సందట్లో సడేమియా.. పాయె.. ఇది కూడా పాయె! | Man Made robot to cut hair Style Video Viral | Sakshi
Sakshi News home page

సందట్లో సడేమియా.. పాయె.. ఇది కూడా పాయె!

Jul 4 2025 11:22 AM | Updated on Jul 4 2025 12:13 PM

Man Made robot to cut hair Style Video Viral

-రోబోలిప్పుడు క్షవర కళ్యాణానికీ ఎసరు పెట్టేశాయి!

-ఇప్పటికైతే ఒక ట్రెండు చోట్ల మాత్రమే కానీ...

-ఇంకొన్నేళ్లు పోతే మాత్రం సందు గొందులన్నింట్లోనూ

-‘రోబో హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌’లు వెలియడమైతే ఖాయం!!!

రోబోలొస్తే ఉద్యోగాలు పోతాయని చాలా మంది చెబుతూనే ఉన్నారు. కానీ, పరిస్థితి మరీ క్షురకుల స్థాయికి చేరుతుందని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఊహించారు. విషయం ఏమిటంటే.. నిన్న మొన్నటివరకూ ఏదో హాబీ కొద్ది ఒకరిద్దరు రోబోలతో వెంట్రుకలు కత్తిరించుకునేందుకు, షేవింగ్‌ చేయించుకునేందుకు ప్రయత్నించేవారేమో కానీ.. ఇప్పుడిప్పుడే ఇవి వాణిజ్యస్థాయిలో అంటే మన వీధి చివరి సెలూన్ల మాదిరిగా దుకాణాలు తెరవడం మొదలైంది. ఈ ట్రెండ్‌ ఊపందుకుందీ అనుకోండి.. క్షురకులు గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోవడం గ్యారెంటీ అంటున్నారు నిపుణులు!

షేన్‌ వైటన్‌.. అమెరికా యూట్యూబర్‌ ఇతడు. ఇంజినీర్‌ కూడా. ఐదేళ్ల క్రితం ‘స్టఫ్‌ మేడ్‌ హియర్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేశాడు. తన బుర్రకొచ్చిన ఆలోచనలను యంత్రాలుగా మారుస్తుంటాడు. ఉదాహరణకు ఇతడు సృష్టించిన బాస్కెట్‌బాల్‌ హూప్‌ (కోర్టుకు ఇరువైపులా ఉండే బోర్డు)! బాల్‌ ఎలా విసిరినా సరే.. బోర్డు తనను తాను అడ్జెస్ట్‌ చేసుకుంటుంది. బాల్‌ కచ్చితంగా రంధ్రంలోకే పడుతుంది! అలాగే.. స్నూకర్‌ ఆడుతున్నప్పుడు బాల్స్‌ కచ్చితంగా బాల్స్‌ను రంధ్రాల్లో పడేలా స్పెషల్‌ ‘క్యూ’ను తయారు చేశాడు. 

ఈ క్రమంలోనే ఈ యువ ఇంజినీర్‌కు హెయిర్‌ కట్‌కూ ఓ రోబో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. రంగంలోకి దిగిపోయాడు. బోలెడన్ని విఫల ప్రయత్నాల తరువాత ఓ సక్సెస్‌ఫుల్‌ రోబో తయారైంది. వాక్యూమ్‌ క్లీనర్‌ వంటిదాన్ని ఉపయోగించి వెంట్రుకలన్నీ పైకి లేచేలా చేసి.. రోబో ద్వారా వెంట్రుకలు కత్తిరించేలా చేశాడు. తల మొత్తాన్ని త్రీడీ మ్యాపింగ్‌ చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు తల కదలికలను కూడా నమోదు చేసుకుంటూ కదులుతుందీ రోబో బార్బర్‌!.

ఇదొక్కటే కాదండోయ్‌.. స్టూడియో రెడ్‌ అనే కంపెనీ కెమెరాలు, ప్రెషర్‌ సెన్సర్ల సాయంతో వాణిజ్యస్థాయి రోబో బార్బర్‌ను రూపొందించే క్రమంలో ఉంది. నేడో రేపో మార్కెట్‌లోకి వచ్చేస్తుంది ఇది. ఇక ఆటోమెటిక్‌ హెయిర్‌ కట్టర్‌ రోబో గురించి.. త్రీడీ మోడలింగ్‌, వాక్యూమ్‌ సక‌్షన్‌తోపాటు మొబైల్‌ ఆప్‌ ద్వారా అవసరమైన ‘స్టైల్‌’ను సెలెక్ట్‌ చేసుకునేలా ఒక రోబోటిక్‌ వ్యవస్థను సిద్ధం చేసింది. దీనికి పేటెంట్‌ కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి నమూనా యంత్రాల తయారీ, పరీక్షలు జరుగుతున్నాయి! ఇవన్నీ ఆటోమెటిక్‌ రోబో బార్బర్లైతే.. రోబోకట్‌, ఫ్లోబీ సిస్టమ్స్‌ వంటివి సెమీ ఆటోమెటిక్‌ పద్ధతిలో ఇంట్లోనే కటింగ్‌, షేవింగ్‌ చేసుకునే యంత్రాలను రూపొందించే పనిలో ఉన్నాయి!.

స్టూడియోరెడ్‌, షేన్‌ వైటన్‌ వంటివారు తాము తయారు చేసిన రోబో బార్బర్లను సెలూన్లలో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈ విషయంలో కృత్రిమ మేధ కూడా అడుగుపెట్టేసింది. బార్బర్‌ జీపీటీ మన ఫొటోలను వాడుకుని ఏ స్టైల్‌లో ఎలా కనిపిస్తామో చూపిస్తుంది. నచ్చినదాన్ని సెలెక్ట్‌ చేసుకుని ఓకే అంటే చాలు! క్ష... వ... రం... మొదలైపోతుంది!!.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement