ఒక పక్క ఇండిగో సంక్షోభం కొనసాగుతుండగా మధ్యప్రదేశ్ లోని సియోనీలో ఓ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ అనే విమానయాన సంస్థకు చెందిన ట్రైనీ విమానం తన చివరి దశలో నియంత్రణ కోల్పోయి అకస్మాత్తుగా కూలిపోయింది. ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం సాయంత్రం సుక్తారా గ్రామంలోని ఎయిర్‌స్ట్రిప్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లఖన్వాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమ్గావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తరా ఎయిర్ స్ట్రిప్ లో ల్యాండింగ్ సమయంలో, 33 KV హై-వోల్టేజ్ లైన్‌కు చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ అకస్మాత్తుగా వైఫ్యలం కారణంగా పైలట్ అమ్గావ్ సమీపంలోని ఒక పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద శబ్దంతో పొలంలో కూలిపోయింది. శబ్దం విన్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. విమానం కాక్‌పిట్ నుండి ఇద్దరు పైలట్‌లను రక్షించారు. అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సుమారు 90 గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులు కష్టపడి విద్యుత్ సరఫరాను పనరుద్ధరించారు.
ఇద్దరు పైలట్లు ప్రైవేట్ ఆసుపత్రిలో
ఈ ప్రమాదంలో, పైలట్ అజిత్ , ట్రైనీ అశోక్ చావా తల మరియు ముక్కుకు గాయాలయ్యాయి. ఇద్దరినీ బారాపత్తర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
రెడ్ బర్డ్ ఏవియేషన్ కంపెనీ నాగ్‌పూర్ రోడ్డులో ఉన్న సుక్తారా గ్రామంలో ఒక ఎయిర్‌స్ట్రిప్‌ను లీజుకు తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ పైలట్ శిక్షణ అందిస్తుంది.
గతంలోనూ ప్రమాదం
విమానయాన కేంద్రం వద్ద భద్రతా ప్రమాణాలను చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో శిక్షణా విమానాలు రన్‌వేపై రెండుసార్లు బోల్తా పడ్డాయనీ కానీ కంపెనీ, అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆరోపించారు.


