
దైవీశక్తులతో కూడిన శ్రావణ శుద్ధ పూర్ణిమను రాఖీపూర్ణిమగా, జంధ్యాల పూర్ణిమగా జరుపుకుంటారు. శక్తిస్వరూపిణిగా వ్యవహరించబడే ఇంటి ఆడపడచు(సోదరి) చేత ఈరోజు రక్షాబంధనం కట్టించుకున్న సోదరులకు దేవతలు రక్షగా నిలిచి అరిష్టాలను తొలగిస్తారని, అన్నింటా అండదండగా నిలుస్తారని విశ్వాసం. రక్షాబంధన పండుగ పరమార్థం ఏమిటి?
తన సోదరుని జీవితం తీపివలె ఎల్లప్పుడూ కమ్మగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే–ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలన్నది ఈ పండుగ పరమార్థం.

ఈరోజున బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తదితర జంధ్యాన్ని ధరించే అన్ని కులాలవారు స్నానాన్ని ఆచరించి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి ఉపాకర్మ జరిపిస్తారు. అందుకే దీనికి జంధ్యాల పూర్ణిమ అని పేరొచ్చింది. ఈ రోజునే హయగ్రీవ జయంతి
‘‘జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’’
అంటూ సర్వవిద్యలకూ ఆధారభూతంగా చెప్పుకునే హయగ్రీవుని స్తుతించడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి
పెరుగుతుందని శాస్త్ర వచనం