రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్‌ హుందాతనం | Rajinis Jealousy vs Vijays Humility | Sakshi
Sakshi News home page

రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్‌ హుందాతనం

May 18 2026 11:56 AM | Updated on May 18 2026 12:21 PM

Rajinis Jealousy vs Vijays Humility

‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం ‍స్టాలిన్‌ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్‌ను, అదీ పెద్ద స్టార్‌గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. 

రజనీకాంత్‌ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. అందులో విజయ్‌ ఫ్యాన్‌ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్‌ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్‌ ఎలివేషన్‌ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట.  విజయ్‌ అభిమాని చేసిన పోస్ట్‌ అంటూ అది హల్‌ చల్‌కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్‌’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్‌ స్టంట్‌ అంటూ ఓ బాంబ్‌ పేలడం ఈ ఎపిసోడ్‌ను మరో మలుపు తిప్పింది. 

సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్‌ విషయంలో  “ఫ్యాన్‌ వార్‌ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్‌ డమ్‌ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్‌ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్‌ మరింతగా ముదిరింది. 

1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్‌స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్‌ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్‌ అభిమానులు ‘మాస్‌ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్‌ కలెక్షన్ల దాకా వెళ్లింది. 

ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్‌లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్‌ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ వార్స్‌ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్‌ను వారించడం.. మళ్లీ రిపీట్‌ కావడం అవుతూ ఉండేది. ఈలోపు..  విజయ్‌ సినీ కెరీర్‌ ఎవరూ అందుకోలేనంత పీక్స్‌కు చేరుకుంది.

కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్‌.. జైలర్‌ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్‌ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్‌ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్‌ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్‌ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్‌ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్‌గానే విజయ్‌ ‘లియో’ క్లైమాక్స్‌లో గద్ద రిఫరెన్స్‌ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది.   

పొలిటికల్‌ టర్న్‌..!
90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్‌డమ్‌ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్‌) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. 

విజయ్‌ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్‌ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్‌ స్టైల్‌, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్‌ సినిమాలపరంగా హయ్యెస్ట్‌ రెమ్యునరేషన్‌ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్‌లో ఒక టాక్‌. అంతెందుకు విజయ్‌ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. 

విజయ్‌ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్‌ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్‌ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్‌ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్‌గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్‌ స్పీచ్‌లతో సందేశాలిస్తూ వచ్చాడు. 

విజయ్‌ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్‌.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్‌డమ్‌ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్‌కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు  చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్‌ హాసన్‌) స్వయంగా వెళ్లి విజయ్‌ను అభినందించడం.. విజయ్‌ విజయంపై మొక్కుబడిగా ఎక్స్‌లో ఓ మెసేజ్‌ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్‌మీట్‌ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్‌ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement