తాత్త్వికథ
ఒక ఊర్లో కూలీలను పెట్టి బావుల్ని తవ్వించే మేస్త్రీ ఉండేవాడు. ఆ బావి మేస్త్రీ పల్లెలన్నీ తిరిగి ఎవరు బావి తవ్విస్తారో వారికి కూలీలను ఏర్పాటు చేసి బావుల్ని తవ్వించే పని చేసేవాడు. అతడు పనికి ఒప్పుకున్నాడంటే ఆ బావిలో నీళ్ళు పడాల్సిందే. కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అతడికి మంచి పేరుంది. దాంతో బాగా డబ్బు సంపాదించి కొంచెం స్థిమితపడ్డాడు.
ప్రతి పౌర్ణమికీ అతడు వీలు కల్పించుకుని దగ్గరున్న పట్టణంలోని గుడికి వెళ్ళేవాడు. అక్కడ ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలను, రామాయణ భారత భాగవతాలను విని ఇంటికి వచ్చేవాడు. తీరికగా ఆ విషయాలన్నీ భార్యకు చెప్పేవాడు. ఆమె చాలా ఆసక్తిగా వినేది. తనకు వచ్చిన అనుమానాలను భర్తనడిగి తెలుసుకునేది. అయితే తాము మాత్రమే వాటిని తెలుసుకోవడం ఆమెకు రుచించలేదు. ‘మరింత మందికి ఆ మంచి విషయాలు తెలియజేస్తే బాగుంటుంది కదా’ అని ఆలోచించసాగింది.
ఒకరోజు పనులన్నీ ముగించుకుని ఉపన్యాసాలు వినడానికి పట్టణానికి బయలుదేరబోయాడు మేస్త్రీ. అతడి స్నానానికని ఇంట్లోని చేదబావిలోని నీళ్ళను తోడుతూ ‘ఎవరింట్లో అయినా బావి తవ్విస్తే ఏమి జరుగుతుంది?’ అని అడిగింది. ‘ఆ ఇంట్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు తోడుకుంటారు. వంటకీ, ఇంటికీ వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు.
‘అదే ఊరి మధ్యలో చేదబావి తవ్వితే ఏమవుతుంది?’ అని ప్రశ్నించింది.
‘అనుమానమెందుకు? ఊర్లో వాళ్ళందరూ బావిలోని నీళ్ళు వాడుకుంటారు’ అని సమాధానమిచ్చాడు. ‘మరి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మీరు మాత్రమే విని నాకు చెబితే మనవరకే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. అదే మీరు ఉపన్యాసకులను మన ఊరికి పిలిపిస్తే ఇంకా బాగుంటుంది. మన ఊరి రాములవారి గుడిలో నెలకొకసారి కార్యక్రమం ఏర్పాటు చేస్తే పిల్లలూ, పెద్దలూ అందరూ వింటారు. నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్లు కదా’ అని మెత్తగా చెప్పింది.
‘ఇన్నాళ్ళూ నా భార్యని బావిలోని కప్పనుకున్నాను. కానీ, లోతుగా ఆలోచన చేసే మనిషి’ అని గుర్తించాడు. వెంటనే వెళ్ళి ఉపన్యాసకులతో మాట్లాడి వారిని ఒప్పించాడు. తమ ఊర్లోనే కార్యక్రమాలు ఏర్పాటు చేయించాడు. మొదటగా ఊర్లో వాళ్ళు మాత్రమే వినడానికి వచ్చే వారు. చిన్నగా చుట్టుపక్కల గ్రామాలకు విషయం పాకింది. ఇతర గ్రామాల ప్రజలు మైళ్ళ దూరం నడిచి వచ్చి శ్రద్ధగా వినడం ప్రారంభించారు.
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, వచ్చి నాలుగు మంచిమాటలు వినే జనాన్ని చూసిన మేస్త్రీ దంపతులకు, నిండుగా నీళ్ళున్న బావిని చూసినంత ఆనందం కలిగింది.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు


