ఆత్మదర్శిని
ఆత్మదర్శనం ఒక్కటే నిన్ను దైవాన్ని చేర్చే ఏకైక సాధనం. సమాజంలో జరుగుతున్న ప్రతి తప్పు ఆత్మను మరచిపోయిన స్థితిలో జరుగుతున్నవే. సామాజికమైన సమస్యలన్నీ కూడా కాలం– స్థలం అన్న పరిమితిలో జరుగుతున్నవే. మోసం, ద్వేషం, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు మొదలైనవన్నీ యాంత్రికమైన స్థితిలో జరుగుతున్నవే. శరీరం–మనస్సు, కోరికలు, కాలం–స్థలం అనే పరిధిలోనే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. సమాజాన్నిమార్చాలి అంటే మొదట నీవు ఆత్మతత్వాన్ని చేరుకోవాలి. నీ ప్రయాణం అంతర్ముఖమై ’నేను ఆత్మను’ అని అనుభవంతో తెలుసుకునే వరకు తప్పులు జరుగుతూనే ఉంటాయి. నీ గమనిక బహిర్ముఖమైనప్పుడు కలిగే స్థితే యాంత్రిక స్థితి, ఆత్మ పట్ల ఎరుకలేని స్థితి. నీ గమనిక అంతర్ముఖమైనప్పుడు ఆత్మ చైతన్యస్థితిలో ఉంటావు. నీ మూలాన్ని చేరుకుంటావు. ఆ స్థితిలో శరీరం–మనస్సులు చేస్తున్న పనులన్నింటినీ ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటావు. నడవటం, మాట్లాడటం, స్పర్శించటం, రుచి చూడటం వంటి పనులు చేస్తున్న శరీరం–మనస్సులను అంటకుండా దూరంనుండి చూస్తూ ఉంటావు. వచ్చే ఆలోచనలను, కోరికలను కూడా సమభావనతో గమనిస్తూ ఉన్నప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు. వాటి ఫలితాలు కూడా నిన్ను బాధించలేవు.
సుఖమైనా, దుఃఖమైనా సమభావనతో సాక్షిగా ఉండిపోతావు. ఆలోచనలను గమనిస్తున్నప్పుడు ఆలోచనల కదలిక ఆగి పోతుంది. అలోచనల్లో ఉన్న శక్తి తిరిగి గమనికలోకి వచ్చి చేరి ఆలోచనలు శక్తిహీనమై మనస్సు సహజంగానే నశించి΄ోతుంది. నీవు బలవంతంగా అణిచి పెట్టవలసిన అవసరమే లేదు. నీవు ఈ నిద్రనుండి లేచే వరకు ప్రపంచం మారదు. నీ నమ్మకాలు, దైవం పట్ల ఉన్న నీ అభిప్రాయాలు, బాహ్యమైన ఆరాధనలు, అర్చనలు మొదలైనవన్నీ భ్రమలేనని తెలుసుకుంటావు. నీవు ఏది ఊహించుకున్నా చివరికి అది దైవం గూర్చిన ఉహలే ఐనా, అవి కేవలం నీ కల్పితమైన మనస్సు ప్రతిబింబాలే గానీ సత్యాలు కావు. మనస్సుతో ఊహించినదేదీ సత్యం కాదు. సత్యం మనస్సుకు అతీతమైనది. మనస్సు మాయమైనపుడు ఉన్న శుద్ధ చైతన్యస్థితే సత్యం. అది కేవలం అనుభవంతోనే తెలుసుకోగలవు. నీవు నీవు కావడమే ఆధ్యాత్మికత. మనసుతో తెలుసు కున్నవి, ఊహించినవి అన్నీ అసత్యాలే. ఆ చైతన్య స్థితిని తెలుసుకోవాలి. అదే బుద్ధుడు, కృష్ణుడు, లావోట్సు మొదలైన యోగులు చేరుకున్న స్థితి. వారంతా బోధించినది చైతన్యస్థితి గురించే. మనస్సు భ్రమలనుండి బయటపడమని బోధిస్తే మనమేమో ఆ భ్రమలను పెంచుకుంటూ అవే నిజాలని నమ్ముతున్నాము. మనస్సు మలినాన్ని కడిగేదే ధ్యానం. ధ్యానంతోనే దైవాన్ని చేరగలవు. అదే ఏకైక మార్గం. నమ్మకాలను, భ్రమలను తీసివేసేదే ధ్యానం. నీ నిజతత్వాన్ని అనుభవింపజేసేదే ధ్యానం.
అసలు మనస్సు అనేదే ఆగిపోయినప్పుడు దేన్ని కోరగలవు. అప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. నమ్మకాలు, భ్రమలు అన్నీ మాయమైపోతాయి. అల సముద్రంతో తిరిగి కలిసిపోతుంది. మనస్సు దాని మూలమైన ఆత్మతో తిరిగి ఏకమైపోతుంది. ఏకత్వం అనుభవమై ఔతుంది. ప్రకృతి పురుష ఏకమౌతుంది. చూసేవాడు, చూడబడేది అనే రెండూ శుద్ధ చైతన్యంలో లీనమౌతాయి. కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది.
– స్వామి మైత్రేయ ఆధ్యాత్మిక బోధకులు
∙


