ప్రమాదం కూడా పెరుగుతుంది.
5. మనకు మేలు చేసే ఆంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు నశించిపోతాయి.

:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Advertisement
 
Advertisement
Advertisement