ఎన్నికల వేళ తమిళనాడులో ఈసీ కీలక నిర్ణయం | ECI Transfers Four SPs in Tamil Nadu Ahead of Assembly Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ తమిళనాడులో ఈసీ కీలక నిర్ణయం

Mar 16 2026 7:13 PM | Updated on Mar 16 2026 7:18 PM

ECI Transfers Four SPs in Tamil Nadu Ahead of Assembly Elections
  • నలుగురు ఎస్పీలను బదిలీ చేసిన ఈసీఐ

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తమిళనాడులో నలుగురు పోలీసు సూపరింటెండెంట్ల(ఎస్పీ)ను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాలతో కరూర్, ఈరోడ్, నాగపట్నం, విరుదునగర్ జిల్లాల ఎస్పీలు తక్షణ బదిలీ అవుతారు. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 

షెడ్యూల్‌తో పాటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఈసీఐ కరూర్ ఎస్పీగా హరికిరణ్ ప్రసాద్, కిరణ్ శ్రుతిని ఈరోడ్, సుజిత్ కుమార్‌ను నాగపట్నం, శ్రీనాథను విరుదునగర్ ఎస్పీగా నియమించారు. ఈ జిల్లాల ఎస్పీలు అధికార డీఎంకే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోనూ కీలక అధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన అధికారి నందిని చక్రవర్తిని తొలగించి దుష్యంత్ నరియాలా (ఐఏఎస్-1993 బ్యాచ్)ను నియమించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం అండ్ హిల్ అఫైర్స్ జగదీశ్‌ ప్రసాద్ మీనాను తొలగించి సంగమిత్ర ఘోష్ (ఐఏఎస్-1997 బ్యాచ్)ను నియమించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement