breaking news
Gopala Krishna G Mayya
-
వ్యాయామం తంటా లేకుండా ఆరోగ్యం!
ఆరోగ్యం.. కడుపులోని చల్ల కదలకుండా!ఊబకాయం తగ్గించుకునేందుకు..ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ..రకరకాల వ్యాయామాలు చేస్తున్న వారందరికీ ఓ గుడ్‌న్యూస్!ఈ తంటాలేవీ పడక్కరలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు!ఎంచక్కా అప్పుడప్పుడూ ఓ మాత్ర వేసేసుకుంటే చాలని..వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వచ్చేస్తాయని చెబుతున్నారు!ఆ వివరాలేమిటో చూద్దామా?ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. అందుకు తగ్గట్టుగా తగిన వ్యాయామంతో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం.. ఈ ఆధునిక కాలంలో చాలామంది పాటించే సూత్రం. అయితే, కొంత మందికి వ్యాయామం ఎంత చేసినా.. ఎంతలా కడుపు కట్టుకున్నా ఒళ్లు తగ్గదు. ఆరోగ్య సమస్యలూ వీరిని పీడిస్తూంటాయి. ఇలాంటి వారికీ ఉపయోగపడే ఓ ప్రయోగాన్ని చేశారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. బీట్రూట్, పాలకూర, గింజ ధాన్యాల్లో సహజంగా లభించే ఓ పదార్థం.. వ్యాయామం చేస్తే వచ్చే ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ పదార్థం ద్వారా వయసుతోపాటు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని తేలింది.శారీరక వ్యాయామం చేయకున్నా ఆ ఫలితాలన్నీ ఇచ్చే అద్భుతం కోసం శాస్త్రవేత్తలు ఒకవైపు పరిశోధనలు చేస్తూనే ఉండగా.. చైనా శాస్త్రవేత్తలు ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేయగలిగారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న వారిని పరిశీలించగా.. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో బెటనైన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మూత్రపిండాల ద్వారా శరీరానికి అందుతుంటుంది. బెటనైన్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అని వివరంగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.ఇందు కోసం కొంతమంది యువకులను ఎంచుకుని ఆరేళ్లపాటు పరిశీలించారు. వీరు రెండు రకాల వ్యాయామాలు చేసేవారు. కొందరు శారీరక దారుఢ్యానికి పరీక్ష పెట్టే ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేస్తుండగా.. మిగిలిన వారు ఎక్కువ శ్రమ ఉన్నవి చేస్తున్నారు. రెండింటివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గుర్తించాలన్నది దీని ఉద్దేశం. ఆశ్చర్యకరంగా శరీర కణాల వయసు పెరగకుండా చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది!. ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేసే వారిలో కణాల వార్ధక్యం, మంట/వాపు మిగిలిన వారికంటే తక్కువగా ఉన్నట్లు తెలిసింది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వ్యాయామాలు చేస్తున్న వారిలో కణాలు ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమైంది.ఎండ్యూరెన్స్ వ్యాయామం చేస్తున్న వారిపై మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే ఒక ప్రొటీన్ (ఈటీఎస్1) ఉత్పత్తి తగ్గినట్లు స్పష్టమైంది. అదే సమయంలో కిడ్నీల్లో బెటనైన్ తయారవడం ఎక్కువైంది. వయసు ఎక్కువగా ఉన్న వారు వ్యాయామం చేసిన తరువాత రక్తంలో బెటనైన్ ఎక్కువగా ఉన్నట్లు, ఈ పదార్థం కండరాల శక్తి, జీవక్రియలు, కణంలో చక్కెరలను శక్తిగా మార్చే మైటోకాండ్రియాల ఆరోగ్యం మెరుగైనట్లు తెలిసింది. దీంతో వ్యాయామంతో వచ్చే ప్రయోజనాల వెనుక బెటనైన్ ఉందని స్పష్టమైంది.ఎలుకలకు ఇచ్చి చూశారు..తమ అంచనాలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు వయసు మళ్లిన ఎలుకలకు నిర్దిష్ట మోతాదుల్లో బెటనైన్ అందించారు. ఆ తరువాత పరిశీలించినప్పుడు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వాటిల్లోనూ కనిపించాయి. అంటే కండరాలు గట్టిపడ్డాయి, ఎక్కువ కాలం శ్రమను ఓర్చుకోగలిగాయి. మంట/వాపు వంటివి తగ్గాయి అన్నమాట!. కణజాలం పునరుత్పత్తి కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. ‘వ్యాయామం చేయడం వల్ల ముందుగా శరీరంలో మంట/వాపు వస్తాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే కొనసాగిస్తే.. ఇవి తగ్గిపోతాయి. కిడ్నీ ద్వారా ఉత్పత్తి అయ్యే బెటనైన్ తగ్గిస్తుంది’ అని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త లియు గువాంగ్హూయి తెలిపారు. మొత్తమ్మీద విషయం ఏమిటంటే.. వ్యాయామం అప్పుడప్పుడు చేయడం కాకుండా.. క్రమం తప్పకుండా చేయాలి అని!!. అలాగే బెటనైన్ సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తినడమూ శరీరానికి మేలు చేస్తుందన్నమాట!. లేదా.. మరిన్ని పరిశోధనల తరువాత బెటనైన్ సప్లిమెంట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటిని రోజూ తీసుకోవచ్చు!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)
-
సందట్లో సడేమియా.. పాయె.. ఇది కూడా పాయె!
-రోబోలిప్పుడు క్షవర కళ్యాణానికీ ఎసరు పెట్టేశాయి!-ఇప్పటికైతే ఒక ట్రెండు చోట్ల మాత్రమే కానీ...-ఇంకొన్నేళ్లు పోతే మాత్రం సందు గొందులన్నింట్లోనూ-‘రోబో హెయిర్ కటింగ్ సెలూన్’లు వెలియడమైతే ఖాయం!!!రోబోలొస్తే ఉద్యోగాలు పోతాయని చాలా మంది చెబుతూనే ఉన్నారు. కానీ, పరిస్థితి మరీ క్షురకుల స్థాయికి చేరుతుందని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఊహించారు. విషయం ఏమిటంటే.. నిన్న మొన్నటివరకూ ఏదో హాబీ కొద్ది ఒకరిద్దరు రోబోలతో వెంట్రుకలు కత్తిరించుకునేందుకు, షేవింగ్ చేయించుకునేందుకు ప్రయత్నించేవారేమో కానీ.. ఇప్పుడిప్పుడే ఇవి వాణిజ్యస్థాయిలో అంటే మన వీధి చివరి సెలూన్ల మాదిరిగా దుకాణాలు తెరవడం మొదలైంది. ఈ ట్రెండ్ ఊపందుకుందీ అనుకోండి.. క్షురకులు గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోవడం గ్యారెంటీ అంటున్నారు నిపుణులు!షేన్ వైటన్.. అమెరికా యూట్యూబర్ ఇతడు. ఇంజినీర్ కూడా. ఐదేళ్ల క్రితం ‘స్టఫ్ మేడ్ హియర్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. తన బుర్రకొచ్చిన ఆలోచనలను యంత్రాలుగా మారుస్తుంటాడు. ఉదాహరణకు ఇతడు సృష్టించిన బాస్కెట్‌బాల్ హూప్ (కోర్టుకు ఇరువైపులా ఉండే బోర్డు)! బాల్ ఎలా విసిరినా సరే.. బోర్డు తనను తాను అడ్జెస్ట్ చేసుకుంటుంది. బాల్ కచ్చితంగా రంధ్రంలోకే పడుతుంది! అలాగే.. స్నూకర్ ఆడుతున్నప్పుడు బాల్స్ కచ్చితంగా బాల్స్‌ను రంధ్రాల్లో పడేలా స్పెషల్ ‘క్యూ’ను తయారు చేశాడు. This Video shows a real robotic barber.Similar tech exists, like Shane Wighton's project reported by Popular Mechanics and CNET. It aligns with demos from startups like Snips AI. pic.twitter.com/2sRHIYGUQI— The Artificial Intelligence Techie (@TheAItechie) July 2, 2025ఈ క్రమంలోనే ఈ యువ ఇంజినీర్‌కు హెయిర్ కట్కూ ఓ రోబో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. రంగంలోకి దిగిపోయాడు. బోలెడన్ని విఫల ప్రయత్నాల తరువాత ఓ సక్సెస్ఫుల్ రోబో తయారైంది. వాక్యూమ్ క్లీనర్ వంటిదాన్ని ఉపయోగించి వెంట్రుకలన్నీ పైకి లేచేలా చేసి.. రోబో ద్వారా వెంట్రుకలు కత్తిరించేలా చేశాడు. తల మొత్తాన్ని త్రీడీ మ్యాపింగ్ చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు తల కదలికలను కూడా నమోదు చేసుకుంటూ కదులుతుందీ రోబో బార్బర్!.Basketball hoop that doesn't let you miss by Shane Wighton. pic.twitter.com/WP9tYoVLOP— MachinePix (@MachinePix) May 11, 2020ఇదొక్కటే కాదండోయ్.. స్టూడియో రెడ్ అనే కంపెనీ కెమెరాలు, ప్రెషర్ సెన్సర్ల సాయంతో వాణిజ్యస్థాయి రోబో బార్బర్‌ను రూపొందించే క్రమంలో ఉంది. నేడో రేపో మార్కెట్లోకి వచ్చేస్తుంది ఇది. ఇక ఆటోమెటిక్ హెయిర్ కట్టర్ రోబో గురించి.. త్రీడీ మోడలింగ్, వాక్యూమ్ సక్షన్తోపాటు మొబైల్ ఆప్ ద్వారా అవసరమైన ‘స్టైల్’ను సెలెక్ట్ చేసుకునేలా ఒక రోబోటిక్ వ్యవస్థను సిద్ధం చేసింది. దీనికి పేటెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి నమూనా యంత్రాల తయారీ, పరీక్షలు జరుగుతున్నాయి! ఇవన్నీ ఆటోమెటిక్ రోబో బార్బర్లైతే.. రోబోకట్, ఫ్లోబీ సిస్టమ్స్ వంటివి సెమీ ఆటోమెటిక్ పద్ధతిలో ఇంట్లోనే కటింగ్, షేవింగ్ చేసుకునే యంత్రాలను రూపొందించే పనిలో ఉన్నాయి!.స్టూడియోరెడ్, షేన్ వైటన్ వంటివారు తాము తయారు చేసిన రోబో బార్బర్లను సెలూన్లలో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈ విషయంలో కృత్రిమ మేధ కూడా అడుగుపెట్టేసింది. బార్బర్ జీపీటీ మన ఫొటోలను వాడుకుని ఏ స్టైల్లో ఎలా కనిపిస్తామో చూపిస్తుంది. నచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే చాలు! క్ష... వ... రం... మొదలైపోతుంది!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్‌మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
కొండను కదిలించడం అంటే ఇదే!
వందేళ్ల పురాతనమైన ఇటుక కట్టడం.. 44 వేల చదరపు అడుగుల నిర్మాణం.. 8270 టన్నుల బరువు.. చిన్నసైజు కొండలా ఉంటుంది. కానీ.. మనిషి సంకల్పం ముందు మాత్రం దూదిపింజె చందంగా తేలికగా మారిపోయింది. ఇటు నుంచి అటుకు.. కొంత సమయం తరువాత అటు నుంచి ఇటుకు వచ్చేసింది. చైనాలో జరిగిందీ అద్భుతం. భూగర్భంలో ఓ షాపింగ్ సెంటర్ కట్టేందుకు అడ్డుగా ఉందని.. షాంఘైలోని హయాన్లీ షికుమెన్ భవనాన్ని చెక్కు చెదరకుండా పక్కకు తరలించారు. మల్టీ లెవల్ అండర్‌గ్రౌండ్ షాపింగ్ మాల్ నిర్మాణం పూర్తి కాగానే యథాతథ స్థితికి చేర్చేశారు.వివరాలు... ఇప్పుడంటే మాయమయ్యాయి కానీ.. ఒకప్పుడు చైనాలో నడవా ఇళ్లు భారీ ఎత్తునే ఉండేవి. నడవ ఇల్లు అంటే అర్థం కాకపోతే.. విశాలమైన సెంట్రల్ కోర్టు ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అనుకోండి. 1920, 30లలో కట్టిన ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఈ హుయాన్లీ షికుమెన్ కాంప్లెక్స్. కాలం మారిపోయింది. షాంఘై మహా నగరమైంది. ప్రజల అవసరాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగా ఈ కాంప్లెక్స్ ఉన్న చోట ఓ భారీ భూగర్భ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే వందేళ్ల చరిత్ర ఉన్న హుయాన్లీ కాంప్లెక్స్‌ను కూల్చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి మనసు రాలేదు. దాన్ని కాపాడుకుంటూనే అండర్‌గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేద్దామని తీర్మానించారు.ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న షాంఘై కన్స్ట్రక్షన్ నెం:2 సంస్థ భవనాన్ని నఖశిఖ పర్యంతం పరిశీలించి.. త్రీడీ స్కానింగ్ చేసి... పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తరువాత మళ్లీ ముందు ఉన్న చోటికి తెచ్చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యాధునిక కృత్రిమ మేధ సాయంతో పనిచేసే డ్రిల్లింగ్ రోబోలు రంగంలోకి దిగాయి. మట్టికి, నిర్మాణానికి మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోగల ఈ రోబోలు భవనం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం తవ్వడం మొదలుపెట్టాయి. అడుగుభాగంలోకి చేరి ఒక్కటొక్కటిగా 432 హైడ్రాలిక్ వాకింగ్ రోబోలను నిలిపాయి.ఒక్కోటి పది టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్నవి. సెన్సర్ల సాయంతో పీడనం, కంపనలు వంటివి గుర్తిస్తూ వాకింగ్ రోబోలు అన్నీ సమన్వయంతో నెమ్మదిగా కదలుతూ భవనం మొత్తాన్ని పక్కనున్న ఖాళీస్థలంలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పైకి చేర్చాయి. ఒక రోజుకు కేవలం 33 అడుగుల దూరం మాత్రమే ప్రయాణిస్తూ... భవనం చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2023లో మొదలైన ఈ తరలింపు కొద్ది రోజుల్లోనే ముగిసింది కానీ.. ఆ తరువాత ఖాళీ స్థలంలో అండర్‌గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు ఒక భూగర్భ మెట్రో రైలు స్టేషన్, పార్కింగ్ ఏర్పాట్లు వంటివన్నీ పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెల 19న హుయాన్లీ కాంప్లెక్స్‌ను మళ్లీ యథాతథ స్థితికి తీసుకొచ్చే పని మొదలై 19 రోజుల్లోనే ముగించారు. జూన్ ఏడవ తేదీకల్లా భవనం తన సొంత పునాదులపై నిలిచింది.ఇదే తొలిసారా?ఊహూ కానేకాదు. భారీ భవంతులను పక్కకు జరిపడం గతంలోనూ చాలాసార్లు జరిగింది. 1985లో టెక్సస్‌లోని సాన్ ఆంటోనియలో ఉండే ఫెయిర్‌మౌంట్ హోటెల్ను కూడా ఆరు బ్లాకుల దూరం కదిలించారు. భారీ క్రేన్, డంప్ ట్రక్కుల సాయంతో జరిగిందీ తరలింపు. చక్రాలపై కదిలిన అతి భారీ భవంతిగా ఇప్పటికీ గిన్నిస్ రికార్డు కొనసాగుతోంది. దీని బరువు 14.5 లక్షల కిలోలు లెండి!1930లో ఇండియానా బెల్ అనే టెలిఫోన్ కంపెనీ ఏడు అంతస్తుల తన ప్రధాన కేంద్ర భవనాన్ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు మళ్లించడం కూడా ఒక రికార్డే. పైగా ఇలా ఈ భవనాన్ని తిప్పేస్తున్నప్పుడు దాంట్లో కార్యకలాపాలు ఏ మాత్రం నిలిపివేయకపోవడం ఇంకో విశేషం! 1962లో చైనా కూడా సుమారు 22 అంతస్తుల భవనం ఒకదాన్ని 90 డిగ్రీల మేరకు పక్కకు తిప్పేయడం కొసమెరుపు!- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
కాలం కలిసొచ్చింది... కారు నడిచొచ్చింది!
‘‘కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు పుడతాడంట!’’ పాతకాలపు సామెత. ఈ టెక్నాలజీ యుగంలో ఈ పప్పులేమీ ఉడకవు. కానీ.. డబ్బులు ఉంటే షోరూమ్‌కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్ వస్తే సొంతంగా.. లేదంటే అద్దెడ్రైవర్ను పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు మాత్రం ఇప్పుడు దానంతట అదే నడిచొస్తుంది!. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది!.. ఎలాన్ మస్క్ సృష్టించిన అద్భుతం డ్రైవర్‌లెస్ కారు మొట్టమొదటిసారి కొనుగోలుదారు ఇంటి వద్దకు వచ్చేసింది. ఈ విషయాన్నే టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ గర్వంగా తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌పై పంచుకున్నారు కూడా. ఎలాంటి మానవ సాయం, జోక్యం లేకుండా.. టెక్సస్‌లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో తయారైన ‘మోడల్ వై’ కారు స్థానికంగా కొనుగోలుదారు వద్దకు గంటకు 72 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చిందన్నమాట. First time that a car has delivered itself to its owner! https://t.co/xgZBRDaMiX— Elon Musk (@elonmusk) June 28, 2025పైగా... అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగా ఎలాన్ మస్క్ పుట్టినరోజు నాడే ఈ కారు డెలివరీ కావడం ఒక విశేషం. ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఇదో చిరస్మరణీయ ఘట్టం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డ్రైవర్ల అవసరం లేని వాహనాలతో క్యాబ్‌లు నడపాలన్న మస్క్ ఆలోచనలు వాస్తవమయ్యే దిశగా ఇంకో ముందడుగూ పడిందన్నమాట!. మోడల్ వై గురించి క్లుప్తంగా..2020లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. టెస్లా మోడల్ త్రీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఐదుగురు కూర్చోగలరు. కొన్ని ప్రాంతాల్లో ఏడు సీట్లు ఉన్న వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టెక్సస్‌లోని ఆస్టిన్ ప్రాంతం ఫ్రీమాంట్‌లోని టెస్లా గిగాఫ్యాక్టరీతోపాటు షాంఘై, బెర్లిన్లలో ఈ మోడల్ వై కార్లు తయారవుతున్నాయి. వేరియంట్‌ను బట్టి 60 - 81 కిలోవాట్ హవర్ల బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్ ఫాస్పే్ట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలతో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే వేరియంట్‌ను బట్టి 320 నుంచి 330 మైళ్ల దూరం ప్రయాణించగలదు. పావుగంటలోనే 180 మైళ్ల దూరం ప్రయాణించగలిగేంత విద్యుత్తును ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 5.4 సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగల శక్తి దీని సొంతం. గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు! వాహనం లోపలి విశేషాల గురించి చూస్తే.. 15.4 అంగుళాల విశాలమైన టచ్స్ట్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్‌లు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వేరియంట్‌ను కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని పరిమితమైన ఫీచర్లతో డ్రైవింగ్ అవసరాన్ని తగ్గించేవి లభిస్తాయి. తెల్లగీతల మధ్య మాత్రమే ప్రయాణించడం, అడాప్టివ్ క్రూయిజ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి అన్నమాట. అత్యాధునిక ఆడియో సిస్టమ్ ఉండనే ఉంది. భద్రత విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. చివరిగా ధరల గురించి... రకాన్ని బట్టి 39.3 లక్షల రూపాయలు (46000 డాలర్లు) నుంచి 41.01 లక్షల రూపాయలు (48,000 డాలర్లు) వరకూ ఉంటుంది.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
అవును. నిజం. ఒకట్రెండేళ్లలో క్యాబ్డ్రైవర్లు అనే వారు ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా ఊబర్, ఓలా, ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్ డ్రైవర్ల ఆదాయంలో కొంత వాటా పంచుకుంటూంటే... రోబోటిక్స్, అటానమస్ వెహికల్ టెక్నాలజీ కాస్తా... డ్రైవర్ల ఉద్యోగాలకే గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ల అవసరం లేని కార్లను టెస్లా ఎప్పుడో తయారు చేసింది కదా? అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని అంటున్నారా?సింపుల్.. టెస్లాతోపాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఈ అటానమస్ వెహికల్ టెక్నాలజీని క్యాబ్స్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి! టెస్లా ఇప్పటికే తన సైబర్ ట్రక్‌ను క్యాబ్ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తూండగా.. అమెజాన్ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్డ్ ప్రాంతంలో అమెజాన్ సుమారు 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోబో ట్యాక్సీల తయారీకి ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్కులాంటి ఈ వాహనం పేరు జూక్స్. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా కొన్ని వాహనాలు లాస్ వేగస్ నగరంలో పరుగులు పెడతాయి కూడా. ఆ తరువాత.. దశలవారీగా మయామీ, ఆస్టిన్, శాన్ఫ్రాన్సిస్కోలకు వీటి సేవలను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాన్లను టెస్ట్ ట్రాక్‌పై నడిపి పరిశీలిస్తున్నారు కూడా. డ్రైవింగ్ తీరుతెన్నులు, పికప్.. డ్రాప్ఆఫ్ల సందర్భంగా ఏమేం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. మరోవైపు.. టెస్లా కంపెనీ కూడా తన సైబర్ ట్రక్‌ను కాస్తా సైబర్ క్యాబ్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉంది. 2027 నాటికి తొలి దశ వాహనాలను రోడ్లపైకి ఎక్కిస్తారు. రోబోట్యాక్సీ అని పిలుస్తున్న ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు. స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివేవీ ఉండవు. అన్నీ కృత్రిమ మేధ ద్వారానే జరిగిపోతాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ముందు, వెనుక ఎక్కడ అద్దాలుండవు. కెమెరాలు, సెన్సర్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేస్తుందీ వాహనం. ఒక్కో రోబోట్యాక్సీని 30,000 డాలర్లకు అమ్మేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. మానవ డ్రైవర్ల పరిస్థితి?జూక్స్, రోబోట్యాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డుకాలమే!. ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పరిమితం కావచ్చు కానీ... భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు మరీ ముఖ్యంగా వివిధ దేశాల్లోని నగర ప్రాంతాలకు విస్తరించడం ఖాయం. అదే జరిగితే ట్యాక్సీ డ్రైవర్లకు డిమాండ్ తగ్గిపోతుంది. రోబో ట్యాక్సీలో ఒక ఒక మైలు ప్రయాణించేందుకు 0.20 డాలర్లు ఖర్చు అవుతుందని, బస్సులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు తక్కువ అని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. ఇదే వాస్తవమైతే చవక కాబట్టి వీటిల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతారు. కాకపోతే..మానవ డ్రైవర్లను ఈ రోబోట్యాక్సీ నిర్వహణకు ఉపయోగించుకోవచ్చునని ఒక అంచనా. అంతేకాదు... కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రోబో ట్యాక్సీలు మానవ డ్రైవర్లను పూర్తిగా లేకుండా చేయలేవు. ఎందుకంటే ఇలాంటి వాహనాల భద్రత, నియంత్రణలకు సంబంధించిన నిబంధనలు ఇప్పటివరకూ రూపుదిద్దుకోలేదు. ప్రభుత్వాలు పూనుకుని వీటిని సిద్ధం చేసేందుకు చాలా సమయమే పట్టవచ్చు. మరికొంత మంది అభిప్రాయం ప్రకారం అటానమస్ వాహనాలు నగరాల్లో కొన్ని నిర్దిష్ట మార్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సంక్లిష్టమైన రూట్లలో మానవ డ్రైవర్లనే ఉపయోగిస్తారు. ::గిళియారు గోపాలకృష్ణ మయ్యాPhotos/Videos Credits: zoox.com/newatlas.com -
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా తెరపడింది. క్షిపణి మోతలు, సైరన్ల హోరు కాస్త తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా. అయితే... పదమూడు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? కష్టమెవరికి? నష్టమెవరికి?.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ 13వ తేదీన ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేవలం అయిదంటే అయిదు రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్‌లోని వందకుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకూ క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ జూన్ పదమూడుతో మొదలుపెట్టి వరుసుగా వారం రోజులపాటు ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్నింటిని నిరోధించగలిగినా... మిగిలినవి ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయి. అయితే.. జూన్ ఇరవైన అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులు మారాయి. అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, ఈ దాడులు యుద్ధ ప్రకటనేని హూంకరించిన ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది కూడా. అయితే ఆ తరువాత జూన్ 22న రోజు గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్య, మిలటరీ వర్గాలు అంటున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నెతన్యాహ్యూ తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. ఇజ్రాయెల్ రెచ్చగొట్టనంత వరకూ తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ స్పష్టం చేయగా... ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ ‘యుద్ధం ముగియలేదు’ ప్రకటించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఒక అణుశాస్త్రవేత్త మృతికి కారణమైంది కూడా. ఇదిలా ఉంటే... ఫొర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణు స్థావరాలపై ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ ప్రకటించగా... జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు ఇరాన్‌పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ.మొత్తమ్మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్లో ప్రభుత్వ మార్పు అనే రెండు లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ అమెరికాను కూడా తోసిరాజు అనగలిగింది!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్‌కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్‌సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
‘గారె’ వాసనకు పడిపోయారు!
నోరూరుంచే వంటను చూసినా.. వాసనొచ్చినా మనసాగదు మనకు. ‘‘ఎవరింట్లోనో వంట అద్దిరి పోతోంది గురూ’’ అనుకుంటాం. ఆ ఇద్దరు అమెరికన్లదీ సేమ్ ఫీలింగ్ కానీ ఆ వంటేదో తెలియదు. ఆకలిమీదున్నారో... తెలియని వంటపై ఆసక్తో తెలియదు కానీ.. ఆ వాసన వెంటపడ్డారు.ఓ భారతీయ సంతతి మహిళ ఇంటి తలుపు తట్టారు వారు. ‘‘మీ ఇంట్లోంచి భలే వాసనొస్తోంది. ఎం వండుతున్నారు’’ అని వారు అడగడం... గారెలని ఆ ఇంటావిడ సమాధానం చెప్పడం విశేషం కాదు కానీ... ‘‘ఇంద.. మీరు ఓ రెండు గారెలు తినండి’’ అని కొబ్బరి చట్నీలతోపాటు ప్లేట్లలో వడ్డించడం మాత్రం నెట్టింట వైరల్ అయిపోయింది.పది రోజుల క్రితం అమెరికాలోని మినసోటాలో జరిగిందీ ఘటన. పేవ్మెంట్లను శుభ్రం చేస్తున్న ఇద్దరు అమెరికన్లు భారతీయ వంటకం వాసనకు పడిపోయిన ఈ ఘటనను కంపెనీ స్వయంగా వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేసింది.పది రోజుల్లో సుమారు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి ఈ వైరల్ వీడియోకి.. చూసినొళ్లు కూడా ‘‘ఇదీ భారతీయం అంటే’’ అని, ‘‘అతిథి దేవో భవకు అసలైన నిదర్శనం’’ అని రకరకాల కామెంట్లు చేస్తూ భారతీయ సంసృ్కతిని, ఆతిథ్యాన్ని నోరార కొనియాడటం ఇంకో విశేషం! ఊరకే అన్నారా...‘‘వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి అని!!